కాశీమజిలీకథలు/పదవ భాగము/244వ మజిలీ

వికీసోర్స్ నుండి

గావింపుచుదారుణశోకావేశంబునమే నెఱుంగక నేలఁబడి మూర్చిల్లినది.

ఆ యుపద్రవవార్త కోటలోనున్నవా రందఱకు దెలిసినది. అంతఃపుర స్త్రీలందఱు మహా దుఃఖావేశంబుతో బ్రాణబంధువుల మరణములకు దుఃఖించుచుఁ గటారులఁ బొడుచుకొనువారును దాదులచేఁ బొడిపించుకొనువారును నూఁతులం దూకువారును అగ్నిలోఁబడు వారు మెడ కురిబోసికొనువారునై రెండు గడియలలో రాజస్త్రీ లందఱు దేహత్యాగము గావించుకొనిరి. వారి పాటుజూచి దాసదాసీ జనంబులు బలవంతముగనే హత్యలు గావించకొనిరి. అంతలో నా రక్కసుఁడు కోటలోఁ బ్రవేశించి మిగిలిన శిశు బాలవృద్ధులఁ గ్రుద్ధుడై నెత్తిపై గ్రుద్దుచుఁ బెద్దనిద్దుర నొందఁజేసెను.

మఱియు రక్కసులెల్ల నాకోట గొల్లకొట్టి పాతాళలోకము నుండి రాజకుమారులు తెచ్చిన రత్నములు, మండనములు, బంగారము నంతయు నెత్తికొని యాకోట పాడుపదడుచేసి తిరుగాఁ బాతాళలోకమున కరిగిరి.

అని యెఱిఁగించునంతఁ బ్రయాణసమయ మగుటయు నయ్యతి పతి యవ్వలికథ పై మజిలీయం దిట్లు జెప్పందొడంగె.

___________

244 వ మజిలీ.

నారదుని స్వస్వరూపప్రాప్తి.

క. పెద్దతడ వొడలు తెలియక
   ముద్దియపడి కొంతవడికి మోహంబుడుగన్
   దద్దయు విలపించెను బలు
   సుద్దులఁ బుత్రుల దలంచి శోకము హెచ్చన్.

సౌభాగ్యసుందరి కొంతసేపటికి మేను దెలిసి యట్టె లేచి నలు దెసలం బరికింపుచు దాపున నెర్విరింగానక కొంతపరిక్రమించి శవా క్రాంతములైయున్న ప్రాంగణ భూముల జూచి గతాసులైన కోడండ్ర

మనుమలఁ బౌత్రికల దాసదాసీ జనంబులం జూచిచూచి గుండెలు బాదుకొనుచుఁ బెద్ద యెలుంగున నాక్రోశింపుచు నావాకళులన్నియు దిరిగి తిరిగి యొక్కొక్క కోడలింజూచి తచ్ఛర్యల స్మరించుకొనుచు దుఃఖంప నోదార్చుటకు నొక్కరైనను మిగులలైరిగదా! అప్పుడామె చిత్తవృత్తి యెట్లుండునో చెప్ప నెవ్వరితరము?

తన పతికూడ సహితునిచే మృతినొందింపఁబడెనని నిశ్చయించి యాసాధ్వీమణి శో కావేశమునఁ గర్తవ్యమెఱుఁగక యున్మత్తవోలె నాకోటలో నొక్కరితయుఁ దిరుగ జొచ్చినది. అంతలో నొక మూల నుండి తాళధ్వజుండు రక్కల దాడికోడి పారిపోయి వారూరువిడిచి చనిన తరువాత మఱల రణావని కరుదెంచి యందుఁ జచ్చిపడియున్న కొడుకుల మనుమల శవములపైఁబడి యేడ్చి యేడ్చి కోటలోనివా రెట్లుండిరో యని తెలిసికొనుటకై యాప్రాంతమున కరుదెంచుటయు సౌభాగ్యసుందరి భర్తం గాంచి యతనిపయింబడి గోలు గోలున నేడ్చుచుఁ బాణేశ్వరా ! నాపుత్రులేరీ ? ఒంటిగా వచ్చితిరేల ? పిల్ల వాండ్ర యుద్ధభూమిలో విడిచివత్తురా ? మీకక్కటికములేదా ! అని పిచ్చిదానివలె నడుగుటయు నతం డాయెలనాగం గౌగలించుకొని.

క. ఎక్కడి పుత్రకులయయో
    ఎక్కడి పౌత్రకులు మానినీ! దుర్మతియా
    రక్కసుఁడు మడియ జేసెను
    నొక్కకొడుకునైన మిగులకుండఁగ నకటా!

మ. ప్రమదా! యేమని చెప్పువాఁడ మన మాపద్వార్థిలో మున్గినా
     రము దిక్కెవ్వరులేరు కాచుటకు రారమ్మందు నీపుత్రదే

    హము లెట్లున్నవొ చూతుగాక కని దేహత్యాగముంజేసి స్వ
    ర్గమునం దాప్తులఁగూడికొందము విచారంబేల నింకీయెడన్.

అని పలుకుచు భార్య చేయిపట్టికొని తాళధ్వజుండు యుద్ధభూమికిఁ దీసికొనిపోయెను. సౌభాగ్యసుందరి యందు నరకఁబడిన కాళ్లతో దెగిన చేతులతో మొండితల మొండి కళేబరముల గల పుత్ర బౌత్రాదుల గాత్రములఁగా కగృధ్రములు పొడిచి పీకుచుండఁ జూచి గుండెలు బాదుకొనుచుఁ భర్తతోఁగూడ నాశవములమీఁదఁబడి,

సీ. అయ్యయ్యో శ్రీముఖుండా వీఁడు కటకటా
                 కమలాంచితాస్య తేజము నశించె
    సౌమ్యుఁడా వీఁడయో చారుగాత్రమువాసె
                 గుందమాలాభి యుక్తుండుగామి
    చిత్రభానుఁడె వీఁడు శివశివా గాత్రముల్
                 కడముట్టె వారుణీకలనబాసి
    పుష్ప కేతుఁడె వీఁడు పోల్చంగ విగత ర
                త్నమకుటుండగుట ఖేదముఘటించె

గీ. ఖండితావయవములగు మొండెములఁ గ
    నంగ గుండెలుపగిలెఁ బుత్రాంగకముల
    గాక గృధములీడ్వంగఁ గనియు నిట్లు
    బ్రతికియుంటిని నావంటి పడఁతి గలదె.

అయ్యయ్యో! నాకుమారులు హంసతూలికా తల్పంబులఁ బండికొనియు నొఱయునని పలుకుచుందు రట్టి ముద్దుకుఱ్ఱల యవయవము లిట్లు ఖండితంబులై జంబుకంబులు దినుచుండఁ జూచియు మేనం బ్రాణంబులు దాల్చియుంటి నావంటి మొండికత్తె యెందై నగలదా ! ఛీ ! నేనొక ప్రేమగలదాననే. ఔరా! ఎంతలోఁ గాలము మారి పోయినది. నేఁటి యుదయకాలముననే కాదా కోడండ్ర తగవులు . దీర్చుచు నావంటి భాగ్యశాలిని యెందును లేదని గరువపడితిని. హాహా ! నిన్న నీపాటివేళ నాముద్దు కొమరులతో మాట్లాడుచు వారివారి భార్యల సౌందర్యంబునం గల తారతమ్యముల నిరూపించు చుంటి. ఛీ! ఛీ! నావంటి దౌర్భాగ్యురా లెందునులేదు. నాభర్త చెప్పినట్లు మృతినొంది సుతులతో ముచ్చటించెదనని పెద్దయెలుఁగున రోదనముజేయుచుఁ బౌత్రుల శవంబుల వెదగివెదకి గురుతుపట్టి తచ్ఛవంబులమీఁదఁబడి నాపోవుచు బెద్దతడ వాయుద్ధభూమి యున్మత్తవలె దల విరియఁబోసికొని తిరుగుచుండె. అప్పుడు,

క. వీపునఁ గృష్ణాజినము జి
   టాపటలము శిరమునందొడల భూతియు ను
   ద్దీపింపఁ బాఱుఁడొక్కరుఁ
   డాపడఁతి సమీపమునకు నరుదెంచి తగన్.

వృద్ధబ్రాహ్మణుడు - అమ్మా! నీవెవ్వతెవు? ఇట్లు దుఃఖించుచుంటి నెవ్వరి నిమిత్తము?

సౌభాగ్యసుందరి – (నమస్కరించి) మహాత్మా! నాదౌర్భాగ్య మేమి చెప్పుదును? ఏను తాళధ్వజనృపాలునిం బెండ్లియాడితిని. లోకైకవీరు లిరువదిమంది కుమారు లుదయించిరి. నాలుగుదిక్కులు జయించి త్రిభువనైకసుందరులం బెండ్లియాడి పెక్కండ్రఁబుత్రులం గనిరి. మావంశము యాదవవంశమువలె వృద్ధినొందినది. ఈదినమున శత్రువులచే నాకుటుంబ మంతయు నాశనమైనది. నేనును నాభర్త మాత్రము మిగిలితిమి. తండ్రీ! అని దుఃఖంచినది.

వృద్ధ — అమ్మా! నిన్నొక్కమాట నడిగెదఁ జెప్పుము. నీవా రాజుం బెండ్లియాడి యెంత కాలమైనది?

సౌభా - ఎనుబది సంవత్సరములైనది. ఆహా! నేననుభవించిన సౌఖ్యము ఇంద్రాణియైన ననుభవింపఁలేదు. తండ్రీ! ఆవైభ వమంతయు గడియలో స్వప్న ప్రాయమైనది. అని పెద్ద యెలుంగున రోదనము గావించినది.

వృద్ధ --కోమలీ! నీవు శోకముడిగి నామాటవింటివేని జెప్పెద. లేకున్న నాదారింబోయెద. నామాటలకు సమాధానముజెప్పుము.

సౌభా — చిత్తము. మహాత్మా. చిత్తము.

వృద్ధ - నీవారాజుం బెండ్లియాడకపూర్వ మీసంతతియంతయునున్నదియా?

సౌభౌ -- ఎవ్వరులేరు స్వామి! పెండ్లియాడిన తరువాతనే యీకుటంబమువృద్ధియైనది. గడియలో నాశనమయినది. అని శోకించినది.

వృద్ధ - మొదటలేదు నడుమవచ్చినది. చివరపోయినది. ఇందులకు వగచెద వేమిటికి? సంసారము మోహజనకము క్షణభంగురమని తెలియదా? వీరికి నీ వేమగుదువు. వీరు నీ కేమగుదురు? ఎట్టి సంబంధము? గర్భవాస సంబంధము. వారికి నీవంటి తల్లిలెందరైరో? నీవిదివఱ కెందరకుఁ దల్లివైతివో! అందఱికొఱకు నిట్లుదుఃఖించుచుందువా? ఈచక్ర మిట్లు తుది మొదలులేక గడియారమువలెఁ దిరుగుచునే యుండును. నీవు పుత్రోదయము సుఖమని మురిసితివి. ఆమురిపెమే యీవెఱపునకుఁ గారణమైనది. అదియే లేనిచో నిదియును లేకపోయెడిదే సంసారమాయామార్గ మిట్టిదని తెలిసికొనుము. ఏడవకుము. లెమ్ము. లోకమంతయు నస్థిరమని యెఱింగిన శోకముండునా? ఇంతయేల? నీమాట చెప్పుము. ముందరిక్షణమున నీవెట్లుందువో తెలియునా? సంసార ప్రవాహంబునఁ బుద్బుదములవలె గొట్టి కొనిపోవుచు దేహులు మోహావేశచిత్తులై దుఃఖసముద్రంబునం బడిపోవుదురుగదా! కావున విలపించిన ప్రయోజనము లేదు. . లెమ్ము. అదియ పుణ్యసరోవరము. అందు స్నానమాచరించిన మనోమలంబు వాయగలదు. స్నానమాచరింపుము. అని యుపదేశించుటయు నా యోషామణి కించుక విరక్తిగలిగినది. సంసారము స్వప్న ప్రాయము. ఎండమావుల నీరు గ్రోలదలంచినట్లిందు సుఖపడఁదలంచుట భ్రాంతియేయని తలంచుచు నాచంచలాక్షి అట్టెలేచి యాపాఱుని వెంట నల్లంత దవ్వులోనున్న తటాకమున కరిగినది. భర్త యించుక యెడముగ నుండగనే మనములోదుఃఖించుచు నాజలాకరము లోనికిఁ దిగి దలవిప్పికొని మూడు మునుఁగులును మునింగి లేచినంత,

క. తీరమునఁ జూచె గరుడుని
   చేరువఁ గూర్చున్నవిష్ణుఁ జెంతను తన వీ
   ణారత్నము నజినంబును
   దారుకమండులువు విస్మితస్వాంతుండై .

పిమ్మటఁ దనయాకారము జూచుకొని యెప్పటి నారదవేషము ప్రత్యక్ష్యంబగుటయు మోహవివశుండై తన కుపదేశించిన బ్రాహ్మణు నందుఁ గానక క్రమ్మఱ దరిదెసకు జూపుల వ్యాపింపఁజేసి యందున్న శ్రీహరిని, దనవీణా కమండలువులగాంచి కన్నులమూసికొని సౌభాగ్యసుందరీ వృత్తాంతమంతయుఁ దలంచుచు నేది నిజమో యేది యసత్యమో తెలిసికొనఁజాలక తొట్రుపడుచున్న సమయంబునఁ బుండరీకాక్షుఁడు మందహాసము గావించుచు,

ఉ. స్నానముసేత కింత యట జాగొనరించితివేల ! నీ యను
    ష్ఠానము దీర్చుకొంటె మునిచంద్రమ! రమ్మట వేగ మేనునున్
    స్నానముజేసి వచ్చెద వెసంజనగాఁ దగు నూరిలోనికిం
    భానునిబింబ మప్పుడె నభంబు సగంబెగఁబ్రాకెఁ జూడుమా.

అని పిలుచుటయు నతం డాహా! ఇదియేమి మోహము ? తాళధ్వజునితో నెనుబదియేండ్లు కాపురముజేసి యిరువదిమంది బిడ్డలం గనిన దంతయు వట్టిదే. ఇది స్వప్నము కాఁబోలు. నేను నారదుఁడనా ? సౌభాగ్యసుందరినా ? సరి సరి. గర్భధారణ ప్రసవ వేదనము మొదలగు చర్యలన్నియుం గన్నులకుఁ గట్టినట్లుండ నిది వట్టిది యెట్లగును ! అయ్యో ! నేను నారదుండగానా ! స్నానము చేయుమని నన్ను విష్ణుండు ప్రేరేప నిందు గ్రుంకలేదా ! ఇంతలో నింతకాలమైనట్లున్న దే ! ఇంద్రజాల మేమో! ఏమియుఁ దెలియ కున్నది గదా! నే నిప్పుడు నిద్రలో నుంటినేమో! అంతయు నచ్యుతున కెఱింగించి నిజము దెలిసికొనియెదం గాక ! అని యాలోచించుచు మెల్లగా గట్టెక్కి విష్ణునికడ కరుగుచుండెను.

అంతలో నాతాళధ్వజనృపాలుం డాతటాకము దాపున కరుదెంచి పెద్ద యెలుంగున సౌభాగ్యసుందరీ! సౌభాగ్యసుందరీ ! యని పిలుచుచుఁ బ్రతివచనంబు బడయక గుండెలు బాదికొనుచు,

అయ్యో! అయ్యో! నాప్రాణనాయకి యీకొలనిలోఁ దిగి మునింగి పోయినది. జలజంతువులు మ్రింగినవి కాఁబోలు. అక్కటా! నేనిఁక నెట్లు బ్రదుకువాఁడ. హా ! పరమేశ్వరా ! అని పలుకుచు మూర్ఛవడి కొంతవడికి లేచి నలుదిక్కులు సూచుచు నింకెక్కడి సౌభాగ్యసుందరి! నీటిపాలైనది. అని గోలుగోలున నేడువఁ దొడంగెను. మఱియు,

సీ. సౌభాగ్యసుందరీ ! నాభాగ్యదేవతా!
               సతి! నన్ను విడిచిపోయితివె నీవు
    వద లెనే నేఁటితో ముదిత! నీతోపొందు
              నాకు దిక్కెవ్వరున్నార లింక
    కలికి నీప్రధమసంగమము నాఁటివినోద
              ములఁ దలంచిన గుండె కలక జెందె
    స్త్రీరత్నమనుచు వర్ణింపఁగాఁదగు నిన్నె
             తప్పులెన్నెద వరుంధతికినైన

గీ. సాధ్వి నీయట్టినతి యెన్ని జన్మములకు
    నైన దొరకునె తలక్రిందుగాను నిలిచి
    తపముజేసినగాని సీ! తలఁచిచూడ
    వట్టి నిర్భాగ్యుఁడైతిఁ జివరకు నేను.

అని యమ్మహారాజు సౌభాగ్యసుందరి తనకడకు వచ్చినది మొదలు నాఁటి తుదివఱకు జరిపిన చర్యలన్నియు నుగ్గడించి దుఃఖించుచు నా సరోవరములోఁదిగి వెదకుచుండ నాలించి నారదుండు అచ్చర్యలెల్లఁదాను గావించినవిగా నెఱింగియు నేమియుందోచక యూరక చూచుచుండె నప్పుడు శ్రీవిష్ణుం డాభూపాలుఁ దాపునకు రమ్మని చీరి సమీపించినంత,

నీ వెవ్వఁడవు ? ఎవ్వరి కొఱ కిట్లు విలపించు చుంటివి ? ఆతటాకములో వెదకుచుంటి వేమి పోయినది? అని యడిగిన నాభూనేత తన కథయంతయుం జెప్పి నాకళ్యాణరాశి నాసౌభాగ్యసుందరి నాజీవితేశ్వరి, యీతటాకములో మునిఁగి తిరుగా లేచినదికాదు. జలజంతువు లేవియో మ్రింగినవి. ఆయొప్పులకుప్ప నందు వెదకుచుంటి తండ్రీ! మీకుఁ జూలపుణ్యమురాఁగలదు. అందులకు సహాయము జేయుదు రే. అని వేడికొనిన నవ్వుచు ముకుందుం డిట్లనియె.

నీటిలో మునింగినవా రింతసేపు జీవింతురా? నీభార్య మకర గ్రస్తయై పరలోకమున కఱిగినది. ఎంత విలపించినను నీకాంత రానేరదు. వగపు నిరర్ధకము. మూఢుండవై యేల విలపించెదవు? ఇంటికిం బొమ్మని పలికిన విని తాళధ్వజుం డిట్లనియె.

అయ్యయ్యో! నాభార్య లోకము పరిపాటిబోటికాదు. తండ్రీ! ఆసుగుణములు, ఆప్రేమ, ఆయనురాగము ఇట్టిదని చెప్పఁజాలను. కుటుంబమంతయు నశించినను నాయిల్లాలు బ్రతికి యున్న నేనిట్లు విల పింతునా! ఇంటికిఁబోయి యేమిచేయుదును? ఇల్లు సర్వశూన్యమై యున్నది. నేనుగూడ నాతటాకములోఁబడి ప్రాణములవదలెద. నాకు వేరొకగతిలేదని దుఃఖింపఁదొడంగిన వారించుచు నిందిరాభర్త రాజా! నీవు శాస్త్రములేమియుఁ జదువలేదా ! పురాణములు వినలేదా? పెద్దల సహవాసమేమియుఁ జేయలేదా? నీవు వట్టి మూఢుఁడవువలె దోచుచుంటివి. వినుము ప్రవాహరూపమైన సంసారమున భార్యా పుత్రాదులు నావయెక్కుటకుజేరిన పాంథులవలెఁ జేరికొని యెవ్వరిదారిని వారు బోవుచుందురు. వెనుకటి జన్మమున నామె యెవ్వతె? నీవెవ్వఁడవు? ఇప్పుడు కలిసి కొన్నిదినములు గాపురము సేసిరి. ఆమెదారి నామె పోయినది. నడుమవచ్చినది నడుమపోయినది. మొదటినుండియు నీకడనున్నదా! చేరకపూర్వ మామెయందు నీకీ మోహమున్నదియా! ఆమెరాక నీకు సుఖముగలిగించినది. పోక దుఃఖమైనది. దుఃఖాంతములు సుఖములని యెఱుంగవా. జ్ఞానము దెచ్చికొని మోహమును నాశనముజేయుము. తపోవనంబు నకుంబోయి యోగముపట్టి ముక్తుండవుకమ్ము. కానిచో మఱియొక యువతిం బెండ్లి యాడుము. వేయిసంవత్సరములు విలపించినను నీకాసుందరి గనం బడదు, పోపొమ్మని పలికిన విని యారాజు శ్రీహరికి నమస్కరించుచు నిట్లనియె.

అయ్యా! మీరెవ్వరో మహానుభావులగుదురు. మీమాటలచే నాశోకము కొంత తఱిగినది. కాని స్వామీ! నా సౌభాగ్యసుందరి నెట్లు మఱవఁగలవాఁడను? ఆనర్మోక్తులు, ఆప్రియభాషణములు ఆక్రీడలు తలంచికొనిన నామనసు దుఃఖసముద్రములో మునిఁగిపోవుచున్నది. అబ్బా! దురంతశోకానలంబున నామేను భగ్గున మండిపోవు చుస్నది. ఎట్లు తాళుదును సామీ! అని పరితపింవ నాక్షేపించుచుఁ బుండరీకాక్షుం డిట్లనియె. సీ మూర్ఖుఁడా! నాచెప్పిన నీతియంతయు వఱదపాలుగావించితివే. మోహమన నిదియేకాదా! ఇంత తెలిసికొనఁజాలకుంటివేమి? ఇది యొక యింద్రజాలమని గ్రహింపుము. ఎండమావులలో నీరు గ్రోలఁగలవా? నీవిట్లెన్ని కల్పములు దుఃఖించినను నీభార్య కనంబడదు. విరక్తుండనై యింటికిఁ బొమ్మని యుపదేశించిన విని తాళధ్వజుం డేమాటయుం బలుకనేరక లోలోపల దుఃఖించుచుఁ దటాకములో' స్నానముజేసి యింటికింబోయెను.

అని యెఱింగించి — పైమజిలీయం దిట్లు చెప్పఁదొడంగె.

__________

245 వ మజిలీ.

క. నారదుఁ డామాటలఁ జెవు
   లారఁగ విని నృపతిఁ గన్నులారఁగని యప
   స్మారుని గతిఁ దనమదిలో
   నూరక తలపోసిపోసి యూహగలంగన్.

గీ. నవ్వు, విలపించు, వగచి డెందమున దాను
   మున్ను జేసిన చేష్ఠలనన్ని దలఁచి
   స్వప్న మో! భ్రాంతియో! యింద్రజాలమో! య
   టంచుఁ దర్కించు నాకస మట్టెచూచి.

అతని చిత్తవికారంబరసి సరసిజాక్షుండు నవ్వుచు నారదా? నీవున్మత్తుండువోలె నీలోనీవే మాటలాడికొనుచుంటివేమి? జలంబుల మునింగి వింతలేమైన గంటివా! అని యడిగిన గ్రహించి నారదుండు ఓహోహో ఇదియా తాతా! తెలిసికొంటి నీవుపన్నిన యింద్ర జాలమా! నీచేతవంచింపఁబడితి. మాయాబలము జూపితివి. ఔరా! ఎన్నివిచిత్రములు గావించితివి? లెస్స. లెస్స. నేనాఁడుదాననై కావించిన చర్యలన్నియుఁ గన్నులకుఁ గట్టినట్లున్నవి గదా! అయ్యో!.