Jump to content

కువలయాశ్వచరిత్రము/ప్రథమాశ్వాసము

వికీసోర్స్ నుండి

శ్రీరస్తు

కువలయాశ్వచరిత్రము

ప్రథమాశ్వాసము

శా. శ్రీరాధాధరబింబసంభృత సుధాబృందాతిమాధుర్యగా

థారీతు ల్బ్రకటించు లీల మురళీధౌరేయుఁడై గీతసం
చారంబు ల్వెయించుకృష్ణుఁడు దయాసర్వస్వతాగౌరవం
బూర న్సౌరమునారనాధిపుఁ జిరాయుశ్రీయుతుం జేయుతన్.1

సీ. తనమందహాసనూతనకాంతి కాంతకీర్తికలాపములను సంధించుకొనఁగఁ

దనయాస్యపద్మంబు ధవరాగరసఝరీపటిమతోడుత మాటపలుకులాడఁ
దనతనూదీప్తిసంతతులు నాయకమహస్తోమంబునకును విందులు ఘటింపఁ
దనయురోజాచలత్వంబు మనోనాథకఠినధైర్యముతోడఁ గలసిమెలఁగ
రాజులఁ దిరస్కరించుచు రమణుఁ డున్న, యరదమెక్కిన రుక్మిణీసరసిజాయ
తాక్షి సవరము నారాయణాధిపేంద్రు, శుభదయాపూర్ణవీక్షచేఁ జూచుఁ గాత.2

చ. నెలకొనుజూటసౌరతటినీనవకైరవిణీవధూటితో

లలితసుధాంశుఁ గూర్చినతలంబునఁ బార్వతిఁ గూడి యబ్ధికిం
గలయికకుంటెన ల్నడుపఁగాఁ బనిపూనిన యాశపాలకుం
డలశివుఁ డిచ్చుఁ గావుతఁ జిరాయువు నారనభూపమౌళికిన్.3

చ. తనతనుకాంతి కాంతజలదప్రతిమానగళాగ్రనీలిమం

జెనక నరాంగరోచి నిజచిత్రసుధాస్మితపాండిమంబుఁ జి
క్కనితమి ముద్దుఁ బెట్టుకొనఁగాఁ బతికౌఁగిట నున్నయద్రినం
దన సవరంబు నారనజనప్రభు నెప్పుడుఁ బ్రోచుఁ గావుతన్.4

సీ. నుడుగులపూఁబోఁడి యడుగులబెడఁగు నిరీక్షించుచోఁ బదము పఠించుకొనుచుఁ

బలుకుటొయ్యారి గుబ్బకవ గందపుఁబూఁత నెంచుచోఁ జర్చ వర్ణించుకొనుచు
మాటమిటారి సయ్యాటంపునడ నిరీక్షించుచోఁ గ్రమము గుణించుకొనుచు
మినుకుఁ బ్రోయాలి కింపునఁగీలుజవయల్లఁ జెరువుచో నలజటఁ జెప్పుకొనుచు
వాణిశారీరరుచివైభవంబుఁ జూచు, వేళ వర్ణక్రమంబు భావించుకొనుచు
నెమ్మి నగు తమ్మిచూలి మాతిమ్మనృపతి, పుత్రు నారాయణాధిపుఁ బ్రోచుఁ గాత.5

శా. వీణాదండచలత్కరోజ్జ్వలవిభ ల్వేల్లన్నఖోద్యద్రుచి

శ్రేణు ల్మించుగ గానర క్తిఁ జిగిరించెం బూచెనంచు న్మదిం
గాణ ల్మెచ్చఁగఁ బాటపాడి పతికి న్సంతోషముం గూర్చునా
వాణీనీరజనేత్ర నారనధరావజ్రిం గృపం బ్రోవుతన్.6

మ. కలుగు న్లాయపుతేజికిం భయముమైఁ గాన్పించు నీశానుసొ

మ్ములకుం దమ్ముని కత్తలానము రయంబు ల్మీర రావించి సూ
రెలకుం బర్వునఁ బోవువానిఁ గని గౌరీకాంత సారెం గిలా
కిల నవ్వ న్ముద మొందు దంతిముఖునిం గీర్తించి నర్తించెదన్.7

సీ. అలకురువ్రజనాథు నడఁగఁదొక్కు నటంచు నలకురువ్రజనాథు నడఁగఁద్రొక్కె

సైంధవాక్రమణ నైశ్చల్య మొందు నటంచు సైంధవాక్రమణ నైశ్చల్య మొందె
మించి యక్షబలం బడంచి పేర్చు నటంచు మించి యక్షబలం బడంచి పేర్చె
ద్రోణగురుత్వంబు తొడరితాల్చునటంచు ద్రోణగురుత్వంబు తొడరితాల్చె
భావిసోదరభీమసంభావ్యకార్య, మెల్ల నీరీతి నెఱిఁగించె నెవ్వఁ డట్టి
రామపాదారవిందమరందబృంద, చంచరీకాత్ము హనుమంతు సన్నుతింతు.8

సీ. ప్రతివాదిమర్మనిర్మథనకర్మఠమైన బాణసౌశీల్యంబుఁ బ్రస్తుతించి

ఘనశబ్దసాంగత్యజనితాత్యధికమోదగరిమఁ గన్న మయూరసరణి నెన్ని
మాలతీమాధవమహిమఁ బూజితమైన భవభూతిమార్గంబుఁ బరిగణించి
సారనవార్థపోషణధురీణంబైన భారవి యుదితవిభ్రమముఁ బొగడి
వెండియును గాళిదాసాదివిబుధవరులఁ, దలఁచి యుష్మత్కవిత్వసందర్భగౌరళ
వార్థ్యహంఖలు దాతుమర్హథ యటంచు, వారికృపఁ గాంతుఁ గవితాదివైభవంబు.9

క. నన్నయభట్టన్నను నె, ఱ్ఱన్నను దిక్కన్నసోమయాజిని శ్రీనా

థు న్నాచనసోముని మది, నెన్నుదు నాంధ్రప్రబంధహేలానిధులన్.10

శా. విగ్రస్రగ్నవగంధమంధకపురోవీథీవధూక్రీడ పం

గుగ్రామణ్యతిదూరసంస్థితసురక్షోణీధరేంద్రంబు వృ
ద్ధాగ్రశ్యామ గదా మదాచరితకావ్యం బౌర దుర్వైదుషీ
వ్యగ్రాసత్కవికోటి యెన్న నది యూహ ల్సేయఁగా నేర్చునే.11

మ. ఒకచో శబ్దంగుంభనంబు లొకచో యుక్తిక్రియాగౌరవం

బొకచో నద్భుతజాతివార్త లొకచో నుజ్జృంభితత్తద్రస
ప్రకరంబుం గనిపించిన న్మదికి సంభావింప నర్హంబుగా
కకటా యేమియు లేని కబ్బ మది యాహ్లాదంబు గావించునే.12

వ. అని యిష్టదేవతానమస్కారంబును సుకవిపురస్కారంబును గుకవితిరస్కారంబు

నుం గావించి బహువిధకథావిచిత్రంబగు కువలయాశ్వచరిత్రంబను కావ్యంబు సరస
జనసేవ్యంబుగా రచియింప నూహించి యేతత్కృతినాయకత్వంబునకుం దగువాఁ
డెవ్వఁడో యని విచారించి.13

క. అలనారాయణధరణీ, తలనాయకమణికి నిచ్చెదఁ బ్రబంధంబున్

గలదే మేదిని భేదము, తలఁపంగా నీతఁ డనఁగ దైవ మనంగన్.14

వ. అని నిశ్చయించియున్న సమయంబున.15

సీ. ఏనవ్యగుణహారి దానవారియవక్రచక్రసౌఖ్యకరప్రసక్తిఁ గాంచు

నేవైరిహరహేతి భావరీతి యమూల్యకళ్యాణధరధర్మగరిమఁ గాంచు
నేజగన్నుతిశాలి యాజికేళిఁ బ్రచంచపరచండమహతి యన్ ప్రౌఢిఁ గాంచు
నేరమ్యతరకీర్తి మారమూర్తి యవేలకమలాంబికామోదఘటనఁ గాంచు
నతఁడు వయిఖందుఖానసప్తాంగహరణ, కరణకారణరణరణద్ఘంటికాని
కాయవేదండముఖసైన్యకలితవిజయ, శాలి నారాయణక్షమాపాలమాళి.16

వ. వెండియుఁ దాండవఖేలనోద్దండఖండపరశుజటామండలాగ్రహిండమానపుండరీక

గంగాడిండీరపాంచరాఖండరుచికాండకీర్తినిష్యందచంద్రికాచక్రీకృతదుర్వక్రవిక్రమ
పరిపంధిరాజన్యసైన్యుండును సర్వసర్వంసహాధూర్వహతానిరాకృతకమఠపరిబృఢకా
కోదరలోకాధిపదిశాస్తంబేరమమూర్ధన్యుండును కరుణారవిందచరణామణీపరిణీ
తపరీరంభణోజ్జృంభణాలోకుండును బ్రచండమండలాగ్రవిదార్యమాణరిపుమండలా
ఖండలకరణీయభావిరంభాసంభోగాంతరాయభయావిలనలకూబరానీతనవనిధిబోధవి
ధాయకనానావస్తువిస్తారనిస్తులస్తవనీయమణీరమణీయమందిరాలిందుండును రాజ
కార్యవిరోధిరిపురాజశిరోధిఖండనోద్దండతదీయదుర్గగ్రహణవిచక్షణనిజనియు
క్తసేనాభిరాముండును సింధుగోవిందధవళాంగభీముండును బ్రతిక్షణప్రకల్పితదా
నధారాధునీమానావనోదనసాంత్వవాదనప్రవీణతదీయవేణికాసమాహతపారావారవి
గళితనిజాశ్రయపరాయణతద్గాంభీర్యధుర్యుండును హేమకరగండాంకవర్యుండును
శ్రీరంగరాజకుమారవీరవేంకటేశరాయ భుజాబలసహాయబహువిధోపాయధురీణుం
డును జంచలలోచనామనోవంచనాపంచబాణుండును గాశ్యపగోత్రపవిత్రుండును
జితచరిత్రుండును దిమ్మనరపాలగర్భరత్నాకరరాకాచంద్రుండునునగు నారాయణ
ధరాదేవుం డొకానొకశుభవాసరంబున సుధాకరశిలావేదికాసరోవంబులకుఁ జెం
దొగలపొందుఁ గలయ నొందించు నమందకుడ్యభాగపద్మరాగప్రతిబింబంబులకుఁ
దాఁటు తేఁటిదాఁటులనీటు వాటించు వలభికానీలజూలంబుల నీడలకుం దోడుపడు
సాంబ్రాణిధూపపుంజంబు లనుచీఁకటికై యుదయించు మంచురాయని రేకలపో
కలందగు మగఱాతిబోదియలం జెలంగి ముంగల నాడు కీలుబొమ్మలకోలాటంబు
రొదలకును గివకివకివఁగూయు కోయిలలయారజంబులకును నొండొరులమొగంబు
లు చూచికొను నూడిగంపుఁజేడియల మందహాసరుచికందంబులకు విందులు గావిం
చు ముక్తామయస్తంభంబులందగు తమయాకారంబులం గనుంగొని తోడినియోగుల
ని రాజకార్యబు లడుగునానాదిగంతరానేకవజీరామాత్యులం బిలుచు సౌవిదల్ల
సాహోనినాదంబులకుఁ బ్రోదిగావించు వందిజనంబుల కైవారంబుల నడుమ వినంబ
డు నంగనాంగీకృతసంగీతంబు లగు నానందబాష్పబిందుసందోహంబుఁ జిందించుచం
దంబునఁ దొరఁగు వితానీకృతవివిధప్రసవవిసరరసప్రసారంబునం బొసంగు నా
స్థానంబున మణిమయాసనంబున సుఖాసీనుండై నిండోలగం బుండుసమయంబున.17

క. వినయమున నేను గదియం, జని యేతత్కువలయాశ్వచరితంబు ముదం

బున మీకు నంకితముగా, నొనరించెద ననిన హర్షయుక్తుం డగుచున్.18

వ. ప్రసాదమందస్మితకటాక్షంబుల నిరీక్షించినఁ దదీయాంగీకారం బెఱింగి ప్రబంధని

బంధనోత్సాహబంధురుండనై తన్ముఖాలంకారంబుగాఁ గృశిపతివంశావతారం బ
భివర్ణించెద.19

సీ. నెలఁతలనెఱముద్దునెమ్మోవినీటుదార్కొన్నవానికి జోడుకోడె యనుచు

జనరాండ్రజిగిగుబ్బజగపోల్కిఁ జనుపిట్టకవలకెల్లను జెల్మికాఁ డటంచు
లేమగుంపుల లివలివలాడు లేఁగౌనునంటిచోటికి నెలవరి యటంచుఁ
గలికిమిన్నలకల్కికంటికో పెనయు మెచ్చులక్రొవ్విరికి మేలిచుట్ట మనుచు
నెంచి ఛాయాశుభాంగి యేయినుని మౌళి, నిండువేడుకఁ దలఁబ్రాలు నించి వెలసె
నతఁడు కనకాద్రివలనాప్రయాణనిపుణ, సైంధవుం డెన్నఁదగు లోకబాంధవుండు.20

క. ఆతనికులమున దశరథ, నేత దగు న్శరధిపరిధినిఖిలమహీర

క్షాతత్పరుఁ డాతనికి, న్సీతాశాతోదరీమణీపతి వొడమెన్.21

శా. ఆరామాధిపమౌళికిం దశముఖాఖ్యగ్రావదంభోళిన్

బారావారపటీసమావృతకటీభారోజ్జ్వలద్ధారుణీ
ధౌరంధర్యసరీసృపార్యసమదోస్తంభప్రతాపప్రభా
శ్రీరాజద్దిశుఁ డౌకుశుండు జనియించెం బ్రాభవోపేతుఁడై.22

గీ. ఆకుశుని యన్వయమున బాహాసహాయ, శౌర్యగాంగేయ వైరిరాజన్యగేయ

బలులు పెక్కండ్రు నృపతులు వెలసి రందు, వినుతి వహియించె గోవిందజనవిభుండు.23

క. వెలయుం దత్సుఁతుడై యతి, బలధృతియై తిమ్మధరణిపతి వైరిసతీ

కలితాంజనబాష్పఝరీ, హలహలికాంజనధరీకృతాఖిలగిరియై.24

సీ. విడు పైఁటచెఱఁగు నే వెఱతు గాయము మాననిమ్మని ఛాయ యెంతేసి వేఁడ

నశ్విను ల్మందులకై ద్రోణగిరికి నిచ్చలుఁ బోవుకతన వేసరుకొనంగ
నిరుపద్రవముగామి నిలువరాదని రమాపతి వేఱపాలెంపుఁ బట్టు వెదక
నాయయ్య కిదియపాటాయంచు నలసింహికాతనూభవుఁ డౌడు కఱచికొనఁగఁ
జెలఁగి తొగకొమ్మమొగ మింత చేసికొనఁగఁ, దిమ్మనృపశౌరి దినదినోద్భిన్నవైరి
వారబహువారభేదనవర్ధమాన, మైనరవిమేనిపెనుగండి మానదయ్యె.25

క. ఆరసికమౌళి ముద్దుఁగు, మారుఁడు శరజాతవృత్తి మనియె న్గనియెం

దారకగర్వనివారక, సారకనత్కీర్తి లక్కజనపతి ధరణిన్.26

సీ. ఆర్కవంశమువారమని దుర్ణివారులై గుడిసెకై జిల్లెడు గొట్టఁబోరు

హరిభ క్తిగలవారమనుచు సన్నద్ధులై వేఁటకై సింగంబు వేఁటఁబోరు
కడువిరక్తులమంచుఁ దడవిండ్లు గైకొని యేచి పుల్గులమీఁద నేయఁబోరు
భార్గవగోత్రసంభవులమంచుఁ దలంచి గట్టులపైఁ దరుల్ మెట్టఁబోరు
సంగరాంగణసంగతశౌర్యధైర్య, ధుర్యు లక్కమహీపాలవర్యధాటి
కాపలాయితమత్తప్రతీపభూపు, లడవిలోఁ బాతకాఁపులై యలరునపుడు.27

గీ. అమ్మహైశ్వర్యసంపన్నుఁ డంబకాగ్ర, చంచలీకృతదుర్మనోజాతుఁ డగుచుఁ

గలితమైన సదానందకారి గరిమఁ, దనరు తిరుమలదేవి నుద్వాహమయ్యె.28

గీ. ఆ తిరుమలాంబయందు లక్కావనీశుఁ, డతులరవితేజుఁ దిప్పభూపతి బిడౌజు

లక్కనృపవర్యుఁ దిమ్మవిలాసధుర్యుఁ, గృష్ణనృపచంద్రు నారాయణేంద్రుఁ గనియె.29

క. వారలలోపలఁ దిప్పధ, రారమణుఁడు వెలయు రాజరా జనఁగఁ గృపో

దారుండు లబ్ధకవచ, స్ఫారగుణాపార్థవైరిబాణక్షతియై.30

సీ. పద్మము ల్మైనిండఁ బర్వ నుస్సురుమంచుఁ దలయూఁపఁదొడఁగె వేదండపాళి

కమలము ల్క్రేవలఁ గదియ వెల్వెలవాఱి కాలూఁదలేఁ డయ్యె వ్యాలభర్త
యజ్ఞరేఖాప్తిపై నమర నిద్దురమాని నిలిచినచో నిల్చెఁ గులధరాళి
వనజాతములచ్చాయ దనరి కంపనమొంద రోమోద్గమముఁ జెందెఁ గ్రోడమౌళి
తమ్ముఁ బెడవాసి వసుధాసుధాకరాస్య, క్రొత్తవలపంటి ననవంటి కొమరువంటి
నీటుకాఁడైన యలతిప్పనృపతిఁ జేర, విరహగరిమంబు తమయందు వీలుకొనఁగ.31

చ. అతఁ డనుజన్ముఁ డైన సుగుణాఢ్యుఁడు లక్కవిభుండు తోడుగా

నతులితుహిందుఖానుని బలావళి ద్రుంప నిలింపు లింపున
న్వితతలతాంతవర్ష మొచవించుట మించు వరించ నెంచి స
మ్మతి జయలక్ష్మినించు నవమౌక్తికపుం దలఁబ్రాలు కైవడిన్.32

సీ. నలుపుఁగస్తురిగీఱునామంబుఁ దుడిచి యేతెంచినఁగాని సంధించమనుచు

నిడుదముత్తెపుటొంట్లు సడలించుకొని చెవు ల్పూడవైచినఁగాని చూడమనుచుఁ
గమనీయమణికిరీటము డించి పైఠాణిపాగ చుట్టినఁగాని పలుకమనుచు
దంభోళి విడిచి క్రొండళుకు సింగిణివిండ్లు చేకొన్నఁగాని హర్షింపమనుచు
జిష్ణుతో మాటలాడ హేజీబు ననుతు, రౌర తిప్పనృపాలబాహాసినిహతు
లైనయలహిందుఖానసేనాధిపతులు, నిండి సురపట్టనముచెంత దండు విడిసి.33

గీ. తిప్పనరపాలకరవాలదీర్ణయవన, ముష్టిహతి రంభ నెడసి సమ్ముఖముం జేగు

తనయుఁ గని రాజరాజు సంతసముఁ జెందుఁ, దురకగ్రుద్దును బనికివచ్చెర యటంచు.34

క. బిసరుహనయనావిసర, ప్రసవకలంబకుఁ డతండు పరితోషితవి

ప్రసతీకదంబనానన, హసితైందవబింబఁ గోనమాంబ వరించెన్.35

క. ఆ తిప్పనృపతి కోనాం, బాతామరసాక్షియందు బాంధవరక్షా

ఖ్యాతుని దిమ్మధరాధిపు, నాతతగుణకలితు వేంకటాధిపుఁ గనియెన్.36

ఉ. వారలలో శఠారినృపవారకఠోరకుఠారధారణో

దారమహామహీతలవిధాయకకుంకుమసత్కురంగనా
భీరసరేఖికాకృతి గభీరభుజంగమభోగబాహుదు
ర్వారుని దిమ్మభూవరునిఁ బ్రస్తుతి సేయ వశంబె యేరికిన్.37

సీ. పరకాంతసంగతిఁ బరఁగుకూర్మస్వామి యబ్రమే బహుళజడాశి యగుట

రాజభామ వ్యాప్తిఁ బ్రబలు భూధరపాళి యరుదె గతశ్రవణాగ్ర మగుట
సద్విజవనితల సక్తి గాంచినపోత్రి వింతయే వెలివేయు విధులఁ గనుట
కుండలీశ్వరసుదృక్కులఁ బొందుకరిరాజపటలిభారమె యధఃపాలి యగుట
యనుచు భూదేవి తిమ్మభూపాగ్రగణ్య, బాహువం దుండి యొసపరిబాగుమీఱ
గరువమునఁ బల్కు నిఖిలలోక ప్రతాన, కార్యపరిశంశితత్కీర్తికాంతతోడ.38

సీ. చనవు తానని వచ్చినను లేవ కలమంజుఘోష మోచేకొద్దిఁ గొట్టువడియెఁ

గొనగోఱఁ జెక్కిలిఁ జెనకి ఘృచికాదేవి దేశీయంపుఁ దిట్టువడియెఁ
బుక్కిటివిడె మీయఁబోయి తిలోత్తమావనజలోచన ముచ్చెవాట్లుపడియెఁ
బొలయల్కఁ జుఱుకుఁజూపులఁ జూచి యూర్వశీబిబ్బోకవతి చౌకువేట్లు పడియెఁ
దిమ్మనరపాలు చికిలిదోదుమ్మిదారి, బలిమిఁ దెగటారి సురపురప్రాంగణమున
నరలెడు కటారిరాహుత్తవరులచేతఁ, గీడుచేయదె మడియలతోడిచెలిమి.39

సీ. అమరనాయకుమీఁది యాస యటుండఁగా బాదుషాపై యాస పల్లవించెఁ

బొసఁగినఘనవిధంబులవా రటుండఁగా దురువరంబులవారిమురువు హెచ్చె
లలితంపురుద్రవీణలవా రటుండఁగా మఱిరఖాబులవారిమాట హెచ్చె
హృద్యోత్సవంబు లనేకంబు లుండఁగాఁ గానిపనులదండుగలు సెలంగె
నబ్జహితుపేరు లవియెన్నియైన నుండఁ, ప్రౌఢకర్తారుశబ్దంబు రూఢికెక్కెఁ
దిమ్మనృపఖడ్గధారావిదీర్ఘమత్త, ఖానపుంగవసాంగత్యగరిమ దివిని.40

సీ. నికరంబుఁ పాపోసులకు మ్రొక్కుమనుచు దేవేంద్రనందను బట్టి యీడ్చి రనుచుఁ

జేష్టలుమాని దేశీయము ల్వినిపించు మంచుఁ దుంబురు నడ్డగించి రనుచు
సారాయికొపెర గంజాపొడు ల్దెమ్మంచు నంగడు ల్వడిఁ గొల్లలాడి రనుచు
లాయంబులోఁ బను ల్గావింప రమ్మంచు హరిణితోఁ గడునెగ్గులాడి రనుచు
దిమ్మనృపహతయవను లొందించులూటి, నమరపురిఁ జేర వెఱచు దిశాధిపతుల
కెఱుఁగఁజేయంగ నచ్చటి కిచ్చటికిని, నారదుం డాసుఁగ్రోవిచందమునఁ దిరుగు.41

గీ. అతఁడు తిర్మలదేవి మూర్త్యంబ రంగ, మాంబ లక్ష్మాంబ కొండమాహరిణనయన

గురవమాంబను నిజబంధుకోటు లెంచ, వరలువేడుకతోడ నుద్వాహమయ్యె.42

సీ. భర్త వినాయకప్రౌఢసంగతిఁ జెందఁ దాఁ గల్కివగల సంతసముఁ జెందుఁ

బతి ద్విజరాజాగ్రపాద మౌదలఁ దాల్ప, దా మహిభృత్పాదతతి భజించు
విభుఁడు సుధర్మాభివృద్ధిఁ బెంపువహింప, దా సురామోదసంధాన మొందు
వరుఁడు ప్రాభాకరవ్యాలోలరతిఁ గాంచఁ దాను జంద్రాలోక మూని చెలఁగు
ననుచు హరిజాయ హరురామ నమరనాథు, కొమ్మనంబుజభవుముద్దుగుమ్మఁ దెగడి
కాంతునకు నానుకూల్యసంఘటన యొసఁగు, ధీరసద్గుణనికురుంబ తిర్మలాంబ.43

సీ. వరుని సదా గదాకరుని జేయుటెకాని యిందిరాజలజాక్షి కేమి కొదవ

చెలువుచే మరుమాట చెల్లించుటయేకాని హిమశైలతనుజాత కేమి కొదవ
నాధునిజాడ్య మొందఁగఁజేయుటేకాని యిలజహ్నునందన కేమి కొదన
కాంతుని గోత్రారిఁగాఁ జేయుటేకాని యింద్రుపట్టపురాణి కేమి కొదవ
తరము గావింపరాదె యీతరలనయన, తోడ వారల ననుచు బంధువులు వలుక
విభున కత్యంతభాగ్యంబు వెలయఁజేయు, కీర్తితగుణావలంబ యామూర్తిమాంబ.44

వ. అమంధరవీర్యుండగు తిమ్మనృపకంఠీరవుండు తిరుమలాంబయందు గంభీరభేరీమహా

రావనిర్దలితకకుప్పటలవిశాలుం డగు తిప్పనృపాలుని రణరంగసంగతజయరమాధు
ర్యుం డగురంగరాయనృపవర్యుని నుష్ణకరతేజుం డగుకృష్ణధరాబిడౌజునిం గనియె
మూర్తిమాంబయందుఁ గర్ణాటకాధీశ్వరదయాసాంధ్రుం డగు నారాయణవసుంధ
రాదేవేంద్రునిం బెదరంగమాంబయందు నమందవితరణశాలియగు రఘునాథనరనా
థమౌళిని లక్ష్మాంబయందు నౌదార్యనిస్తద్రుండగు రామప్రభుచంద్రుని గొండమాం
బయందు ధర్మచర్యాదిలీపుండగు గోవిందభూపుని గురవమాంబ యందు శౌర్యహర్య
క్షుండగు తిమ్మధరాధ్యక్షునిం గాంచె వారలలోఁ దిప్పనృపాలు శౌర్యం బెట్టి దనిన.45

సీ. తనయిల్లు విడిదసేయనటంచుఁ జలపట్టు కొడుకు చేతులు పట్టుకొనఁగవలసె

తనరంభ వారి కీయనటంచు వాదించు కౌబేరికుఁడు గర గప్పవలసె
నులుపకై యీగిమ్రాకులచెంతకును దానె చని యిప్పు డాదుకొం డనఁగవలసె
దెల్లయేనిక నన్నుఁ దెమ్మందురో వార లని మూలదెస దాఁచుకొనఁగవలసె
నౌర తిప్పనృపాల బాహాసిధార, నవని విడనాడి ఱొమ్ముగాయముల వచ్చు
కడిది పగఱకు నుచితము ల్నడపుహరికిఁ, జాలుననిపించె నమరరాజత్వగరిమ.46

క. అలతిప్పధరాపాలున, కలఘుకృపాళునకు ననుజుఁ డై కాహళికా

కలితధ్వనిహలహలికా, చలదరి శ్రీరంగరాయజనపతి వెలయున్.47

క. మానకథానిధి యాధర, ణీనాయకమౌళి యరుల నిద్దురవుచ్చున్

మానక మృడకరడమరుస, మానకభటపటలపటపటార్భటిపటిమన్.48

సీ. తనకుఁ గూఁతు నొసంగి తనరిన దక్షుఁ డిష్టార్ధభంగముఁ జెందియవలఁ దిరుగఁ

దనకు ననంతపద్యారూఢి యొసఁగిన చతురాస్యుఁ డెపుడు విచార మందఁ
దనపైఁ బదం బమర్చిన పురుషోత్తముం డెందు నిరాకృతిఁ జెంది నిలువఁ
దనకు సత్కృతిపతిత్వం బిడిన బుధేంద్రుఁ డాశానువృత్తి నిత్యంబు మెలఁగ
వెలయు టిది యెల్ల యేదానవిధమటంచుఁ , జంద్రనీరదశిబికర్ణసరణిఁ గేరి
సుకవివర్యుల కఖిలార్థనికర మిచ్చుఁ, బ్రకటగుణుఁ డైన శ్రీరంగరాయనృపతి.49

క. ఆతని తమ్ముఁడు కృష్ణధ, రాతలనాయకుఁడు వెలయురంభావైరి

వ్రాతమకరాంకకేళీ, దూతీకృతహేతి లలితదోరర్గళుఁ డై.50

క. మూర్తిమాంబాతనూజు సత్కీర్తి నీయ, భవ్యరవితేజు నిబిడవైభవబిడౌజు

నతులరేఖాతిచంద్రు నారాయణేంద్రు, బ్రకటగుణసాంద్రు సన్నుతింపఁగఁ దరంబె.51

సీ. బహువర్షములుగన్న పాథోనిధిస్వామి నవ్యలావణ్యవర్ణనముఁ గనియె

సగరవృత్తి నెసంగుజహ్నుమౌనితనూజ యమృతప్రవాహవిఖ్యాతిఁ గనియె
నరవదిగ్బహులాస్య మరయని కావేరి రంగస్థలాభివర్తనముఁ గనియె
గడునుగ్రగతి యెఱుంగని నర్మదానది సోమోద్భవాదివిశ్రుతులుఁ గనియె
నేకుమారుని పట్టాభిషేకసమయ, మందు నిజవారి యొసఁగు భాగ్యమున నట్టి
వీరవేంకటరాయభూవిభునికరుణ, నెలమిఁ బాలించె నిల నారణేశ్వరుండు.52

సీ. అఖిలంబునకుఁ బ్రపంచాంగంబుఁ దెలిపి సత్రములపా లగుపోత్రిరాజుఁ దెగడి

కలభారతస్ఫూర్తిఁ దెలియంగఁ జేసి దానములు చేకొను నాగసమితిఁ దెగడి
పండ్లు గన్పట్టంగఁ బనసఁ జూపుచు ముష్టిఁ గైకొను కులధరాగ్రణులఁ దెగడి
కౌముదీరుచిఁ దెల్పి కడునాదిభిక్షుకాభరణాఖ్యఁ గనుఫణిప్రభునిఁ దెగడి
వచ్చి చేరిన ధారుణీవనజముఖికి, నీరదులపేరి వెలిజరీచీర లిచ్చి
నెనరుతో గంధ మొసఁగి మన్నించునాతఁ, డధిపమాత్రుఁడె నారాయణాధినేత.53

గీ. అట్లు పెదరంగమాంబామృగాయతాక్షి, తనయుఁ డైనట్టి రఘునాథధరణివిభుఁడు

తరణినిభుఁడు ప్రతాపసంతతులవలన, నంచు బుధలోకమెల్ల వర్ణించ మించు.54

గీ. అల్ల శ్రీరంగరాయ ధరాధినేత, దేవతాభక్తి నికురుంబఁ దిమ్మమాంబ

వరసరోవర కాదంబఁ దిరుమలాంబఁ, దనకు దేవేరులై ముదం బెనయ వెలసె.55

మ. అతఁ డాతిమ్మమయందు వేంకటనృపాధ్యక్షున్ రిపుక్షేషణో

ద్ధతు రంగాధిపుఁ దిర్మలాంబవలనన్ ధర్మాత్ము గోపాలు స
న్నుతకీర్తిం జిననారనాఖ్యుఁడగు నన్నుం గస్తురీంద్రు న్సమం
చితకీర్తి న్రఘునాథుఁ దిమ్మవిభుఁ గాంచె న్సజ్జనాధారులన్.56

గీ. అతని యనుజన్ముఁ డైనకృష్ణావనీంద్రుఁ, డెలమి రుక్మాంబవలన నహీనగుణుల

రంగనృపు సాంద్రతరదయారామచంద్రు, వేంకటపతీంద్రు వేంగళవిభునిఁ గనియె.57

మ. అలతిమ్మాధిపు నారనేంద్రుఁడు దయాధారుండు నన్నుం జయో

జ్వలుఁ గృష్ణాధిపుపుత్రు వేంకటపతిక్ష్మాకాంతచంద్రున్ గుమా
రులుగాఁ గైకొని ప్రోచెఁ గాన నతఁడే రూపింపఁగాఁ దల్లిదం
డ్రులు దైవంబును నయ్యె నిద్దఱకు నెంచు న్సందియం బేటికిన్.58

సీ. చలపట్టెనా వైరిజనపాలకుల ఱెక్కముక్కాడనీయక యుక్కడంచుఁ

బూనెనా యరిధరాభుజుల నంతఃకలహంబు గల్పించి పాయంగఁ జేయు
నెంచెనా పరిపంథిపృథివీపతుల దాడి వెడలించి తన వెంట వెంటఁ ద్రిప్పుఁ
దలఁచెనా రిపురాజిఁ దనహజారంబునఁ బడిగాపులై తడఁబడఁగఁ జేయు

.

నితనితోడుత వైర మీడేఱ దనుచు, సకలధరణీశు లెపుడు నిచ్చక మొనర్స
వీరవేంకటరాయభూవిభునికరుణఁ, బరఁగు నారాయణక్షమాపాలవరుఁడు.59

సీ. తనమాట కాంచికాతంజాపురీమధురాధినాథులకు నెయ్యంబు నెఱపఁ

దనచీటి గోలకొండనరేంద్రముఖధరాధవపద్మబంధు లౌదల ధరింపఁ
దనకీర్తి మట్లనంతనృపాలముఖ్య గోత్రామరేంద్రులు గొనియాడికొనఁగఁ
దనదానగుణము గోదావరీతీరభూనిర్జరేశ్వరులు వర్ణించుకొనఁగ
వెలయు వేదండగండనిర్గళదనర్గ, ళమ ధారాధునీనాథకుముదబంధు
కార్యకృడ్డిండిమారావధుర్యసైన్యుఁ, డతఁడు ప్రభుమాత్రుఁడే నారనాధినేత.60

షష్ఠ్యంతములు

క. ఏవంవిధవసుధాసం, భావితబహుథాకథాతిభానీరధికిన్

గ్లావధికశిశిరనిజవీ, క్షావధికార్పణ్యబుధమహాసేవధికిన్.61

క. స్ఫుటధాటీభటకోటీ, చటులాటీకనహతారిజనపతికి శచీ

విటగోత్రోత్కటమిత్రో, ద్భటచిత్రోజ్జృంభితప్రభావద్యుతికిన్.62

క. మణినాగనగరకాంతున, కణుమధ్యాజనమనోజయంతునకుఁ గుభృ

ద్గణగణితరామణీయక, మణిఘృణిఫణితాతిమంజిమనిశాంతునకున్.63

క. విసృమరబహువిధవైభవ, హసితేంద్రున కసితకేతనాలోకనమా

సముత్త్రస్తారిధరా, పసమూహావనచలత్కృపాసాంద్రునకున్.64

క. వీరారివారవారణ, వారణసృణికింగవీంద్రవర్ణితవిద్యా

పారగతాదిమఫణికి, న్నారాయణధరణియువతినాయకమణికిన్.65

వ. అభ్యుదయపరంపరాభివృద్ధిగా నాయొనర్పంబూనిన కువలయాశ్వచరిత్రంబునకుం

గథాక్రమం బెట్టి దనిన.66

ఉ. శ్రీమహితంబు భారతవిశేషకథావిధము న్విహంగమ

గ్రామణు లేర్పడం బలుకఁగా విని భావనిరూఢహర్షుఁడై
జైమిని యాఋతుధ్వజుని చందము లందము లయ్యెఁ దెల్పర
య్యా మఱి యాతఁడే కువలయాశ్వుఁ డనంగఁ బ్రసిద్ధి గాంచుటల్.67

క. అనిన న్విని జైమినిమునిఁ, గనుఁగొని విహగంబు లతనికత యి ట్లనుచు

న్వినిపించె సుధారసగుం, భనగంభీరాతిజృంభమాణమృదూక్తిన్.68

క. శ్రీకరమై నానావిభ, వాకరమై యగ్రచుంబితాంబరబహుర

థ్యాకేతనాతిసరమై, సాకేతపురీవరంబు సన్నుతి కెక్కున్.69

సీ. ప్రాకారశశికాంతపఙ్క్తికాంతులు చుట్టు నూలిపోగులచాలు లీలఁ గాంచ

విడికెంపుగుంపుఁ జెక్కడపుఁ జొక్కపుఁ గోటకొమ్మలు జోతులయెమ్మెఁ దాల్ప
నవరత్నమయనూత్నవివిధవీథీరాజి యమరికప్రోలుసోయగము చెందఁ
బైఁడికుండల నేరుపడినముత్తెపుమేడ లై రేనికడవలయంద మొంద
జయరమాసతి తత్పురీశ్వరవివాహ, గరిమ నాలవనాఁడు నాకబలి చల్లఁ
దమమహిమ మింటినంటు భక్తంబు లనఁగ, సొగసుఁ గనఁజాలుఁ గడురేలుచుక్కచాలు.70

చ. దళములచాలు మిద్దియలతండముమేలు విచిత్రపత్రము

ల్చెలఁగెడితీఱు నీరములు చెందినసౌరును గాక రాజురా
కల విలసిల్లునంచుఁ బురకంజముఁ జేరె రమావధూటి త
జ్జలజగృహంబులం దలిమిషంబున లక్కను ముద్రవెట్టుచున్.71

ఉ. కోటకు నస్థిభార మొనగూర్చుతఱిం బలియిచ్చు సేమపుం

జీటులు కొమ్మ దీర్చునెడ శిల్పకు లంతికవర్తి సత్యలో
కాటనతత్పితామహుని హస్త ముఁ జేర్పుదు రాతఁ డాత్మ నై
శాటవిరోధిఁ గన్నఁ గొదవంచుఁ గటారి యొఱం దగుల్పఁగన్.72

చ. కలిగిన నేమి జాణలు జగంబున నంబుధినాథువంటిజా

ణలు గలరే యదెట్టులనినం దనలో మణులెల్లఁ బౌరరా
జులు జవరాండ్రకుం జికిలిసొమ్ములు సేయ నగడ్తపేర వా
రలజలఖేలనత్రుటితరత్నములం గిలుబాడు నిచ్చలున్.73

ఉ. అంబుధి మేదినీవసనమై కనుపట్టుటఁ గట్టిపెట్టి ని

క్కంబుగఁ గోటచుట్టుఁ బరిఘాకృతి నుండుట యేమి యంచు నెం
చం బని లేదు మందరరసాధ్రసమాంబువిహారితత్పురీ
శంబరలోచనాజనకుచక్షతి సారదిదృక్షువై సుమీ.74

చ. అగణితకేళిఁ బ్రోలిజవరాలిగము ల్వనపాళి నాడఁగా

నగడితఁ దేలి యోలినురగాళికచాళి తదీయవేణి సో
యగములు బాళి మృచ్చిలి వయాళిగ నెమ్మిగయాళి జాడమై
డిగుననుజాలిఁ గ్రమ్మఱి నడిం జను గూఢపదత్వసంపదన్.75

చ. పురిఁ బరిఘోరీనికరము ల్జలసూత్రమువెంట సౌధమం

దిరములఁ జొచ్చి యందుఁ దరుణీతనుగంధము కాలిసంకెలై
నెరయఁగ నిల్చి కేకిరమణీనిహృతు ల్మెడవట్టిద్రొబ్బగా
నరిగి తదీయభూతిఁ గొనియాడు నిజాప్తులు మూఁగి యూకొనన్.76

మ. తళుకు న్మేడలమీఁది చేడియల చేఁత ల్తేటమిన్నేటిలోఁ

గలయం గానఁబడం దదంబువిహరర్గంధర్వు లీక్షింపఁ ద
ల్లలన ల్గన్గొని యద్దపున్ముడుపు లేలా చూడఁగా నంచు వా
రలచూపు ల్మరలింతు రల్లన మిటారంపున్నునుంబల్కులన్.77

సీ. కార్యత్వరాగతాగతసౌరకులవారకాంతలు చేదివ్వె సంతరింపఁ

బూర్వాభిసారసంభోగానురాగతారావధూమణి చంద్రురాకఁ గోరఁ
గేలిలాలసమరుద్బాలికాపాలిక ల్కడఁగి చీఁకటి మొట్టికాయ లాడ
మఘవదాజ్ఞాలంఘనఘనజాంఘికభటోత్కరములు కాణాచిగా రమింపఁ
దనరు వనరుహనాభనూతనరుచిప్ర, చండపురనీలజాలకసౌధయూధ
కాంతిసంతానమంతరధ్వాంతరోహ, వీథిసురపట్టనాధ్వాంతరోధి యగుచు.78

శా. ఈనీలపుమేడల న్శుభవిధాయి స్వర్ణపాంచాలికా

కేశు ల్మేలగు పాండురాజభవభక్తి న్మించియు న్సౌరభా
వాలోద్వేలశిలీముఖప్రభల భాస్వన్నందనాలింగనే
చ్ఛాలబ్ధిం దగి యక్షయాంశుకతతి న్సంధించుచుం దత్పురిన్.79

గీ. రవిరథతురంగములు నిబ్బరముగ వచ్చి, హర్మ్యముల నిల్చి వేసవి నచటిముద్దు

గుమ్మ లచ్చపుఁ జిమ్మనగ్రోవినీట, నురుఁగుఁ గడుగఁ బథిశ్రాంతి దొఱఁగి యరుగు.80

సీ. సకలాగమస్ఫూర్తిఁ జరియించుభూసురు ల్పనసలు కొన్ని యేర్పఱచు టరుదె

యనుపమధైర్యశౌర్యారూఢి గలనృపుల్ ఘనచక్రవైభవం బెనయు టరుదె
రాజరాజప్రౌఢి రహిగల్గు కోమటు ల్వరవైభవంబున వరలు టరుదె
కువలయప్రఖ్యాతిఁ గొమరొందు శూద్రులు ద్విజరాజభక్తి భావించు టరుదె
యనఁగ సుమనఃప్రవృత్తిచే నతిశయిల్లి, యచ్యుతస్థితిఁ జెంది కర్ణాతిసహ్య
సరణి గణనకు నెక్కుచు సరసులందు, వెలసి సన్నుతిగాంతు రవ్వీటియందు.81

సీ. పట్టపుటేనుంగు పజ్జలబిరుదడక్కారావ మాలించి యట్టె తూఱు

దాని నవ్వలఁ దీయఁ దళకుగోడల మచ్చుఁ దమనీడఁ జూచి యుద్ధతిని గ్రుమ్ము
నాచెంత గరిడీలనమరు సాదనమ్రోఁత విని యచ్చటికి గిరుక్కునను మరలు
నది చూచి యదలించు నాదికట్టికవారిఁ బైనెత్తు బంధము ల్తోనె తునియ
రెక్కలన గంటలమర సారించి చాఁచుఁ, గరము పిలిచినవారలఁ గదియ నిగుడ
దరలు నని మావటీండ్రు కొందలపడంగఁ, గదలు వీథులఁ దత్సురీగంధకరులు.82

చ. అనిలునిఁ జేసె లేడి భువనాంచితపావనమూర్తి వైనతే

యుని విధమంటిమేనిఁ బురుషోత్తము నెందున నామధేయుఁగా
నొనరిచె నంచు నచ్చటిహయోత్కరము ల్బహుమండలప్రవ
ర్తనము జగత్ప్రసిద్ధగుణధారలుఁ జూపు నిజేశ్వరాళికిన్.83

చ. ఊరగకులోద్వహుండు పగ యొప్ప దటంచును దార్క్ష్యసంగతం

బరఁగఁ దలంచి వజ్రసుషమాతిరమాపరమానుషక్తిచే
నరదము లయ్యెఁ గావలయు నప్పురరాజమునందుఁ గానిచో
హరిపదమందు మేల్పడగలందునె చక్రివిధంబుఁ జెందునే.84

చ. చలువలు గట్టి చన్నుల హుసారుగ గంధ మలంది కప్పురం

బలరెడి ముత్తెపుంబరణు లంది తనర్తుల్ గట్టి వాల్చెలుంరు
తెలియఁగ నాత్మకాంతిధవళీకృతపద్మభవాండముం గరా
మలకముఁ జేసి నిల్చు పురమానవకీర్తిలతాంగులో యనన్.85

సీ. ననవింటివాని సానాకత్తి పరుఁజు టెక్కుల చొక్కటపు సాముకొండె లలర

మురువుదీర్చిన చన్నుమొలక యద్దములకు గవిసెనల్వలెఁ జనుకట్టు లమరఁ
దీవలపైఁ బూవుఁదేనెసోనలలీల మేనుల సంపెంగనూనె తనర
బటువు గద్దియలపైఁ బట్టుగద్దిగ రీతి జఘనదేశముల హిజారు లమరఁ
గడగి మీఁదటికన్నెఱికంబుఁ జెఱప, నొకనికొకఁడు వితాకొలారకము లనుపఁ
దళుకుఁ గాంతురు వింతసాదనలఁ దీఱి, గుడి వెడలి వచ్చుబోగంపుఁబడుచు లచట.86

క. కాదంబరి స్వాదించియు, మోదంబునఁ గౌముదీసమున్మేషము సం

పాదించియుఁ దబ్బిబ్బుగ, వాదింతురు రేలు వారవనితలు వీటన్.87

చ. తొలఁకెడుతావిగంపవొడి తూరుపువాఱఁగఁబట్టి మల్లెపూ

వలపులు కొల్లలాడి హిమవారిఁ గలంచి మెఱుంగుఁబోండ్లగు
బ్బలపయి చంద్రకావిజిగిపయ్యెదకొంగు లెడల్చి యెందు మై
దెలియక తూలుకొంచు వలిదెమ్మెరలాహిరికాఁడు త్రిమ్మరున్.88

క. ఆనగరంబు ఋతుధ్వజ, భూనగవరవైరి యేలు భూమహిమధరా

ధీనధరాహీనధురా, హీనకరారచితకీర్తి మృదుకంచుకుఁడై.89

క. చకచకితనఖరముకుర, ప్రకరముఖచ్ఛాయఁ దొంటిభంగి గనుటనో

వికటమహిపాళి తత్పద, నికటంబున వ్రాలి లేవనేరకయుండున్.90

సీ. అనిలబాణము శత్రుజనులకు సెలవిచ్చు జోగులై భోగులై స్రుక్కఁజేయ

వారిదాస్త్రము వైరివీరులఁ జాలించుఁ గర్మందులై గాలిఁ గమిచి మ్రింగ
నంధకారాంబకం బరుల కప్పన యిచ్చు నిహతులై కమలినీనేతఁ బొదువ
నహిశరం బహితరాజాళి కానతియిచ్చు శబరులై కీకససమితిఁ బొదువ
నౌర యీరాజవరుఁ జేరి యసమజన్య, మందు నివియెల్ల స్వామికార్యస్వకార్య
ములను వంచన లేక వర్తిలఁ దొడంగె, గాఢమతిశాలిమంత్రిపుంగవు లనంగ.91

శా. ఆలీలాజలజాస్యుఁ డశ్వతరుఁడన్ వ్వ్యాళేంద్రుపుత్రు ల్నయ

శ్రీలాసిస్వచరిత్రు లిద్దఱు నిజస్నేహాతి రేఖాజహ
త్కేళీలోలతఁ దన్నుఁ గొల్వ మది నుద్దీపించు ప్రేమంబునం
గాలక్షేప మొనర్చు దుష్టజనశిక్షాశిష్టరక్షాదృతిన్.92

సీ. ఒకవేళ దండనాయకులు పౌజులు దీఱి పొడఁగానఁగా స్వారిపోయి మరలు

నొకవేళ వెనువెంట నూడిగా ల్గొనుచు ఘోట్టాణంబు నెక్కి జోడనలు చూపు
నొకవేళ మంత్రిగాయకముఖు ల్గొలువఁగా సుముఖుఁడై నిండోలగమున నుండు
నొకవేళ మాఱువాలకముతో నసిసహాయంబుగాఁ బురశోధనం బొనర్చు
నొక్కవేళను భరతశాస్త్రోక్తరీతి, జాణలునటించు నాటకశాలఁ జూచు
నిట్లు వారాశివేలాపరీతభూమి, పాలనశ్రీల నారాజు బరఁగునంత.93

మ. బిలనిశ్చేష్టజరద్భుజంగము తదాభీలాతిఫూత్కారగా

రళఘోరానలభావదాయకదనవ్రాతంబుఁ డచ్చాంతివీ
క్ష్యలలచ్చైవలినీభవిష్ణుమృగతుృష్ణాలీలమై యుర్వరం
గలయం బర్వె నిదాఘకాలము సమగ్రక్లాంతదిగ్జాలమై.94

సీ. జలవిహంగములు శుష్యజ్జలాశయముల కితరపక్షులఁ జేరనీక తఱిమె

వనకరుల్దవవహ్ని యనుజుంజములు సోఁకఁ గరము లెత్తుచుఁ గొంచపరువు వాఱెఁ
జిలువచాల్కలుగులోపల స్రుక్కి యన్యోన్యఫూత్కారపవనాప్తిఁ బొట్ట నించెఁ
బులు లాఁకట నలంగి బొరియలడాఁచిన పలలంబులకుఁ బోను బాలుమాలెఁ
దమకుఁ బాన్పైనతరణికాంతములు పొదల, యాకుసందులఁ బొడయెండలంటి ప్రక్క
చుఱుచుఱుకుమన్న మెకములు గెరలి బెదరి, గొరిజదాఁటుగఁ బరుగెత్తి తిరిగిచూచె.95

సీ. యతిజను ల్చక్రవాళాద్రియవ్వలిమునీంద్రులతోడ మాలిమి గలదటంచు

ఫణివరు ల్పాతాళపతియైన యౌరగేశ్వరుఁడు మా కేలినవాఁ డటంచు
నచులు పంకజభవాండము చుట్టికొన్నట్టి యుదధిరా జున్నాఁడు గద యటంచు
నంచలు సత్యలోకాధీశుఁడగువాని సొగసుతత్తడి మాకుఁ జుట్ట మనుచు
నక్కడక్కడి కరుగ నుపాయ మెంచఁ, గాసె బీఱెండ మార్తాండకరగృహీత
సలిలసింధువినిర్గతజంతుకబల, నాగ్రహవ్యగ్రబాడబాత్యుగ్ర మగుచు.96

చ. మిటిమిటియెండవేఁడిబలిమిం దెలిదమ్ముల ఱేకుసందులం

జిటుకుమనంగ నోడి నివసించి తదగ్రమరంద మప్పట
ప్పటికిని మూతిముటైపైఁ బైఁబడి చల్లఁబడంగఁ బ్రొద్దుకుం
కుటఁ గని యంతట న్వెడలుఁ గోడెమిటారపుఁతేఁటు లత్తఱిన్.97

సీ. కావళ్ళు గలిగెఁ జొక్కపుఁ గప్పురపుఁ బల్కు లడరించు నేడాకుటనఁటులకును

సుంకంబు లుడిగె మెచ్చులు రా గుబాళించు చేవయెక్కు మలాక చెక్కలకును
హెచ్చుకట్టడి గల్గె నింపుగారవమాడ వళ మద్దుచాయలవారలకును
మన్నన ల్గలిగె మేల్పన్నీరుచెంబు లేర్పఱచి తెచ్చినయపరాధులకును
హుజురుకొలువులు గలిగె సొంపొలుకు తేట, నీటికొలఁకులలో బెండు నిండువగల
దెప్పపై బొండుమల్లెల చప్పరములు, నెరయఁజేసినవారికి దొరలచేత.98

మ. కొలఁకుందామరతావితెమ్మెరలసోఁకు ల్దెచ్చు ముత్యాలత

ల్పులబల్సోరణగండ్లచాయఁ గపురంపుంగుంపుసొంపూను మే
ల్మలకాగందపుతేటతోడి జిలుగుంబన్నీటిధూమ్రంపుఁది
త్తులచేఁ బొద్దులు వుత్తు రత్తఱినిఁ గాంతు ల్కాంతలు న్మేడలన్.99

చ. అలసిన మమ్ము మింటి కెగయం ఘటియించి భరంబువాపు వా

త్యలఁ గనుఁగొన్నఁ గాని తనకబ్బకు హర్షమటంచు శేషుఁ డ
ర్మిలిఁ దల లెత్తిచూచు బిలరేఖలన న్మడుగు ల్చెలంగె ని
ర్జలలసితాబ్దకోరకపరంపర తత్ఫణమండలంబుగన్.100

క. పరుసైన యెండమెండున, నరవరలై హాయిలేక యలజడి పడఁగా

సురగాలి యేఁచెఁ బ్రజలం, గఱవుకుఁ దోడావపంట గలిగిన కరణిన్.101

క. అడరెడు నదీజలంబుల, నెడవాయఁగలేక యవి మహిం గ్రుంకినచో

నడుగంటి నిలిచి తెలిపిన, సుడు లనఁగాఁ జెలమలింపుఁ జూపెం బ్రజకున్.102

గీ. కూపములమీఁదఁ గలలోభగుణముకతనఁ, దూఁచి కైకొనుకైవడిఁ దోఁచె నపుడు

హలికజనములు పరికల్పితాంబుయంత్ర, ముల జలంబుల గ్రహియించు చెలువు మెఱయ103

క. జడజవనబంధువేఁడిమి, నుడికెడు పుడమికి నొకింత యూరట సేయ

న్నడుమ నెలకొన్న వెన్నెల, నడువున శాల్మలుల తూలవారము నెఱసెన్.104

గీ. అట్టి గ్రీష్మర్తునందు నయ్యధిపమౌళి, యతులతరభోగభాగ్యంబు లనుభవించె

ననిన జైమినిముని యావిహంగము లన, నంతరకథావిధం బెట్టిదని యడిగిన.105

ఆశ్వాసాంతము

మ. మృదువాణీసుమచాప చాపలపలాయిద్వేషిరాజన్యకా

న్వదితాశాంచలభాగ భాగవతసంపన్నిత్యపూజాలస
త్సవనాధిష్ఠితవిత్త విత్తమనుతస్వచ్ఛస్వకీర్తిచ్ఛవి
చ్ఛిరురేందుద్యుతికాండఖండదతి నాసీరైకభేరీరవా.106

క. గాంధర్వరసిక యౌవన, గంధర్వవిపత్సఖర్వగర్వవిదళనా

సంధానధురంధర బల, సంధానవపరశురామ సంగరభీమా.107

మత్తకోకిల. నందనందన పాదనత్యభినందిమానససింధుగో

విందసన్మణినాగపట్టన విశ్రుతప్రభుతోజ్జ్వలా
చందనైందవసుందరీహరిచందనద్రునవప్రతి
చ్ఛందనూతనకీర్తికందలచంద్రికాంకదిగంకణా.

గద్య

ఇది శ్రీమన్మదనగోపాలకటాక్షవీక్షణాసమాసాదిత సరసకవితావైభవ సవరమ

న్వయాభరణ నారాయణభూపాలతనూభవ శఠగోపతాపసేంద్రచరణారవింద
సంచలన్మానసమిళింద సంతతభారతభాగవతాదిశ్రవణానంద కామినీమనోహర
రూపరేఖావిజితచైత్ర కాశ్యపగోత్రపవిత్ర జాతివార్తాకవిజనామోదసంధా
యక చిననారాయణనాయకప్రణీతంబైన కువలయాశ్వచరిత్రం బనుమహాప్ర
బంధంబునం బ్రథమాశ్వాసము.