కుటుంబ నియంత్రణ పద్ధతులు/డూష్

వికీసోర్స్ నుండి

11. డూష్

సంయోగం అయిపోగానే స్త్రీ వెంటనే లేచిపోయి డెట్టాల్ నీళ్ళతోగాని, పెర్మాంగనేటు నీళ్ళతోగాని వీర్యకణాలని నిర్మూలించే రసాయనిక ద్రవాలతో కలిసిన నీళ్ళతో గాని డూష్ చేసుకునే అలవాటు కొందరిలో వుంది. ఇలా చేయబట్టి గర్భం రాకుండా చేసుకోవచ్చని భావిస్తారు. ఎనిమా చేసుకొనే డబ్బాలో లోషన్ నీళ్ళు పోసి వుంచుకుని ఆ డబ్బాని ఎత్తుగా తగిలించివుంచి అందులోంచి నీరు వచ్చే రబ్బరు గొట్టానికి నాజిల్ బిగించటం జరుగుతుంది. సంయోగం అయిపోగానే కూర్చునో, పడుకునో, ఆ నాజిల్ యోనిలోకి పోనిచ్చి ఆ నీళ్ళతో యోనిలో స్కలనమయిన వీర్యాన్ని కడిగి వేసుకోవడం జరుగుతుంది. ఈ "డూష్" పద్దతి గర్భం రాకుండా చేసుకోవడానికి కొంత ఉపయోగపడినా సంయోగం జరగగానే లేచిపోయి వెంటనే డూష్ చేసుకోవటం అనేది రతి యెడల అసంతృప్తి కలిగిస్తుంది. అంతే కాకుండా డూష్ సరిగా చేసుకోకపోతే మిగిలిపోయిన వీర్యకణాలు గర్భము రావడానికి దోహదము చేయవచ్చు. అదీకాక రోజూ డూష్ చేసుకోవడంవల్ల యోనిలో వుండి యోనికి రక్షణ కల్పించే మంచి బాక్టీరియా క్రిములు నశించిపోయే ప్రమాదం ఉంది. అందుకని గర్భనిరోధక పద్దతిగా రోజూ డూష్ వాడటం మంచిదికాదు.

* * *