కాశీమజిలీకథలు/పండ్రెండవ భాగము/321వ మజిలీ

వికీసోర్స్ నుండి

అయ్యగారూ ! కాశీక్షేత్ర ప్రభావంబు వినుటచే నా మనంబున నధికోత్సా హము బుట్టుచున్నది. మీ యనుగ్రహమున నట్టి యుత్తమ తీర్థగమనలాభము నాకు చేకూరుచున్నది. నే నెంతేని ధన్యుండనని పలుకుచుండ నమ్మణిసిద్దుండు నేటికి జాల ప్రొద్దు బోయినది. ముందు మజిలీ యించుక దూరముగా నున్నదందురు. వేగమె బయలుదేరి యందు జేరవలయునని వానిని తొందరబెట్టి యప్పుడే బయలుదేరి యగ్గో పాలుండు గావడి యెత్తుకొని వెంటరా దదనంతరావసధమునకు బోయెను.

శ్రీరస్తు

కాశీమజిలీకథలు

పుండరీకుని జన్మవృత్తాంతము కథ

321 వ మజిలీ


శ్రీకాశీవిశ్వేశ్వర !
ప్రాకటబ్రహ్మాచ్యుతస్తుతాద్భుతమహిమా
ప్తోక ! శశికళాధర ! గౌ
రీకన్యాహృదయపుండరీకనివాసా !

దేవా! అవథరింపుము. అట్లు మణిసిద్దుండు శిష్యునితో దదనంతరావ సధముజేరి భోజనాంతరమున నుచితస్థలమున సుఖోపవిష్టుడైయున్న సమయమున నగ్గోపాలుండు వానిసన్నిధిం గూర్ఫుండి‌ వినయమున నిట్లనియె.


గీ. ఇచటఁ జేరినదాది మీరింతవఱకు
    నాకుఁజెప్పిన కథలెల్ల నాకలింపుఁ
    జేసికొనుచుండఁ దోచె నాచిత్తమునకు
    శంకలొకదానియందు విస్తారముగను.

సీ. కాదంబరీమహాగాధ గాధాంతరం
          బునఁ బుండరీకుఁ డన్మునితనూజు
    డమ్మహాశ్వేతకై యుమ్మలించుచు జీవ
          ముల బాయఁ జంద్రుఁడమ్మూ ర్తి నాత్మ


    లోకంబునకు వేగఁ గైకొనిపోయి యం
           దొనరఁ గాపాడఁ గారణముఁగలదె?
    వారికి పూర్వసంబంధ మెయ్యదియైన
           నుండెనా ? శ్వేతకేతుండు కునులఁ

గీ. జడఁగ శ్రీదేవిమోహ విభ్రాంతయై సు
    తుంగని చెలంగి మౌనికొసంగిపోవు
    టరయ నత్యద్భుతంపు కార్యంబుగాదె !
    హేతువెయ్యది దీనికి యెరుఁగఁజెపుమ,

శా. చంద్రాపీడుని యంతమున్గని తదశ్వశ్రేష్టముం గొంచుని
     సంద్రత్వంబున దివ్యపుష్కరిణి మధ్యంబందు బడ్డట్టియా
     చంద్రోద్యన్ముఖి పత్రలేఖయను యోషారత్న మేమాయెనో
     సాంద్రానుగ్రహ మొప్పనా కిపుడు భాస్వద్రీతిమై జెప్పరే?

గీ. శాపము దొలంగగాఁ గపింజలుఁడు సరసి
    వెడలివచ్చినవిధము సవిస్తరంబు
    గాఁదెలిసెఁగాని పత్రలేఖావధూటి
    వార్త తెలియదయ్యెను గురుప్రవర ! పిదప.

ఆ. వె. పత్రలేఖిపూర్వభవ మందునెవ్వతె ?
         కారణాంతరంబు కతననామె
         జన్మమెత్తినటు చర్చింతు నెమ్మది
         సత్యమెరుఁగఁజెప్పు స్వామి ! నాకు.

క. ఏతత్క థాచమత్కృతిఁ
    జేతఃపరవశతఁ గాంచి చెలగెడి నాకీ
    రీనిని సందేహములపు
    డాతతగతిఁదోపవయ్యె నయ్య ? యడుగఁగాన్‌.

మ. అతికౌతూహలమొప నిట్లడుగు శిష్యశ్రేష్టు బుద్దిప్రవీ
     ణతకెంతే మణిసిద్ధయోగి హృదయానందంబునుం బొంది స
     న్నుతమాణీక్యమహాప్రభావగరిమన్‌ బూర్వాద్భుతోదంతమం
     చితరీతిన్‌ గ్రహించి సర్వమెరిఁగించెన్‌ వానికీతీరునన్‌.

గోపా ! వినుము. స్వర్గంబున బ్రసిద్దమగు నచ్చరల కులంబులు పదు నాలుగుగలవు. అందొకటి పద్మగర్భునివలన నుద్భువించెను. మఱొక్కటి వేదముల వలన నుదయించెను. ఇంకొక్కటి యగ్నివలన సంభవించెను. వేఱొక్కటి వాయువు వలన జన్మించెను. ఒకకులంబు భూమివలన నావిర్భవించెను. ఒకటి జలంబువలన బుట్టెను. మన్మధునివలన నొక్కకులంబు గలిగెను. మృత్యువువలన నింకొక్కటి యుత్పన్నమయ్యెను. అమృతంబువలన మరొక్కటి జననమందెను. ఒకయచ్చర కులము సూర్యకిరణములవలనను నింకొక్కటి చంద్రకిరణముల వలనను బొడమెను. ఓకటి విద్యున్మాలయందు జనిమగాంచెను. దక్షకన్యకలైన ముని, యరిష్టలవలన నొక్కొక్కకులము బొడసూపెను. ఇవియన్నియుంగలిసి పదునాలుగు కులము లయ్యెను. గంధర్వులలో దక్షకన్యకాద్వయమువలన గలిగిన రెండుకులములే నిలిచి యుండెను.

అందు మునిపుత్రులు పదునార్వురతో గడగొట్టువాడు చిత్రరధుండు మిగుల బ్రఖ్యాతిగాంచెను. అతం డతిపరాక్రమోపేతుడై దేవదానవ సమరమున దేవత లకు బెక్కు సారులు మిగుల సహాయముజేసి యింద్రున కాంతరంగిక మిత్రుడై యుండెను. అరిష్టతనూజులార్వులలో జ్యేష్టుండు హంసుం డనువాడు. చంద్రకిరణ సంజాతాప్పర కులమున బొడమిన గౌరియను నతిలావణ్యవతిం బరిణయమై చెలంగి యుండెను. అమృతసంభవంబగు కులమున బుట్టిన మదిరయనుకన్యను చిత్ర రధుండు పెండ్లాడెను. అతండు బాల్యమందే గంధర్వులకెల్ల నేలికయై భారతవర్షమున కుత్తరదిశనున్న కింపురుష వర్షమందుగల హేమకూటపర్వతమున నివసించియుండెను. అం దాతనిచే బరిపాలింపబడుచు వేనవేలు గంధర్వులు కాపురముండిరి. మరియు జిత్రరధుండు హంసుని రెండవ గంధర్వకులమున కొడయనిగా నియమించుటంజేసి యతండుగూడ హేమకూటమందే యపరిమిత గంధర్వబలము సేవింప నివసించి యుండె. చిత్రరధునకు హంసునకు బరస్పరానురాగము దినదినాభివృద్ధి గాంచుచుండ బెద్దకాలము వారు రాజ్యపరిపాలనము సుఖమున జేయుచుండిరి. కాని వారికెంతకాలము నకును సంతానప్రాప్తి కలుగదయ్యెను. అక్కా.రణమున వారనవరతము జింతాకుల స్వాంతులై భోగవిలాసముల విరక్తులైయుండిరి.

చిత్రరధుం డొకనాడు మిత్రుండగు సచీకళత్రునకు దనమనస్సంకటం బెరిం గించి యపత్యలాభము బడయు నుపాయము దెలిసికొననెంచి మించిన తమకమున స్వర్గ లోకమునకరిగెను. అశతక్రతుండు సర్వబృందారకబృంద బరివేష్టితుండైసుధర్మామధ్య మున బేరోలగంబున్న సమయమున జిత్రరధుండు మందగమున నందేతెంచి హృదయ పరితాపంబు మొగంబున గనిపింప నిలించి వల్లభుని మ్రోల దలవాల్చి నిలచి యుండెను. ఆగంధర్వనాయకుంగాంచి సముచితగౌరవ పురస్సరంబు సురపతి యాదరించి యాసన్నార్హాననంబు నుపవిష్టునొనరించి స్నేహభావము దేటపడు రీతి నిట్లనియె. మిత్రమా! భవదీయదీనాననసమీక్షణమున మదీయ హృదయం బపరిమిత పరితాపమున గొందలమందుచుండెను. ఎన్నడులేని కలత నీకేమిటికి గల్గెనో గ్రహింప జాలకున్నాను. సహజధైర్యనిధానమగు నీడెందమున కెట్టియిక్కట్టు సంభవించెనో యూహింప శక్యముగాకున్నది నీ విచారకారణం బెరుంగుటకు నాహృదయం బాతత్రం బొందుచున్నది.


చ. గురులకు నెగ్గుసల్చితివొ ? కోరియగమ్యగమించితొ ? రణాం
    తరమున భీతీఁజెందితివొ ? దబ్బరలాడితివో ? యవధ్యులన్‌
    గరమువధించినావొ ? యుపకారిఁదలంపవొ ? యేయకార్యమిం
    కరయఁగ జేసియుంటివొ ? రయంబునఁబల్కుమ దైన్యమేటికిన్‌.

గీ. సుఖియె? నీసోదరుండు హసుండితండు
    కుశలమగునాక్కొ ? నీ బంధు కోటికెల్ల
    సేమమెగద ? గంధర్వ శేఖరులకు
    లేదుగా ? శత్రుబాధ మీ మీఁదనిపుడు.

ఇట్లు పఠించు బిడౌజునకేమి ప్రత్యుత్తరంబొసంగవలెనో యెరుంగక చిత్ర రధుండు మౌనము బూని యుండుటచే మరింత హృదయోద్వేగముం గాంచి యా శతమన్యుండు వెండియు నిట్లనియె. హితుడా! నీ వైఖరి నేడు తారుమారుగా నున్నది గదా? నీ దీనావనము దిలకింప నా డెందంబు గలత‌ బడుచున్నది. ఎన్నడును నీయం దిట్టి దైన్యము గనివిని యెరుంగను. నేడేమి గల్గెనో తెలియదయ్యెను. సత్వరము భవదీయ దుఃఖకారణ మెరింగింపుము. అందులకు దగిన ప్రతీకార మాలోచింతము. ఇంకను మౌనము వహించి యుంటినేని మిత్రద్రోహ మొనరించినవాడవగుదువు. చెలి కాడా ! నీ దేహమున నత్యంత బాధకంబగు రోగమెద్దియైన నుత్పన్నమై యుండలేదు గదా ?

అని యనేక విధముల నడుగుచున్నవానికి చిత్రరధుం డల్లననిట్లనియె.

త్రిలోకాధిపా ! నా దేహమున నెట్టి రోగమును లేదు. గంధర్వ లోకంబెల్ల గుశలముగా నున్నది. నా బంధువర్గము సుఖసమంచితమై యొప్పియుండెను. నా లోకమునందు శత్రుభీతియును లేదు. నీయనుగ్రహమున మాకేకొరంతయును లేదు. కాని నా సోదరుండగు హంసునకును నాకును నిరంతర మొక వినయము మనోవేదన గల్గించుచుండెను. సంతోషరహితస్వాంతములకు సౌఖ్యమను వస్తువు గగనకుసుమమే గదా !


ఆ. వె. ఎంత భాగ్యమున్న నెంత గౌరవమున్న
         నెంత విద్యయున్న ఏమియున్న


    సంతులేకయున్న సర్వంబసహ్యంబ
    దెంతవానికైన నిది నిజంబు.

సంతానరహితుని భోగభాగ్యములు వ్యర్దంబులు. ఆ పుత్రకుని యానందము శూన్యగేహంబునందలి దీపకాంతి వంటిది. అనపత్యుని విద్యాబలములు ప్రయోజనరహి తములు. పిల్లలులేనివాని జీవనము నిరుపయోగము. అట్టి నిరర్దక ప్రాణధారణముకన్న జచ్చుటయే యుత్తమమని తలంచుచున్నాను. ఇట్టి దారుణ విచారమునకు లోనై సంత తము గృశించుచు నే డిందేతెంచితిని. ముల్లోకములకు నియామకుండవగు భవదీయ సందర్శనం బొనరించి నీ యానతిముందు కృత్యమునకు గడంగ నెంచితిని. మీద దేవరయే ప్రమాణము కా హృదయశల్యము నూడబెరుకుటకు మీరలే కర్తలని మిన్న కుండెను.

ఆ పలుకు లాలించి వాని యభిమతం బెరింగి కటకటంబడుచు నా సహ స్రాక్షుండు చేరువనున్న దేవగురుని మొగము దిలకించి యాచార్యవర్యా ! నా ప్రియ మిత్రుడగు నీ చిత్రరధుని హృదయ పరితాపకారణం బెరింగినదిగోలె నా డెందమున మిగుల జాలి బుట్టుచున్నది. ఆగతానాగతఫలముల శాస్త్రదృష్టి నెరింగి చెప్పుటయందు మీకుగల సామర్ద్యం బెవరికిని లేదు. ఈ గంధర్వపతి భాగదేయ మెట్లున్నదో పరీక్షించి యెన్నడైన వీనికీ సంతానయోగము గలదేమో తెలియజేయుడని పలుకుటయును నా బృహస్పతి కొంత సేపెద్దియో గుణించి భవిష్యమెరింగి యప్పాకశాసనున కిట్లనియె.

దేవతా చక్రవర్తీ ! ఈ గంధర్వశ్రేష్టుని దిష్టంబు సామాన్యముగాదు. చతుర్దశభువనములయందును వీనిబోలు పురుషప్రవరుండుండుట యబ్బురంబు. అలఘు గుణగణయుతుండై యఖండ సద్యశోవిరాజితుండై యనిర్వచనీయ శౌర్య సమేతుండై యనల్ప బలపరాక్రమ సమన్వితుండై యనన్య దుర్గభమహావైభవ ప్రశో తుండై నెగడు నీ చిత్రరధుడు సర్వవిధముల బ్రశంసనీయుడై యుండెను. కాని వీనికి పుత్రస్థానము మాత్రము మిగుల దుర్భలత నందియున్నది. వీనికి పుత్రసంతాన మెన్నడును గలుగనేరదు. అయినను గొంతకాలమున కొక పుత్రికా రత్నము మాత్రము వీనికి జన్మింపగలదు. అబ్బాలికామణి వలన సంభవమగు పురుష సంతానమే వీని వంశమున కాధారమై యుండునని యూరకుండెను. చిత్రరధుండు మొగమున దైన్యంబుదోప నీరెలుంగున నాచార్యునితో గురుప్రవరా ! నాకు పుత్రులు గలుగు భాగ్యములేకున్న నా తమ్ముడు హంసునకైన నెట్టి యోగమున్నదాయని ప్రశ్నించుటయును నా దేవగురుండు దిరుగ గొంతసేపు గణితము జూచి పురుష పుంగవా ! మీ యిరువురి భాగదేయము లొక్కరీతినే యొప్పియున్నవి. నీకుబలె హంసునకు గూడ నేకపుత్రికాయోగమేగాని కొడుకులు గలుగు సుకృతము లేదు మఱొక్క విశేషము గూడ గలదు. మీ యిరువురకును గూతుండ్రు కొంచె మించు మించుగ నేక కాలమందే కలుగగలరు. వారు దేహములు వివిధములైనను నొక్కటి వలెనే ప్రవర్తింపగలరు. వారికి భర్తృసమాగమం బొక్కకాలమందే సంభవింపగలదు. మరియును వారు సంతానవంతులైన పిదప నేక ముహూర్తమందే దేహత్యాగ మొన రింపగలరు ఇంతకన్న నే జెప్పదగిన దెద్దియును లేదని మి‌న్నకుండెను.

అప్పుడు దేవవల్లభుండు నిజమిత్రునకు మనఃప్రియముగ నెన్నియో యనునయ వాక్యముల జెప్పి పుత్ర జననముకన్న బుత్రికా సంభవంబె జననీజనకులకు సర్వవిధముల సంతోషప్రదంబని వానిచే నొప్పించెను. మరియును వాని హృదయము రంజిల్లునట్లు నాడు బెక్కు వినోదములు నా దేవసభయందు జరిపించెను. పిమ్మట చిత్రరధుండును దేవేంద్రుని వలన ననేకరీతుల నాదరింపబడి వాని యనుజ్ఞగైకొని నిజ వాసమున కేగెను. కాని వానిమనంబున కూరట గలుగకుండెను. ఒకనాడు‌ నారదుడు యధేచ్చావిహారమున జిత్రరధు సాలి కేతెంచుటయును నతం డతనిచే బూజితుండై యర్హాసనంబున సుఖోపవిష్ణుడై యున్న సమయమున జిత్రరధుండు దన మనోవిచారం బెరింగించి పుత్రసంభవమున‌ కుపాయమానతిమ్మని ప్రార్ధింప నా దేవర్షి యిట్లనియె.

గంధర్వకుల చూడామణి ! దీనికై ప్రాకృతునివోలె నీవింత వలవంతబడుట సముచితమేనా ? పరమేశ్వరానుగ్రహమున బడయరాని దెద్దిగలదు? ఆ దేవుండు భక్తసులభుండని యెరుంగవా ?


సీ. కాలునిఁద్రోసి మార్కండేయునకు చిరం
            జీవనమిచ్చి రక్షింపలేదె ?
    హాలాహలము లీలఁగ్రోలి సురాసుర
            ప్రకరంబు బాధ దీర్పంగలేదె ?
    దివిజగంగా స్రవంతిని నౌదలభరించి
            భువి భగీరధు పూన్కిఁ బ్రోవలేదె ?
    త్రిపురదై త్యుల సంహరించి సుధాంధన
            కోటికానందంబు గూర్పలేదె ?

గీ. మఱియు నిజభక్తు లెందఱెందఱఁ గటాక్ష
    వీక్షణంబున హృదయసంప్రీతి నొసఁగి
    కాచి రక్షింపలేదె? యాక్రతువిరోధిఁ
    గొలిచి కోర్కెలందనివారు గలరె యెందు ?

కావున నా మహేశ్వరు నారాధించి యిష్టఫలసిద్ధిం బొందుము. ఇతర శంకల విడువుమని బోధించి యా మునివల్లభుం డెందేని బోయెను.

చిత్రరధుండును నీశ్వరారాధనమున దనకోర్కె యీడేర గలదని నిశ్చ యించి మంచి ముహూర్తమున నిల్లు వెడలి భూలోకమునకు దపంబొనర్ప నేతెంచెను. అందు సువర్ణపురమున కుత్తరమున నున్న కెలాసగిరి పరిసరమున నిర్మానుష్యంబగు నరణ్యము తగిన స్థలంబని తలంచి యచట నొకవైపున నతిసుందరంబగు దేవమంది రముగట్టించి యందు ద్ర్యంబకుని బ్రతిష్టించి యావిరూపాక్షు సిద్దాయతనమునకు బూర్వ దిగ్భాగమున నచ్చోదంబను నతిమనోహరంబగు సరోవరమును జైత్రరధంబను నుద్యాన వనమును నిర్మించి యందు బెద్దకాలము దీక్షగా దపంబాచరించుచుండెను.

కొంతకాలమునకు వాని తపమునకు మెచ్చి పరమేశ్వరుండు పత్యక్షమై యభీష్టవరము గోరుకొనుమని యానతిచ్చెను అందుల కా గంధర్వసార్వభౌముఁడు మహానందకందళిత హృదయారవిందుడై తనకును హంసునకును సంతానముగలుగు నట్లు వరంబిమ్మని ప్రార్దించెను. అప్పు డప్పినాకపాణి వారిరువురకును జెరియొక పుత్రికయును బొడమ గలరని వరంబిచ్చి యంతర్హితుండయ్యె. పుత్రసంతాన మపేక్షించి తపం బొనరించుచున్న యాగంధర్వపతికి పశుపతివరము సంతోషమును గలిగింపదయ్యెను. అక్కారణమున జిత్రరధుండు చింతాకులస్వాంతుడై యిట్లని విచా రింపదొడంగెను. అన్నా ! మందబుద్ధినై చేతి కబ్బిన మహాభాగ్యము ననుభవింపజాల నైతినిగదా! అనన్యదుర్లభంబగు నీశ్వరసందర్శనభాగ్యం బబ్బినను మన్మనోగతము నీడేర్చుకొనజాలనైతిని. ఆ దేవోత్తముం డభీష్టవరము గోరుకొమ్మని యానతిచ్చి నప్పుడు పుత్రసంతానము గావలెనని స్పష్టముగ‌ వేడుకొనక వెంగలినై సంతానము మాత్రమే కోర దివురుట నాయభాగ్యత మూలమునగాక యితరమెట్లగును? అయ్యో! చేసినకృషియంతయును వ్యర్థమయ్యె గదాయని యనేకవిధముల విచారించుచున్న సమయమున నారదుండెందేనిబోవుచు నచ్చోటి కేతెంచెను. చిత్రరధుండు వానిరాక నెరింగి లేచి నమస్కరించి యధార్హ సత్కారము లొనర్చి జరిగిన యుదంతంబెల్ల నెరిం గించి యమ్మునితల్లజునితో మరియు నిట్లనియె.


సీ. తల్లిదండ్రులకు సద్గతి హేతువగువాఁడు
          తనయుండు జన్మమాత్రంబువలన
    కన్నవారికిఁ గీర్తిఁ గల్చించుఁ గొమరుండు
          వినయవివేక సద్విధులవలన
    పితరుల కతిమఃప్రీతిగొల్పు సుతుండు
          సరసవిద్యావివేషములవలన
    జననీజనకులకు సౌఖ్యంబుగూర్చు పు
          త్రకుఁ డుపచారపద్ధతులవలన.


గీ.‌ అట్టిసూనుండుబుట్టు భాగ్యంబు నాకు
    గలుగదయ్యెను నాతపఃఫలమదెల్ల
    దారుమారయ్యె నాడుసంతానమబ్బ
    వంశమెటునిల్చు మీదఁ దాపసవరేణ్య!

అని వ్యసనపడు చిత్రరధు నూఱడించుచు నారదుం డిట్లనియె. గంధర్వ కులచూడామణీ! విధినతిక్రమింపజాలువా రెందును లేరుగదా? పరమేశ్వరుని యాదేశము గూడ వారివారి పురాకృతము ననుసరించియే యుండును. నీకొక్కపుత్రికయును హంసుని కొక్క పుత్రికయును గలుగగలరని పలికిన సర్వేశ్వరునిమాటల కన్యధాత్వ మెట్లుండును ? దీనికై యెంత వంతపడినను ప్రయోజనములేదు. పరమేశ్వరప్రసాద సంలబ్ధమగు పుత్రికలను సామాన్యబుద్ధి దలంపరాదు. ఆపుత్రికాద్వయము మూలమున మీయుభయగంధర్వకులములకును శాశ్వతసదృశ్యంబు గలుగగలదు. వారికిపుట్టు పుత్ర సంతానమే గంధర్వరాజ్యరమా పరిష్వంగసౌఖ్యార్హ మై మీకత్యుత్తమ లోకసంప్రాప్తికి కారణమగును. తపమున బరమేశ్వరుని సన్నిహితుంజేసికొనగల్గిన నీభాగ్యదేయము మిగులస్తోత్రపాత్ర మైనది. ఇక మనమున నే విచారమును బెట్టికొనక నిజసదసమునకు బోయి సుఖమున‌ గాలము గడుపుచుండుము, నీచే నిచ్చట బ్రతిష్టింపబడిన నీశ్వరునకు నిత్యమును బూజావిధానములు జరుగుచుండునట్లుచూడుము. దాన నీకుత్తమలోకప్రాప్తి గలుగగలదు. పొమ్ము. శుభంబులం బడయుమని దీవించి యా దేవమునీంద్రుండు యధేచ్చాగతిం బోయెను. చిత్రరధుండు వానిమాటలవలన గలంకముడిగి నిజనివాసము నకుబోయి యా వృత్తాంతమెల్ల నాప్తుల కెఱింగించి సంతోషమున గాలము బుచ్భు చుండెను. నిత్యమును‌ బుడమి కేతెంచి యందు దనచే బ్రతిష్టింపబడిన సదాశివమూర్తిని స్వయముగా నర్చించుచుండెను.

322 వ మజిలీ

శ్రీవైకుంఠమందు గార్తికశుద్ధఏకాదశినాడు గొప్ప యుత్సవము బ్రతివత్స రము జరుగుచుండును. నాడు శ్రీమన్నారాయణుండు పాలసంద్రమునుండి యోగ నిద్రాప్రబోధితుండై లేచివచ్చి సర్వప్రపంచ సంరక్షంబునకు గడంగును. అప్పుడు దేవతలెల్లరునువచ్చి యా యాదినాయణ దివ్యదర్శనంబొనర్చి స్తోత్రపాఠము లొన రించుచుందురు. సురపురోహితుండగు బృహస్పతి సర్వబృందారక సమక్షమందాయధో క్షజుని లక్ష్మీసమేతముగా దివ్యసింహాసనమునందు గూర్చుండబెట్టి యాగమవిధుల వివిధసత్కారము లొనరించుచుండును. దేవర్షిబృందమెల్ల నాసభాభ్యంతరమున లక్ష్మీ నారాయణ ప్రీతికరముగ నాశిషంబుల బఠించుచుండును. తుంబురునారదులా దేవదేవుని వింశత్యవతార విశేషముల దివ్యగానం బొనర్తురు. అప్సరోయువతులా సభాప్రాంగ