కాశీమజిలీకథలు/పదవ భాగము/237వ మజిలీ

వికీసోర్స్ నుండి

237 వ మజిలీ.

క్రోధనునికథ.

గాయత్రీదేవి యాలయముగల దీవికి శక్తి ద్వీపమనిపేరు. ఆదీవి నాలుగుమూలల నాలుగు శక్తి దేవళములు గలిగియున్నవి. నడుమ గాయత్రీయాలయమొప్పుచున్నది. ఆదీవికడుచిన్నది. వరుణ ద్వీపమునకు దక్షిణ సముద్రమునంటియున్నది. అద్వీపముచేరిన వారిని మహాశక్తులు మ్రింగివేయునని వాడుక యుండుటచే మనుష్యులెవ్వరు నాద్వీపమునకు నోడలఁ జేర్పరు. సముద్రములోఁ బోవునప్పుడుకూడ నాదీవికిఁ జేరకుండ దూరము నుండి నడిపించుచుందురు.

దానంజేసి యాదీవి మిగుల రహస్యస్థలమై యొప్పుచున్నది. తాళధ్వజుని పుత్రులు నలువురు దేవకాంతలతో నాలుగుదెసల నతి విచిత్రప్రచారముల నతిమనోహర కేళీవిలాసముల నపూర్వ కామక్రీడా వినోదముల నిదిరాత్రి యిది పగలను వివక్షలేక నెలదినము లొక గడియగా వెళ్ళించిరి.

ఒకనాఁడు విక్రముఁడు మధుమతితో, ప్రేయసీ! మాచరిత్ర మంతయు నీకెఱింగించితిమిగదా? మాపూర్వపుణ్యవిశేషంబున మా యన్నలవలె దేవకాంతల మిమ్ము భార్యలుగ బడసితిమి. మీకేళీవిలాసముల జొక్కి వచ్చినపని మఱచితిమి. వరుణావతీ పురాధీశ్వరుఁడు క్రోధనుం జయించినంగాని యింటికిఁ బోవరాదు. అట్లు పోయితిమేని యుమాపురంబుననున్న రాజకుమారులు మమ్ముఁ బరిహసింపకమానరు. మేము శపధములుసేసి వచ్చితిమి. శత్రునగరముచుట్టును యంత్రము లమరించియుంచిరఁట. సముద్రములో నాగనులుతగిలియేకాదా మాయోడలు శకలములైనవి. మెట్టదారిని గూడ నావీడుచేరుట కష్టమఁట. ఆకాశగమనంబున నప్పురము జేరవలసియున్నది. వానికి గూడ విమానము లున్నవని వినియున్నారము, ఉండుగాక. ఇందులకై మీరొక సహాయము చేయవలసియున్నది. దేవలోకమునుండి యొక విమానము సంగ్రహించి తీసికొనిరావలయును. అప్పని మీకుసాధ్యమే! యని యడిగిన మధుమతి యిట్లనియె.

మనోహరా! స్వర్గమునందలి విమానశాలలో వేనవేలు విమానము లొప్పుచుండును. ఆకాశగమనము సహజమైనది. కావున మాకు విమానములతోఁబనిలేదు. దేవలోకములో భార్యాభర్తల మిధునమునకు గాని విమానమీయరు. విమానశాలాధికారి సెలవు లేనిదే విమానము సంగ్రహించుట కష్టమే. మావివాహవృత్తాంతములు పెద్దలతోఁ జెప్పుదుమా మానుదుమా యని మేమింకను నా లోచించుచుంటిమి. మనుష్యభర్తృత్వమునకు వారు శంకింతురేమో యని యనుమానముగా నున్నది. కానిండు. ఈసంఘటనము గాయత్రీకర్తృకమగుటచే మమ్ము మావారు నిందింపఁగూడదు. ఎట్లైనను మీకువిమానమొకటితీసికొనియియ్యగలము. మమ్మనుపుఁడనికోరినది.

అరాత్రి నలువురు నొకచోటఁజేరినతరువాత విక్రముఁడు సోదరులతోఁదనయుద్యమ మెఱింగించి విమానము దెచ్చుటకై భార్యల నాకమున కనుపుటకు యోచించి వారింగూడ నంగీకరింపఁ జేసెను.

దేవకన్యలు నలువురు భర్తల యనుజ్ఞ బుచ్చుకొని నాఁటి వేకువజామున స్వర్గంబున కరిగిరి. ఆకాంతలరాక నిరీక్షించుచు రాజపుత్రులు , గాయత్రీదేవి యాలయంబున వసించి క్రోధనుని జయించు నుపాయ మాలోచించుచుండిరి. దేవకాంతలు వత్తు మన్న గడువునకు రాకపోవుటచే వారికిఁ బెద్దవిచారము గలిగినది. అప్పుడు విక్రముఁ డయ్యో! నేను చాల తెలివితక్కువపని చేసితిని. మనుష్యభర్తృత్వమునకు వేల్పులు గర్హింతురని మధుమతి చెప్పిన మాటలోఁ గొంత సత్యమున్నది. ఈవార్తవిని వీరిని మందలించి యిందురాకుండ నాటంకపరచిరేమో! లేకున్న వారిందు రాకుండ గడియనిలుతురా! లబ్ధనాశనమన నిట్టిదే యనిపరితపింప విజయుఁడిట్లనియె.

విక్రమా! దేవకాంతల ప్రేమ యవ్యాజమైనది. వాండ్రఁ గట్టిపెట్టినను నెట్లో తప్పించుకొని వత్తురుగాని యందు నిలువరు. వారు రాకపోయినచో మనయాయువు లీదీవియందు ముగియవలసినవే యని పలికెను. చిత్రభానుండు నలుండుగూడ నట్లే యనువదించిరి. మఱి రెండుదినములు గడిచినను వారిజాడ గనంబడలేదు. మిక్కిలి పరితపించుచు వారు సముద్రతీరంబునకుంబోయి యందుఁ గూర్చుండి వారురారని నిశ్చయించి తత్క్రీడా వినోదముల నొండొరులకుం జెప్పికొని పరితపించుచు నాశదీరక యాకాశమునందే సర్వదా దృష్టులు వ్యాపింపఁజేయుచుండిరి. వారిజాడ గనంబడలేదు.

వెండియు దేవీభవనంబున కరుదెంచి ముఖపంటపములో సాష్టాంగముగాఁ బండుకొని యమ్మహాదేవిని ధ్యానించుచు,

గీ॥ ఉదధి జలమధ్యమున మున్గుచున్న మమ్ముఁ
     దెచ్చి యమరాంగనల గూర్చితివిగదమ్మ
     బేలతనమున మేమాండ్ర గోలుపోతి
     మంబ! యెటుచేర్తొ కృప మా కుటుంబినులను

అని ప్రార్ధించుచు నా రాకుమారు లారాత్రియెల్ల జాగరము జేసి దేవి నారాధించుచుండిరి. తెల్లవారుసమయమున నంతరిక్షమున గంటలచప్పుడు వినఁబడినంత వారత్యంత సంతోషముతో బయటకు వచ్చి తలలెత్తిచూచిరి. అప్పుడు కనకమణిరుచిరప్రభాపటలంబు క్రిందికి వచ్చుచున్నట్లు కనంబడుటయు నది విమానమని వారు దెలిసి కొని చప్పటులు గొట్టుచు నాట్యముసేయఁ దొడంగిరి.

అంతలో నావిమానమువచ్చి దేవీముఖమంటప ప్రాంగణమున వ్రాలినది. అందుండి మఱపుతీగవలె మెఱయుచు నానలువురు తరు ణులు దిగివచ్చి వియోగచింతాసాగరమగ్నులై తమరాక కెదురు చూచుచున్న భర్తలం గౌఁగిలించుకొని యానందాశ్రువులచే వారి శిరంబులం దడిపిరి. అప్పుడు విక్రముఁడు మధుమతిని గ్రుచ్చియెత్తుచు మత్తకాశినీ! మీరు మమ్ము మాయజేసి పోయితిరని తలంచితిమి. అబ్బా! యిట్టి వియోగశోకము శత్రులోకమునకైన రావలదని కోరుచున్నాను. అని తాము వారిగుఱించి పడిన పరితాపమంతయుఁ జెప్పి వారింగూడ దుఃఖవివశులం గావించి మీరేమిటి కనుకొన్న గడువునకు వచ్చితిరికారు? మిమ్మక్కడ నెవ్వరైన నాటంకముసేసిరా? మీవృత్తాంతము సవిస్తరముగాఁ జెప్పుఁడని యడిగిన విని మధుమతి భర్తకు నమస్కరించి యిట్లనియె,

మనోహరా! మీరిక్కడ వియోగదుఃఖ మనుభవించుచుందురని మే మెఱుంగుదుము. అయినను రాశక్యమైనదికాదు. వినుండు. మేము మీ సెలవుపొంది తిన్నగా స్వర్గమున కరిగితిమి. మేము నలువురము నందనవనములో దూరుపుదెసనున్న పారిజాతతరుషండము నడుమ నొప్పు వసంతమను పేరుగల సౌధంబున వసింతుము. కావున ముందుగా మామేడ కే పోయితిమి.

అందు మాపరిచారికలు మమ్ముజూచి అయ్యో! మీరు భూలోకమున కరిగి యింతయాలస్యముగా వచ్చితిరేల! ఎప్పుడైన నిన్ని నాళ్ళు జాగుచేసితిరా? మాసము దాటిపోయినది. మిమ్ము భూలోకములో నెవ్వరైన నిర్భంధించినారేమో యని మొన్ననే మహేంద్రుని కడ కరిగి చెప్పితిని. మీరు ప్రతిశుక్రవారము భూలోకమున కరుగు చుండుట ఆయన యెఱుగరఁట. కన్నులెఱ్ఱజేసి మాసెలవు లేనిదే వాండ్రు భూలోకమున కేల పోవలయు? నిలువుం డిప్పుడే తగినవారిం బంచి రప్పింతునని చెప్పుచుండ బృహస్పతిగా రరుదెంచిరి. వారెద్దియో రాజకార్యముల మాటలాడుకొనుచు మామాట మఱచిపోయిరి. పెద్దతడవు మేము సుధర్మా సభాబాహ్యప్రదేశమున నివసించితిమి. తిరుగా మాకింద్ర దర్శనమైనది కాదు. ఇంటికి వచ్చితిమి. తరువాత నీమాట జెప్పుటకై పదిసారులు పోయితిమి వారి దర్శన మైనది కాదు. మీకొఱకె యెదురు చూచుచుంటిమని చెప్పిరి.

ఆమాటలు వినినంతమాగుండెలుఝల్లుమన్నవి. అయ్యయ్యో! మీ రేల తొందరపడి యింద్రుని కెఱింగించితిరి. మా కం దమ్మవారు ప్రత్యక్షమై కామ్యములు దీర్చినది దానంజేసి యాలస్యమైనది . మహేంద్రుఁడు మేము భూలోకమునకరుగుటయె తప్పనియె నేమి? బృహస్పతిగారి యనుమతి పడసియే పోవుచుంటిమి. అయ్యో ! మనుష్య భర్తృత్వము నిందింతురుకాఁబోలు! ఏమిచేయుదము? విమానమెట్లు సంగ్రహింతుము? వారితో నీమాట చెప్పుదుమా మానుదుమా? చెప్పినఁ దప్పుపట్టి పోనీయరేమో? చెప్పకున్న నందు పోవుటయెట్లు? అని మేము డోలాయిత హృదయులమై యేమిచేయుటకుఁదోచక తొట్రుపడుచుండ నింతలో నింద్రుని పరిచారకుఁ డొకఁ డక్కడికివచ్చి మాపరిచారికలం జీరి మహేంద్రుని సెలవైనది. తక్షణమురండు. అని పలికిన విని మేము ఓహో ఈపిలువు మానిమిత్తమేయై యుండవచ్చును. ఏమిచెప్పుకొందుము అని యాలోచించి వారి కిట్లంటిమి.

వారివార్తయేమైనదని మహేంద్రుండు మిమ్మడిగిన వా రప్పుడే వచ్చిరి. కావునఁ దిరుగా మీకడకు రాలేదని చెప్పుడు పైమాట జూచుకొందమని యుపదేశించి పంపిరి. వారుదూతలవెంట మహేంద్రుని కడకరిగి నమస్కరించుటయు నతండు మీరు కన్యకా చతుష్టయము పరిచారికలు కారా? తిరుగా వారిమాట జ్ఞాపకముచేసితిరి కారేమి! వారింటికి వచ్చిరా లేదా? అనియడిగిన వాండ్రు స్వామీ! వా రామఱు నాఁడే యింటికివచ్చిరి. అమ్మవారు ప్రత్యక్షమై వరము లిచ్చినదఁట అందులకై యాలస్యమైనదని చెప్పిరి. అని యెఱింగించిన నింద్రుండు;

ఓహో! గాయత్రిదేవియే వారికిఁ బ్రత్యక్షమైనదియా ఎట్టి వరము లిచ్చినది? అనుటయు నావరము వివరము మాకుఁ దెలియదని వాండ్రు చెప్పిరి. వెంటనే మమ్ముఁ రమ్మని యాజ్ఞాపించుటయు దూతలు వచ్చి మమ్ముఁ దోడ్కొని పోయిరి.

ఇంద్రుఁడు - (మా నమస్కారములందుకొని) చంద్రకళా ! ప్రతి శుక్రవారము గాయత్రిదేవి నారాధించుటకు భూలోకమున రుగుచుంటిరఁట ఏమిటికి?

చంద్రకళ — (సిగ్గభినయించుచు) బృహస్పతిగారు మమ్మట్లు పోయి సేవించమన్నారు.

ఇంద్రుఁడు — ఎందులకై సేవించమన్నారు?

చంద్ర - ఏమియు మాటాడినది కాదు

ఇంద్రుఁడు — వారుణీ! నీవు చెప్పుము

వారుణి — మీకు మంచి యల్లుఁడు వచ్చుటకు

ఇంద్రుఁడు - గాయత్రీదేవి ప్రత్యక్ష మైనదియా? వరము లిచ్చినదా?

వారుణి – ఆ ప్రత్యక్షమై వరములిచ్చినది.

ఇంద్రుఁడు - ప్రత్యక్ష మైనదా? తిన్నఁగాఁ జెప్పుము

వారుణి — తిన్నగానే చెప్పితిని.

ఇంద్రుఁడు — ఎట్టి వరము లిచ్చినది?

వారుణి – మేము కోరిన వరము లిచ్చినది.

ఇంద్రుఁడు - మీరు భర్తలంగోరి సేవించితిరి గదా భర్తల నిచ్చినదియా?

వారుణి – ఇచ్చినది స్వామి యసత్యమాడుదుమా? ఇంద్రుఁడు - వా రెవ్వరు?

వారుణి - భూలోకచక్రవర్తి కుమారులు.

ఇం – (కన్ను లెఱ్ఱ జేయుచు) ఏమి! మహామునులకుఁబ్రత్యక్షముగాని గాయిత్రీదేవి మీకుఁ బ్రత్యక్షమైనదియా? భర్తల నిచ్చినదియా? ఎవ్వరో యువకులు మాయజేసి యట్లు చెప్పియుందురు. మీరు స్వతంత్రించి భూలోకమున కరుగుటతప్పు. మీనిమిత్తమై భర్తల మాటాడుచుంటిమి. మాసెలవు లేనిదే యిల్లు కదలితిరేని మిమ్ము దండింపఁజేసెదఁ జుఁడి! పో పొండు అని యదలించుటయు మాగుండెలలో ఱాయిపడినది. తెల తెలబోవుచు నేమాటయుఁ బలుకనేరక చూచుచుంటిమి.

అప్పుడు మాపుణ్యవశంబున దైవికముగా బృహస్పతి గారచ్చటికివచ్చిరి. ఆయనం గూర్చుండఁ బెట్టి మాతండ్రి గురూత్తమా! వీరి చరిత్రము వింటిరా? వీరికీ గాయత్రీదేవి ప్రత్యక్ష మైనదఁట మంచి భర్తలం దెచ్చియిచ్చినదఁట. ఆవ్రతము వీరికి మీరే యుపదేశించితిరఁట కాదా? అని యడిగిన నగ్గురుండు ఔను భూలోకములో శక్తి ద్వీపమున నున్న గాయత్రీదేవిని నాఱువత్సరము లారాధించినవారికి నద్దేవి కామితము దీర్చును. ఇది సత్యమైనమాటయే యని చెప్పిన నింద్రుఁడు నవ్వుచు ననేక సహస్ర సంవత్సరములు దలక్రిందుగాఁ దపం బొనర్చిన మహర్షులకుఁ బ్రత్యక్షముకాని గాయత్రీదేవి గొన్ని శుక్రవారములు సేవించినంతఁ బ్రత్యక్షమై కామితములం దీర్చునా. ఈ మాట విశ్వాసపాత్రముగాలేదని చెప్పుటయు గ్రీష్పతియిట్లనియె?

మహేంద్రా! అట్లనరాదు గాయత్రి ప్రత్యక్షముగాఁ గనంబడదు కాని కామితములఁ దీర్పకమానదు. బాలికలారా ! మీరు నాఁడు నన్నడిగితిరిగదా? ఆయమ్మవారి నారాధించితిరా! ఏమిజరిగిన దని యడిగి మేము యధార్ధమంతయు జెప్పితిమి. మా మాటలు విని గ్రీష్పతి నేనన్నమాట యసత్యమంటివి. ఈ వాల్గంటుల మాట వింటివా ? వారు వీరుకోరిన గుణములుగలవారై యుండకపోరు. వీరిభర్తలు గాయత్రీ ప్రసాద సంప్రాప్తులేయని యింద్రునికడ యుక్తి యుక్తముగా నుపన్యసించెను.

అప్పటికి దేవేంద్రునిబుద్ధి కొంతమారినది స్వామీ ! మే మీ కన్యకలకుఁ బెండ్లిజేయవలయునని తలంచు చుంటిమి. ఏమందురు ? అని యడిగిన సరిసరి. అట్లుచేసిన వేదజననికి, గోపమూ రాదా! ఆమెచేఁ గూర్పఁబడిన భర్తలేయుత్తములనిచెప్పి మాకుసంతోషముగలుగ జేసెను.

అప్పుడు మాతండ్రి నన్ను దాపునకుఁజీరి మధుమతీ? మీకు గాయత్రీమహాదేవి యనుకూల వాల్లభ్యంబు గలుగఁ జేసినదియా! మీ కిష్టముగానున్నదిగద. అని యడిగిన నేను తత్సమయోచితము లైన మాటలు జెప్పి యతని మెచ్చజేసితిని. తరువాత మీ విజయవార్తలం దెలుపుచు మాకు వారితో భూలోకములో విహరించుటకు విమాన మిప్పించుమని కోరితిని. అతం డంగీకరించి యప్పుడే విమానశాలాధికారిపేర జీటివ్రాసి యిచ్చెను.

మేమాయింద్రునిచే ననిపించుకొని యప్పుడే విమానశాలకుం బోయి యాయధికారికి చీటిఁజూపి మాయిచ్చవచ్చిన విమానమేరికొని పరిజనులకుమాత్రము జెప్పి యిందువచ్చితిమి. యిందులకై యాలస్యమైనది. గాయత్రీమహాదేవి యనుగ్రహంబున మాతండ్రిగూడ ననుమతించెను. మనమీ విమానమెక్కి మూడులోకములు సంచారము సేయవచ్చును. అని యావృత్తాంతమంతయు నెఱింగించినది.

ఆవార్త విని విక్రముఁడు సంతసించుచు గాయత్రీదేవి ప్రభావ మెట్టిదో తెలిసికొంటిరా యని సోదరుల కెఱింగించి సోదరులతోఁ దరుణులతో నమ్మహాదేవికి మ్రొక్కియప్పుడే యావిమానమెక్కి మధుమతి కిట్లనియె. ప్రేయసీ! ఈవిమానము కామగమనమనముకలదిగదా! దీనినిప్పుడు వరుణావతీనగరమునకుఁ బోవునట్లు స్మరింపవలయును. రాత్రివేళ మమ్మందు దింపి మీరు స్వర్గమునకుఁ బొండు మేము స్మరించినప్పుడు తిరుగా రండు. మీయందు మాకు నమ్మకము గలిగినది. మే మాక్రోధనుని జయించినపిమ్మట మనమందరము గలిసి విమానమెక్కి మానగరమున కరుగుదముగాక. అని యుపదేశించిన వినిమధుమతి యంగీకరించి వారు కోరినరీతిగాఁ దెల్లవారుసమయమునకు నా విమానము వరుణావతీనగరము జేరునట్లుజేసి యావీటి నడివీధి వారిం దింపి విమానముతో స్వర్గమునకుఁ బోయెను.

క్రోధనుఁడు భూపతులనిన నిరసించును. యతులనిన నతిభక్తితోఁ బూజించును. ఆవార్త వారదివఱకే వినియున్న వారగుట నప్పుడే యతివేషములువైచికొని సూర్యోదయము కాఁగానేమఠమెక్కడనున్నదని యడిగి తెలిసికొని సన్యాసులువసించు శంకరమఠమున కరిగిరి.

మఠాధిపతులు వారిరాకజూచి యెదురువచ్చి సగౌరవముగాఁ దోడ్కొనిపోయి తగిననెలవునఁ బ్రవేశపెట్టి మ్రొక్కుచు నిట్లనిరి. మహాత్ములారా ! మీ రెందుండివచ్చితిరి. ఇందెన్నాళ్లుందురు! మీ రేయేదేశములు తిరిగితిరి? మీవృత్తాంత మొకింత యెఱింగించితిరేని వ్రాసికొని మారాజునకుఁ దెలియఁ జేయవలసి యున్నది. మీరెంత కాల మిందుండినను నభ్యంతరములేదు. మీకుఁ గావలసిన పదార్థముల నర్పింపుచుందుము. ఇది మారాజశాసనము అని యడిగిన విని విక్రముఁడు ఇంచుక నవ్వుచు నిట్లనియె.

మీయధిపతి యతిప్రియుండనియు విద్యాబలసంపన్నుండనియు విని చూడవచ్చితిమి. ఇందలివారలకు యతిధర్మములేమియుం దెలియవనుకొందుము. మాకాహారముతోఁ బనిలేదు. నారాయణస్మరణము. అద్వైతచింతనము తప్ప నితరవిషయములుమా చెవి కెక్కవు. యతుల కొకచోఁగాపురము, ఒకనామము గలిగియుండునా? అన్ని దేశములు తిరుగుచుండుటయే యతిధర్మము. అన్ని నామములు మాకే వర్తించును. సర్వంఖల్విదం బ్రహ్మ అను శ్రుతివాక్యము వినియుండ లేదా. బ్రహ్మవ్యతిరిక్తపదార్ధ మొక్కటియును లేదు. మేమే బ్రహ్మలము. అంతయు బ్రహ్మమయంబు. మేము భిక్షాటనముజేసి భుజింతుము. మీరేమియు మాకీయనవసరములేదు. కావలసిన మేమే మీ కీయఁగలము. అని పలికిన విని వారు వారి నిస్పృహత్వమునకు వెరగందుచు వారు మహానుభావులని తలంచి మఱేమియుఁ బ్రశ్నములు వేయక భయభక్తివిశ్వాసములతో వారి వెనువెంటఁ దిరుగఁజొచ్చిరి.

వారు ప్రొద్దుటలేచి స్నానముజేసి కాషాయాంబరములు ధరించి తత్వములు పాడుచు భిక్షాటనము సేయువారుం బోలె వీధులం దిరుగుచు యంత్రవిశేషంబులం బరికింపుచుండిరి. గుప్పెడు బియ్యము తప్ప వారేమియుం బుచ్చికొనరు వారి కిష్టమైనవారియింటకడనేకాని నిలువరు. ఇట్టి మహాత్ముల నిదివఱకుఁ జూచియుండలేదని పౌరులు జెప్పుకొనుచు వారి వెనువెంటఁ దిరుగుచుందురు.

ఆనగరమంతయు యంత్రములతో నొప్పుచున్నది. ఒకవీధికిఁ బదియంత్రములున్నవి. మఱత్రిప్పినంత తలుపులు పడిపోవును. అప్పు డా వీధినుండి యవ్వలకుఁ బోవశక్యముగాదు. శత్రువులు గ్రామసీమ కైనఁ జేరజాలరు. చేరినను వీధులం బ్రవేశింపవశముకాదు. ప్రవేశించినను దలుపులుపడినంత నానడుమంబడి మడియవలసినదే. కోట కనేక దుర్గములున్నవి. ఎట్టి బలవంతులైనను నాయంత్రంబులఁ దప్పించుకొని యాకోటలోఁ జేరఁజాలరు.

రాజకుమారులు నలువురు నిత్యము వీధులఁదిరుగుచుఁ బదిదినములలో నావీటి రహస్యములన్ని యుం దెలిసికొనిరి. ఆనగరము విశ్వకర్మనిర్మితమేమోయని భ్రాంతిపడఁజొచ్చిరి. వారు వీధుల నడుచున పుడు బాలురకు ఫలములు పంచదారయు నిచ్చుచు వారిచే నారాయణస్మరణ జేయించుచుందురు. దానంజేలి వారివెంటఁ బాలకులు గుంపులుగా మూఁగి ఫలములందినుచుఁ బోవుచుందురు.

పదిదినములలో వారిప్రఖ్యాతి నగరమంతయు వ్యాపించినది. వారు వీధింబోవుచుండ నెదురుపడిన పౌరులు సాష్టాంగనమస్కారములు జేయుచుఁ గొంతదూరము వారితో నడిచి వెనుకకుఁ బోవుచుందురు. కొందఱు భిక్షావందనములకు రమ్మని కోరుచుందురు. సంతతిలేని స్త్రీలు రాత్రుల మఠమునకుఁబోయి యతిభక్తితోఁ బాలు ఫలములు నర్పించుచుఁ దమకుఁ బుత్రులుగలుగువిధానము బోధింపుఁడని వేడుకొనిన నేదియో చెప్పి వారిని సంతోషపఱచి పంపుచుదురు. “ఎవరేమియిచ్చినను బుచ్చుకొనరు. ఫలములందికొని యప్పుడే పంచిపెట్టుదురు.” అనియూరంతయు వాడుక వ్యాపించుటచే వారి సుగుణములు మఱియుం బెద్దగా నెన్నుచుండిరి.

వారికీర్తిక్రమంబున మఠంబువదలి, వీధులునిండి, గోడలుదూకి, మేడలెక్కి., సందులదూఱి, దుర్గముల నతిక్రమించి, శుద్ధాంతములఁ బ్రవేశించి, కోటదాటి, రాజుగారిచెవిం జేరినది. క్రోధనుఁడు సన్యాసులప్రఖ్యాతి విని యక్కజమందుచు మఠాథిపతుల రప్పించుకొని యిట్లనియె.

మనగ్రామము మహానుభావులైన సన్యాసులు నలువురువచ్చి మఠములో నివసించియుండిరఁట. వారెట్టివారు? ఎందుండి వచ్చిరి? వారి ప్రవర్తనము లెట్టివి? తేలుపుడని యడిగిన మఠాధివతు లిట్లనిరి.

మహారాజా! మనమఠమున కిదివఱకనేకసన్యాసులు యతీశ్వరులు వచ్చియుండిరికాని యిట్టి నిస్పృహుల నిట్టివిరక్తుల నెన్నఁడును జూచి యెఱుంగము. సమలోష్ఠకాంచనులన వీరికే చెల్లును. ఫలము కాయ యెవ్వరైన నిచ్చిన నందుకొని యందే పంచిపెట్టుదురు. మఱి యొక్కవిశేషము వినుండు. వారెప్పుడును భోజనముజేసినజాడయుఁ గనంబడదు. మర్యాదకై యెవ్వరైన భిక్షావందనమునకుఁ బిలిచినచోఁ బోయి పాలుమాత్రము పుచ్చుకొందురు. అని వారిగుఱించి యారాజు పురుషులు బెద్దగా నగ్గించుటయు రాజు వారిం జూడవలయుననియు భిక్షావందనము జేయవలయుననియు నభిలాషజనించుటయుఁ దన యుద్యమ మాపురుషుల కెఱింగించెను.

వారు ఓహో! యింతకన్నఁ బుణ్యకార్య మున్నదా! అవశ్యము దేవర, వారిం బూజింపవలసినదియే. మీసద్గుణములు మావలన విని వారు మిగులసంతోషించిరి. కోటలోని విశేషములు జూడవలయునని యొకప్పుడు మాతోఁ జెప్పిరి. ఇఁక నెన్నియోదినము లీయూర నుండునట్లు లేదు. కావున రేపే వారికి భిక్షావందనము చెప్పుడని ప్రోత్సాహపరచిరి.

సరే. రేపుప్రొద్దుననే నామఠమునకువచ్చి వారికి భిక్షావందనము చెప్పెదను, మఱియెక్కడికైనఁ బోయెదరేమో వారితోఁ జెప్పి యుంచుఁడని పలికి వారిం బంపివైచి తా నంతఃపురకాంతలకెల్ల నా కృత్యము దెలియఁజేసెను. రాజపత్ని సంతసించుచు నేను వారికి స్వయముగా వంటజేసి యర్పింతుఁ బెందలకడ దీసికొనిరండని భర్తను బ్రోత్సాహపరచినది.

ఆమఱునాఁ డుదయముకాకమున్న క్రోధనుఁడు స్నానముజేసి పట్టుపుట్టంబులం దాల్చి సముచితపరివారముతోఁ గాలినడకనే యా మఠంబునకుం బోయి యాబాల సన్యాసులంగాంచి తత్తేజోవిశేషంబున కచ్చెరువందుచు వారికి సాష్టాంగనమస్కారము గావించి మహాత్ములారా! మీచరిత్రము నాలుగు దివసముల క్రితమే నాచెవిం బడినది. ఈనడుమ ద్వీపాంతరమందున్న ద్వారవతీనగరమునుండి మాయింటికిఁ గొందఱు బంధువులు వచ్చియున్నారు. వారితో ముచ్చ టింపుచుఁ దిరుగుటఁజేసి మీదర్శనముజేయ నవకాశము జిక్కినది కాదు. వారీనాఁడు సముద్ర విహారమునకై యరిగియున్నారు. దానం జేసి తీరికయైనది. మీవంటి మహాత్ముల పాదధూళి సోకిన మావంటి పామరుల గృహములు పవిత్రము లగుచుండును. నేఁడు మీరు మా యింటికి బిక్షావందనమునకు దయచేయవలయు, ఇదిగో భద్రగజము. తీసికొని వచ్చితిమి. దీని నధిష్ఠింపుఁడు. అనిప్రార్ధించిన విని యక్క పటయతులిట్లనిరి.

మహారాజా ! నీదానశూరత్వము ద్వీపాంతరముల విని నిన్నుఁ జూచుటకే యీయూరు జేరితిమి. నీసౌశీల్యము వినినదానికన్న నెక్కువగానున్నది. మేము సన్యాసులము. భోగములతోఁ బనిలేదు. వాహనము లెక్కము. మార్గంబెఱింగిన పరిజను నొక్కరుని మాత్ర మిందుంచుము. పాదచారులమై మీయింటికి వత్తుము. నీవింటికిం జనుము. మా కేదేని కోరికయున్న నక్కడఁ గోరికొందుమని పలికిన విని యాజనపతి సంతసించుచు వారిని వీడ్కొని యింటికిం బోయి యతులు భుజింపఁదగిన పదార్ధములు దెప్పించి రుచియుక్తముగా వండుమని భార్యకుఁ దెలియజేసి వారియాగమన మభిలషించుచుండెను..

అంతలో నాకపటయతులు లోపల జెట్టిపుట్టంబులంగట్టి పైనఁ గాషాయాంబరము లవకుంఠనముగా వైచికొని యాయుధంబులు వస్త్రచ్ఛన్నంబులు గావించి తూర్యనాదములు నింగిముట్ట రాజభటుల వెంటనూరేగుచు నడుమ నడుమఁ గనంబడు యంత్రవిశేషంబులం జూచి భటులవలనఁ దద్విధానంబులం దెలిసికొనుచుఁ బౌరులుమూగి వెంటనడువ బాహ్మణులు స్వస్తిమంత్రంబులం జదువ మెల్లన మహావైభవముతో సింహద్వారము కడ కరిగిరి.

క్రోధనుం డర్ఘ్యపాద్యాదులంగొని ద్వారముకడ కెదురువచ్చి సత్కరించి యత్యంతభక్తితో శుద్ధాంతమునకుఁ దీసికొని పోయి పాదంబులం గడిగి శిరంబునఁ జల్లుకొనుచు భార్య పైఁజల్లి పైడిపీటలపై గూర్చుండఁబెట్టి యర్చించుచు బిక్షకు సంకల్పించినంత వారు,

చ॥ సముచితరీతి మేమిటకు సంగరభిక్షునుగోరి వచ్చినా
      రము వినుతింప నీదగుపరాక్రమమెల్లడ మాకు నీ పదా
      ర్ధములు రుచింప వాజి భుజదర్పములేర్పడ నేఁడు ద్వంద్వయు
      ధ్ధము దయసేయుమయ్య ప్రమదంబు వహింతుముదాననెంతయున్

చ. సమధికయంత్రశక్తి నృపజాలములన్ ధరఁ గెల్చితంచు గ
    ర్వముపడఁబోకుమీ యదిపరాక్రమహీనుల మాగర్ మాత్మ వి
    క్రమ మెఱి గింతువేని రణకౌశలమేర్పడరమ్ము సాంపరా
    యము బొనరింతమందుఁ దెలియంబడుగా మనశౌర్యసంపదల్.

నరేంద్రా! మేము నలువురమని శంకింపవలదు. మాలో నొక్కనితోఁబోరి గెలుపుగొందువేని నిన్ను మంచి బంటుగా గీర్తింతుము. కత్తులా గదలా కరములా పిడికిళ్ళానీవు వేనితోఁ బోరంగలవో చెప్పుము మేము వానిం గైకొందుములెమ్ము. నీయంత్రబలమును మాతంత్రబలముమ్రింగివేసినదని పలుకుచు శాటీపటావకుంఠనముదీసి పారవైచి వీరవేషములతో నెదుర నిలువంబడియున్న యారాజు కుమారుల నలువురంజూచి మందహాసము గావించుచు,

మ. జననాధాగ్రణి వారిఁబల్కె బళిరా! సన్యాసులై మీరు వం
     చన విచ్చేసితిరిప్పురంబునకు మీశౌర్యంబు ధైర్యంబు దీ
     ననె తెల్లంబగుచుండె సంగరములోన న్వేరెవీక్షింపగాఁ
     బనిలేదైనను మీప్రతాపవచన ప్రౌఢత్వమున్మెచ్చితిన్ .

ఉ. ఎవ్వరుబాబు మీరు? కులమెయ్యది? కాపురమెందు ప్రౌఢిమన్
     జివ్వకుఁ జీరుచుంటిరి విచిత్రమె యిందలి నాచరిత్రమీ
     కెవ్వరు సెప్పలేదుకొ గ్రహింపకవచ్చితిరద్దిరయ్య ! మీ
     క్రొవ్వుడిగింతు నిల్వుఁడొకకొంచపుకాలము సంగరంబులో.

ఉ. సంగర బిక్షబెట్టుమని సాహసమొప్ప వచించినార లు
     ప్పొంగితి నొక్కరొక్కరుగఁ బోరొనరింపఁగనేల నందఱేకమై
     నం గుతుకంబె నా కమరనాధ సుతుండొకఁడేకదా బలా
     ప్తింగురునాధులం గెలిచి త్రిప్పఁడెగోవుల మీరెఱుంగరే.

అనిపలికిన విని యారాజనందనలు మందహాసశోభిత వదనారవిందులై

క. ఓనృప! తాళధ్వజనృపు
   సూనుల మేమిప్పురంబు జొచ్చితి మురు వి
   ద్యా నిపుణతతో శత్రు
   స్థాన రహస్యములఁ దెలియఁదగు ఛద్మమునన్ .

యంత్రబలగుప్తుండవగు నిన్నుఁ దంత్రబల ప్రౌఢిమం బట్టికొనుట తప్పుగాదు. లే లెమ్ము. ఆయుధఁబులం ధరింపుము. నీధార్మిక బుద్ధికి మెచ్చుకొంటి. అన్నంబిడఁబూనిన నీపైఁ గత్తిగట్టితి మిదక్షత్రియధర్మంబగుట దూష్యంబుగాదు. జితోస్మి యనుము. విడుతుమని పలికిన విని క్రోధనుం డిట్లనియె.

ఓ హో హో! మీ బాహుబలం బెట్టిదైనను వచనప్రౌఢిమ మెచ్చఁదగి యున్నది. వాచాలురగుదురు. దొంగలవలె నింటిలో దూఱి బీరము లాడెదరా? కానిండు. మిమ్ముఁ బరిభవించి మీవాక్యములకు సమాధానము చెప్పెదంగాక. అని పలుకుచు నసిగదా ముసలాది సాధనంబుల నక్కడికిఁ దెప్పించుకొని వారిపై దుముకుటయు నతనితో విక్రముం డొక్కఁడే కలియఁబడెను. తక్కినవారు వారి యుద్ధనైపుణ్యము బరికించుచు దూరమున నిలువఁబడిరి.

అంతకుమున్న యంతఃపురకాంత లందఱు నయ్యతిపతుల నర్చించుటకై స్నానముజేసి పీతాంబరంబులం దాల్చి పుష్పంబులు చేతఁబూని ప్రాంతములం బొంచి పొంచి చూచుచుండిరి. రాజపత్ని యతిభక్తితో వంటజేసి వడ్డింపఁ నిరీక్షించుచున్నది. అట్టిసమయంబును నీపోరు సంప్రాప్తించుటయు నామె అయ్యో! నాభర్త యొక్కరుండు శత్రువులు నలువురు. నలువురుతో నొక్కఁ డెట్లు పోరఁగలఁడు? అక్కటా! మాచుట్టము లీదివసమే సముద్రవిహారమున కరిగిరికదా. వారికి వార్త బంపిన లెస్సగానుండునే. శత్రువులు బలవంతులు గాకున్న నింతవ్యూహము పన్ని శుద్ధాంతము సేరుదురా! అయ్యో! మాయంత్రబల మిప్పుడేమి పనికివచ్చును? అంతఃపురముననే చిచ్చు పుట్టినది. ఔరా! శుద్ధాంతము సంగరరంగమైన నేమిచేయుదుము? అని పరితపించుచుఁ బెరటిదారిని మంత్రులకు సామంతులకు దండనాధాది వీరయోధుల కవ్వార్త దెలియపఱచినది.

మట్టమధ్యాహ్న మైనది. అర్చన సమయమని సింహద్వారము కడ మంగళనాదములు వెలయించుచుండిరి. ఆయుద్ధప్రవృత్తి యెవ్వరికిఁ దెలియదయ్యెను. మంత్రు లావార్తవిని యాశ్చర్యపడుచుఁ గొందర వీరయోధులఁ బ్రోగుజేసికొని యత్యంత వేగముగా గోటలోఁ బ్రవేశించిరి కాని, విజయాది రాజకుమారులు మువ్వురు నాయుధంబులంబూని సముద్రంబును జెల్లెలికట్టవలె నాదిట్టల లోపల నడుగు పెట్టనీయక దూరముగాఁ బాఱదోలిరి.

అంతఃపురస్త్రీలు వెరపుతోఁదలుపులు మూసికొని గవాక్షములు తెరచికొని వారి యుద్ధవిశేషములు చూచుచుండిరి. అందుఁ జారుమతి యను చిన్నది సంగరరహస్యము లెఱింగిన వీరపత్నియగుట దుర్యోధన భీములవలెఁ బోరుచున్న యాయిద్దర యుద్ధనైపుణ్యము పరికించుచుఁ గ్రోధనుని యేటులు దప్పిపోవుచుండుటయు విక్రముని యేటులు బీరువోవక ప్రతివీరునకుఁ దగులుచుండుటయుఁ గనిపెట్టినది

అప్పు డప్పుడఁతి భయపడుచు రాజపత్నితో నమ్మా! నీభర్త క్రోధనుం డనూన పరాక్రమశాలియని గరువపడు చుంటివికాని గదాయుద్ధములోఁ బ్రతివీరునికిఁ జాలకున్నాడు. ఇంక రెండు గడియ లలో నితండు పడిపోవును. రిపుఘాతంబులు రెండు తగిలినవి. వాని కితని తాడనంబొకటియుఁ దగులలేదు. గద త్రిప్పుటలో వానికిగల నైపుణ్య మీయనకు లేదు. తల్లీ! వేగము వారికి వర్తమానము పంపుము. ఆవీరులువచ్చిన వీరితోఁబోరాడగలరు. లేకున్న గడియలో నితండు పడిపోవఁ గలడని పలికిన రాజపత్ని యిట్లనియె.

అమ్మా! మీతండ్రిగారి పరాక్రమ మేతన్మాత్రముకాదు. ఈలాటి బలాఢ్యుల నిదివఱ కెందరను పీచమడంచి రనుకొంటిని ! అయినను వారి కీవార్త దెలియఁ జేయుమని యిదివఱకే వార్తనంపితి నని యుత్తర మిచ్చినది.

అట్లు క్రోధనుండు విక్రమునితోఁ బెద్దతడవు గదాయుద్ధము జేసి క్రమంబున బలంబు క్షీణం బగుచుండ నతని యేటులు గాచి కొన లేక తప్పుదెబ్బలు కొట్టుచు శత్రు గదాప్రహారములు మర్మ సంధుల వేధింప విహ్వలుండై యొక్కింత పెడకుఁ దప్పుకొని,

క. ఏయకు మేయకు మాగు గ
   దాయుద్ధమునందు నీవు తద్దయుఁ బ్రజ్ఞా
   గేయుఁడవైతివి మెచ్చితి
   నాయాసముదీర నిలువుమా క్షణ మనఘా!

అని పలికిన విని నవ్వుచు విక్రముండు ఏయుటమాని రాజా ! ఆయాసము తీర్చికొని రమ్ము. తొందరలేదు. పాపము! నాచేఁ జాల దెబ్బలు తినియుంటివిగదా !

క. భూధవ మాయాయోధన
   సాధన మింతియయ నీప్రసంగమువిని బల్
   యోధుఁడ వనుకొంటిని మేల్
   బోధపడె న్నీదుశౌర్యమును ధైర్యంబున్.

క్రోధనా ! ఆయాసము దీరినదియా ? నీకు గదాయుద్ధము నం దంతగా నైపుణ్యమున్నట్లు తోచదు. పోనీ, ముష్టి యుద్ధము చేయుదమా? లేక శరశరాసనంబులం బూని ద్వంద్వయుద్ధము చేయుదమా ? నీ కేది ప్రియమో చెప్పుము. అన్నిటియందు నిట్టిప్రజ్ఞయే కలిగియున్నచో దొలంగిపొమ్ము. జితోస్మియని నాకాలిక్రింద దూఱి పొమ్ము. అని పలుకుచుండ విని యతండు దోస్సారము క్షీణించి నను రోషావేశంబున లేనిబలము దెచ్చుకొని యొక్క పెట్ట విక్రముని మీఁది కుఱికి ముష్టియుధ్ధంబునకుఁ దొడంగెను. అప్పుడు వారిద్దరు పెద్దతడవు బాహాబాహీ ముష్టాముష్టి కచాకచిం బెనంగుచుఁ జూపఱకు వెఱపుఁ గలుగజేసిరి.

విక్రముం డట్లొక్కింతసేపు విలాసముగాఁ నతనితోఁబోరి బెండువడియున్న యతని నట్టె యెత్తి నేలం బడద్రొబ్బి బెబ్బులి మేక పిల్లనుం బోలె నవలీలం బొదివి పట్టుకొని యిట్టట్టు కదలనీయక మోకాళ్ల నొక్కి పట్టుటయు నామహారాజు,

క. చచ్చితిఁ జచ్చితి నయయో
   నొచ్చెనొడల్ నిలువ లేననూనవ్యధకున్
   మెచ్చితి నీబలమున కిదె
   యిచ్చెదఁ బత్రికల విడువుమిఁక నన్న నఘా !

అని గిలగిలం గొట్టుకొనుచుఁ బలికిన విని యాయుద్ధము జూచుచున్న రాజపత్ని యడలుచు నందువచ్చి మహాత్ములారా ! మీరు దేవసములు లోకైకవీరులు. కానిచో ననేకయంత్ర దుర్గరక్షితంబగు నీనగరంబు జేరఁగలరా ! హఠాత్తుగా భోజనమునకుఁ బిలిచిన నరపతి పయింబడి భోజనశాలయే రణభూమిగాఁజేసి పరాభవించుట వీర ధర్మముగాదు. మీకడ నేను రణధర్మములు సెప్పుదాననా? ఎట్లైన నేమి ? మీరు నానాధుని జయించితిరి. పతిబిక్షబెట్టి వీనిని రక్షింపుఁడని వేడుకొనినది. విక్రముండు నవ్వుచు అమ్మా! మేము నీపతి నక్రమముగా జయించితిమని పలుకవలదు.

కొంత గడువిత్తుము. సేనలం గూర్చుకొని మీకడనున్న మహావీరులనెల్ల నాయత్తపరచికొని యుద్ధము సేయుమనుము. అందుఁ గూడ గెలిచినప్పుడే మాకు నీపతిచే జయపత్రిక లిప్పింపుము. అంత దనుక మేమిందొకచోట వసించియుందు మని పలుకుచు విక్రముండు క్రోధనుని విడిచి లేచెను. అప్పుడతండు లజ్జావనతముఖుండై లోపలికిఁబోయెను. అప్పుడారాజపుత్రులు ద్వారమున నిలిచియున్న మంత్రిసామంత ప్రముఖ యోధులనెల్ల లోపలికిబొమ్మని యాజ్ఞయిచ్చి సాధ్వీ ! మే మామఠమునకుం బోవుచుంటిమి జయపత్రికయో రణపత్రికయో మూడుదినములలో మాకుఁ బంపవలయును. నింతియగడువు. మేము బోవుచున్నారమని పలికి వారు మఠంబునకుం బోయిరి.

అని యెఱింగించి మణిసిద్ధుండు. . . ఇట్లు చెప్పఁ దొడంగెను.

_________

238 వ మజిలీ

అయ్యో భూలోకమునంగల చక్రవర్తులందఱు నాపేరువినినగడగడలాడుచుందురు. నా పాలిటికీవీరు లెక్కడనుండివచ్చిరో ! ఇప్పుడు నేను వీరికి జయపత్రికలిచ్చినచో నలువురలోఁదలయెత్తి తిరుగుట యెట్లు? ప్రేయసీ ! ఇట్టిపరాభవము నే బుట్టినతరువాత బొందియుండలేదు. మనయింటికివచ్చిన చుట్టములులోకైకవీరులని చారుమతి చెప్పినదిగదా! వారీ రాత్రి నింటికిఁరాగలరు వారింటనుండు నప్పుడైన వీరిని బిక్షకుఁ బిలిచితినికానే యౌరా! ఆకపటాత్ములు యతులవలె నెంతప్రచారముచేసిరి! ఇంతయేల జయవత్రికలిచ్చిపంపుమందునా. తిరుగాయుద్ధమునకురమ్మని సన్నాహము చేయుమందువా? ఇప్పుడు కర్తవ్య మేమని యడిగిన భార్య యిట్లనియె.

నాథా ! మీరు వారితో, బోరఁజాలరు వారు సామాన్యులు