Jump to content

కుటుంబ నియంత్రణ పద్ధతులు/గర్భం రావడం విషయంలో దంపతుల్లో ఉండే అపోహలు

వికీసోర్స్ నుండి

21. గర్భం రావడం విషయంలో దంపతుల్లో ఉండే అపోహలు

సుమిత్రకి తన బావ సౌజన్యరావు అంటే ఎంతో ప్రేమ. పెళ్ళి చేసుకొంటే బావనే పెళ్ళి చేసుకోవాలని గాఢమైన కోరిక. ఆమె కోరికకు తగ్గట్టు సౌజన్యరావుకి కూడా సుమిత్ర అంటే ఎంతో ఇష్టం. మనసులు కలిసిన తరువాత మనుషులు కలవకుండా వుండటం వారిద్దరికీ బాధాకరంగానే వుంది. తల్లి దండ్రులు ఇంకా ఏవేవో చాదస్తాలు పెట్టుకుని వివాహానికి ముహూర్తం నిశ్చయించనే లేదు. నిండు వెన్నెల, చల్లనిగాలి, దానికి తోడు సన్నజాజులు- మల్లెల సుగంధ పరిమళాలు, అంతకంటే అనుకోకుండా తటస్థ పడిన ఏకాంతం సుమిత్రని తన బావ కౌగిట్లో కరిగిపోయేటట్లు ప్రోద్భలమిచ్చాయి. మనసులు ఒక్కటితో పాటు శరీరాలు కూడా ఒక్కటయినాయి. వెచ్చని కౌగిలినుంచి విడివడిన తరువాత జరిగినదాని గురించి సుమిత్ర భయబడి పోతూ వుంటే "ఒక్కసారి సంయోగానికే కడుపు వస్తుందా ఏమిటి? పిచ్చిగాని" అంటూ జరిగినదానికి ఆమెను సమాధానపరిచాడు.

నిజమే సౌజన్యరావు చూసినంతమట్టుకు తనకు తెలి సిన వారందరూ ఎంతో కాలం దాంపత్య జీవితం గడిపితేనే తప్ప గర్భవతులు కాలేదు." అంత ఫ్రీగా దాంపత్య జీవితంలో పాల్గొన్నప్పుడే వెంటనె గర్భం రానప్పుడు ఏదో ఒక ఆవేశంలో ఒకసారి మాత్రమే సంయోగం చేసినంత మాత్రాన్నే గర్భం ఎలా వస్తుంది? తానేమీ ఎక్కువ సార్లు సంయోగం చేస్తే కదా! ఇందుకోసం ప్రత్యేకంగా గర్భనిరోధక పద్ధతులు వాడటమెందుకు? ఇలా భావించిన సౌజన్యరావుకి పెళ్ళీపీటలమీద కూర్చోకుండానే సుమిత్రకి వేవిళ్ళు కనబడటం ఆశ్చర్యం కలిగించింది.

ఒక్కసారే సంయోగం జరిపినా గర్భంవస్తుందా

ఎందుకు రాదూ? సుమిత్ర విషయంలో జరిగిందేమిటి? అది మొట్టమొదటి సంయోగంమా, లేక తరచుగా పాల్గొనే సంయోగమా అనే దాన్ని బట్టి గర్భం రావడం ఆధారపడి వుండదు. అండం విడుదలయ్యే సమయంలో సంయోగంలో పాల్గొంటే అది మొట్టమొదటి సంయోగమైనా గర్భం రావడానికి చాలా హెచ్చు అవకాశాలు వున్నాయి. అండం విడుదలయ్యే రోజుల్లో కాకుండా ఇతర రోజుల్లో ఎనిసార్లు సంయోగంలో పాల్గొన్నా గర్భం రాదు. అందుచేత గర్భం రావడానికి ఎక్కువసార్లు సంయోగంలో పాల్గొనడానికి, పాల్గొనకపొవడానికి సంబంధం లేదు. అయితే చాలామంది దాంపత్య జీవితంలో వరసగా పాల్గొన్నా వెంటనే గర్భవతులు కాకపోవడం ఎందుచేత అని అనుమానం కలగవచ్చు. దీనికి అండం విడుదల లేకపోవచ్చు అండం విడుదలైనా అండవాహికల్లోనూ, గర్భాశయంలోనూ వీర్యకణాలతో అండం కలయికకు సరైన అవకాశం, అనుకూలత లేకపోవచ్చు, లేదా రతి పద్ధతుల్లో లోపం కావచ్చు. ఇంకా ఇతర కారణములు చాలా ఉన్నాయి. గర్భం ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు రావడానికి అవకాశమున్నదో తెలియక "ఎప్పుడో ఒకసారి సంయోగంలో పాల్గొన్నంత మాత్రాన కడుపు వస్తుందా ఏమిటి" అంటూ కొంతమంది పురుషులు కన్నెపిల్లల జీవితాలతో చెలగాటాలాడడం చూస్తున్న విషయమే. అలాగే అమాయకమైన కన్నెపిల్లలు యిదే అభిప్రాయంతో మోసపోవడం జరుగుతున్న విషయమే.

గర్భం రావడానికి. . .

గర్భం రావడానికి పలుమార్లు సంయోగం జరగవలసిన అవసరం లేదు. అండం విడుదల లేని రోజుల్లో సంయోగంలో పాల్గొన్నా గర్భం రాదు. అండం విడుదల అయిన రోజున ఒకసారి సంయోగం జరిపినా గర్భం వస్తుంది. అయితే కొందరికి అండం విడుదలైన రోజున సంయోగంలో పాల్గొన్నా గర్భం రాదు. అలా రాకపోవడానికి ఇతర కారణాలెన్నో ఉంటాయి. ఇటువంటివారు డాక్టరుచేత పరీక్ష చేయించుకుని దానికి తగిన కారణం తెలుసుకుని చికిత్స పొందాలి.

రజస్వల కాకుండా గర్భం రావచ్చా?

కొంతమంది ఆడపిల్లలు రజస్వల కాకముందే శారీరకంగా మానసికంగా పరిపక్వత చెందుతారు. రజస్వల కాకపోయినా వీరి జననేంద్రియాలు సంయోగానికి అనువుగా వుంటాయి. సాధారణంగా రజస్వల కావడానికి 2, 3 సంవత్సరాల ముందునుండే సెక్సు హార్మోన్లు తయారవడం ప్రారంభం అవుతాయి. కనుక జననేంద్రియాల వికాసంతో పాటు సెక్సు కోరికలు కలుగుతాయి. అటువంటప్పుడు అరుదుగా కొందరిలో సెక్సు సంబంధాలు సహజం. రజస్వల అవడం అనేది స్త్రీలో మొదటిసారి అండం విడుదలైన తరువాత 14 రోజులకి కనబడే బహిస్టుస్రావం. ఒకవేళ రజస్వల అవడానికి ముందునుండే ఆ బాలికకు పురుష సంపర్కం అంటూ ఉంటే మొట్టమొదటిసారి విడుదలైన అండంతో వీర్యకణములు కలిసి పిండంగా మారడానికి అవకాశాలు ఉన్నాయి. అటువంటప్పుడు ఆ బాలిక రజస్వల అయినట్లు సూచనగా బహిష్టుస్రావం అవకుండానే గర్బవతి కావడం జరుగుతుంది. రజస్వల కాకుండానే గర్భవతులైన స్త్రీల గాధలు వైధ్య చరిత్రలో లేకపోలేదు.

బహిస్టు సమయంలో సంయోగం చేసినా గర్భం వస్తుందా?

సాధారణంగా బహిస్టు స్రావం అవుతున్నప్పుడు రతిలో పాల్గొంటే గర్భం రాదని భావిస్తూ వుంటారు. కాని అందరి విషయంలోనూ సరిపోదు. పదిరోజులకి-పదిహేనురోజులకి బహిస్టుస్రావం కనబడేవాళ్ళలోనూ 2, 3 వారాలకే బహిస్టు అయ్యే స్త్రీలలోనూ అండం విడుదల సరిగ్గా ఉండదు. ఉదాహరణకి 21 రోజులకి బహిస్టు అయ్యే స్త్రీలకి బహిస్టు ప్రారంభం అయిన 5వ రోజునుంచి 9వ రోజులోగా ఎప్పుడయినా అండం విడుదల కావచ్చు. అండం విడుదలకి 3 రోజులు ముందు వీర్యకణములు విడుదలై యోని మార్గంలో వున్నా అవి అండంతో కలిసే శక్తి కలిగి వుంటాయి, అందుచేత బహిస్టు అయినప్పుడు సంయోగం జరిగితే గర్భం రాదులే అని బహిస్టు స్రావం కనబడిన రెండవరోజుగాని, 3వ రోజుగాని రతిలో పాల్గొంటే గర్భం రావడానికి అవకాశాలున్నాయి. అలాగే ప్రతి 10 రోజులకి 15 రోజులకీ బహిస్టుస్రావం కనబడే వాళ్ళలో ఎప్పుడు అండం విదుదల అవుతుందో చెప్పడం కష్టం. ఒక్కొక్కసారి బహిస్టు స్రావం అని భావిస్తున్న దినాల్లో కూడా అండం విడుదల అవుతూ వుండవచ్చు. ఇలా అస్తవ్యస్తంగా బహిస్టు అయ్యేవాళ్ళల్లో కాకుండా 28 రోజూలకీ 30 రోజులకి బహిస్టు అయ్యేవాళ్ళల్లో మాత్రం బహిస్టు సమయంలో సంయోగం జరిగితే గర్భం వచ్చే ప్రమాదం ఉండదు.

స్త్రీలో కామోద్రేకం కలగపోతే గర్భంరాదా

కొంతమంది స్త్రీలు తాము రతిలో పాల్గొన్నప్పుడు కామోద్రేకం పొందకపోతే కడుపు రాకుండా వుంటుందని భావిస్తారు. దీనికి వారిలో కొన్ని తప్పు అభిప్రాయాలు వుండటమే కారణం. పురుషులకి ఏ విధంగా వీర్యస్కలనం అయి తడి తడిగా స్పష్టంగా తెలుస్తుందో అదే విధంగా తమకు కూడా ఒక రకమైన స్కలనం అవుతుందనీ, ఆ స్కలనం అయితేనే గర్భం వస్తుందనీ భావిస్తారు. దానికి తగ్గట్టుగా వారిలో కామోద్రేకం బాగా కలిగినప్పుడు యోని దగ్గర పల్చని ద్రవం ఊరి తడి తడిగా గుర్తించడం జరుగుతుంది. తమలో కూడా పల్చని ద్రవం స్కలనం అయితేనే గర్భం వస్తుంది. కనుక అసలు రతిలో ఎక్కువ ఉద్రేకపడకుండా ద్రవాలు యోనిదగ్గర వూరకుండా చేసుకుని గర్భం రాకుండా దాంపత్య సంబంధం కలిగి వుండవచ్చని భావిస్తూ వుంటారు. అయితే సంతాన నిరోధక పద్ధతికి ద్రవాలు వూరకుండా కామాన్ని అదుపులో వుంచుకునే దానికి ఏమీ సంబంధం లేదు. స్త్రీకి కామోద్రేకం కలిగినప్పుడు యోని వదులు అయిపోవడం, యోని దగ్గర ద్రవాలు వూరడం మామూలుగా జరిగే విషయం. ఈ రకంగా తయారయిన ద్రవాలు యోనిలో వీర్యకణములు త్వరత్వరగా పయనించడానికి అవకాశం కలిగించినా, ఆ ద్రవాలు వూరడం జరగకపోయినా, స్త్రీకి కామోద్రేకం కలగకపోయినా వీర్యకణములు మాత్రం గర్భాశయంలోకి పయనించే శక్తి కలిగి వుంటాయి. అందుకనే కొందరు స్త్రీలు ఏనాడూ రతిలో సుఖప్రాప్తి పొందకపోయినా, రతిలో జడత్వం కలిగివున్నా పిల్లల్ని కనడం జరుగుతుంది.

చిన్న వయసులోనే గర్భం వస్తే నష్టాలు

రజస్వల అయిన కొద్ది నెలలకో సంవత్సరాలకో వెంటనే గర్భం వస్తే కాన్పు అవడానికి ఎంతో యిబ్బంది కలగవచ్చు. ఒక్కొక్కసారి ఆ చిన్నారి తల్లులకి సిజేరియన్ చేసి బిడ్దను బయటకు తీయవలసి వుంటుంది. ఎందుకంటే ఆ వయస్సుకి బిడ్డపుట్టే మార్గంలో తగినంత విశాలంగా పెరగడం జరగదు. దీనికి కారణం బస్థి మార్గంలోని ఎముకలు బిడ్డ బయటకు రావడానికి వీలుగా వెడల్పు కాకపోవడమే. అటువంటప్పుడు సిజేరియన్ ఆపరేషన్ చేసి బిడ్దను బయటకు తీయకపోతే తల్లి ప్రాణానికి బిడ్డ ప్రాణానికి కూడా ప్రమాదం జరగవచ్చు. అందుకనే బాల్యవివాహాలు ఎక్కువగా జరిగే పూర్వపు రోజుల్లో ప్రసూతీ సమయంలో మాతృ మరణములు, శిశు మరణములు ఎక్కువగా ఉండేవి. ఇది ఇలా ఉండగా తల్లీ, బిడ్డా తరచుగా అనారోగ్యానికి గురి కావడం జరుగుతూ వుండేది. ఇటువంటి యిబ్బందులు వుండగా రజస్వల అవడంతోనే కాపురానికి పంపినట్లయితే మానసికంగా తగిన పరిపక్వత లేక దాంపత్య సుఖం అనుభవించడం జరగదు. రతిలో తృప్తి తెలిసే వయసు వచ్చేసరికి పిల్లలు పుట్టడంతో బాధ్యతలు పెరగడంతోను, ఒంట్లో శక్తిలేక నీరసంగా అయిపోవడంతోను రతి ఎడల ఆసక్తి లేకుండా పోతుంది 18-20 సంవత్సరాల వయస్సు వచ్చిన తరువాత వివాహం చేసుకుంటే, అటు కాన్పులలో ఇబ్బంది కలగదు. యిటు దాంపత్య జీవితంలో నీరసమూ వుండదు.

* * *