Jump to content

కిలకిలని నవ్వు చెలులతో కలసి మెలసి

వికీసోర్స్ నుండి


కిలకిలని నవ్వు చెలులతో కలసి మెలసి

పువ్వువై మబ్బువై చిన్ని పుల్గు వౌచు

ప్రసవ కోమల రమణీయ పథము పట్టి

పోవుచుందువు లావణ్య మూర్తి వీవు.


ఏనొ దీనుడ నే నీడ నైన నొదిగి_

అడు గిడగ లేక నిటూర్పు విడువ లేక

పొరలు కన్నీటి కాల్వలు గురియ లేక_

ఏనొ దీనుడ నే నీడ నైన నొదిగి

కాంచెదను నిన్ను కనులార కరవు దీర!


ప్రసవముల జల్లి గానసౌరభము లల్లి

ప్రవిమ లానంద నృత్యోత్సవముల దేల్చి

నిన్ను వలపింప బూనుదు రెన్నొ గతుల.


ఏనొ దీనుడ నే నీడ నైన నొదిగి_

హృదయ నేతవు భవదీయ పదసరోజ

మృదు రజోలేశ దివ్య సంపదను వలచి

ఎడద కలగించి విదళించి యేర్చి వెడలు

వేడి నిట్టూర్పు గాడ్పుల పెదవు లదర

నా మనోహరి నిన్ను గన్నార గాంచ

నలవి గాకుండ దుఃఖాశ్రు సలిలమౌక్తి

కం బొకటి నాదు ప్రణయ వీక్షణము గప్ప_

ఏనొ దీనుడ నే నీడ నైన నొదిగి

మ్రోడునై రాయినై నిల్చిపోదు నకట!