కాశీమజిలీకథలు/పండ్రెండవ భాగము/319వ మజిలీ

వికీసోర్స్ నుండి

యాంతరంగిక సచివుడై యొప్పియుండెను. దివోదాసుని కనంగమోహినియందు సమ రంజయుండను పుత్రరత్నము దొలిచూలు తనయుడై జన్మించెను. మరియు ననేక పుత్రపుత్రికా సంచయం బారాజేంద్రునకు దక్కిన కళత్రముల యందును గలిగెను.

పిమ్మట దివోదాసుడు నిర్ద్వంద్వ నిరవగ్రహ నిస్సపత్నంబుగా ధరణీ రాజ్యంబు బెద్దకాలంబు పరిపాలించెను.

319 వ మజిలీ

అట్లు సిరితో సంతతితో దివోదాసుండు వారణాశీపురమున బెద్దకాలము నివసించియుండి పుడమిని ప్రజానురంజకుడై పరిపాలింపుచుండెను. కాని‌ దేవత లప్పుటభేదనంబు జొచ్చుటకు మాత్ర మతడంగీకరించి యుండలేదు. కాశీవియోగ వేదనా దోదూయమానమానసులై వేల్పులు శచీకళత్రుం బురస్కరించుకొని యొక నాడు బృహస్పతి చెంతకరిగి తమ మనోవ్యధ తెరంగెరింగించి యద్ధివోదాసునకు రాజ్య పదభ్రంశనం బెవ్విధమున నగునో యానతిమ్మని వానిని గోరుకొనిరి.

అప్పుడా వాచస్పతి మందస్మిత సుందరవదనారవిందుడగుచు వారికిట్లనియె. బృందారక బృందంబులారా ! ఇందులకై మీరింత యలజడిం బొంద నేమనం‌గలను. మానవులు దివిజుల యాశ్రమము లేక గడియయైన మనఁగలరా ? అగ్ని దేవుని యాధా రము లేకున్న వారెట్లు భోజనపదార్థముల బచనము జేసికొనగలరు ? గాలి లేకున్న వారికెట్లూపిరాడగలదు. వరుణదేవుని యనుగ్రహమునగాదే భూమిపై వారికి జీవనము నిలుచుట గలుగుచున్నది ?


గ. అగ్నిమనలోన నొక్కరుడౌ నొకాఁడొఁ
   చేయ డే వాయుదేవుండు జెప్పిసట్లు
   వరుణుఁడెవ్వరివాడు ! మువ్వురునులేక
   నిముసమోర్తురె మర్త్యులు నిశ్చయముగ.

వరుణానిలాగ్నులు దమతమ శక్తులుపసంహరించి రేని పుడమిపై బిఠర పాకంబు సాగదు. దానంజేసి యోదనంబు పరిపక్వంబు గానేరదు. వైశ్వదేవ బలి హరణాది సత్క్రియాకలాపము లక్కారణమున గుంఠితములగును. హవ్యకవ్య క్రియాశూన్యులైన బ్రాహ్మణులు రాజునందు విరక్తులగుదురు. తక్కిన వర్ణముల వారును బ్రాహ్మణుల ననుసరింప గలరు. ప్రజానురంజనంబునంగదా రాజు రాజ్యము సేయగలుగుట. ప్రజావిరక్తిచే రాజునకుఁ గోశదుర్గబలాది సప్తాంగంబులు క్షీణించును. దాన ద్రివర్గము నశించును. అందుచే నుభయలోకమార్గమును ఖిలీభవింపగలదు. ఇందువలన మన యాశయము నెరవేర గలదు.


ఉ. చండకరాన్వయాంబునిధిచంద్రుఁడు భూరమణుండతండు ఱా
     గుండియవాఁడు వేలుపులకోటు లసంఖ్యలు భూతధాత్రిపై
    నుండఁగ నీక కాశిపురి నొక్కఁడు రాజ్యము సేయుచుండఁగా
    దండితనంబు లేకిటుల దైన్యముబూనఁగ మీకుఁబోలునే ?

అని పెద్దగా నుపన్యసించిన యాచార్యుని పలుకు లాదరించి యప్పుడే శచీ కళత్రుండు వైశ్వానరప్రభృతుల బృహస్పతి వచినానుసారముగ బ్రవర్తించుటకు నియమించెను.

త్రివిష్టపేశ్వరు ననుమతమున నగ్ని దేవుండు భూలోకమున దనమూర్తి నుపసంహరించెను. వాయువు స్తంభించెను. వరణుడు వర్షింపకుండెను. అందగ్ని లేకుండుటచే స్త్రీలు పాకక్రియయం దసమర్థల్తెరి. బ్రాహ్మణుల నిత్యాగ్నులు సెడి పోయెను. ఆ సమయమున భూపతి సమ్ముఖమున కాంధసికసంఘ మేతెంచి ముకు ళిత కరపుటులై కొంకుచునిట్లని విన్నవించిరి. దేవా ! నే డదేమికారణముననో కాని యెంత బ్రయత్నించిన నిప్పురంబున‌ నిప్పు బుట్టవయ్యెను. దానంజేసి దేవరకీదినమున సూర్యపాకము నాయితంబైన యోదనము బెట్టవలసివచ్చినది. ఇప్పటికే రెండవజూము దాటుచున్నది. కావున నారగింప వేంచేయుమని మనవి జేసికొనిరి. వారిమాటల కారాజ మార్తాండుఁడు నివ్వెరంబడుచు దేవత లొనరించిన కపటమ నెరింగి యానాటి కర్క కిరణతాపపక్వములగు పదార్థముల భుజించి వచ్చి గొల్వుదీర్చి వాసవాదులు చేసిన యప కారమునకు బ్రతీకారము జింతించుచున్న సమయమున బౌరు లగ్నితిరోధానమునకు భయంపడి యమ్మహోత్పాతంబు రాజున కెరింగింప నేతెంచిన వారి నెల్లర నాదరించి దివోదాసుండు నాకనివాసులు జేసిన దుర్వృత్తికి దలంప బనిలేదని వారి కుదుటుగఱ పుచు మరియు నిట్లనియె.


మ. అనుమానింపక యాసుధాంథసులు మాయా కల్పనావంచనం
     బునవైశ్వానరునిన్‌ హరించిరి యవుంబో ! యింత మాత్రంబులో
     నన వాయోగమహానుభావమునకున్‌ భంగంబు వాటిల్లునే !
     ననక ల్దాఁచిన బెండ్లి యాగునొకొ ! దుశ్చారిత్రముల్గంటిరే !

 సీ. దహనస్వరూపంబుఁ దాల్చి యేఁ గైకొందు
             దావ్యకవ్యాహుతు లధ్వరములఁ


    బర్జన్యమూర్తిఁ జేపట్టి యేవర్షింతు
           సలిలధారలు సస్యములు ఫలింప
    శశిదినాకరుల వేషముఁదాల్చికొని యేన
           ఖండింతు గాఢాంధకారపటలిఁ
    బనను నాకారంబు భరియించి యేను బ్రా
           ణ్యంత ర్బహిర్వ్యాప్తి నావరింతు

గీ. వేల్పులందఱు నేనయై వివిధకృతుల
    విశ్వలోకంబు రక్షింతు వేయునేల ?
    యింకమీదట నిటనేన యేలువాఁడు
    నాగలోకంబు నాకంబు యోగశక్తి.

అని యోగవిద్యాబలమున సర్వదేవతామయుండై దివోదాసుండు రాజ్యము సేయుచుండెను.

ఇట్లుండ మందరాచలమున నధివసించియున్న పరమేశ్వరుండు కాశీ వియోగము సహింపజాలక తత్సమాగమోపాయము జింతించుచుండెను అంత నొక్కనా డాయంధకాసురవైరి గజానన, శరభానన, వికటానన, వానదానన, వృషా నన, వికటాలోచన, రుధీరపాయిని, గర్భభక్షణి, యాంత్రమాలిని, తాపని, శోషణి, కోటరాక్షి, మక్తాక్షి, కేకరాక్షి, రక్తాక్షి, స్థూలనాసిక, ప్రముఖ చతుష్షష్టి యోగినుల రావించి మీరు నానాతిప్రకార మాయావేషముల గాశీనగరమునకు బోయి యందలి పుణ్యస్త్రీల ప్రాతివ్రత్యములు బురుషుల యాచారములు జెరుచునది. వార్ణాశ్రమములు నిజధర్మమున వర్తింపకున్నచో దివోదాసుండు రాజ్యప్రదభ్రంశంబు నందగలడు. అప్పుడుగాని మాకు గాశీసమాగమము సిద్ధింపనేరదని జెప్పి వార నొప్పించిపంపెను. వారును శంభనియోగమున వారణాసికిం జని -


సీ. పుష్పలావిక యోర్తు భూమికత్తె యొకర్తు
            గంధవాహినియోర్తొకర్తు లంజె
    హస్తాంఘ్రిరేఖాసమాలోకనక్రియా
            సాముద్రికజ్ఞానచతురయోర్తు
    సలిలాగ్ని వాయ్వయస్తంభవిద్యాకళా
            ప్రావీణ్యయోర్తు సైరంధ్రియోర్తు
    మాసకమ్మ యొకర్తు మంత్రవాదిని యోర్తు
            రంగవల్లి విచిత్రరచయితొకతె


గీ. చదువఁ బాడంగ నర్తింప సరసమాడఁ
    గథలు సెప్పంగ నగ్గింపఁ గన్ను లార్ప
    వీణవాయింపఁ బొగడంగ విరులుగట్ట
    నేర్చునట్టిది యొకరిత నితాత యొకతె.

ఈ రీతి నానావిధరూపములంగైకొని యా యోగినీ మండలము వారణాసీ పురమున విహరించుచుండెను. ఇంతలోఁ గాలవిలంబము సైరింపఁజాలక యయ్యంధ కారాతి కాశీనగరమందలి వృత్తాంతమరయఁ జండకిరణుని బంపనెంచి వానిని రావించి యిట్లనియె.

వాసరాధిపా ! కాశీవియోగతాపమున నామనమున కూఱటఁ గలుగకున్నది. ధర్మ మార్గయిక తత్పరుండగు దివోదాసుని నందుండి వెడలనడిపించుట కుపాయము దోపకున్నది. వాని నెట్లయిన ధర్మవిముఖునిం జేసినఁగాని మనపని సులభముగానేరదు. కావున నీవచ్చటికేగి వానియందెద్దియైన దోషమును నిరూపించవలయునని పలుకుటయు నయ్యుష్ణాంశుండు వానియానతి శిరంబునంబూని కాశికేతెంచి యాచకుఁడై, దూతయై, దీనుఁడై, కార్తాఁతికుఁడై, దృష్టప్రత్యయవాదియై, వదాన్యుఁడై, జటిలుఁడై, దిగంబరుఁడై, బ్రహ్మచారియై, యతియై, నానా ప్రకారవేషభాషా చేష్టా యంత్రమంత్రతంత్రమాయా ప్రయోగబలమున మెలంగుచుండెను. కాని యా రాజన్యచూడామణి యందు దోష మించుకయును గనిపెట్టఁజాలఁడయ్యెను. ఇట్లు విఫలప్రయత్నుండై సూర్యుండు మగిడి యీశ్వరు సన్నిధికేగుటకు మొగముజెల్లక యా కాశియందే పండ్రెండు మూర్తులం గైకొని యధివసించి యుండెను. కాశీవాసనిమిత్తముగా మనంబు లోలం బగుట వానికి లోలార్కుఁడను ప్రసిద్ధనామము గలిగెను.

అచ్చట మందరాచలమున సాంబుండు కాశీవియోగ వేదనాక్రాంత స్వాంతుండై తద్వ్యత్తాంతశ్రవణ కతూహలమున విధాతనమ్మహాపరేత నిలయమునకుం బంపనెంచి వాని రావించి యిట్లనియె.


ఉ. పోయెను యోగినీబలము పోయినపోకనె పోయెఁ బిమ్మటన్‌
    దోయజబాంధవుం డతఁడునుం దడసెంగడు నీరుచూడఁగాఁ
    బోయిన యట్టి తామరలపోలిక నందరుఁ గాశిజిక్కిరీ
    తోయము నీవు‌ వోద్రుహిణ ! తొల్లిటి వారలయట్లకాకుమీ !

అని పలుకు నెలసిగ దాలుపు నానతివడసి యక్కమలగర్భుండు వృద్ధ బ్రాహ్మణవేషమున దివోదాసుని పేరోలగమున కేతెంచి యాశీర్వదించి కాశీక్షేత్ర మున యజ్ఞము లొనర్చుటకు దనకనుజ్ఞ యొసంగుమని యా భూపతిని బ్రార్థించిన నదేవతాకములగు జన్నములెన్నేని జేయవచ్చునని పలుకుటయు నక్కుహనా బ్రాహ్మ ణుండు గటకటంబడుచు నిట్లనియె.

రాజోత్తమా ! విశ్వేశ్వరుండు లేకుండుటచే నీయవిముక్తక్షేత్రం బెంతేని చిన్నవోయియున్నది. ఆ వాసుదేవుఁడొక్కడు మాత్రమిందేతెంచుట కనుమతింపుము. తక్కిన వేల్పులు నే నొనర్చు జన్నమునకు రాకున్నను జింతలేదని బ్రతిమాలుచున్న వాని కానృపోత్తముం డర్దాంగీకార సూచకముగ మిన్నకుండెను. పిమ్మట నవ్విధాత దశాశ్వ మేధయాగములు సుప్రయోగములుగా నాహరించి బ్రహ్మేశ్వర దేవుం బ్రతి ష్టించి భాగీరదీ పశ్చిమతీరమునఁ జెలఁగియుండెను.

అచ్చట గౌరీశుండును గాలవిలంబము సైరింపఁజాలక నిజాంతర్గతమున నిట్లని చింతించెను. యోగినీబృందంబా యానందకాననమునకేగి తిరిగి రాదయ్యెను. వినస్వతుండు పూర్వవృత్తాంతమంతయు మరచి యందే నిలచియుండెను. అంభోజు సంభవుండును నందె కదలిని కంబంబయ్యె ఇంకఁ బరమవిశ్వాసనిధులగు ప్రమధుల నందుఁ బంచెదంగాక యని శంకుకర్ణ ఘంటాకర్ణ మహాకర్ణ గోకర్ణ తిలకర్ణ స్థూలకర్ణ మహాకాళ పింగళకాహళాది ప్రమధోత్తముల బహుమానపురస్సరముగా రావించి కాశీ వృత్తాంతంబరసి వచ్చుటకు బుత్తెంచుటయును వారతిరయమున నచ్చటికేగి యాక్షేత్ర మహాత్మ్యమున నిర్వచింప లేనట్టి యానందం బనుభవించుచు నభవు నాజ్ఞను మరచి యం దీశ్వర లింగంబులం బ్రతిష్టించి తదారాధనాతత్పరులై యన్యమెరుంగకుండిరి.

320 వ మజిలీ

మందరాద్రియందు బాలేందుకలాధరుండు కాశికరిగిన వారి వృత్తాంతము తిరుగ నెరుంగక చింతించుచు గజాస్యునిగూడ నందుఁ బంపువాఁడై వాని రావించి చేయవలసిన కృత్యమెల్ల బోధించి యచ్చటకు బంపించెను. వారణాస్యుండు వారణాసి కరిగి ప్రతిదిన మందనేక దుర్నిమిత్తములఁ గల్పించుచుఁ బౌరులకు మిగుల వెరపు గలిగించుచుండెను. తాను పురజనులలోఁ జేరి యా దుర్నిమిత్తములవలనఁ గలుగబోవు విపత్తు లెరింగించుచు వాని కుపశాంతుం బోధించుచు నందరకు బరమాప్తుండువలె నా కాశీమధ్యమున సంచరింపఁ దొడగెను.


సీ. కలలోనఁ బుట్టినకథలెన్ని యన్నియుఁ
          బూసగ్రుచ్చినయట్లు పొసగఁజెప్పు
    హస్తరేఖలుజూచి యాయుష్యమును భవి
          ష్యము తేట తెలవిగా నానతిచ్చు