కాశీమజిలీకథలు/పదవ భాగము/239వ మజిలీ

వికీసోర్స్ నుండి

నెఱింగించి తమ వృత్తాంతము పూసగ్రుచ్చిన ట్లెఱింగించి సౌభాగ్య సుందరిని సంతోషపారావార వీచికల నుయ్యెల లూగించిరి.

క॥ కొడుకుల నక్కునఁజేర్చుచు
     గడువడిఁ గోడండ్రఁ దిగిచి కనుగొనుచు నొడల్
     బుడుకుచు నామె కొమారుల
     నడిగిన మాటలనే మఱియు నడుగుచు వేడ్కన్.

సౌభాగ్యసుందరి దివ్యరూపసంపన్నులగు కోడండ్రను గొడుకులను దనకడనే యుంచికొని వారివారి చరిత్రములం బలుమారు వినుచు గడమకొడుకులు గూడ నింటికి వచ్చినచో నిఁక నా కేవిచారము నుండదని పలుకుచు సంతోషముతోఁ గాలముగడుపుచుండెను.

అని యెఱింగించి మణిసిద్ధుండు. . . ఇట్లు చెప్పు దొడంగెను.

_________

239 వ మజిలీ.

దక్షిణదిగ్విజయము

పుష్ప కేతుని కథ.

పుష్ప కేతుఁడు మయూరధ్వజుఁడు చిత్రభానుఁడు సౌమ్యుఁడు పింగళుఁడు వీరేవురు దక్షిణదిగ్విజయము సేయఁదలంచి తండ్రియనుమతి బొందకయే రహస్యముగాఁబయలుదేరి యాంధ్రకర్నాటకేరళాది దేశవిశేషములఁ జూచుచుఁ గాంచీపురాదిదివ్యక్షేత్రంబుల సేవింపుచు ద్రవిడదేశంబు జొరపడి యందలివింతలనరసి పాండ్యదేశంబు మీఁదుగా స్త్రీరాజ్యంబుజేరి తద్రాజధానియగు పుష్పపురంబు ప్రవేశించిరి.

ఆనగరము పదియామడ వెడల్పును పదాఱామడ పొడవును గలిగియున్నది. విశాలములైన వీధులచే సౌధములచే నొప్పుచున్నది. ఒక్కొక్కవీధి యొక్కొకపేట పెద్దపట్టణముతోఁ బోల్చవచ్చును. ఆస్త్రీరాజ్యములో మూఁడువంతులు నగరమే వ్యాపించియున్నది. రత్నమకుటయను వనితారత్న మవ్వీడు పాలించుచున్నది.

రాజపుత్రులేవురు నప్పురంబున నొకభవనంబద్దెకు దీసికొని యందువసించిరి. పెద్దవాఁడు తమ్ములారా ! ఇన్నగర మాడుదిపాలించుచున్నదఁట. ఆమెతో మనముపోరుసేయఁగూడదుగదా!ఇందుఁగొలఁదిదినములుండి యిందలివిశేషములు సూచియవ్వలికిఁబోవుదుముగాక.ఇంతపట్టణ మిదివఱకు మనముచూచియుండలేదు. ఇందుఁబెక్కులు విచిత్రములుండకపోవు. మనము తలయొక వీధికిం బోయి చూచివచ్చుచుందుముగాక. మనమదుల కచ్చెరువుగలిగించు విశేషము లేమైనగలిగినచోఁ బరీక్షింపవలసినదియే. అని యుపదేశించిన వారనుమఁతించిరి. వారునిత్యము పెందలకడ భోజనముచేసి చక్కగా నలంకరించుకొని శృంగార శేఖరులవలె నొప్పుచు బయలు దేరి తలయొకవీధికిఁబోయి యందలివిశేషంబులుచూచిరాత్రికింటికివచ్చి యవ్వింతలొండొరులకుం జెప్పుకొనుచుందురు. ఈరీతి మూడుదివసములు జరిగినవి నాలుగవనాఁడు పుష్ప కేతుఁడమాత్ర మింటికివచ్చెను. తక్కినవా రెవరును రాలేదు. చీఁకటిపడినది పుష్ప కేతుఁడు బరితపించుచుఁ దమ్ములజాడ జూచుచుఁ బెద్దడవువీధిలోనే కూరుచుండెను. ఒక్కండును రాలేదు.

అప్పుడతండాలోచించుచు నిన్న రాత్రి పింగళుఁడు మాటల ధోరణిలో నీవీట వేశవాటిక చాల పెద్దదనియు నందలిబోటులుమంచి నీటుకత్తెలనియుఁ జెప్పియున్నాఁడు నేఁడక్కడికిఁబోయి యుందురా? అయ్యో ! అందుబోవలదని చెప్పవలసినది. ఆవెలయాండ్రు వీరినేమి మోసముజేసిరో? మాకిదిక్రొత్తదేశము కానిమ్ము. ఆమహావీరులవార లేమిజేయగలరు? వలపుగలుగఁజేసి చిక్కపట్టినంబట్టుదురుగాక రేపు పోయి పరిశీలించెదనని తలఁచుచు నారాత్రియెల్ల నిద్రబోవడయ్యెను. మఱునాఁడు పెందలకడ భుజించి రూపంబు దిద్దికొని చేఁత బెత్తంబుబూని విలాసముగా నడచుచు దెలిసికొని వేగముగా నడుచుచు జాముప్రొద్దువేళకు వేశ్యాంగణముజేరెను. అందు

క॥ ఒకచోట మృదంగధ్వని
     యొకచో వీణానినాద మొకచోఁ దౌర్య
     త్రికరవము వేణుగానం
     బొకచోఁదగవిని యతండహోయని పొగడెన్.

పుష్ప కేతుఁడందలి సంగీతనాదములు చెవులపండువు గావింపుచుండఁ గొండకదూరముపోయి యొక్క చో సమున్నతవేదికాభి రామంబై విచిత్రకుడ్యదీప్తంబై యభ్రంలిహాగ్రంబై బహులతాసముల్లిఖిత సింహ ద్వారకవాటంబై యొప్పు నొకసౌధరాజంబు రాజభవనమేమో యని యతనికి భ్రాంతిగలుగఁ జేసినది. వేశవాటికలోఁ బ్రాసాదము లుండునా! అనితలంచుచు సమీపమునకుఁబోయి యీమేడ యెవ్వరిదని యడిగెను.

అందుఁగాపున్న వారామాటవినిఅయ్యా! ఆగోడకువ్రేలఁగట్టిన పట్టంబుజదివికొనుడు. అంతయు మీకుఁ దెలియగలదని యుత్తరము జెప్పిరి. అతండు సంతసించుచు నఱఁగెక్కి యందలిపట్టంబు జదువ నిట్లున్నది.

మహారాజరత్నముకథ.

ఇందు మహారాజరత్నమను వేశ్యారత్నము గాపురముసేయుచున్నది. ఆయద్ధములోఁగట్టఁబడిన రూపమాయువతి ప్రతిబింబము ఈత్రిభువనైకసుందరికిఁ జతుష్షష్టికళలయందుఁ బాండిత్యము గలిగి యున్నది. ఈమెతుచ్ఛవిటతండముల షండములఁగాఁజూచుచుండును. ప్రచండ విద్యామదగర్వితుని వరింపఁగలదు. పండితంమన్యులఁ బరిచా రకులగాఁ జేసికొనును. మఱియు నామె విద్యావిషయకములగు కొన్ని ప్రశ్నములనడిగి వానికిందగిన సమాధాన మిచ్చిన వానిఁ బ్రాణేశుఁగా జేసికొనఁగలదు. లేకున్న నామెతోటలోఁ బనిజేయవలసియున్నది యిందులకంగీకరించినవాఁడు ఒడంబడిక వ్రాసియిచ్చి లోపలకు రా వలయును.

అనియున్న పట్టము జదివికొని యారాజపుత్రుఁడు రెండుగడియలసేపాలోచించి ద్వారపాలునింజూచి యోయీ నిన్న నెవ్వరైన నీమెయిచ్చినపశ్నముల కుత్తరమిత్తుమని లోపలకుఁబోయిరా! అని యడిగిన వాఁడు ఒకచిన్నవాఁడు మీవలెనేయున్నాఁడు నిన్న వచ్చి యామెయిచ్చిన ప్రశ్నములన నెంత తృటిలోనుత్తరమిత్తునని చెప్పి లోపలికిఁబోయి తిరుగారాలేదు. తోటలోనికదేదారినిబోయెను. మొక్కలు త్రవ్వుచున్నాడని యాకథ యెఱింగించి యతండు వ్రాసియిచ్చిన పత్రికం జూపించెను.

ఔరా? ఈరాగ విద్యలలో నెంతప్రౌఢ ! మాతమ్మునిబింగళునే జయించినదియా! ఇదిమాకన్న నెక్కువజదివినది కాఁబోలు! ఏవిద్యలో నడుగునో విమర్శించిపోవలయును.

ఆహా! సకలకలానిపుణుండగు పింగళు నోడించిన యీవారాంగన పాండిత్యము కొనియాడఁ దగియున్నది. కానిమ్ము. ఇప్పుడు దీని నెట్లో జయించి తమ్ముని విడిపించుకొనిరావలయుంగదా. దీని విద్యావిశేషములెట్టివో పింగళు నేవిద్యలో బరాజితుంజేసినదియో తెలిసికొనుట అవశ్యకమైనపని. దీనిగుట్టెవ్వరివలనం దెలిసికొందునని యాలోచించుచు నెదురింటి యరుఁగుపైఁ గూర్చుండెను.

అంతలో నొకగుఱ్ఱముబండి వచ్చి యచ్చిగురుబోడి వాకిట నిలిచినది. అతం డాబండివానిని జీరి యోరీ! దీని నెవ్వరినిమిత్తము దీసికొనివచ్చితివి? రాజరత్న మెందైన విహరింవనరుగునా? అని యడి గిన వాఁడు ఆమెకాదుసామి. ఆమె పనికత్తెనిమిత్తము దెచ్చితిని. ఇంటికిం బోగలదని చెప్పుచుండగనే లోపలనుండి యొకపరిచారిక వచ్చి యాబండిలోఁ గూర్చుండెను. బండి నడుచుటకుఁ బ్రారంభించినతోడనే రాజపుత్రుఁడు వెనుకం గూర్చుండెను.

ఆశకటము గడియలో దానియింటికిం బోయి నిలిచినది. రాజపుత్రుఁడు దానికన్నముందు బండిదిగి ద్వారముకడ నిలిచి యది దిగినతోడనే రత్న కేసరీ! నీనిమిత్త మిందు వేచియుంటి. వచ్చీతివా అని యడిగిన నప్పడతి తెల్లబోయి చూచుచు నతని యాకారగౌరవమునుంబట్టి యుత్తముఁడని తలంచి నమస్కరించుచు లోపలకు దయచేయుఁడని సవినయముగాఁ బలికి తీసుకొనిపోయి యొకపీఠంబునం గూర్చుండఁ బెట్టి యిట్లనియె.

అనఘా! మీరెవ్వరో గురుతుతెలియకున్నది. నన్నెఱిఁగినట్లు పల్కరించితిరి. ఇది గరువమని తలంపవలదు. నాకొఱకు వేచియుండుటకు నావలనం గాదగినపని యేదియో సెలవీయుఁడని యడిగిన మందహాసముజేయుచు నాసుందరుం డిట్లనియె.

రత్న కేసరీ! నావృత్తాంతము చాలగలదు. నన్ను నీవెఱుఁగకున్నను నిన్ను నేనెఱుంగుదును. నీసుగుణములు విని నిన్నుఁ జూడవచ్చితిని. నీవలనఁ గాఁదగినకార్య మొకటికలదు. అందులకు గానుకగా నీకీరవ్వయుంగరమిచ్చుచున్నవాఁడఁ గైకొనుమని పలుకుచుఁ గాంతులీనుచున్న యంగళీయకమొకటి దీసి దానిచేతిలోఁ బెట్టెను.

మిక్కిలివెలగల యానగం జూచి యామగువ వెఱఁగుపడుచు ఆర్యా! మీకార్యమేదియో యెఱిఁగింపుఁడు. ఓపుదేని గావించి పిమ్మట మీవలన నీకానుక నందుదాన. పనికతైనగు నన్నింతపెద్ద జేసి యగ్గింపుచుండ సిగ్గగుచున్నది. సామీ! అని యాయుంగర మీయఁబోయిన వారించుచు నతండు వలచు. నీకడనే యుంచుము నాకా ర్యము నీకుఁ జేయశక్యము కాకపోవదు. వినుమని యిట్లనియె.

పుష్ప కేతుఁడు - రత్న కేసరీ! నీకెక్కడపని?

రత్న కేసరి – మహారాజరత్నమను వేశ్యకడ

పుష్ప - నీవక్కడ నేమిచేయుచుందువు?

రత్న - సఖురాలువోలె గౌరవములైనపనులుచేయుచుందును.

పుష్ప - నీ వేమి చదువుకొంటివి ?

రత్న - సామాన్యమైన చదువే.

పుష్ప - రాజరత్నమో ?

రత్న - అబ్బో! అది గొప్ప విద్వాంసురాలు. ఆమెకు రాని చదువులేదు.

పుష్ప — అది విద్వాంసులతో వాదించి యోడించునఁట యే విద్యలలోనో యెఱుంగుదువా?

రత్న - అది నాకుఁ దెలియదుసామి.

పుష్ప - ఓడిపోయినవారి నేమిచేయును ?

రత్న - తోటలలోఁ బనిచేయించునుసామి. నిన్ననే యొకఁడు పాపము చక్కనివాఁడు మీవలెనున్నాఁడు. వాని నోడించి తోటలోని కనిపినది.

పుష్ప - వానితో నెట్లు వాదించినదో చెప్పగలవా ?

రత్న — ఆసాంకేతకములు మాకేమియుఁ దెలియవు. ఏదియో సాంకేతికమువ్రాసి యంపుచుండును. తగుసమాధానము రానిచో లాగివేయును. నిన్న నేనే యాసంవాదమంతయును జరిపితిని.

పుష్ప — ఆ జరిపిన యుత్తరప్రత్యుత్తర పత్రికలు నీయొద్ద నున్నవియా?

రత్న - ఆ. వానిం దీసికొనిరాఁగలను. కట్టకట్టి మంచము పందిరిమీఁదఁ నేనే పెట్టితిని. పుష్ప - అదియే నీవలన నాకు గావసినపని. వానిం దెచ్చి చూపఁగలవా?

రత్న - రేవు సాయంకాల మీపాటివేళకు రండు. ఆకట్ట తెచ్చి మీకిచ్చివేసెదను. యిదియేనా మీపని.

పుష్ప -- అవును. నేను బోయివత్తు. మఱుతువుసుమీ.

అని చెప్పి యతండు బసలోనికిం బోయి మఱునా డావేళకే దానియింటికిఁ బోయెను. రత్న కేసరి యాకట్ట యతని ముందరం బెట్టినది. ద్రవ్యంబునకు సాధ్యము కానివా రుండరుగదా.

పుష్ప కేతుండు ప్రశ్నోత్తరములతో నొప్పుచున్న యా పత్రికలన్నియుం జదివి యందలి రహస్యములు కొన్ని తెలిసికొని దాని కిట్లనియె. రత్న కేసరీ ! మొదట నీవు పల్లవాంకురము తరువాత మాలతి పిమ్మట జూతమంజరి. తరువాత గోళ్లునాటించిన యెఱ్ఱగుడ్డచుట్టిన మైనము ముద్ర పిమ్మట నల్లగడ్డచుట్టిన తామలపాకులు నతని యొద్దకుఁ దీసికొనిపోయి యిచ్చితివి జ్ఞాపకమున్నదా ? అని యడిగిన నది ఔను. ఇచ్చితిని. వాని కతండు తగుసమాధానము చెప్పలేక పోయెనఁట. అతండును సామాన్యుడు కాడు. నీవోడితివని చెప్పినప్పు డెదరించి బెదరించి కత్తితీసి నరికెదనని పలికెను. పిమ్మట నాపొన్నికొమ్మ ఏదో పుస్తకము జూచి కొన్ని శ్లోకములు వ్రాసియిచ్చినది. వానిం జదివికొని మఱుమాట పలుక తోటలోనికిఁ బోయెనని చెప్పినది.

అవును రాజరత్నము తానడిగిన ప్రశ్నమును శాస్త్రసమ్మతములే యని దృష్టాంతము చూపినది.

శ్లో. నారీసం కేతకం వక్ష్యె వక్రభాషాంగముద్రయోః
    పోటలీవస్త్రపుష్పాణాం తాంబూలస్యావ్యనుక్రమాత్ .

అను శ్లోకముమాత్రము జదివి రత్న కేసరీ ! నీదయవలనఁ గొంత సదుపాయము గలిగినది. నేను గూడ మీరాజరత్నముతో గొంత ముచ్చటించెద నని పలికిన నక్కలికి సామీ! నేను మీకీపత్రికలిచ్చితినని చెప్పఁగూడదు చుఁడీ యని కోరినది. అతం డనుమ తించి బస కరిగెను.

రాత్రియెల్ల నావిషయమై ధ్యానించుచు మేము కామశాస్త్రము లన్నియు జదివితిమి. బౌద్ధయతికృతమగు నాగరసర్వస్వ మను గ్రంథములో నీనారీసాంకేతికములు వ్రాయఁబడి యున్నవికాఁబోలు. ఆగ్రంథము మేము చదువలేదు. దానంజేసి పింగళుడా ప్రశ్నముల కుత్తరము జెప్పలేకపోయెను. ఆవుస్తకమీ నగరంబున నుండకమానదు. దానిం జదివి యందలి రహస్యముల గ్రహించెదంగాక. దీని నోడించుట యెంతపని. అని యాలోచించి మఱునాఁ డావీటనున్న పుస్తకాలయముల గుఱించి వితర్కించి తెలిసికొని యొక పుస్తకభాండాగారమున కరిగి యందుగల పుస్తకముల పట్టికం జదిని యతిప్రయత్నముతో వెదకి నాగరసర్వస్వమును దీసి దాని నామూలాగ్రముగ మూడుసారులు చదివెను. అందు,

శ్లో॥ యదపిన సులభేహ సామృగాక్షీ
      సకల కళాకలనాసు పండితయా
      కధమపి యది సంగమస్తయాస్యాత్
      వ్రజతి తదాహి పరాభవం వరాక:
      అవిదిత యువతీకృతైక సాంకే
      తక ఇతి రత్నకుమారకోయదైవ.

సకలకళాపాండిత్యముగల కలకంఠితోఁ గలసికొనుటయే దుర్ఘటము. దైవవశంబున నట్టి యంగనతో సంగమము గలిగినప్పుడు యువతీకృతసాంకేతములు దెలియనివాఁ డైనచోఁ రత్నకుమారుఁడు వలెనే పరాభవము నొందగలఁడు అని వ్రాయఁబడియున్నది. ఇట్లు వ్రాసినవాఁడు,

శ్లో॥ కేచిద్భాషాంతరకృతతయా కామశాస్త్రప్రబంధా
     దుర్విజ్ఞేయా గురుతరతయా కేచిదల్పార్థ కాశ్చ
     తత్పద్మ శ్రీవిరచితమిదం సర్వసారం సుభోధం
     శాస్త్రం శ్రీఘంశృణుత సుధియోభీష్ట ధరార్థకామాః.

పద్మశ్రీ యను బౌద్ధసన్యాసి రచించుటచే నిందలి విషయంబు లశాస్త్రీయములని చెప్పుటకు వలనుకాదు. అందులకే మాతమ్ముడు అంకీకరించి బద్ధుండయ్యెను.

నాకిప్పుడీ గ్రంధవిషయంబు లన్నియు క్షుణ్ణముగా నున్నవి. రాజరత్నమును దృటిలో జయింపఁగలనని యాలోచించుచు నాయా ఘట్టమునందలి శ్లోకములు వ్రాసికొని వర్లించుచు నింటికిఁబోయి మఱునాఁడు సాయంకాలమున శృంగారవేషముతోఁ రాజరత్నము నింటికిఁ బోయెను.

అఱుగెక్కి యెవ్వరి నడుగక యే ప్రకటన పట్టములోనున్న ప్రకార మందలి గంటమ్రోగించెను. అంతలో లోపలనుండి యొక పురుషుఁ డీవలకువచ్చి మీరెవ్వరు ? గంటమ్రోగించితిరేల ? రాజరత్నముతోఁ బ్రసంగింతురా ? అని యడిగిన నతం డౌను. అందుల కే వచ్చితినని చెప్పెను. ప్రకటన పట్టము చదివికొంటివా ? అందుల నిబంధన కొప్పుకొంటివా! ఒడంబడినచో నీకాగితముపై వ్రాఁలుచేయుమని చెప్పెను. అంగీకరించితినని యాతండు వ్రాలుచేసెను.

ఆపురుషుఁ డాయొడంబడిక పత్రిక లోపలికిఁ దీసికొనిపోయిన యరగడియలో నిరువురు పరిచారికలు లోపలినుండి వచ్చి యొకతె కాళ్ళుగడిగినది. ఒకతె నివాళి యిచ్చినది. సవినయముగా నతనిం దీసికొనిపోయి విచిత్రాలంకార భూయిష్టంబగు నొక గదిలోఁ దల్పంబున గూర్చుండఁబెట్టిరి. ఆభవనాలంకారములం దిలకించి యారాజపుత్రుఁ డది స్వగర్వమేమో యని భ్రాంతిపడఁజొచ్చెను. అందు నానావిధఫలములు పుష్పములు దళములు జిగుళ్ళు మొదలగు వింతవస్తువులు పేరులువ్రాసి యద్దపు మందసములలో నునుపఁబడి యున్నవి. పెక్కేల? అది యొక చిత్రశాలవలె నొప్పుచున్నది.

అతం డా శయ్యదిగి యొకపీఠముపైఁ గూరుచుండి యది యెట్టి ప్రశ్నములిచ్చునో యనియాలోచించు చుండెను. అంతలో వాడుక ప్రకారము పరిచారికచే బంగారు తళియలోఁ బల్లవాంకురము లునిచి యతనియొద్ద కనిపినది. దానింజూచి యతండు నవ్వుకొనుచు.

శ్లో॥ కులప్రశ్నాకురః స్మృతః॥ నీకుల మేమని యడుగుట కిది యంకురము పంపినదని గ్రహించి యాపళ్లెరములోనే, శ్లో॥ పనసః క్షత్రియేస్మృతః || అని చెప్పఁబడినది కావున నందు రంగులతో నమరించియుంచిన పనసఫలం బొండుదీసి యాపళ్లెములోఁ బెట్టి పంపెను. తరువాత నానాతి విదియచంద్రుని గాకితముమీఁద వ్రాసియంపుటయు శ్లో॥ రాజపుత్రే ద్వితీయేందుః॥ అనియుండుటంజేసి నీవురాజపుత్రుఁడవా? అని యడిగినట్లు తెలిసికొని, శ్లో॥ ఘనచ్ఛాయస్తు భూపతిః॥ నేను కేవలము రాజుపుత్రుఁడనే కాను భూపతినని తెలియఁజేయుచు మేఘమురంగు వ్రాసియంపెను.

తరువాత నానెలఁత పోట లీప్రశ్న యడిగినది:-

శ్లో॥ సిక్థేన నిమిన్‌తా ముద్రా పంచాంగుళి సఖాంకితా
     వేష్టనం రక్త సూత్రేణ పోటలీ పరికీర్తి తా॥

“మైనము ముద్దగాఁజేసిదానిపై నైదుగోళ్లు నాటించి యెఱ్ఱదారము చుట్టి యంపినది. దానికే పోటలియని పేరు

శ్లో॥ మదనానంగతః సిక్థః సంరాగోరక్త వేష్టనం
      పంచబాణక్షతత్వేన పంచాంగుళినఖక్షతం॥

ఎఱ్ఱదారములు చుట్టుటచే నీయం దనురాగము కలదనియు నింతకుముందు మన్మధవ్యాపారము లేదనియు నైదుగోళ్లు గ్రుచ్చుటచేమన్మధుని పంచబాణముల బాధ యెక్కువగా నున్నదనియు నభిప్రాయమని గ్రహించి యతండు,

శ్లో॥ స్మరేణోద్భిన్న దేహ త్వే సచ్ఛిద్రం వస్త్ర ముత్తమం

అని యుండుటచే నది పంపిన మైనము ముద్రకు చిల్లులుపొడిచిన మంచిగుడ్డ గట్టి యంపెను. అనగా నాదేహము మన్మధుని చేఁజిల్లులు చేయబడినది. అని తెలుపు సూచన తెలియఁజేసెను. పిమ్మట నాకొమ్మ తాంబూల ప్రశ్నలు వైచినది,

శ్లో॥ తాంబూల విటకాః పంచకీర్తి తా నరపుంగవైః
      కౌశలాంకుశ కందర్ప పర్యంక చతురశ్రకాః

కౌశలము శలాకసూత్రరహిత మైనది. అంకుశము, అంకుశాకారము, కందర్పము, త్రికోణాకారము గలది. మధ్యబాణాకారముగ నుండును. పర్యంకము పర్యంకాకారముగలది, చతురశ్రము-నాలుగు కోణములుగలది. అవి యైదువిధములతో నొప్పుచున్నది. అందు బర్యంకమను విటకము పళ్లెమున నిడి పంపినది.

శ్లో॥ పర్యంకస్సంగమాశయా,- అని యుండుట గ్రహించి రాజపుత్రుండు, శ్లో. బాహ్యేచందన పంకాక్త మత్యర్థ మనురాగతః- అని యాతాంబూల వికటముపై మంచిగంధము నంటించి యనిపెను. నాకు నీయందుఁ జాల యనురాగము కలిగియున్నదని సూచించెను.

ఈరీతి తానుపంపిన నారీ సంకేతనము లన్నియు నతండు గ్రహించి తగినట్లు ప్రత్యుత్తర మిచ్చినంత నక్కాంతారత్నము సంతోషించుచు నెడమచేతి మధ్యాంగుళి నడిమిరేఖ నాఁడు తిరుగా రావలయునని వ్రాసియంపినది. అది చదివికొని యతండు,

శ్లో. శుక్లేవామకరోఁజ్ఞేయః అసితో దక్షిణఃకరః
    కనిష్టమూలమారభ్య రేఖాః పంచదశస్మృతాః.
    అంగుష్టస్యోర్ధ్వరేఖాంతాః స్మృతాః ప్రతిపదాదిషు,

ఎడమచేయి శుక్లపక్షమనియుఁ గుడిచేయి కృష్ణాపక్షమనియు జిటికెనవ్రేలి మొదటిరేఖ మొదలుబొటన వ్రేలి తుదిలేఖవరకు బదియేను రేఖలు పదియేను తిధులుగాఁ దెలిసికొనవలయునని సాంకేతికము. ఎడమచేయి అనగా శుక్లపక్షము, మధ్యాంగుళి నడిమి రేఖ యన నష్టమి, శుద్ధాష్టమినాడు రాత్రి తిరుగా రమ్మని సూచనయని గ్రహించి యతం డట్టే యాలోచించి నేనంతకాలంబుదనుక నిలువను. అనామిక నడిమి రేఖకే (పంచమినాటికి) రాఁగలను. అని ప్రత్యుత్తర మిచ్చెను?

ఆ వేశ్య మిగుల సంతసించుచు నతండు తన ప్రశ్నములకు సమాధాన మిచ్చిన ట్లొప్పుకొని నాఁడు వచ్చుట కంగీకరించి యంపినది.

పుష్ప కేతుం డింటికిఁబోయి యావారాంగననోడించినందులకు సంతసించుచు సౌమ్యుని విడిపించి పిమ్మటఁ దక్కిన తమ్ముల జాడఁ దెలిసికొనియెదనని నిశ్చయించి మూడుదినము లెట్లో గడిపి పంచమి నాఁడు సాయంకాలమునకు మహారాజరత్నము నింటికడకుబోయెను.

అంతకుముందే యిందుముఖు లిరువు రతనినిమిత్తమందు వేచియుండిరి. అతని జూచినతోడనే రండు రండని పలుకుచు నొకతె పాదములు కడిగి తడియొత్తినది. ఒకతె నివాళి యిచ్చినది. ఇరువురు నతని సగౌరవముగా లోపలకుఁ దీసికొనిపోయి వెనుకటి గదిమీఁదుగ ననేక కక్ష్యాంతరములు దాటించి యొక రాజసౌధములోనికిం దీసికొనిపోయి రత్నపీఠంబునం గూర్చుండఁ బెట్టిరి. ఆగది యలంకారము జూచి యతం డిది వేశ్యాసదనము కాదు. రాజభవనమువలె నున్నది. ఆమేడ వీధిగోడకు వ్రేలంగట్టిన చిత్రఫలకము మహారాజరత్నముదని వ్రాయఁబడి యున్నది. ఇందు మఱియొక రమణీమణి చిత్రఫలకము గనంబడుచున్నది. ఈచిన్నది మఱియొకతె కాఁబోలు. దీనికిఁ గిరీటములు కేయూరములుగూడఁ గలిగియున్నవి. ప్రభుచిహ్నముల వేశ్య యెట్లు దాల్చెడిని ? ఏమో. దేశాచారభేధము లెవ్వఁ డెఱుంగును ? అని యాలోచించుచున్న సమయంబున,

క. కుందనపుబొమ్మయనఁ మెఱు
   పుందీగె యనంగఁ గాంతిపుంజికయనఁ బొ
   ల్పొందు నొక సుందరీమణి
   యందుల కరుదెంచెఁ బరిజనావృతయగుచున్ .

కిరీట కేయూర కరవాలాదిప్రభుచిహ్నాలంకారముల దాల్చియున్న యాయన్నుమిన్నం జూచి యతం డౌరా ! ఈనారీరత్నము మున్ను నే చిత్రఫలకంబునఁ గన్నదికాదు. ఇది వేరొకతె. ఆమహారాజరత్న మెందున్నది? దీనిరాకకు గతంబేమి? నాచే జయింపఁబడిన చేడియయెవ్వతె? దాని మొగమే చూచియుండలేదేయని యాలోచించుచుండనయ్యండజగమన మెల్లన నతనినికటమున కరిగి పదంబులకు నమస్కరించుచు,

క. ఫలియించె నిప్పటికి నా
   యలఘుపురాకృతఫలం బహా సకలకళా
   లలితు నినుఁ బతిగఁ బడసితి
   నిల ననుఁబోలిన వధూటి యెటలే దరయన్.

రాజ --- ఓహో ! నీవేశ్యాలాపములు నాకడ నుపచరింపవు నీవు ఏకపరిగ్రహవా? అనేకపరిగ్రహవా ? ఆపగ్రహవా ?

రత్నమకుట —- రాజపుత్రా! నేను వేశ్యను గాము. ఈదేశము పాలించు నధికారిణిని. నాపేరు రత్నమకుట యండ్రు. రాజు -- బలే. బాగు. ఇందు దేశమేలు రాజస్త్రీలుగూడ వేశ్యావృత్తి వహింతురని మాకుఁ దెలిసినది కాదు. మంచి యా చారమే.

రత్న - రాజనందనా ! నావృత్తాంతమంతయును విని పిమ్మట నాక్షేపింపుము.

రాజు – నీవృత్తాంతము వినక తెలిసికొనక యితదూర మెట్లు వచ్చితిని ? గోటకుఁగట్టిన పట్టము నీవృత్తాంతమంతయుఁ జెప్పుచుండ లేదా? ఏదో మారుమూలగ్రంథములోనున్న నారీసాంకేతిక శ్లోకములు నాలుగు వర్ణించి కట్టుకథలవంటిప్రశ్నము లడిగి వానిం జెప్పలేకున్న సకలకళాపారంగతుల నిర్వక్రపరాక్రమవంతులఁ గూలివాండ్రగాఁ జేసికొందువా? నీవ్రాఁతలకుం గట్టుబడియింతదనుక నుపేక్షించితిమి. నిరుపమవిద్యాబలశాలియగు మాతమ్ముని మొన్న బరిచరుంగాఁ జేసికొంటి వతం డెట్టివాఁడో యెఱుంగుదువా? న్యాయంబునకుఁ గట్టుపడియెంగాని యువ్వెత్తుగా నీ రాజ్యము నిన్నుఁగూడ మట్టుమాపకపోవునా? ఈదేశమును బాలించు నీవే యిట్టికపటకృత్యములు సేయుచుండ నిందుఁ గాదనువారెవ్వరు? రాజస్త్రీవై వేశ్యనని చెప్పుకొంటివేల ? ఇది యెట్టిగౌరవమని యత్యంతకోపముతోఁ బలుకుటయు నక్కుటి లాలక యతని యలుకకు వెఱచుచు నడుగులంబడి యిట్లనియె.

మహాత్మా! నావృత్తాంతమంతయు విని తప్పున్న గోపింపుఁడు. ఇది స్త్రీరాజ్యము. నేనీరాజ్యమునకు వచ్చి సంవత్సరము దాటినది. మా దేశాచారములు కడు విపరీతములు. ఇందు విద్యాధికులగు పురుషులు చాల తక్కువగానున్నారు. నేనుత్తముఁడగు పతిం బడయఁగోరి యొక బౌద్ధసిద్ధు నాశ్రయించితిని. ఆబౌద్ధసన్యాసి నాభక్తికి మెచ్చి నాకీశ్లోకములుగల ప్రశ్నోత్తరములు వ్రాసియిచ్చి వీని కీరీతిఁ బ్రత్యుత్తరమిచ్చిన వానిం బెండ్లియాడుము. అని చెప్పి పోయెను. అందులకై యిట్టివ్రతము బూనికొంటిని. మహారాజరత్నము నాకు స్నేహితురాలు. మంచియందకత్తెయ. విద్వాంసురాలు. నా పేరున నిట్టిప్రశ్నములిచ్చుట కిష్టపడక దానిపేరునం బ్రకటించితిని. వేశ్యల గేహములకు పురుషశ్రేష్ఠులు వచ్చుచుందురని యట్లు నియమించితిని ఆమేడ నిజముగా దానిదే. అదియు సామాన్యుల నొల్లక కన్యకగానే యున్నది. మొన్న మీతమ్ముని వరించి మెడలో బూవుదండ వైచి తనమేడకుఁ దీసికొనిపోయినది. ఆయనతో మీవృత్తాంత మింకను జెప్పలేదు. మఱియు నాప్రశ్నముల కుత్తరమీయలేనివారిం బరిచరులఁగాఁ జేసికొననేల యందు రేమో వినుండు. మొదటగొన్ని దినము లట్లే ప్రకటించితిని. విద్యావిహీనులుగూడ నిత్యము నాప్రశ్నముల కుత్తరమిత్తుమని లోపలిగృహవిశేషములు చూడ ననేకులు వచ్చుచుండిరి. దానంజేసి విసిగి యిట్టినియమము గావించితిని కాని లోకుల వంచించుటకు గాదు. మాతప్పులన్ని యు మన్నించి యీరాజ్యముతోఁగూడ నన్ను బరిగ్రహించి స్త్రీరాజ్యమన్మధసామ్రాజ్యములకుఁ బట్టభద్రులు కండు. నేను మీచే వాదంబున గెలువబడితిని గదా? అని ప్రార్థించిన నతండించుక యాలోచించి యిట్లనియె,

దేవీ! నాచే నోడింపఁబడినది మహారాజరత్నముకాదా నీవెట్ల గుదువు ? అనుటయు నాచతుర, మీరు విద్వాంసులు. ఆ పేరు మాయిద్దరియందు వర్తించుచున్నది. నేను మహారాజరత్నము ననుకొన దగనా? కావున మీచే నోడిపోయినదానను నేనేకాని యదికాదని యుత్తరము చెప్పినది.

ఓహో ! మహారాజులలో రత్నమువంటిదాననని నీవు శబ్దార్థమును దిరపచుచుంటివా. ఈమాటు మెచ్చుకొంటి. సరిపోయినది. కానిమ్ము. సిరిరా మోకాలొడ్డువాఁ డుండునా? నీవు రాజ్ఞివని గరువమునొందక నాయిచ్చవడువున మెలంగెదనంటివేని నిన్నుఁ బరిగ్ర హింతు. లేకున్న నొడంబడనని పలికిన విని యక్కలికి నవ్వుచు నెందైనను మగవారు మీదువారు. వారిమాటయే పైగానుండును. అందుల కాటంకమేమి? మీయిష్టమువచ్చినట్లు శిక్షించుకొనుఁడని యప్పుడే యతనిమెడలో ముక్తాదామము వైచినది. అతండు మఱి యొకదామం బాపడఁతిమెడలో వైచెను. అదియే వారికి వివాహము. వేశ్యారత్నముతోఁగూడఁ బింగళు నక్కడకుఁ దీసికొనిరమ్మని వారొక విచిత్రభవనాంతరమున కరిగిరి.

శ్లో. విలసదమలదీపె పుష్పదామావకీర్ణె
    ప్రసృతసురభి ధూపెధామ్ని కామీ‌ సువేషః
    సహసహచరవగైన్ ర్వామపాశెన్వ్ నివేశ్య
    స్త్రియముపహితవేషాం భావయేన్నర్మగోష్ఠీం.

శ్లో. కలాకలాపైశ్చయుతం సమస్తైః
    గుణైరసం కేతవిదం హికాంతం
    ప్రమ్లాన నిర్మాల్యమివోత్సృజంతి
    గుణాధికానాగరికాస్తరుణ్యః

శ్లో. తతోన్యచింతాంపరిహృాత్య కామీ
    యతేత సాంకేతిక శాస్త్ర కేషు
    సతాంహి సమ్మానసహస్రభాజాం
    యూనాం వధూధిక్కృతి రేవ మృత్యుః

సకలకలాపాండిత్యము గలిగియున్నను నారీసాంకేతిక మెఱుంగని పురుషుని గుణాధికలగు నాగరిక స్త్రీలు వాడిన నిర్యాల్యమాలికలవోలె గౌరవింపక విడిచివేయుదురు. కావున నితరచింతవిడిచి పురుషుఁడు నారీసాంకేతికవిథానము దెలిసికొనవలయును. అనేక సన్మానములు బొందుచున్నను యౌవనవంతులకు స్త్రీధిక్కారముకన్న నవమానము వేరొకటిలేదుగదా. అని యెఱింగించునంతఁ గాలాతీతమైనది. అవ్వలికథ తదనంత నావసధంబున నిట్లు చెప్పఁదొడంగెను.

________

240 వ మజిలీ.

మణిమంతునికథ.

స్త్రీరాజ్యపాలనావిశేషము లెట్లుండునో రత్నమకుట యెట్లు తీరుపులు చెప్పునో వినవలయునని యభిలాషగలిగి యొకనాఁడు పుష్పకేతుఁడు భార్యతోఁగూడ సభాస్థానమున కరిగి రత్నమకుట సింహాసనమునకుఁ బ్రక్కగా వేరొకపీఠంబునఁ గూర్చుండి యామెచేయు ప్రశ్నప్రకారము అరయుచుండెను. తనభర్తప్రక్కనుండుటచే వాడుక ప్రకారముగాక స్వరవైక్లబ్యముతో మంత్రిదిక్కు. మొగంబై యామె నేఁడు విచారింపవలసిన యభియోగము లేమిగలవని యడిగినది.

మంత్రి లేచి రాజ్ఞీ! నేఁడు ముఖ్యముగా హత్యాపరాధపరిశోధకములు రెండువిమర్శింప వలసియున్నవి. ఒకదానిలో వాది ప్రతివాదు లిరువురు వచ్చియున్నారు. ఒకదానిలో వాదిమాత్రమే వచ్చి యున్నాఁడు అని పలుకుచు నాకాగితములుకట్ట నామెచేతికిచ్చెను. రత్నమకుట చేయి వణక నందుకొని వానిభర్త కిచ్చుచు మీయెదుట మేము విమర్శింపలేము. మీరే విచారించి తీరుపుచెప్పుఁడని పలికినది

అతండు నవ్వుచు మీపాలనావిధానము జూడవలయుననితలంప నీభారము నామీఁదనే పెట్టితివా? కానిమ్ము మీయమాత్యుఁడు హత్యలనుచున్నాఁడు. అవి యెట్టివో తెలిసికొనియెదంగాక యని పలుకుచు నాపత్రికలం జదివికొని శిరఃకంపముతో ముందు మణిమంతుఁడు రత్న పాదుఁడునను వర్తకులఁ బిలువుఁడని భటుల కాజ్ఞాపించెను.

వాండ్రు పిలువఁగా నావర్తకులికువురు వచ్చి యెదుర నిలువం