కాశీమజిలీకథలు/పదవ భాగము/231వ మజిలీ
జనవలె నింక లెమ్మనుచు ఛాత్రునితోఁ దదనంతర ప్రదే
శనిలయమేగి చెప్పె సరసంబుగ నవ్వలివార్త గ్రమ్మఱన్॥
- __________
231 వ మజిలీ.
స్వగ్రామప్రయాణము.
తమ్ములారా! వినుండు కీడుగూడ మేలునకే యొకప్పుడు కారణమగుననుమాట మనయందు నిరూఢమైనది. అమ్మహావాత పాతంబున గుఱ్ఱముతోఁగూడ నేనాదెసకు గొట్టుకొనివచ్చి యీకోటగోడకు దగిలికొంటిని. మీకుఁబోలె నాకు మన గుఱ్ఱముజేసిన సహాయమె యీవైభవమునకుఁ గారణమైనది. కోటలోఁజేరిన పురుషులు స్త్రీలవలె నందున్నవారికిఁ గనంబడునట్లు కాశ్మీర దేశాధిపతి యొకసిద్ధు నాశ్రయించి వరముగాఁ బడసెనఁట! నన్నీ ప్రమద్వర యాడుదాన ననుకొని తన యంతఃపురమునకుం దీసికొని పోయినది. మత్సంపర్కంబున గర్భవతియైనది. ఇందున్న కన్యకలందఱు పురపోపసృత్తముల నెఱుంగని వారగుట మాక్రీడల తెరంగెఱుఁగలేక పోయిరి. ఇందున్న ముసలిది ప్రమద్వర గర్భచిహ్నముల గహించి నన్ను బెదరించుచు నామె తండ్రికి వార్త నంపినది. ఎవ్వఁడో పురుషుఁడు స్త్రీ వేషముతోవచ్చి నీపుత్రికం గలసికొనియెను. ఇప్పుడు గర్భవతి యైనది. నీకూఁతురు నామాట వినక సంతతము వానితో దిరుగుచున్నది. కాపాడుకొనుమని వ్రాసిన యుత్తరము జదివికొని ప్రమద్వర తండ్రి చతురంగబలములతోవచ్చి యీకోట ముట్టడించి నన్నుఁ బట్టుకొనుటకుఁ బ్రయత్నించెను. ఖడ్గప్రహారముల వారినెల్ల నేను కాందిశీకులగావించితిని. రాజు నా పరాక్రమము మెచ్చికొని యా సిద్ధుని యుపదేశమున నే నల్లుఁడగుట సంతసించుచు నాతో సంధి చేసికొని వివాహమహోత్సవంబు గావించి నన్నుఁ దనరాజధానికి రమ్మని వేడుకొనియెను. నే నంగీకరింపక యిందేయుంటిని. ప్రమద్వర సకాలమునఁ బ్రసవమై యీపుత్రరత్నముఁ గనినది. నేఁడే వానికి జాతకర్మోత్సవము చేయుచుంటిమి. లగ్నబలంబున మనమందరము నిందుగలిసియుంటిమి అనితనవృత్తాంతమంతయుఁ దమ్ముల కెఱింగించెను.
అకథ వినిహరివర్మ అన్నా! మనుష్యుల శుభాశుభకర్మంబులు దైవాయత్తములై యుండును. మనుష్యులకంటె మృగములకు భావి శుభాశుభకర్మగ్రహణశక్తి యెక్కువగానుండును. నాగుఱ్ఱము దారితప్పి యిట్లు రాకున్న మనము కలిసికొనలేకపోవుదము. ఇఁక మనమింటికిఁ బోవలయును. అట్టిప్రయత్నము చేయుమని కోరికొనియెను. విద్యాసాగరుని మామగారగు శ్రీవర్ధనునితో దమయభిలాష తెలియఁజేసెను.
అన్నృపతి యంగీకరించి రెండువేల యేనుఁగులు నాలుగువేల గుఱ్ఱములు దాసదాసీసహస్రములు చీనిచీనాంబరములు ధనకనకవస్తు వాహనాదికముల గాణేయముగా నరణమిచ్చి శుభముహూర్తంబున వారికిఁ బ్రయాణము సాగించెను.
రాజపుత్రులు మహావైభవముతో బయలుదేరి నడుమనడుమ శిబిరంబులువైచి విడియుచు దేశవిశేషముల సంగ్రహించుచుఁ నాయా మహీపాలు రర్పించుకానుక లందికొనుచు నీరీతిం బోయిపోయి యొకనాఁడు సాయంకాలమున మార్గవశంబునఁ బరమ బవిత్రమైనద్వారవతీ పుణ్యక్షేత్రము జేరికొనిరి.
క. అని మణిసిద్ధుఁడు దెల్పిన
విని గోపాలుండు కడు వివేకముతో ని
ట్లను స్వామి! యీకథాంతర
మున నాకొక సందియంబుబొడమె వినుఁడొగిన్.
మహాత్మా! ప్రమద్వరయున్నకోటలో మగవారు ప్రవేశించి. నచో నందున్న యాఁడువారి కాఁడువారువలెఁ గనంబడున ట్లెవ్వరో వరమిచ్చిరని చెప్పితిరి. అట్లె జరిగినది. లెస్సయే కాని తరువాత విద్యాసాగరుని కుమారుని జాతకర్మాద్యుత్సవంబుల కనేకులు మగవారు వచ్చినట్లుగాఁ జెప్పియుంటిరి. వారందఱు నందలివారికి మగవారుగనే కనంబడినట్లు చెప్పియున్నారు. మొదటినియమ మేటికిమారినది? యీసందియము తీర్పుఁడని యడిగిన నవ్వుచు గురుఁడు వత్సా! గట్టి శంకలే చేయుచుంటివి. ఔను. ఆమాట నడుగఁదగినదే. మొదట వరమిచ్చిన సిద్ధుఁడు ప్రమద్వరరక్షణకై యట్లు వరమిచ్చెను. వివాహము వఱకే యానేమము చెల్లునని యాసిద్ధుం డానతియిచ్చియున్నాఁడు దానంజేసి జాతకర్మోత్సవంబున నావ్యత్యయము లేక యధాప్రకారమే జరిగినదని చెప్పి శిష్యునితోఁగూడ నవ్వలిమజిలీ చేరిరి.
అందుఁ జేరినదిమొదలు గోపాలుఁడు స్వామీ! నారదమహర్షి చరిత్రము గొడవగానుండుననుకొంటి. వరప్రసాదుల కధకన్న నదృష్ట దీపుని కధకన్న విజయభాస్కరుని కధకన్న చాల మనోహరముగా నున్నది. పాపము నారదమహర్షి తా నాడుదియై పిల్లలఁగంటినని యెఱుంగఁడుగదా! అతండు తిరుగా మహర్షియై యేమిచేసెనో వినవలయును. అతని తరువాతిపుత్రుల వృత్తాంతము జెప్పుఁడని ప్రార్థించిన సంతసించుచు శిష్యునకు గురుం డిట్లు చెప్పందొడంగెను.
- __________
232 వ మజిలీ.
పశ్చిమ దిగ్విజయము.
శ్రీముఖుఁడు విజయుఁడు విక్రముఁడు చిత్రభానుఁడు. నలుఁడు వీ రేవురు తాళధ్వజుని కుమారులు. సులోచనుని తరువాతివారు. ఉత్తరదిగ్విజయము సేయ నరిగిన యన్నలు రాకమున్న వీరు తలిదం