కాశీయాత్ర చరిత్ర/పదిహేనవ ప్రకరణము

వికీసోర్స్ నుండి

పదిహేనవ ప్రకరణము

పయిన వ్రాశినటువంటి పట్నాషహరులో డిసంబరు నెల 31 తేది దాకా వుండి 1831 సం|| జనవరి నెల 1 తేది ఉదయ మయిన 4 గడియలకు గయా మహాక్షేత్రానికి ప్రయాణమై పది ఘంటలకు పున:పున: అనే నదివద్ద చేరినాను. దారి సడక్కు వేసియున్నది. యిరుపక్కల తోపులు వూళ్ళు నిబిడీకృతముగా యున్నవి. గయా వ్రజనము చేయడానము పున:పున: నదివద్ద క్షౌరముచేసుకొని శ్రాద్ధము చేసి సంకల్పము చేయవలసినది గనుక అదేప్రకారము జరిగించినాను. దిగడానకు నదివొడ్డున స్థలములేదు గనుక బయలులో గుడారము వేశి వంటభోజనములు గట్టున గడుపుకుని రాత్రి నీమా నదామా అనే వూళ్ళవద్ద ఒక సరాయి, ఒక పబ్లిక్కుబంగళా వుండగా వాటి సమీపమండు నిలిచినాము. సరాయిమధ్యే ఒక భావియున్నది. సరాయి దిగడానకు మంచివసతి. యీ సరాయి పట్టణమునకు 9 కోసులదూరములో నున్నది. భాటబాగుగాని దువ్వరేగడ భూమి నీమా వదామా అనే రెండు వూళ్ళున్ను గొప్ప వూళ్ళేను. బాజారు వున్నది. అన్ని పదార్ధాలు దొరుకును. వంట చెరుకులు మాత్రము ప్రయత్నముమీద దొరకవలసినది. మిరిజాపూరు మొదలుగా అడివి సమీపముగా యీ ప్రాంత్యాల లేదు గనుక గొమయ శుష్కములు నాటుపురాలలో బహుశ: వాడుతారుగాని వంటచెరుకులు పట్టణములలో దొరికేటట్టు సహజముగా నాటుపురాలో దొరకవు. పున:పున: అనేనది నిండా వెడల్పు లేకపోయినా జీవనదిగా సార్వకాలము ప్రవహింపుచున్నది. యీ రాత్రిపయి రెండువూళ్ళవద్ద వసించియున్నాను.

జనవరి 2 తేది ఉదయమయిన 2 ఘడియలకు మంచువల్ల బాగా యెండవచ్చిన వనక బయలుదేరి యిక్కడికి 9 కోసుల దూరములో వుండే జానా అనే వూరు 1 ఘంటకు చేరినాను. దారి నిన్నటి వలెనే బాగా సడక్కుకలిగి యున్నది. ఈ వూరు షహరువంటి వూరు, 1000 యిండ్లు కద్ధు; బట్టలుకూడా నేశి అమ్ముతారు. గొప్ప బాజారు వున్నది. వూరివద్ద ఒక చిన్ననది ప్రవహించుచున్నది. నదివొడ్డున లోగడె మజిలీవలెనే హిందువులకు ఒక సరాయి, జారులవారికి ఒక బంగళా కట్టివున్నది. బరక్రదాసు అనే పోలీసు బంట్రౌతు ముసాఫరుల సరఫరాయి నిమిత్తమున్ను కాపు నిమిత్తమున్ను సరాయి బంగాళాలవద్ద కాచియుంటాడు. యీ గొప్ప వూరిలో వంటచెరుకులు ప్రయత్నము మీద దొరికినవి. యీ రాత్రి యిక్కడ వసించినాను.

3 తేది 7 ఘంటలకు బయలువెళ్ళీ యుక్కడికి 8 కోసుల దూరములోవుండే చెలాయనే యూరు 2 ఘంటలకు చేరినాను. దారినిన్నటిదారివలెనే బాగావున్నది. ఈవూరిలోను సరాయి బంగాళా వున్నప్పటికిన్ని సరాయిలో మనుష్యులు నిండి యున్నందుననున్ను కాశీ పట్టణము మొదలుగా ప్రతి జిల్లా మేజస్ ట్రేటు వారు వారి సరిహద్ధు పరియంతమున్ను చప్రాశి అనే ఒక బిళ్ళ బంట్రౌతును దయచేశియిస్తూ వున్నందున, కూడావున్న తయినారి బంట్రౌతు గుండా ఆవూరిజమీందారుణ్ని పిలుపించి వాడియింటిని ఖాలీ చేయించి అందులో దిగినాను. యీ వూరు గొప్పవూరేను. సకల పదార్ధాలు దొరుకును. జలవసతి నిండాలేదు. యీ వూరిలో యీరాత్రి ససించినాను.

4 తేది ఉదయ మయిన 7 ఘంటలకు ప్రయాణమై యిక్కడికి 10 కోసుల దూరములో వుండే గయామహాక్షెత్రము 2 ఘంటలకుచేరినాను. కాశిలోవుండాగానే డౌలత్తురావు శింధ్యా గయావళి సహదేవ భయ్యా స్వీకారపుత్రుడయిన చోటాలాలు భయ్యా యోగ్యుడని తెలిసినందున ఆ చిన్నవాణ్ణి కాశికి పిలుపించినాను. అతడు రాజసల్తనతో కూడా నావంబడి ఒక బజరాచేసుకొని పట్నాషహరుకు వచ్చి అక్కడి నుంచి కూడా గయకు మజిలి మరుమజిలీగా నాతోకూడా భోజనము చేసుకొంటూవచ్చి ముందర దిగడానకు విష్ణుపాదము గదాధరస్వామి గుళ్ళకు ఫల్గుణీనదికిన్ని అతి సమీపముగా ఒక గొప్పయిల్లు కుదుర్చి పెట్టినందున అందులో దిగి, యీశ్వర కటాక్షముచేత నాగయావళీ ఉపపన్నుడయి బ్నహుశ: యింగిత జ్ఞానము తెలిసి గదాధర భట్లు అనే దేశస్థ బ్ర్రాంహ్మణుని తనవద్ద సర్వాధికాగానున్ను ప్రాపకుడుగానున్ను వుంచుకొని వున్నాడు. గనుక సకల విధాల ఆ క్షేత్రము నాస్వస్థ ళములవలెనే అయ్యేటట్టుగా జాగ్రత్త పెట్టించినాడు. కాశీనుంచి వచ్చేదారిలో చప్రా అనేషహరులో లోగడ చన్నపట్టణములో ఆక్టింగు గౌనరుగా వున్న గ్రీందొరగారు జననమయి వారి తండ్రిగారు అక్కడ బహుకాలము అధికారము చేసినందున వారి పాత నవుకరులకు కొంత యినాములు యిచ్చి వారి కుశలము విచారించే కొరకు నన్ను కొన్ని దినములు చప్రాలొ నిలువు మని చెప్పినందున ధనుగ్రయ త్వరగా ఆరంభించడానకు కొంత ఆలస్య పడ్డరి గనుక ధనుర్మాసములో గయావ్రజనము సమాప్తి కాక పొయినా ఆరంభము మాత్రము ధనుర్మాసములోనే చేసినాను.

గయాక్షేత్రము మహా గొప్పపట్టణము. అందుకు వుత్తర భాగ మందు 50 యేండ్లుగా యింగిలీషువారు సాహేబు గంజు అని 2 కోసుల దూరములో తాము యిండ్లు తోటలు కట్టుకొని ఒక బస్తీ చేసినారు. అక్కడ అనేక మళిగలు గొప్పబజారు వీధిన్ని యేర్పడ్డది. సకలపదార్ధాలు ఆబజారులో చవుక. ఆసాహేబుగంజు బస్తిన్ని గయాషహరున్ను యిప్పట్లో యిండ్ల సమూహముతో కలిసి వున్నది. రెండు స్థలాలలో మూడు వేలయిండ్లున్ను 15000 వేల మంది ప్రజలున్ను కలిగి వుండునని తోచుచున్నది. గయలో ఒక మేజస్ ట్రేటు ఒక జిల్లాజడ్జి, ఒక డాక్టరు, యాత్రదారుల వద్ద మహస్సూలు వసూలు చేయడానికి ఒక టాక్సుకలకటరు జిల్లాకలకటరుకు అంతర్బూతముగా వున్నారు. గయాపట్నము బాహారుజిల్లాతో చేరినది. కలకటరు హుజూరి కచ్చేరి యిక్కడ బహుకాలము వశింపుచూ వుంచున్నది. యిక్కడ సకల పదార్ధాలు ద్వీపాంతర వస్తువులు సకల విధములయిన పనివాండ్లు కలరు. గడియారము చక్క పెట్టడానకు పనివాండ్లుమాత్రము పట్నా షహరులో వుండేటట్టు మిక్కటము యిక్కడలేదు. మిఠాయి అంగళ్ళలో తిలలతో అనేక దినుస్సులు భక్ష్యరూపములుగా చేసి అమ్ముతారు. వాటిఆకుకూరకు నిండా బాగా వుంచున్నది. యెర్రమందారపు మొగ్గలు అమితముగా తెచ్చి కూరకు అమ్ముతారు. అది పెసలపప్పుతో కలిపి వండితే బహు బాగా వుంచున్నది. మన దేశములో యీ మొగ్గలు వున్నా వికసించినవనక అర్చనకు వాడుతాముగాని మొగ్గలను భక్ష్యయోగ్యముగా వాడడములేదు. యిక్కడి దూదుప్యాడాలు ప్రసిద్ధి కలిగి దినాల పేరట వుంచున్నవి, వీధులు కాశీ అంతటి కుసంది కావు. జాహేబు గంజువీధులు దక్షిణ దేశములోని వీధులకు సరి పోలి వున్నవి. యిండ్లు నాలుగు అంతస్తులుదాకా కొయ్యసామాను వేశి మజుబూతి (గట్టి) మిద్దేలుగా కట్టి వున్నారు.

యీ క్షేత్రముచుట్టు కొండలు వుండడము మాత్రమేగాక షహరుమధ్యే కూడా చిన్న తిప్పలు వున్నవి. ఆ తిప్ప మిట్టలమీదనే యిండ్లు కట్టియున్నారు. సమీప మందున్న ఫల్గుని నదిని ఇక్కడి దేశస్థులు ఫల్గు అనుచున్నారు. బహుశ: వడల్పు కలిగి బహుదూరము ప్రసిద్ధి కెక్కియున్నా ప్రవహింపుచు వుండే దినాలు బహు కొద్ది గనుక అందులో యెక్కడ చూచినా చలమలుతీసి స్నాన పానాలు గడుపుకుంటూ వుంటారు. యీ చలమల విషయమయి యీ షహరుని వాసుల ఖర్చులు విస్తారముగా ప్రతి నెలకు తగులుతూ వచ్చుచున్నది. గదాధరస్వామి సన్నిధిలో వుండే ముఖ్య చలమ వుదమకు కూపోదక మర్యాదగా వుష్ణకాలానకు శీతముగానున్ను శీతకాలానకు వుష్ణముగాను వుంచున్నది. గయావళీల యిండ్లు---1000 చిల్లర అని ప్రసిద్ధి అయి వున్నా 700 యిండ్లు హాజరుగా వున్నవి. గౌడబ్రాహ్మణుల యిండ్లు శానా వున్నవి. మహారాష్ట్రులు ఆంధ్రులు కలిశి ముప్పై యిండ్ల దాకా వున్నారు. పంచద్రావిళ్ళలో నూటిదాకా బ్రాహ్మణ మండలి చేరుతున్నవి. వారికి జీవనము షోడశీ అనే పౌరొహితము. వారు గయావళీలను వుపసర్పించుకొని వుంటారు. వారి ఆజ్ఞానుసారముగా వచ్చినవారి గయాప్రజనాలకు పౌరోహితము చేయిస్తారు. వారికి క్లిప్తములు (నిర్ణయములు) యేర్పడి యున్నవి. అందుకు తక్కువ యాత్రవారివల్ల పుచ్చుకొరు.

యిక్కడ గయాప్రజనాలు చేసే క్రమాలు నాల్గు. అష్టగయా అనే గయావ్రజనము ముఖ్యమున్ను ఖర్చుయెక్కువ పట్టేదిన్ని; పంచగయా అనేది రెండోపక్షము. యేకోద్ధిష్ట మనేది మూడోపక్షము. ఫల్గుశ్రాద్ధ మనేది నాలుగోపక్షము. మొదటి పక్షానికి కుంఫిణీ సర్కారుకు 148 (రు 14 1/2) రూపాయి యివ్వవలసినది. రెండోపక్షానికి 74 (రు 7 1/2) మూడోపక్షానికి మూడున్నర రూపాయ, నాలుగోపక్షానికి రెండు రూపాయలు.

యీ గయా మాహత్మ్యము వాయుపురాణ గరుడ పురాణాంతర్భూతముగా యెనిమిది అధ్యాయాలతో యిక్కడ ప్రచురముగా వున్నది. వాటిసారము యేమంటే గయాసురుడనే రాక్షసుడు అతి దీర్ఘకాయము కలవాడు బహు తపస్సుచేసి సకలతీర్ధాలకన్నా తన దేహము అతి పవిత్రముగా వుండేటట్టు వరముతీసుకొని తన తొలుదేహవాసనసంబంధమయిన తామస పనులుచేస్తూ వచ్చినట్టున్ను, త్రిమూర్తులలో ఒకడైన బ్రహ్మ వాణ్ని శాంతిపొందించవదలచి వాడివద్దికి వచ్చి నీదేహము అతిపవిత్రము గనుక నీదేహముమీద నేను యాగము చేయతలచినానని చెప్పినంతలో రాక్షసుడు సమ్మతించి ఈక్షేత్రములో తలపెట్టి శయనించినట్తున్ను బ్రహ్మ ఋత్విక్కులను సృషృంచి యాగము వుపక్రమణ చేసినంతలో రాక్షసుడి శిరస్సు చలనతదశ పొందినట్టున్ను శిరస్సును కదలకుండా పెట్టేకొరకు యెన్ని గొప్పకొండలు తెచ్చివేసినా నిలవక చెదిరి చుట్టు పడి యిప్పుడు రామపర్వతము ప్రేతపర్వతముగా సమీపమున నిలిచివుండేటట్టున్ను అటుపిమ్మట అవశాత్తుగా నొకానొక పతివ్రత పురుషుడి శాపన్ని ధరించి శిలారూపముగా వుండగా ఆ శిలను తెచ్చి గయాసురుడి శిరస్సుమీద వుంచినట్టున్ను ఆ శిలా అతిపవిత్రమయినదిగనుక గయాసురుడు తోసివేయలేక శిరస్సు మీద వుంచుకున్నా వాడి శిరస్సుయొక్క కంపముమాత్రము వదల నందున బ్రహ్మ యాగము పరిపూర్తి చేసేకొరకు 'యీశాన విష్ణుకమలాసన ' అని శ్రాద్ధకాలములలో వచించే శ్లోకప్రకారము దేవతలందరు వచ్చిరి. విష్ణువు గదాధర స్వరూపుడయి ముఖ్యముగా ఆ శిరస్సు మీద వున్న శిలమీద కుడికాలుపెట్టి నట్టున్ను తదనంతరము శిరస్సు కదలకుండా బ్రహ్మ యాగము పరిపూర్ణ మయి నట్టున్ను యాగసంరక్షణ నిమిత్తముగా గదాధారుడై అక్కడ నిలిచిన విష్ణువు కరుణాసముద్రుడు గనుక వచ్చిన సకల దేవతల సమ్మతముగా, లేవలేని గయాసురుడున్ను శిలా స్వరూపముగా వున్న పతివ్రతయున్ను ప్రార్ధించి నంతలో తాను అదేస్వరూపముగా ఉయెల్లప్పటికి యిక్కడ విరాజమాన మయ్యేటట్టు వొప్పుకున్నట్టున్ను అప్పట్లో కూడిన సమస్త దెవతలు చేసిన ప్రార్ధన ప్రకారము యెవరు యీ స్థలమందున "శమీపత్రప్రమాణేన పిండం దద్యాద్గయాశిరే" అనే శ్లోక ప్రకారము పిండ ప్రదానము ఛేసినా 101 కులమువారు తరించేటట్టు వర మిచ్చినాడు. గనుక తదారభ్య పితృస్వరూపుడైన పరమాత్మ యిక్కడ శ్రాద్ధ కర్మాలు చేసినంతలో అతితృప్తు డయ్యేటట్టు నిశ్చయ మయి యున్నది గనుక, ప్రతిదినము వుదయ ప్రభృతి సాయంకాల పర్యంతము సహస్రావధి ప్రజలు ఆ రీతిగా వుంచిన విష్ణు పాదలాంఛన మీద పిండప్రదానాలు చేస్తూ వుంటారు. శ్రాద్ధము వినా పిండప్రదానము మాత్రము కూడకపోయినా స్థల పురాణములో యీ స్థల మందు పిండప్రదానమే ముఖ్యముగా చెప్పివున్నది. గనుక అనేక ముగా పెట్టవలసిన శ్రాద్ధాలకు బదులు యీ స్థలాంతర్భూతమయిన ప్రదేశాలలో పిండప్రదానాలు మాత్రమే ఛేయుచున్నారు గనుక నేను ఆ దేప్రకారము ఛెసినాను.

నెం. 27 అష్టగయ చేయవలసిన క్రమము:-- క్షేత్రము ప్రవేశించిన దినము ఫల్గునినదిలో స్నానముచేసి గదాధర్శనము విష్ణుపాదము గుడి బహుపాదదర్శనము విష్ణుపాదదర్శనముచేసి క్షేత్ర వుపవాసము వుండవలసినది. విష్ణుపాదము గుడి బహుసుందరముగా నల్లశిలతో ముందు విశాలమయిన ముఖమంటపముతోకూడా అహల్యాబాయి కట్టించివున్నది. అరటి పువ్వందముగా సువర్ణమలాముతో చేసిన కలశముతోకూడా ఒక స్తూపీ యేర్పరచి యున్నది. గదాధరస్వామి మందిరము అందుకు రెండో తరము విష్ణుపాదపు గుడికి చేరినట్టుగానే కట్టియున్నది. గోడలో చేర్చి గదాధరమూర్తిని నిలిపివున్నారు. విష్ణుపాదము, మనిషి అడుసులో కాలిపెట్టితే అడుగు యేర్పడ్డట్టు శిల మీద లాంచనగా యెర్పడివున్నది. బహుకాలమయినది గనుక రేఖాలాంచనలు తెలియవు. మహాపూజా కాలమందు ఆపాదము మీద చందనము సమర్పించి కుంకుమ పువ్వుతో రేఖాలాంఛనములు చందనము మీద అతి సుందరముగా యేర్పరుస్తారు. గదాధర మూర్తిని అతి సుందరముగా కల్పించి వున్నది. యీ రెండు గుళ్ళు ఫల్గుని తీరమందు వున్నవి. విష్ణు పాదానికి సమీపముగా అష్టాదశపాదాలు 'యీశాన విష్ణు ' అనే శ్లోక ప్రకారము ఒకటే పెద్ద శిల మీద వున్నట్టు వదంతి గనుక ఆ శిలకు ఒక పెద్ద మంటపము అహల్యాబాయి కట్టించి వున్నది. ఆ పుణ్యాత్మురాలు శానా ధర్మాలు యిక్కడ ఛేసి వుండెను. అది అంతా యిప్పట్లో నిలిచిపొయినవి. ఆపె ఆకృతి శిలతో చేసి గదాధరస్వామి గుడివద్ద ఆపె అన్నసత్రములో వుంచినారు గనుక ఆ బింబాన్ని చూచి ధన్యుణ్ణి అయినాను. ఆ అన్నసత్రమున్ను యిప్పుడు నిలిచిపోయినది.

2 డో దినము ఫల్గుని శ్రార్ధము క్రమముగానే ఛెయవలసినది. గయావళులను తప్ప మరి ఒకరిని బ్రాహ్మణార్దము చెప్పకూడదు. యీ దినము పెట్టే పిండాలు ఫల్గుని నదిలో పెట్టవలసినవి. బ్రాహ్మణార్ధానికి మనకు యేర్పడ్డ గయావళి వారి స్వకియ్యుల్ను పిల్చుకొని రావలసినది గాని వారి సంకేతము ప్రకారము మనము పిలిస్తే వారు రారు. యీ గయావళీలు యెందరు యెక్కడ వచ్చి యాత్రవారిని కల్సుకున్నా యజమానుడు యిచ్చవచ్చిన వాణ్ని నీవు నా గయావళీ అని నియమించి మిగిలిన వారిని నాకు అక్కరలేదని చెప్పవచ్చును. కాశీ ప్రయాక స్థలముల వలెనే నిర్బంధము లేదు.

3 డో దినము షహరుకు ఉత్తరపు పక్క 3 కోసుల దూరములో వుండే ప్రేతపర్వతానికి పోవలసినది. కొండకింద బ్రంహ్మగుండము అనే తీర్ధము ఒక గుంట అందముగా వున్నది. గయావ్రజనము చేసే వారికి గయావళి మూలకముగా పిండపిచ్చి యనే అంగటివాడు ఒకడు యేర్పడుతాడు. ఆ యా దినానికి పెట్టవలసిన పిండాలు తెలిసి పిండ మామగ్రీలు బ్రాహ్మల కయితే బియ్యము యితరులకు యన పిండిన్ని నువ్వుల్ దర్భ తేనె నెయ్యి మృణ్మయ పాత్రలో పెట్టి యిస్తాడు. వానికి అష్టగయ చేసేవారు రెండురూపాయిలు యివ్వవలసినది. యీ షోడశీ ఆ పిండ సామగ్రీని తీసుకొని కూడావస్తాడు. ప్రేత పర్వతమునకు వచ్చేవాడు రెండు తావులలో పిండ ప్రదానము చేయవలసినది. యీ కొండకు సుమారు మున్నూరు మెట్లు కలవు. యెక్కడము ప్రయాస; సవారి మీద పోదామంటే కొండపయిన స్నానికి వుదకములేదు గనుక నడిచిపోవలసినది. ఆ కొండమీదికి నిమిత్తము లేనివారిని సర్కారు మనుష్యులు పొనియ్యరు. వుపచారము చేశేవాడు కూడా వస్తే వాడికి వేరే అమరాహి అనే వొక చీటి మూడున్నర రూపాయి యిచ్చి తీసియ్యవలశినది. భార్య మొదలయిన వారు కూడా వస్తే వారికి వేరే ఛీట్లు మూడున్నర రూపాయి వంతున యిచ్చి తీసుకోవలసినది. కొండమీద స్వర్ణరేఖ ఒక శిలామంటపము కిందవున్నది.

ప్రేతగయావళీలు అనే వక తెగవారు వుంటారు. వారు పిండదాన కాలమందు శానా తెమ్మని తొందర పెట్టుతారు. అష్టగయకు రెండురూపాయలు వారికి క్లిప్తము (నిర్ణయము). అంతమటుకు యిచ్చితీరవలెను. యీ ప్రేత గయావళీలు సుఫలము యివ్వడమని వొక సంప్రదాయము. ఈ ప్రేత గయావళీలు సుఫలము యిచ్చేక్రమ మేమంటే, పిండప్రదానము కాగానే భం అనే పేరుతో చెయితిప్పి నోరుకొట్టుకొని మీపితృలు స్వర్గస్థులయినా రని చెప్పవలసినది. అక్కడ పిండప్రదానము కాగానే మడుగు నిమిత్తము లేదు గనుక స్త్రీలతో కూడా సవారీల మీద యెక్కి కొండ దిగి వచ్చినాను.

యీ ప్రేతగయావళీలు గయావళుల అక్రమసంతు అనే వొక మాట వాడుకుంటారు. అసలు గయావళీల ఉత్పత్తి పయిన వ్రాసినప్రకారము బ్రహ్మయాగార్ధము ఋత్విక్కులను సృష్టించి నారని వ్రాసివుంటే గదా. వీరు ఆ ఋత్విక్కుల సంతువారని యీ గయావళీలను బ్రహ్మకల్పితబ్రాహ్క్మణు లని వారిపూజా కాలమునందు వచింప బడుచున్నది. బ్రహ్మ యాగము పూర్తికాగానే సమస్తమున్ను కావలశినమట్టుకు వీరికి యిచ్చి నప్పటికిన్ని మళ్ళీ బ్రహ్మను చాలదని యాచించి నట్తున్ను, బ్రహ్మకు కొపమువచ్చి మీకు యిచ్చినది సమస్తమున్ను వ్యర్ధమై పోగాకా అనిన్ని, మీరు విద్యారహితులై దరిద్తురులైపోదురు గాకా అనిన్ని శపించినట్టున్ను ఆపిమ్మట వారు పశ్చాత్తపులై బ్రహ్మను శరణు చొచ్చినంతలో యిక్కడ పితృకర్మాలు చేసేవారు మిమ్ములనే ఆరాధింపు చున్నారు; అందువల్ల జీవనము చేయం డని ఆజ్ఞ యిచ్చి నట్టున్ను అదే పురాణములో వ్రాసియున్నది. ఆ బ్రాహ్మణ కల్పన కాలమునందు వారికి సమానులయిన స్రీలను ఉత్పత్తి చెయలేదు గనుక యీ క్షేత్రములొ మిక్కటముగా వసియింపుచు నుండే మేదరజాతి స్త్రీలను వారు పరిగ్రహించి తద్వారా వంశము వృద్ధిఅయి నట్లున్ను అందువల్ల అవ్యాపి స్త్రీప్రజ వీరిలో వంటవార్పులకు పనికిరాకుండా బోగార్ధమునకు మాత్రము ఉపయోగింపుచు వుండేటట్టు యిక్కడా ప్రసిద్ధముగా నున్నది. యీ గయావళీలు భార్యలచేత భోజనము చెయ్యరు గనుక మన దేశము నుండి వచ్చిన అనాధస్త్రీలను స్వయం పాకమునకు కొలువు పెట్టుకొంటారు. తమస్త్రీలచేత నీళ్ళు తాగేది లేదని చెప్పడము. యీ గయావళీల స్త్రీలు యధోచిత మయిన రాణివాసము గలిగి వుంటారు. యీగయావళీలకు యెనిమిది యేండ్లలోనే వివాహమవుచున్నది. రెండోపెళ్ళికిపడుచును యివ్వడములేదు. వీరి ఆజ్ఞకు తగ్గట్టే వివాహము మొదలయిన విషయములలో వీరికిప్రయము యెక్కువగా అవుచున్నది. వీరియిండ్లలో స్త్రీప్రాబల్యము యెక్కువ అని ప్రసిద్ధి. గయాఫళీల విద్యావివేక విషయాలళొ బ్రహ్మశాపము వ్యర్ధమయినట్టు తోచలేదు. వారి ఆచారాలు యీ దేశానకు తత్కాలానుగుణముగా వున్నా మన దేశస్థులకు యేహ్యముగా నున్నది.

4 గో దినము ప్రేతపర్వతము దారిలొనే షహరుకు 2 కోసుల దూరములో సాజెబుగంజుకు చేరినట్టుగా రామపర్వత మనే కొండవున్నది. అక్కడికివెళ్ళి నాలుగు ప్రదేశాలలో నాలుగు ఆవృత్తులు పిండప్రదానాలు చేయవలసినది. కొండమీద శివమందిరము, రామమందిరమున్ను వున్నవి. గనుక ఆ అమందిరాల సన్నిధిలో పిండప్రదానము చేయవలసినది. యీకొండ యెక్కడము నిండా యెక్కుడు కారు. 140మెట్లు యెక్కవలసినది. మెట్లు నిండా పొడుగుకావు. యీ పర్వతముమీదను పిండప్రదానముకాగానే యిక్కడకూడా ప్రేతగయావళీల ప్రదేశము గనుక భం అనె ధ్వనితో వారు సుఫలము యియ్యవలసినది. యీ కొందమీదనున్ను వుదకములేదు. అష్టగయ చేయని మనుష్యులను యీకొండమీదికి కూడా రానియ్యరు. యీ కొండ దిగివచ్చిన వెనక కింద మూడు తావులలో పిండప్రదానాలు చేయవలసినది గనుక నేటిదినము దిగివచ్చే టప్పుడు పాదచారిగానే దిగిరావలశినది. యీ పిండపిచ్చులు వగయిరాలు పావుశేరు బియ్యముతో అక్కడక్కడ పిండప్రదానాలు చెస్తూవస్తే అష్టగయకు రెండురూపాయిలు వంతున యివ్వవలసినది. అర్ధశేరుకు రూపాలు 4, శేరుకు రూపాయిలు 2 దేలెక్క ప్రకారము షోడశికిప్రేతగయావళీలకు నిష్కర్ష గనుక బియ్యపుమూయినకు తగ్గట్లు తిలలు మొదలైన సామానులు యిస్తాడు. యీ దేశములో తెల్లనువ్వులు విస్తారముగా వున్నాయీ పితృకర్మాలకు వాడడము నల్లతిలలేదు. దర్భదొరకదు గనుక యీ దేశమునందు యావత్తు అతి కోమలముగా పెరిగే కుశనుప్రతిగా వాడుకుంటున్నారు. ప్రతి పిండప్రదానానికి కారుణ్యాల సహితముగా పిండప్రదానము కాగానే ధర్మపిండాలని 40 శ్లోకాలతో 4-0 పిండాలు వేయవలచినది. యీధర్మపిండాలు ప్రతి పిండప్రదానకాలందు వెయ్యవలసినది. 'పితృవంశే మృతాయేచ 'అనే శ్లోకాలతో ధర్మపిండాలు వేయవలసినది.

4 దో దినము పంచతీర్ధాలనే 4 ప్రదేశాలలో పిండప్రదానాలు చేయవలసినది గనుక 4 పిడతలు హాజ రయి వుంచున్నవి. వాటిని సాహెబుగంజు వద్దవుండే వుత్తరమానస తీర్ధానికి తెచ్చి అయిదు పిడతలలొ అన్నము ఒకసారిగా పక్వముచేసుకుని ఆతీర్ధము ఒక గుంట ఆకారముగా వుంచున్నది గనుక ఆతీర్ధము వొడ్డున నొక సారి పిండప్రదానముచేసి అక్కడ గుళ్ళోవుండే సూర్యమూర్తి దర్శనము చేసుకుని మౌనవ్రతముతో దక్షిణమానసతీర్ధము అనే సహరునధ్యైవుండే నొక పెద్దగుంటకు కడమ, నాలుగు పిడతల అన్నము పిడతలతోనే యెత్తుకుని రావలసినది. యీ రెండు మానవతీర్ధాలు రమణియ్య మయినవికావు.

ఆ దక్షిఅణ మానస తీర్ధములోనే మూడు తావులలో వుదీచితీర్ధమని, ఖనఖలతీర్ధమని, దక్షిణమానస తీర్ధమని, మూడు పేళ్ళతో పిండ ప్రదానాలు చేసి అక్కడ మందిరములో వుండే సూర్యమూర్తి దర్శనము చేసుకొని ఫల్గుని నదికి ఒక పిడత అన్నము తీసుకుని వచ్చి అక్కడ గదాధరునికి యెదురుగా పిండప్రదానముచేసి, గధాదరునికి అభిషేక పూజలు చేసి, దర్శనము చేసుకుని అక్కడికి కొంతదూరములో వుండే పితామహేశ్వరుని దర్శనము చేసుకుని, రావలసినది. రామపర్వతములో, ప్రేత పర్వతములో ప్రేతగయావళీల పూజ చేసి నట్లు యీ స్థలాలలో స్వంత గయావళీ పూజచేస్తూ రావలసినది. యీ ఫల్గుని నదికి అనేక స్నానఘట్టాలు కట్టి వున్నారు. గయావళీల యిండ్లు అనేకముగా ఫల్గునీ నదీతీరమందుకూడా శానా గొప్పలుగా కట్టివున్నవి యీగయవాళీలకు కాపురము వుండే యిండ్లు గాక పరువుకలవారు బయటకు అని కచ్చేరి కూటాలు వేరే కట్టుకుని వుంటారు. ఆప్రేత గయావళీలు యీ గయావళీలను వుపసర్పించుకొని వుంటారుగాని వారికి స్వతంత్రదశ వున్నట్టు అగుపడ లేదు. గదాధర స్వామిపూజ ప్రేతగయావళీలది. విష్ణుపాద పూజ శుద్ధగయావళీలది.

6 రో దినము, ధర్మారణ్యం బౌద్ధగయ అనే ప్రదేశాలకు పోవలసినది. యీ ప్రదేశాలు షహరుకు 4 కోసుల దూరములో వుంచున్నవి. పోయిరావడానకు అస్తమాన మవును. యీ ప్రదేశాలు క్షేత్రానికి పశ్చిమ భాగమందున్నవి. యిక్కడ ఒక గోసాయి పీఠస్థుడు జాగీరు అనుభవిస్తూ వచ్చినవారికి సదావృత్తి యిస్తూ వుంటారు. యీ స్థళము గయనుంచి కలకత్తావెళ్ళే భాటలో వున్నది. ఇక్కడ దెహబ్రహ్మవాదుల బౌద్ధగుడి ఒకటి యున్నది. అక్కడవుండే ప్రతిమలు బ్రహ్మదేశములో నుంచి జాతులవాండ్లు తెచ్చిన ప్రతిమకు సరిగా యున్నవి. ఆ గుడి చూడగా 200-300 యేండ్లకిందట కట్టినట్టు అగుపడుతున్నది. ఆ మతస్థుల ప్రబలము యెప్పుడు యీ ప్రాంత్యాల అయివున్నదిన్ని ఖుల్లముగా తెలియలేదు. యిందుకు వుత్తరము జయపురము, జోతీపురము, బిక్కానెరి అనే మారువాడి దేశాలు మొదలుగా దేహబ్రహ్మవాదుల నివాసభూమి గనుక పూర్వము ఒక కాలము నందు వారు యిక్కడ ప్రవేశించి పిమ్మట యీ కర్మ భూమియందు నిలవలేక ఖిలల్పపడి వుందురు.

యిక్కడ వుండే గోసాయి మహంతు సంత్రాసునింబూ అనే నారదపు కాలలలో అనేక లవణాలు పిప్పలి, శొంఠి, మొదలయిన జీర్ణకారి పదార్ధాలు కూరిపోశి యెండపెట్టి వచ్చినవారికి మెప్పుగా తారతమ్యము విచారించి యిస్తాడు. యీ దేశములొ ఆహార పదార్దాలు బలకరమయినవి గనుక అజీర్తిమాద జ్వరాలు వస్తూవుండుట చేత పాచక మనే మందులు కరక్కాయలు, జీలకర్ర, పిప్పళ్ళు, వోమము మొదలయిన వస్తువులను భావన చేసి అటువంటి పదార్దాలు నారదపు కాయలు మాదీఫలములలో యిమిడ్చి యిక్కడ చెయ్యడమే కాకుండా నేపాళాన్నుంచి అనెకముగా తెప్పించి అమ్ముతూ వుంటారు. ఆ సంత్రాసునింబు అనే పండ్లలో సూదులు గుచ్చి పెట్టితే సూదులు కరిగి పొతున్నవని వదంతి. యీపాచక ఔషధాల దినుసులకు యిక్కడ లెక్కలేదు. యీ ఔషదాలు జీర్ణకరములై భేదికారిగా వున్నవి.

గయావళీలు వచ్చిన ప్రభువు ప్రసన్నుడయితే అంతకు మిక్కిలి పండగ వేరే లేదు గనుక కలిగిన భూషణాదులు అలంకరిచుకుని వుండే నల్తముతొకూడా యిటువంటి పిండదానము చేసే ప్రదేశాలకు యజమానుడితో కూడా వచ్చి చేశే పూజలు ప్రతిగ్రహిస్తారు. ఒక నూత్రులయితే షోడశిని కూడా పిల్చుకుని వెళ్ళి యీ ముందు వ్రాసిన స్థలములలొ నంతా పిండదానాలు చేసి రావలసినది. ఆ బౌద్ధ గయలో జగన్నాయకుల గుడి వొకటి వున్నది. పయిన వ్రాశిన మహంతుతొట ఒకటి గొప్పదిగా నున్ను సుందరముగా నున్నది. ఈదినము నాలుగు తావులలో పైన వ్రాసిన ప్రకారము పిండదానాలు చేయడమయినది.

7 డో దినమందు లేచి తొలుదినమే బౌద్ధగయ చేశేనాడే చేస్తే నిండాప్రయాస అవుతున్నది గనుక యీదినము క్షేత్రానికి అతిసమీపముగా వుండే బ్రహ్మసరస్సుకు వెళ్ళీ అక్కడ పిండదానము చేసి కాక బలి, యమబలి, శ్వాసబలి యనే మూడుబలులు అక్కడికి సమీపముగా వుండే ఒక మంటపములో వేశి అక్కడ వుండే చూతవృక్షదర్శనము చేసి పూజచేసి రావలసినది.

యెనిమిదో దినమున విష్ణు పాదానికి సమీపముగా వుండే అష్టాదశ పాదాలమీద 12 మాట్లు ప్రత్యేక ప్రత్యేకముగా పిండదానాలు ఒక మంటపములోనే ప్రత్యేక ప్రదేశాలలో చేశి ప్రతి పాదము వద్దనున్ను నదదీప మనే ఘృతదీపాలువుంచి క్షెరతప్రణము ప్రతిపాదము మీద పితృద్దేశముగా చేయ వలసినది. యీ కృత్యము కావడానకు యీదినము అస్తమాన మవుతున్నది. ఈ స్థలాలయందు పిండ ప్రదానాలు చెశేటప్పుడు యేదేవతాత్మకముగా ఆస్థళము వుంటే ఆలోకములో అన్శత్పతృ నివాస సిధ్యర్ధం అని సంకల్పము చేయుచూ రావలసినది.

తొమ్మిదో దినమున ఫల్ఘునీశ్రాద్ధమువలేనే క్రమముగా అన్నశ్రాద్ధము విష్ణుపాద ప్రయుక్తముగా చేసి శ్రాద్ధానంతరము విష్ణుపాదము మీద పిండప్రదానము చేయవలసినది. విష్ణుపాదము మీద అశక్యముగా లోకులు పిండాలు వేస్తూ వుంటారు గనుక పిండముమీద పిండము పడకుండా రాజాధిరాజులుగ వుండే వారు సరకారుహుకుము మీద తాము పిండప్రదానము చేశి బయిట వచ్చేకొరకు యెవరినిన్ని గర్భగృహములోకి రానివ్వకుండా సరకారు మనుష్యులను వుంచి నిరోధము చేస్తారు. యిటువంటి లౌకీకప్రతిష్ట అయిన పనులు యిక్కడి జడ్జీగా వుండే మారీసు దొరగారికి, కలకత్తాలో వున్న నావిహితుడయిన మేస్తర్ మించ్చన్ దొరగారు ఒక కాకితము పంపించినంతలోనాయెడల మిక్కిలి కటాక్షము వుంచి యిక్కడవుండే సకల అధిరారము గల యింగిలీషు దొరలతో నాకు విహితము చేసి వారిగుండా కావలసిన సహాయము నాకు కరతలామలకము అయ్యేటట్టు చేసినాడు గనుక యీశ్వర కటాక్షముచేత నాకు కావలసినంతకన్నా యెక్కువ లౌకీక ప్రతిష్ట యిక్కడ సిద్ధించినది.

విష్ణుపాదముమీద పిండప్రదానము కాగానే గయావళీకి ముఖ్యముగా గోదానము చేయవలశినది. యీ విష్ణుపాదపు గుడివద్ద కొన్ని ధర్మశాలలు కట్టివున్నవి. స్థలంతరము దొరకనివారు యీ ధర్మశాలలో శ్రాద్ధాలు ఛేయుచున్నారు. యీ దినము యెక్కడ శ్రాద్ధము పెట్టినా పిండాలు తెచ్చి విష్ణుపాదముమీద వేయవలసినది.

10 దో దినమున, గయా ప్రజనానికి పూర్తిగా నటశ్రాద్ధము చేయవలసినది గనుక అక్షయ వటము కట్టివుండే ధర్మశాలలకు శ్రాద్ధయోగ్యమయినపదార్ధాలు అన్ని యెత్తుకొని వెళ్ళి ఆధర్మశాలలో పాకముచేసి శ్రాద్ధముచేయవలసినది. ఫల్గుని, విష్ణుపది, అక్షయవట శ్రాద్ధాలకు గయావళీలే బ్రాహ్మణార్ధాలు చేయవలసినది. గనుక వారు భోజనానికి రావడానకు శానా సావకాశ మవుతున్నది. వారిలో బహుమంది వుదయాన ఫలహారముచేసి వస్తారు. బ్రాహ్మణార్ధము చేస్తే రెండోసారి భోజనము చేయరాదనే నియమము వారికి లేదు. బ్రాహ్మణార్ధానికి పూర్వము సహజముగా తాంబూల చర్వణము చేయచూ వుంటారు. బ్రాహ్మణార్ధానికి వచ్చేటప్పుడు యింట్లోనే స్నానము చేసి సవారియెక్కి వచ్చి యిక్కడ వస్త్రపరివర్తనము చేసుకొని బ్రాహ్మణార్ధానకు కూర్చుంటున్నారు. హిందూస్తానులో వసించే పంచద్రావిళ్ళూ మొదలైన బ్రాహ్మలందరు స్త్రీలుసహా బోజన కాల మందు పట్టువస్త్రాలు, నారపట్టులు, ధావళ్ళు కట్టుకొని వుండడము గాని నూలుబట్టలు కట్తుకొన్నవారు పంక్తికి వచ్చింప్పటికి అశుచిగా యెంచుతున్నారు గనుక యీ గయావళీలకు అదే ఆచారము.

అక్షయవటము చుట్టు గోడపెట్టి వాకిలి పెట్టియున్నది. ప్రేతపర్వతము రామపర్వతము తప్ప కడమ పిండప్రదానాలు చేసే స్థలముల కంతా కావలసిన వారిని కూడా పిల్చుకుని పోవచ్చును. యెవరు కావలసినా ఆయా స్థలముల దర్శనము నిమిత్తము యెప్పుడు కావలిస్తే అప్పుడు పోతూ వస్తూ వుండవచ్చును. గయా వ్రజనాలు చేసి పిండప్రదానాలు ఆ యాస్థలములలో చేశేవారు సరకారులో నుంచి యిచ్చే చీట్లను అక్కడక్కడ వుండే చౌకీ బంట్రోతులకు చూపించి వారికి చీటీ 1 కి వొకపైసా వంతున యిస్తూ రావలసినది. యీఅక్షయవటము అనేకావృత్తులు సమూలముగా యెండిపోయి వేరే వృక్షౌలు కూడా బదులుకు సమీపముగా వుంచి సిద్ధము చేసినవనక హాశ్చర్య కరముగా తున్నారు. వీండ్లుపెట్టే నిర్బంధము అంతా యీవటశ్రాద్ధమునాడు, అనుఫలము యిచ్చే కాలమందు గాని మరి యెప్పుడు నోటిమాట మాట్లాడరు. పూర్వకాలమందు యీసుఫలము యివ్వకుండా లోకులకు శానా శ్రమపెట్టుతూ వచ్చినారట. యిప్పుడు తుదను నాలుగు రూపాయిలు యిచ్చినా పుచ్చుకుంటున్నారు. ముఖ్యమయిన యీ అష్టగయ చేయడానకు సకల శలవులతో కూడా అరువై రూపాయలు పట్టుచున్నవి. యీసుఫల పుచ్చుకొని అక్కడ సమీపములో వుండే గుళ్ళో ప్రసితామహేశ్వర దర్శనము చేసుకొని శ్రార్ధశేషము భోజనము చేసుకొని వారి వారి పరువుకొద్ది విభవములతోనున్ను, మేళతాళములతోనున్ను వచ్చి విష్ణుపాదగదాధర దర్శనము చేసుకొని యింటికి రావలసశినది.

యీ అక్షయవటము వద్ద ధర్కశాలలో గయావళులు తప్ప యితరులు భోజనము చేయకూడదని ఒకకట్టు కట్టుకొని శ్రాద్ధశేషము కర్తను తప్ప మరి ఒకరిని అక్కడ భోజనము చేయనీయకుండా అంధపరంపరగా యీవరకు జరుగుతూ వచ్చినది. యీశ్వర కటాక్షముచేత నేను గయా మహాక్షేతములో వుండేవరకు అన్నసత్రాలు లేనందున పంచద్రావిళ్ళు అయిన మన దేశస్థులు 30 కి తక్కువ లేక నిత్యము నాతో సహపంక్తిగా భోజనము చేయుచూ వచ్చిరి గనుక వారు అందరు నామండలితో కూడా ఆ ధర్మశలలో పిండప్రదానానంతరము భోజనము చేశేటట్టు ఘటన అయినది. పునా శ్రీమంతుడు కూడా యీపని చేయనేరక శ్రాద్ధానంతరము విడిదికి భోజనానికి పోయినాడు, యీ పని యీ పురుషుడికి జరిగిన దని బ్రాహ్మణ మండలి సంతోషపడేటట్టు యీశ్వరుడు కటాక్షించినాడు. యిందుకు కారణము నా గయావళి అనుకూలము ఒకటి: మేజస్ట్రేటు కొత్తవాలును కూడావుండేటట్టుగా వుత్తర్వు చేసినంతలో ఆకొత్తవాలున్ను నూటికి బంట్రోతులతోకూడా హాజరు భాషిగా నావద్ద వున్నందున యీపని జరిగినది. యిక మీదు అక్షయవటము కింద అనేకబ్రాహ్మణభోజనాలు జరుగుతూ రావచ్చును. యీ అక్షయవటము షహరుకు అరకోసు దూరములొనే వున్నది.

11 డో దినము అష్టతీర్ధాలని రామగయ అనే కొండకింద మధుస్రవ అనే స్థలములోనున్ను, గయాశిరసి అనే తెర్ధములోనున్ను కూపగయ అనే బావివద్దనున్న, మృడవృష్ఠం అనే స్థలములోనున్ను, భీమగయ అనే స్థలములోనున్ను, గోష్పదం అనే స్థలములోనున్ను, వైతరణి అనే స్థలములోనున్ను అంతు పదిస్థలములలో ప్రత్యేక ప్రత్యేకముగా పిండప్రదానములు చేయవలసినది. యిది అష్టగయాశ్రాద్ధముటొ చేరిందికాదు. యివి అన్ని ఉపతీర్ధములు. ఇటువంటివి సహస్రావధి తీర్ధములు వున్నవి. వాట్లలో నంతా చేయడానికి మనుష్యులకు ప్రయాస అని గదాధరరూపముగా గయావళి అక్షయవట శ్రాద్ధము నాడు సుఫలము యియ్యడము గనుఇక గయావళీలలో ప్రముఖముగా వుండే వారంతా నాయెడల జడ్జీ మొదలయిన దొరలు ప్రీతిగా వుండేది చూచి మీరు అందరింవలెనే అష్టతీర్ధములు చేయనక్కర లేదు. రామసాగర మనే గొప్ప తీర్ధము ఒకటి దొరలు ఆక్రమించుకొని సంకిళ్ళవాండ్లుగుండా మరామత్తు చేయింపు చున్నారు. ఆ తీర్ధము క్షేత్రానికి మధ్యే వున్నది. ఆ తీర్ధము దొరల అధీన మయిపోతే మాకండ్లు తీసివేసినట్టు అవుల్చున్నది. ఆ తీర్ధమువద్ద యెవరినిన్ని పిండప్రదానాలు చేయనివ్వడములేదు. మీరు దొరలవద్ద సెలవు తీసుకొని ఆ రామసాగర తీర్ధము వద్ద పిండప్రదానము చేసినట్టయితే అన్ని ఉపతీర్ధములలో పిండప్రదానము చేసిన దాని కన్న యెక్కువ ఫలము సిద్ధింపుచున్నదని చెప్పుకొన్నందు చేతనున్ను, నామనివి దొరల వద్ద అప్పట్లో సాగేటట్టుగా ఈశ్వరుడు కటాక్షించి వున్నందున మారీసు దొరగారితో మనివి చేసినంతతో వారు మేజట్రేటు జాంసన్ దొర గారితో యోచించి ఆ తీర్ధము వద్ద హిందువులు పిండప్రదానములు చేయడము ఫలాని ప్రదేశమని నిశ్చయించి అక్కడ నున్ను పిండప్రదానము చేశేటట్టు వుత్తర్వు చేశినారు. గనుక అన్ని ఉపరీర్ధాలకు బదులుగా గయావళీల సమూహము అప్పట్లో అక్కడ కూడినది గనుక వారి సన్నిధిని ఆ రామసాగరములొ పిండప్రదానము చేసినాను. ఆ మరుసటి దినమే మరి ఒక గొప్పవాడు యీ దేశస్థుడు

వాడి గయావళీ ప్రేరేపణ మీద నావలెనే అష్టతీర్ధములకు ప్రత్యామ్నాయముగా రామసాగరములో పిండప్రదానము చేశినాడు. నాతో కూడా వచ్చిన మండలిమాత్రము యధావిధిగా అష్ట తీర్ధములలో నున్ను పిండప్రదానములు చేసిన వారయినారు.

12 డో దినము న్యూనపరిపూర్తి విష్ణుపాద శ్రాద్ధమని ఒక శ్రాద్ధము ఛేయవలెను. మనవారు దానికి శుద్ధ శ్రాద్ధమని పేరు పెట్టి పంచద్రావిళ్ళున్ను తమ వారిని బ్రాహ్మణార్ధము చెప్పి రెండో సారి విష్ణు పాదము మీద పిండప్రదానము చేయుచున్నారు. నేనున్ను అదే ప్రకారము ఛేసినాను. యీ శ్రాద్ధానకు గయావళీలు బ్రాహ్మణార్ధము చేయ నిచ్చయించడము లేదు. వారి వారికి యిష్టమైన వారిని బ్రాహ్మణార్ధము చెప్పుకొనేటట్టు అనుజ్ఞ యిస్తున్నారు. ఈ ప్రకారము రెండుమాట్లు విష్ణుపాదము మీద పిండ ప్రదానము చేశే టందుకు, పూర్వము, అభిషేక పూజలు చేయవలసిన విధి గనుక శ్రీరములవారు నాకు కావలసినంత సేపు గర్భగృహములో నా పరివారము యేకాంతముగా వుండేటట్టు కటాక్షించినాడు గనుక యాభైయింటికి బ్రాహ్మణులను గర్భగృహములో జమ చేసి పురుషసూక్తముతో అభిషేకము యధావిదిగా చేసి లక్ష తులసీదళములు అర్చన చేసి ఆ తులసీ రాసిమీదనే పిండప్రదానములు రెండు ఆవృత్తులు విష్ణు పాదము మీద చేసినాను. యీ విష్ణు పాదము చుట్టు తొట్టి కట్టి వుండగా ఆ తొట్టికి తంజావూరి రాజు వెండి తగుళ్ళు కొట్టించినాడు. ఆ తొట్టి నిండేటట్టు శ్రీమంతుడు 160000 వేల రూపాయిలు పోయిన సంవత్సరమున యీ దినముల లోనే అందులో పోసి గయావళీలకు పంచిపెట్టినాడు. యీ గయావళీలకు యీ లాగు ప్రవాహమువలె ఆర్జన కలిగియున్నా బ్రహ్మదేవుడు నిత్య దరిద్రులుగా వుందురు గాక యని యిచ్చిన శాపము వారియెడల సత్యముగానే వున్నట్టు అగుపడుచున్నది.


13 డో దినము ఫల్గునినదిలో సాత్రియనే మడుగులో ప్రాత స్నానము చేసి దగ్గిరవుండే గుడిలో ప్రకాశింపుచున్న గాయత్రీదెవతా దర్శనముచేసి అక్కడ అదివరకు ప్రాతస్సంధ్యలను కాలాతీరముగా కలిగి కుదురుగా ఒక స్థలములోనే వుండుకొని సద్వ్యాపారముతో కాలము తోయవలెనని తలిస్తే అలాటివారు కన్నతావులలొనున్ను తిరగసాగితే పుట్టిన నిశ్చయము భేదించి పోవును గనుక అందుకు యోగ్యమయిన స్థలమును ఒకదాని యేర్పరచి అక్కడ చేయవలసిన కృత్యముల నున్ను యేర్పరచి తద్ద్వారా మోక్షము క్రమక్రముగా కలుగు నని బోధచేస్తే మనుష్యుల బుద్ధికి చాలా స్వస్థ్వము కలుగును గనుక యీ కాశీమహాత్మ్యము అలాటి వారికి వుపయోగింఛే లాగు యేర్పరచినా రని తోచుచున్నది.

గయా మహాత్మ్యమును గురించి యోచిస్తే లోకమందు తల్లి దండ్రులు మొదలయిన రక్త సంబంధికుల మీద అత్యంతమయిన ప్రీతి కలిగియుండవలసినది గనుకనున్ను, జరామరణాదులు యెప్పుడు సంభవింఛెదిన్ని యెవ్వరికిన్ని తెలియరాదు గనుకనున్ను అట్టి రక్త సంబంధికులు దేహము చాలించినంతలో వారు బ్రతికి వుండగా చేయవలసిన సత్కారములు చేయ డానకు వల్లపడక పొయివుండినా, చేసినది చాలదని తోచినా, వారి ఋణము మనమీద నిలిచిపోయెనే అనే పశ్చాత్తాపము కలవారికి అటువంటి రక్త సంబంధికుల మరణానంతరము వారిని తరింప చేసే వుపాయము ఒకటి వున్నదని తెలిస్తే ఆ పనిచేసి మన ఋణము తీర్చుకుంటిమి గదా అని మనస్సుకు ఆనందము పుట్టించవలసినది అగత్యము గనుక యీ గయా మహాత్మ్యము అటువంటి వారి విషయ మయి ప్రకటనము చేసినారని తోచబడుచున్నది.

సకల స్వరూపుడుగా నున్ను సర్వాంతర్యామిగా నున్ను వుండే దేవుడు వొక్కడే గనుక యే రూపము మీదనయినా భక్తి జనియించి దృఢమయిన బుద్ధితో యెటువంటి ఆరాధనను చేసినా సంతుష్టిపడి 'యేక మేవ ' యనే శృతి ప్రతిపాదితు డయిన 'అద్వితీయ బ్రహ్మా' అంగీకరించు నని తలచి మానుష సామాన్యబుద్ధికి ప్రీతివిశ్వాసములు జనియించతగిన రూపములు కల్పించి ఆ రూపముగానైనా పరమాత్ముడి ఆరాధనలను మనచేత చేయించ తలచి పూర్వికులు యిట్టి స్థలమాహాత్మ్యాలను ప్రకటన చేసినా రని తోచబడుచున్నది. న్నవి. సుగంధము కల పూలలో పన్నీరు పూలు ఒక దినుసు, జాజిపూలు ఒక దినుసు, సబురాపూలు అని ఒకదినుసును; యివి తప్ప కడమ దొరికే పూలు అన్ని చూపులకు అలంకారముగాని సుగంధము కలవి గావు.

యీ గయా మహాక్షేత్రములో చెప్పే సంకల్ప క్రమము యీ అడుగున వ్రాయుచున్నాను. నెం.28. 'వైవస్వత మంవంతరే, మేరో, దక్షిణ దిగ్భాగే, ఆర్యావర్తాంతర్గత మధదేశే గయా గదాధర క్షేత్రే, కోలాహలపర్వతే, మధువనే, విక్రమశకే, బౌద్ధావతారే, బార్హల్స్పత్యమానే, ప్లవనామసంవత్సరే, ఆత్మహితైకోత్తరశతకులొద్ధారణార్ధ 'మని చెప్పుచున్నారు.

ఈ మగధదేశములో వుండే మహాస్థలములు:--నెం.29. గయ 1, రాజగృహి 2, పవనాశ్రమం 3, పున: పున: 4, లోహదండం 5, వైకుంఠం 6, ఈ మహాస్థలములకు యాత్రార్ధము వస్తే రావచ్చును గాని నిర్మిత్తముగా యీ దేశానకు కర్మకులు రాకూడ దని పూర్వీకులు పురాణసిద్ధముగా నియమించి వున్నారు.

కాశీ నుంచి గయకు రావలసిన దారిని నేను రాకపోయినా విచారించి ఆ దారి మజిలీ వూళ్ళు క్రమముగా వ్రాయుచున్నాను: నెం.30. మొగలుసరాయి కోసులు 5, కఫనాశిని కో(సులు) 7, మోఘనాసరాయి కో.7, సహస్రాం కో. 12, నాసరుగంజు కో.10, పున:పున: కో 7, పదాన్ పూరు కో 9, గయ కో 5, అంతుకోసుల 62.

యీ గయా షహరులో నల్లరాతితో చెంబులు; గ్లాసులు, తట్టలు, ప్రతిమలు మొదలయిన స్వరూపాలు బహుకుదురుగా చేసి అమ్ముతూవుంటారు. అనేక విధములయిన విగ్రహాలు విత్తళి(ఇత్తడి)తో పోసి అమ్ముతునారు. విష్ణు పాదాలు తామ్రరేకులతోను, వెండితోను అనేక దినుసులుగా చేసి అమ్ముతూ వున్నారు. యిక్కడికి సమీప మయిన రాజగృహి కొండలవద్ద నున్ను, టంకారి అనే వూరి కొండవద్ద నున్ను స్ఫటిక శిలలు పుట్టు చున్నవి గనుక వాటిని స్ఫటిక మణులుగా నున్ను, శివలింగాలుగా నున్ను చేశి యీ గయా క్షేత్రములో అమ్ముతూ వుంటారు. అండవాయువులు యింగిలీషువారు చెన్నపట్టణములోవశిస్తూ వుండగా వారికి లేక నల్లవాండ్లము మాత్రము ఆ భూమిలో కలగడ మే మని కొందరు దొరలను అడిగివుంటిని. వారు దీన్ని గూర్చి యోచించి తమ డాక్జ్టరులు అందరున్ను కూడి నిశ్చయముచేసిన తీర్పుసంగతిని నాతో చెప్పినారు. అది యేమంటే యౌవనప్రారంభాత్పూర్వమే నల్లవాండ్లు స్త్రీభోగములలో ప్రతివర్తింపుచున్నారు గనుక స్త్రీ సంచారము మిక్కటము కావడమే అండవాయువు ఉపద్రవము కలుగుటకు కారణ మని నిశ్చయించినారట. ఆ కారణమువల్లనే యీ మగధ దేశములో అండవాయువులు విస్తరించివున్న వని విచారణమీద తెలిసినది. కాబట్టి చెన్నపట్టణానుభవముచేత నున్ను, మగద దేశపు వర్తమానము తెలిసినందుననున్ను, డాక్టరులు చెప్పినయోచన సరే నని నిశ్చయించడమయినది.

యీ దేశపు రేగుపండ్లు బహు యోగ్యములుగా వున్నవి. నిడువు అందముతో పొట్టివిత్తులు కలవిగా అతి మాధుర్యము గలిగి పురుగులు లేకుండా వున్నవి. యీ పండ్లు అమితముగా అమ్మడము కలిగి వున్నది. యీ దేశమంతా తట్టలతో భోజనము చేయుచు నుండడమున్ను, మర్రిచెట్టు పూరార్హముగా వుండడమున్ను, యిప్పపూలతో సారాయి దించడమువల్ల వాటి ఆకులు కోయడము లేక వుండడమున్ను మోదుగచెట్లు విస్తరించి లేక వుండడమున్ను యిక్కడా కలిగి వున్నందున పట్టణములలో కూడా విస్తళ్ళు దొరుకుట ప్రయాస ముగా నుండును. దొరికినా భోజనయోగ్యములుగా వుండవు. చేసుకొని వుంచుతూ రావలసినది. హిందూస్తాన్ యావత్తున్ను రొట్టెల వలెనే అన్నమునున్ను ప్రతిదినము భోజనము చేయుచున్నారు. గనుక చింతపండు మిరపకాయలు మొదలయినవి సహజముగా యెక్కడపడితే అక్కడ దొరుకుతూ వచ్చుచున్నవి.

యిక్కడి రూపాయి 1 కి పయిసాలు 34. పయిసా 1 కి గవ్వల పుంజీలు 24. పుంజీ 1 కి గవ్వలు 4. కట్టెలు మొదలుగా సకల పదార్ధాలున్ను తూనికెమీద అమ్ముతున్నారు. తూనికె క్రమము: శేరు 1 కి సుమారు యెత్తు ర్పు 80. దాన్ని 20 గండాలు అనుచున్నారు. గండా అనగా 4 రూపాయల యెత్తు, కొన్ని తావులలో శేరు 1 కి 18 గండాలు; కొన్నితావులలో 24 గండాలుగల శేరు వున్నది. కొన్ని తావులలో 22 గండాలుగల శేరు వున్నది. యీ గండాలు శేర్లు 1 కి ఎన్ని అని తెలుస్కున్ని వస్తువులు బేరము చయవలసినది. మణుగు 1 కి 40 శేర్లు, శేరు 1 కి చికాకులు 16. అంగళ్ళలో వుండే తూనిక గుండ్లు యేవంటే శెరు అనే గుండును, పక్కాశేరు అనే అయిదు శేర్లగుండు 1, చికాకులగుండ్లు కొన్ని కొన్ని వున్నవి. కట్టెలు, బియ్యము మొదలయిన గొప్పతూనికెలు మణుగు పండ్లతో తూచుదున్నారు.

పంచగయలు చేసే క్మర మేమంటే ఫల్గునీ శ్రాద్ధము యధాప్రకారముగా ముందర ఛేసి పయిన వ్రాసిన పంచతీర్ధాలలో పిండప్రదానములు చేసి అటుతర్వాత మూడోదినము విష్ణునదీ శ్రాద్ధము పయిన వ్రాసిన రప్రకారమే వెరవేర్చి నాలుగోదినమందు విష్ణుపాదపు గుళ్ళోనే మరివొక వటవృక్షము వున్నది. గనుక అక్కడి దర్మశాలలో శ్రాద్ధము చేసి ఆ వటవృక్షము కింద పిండప్రదానము చేసి గయావళీవద్ద సుఫలము పుచ్చుకోవలసినది. ఏకోద్దిష్ణము చేసేక్రమము మొదటి దినము ఫల్గునీశ్రాద్ధముచేసి రెండోదినము విష్ణుపదీ శ్రాద్ధముచేశి విష్ణుపాదము మీద పిండప్రదానము కాగానే గయావళీవద్ద ఆ విష్ణుపాదము వద్దనే సుఫలము పుచ్చుకోవలసినది. ఫల్గునీ శ్రాద్ధము చేయవలసిన క్రమ మేమంటే ఫల్గునీశ్రాద్ధము మాత్రము ప్రధమదినము చేశి ఫల్గునిలో పిండప్రదానము కగానే గయావళీ వద్ద ఫల్గునీనదిలో సుఫలము పుచ్చుకొని పిండములు ఫల్గునీనది చెలమలలో కలిపి వెయ్యవలశినది. యీ నాలుగు క్రమములుకాక వేరేవిధమయిన గయాప్రజనక్రమము లేదు. గనుక నాతోకూడావచ్చిన బ్రాహ్మణ మండలిచేత నంతా అష్టగయా వ్రజనము చేయించి, గయావ్రజనము ఛేయను శక్తిలేక గయలో కాచి యున్న ద్రావిడ దేశస్థులయిన బ్ర్రాహ్మణులచేతనున్ను, నాతోకూడా వచ్చిన బోయీలు బంట్రౌతులు వగయిరా శూద్రుల చేతనున్ను ఏకోద్దిష్టమనే గయావ్రజనము చేయించినాను.

యీ గయామహాక్షేత్రము రాజా మిత్రజితశింగు అనేవాడి జమీందారితో చేరినది. వారి నివాస్థలము టంకారి అనే వూరు, గయకు పదికోసుల దూరములో వున్నది. యితను బహు సంపత్తుగలిగి యున్నాడు. యితని జమీందారికి యితడు కుంఫిణీకి కట్టే రూపాయలు సాలు 1 కి మూడు లక్షలు యితని రాజ్యములో యితనికి యాభై లక్షల రూపాయలు సునాయాసముగా కనుబడి అవుచున్నది. యిదే రీతిగా యీ ప్రాంత్యాల వుండే జమీందారులంతా అపరిమితమయిన లాభమును అనుభవింపుచు సుఖముగా నున్నారు. యింత లాభమునకు కారణ మేమంటే యాభై అరువై యేండ్ల కిందట యీ హిందూస్తాన్ రాజ్యము కుంఫిణీ వారికి స్వాధీనము కాగానే నాలుగు పక్కల శత్రుసమూహాలు నిండివుండెను గనుక రాజ్యములు తమ స్వాధీనానికి వుపర్యుపరిగా వచ్చేకొరకున్ను వచ్చిన రాజ్యము పరాక్రాంతము గాకుండా స్వాధీనములో వుండేకొరకున్ను లార్డు కారన్ వాలీసుగారి వుత్తర్వుమీద అప్పట్లో యీ జిల్లాలకు వచ్చిన కలకటరులు పూర్వము వున్న జమీందారులకే యావత్తు భూమినిన్ని తేలికెగా జమాబంది యేర్పరచి యుద్ధప్రసక్తులు తమకు కలిగి నప్పుడు మంది మార్బలములతొకూడా (కాలు బలము)కావలసిన రస్తుసామగ్రీలను ప్రతి జమీందారుడ్లున్ను కుమ్మక్కు చేయవలెనని వొక ఖరారు చెసుకొని భూమిని జమీందారుల వశము ఛెసినారు. అటువంటి సయాయములు వీరివల్ల కుంఫిణీ వారికి యీ వరకు నిమిత్తము లేకుండా తమ పరువుకు కావలసినంత శిబ్బందిని వుంచుకొని గజాంతైశ్వర్యములు జమీందారు లందరున్ను అనుభవింపుచు కాలము తోయుచున్నారు.

యిక్కడి భూమివాటము మామిలియతు వాటము, రహితుల క్షేమము వారి ప్రారాపత్యాలఖుల్ల నున్ను యేమంటే యీ హిందుస్తాన్ లో భాను అని ఒక భూమి కొలతకర్ర కద్దు. ఆభాను అనే వెదురు పంటలలో అభినిమందు గోధుమలు యవలు యివి నిండా వెలగల వస్తువులు.

అభిని మందు గసగసా కాయలమీది బంక. ఆ కాయలను పోస్తుకాయ అంటారు. యీవస్తువులు ఫలింఛే కాలము యిదే గనుక గయ చుట్టూవున్న పట్నా నుంచి గయకు వచ్చే దారిలో నున్ను పైన వ్రాసిన వస్తువులు అమితముగా ఫలించియున్నవి. పోస్తుచెట్లు వూళ్ళవద్ద వేస్తారు గాని యిండ్లకు దూరమైన పొలములో వేయరు. పోస్తుచెట్లు అరిటిచేట్ల రీతుగా మొద్దుకట్టి వుండును. ఆ యేన్ను మొద్దుకు నాలుగు పక్కలా ముల్లంగి ఆకులవలెనే దళసరిగా ఆకులు వేసుకుని వచ్చి ముల్లంగి చెట్టంత పొడుగు కాగానే కాడవంటి యెన్ను తీసి యెన్నుకొనను తెల్లని పుష్పములు పుష్పించి రేకులు రాలిన వెనక పత్తికాయలవంటి పిందె బుట్టుచున్నది. అరటి పువ్వందముగా వెలపటి కాయ రవంత పెద్ద పెరగగానే కాయ వూర్ధ్వముఖ మవుచున్నది. ఆ కాయ నిమ్మకాయ కన్నా యెక్కువ గాత్రమయ్యేది. ముక్కాలు వాసి కాయ కాగానే మూడు సూదులు ఒక కట్టగా కట్టుకుని నాలుగు ఆవృత్తులుగా కాయకు నాలుగు పక్కలా మూడేసి గీట్లుగా గీస్తారు. గీచిన మురసటిదినము ఆ గీతలమీద మునగబంక వర్ణముగా మెత్తని బంక పుట్టు చున్నది. వాటిని కత్తులతో గీచి కుంఫిణీవారికి శేరు 1 కి రూపాయలు 4 వంతున యిస్తారు. మరి ఒకరికి రహితులు అభినిమందు యియ్యకూడరు.

ఈ మందు యీ హిందూస్తాన్ లో అయ్యేదంతా శేఖరం చేసే కొరకు పట్నాలో సర్ చర్లీస్ చార్లీన్ డాలిబ్యార్డు అనే గొప్ప దొరను వుంచివున్నారు. నభినిమందు విషయాన్ని గురించి అతను మేమి వ్రాసినా కలకటరు మొదలయిన అధికారస్థులు శిరసావహించి నడవవలసినది. ఆ దొర ములుకుగిరి తిరుగుతూ వుంటాడు: ఆ పోస్తుకాయలు చేతికి మెత్తగా వుంచున్నవి. కోస్తేలొపల కిత్తిలిపండువలె తొలలుగా చీల పోతున్నవి. ప్రతి తొలమీదా గసగసలు ఈశ్వరుడు కూరిపోసివున్నాడు. పోస్తు కాయలు పొలము చూచి నప్పుడు గోడుగులవంటి శుద్ధధావళ్యముగల పూలతో బహుశృంగారముగా చూడ వేడుకగా వుంచున్నది. మధ్యే ఒక్కొక్క యెర్రవర్ణపు పూలున్ను సకృత్తుగా పూచియుంచున్నవి.

గోధుమలు, జవ అనే యవలున్ను వరిపయిరు వలెనే పెరిగి తోకవడ్లవలెనే యెన్నులు తీయుచున్నవి. గోధుమ యెన్నులు కురచగా నున్ను, గింజలు గుండు అందముగానున్ను జడ అల్లినట్టుగా వుంచున్నవి. యవయెన్నులు తోకవడ్ల యెన్నులకు అన్ని విధాలా సరిపోలి వుంటున్నవి. యీదేశపు గౌడ బ్రాహ్మలందరున్ను అభిని మందు, బంగాకు దాని జడలున్ను సహజముగా అంగీకరిస్తారు.

యీ గయా మహాక్షేతములో కాశివలెనే అడుగడుగుకు లింగాలు లేకపోయినా శానా గుళ్ళు తీర్ధాలకు నాలుగు పక్కలా వున్నవి. అందులో ముఖ్యముగా మంగళగౌరి యని వొక శక్తి గుడిన్ని గయాసురి అనే శక్తి గుడిన్ని వున్నవి. యీ రెండు గుళ్ళలో తామసారాధన లయిన బలిప్రదానాలు జరుగుచున్నవి. యీ మంగళ గౌరి యనే దేవిగుడి అష్టాదశ పీఠాలలో ఒకటి యని వాడుకుంటారు. యీ గయా మహాక్షేత్రములో ఫిబ్రవరి నెల 14 తేదివరకు వాసము చేసినాను.

పదియేడవ ప్రకరణము

ఫిబ్రవరి నెలె 14 ది మధ్యాహ్నము 12 ఘంటలకు ఆ క్షేత్రము వదిలి ప్రయాణమై లోగడి దారిగానె మళ్ళీ 12 తేది పట్నాషహరు ప్రవేశించినాను. నేను మైహరు అనే వూరు వదిలిన వెనక యీ నెల14 తేదివరకు యెక్కడా వొక చినుకయినా పడ్డది కారు. శివరాత్రి ముందు వెనకలుగా యీ దేశములో వర్షము కురియడము వాడికె గనుక సివరాత్రి ముందు వెనకలుగా యిక్కడ మంచివర్షాలు కురిశినవి. యీకాలమందు కురిశే వర్షము కూడా ఘనీభవించి రాళ్ళ వాన కురియడము కద్దట. ఆదేప్రకారము యీ చుట్టుపక్కలా తూర్పు గాలి సహితముగా రాళ్ళవాన కురిశినట్టు విన్నాను. ఆ రాళ్ళు భూపతన మయిన రెండు గడియలకు కరిగి పోవుచున్నవట. యీ వానలు యిక్కడికి గోధుమ వగయిరా పయిరులకు నిండా విరోధము. అకుటోబరు నెల ఆఖరు మొదలు ఫిబ్రవరి 15 తేది పర్యంతము చలియొక్క బాధ ఒకటేరీగిగా వుండినది. పిమ్మట చలిబాధ విడిచినట్టు తోచగానే యెండలు తీక్ష్ణము కాసాగినవి. యీ వాన కురియకపోతే చలి శుద్ధ ముగా నివర్తించునట. యీ వానవల్ల వైశాఖమువరకు వుదయకాలమందు కొంచము చలి వుపద్రవము వుంటూ వచ్చునని యీ దేశస్థులు చెప్పినారు. యెట్లా శీతము యెక్కునో, అట్లా యెండయున్ను ఆ కాలములో అంత యెక్కువగా వుంచున్నదనివిన్నాను. యీ వుష్ణకాలానికి భయపడి లార్డు వుల్లియం బెంటిక్కుగారు నెపాళ దేశములో వుండే సముద్రోదకానికి పైన 27000 అడుగుల పొడుగుగా యీ బ్రహ్మాండాని కంతా వున్నత పర్వతమైన హిమాలయ పర్వతానకు యెండకాలపు కాలక్షేపము కొరకు వెళ్ళినారు. ఫిబ్రవరి నెల 18 తేది మొదలు కొని మార్చి 4 తేదివరకు వర్షప్రతిబంధకము చేతనున్ను బజరా పుల్లాకులు అనే వాడలను కుదుర్చుకోవలసి సావకాశముగా పట్నా షహరులో వసించినాను.

మార్చి నెల 5 తేది సాయంతరము పట్నాషహరు వదిలి 14 దాండ్ల బజరా ఒకటి బంగాళాకు బాడిగె 112 రూపాయలకు కుదిరి వుండగా దానిమీద సహకుటుంబముగా సవారి అయి 70 రూపాయిల బాడిగెకు పుల్లాకి యనే పడవ వొకటి కుదిరి యుండగా దాని మీద బోయీలు, కళాసులు, డేరాలు మొదలయిన సామానులను యెక్కించి ప్రయాణమైనాను. హిందుమతము యొక్క బాహ్యపు చిన్నెలు చూచి హిందువులు తెలియక చెడిపోతారనే తాత్పర్యము యిప్పట్లో యీశ్వరాజ్ఞ వల్ల హిందువులను యేలే ఇంగిలీషు జాతివారికి నిష్కర్షగా తోచివున్నది. అటువంటి తాత్పర్యము వారికి కలగడము యీ సరికి నేను వ్రాసిన హేతువులవల్ల యెంత మాత్రమున్ను వింతకాదు. గండకెగంగాసంగమ ప్రదేశములో యిక్కడ హరిహరాదుల గుళ్ళు రెండువున్నవి. అక్కడ సంవత్సరానికి ఒకసారి మహోత్సవము జరిగి లక్షావధి ప్రజ వస్తు శ్రీ శైలనాధునికి సమమవునా శ్రీకాళహస్తి నాధునిన్ని యుక్తులు చెప్పి శైవవైష్ణవులు మొదలయిన హిందువులు వారలలో వారే పోట్లాడ సాగుతూ వుంటే 3000 ఆమడ దూరములో నుంచి వచ్చిన యింగిలీషువారు హిందువులను జూచి నవ్వక అంతస్తత్వము విచారించే వోపిక త్వరలో యెట్లా కలుగును! గనుక పూర్వీకుల తాత్పర్యము యీ కర్మోద్ధారణ విషయములో యేమైనదంటే నిప్పులో నీళ్ళు పుట్టినట్టయినది.

పట్నాషహరు వదిలిన వెనక మార్చి నెల 2 తేది మూంగేరి (మాంఘీర్) అని యిప్పుడు లోకప్రసిద్ధిగా వుండే పూర్వపు ముద్గలాశ్రమము ప్రవేశించినాను. గంగామహానది సర్పము నడిచినట్టుగా అనేక తిరుగుళ్ళుగా ప్రవహింపుచున్నది. మూంగేరి ముందుగా గంగ నడమ చిన్నతిప్పలు రెండు వున్నవి. ప్రవాహకాలమందు ఆ కొండతిప్పలు ముణిగిపోను గనుక పడవలకు గుర్తు తెలిశే నిమిత్తము వాటిమీద రెండు కొడిస్తంభములు నాటివున్నారు. మూంగేరి ఖసుబా కలకటరు వగైరా అధికారస్థులు వుండే స్థలము. సకల పదార్ధాలు దొరుకును. గొప్పయిండ్లు, ఒక చిన్న కోట కలదు. జాతులవాండ్లు కొన్ని బంగాళాలు ముచ్చటగా కట్టివున్నారు. యీ షహరులో నేమి యీ చుట్టు ప్రాంత్యాలలో నేను మూంగాచీర అనే పట్టు నారమళ్ళు నేశి మన దేశానకు రావడము; యీ బట్టలను మూంగేరి చీరలనడానకు మూంగాచీరలని అభావముగా ప్రఖ్యాతి అయినది. ఆ బట్టలు యుక్కడా శానా నయము.

యిక్కడ మాకు పడవతోశే మల్లాలకు కావలశిన భక్ష్యయోగ్య పదార్ధాములు పుచ్చుకొని సాగిపోయి యిక్కడికి 4 కోసుల దూరములో వుండే సీతాగుండ ప్రదేశానకు సమీపముగా పడవలు నిలిపీ సవారీలతో రెండుకొసుల దూరము వెళ్ళి అక్కడవుండే సీతాగండదర్శనము చేశి స్నానపానాదులు చేసినాము. ఆ సీతాగుండము సుమారు 30 అడుగుల చదరముతో తిరుకొలను వలె కట్టివున్నది. వుదకము బహు నిర్మలముగా వున్నది. వుదకముకింద రాతిగొట్టు కొండరాతిలో వూటపుట్టి తిరుకొలనులో పెట్టివుండే తూముగుండా వుదకము బయట పారుతున్నది. తిరుకొలను వదిలి 100 బారల దూరము పొయ్యేదాకా వుదకము యొక్క వుష్ణము యెక్కువ గనుక చెయి నిండాసేపు వుంచ సహ్యముకాదు. తిరుకొలనులో వుదమము మీద పొగలు పారుతూ వుదకమునద్ది మెట్లను వుష్ణము చేయుచూ కిందమంట వేస్తే తపిలలోని వుదకము పొంగుతూ వుంచున్నది. లోకులు పూజార్ధము ఆ కొలనులో బియ్యము వేస్తారు. ఆ బియ్యము రెండు మూడు దినములకు నాని తూముగుండా బయిటికి వస్తున్నది గాని పచనము కావడము లేదు. యల్లీసు దొర కోడిగుడ్డును యీ వుష్ణోదకములో వుంచితే పక్వము కాలే దని వ్రాశినాడు.

యీ వుదకము యేప్రల్ నెలలో వచ్చే శ్రీరామనవమి మొదలుకొని యిక్కడా వర్షాకాలము ఆరంభమయి శ్రావనమాసము దాకా శీతకరముగా వుండి వర్షప్రదము కాగానే వుదకము మళ్ళీ వుష్ణము కాసాగి శీతకాలమునందు చెప్పితీరని వుష్ణమవుచున్నదట. యిక్కడ సంవత్సరానికి వకసారి అయ్యే వుత్సవములో బహు జనసమ్మర్ధము చేత మనిషి కాలుజారి ఆ కొలనులో పడితే చర్మమువూడి నాలుగయిదు దినములలో దేహమునకే అపాయము వస్తున్నదట. యిప్పట్లో ఆగుండములో నుంచి ముంచిన ఒక కుండ గంగలో సుమారు రెండు కుండల చల్లని గంగపోసి చల్లర్చి స్నానము చేసినాను.

ఆ తీర్ధానికి చుట్టున్ను రామగుండము లక్షమణగుండము అనే తీర్ధములు నాలుగు అయిదు కొలనుల వలెనే కట్టియున్నవి. వాటి వుదకము చల్లనే గాని, వుష్ణముకాదు. వాటి వుదకము వూటే గాని సీతాగుండమువలె వుదకము వుదకము నదివలెనే సదా స్రవింపుచు పారడములేదు. యీ వుష్ణోదకము కనిపెట్టకూడని వొక సువాసనగా వున్నది. అది నిండా మాధుర్యము లేకపోయినా పానానికి సహ్యముగా వున్నది. పానానంతరము నోరు కొంచెముగా పుల్లగా వుంచున్నది. స్నాన పానానంతరము ఒకవిధమయిన సువాసన మన దేహాన్ని అనుసరించి కొంతసేపు వచ్చే వుచ్చ్వాస నిశ్వాసాలతో తెలియవచ్చుచున్నది.

నల్సెటిర్ యేసిడ్ అనే గంధక ద్రావకము వుదకములో కలిసి తీసుకుంటే పుల్లగా వుంచున్నది గనుకనున్ను అగ్ని గంధకపు భూమిలో తనంతట పాషాణ సంబంధమయితే త్వరగా వుత్పత్తి కావచ్చును గనుక నున్ను లోకారాధ్యుడు మహానదులనున్ను, మహాపర్వతాలనున్ను అనేకముగా సృష్టించి నప్పటికిన్ని అటువంటి సృష్టికోటి చూచి ఒక వేళ తన అత్యద్భుత చర్యను తెలుసుకొలేక పోదురనే తాత్పర్యముతో యీ వుష్ణ గుండాన్ని తగుపాటి కారణాలను వుంచి సృష్టించినాడని తోచబడుచున్నది.

యీ వుష్ణగుండపు కధ: శ్రీరాములు రావణ బ్రహ్మహత్య పరిహారార్ధముగా ముద్గలాశ్రమమునకు సహకుటుంబముగా వచ్చి నట్టున్ను, అప్పట్లో తన లంకా నివాసదోష సందేహము అక్కడవున్న అనేక ఋషులకున్ను, అక్కడికి సమీపమందున్న తన తండ్రి అయిన మిధిలాపురనాయకుని కిన్ని నివృత్తి అయ్యేటట్టు పాతాళమందు వుండే బాడబాగ్నిని తెప్పించి సీతాదేవి తాను ప్రవేశమై బయిటికి వచ్చి నట్లున్ను, ఆ అగ్నివల్ల యీలోకానకు బాధలేకుండాపిమ్మట అక్కడ తదుపరి వుదకప్రవాహాన్ని సృస్టించినట్టున్ను తద్వారా అద్యా ఆ వుపి ఉదకము వుష్ణకరముగా వుండేటట్టున్ను చెప్పుతారు.

రామకృష్ణాద్యవతారములు అబద్ధములు కావు గనుకనున్ను, వారు పరబ్రహ్మ స్వరూపు లనడానకు యేమాత్రము సందేహము లేదు. గనుక నున్ను తమమహిమలు లొకములో ప్రసిద్దిగా వుండేకొరకు యిటువంటి యాశ్చర్యకరము లయిన విషయాదులు కలగచేసినా కలగజేసి వుండవచ్చును.

యీ స్థలమందు వసించి ఆమరునాడు జాంగీరు అనిన్ని, జాంగరాబాదు అనిన్ని చెప్పబడే గొప్పబస్తీ యయిన గంగ వుత్తరవాహినిగా ప్రవహింఛే పుణ్యస్థలము ప్రవేశించినాను. యీ వూరు కలకటరు మొదలయిన అధికారస్థులు వసించే జిల్లా కాకపోయినా నీలిమందు చేసే యింగిలెషు దొరలు గంగాతీరమందు అక్కడక్కడా మిద్దెలు వగయిరాలు కట్టుకొని యీ ప్రాంతముల అనేకులు వుండేటట్టు యిక్కడా కొందరు వసించి యున్నారు. యిది గొప్పవూరు. మైధిలి కాన్యకుబ్జ బ్రాహ్మణులు యిండ్లుకట్తుకొని తీరవాసు లయి యున్నారు. వంటి సిద్ధులకు నిమిత్తములయిన వస్తువులను స్వాధీనము చేసుకోవలనని వృధా ఆశపడి నిమిత్తము మాలిన భ్రమప్రమాద మైన పనులు చేయడము అతి వ్యర్ధమని నిశ్చయము చేసినాను.

యీ దాతా వైధ్యనాధ స్వరూపముగా వుండే పరమాత్మునికి శివరాత్రి దినమున సపాదలక్ష అనే లక్షాయిరువై అయిదువేల గంగ కావిళ్ళకు తక్కువ లేకుండా లొకులు తెచ్చి కామ్యార్ధముగా అభిషేకముచేస్తే యిష్టసిద్ధి అవువున్నదని యీ హిందూస్తాన్ లో బహు ప్రసిద్ధి. ఆ పంచకావిళ్ళు యేదే దంటే గంగోత్తరి, గంగా సాగర సంగమము కావిళ్ళు రెండు; హరిద్వారమువద్ద యెత్తే గంగకావడివొకటి; ప్రయాగలో యెత్తే కావడి వొకటి; యీ జాంగీరువద్ద యెత్తే గంగకావడి వొకటి; అంతు కావిళ్ళు అయిదు.

యీదాతావైద్యనాధస్థలముయొక్క కధయేమంటే పూర్వకాలమునందు రావణాసురుడు కైలాసానకు వెళ్ళి శివుణ్ని నాలంకలో నీవు వసించవలనని ప్రార్దించి నట్టున్ను శివుడు మంచిదని ఒకలింగములో మూర్తీభవించి నన్ను దిగువపెట్టకుండా నీలంకకు యెత్తుకొని పొమ్మని చెప్పినట్తున్ను విష్ణువుకు యీ వర్తమానము తెలిసి లోక సంరక్షణ పనికి నియమింప బడ్డ వాడు గనుక యీ తామసగుణ ప్రధానడయిన రావణుని సమీపమందు శివుడు వసిస్తే వీడు మరీ శివప్రసాదము కలిగే కొద్దిన్ని సాధులను బాధపెట్టు ననే భయముచేత వుదకాధిపతి అయిన వరుణుని ప్రేరేపణ జేసి రావణుడు యీ జాంగీరువద్ద గంగ దాటి అడివి మధ్యే పోతూవుండగా రావణునికి జలబాధ బహుశా కలిగేటట్టు చేసి తాను వృద్ధ బ్రాహ్మణుని వేషము వెసుకొని ఆ లింగము తీసి వుంచుకొని రావణుడు జలబాధ నివృత్తి చేసుకుని వచ్చేలోపల ఆ అరణ్యములో పెట్టి వెళ్ళీనట్టున్ను ఆ లింగాన్ని పెల్లగించడానికి శక్తిలేక లంకకు వెళ్ళిపోయినట్టున్ను, పిమ్మట వైద్ది అనే గోపాలకుడు కాళహస్రి కన్నప్పవలెనే అతిమూర్ఖమయిన భక్తితో ఆరాధన చేశినట్తున్ను ప్రసిద్ధి గలిగి యున్నది. ఆ స్త్ఘలము చుట్ట్లున్ను అడివి బిల్వ మయముగా వున్నది. యీ దేశములోనున్ను ముఖ్యముగా బగాళీలున్ను, యెండకాలములో బిల్వపండ్లు షర్బత్తుచేసి బహుశ: తాగుతారు. ఈ దేశపు బిల్వపండ్లు బహు గొప్పలుగా వున్నవి. పండిన వెనక బహుమాధుర్యముగా వుంచున్నవి. యీ బిల్వపండలు నిమిత్తము బిల్వచెట్టుకు బహుకట్టు చేశియున్నారు. యీ చెట్ల కిందికి మనుష్యులను పోనివ్వరు. యీ జాంగీరువద్ద నొక తోటలో బిల్వచెట్టు పనసచెట్టు కాచివుండగా నా మనుష్యులు పనసాకులు కొయ్యపోతే పనసచెట్లనువిరచినా సమ్మతించినారుగాని పూజకు రెండు నిల్వదళములు కొయ్యనిచ్చినవారు కారు. యీ జాంగీరు స్థలములో అమావాస్య ఆదివారము ఘటనమైనది గనుక ఆ దినమునకు మరునాడు అమావాస్య సోమవార వ్రత మిక్కడనే గడిపి సోమవారము మధ్యాహ్నము బయలుదేరి సాగివచ్చినాను.

మార్చి నెల 16 తేది కహలుగాం అనే గొప్పవూరుచేరినాను. యీ వూరివద్దను గంగమధ్యే రెండు చిన్న కొండలున్నవి. ఆకొండల మీద మానుషసంచారము లేదు. అడివి పెరిగియున్నది. ఈ వూళ్ళో అన్ని పదార్ధాలున్ను దొరుకును. మయిధిలి బ్రాహ్మణులు, కనోజాబ్రాహ్మణులు 40 యిండ్లదాకా యున్నారు. కరివేపాకు మన దేశము వదిలిన తరువాత అక్కడక్కడ ప్రయత్నముమీద దొరుకుతూ వచ్చినది. ఈ వూరిలో ప్రతిపెరటిలోనున్ను కరివేపాకుచెట్లు కొల్లగా వేసి యున్నారు. కొత్తమల్లి మనిషిపొడుగున యీ దేశాములొ గడియ దూరము దాకా పరిమళింపుచు పయిరు అవుచున్నరి. యీ ధనియాలు కునుంబా చెట్లతో కలిపి అభిని చెట్లతొ కూడా నున్ను ప్రత్యేకముగా పొలాలలో నున్ను చల్లుతారు.

మూంగేరి మొదలుగా గంగకు యిరుపక్కలలో పర్వత దర్శనము అవుతూ వున్నది. బజారాలో వచ్చేటప్పుడు ఆ పర్వతాలు వొక పక్క నుండేవయినా నాలుగు పక్కలా తిరుగుతూ వుండేటట్టు స్థిరముగా నుండే సూర్యుడు భూచలనముచేత వొక పక్కనుండి వక పక్కకు వచ్చేటట్టుతోచే లాగు అగుపడుచున్నది. జాంగీరునుంచి కహలుగాముము వచ్చేలోపల భాగల్పూ రనే జిల్లాకసుబా గొప్ప షహరు వొకటి వున్నది. అక్కడ కలకటరు మొదలయిన అధికారస్థులు నివాసముగా వుండి వున్నారు. ఆ వూరి వద్ద నుండే గంగాధార యీ దినాలలో లోతు చాలనందున ఆ వూరికి వుత్తరముగా వుండే పద్ద ధారలో యీ బజరాలు వస్తున్నవి గనుక దూరపుదృష్టి మాత్రము ఆ వూరిమీద కలిగినది. యీగంగధారలను యీ పడవవాండ్లు దరియ్యా లంటారు. జలధార తక్కువయితే యె దరియ్యా మరుగయా అంటారు.

17 తేది గురువారము పడమటిగాలి అనుకూలముగా కొట్టి నందున యీ దినము వుదయము మొదలు అస్తమానము లొపల 24 కోసుల దూరము మా బజరా సాగి వచ్చినందున రాజా మహాలు అనే గొప్ప వూరు చేరినాము. యీ వూరిలో నీలిమందు చేశే దొరలు మాత్రము నివాసముగా వున్నారు. యీ వూరివద్ద గంగలో రాళ్ళు వున్నవి. పడవలు జాగ్రత్తగా రావలసినది. యీ వూరు తోపులు, తోటలతో నిండి వున్నది. వొక మశీదు వున్నది. అది తురకల భక్తిని ఆకర్షించే పాటిగా పురాతముగా వుండి వున్నది. పూర్వికపు రాజులు *కట్టినది వొక నల్లరాటి మహలి శిధిలమై యున్నది. సకల పదార్ధాలు దొరుకును.

పట్నా అనే షహరు విడిచిన వెనక శోధన చూడవలెననే వేషముతో సుంకపు చౌకిదార్లు యెవరున్నూ మా బజరాలవద్దికి చిన్నపడవలు వేసుకొని రావడములేదు. వారిని యిక్కడి కష్టం కలకటరులుపోయి వస్తూవుండే పడవలను నిండా తొందరపెట్టకుండా తాకీదు చేసినట్టు తోచుదున్నది. సుంకపువాండ్లు యీ దేశములో లోకులను చేసేతొందర అధికారస్థు లయిన దొరలకు తెలుసును. కాశిలో వుండే బ్రూక్కుదొర యీప్రసక్తి నాతో మాట్లాడే టప్పుడు ఈలాగే మాదేశమైన యింగిలాండులోనున్ను సుంకపువాండ్లవల్ల తొందర కలిగి


  • ఔరంగజేబు చక్రవర్తి సోదరుడు షూజా క్రీ.శ. 1630 లో దీనిని కట్టె నని బిషప్ హెబరు వర్ణించినాడు. వున్నది. వీరికి అధికారము యివ్వక విధిలేదు. యిచ్చినందువల్ల లోకులకు హింసగా వున్నదని వ్యసన పడుకున్నాడు.

యు దేశములో బంట్రౌతులు మొదలుగా గల శిరస్తా వుద్యోగస్థుల వరకు జీతములు బహు స్వల్పము గనుక లోకులవద్ద లంచాలు నిండా తీస్తారని గయా మేజస్ట్రేటుదొర మేస్తరు జాకుసన్ దొరతో మాట్లాడునప్పుడు ప్రసక్తివచ్చి అప్పుడు వారి చెప్పినది యేమంటే; పిడికిళ్లతో యెత్తి యీ దేశములో అధికారస్థులకు లోకులు లంచాలు యిచ్చేవాడికె పడియున్నందున జీతాలు మీ దేశమువలె యెక్కువచేసినా అధికారస్థులు అడకక పోయినా వాడికె ప్రకారము లొకులు తెచ్చియివ్వలసినదాన్ని యిస్తూ వస్తున్నారు గనుక అప్పట్లో కుంఫిణివారికి యెక్కవజీతము యిచ్చేనష్టము ఒకటేగాని యెవరికి క్షేమముండ నేరదని చెప్పినాడు. బరకందాసు అనే వొక ఠాణాబంట్రౌతులకు యిక్కడ జీతము నెల 1 కి నాలుగురూపాయిలు. వాడి గుర్రము వగయిరాలకు మాత్రము నెల 1 కి 10 రూపాయలు సెలవు వుంటూ వున్నది. యిక్కడ జిల్లామేజస్ట్రేటు నాజరుకు సుమారు నల 1 కి నూట్కి తక్కువలేక వస్తూవున్నది. హిందుస్తానులో జుడైసైయాల్ లయనులో నల్లవాండ్లలో నాజరు వుద్యోగము సర్వోత్తమ మని నిశ్చయిముచేసినాను.

యిక్కడ సకల కచ్చేరలలోనున్ను లెక్కలు వగయిరా వ్రాసే భాష ఫాషీన్. యింకా యిక్కడా వ్రాశే అక్షరములు శానా విధములుగా వున్నవి. ఒకరికి వ్రాయ చదవ తెలిసినది మొరొకరికి తెలియదు గనుక జాబులు మూలకముగ పనులు జరుగడము ప్రయాస. ఫార్శి లిపిమాత్రము సర్వమధ్యస్థముగా వున్నది. యిక్కడ వ్రాశే లిపుల ఖుల్లసు యేమంటే మహాజని యని సాహుకార్ల లిపి వొకటి. బ్ర్రాహ్మణీ అని బ్రాహ్మలు గ్రంధాలువ్రాశే లిపి ఒకటి, మోడి అనే మహారాష్ట్రపు లిపివొకటి, మారువాడి అని మారువాడీలు వ్రాసే లిపివొకటి. ఇంకా కొన్నిలిపులు వున్నట్టు తోచుచున్నది. మగధ దేశములో మాగధి అని వొక భాష గయావళీలు అంతరంగముగా మాట్లాడు కొంటారు. యీగయావళీలేమి, యీదేశపు పంచగౌడ బ్రాహ్మణులేమి వారి వటువులకు యెనిమిదో సంవత్సరమున వుపనయనము క్రమముగా చెస్తారుగాని ఆచిన్న వాండ్లచేత అటుతర్వాత త్రికాలములను సంధ్యవార్పింఛే జాగ్రత చెయ్యడములేదు. వివాహాదులు నాలుగు దినముల దీక్షతో చేస్తారు. నిశ్చితార్ధము మాత్రము కొన్ని నెలలకు ముందే చేసివుంచుతారు. ప్రవేశ హోమము శేషహొమము పాణిగ్రహణము యీ ముఖ్య కృత్యములు కద్దు. మంగల్య ధారణము మొదలయిన లౌకిక లాంచనలు దక్షిణదేశము వలెనే నడవడము లేదు. జాతా శౌచాదులు శృతి స్మృతి ప్రకారము ఆవరించుతారు. గంగకు సమీపప్ర్రాంతములందు వశించేవారు, యెవరు దేహము వదలినా దేహమును యథోచితముగా కర్మ నిమిత్తము తప్తముచేసి గంగలో విడిచిపెట్టుతారు. కర్మ ప్రసక్తి లేనివారి దేహములు వొక నిమిత్తము లేక గంగలో విడిచి పెట్టడమే ముఖ్యముగా జరుగుచున్నది.

యిక్కడి పంచాంగాలలొ గ్రహ దృష్టులు సాధించి వ్రాయుచున్నారు. తిధివార నక్షత్ర యోగకరణాదులు దక్షిణదేశపు పంచాంగానికి గడియ యెచ్చు తక్కువగా సరిగా వుంచున్నది. పంచాంగాలలో వివాహోపనయన ముహుర్త విచారణ బహుశ: లోకులు చేయుచున్నారు. శివాలిఖిత మని వొక ప్రయాణ ముహూర్త నిర్ణయ గ్రంధమున్నది. దాని ప్రమేయము సాంబమూర్తి త్రిపుర పరిహారము చేయబోవు నప్పుడు తలచిన కాలమందు ముహూర్తము దొరికేటట్టు ఆ గ్రంధము లోకోపకారముగా చేసినాడట. జాతక సంవత్సర ఫలాలు గొప్ప వారికి జ్యోతిషికులు వ్రాయిస్తూ వస్తారు.

కాశీప్రయాగలొ దక్షినదేశస్థులేమి, యిక్కడి ఉత్తర పశ్చిమ తూర్పు దేశస్థులేమి అనేక ధర్మాదులను కాశీతంబురాయడి అధీనముగా దక్షిణదేశస్థులు కాశీ మొదలయిన ధర్మాదులను చేసినట్టు చేసి అనేక గుమాస్తాలగుండా నడిపిస్తూ వుండేది. నడుస్తున్నదా లేదా అని సర్కారుతరపున విచారణలేదు.

దక్షిణదేశపు సౌరమాన చాంద్రమాన నక్షత్రమానాలకున్ను, విశ్వాసములు కలవారు గనుకనున్ను, కలకత్తా దేశమునుంచి నూరార్లు నావాలు వేసుకొని నా యెదట యిప్పుడు వస్తున్నారు గనుక యెక్కడ రాత్రిళ్ళు దిగినా ఐదారు నావాలు నాతో కూడా దిగుతూ వస్తున్నవి. యీ ప్రాంతములలో రాత్రిళ్ళు వావాలు ఒంటిగా మనిషి కట్టు తక్కువగా దిగి వుంటే దొంగలు తెలివిగా వుండే కిస్తీలు అనే నావాలమీద వచ్చి కొళ్లపెట్టుక పోతారని వాడుకుంటారు. యిప్పట్లో అటువంటి దుర్మార్గములు శానా మట్టుపడ్డట్టు తోచబడుచున్నది.

లోగడ వ్రాశినంతలో శాస్త్రయుక్తిచోదిత మయిన ద్వైతమతము ప్రసిద్ధముగా మధ్వాచార్యులవారు వుద్ధరించి దక్షిణ దేశములొ బహుమందిని తదనుష్టానపరులుగా నున్ను యేర్పరుచుకున్నట్టు యీ దేశములో యెవరినిన్ని లోపరుచు కో లేదని వ్రాసుకుని వుంటిని. గయామహాక్షేత్రము ప్రవేశించిన వెనక గయావళీల మతము విచారించగా వారు మధ్వమత ప్రవిష్టులుగా నున్ను దక్షిణ దేశపు సత్యపూర్ణ పీఠపు శిష్యవర్గముగానున్ను తెలియవచ్చినది.

యీ గయావళీలు మాత్రము యింత దేశములో మధ్వమతానికి లోబడ వలసిన కారణ మేమని విచారించగా వాయుపురాణ ప్రకారము యాగార్ధమై వీరు బ్రహ్మ కల్పిత బ్రాంహ్మణులు గనుక నున్ను ధర్మప్రజా వృధ్యర్ధం వర్ణాంతర స్త్రీలను పరిగ్రహించి నారు గనుకనున్ను యిక్కడి బ్రాంహ్మణ మండలి యీ గయావళీలను తమ సముగాయములో కూర్చుకొక గయాప్రజనకాలములలో మాత్రము వాయుపురాణ ప్రకారము వీరిని తగురీతిని ఆరాధనచేయుచు నుండగా మధ్వమత ప్రకటనార్ధము యేనూరేండ్లకిందట మధ్వమతొద్ధారకులు యీ దేశమునకు వచ్చినప్పుడు అందరికి యిక్కడా వెలిగావున్న గయావళెలు అందరున్ను యిక్కడ అనంగీరారము చేశిన మతాన్ని అంగీకరించి తమంతట తాము యిక్కడ వొక ప్రత్యేక మతానుసారులుగా వుండడము యుక్తమని నిశ్చయము చేశి మధ్వమత సంకేతాలకు అన్నివిధాలా అప్పుడు లోపడినారు. మతోద్ధారకులు ద్రావిడాచారాలు యావత్తు వీరికి బోధచేసి తదారభ్య ద్రావిడాన్నము భోజనము చేసేటట్టు వీరికి యిచ్చను కలగచేసినారు. ఆ యిచ్చమాత్రము యిప్పుడు నిలిచి వున్నది గాని, వారు బోధ చెసిన ఆచార వ్యవహారాదులు యీ దేశాస్థుల సాంగత్యము చేత క్రమక్రమశ: ఖిలపడుతూ వచ్చినది.

వాయుపురాణ ప్రకారము గయావళీలను గయావ్రజనక్రియలు చేయడములో ఆరాధన చెయవలసినది అగత్యము గనుకనున్ను, ద్రావిడాచార ప్రకారము పిండప్రదానాత్పూర్వము అన్నశ్రాద్ధము చేయడము ముఖ్యము గనుకనున్ను, గయవళీలు ద్రావిళ్ళు పచనము చేసిన అన్నము భోజనము చేసేటట్టు సమ్మతించినారు గనుకనున్ను, చటకము మొదలైన శ్రాద్ధాలు చేసి గయావళీలకు ఆమం మొదలైన భక్ష్యయోగ్య వస్తువులు యిచ్చే టంతకన్నా అన్నశ్రాధ్హానికి గయావళీలను బ్రాహ్మణార్ధము చెప్పేటట్టు దక్షణ దేశస్థులు నిశ్చయము చేసినారు గాని యేకారణము చేతనున్ను గయావళీలు పక్వము చేసిన అన్నమును ద్రావిళ్ళు వుచ్చుకునేటట్టు సమ్మతించినవారు కారు. తదారభ్యగయావళీలు ద్రావిళ్ళవల్ల యీపాటి జరిగే గౌరవమును కాపాడుకోవలసి ద్రావిడ దేశస్థులు భోజనము చయ్యకనుండేవారి చేతి పక్వాన్నము తామున్ను భుజించకుండా ద్రావైడాచార ప్రకారము నడిచేవారమని అభినయిస్తూ కాలము గడుపుతూ వస్తున్నారు. యాభై అరవై యేండ్ల క్రిందట సత్యూపూర్ణ పీఠస్థులు యీ ప్రాంతముల చచ్చివుండి గయావళీలకు నమాశ్రయణము చేసి పూజగైకొని పోయినారు. యిప్పుడున్ను పునా శ్రీమంతుడు మొదలయిన గొప్పవారి గయావళీలు మాత్రము యధోచితముగా యజమాన ప్రీత్యర్ధమై బ్ర్రాహ్మణ నిత్యకర్మలు జరుపుకుంటారు.

పద్దెనిమిదవ ప్రకరణము

మనలో పేరుగలిగిన యాభై ఆరు చేశాలు వాటి ఛెప్పన్నభాషలున్ను యీ బ్రహ్మాండములో యేపక్క వున్న వని విచారించగా నేను చేసిన దేశాటనముచేత నాకు కలిగివుండే స్వానుభవము చెతనున్ను, నా వినికిడి వల్లనున్ను, నేను నిశ్చయము చేసినది యేమంటే ఆ దేశాలంతా కర్మద్వారా బ్రహ్మానుసంధానము చేసే 'యిండి యా' అని నామధేయము కలిగిన కన్యాకుమారి మొదలు కాశ్మీరము లోపలనే వున్నవి గాని అన్యత్ర కాదు, అని నిశ్చయము చేసినాను. అయితే బహు దినములుగా యీ భూమి తురకలచేత ఆక్రమింపబడి దేశ సరిహద్దులు తెలియకుండా భూమిని కలిపి వారి యేలుతూ వచ్చి నందుచేత యిప్పట్లో ఆ యాభ్హై ఆరు దేశాల సరిహద్దులు అన్ని కనిపెట్టి వ్రాడనకు ప్రయాసగా నున్నది. అయినా ఆ యాభై ఆరింటిలో అనేక దేశాల సరిహర్రులు కనిపెట్టి వ్రాయవచ్చును.

మనము వసించే భూమితోకూడా ఊర్ధ్వ లోకాలు యేడు; అధోలూకాలు యేడు. వాటిస్థితి యెక్కడ నని విచారించగా నాబుద్ధికి తేటపడ్డది యేమంటే, పయిన వ్రాశిన పదునాలుగు భువనములు యీ బ్రహ్మాండమునకు అంతర్భూతములని నిశ్చయపడ్డది. అది యెట్లంటే యీ బ్రహ్మాండము కోడిగుడ్డు ఆకారముగా వున్నదని మన శాస్త్రమున్ను మతారంతరస్థుల భూగోళ శాస్త్రములున్ను యేక వాక్యవ పడి వున్నవి. మన గణిత శాస్త్ర ప్రకారముగా నున్ను యీ బ్రహ్మాండానికి 120 భాగాలుగా చేసి అందులో మధ్య ప్రదేశాన్ని మనవారు నిరక్ష దేశమనిన్ని, జాతులవాండ్లు 'లయన్ ' అనిన్ని పేరుపెట్టి వున్నారు. గనుక ఆ నిరక్ష దేశానకు వుత్తరము యేడులొకములుగానున్ను, దక్షిణము అధోభాగమునందు యేడు లోకాలుగా నున్ను మన వారు నియమించినారు. వుత్తరము వూర్ధ్వభాగమందు వుండే యేడు భువనములలో మానుష నివాస భువనము వొకటి. దీనికి పై అంతస్థు అంతస్థుగా మనుష్యాపేక్షయా దేవతాస్వరూపులుగా వుండేవారు సృష్టికోటి తారతమ్యాల ప్రకారము శుద్ధసత్విక గుణప్రధానులై శీతల భూప్రదేశాలలో ఆనందింపుచు నుండే లాగు తోచుదున్నది. యీ లోకము లను స్వర్గ మర్వ్య పాతాళలోము అని మూడుగా చెప్పుచున్నారు. నిరక్ష దేశమునకు దక్షిణమందు అధోభాగమున తమోగుణ ప్రధానులైన రాక్షస భూతప్రేత పిశాచూదులు వారి వారి తారత్మ్య ప్రకారము అంతస్థులుగా వసింపుచునుండేలాగు తోచబడు చున్నది.

మనుష్యనివాసభూమికి ఊర్ధ్వాధ: ప్రదేశములలో వసింపచే