Jump to content

కువలయాశ్వచరిత్రము/చతుర్థాశ్వాసము

వికీసోర్స్ నుండి

శ్రీరస్తు

కువలయాశ్వచరిత్రము

చతుర్థాశ్వాసము

క. శ్రీరాజద్వేంకటగిరి, శౌరిపదాంభోజభజనజనితోజ్జ్వలతో

దారవిభవేంద్ర సవరము, నారాయణభూపచంద్రనయగుణసాంద్రా.1

గీ. అవనరింపుము జైమిని కలపతంగ, కులపతంగంబు లిట్లని తెలుపఁ దొడఁగె

నమ్మదాలస పటకుటీరంబుదారి, కమ్మతావులతెమ్మెర ల్గమ్ముదారి.2

క. వని సొచ్చుట మరునకు న, ర్చన లిచ్చుట సొమ్మసిల్లి సఖియలవలనం

గనువిచ్చుట వా రచటికిఁ, జనుదెంచుట యెఱుఁగలేక తన్మయదశచేన్.3

సీ. మనవులు విన్నవించిన వినునోయంచుఁ జేరుకన్నియమిన్న చిన్నఁబోవ

ననబంతి కానుకిచ్చినఁ జూచునోయంచు వచ్చు నెచ్చెలి తలవంచికొనఁగఁ
నెనరుతో హెచ్చరించినఁ బల్కునోయంచుఁ గదియు పైదలి సిగ్గు గాంచి యొదుగ
గనిపించి జాతి చెప్పిన నవ్వునో యంచు నరుదెంచు హరిణాక్షి యవలి కరుక
వినక చూడక పలుకక వేదనాప్తి, నవ్వ కాపద్మనయన కాంతవశరాగ్ని
తప్తకిసలయముక్తనూతనపునఃప్ర, వాళకృతశయ్యఁ బొరలాడువేళయందు.4

ఉ. ఈవనజాయతాక్షిఁ దరుణేక్షుధనుష్కతురుష్కమౌళి యా

హా వెత పెట్టెనంచు హృదయార్ద్రదయాభ్యుదయాప్తి చేత రా
జీవశరప్రహారగతిఁ జెందుట తెల్పఁగ నేగె నాఁగ గం
గావిభుఁ జేరెఁ గింశుకనఖద్యుతిఁ జొత్తిలి మిత్రుఁ డయ్యెడన్.5

శా. ఛాయాప్రాగవకర్షణంబు సరసీజాతాంతభోగంబు కౌ

లాయానీకపతంగపాకపితృజాలప్రాప్తి పాంథప్రజా
స్థేయస్థానగతిప్రబోధకము దూతీప్రార్థనారూఢజా
రాయత్నంబు జరన్మహాతప ముదారంబయ్యె నంతంతకున్.6

చ. వడి నపరాద్రిఁ జెంద నని వాసిగఁ బద్మిని నెత్తిమీఁదఁ జే

యిడి కరసంగతి న్సమయ మేగఁ దదాశఁ గుఱించి రాగ మే
ర్పడఁగఁ జనంగఁ దేజమెదఁ బాయఁడె యీయినుఁ డంచు మ్రోఁత పె
ల్లడఁరగఁ జాటుసూటి సరసాళితతు ల్మొఱసెం గొలంకులన్.7

చ. అవిరళనిర్గళన్మధురసాగ్రనిబద్ధ నిజానుబింబకై

తవమున హేళి కాలవశత న్నిజపద్మగృహంబుఁ జేర మా
ధవపదచ మౌటచే రమ మచభ్రమరాళితమంబు వాని వెం
దవులకయుండఁగాఁ దలుపు దార్చె నన న్ముకుళించెఁ బద్మముల్.8

ఉ. ఏకరథాంగభావము వహించిన నన్నిటు డించి పోవుట

ల్నీ కుచితంబు గా దయిన నీవలె నేనును నీరధిప్రవే
శాకలనంబు గాంతు నను నాకృతి భానుని దేఱిచూచుచుం
గోకము బాష్పనార్థి సమకొల్పె భవిష్యదయోగఖిన్నమై.9

ఉ. ఎంతయు బాడబంబు తనయింటికడం జెలువొందు జీవనం

బంతయుఁ గొల్లలాడ భువనావనశాలివి నీవుపేక్ష గ
న్పింతువె యంచుఁ బాశి మొఱ వెట్టగఁ జక్రము దానిపై రమా
కాంతుఁడు వైచెనో యన వికర్తనుఁ డయ్యెడఁ గ్రుంకె వార్ధిలోన్.10

చ. కరముల బల్మిచే మెఱయు కంజహితుం డను మేటిజెట్టితో

నరుదుగఁ బోరిపోరి సమయప్రతిమల్లకులేంద్రుఁ డాతనిన్
హరువుగఁ ద్రోచి మేనిచెమ టారఁగఁ దాల్చిన యెఱ్ఱమట్టినా
గరమమరెం బ్రవాళరుచిగంధధురంధరసాంధ్యరాగముల్.11

సీ. రవిగ్రుంక ముకుళించు రాజీవములఁ బాసి గమిగూడు తుమ్మెదకదు పనంగ

విభునిఁ గానక భూమి వెదుక నేతెంచి చొప్పుడు చాయ విశ్వరూపం బనంగఁ
దొగనంటు సోమాఖ్య నెగడి రాఁగలఁడంచు గుమిగొన్న తామసగుణ మనంగ
రేకొమ్మ పతిరాక కైకొప్పు ఘటియింపఁ గొనవిప్పు కురులడా ల్గుం పనంగ
కాముకాగమనప్రతీక్షాపరాయ, ణోత్పలాక్షీజనాంజనవ్యూఢవిసృమ
రాయతాక్షీణనవవీక్షణౌఘ మనఁగఁ, దండిచీఁకటితండంబు మెండుకొనియె.12

సీ. నటదుగ్రఢక్కానినాదభిన్నాంతరిక్షమునఁ దాల్చిన వెండిక ట్లనంగ

జవమందమందగంధవహాప్తి మింటిపై రాలు వేలుపుమ్రానిపూ లనంగ
యామినీవిధువివాహమున కంబరవేది వరలు ముత్తెపురంగవల్లు లనఁగఁ
దమపుష్కరాభిఖ్యతథ్యంబకా వియత్పథము చెందిన వెల్లదమ్ము లనఁగ
సమయమనుయాత్ర నాళీకసార్వభౌముఁ, డంబుజంబులఁ జెందురోలంబపఙ్క్తి
యనుతుపాకిని గగనలక్ష్యంబు వైవఁ, దగులు సీసంపుగుండ్లునాఁ దార లమ రె.13

క. అలపొడుపుగట్టు నగరు, న్వెలువడురాజునకు మ్రోల వేళాసతి మె

చ్చులకుచ్చుఁ బట్టివైచిన, వెలిపావడ యనఁగఁ దూర్పు వెలుకం బాఱెన్.15

సీ. తనభానుసంతతి ధరమీఁద వెలయింప భువిఁ గాధిపతి గురస్ఫురణఁ బెంప

రహిఁ బాదమహిమచే ఱాతినారి నొనర్ప నభవోగ్రధర్మ మొప్పారఁజేయ
మానితధరణిజాతానంద మొనరింపఁ బాంథరామాత్మదర్పంబు లడఁప
వనభూరికమలవర్గస్ఫూర్తి మాయింపఁ దారేశరూఢివర్ధన మొనర్పఁ
దేనెరాయనిగర్వంబు గానుపింప, సమధికపలాశపరచక్రసమితి నొంచ
నమితకువలయపరిపాలనమున మెలఁగఁ, దూర్పుదెస రామచంద్రుఁడు తోఁచె నపుడు.16

గీ. ప్రాగ్దిశాంగన కెంగేలఁ బట్టినట్టి, పురుతకాలపట్టుగవిసెన పొదువు వలన

నందమొందెి నిద్దంపుటద్ద మనఁగఁ, బొడుపుఁగెంపున జాబిల్లి పొడిచె నపుడు.17

చ. అమలిన శుక్లపక్ష మెనయందగు తద్విజరాజు మించి భే

దము సవరించి తేర్చు తెలితల్కులపాలనఁ బాంథదేహపాం
డిమబలెఁ జంద్రిక ల్నిగిడె డించిన నీరనఁ గాముకాత్మమో
హమువలె నంధకారనివహం బది యెక్కడనో యడంగఁగన్.18

క. ఆకరణిఁ బొలుచు హృదయ, వ్యాకులతాతాపకారి యగు కోకారిం

జేకూరిన వగ వేలుపు, రాకూరిమిపట్టి యబ్బరంబుగఁ బలికెన్.19

మ. నెనరొందం ద్విజరాజుగా యితఁడు పోనీ యంచు నే నూరకుం

డిన నీ వెంచక యేతువే యిటులఁ గానీ మంచిదే చంద్ర నా
నునువాలుంజడ చిల్వరాయనికి నిన్ను న్మేఁత గావింతురా
వినురా యేటి పరాకురా కుసుముధన్విం గూడి వే రాకురా.20

గీ. అమృతరామకమండలు హరిణకృత్తి, కాసమన్వితు నుద్దండకరుని నిన్ను

గన్న సన్న్యాసిగతి దోఁచుచున్న దరయ, గగనమధ్యాభియుక్తి నీ కగునె చంద్ర.21

గీ. శరధిఁ దోచుఁట నాళీకపరవిధంబు, గోరి కాంచుటయును మ్రోయుగుణము గల్గు

వింటనంటుట మమ్మేఁచుచుంట తెలిసె, నేయువారలఁ గానమో తోయజారి.22

క. నళినాప్తువలన మండల, కలితుఁడవై వెలయుటెల్లఁ గలిగిన కరణిం

దలఁతువె శంబరహారికిఁ, గలదే యుపకార మెందుఁ గమలకులారీ.23

సీ. నినుఁ గడుపారఁ గాంచినవారిరాశికిఁ గడలేనిపాటులు గాంచవలసె

నిను నారికోరి కైకొను కల్వచెల్వకు విషములో బ్రతుకుఁ గావింపవలసె
నినుఁ దలమీఁదఁ దాల్చిన శూలపాణికి నవిభవోపేతుఁడై యమరవలసె
నిను నమ్మి కొల్చి నిల్చిన తారకాళికిఁ జింతింప దుఃఖంబు చెందవలసె
నెవ్వరికి మంచివాఁడ విట్లెంచి చూడ, నించువిలుకాని కొక్కనికేమొకాని
వాని ప్రథమాస్త్రవిభవంబు వారి కొనవె, రాదు నీచెల్మి చేయఁ దారాసహాయ.24

గీ. పాంథమదఖండనోద్దండపద్మకాండ, గర్వసాహాయ్య కలయొండు గన్న నీకు

నమరభోజ్యకళ ల్గలవండ్రు లోకు, లొకటికిఁ బదాఱు గల్పించి యుత్పలాప్త.25

గీ. అనుచు రామాలలామ పాంథాతిభీమ, ధామచయసీమ యగుచందమామఁ గినిసి

వినిశితాంభోజనారాచ మెనసి యేఁచు, మనసిజు గుఱించికొనుచు నిట్లనుచుఁ బలికె.26

గీ. అబ్జ నీవైరి నీతండ్రి యైనగరుడ, గమనకేళికి గుండెలో గాల మింత

కొదవలే నీదుతల్లికిఁ గొంప చెఱుపు, వీనితోఁ గూడి యేఁచకు విషమబాణ.27

చ. కమలశరా నినుం జఱపఁగా నియమించినఁ జేరిమూఁడుగా

ళ్ళముసలి కావునం దయలలాట విలోచనకీలి నిన్ను ని
క్కముగఁ గరంచకుండె నని కాదె గిరీంద్రకుమారి కావరుం
డమలినమంత్రదక్షసవనావని నాతనిఁ బాఱఁ ద్రోలుటల్.28

సీ, భామానిరూఢి గన్పడ మండలాగ్రంబు మెఱయించు మొదట నీమేనమామ

కొమ్మలపైఁ బండ్లు కొఱికి లావుల నల్లధాటి కన్పించు నీఘోటకంబు
కాంతాళి పైఁ పరాగస్ఫూర్తి గల్పించి చెనకంగఁ జూచు నీచికిలితూపు
నారులమ్రోఁత నానందించి నిలువెల్లఁ గన్నులు దాల్చు నీకార్ముకంబు
బళిబళీ నీకు బాకైన తలిరుటాకు, లడవి లతకూనలన్నఁ బైనంటి నిలుచు
నీవు మామీఁద శౌర్యంబు నెఱపుటరుదె, మానినీప్రాణహోర రమాకుమార.29

చ. వనజకృపాణ చల్లనయి వర్తిలఁగాఁ దడిపాఁతగొంతు గో

సినగతిఁ దమ్మివాలు గొని చిమ్మెదు పొాంథులమీఁదఁ దేనెఁబూ
సిన పెనుఁగత్తి కావలయుఁ జేతికి నీ కది విప్రయోగమొం
దినయల ముద్దియం దగిలి నెయ్యముఁ జూపఁగ నెట్టు లోర్చితో.30

గీ. అనుచుఁ జెల్వపుఁ జెంగల్వయరిదికిరుసు, దురుసుమాష్టీని బదరి యియ్యరుసుపట్టి

గురుసుమద్యోతనుని దూఱి గరుసు మీఱి, పేరెములు వారెడు మరుత్కుమారు ననియె.31

సీ. మెడలపై నిడలేక పడగలు చిదిసిపో మేదిని భారమై మెఱయుఁ గాత

గట్టిగా నూపిరికుట్టు పట్టంగ నాళీకనాభుఁడు పవ్వళించుఁ గాత
నాభీలపాతాల మైనను జొరఁబాఱి పిల్చి తార్క్ష్యుండు నొప్పించుఁ గాత
గృతియైన భాష్యఫక్కికయందు నొకమాట తగుచుట్టుఁ బ్రోవయై తాఁకుఁ గాత
ప్రబలపన్నగకులరాజ్యపట్టభద్రుఁ, డెన్న పసవీడ నొకప్రక్క నిన్ను మెసవి
లేఁడు పొమ్మని యనకున్నవాఁడు గాన, దళితపాంథవిహార శీతలసమీర.32

క. కడుఁ దాత్పర్యము నాపై, నిడుతామరపాస్రుతోడి యీనెయ్యంబు

న్విడు కారింపకు మదిఁ, జెందెడుతాలిమి నొక్కవిడుత తెమ్మెరబుడుతా.33

గీ. ఆనుచు నిక్కాంత వలవంతఁ బెంచి వేఁడి, దొరలఁజెందిన కమ్మదెమ్మెరల దూఱి

ముమ్మరమగు తాపమ్ము గ్రమ్మిఁ దమ్మి, పానుపున సొమ్మసిల్లుచు మేను సేర్ప.34

ఉ. ఏను మనంబులోనఁ జెలు లింద ఱలంతలఁ జెందిరంచు

నప్పానుపునందు నిక్కలికిప్రక్కనె యించుక పవ్వలించు న
చ్చోనిఁక నేమి తెల్పుదు యశోధన కోలలఁ గొట్టి లేపిన
న్మే నెఱుఁగంగనీ కొదవె నిద్దుర యిద్దురవస్థకై వెసన్.35

ఉ, అంతట మేలు కాంచి నయనాబ్జము లొయ్యన విచ్చిచూడ ని

క్కాంతయు నేను నిక్కుధరగహ్వరపట్టనరాజగేహసౌ
ధాంతమునందు నుంటిమి మహాత్మక యిప్పు డిదేమొ యంచు మే
మెంతయుఁ జింత వంత గుఱియింప భయంపడి యున్న గ్రక్కునన్.36

క. పాతాళకేతుఁ డఁట యొక, దైతేయుఁడు చేరవచ్చి దంభోళిహటా

త్పాతాద్రిభీతహరిణీ, రీతిం దగు మమ్ముఁ జూచి కృతహాసముతోన్.37

క. లోకములన్నియు నన్నుం, గైకొని పూజించు మీరుగా మీ రానా

ళీకాంబకుఁ బూజించితి, రాకామినులార నాకరం బెఱుఁగరొకో.38

గీ. ఇప్పు డేమయ్యె నింక నాయించువింటి, వాఁ డనుఁగునేఁడు గూర్చి మీవాంఛ దీర్చ

నేర్చునో నేరడో చూచి నెలఁతలార, యింపుపసలార నన్నుఁ బూజింపుఁ డనుచు.39

క. ఒక హెగ్గడి దానననా, యకుతో నేమేమొ తెలిపి యాతఁడు వికట

భ్రుకుటీపటుతరనిటల, ప్రకటీకృతరోషుఁడై సభాస్థలి కరుగన్.40

క. ఆవచ్చిన చెలి నాతో, నేవగల ఋతధ్వజేంద్రుఁ డితనిం జంపం

గా విడిసినాఁడు బ్రదికితి, రీవేళ కుఁ దాళుఁ డనుచు నేగె న్వేగన్.41

గీ. నాఁటనుండియు వలవంత నాట నీవ, ధూటి పడుపాటు కనుచు దోధూయమాన

మానసాంభోజనై యున్నదాననయ్య, యనఘ నాపేరు కుండల యండ్రు సురలు.42

వ. మహాత్మా! యిది మదీయవృత్తాంతంబు దురంతసంతాపచింతాపరాయత్తం బగు

చిత్తంబు వివరింప భవత్కథాకథనంబున కడ్డంబుగా నింతయు విన్నవించితి నీయప
రాధంబునకుం బ్రార్థనారంనారంజకంబగు నంజలి రచియించెద నాఁడు ఋతధ్వజవసుంధ
రాపురందరు దారునం జూచుటంజేసి నిర్ధారణాసామర్ఖంబులేమిం జేసి డోలా
యమానమానసనై యున్నదానఁగాని నీయందలి సౌందర్యగాంభీర్యాదిగుణంబులు
సోయంప్రతృభిజ్ఞావిధాయకంబులై యున్నయవి, అయినను మద్విలోచనచకోరికా
చంద్రబింబంబగు నీమూర్తియుం బోలె యుష్మద్వృత్తాంతంబుఁ గూడ మన్మనః
కమలంబునకు మార్తాండమండలంబుగా నానతీయ నవధరింపుము.43

చ. అన విని యాజనాననగుణావని యావనితాశిరమణిం

గనుఁగొని యింత నేర్పరివి గాకయ యుండిన నీవధూటి కిం
పెనయ వయస్య వొదువె భళీ యిటు వచ్చెను రాక్షసాధముం
దునుము ఋతధ్వజుం డనవుడున్ భవదూహకుఁ దప్పు గల్గునే.44

క. నాకోరికతో నీక, న్యాకాంక్షిత మెల్ల సఫల మయ్యెం దివిష

ద్భీకరుఁ డీదనుజుఁడు ఘో, రాకారతఁ గూలె మచ్ఛరావళిచేతన్.45

గీ. అదియు నెఱుఁగుదు వింక నేణాంకనదన, మంజువాణియు నేను నీమాటలోని

వార మైతిమి మాకు నేదారి నడువ, వలయునో యట్లు నడిపింపు పలుకు లేల.46

చ. అనవుడు నమ్మదాలస ముఖాబ్జమునం జిఱునవ్వువెన్నెలల్

నునుఁజనుఁదోయిపైఁ బులకలున్ నిటలంబున ఘర్మబిందువుల్
మనమున సిగ్గుఁ గన్నుఁగొనలం బ్రవహించు ముదశ్రుపూరముల్
కనఁబడ నున్నఁ జూచి చెలికత్తియ యత్తఱి రాజచంద్రుతోన్.47

చ. ఇపుడు గదా మదాళి పయి నెత్తిన వింటిపయిం జెలంగు నం

దపువిరిదమ్మిఱేకు దెస నా దొరకేల్ రతి నిబ్బరంపు సి
బ్బపు నలిగబ్బిగుబ్బకవపై జెరలాడఁ దొడంగె నేఁడు మా
తపము ఫలించె నింక వసుధావర తామస మేటి కియ్యెడన్.48

సీ. వేఁడిసెగల్గల్గువేల్పు సాకిరియైన యప్పుడు గాని కేలంటరాదు

ప్రామిన్కురొదలు గన్పడఁ గంటెకట్టునప్పుడుగాని గళయుక్తిఁ బొందరాచు
పొలుపుగా వ్రేలిమి బొట్టమరించునప్పుడుగాని ముంగురుల్ పొదువరాదు
మొక మోరసేయ సన్నికలు మెట్టించునప్పుడుగాని పాదాప్ఁ బొరయరాదు
నృపదంపతులకు విడెమిచ్చుమోద, మెనయునప్పుడుగాని పాన్పెక్కరాదు
నీ వెఱుంగవె శాస్తోక్తి నిర్ణయప్ర, చారము లుదారకుంభినీజంభవైరి.49

ఉ. ఏను వచింప నీవు విను టిప్పుడకా యిఁకమీఁద నీసరో

జానన యొక్కవేళఁ బొలయల్కఁ బరాకున నున్నయప్పుడే
మో ననుఁ బిల్తు పెద్దతనముం గనినప్పటికైన నీదుపా
డానతి నాకుఁ బోఁటియయి యప్పుడె యప్పని నేర్పకుండునే.50

సీ. రాచిల్క రాయబారమున దారికి రాక చడ్డింపు కోరమీసములు దువ్వి

యదిగా దనుచు నింతటంతటఁ జేరరాఁ గేడింప బిట్టుగాఁ గేక వైచి
నీ బంట నన్ను మన్నించవే యన వివి వినమి సేయుచు దుంటవిల్లు వంచి
దుడుకుగాఁ జెఱగంట ముడిగొన్న బొమ్మ లానించి చూచిన తెగనిండఁ దీసి
యతనుఁ డీయింతి కలుక చల్లార్ప నీవు, పాదముల వ్రాల దీనబాష్పములు చూచి
యస్త్రసన్న్యాస మొనరించునట్లు గాఁగ, నింపు సొంపొరఁగా విహరింపుఁ డింక.51

గీ. అనిన ముదమంది యమ్మందరాద్రి ధీరుఁ, డావధూటులఁ దోడ్కొని యాత్మపురికి

నరుగుటయ కాని లేదు కార్యం బటంచు, నగవు దైవాఱఁ గుండలమొగము చూచి.52

క. మంచిది మనపురిఁ జేరుద, మంచు న్లేచుటయు నవ్వయస్యయుఁ గమ్మల్

మించుగ నసియాడఁగ బదుఁ, డంచుం జేఁ జూపి మందహాసముతోడన్.53

చ. చెలువుని వెంటఁబోఁ దరువుసేయు మనోబ్జము మాట చెల్లనీ

కలమెడు లజ్జకన్న ఘనమైన కటీతటి వ్రేఁగున న్నడ
ల్బెళకఁగ నంచబిత్తరివలె న్మురిపంబున నమ్మదాలసా
జలరుహగంధి రా నృపతిచంద్రుని వెంబడి మేడ డిగ్గినన్.54

మ. అతఁ డచ్చోఁ దురగంబు నెక్కి హృదయాబ్జాపూర్ణమోదార్ణవాం

చితుఁడై వారల వెన్క నుంచుకొని యక్షీణైక్యమాణిక్యదీ
ధితిజాతానృతదిగ్వితాన మగు దైతేయాధినాథాయతా
యతనం బల్లన నిర్గమించి పురబాహ్యక్షోణి కేతెంచుచున్.55

ఉ. అచ్చట నున్నసైన్యము బలాధిపతు ల్వెనువెంటరా సము

ద్యచ్చటులారభటిం గువలయాశ్వము ధేయని చౌకు చేసినన్
బ్రోచ్చలితావనీరజము లొక్కమొగంబుగఁ బిక్కటిల్లి వై
యచ్చరవీథిఁ గప్ప నది యాత్మపురాంగణసీమఁ జేరినన్.56

గీ. అచటి కెదురుగవచ్చు ధరాధిపతులు, కామినీయుక్తుఁ డై చేరు క్రమ మెఱింగి

దవ్వులనె నిల్వ నిజమణిధామ మొంది, రమణులును దాను నంతఃపురమున కరిగె.57

ఉ. అంతట నాసురాంతకుని యర్మిలితమ్ముఁడు తాళకేతుఁ డ

త్యంతమహాగుహాముఖకహాకహనాదమహాట్టహాసవి
భ్రాంతసమీకశోకపరిపాకభయాకరణైకలోకదు
ర్దాంతవిరక్తనోదరగదాశ్రితకేశవుఁ డొక్కయిమ్మునన్.58

చ. కొలువున నుండి యింద్రుకడకు న్మన మంపినవాఁడు వచ్చెనా

పిలువు మటన్న వేత్రధరబృందము తోకొనితెచ్చి ముంగల
న్నిలిపిన వాఁడు భీతియు వినీతియుఁ దోఁప దురాపకోపచా
పలమున హుంకరించు నిజభర్తకుఁ గేలు మొగిడ్చి యిట్లునున్.59

క. దేవరప్రతాపగరిమకు, నే వెఱతుం గాని నిర్జరేంద్రుఁడు వెఱవం

డావంతయైన నిపు డే, మోవింతలు పుట్టె దనుజమూర్ధన్యమణీ.60

సీ. దొర కాప్తులై కార్యసరణిఁ దెల్పెడి కవీశ్వరులకు లంచపంచంబు లొసఁగి

సమ్ముఖమ్ముననుండి చను దెంచు నలవ్రాయసమువారి కాశపాశలు ఘటించి
బోనవెచ్చము గొంచుఁబోవు శచీదేవిదారులకును బరిధాన మిచ్చి
పిలువ నేతెంచు వేగులవారివెంట నే యరుగు నియోగుల ననుసరించి
కినిసి వాకిటివా రడ్డగించుకతన, నేను వచ్చినమాట దేవేంద్రుతోడఁ
డెలుపు మని యెంత వేఁడినఁ దెలుపరైరి, విని వినమి చేసెనో కాని వేల్పుఱేడు.61

క. మనగురు వఁట నే వచ్చుట, వినెనేమో గ్రుడ్డికంటి వేలుపుదొరతో

వినిపించి యతనియనుమతి, ననుఁ గొని చని సమ్ముఖమ్మున న్నిలుపుటయున్.62

సీ. ననుఁ గని పాట నిల్పిన తుంబురుని జూచి యాతాన మీసారి యనుమటంచుఁ

గమలజోద్భవసుమాళము చెందినాఁడవు వింతవార్త లు గలవే యటంచు
నీతని నంపరాదే యంచు సన్నగాఁ దెల్ప వారలను గద్దించుకొనుచుఁ
గ్రేఁగంటఁ బల్కనుంకించు నన్గని పట్టుగద్దిగ లెస్సాయెగా యటంచు
సడ్డ సేయక నిరుపమైశ్వర్యగర్వ, పటిమ పడఁతులు జలకంబు పట్టియున్న
దనఁగఁ గట్టిక వారిండ్లకనిపికొండ, యంచఱు నటంచు మ్రోయ నయ్యవసరమున.63

గీ. మనగురుఁడు చేరి ననుఁ జూపి మనవి గాఁగ

నితని వీడ్కొల్పుఁ డన్న దేవేంద్రుఁ డొద్ద
నున్న గీష్పతిఁ గని కనుసన్న సేయ
నతఁడు నాదిక్కుఁ జూచి యనాదరమున.64

క. ఏమోయి తాళకేతుం, డేమని పంపించె నిర్జరేంద్రునికడ కు

ద్దామక్షేమాహతసాం, గ్రామికుఁ డాతనికి శుభమో కద యని పలుకన్.65

గీ. చుఱచుఱను జూచి దొర నిన్నుఁ జూచువాఁడు, నంతలోననె నీవు న న్నడుగువాఁడ

వాబలా పొట్టక్రొవ్వుగా కంచు నేను, గోత్రపరిపంథితోఁ గొంకుకొసరు లేక.66

క. తారారంభలు చక్కని, వా రనఁగా మెచ్చి దనుజువల్లభుఁడు నినుం

బేరుకొని వేఁడుమన్నాఁ, డారమణుల నొప్పగింపు మటుగాకున్నన్.67

సీ. అలవాటు చేసికొ మ్మఖిలమరుత్పాలకులఁ గూడికొని నిల్వుకొల్వునకును

నభ్యసింపఁగఁ జేయు మలజయంతునకు వేళ యెఱింగి వెండికాలాచి దాల్ప
దారికిఁ దెచ్చుకొ మ్మారూఢిఁ బౌలోమి సైరంధ్రికాసదాచారమునకు
నలవడఁగా నేర్పు మచ్చరలకు మాఱువలుకని బానిసపాటులకును
దలఁప కమృతంబు వైజయంతంబు మఱవు, విడువు వజ్రాయుధముతో డీగొడవ యింక
నిచట నుండక వెడలిర మ్మిపుడు దేవ, పట్టనం బేను దోరణకట్టినాఁడ.68

క. అని నీల్గు నన్నుఁ దప్పకఁ, గనుఁగొనలం గొప్పనిప్పుకలు కుప్పలుగాఁ

గనుఁగొను ప్రథమకకుత్పతిఁ, గని దేవగురుండు రోషకలుషేక్షణుఁడై.69

క. ఓరీ మీదొర గోరిన, తారారంభల విటావతంసులచేతన్

మీరజనీచరుఁ డగ్రజుఁ, జేరం జనుఁగాక యని వచించుచు నలుకన్.70

గీ. వీని వెడలంగఁ ద్రోయుఁ డివ్వీటిగోట, దాఁటునందాఁక ననుమాట నోటనుండ

నీటు వోమీటి గరువంబు మాటి యిటకుఁ, బెద్దపర్వున వచ్చితి బెదరువుట్టి.71

క. ధారాధరవాహను గ, ర్వారూఢియు గురునిశాప మటులుండెఁ గదా

మీరజనీచరుఁ డగ్రజుఁ, జేరం జనుగాక యనుటఁ జెందితి వగలన్.72

క. పాతాళకేతుఁ డాదృఢ, దైతేయుఁడు వీరుఁ డమ్మదాలసకొఱకై

యేతెఱఁగున నేమయ్యెనొ, కో తెలియదటంచుఁ దెలిసికొను నట్టియెడన్.73

గీ. ఆరీతి ఘటిల్లఁ గొందఱు చారవరులు, వచ్చినతి సల్పి కువలయాశ్వక్షితీంద్రు

చేతనైనట్టి పాతాళకేతు పాటు, తోఁపఁదెల్పినఁ దాళకేతుండు కనలి.74

చ. ఒదవినశోక మాచికొని యుగ్రతరాగ్రహకేళికావశుం

వదుఁడయి యింద్రు గెల్చుటకు వచ్చిన నే మటుమీఁదఁగాదె నేఁ
డదయత నన్నరేంద్రుఁడు మదాలసకై కద భాసమానదో
ర్మదుని మదగ్రజుం బిలుకుమార్చెను దాని హరింతు నిత్తఱిన్.75

గీ. కపటమునఁ దెత్తు నాహంసగమన నది యె, ఱింగి మార్కొన్న నాతని భంగపఱతుఁ

బగయడంపకయున్న నీపగిది నెగులు, సైఁచవచ్చునె యిదియ నిశ్చయ మటంచు.76

సీ. ఎదురిండ్లు ఫలుసాల లెనసి వర్ణింపఁజాలిన మేలిపర్ణశాలికలు కొన్ని

యాగమాతంబుల యందలి యర్థము బ్రకటించు కీరశారికలు కొన్ని
హవిరన్నసంభ్రమద్దివిజకోలాహలాంకములైన యాగవాటములు కొన్ని
దున్ని విత్తక పుట్టి యెన్నులవ్రేఁగున వ్రాలు నివ్వరిప్రాలచేలు కొన్ని
తోఁపు లొకకొన్ని తెలినీటిదొనలు కొన్ని, కొలఁకు లొకకొన్ని పెంపుడుపులులు కొన్ని
మొదవు లొకకొన్ని చేమంతిపొదలు కొన్ని, బెరయఁగఁ దపోవనంబుఁ గల్పించి యపుడు.77

గీ. తోడిదైత్యులు శిష్యులై కూడి నడువఁ, బేరు ముండవ్యుఁ డనుచుఁ గల్పించుకొనుచు

కొన్నిమాయలు మదిలోన నెన్నికొనుచుఁ, గువలయాశ్వుని పట్టనక్షోణిఁ జేరె.78

ఉ. అంతట పౌరసారసదళాక్షు లుదారవిహారసౌధయూ

ధాంతము లెక్కి కంటి రటవమ్మ మునీశ్వరుఁ డొక్కఁ డిమ్మహీ
కాంతునిఁ జేరి రాక్షసనికాయముచేత మదీయయజ్ఞ మా
ద్యంతముఁ గోలుపోయితి నయా యని తోకొనిపోవుచందముల్.79

ఉ. నిన్న గదమ్మ గాలవమునిప్రభు వెంబడి నేగి రక్కసు

న్వన్నియమార్చి రాచిలుకవంటి మదాలసఁ దెచ్చి యుద్వహా
భ్యున్నతిఁ గోరి నేఁటికి ముహూర్త మటంచును నిశ్చయించె నీ
యెన్నిక చిన్నవోవఁగ ఋషీశ్వరుఁ డెక్కడ వచ్చె నక్కటా.80

పీ. తలవాంచి బెళుకుఁజూపులు క్రేళ్లు త్రుళ్లంగఁ దెరమొఱంగుననిల్చు నొరపుఁ జూచి

చెలికత్తె చేయెచ్చవలెనన్న సిగ్గుతోఁ దలఁబ్రాలు వోయు బిత్తరముఁ జూచి
వ్రేలిమిఁ జెమరించు కీలనంటెడు లాజ లందిచ్చునట్టి సోయగముఁ జూచి
కులదేవతకు మ్రొక్కుకొనువేళఁ దనపేరు వలుకఁగొంకెడు ముద్దుబాగుఁ జూచి
ముచ్చటలు దీర్చు పూనిక వచ్చియితనిఁ, దోడుకొనిపోవుచున్నాఁడు దుడుకుఁదపసి
యతని మాటకు మారాచఁ డయ్యొ యీతఁ, డిందుముఖి రాజులకు సౌఖ్య మేడదమ్మ.81

క. దొర నయ్యెద నని కోరుదు, రరయగ జను లెవ్వరైన నాపెనుబెడద

ల్పరికింపరు దొరతనపు, న్సరవు ల్మఱి క త్తిమీఁది సాములు సుమ్మీ.82

సీ. మంత్రుల మర్మకర్మము లెఱింగెడు దారి కోటలు కాపాడుకొనెడు నేర్పు

తఱికాపు చెడకుండ సరిగోరుకొనురీతి యీతిబాధలు చెందనీనిసొంపు
పరులయాలోచన ల్పరికించు గరిమంబు నర్థార్జనముమీఁది యాదరంబు
వేఁటతోఁటలమీఁద విలసిల్లు నాసక్తి యొడ్డోలగం బుండు నొప్పిదంబు
తగిలిపిరువీఁకు సేయ నుద్దండవృత్తిఁ, జెలఁగుటయె కాని మనసు వచ్చిన మిటారిఁ
గూడి తమి మీఱ సయ్యాట లాడికొనుచు, నడువఁగూడునె మేదినీనాయకులకు.83

క. అని యాడికొనఁగ మాయా, మునివెంబడిఁ గువలయాశ్వ మున్నూకి రయం

బునఁ జని యారాకొమరుఁడు, గనియెం దత్పర్ణశాలికాప్రాంగణమున్.84

గీ. అంత నమ్మాయతపసి యయ్యధిపవర్యుఁ, గమ్మదమ్ములఁ దుమ్మెదదిమ్ముఁ దోలి

ముమ్మరపుఁబుప్పొడుల్ నెమ్మి గ్రుమ్మరించు, తెమ్మెరలు గ్రమ్ము కమలాకరమ్ముఁ జేర్చి.84

గీ. అధిప నీ విందు వచ్చిన యపుడ తొలఁగె, రక్కసులమాయ పద్మాకరంబునందు

వరుణజప మొనరించి యే వచ్చుదనుక , నిచట నుండంగవలయు నీ వేమి యనక.85

గీ. అయ్య నిను నమ్మఁగూడ దే నరుగుదేరఁ, దామసంబైన జరగెద వేమొ నీవు

కాకయుండిన నిమ్ము నీకంఠహార, మిప్సు డన' చిన్నినవ్వుతో నిచ్చుటయును.86

క. జలదేవతకుం బ్రాంజలి, సలుపుచు నక్కొలన మునిఁగి జనపతి నగర

స్థలమున నంతిపురంబున, నలరుం బొదచెంత డిగ్గియం దేలుటయున్.87

గీ. కుండలియుఁ దాను నవ్వుచుఁ గూడియున్న, యమ్మదాలసఁ గని మంత్రియంద మొంది

యమ్మ మనరాజు మౌని యాగమ్ము గాచె, రక్కసులఁ దోలి భుజబలప్రాభవమున.88

ఉ. అమ్ముని యంత సంతసము నంది యనిందితకార్యధుర్యరూ

ఢమ్ముగ నీవివాహ మచటం జరగింపఁగఁ గోర్కె వేడ్క యీ
యిమ్మునఁ బట్టనంబు రచియించెద నాదు తపోబలంబునం
గొమ్మను బిల్వ బంపు మిటకు న్మఱుమాటలు పల్క కేమియున్.89

గీ. అనిన మాఱాడ వెఱచి యమ్మనుజనాథుఁ, డానవాలుగ నీకంఠహార మిచ్చి

నిన్ను వేవేగఁ దోడి తెమ్మన్న వచ్చి, నాఁడ రావమ్మ కుండలతోడఁ గూడి.90

మ. అని యామౌక్తికహార మిచ్చుటయు సాంద్రానందముం బొంది మా

నిని మేకోలునఁ గుండలావదనము న్వీక్షింప నయ్యంబుజా
నన కానిమ్మని పల్కఁ గృత్రిమవిమానం బెక్కఁగాఁ జేసి య
ద్దనుజాధీశుఁడు తా నదృశ్యుఁడయి చెంతంబోయె సంతుష్టుఁ డై.91

వ. అత్తఱిం దటిత్తరుణభానువిరాజమానం బగు నమ్మాయావిమానంబు జలయంత్రంబు ను

పమఁబ్రవేశంబునకుం గమకించు నందకంబురకంబునఁ బొడవుగా నెగిరి యొక్క
పరిరథంబువిధంబున మందగతిం జనుచు నొక్కసారి లకోరిదారి రివ్వున నిగుడు
చు నొక్కతేప బొంగరంబు రంగున బిఱబిఱం దిరుగుచు నొక్కమాటు గాలిప
టంబునీటున నసియాడుచు నొక్కయెడఁ జుక్క తెగిపడ్డవిధంబున డిగ్గుచు నొ
క్కచోటం బుట్టచెండు వడువున నుప్పరంబునకుం బోవుచు నొక్కవంక జీనుది.
గవైచిన కప్పలి చొప్పునఁ గదలక నిల్చుచు నొక్కపరి బైరిడేగ యొయారంబునం ది
ర్యక్ప్రచారంబుఁ జూపుచుఁ బోయి మేరుధారుణీధరంబున నిబిడాంధకారబంధు
రం బగునొక్కబిలంబున దమాలతాలతక్కోలరసాలసాలముఖసాలవిశాలం బగు
వనంబునం బునఃపునర్వర్ధమానగిరిఝరీవితానంబులకు నుబ్బు గన్పించు పన్నీటిపిల్ల
కాలువలకుం బ్రోదిసేయు జాదివిరిదేనియవాకవెంబడిం బాదుకొసన పోఁకమ్రాకు
ల కట్టకడపట నెట్టుకొనిన యిందుకాంతవేదికాబృందంబులతోడి గురివిందపందిళ్ళ
నొరసికొనియున్న తిన్నని మగఱాతివన్నియలఁ జెన్నగు చవికల నిముడుకొన్న క
న్నెసురపొన్నగున్నలఁ బెనఁగొన్న నతిబియసజాతికి నాధారంబగు గొప్పకెంపు లు
బ్బు చప్పరంబులం గప్పికొన గుజ్జుమావులక్రేవలఁ దమ్మితావులకుం దావులైన తెలి
నీటికేళాకూళి నంటికొనిన యనంటులవలనం దొరఁగు కప్పురంపురవలుం బాఱు
కొలువుకూటంబు డిగ్గిచను మెట్లడగ్గఱ నగ్గలంబగు నీలంబు నిగ్గులు గగ్గోలుపడు కో
నపాదిరిం గౌఁగిలించిన పొగడగుంపుల నట్టనడుమఁ బట్టుగఁ పొదరిండ్లఁ జుట్టఁబ
డియున్న బిత్తరం బగు క్రొత్తముత్తియంపుఁబడుకటింట నపరంజిగొలుసులం జెలం
గు తూగుటుయ్యెలచేరునకుం జని యద్దనుజవీరుండు నిజాకారంబుతో నయ్యిద్ద
రం దద్గృహంబున నునిచి యతిఘోరాకారులగు దైతేయభామలం గాపువెట్టి కృత
కృత్యునింగాఁ దలంచుకొని యాక్షణంబున.92

చ. మునుపటిసారి కాంక్షి విధముం భజియించుచు నంబుజాకరె

బునఁ బడి తేలి యోనృపతిపుంగవ నీభుజసారగౌరవం
బున జప మెల్లఁ దీఱెఁ బొలివొవక నీవిఁకఁ బట్టనస్థలం
బునకయి పొమ్ము రాజునకుఁ బోలునె యాశ్రమవాసఖిన్ననల్.93

చ. అని యనుపన్ హసాదని నృసాగ్రణి యమ్మునిలోకచంద్రు వీ

డ్కొని తన తేజి నెక్కి గిరికోటులుఁ గాననవాటులు న్మహా
జనపదము ల్నదంబులును జయ్యన దాఁటి పురంబుఁ జేరి కాం
చనసముదారమై తగుహజారమునం దమవారు చేరఁగన్.94

క. తురగంబు డిగ్గి యచ్చటి, పరిజనుల న్వీడుకొల్పి పార్థివచంద్రుం

డరిఁగి గృహాంతరమునఁ ద, త్తరుణీమణి లేమి నద్భుతనిమగ్నుండై.95

ఉ. అక్కట యెందు వోయెనొ యొయారపుసంచులముద్దుగుమ్మ యే

చక్కిని దాఁ గెనో కలికి చక్కవలెక్కువగుబ్బలాడి యే
దిక్కున నున్నదో సొలపు దేఱెడి చూపుల హొంతకారి యే
యిక్కన నిల్చెనో యొరపు నీనెడు చిల్కలకొల్కి దైవమా.96

ఉ. ఆనడ లామెఱుంగుఁదొడ లాకడగంటన చూచుసోయగం

బానెరు లామిటారికరు లామురిపంబునఁ బల్కుపాటనం
బానొస లామొగంబుపస లాతెలిపయ్యెద చక్కఁజేర్చుసొం
పేనలినాక్షికైనఁ గలదే కలరే యిటువంటి కామినుల్.97

సీ. గిలుకుబంగరుమట్టియలు జాఱఁగాఁ జక్కనలవరించెద నంచు నిలిచి నిలిచి

బయట నున్నది చిల్క పంజరమున నుంచి మఱివచ్చెద నటంచు మరలి మరలి
యతివ యల్లపుడేమి యంటివే యే చిరాకయియుంటిఁ దెల్పమం చడిగి యడిగి
చెమటచేఁ దిలకంబు చెదరెనో యని వింతసొలపుతో నద్దంబు చూచి చూచి
ప్రొద్దు గడపుట కని తోడి పూవుఁబోఁడు, లదరవైవంగఁ దనమందయానగరిమ
యినుమడింప మదీయమోహనగృహంబుఁ, జేరు టెన్నఁడొ యానీలచికురనికర.98

శా. కైజా చేసిన బొండుమల్లె విరిబల్ఖండాజగాజోదు తే

జీజాడం దలవాంచి బోఁటిచెఱఁగుం జేఁ గట్టిగాఁ జుట్టి ను
న్గాజుం గంబముచాఁటున న్నిలిచి క్రేఁగంట న్ననుం జూచు నం
భోజాతాక్షిని సెజ్జకుం దిగుచు నేర్పు ల్గల్గు నేమీఁదటన్.99

క. ఎక్కడి యాలోచన యిది, యక్కట యక్కలికి యున్నయపపటికిఁ గదా

యిక్కోరికియని ననవి, ల్మొక్కలిదొరవిరిలకోరిమొనకుం దలఁకున్.100

సీ. పొడఁగననచ్చు నాప్తులవేళఁ గాదంచు నవసరంబులవార లడ్డగింపఁ

బనిగల్గియుండినఁ దనకు మంత్రులకు లేఁజిగురుఁబోఁడులచేతఁ జీట్లు నడున
నిదియేమొ కడువింత గదయంచు నవరోధబిసరుహాక్షులు గుసగుసలు వోవఁ
గొలువుకూటమునందుఁ జెలఁగెడు సింగంపుగద్దియ గవిసెన గైకొనంగ

బొక్కసంబులు పెనుబీగములు భజింప, నుడిగములవారలకు నాటవిడుపు గాఁగ

నోలమును మాని మేదినీయువతిజాని, యింత భావించు నంతఃపురాంతరమున.101

క. ఈ కరణి నన్నృపాగ్రణి, యేకరణీయములు మాని హిమకరవిలస

ద్రాకలకు న్వలిదెమ్మెర, రాకలకుం జాలిగొని విరాళిఁ బడంగన్.102

ఉ. అతని నేస్తగాండ్రు భుజగాత్మజు లవ్వగలెల్లఁ గాంచి య

య్యో తమవంటివార లిటు లుండియు నీదొర సీ దురంతచిం
తాతనుతానితాంతహృదయవ్యధఁ గూఱఁగ నూరకున్న సం
గాతులమౌదుమే యిపుడు గాక మఱెప్పటి కీవయస్యతల్.103

క. అని యయ్మిద్దఱఁ జని తమ, జనకుం డగు నశ్వతరుని సమ్ముఖమున నీ

జనపాలు విరహవేదన, వినిపించి తదార్తి మాన్పవే యని వేఁడన్.104

చ. తనయుల స్నేహబాంధవవిధానము లెంచి నరేంద్రుఁ డంటిమా

ఘనుఁ డటువంటివాని కుపకార మొనర్చినఁ గీర్తి చెందదే
యని రజతాద్రికిం జని నగాత్మజతోఁ జదరంగ మాడు రు
ధ్రుని గని మ్రొక్కి కుండలివరుం డటు నిల్చిన నాదరంబున్.105

గీ. అంబికయును నితం డెవ్వఁ డనుచు నడిగి, యధిపుఁ డశ్వతరుండు గాడా యటన్న

నీతఁడా యశ్వతరుఁడు సంగీతవిద్య, దొడ్డవాఁడఁట యనిన రుద్రుండు చెలఁగి.106

క. వెనుకం బురుహూతు దెసం, దనతంబురవలన గెలిచె నానాగతుల

న్మనతుంబురు నీ వెన్నడు, విన వంబురుహాక్షి నేఁడు విను మని పలుకన్.107

గీ. మంచిది సగటుపై నిదె మంత్రికావ, లున్న దీచదరంగ మిట్లుండనిమ్ము

వెనుక నాడుదమని సతి వనజనయన, యభిముఖంబుగఁ గూర్చున్న యవసరమున.108

గీ. ఔర నారాక ఫలియించె నంచు నెంచి, యచటఁ కూర్చుండి యయ్యురగాధినేత

గవిసెన సడల్చి తంబుర కలికిపైఁడి, బిరడలు బిగించి శ్రుతులెల్ల సరిగఁ గూర్చి.109

క. రాకాశశాంకవదన ప, రాకా యిటు నీదు మ్రోల రహి గనిపింపన్

నాకుఁ దరమౌనె యైనం, గాకుండిన నీకు ముద్దు గద యని యంతన్.110

సీ. శ్రుతి తోడఁగూడి మెచ్చులు రా నిజంబుగ సంచునందగ నాలపించు సొంపు

గడియయైనను గుక్కవిడునక హొయలుగా నవగడంబుగఁ దానమనెడు నేర్పు
పరరాగముల వింత సొరనీక వ్యాప్తిమై మించు గారాగంబుఁ బెంచు వింత
తాళంబు తప్పక తనువు గదల్పక బాగుమీర పదంబు బాడుచారి
ఎడనెడఁ బరాకు వినుడను హెచ్చరింపు, మీరు మెచ్చిన యీవిద్య మీ రొసంగు
నట్టిదని గర్వపరిహార మలర నతఁడు, గాణ వవుదనశుద్ధమార్గము నటించి.111

గీ. గోఁటి వాద్యంబు కిన్నరమీటు బడ్డి, వాద్యము రబాబు వగలు సర్వంబు మెరయ

దురుసుగతి జూపఁ బార్వతీతరుణి మెచ్చి, జారు సరిగంచుపయ్యంటఁ జక్కఁజేర్చి.112

ఉ. ఎక్కడి నారదుండు మఱి యెక్కడి తుంబురుఁ డోగిరీశ యే

దిక్కున నైన నీవిధము తేటపడం గనుఁగొంట లెద యే
పెక్కున తప్పునంచుఁ గనిపెట్టుక యుండితి మెందుఁ గాన మ
మ్మక్క శబాసు మేలు హవుదంచు ఫణీశ్వరుఁ జూచి యింపునన్.113

క. వర మడుగు మనిన గంగా, సరసిజముఃఖ యీసుతోడి జంకెనచూపుల్

బొలసిన మొగంబుఁ ద్రిప్పెఁ, గిరిజకు డెందమున వింత కినుక జనింపన్.114

ఉ. అమ్మక చెల్ల యెన్ని వగ లద్దిరనానాయకుఁ డొద్ద నుండఁగా

నెమ్మెలు గాక యేను వర మిచ్చెద నంటి విదేటిమాట దో
సమ్ము సుమీ వధూటులకు జవ్వని నాథు ననుజ్ఞ లేక యే
కొమ్మని యీఁగఁజెల్లునె యకుంఠితచాతురి గల్గియుండినన్115

గీ. అని పలుక నెంత లే దామృగాక్షిమాట, వినకు మడుగుము వర మిత్తు విభుఁడు తనకు

నంతచను విచ్చినాడన నవ్వధూటిఁ, జుఱుకు చుఱుకునఁ బార్వతిఁ జూచె నపుడు.116

చ. ఉరగవిభుండు లేచి కుధరోద్భవఁ గన్గొని యమ్మ మేదినీ

వరుఁడు ఋతధ్వజుండు భుజవైభవశాలి మదాలసాసతిం
బరిణయమౌదునంచు నిజమందిరమం దిరవొందఁ జేసి త
త్తరుణి వయస్యఁ గుండల వితావితఁ గానక వంతఁ గుందెడున్.117

గీ. వారి నిద్దరి రప్పింపవలయు ననిన, గిరిజ కానిమ్మనంగఁ దత్సరసిజాక్షి

కాని కుంతల రాదంచు గంగ పలుక, నభవు డిద్దరియందు మధ్యస్థుఁ డగుచు.118

గీ. మంచి దహిరాజ రెండునా ళ్ళించుమించు, గాగఁ గుండల చనుదెంచు గాక యిప్పు

డమ్మదాలస వచ్చు నీ వఱుగుమనిన, నదియ పదివేలుగా నెంచి యాతఁ డఱిఁగె.119

ఉ. అంతటిలోననే యలమదాలస నిద్దురవోవ నయ్యుమా

కాంతుఁడు మాయచే నురగ కర్తృగృహంబున నిల్పనాతఁ డ
త్యంతము సంతసించి తనయాత్మజుగా నురరీకరించి య
య్యింతిని గొల్వ వేవురు మృగేక్షణల న్నియమించి యత్తరిన్.120

చ. తనయులఁ బిల్చి మీరు వనితామణి వచ్చిన మాటఁ దెల్పక

జ్జనపతిఁ దోడి తెండనఁ బ్రసాదమటంచును వార లేగి గ్ర
క్కున నుడిగంపుఁ జేడియలు కొందఱు గొల్వఁగ నున్న భూవరుం
గనిన నతండు నిండుకుతుకంబునఁ జేరున నుంచి యిట్లనున్.121

ఉ. ఇన్నిదినంబు లంబుజననీశుఁడు చెందొవయిండ్లలోన ర

క్కొన్న మదాళి బద్మగృహకోటికిఁ బొమ్మని తీవరించు నం
తన్ననుఁ జేరవత్తురుగదా యెకయామము బోవుదాక రా
కున్న తెఱంగు మాకు వినయోగ్యమ యేని వచింపుఁ డింపుగన్.122

క. పరబలఖండనమంత్రా, చరణమొ గృహకృత్యగతవిచారమొ కాకో

దరపుత్రులార మీ, రిట కరుదేరక యుండ నాఁగినది యెయ్యదియో.123

చ. అనుడు భుజంగరాజసుతు లట్టివి యేవియు లేవు లెండు మా

జనకుఁడు మీగుణంబు విని సంతసమంది మిముం గనుంగొనన్
మనమునఁ గోరి తాన పయనంబయిన నలదా యిలాబలా
రిని దొడిఁ దెత్తుమంచు వివరించుటకై తడవుంటి మిత్తరిన్.124

క. ఆతీరునఁ బలుకఁగరా, దో తెలియదు గాని శౌర్యధూర్వహనీసం

గాతముచే నీమన్ననఁ చేతం దొడితేరఁ బ్రతినఁ జేసితిమనుఁడున్.125

క. మాయురె తా రావలెనా, యాయెడకే నరుగుదెంతు నాయిల్లనఁగా

నీయిల్లనఁగా వేఱా, వోయఁగ రా విట్టు లైన భువి సఖ్యంబుల్.126

మ. అనుచుం గట్టికయింతి దేవర పరాకయ్యా పరాకంచు బో

రన మ్రోయన్ వలెవాటుదుప్పటిచెరం గల్లాడఁగాఁ జేఁగటా
రిని లోభాగము నూఁది నిల్పఁదగు వారి న్నిల్పుచున్ మేలికుం
దనపుంగద్దియ డిగ్గి నిల్చె నురగేంద్రక్ష్మా దిదృక్షారతిన్.127

చ. నిలచి పరావనీప రథి నీరధి మంథనమందరాద్రి య

బ్బలియుఁడొకండ పాప దొరపట్టులు తెన్నెఱిఁగించుచుండఁ గా
నలరుచుఁ నేఁగి కాంచె సికతాంచితతీరసమేతకేతకీ
తిలకగచంచరీకసుదతీకృతగీతిక గోమతీనదిన్.128

చ. కనుఁగొని చిల్వరాచకవ గ్రక్కున నన్నదిఁ గ్రుంకఁ జేసి తో

డ్కొని చనఁ నేఁగి చూచె ఫణకోటిమణీఘృణివేణికోర్ధ్వదీ
పనికరభూత్రపాచరితపౌరుషకేళివిధూతరత్నరు
గ్జనితనవస్మితాననభుజంగిక మొక్కపురంబు ముందరన్.129

చ. అచటి వియోగిభోగి జలజాక్షులు మారుని వ్రాసి కొల్చుచో

నచలితభక్తిఁ జందురిని యంద మెఱుంగమి మున్ వసుంధరా
రుచి గరుణావలోకులు నరుల్ చెలి నీ మొక మబ్జువంటిదన్
వచనము లంతలోఁ దలఁచి వ్రాయుదు రున్ముకురాగ్రవీక్షలై.130

క. ఈకరణిఁ జూచి డిగు నా, భూకాంతున కొక్కయింపుఁ బొడమించెను ద

ర్వీకర వైశాకర రు, చ్యాకర ముక్తానుషక్తహర్మ్యతలంబుల్.131

సీ. తీవయుయ్యెల లూఁగు పూవుఁబోఁడులవీఁగు కొప్పుచీఁకఁటిఁ డాఁగు కోర్కి యొకటి

నునుపుట్ట చెండాడు వనితల యరవీడు జిలుగుపయ్యెదఁగూడు చెలువ మొకటి
యలయంచ నదలించు చెలుల జంకెనమించు బెళుకుచూపులముంచు బెరికి యొకటి
పూవుబంతులు రువ్వు పొలతుల తెలినవ్వు కలికివెన్నెలక్రొవ్వు గనుట యొకటి
గాని మఱి యేమి వలదని కంకణంబు, గట్టుకొని నిల్చుపతిదృష్టి గ్రమ్మరించి
చలిది గట్టించి త్రిప్పె నిస్తుల సువస్తు, నన్యసంతోషకరమగు నాగపురము.132

చ. ఇటువలెఁ జూచుచుం జను నరేశకుశేశయబాణుచూడ్కి న

న్నిట మగుడించె భోగిపరిణీతరుణీఫణధోరణీననా
ఘటితమణీగణీభవదకంపఘృణీతవియత్పిశంగమో
త్కటఝఃరిణీసరోజమతికారి నమేరువనీరమారుతుల్.133

క. అవ్వనముఁ జేరి మవ్వవు, జవ్వనవున్ రాచకొమరుఁ జల్లనిమంచుం

దువ్వరల నివ్వటిల్లెడు, పువ్వుంబొదరింట నునుచి భుజగకుమారుల్.134

క. ఇట నుండు మేము నీవ, చ్చుట యురగేంద్రునకుఁ దెల్పి శోభనలీలా

ఘటనాపూర్వంబుగ ని, చ్చటి కేతెంచెద మటంచుఁ జనుటయు నతఁడున్.135

మ. వెలుఁగు ల్గాఁదగు మిన్నతీవియల ఠీవిన్ రాయు పన్నీటికా

ల్వల తుంపుర్లకు మారు గాఁబలెఁ జలద్వాసంతికానూనని
ర్మలమారందకణాళి జారి తనపై వ్రాలంగ రాయంచ ఱె
క్కలు ఝాడించినఁ గ్రమ్ము తెమ్మెరల రాకన్ హాయి మంచు న్నెడన్.136

చ. హడపము వీణ కిన్నెర హిమాంబువు నించిన గిండిచల్వపా

వడలుఁ గురంగనాభియు జవాదియుఁ దట్టుపునుంగు వీవనల్
ముడి విరు లద్దముల్ సురటులుం దెలిదంతపు దువ్వెనల్ ముదం
బడర ధరించి యూడిగపు టబ్బరపున్ వలిగుబ్బెతల్ దగన్.137

సీ. జిగిచాలు దగుకీలు చిగురాకునకు బ్రాఁకు కలికికోయిలలకుఁ కౌలు పనుప

నేలగోవగలమోము తెలిదమ్మిఁగల తుమ్మెదలకు నమ్మిక కమ్ము లలవరింప
నెఱికప్పుఁగను కొప్పుఁ నెరిమబ్బునకు నుబ్బు నెమలికిఁ ద్రోవబత్యముల ననుప
నునుమోవిపైఠీవి మును బింబ నికురుంబముల కేఁగు రాచిల్క కొళవులియ్య
లేనగవు డాలు కైదండ పూను చూపు, తళుకుచే మొక్కుఁగొనెడు ముత్యాలరెట్ట
పేట పాపటబొట్టు తుంపిళ్ళు గుఱియ, నచటి కేతెంచె నొకచకోరాయతాక్షి.138

సీ. కావలిఁగనునింతి కానుకిచ్చినబంతిఁ గనుసన్న నొకకన్నె గైకొనంగ

దెలిచూపు గమి తారసిలుచు నిల్చిన యంతఁ బడతులిద్దరు బరాబరులు సేయ
నగుమోము జిగితమ్మి నిగుడు ఘర్మము గ్రమ్మి నంతుకై చెలువపావడలు దుడువ
తొలఁగు బంగరురంగు జిలుగుపయ్యెదకొంగు సకియ యొక్కతె చక్క సవదరింప
కట్టికమిటారిమొకరిచెల్కత్తెగములఁ, బొడఁ గనఁగఁ జేయ బంగారుపొంత మొఱుఁగు
టరిగె గుంపులనీడ నొయ్యార మొసఁగ, వచ్చి పుప్పాపచయకేళి వాంఛ దేలి.139

క. మడమఁబడు నిడుదవాలిక, జడ నడుమున జుట్టి పైట సరిగె చెరంగుల్

బెడఁగుఁ జనుదోయి పొడ లే, ర్పడ బిగియింపుచు ననుంగుఁపడతులు గొల్వన్140

చ. చిలుకలలోన చిల్కలయి చెల్వపుటంచలలోన నంచలై

తెలివి పొసంగు తీవియలఁ దీవియలై సరసంపుఁ బల్కులన్
గులుకునడల్ పసిండితలుకుల్ గల మేనులు గానుపింపఁ జే
తుల కసివోవఁ దేనియలతో ననతోయములెల్ల గిల్లుచున్.141

సీ. కలిగొట్టుఁ జేరబో కళి గొట్టు సేయు నీ బీర మేమిటికి జంబీర మదిగొ

సిందువారము తెనె సిందు వారము లేని పైరుగాఁదేఁటి కింపై రుచించుఁ
జూతము పదరమ్మ చూతము మదవతీగానంబు లచ్చోట గానరావె
రమ్ము మారుని గుడారమ్ము మారు నిజమ్ము గుంపుచోటుల గుజిగుంపు లేల
యీరమా యీరమానీతి యీప్రసూన, వాసనల్ వాసనల్ వంక నందికొనఁగ
పాటలాపాటలాళిచే పడియె ననుచు మాటకే మాట కేమి లేమావివిరులు.142

క. అని జవ్వను లవ్వనిఁ గ్రొ, వ్వునఁ బువ్వులు గోసి కడు చవుల్కొను నవ్వుల్

నన రువ్వులు కొందరు మెచ్చనిచివ్వలు నివ్వటిల్లుఁ జుని యవ్వలనన్.143

సీ. కంబముల్ గాన నిల్కడఁ గన్న పోఁకబోదియలపై వడిగాగ దీటుకొన్న

యలదీవ చాలు వాకిలి సొచ్చి లేమావిగుమురుల క్రీనీడఁ గొప్పకెంపు
లలితంపు మెట్లఁ గేళాకూళికవ్వల జలయంత్రముల వీఁగు చలువగాడ్పు
గదియంగఁ గలువ మేల్కట్టు పూవుల గప్పు సాంబ్రాణి దూపంపుజలదపాళి
నరసిఁ బురివిప్పఁ జను నెమ్మి నాస గలుగు, దాని గాఁ జేసికొనెడి చిత్తరువుబొమ్మ
చిలువచెలువంపు జడగుంపు సొలపు నింప, నీఁడు గానని యొకచిన్నిమేఁడమీఁద.144

క. చెలువైన పసిడిగద్దియఁ, గొలువై నలువంకఁ జెలువగుంపులు గొలువన్

బలువైఖరి పావడ నెల, తలు వైవఁగఁ గన్నెయున్నతఱి నటమున్నన్.145

శా. ఆజన్మస్థిరధర్మకర్మనిపుణుం డౌరాజు రాచిల్క మే

త్తేజీ జో ల్తేదొక పొంత కాఁడయి తనుం ద్రిప్పంగ నయ్యింతి య
య్యోజన్ వచ్చుట గొలెఁ బూపొదలలో నున్నట్లు వీక్షించి యా
రాజీవేరేక్షణ వెంటనంటఁ జని గారామారసౌధస్థలిన్.146

క. వలభిన్మణిగణగుంభిత, వలభిం దద్రుచి తమంబు వలఁగొని పొదువన్

జలదాచ్ఛాదితుఁడగుత, మ్ములదాయ య యనంగ నిలిచి ముదితం జూడన్.147

శా. ఏకై కాంగవిలోకనాకలనతుష్టైకాంతసామంతభా

వాకూతంబులు తద్విధాతృరచనాత్యార్చర్యగాఢాప్తమూ
ర్ధాకంపంబులుఁ దత్సమానకృతమానాధీననానావచ
శ్రీకంబుల్ మహిపావలోకములు నారీమౌళిపై వ్రాలుచున్.148

చ. అలికచ కావిమోవి బెడఁగానెడు తేనియ సోనవానలన్

నిలిచి శరీరకాంతి ఝరిణీపరిణీతములై కుచాచలం
బులఁ దప మాచరించుచును మున్ను వరోరువిలాసిరంభతో
గలసిన కొంకుపో విభుముఖంబుఁ గనున్ నృపవీక్షణావలుల్.149

క. మినుకు చనుగుబ్బగుబ్బలి, కొననుండియు గాఢనాభికూపంబునఁ గ్ర

క్కున దుమికి నెలవు మఱిఁ గనుఁ, గొనమి న్నృపుచూపు లుడ్డుకుడుచుచు వెడలెన్.150

గీ. కలికిలేగౌను నిలువెల్ల కల్లయగుట

వెస నదృశ్యాంజనంబు సేవించెనేమొ
నెగడ దటులయ్యుఁ బతిదృష్టి నెమకఁదొడఁగె
వెఱచువారలఁ గనుఁగొన్నవెంటఁ బడరె.151

క. ఈనటనఁ జూచి నివ్వెర, గానఁబడన్ రాజహంస గమనాదృతిచే

మానసము మానసముగా, నానరపతి యతిశయప్రియంబు దగంగన్.152

సీ. శాబాసు ననచెండు జిగిఁ జెండుచనులొండు గబ్బిగుబ్బలిచాలు గెబ్బఁజాలు

హయిసరే నెఱిమించు నదలించుకనుమించు కమ్మదమ్ములమేలు గ్రుమ్మఁజాలు
చాగురే విరిపువ్వు సరిరవ్వు చిరినవ్వు తొగరాచ జిగిజాలుఁ ద్రోవఁజాలు
మాయురే యళిపెంపు మరపింపు నెరిగుంపు మేలినీలపుడాలు వేలజాలు
మెలుసంపంగి డండలు డీలుపఱచు, కెలునునుపూలతీగెల వ్రీలజాలు
వాలుగల డాలు దొరచేతి వాలుకలువ, వాలుగాబోలుఁ దలఁప నీవాలుగంటి.153

చ. అని కొనియాడి చేడియ నొయారపురాశిని జేసినట్టి య

వ్వనజజు చేతికిం బిరుదు వైవఁగనచ్చుఁ గదయ్య దీని ప్రా
ఫున ముద మొందు కెండలిరు బొడళపుందొర చూచు వారలన్
వెనుకొని పూవుటంపరలఁ బెంపరలాఁడకు మన్నమానునే.154

శా. ఔనేకా మును పెన్నఁడో చెలియ చాయంజూచి నట్టయ్యెడున్

గాన న్వచ్చె మదాలసావయవరేఖావైభవం బింత యే
లా! నామానస మీలతాంగిపయి లీలాడోలికాకేళికా
శ్రీనైపుణ్యముఁ జూపఁగా హవణుఁ గాంచెం దద్గుణాలంబమై.155

మ. వరభామాంగము మించుఁగా నితరముం బాటించకే మన్మనః

స్థిరహంసం బది మానసంబు గనురీతిన్ నాతి నీక్షింపుచోఁ
గర ముత్సాహముఁ జెందిపొంగెడు నదే కాదా మహాచిత్రమై
యిరవొందెన్ మది నాకు నాకె వెరగయ్యెంగంటివే యిచ్చటన్.156

క. ఐనప్పుడే మదాలస, గానోపుఁ జుమీ లతాంగి కాకుండినచోఁ

గానీ కాకుండు బలా, యీనిగనిగజిగులు గందుమే యెందైనన్.157

సీ. మోముచాయయె కాదు ముద్దుపల్కులలోని తఱితీపు మెడగుల్కు దానివగయె

మోవి కావియ కాదు మఱిపెంపు పెంపుతో నాను జంకెనచూపు దానివగయె
పలుసోయగమె కాదు పచ్చిదేరఁగనాఁడు తరుణి పైబొమముడి దానివగయె
మోముచాయయె కాదు ముద్దుమాటకుఁ జెక్కులో నిండు లేనవ్వు దానివగయె
అన్నియును నాయెఁగా యీమృగాయతాక్షి, యదిగొ గూర్చున్నరుంద్రలీలాంబుజంబు
వలని యొల్లమి మూర్కొన్న చెలువు దాని, వగయె కావలె బాపురే వనజజన్మ.158

క. అని సమవస్తునిరీక్షణ, మున సరిసేయంగ బుద్ధి పొడమితలఁచి యా

జనపతి రతివిపరీవృత, మన మతిచంచలము గాఁగ మఱియుం దనలోన్.159

గీ. ఇది మదాలస యగునేని యిచట కెట్టు, లఱుగుదెంచెనో దీనిప్రాణంబు లైన

యల్ల కుండల యిప్పు డే మయ్యెనొక్కొ, వీరి కెడఁబాయవలసెనో విధికృతమున.160

సీ. అలనాఁడు మందరాహార్యకందరభాగమునఁ గుందఁగాఁ బలాశనకులాగ్ర

జాతుమాయాతివిఖ్యాతు భీతామరవ్రాతుని బాతాళకేతుఁ గూల్చి
ప్రమదంబుతోఁ దేజిపైకి రమ్మన నాలుగడుగులు పిఱుదన నఱుగుదెంచి
యటునిల్చి మురిపెంపుటల్లిక సిగ్గుతో గొరలు కొంకునఁ బైటకొంగు నేల
నలమి యీకాంత వింతదైన్యంబు నెట్టి, కొనఁగ ననుఁ జూచి దానిఁ జూచిన నెఱింగి
వనితతోఁ గూడ దాని నావెనుక నుంచి, తోడి తెచ్చితిఁగాదె మత్పురమునకును.161

ఉ. అంబరవీథిపైఁ గువలయాశ్వము మీరి లకోరి కోల వే

గంబునఁ బోవ వెన్నువెనుకం దగుదానివశంబుగాక రాఁగ
గంబున దానిమోవి పలుగం టొనరింపక దానిపాలభా
గంబునఁ జిందులాడు నలకంబులు దీర్పక మోసపోదునే.162

చ. విడివడిరువ్వనన్ గగనవీథికి గుఱ్ఱము చౌకలించినన్

వడకుచు గబ్బిగుబ్బలమొనల్ వెస వెన్నున నాఁటి రొమ్మునన్
వెడలఁగ గోలతుంగ భయవిహ్వలమై ననుఁ గాగళింప న
ప్పడతి మదీయవేగరసభంగ మొనర్చె భయాబుఁ దెల్పుచున్.163

సీ. ఎదురుకోవలెనంచు నేతెంచు మన్నెవారలఁ జూచి దవ్వుదవ్వులనె తిరుగ

దొరలు వచ్చిరటంచుఁ తిరుగు తొక్కుళ్ళ నియోగు లొక్కొకచోట నొదిగినిల్వ
నలయమాత్యులు నిల్చు టరసి పాఱులను గంచుకి ముక్కుమొకముఁ జూడకయె తఱుమ
గట్టికవాని యాగ్రహవృత్తిఁ గని పౌరు లంతంత సన్నఁగ నఱుఁగుదేర
నభ్రయానంబు వీడి హయంబు పురముఁ, జేక నీనారి తిరిగి యాచెలువ నడుగ
యదియు నావల్లఁ దెలిసి యియ్యధిపవర్యు, కటకమని తెల్పనఱిగితిగాదె మున్ను.164

క. అటువంటి కూర్మికత్తియ, కుటిలాలక నెడసె నేమొకో యది విధి సం

ఘటనము గావలె నీవలఁ, గటకట యీకార్య మెట్లు గావినఁ బడౌనో.165

క. ఆని పతి తలపోయఁగ నిం, పున వీణియలంచు గీతముల్ వడిఁ బలికిం

చినగతి వినఁబడె నిద్దఱ, వనితల యన్యోనకలహవాచాప్రౌఢుల్.166

సీ. చనవరివలె నెందుఁ జనెదు నడ్డము లేక మాకును నొకయడ్డమా మృగాక్షి

యంతటి దొరసాని వగుదు వెవ్వతె వీవు, తెలియదే యింద్రుని కొలువుదాన
నతనిఁ గొల్చినవార లరయ నెందరు లేరు వారిలో నెంచఁగ తారగానె
యిటు నిల్వు మెవ్వతె వైన నేమిభయంబు నిలువదీరదు పోవవలయు మాకు
యెంతవేగిరకత్తివే యింతికాన, మామగువ గొల్వవచ్చితి మోమిటారి
యేరిఁ బోలుదు కొలిచినవారిలోన, సుదతి యాకారగరిమంబు చూచి పల్కు.167

క. అను కలకలంబు చెవిఁ బడఁ, గనుసన్ననె యవసరంపుఁ గల్కిమిటారిన్

వినిరమ్మని చెలి పంపినఁ, బనివిని యది వచ్చి వినయపరవశ యగుచున్.168

చ. సముఖమువారిఁ ద్రోచి బురుసాపని చీరజరీచెరంగు వ

స్త్రమునకు మాటు సేయుచుఁ బరాకు లతాంగి సురేంద్రు కొల్వుబో
గముదఁట పేరు తార యనఁగా నుతిఁగన్న మిటారి యెంత గ
ర్వమొ యిటుచొచ్చి రా నచటివాకిటికావలి చెల్వ నిల్పినన్.169

క. వారల జగడపుమాటల, తీ రిది వే ఱేమి లేదు దేవి యనఁగఁ గ

న్యారత్నంబును విస్మయ, మారంగను గొమ్మనిక్కమంతయు వినుచున్.170

గీ. ఎదురుగా నేగి యౌనెకా యచట నిలిచి యెంతవింత నటించితి విందువదన

చాలు రావక్క యనుచుఁ గెంగేలు వట్టి, తోడుకొనిపోయి బంగారుమేడమీఁద.171

చ. కలప మలందుచో నొలుకు కస్తురిచిందులచేత ఘమ్మనన్

వలపు నెఱుంగు బంగరుతివాసిపయిన్ దగునొక్కరంగుకే
ల్సులువు పరంగిలాగి జిగిచొక్కపుఁ గద్దిగమీఁచ నిద్దరుల్
దలగడఁ జేతులూఁది చిఱునవ్వులతో వసియించు యున్నెడన్.172

గీ. రాజముఖి కొంతవడికి దారావధూటి, సొగసు నెమ్మోముఁ దప్పక చూచి పేర్మి

నువిద నీ వెంత కొంచకత్తెవె జయంతు, గాపుఁ జేసిన గరితవు కావె నీవు.173

క. అని పల్క నందులకుఁ బ, క్కునఁ దారయు నవ్వ నచట హరజూటవనీ

వనితామరలోకధునీ, వినుతఘనీభూతరుచుల వెన్నెల గుఱిసెన్.174

ఉ. ఆవనజాక్షి యంత దివిజాంగన కేలు దెమల్చియౌనె కా

యావిధమేమొ లెస్స విననైతి పరాకున మున్ను నీకథల్
నీవె వచింపఁగా వినవలెన్ వివరింపుమటన్న నేమిలే
దే; వినవే యటంచు నది తెల్పఁదొడంగె నుదంతమంతయున్.175

చ. కమలదళేక్షణా యమరకాంత్తు జయంతుఁడు నేను గూడియుం

టిమి కద నాఁడు వాని నెఱనీటులవెక్కడ వాని వింతయం
దములకు వాని యిచ్చకపుఁ దల్కులకున్ మఱి వాని మేనిడాల్
కొమరున కేను మేలు పడి గుత్తకు నిచ్చితి నేమి చెప్పుదున్.176

సీ. ఇంద్రుకట్టెదుట నే నృత్య మాడెడువేళ బుడుతలచే నాకు మడుపు లంపు

అమ్మతో నొకఱేని నలుక గడింపుచు నెటులనో నాయింటనే వసించు
తోఁడితిలోత్తమాదులు వచ్చి పొడఁగన్న ననుఁ జూచి కనుగీఁటి నవ్వఁజూడు
నెవ్వరు వినిపించిరేనియు విననట్టి మనవి నే తెల్పినంతనె ఘటించు
ప్రొద్దుపోఁకకుఁ గస్తూరిబొట్టుఁ బెట్టి, కీలుజడ యల్లి సురతావిపూలు జుట్టి
సొగసుఁ జేసి యెగాదిగఁ జూచి సిగ్గు, మురిపెమును బొందు ననుఁ జేరి ముద్దు పెట్టి.177

చ. సనసనగా నెఱింగి తనుజాతుఁడు నేనును నుండఁ గొల్వులో

దివిజవిభుండు లేనగవుఁ దెచ్చికొనున్ శచియల్కఁ జూడఁ గై
తవమునఁ బిల్వనంపి నను దప్పకజూచుచు సొమ్ములెల్ల మ
క్కువ నొసఁగుం చురుక్కురని కోడలిఁజంకెనచే నదల్చుచున్.178

క. ఈకరణి న్నాతోడిదె, లోకంబైయుండ నేను లోనగుచుఁ బురీ

రాకేందువదన లాకడ, నీకడ ననుకొనఁగ నతఁడె నేనై యుంటిన్.179

సీ. పనియుండి యెడఁబాసి చని రాకయున్న నే బిలువనంపింతు నెచ్చెలులచేత

వనిత యెవ్వతె హత్తుకొనునె వీని నటంచు వెంటనే బుడుతల వేగఁ బనుతు
నతని నెవ్వరు దూలనాడిన వారితోఁ జలపట్టి వట్టివాదులకుఁ బోదు
రతిపారవశ్యత నతఁ డొనర్చిన మోవిగంటి పిమ్మట నొవ్వఁగా నదల్తు
వాఁడు నవ్వుచు నింటికి వచ్చెనేని ప్రేమ రెట్టింప నే చెలరేగి యుందు
రిచ్చవడుమోముతోఁ జేరవచ్చెనేని, గుండె భగ్గున నే మనుకొందు నబల.180

చ. వలచుట జాతిలోనఁ దలవంపగునే కద యింకఁ దాఁచఁగా

గలిగెడి దేమి నాననుపుకాండ్రను దొల్లిటి వారి వీథిలో
పలఁ గనినంత వెచ్చనగుబాటున కోరిచి యన్నదమ్ములన్
బిలిచినరీతిఁ బిల్వ వలపించెఁ జుమీ యతఁ డంబుజాననా.181

గీ. అట్లు వలపించి లోనయ్యె నంచుఁ దెలసి, తరుచు కావళ్లు పెట్టి మాయిరుగుపొరుగు

చెలులతోనైన ముచ్చటఁ పలుక నీఁక , త్రాడు గట్టినవాని చందాన నేలె.182

సీ. పలుకనియ్యడు కమ్మవలపు హెచ్చన నాసనములు దెచ్చిన యింద్రవనితతోడ

జూడనీ డొకవేళ జోగునకై వచ్చి మేలు దెల్పెడు జోగురాలి నైన
గూడఁగానీడు కొక్కోకంబు చదువుకోఁ జేరు వేలుపు రాచ చిన్నపడుచు
సరసమాడఁగనీడు వరుసఁదప్పక తెచ్చి విరులిచ్చు పుష్పలావికలతోడ
అకట యేమందు తల్లి యిల్లాలికైనఁ నెడగలదు గాని వానిలోనడచుదాని
కుబుసుపోకకు నేని వేఱొక్కదారి, మిసుక కూడదు మేరకు మేర గాక.183

సీ. తారావధూటి బందాకోరుగాఁ జేసె మనజయంతుఁడె జాణయనెడువారు

నదిగాక మోహింపఁ డతని బంటుగ నేలుకొనుటకై యట్లున్నదనెడువారు
దీని కేమాయెనే వానిఁగాక మఱెవ్వరిని బిల్వదఁట చూడు మనెడువారు
నది బుంతవాని మాయలకు లోగునె యెందరిని జక్కఁబెట్టునో యనెడువారు
ననుచు నచ్చర నెచ్చెలు లాడుకొంద్రు, నిగళములతోడ మదహస్తి నిగుడు పగిది
వెంటఁ గావలి మాస్టీలు వేగిరింప, భూధరారాతి నగరికిఁ బోవువేళ.184

క. ఆతఁ డెంత యెంచినను సం, మతమై మదిఁ దోచుఁగాని మఱి యితరవిటా

యతనానావిధలోక, స్థితి గొందల మొంప వలపు చెడ్డది సుమ్మా.185

చ. అడకువ గాని పేరిమి జయంతుని పట్టున నొక్కతీరుగా

నడతునె కాని మున్ను నెర నమ్మిన నెచ్చెలికాండ్రు వచ్చి నా
కడపయ మెట్టిరేనిఁ జతకాపడ నిత్తు విరుల్ దుకూలముల్
విడెములు నాదిఁ గాగ నను వేఁడక మున్న ప్రియంబుఁ జెప్పుచున్.186

క. మిన్నక తదీయసఖు లే, కన్నియ గావలెనటన్నఁ గానీ దానిన్

చిన్నారినగవు చూపుల, సన్ననె రప్పించి కూర్తు సమ్మద మొదవన్.187

సీ. ఒరపుగా విరులతో నెరికొప్పు ఘటుయింతు నదిమాని గీల్జడ యల్లికొందు

గీఱుచు గుమ్మడి గాజునామము దీర్తు నది మాని డిల్ల బొట్టవధరింతు
వలిచన్నుఁదోయి గొప్పులదండ గీలింతు నది మాని ముత్యాలహార ముంతు
మినుకుసైకపువ్రాతపనిచీరఁ గటిఁ దాల్తు నది మాని తెలిచల్వ యలవరింతు
రవిక బిగియింతు నదియును నవల వైచి, కుంకుమపుఁబూత చిమచిమఁగొనెడు చిన్ని
పచ్చికొనగోటితాఁకులు రచ్చసేయ, గుబ్బ యరగానరాఁ బైటకొంగు వైతు.188

చ. విను మిటులుండఁగాఁ దిమిరవేణి కుబేరుఁడు కమ్మ పంపఁగా

దిన చిరి చీటులందు గడిదేరు జయంతుని వర్తమానముల్
విని నలకూబరుం డదిర వేలుపుఱేని కుమారునిన్ ముదం
బెనయఁగ నింత సేసె నిది యెంతటిదో యని విస్మయంబునన్.189

సీ. తిరుగఁడే కొన్నాళ్లు సరసీతిలోత్తమాపుంభావసంభోగములకుఁ జొచ్చి

చెలఁగఁడే కొన్నాళ్లు చిత్రసేనాకంతు పారావతారావపటిమఁ దగిలి
నడవఁడే కొన్నాళ్లు నవమేనకాధరాధరసుధాపానవిస్ఫురణ కలరి
మెలగడే కొన్నాళ్లు కలితోర్వశీవశీకరుణాకరోక్తి వైఖరికి మెచ్చి
కెరలి దెరగంటి దొరసూతి కేళులందుఁ, జొచ్చి చూడక మానినచోటు గలదె
నన్నుఁబలె యోర్తు పైఁబడియున్నవాఁడె, సుకరముగ మేలువడెనె వా డొకతెకేని.190

గీ. చదివికొన్నాడు మదనశాస్త్రంబులెల్లఁ, తెలిసికొన్నాడు వెలమిటారుల బెడంగు

కొసరు వగలెల్ల నటువంటికోడెకాని, వలచి వలపించుకొనియె నే వనరుహాక్షి.191

సీ. అతఁ డింటి కల్లంత నరుదేరఁ దావచ్చి మించుచూపులనె తేలించునేమొ

యతఁడు కీల్జడ కేల నదిమిన మే నోసరించి కోపమున గద్దించునేమొ
యతఁ డించుక పెనంగి యలయఁ దానదలించి మించి పైకొని పచారించునేమొ
యతఁడు చక్కెరమోవి యానఁ దా గుల్కు టెల్గించి బిగ్గిలఁ గౌగలించునేమొ
బెడఁగు మొనపంట సగమాకుమడుపు లిచ్చి, కొసరుమాటల మఱియును గూడ నెచ్చ.
రించి యాతని కాస పుట్టించునేమొ, బాల సురతాంతమందు బాగా లొసంగి.192

క. ఇది గంటివి యీవరకున్, మదనక్రీడారహస్యమతకోవిదయై

ముదమునఁ దేలింపుచు నను, చదురాలై యిపుడు చాల ఔక యొనర్చెన్.193

సీ. నేవచ్చువేళఁ దా నింట నుండకపోయి పొరుగింట నిరుగింటఁ బ్రొద్దు గడపు

నలవాడు నీచుట్ట మరుదెంచె ననిన నేమాయెలే వచ్చుఁగాకంచు బిగియు
నిలలేక స్వయముగాఁ బిలువఁబోయినఁగాని బెదరించు నిదిగో వచ్చెదనటంచు
వలసినప్పుడు వచ్చి యలిగియున్నట్టి నే పలికించుదాక దవ్వులనె నిల్చు
నంతటను నేనె పైటకొం గలమి బలిమి, సెజ్జపై దార్చి యలకలచిక్కుఁ దీర్చి
మ్రొక్కుచు నదల్చి నునుపోకముడి వదల్చి, కరఁగఁ జేసిన యటుమీఁదఁ గౌగళించు.194

చ. పరిపరిరీతులం బ్రసవబాణునికేళి యొనర్చు తొంటివై

ఖరి నెర పారుతంపురొద గానఁబడం దలయెత్తి నామనో
హరుఁడవు నీవ యంటి నవురా యను నంతటి పారవశ్యముం
బొరయుదు నుస్సురంచుఁ గనుమోడ్చుట లేదిపు డించుకేనియున్.195

క. నెనరైన దాని కిటువలె, గనరైనను వీడ చూచెఁ గడుమాలిమిచే

దనరంగ స్మృతులు నెయ్యెడ, పనవవె యతిపరిచయావజ్ఞా యనఁగన్.196

గీ. దీనిపొగ రార్ప నెరవేర్చు దిట్టతనము, మురువు హరువును గల జగన్మోహనాంగి

లేదుగా యంచు దివిని గాలింతు నేఁడు, కలిగెఁ గాతార నవకాంతి చలితతార.197

చ. అని చెలికాండ్రతోడ నతఁ డాడిన ముచ్చట లెల్ల వారు నన్

గనుఁగొని వచ్చి యిచ్చకముగా వినిపించిన నెంతమాట చ
క్కని జవరాలు రంభ యదిగాక జయంతుఁడు తామునుండు వ
ర్తన కిది మేరె తా మెరుగరా యని చీటిని బుచ్చి పంపుదున్.198

ఉ. అంతట నొక్కనాఁ డల ధనాధిపుఁ డశ్వము వాగె వెక్కసిన్

రంతులు మీర నెక్కి పెనురౌతన జోడన చెల్వఁ జూపుచుం
బంతము మీర వీథుల దుమారము రేఁగ సవారిఁ జేసి ప్రొ
ద్దెంతయు నెక్కఁగా నడుమ యించుక మేపశ్రమంబు పూనఁగన్.199

చ. హరి గెలనీడ వేత్రధరు లయ్యెడ నామము లుగ్గడించి హె

చ్చరికె యొనర్ప మ్రొక్కు భటజాలము వీడ్కొని యాస్యపద్మముం
బరిజనులంద పుంజలువబావడలం దుడువంగ నాత్మమం
దిరమున కేగి యందు నొకతిన్ననికెంపులతిన్నెనిల్చుచున్.200

ఉ. జెట్టులు చేరి లేత విడి చెందొవవ్రాతరుమాలువున్ సిగం

జుట్టి యలందుకుంకుమపుసోకుల బంగరుతీగెరంగు ని
ట్టట్టన నీని జందెము భుజాగ్రమునం బడనై చి సీత్కృతుల్
దట్టము గాఁగ వింతవగలన్ మెయిమర్దన సేయునత్తరిన్.201

చ. చెలువపు వెన్నతోఁ జలిది చిక్కములున్ మెడతాఁడు చీఁకటుల్

గులికెడు నీలిదట్టెపొరలోపల కమ్మచెరంగు వెన్నునం
దొలకెడు నెత్తిజుట్టు తెలిదుప్పటి వీనుల మానికంపు నా
గుల పడగల్ రహిన్ దగనొకొండగు యోంటరి బోయఁ డుద్ధతిన్.202

గీ. వచ్చి యవధారు కువలయాశ్వక్షితీంద్రుఁ, డల్లపాతాళకేతుఁ గీటడచె ననుచు

నచటి కరుగుచునుండి సురాధినేత, మిమ్ము రమ్మని యిదె యుత్తరమ్ము పనిచె.203

క. అని వినిపించు కుబేరుని, కని చెంద్రిక మీఁదవ్రాసి యందు శిఖావే

సిన కమ్మగద్దె చేరువ, నునిచినఁ జూచుకొని చుట్టి యున్ముఖుఁ డగుచున్.204

సీ. హరినీలములమేడ యవలకెంపులసజ్జు కడమకట్టఁగ నుడుగర యొసంగి

పెరచోట వడి దాచిపెట్టిన నవనిధానములు దేవాప్తసంఘములఁ బనిచి
కారుకు లెత్తి చక్కఁగఁ జేయుఁ డలచైత్రరథమని తగుభటప్రతతిఁ బనిచి
యరయమిచే డొక్కలంటిపెట్టుకయున్న యిభకోటులకు మేపులిడ ఘటించి
పుడమిఁ బాతాళకేతుండు గెడసినపుడె, నిత్యముగ నిల్చె నలకాధిపత్య మనుచు
ననిమిషాధీశ్వరునిచెంత కనుపఁదలఁచి, పుత్రుఁ బిలుమన్న నూడిగంపుభటు లపుడు.205

గీ. తోడి యక్షకుమారుల తోడఁ గోడి, పడవగొడవలఁ బడి యర్ధపతిసుతుండు

గౌడమైల శలాయత్తు కాకివన్నె, మొదలుగాఁగల కుక్కుటంబులను దెచ్చి.206

ఉ. పట్టెపుజుట్టునిక్కు మెడబాగునఁ జివ్వనయారెపొంకమున్

రెట్టలబల్మి నెమ్మిఁ బురణించిన యీకలజోకులున్ దగిల్
గొట్టకయుండ మేపు పలు కోయపుమందులు గల్గు పుంజుఁ జే
పట్టి గ్రహంబు వెన్కఁ గనుపట్టఁగ నల్లలు దీసి యంతటన్.207

గీ. ఎదుటిదానిని విడుమంచు హెచ్చరించి యతఁడు తను వేగిరింప మల్లాడికొనుచుఁ

గినిసి యొండొంటిఁ బిట్టుదాకించి యీసు, బొడమ రెంటిని గదియించి విడుచుటయును.208

వ. అప్పు డనిర్వారగర్వధామంబులగు నత్తామ్రచూడసార్వభౌమంబు లతిరూక్ష వీ

క్షాపరంపరలఁ జురం జురంజూచి పవరంజుకొని జుంజురించిన మెడలు నిగుడించు
కొని సాటి ని యీసునం గాటియ్యక తిరుపులుగట్టిన యొరఫునం దిరుగుచు నింపు
సొంపుల గుంపులు గొని నిజవిజయపరాజయంబులు గోరుచు నొకళ్ళొ కళ్ళ త్రొక్కు
ళ్ళఁ బొడము జగడంబుల జరాలుమనం గటారులు డుస్సుకొని పెద్దలు వారింపం దే
రి యచ్చటికిం జేరి ముంచుకొను కొంచెపుగాండ్రు పెడమోము వెళ్ళినటింక వెంట ను
ట్టినడువ గోడి నెత్తికొనుపోవుచు నెట్టికొనిదగలు తొట్టినం బట్టి యీకలందె
మడ వెడలించి పన్నీటితేటల రెట్టలకుం జలువ పుట్టించిన కట్టలుకంబట్టి తప్పించు
కొని యొండొంటి నంటి నొప్పించుచు నేవమీరి గౌతమమునిపుంగవాంగనామా
నభంగకరణాదికారణారవనిర్నిద్రచరణాయుధలోకపట్టభద్ర గెలిచితి వనుచు
నుతించుచుఁ బంచెవన్నె పావడలు వైచుచు మచ్చరంబున నిరువాగును నెచ్చరించి
న నిలిచి తన్నుఁ బోరునెడఁ గుబేరకుమారు కుక్కుటకంఠీరవంబు వెనుక నడచి
కేడించి చుట్టుకొని చురుక్కునం జుట్టు నొక్కినఁ గ్రక్కున నది లేదనిపించి యె
దిరి చరణాయుధంబునకు నడ్డంబుగా నడచి యారె విరుగందన్నిన నంజక యక్షకుం
జరుని పుంజు బిరబిరంజుట్టి రెట్టలోపలం దల సొనిపి గిలిగింతలు గొనినం బ్రతిపక్షియు
నెగిరి తప్పించుకొని గుప్పున నవ్వలం గుప్పించి యెదురై యులికి కరము వందురిన
నలకూబరుని కోడియు సమందరయంబునం గ్రిందికిఁ దగ్గి నెత్తురు జొత్తిల్లఁ గుత్తుక
కఱచి వెనుకకు మ్రొగ్గి యీడిగిలంబడిన నరాతియు మెడముడి విడిపించుకొని త
రిమిన గ్రమ్మికొను చెమ్మట నపయ మున్నె యోడెననుచు నెల్లవారలు గొల్లుగొల్లున
నవ్వుచు నెన్నుకొనం గిన్నరరాజకుమారుని చరణాయుధంబు సేదదేరి యడియాస
లం దన్నికొనివచ్చు నభియాతి నలయించి నిలువంబడునెడం జేరి పారిపో
వందన్నిన.209

గీ. కేరి తొడఁ దట్టికొని బిట్టుకేక వైచి, మీసములు దీటి యెదిరికి రోస మొదవ

డవిణ వాయింపఁజేయుచు డాసి పుంజు, నట్టె చూచుచు నున్నట్టి యతనిఁ గాంచి.210

చ. ఉడిగపువారు చేరి సమయోచిత మేతగఁ దెల్పుసుద్దులే

నుడువుచు నౌగదా యని కనుంగొన దేవర సంతరించు నె
క్కుడువగపుంజుతోడ నొకకోఁడి యెదుగ్చునె యంచుఁ జెంతకుం
వడిఁజని యయ్యగారు పిలువంబనుపం బని వింటి మంచనన్.211

సీ. ఒక్కఁడు చెంపకై యొరఁగుపువ్వులతోడి దసిలీరుమాలు వందముగఁ జుట్ట

జేరి యొక్కండయ్యగా రిచ్చుకట్టు వర్గములకు ముల్లెలు గైకొనంగ
నొక్కండు దరహస మొదవంగ నేటికుక్కుటము కేడించిన గొడవఁ దెల్ప
నొక్కండు రంభాపయోజాక్షి పడవ గెల్చినమాట విని సంతసించు ననఁగ
నఱిగి తండ్రికిఁ బ్రణమిల్లి యతఁడు కమ్మ, వచ్చుటలు దెల్పి తేజీదు వాలి నోలి
నలసియున్నాడ నీ వేగు మనుచు ననుప, నగుమొగంబున వీయని నగరు వెడలి.212

సీ. సానిపటాణి తేజిని ముందర నిల్పి సామి యటంచు సలాము సేయ

మావటీఁడు గజోత్తమముఁ దెచ్చి యంకుశంబు దనర్చుకేళితో మ్రొక్కు వేయ
సారథి రథముకన్ చాయనుఁ బోనిచ్చి యటు నిల్పి వచ్చి జోహారు సేయ
దాకాధినాథు డరదము ముందరనిల్పి తమిసపొత్తులతోడ దండ మొసఁగ
పావలటు మీటి కొల్లారు బండి యెక్కి, దురదురన రంభ యింటికి నరిగి తనదు
పయన మెఱిగించి సమ్మదపడనిదాని, గుస్తరించుచు ననిపించుకొని యతండు.213

చ. స్ఫురితవిభాసమానమగు పుష్పకనామ విమాన మెక్కి ని

ర్జరతతి తోడ నేఁగి దితిజక్షణశిక్షణదక్షరూక్షభా
స్వరశరసాంద్రు నానృపతిచంద్రు నుతించు సురెంద్రువెంబడిం
దిరిగి శుభాకరంబగు తదీయపురంబును జేరి యందులన్.214

క. అల యదితి విప్రపూజలు, సలుపంగనుఁ గొనఁగఁ బాకశాసనుఁడు తనున్

నిలుపఁగ నులుపనించిన, చెలువొందెడు విడిదెలో వసించె నతండున్.215

గీ. అన మదాలస తారామృగాంకవదన, తెల్లముగ మీఁదికతలెల్లఁ దెలుపుమనియె

ననిన జైమిని ముని యావిహంగములన, నంతరకథావిధం బెట్టిదని యడిగిన.216

ఆశ్వాసాంతపద్యములు

శా. సంధ్యాతాండవచండఖండపరశుస్ఫాయజ్జటామండలీ

సంధ్యాహిండితగాంగభంగజ మిధస్సంఘర్షి పుంజీకృతా
వంధ్యారావ ఘమం ఘుమోన్నతి సదృగ్వాగ్జాల పుణ్యాకృతీ
వింధ్యక్ష్మాధర కూట గోటి విచరద్వీద్వేషి యోషిత్తతీ.217

క. అమితప్రతాప తాపని, సమదానవిభాసభావజన్మాకారా

నుతగోత్ర గోత్రభిష్టుక, హిమకరనిభకీర్తికాండ హిమకరగండా.218

మాలిని, ధరణిపకులసోమా, దర్పితారాతిభీమా పరిహృతకవిభూమా భానుసంకాశధామా

సరసకవనభోజా సాధుసంతానభూజా, మురరిపునుతతేజా మూర్తిమాంబాతనూజా.219

గద్య

ఇది శ్రీమన్మదనగోపాలకటాక్షవీక్షణాసమాసాదిత సరసకవితావైభవ సవరమన్వయా

భరణ నారాయణభూపాలతనూభవ శఠగోపతాపసేంద్రచరణారవింద సంచలన్మా
నసమిళింద సంతతభారతభాగవతాదిశ్రవణానంద కామినీమనోహర రూపరేఖావిజి
తచైత్ర కాశ్యపగోత్రపవిత్ర జాతివార్తాకవిజనామోదసంధాయక చిననారాయణనా
యకప్రణీతంబైన కువలయాశ్వచరిత్రంబను మహాప్రబంధంబునందు చతుర్థా
శ్వాసము


సమాప్తము