కాశీమజిలీకథలు/పదునొకండవ భాగము

వికీసోర్స్ నుండి

విషయసూచిక

మజిలీవరకు వచ్చు కథలు

శుభమస్తు - అవిఘ్నమస్తు

కాశీమజిలీకథలు

పదునొకండవభాగము

250 వ మజిలీ

శ్రీగౌరీధృతకరణా!
వాగీశాద్యఖిల దేవవందితచరణా !
నాగాసురమదహరణా !
భోగీంద్రాభరణజత భూధరశరణా !

దేవా ! అవధరింపుము. అట్లు మణిసిద్ధయతీంద్రుండు గోపశిష్యునితో గూడ గాశీయాత్ర గావింపుచు గ్రమంబున బంచాశద్ద్విశతసంఖ్యాకంబగు నివాసస్థానంబు చేరి యందు గాల్యకరణీయంబుల దీర్చికొని భుక్తోపపవిష్టుండై శిష్యునిరాక నరయుచున్నంత నింతలో నగ్గోపాలుం డూరిలోని కరిగి నాలుగువీధులుం దిరిగివచ్చి యయ్యవారికి నమస్కరించుచు నిట్లనియె.

స్వామీ ! ఈ గ్రామంబంతయు దిరిగి చూచితిని. వింతలేమియు గనంబడలేదు. సీ మాంతముల బరిశీలింతమనుకొంటినిగాని మీరు నా నిమిత్తము వేచి యుందురని తొందరపడి వచ్చితిని. ప్రష్టవ్యాంశ మొకచో నించుక లభించినది వినుండు.

ఊరునడుమ శివాలయంపుటరగుపయిం గూర్చుండి కొందరు పారులు సమస్యగా నీయబడిన యొకశ్లోకపాదమును బఠింపుచు దదర్థావ‌ బోధనము చేసికొన లేక యొండొరులు కలహించుచున్నారు. నే నందు గూర్చుండి యా సంవాదమంతయు యార్జించితిని. ఆ శ్లోకపాదమును వ్రాయించుకొని వర్లించితిని. వినుండు. -

శ్లో॥‌ ప్రసూత కన్యాత్మజ మప్యనా థా

గీ॥‌ కన్య గనియె సుతు మగండులేక

ఆ పాదమునే మరియొకరిట్లు తెనిగించిరి. ఈ సమస్య యే సందర్భములో డెవ్వ రెప్పు డిచ్చిరో యందెవ్వరికి దెలిసినదికాదు. ఎవ్వరినడిగినను జెప్పలేక పోయిరి. ఇదియే నేటికడుగదగిన విశేషమని తలంచి దానిం జదివికొనుచు మరి యెక్కడికిబోక నింటికివచ్చితిని. నా పుణ్యము ఫలించెనేని యీ సమస్యవలన