Jump to content

కాశీమజిలీకథలు/పదవ భాగము/247వ మజిలీ

వికీసోర్స్ నుండి

247 వ మజిలీ.

నాగునికథ.

గంగానదీ దక్షిణతీరంబున మహాపద్మమను నగరంబున భృగుండను విప్రుండు గాపురము జేయుచుండెను. అతండు తపస్స్వాధ్యాయ నిరతుండు, జితక్రోధుండు, జితేంద్రియుడు, నిత్యతృప్తుండు, ధర్మనిత్యుండు, సజ్జనసమ్మతుండునై యొప్పుచుండెను. న్యాయప్రాప్తంబగు విత్తంబునఁ జిత్తం బలరించికొనుచు జ్ఞాతిసంబంధులచే విపులమగు కులంబున విఖ్యాతివడసి విశిష్టమగు వృత్తి నాశ్రయింపుచు ధర్మానుసారముగాఁ బుత్రులఁ బెక్కెండ్రఁ బడసి కాలక్షేపము జేయుచు నొక నా డాత్మగతంబున నిట్లు తలంచెను.

ఆహా! నాకిప్పుడు సగముప్రాయము గతించినది. ధనము సంపాదించితిని. వేదకర్మల యజ్ఞయాగాదులం గావించితిని. బంధువులఁ బోషించితిని. కాని మోక్షమునకు నిక్కమగుమార్గ మేదియో తెలియకున్నది. వేదము కర్మలఁజేయుమని యొక చోటను కర్మల వలనం బ్రయోజనము లేదని యొక చోటునం జెప్పియున్నది. వేదోక్తముశాస్త్రోక్తము శిష్టాచారము మూడును మూడు దారులుగా నున్నవి. మోక్షమునకు ముఖ్యమగుమార్గ మేదియో యెఱింగించుమహాత్ముఁ డెందైనం గలఁడేమో యని ధర్మనిశ్చయము జేసికొనలేక యతండు సంతత మాలోచించుచుండ నొకనాఁడొక విప్రుం డతనియింటి కతిధిగా వచ్చెను.

భృగుండు మిగుల సంతసించుచు భయభక్తివిశ్వాసములతో నతని కాతిథ్యమిచ్చి భుక్తోపవిష్టుండైన యాపాఱుని చేరువ నిలువంబడి తాళవృంతమున వీచుచు విశ్రాంతుండగుటఁ దెలిసికొని మెల్లననిట్లనియె. ఆర్యా! నీమాటలు వినుటచే నీవు ప్రాజ్ఞుండవని తెల్లమగు చున్నది. నీయుపన్యాసము కడుమాధుర్యముగా నొప్పుటచే వినుటకుఁ దృప్తితీఱకున్నది. నిన్ను మిత్రునిగాఁ దలంచి నిన్నుఁ కొన్నిమాటలడుగఁదలంచితిని. నేను గృహస్థధర్మముల ననుసరించి పుత్రులం గని వేదోక్తకర్మల నాచరింపుచు సాధారణగుణములచేఁ గట్టఁబడి లోక వాసనల నాశ్రయించి సంచరింతును. మఱియు నేనెల్లప్పుడు నాత్మలో నాత్మచేతనే యాలోచించుచుందును. పుత్రాదిఫలాశ్రయమైన నావయసు క్రమంబున సగము గడచినది. ఇప్పుడు పరలోకసంబంధమగు పాథేయమేమని యూలోచింపుచుంటిని. ఈలోకసంభారసముద్రము పారముజేరుటకు ధర్మమయమగు తెప్ప యేదని బుద్ధిని సర్వదా తలంచుచుందును.

మఱియుఁ బుట్టుచుం బెరుగుచుఁ జచ్చుచుండెడి నీప్రజల సంయుజ్యమానవిశేషములఁ జూచిచూచి నామది విశ్రాంతినొందకున్నది. పారలౌకికసుఖంబుల ననుభవింప నిచ్చఁగలిగిన నేనీభోగముల ననుభవించుసమయంబున నామనసు సంతుష్టినొందదు. కావున మహాత్మా! నీబుద్ధిబలమున నాలోచించి యుత్తమమైన ధర్మమేదియో నిరూపించి మంచిమార్గముజూపుమని ప్రార్థించిన నాలించి యాయతిథి యిట్లనియె.

భూసురోత్తమా ! బహుద్వారములుగల స్వర్గమున కేదియుత్తమమార్గమోయని నేనును దలంచుచుందును. ఈవిషయమున మోహముజెందియుంటిని. దీనిం దెలిసికొనుటకే నేను బ్రయత్నించు చున్నాడను. కొందఱు జన్నంబులం బ్రశంసింతురు. గొందఱు గృహస్థధర్మములఁ గొందఱు వానప్రస్థము, కొందఱాత్మజ్ఞానము, కొందఱు గురుశుశ్రూషఁ గొందఱు మౌనంబు గొందఱు మాతాపితృసేవ, కొందఱు అహింస , కొందఱు సత్యంబు, కొందఱు దానంబు, కొందఱు యుద్ధమరణంబు ఆర్జవంబు, అధ్యయనంబు తలయొకరీతిని ప్రశంసింపు చుందురు. ఇట్లు పలువురు పలుతెఱఁగుల మోక్షమార్గము లుప దేశించియుండ నేది మంచిదో నిశ్చయించుటకు సమర్ధముకాక నామనస్సు సందేహడోలికయెక్కి యూగుచున్నది. వాయువుచేఁ దరళమగు మేఘమువలెఁ దొట్రుపడుచున్నది. అయిన నన్నడిగితివి కావున నీకొక్క యుపాయము సెప్పెద నాలింపుము. నేనిట్లే యడుగ నాగురుం డిది నాకుపదేశించెను. కాని యట్లాచరించుటకు సంసార సక్తచిత్తుండనగు నాకు నింకను నాగకున్నది. వినుము.

నైమిశారణ్యంబున గోమతీనదీతీరంబున నాగమను నగర మొప్పుచున్నది. అందు మాంధాత యనేకయాగములఁజేసి దేవతల నతిక్రమించియున్నవాఁడు, ఆఫదంబునఁ బద్మనాభుండను నాగాధిపతి గాపురము జేయుచుండెను. అయ్యురగపతి త్రికరణములచేత భూత హితము గోరుచుండును. చతురుపాయములచేత రక్షించుకొనుచుండును. అతండు సర్వధర్మములనెఱింగిన ప్రోడ. సర్వశాస్త్రవిశారదుఁడు. సర్వసుగుణములు నతనియందున్నవి. కృతాకృతముల నెఱింగినవాఁడు. తపస్సంపన్నుఁడు. పెక్కేల అతనియందు సద్గుణములన్నియు సంపూర్ణముగా నున్నవఁట. అతనికడకుఁ బోయి యడిగిన నీసందియములు దీర్పఁగలఁడని నాకుపదేశించెను. నేనిప్పుడు నీకామాటయే చెప్పుచున్నాను నీవందుఁబొమ్ము. నీసందియము దీరఁగలదని పలికిన విని పరమానందభరితుండై యాభృగుం డిట్లనియె.

మహాత్మా! నెత్తిపైనుండి పెద్దబరువు దింపినట్లు దారి నడిచి యలసినవానికి శయ్య గల్పించినట్లు దాహార్తునకు బానీయమిచ్చినట్లు క్షుధార్తునకు భోజనంబిడినట్లు వృద్ధునకు సుతుండు గలిగినట్లు వియోగమునుబొందిన మిత్రునిదర్శనమైనట్లు గ్రుడ్డివానికిఁగన్నులు వచ్చినట్లు తొట్రుపడుచున్న నాకు నీయుపదేశముననట్టి సంతోషము గలిగినది. తప్పక నీవుజెప్పినచొప్పున నామహానుభావు దర్శనమునకుంబోయెదం గాక. మంచిమార్గ ముపదేశించితివని సంతసించుచు భృగుం డారా త్రియెల్ల నాయతిధితో ముచ్చటింపుచుఁ దృటిగా వెళ్లించెను. మఱునాఁడాయతిథి యెం దేనిం బోయెను. భృగుండును భుజగేంద్రదర్శన లాలసుండై శుభముహూర్తమున నిల్లువెడలి వనంబులు దాటి పర్వతంబు లతిక్రమించి నదీనదంబుల మీఱి క్షేత్రంబులం జూచుకొనుచు మార్గమధ్యంబున ననేక కష్టంబుల భరించి పోయిపోయి కొన్నిదినంబుల కా గోమతీతీరంబునకుం జని యురగనగరంబు బ్రవేశించి వీధులన్నియుం దిరిగి తిరిగి పద్మనాభుని గృహమడిగి తెలిసికొని వాకిటకుఁ బోయెను. తలుపు మూయఁబడియున్నది. వాకిట సందడి యేమియును లేదు. అతం డొక్కింత సేపాలోచించి మెలన తలుపు తట్టుచు, ఆయ్యా ! లోపల నెవ్వ రున్నారు ? తలుపు తీయుదురా ? అని కేక పెట్టెను.

ఆ కేక విని ధర్మవత్సలయగు నాగపత్ని వచ్చి తలుపుతీసి యావిప్రుఁజూచి యతిధిపూజ గావించి మహాభాగ! మీ రెవ్వరు ? ఎందుండి వచ్చితిరి ? మాయింట నేదేని బనియున్నదియా ? కామిత మెఱిఁగింపుఁడు. కావించి కృతార్ధురాలగుదునని యడిగిన నాభృగుండు తద్వినయవిశేషముల కచ్చెరువందుచు అమ్మా! నేను బ్రాహ్మణుండ భృగుండనువాఁడ. పద్మనాభుండను నాగపతిం జూడవచ్చితిని. అయ్యురగేంద్రునిగృహ మిదియేనా ! అతం డింటనున్నాడా ? అని యడిగిన నాయిల్లా లిట్లనియె.

ఆర్యా ! మీరాకచే మాగృహము పవిత్రమైనది. నేనా నాగపతి భార్యను. నాభర్త తనకు వంతురాగా సూర్యరథము గడుపుట కరిగిరి. సంవత్సరమునకొకసారి బోయి మాస మందు వసించి రావలయును. సూర్యరథహయంబులకుఁ బగ్గములుగా భుజగములఁ గట్టుదురని మీరు వినియేయుందురు. ఆయన యెనిమిదిదినములలో నిందు రాఁగలరు. అంతదనుక మీరిందు విశ్రాంతిగా నుండవచ్చును. మీ కేకొరంతయు నుండదు. అక్కార్యంబు మావలనం దీఱునదియే యైనచో నుడువుఁడు. భ క్తితో నాచరించి కృతార్థులమగుదుముగాక. అని నివేదించిన విని యతం డించుక యాలోచించి యిట్లనియె.

సాధ్వీ! నీయాదరముననే నీసద్గుణంబులు వెల్లడియగుచున్నవి. నాకార్య మొరులవలనం దీఱునదికాదు. ఆతండే వచ్చి చెప్పవలయును. అతండు వచ్చుదనుక నాగోమతీపులినంబున వసించి తపంబు జేసికొనుచుండెద. వచ్చిన వెంటనే నాకుఁ దెలియఁజేయుము. ఇదియే నాకోరికయని పలికిన నాగేస్తురాలు. ఆర్యా! ఆతిథ్యమందుచు మా యింటనుండుము. వారు వచ్చి మీకార్యము దీర్తురుగాక. శీతవాతా తపక్లేశములు వహింపుచు నాయిసుకతిన్నెల నుండనేల! యని యడిగిన నతండు తల్లీ! నీయుల్లంబున మఱియొకరీతిం దలంపకుము. నీ యాతిథ్యమందితిని, నీయుపచారముల కానందించితిని. నేనీయెనిమిది దినములు భోజనము సేయను. తపంబు గావించుకొనుచు నందుండెద ననుజ్ఞయిమ్ము పోయివత్తునని బ్రతిమాలికొని యాయురగి నంగీకరింపఁ జేసి తత్తీరంబుజేరి నిరాహారుండై తపంబొనరించుచుండెను.

ఎవ్వఁడో బాహ్మణుండువచ్చి గోమతీసికతాతలంబున నన్నముతినక మలమల మాడుచున్నాడని విని యాయూరిలోనున్న వృద్ధ నాగు లాతిథ్యములుగొని యతనికడకుఁబోయి మహాత్మా! ఇది యేమి కర్మము? ఇది యూరనుకొంటివా? అరణ్య మనుకొంటివా? ఇందలి వారలు ధర్మశూన్యులని తలంచితివి కాఁబోలు. అతిధి యన్నముతినక మలమల వేగుచుండ శంకింపక గృహస్థులు కుడిచినచో నది మూత్ర పురీషసమమని యార్యులు సెప్పుదురు. పండ్లో పాలో కాయో కూరో మీరు భుజింప కిట్లుపవాసములు చేయుచుండఁ గుటుంబవంతులము మే మూరకొనిన నశింపమా? రండు. మీకిష్టమైనదాని భుజింపుఁడు మేము గృతార్థులమగుదుమని యెంతయో ప్రార్థించిరి. కాని యది నాకు వ్రతంబు. వ్రతమధ్యంబునం గుడిచిన మహాపాతకంబు. ఎనిమిదిదినములు దాటిన భుజింతునని సమాధానముజెప్పి వారి ధర్మ సత్కారమున కచ్చెరువందుచు భుజించుట కంగీకరింపలేదు.

పదిదినములు గడచినతోడనే పద్మనాభుండు సూర్యు ననుజ్ఞ బుచ్చుకొని యింటికి వచ్చెను. నాగపత్ని పతికెదురేఁగి పాదంబులఁ గడిగి శిరంబునం జల్లుకొని పీఠంబునఁ గూరుచుండఁబెట్టి విసరుచుండఁ బన్నగపతి సతింజూచి యిట్లనియె. యువతీ! నేను లేనిసమయములో దేవతాతిధిసత్కారములు యథాయోగ్యములుగాఁ జేయుచుంటివా? స్త్రీచాపల్యంబునంగాని మద్వియోగదుఃఖంబునంగాని ధర్మసేతువు చెడఁగొట్టలేదుగద అని యడిగిన నాగపత్ని యిట్లనియె.

ప్రాణేశ్వరా! శిష్యునకు గురుశుశ్రూష విప్రునకు వేదధారణము రాజులకు లోక పాలనము గృహస్థున కతిధిసత్కార మెట్లు నియతములో సతికిఁ బతివ్రతాత్వము పరమధర్మము. మీయట్టి యుత్తముని భార్యనై సద్ధర్మముల నెఱుంగకుందునా? నీవు ధర్మరతుండవని యెఱింగి సన్మార్గ మెట్లు విడుతును? అతిధిసత్కారములఁ యథావిధిం గావింపుచుంటి. - - - - పదిదినములక్రిందట మనయింటికి కొక విప్రుం డతిధిగావచ్చెను. కార్యము చెప్పఁడయ్యె. మిమ్ముఁ జూడవచ్చెనఁట గోమతీసైకతస్థలంబున నిరాహారుండై - - - - వేచియున్నాడు. మీ రాక తనకుఁ దెలియఁ జేయుమని కోరియున్నా డిదియే మీరు లేనప్పుడు జరిగినచర్య. మీరందుఁ బోవుఁడని యెఱింగించిన విని యా యురగపతి యిట్లనియె.

దేవీ! నీవు నన్నెఱుఁగనట్లు పలుకుచుంటివేమి? సురాసురుల కంటె దేవర్షులకంటె సురభివలనం జనించినవారగుట నాగు లధికులని యెఱుంగుము. అట్టి నేను మనుష్యునిం జూడఁబోవలయునా? ఇది మాకు మర్యాదగాదు. నీవువోయినా రాక యతని కే చెప్పుము. ఆతఁడే యిందు రాఁగలఁడని పలికిన విని యించుక నవ్వుచు నాసాధ్వీరత్న మిట్లనియె.

మనోహరా! ఆర్జవంబున నాబ్రాహ్మణుఁడు దేవుడు కాని నీయందుఁ బరమభక్తిగలవాఁడు. అతని కిందు వేరొకపనిలేదు. మేఘోదయమునుఁ జాతకంబువోలె నీయాగమన మభిలషించుచున్న వాఁడు. అందుల కేమివిఘ్నమువచ్చునో యని యడలుచున్నాడు. అతం డెట్టివాడైనను మిమ్మాశ్రయింప వచ్చెంగావున మీరు జాతిస్వభావజన్యమగు నహంకారము విడిచి యతనియొద్దకుం బోఁదగును. ఆశాఛ్ఛేదమున నాత్మను దహింపఁజేయకుఁడు. ఆశతోఁగూడికొన్నవాని నశ్రుప్రమార్జనము సేయక రాజైననేమి రాజపుత్రుఁడైననేమి? బ్రాణహత్యను బొందును. మౌనమువలన జ్ఞానఫలావాప్తియు దానంబునఁ గీర్తియు సత్యవాక్యంబున సర్వాధిక్యము నొందఁగలరు. న్యాయార్జనంబున లభించిన విత్తంబున నాశ్రమసమ్మతమైన భూదానఫలంబనుభవించునని బోధించిన విని యాయురగపతి యిట్లనియె.

సాధ్వీ! నేను మహామోహజనితిమగు నభిమానదోషంబున నే నిట్లంటి. సంకల్పమువలనఁ బుట్టిన నాదోషమును నీవడంచితివి. భుజగములకుఁ గ్రోధము సహజము. గర్వము సర్వగుణములను జెఱుచును. అభిమానము చెడ్డది. ఆహంకారమువలన రావణుఁడు కార్తవీర్యుడు లోనగువారు శత్రువులచేఁ జంపఁబడిరి. నీమాటలవలన నట్టిక్రోధ ముపసంహరించుకొంటిని. నీవంటిభార్య నాకు దొరకుటచే నన్ను నే బొగడుకొనుచుంటిని. నీమాటవడువున నేనా పాఱునొద్దకుఁ బోయెద. నతని కామితముదీర్చెదనని పలుకుచు నప్పుడే గోమతీతీరమునకరిగెను.

అందుఁ నేకాగ్రచిత్తముతో దనరాకకు వేచియున్న యాజన్ని గట్టుం గాంచి యోమహాభాగ! నీ వెవ్వఁడవు? యెందులకై యిందు వచ్చితివి? ప్రయోజనమేమి? స్నేహముచె నడుగుచుంటిఁ జెప్పుమని యడిగిన నాబాహ్మణుఁ డిట్లనియె. అయ్యా! నేను ధర్మారణ్యవాసిని. బ్రాహ్మణుఁడ భృగుండనువాఁడ. పద్మనాభుండను సర్పరాజుం జూడవచ్చితిని. కర్షకుండు పర్జన్యోదయమువోలె నేనతనిరాక నిరీక్షించి యతని క్షేమముగోరుచు క్లేశశూన్యమైన యోగ మవలంబించి యున్నవాఁడనని చెప్పిన విని సర్పపతి యిట్లనియె.

అయ్యారే! విప్రోత్తమా! నీవృత్తము కడు కల్యాణమైనది నీ సాధువృత్తి యిట్టిదని కొనియాడఁ జాలను. జగంబంతయు మైత్రిచేఁ జూచుచుంటివి. నేనే యాపద్మనాభుఁడను. నీయునికి విని యిందు వచ్చితిని నీ కేమికావలయునో నా కాజ్ఞాపింపుము. కింకిరుఁడనై యక్కార్యంబు గావించెద. నీకుఁ బ్రియమేదియో తెలుపుము. నీయిచ్చవచ్చినపనికి నియోగింపుము. నీసుగుణములచేఁ గ్రీతుండనైతినని పలికిన విని యావిప్రుం డట్టెలేచి యబ్బురపాటుతోఁ జూచుచు నిట్లనియె.

ఓహో! మహానుభావుఁడవు పద్మనాభుఁడవు నీవేనా ! నీదర్శనమున నేనిప్పుడు కృతకృత్యుండ నైతిని. నీయాదరణవచనములచే మఱియు మురిసితిని. నీవలన నొకవిషయము దెలిసికొనుతలంపుతో వచ్చితిని. ఉత్తమధర్మమేది? నాకు గతి యెట్టిది ? కర్తవ్యమేమి? పరమార్ధమేది. అని నాలో నేను సంతతము చింతించుచుందు. యశోగర్భ కిరణములచేఁ బ్రకాశించుచు నీవు చంద్రునివలె నాకాహ్లాదము గలుగఁజేయుచుంటివి. నాకుఁగలిగిన సందియము దీర్పవలయును.

అది యట్లుండె. నీవు సూర్యరథము నడుపుటకై యరిగితివని వింటి. ఒక నెల యమ్మహాత్మునితోఁ గలిసి తిరిగితివి. ఆజగచ్చక్షువు సమస్తజగములకు నాధారము. అందున్న వాని కన్నిజగములు కనంబడునుగదా అప్పుడీభూలోక మెట్లుండును? సూర్యరథము నడుచు నప్పు డెంతవేగముగా నుండును? విశేషము లేమిగనంబడు నచ్చటి విశేషము లెఱింగింపుమని యడిగినఁ బద్మనాభుఁ డిట్లనియె.

భృగుప్రవరా! సూర్యునియందుఁగల విశేషములం జెప్పుటకు శేషునకైననుశక్యముకాదు. సూర్యరథమునకుఁగలవేగ మవాఙ్మాన సగోచరము. తత్తేజము తత్వసాధనంబునంగాని భరింపశక్యముగాదు. పర్వతములైనను రవిచెంతఁ జేరిన భస్మములైపోవును. మాకుఁ దదను గ్రహమునంజేసి సూర్యకిరణములు జల్లగానుండును. త్రాళ్లంటి వ్రేలాడువక్షులువలె రవికరసహస్రంబంటుకొని వ్రేలాడుచు వాలఖిల్యాది మహర్షులు తపంబుగావించుచుందురు. వేయికిరణములు వేయిరంగులుగా నొప్పుచుండును. కొన్నికిరణములు భూమియందుఁ గలజలమును లాగి యాకసమున నావిరిగా నెరయఁజేయును. కొన్నికిరణములు పగ్గములవలె భూమినాకిర్షించు చున్నవి. కొన్నికిరణములు వాయుపుతోఁ జేరి యావిరిని నీరుగావించి వర్షము గురిపించుచున్నవి. గ్రహతారకలతోఁగలిసి కొన్నికిరణములు పంటలుపండించుచున్నవి.

అక్కడి కీభూమియంతయు నొక చిన్న చుక్కవలెఁ గనంబడును. ఆతేజోరాశినిమించిన తేజము లేదు. తన్మండలమధ్యవర్తియై నారాయణుండు జగంబులం బాలించుచున్నాడు. ఓడమీఁదనున్న వానికి గమనవేగంబు దెలియనట్లు మాకందుఁ గుదుపుగాని తొట్రుపాటుగాని కనంబడదు. నిలువఁబడియున్నట్లే తోచును. కనంబడిన లోకములన్నియు దూరమగుచుండును. మాకు రాత్రింబగళ్ళు లేవుగదా. చక్రమువలెఁ దిరుగుచుండును. ఇట్టి విశేషము లనేకములున్నవి. ప్రొద్దు వోయినది. మనమింటికిఁ బోవుదములెండని పలికిన నాభూసురతిలకుఁడు వెండియు నిట్లనియె.

అయ్యా! సంగరములోఁ జచ్చినవారు పుణ్యపురుషులు, సూర్యమండలముమీఁదుగాఁ బోవుదురని పురాణముల వినియంటిమి. అట్టివారు మీకెవ్వరైనఁ గనంబడిరా? అని యడిగిన నురగపతి యిట్ల నియె. ఆర్యా! అట్టి పుణ్యపురుషు లనేకుల నిదివఱకుఁ జూచియుంటిని కాని మొన్నఁజూచినవింత యెన్నఁడును జూచియెఱుంగను. వినుఁడు.

ఒకనాఁడు సూర్యరథము వేగముగాఁ బోవుచున్నది. అప్పుడు భూలోకమునకు మధ్యాహ్న కాలము కావచ్చును. రవి దివ్యతేజోమయుండై వెలుఁగుచుఁ బోవుచుండ నా తేరికొక యద్భుత తేజ మెదురు వచ్చుచుండ మేము జూచితిమి. ఓహో! సూర్యు లిరువురు గలరా యేమి? ఆ తేజ మెక్కడిది? అని మేము వెఱగుపడుచుండ నా తేజము మా రవిబింబముచేరువునకు వచ్చినది. అప్పుడాసూర్యుఁడు అనిర్దేశ్యమైన యా తేజమును చేతులుసాచి తనరథముమీఁద కెక్కించుకొనియెను. ఆ రెండు తేజంబులం జూచి మేము రవియెవ్వఁడో క్రొత్తతేజ మెయ్యెదియో తెలిసికొనలేకపోయితిమి. ఇద్దరు సూర్యులువలెఁ బ్రకాశించుచుండిరి. కొంతసేపటి కా తేజము రవిబింబములో, గలిసిపోయినది. ఆవింత మేము గన్నులార జూచితిమి.

అప్పుడు మేము రవికి నమస్కరించి మహాత్మా! ఈవచ్చిన తేజ మెయ్యది? మీ తేజముతో సమానముగాఁ బ్రకాశించుచున్న దే మీలోఁ గలిసిపోయిన దేమి? దీని వృత్తాంతమంతయు జెప్పుమని యడిగిన నా లోకబాంధవుం డిట్లనియె. ఇతండు దేవుఁడుగాడు. అగ్ని కాడు, రాక్షసుఁడు కాడు. ఉంఛవృత్తివలన గాలము గడపిన యొకానొక బాహ్మణుఁడు. తానుజేసిన సుకృతమువలన నాలోఁ కలిసి ముక్తుం డయ్యెనని చెప్పిన మేమిట్లంటిమి. జగన్మిత్రా! ఈ ధాత్రీసురుఁ డెట్టి పుణ్యముజేసి మీలోఁ గలిసెనో చెప్పెదరా! అని యడిగిన సూర్యుఁ డిట్లనియె.

ఇతండు యజ్ఞయాగముల నేమియుం జేయలేదు. యాత్రల దిరిగి యెఱుంగఁడు. నిరాహారుండై దీర్ఘతపంబును జేయలేదు. వినుం డితండు త్రికరణముచేత భూతహితము గోరుచుండును. దేనియందును మనసు తగులనీయఁడు. దేవినిం గోరఁడు. వచ్చినదానివలన సంతుష్టి నొందును. ఉంఛవృత్తివలన జీవనము గావించెను. తత్సుకృతమువలన సిద్ధార్థుండై మృతినొంది యిప్పుడు నన్నుఁగలిసెను. అని సూర్యదేవుఁడు మాకెఱింగించెను.

ఇదియే కడసారి నేనందుఁ జూచినవింత. ఇంతకన్న నేవిశేషము గనంబడలేదని పలికి మహాభాగా! ఇఁక మన మింటికిం బోవుదము రండు. విశ్రాంతి వహించిన పిమ్మట సావధానముగా నడుగ వలసిన యర్థ మడుగుదురుగాక! యుపవాసముల డస్సియున్నారు. రండని పలికిన విని సంతుష్టాంతరంగుఁడై భృగుండు సర్పపతికి నమస్కరించి యిట్లనియె.

భుజగేంద్రా! నీవలన వినవలసిన యర్థంబులం దెలిసికొంటి. పోయివత్తునని పలికిన విని చిలువఱేఁడు వెరగందుచు అయ్యో! ఇది యేమి పాపము! నావలన నేదియో తెలిసికొనవలయునని గంపెడాసతో వచ్చి యుపవాసముల డస్సి యిప్పుడు నేను వచ్చిన నన్నేమియు నడుగకయే యింటికిం బోయెదనందువేల? నామాటలు నాలుగు వినినంతనే నా యసమర్థత తెల్లమైనదియా యేమి? ఇందులకు నా డెందము సిగ్గు జెందుచున్నదని యడిగిన న ప్పుడమివే ల్పిట్లనియె.

ఫణిపతీ! నీమతి నట్లనుకొనరాదు. నీమాటలు వినుటచే నా సందియము దీఱినది. నీయుపన్యాసమే నాశంకకు సదుత్తరమైనది. కర్తవ్యము దిలిసికొంటి. సంశయము దీరినది. అని తానువచ్చిన పనికి విన్న విషయము సమాధానముగా నున్నదని పలికి నిజ మెఱింగించి యతని వీడ్కొని భృగుండు నిజనివాసంబున కరిగెను.

అని నారదమహర్షి యెఱింగించిన విని శుకుండు సంతసించుచు మహాత్మా! నీయుప దేశంబున నామనంబునంగల సందియముదీరినది. పోయివత్తు ననుజ్ఞ యిమ్మని పలికి యమహ్మర్షి యెందేనిం బోయెను.


___________