Jump to content

కాశీమజిలీకథలు/పండ్రెండవ భాగము/323వ మజిలీ

వికీసోర్స్ నుండి

కని పలికెను. పిమ్మట తమ యవినయంబుకతంబున బుట్టిన యనర్థముల విని యహల్యాతారా రమణులు మిగుల విచారించిరి వారి నుచితరీతిని ననునయించి నార దుండు యధేచ్ఛాగతింబోయెను. పిమ్మట నెల్లరును నిజనివాసముల కరిగిరి.

323 వ మజిలీ

పుండరీకునికథ

దేవలోకమున శ్వేతకేతుండను మహాముని కలడు. అమ్మహానుభావుండు దివిజగంగాసరి త్తీరమున నాశ్రమము గల్పించుకొని తపంబాచరించుచుండెను. ఒక్కనా డమ్మునిముఖ్యుండు మందాకినీ స్నానంబొనరింపగనేగి యందలి వికసిత సరోజాతముల దేవపూజకై కోసి తెచ్చుట కా జలంబులందిగెను. ఆ సమయమున గమల వనమున సన్నిహితయై వేయిరేకుల తమ్మిగద్దియపై గూర్చుండియున్న లక్ష్మీదేవి యామౌనిసత్తము నీక్షించి గౌతమశాపమూలమున జిత్తచాంచల్యము నొందెను. దర్శన మాత్రముననే సమాగమసౌఖ్యంబందిన యామెకు సద్యోగర్భమున నప్పుండరీకమందు పుత్రోదయంబయ్యెను. అప్పు డద్దేవి యా పుత్రకు నెత్తుకొనివచ్చి మునీంద్రా ! వీడు నీ తనయుండు. వీనిం గ్రహించి సంరక్షించుకొనుమని వచించి యబ్బాలకు నా శ్వేత కేతుల కొసంగెను. పుత్రసంభవము మాత్రముననే యామెకు శాపాంతమగుటయును జరిగినదానికి మనమున లజ్జించుకొనుచు నా శ్రీదేవి యంతర్హి తురాలయ్యెను.

పిమ్మట శ్వేతకేతుండు తనూజలాభమున కంతరంగమున సంతసించుచు నబ్బాలకుని నిజాశ్రమమునకు గొనివచ్చి పుండిరీకమున సంభవించిన కారణమున వానికి పుండరీకుడని నామకరణం బొనర్చెను. అబ్బాలకుం డమ్మునీంద్రుని సంరక్షణావిశేష మున దినదిన ప్రవర్థమానుండగుచుండెను.

దేవలోకముననే యొక మునిదంపతులకు గౌతముడు శాపమూలమున గపింజలుండును పుత్రుడై జన్మించెను. వానిని తలిదండ్రులుపనీతులొనర్చి విద్యా భ్యాసంబునకై శ్వేతకేతునియొద్దకు బంపిరి. పుండరీకునితో సమవయస్కుండగు నాకపింజలుని దన యాశ్రమమునందే యుంచుకొని పుత్రునితో వానికి సకల విద్య లను నేర్పుచుండెను. పుండరీకకపింజలు లత్యంతమైత్రి గలిగియుండిరి. ఉపదేశికుని ప్రభావమున నబ్బాలకు లచిరకాలముననే సర్వశాస్త్రముల యందును ప్రవీణులైరి.

ఇట్లుండ నొకనాడు నారదుండు శ్వేతకేతుని యాశ్రమమున కేతెంచెను.. అందా బాలకుల నిరువుర నీక్షించి మందహాస మొనరించుచు నమ్మునిపుంగవునితో నిట్లనియె. నార -- మహాభాగ ! ఈ కుమారులిర్వురును భవదీయ శిష్యులు గావల యును. శాస్త్రములెంతవరకు పఠించిరి?

శ్వే - పుండరీకుడను నీ బాలకుండు నా పుత్రుండు. రెండవవాడు విద్యా భ్యాసమునకై వచ్చియున్నవాడు. వీరు సర్వశాస్త్రముల బఠించిరి. కోరికగలదేని యేదైన బ్రశ్నింపవచ్చును.

నార -- ప్రశ్నింపనగత్యములేదు. శాస్త్రములన్నియును వీరి ముఖముల యందు బ్రతిఫలించుచుండెను. కాని యొక్కసందియము గలదు. ఆగ్రహము రాకున్న దెలియబల్కెదను.

శ్వే - ఆగ్రహమేల ? నీ సందియము తప్పక తీర్చుకొనవలసినదే!

నార - మహాత్మా ! బ్రహ్మచర్యదీక్షచేఁ బ్రసిద్దికెక్కియున్న నీకీపుత్రకుం డెట్లు గలిగెనో వినఁగుతూహలమగుచున్నది. నెరుంగఁ దగినఁ జెప్ప బ్రార్దించెను.

శ్వేత - ఆ వృత్తాంతము గొంత గూఢమైనది కాని నీసందియము బాపుటకై ప్రధానాంశమునుమాత్రము జెప్పెద వినుము. మందాకినీతీరమునఁ బుండరీకమధ్య మందు నాకీబాలకుండు లభించెను. కావుననే వీనికి పుండరీకుఁడను పేరుపెట్టితిని. వీని నప్పటినుండియును బుత్రప్రాయునిఁగా నీయాశ్రమముననే పోషించుచు విద్యాబుద్ధుల గరపితిని.

నార -- బాగు బాగు. ఈ కుమారుని ముఖమునఁ ద్రిభువనములఁ బాలింపఁ దగు చక్రవర్తిలక్షణములు బెక్కులు గనిపించుచున్నవి. వీని‌ నీయాశ్రమమున ముని వృత్తియందుంచుటకన్న లోకసంరక్షణమునకు వినియోగించుట యుచితమని నా తలంపు. మీద మీ చిత్తము.

శ్వేత -- ధనుర్వేదమందుఁగూడ నితండు గుశలుఁడయ్యెను. కాని పరిశ్రమ కొరవడియున్నది. అందులకై వీని నెచ్చటికైనఁ బంపవలెననియే నేనునుఁ దలంచు కొంటిని.

నార -- అట్లయిన వీని నావెంటఁ గొనిపోయి ధనుర్విద్యాపరిశ్రమమున కనువగుచోట శిసుక్షితునింజేయించెద ననుజ్ఞ యిప్పింతురే యని యడుగుటయు శ్వేత కేతుం డందుల కానందించి పుండరీకుని వానితోఁ బంపుటకు సమ్మతించెను.

ఆ దేవమునీంద్రుండు శ్వేతకేతునాశ్రమమునఁ నాదినముగడిపి మరునాఁడు పుండరీకునిఁ దోడ్కొనిపోవనున్న సమయమునఁ గపింజలుఁడుగూడ వారివెంటఁ బయన మయ్యెను. కాని వానితలిదండ్రుల యనుమతము బడయకుండఁ తమవెంటఁ దీసికొని పోవుటకు నారదుం డంగీకరించలేదు. కపింజలుండును బుండరీకునియందుఁ దనకుఁ గల మైత్రివలన వాని నెడఁబాసియుండఁజాలక తన తల్లిదండ్రులయనుజ్ఞఁ గెకొని వెంటనే వచ్చెదననిజెప్పి యందుండి వెడలిపోయెను. అప్పుడు నారదుండు శ్వేతకేతు ననుజ్ఞఁ గైకొని పుండరీకునితో నటఁగదలి సకలదేవతాలోకంబులఁ దిరుగుచు నందలి విశేషములు వానికి జూపుచుఁగ్రమమున భూలోకమున కేతెంచెను. అందుఁగల పుణ్య తీర్థములెల్ల వానికిఁ జూపించుచు వానివానివిశేషముల సంగ్రహముగా నెరింగించుచు జివు రకు భారతవర్షమున దక్షిణాపథమున నున్న పావనగోదావరీ సరిత్తీరమునకేతెంచి యమ్మ హానదియందుఁ గృదస్నాతులై తీరమున‌ కేతెంచుచున్నసమయమునఁ బ్రాంత మందు జనుల కోలాహలము వినంబడెను.

దానికి వారు వెరఁగందుచుఁ జూచుచుండ నొకదండనుండి వేదండంబొం దతిరయమున వారున్న వైపునకు వచ్చుచుండెను. దాని ననుసరించి యపరమిత సేనాసము దయం బరుదెంచుచుండెను. ఆ వేదండంబు తిన్నఁగాఁ బుండరీకుండున్న చోటి కేతెంచి నిజశుండాదండం బెత్తి యందమరింపబడియున్న మణిహారమాపుండరీకుని మెడలోవై చి యతిసంతోషసూచకముగ ఘీంకారమొనర్చుచు వానిచుట్లుఁ దిరుగుచుండెను. ఇంతలో వెనుకవచ్చుపరివారము జయజయనినాదములతో సమీపించిరి. ఈయద్భుతసంభవమును గాంచి నారదమునిచంద్రుడు మందహాసమొనరించుచుండెను. అమ్మణిహారప్రశో భితుండగు పుండరీకుండు పుండరీకాక్షు ననుసరించుచుండెను. అప్పుడు రాజపరివారము నుండి ప్రధానామాత్యుండు సకలరాజచిహ్నమాలంగైకొని ముందునకు వచ్చి పుండరీకు నాశీర్వదించుచు నిట్లనియె.


ఉ. కుంతలభూపుఁడీల్గగఁనె కొంకక నింకొకయోగ్యుఁ బట్టపుం
    దంతియెరింగి గోర్చుట విధాయక మీయెడఁ గావునన్ గరా
    భ్యంతరసంగృహీతమణిహారముతో నరుదెంచి నిన్నె భూ
    కాంతునిగా వరించెఁ గడకన్‌ గరిరాజిజ మాటలేటికిన్‌.

కుమారా ! నీ మొగమున సర్వవసుంధరా రాజ్యరమా సమోప భోగార్హము లగు చిహ్నంబు లనేకములు పొడఁగట్టుచున్నవి. నీ రూపము త్రిభువనాసేచన కముగ నెగడియున్నది. నీ యాదేశానుసారముగ‌ మే మెల్లరము మెలంగఁగలము. అసమశోభావిభూతిచే నతిశయిల్లు ప్రతిష్టానపురమందు భద్రసింహాసనా రూఢుండవై యీ కుంతలరాజ్య పరిపాలనం బొనర్పుము. నృగసగరభగీరధాధియాదిమ భూపాలకుల కీర్తివిత్తాపహర్తవై పయోధిపులినసంక్రాంత విక్రమక్రముండనై విపక్షభూపాలసంపదాప హర్తవై ముజ్జగములచేఁ కొనియాడఁబడుచుండుమని దీవించుచు నామరిత్రిముఖ్యుండు రాజోచిత వస్త్రాభరణము లప్పుండరీకుని మ్రోలఁబెట్టెను.

నారదమునీంద్రుని యాదేశమునఁ బుండరీకుండు సకలరాజ చిహ్నముల ధరించి యపరపుండరీకాక్షునివలెఁ బ్రకాశించుచుండెను. పిమ్మట నయ్యుపవాహ్యము నధిష్టించి మహావైభవమునఁ బ్రతిష్టానపుర ప్రవేశంబొనరించి యందు రాజభవనమున విడిచి శుభ సమయమున మంత్రి సామంతహిత పురోహిత ప్రముఖ ప్రకృతివర్గము బరివేష్టింపఁ గుంతలరాజ్య సింహాసనాధిష్టితుండయ్యె. ఇట్లుండ నొకనాఁడు నారధుం డేకాంతగృహమున నప్పుండరీకునితో నిట్లనియె. వత్సా ! పరమేశ్వరానుగ్రహమున నీకుఁ దగినపదవి లభించెను, ఇక్కు౦ తలరాజ్యరమాపరిష్వంగ విశేషమున నీకనన్యదుర్లభంబగు సుఖం బొనఁగూడఁగలదు. నేనిందుండరాదు తరుచు వచ్చి నీక్షేమమరసి పోవుచుందును. నీకే లోపమును రానే రదు. నీజనకునివలన నభ్యసించిన ధనుర్విద్యా వైశాంద్యంబెల్లఁ దెల్లమగునట్లు సర్వ దిగ్విజయం బొనర్చుము. శుభములంబొందుము. పోయివచ్చెదనని బల్కి వాని యను మతమువడసి యద్దేవమౌని యధేచ్చగఁబోయెను.

పుండరీకుండట్లు కుంతలభూపరీవృఢుండై యధాన్యాయమున బ్రజాపరి పాలనం బొనరించుచుండెను.


గీ. వాని వక్షస్థలంబు లక్ష్మీనివాస
    యోగ్యముగఁ దనరె ముఖమహోత్పలాంత
    రమున నుచితగౌరవపీఠమమరె వాణి
    కుభయులను నొక్కచోనిల్పి యొప్పె నతఁడు.

అతండు దివ్యతేజోవిరాజితుండైనను సూర్యునివలె ననేక కరప్రయోగ సంతాపిత మండలుడు కాలేదు. శీతాంశునివలె నపరోదయమున వక్రత్వమును బొంద లేదు. సస్తార్బివలె దహనవ్యాపారమున విభూచి నుత్పాదింపలేదు. దీపికవలె బాత్రో పరి బ్రజ్వలించుటలేదు. మాణిక్యమణివలె సువర్ణబంధమున నాయకత్వము వహించి యుండలేదు.


శా. ఆ రాజేంద్రుభూజాసిముఖ్యము ప్రతాపాంతర్విహారాతి వి
    స్తారంబందున గ్రీష్మత్మీవ్ర, మరిరాడ్డారాశ్రుధారాసమా
    సారంబొప్పఁ బ్రవర్షణంబు, తుహినచ్చాయావిరాజద్యశ
    స్సారాప్తిన్‌ శిశిరంబు, నిట్లొకటఁ దేఁజాలున్‌ ద్రికాలంబునన్‌.

మరియు నతండు సుశిక్షిత సేనాసమగ్రుడై విశేషవిజగీషుడై భుజబలమున సర్వకాలముననే నఖిలద్విజయంబొనర్చి విజయనిశితాసిచే విపక్షక్ష్కాపాలవంశనిర్మూ లనం బొనరించిమించెను. అప్పుండరీక పార్థివుండు ధర్మమున గలికాల ప్రాబల్యము నిరసించుచు, సుగుణముల నఖిల సాథులోకమును రంజింపజేయుచు వినయమున గురు జనుల సన్మానించుచు, క్రమాగతానుజీవిసామంతచక్రమును ప్రసాదమున నభివం దించుచు, బృకృతికనలము ననుర క్తి నాదరించుచు, చతురంభోధివలయాలంకారమై యనన్యభోగమై యేకాంతపత్రశేఖరమైయెసగు వసుంధరరమాసామ్రాజ్యసింహాస నమున సుప్రతిష్ఠుడైయుండెను. ఆతనికి విభూతివర్దనుండను విప్రకులసంజాతుండు మంత్రియై సకలరాజకార్యముల గ్రమమున నిర్వ ర్తించును. రాజున కత్యంతాప్తుడై మెలంగుచుండెను. ఇట్లు పుండరీకుండు కుంతలరాజ్య పరిపాలనం బొనర్చుచు నత్యంత సంతోషస్వాంతుడై కాలము గడపుచుండ సర్వజగదాప్యాయన విశారదయగు శారద సమయం బేతెంచెను.


గీ. అంబుధరపం క్తి విష్ణుపధంబునందు
    వివిధపాండురవర్ణశోభితము నయ్యొ
    వయసుమీరఁగ ధవళభావంబునందు
    వృద్ధునిశిరోజపుంజంబు విధముగాఁగ.

శా. లీనాతిస్థిరమౌ చకోరతరుణీలీలేక్షణాశోణిమ
    శ్రీనింపారెడు బంధుజీవకుసుమశ్రేణిన్‌ ద్విరేఫాంగనన్‌
    ఆనందంబున నూత్న ధాతుపటమందంతర్మషీలి స్తపాం
    ధానుస్యూతకధాక్షరావళివిధంబై విభ్రమించెన్‌ సదా.

అట్టి యుత్కిష్ఠశరత్సమయమం దొకనాడు యుదయమున నాభూజాని నిజాస్థానమండపముం బ్రవేశించివర్ణసింహాసనము నధిష్టించి సుఖోపవిష్టుడై పృధు భరత భగీరధాది పూర్వభూపాలచరితోపనాంసకులగు మంత్రులతోడను, దుర్గిమారాతి నిగ్రహవార్తానివేదకులగు సామంతులతోడను, బాణభట్టాభినందప్రభృతి కవ్కిక్రకలితా వరిష్టగోష్టీవినోదకులగు కవీశ్వరులతోడను, ప్రమాణశాస్త్రోపన్యాస విభ్రమునగు తార్కికులతోడను, పరిహాసమిశ్రితాలాపకౌశలు లగు నర్మసహచరులతోడను నంత డమందానందళితహృదయారవిందుడై యున్న సమయమున, బ్రతీహారి యరుదెంచి జానుకరకమలములు పుడమిసోక మ్రొక్కుచు నిట్లనియె.

దేవా ! ఏలినవారికి మిత్రుడు లీలోద్యానపాలకుడు వసంతశీలుడు దేవర దర్శనార్థియై వచ్చి ద్వారమున నిరీక్షించి యున్నవాడు. ముదలయే యనిన తోడనే యారాజేంద్రుడు మాయానతి నాభీరదేశమందలి నందావటమను పురమునకునుద్యాన పాలకుడుగా బోయి యతండు జిరకాలమున కేతెంచినాడు. సత్వరమ ప్రవేశ పెట్టుమని వాని కానతిచ్చెను. పిమ్మట ప్రతీహారిచే రాజాజ్ఞ నెరింగి వసంతశీలు డతివేగమున స్వామిసన్నిధి కేతెంచి యధార్హ నందనాదికం బొనరించి దా గొనితెచ్చినఫల మొకటి యుపాయనముగ నారేనియెదుట బెట్టెను.

ఆ ఫలము గైకొని “వసంతశీలా ! వచ్చితివా” యని యాదరించు ప్రభు నితో దేవా! అత్యద్భుతమగు విషయము దేవరవారి కెఱింగింప నిచ్చట కేతెంచితి నని యాఱేనిసమీపమున నుపవిష్టుడయ్యెను. పుండరీకుండును రసాంతరతరంగితాంత రంగుడై విశేషమేమో సత్వరమ వచింపుమని యనుటతోడనే వసంతశీలు డిట్లని చెప్పదొడంగెను.

ప్రభువరా ! వసుంధరారమాదేవికి నూతనశృంగార మాపాదించు శరత్కాల మేతెంచినతోడనే దేవరయానతి నౌదలంబూని నవోద్యానకార్యతప్పరుండనై నందావట పురమునకఱిగి యొకనాటి వేకువను శరత్కాలసంపదలచే నొప్పు నుద్యానవనమున కేగితిని. అచ్చట పలవకుండను సేవకుడు నీరు దోడుజలయంత్రముల నమరించుచు నతివృష్టివిఘటితములగు బోదుల సరిజేయుచుండెను. నీరు నిండుటచే కొట్టుకొని పోయినపాదులు జక్కపఱచుచుండెను. మంటపములందు పైకెదిగి భారముచే వంగి గ్రిందుకు జాఱిన లతావితానముల యధాస్థితిం బొందుపరచుచుండెను. అరటిచెట్ల యందు వ్రేలాడు సొరుగెల్ల ఖండించివైచుచుండెను. ఝంఝామారుతముచే గొట్టుకొని వచ్చి వనస్పతులయందు జి‌క్కుకొనియున్న ముండ్లగుత్తులెల్ల దీసిపారవైచుచుండెను. అప్పుడు నే నతిజాగరూకతతో ప్రతిలతామండపమును, ప్రతిపాదపమును, ప్రతివిట పమును, బరిశీలించుచు నందందలి జలాశయములను నందలిపద్మముల సౌందర్యమును బరికించుచు నాయుద్యానవనరామణీయకమునకు సంతసించుచు మిగిలియున్న పనుల నెల్ల సత్వరము నెరవేర్పుమని పల్లవకుని నియోగించి మఱలిపోవుచుంటిని.

అట్లు నేనొంటినై నిశ్చింతగ మందగమనమున నరుగుచు నెండచే శ్రమ పడి చల్లని ప్రదేశమున కేగనెంచి పురపరిసరోప్రాంత ప్రదేశమున నొక సుందరమగు బౌద్ధమందిరముం గాంచి దాని వెలుపలనున్న వితర్దికపై గూర్చుంటిని. అందు గొంత విశ్రాంతిని బొంది స్వతంత్రావలోకనముల నిటునటు బరికింప నోదేవా ! ఏమి చెప్పుదును ? నే నుదయమున నుద్యానమున కేగునప్పుడు స్పటికసృష్టివరిపాండు రంబై కనంబడిన యా చైత్యము నా కప్పు డింద్రనీలశిలావి నిర్మితంబై నట్లు హరిత వర్ణమున గనంబడెను. దానికి నేను వెరగుపడుచు నెడద ననేకవిధముల దలం‌చుచుండ నందుండి నా కిట్లు వినంబడెను.


గీ. ఎంతచిత్రంబుగా నుండె నెంచిచూడ
    లలితగుణమైన గ్లేశమూలంబు నయ్యె
    నెందు విశ్రాంతిలేదు దేహికి నిజంబు
    యేమి చెప్పుదు నింక సంస్కృతి విధము.

అందులకు నే నక్కజంపడుచు నా పల్కులు వినంబడినవైపు జూచుచుండ గనే యా చైత్యగర్భమునుండి యొక చిలుక పైకేతెంచితచ్చిఖరము నధిష్టించెను. తోడనే యా మందిరము యధాపూర్వముగ స్వచ్చకాంతుల బరగెను. ఆ శుకమునకు జాతివిరుద్ధముగ దలపై శిఖయొండు గలదు. అదిచూచి నే నాశ్చర్యపడుచు నిట్లని తలంచితిని. ఏకఖండేందు కాంత శిలానిర్మాణమున నొప్పి వీరంధ్రసంధిగర్భంబగు నీ చైత్యమునం దెట్లీశుకము ప్రవేశించి పైకి రాగలిగినదో కదా ! ఇయ్యదిలోన నుండుటచేతనే యీ చైత్యమట్లు హరితవర్ణమున నొప్పారెను. ఇంతకుమున్ను విన్న గంభీరార్థసూచితములగు పలుకు లీశుకసత్తమము వంచించినవియై యుండనోపు. దీని యౌదలగల శిఖయే దీని యుత్కృష్టతను సూచించుచున్నది. ఇట్టి వింత శకుంతమును మహారాజున కర్పించిన నుత్తమముగా నుండునని దలంచుచు చూచుచుండగనే య వ్విహంగ మా చైత్య శిఖరముననుండి కింద వ్రాలి యందలి మూలమణిపీఠ కుట్టి మమున నిటునటు తిరుగాడ దొడంగెను. అప్పుడు నేను దానిని పట్టుకొనగలుగుదునను నాసతో నవనమితగాత్రుండై యలక్షితపదప్రచారుడనై దాని సన్నిధికేగి చేతితో పట్టు కొన నుంకించినంత నాకు చిక్కక పైకెగిరిపోయి కొంతదూరమందున్న యొక వట వృక్షశాఖపై వ్రాలెను. ఆ యద్భుత శకుంతలము నెట్లయినను పట్టుకొని మహారాజున కర్పించుటకు కృతనిశ్చయుడనై నేను దాని వెంటాడుచు నా పక్షితో నొక చెట్టునుండి మరొక చెట్టునకు తిరుగుచుంటిని. అదియును నొకచో భూమికి దిగుచు నేను సమీ పించిన వేంటనే పై కెగయుచు నిముసమాత్రమాగుచు మరియొకచో నేలపై వ్రాలి వెంటనే పైకెగురచు నింకొకచో చేతికి చిక్కినట్లె యుండి పారిపోవుచు నిట్లా దిన మంతయు గడ పెను. నేనును మార్గామార్గము లెరుంగక దానివెంట బరువెత్తుచుంటిని. ఇట్లు క్రమక్రమమున నన్నా శకుంతము దురంతారణ్యమధ్యమునకు గొనిపోయి వన తరుశిఖర శాఖాశతాంతరమున నదృశ్యమైనది.


324 వ మజిలీ

పామరునికథ

అప్పుడు నేను దానికొఱకై విచారించుచు నందందు వెదుకఁజొచ్చితిని. అందుఁ గనంబడిన యరుణకుసుమకళితంగని యా చిలుక చంచువని భ్రమజెందుచు, హరితఫలగుళికంగాంచి దానిమౌళియని దలంచుచు, ప్రచలిత వినీలతరుదళములఁజూచి దాని పక్షకాండములని మోసపడుచు, వికటార్క ఫలకోశము దిలకించి దాని యంగ యష్టియని సంశయించుచు, పై నెగురుచున్న యన్యశకునిపక్షపుటపుటారావము విని యా చిలుకయే యెగురుచున్నదని శంకించుచు యావిపినముంతయు బరిభ్రమించితిని. పిదప నావిపినాంతమును ఖండితాశుఁడనై చేరి చేయునది‌ లేక విచారించుచున్న సమ యమున సమీపమున నవిరళతరుసరళ కాంతారమునుండి యనేక విహంగారవకోలా హలము వినిపించెను. అంతట నాశుకము లభించునను నాశ మనమునఁ దిరుగఁజనింప యాపక్షుల పిండున్నదశ కేగితిని. అందు ముందతినిర్మల జలప్రవాహ ప్రశోభితంబై యుష్టాంశుని తనయయని వినుతి కెక్కిన తాపియను నదిద్వరము నేత్రపర్వం బొన రంచెను.


గీ. ఆమహాధునీముఖ్య ముష్ణాంశునాత్మ
    జాతయైయున్నఁగాని తజ్జలము మిగుల