కాశీయాత్ర చరిత్ర/పదుమూడవ ప్రకరణము

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

జ్వలిస్తూ యుండినందున ముక్తిక్షేత్ర మయినది. ఈ క్షేత్రములోని పాపులకు ప్రకారాంతరముగా కాలభైరవ దండన మూలకముగా పాపానుభవము చెప్పి అటుతర్వాత విశ్వేశ్వరుడివల్ల తారకమంత్రము వుపదేశమయి ముక్తిని పొందేటట్టు పురాణసిద్ధ మయి యున్నది.

యీ స్థలము అవిముక్త క్షేత్రమయినందున గంగ విశ్వేశ్వరుడి అనుగ్రహము సంపాదించి అసి-వరణల మధ్యే తనలోని జంతువులగుండా యెవరికిన్ని ఉపద్రవము చేసేది లేదని ఖరారుచేసి ఇక్కడ ప్రవహించసాగినది. ఈ కలియుగములో పాపాలను పోగొట్టడానకు గంగకు మించిన పదార్ధములేదని కంఠోక్తిగా కాశీఖండములో చెప్పియున్నది. ఆటువంటి గంగ ఇటువంటి క్షేత్రములో ఇక్కడ జతపడినందున ఈ రెంటిమూలకముగా పరమాత్మడు అనేకుల భక్తిని ఆకర్షించి తరింపచేయుచున్నాడు. ఇటువంటి మహాస్థలములో డిసంబరు నెల 16 తేది రాత్రివరకు వసించినాను.

Kasiyatracharitr020670mbp.pdf

పదుమూడవ ప్రకరణము

17 తేది ఉదయాన 4 ఘంటలకు ధనుర్లగ్నములో 12 దాండ్లుగల బజరాలోయెక్కి గయకు తరలి వచ్చినాను. నాబోయీలు మొదలయినవారు ఉండడానికి పట్టేలు అనే తడికెలు కట్తిన పడవను ఒకదాన్ని కూడా తేవడమయినది. ఈ బజరాకు పట్నా అనే షహరు వరకు బాడిగె యాభై యైదు రూపాయలున్ను, పట్టేలు అనే పడవకు ముప్పై రూపాయలున్ను యిచ్చినాను. కార్తీకశుద్ధ పున్నమివరకు యీ ప్రాంతమందు శీతకాలము ప్రవేశించలేదు. అదిమొదలు చలి దినదిన ప్రవర్ధమాన మయినందున యెండను మనదేశములొ వసంతకాలపు వెన్నెలవలె అతిప్రియముతో అనుభవింపుచు నున్నారు.

కాశీపట్టణ్ము గంగయెడ్డు అయినందున గంగ ధనురాకారముగా ప్రవహింపుచు గట్టునుకోసి వొత్తిరాకుండా బలమయిన గట్టములను వొడ్డున కడాకున్ను కట్టియుంచుట చేత, వొడ్డు కోశేదానికి బదులు ప్రవాహముయొక్క జోరు భూమిని కోశి లోతు అవుతూ వచ్చినది. గనుక ఆ చొప్పున లొతు కావడమువల్ల వడ్డున వుండే భూమి వూటపారి యీ శీతాకాలములో అతిశీతలమయి పయిగా జనసమ్మర్ధము విస్తారమయి నందున జ్వరాలు మొదలయిన అనేక రోగాలను ఉత్పత్తి చేయుచున్నది. మిక్కటముగా భూమి కొత్త అయినవారికి వుపద్రవము యెక్కువగా వుంచున్నది. కాశీలో ప్రవేశించిన వెనక యికను సుభిక్ష రాజ్యములో ప్రవృత్తి కలుగు చున్నదనే తాత్పర్యము చేతనున్ను కలకత్తా పర్యంతము నావల మీద పోవలెననే యిచ్చచేతనున్ను కాశెలో కొన్ని దినములు వసించవలసియున్నదనిన్ని హయిదరాబాదులో కొలువుపెట్టిన ఒక జత పండ్రెండు మంది బోయీలనున్ను, ఆరుగురు బంట్రౌతులనున్ను పట్నాంన్నుంచి వచ్చిన ఆరుగురు కావడి వాండ్లనున్ను కొలువు తీసి వేసినాను. మిగిలియున్న వారిలో నలుగురికి కుదురుతువస్తే ఆరుగురికి జ్వరాలు మొదలయిన యుపద్రవాలు తగులుతు వచ్చుచున్నవి. యిక్కడి స్థలజ్ఞులు అదేప్రకారము రోగపీడితులుగానే వున్నారు. యిక్కడి చలి మన దేశస్థులకు అసహ్యముగా నున్నది. నాపరివారానికంతా ధగళాలు, కుళ్ళాయిలు, చావళ్ళు, లుంగీలున్ను తీసియిచ్చిన్ని కుంపట్లు ఆపేక్షింపుచున్నారు. నేను ప్లానుల(ఫ్లాన్ల్)తో అన్ని వస్తువులున్ను వారివలెనే కుట్టించుకుని ధరించినాను. యెండకాలములో వుష్ణము అదెప్రకారము అతిమిక్కటముగా నుంచున్నదట. అందుకు కారణము అప్పట్లో గంగ లోపలికి పోవడము ఒకటే గాని వేరే తొచలేదు. ఇప్పట్లో ఇక్కడ అహస్సు 26 గడియలు. యీ వాశి రాత్రి వృద్ధి అయి వుంచున్నది.

కాశీక్షేత్రము సకల స్థలములలోనున్ను చేసిన పాపములను పోగొట్టుచున్నది. యీ కాశీ మహాస్థలమందు లోకులు చేసే పాపములను యావత్తున్ను పోగొట్టడానికి జ్యోతిర్లింగ ప్రదక్షిణార్ధము పంచక్రోశయాత్ర అని యొకటి చేయవలసినది. ఆ యాత్ర చేసిరావడానకు అయిదు దినములు పట్టుచున్నది. ప్రధమ దినము మణికర్ణీకలో స్నానము చేసుకొని సంకల్ప పురిసారముగా ప్రయాణమయి మొదటి దినము కద్రమేశ్వరము అనే యూళ్ళో నిలిచి అక్కడ కర్దమతీర్ధ ములో స్నాన తీర్ధశ్రాద్ధాదులు చేసి కద్మమెశ్వరుని అర్చించి రెండో దినము భీమచండీ అనే స్థలము చేరి అక్కడ మొదటి దినము వలెనే గడిపి మూడో దినము రామేశ్వరము చేరి అక్కడ వరణ ప్రవహింపుచున్నది గనుక అక్కడ వరణా తీరమందు తీర్ధనిధి చేసి రామేశ్వరార్చన చేసి, నాలుగో దినము కపిలధార అనే స్థలము చేరవలెను. అక్కడ లోగడి మూడు దినముల వలెనే గడిపి అయిదో దినము మణికర్ణీక చేరి అక్కడ తొలు నాలుగు దినములవలెనే గడిపి స్వస్థలము చేరవలెను. యీ యాత్ర తిరగడము 26 కోసులు కద్దు. ప్రతి మజిలీస్థలములో నున్ను విశాలమయిన ధర్మశాలలు కట్టి యున్నవి. యిదిగాక అంగళ్ళు యిండ్లు, తొపులు అక్కడక్కడ కలిగి వున్నవి. దారిపొడుగునా శాల (నీడకొరకు వేసిన చెట్లవరస) యుంచి యున్నారు. ప్రదక్షిణానికి ఆరంభము అసిమొదలుగా చేయవలసినది.

కాశీయాత్ర చేసేవారు వారానికి ఒకసారి మసోపవాసి అనేనక దేవి దుర్గా గుడికి సమీపముగా నున్నది. అక్కడికి వెళ్ళి కొన్ని గవ్వలు వేయవలసినది. వేయనివారి యాత్రాఫలము ఆమె అపహరించేటట్టు ఒక వదంతి కలిగి యున్నది. యీ పంచక్రోశయాత్ర చేసే టప్పుడు భిక్షకులకు, గలిగినవారు నిండాగా నుపచరింప వలసియుంచున్నది. యీ కాశీక్షేత్రమందు గంగలో పూజచేసే బిల్వము ముణిగి పోవుచున్నదని ప్రసిద్ధి కలిగియున్నది. ప్రయాగలో స్త్రీలు యిచ్చేవేణిన్ని అదే ప్రకారము మణిపోతూ వుంచున్నది. యేస్థలములో నున్ను సన్యాసులు త్రిరాత్రానికి అధికముగా వాసము చేయకూడదని విధియేర్పడి యున్నా, విశ్వేశ్వర స్మృతి ప్రకారము ఈ కాశికి వచ్చిన యతులు యీ స్థలము వదలి పోకూడదని యేర్పరచి యున్నందున పంచగౌడులు పంచద్రావిళ్ళలో సుమారు వెయ్యింటికి యతులు యీ మహాస్థలములో నివాసముగా యున్నారు.

ఆంధ్రులలో వెలనాడు, కాసలనాడు, మురికినాడు అని వున్నట్టున్ను ద్రావిళ్ళలో వడమలు, కండ్రమాణీక్యము, యెణ్నాయిరము అని వున్నట్టున్ను ప్రతి గౌడ తెగకున్ను అనేక చీలికలున్నవి. బహు సావకాశముగా విచారించక గాని వాటి ఖుల్లస్సు బోధపడదు. బంగాళీ బ్రాహ్మణు లయిన ఉత్కల గౌడులలో ఒక అన్యాయము జరుగు తున్నది. అది యేమంటే లోగడ వారి తెగలో కొంత విపత్తులు వచ్చినప్పుడు కొందరు యధాశాస్త్రముగా ప్రవర్తింపుచున్నట్ట్లున్ను, అద్యాపి వారి సంతతి ద్వారా కులీనులయినట్టున్ను, అటు కులీనుడికి కన్యకును వివాహము చేసి యిస్తే కులము పవిత్రమవుతున్న దని ఒక బోధ తోచి యుపపన్నులు అందరున్ను అటువుండే బహు కొద్దిమంది కులీనులకు బహుద్రవ్య మిచ్చి వొప్పచేసి కన్యమీద కన్యను యిరువై ముప్పైయింటిగాకా యిచ్చి వివాహము చేయుచున్నారు. ఆ ప్రకారము వివాహము చేసుకొన్న కులీనుడు తదనంతరము నూరాగులు యిస్తేగాని ఒక రాత్రి ఆప్రకారము వివాహమయిన స్త్రీలతో వసించేదిలేదు. అటుగనుక అటు వివాహమయిన స్తీలు చాపల్యము లేనివారు హింసపడుతూ, చాపల్యము కలవారు వ్యస్థ తప్పి నడుచుచున్నారు.

యీదేశములో వసింఛే ఘూర్జర దేశాస్థులు అనేక తెగలుగా భేడా వారని, నాగరీ లని ప్రత్యేకగుంపులుగా ఒకరి యింట్లో ఒకరు భోజనము లేక నియమము కలిగియున్నారు. యీ దేశములో దృష్టి దోషవిచారము లేకపోయినా కచ్చారసూయి, పక్కారసూయి అనేపాక నియమాలు బహుశా పాటింపు చున్నారు. పక్కరసూయి ఒకడు పాకము చేసినది మరి ఒకడు సంప్రదాయము విచారించక శూద్రుడయినా బ్ర్రాహ్మణునిచేత కూడా తినడు. శూద్రులు బహుశా మాంస భక్షణము చేయడములేదు. కొన్ని సంఫత్సరముల కిందట దక్షిణ దేశములో నుంచి గూపాలకజాతి యయిన ఒక గొప్ప మనిషి కొమార్తె ఇక్కడికి యాత్ర వచ్చి స్వకులస్థులను యిక్కడ పరిచర్యకు కొలువు వుంచినది. అటు కొలువువున్న స్త్రీలు పురుషులున్ను వచ్చిన స్త్రీ మాంస భక్షణము చేయడము చూచి, నిండా నిందించి కొలువు వుండమని చాలించుకొన్నారు. యీదేశములో గోపాలకులు తులసీమణి ధారము చేసినట్టయితే ఆచార సంపన్నులని వారి చేతి గంగను ధారాళముగా యీ దేశపు సర్వజనులున్ను పుచ్చుకొంటారు. వారిని సచ్చూద్రులని చెప్పుతారు. కాశీలో సకల గ్రంధమలున్ను సంగ్రహింపబడి వున్నవి. కుంఫిణీవారు బహు దినములుగా ఒక పాఠశాలను వుంచి సమస్త గ్రంధాలు సంగ్రహించి యుంచి పాఠము చెప్పను మనిషికి 30 రూపాయీలు జీతము ఛేసి పదిమంది పండితులను వుంచి చదవడానకు 100 మంది విద్యార్ధులకు మూడేసి రూపాయలు లెక్కని జీతమును చేసియుంచినారు.* యింకా రాజాధిరాజులు గ్రంధ సంగ్రహము కావలసినప్పుడు లక్షావధి రూపాయలు కాశికి పంపించి గ్రంధ సంగ్రహము చేయుచు నున్నారు. గనుక బహుమంది పెద్దలు తమ సోధనార్ధమున్ను అట్టి తరుణాలలో రాజాధిరాజులకు పనికి వఛ్ఛేటట్టు చాయడానికిగాను అనేక గ్రంధాలు సంగ్రహించి అపారముగా వుంచి యున్నారు.

కాశికి సుమారు యిరువై మజెలీలలో గోకుల బృందావనము యుండి యున్నది. హరిద్వార మనే పుణ్యభూమి 20 మజిలీలలో నున్నది. ఆ హరిద్వారమునుండి గంగోత్తరికిన్ని బదరీకేదారానికిన్ని బదరీ నారాయణానికిన్ని జ్వాలాముఖి కిన్ని దారిపోతున్నది. హరిద్వారము వెళ్ళకనే పయిన వ్రాసిన స్థలములకు యెక్కడికిన్ని పోను ఆయత్తు కాదు. హరిద్వారమునుంచి పయిన వ్రాసిన స్థలములలో యే స్థలానికి పోవలసినా ఈశ్వరేచ్చ యేమోగాని పదిహేనేసి దినాల మజిలి ఆయూస్థలములకు సరిగా నున్నది. అందుకు ఒక స్థలమునుంచి ఒక స్థలానికి వెళ్ళడానికి వేరేదారిలేదు. గంగోత్తరినుంచి బదరీకేదారము వెళ్ళవలసివస్తే హరిద్వారానికి వచ్చి పోవలసినది. అయోధ్య అతి సమీపము. ప్రయాగకు 12 ఆమడ వున్నవి.

పయిన వ్రాసిన గంగోత్తరి మొదలయిన మహాస్థలములు అన్ని నీలకంఠనేపాళరాజుయొక్క రాజ్యములొ యున్నవి. ఆరాజు నేపాళములో వాసముచేయుచు యింగిలీషువారికి లోబడియున్నాడు. ఆ నేపాళము వద్దనే మూరంగి అనే యూరున్నది. అందులో ద్రాక్షలు ఫలింపుచున్నవి. ఆ గ్రామము కాశీతంబురాయడనే పండారానికి


 • ఈ విద్యాలయమును గురించి బిషప్ హెబరు చక్కగా వర్ణీంచినాడు. బదరీ కేదారేశరుని పూతానైవేద్యాల కొరకు నేపాళరాజు జాగీరు యిచ్చియున్నాడు. ఆ ప్రాంతములలో మంచు అపారముగా నున్నది. కేదారేశ్వరునికి ఆరునెలలు పూజలేదట. మంచుకాలము యొక్క ఉపక్రమణలో ఒక పెద్ద కొడి స్తంభము నాటిపెట్టి మంచు గుడిని మూసుకునిపోతే మంచుకాలము తీసినవెనక ఆ కొడి స్తంభము గుర్తుపట్టుకొని మంచుగడ్డలు తొవ్వి యెత్తి గుడిని కనుక్కోవలసినదని చెప్పినారు.

ఈశ్వరుడు నీళ్ళలోని చేపలకు జలాధివాసము సహజము చేసి నట్టు ఆయాస్థలస్థులకు ఇటువంటి తనరూప మయిన కాలాలను సహజము చేయుచు వచ్చినాడు. కాలాన్ని అనుభవింఛే వ్యక్తిలోనున్ను కాలములోనున్ను యీశ్వరుడు అంతర్యామి అయినప్పటికిన్ని అభ్యాసము వల్లనున్ను యిచ్చవల్ల నున్ను యిటువంటి కాలభేదములు కొన్ని వ్యక్తులకు సరిపడక వుంచున్నవి. యెట్లా అత్తిచెట్టుయొక్క అనేకపండ్లలోని ఒక క్రిమిగాని ఆ ఛెట్టుయొక్క గాత్రమునున్ను శక్తినిన్ని యెట్లా తెలుసుకో నేరదో తద్వత్తుగా అనేక బ్రహ్మాండాలు ఉత్పత్తి ఛేసిన యీశ్వరునియొక్క చిద్విలాస మహిమను ఒక బ్రహ్మాండములోని ఒకా నొక ప్రాణి తెలిశి ఆశ్చర్య పడడానకు శక్తుడు కాడు.

యీ కాశీ మహాపట్నము యొక్క వేడుకను చూచి ఆనందించి, కపిల మహాముని యించుకు అధికముగా తనతప:ప్రభాముచేత యీ కర్మభూమికి చివరను గంగాతీరమునందు కాశ్మీరము అనే పట్నాన్ని ఉత్పత్తి చేసి సకల విధాలా బాగాచేసి కాశీవిశ్వేశ్వరునికి యెరుకచేసి అక్కడికివచ్చి చూడుమని ప్రార్ధించి నంతలో విశ్వేశ్వరుడు ఆ కపిలుని మాట నిజమేనని తెలుసుకున్నవాడై అప్రతిద్వంద్వముగా కాశి యుండవలసిన సంకల్పము పరమాత్మునికి నుండగా గర్వము చేత కపిలుడు యీప్రకారము ఛేసినాడు గనుక ఆ కాశ్మీర పట్నము అతని గర్వభంగము అయ్యేకొరకు వెంబడిగానే మ్లేచ్చాక్రాంతమయి మ్లేచాభూయిష్టమయి పోగాకా అని శపించినాడట. అదిమొదలు అద్యాపి యెంత అక్కడ శంకరాచార్యులవారు దిగ్విజయము చేసినా సరస్వతీపీఠమున్నా అక్కడ ప్రవహింఛే గంగ సస్యాదులకు కూడా వుపయోగింపుచున్నా అక్కడవున్న బ్రాహ్మణులు అందరు బలాత్కా రముగా తురకలలోకలిసి బ్రాహ్మణుడు అప్ర్రాంత్యాల తలచూపడము అద్యాసి ప్రయాసగా నున్నది.

ఇప్పట్లో ఆ రాజ్యము రణజిత్తు సింగు* అధీనముగా యున్నది. ఆకాశ్మీరములోనే కుంకుమపువ్వు అవుచున్నది. శాలూలు నేయడానికి యోగ్యమయిన వెంట్రుక లయ్యే మృగాలు ప్రత్యేకముగా ఉత్పత్తి అవుచున్నవట. కాశ్మీరశాలూలు బయటికి విస్తారము రావటములేదట. అందుకు నకలుగా లాహోరులో నేసిన శాలూలు బయటికి విక్రయయానికి వచ్చేటట్టు విన్నాను. నిరక్షదేశము మొదలుగా 23 భాగల దూరము లో నుండే కాశీ లొగానే కాలము మొదలుకొని ఆచారవ్యహారములు యింత భేదించి యుండగా యికను ఉత్తరోత్తరా యేమి వింతగా నుండునో తెలిసినది కాదు; వీపుమీద నుండే మచ్చ చూడడానకు కూడా మనుష్యుడు శక్తుడుకాడు. మాయావృతజ్ఞానము కలిగి వుండుట మిక్కటముగా యీ ప్రకారము మాయామగ్ను లయిన అస్మదాదులను కాపాడ వలసినది.

1830 వ స|| డిసంబరు 28 తేది పట్నా అనే షహరు ప్రవేశించినాను. గంగలో పదిదినములు బజరా పట్టేలు అనే పడవల గుండా నడవడమయినది. దారిలో గంగ కిరుప్పక్కలనున్న వూళ్ళ పేళ్ళు ఈ అడుగున వ్రాయుచున్నాను. నెం.21.కబారా 1 మంజీ 1 ఛోటక్పూరు 1 కనాలుగంజి 2 సయత్పూరు 1 మాంజీ 1 చోబక్పూరు 1 రోజా 1 జిమ నియ్యాం 1 రాంపూరు 1 మదనా పూరు 1 గాజీపూరు 1 కాతిసుపూరు 1 నెరువూరు 1 బకుసరు (బక్సార్) 1 నిక్కావూరు 1 బుదాగా 1 కట్రాజిగంజి 1 బిసన్ పూరు 1 ఆరా 1 నవరంగా 1 రామనగరము 1 శిరువూరు 1 శిరంపూరు 1 చప్రా 1 రస్తాన్ గంజి 1 దానాపూరు 1 బాకీపూరు 1 పట్నా 1.


 • రంజితసింగు శిక్కుల రాజు. 1780 లో జన్మించి 1839 లో దివంగతుడైనాడు. పెరుగు, పాలు, కూరగాయలు - ఇత్యాది అనేక దినముల పరియంతము బాగావుండని పదార్ధాలకు గాను ఒకవేళ గంగకు ఇరుపక్కలావుండే వూళ్ళలోకి వెళ్ళితే మనుష్యులు వెళ్ళీ రావలసినది. సుఖహేతువులంతా కష్టసాధ్యములు గనుక యీ గంగా తీర సంచారసుఖానుభవములో పడవలోకి నీళ్ళు వూరి వచ్చిన దనిన్ని పడవ తోశే వాండ్లు చెప్పినట్టు వినలేదనిన్ని కూడా వుండే పరిజనుల ప్రకృతులు భిన్నాలు అయినందున వాండ్లు ఒకరితో నొకరు కలహము పడడము వల్లనున్ను, వద్దవుండే స్థితికి చోరులవల్ల అపాయము వచ్చునేమో అనే భయముచేతనున్ను, మనస్సుకు అప్పుడప్పుడు ప్రపంచదృష్టి పూరా కలిగిన దేహాధీన మయినందున వికల్పము కలుగుచున్నది. అప్పట్లో జగము యావత్తు పరబ్రహ్మ ఆడించే బొమ్మలుగాని, వేరే కాదనిన్ని తృణాగ్రమయినా యీశ్వరాజ్ఞ చేతనే కదల వలసినదిగాని మరిఆన్యధా కాదనే తెలివితోనున్ను మనస్సునిండా ఖేదాన్ని పొందనియ్యకుండా బుద్ధిద్వారా శిక్షించి నట్టయితే పయిన వ్రాసిన స్థలజల సౌఖ్యములు మిక్కిలి ఆనందములుగా తేటపడు తున్నవి.

యీ గంగలో నడిచే అనేకపడవలు అనేక భేదములు కలిగి యున్నవి. అందులో విచారించగా తెలియవచ్చిన వాటిని అడుగున వ్రాసినాను. నావల భేదక్రమము బజరా 1. అది ఒంటికంభము కలది. వెడల్పుయెక్కువ. తలపక్కచుక్కాణి, చుక్కాణి మొదలు పొడుగున తగ్గుచూవచ్చు చున్నది. పిన్నిస్సు 1. అదిరెండు కంభాలుకలది. నిడువు యెక్కువ. మొనను చుక్కాణీ. యిల్లు మధ్యే వుంచున్నది. పొడుగు కొనా మొదలున్నుసమము. కటరు 1. అది పిన్నిసుజాడ; గాలిని చాపలచేత వైపు (వీలు) చేసుకోవచ్చును. బవులియ్యా 1. అదిబజరాజాడ; గాలిని చాపలచేత స్వాధీనము చేసుకోవచ్చును. డోంగా 1. అది చిన్నయిల్లు గలతేలిక పడవ. బాలిబోటు 1. అది చెయిపడవ. పయిన వ్రాసిన ఆరుదినుసులు సవారీలాయఖు. సర్కు మోసే నావలు పట్టేలి 1. అది మిరిజాపురపు శాత. పొడుగు తక్కువ. వెడల్పు యెక్కువ. వులాకు 1. అది పట్నాశాత.

పట్నా మధ్యే గంగకు యిరుపక్కలా వుండే వూళ్ళలో గాజీ గంగలో కలియుచున్నది. చప్రావద్ధ కర్మనాశినీ అనే నది దక్షిణము నుంచి వచ్చి గంగలో కలియుచున్నది. యీ కర్మనాళిని నదిలో యెవరు కాలుపెట్టినాగాని సుకర్మాలు నశించుచున్నదనే తాత్పర్యముచేత కర్మఠులు యెవరున్ను యీనదిలో కాలు పెట్టరు. యీనది దాటడానకు కాశీనుంచి గయకు వచ్చే దోవలో అహల్యాబాయి అనె యశ:కాయము గల పుణ్యాత్మురాలు వారధి కట్టడానకు శానా యత్నము చేసినది. యిప్పటికి ఆమె చేర్చిన సామానుతో కట్టాడానకు అనేకులు యత్నము చేసినా కొనసాగలేదు.

యీ పట్నాషహరువద్ద పునఃపునః అనే నది దక్షిణమునుంచి వచ్చి గయవద్ద వచ్చే ఫల్గుని నదివలెనే గంగాసంగమ మయినది. యీ పున:పున: అనేనది గయా క్షేత్రమునకు ప్రదక్షిణముగా ప్రవహింపుచున్నది గనుక యెటువంటి గయకు వచ్చే వారున్ను యీ పున:పున: నదివద్ద క్షౌరము చేసుకొని తీర్ధశ్రాద్ధము చేసి గయావ్రజనము చేయడానకు నియమము ధరించవలసినది.

దక్షిణమునుంచి వచ్చే పయినదు లంతా నర్మదానదివలెనే వింధ్య పర్వతములొ ఉత్పత్తి అయినవి. శోణభద్రా నదిన్ని, నర్మదానదిన్ని ఒక్క ప్రదేశములోనే ఉత్పత్తి అయి రెండు ధారలుగా చీలి ఒకటి లింగాలనున్ను, మరి ఒకటి వినాయకశిలలనున్ను జగత్తుకు కలుగ ఛేసి యున్నవి. యిదిగాక పేరు ప్రశస్తములేని కొన్ని నదులు ఉత్తరము నుంచి వచ్చి కాశీ పట్నాలమధ్యే గంగలొ కలియు చున్నవి.

కాశి మొదలు పట్నాషహరు వరకు గంగకు ఇరుపక్కలా సరసు అనే పెద్ద ఆవాలున్ను, రాయి అనే చిన్న ఆవాలున్ను, బూటి అనే శనగలున్ను, పటానులున్ను, కందులున్నూమితముగా పయిరు చేసి యున్నారు. యీ పెద్ద ఆవాలు చెట్లు ముల్లంగి చెట్లవలెనే ప్రధమములో పయిరు అయి యెన్నుతీసి పచ్చని పూలు పూచి, గోరుచిక్కుడు కాయలవలె కాయలు కాయుచున్నవి. యీ ఆవకూర యీమంచు దినములలో పుల్లకూరవండి యీ దేశస్థులు అవశ్యముగా పుచ్చుకొను చున్నారు. పుల్లకూర బహురుచిగా వుంచున్నది. మంచు కాలములొ దేహానికి లేపనము చేసేటందుకు నాలుగు ' విధాలు పరిమళ శైలములు యిక్కడ తయారు అవుతున్నవి. వాటి పేళ్ళు సుగంధరాజతేలు అనేది ఒకటి, బేలా అనేదిఒకటి, చెంబెలిఅనే నూనె ఒకటి, పూలేది అనేనూనె ఒకటి, ఇవి వుపపన్నులు చేసుకొనేవి. పేదలు పెద్ద ఆవాలనూనె పట్టించుకొను చున్నారు. యీ తైలాలతో అంగమర్ధనము చేయకపోతే చర్మములో ల్నుంచి సూదితో కుట్టి నట్టు బెజ్జాలుపడి నెత్తురు చెమ్మగింపు చున్నది. యీ ప్రకారము నాపదిజనానకు నడిచేటప్పుడు కాళ్ళలో కొందరికి నెత్తురు చెమ్మగించి నందున భయపడి వారు యిందుకు వైద్యము ఆవనూనె పట్టించి వేన్నీళ్ళు పోసి కడిగితే వెంబడిగానే వాశి అయిపోతున్నది. చిన్నఆవాలలో నూనె నిండా రావడము లేదు గనుక చిన్న ఆవాలను భక్ష్యయోగ్యముగా వాడుకొని, పెద్దఆవాలలో మాత్రము నూనెను గానుగ ఆడి తీయుచున్నారు.

యీ మంచుకాలములో బ్రాహ్మణ సంతర్పణలు కాశిలో నావల్ల యీశ్వరుడు జరిపినప్పుడు యీ దేశములో నివాసముగా నుండే పంచద్రావిళ్ళకు దృష్టిదోషము అక్కరలేనందున ఆ బ్ర్రాహ్మణులు ఆవరణలోపలను భోజనము ఛెయడానకు చలి యుపద్రవముగా వుంచున్నదని పగలు రెండుజాములవేళ మెద్దెమీద పయిదళములో యెండలో ఆకులు వేయించుకొని కాకుల బాధలేకుండా నాలుగు పక్కలా నలుగురు శూద్రులు తుపాకులు కాలుస్తూ యుండేటట్టు యేర్పరసుకొని యెండ సౌఖ్యముగా వున్నదని భోజము చేసినారు.

కాశివరకు తాటిచెట్లు కండ్లపడక పోయినా, గంగకు యిరుపక్కలా అనేక గ్రామాదులలో తాటిచెట్లు కలిగి యున్నవి. యిరువై యేండ్లకు మునుపు జాతులవాండ్లు పొట్టేటసు అనే గడ్డలు (బంగాళాదుంపలు) యీ దేశానికి తెచ్చి పయిరుపెట్టే క్రమమును యీదేశపు జనులకు నేర్పించినారు. అది మొదలుగా యీ దేశములొ యెక్కడ చూచినా వాటికి ఆలి అనే పేరు పెట్టి అమోఘముగా పయిరు పెట్టుచున్నారు. ఆ గడ్డలు పెద్దదినుసు నిమ్మకాయలంతేసి, చిన్నదినుసు గచ్చకాయలంతేసిగా అనేక రాసులుగా పన్నీరు పూలవర్ణముతో ఫలించి యెక్కడ చూచినా యీ ప్రాంత్యములలో అమ్ముచున్నారు. గంగలో పడవలు యెల్లప్పుడు వస్తూపోతూ వుండడముచేత యీ పడవలు వాడికెగా నిలిచే ఘాట్లవద్ద యిటువంటి భక్ష్యయోగ్య మయిన వస్తువులు తెచ్చి పెట్టుకుని అమ్ముతూ వుంచున్నారు. కాశిలో అమ్మే గొయ్యా పండ్లు (జామపండ్లు) మిక్కిలి గొప్పలుగా, విత్తులు శానా తక్కువగా యుంచున్నవి. ఈ దేశములో కాలము యెరిగి కూరకాయలు వేయుచున్నారు గనుక ఒక కాలములో అయ్యేవస్తువులు మరియొక కాలములో మన దేశములో అకాలములో కూడా దొరికేటట్టు చిక్కదు.

పట్నా అనే షహరు దానాపూరు మొదలుగా ఆరుకోసుల దూరమునకు ఒకే షహరుగా నున్నది. పట్నా షహరులో కలకటరు జడిజీ మెజిస్ట్రేటు ఉండడము మాత్రమేగాక ఒక అప్పీలు కోరటు రివిన్యూ క్రిమినాలు సంగతులు విచారించడానకు ఒక కమిసనరు వున్నాడు. యీ షహరు మ్లేచ్ఛమయముగా నున్నది. లోగడ యెల్లీసు దొర యీ దేశము చూసే నిమిత్తము వచ్చియుండి యీ షహరులో గోమాంసము బహిరంగముగా బజారులో పెట్టి అమ్ముచున్నారు, యీ వింత నేను హిందూదేశములో యెక్కడ చూడలే దని వ్రాసినాడు. అటువంటి వస్తు విక్రయము నా కండ్ల పడకపోయినా అంతపని సాధారణముగా చేసేపాటి మ్లేచ్ఛ షహరు అనవచ్చును.

ఈ షహరులో రెండు దేవస్థలా లున్నవి. ఒకటి పట్నాదేవి మందిరము, మరియొకటి గోపీనాథుని మందిరము. రాజసపూజ వితరణగా జరుగుచున్నది. గాజీపూరు, ఆరా, చప్రా, వీటికన్నా యీ షహరులో యిండ్లమిద్దెలున్ను విస్తారముగా నున్ను, గొప్పలుగానున్ను కట్టియున్నవి. కాశీపట్నమువలెనే ప్రతిసందుకు పాటక్కులనే వాకిళ్ళు తలుపులతోకూడా కట్టియున్నవి. రాత్రిళ్ళుమూశి గడియలు బీగము వేయుచున్నారు. బాజారులను బహునిర్బంధము మీద యిటీవల జాతులవాండ్లు వెడల్పుచేసి చక్కపెట్టినారు. యిండ్లకు బాడిగె యీ షహరులో బహు అల్పము. నేను దినానికి ఒక రూపాయివంతున నిలిచిన దినమునకు బాడిగె యిచ్చుచు వచ్చినాను. సకల పదార్థాలు సకల విధములయిన పనివాండ్లు సమృద్ధిగా దొరుకుదురు. పనివాండ్లను యీ దేశస్థులు కాలీగర్లు అని అనుచున్నారు. యీ షహరులో యెక్కా లనే ఒంటిగుర్రపు గాడీలు బాడిగకు వేలాంతరాలు దొరుకును. యీ సహరులోవుండేపాటి యెక్కాలు యెక్కడా లేవని హిందూస్తాన్ లో ప్రసిద్ధము. ద్వీపాంతర పదార్ధాలుకూడా సమృద్ధిగా దొరుకును. యింగిలీషు షాపులు కొన్నియున్నవి.

షహరుకు మూడుకోసుల దూరములో జాతులవాండ్లు గంగాతీరమునందు యిండ్లు, తోటలు కల్పనచేసుకొని యున్నారు. సమస్తఫలవర్గాలున్ను దొరుకును. అరిటిపండ్లు దొరికినా బొంతపండ్ల జాతేగాని రస్తాళి మొదలయిన రుచికరమయిన జాతిపండ్లు దొరకవు. నాగపూవు వదిలిన వెనక మంచి అరిటిపండ్లు వెడల్పుగల అరిటి అకులున్ను చూచిన వాణ్నికాను. మెవావస్తువులని యీషహరులొ పిస్తా, బాదము, అగురోటు, మునక్కా అనే విత్తు కలిగిన విత్తు లేని ద్రాక్షయేమి పయిచెక్కు యెండి లొపల మాధుర్యము గలిగి విత్తు అతిహ్రస్వముగా కండకలిగిన అనారు అనే దాడింమపండ్లున్ను యెండి అత్తిపండ్లున్ను సమృద్దిగా అమ్ముతారు. సెబుభి యివి మొలయిన శీమ అప్పీల్సు యీ దేశములో అవుతున్నవి. కాశీలో హుక్కాబుర్రలు అమ్మేటందుకు ఒక వీథి ప్రత్యేకముగా యున్నట్టు యీషహరులో యెక్కడ చూచినా నానావిధాలయిన పాదరక్షలు, హుక్కాబుర్రలు మొదలయినవాటి సామానులు అమ్ముతువుంచున్నవి. చలికాలములో రజాయి దుప్పట్లు, రజాయి చొక్కాలు అమితముగా తయారు చేసి అంముతారు.

యీ షహరులో హయిదరాబాదు వలెనే ఆయుధములే ఆభరణాలుగా యుంచే స్వభావము కల మనుష్యులు సమృద్ధిగా వున్నా యింగిలీషువారి అధికారము పూర్తిగా యిక్కడ జరగసాగిన వెనక లక్షాంతరాలు ఆయుధాలు నిర్బంధము మీద లోకులవద్ధ తీసి విరిచి గంగలో వేసినారు. అట్లా చేసిన్ని యింకా యెవరిచేత చూచినా ఆయుధాలున్ను నిర్నిమిత్తముగా ఒకణ్ని ఒకడు నరుక్కోవడాలున్ను గలగి యున్నది.

యీ దేశములో చక్కెర కాచి పోసే కలకండ, చీనా కలకండ పచ్చకర్పూరమున్ను యెంత మాత్రము దొరకదు. నేపాళ దేశము యిక్కడికి సమీపము గనుక అక్కడ అయ్యే కస్తూరి అమ్ముతారు. అందులో కృత్రిమము బహుశ: జరుగుచున్నది. కుంకుమ పువ్వు అయ్యే కాశ్మీర దేశము దక్షిణదేశము కన్నా యీ దేశానికి సమీపముగా వున్నా మనదేశములో దొరికేపాటి మంచి విడి కుంకుమపువ్వు యిక్కడ దొరకదు. వస్తువులు అయ్యే దేశాలనుంచి అన్య దేశాలకు ప్రియమయిన దినుసులను తమ దేశములో వాడీకెలోకి తేకనే పంపించేటట్టు తోచుచున్నది. యీ దేశస్థులు యిక్కడి శీతము యేపాటి? నేపాళ దేశములో కలిగే చలికి సహస్రాంశములలో ఒక అంశ యిక్కడ లేదని చెప్పుతారు. సాల గ్రామాలు ఉత్పత్తి అయ్యే కొండ భూమి నేపాళ దేశములోనే వుండియున్నది. ఆ కొండ మీదుగా గండకీనది ప్రవహింపుచున్నది. ఆ నదిలో సాలగ్రామాలు యెత్తడము నర్మదా శోణభద్రా నదులవలె పట్నావద్ద కలిసే గండకీ నదిలో పట్టిన తావున సాలగ్రామాలు దొరకవు; ఆ కొండ ప్రదేశములోనే ఆ నదిలోనే సాలగ్రామాలు కలిగి వున్నవి.

                     ------------

పదునాలుగవ ప్రకరణము

యీ హిందుస్తాన్ లో యింగిలీషు వారికి అధీనము కాకుండా యికను నిండా ప్రయత్నము మీద స్వాధీనము కావలసిన రాజ్యము రణజిత్తుశింగుదీ ఒకటేను. వాడి రాజ్యము హిందూస్తాన్ కు చివర కాశ్మీర ఖండమున్ను, లాహోరు అనే షహరున్ను, మూడు లక్షలమంది మార్బలము కలిగియున్నాడు. హయిదరాబాదు చట్టముగా యింగిలీషు వారిని ఉపసర్పించుకొని రాజ్యము చేయుచు నుండే వారు జోతీపురపు రాజు, జయపురపు రాజు, బిక్కనెరి (బికెనీరు!) రాజు, నేపాళపురాజు లక్కునో నబాబు, శింధ్యా, హోలుకరు, వీరు తప్ప మరి యెవరున్ను రాజ్యాధిపతి అని పేరు పెట్టి పిలవడానికి హిందూస్తాన్ లొ లేరు. హోలుకరు,వీరు తప్ప యెవరున్ను రాజ్యాధి పతి అని పేరు పెట్టి పిలవడానకు హిందూస్థాన్ లో లేరు. హోలుకరు గడిచి పోయిన వెనక రాజ్యము బహుశ: యింగిలీషువారి అధీనమయి హోలుకరు కొడుకు యింగిలీషువారి ఆజ్ఞాబద్ధుడుగా నున్నాడు .