కూసుమంచి గణపేశ్వరాలయం/కాకతీయుల సంక్షిప్త చరిత్ర
కాకతీయుల సంక్షిప్త చరిత్ర
తెలుగు ప్రాంతం అంతటినీ ఒక్కటి చేసి శాతవాహనులు పరిపాలించిన వెయ్యేళ్ల తరువాత తిరిగి తెలుగువారందరినీ ఒకే ఏలుబడిలోకి తీసుకువచ్చిన వారు కాకతీయులు. దాదాపు రెండు శతాబ్దాల పాటు తెలుగుదేశాన్ని పరిపాలించి రాజకీయంగానూ, సాంఘికంగానూ తెలుగుజాతికి విశ్వవ్యాప్తమైన కీర్తి ప్రతిష్ఠలు కల్పించిన వారు కాకతీయులు. దక్షిణాన కంచి నుంచి తూర్పున దక్షిణ కళింగ వరకు, కోస్తా, తెలంగాణా ప్రాంతాలతో పాటు, ఆథోని, రాయచూరు, బీదరు కోటల దాకా కాకతీయ సామ్రాజ్యం విస్తరిల్లింది. కాకతీయ రాజుల పరిపాలనా కాలాన్నిపరిశీలించి చూస్తే కాకతీయ సామ్రాజ్యపు మొట్టమొదటి బేతరాజు క్రీ.శ. 992 నుండి 1052 వరకు పాలించాడు. మొదటి బేతరాజు ఖమ్మం జిల్లా మధిర తాలూకా ప్రాంతాన్ని, తర్వాత వరంగల్ జిల్లా మానుకోట ప్రాంతాన్ని పాలించాడు. ఖమ్మంజిల్లా సత్తుపల్లి మండలంలో ఈ బేతరాజు పేరుతో బేతుపల్లి గ్రామం వుంది. అక్కడ కాకతీయుల నాటి శివాలయం ఉన్నది. అలాగే బేతుపల్లికి దగ్గరలో
బేతరాజు మరణించిన తర్వాత మొదటి ప్రోలరాజు సింహాసనమధిష్టించాడు. ఇతని పాలనాకాలం 1052 నుండి 1072 వరకు నడిచింది.
మొదటి ప్రోలరాజు పాలనానంతరం రెండవ బేతరాజు 1079నుండి 1108 వరకు పాలించాడు. కాజీపేట శాసనంలొ ఇతన్ని గొప్ప వీరుడిగా వర్ణించబడివుంది.
ఇతడి పాలనానంతరం ఇతని పెద్ద కుమారుడు దుర్గరాజు 1108 నుండి 1116 వరకు పాలించాడు.
తదుపరి రెండవ ప్రోలరాజు పరిపాలన కొచ్చాడు. ఇతడు 1116 నుండి 1157 వరకు 41 సంవత్సరములు పరిపాలించాడు. ఇతని కాలంలో కాకతీయ రాజ్యము పూర్తిగా బలపడి సర్వ స్వతంత్రమయ్యింది.
తర్వాత రుద్రమదేవుడు 1158 నుండి 1195 వరకు రాజ్య పరిపాలన చేసాడు అనేక యుద్ధాల ద్వారా తన రాజ్యాన్ని విస్తరించాడు కూడా. వేయి స్తంభాల దేవాలయ సముదాయాన్ని క్రీ.శ. 1163లో కాకతీయ రాజు ఒకటవ రుద్రదేవుడు నిర్మించాడని చెప్పే శాసనం ఉంది.
రుద్రమదేవుడి మరణానంతరం మహాదేవ రాజు 1196 నుండి 1198 వరకు కేవలం రెండు సంవత్సరములు పాలన చేసాడు. మహాదేవరాజు రుద్రమదేవుడి సోదరుడే. ఇతని మరణాంతరం కాకతీయ ప్రభువులలో అగ్రగణ్యుడైన గణపతిదేవుడు రాజయ్యాడు.
గణపతిదేవుడు 1199 నుండి 1226 వరకు సుదీర్ఘకాలం పరిపాలన చేసాడు. ఇతని కాలంలో కాకతీయ సామ్రాజ్యం చాలా వరకు విస్తరించింది. కూసుమంచి గణపేశ్వరాలయానికి గణపతిదేవుని వలన ఆ పేరు వచ్చింది అని పైభాగాలలో చెప్పుకున్నాం. గణపతిదేవునికి ఆ పేరురావడానికి కారణాన్ని చెప్పే కథను ప్రతాపరుద్ర చరిత్ర(పేజి 28) సిద్ధేశ్వర చరిత్ర (పేజీ 109) లలో చూడవచ్చు. మహదేవరాజుకు చాలా కాలం సంతానం లేకపోవడంతో శ్రీశైల మల్లికార్జున స్వామిని సేవించి వంశాంకురంకోసం ప్రార్ధిస్తూ, అక్కడ వున్న 10వేల మంది మఠాధిపతులను సేవిస్తూ కొంత కాలం గడిపాడు. ఆ విధంగా గణారాధన ఫలితంగా జన్మించిన వాడు కాబట్టి ‘గణపతి’ అనే పేరు పెట్టారట. గణపతిదేవుని ఓరుగల్లు శాసనంలోని బిరుదుగద్యలో కనిపించే ‘ప్రత్యక్ష ప్రమథగణావతార’ (కాకతీయ వైభవం పుట 10) అందుకు మంచి నిదర్శనం. గణపతిదేవుని దీక్షాగురువు శ్రీ విశ్వేశ్వర శంభువని మల్కాపుర శాసనం ద్వారా తెలుస్తోంది. గణపతిదేవుని గురువైన మల్లికార్జునారాధ్యుడు, మల్లికార్జున పండితారాధ్యుని మనవడు.
గణపతిదేవుని అనంతరం ఇతని కుమార్తె రుద్రాంబ పరిపాలించింది. గణపతి దేవునికి కుమారులు లేనందున ఆమె రాఙ్ఞి అయ్యింది. ఈమె పాలనా కాలంలో ఓరుగల్లుకోట శత్రుదుర్భేధ్యంగా, దృఢంగా తయారయ్యింది. ఈమె అనంతరం ప్రతాపరుద్రుడు రాజయ్యాడు. ఇతడు రుద్రాంబకు దౌహిత్రుడు. (సిద్ధేశ్వర చరిత్ర కథనం ప్రకారం రుద్రమదేవి కుమార్తె ముమ్మడమ్మ కొడుకు ప్రతాపరుద్రుడు. కొడుకులు లేనందు వల్ల మనుమడే తనకు అపర కర్మలు చేయాలని తనకి వారసుడుగా రాజ్యపాలన చేయాలని రుద్రమాంబ నిర్ణయంతీసుకుంది.5 ఏళ్ళ వయసునుంచే మనవడిని ఒడిలో కూర్చోబెట్టుకుని రాజ్యపాలన చేసేదట ) రుద్రాంబ ఇతనికి కుమారునిగా స్వీకరించింది. ఇతడు మంచి విజ్ఞానవంతుడు, కవిపండిత పోషకుడు. క్రీ.శ. 1302 నుంచి క్రీ.శ 1323 మధ్య ఓరుగల్లుపై ఢిల్లీ సుల్తానుల సైన్యం ఏడుసార్లు దండయాత్ర చేసింది. గెలవటం కంటే ప్రధానంగా దోచుకు పోయేందుకు వారీ దండయాత్రలను చేసారు. అనేక సార్లు కాకతీయ సైన్యం వారి ప్రయత్నాలను తిప్పికొట్టింది.
1323వ సంవత్సరంలో ఢిల్లి రాకుమారుడు ఉల్గూఖాన్ (ఇతనే రాజయ్యాక ‘మహమ్మద్ బిన్ తుగ్లక్' ) తన అపార సైన్యాన్ని ఓరుగల్లుకు పంపించాడు. ప్రతాపరుద్రుడు ఐదు నెలల కాలం యుద్ధం చేసి చివరకు వారికి బంధీగా పట్టు బడ్డాడు. ప్రతాపరుద్రుడిని ఢిల్లికి పంపించారు. కానీ మార్గం మధ్యలోనే ప్రతాపరుద్రుడు మరణించాడు. దీనితో మహోజ్వలంగా వెలిగిన కాకతీయ సామ్రాజ్యం అంతరించింది.
కాకతీయుల మత విశ్వాసాలు
రాష్ట్రకూటుల పాలనలో జైన అధికారికంగా పోషింపబడుతున్న కాలంలో కాకతీయులు అధికారాలను హస్తగతం చేసుకున్నారు. కాకతీయులు మొదట జైన మతాన్ని ఆనుసరించేవారు. నాటి జైనుల ప్రాభవానికి వరంగల్లు సరిహద్దుల్లోని కొలనుపాక జైన దేవాలయం దర్పణం పడుతుంది. అనమకొండ గుట్టమీది పద్మాక్షీదేవి బహుశా మొదట్లో జైనదేవతే అయివుంటుంది.
కాలముఖ, కాపాలిక, పాశుపత, ఆరాధ్యశైవ, వీరశైవాది శైవ అంతర్గత భేదాలలో పాశుపతశైవం కాకతీయుల కాలంలో ప్రముఖంగా వుండేది. కాకతీయ ధ్వజంపై విష్ణుమూర్తి అవతారాలలో ఒకటైన వరాహ మూర్తి చిహ్నం ఉన్నప్పటికీ, వీరు మాత్రం శైవాన్ని పెంచి పోషించారు. కాకతీయులు శైవాన్ని పోషించడం ప్రారంభించిన తరువాత అనేక జైన మంటపాలను కళ్యాణ మంటపాలుగా, శైవ మందిరాలుగా మార్చివుంటారు. వేయి స్తంభాల దేవాలయంలో ప్రస్తుతం పునర్నిర్మాణం జరుగుతున్న కళ్యాణ మంటపం కూడా ఇలాంటి జైన మంటపమేనని పలువురు చారిత్రక విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. సాధారణంగా జైన మంటప స్తంభాలపై పూర్ణకుంభాలు కనిపిస్తాయి. ఇతర ఆలయ స్తంభాలపై వీటి జాడ ఉండదు. వేయి స్తంభాల గుడిలోని కళ్యాణమంటపంపై కూడా పూర్ణ కుంభాలు కనిపించడం గమనార్హం.