కాశీమజిలీకథలు/పదవ భాగము/241వ మజిలీ

వికీసోర్స్ నుండి

క. మీరా జాఁడుదియని విని
   నారముగద పురుషుఁడయ్యెనా యిపు డక్కాం
   తారత్నం బట్లైనం
   బోరం గనుఁగొందు వాని భుజబలమిహిహీ.

అని పలుకుటయు మేమదలించి వానిం బట్టికొనఁ బ్రయత్నించితిమి. స్వామి ! వాఁడు మాకు లొంగువాఁడుకాడు. చేతనున్న బెత్తముతోనే మమ్ముఁ గాందిశీకులఁ గావించెను. ఆదెబ్బలఁ దిని పారిపోయివచ్చితిమని యెఱిఁగించినఁ బక్కున నవ్వుచు నౌరా ! ఈ రాజ్యంబున మంచివీరులున్నారు గద. రాజునానతినొక్కరుఁడు లెక్క సేయఁడు. ఆఁడురాజ్య మాఁడురాజ్యముగానే యున్నదని రత్నమకుట నాక్షేపించుచు వారిరువురబలము రేపు గనుంగొనియెదఁగాక. తెల్లవారకమున్న పదుగురసాదుల నిందుండునట్లు నియమింపుము. నానిమిత్త ముత్తమాశ్వ మొకదాని నాయత్తపరచి యుంచుమని మంత్రికి నియమించి పుష్ప కేతుఁడు భార్యతోఁగూడ నతఃపురమున కరిగెను.

అని యెఱింగించునప్పటికి వేళ యతిక్రమించినది. పై కథ యవ్వలిమజిలీయం దిట్లు చెప్పందొడంగెను.

241 వ మజిలీ.

మణిమతుఁ డల్లునితో నగరిలోజరిగిన కథయంతయుం జెప్పి గడ్డముపట్టికొని బాబూ! నామాట వినుము. బలవద్విరోధమువలదు. రాజు చాలమంచివాఁడు. రత్న పాదునిమాటలు విని యతని నాక్షేపించుచు నీపక్షమే వాదించెను. నీవు తనకడకు వచ్చితివికావను కోపముతప్ప మఱేమియును లేదు. ఒకసారి పోవుదమురమ్మని బతిమాలిన నవ్వుచు నతండు మామా! నాసామర్థ్యము నీవెఱుంగక వగచుచున్నావు. అతండు నన్నేమియుఁ జేయఁజూలఁడు. నాకంటె బలవంతులగు నాసోదరులు నలువు రీయూరనున్నారు. అంతయవసరమువచ్చి నచో వారిం గలసికొని తోడుచేసికొనియెద. నీవు విచారింపకుమని పలుకుచు నతండు వత్తునన్న వేళకు గుఱ్ఱమెక్కి యావీథిం దిరుగు చుండెను.

మయూరధ్వజుం డెందుండియో యాదారి నరుదెంచుచు గుఱ్ఱముపై నున్న చిత్రభానుని గుఱుతుపట్టి అన్నా ! నీవిందున్నా వేమి ? ఈగుఱ్ఱమెక్కడిది ? బసలోని కరిగితివా? సోదరులం గలసికొనుచుంటివా అని యడిగిన విని యబ్బురపాటుతోఁ దమ్ముఁడు మయూరధ్వజుఁడా! బాగు బాగు. తలంచినంతనే కనంబడితివే. నే నొక్కగొడవలోఁ బడిపోయితిని. మన మీపట్టణప్రభువు ఆఁడుదియని యుపేక్ష చేసితిమి. మగవాఁడఁట. నాకిప్పుడతనితో విరోధమువచ్చినది. నన్నుఁ బట్టికొనుటకు వచ్చుచున్నాఁడు. వాని ప్రాణమునకు మనమిద్దరము చాలమా? తక్కినసోదరులఁ బిలువనేల. ఆగుఱ్ఱమెక్కి నిలఁబడు మని పలికిన సంతసించుచు మయూరధ్వజుఁడు వేఱొక తురగమెక్కి కత్తిచేతంబూని యిటునటు స్వారిచేయుచుండెను.

అంతలో భేరీధ్వానము దంధణ యంచు మ్రోఁగుచుండెను. పుష్ప కేతుఁడు తమ్ముఁడు పింగళునితోఁ గూడఁ దురగారూఢుండై వీరయోధులు పెక్కండ్రాయోధనసాధనంబులఁ బూని చుట్టునుఁ బరివేష్టించి రాఁ దురగఖురపుటీపాటితంబగు భూరజం బాకసంబుగప్పి చీఁకటి గలుగఁజేయఁ బటురయంబున మణిమంతుని గృహంబు నికటంబున కరిగెను.

మయూరధ్వజుండు చిత్రభానుండును వారిరాకఁ దెలిసికొని తమ ఘోటకముల విచిత్రగతుల నడిపించుచు వారి కభిముఖముగా నిలువంబడి చూచుచుండిరి. అప్పుడు పింగళుం డన్నల గుఱుతుపట్టి యోహో! అవీరులు మనసోదరులు. చిత్రభానుండును, మయూరధ్వజుండును, అన్నా ! చూడుమనిపలికిన నతం డౌను వారలే. తెలిసినది. మణిమంతుని యల్లుఁడు మనవాఁడేకాఁబోలు. కానిచో నితరున కాబింక మెట్లువచ్చెడిని. నేఁడు మంచిసుదినమే యని సంతసించుచు దమవాఱువముల వారిచేరువకుఁ బోనిచ్చిరి. వారు వీరిం గుఱుతుపట్టలేకపోయిరి. ఎఱింగియే పింగళుడు-

క. నిలు నిలుఁ డేయకుఁ డేయకు
   డలఘువ్రతులార యుష్మదభిదానములం
   దెలుపుఁడు పదఁపడి మనమన
   బలములు దెలియంగవచ్చు భండనవేళన్.

అని యడిగిన విని చిత్రభానుండు

గీ. పుడమిఁ దాళధ్వజనృపాల పుత్రకులము
   శూరమణి పుష్ప కేతుని సోదరులము
   క్షత్రియాన్వయభవుల మాక్రాంతసంగ
   రోత్సవప్రీతులము విజయోత్సుకులము.

అని చెప్పినంత వారిరువురు గుభాలున గుఱ్ఱముల డిగ్గనుఱికి తమ్ములారా! రండు రండు మేము మీసోదరులము. తెలియక యొండొరులము కలహింపదొరకొంటిమని పలుకుచుండఁగనే వారును వారువముల దిగి వారిం గౌఁగిలించుకొనిరి. అప్పుడు పింగళుఁడు వారితో దైవసంకల్పము కడువిచిత్రమైనది. పదిదినములలో నెన్నిమార్పులు కలిగినవి? పెద్దన్న యీవీటికి రాజయ్యెను. చిత్రభానుఁడు కోటీశ్వరుని పట్టిం జేపట్టెను. మయూరధ్వజుఁ డేమిచేసెనో తెలిసికొనవలసి యున్నది. సౌమ్యుఁడు ఇంటికడ మనజాడ నరయుచు నుండెనేమో? మనమీనగరము చేరినవేళ మంచిదే యని సంభాషించుకొనుచున్న సమయంబున సౌమ్యుండు గుఱ్ఱమెక్కి కొందఱయోధులం దఱుముకొని యచ్చటికి వచ్చెను. వానింజూచి అదిగో మనసౌమ్యుఁడని పింగళుడు కేక పెట్టెను. ఆ కేకవినిసౌమ్యుఁడు వారి నికటమున కరుదెంచి యోహో! మాసోదరులందఱు నిచ్చటనే యున్నా రే నారాక శుభోదర్కమైనదే యని పలుకుచుండఁ బుష్ప కేతుఁడు సౌమ్యా! నీవీగుఱ్ఱపురౌతులఁ దఱుముకొని వచ్చితివేల? వాండ్రు నిన్నేమిగావించిరి? అని యడిగిన నతం డిట్లనియె.

అన్నా ! మన మిన్నగ రాధిపతి నాఁడుది యనుకొనలేదా మగవాఁడఁట. నే నేదియో యపరాధము చేసితినని నన్నుఁ గట్టి తీసికొనిరమ్మని యీయోధుల నంపెను. అందులకై వారిం దఱిమితినని చెప్పగా నవ్వుచుఁ బింగళునితో నేననినట్లేయైనది చూచితివా కానిచో నొరులకు రాజుపైఁ దిరగఁబడు సామర్థ్యముండునా ! సౌమ్యా ! నేనే నీకావార్త నంపితిని. నేనే యీనగరమునకు రాజైతిని. అంతయుఁ నానకజెప్పెదంగాక యిప్పుడు కోటలోనికిఁ బోవుదము రండు అని పలుకుచు మణిమంతుని రప్పించి వర్తకుఁడా! నీయదృష్టము మంచిది. యదృచ్ఛగా నీబిడ్డకుఁ జక్రవర్తి కొడుకు మగఁడయ్యెను నీయల్లుఁడు మాతమ్ముఁడే యని యాకథయంతయుం జెప్పి వారి నందఱ వెంటఁబెట్టికొని దివాణములోనికిం బోయెను.

పుష్ప కేతుం డంతఃపురమున నొకసభజేసి తనభార్య రత్నమకుటను రప్పించి తమ్ములంజూపుచు జరగిన వృత్తాంతమంతయు నెఱింగించెను. లోకాతీత ప్రతాపసంధుక్షులగు మీకుఁగాక యొరుల కిట్టిపౌరుషము గలిగియుండునా అని పరిహాసమాడినది. తరువాత నొండొరుల చరిత్రము లిట్లు చెప్పుకొనిరి.

కుందమాల కథ.

అందు సౌమ్యుఁ డిట్లనియె. సోదరులారా ! నాఁడు నేనును బింగళుండును నీవీఁటి వేశవాటికంగల విశేషములఁ దెలిసికొనఁదలంచి కొంతదూరము కలిసిపోయితిమి. ఒకవీథిలో నే నతనివిడిచి పైకిఁ బోయితిని. ఒకచోట నడివీధిలోఁ గూర్చుండి కొందఱు గోవాళ్ళు విలాసముగా మాట్లాడికొనుచుండ నందొకచోఁ గూర్చుండి యాలకించితిని.

ఒకఁడు - కుందమాలతల్లి వ్యాఘ్రముఖిమాట యముండు మఱచిపోయెనేమో ఎంత కాలమునకు దానికిఁ జావురాదేమి ?

మఱియొకఁడు — కుందమాల యౌవనము లావణ్యము సౌందర్యము త్రిభువనాభిరామంబై యొప్పుచున్నది. అయిననేమి నీవనినట్లుమాతృపిశాచావేష్టితయగుట నది యెవ్వరికి నుపయోగ పడకున్నది.

ఇంకొకఁడు — వ్యాఘ్రముఖి కుందమాలకుఁ గన్యాత్వహాని కాకుండ విటుల వంచించుచు ధనమార్జించుచున్నదఁట యెట్లు?

ఒకఁడు - ఆరహస్యమే యెవ్వరికిం దెలియదు. దానిలోపలికిఁ బోయినవాఁడు తిరుగావచ్చి యిట్లైనదని చెప్పినవాఁ డొక్కరుఁడును గనంబడలేడు. నే ననేకదినములనుండి చూచుచున్నాను.

మఱియొకఁడు - గ్రామస్థుల నెవ్వరిని గదిలోనికి రానీయదఁట వింటిరా? పొరుగూరివాండ్రుగాని దానికపటములోఁ జిక్కికొనరు.

ఒక్కఁడు — ఎట్లైననేమికుందమాలచక్కఁదనము చూచితీఱవలయు. మొన్న గరుడోత్సవములోఁ జూచితిని. అబ్బా! దానియందము, బింకము, పొంకము, సౌరు, టక్కు మన నగరములోనున్న వారకాంతల కెవ్వరికిని లేదు.

మఱియొకఁడు – అది మనఁబోఁటులకు లభ్యముకాదు. అందరానిపండ్ల కాశపడనేల? నాతోరండు మఱియొకవింతఁ జూపెదనని చెప్పగా వానివెంట నందఱు లేచి యెందేనింబోయిరి.

నేను వారి సంభాషణములన్నియు వింటిని. కుందమాల మిగులఁ జక్కనిదని తోఁచి దానిం జూడవలయునని యభిలాషగలిగిన ది. దానిమేడ యాప్రాంతమందే యుండుటచేఁ దెలిసికొని పోయి యా యింటి వీధియరగుపైఁ గూర్చుంటిని. అంతలో సాయంకాలమైనది. వాడుకప్రకారము దాదియొకతె తలుపులు తెరచికొనివచ్చి దీపము వెలిగించి నన్నుఁజూచి అయ్యా! తమరెవ్వరు? ఏమిటికై యిందుఁ గూరుచుంటిరని యడిగినది.

కుందమాలవాడుక విని యాచేడియం జూడవచ్చితిని. మాది విదేశము నాయాశయ మా కుశేశయవదన కెఱింగింతువేయని కోరితిని. అది నామాటలువిని కన్నులు చిట్లించుచుఁ గుందమాలకు గాదు. ఆమెతల్లికిం జెప్పి తీసికొనిపోయెద నిందు నిలుండని పలికి యాదాది లోపలికిఁ బోయి గడియలోవచ్చి ముచ్చటమాటలాడుచు నన్నాసదనాంతరమునకుఁ దీసికొనిపోయి యొకపీఠంబునంగూర్చుండఁ బెట్టినది. నేనందలి వింతలు చూచుచుండ నింతలోఁ గుందమాల తల్లి వ్యాఘ్రముఖి వచ్చి నాకు సమస్కరించుచు,

వాఘ్రముఖి — ఓహో! మీరు మహారాజుబిడ్డలువలె నుంటిరి. మేమెంతధన్యులము. మాకుందమాల నోము లిప్పటికి ఫలించినవి. మీనివాసదేశమేదియో చెప్పెదరా?

నేను — అబ్బో! మాది చాలదూరదేశము. నేనొక రాజకుమారుఁడనే.

వ్యా — ఆమాట మీరుచెప్పకయే మీ మొగమే చెప్పుచున్నది. సామాన్యుల కీసౌందర్యాతిశయముండు నా. బాబూ మీపేరేమి?

నేను - సౌమ్యుఁడందురు.

వ్యా — ఇఁక నేమి! మీ సౌశీల్యము నామమే చెప్పుచున్నది.

నేను - ఏదీ, మీకుందమాల యిటురమ్మను, మిక్కిలి చక్కనిదని వింటిని?

వ్యా — అలంకరించుకొని రాఁగలదు. ఇదిగో దాని చిత్ర ఫల కము. బాబూ! నేననవలసినమాట కాదుకాని మాకుందమాలను బోలిన యెలనాగ యీభూమండలమందేకాదు స్వర్గమందుఁగూడ లేదని చెప్పఁగలను.

నేను — అట్లై న నేను ధన్యుఁడనే కదా.

వ్యా – చక్రవర్తులు వచ్చి యూళ్లిత్తుమనియు దేశములిత్తు మనియుఁ గన్నెఱికము సేయుటకుఁ గోరిరి. నేనును నాకూఁతురుగూడ నంగీకరించితిమికాము. తగినవాఁడు దొరకవలయు నభిలాష తీరవలయు. ఊళ్ళును దేశములు నేమిచేసికొనఁగలము.

నేను -- నీవుమంచిగట్టిదానవఁట. నీమాట వీథిలోఁ జెప్పికొనిరి.

వ్యా - ఇప్పటివాండ్రకు మాపాటి సామర్థ్యములేదు. ఇంతకు దాని కళ్లముందర దాటవలయుఁ గదా.

నేను - నే దాటించెద వెరవకుము. ప్రొద్దుపోయినది. కుందమాలను రప్పింపుము.

వ్యా - అమ్మాయికిఁ గల నగలన్నియు రత్నములు చెక్కినవియే. యలంకరించుకొని యిప్పుడే రాఁగలదు. అంత దనుక మీరాహంసతూలికాతల్పంబునఁ బండుకొనియుండుఁడు. నేను బోయి వేగ ననిపెదనని చెప్పి యది యవ్వలకుఁ బోయినది. అప్పుడు నేను మెల్లగ లేచి యామంచము దాపునకుఁ బోయి సంశయముతో

“శ్లో|| శయనేహస్త తాడనం” పండుకొనునప్పుడు చేతితో శయ్యంగొట్టి దులిపి పిమ్మట శయనింపవలయునని చిన్నప్పుడు చదివికొన్నమాట జ్ఞప్తికివచ్చుటచేఁ గుడిచేఁతితో నట్లు కొట్టితిని. అది యమరించిన యంత్రము గడియసడలి తటాలున నాశయ్య యగాధముగానున్న నూఁతిలోఁ బడినది.

నే నాయుపద్రవముఁ జూచి ఔరా! యీరండ యెంతమోసము చేయుచున్నది? ఈకపట మెవ్వరును దెలిసికొనలేకపోయిరే. ఎంత మంది నిట్లు చంపినదో. దీనిమేను తునుకలుగాఁగోసి పారవేసినను దోసములేదు. అని యాలోచించుచు దాని తరువాయి చర్యలు పరీక్షించు తలంపుతో నం దొక తలుపుమూల డాగి చూచుచుంటిని. పఱుపు జూరిపడుటకు గురుతుగానుంచిన గంటచప్పుడు విని దాదియు నదియు నచ్చటికివచ్చి శయ్యజారుట తెలిసికొని యిట్లు సంభాషించిరి.

వ్యాఘ్ర - ఒసేవు! అబ్బాయిగారి పని అయినది. నూఁతిలోఁ బోయి శయినించినారు. అమ్మాయి వీనిమాటలు విన్నదా? లేదా?

దాది - అమ్మాయిగారు మీరాయనతో మాట్లాడుచుండగాఁ వచ్చి చూచిపోయినది. వాని సౌందర్యము చూచి వలచినది. తన కతనినే పెండ్లిచేయుమని మీతోఁ జెప్పుమన్నది. ఇంతలో మీరీపని కావించితిరి.

వ్యాఘ్ర - రండవు నీవు వానియందము దానికడఁ బొగడితివి కాఁబోలు లేకున్న నది యేమిటికి వచ్చి చూచును ?

దాది — అవును. ఆమాట వాస్తవమే. మీకుఁ జెప్పలేము గాని ఆయన మంచి చక్కనివాఁడు. అట్టి యందగాని నింతకు ముందు నేను జూచియుండలేదు. మనకుందమాలకుం గూర్పివలసినది.

వ్యాఘ్ర - ఓసి రండా! మంచియాలోచనయే చెప్పుచున్నావు. అమ్మాయిగారు అప్పుడే మగనిఁ బెట్టుకొని కులుకవలయునని చూచుచున్నది కాఁబోలు. ఇంకను బదారేండ్లు నిండలేదు. అప్పుడే విటులు నలుగురు త్రొక్కి, విడిచినచో దమ్మిడీ చేయదు. ఆకుట్లబొంత నెవ్వఁడు వలచును? ఈబెట్టుమీఁదనే విత్తము సంపాదింపవలయును. దాని లావణ్యము తెలిసియేకదా గొప్పగొప్ప విటులు వచ్చుచున్నారు.

దాది – ఆమ్మా! ఎల్లకాలము సంపాదనయే? ఉన్న సొమ్ము చాలదా. పెక్కేల. మీరు చేయుచున్న ద్రోహకృత్యము లమ్మాయిగారి కిష్టములేదు. మీతో బలుమాఱు చెప్పుమన్నది.

వ్యాఘ్ర - ఛీ! రండా! నోరుమూయి. ఇంతయాస్తి న్యాయవర్తనమున సంపాదింపఁగలమా. ఇప్పుడు వచ్చినపురుషునిమేనఁ గోటివెలగల రవ్వలవస్తువు లున్నవి. వాఁడు దీనితోఁ గలిసినఁ బదులిచ్చును. వెలిచ్చును. ఇప్పుడో అంతయాస్తియు సులభముగా దక్కినది. దేహము చెడలేదు.

దాది - అమ్మా! ఎంతకాల మిట్లు విటపురుషులం జంపుదువు? ఇక నిట్టిపని జేసినఁ దానెం దేవిఁ బోయెదనని అమ్మాయిగారు మీతో జెప్పుచున్నది తెలిసినదియా!

వ్యాఘ్ర - నీవు నదియుంగూడఁ బొండు. మఱియొకకన్యం దెచ్చి పెంచెద. నీబోధయంతయు నీవే చేయుచున్నావు. అ దేమియు నెఱుంగదు. సరేకాని రేపు పెందలకడ రమ్ము. నూతిలో విటశరీరముపైఁగల వస్తువులు తీయవలసియున్నది. రహస్యముగా శవవాహకులతోఁ గూడఁ జెప్పుము.

అని పలుకునప్పటికి నాకుఁ గోప మాగినదికాదు. హిరణ్యకశిపునిపై నుఱుక నరసింహమూర్తియుంబోలె నాభీలరౌద్రావేశముతోఁ బోయిఁ దానిపయింబడి యెడమచేతితోఁ గొప్పు పట్టుకొని లాగుచు --

శా. రండా! నీతనువెల్ల ముక్కలుగ ఘోరప్రక్రియం గోసి యా
    కండల్ గుక్కలు గాకగృధ్రములు మెక్కంజేయుదున్ జంకులే
    కుండం జంపితి వెందఱెందఱినొ మాయోపాయపాండిత్య ము
    ద్దండంబై తగనిండె నీదు దురతౌద్దత్యం బహా నేఁటికిన్.

అని పలుకుచు నొఱనుండి కటారిం బెఱికి శిరంబు నఱకనుంకించుటయు నది మొఱ్ఱోయని యరచుచు నిట్టట్టు కొట్టుకొనుచుండ సందిటంబట్టి యెత్తి గుభాలున నాపాడునూతిలోఁ బారవైచితిని. అందున్నపురుషులు గొంద రడ్డము వచ్చినవారినెల్ల గత్తితోఁ నఱకి యాకూపంబుననే పడవిడిచితిని.

అందున్న దాదులు వెఱచి నలుమూలలకుం బరువులిడుచు కుందమాలం గౌఁగిలించుకొని యాక్రందనము సేయఁ దొడంగిరి. అప్పు డావేశ్యకన్య యాయుపద్రవము విని యడలుచు మేడ దిగి నాకడకు వచ్చి నమస్కరించి నాకత్తికి మెడ యొగ్గి యిట్లనియె.

మహాత్మా! నిరపరాధులగు నీపరిజనుల నేమిటికిఁ బరిమార్చెదరు?నాశిరంబు నఱకుఁడు. నాకతంబుననే యాఘోరకృత్యము జరుగుచున్నది. నన్నుఁ జంపిన మీ కేదోసము రాదు. చంపుఁడని పలికిన విని నేను గటారి నేలం బారవైచి కుందమాలా! నీడెందము చందము నే వినియుంటి. నీవు ఉత్తమురాలవు. నీతల్లి మహాపాపాత్మురాలు. అనేకహత్యలు గావించినది. నీ వట్టిపాపకృత్యము లెఱింగియు నుపేక్షించితి వది కొంతతప్పే. కాని నీమందలింపులు విననిచో నీ వేమి చేసెదవు? తల్లికై నీవు విచారింపవలసినపని లేదు. నిన్ను రక్షించితి వెఱవకుమని యభయహస్త మిచ్చితిని.

ఆలలనారత్నము మదీయలాలములవలనఁ దేరి నాయడుగులం బడి మహాపురుషా! మీ రెవ్వరో నే నెఱుంగ. మిమ్ముఁ జూచినతోడనే నాడెందము మీయందుఁ దగులుకొన్నది. ఆమాట నాదాదితోఁ జెప్పితిని. అడిగిచూడుఁడు నాజీవితముతో ధనకనకవస్తువాహనాదులతో మీయాధీన నైతిని. న న్నేలికొనుఁ డింతకుము న్నెవ్వరిం గన్నెత్తిచూచియుండలేదు. మీరే నాభర్తలు అని పలుకుచు వేఁడికొన్నది. నాకు దానిమాటలచే జాలి వొడమినది. తత్సౌందర్యాతిశయము హృదయమును లాగినది. అంగీకరించి యందే వసించి మరునాఁడుదయంబున నూఁతినుండి దానితల్లిని మఱికొందరిని దీయించి దహింపఁజేసితిని.

దానియన్న నాచేత దెబ్బలు తిని పాఱిపోయి మీయొద్ద నభియోగము దెచ్చెను. తరువాయికథ మీరు వినినదియేకదా. తత్క్రీ

డాసల్లాపములఁ జొక్కి తిగిరి బసలోనికిం బోలేక పోయితినని సౌమ్యుఁడు తనకథ నెఱింగించెను.

అని చెప్పువఱకు వేళయతిక్రమించినది. మణిసిద్ధుం డవ్వలి కథ పై మజిలీయందిట్లు చెప్ప మొదలు పెట్టెను.

___________

242 వ మజిలీ.

మయూరధ్వజునికథ.

పిమ్మట మయూరధ్వజుండు తనకథ నిట్లు చెప్పఁదొడంగెను. సోదరులారా ! మిమ్ము నేవిడిచి దక్షిణవీథింబడి పెద్దదూరము పోయితిని. ఆనగరము తుది చూచితీరవలయునని నాకు బుద్ధిపుట్టి వేగముగా నడువఁ దొడంగితిని. ఎంతసేపు నడిచినను దుది కనంబడదు. ఇంక చాలదూర మున్నట్లు చెప్పిరి. అంతలో సాయంకాలమైనది. దీపము లెల్లెడల వెలిగించిరి. అప్పుడు నాకొకవీథి కన్నులుపండువు గావించినది. నేనా వీథిని గొంతదూరము పోయితిని. ఒకవీథి యరగుపైఁ గూరుచుండి కొందఱు కథలుచెప్పుకొనుచుండిరి. నేనుగూడ నందొకచోఁ గూర్చుండి యాకథల వాలించితిని. కథకుఁ డిట్లు చెప్పదొడంగెను.

గోపాలుని కథ.

ఉజ్జయినీవురంబున మహాసేనుఁడను రాజు రాజ్యము సేయు చుండెను. అతనికిఁ బదాఱువేల భార్యలు గలిగియున్నను సంతానాభివృద్ధి లేకపోయినది. యెప్పటికో గోపాలకుఁడు, పాలకుఁడు అను పేరులుగల యిరువురు పుత్రులుదయించిరి. అతనిమంత్రి భరతరోహకుఁడనువాఁడు. నీతిశాస్త్ర పారంగతుఁడు. అయ్యమాత్యునికిఁగూడ రోహాంతకుఁడు, సురోహకుఁడు, అను పుత్రులిద్దఱు పెద్దకాలమునకు