కాశీమజిలీకథలు/పండ్రెండవ భాగము/301వ మజిలీ

వికీసోర్స్ నుండి

శ్రీరస్తు

శుభమస్తు అవిఘ్నమస్తు

కాశీమజిలీకథలు

పండ్రెండవభాగము

301 వ మజిలీ

క. శ్రీ విశ్వేశా ! రౌప్యన
   గావాసా ! వోమ్యకేశ ! హైమవతీశా !
   భావజనశా ! యీశా !
   కైవల్యపురీప్రసిద్ద కాశీవాసా !

దేవా! అవధరింపు మట్లు మణిసిద్ధ సిద్ధయోగీంద్ర చంద్రుండు శిష్యునితో నేకోత్తరత్రిశతతమ నివాస ప్రదేశంబుజేరి యందున్న నిర్మలజలాకరంబునఁ గృత స్నాతుండ్రై విధ్యుక్తంబులఁ గ్రమంబున నిర్వర్తించి వంటఁ జేసికొని భుజించి తద్భుక్త శేషమంతేవాసికిం బెట్టి యుచితస్థలంబున సుఖోపవిష్టుఁడై యున్న సమయంబున నగ్గోపాలుండు వాని‌ సన్నిధిం జేరి యడుగులొత్తుచు నిట్లనియె.

గురుప్రవరా ! ఈ ప్రాంతములయందుఁ జూడఁదగిన వింత లేమియును గనఁబడవు. పధిశ్రమంబును నధికంబుగాఁ గలిగియుండుటచే దూర మరుగలేకపోతమి. నేఁడు కాశీప్రభావద్యోతకంబగు నితిహాసం బెద్దియేనిఁ జెప్పి నన్ను ధన్యునిం జేయుఁడని ప్రార్ధించుటయు నయ్యతి పుంగవుండు మందస్మిత సుందరముఖారవిందుఁ డగుచు నిట్లనియె.

వత్సా ! కాశీప్రభావం బింతింతని వర్ణింప నిలింప గురునకైన శక్యము గాదు. కైలాస సత్యలోక ప్రముఖ నిఖిలపుణ్య లోకంబులకన్న మిన్న యనిగాదే సర్వనుపర్వ సందోహం బీవారణాసి ననవరత మాశ్రయించియుండు. కైలాసము కన్న నియ్యది కడుపవిత్రమనిసుమీ యా యిందుమౌళి నిజపరివారసమేతుండై యిందు నివసించి విశ్వనాధుండనఁ బ్రసిద్దికెక్కియుండెను. వెనుక నొకప్పుడు కొంతకాలము కాశీ‌వాసయోగ్యత తప్పిపోవుటచే దేవతానీక మెంత తల్లడపడెనో యెగుంగుదువా ! మరియు తత్పురమును దిరుగ నాక్రమించుకొనుటకు వారెంత ప్రయత్నించిరో వింటివా ? ఇప్పవిత్రప్రదేశంబున వారికెంత యభిమానమో తెలిసికొంటివా ? అని యనుటయు నగ్గోపాలుండు విస్మయమందుచు నయ్యగారూ ! దేవతలాపురంబు నెందు లకు విడువవలసివచ్చినది ? సర్వసమర్థులగువారు వెండియునందుఁ బ్రవేశించుట కేమి యాటంకము గలిగెను ? వారు నిక్కమ యలిగిరేని ముల్లోకములు భస్మములగునే ? అట్టివారు సామాన్యులవలె నేమిటి కంత తల్లడిల్లిరి ? ఇది నా కెంతేని వింతఁగొలుపు చున్నది. ఇందెద్దియో విశేష ముండకపోదు. నాకా వృత్తాంతమంతయుఁ దెల్లముగా జెప్పుడని ప్రార్థించిన నమ్మణిసిద్దుండిట్లని చెప్పందొడంగెను.

రిపుంజయునికథ

తొల్లి పద్మకల్పంబునందు స్వాయంభువు మనువుకాలంబున ధరిత్రియం దరువదేఁడు లనావృష్టి సంభవించిన కారణంబున సకల జంతులోకంబు నాకులంబు నంది ప్రజాచయంబగుచున్న కతంబున యజ్ఞయాగాదికంబు లుత్సాదనము నొందెను. అధర్వక్రియలు జెడుటవలన క్రతుభుజులకు హవిర్భాగంబులు కరవయ్యెను. దానం జేసి మానవులకు వోలె బుభుక్షాక్షోభంబు సుపర్వలోకంబునకుఁ గూడ సంభవించెను. ఇట్లు మనుజ దివిజ లోకంబులు వ్యాకులతం బొందుచుండుట కంభోజాసనుండు చింతా క్రాంతుండై యీ యవగ్రహం బుడిపి సకల క్షోణీచక్రంబు రక్షింప దక్షుండగువాఁ డెవ్వఁడో యని యరయుచుండెను.

త్రిలోక సంచారియగు నారదుండొకనాఁడు పితామహుని సన్నిధి కేతెం చుటయు వారిరువురకు నిట్లు సంవాదము జరిగెను.

బ్రహ్మ - వత్సా ! నారద ! ఈ నడుమ నెన్నఁడేని భూలోకమున కరిగితివా ? అందలి విశేషంబు లేమి ? అమరలోక వర్తమానంబు లెట్లున్నవి ?

నార -- వనజసంభవా ! అరువదియేండ్లనుండి భూలోకంబు క్షామదేవత చేతఁ బీడింపఁబడుచున్న కారణంబున నందు జన్మంబు లన్నమాటయే యెచ్చటను వినిపింపకున్నది. దానంజేసి స్వర్గంబున రంభాసంభోగ వాంఛా సమాగతయాయజూక ప్రకర వికట ప్రకటానేక ముష్టియుద్ద విశేషంబులు శూన్యంబులైన కతంబున నాకు కలహంపుటోగిరము గరవయ్యెను. అందువలన నేనెట్లు చిక్కి బక్కవారి యుంటినో గనుంగొనుము.


అ. వె. వ్రేలెడేసిలోతు వెళ్ళేఁ గన్నులు జూడు
          ప్రేవులన్ని లెక్కఁ బెట్టవచ్చు
          గడుపువెన్ను నంటె గాళ్ళీడ్గిలంబడె
          సమిధవలెను మేను సన్నమయ్యె.

బ్రహ్మ - ఔరా 1 నారదా ? లోకవిశేషంబులం దెలుపుమన్న నీకలహ

ప్రియత్వంబు దేటపరచెద వేమిటికి ?

నార - తండీ ! విశేషముల కేమున్నది. పుడమిఁ బొడమిన యవగ్రహంబు వలనఁ బాడిపంటలు పూర్తిగా నశించెను. మీఁదు మిక్కిలి విషూచి మశూచికాద్యనేక దారుణరోగంబు లుత్పన్నంబులై ప్రజలఁ గోటానుకోటులుగ యమసదనంబునకుఁ బంపుచున్నవి. దానంజేసి యమధర్మరాజునకు గడియయైనఁ దీరికలేక విసిగిపోవు చున్నాఁడు. వానికొలువునఁ గింకరుల సహస్రసంఖ్యాకుల నూతనముగఁ జేర్చికొన వలసివచ్చినదఁట. ఇట్లు కొంతకాల ముపేక్షించినఁ బుడమి నకాలప్రళయము తప్పక సంభవింపఁగలదు.

బ్రహ్మ -- జలాధిదేవతలు వరుణుఁడు నింద్రుండును గదా? వారేలఁ భూమిపై వర్షముల గురిపించి యీ యుపద్రవము నడిగింపకుండిరిఁ వారి ప్రీతికొరకుఁ గూడ పుడమినున్న జన్నిగట్టులు హావిర్భాగముల నొసంగుచుందురుగదా ?

నార --- కల్పపంచకంబుకు కామధేనువును సన్నిధింబడసినవారి కితర చింత యేమి యుండును ? ఇదియునుంగాక పైనుండు వారు క్రిందివారి విషయమై యాలోచించుట యరుదు. భూతనిర్మాత నగుటంజేసి నీకు తత్‌‌క్షేమ మరచికొనుట సహజ మగును. పెంచిన మొలకను ద్రుంపఁ జూచువాఁడుండఁడుగదా ? మఱియును మర్త్యు లకు జరుగుచున్న యన్యాయమును గట్టిగా నింద్రాదుల నడిగినవా రెవ్వరు ? మన మందరమును వారిపక్షమే యగుటచే వారి కృత్యముదప్పని యెఱింగియును నిర్బం ధించి యడుగఁజాలము. మర్త్యులపక్షమున నట్టివాఁ డొక్కఁడున్నయెడల మనమెల్ల రము దెల్ల వోవలసియుండును.

బ్రహ్మ --- కావుననే నిఖిలధరణీ చక్రరక్షణైక ధురంధురుండగు యొడయండుండుట యెల్లవిధములను సమంజసమని తోచుచున్నది. అట్టి వాఁడెవ్వఁ డైననున్నఁ బేర్కొనుము. వానికి భూచక్రంబెల్లఁబట్టము గట్టి ప్రజలక్షేమమునకై నియో గింతము.

నార --- లోకములన్నియును వట్టిపోయినవనుకొంటివా యేమి? మీకట్టి యభిప్రాయ మున్నయెడల మనువంశ సంభూతుండగు రిపుంజయు నిందులకుఁ బంప రాదా ? వాఁడన్నివిధములఁ బుడమి బాలింప సమర్థుఁడు.

బ్రహ్మ - ఔను. చక్కగా జ్ఞప్తికిఁదెచ్చితివి. ఆ రిపుంజయుల డౌదార్య శౌర్యధైర్యగాంభీర్యాది సద్గుణ గరిష్టుండగును‌. వానియౌదల సర్వవసుంధరా భార మిడినఁ తత్ప్రభావ బలవిక్రమంబుల లోకంబు స్వస్థతం బొందఁగలదు.

నార - చండశాసనుండగు వాని కేల్పడి యొసంగినఁ జివురకు మన యందరకుంగూడ బొమ్మగట్టునేమో యాలోచింపుఁడు. బ్రహ్మ - సరి సరి. నేను రిపుంజయుని నైజంబెరుంగనా ? దయావినయ సత్యశౌచశీలాది యుత్కృష గుణగణవిరాజితుండగు నాతఁడే సర్వవిధముల సర్వం సహాభారధూర్వహుఁడు.

నార - అట్లయిన మీకు తోచినట్లు చేయుఁడని పలికి బ్రహ్మ యను మతంబు వడిసి యిచ్ఛాగ తిం బోయెను.

పిమ్మట రిపుంజయునిఁబుడమికి రాజుగా జేయ నిశ్చయించి విరించిమించిన యాత్రముతో వాని సన్నిధికఱిగి యతనితోఁ దన యభిప్రాయము నెరింగించి యందులకు సమ్మతింపుమని కోరెను. రిపుంజయుండును నిటలతటఘటితకరపుటుండై మృదుమధురగంభీర వాక్కుల నక్కమలాసనునితో నిట్లనియెను.

దేవా ! దేవరయానతి మహాప్రసాదంబని శిరసావహింతునుగాని యన్యధా తలంతునా ? సిరిరా మోకాలొడ్డు వాఁడెందైనంగలడా ? కాని యొకటి కోరుచున్నాను.


చ. వసుమతినే భరించి పరిపాలనమున్‌ బొనరించువేళ న
    ప్పసము మదాజ్ఞ వేదపరిపాటి జగంబు దలంపఁగావలెన్‌
    అసమమదీయ విక్రమవిహారమునంచేదు రెందులేక న
    ల్దెసలయశఃప్రభల్‌ బరగదేకులనేఁ జరింపఁగావలెన్‌.

మరియును నరసుర గరుడ గంధర్వ కిన్నరకింపురుష యక్ష రాక్షస సిద్ధ సాధ్యవిద్యాధరాదులయొక్క. బలప్రతాపసామర్థ్యంబులు నాయందిమిడి యుండవలెను. నా యభిమతంబునకు దేవత లెవ్వరును గూడ మారాడరాదు ఇట్టి వరంబులు నాకు దయ చేసితివేని నీ యానతిఁ బుడమియొడయఁడనై యుండెదను. అని పలికిన వాని మాటలు కాకలుములజవరాలి తొలిపట్టి యనుమతించి మించిన సంతసంబున నిట్లనియె.

రిపుంజయా ! నీవు కోరిన వరంబులన్నియు నొసంగితి. చతురంభోధి పరీత వసుమతీ చక్రంబెల్ల నీ కనుసన్నల మెలంగఁగలదు. దివిజులకు హితంబగునట్లు నీవిఁక పుడమిం బరిపాలింపుము. దివిజహితంకరుండవగు నీకిటమీద దివోదాస సమాఖ్య యొప్పియుండును. అని వచించు నవ్విరించి కతండిట్లనియె దేవోత్తమా ! మరియొక మాటగూడ గలదు. వినుఁడు --


చ. సురలదిగాదొ నాకము ? వసుంధరనుండఁ బనేమివారికి క
    య్యురగులకై యథోభువనముండఁగ వారును భూవిహారమున్‌
    జరుపఁగనేల ? నాకటుల సమ్మతిగాదిఁక వారువారు స
    త్వరమధరాతలంబు విడువన్‌ వలయున్‌ జుమనాదు యేల్బడిన్‌.

ఇందులకుఁగూడ నీవంగీకరింతువేని నేనీధరాభారంబు వహింపఁ బూనెదను. కాదేని నాకీ నియమరహితంబగు రాజ్యంబుతో బనిలేదు అని నిర్మొగమాటంబునఁ బలుకు వానిమాటల కాపలుకులయెకిమీఁడులికిపడుచు నిట్లనియె.

భూమియందుఁగల సర్వపుణ్యతీర్థంబులయందును బృందారక సందోహం బుతో నయ్యిందుధర ముకుందముఖ్యులు బ్రఖ్యాతిగ నివసించియుండిరి అందు నానందకాననం బనంబరగు కాశీయందుఁ బరమానందము నన్ను నంబికానాధునిఁ దక్కుఁగల దేవతాసమూహంబుతో వెడలిపొమ్మనిన నుమ్మలికంబు జెందకుండునా ? ఇత్తెఱంగెల్ల నామృత్యుంజయున కెరింగించి వాని నొప్పించుట యుక్తమని చెప్పుచు నప్పుడే వానితో వారణాసికింబోయి యా దేవోత్తమున కావృత్తాంతము నివేదించెను. ఆ మాటలు విని నిటలాక్షుండు కటకటంబడుచుఁ దామర చూలితో నిట్లనియె.

పరమేష్ఠీ ! లోకహితంబుపొందె నీవు చేసిన యేర్పాటునకు నే నెదురాడ లేను గాని యీ కాశీక్షేత్రంబును విడిచిపెట్టవలయునన్న మాట ములికివలె నాయెడద గాటముగ నాటుచున్నది.


సీ. ధర్మంబు కాశికా స్థానమధ్యంబున
           నాల్గు పాదంబుల నడచియాడు
    నర్దంబు కాశీపురాంగణంబున యందు
           నానా ప్రకారమై లీనుమిగలు
    గామంబు కాశికా కటకఘంటా లీధి
           గర్వించు రాజలోకంబులేప
    మోక్ష సంపదలు కాశీక్షేత్రమునయందుఁ
          బ్రవ్వితండంబులై నివ్వటిల్లుఁ.

గీ. గాశి కళ్యాణమున కాదికారణంబు
    కాశియణిమాది సిద్ధుల కట్టుపట్టు
    కాశి జనలోక సంకల్ప కల్పవల్లి
    కలుష పిశితంబు మెసవు రాకాసికాశి.

సీ. ఉర్వీధరశ్రేణు లుఱ్రాతలూగంగ
           వేఁడు గాడ్పులు వీచు నెన్నఁడేని
    చండభానుండ పండ్రెండు మూర్తులుదాల్చి
           యెనఁగి యెండలు గాయు నెన్నఁడేని
    పుష్కలావర్త కాంభోధరవ్రాతంబు
           లెలగోలు వర్షించు నెన్నఁడేని
    భూర్భువ స్వర్లోకములు ముంచి జలరాసు
           లే కోదకముజూపు నెన్నఁడేని.


గీ. యెన్నఁడే నుండుగాలంబు మిన్న చిక్కు
    భూతములుగ్రాలు నెన్నఁడే బుట్టినిండ్ల
    నపుడు వారణసీక్షేత్రమైదు క్రోసు
    లంతమేర యుపద్రవం బందకుండు.

అట్టి కాశీక్షేత్రంబును విడచి, భాగీరథీపుణ్యస్రవంతికా నిర్మల వారిశీకర ప్రసారశీతలవాతపోతంబుల సుఖంబుమరచి యనవరతమోక్షదిదృక్షాగత భక్తసందోహ సమర్పితస్తుతిపూర్వక వందన చందనానులేపనోపహార సమయాగతానందంబెల్ల బోఁద్రోచిఁ సర్వభోగంబులఁద్యజించి, యెచ్చటనో తలఁగాచుకొనవలెనన్న గష్టము గాకుండునా ? కాని లోకసంరక్షణార్థము నీవు నిర్ణయించిన దానిని మేమును మన్నింపవలయుఁ గావున నీయిచ్చవచ్చినమచ్చున నొనరింపుము. దివోదాసుని భూరాజ్యపట్టభద్రునిగాఁ జేయుము. వానికోరికవడుపున నేను సపరివారంబుగ నెందేనిఁ బోయెదంగాకయని యమ్మహాదేవుండానతిచ్చుటయు మనంబున సంతసించి యవ్వి రించి దివోదాసుని సర్వవసుంధరా చక్రంబున కేలికఁగా నియమించి నిజనివాసంబున కఱిగె.

302వ మజిలీ

దివోదాసుని కథ

అంత దివోదాసుండు మహావైభవంబున ధరారాజ్యాభిషిక్తుండై కాశీపురంబు నిజరాజధానిగాఁ జేసికొని ప్రజాసంరక్షణైక దక్షుండై యుండెను మఱియును --


శా. చాటించెన్‌ మనువంశవర్దనుఁడు విశ్వక్షోణి నందంద ఘం
    టాటంకారము దుందుభిధ్వనియుఁగూడన్‌ వేగమై దేవతా
    కోటుల్మేదిని నన్నుఁదప్పగుఁజుఁడో! కోపంబుపాపం బుపా
    త్తాటోపంబుమెయిం గుటుంబ సహితంబై చేరుఁడోనాకమున్‌.

క. పాతాళమునకు జనరో
   వాతాళను లెచటికేని వలసిన యెడకున్‌
   భూతము లేగరొయని య
   త్యాతతగతిఁ జాటిరవని నధిపతి దూతల్‌.

ఇవ్విధంబున భూతలంబునంగల సకలపుణ్యక్షేత్రంబులయందుఁ జాటింపు చేయించినతోడనే బ్రహ్మదత్తవర ప్రభావంబునఁ కాశీగయా ప్రయాగ, జగన్నాథ,