కాశీమజిలీకథలు/పదవ భాగము/234వ మజిలీ

వికీసోర్స్ నుండి

అని యెఱింగించి మణిసిద్ధుం డవ్వలికథ యవ్వలి నెలవున నిట్లు చెప్పందొడంగెను.

________

234 వ మజిలీ.

గుణకేశినికథ.

చెలులారా! వినుండు. మాతండ్రి మహేంద్రుని సారధి మాతలి పేరు మీరు వినియుందురు. అతనికి లేక లేక చిరకాలమునకు గుణకేశిని యను కూతురు పుట్టినది. ఆబాలికామణిసౌందర్య మిట్టిదని వర్ణింప శేషునికైన శక్యముకాదఁట. త్రిభువనాశ్చర్యకరమగు చక్కఁదనంబుననొప్పునక్కన్యకామణికి వివాహముజేయ నిశ్చయించి మాతలి భార్యతో నాలోచించి వరాన్వేషమునిమిత్తము మాతండ్రి వలన సెలవుబొంది తొలుత స్వర్గపట్టణమంతయుం దిరిగి సురగరు డోరగ సిద్ధ సాధ్య విద్యాధర గంధర్వ కిన్నర కింపురుషాది దేవతా నగర విశేషములఁ బరికించి రూపయౌవనవిద్యామదగర్వితులగు వారి వారి కొమరులం జూచి తనకూఁతునకుఁ దగినవారు కారని నిశ్చయించి తిరుగా నింటికివచ్చి భార్య కత్తెఱం గెఱింగించెను.

అతనిభార్య మనోహరా ! మీతో మొదటనే చెప్పవలయునని తలంచితిని. చక్కఁదనముమాట యటుండనిండు, దేవజాతియం దొక లోపమున్నది. క్రొత్తసంతతి గలుగదు. ఎప్పుడు నొక్క పోలిక వారే యుందురు. నూత్నయౌవనముగల సౌందర్యవంతులు మందున కైనఁ గానరాదు. ఎప్పుడును ప్రాఁతబొందలే కావున మన గుణకేశినికి వేల్పులు పనికిరారు. భూలోకంబున కరిగి యభినవయౌవనమునం బ్రకాశించు రాజకుమారులఁ బరిశీలించి తగినవాడున్నఁ దీసికొనిరండని నియమించినది. మాతలి భార్యమాట పాటించి భూలోకమంతయు మూడుసారులు తిరిగి విద్యాయౌవనబలమదర్వితు లగు క్షత్రియకుమారులఁ గులళీలవిద్యాతపస్సంపన్నులగు మహర్షిపుత్రుల నిశ్శేషముగాఁ బరిశీలించి తనకుమారితకుఁ దగిన లలితు నెందునుం గానక విసిగి యింటికివచ్చి భార్యకావృత్తాంత మెఱింగించెను.

ఆమె ఔరా! స్వర్గమర్త్యలోకములలో నొక్క చక్కని యువకుఁడు దొరకకపోయెనా! సీ! మృదుసత్యులకుఁ గన్యక జనించుట కంటెఁ గష్టములేదు. కన్యక పితృకులము మాతృకలము భర్తృకులము మూడుకులములకు వన్నె తేవలయును. చూచిచూచి రత్నమువంటిపిల్ల నసమానరూవుండగు వరునకిచ్చి యెట్లు పాణిగ్రహణము చేయఁగలము? మనోహరా! కష్టపడి రెండులోకములు తిరిగితిరి గదా! భోగిస్థానమైన పాతాళలోకముగూడఁ జూచి రండు. అందును దొరకనిచోఁ బిమ్మట విచారింతము గాక. అని యుపదేశించుటయు మాతలి భార్యమాట జవదాటనివాఁ డగుట నప్పుడే సుధర్మకు మ్రొక్కి ప్రదక్షిణము చేయుచు భూలోకమున కరిగెను. అందు దైవికముగా నారదమహర్షి యెక్కడికొ పోవుచు నతని కెదురుపడియెను.

మాతలి - (నమస్కరించి) మునీంద్రా! నేనింద్రసారధిని, మాతలిని.

నారదుఁడు — (ఆశీర్వదించుచు) మాతలీ! నీ వీ భూతలంబున కేమిటికి వచ్చితివి? మహేంద్రుఁ డెందైనఁ బనిగలిగి పంపెనాయేమి ?

మాతలి - లేదు స్వామి. స్వీయకార్యమునకే వచ్చితిని.

నారదుఁడు -- మే మక్కార్యవిధానము వినవచ్చునా?

మాతలి - సరి సరి. మూడులోకములలో మీరువినని రహస్యము లున్నవియా ! మీరు వినుటయే కాదు. పూనుకొని యాకార్యము సేయవలసియున్నది.

నార — ఇంతకన్న నత్యాహితమేమియున్నది ! సత్వరముగా నెఱింగింపుము దానిం గావించి నీచే స్తోత్రముల నందెదంగాక.

మాతలి - స్వామీ! దేవతలు సంతానశూన్యులగుటనే సుఖపడుచున్నారని తలంచెదను.

నార – అట్లనుచున్నా వేమి?

మాతలి — మఱేమియుం గాదు. వినుండు. మాతృసాంప్రదాయంబునంబట్టి నాకొక యాఁడుపట్టి పుట్టినది. మీరెఱుంగుదురా?

నార - ఎఱుఁగ కేమి! యామె జతకర్మోత్సవమునాఁడు నే నందులేనా! ఆబాలికామణి సౌందర్యాతిశయము మెచ్చికొని ముద్దు పెట్టుకొని దీవించలేదా?

మాతలి — ఔను స్వామి మఱచిపోయితిని. మీరులేనిదే దేవలోకములో నుత్సవము జరుగునా? ఆబాలిక యిప్పుడు సంప్రాప్త యౌవనయైయున్నది. వరాన్వేషణమునిమిత్తముబయలుదేరివచ్చితిని.

నార — స్వర్గలోకములో నెక్కడను దగినవరుఁడు దొరకలేదా?

మాతలి - స్వర్గమందేకాదు. మర్త్యలోకమునఁగూడ దొరకలేదు.

నార -- మఱి యిందేమిటికి వచ్చితివి ?

మాతలి — పాతాళలోకమొకటి చూడవలిసియున్నది. అందులకై యిందువచ్చితిని. నేనెప్పుడు నాభువనము చూచియెఱుంగను. అందులకు బోవుమార్గముగూడ నాకుఁ దెలియదు. మునీంద్రా! మీరు శ్రమయని తలంపక యిప్పుడు నాతో వచ్చి యాలోక విశేషంబులు జూపింతు రేనిమీకెల్లకాలము కృతజ్ఞుఁడనై యుండెదననుగ్రహింపుఁడు.

నార - మాతలీ!నన్నిందులకై యింతగా స్తుతియింపవలయునా? నేనిప్పుడు వరుణలోకమునకే యరుగుచుంటి పోవుదమురమ్ము. నీకధో భువనవిశేషములన్నియుఁ జూపుదునుగాక. అని పలికి నారదుఁడు మాతలిని వెంటబెట్టుకొని సముద్రములో మునింగి వరుణనగరమునకు దీసికొని పోయెను. వరుణదూతలు నారదునిరాక జూచి వరుణున కడకరిగి దేవా! నారదమహఋషి దేవసారధి మాతలియటఁ యతని వెంటబెట్టుకొని వచ్చిరి. హజారముకడ నిలిచియున్నారు. మీకుఁ జెప్పమన్నారని విన్నవించినంత లేచి నారదులవారి కాటంకమేలా? లోనికిఁ దీసికొనిరాలేక పోయితీరా ? అని పలుకుచు ద్వారముకడ కరిగి మునిసమ్మతమగు నాతిథ్యము నారదునకును మహేంద్రసమ్మతమగు పూజ మాతలికిం గావించి తోడ్కొనిపోయి సభాభవనంబున రత్న పీఠంబులం గూర్చుండబెట్టి పెద్దగాస్తుతియించుచునాగమన కారణం బడుగుటయు నారదమహర్షి యిట్లనియె.

పాశహస్తా ! ఈమాతలిని నీవుయెఱింగియేయుందువు. ఈతని కూఁతురు గుణకేశినియను కన్యకకు వరుఁడు కావలసియున్నాఁడు. స్వర్గమర్త్యలోకములందు వెదకితిమి. తగినవాఁడు గనంబడలేదు. అందు నిమిత్తముపాతాళలోకమునకుఁ దీసికొనివచ్చితిని. ఈలోకంబుననున్న వారి నందఱంజూచుట కాజ్ఞయిప్పింపుమని యడిగినవరుణుఁ డిట్లనియె.

సురమునీంద్రా ! నీవు త్రిలోకసంచారివి. మూడులోకములలో నీవెఱుంగని ప్రదేశములు నెఱుంగని వారును లేరుగదా. అతండు త్రిలోకాధిపతియగు నింద్రుని సచివుండు. మీయిరువురు మాకుఁ బూజనీయులు. ఇట్టి మీ కాటంకములు సెప్పువారెవ్వరు? మీయిచ్చ వచ్చినట్లు శుద్ధాంతగృహారామ క్షేత్రంబుల విహరింపుఁడు. ఈమాతలి మానగర మెప్పుడును వచ్చియుండలేదు. ఈలోకవిశేషములన్నియు నతనికిం జూపుఁడు అని యుపన్యసించెను.

నారదమహర్షి మాతలిని వెంటబెట్టుకొని సర్వసమృద్ధిమంతంబగు వరుణలోకవిశేషము లన్నియుం జూపించెను. తిన్నగా వరుణుని కుమారునికడకుఁ దీసికొనిపోయి మాతలీ! యీతండు పుష్కరుండనువాఁడు. వరుణుని పెద్దకొడుకు. రెండవమహాలక్ష్మియనం బ్రభగాంచిన జ్యోత్న్సాకళయను సోముని పుత్రిక యితని స్వయంవర మున వరించినది. వీ రీతని తమ్ములు, విద్యారూపనంపన్నులు చూడుము. ఈప్రదేశముల హృతరాజ్యులగు రక్కసులు వసింతురు. దైత్యులు దేవతలచేఁ బరాజితులై యిందు డాగియుందురు. ఇది వారుణహ్రదము. ఇం దగ్ని సర్వదా ప్రజ్వరిల్లుచుండును. ఇది గాండీవ ముండుచోటు. ఇది వరుణచ్ఛత్రము. ఇందుబడిన వర్షబిందువులు చంద్రకిరణములువలె నాహ్లాదముజేయును. ఇట్టిచోద్యము లనేకము లీలోకమందున్నవి. మనకుఁగల కార్యవ్యగ్రతచే నిది చూడఁదగు సమయముగాదు. వరుణపుత్రులలో నీ కెవ్వరైన నచ్చిరేమో చెప్పు మని నారదమహర్షి యడిగిన మాతలి యంగీకరింపక యవ్వలిలోకములు చూతము పదుఁడు. అని యుత్తరముజెప్పెను.

అప్పుడు నారదమహర్షి యతనితోఁ గ్రిందుగా మఱికొంతదూర మేగి మాతలీ! ఇది రసాతలము సప్తమలోకము. కామధేను విందే యుదయించినది. ఇందలివిశేషము లద్భుతప్రభావయుక్తములు. పన్నగలోకమున స్వర్గలోకమున మనుష్యలోకమునగూడ నిందున్న వారి సౌఖ్యములు గలుగవని గాధగాఁ జెప్పుకొనుచుందురు. ఇందున్న సుందరకుమారుల నందఱం జూడుమని బలుకుచు నందలివింత లన్నియుం జూపించెను. మాతలి కందలి పురుషులు నచ్చలేదు. అవ్వలకుఁ బోదమని ప్రేరేపించెను. నారదుం డతని మఱికొంతదూరము దీసికొనిపోయి మాతలీ! యీనగరమును జూచితివా? దీనిపేరు భోగవతి. త్రిదివమును దేవేంద్రుఁడువలె దీనినివాసుకి పాలించుచున్నాడు. సహస్రఫణాభూషితుండగు శేషుం డిందుండియే శ్వేతభూధరమువలె మెఱయుచు భూమిని మోయుచున్నాడు. ఇందు సురస కొడుకులు నాగకుమారులు దివ్యరూపములతో నొప్పుచు మణిస్వస్తికచక్రాంకులై వేనవేలు సంచరించుచుందురు. వీరు స్వభావముచేత రౌద్రులు. ఇది నాగలోకమునకు ముఖ్యస్థానమగుట నిందు సహస్రముఖులు పం చాశన్ముఖులు దశముఖులు పంచముఖులు త్రిముఖులు ప్రముఖులు నగు నాగకుమారు లనేకులు ప్రఖ్యాతులైయున్నారు. అని తెలియఁజేయుచు నారదుం డాభోగవతీనగరము నడివీధిని నిలువంబడియెను.

అప్పుడందున్న పన్నగప్రముఖులెల్ల నారదమహర్షి వచ్చెనను వార్తవిని గుంపులుగుంపులుగా వచ్చి యతనికి నమస్కరించుచుఁబూజించి మహాత్మా! ఈదివ్యపురుషుఁ డెవ్వఁడు! ఈనడుము మీదర్శనము మాకు లభించుటలేదు. దానంజేసి యితర లోకవిశేషము లేమియుఁ దెలియకున్నవి. క్రొత్తవిశేషము లేవైనంగలిగిన వక్కాణించి మాకానందము గలుగఁజేయుఁడని ప్రార్థించిరి.

నారదుండు వారి నాశీర్వదించుచు విశేషముల కేమియున్నది సర్వలోకములవారు సుఖులైయున్న వారు. ప్రస్తుతము సంగరము లెక్కడను లేవు. గరుత్మంతునివలన మీ రేబాధయుం బొందక సుఖులై యున్నారుగద. అది యట్లుండ తక్షక వాసుకి కర్కోటక కులస్థు లన్యోన్యము కలహింపుచుందురు. మీలో మీకాతగవులు లేక సఖ్యముగలిగియున్నారా? అనియడిగినఁగాళీయుఁడను ఫణిపతియిట్లనియె.

మహాత్మా! మీదయవలన నిప్పుడు మేమందఱము కలిసియే యుంటిమి. మాలో మాకుఁ దగవులేమియును లేవు. గరుత్మంతుని యుపద్రవ మొకమాదిరిగాఁ దగ్గించుకొంటిమి. వినుండు. ఆపక్షి రాజు అవసరమువచ్చినప్పుడెల్ల మావీటిపైఁబడి దొరికిన నాగులనెల్ల బక్షించుచు దయావిహీనుండై బంధుత్వమాలోచింపక నిత్యము మాకుఁ బ్రాణసంకటము గావింపుచుండెను. ఏదినమునవచ్చునో ఎవ్వరిని భక్షించునో తెలియదు. అతండు వచ్చినప్పుడెల్ల వేలకొలఁది నాగులఁ గాలికిఁ దగిలించుకొనిపోయి భక్షించుచుండెను. అనేకనాగకుటుంబములు. పేరులేక నాశనమై పోయినవి. ఆయుపద్రవము భరింపఁజాలక మాలో మాకుఁగల తగవులు వదలుకొని మేమందరము నొకనాఁడొక సభజేసి కర్కోటక దృతరాష్ట్ర ప్రభృతుల రప్పించి యిట్లంటిమి.

గరుడుఁడు శేషవాసుకిప్రముఖుల కులస్థులజోలికి బోక నిత్యము సామాన్యకుటుంబములమీఁదఁ బడి నాశనము చేయుచున్నాఁడు. మూషికాద దధిముఖ వసంతకాదినాగకుటుంబములు పేరులేక నశించినవి. పెద్దవారందరు పూనుకొనక యుపేక్షించుచున్నారు. ఇట్లు కొన్నిదినములు జరిగిన నాగకులమే నశించును. ఇందుల కేదియేని యుపాయమాలోచింపవలయునని పెద్దవారిం గోరితిమి.

అప్పుడు వాసుకి మనుమఁడు అశ్వతరుఁడు తక్షకుఁడు కర్కోటకుఁడు నలువురు నాలోచించి మాకిట్లు తెలియజేసిరి. మనతల్లి కద్రువు జేసిన దోసంబునంజేసి వినతకొడుకు మనపై యీసుబూని యిట్టి దారుణక్రియలు గావించుచున్నాఁడు. అతండు మిగుల బలవంతుఁడగుట విరోధించి యతని నేమియుంజేయఁజాలము. కావున నతనిం బ్రార్ధించి సంఘమరణములఁ దప్పింపుమని వేడుకొందము. నెలకొకసారి మా యూరు రావలయుననియు నప్పుడు వంతులువేసికొని యొక్కనాగు నాహారముగా నర్పింతుమనియుం జెప్పుకొనుటయేకాక యట్లు వ్రాసి యిత్తము. అతం డట్లంగీకరించినచో నీయుపద్రవము కొంతవఱకు దగ్గునని యుపన్యసించి మాకుఁ దెలియఁజేసిరి. ఆనిబంధనకు నందున్న నాగకులజులెల్ల నంగీకరించి యప్పుడే సంతకములుజేసి సభాపత్రిక వ్రాసియిచ్చిరి.

ఆమఱునాఁడే గరుడుండువచ్చి యా వీటిపైఁబడి నాగ కుమారుల భక్షింపఁబూని నంత శేషవాసుకి పౌత్రలిరువురు నతని కడకుఁబోయి తమపేరులు సెప్పుకొనిరి గరుత్మంతుని కా రెండు కొలముల వారియెడఁ జాల ప్రీతి గలిగియున్నది. వారింజూచి యతం డిట్టి తఱి మీరేమిటికి వచ్చితిరని యడిగిన వారా పత్రికంజూపుచు మా నాగకులజులెల్ల మిమ్మిట్లు ప్రార్ధించుచున్నారు. అక్కా చెల్లెండ్ర బిడ్డలము. ఈమాత్రముపకారము చేయుము. అని వేడికొనిరి. వారిమాట తీసివేయలేక యాపక్షిపతి యట్లంగీకరించి యప్పుడే మరలిపోయెను.

నాఁటినుండియు మాకు సంఘ మరణములు తప్పినవి. వైన తేయుఁడు నెలకొకసారివచ్చి మేమిచ్చిన వారిలో నచ్చినవానింభక్షించి పోవుచుండును. దానంజేసి మాలో మాతగవులు గరుత్మంతుని మూలముగనే యడంగిపోయినవని యావృత్తాంతముంతయు నెఱింగించెను.

నారదుండు విని బాపురే! మీరు మంచి బుద్ధిమంతులు. అన్యోన్యమైత్రివలనఁ గలుగు సౌకర్యము లిట్టివేయని వారి నభినందించెను. అప్పుడు నాగకుమారులు ధనంజయప్రముఖులు నారదమహర్షి నగ్గింపుచు మహాత్మా! మేము మీ వీణాగానము విని చాలా కాలమైనది. ఒకసారిగాయత్రీసామము బాది మాకానందము గలుగఁ జేయుదురా? అని వేడికొనిరి. నారదమహర్షి వారి ప్రార్ధనమాదరించి యానడివీధినే కూర్చుండి విపంచి మేలగించి సామగానంబు హాయిగాఁ బాడఁజొచ్చెను. నారదమహర్షి సంగీతము పాడుచున్నారని విని భోగవతీనగరంబునంగల స్త్రీబాలవృద్ధులు గుంపులు గుంపులుగా వచ్చియాలకించుచునగ్గానరసము గ్రోలి వివశులై పడగలువిప్పి యాడఁదొడంగిరి.

అట్టితఱి నారదుఁడు జనాంతికముగా మాతలితో నీనిమిత్తమే నే నీసంగీతము పాడుచుంటిని. ఫణాధరులు గానమనినఁ జెవులుకోసికొందురు. ఇప్పుడీ గ్రామంబుననున్న నాగకుమారులందఱు నిందు వచ్చియున్నారు. వీరిలో నీకూఁతునకుఁ దగినవాఁడున్నాడేమోచూచికొనుము. మనము ప్రతిపన్నగుని యింటికింబోయి చూచినచోఁ బెద్ద కాలముపట్టును. పరీక్షించి చూచుకొనుమని పలుకుచు వినోదముగా బాడుచుండెను.

పన్నగు లొకచోట నిలువక పాటనాలించుచు నారదమహర్షి చుట్టను తిరుగుచుండిరి. ఆభోగవతీ నగరంబునంగల ప్రముఖులు తక్షకుఁడు కర్కోటకుఁడు కౌరవ్యుఁడు అశ్వతరుఁడు ఆర్యకుఁడు వసంతకుఁడు దిలీవుఁడు కాళీయుఁడు శంకుఁడు ధృతరాష్ట్రుఁడు లోనగు సర్పపుంగవు లెల్ల వచ్చి నారదుని గాన మాలించుచుండిరి. అట్టితరి నింద్రసారధి వారినెల్ల సాకూతముగా నాలోకింపుచుండెను.

చ. శిరమునఁజారు దివ్యమణి శేఖర మట్లు మెఱుంగు లీనఁగా
    సురచిర రత్నమండన విశోభితుఁడాది వయస్ఫురన్మనో
    హరతనుఁ డార్యలక్షణ సమంచితుఁడై తగునాగపుత్రుఁ డొ
    క్కరుఁడట నింద్ర సారధికిఁ గన్నులపండువు గాఁగనంబడెన్.

నూత్నయౌవన లావణ్య శోభా విభాసిత గాత్రుండగునట్టి నాగపుత్రుంగాంచి మాతలియుబ్బుచు గొబ్బున నారద మహర్షి తో మహాత్మా ! ఆ భుజంగ కుమారుండు ప్రణిధానమున ధైర్యమున రూపమున వయసున మాగుణ కేశినికిం దగినవాఁడు. మీ యనుగ్రహంబున నేఁటికిజూడఁ గంటి వానిజన్మ కర్మవిశేషములెట్టివో తెలిసికొనుఁడని కోరిన విని యయ్యనిమిషముని యా బాలునిఁ దననికటంబునకు రమ్మని చీరి యిట్లనియె.

నారదుఁడు — అబ్బాయా ! నీవెవ్వనికు కుమారుండవు?

సుముఖుఁడు -- (విచారముతో) నేను జికురుని కుమారుండ.

నార - నీపేరు.

సుము - సుముఖుండందురు.

నారదుడు - నీవు ఆర్యకుని పౌత్రుఁడవు కావా?

సుము - అవును.

నారదుడు - నీ మాతా మహుఁడు వామనుఁడేనా.

సుముఖు - చిత్తము వామనుఁడే

నారదుడు - నీతండ్రియుఁ దాతయు సేమముగానున్నారా ? సుమఖు — (కన్నులనీరు గ్రమ్మ) దండ్రిలేఁడు తాతయేనన్నుఁ బోషించుచున్నాఁడు.

నారదు — ఆనక మేము మీయింటికివత్తుమని మీ తాతతో జెప్పెదవా?

సుము -- చెప్పెదస్వామీ ! తప్పకదయజేసి మమ్ముఁగృతార్ధులంగావింపుఁడు అనికోరి యా బాలుండప్పుడే యింటికిఁ బోయెను.

నారద మహర్షియుఁ బాటచాలించి నాగ పతులకెల్లఁ జెప్పి యప్పుడే మాతలితోఁగూడ నార్యకు నింటికింబోయెను. ఆర్యకుఁడు మనుమని వలన నతని రాక దెలిసికొని యున్నవాఁడగుట గృహమంతయు నలంకరించి ద్వారముకడ వేచియుండి వారు చేరినతోడనేయర్ఘ్య పాద్యము లిచ్చి స్తుతియించుచుఁ దోడ్కొనిపోయి రత్నపీఠంబులం గూర్చుండఁబెట్టి ప్రక్కలనిలఁబడి వింజామరల వీచుచుండెను.

అప్పుడు నారద మునీంద్రుండతని భయభక్తి విశ్వాసముల నభినందించుచు నార్యకా ! ఈతని పేరు నీవు వినియే యుందువు. మాతలియనువాఁడు. ఇతండు మహేంద్రునకు సారధియు మిత్రుఁడు మంత్రియునై ప్రాణములలోఁ బ్రాణమై మెలంగుచుండును. ఇట్టి తేజస్వి యెందునులేడు. యుద్ధయాత్రలయందు గుఱ్ఱములచేఁ గట్టఁబడిన యింద్ర రథ మితఁడు మనసుచేతనే నడుపుచుండును. ఇతండు గుఱ్ఱములచేతఁ జయించిన శత్రువుల వృత్రారి చేతులతో జయించు చుండును స్వర్గవైభవమంతయు నీతనిదేయని చెప్పవచ్చును. ఇతనికి గుణకేశినియను కూఁతురుగలదు. ఆకన్య చన్కఁదన మిట్టిదని మేము చెప్పకయే మా ప్రయత్నమువలన మీకుఁ దెల్లముకాఁగలదు. ఆకన్యకకుందగిన వరు నిమిత్త మీతండు స్వర్గమర్త్య పాతాళలోకములు దిరిగి యెందునుంగానక మీభోగవతీ నగరంబున కరుదెంచెను. ఇందులకే నేనుగూడ నిందువచ్చితిని. పూర్వపుణ్యవిశేషంబున నీ మనుమఁ డతని మతికి ననుకూలుఁడని తోచెను. గుణకేశిని నీ మనుమని కీయ నంగీకరించినాఁడు. అందులకు మీకు గూడ సమ్మతమేని వెంటనే శుభకార్యము జరిగించవలసియున్నది. మీ కూటస్థుఁ డైరావతుని ప్రఖ్యాతినిబట్టి తనపట్టి సుముఖుని కీయ నిశ్చయించెను. ఇందులకు నీ యభిప్రాయమేమని యడిగిన నార్యకుండు నిట్టూర్పు నిగుడించుచు నిట్లనియె.

మహాత్మా! మాతలి చరిత్రము మేమెఱుంగనిదియా! అది యట్లుండె పరిజన కధలయందును దలంప నర్హతలేని మాయింటికి దేవర మాతలిందీసికొనివచ్చి మమ్ముఁ బెద్దగా నగ్గింపుచుంటిరి. ఇంతకన్న నాకుం గావలసిన దేమియున్నది! త్రిలోకాధిపతియగు మహేంద్రుని సచివుఁడువచ్చి పిల్ల నిత్తుమన్న వలదనువారుందురా? మునీంద్రా! మాయిక్కట్టు నేమనిచెప్పుకొందును. మాకట్టిభాగ్యము పట్టుటయెట్లు? స్వామీ! మాయూరినాగులెల్ల గరుత్మంతునికి వంతులు వైచికొని యాహార మర్పించుటకు నియమము జేసియున్నారు. క్రిందటినెలలో మాకు వంతురాగా నా కుమారుని జికురుని పక్షిపతి భక్షించిపోయెను. అంతటితో విడువక తండ్రి వెనుక నేడ్చుచు నందు వచ్చియున్న యీ సుముఖునింజూచి యోర్వఁజాలక యాపతగపతి ముందరినెలలో వీని నా కాహారముగాఁ దెచ్చియుంచుఁడని పాఁప పెద్దలకుఁ జెప్పిపోయెను. రెండు నెలలో నొక్క యింటివారి నిర్వుర భక్షింపఁగూడ దదియన్యాయమని యొక్క భుజంగుఁడు చెప్పఁడయ్యెను. సంవత్సరమునకొక యింటికి వంతు రాఁదగినది. రెండునెలలో వరుసగా మాయింటికివంతువచ్చినది. కొడుకు పోయినందులకే దుఃఖించుచుండ మనుమఁడుగూడ నానీడజపతికి భక్ష్యమైన నేమిచేయఁ దగినది? ఈయక్రమ మెవ్వరితోఁ జెప్పికొందును? అక్కడికిఁ పెద్ద నాగులకడకుఁబోయి మొఱపెట్టుకొంటిని. మేమేమి చేయుదుము? గరుడుఁడు మీ మనుమనింజూచి స్వయముగా నే కోరికొనియెను. వలదనుటకు మాకు సామర్ధ్యముగలదా! ఇందు మా తప్పులేదని వారుత్తరము చెప్పిరి. తపోధనసత్తమా! మా సుముఖున కిఁకఁ బదిదినములు మాత్రమేయాయువున్నది. ఇట్టి వానికిఁమీరు పెండ్లిచేయుమని యడిగిననేనేమి సమాధానముచెప్పఁగలననిగోలు గోలుననేడువఁదొడంగెను.

సీ! సీ! శ్రీవిష్ణునికి వాహనమై కశ్యపునకుఁ గుమారుఁడై యొప్పు పక్షిపతి కించుకయు జాలిలేకపోవుట కడుంగడు శోచనీయమై యున్నదని నారదమహర్షియతనిగర్హించుచు మాతలిదిక్కు, మొగంబై యిందుల కేమందువని యడిగిన నతం డిట్లనియె. స్వామీ! మీయనుగ్రహముండిన గరుడుండు సుముఖు నేమిజేయఁగలఁడు! ఈసుముఖుని మన మిప్పుడు స్వర్గమునకుఁ దీసికొనిపోవుదము. మహేంద్రునితో నితనికథ జెప్పి యీముప్పు తప్పింపుమని వేడుకొందము. అతం డుపేంద్రుని ముఖముగా గరుడునకుఁ జెప్పించిన నంగీకరింపక పోవఁడు. గరుత్మంతుం డెంతబలవంతుండైనను నుపేంద్రునియాజ్జు నుల్లంఘింపఁ గలఁడా? ఇదియే కర్తవ్యమని నాకుఁ దోచినదని చెప్పిన నారదుండు సంతోషించి యార్యకుని కావార్త దెలియఁజేసెను,

ఆర్యకుఁడు మిగుల సంతోషించుచు మనుమని వెంటఁబెట్టికొని యాక్షణమందే వారివెంట నాకంబున కరిగెను. అని యెఱింగించి... ఇట్లు చెప్పందొడఁగెను.

__________

235 వ మజిలీ.

సుముఖునికథ.

ఆర్యకుఁడు సుముఖుని వెంటఁబెట్టుకొని చుట్టములతోఁగూడ మాతలివెంట స్వర్గమున కరిగెనని విని భోగవతీనగరంబునంగల నాగ ప్రముఖు లొకనాఁడు సభచేసి యిట్లు సంభాషించుకొనిరి.