కాశీమజిలీకథలు/నాల్గవ భాగము/47వ మజిలీ
దనయింటికింబోయెను. అని యెఱింగించి మణిసిద్ధుండు తదనంతరోదంతం బవ్వలి మజికీయం దిట్లని చెప్పందొడంగెను.
నలువది యేడవ మజిలీ
కౌముది కథ
గోపా : వినుమొకనాఁడు కుముద్వంతుని కూఁతురు కౌముది యంతఃపురమున సఖులతో నిట్లు వితర్కించినది.
కౌముది – ప్రజ్ఞావతీ ! కళావంతున కాయుత్తరమిచ్చి వచ్చితివా ?
ప్రజ్ఞావతి - నీవు చెప్పినప్పుడే యిచ్చి వచ్చితినికాదా ?
కౌ - ఆయుత్తరము జూచికొని యతం డేమనెను ?
ప్ర - మందహాసము గావించి సంతసించితిమని చెప్పుమనియె.
కౌ - అతండనుకూలుండని నీకు దోచినదా ? నవ్వుచున్నా వేమి ?
ప్ర - వానివలచియే యాటఁ గట్టించుకొంటివాయేమి ?
కౌ — అమ్మక చెల్లా ? వానిబుద్ధికౌశల మేమని వక్కాణింతును అప్పుడీసుచే నేమాటయుఁ బలికితినికాను.
ప్ర - ఎట్లయినను దనకన్న చిన్నవానిం బెండ్లియాడుట లోకవిరుద్ధమగు నని నవ్వుచున్నాను.
కౌ - అందులకు నవ్వనక్కరలేదు క్షత్రియులకదియాచారమే. శ్రీరాముని కన్న సీత యెన్నియేండ్లు పెద్దదియో యెఱుంగుదువా ?
ప్ర - లెస్సయేకాని మఱియొక వదంతి వింటి నది నీ మనోరధమునకు నిరోధకమని తలంచుచున్న దాన.
కౌ - అదియేమియో చెప్పుము.
ప్ర - ఏనుఁగబారిందప్పించి నిన్నుఁ గాపాడిన విప్రకుమారునకుఁ బెండ్లి చేయవలయునని మీతండ్రి తలంచుచున్నట్లు కింవదంతి పుట్టినది.
కౌ - చాలుచాలు భూమిలో, హారములో, నగ్రహారములో కాక యంత మాత్రమునకే మా తండ్రి నన్ను వానికిఁ బెండ్లిచేయుటకు సమ్మతించునా ? ఆవదంతి వట్టిది.
ప్ర - కళావంతునేమి చూచి వరించితివి ?
కౌ -- అదియా ? మేలు మేలు వాని విద్య యొక్కటిచాలదా ! -------------- ప్రతియున్నదా ! అంతకన్నఁ గావలసినది యేమున్నది.
ప్ర - నేను వానింజూడలేదు కాని వాఁడును ----------------------- మన ప్రజ్ఞావతి యంతయు నెఱుంగును. కౌ - జ్ఞానవతి యెందున్నది?
ప్ర - అదిగో మాటలో నిటే వచ్చుచున్నది.
జ్ఞా -- (ప్రవేశించి) ప్రజ్ఞావతీ ! నావంకఁ జూచుచున్నా వేమి ?
ప్ర - మన రాజపుత్రికను నేనుఁగవలన విడిపించినవాని పేరేమి?
జ్ఞా - దేవగుప్తుడు.
ప్ర - వానిని నీవు చూచితివా ? వాని యంద మెట్లున్నది.
జ్ఞా - నేనుఁ జూచుటయేకాక పరిచయము గలుగఁజేసికొని మాట్లాడితిని. వానియందము మనుష్యులకేకాక, దేవతలకు, యక్షులకు, సిద్ధులకు, విద్యాధరులకుఁ గిన్నరులకుంగూడ లేదని చెప్పఁగలను.
ప్ర - అంతయేమిటికిఁ గళావంతుడు చక్కనివాడా? అతఁడు చక్కని వాఁడా ? ఇద్దఱి తారతమ్యము జెప్పుము.
జ్ఞా - కళావంతుఁడు చక్కనివాఁడేకాని యాఁడుపోలిక వచ్చినది. దేవగుప్తుడు పురుషసింహుఁడు కాదా ? వానికి వీనియందము చాలదు.
ప్ర - పోనీ, మన రాజపుత్రికకెవ్వడు తగినవాఁడో చెప్పుము.
జ్ఞా -- దేవగుప్తుడే తగినవాఁడని నా యభిప్రాయము
ప్ర -- కళావంతుం బెండ్లి యాడుదునని రాజపుత్రిక జెప్పుచున్నది.
జ్ఞా - మనరాజుగారు దేవగుప్తునికిఁ బెండ్లి జేయుదమని వెంటనే రమ్మని శుభలేఖ వాసియంపినది యీమె యెఱుంగదు కాఁబోలు !
ప్ర - అప్పుడే శుభలేఖయు పంపిరా! ఇంతను నీవార్తకింవదంతియని చెప్పితిని.
జ్ఞా - కింవదంతియేల ? నొడయఁడు పెండ్లి ప్రయత్నమె చేయుచుండెనే :
కౌ - ఏమీ మా తండ్రి పెండ్లి ప్రయత్నమే చేయచున్న వాఁడా? దేవగుప్తుని రమ్మని వార్తనంపెనా : కానిమ్ము అంతకుముందే కళావంతుఁడు వచ్చునట్లు జేయుఁడు. అప్పుడు మా తండ్రితోఁజెప్పి యొప్పించెదను.
జ్ఞా - వానితండ్రి సదాచారి వెనుకటి సొమ్మిమ్మని దాని యుత్తరము దీసికొనివచ్చి యడిగిన ఱేఁడు వానిని రమ్మని చెప్పమని యప్పాఱుం బంపెను. వాడెట్లయిన రాఁగలఁడు.
కౌ - అట్లుకాదు. ఈ విషయము వివరింపుచుఁ బ్రత్యేకముగా మన సందేశము పంపుఁడు.
జ్ఞా - భర్తృదారిక యెట్లు చెప్పుచున్నదో యట్లుచేయుచున్నాము అని యందఱు నిష్క్రమించిరి.
రాజచోదితుండగు దూత దేవగుప్తు నరయుచు దిరిగి తిరిగి యొకనాఁడు మధ్యాహ్నమునకు మహేశ్వరాగ్రహారమునకుఁ బోయి విష్ణుగుప్తునింటిలో నున్నవాఁడని . విని సంతసముతో నచ్చటి కేగెను. అప్పుడు వీధి తలుపులు మూయంబడి యున్నవి. ఆతని బిలిచినంత భుజింపుచున్నవారు అంతదనుక వాకిట నుండుఁడని యెవ్వరో చెప్పిరి. ఆ మాట విని యాదూత యమ్మయ్య ! యిప్పటికి నాకష్ట గట్టెక్కినది. ఇటువంటి శుభవార్త దెచ్చినందుల కాయన నాకుఁ దగిన పారితోషికమియ్యుఁగాక యని యాలోచించుచున్న సమయంబున మఱియొక రాజభటుఁ డచ్చటికివచ్చి విష్ణుగుప్తుని యిల్లిదియేనా ? యని యడిగిన నందున్నదూత యిదియే యిదియే ఇటురాయని చెప్పెను.
ఆ మాటవిని యా భటుఁడు వానిదగ్గరకువచ్చి యెహో? కౌస్తుభా నీవిక్కడ నుంటివేమని యడిగిన నతఁడయ్యో ? నందకా ! నీవా ? మఱియెవ్వడో యనుకొంటి. నీ వేటికి వచ్చితివని యడిగిన నందకుఁడు మన రాజనందన కళావంతుఁడను బ్రాహ్మణ కుమారునికేదియో యుత్తరమిచ్చినది. అతండిక్కడున్నాడని తెలిసివచ్చితినని చెప్పెను. కౌస్తుభుఁడునుమన రాజపుత్రికను మృత్యుముఖంబునుండి తప్పించిన దేవగుప్తుడను విప్రకుమారునికిఁ బెండ్లిచేయు తలంపుతో మనరాజుగారే వానిందీసికొని రమ్మని నాకీ శుభలేఖయిచ్చి యంపిరి అతండు నిందేయున్నాఁడు. అందులకై వచ్చితి నని చెప్పెను.
అట్లువారిరువురు మాటలాడికొనుచుండగా దేవగుప్తుడును గళావంతుఁడును భోజనముచేసి తలుపులు దెరచుకొని వాకిటకు వచ్చిరి వారింజూచి యాభటు లిరువురు లేచి జోహారుచేసిరి. వారు మీరెవ్వరని యడిగిన వాండ్రు కుముద్వంతుని ప్రతిణిధులమని చెప్పుచు వారుదెచ్చిన పత్రికల వారికిచ్చిరి. అప్పుడు పైవిలాసముల ననుసరించి యెవరి యుత్తరముసు వారుదీసుకొని విప్పి చదువికొనిరి.
దేవగుప్తా ! నీవు దైవమువలెవచ్చి మృత్యుదేవత నోఁటిలోఁబడిన నా కూఁతురనులాగ బ్రతికించితివి, నీ యుపకారమున కేదియుఁ బ్రత్యుపకారము చేయ నేరను. అప్పడఁతి యప్పుడే నీ వామభాగమైనది. కావున వేగవచ్చి యచ్చెల్వం బెండ్లి యాడి రాజ్యభారము వహింపుము, అని దేవగుప్తునకుఁ గుముద్వంతుడు వ్రాసిన యుత్తరములో నున్నది.
మనోహరా ! భవదీయ మనోహరాకారముచూచియే యాటలో ----------- పొసంగితిని. ఆటఁకు బూర్వమే నా హృదయమర్పించితిని. హృదయ------------------ లేమి చేయఁగలదు ? నీవు భర్తవని యిదివరకే యుత్తరమువ్రాసి యంపితినిగదా ? ఇప్పుడు వేగవచ్చి రాజశ్రీ యుక్తముగా మదీయ పాణిగ్రహణముగావింపుము. అని కళావంతునకు రాజపుత్రిక వ్రాసినది. ఆ యుత్తరములను చదివికొని వారు మందహాసశోభిత వదనారవిందులైరి. అప్పుడు తన యుత్తరము చూడుమని దేవగుప్తున కిచ్చినంత నతండును దన యుత్తర మా కళావంతున కిచ్చె.
దేవగుప్తుండు కళావంతుని యుత్తరము చదివి వయస్యా ! వీరి సందేశములు మిగుల చిత్రములుగా నున్నయవి. ఒండొరుల యభిప్రాయములు తెలియక నిట్లువ్రాసిరని తలంచెదను. ఎట్ల యినను దొలుతగన్యచే వరింపఁబడినవాఁడవు నీవుగదా ? 'పూర్వ త్రాసిద్ధం' అను సూత్రార్ధము ననుసరించి నీకేయెక్కుడు బలము గలిగి యున్నది. కావున వేగఁబోయి యాయింతిం బెండ్లి యాడుమని చెప్పినఁ గళావంతుండు అట్లుకాదు దేయము దాతృవశం బయియుండును. అట్టిదాత నీకిత్తునని యుత్తరం వ్రాసెంగదా ? మఱియు 'నరనిత్యాంతరంగాపవాచానా ముత్తరోత్తరం బలీయః' అని కౌముదియే చెప్పుచున్నది. కావున మీరే యానారీమణిం బరిగ్రహింప నర్హులని పలికెను. అని వారిరువురు బరిహాసముగా మాట్లాడికొనుచున్న సమయంబున సదాచారి విచారముతో నరుదెంచుటయుం జూచి యతనితో మాటలాడుటకుఁ గళావంతుఁడు కొంచెము చాటుగాఁబోయెను. అప్పుడా విప్రుండు యువతీ ! నాగ్రహచారము మంచిది కాదు. చేతికి దొరకిన సొమ్మువిడచి పేరాసఁబడి యిడుమలం గుడుచుచున్న వాఁడ. నీవువచ్చినంగాని యాసొమ్ము నాకీయరఁట. నిన్నుఁ దీసికొనిరమ్మన్నారు. ఆలుబిడ్డల విడిచి యెంత కాలమిట్లు తిరుగుచుందసు ? వేగవచ్చి యా సొమ్మిప్పింతువా ? పొమ్మందువా ? యని యడిగిన నతం డిట్లనియె.
తాతా ! మెల్ల గా మాటాడుము నేనువచ్చి సొమ్మిప్పించెద. విచారింపకుము. ఇప్పుడిక్కడిక్కడే పయనమగు చుందుమని యదార్చెను. వారి సంవాదము దేవగుప్తునికి వినంబడినది. తరువాతఁ గళావంతు డీవలకువచ్చి ఆర్యా ! మనమెట్లైనఁ గుముద్వతి కరుగ వలసియున్నది. అక్కడకిబోయి యా చమత్కార మేదియో చూతముగాక యని పలికిన నతండును సమ్మతించెను. ఇరువురు నమ్మఱునాఁడు విష్ణుగుప్తునకుం జెప్పి కుముద్వ కరుగుటకు బయలుదేరి క్రోశదూరము పోయిరో లేదో విష్ణుగుప్తుడు పిరుందన పరుగెత్తికొనిపోయి వారింగాంచి సంతసించుచు నిట్టూరుపులతో దేవగుప్తా ! నీవు మాపాలిటికి దైవమువై యాపదలు తొలగించుచుంటివి. నిన్ను నాకుమారుడని చెప్పుకొనుటచే మలయధ్వజుం డెప్పటికిప్పుడే రమ్మని వర్తమానము పంపుచుండును. మేమేమి చేయుదము ! నిన్నెన్నిసారులు శ్రమపెట్టుదుము ? వేరొక యుపాయ మేదియుఁ దోచకున్నదని పలికి రాజు పంపిన యుత్తరము చూపెను.
మా మిత్రులు పాండ్యదేశాధీశ్వరులు వ్రాయించిన యుత్తరము చూచికొని మిక్కిలి యానందించితిమి. మాపండితు లీనడుమ దిగ్విజయము చేసికొని వచ్చిన మాట యధార్థమే కాని మీ పట్టణమునకు పోలేదని చెప్పుచున్నారు. ఏది యెట్లయినను మీ బాల పండితుని పాండిత్య ప్రకర్షము చూడ మిగల వేడుకగా నున్నది. మా విద్వాంసులు తిరిగితిరిగి యలసి వచ్చిరి. కావున వెండియు వారికి పయనము సెప్పుటకు సంశయించుచున్నాడ. మీ బాల విద్వాంసు నొకసారి యిక్కడకు బంపితిరేని తప్ప్రగల్బోపన్యాస శ్రవణంబున శ్రవణానందంబుఁ గావించు కొనియెదను. వారి రాకపోకలయిన విత్తమును సమర్పణ చేసికొనుచున్నాడ. ఇట్లు కృష్ణదేవరాయలు. అనియున్న యుత్తరము రెండవ ప్రక్కను ఇప్పుడు మీకుమారుని రాయలయొద్ద కనుపవలసియున్నది. తక్షణమె యిక్కడకే పంపవలయునని మలయధ్వజుఁడు వ్రాసెను.
ఆ జాబుఁ చదివికాని దేవగుప్తుండు ఆర్యా : నేనిప్పుడు కుముద్వతి కరిగి యచ్చటినుండి విజయనగరమునకుంబోయి రాయలవారి పండితులతోఁ బ్రసంగించెద. ఆ మాటనీవు మలయధ్వజునొద్దకరిగి చెప్పుమని చెప్పవలసిన మాటలన్నియు బోధించి విష్ణుగుప్తుననిపెను.
ఆ ప్రసంగ మంతయు విని కళావంతుండు స్వగతంబున సందియ మందుచు విలాసముగా దేవగుప్తుని కిట్లనియెను. నీవీ విష్ణుగుప్తుని కుమారుండవు కానియట్లు తెల్ల మైనది. ప్రచ్ఛన్నముగాఁ దిరుగుటకుఁ గారణమేమియో తెలియదు. నీకులకీల నామంబులు వివరించి నాకు శ్రోత్రానందము గావింపుము. సఖ్యము ------------ గదా ?నేను నీకు శిష్యుండ భృత్యుండ నాప్తుండ నగుట నిక్కము వక్కాణింప నర్హుండనని పలికిన విని నవ్వుచు నతండిట్లనియె. నీవును సదాచారి ---------------- కాని యటుల నాకునుఁ దెల్లమయినది. నీ యుదాంతము ముందు జెప్పితివని ------------ నాకథఁ జెప్పెదనని నుడివిన నక్కపట కళావంతుఁడు మలదిసి ---------------- వదనా లంకార మగుచుండ నార్యా ! నీవు మందారవల్లి కొడుకువయినచో నావృత్తాంతము చెప్పెదనని యుత్తరము చెప్పెను. అప్పుడతండు నీవు గళానిలయ కూఁతురువయినచో నేను మందారవల్లి కుమారుండనేమిటికి కాకుందును ? నీ యుదంత మాద్యంత మెఱింగింపుమని వాక్రుచ్చిన నబ్బురమందుచు నాసుందరి ఆహా ! నీవు వసుంధరుఁడవని యప్పుడే యనుకొంటి. అందులకే నిన్నాశ్రయించి తిరుగుచుంటి దైవ మభీష్ఠము సమకూర్చెనని మెచ్చుకొనుచుఁ దానడవిలోఁబడి బరితపించినది మొదలు నాఁటి తుదదనుక జరిగిన యుదంత మంతయుం జెప్పి నీవీనామముతో నిట్లు తిరుగుటకుఁ గారణ మేమని యడిగినది.
అక్కధవిని యతం డక్కజమందుచు సుందరీ ! నీవరణ్యమునం బడితివని యక్షకన్యాసంభాషణ శ్రవణంబున నాకుఁ దెల్ల మయినది కావున నీవు కళావతియని యనుమానము జెందుచుంటిని. దానంజేసియే యనుసరించి తిరుగుటకు సమ్మతించితిని. సంతసమయినది. నావృత్తాంతము నినుము. నీవలెనే నేనును నొకనాఁటి యుదయమున యక్షిణీశైల శిఖరమునఁ బడియుంటి నందలి కారణము దెలియక పరితపించుచు నందొక పరివ్రాజకుఁడు గనంబడిన నతని నాశ్రయించి తత్పర్ణ శాలలోఁ బది దినములు వసించితిని. అతండు నన్ను యక్షిణీదేవతకు బలియిచ్చుటకు సిద్ధపడిన గ్రహించి నేనే వాని శిరంబుఁ ద్రొక్కి పెట్టి యమ్మవారికి బలినీయ నుద్యోగించితిని. అట్లు చేసితినేని యక్షిణి ప్రత్యక్షమయి కోరిన కోరికలన్ని యుఁ దీర్చునఁట వాని పరిదేవనము విని జాలిపడి బ్రహ్మహత్యకు వెఱచి సంపదల లక్ష్యము సేయక వాని జడల గొఱిగి విడిచి పెట్టితిని.
విష్ణుగుప్తుని కథ
తరువాత నద్దేవికటాక్షముననే యాయక్షిణీ శైలమవలీల దాటి జనపదంబు లంబడి నడుచుచు నొకనాఁడు మధ్యాహ్నమునకు నీ మహేశ్వరాగ్రహారమున కరుదెంచి యందు విష్ణుగుప్తుం డతిధుల సత్కరించునని విని వారియింటికిం బోయితిని. యజమానుని యనుమతి నందున్న వారు నన్నెక్కుడుగా గౌరవించుచు భోజనము పెట్టిరి. నాఁడు విష్ణుగుప్తుండును భార్యయుం గుడువక యొకగదిలోఁ బండుకొని యేమిటికో విచారింపు చుండిరి. పలుమారు వారి భృత్యులు పోయి కుడువరమ్మనిరి. కాని వారిమాట వినిపించుకొనలేదు. అప్పుడు తక్కిన వారును గడువ మానివేసిరి. ఆవిచారమునకుఁ గారణమేమని నేను వారినడిగిన నాభృత్యులలో నొకఁడు రహస్యముగా నిట్లు చెప్పెను. అయ్యా ! యీదేవగుప్తుండు పాండ్యదేశాధీశ్వరుండయిన మలయధ్వజు మహారాజుగారి యాస్థానపండితుండు. ఆ నృపతి వలనఁ బెక్కు బిరుదములతో నీయగ్రహారము గానుకగాఁ బడసెను. ఇప్పుడాఱేని సభగు రాయలవారి యస్థాన కపులు దిగ్దంతులని బిరుదములు వహించిన వారు వచ్చిరఁట వారితోఁ బ్రసంగింప రమ్మని యింతకు ముందే యభూపతి పత్రిక నంపెను. ప్రసంగ సంగరములో వారిం బరాజితులఁ గావించి మాదివాణము ఖ్యాతినిగానక పోయితివేని నీ యగ్రహారము లాగికొని వారికిచ్చి వేయుదుమమని యా పత్రికలో వ్రాయబడి యున్నదఁట. ఇతండు వారి పాండిత్య మగ్గడించుకొని వెఱచుచు నగ్రహారము పోవునని పరితపించుచున్న వాఁడు ఇదియే భోజనము సేయని కారణమని యతఁడు నాకుఁ చెప్పెను.
విష్ణుగుప్తుండు ధర్మశీలుఁడని వినియుంటిని కావున నతనింగావఁదలంచి యాలోపలికింబోయి యతడినిం గాంచి యార్యా ! నీవు రాయలవారి పండితులకు వెఱచి భోజనము సేయమానివేసితివఁట కాదా ? అయ్యయ్యో ! ఇంత యనుచిత మేదియేనింగలదా ? వారితో వాదింప సామర్థ్యము లేకపోయిన మఱియొక తెరువాలోచించు కొనవలయుంగాని యూరక పరితపించిన లాభమేమియున్నది ! లెమ్ము . భోజునము సేయుము. నీకు బదులుగా నేనుబోయి వాదించి వారిం బరాజితులఁ గావించెద నిప్పుడే కాశిలో సకల విద్యల జదువుకొని వచ్చుచుంటి. ప్రసంగ మెచ్చటనైన జరుగునాయని వేడుక జెందుచుంటి. నీ యగ్రహారము నిలిపెదనని పలుకుటయు విని దాతహప్తుండంబుదనినదంబునోలె నామాటవిని యతండత్యంత సంతోషము జెందుచు మంచము దిగి నన్ను జూచి వెఱగందుచు నిట్లనియె.
అయ్యా ! నీ పేరేమి ? ఎందుండి వచ్చుచుంటివి ? జన్మభూమి యెచ్చట? నీవు బాలుండవే ? యా ఫ్రౌడులతోఁ బ్రసంగింపఁగలవా ! వారి వృత్తాంత మెఱుంగవు వారు సామాన్యులుకారు అందు రామలింగకవి యున్న వాఁడు అతని చెయువులు కథలుగాఁ జెప్పుకొనుచుందురు. నీ సామర్థ్యము దెలియువరకు నా మనస్సంతాపము వాయదని పలికిన నేనిట్లంటి ఆర్యా : నా పేరు దేవగుప్తుండందురు నా జన్మభూమి మళయాళ దేశములో నొక గ్రామము. కాశినుండి చదువుకొని వచ్చుచున్నాను. ఆ పండితులు నే నెఱుంగనివారుకారు వారిం గెలువగలను వెఱపుడుగుము. భుజింపుమని యతండు నమ్మునట్లు చెప్పితి నప్పుడతం డయ్యా ! నీ దేజము చూడ నంతవాఁడవు పలెఁ దోచుచున్నది. కాని నీ విజయమువలన నాకేమి ప్రయోజనమని యడిగిన విని నేనాలోచించి నీ కుమారుండననిపోయి బ్రసంగించెదఁ బుత్రుని పాండిత్య ప్రకర్షము తండ్రికే ఖ్యాతిఁ దెచ్చుంగాదా ? పుత్రాదిచ్ఛేత్ప రాజయమను నార్యోక్తిని వినియుండ లేదా ? యని చెప్పి యతనికి సంతోషము గలిగించితిని.
అప్పుడా బ్రాహ్మణుఁడు లేచి భుజించి నన్ను స్తుతిఁజేయుచు నావిద్యలం బరీక్షించుచు నా దివసము సంతోషముతో వెళ్ళించెను. మఱునాఁడు మలధ్వజుఁ డొక పల్లకీ బంపెను. నేనావిష్ణుగుప్తుని కండలములు శాలువులును గంకణములును దాలిచి యా సిబికనెక్కి యా సభకుఁబోయి విష్ణుగుప్తుని కుమారుండనని చెప్పుకొని ప్రసంగించి వారిం బరాజితులఁ గావించితిని తరువాత వృత్తాంతము నీవు వినినదియేకదా యని చెప్పిన నప్పడఁతి ప్రహర్ష సాగరంబున మునుంగుచు నిట్లనియె.
కళావతీ వసుంధరుల కథ
ఆర్యా ! నీ యౌదార్యంబు నీ దాక్షిణ్యంబు నీసౌశీల్యంబు వేనోళ్ళ గొనియాడదగియున్నది. సామ్రాజ్యంబు గవ్వగాగణించి సన్యాసిం గరుణించి విడిచిపెట్టితివి. పుత్రుండవని చెప్పికొని విష్ణుగుప్తుం బాలించితి వింతకంటె సాద్గుణ్యమేమి యున్నది అదియట్లుండె గండుమీరి జంతుతండంబులఁ జండాడెడు మత్తవేదండంబు తుండంబు బట్టుకొని గండరగండడనై నీవారాజసందనం గాపాడినకథ మిక్కిలి యాశ్చర్యము గలుగజేయుచున్నది. నీకిట్టిపౌరుష మెక్కడినుండి వచ్చినదని యడిగిన నతండప్పుడు యక్షిణి దలంచుకొనుటచే నాకాహస్తివశ్యమైనదని చెప్పుచు మఱియు నతం డింతీ ! నీ పురుషవేషము గడువింతగానున్నది సుమీ ! దానఁజేసియే గౌముది తండ్రిమాట గణింపక నిన్ను వలచి నీ కుత్తరము వ్రాసినది వేగబోయి యాయెలనాగం బెండిలి యాడనా ? యని పరిహసించిన నమ్మించుఁబోఁడి యార్యా ! కరివెరపున నిన్నా యన్నులమిన్న తిన్నగాఁ జూడకపోవుటకే నన్ను వరించినది పోనిండు. ఎట్ల యినను యా జవరాలు మీకే దాసురాలగును యజమానునకు భ్పత్యుని భృత్యుండును భృత్యుఁడే యగుంగదా? యని పలుకుచు శృంగార విలాసము లంకురింప సప్పంకజాక్షి యపాంగ వీక్షణములతనిపై వ్యాపింపఁ జేసినది. అప్పుడప్పూబోఁడి చూపుకైదువుల నాటించి యవకాశము జేసికొని కుసుమశరుం డక్కుమారుని హృదయంబునఁ బ్రవేశించెను.
ఉ. పున్నమినాఁటిచ దురుని • బోలుమొగంబును జిన్నిచన్నులున్
సన్ననికౌను ముత్తియపు • చాలనఁగ్రాలు రదాలు మేల్పదా
ఱ్వన్నెకడానిమేనిజిగి • వాలుకనుంగవ గల్గి కూకటుల్
చెన్నువహింప బాల రహి • సేయదె జవ్వన మూనువేళలన్.
గీ. సాటిలేనిమేటి • చక్కఁదనము గల్గి
సకల విద్యలందు . జాణలగుచు
నేకదేశమున వ. సెంచెడు యువజవ
లొకరినొకరు వలచు • టొక్క యరుదె.
అతండు డెందంబునఁ బొడమిన వికారంబుఁ దెలియనీయక యడఁచుకొని బాలా ! మనమెప్పుడు కుముద్వతీ నగరంబున కరుగువము. ఆ చంచలాక్షి యెవ్వరిని వరించునో యా నృపాలుం డెవ్వరికిచ్చి పెండ్లి సేయునో యేమివింతలు జరుగునో చూతముగాక యని పలికిన విని యక్కలికియు సమ్మతించినది.
పిమ్మట సదాచారి యనుసరించిరా వారిరువురు గతిపయ ప్రయాణంబుల నప్పుటభేదనంబు చేరి దూతలవలనఁ దమరాక నృపాలున కెరింగించిరి. ఆ భూభర్త యా వార్తవిని సంతసముతో వారిని విచిత్ర సౌధంబున విడియఁజేసి యుపచారములుఁ గావింపఁ బెక్కండ్రఁ బరిచారకుల నియమించెను. ఊరి చేరినది మొదలు సదాచారి కళావంతుని దనసొమ్మిపింపుమని నిర్బంధింపఁ దొడంగినవిని దేవగుప్తుండు తాతా ! నీ వెక్కడికిఁ బోయెదవు ? నీవు రాజుతో వియ్యమందవలయును. నీ కుమారునికి రాజపుత్రికనిచ్చి వివాహము చేయుదురఁట వస్తువులు పెట్టవలయును సొమ్మేమైన దాచితివేమో తెమ్మని పలికినవిని యా పాఱుండేమియు మాటాడక యవ్వలికిం బోయెను. మఱియు నాఱేయి వసుంధరుఁడును గళావంతుడును పురీవిశేషములరయఁ దిరుగుచు నొకదేవాలయము దాపునఁ బౌరులు గొందఱు మాటలాడుకొనుచుండ నందు నిలువంబడిన వారిట్టు మాట్లాడికొనిరి.
పథముడు - మిత్రమా ! సభావిశేషములేమి ? చివరకు గౌదమి నెవ్వరి కిచ్చుట నిర్ధారణచేసిరి ? నీవు చివరంట నుండితివిగదా ?
ద్వితీయుడు - మొదటివానికి పెండ్లి చేయవలయునని కొందఱు, రెండవ వానికిఁ జేయుట నీతియని కొందఱు వాదించిరి.
తృతీయుఁడు -- మీ మాటలేమియు నాకుఁ దెలియుటలేదు. తత్పూర్వోత్తర మేమియో వివరింపుడు.
ప్రథ - మన రాజుగారి కూఁతురు కౌముదిమాట జెప్పికొనుచున్నాము. ఆ చిన్నది తనతోఁ జదరంగమాడి జయించినవానిం బెండ్లియాడుదునని నిశ్చయము చేసికొన్నఁదట. తృతీ - ప్రకటనలో నట్లు లేదే గెలిచినచోఁ బదివేలమాడలిప్పింతునని నోడినవాని నురిదీయింతుననియు వ్రాయఁబడియున్నది.
ప్రథ – వ్రాఁతలో నామటలేదుగాని హృదయంబున నట్లు నిశ్చయించు కొన్నఁదట అందులకే బ్రాహ్మ క్షత్రియ కులజులేకాని యితరులు పనికిరారని వ్రాయించినది.
తృతీ - పోనిమ్ము ఇప్పుడేమి? మొన్న గళావంతుఁడను విప్రకుమారుఁడు జయించెనుగదా ! వానిం బెండ్లియాడరాదా ? సభలేల ?
ప్రథ — వినుము. మొన్న నీనడుమ పట్టపేనుఁగ మదముదిగి కావించిన యల్ల రిలో రాజపుత్రిక చావవలసినదియేకదా.
తృతీ -- అవును. అప్పు డెవ్వఁడో యొక విప్రకుమారుఁడు రక్షించెనని చెప్పుకొనిరి. నేనప్పుడు రాలేదు.
ప్రథ - ఆ చిన్నది భయమున వానిం గౌగలించుకొన్నది. కావున వానికే పెండ్లిచేయుట యుచితమని రాజు వానికిఁ దెలియజేసెను.
తృతీ - అతండు కుమర్తెపట్టిన శపథ ప్రవృత్తి యెఱుంగడుకాఁబోలు తరువాత ?
ప్రథ - ఆ మాట విని యా బోఁటి యంతకుఁ బూర్వమే కళావంతుల బెండ్లియాడెదనని యతని కుత్తరము వ్రాసియున్నది. కావునఁ దండ్రితో నప్పుడు తన యుద్యమము చెప్పినది.
తృతీ - ఓహో ప్రమాదమే జరిగినది.
ప్రథ - రాజు ధర్మశాస్త్ర ప్రకార మెవ్వరి కక్కన్య నిచ్చి పెండ్ల చేయవలెనని పండితుల బిలిపించి సభ జేయించెను.
తృతీ - అదియా కధాసందర్భము తెలిసినది. తెలిసినది. ఈసారి చెప్పు మనుము.
ద్వితీ - చెప్పుట కేమియున్నది. రాజకన్యలకు స్వయంవరము శాస్త్రములోఁ జెప్పబడియున్నది. కావున నా పూవుఁబోడి మొదట పరించినవాఁడే భర్తయగునని మొదటితెగవారు సెప్పిరి.
తృతీ - రెండవ తెగవారేమనిరి ? ద్వితీ - ప్రకటన పత్రికలో నిట్టివిషయమేమియు వ్రాయఁబడి యుండలేదు. గెలిచినవాని కప్పుడే పదివేలమాడలు కానుకగానిచ్చివేసిరి. అప్పుడైనం జెప్ప లేదు. తరువాత నెప్పుడో వ్రాసిన యుత్తరము ప్రధానముకాదు. తండ్రిచే నిరూపింప బడిన వరుడే యర్హుఁడని రెండవ తెగవారు చెప్పిరి.
ప్రథ - నీకేది యుక్తమని తోచెడిని.
తృతీ - ద్రౌపదిలాగున నమ్మగువ యిరువురం బెండ్లియాడిన యుక్తంగా నుండునని నా యభిప్రాయము.
ప్రథ - నిన్ను రాజుగారు కోరునప్పు డట్లె చెప్పుదువుగానిలే.
తృతీ - అట్లే చెప్పెదను. నాకేమియు భయములేదు. కాకున్న స్త్రీల కట్టి స్వతంత్ర మిచ్చినందులకు రాజుదే తప్పు.
ప్రథ – గొడ్డువీగి కనినబిడ్డకావున నామెకోరినట్టు చేయించెను. పోనిమ్ము మిత్రమా తరువాత నేది నిర్ధారణచేసిరో చెప్పుము.
ద్వితీ - ఏది నిశ్చయింపలేదు. వారిరువురను రప్పించి వారెట్లు చెప్పిన నట్లుచేయుట యుచితమని నిశ్చయించి యంతటితో సభ చాలించిరి.
తృతీ - ఇద్దరు కావలయునని కోరిన నేమిసేయుదురో ? సిరికా మోకాలడ్డువాడుండునా యేమి ? రాజ్యముతోఁగూడ నా చేడియ దక్కుచున్నదిగదా.
ప్రథ -- అప్పుడు నీవు చెప్పినట్లే చేయుదురేమో ?
ద్వితీ - అదియుం జూతముగా తొందరయేల?
అనిమాట్లాడుకొనుచు వారు నిష్క్రమించిరి.
ఆ సంవాదమంతయు విని నవ్వుకొనుచు వారిలో వారేదియో మాట్లాడికొని యా రాత్రి బసలోనికిం బోయి పండుకొనిరి. అమ్మఱునాడు ప్రాతఃకాలమున నా భూపాలుండు వెండియు సభజేసి యా సభకు వారిరువురను రప్పింది. మహోన్నత కనకపీఠంబులం గూర్చుండఁబెట్టి స్పౌమ్యులారా ! మీరిరువురును పండితులగుచో నా విన్నపం నొక్కటాలింపవలయును. మా కౌముది పత్రికలోఁ బ్రకటించిన విషయములు మీరు చూచియేయున్నారు. తరువాత నితం డోడించెను. ------------- బ్రకటించిన ప్రకారము కానుక నిచ్చితిమి. తరువాత తెలియపరచితిని. ఇవియే జరిగిన విషయములు. మీలో నెవ్వనికిఁ బెండ్లి చేయవలయునో మీరె చెప్పుడు పండితులు వేరువేర యభిప్రాయములు పడిరని యుపన్యాసముగాఁ జెప్పెను.
అప్పుడు కళావంతుఁడు తనకే యక్కన్యం బెండ్లి చేయవలయునని యుక్తియుక్తముగా వాదించెను. వాని వచనంబులన్నియు ఖండించుచు వసుంధరుఁ డా సుందరిఁ దనకుఁ బెండ్లిచేయవలయునని కోరికొనియెను. ఇరువురి వాదమువిని యజ్జన పతి డోలాయతమనస్కుండై చేతులుజోడించి యిరువురు సమాధానపడి యొకతెరు వెఱిగింపుఁడని మిక్కిలి వినయముతోఁ బ్రార్ధించిన వసుంధరుం డిట్లనియె.
నరేంద్రా ! యిప్పటిరాజులలోఁ గృష్ణదేవరాయలు పెక్కండ్ర బండితులం బ్రోగుచేసుకొని యాదరింపుచున్నాఁడు. తదాస్థాన పండితులకే దిగ్దంతులని బిరుదములు గలిగియున్నవి. ఇప్పుడీ విషయము లన్నియుఁ బత్రికలో వ్రాసి యా నృపాలు నొద్ద కనుపుము. మేమునుఁ బోయి యా పండితులలో వాదింతుము మా వాదములు విని యందలి పండితు లేది నిర్ధారణ చేయుదురో యట్లు కావింతువు గాక అందులకు మేమిరువురము నొడంబడుచున్నా రమని పలికిన సంతసించుచు నప్పుడే యా విషయము లన్నియు బండితులచేత వ్రాయించి యుత్తరముతో గూడ రాయలవారి యాస్థానమునకు బంపెను.
అందు వసుంధరుండు తన పేరు దేపగుప్తుడనియుఁ గళావతి పేరు కళావంతుడనియు వ్రాయించెను. వారి రాజఁ జారుల వలన విని కృష్ణదేవరాయలు మిగుల సంతసించుచుఁ బూవుఁతోటలో నున్న చిత్రశాలలో వారిం బ్రవేశపెట్టించి యుపచారములఁ గావింప దాయాదుల బెక్కండ్ర నియమించి -------- పండితులకుఁ దెలియజేసెను. దేవగుప్తుని పేరు వినినంతనే --------------- కవీశ్వరుడు నాఁడు రాయలవారు పంపిన పత్రికలం జదువుకొని విచారించుచు నందఱు గుమిగూడి రామలింగకవి యింటికిజని యతనిచేత సత్కృతులై యిట్లనిరి.
ఆర్యా ! మనకు హృదయకూలమయిన దేవగుప్తుఁడు వచ్చిన వార్తనీకునుం దెలిసియే యుండును. నాఁటి యవమాన మెట్లో దాటించితివి. వాని వలన మన సామర్థ్యము దెలిసికొనవలయునని రాయలవారు గట్టిశ్రద్ధ చేయుచున్నారు. మొన్నటి వలెనే - పే, జతం, నేల, సరం. మనం సిరా నలు ముసు.. మన కంతకంటె యపఖ్యాతియేమున్నది ! సభ కూడకమున్న దానికుపాయ మేదియేని యాలోచింపుము. నాఁడు మందారవల్లి ని జయించినట్లె యట్లే వీనిని బరాజితుని గావించి మమ్ముఁగాపాడుము. వాని యెదుట బడితిమేని యవమానింపక విడువఁడు. దాని యెదుట బృహస్పతియయినను నిలువఁజాలఁడు. నీ విప్పుడభయహస్త మిచ్చిన నుందుము కాదంటివేని నాలుబిడ్డలతో నిల్లువిడిచి యెక్కడికేనిం బోవుదుమని యేక వాక్యముగాఁ బ్రార్ధించిన విని రామలింగకవి నవ్వుచు నిట్లనియె.
మిత్రులారా ! నే నేమి చేయుదును ? నాకును వాని యెదుట నే మాటయు స్ఫురింపదు. ఏమియుఁ దోచకయే కాదా యా రాజున కిట్ల సత్య పత్రికలం బంపితిని. అంతటితోఁ బోవుననుకొంటిని గాని వెన్నంటి తరిమికొని వచ్చెను. మఱియుఁ గుముద్వంతుఁడు మనలఁ బెద్దగా వర్ణించుచు ధర్మసందేహము దీర్చుఁడని పత్రికలువ్రాసెను. దానిలో వీఁడొక వాదియఁట అది యేమియో కాని వానిపేరుఁ దలంచినంతనే యెడద వెఱవుగలుగుచున్నది. నాకును వానితోఁ బ్రసంగించుటకు వాక్కురాదు. మనమందరము పోయి గూఢముగా వాని నాశ్రయించి ప్రసంగము చేయకుండ నవ్వలసాగనంపుటయే యుచితమని చెప్పుటయు నా పనియు నీ పురస్కరముగనే కావలయునని కోరి కొనిరి.
అమ్మఱునాఁడు రాత్రి కొంచెము ప్రొద్దుపోయిన తరువాత నా పండితు లందఱు గుమిగూడి దేవగుప్తుఁడున్న పూవుఁదోటకుఁ బోవుచుండిరి. కృష్ణరాయలు రాత్రులయందప్పుడప్పుడు మారు వేషముతోఁ బ్రజల యభిప్రాయములఁ దెలిసికొనుటకై తిరుగుచుండును. నాఁడొక బీదపాఱుని వేషమునఁ దిరుగుచు పండితులుసందడిగా మాటలాడికొనుచుఁ బోవుచుండుట జూచి తానును వారి వెనువెంట గూఢముగా నడచు చుండెను. అది వారెఱుంగక క్రమంబున నా పూవుఁ దోటకుం బోయి యొక పొదరింటిదరి నిలువంబడి తమ రాక పరిచారిక ముఖముగా దేవగుప్తునకుం దెలియజేసిరి. ఈ లోపల నృపాలుండు వారిం దెలియకుండ లోపలికిఁబోయి యొక వాక్షము దాపునఁ గూరుచుండెను.
అట్టి సమయమున పసుంధరుండును గళావతియు నిట్లు మాటలాడుకొను చుండిరి.
వసుం - కళావతీ ! మనమీవీడు విడిచి నాలుగు సంవత్సరములు దాటినవి. మనల గుఱించి మనవా రేమనుకొనుచుందురో ! కళా - ఏమనుకొని యెదరు ? సమసితిమని విరక్తులయి యుండెదరు. వసుంధరా : నాకు మా దల్లిదండ్రుల వేగఁబోయి చూడవలయునని యున్నది. రేపు పోపువునా ?
వసుం - అశ్యము పోవచ్చును. అంతఃపురమున బ్రవేశింతువుకాఁబోలు నన్నెప్పుడయిన స్మరింతువా ?
కళా — నా హృదయమే నీ యొద్దనుంచి పోవుచున్నాను. అట్లనియెద వేల ?
వసుం - మణిదిగ్దంతుల ప్రసంగ ప్రకారములాకిర్ణించిపోవవా.
కళా - స్వ గ్రామమున సభకుఁబోవుట యుచితము కాదు. తరువాత నంతయు విందుము కాదా ?
వసుం - పోనిమ్ము కౌముదిం బెండిలియాడు విషయమై పండితులతోఁ బ్రసగించి పొమ్ము వారేమి చెప్పుదురో చూతము.
కళా - రెండు వాదములు నీవే చేయఁగలవు. వాదింపనేమి యున్నది. మేమిరువురము నీ దాసురాండ్ర మయితిమి. మఱియు మా కాల్లి చేసిన యపరాధము మఱువవలయునని మిమ్ము వేడుకొనుచున్న దాన.
వసుంధరుడు - మీ తల్లి నాకొక్కనికే యపకారము చేయలేదు మనయిరువులకుఁ జేసినది కాదా ? అదిగొ పండితులు వచ్చుచున్నారు మాటాడకుము.
కళా - వీరి రాకకు గతంబేమియో ?
వసుం - ఏమున్నది ? పిరికితనమే.
అని మాట్లాడికొనుచుండఁగనే తదనుజ్ఞగై కొని యా విద్వాంసులు లోపలికి వచ్చిరి. వసుంధరుండందఱికి నమస్కరించి వారినుచిత పీఠంబులం గూర్చుండఁ బెట్టెను. అప్పుడు వారాశీర్వాదము చేయుచు నక్షత లతనిశిరంబున వై చిరి. అప్పుడు వసుంధరుఁ డార్యులారా ! అమోఘంబైన బ్రాహ్మణాశీర్వాదము స్వీకరించిమీరందఱు లోకాతీతులు. ఇట్టి యర్దరాత్రమున నాకడకు రాఁ గతంబేమియో యెఱింగింపుఁడని యడిగినఁ బెద్దనార్యుం డిట్లనియె.
పండితకంఠీరవా ! నీవు విద్యచే నధికుండవైనను బ్రాయంబున మాకంటెఁ జిన్నవాఁడవు కావున నాశీర్వచన పాత్రుండ వయితివి. మా కొక కార్యంబు గలిగియే నీ యొద్దకు వచ్చితిమి. మా కామితంబు దీరుతునంటివేని చెప్పుదుమనుటయు నతండందలిపట్టి యార్యులారా : మీకు నేను బుత్రునివంటివాఁడ. మీ కార్యంబెట్టిదయినను దీర్చి మీకు మురిపెము గలుగఁ జేసెద. సంశయింపక నుడువుఁడని పలికిన వారిట్లనిరి.
మేము చిరకాలమునుండి యీదివాణము నాశ్రయించి కాలక్షేపము చేయుచున్నాము. మా పేరు పెట్టుకొని యెవ్వరో మలయధ్వజుని యాస్థానమున కరుదెంచి నీతోఁ బ్రసంగించి పరాజితులై రని వింటిమి అందలి నిజం బరము తలంపుతో మా రాజు నిన్నిందు రప్పించెనఁట. రాజులకేమి ? కోడి పందెములఁగట్టి వినోదించు కోడె గాండ్రవలె మనలో మనకుఁ గలహములు గల్పించి యానందించుచుందురు. జయాప జయంబులు దైవా యుత్తములు గదా.
నీవు మంచిపరువములో నుంటివి. నీకు మేమోడిపోయితిమేని మాభూక్తులకు లోపమురాఁగలదు. ఒకరికిఁ గీడుగావించి వడసిన విత్తంబుత్తమ మైనదా ? కావున నొరులకుఁ జెప్పకుండ నీ విక్కడి నుండి యవ్వలికి బోయి మమ్ము గాపాడుము. ఇదియే మా కోరికయని పలికిన నతండు నవ్వుచు నిట్లనియె.
ఆర్యులారా ! యవశ్యము మీ కోరిక ప్రకారము కావించెదఁ గాని నా కడ నింకను గపటముగా మాట్లాడుచున్నారు. అది యుచితము కాదు. నాఁడు మలయధ్వజుని యాస్థానమున కరుదెంచినవారు మీరదురు కారా ? నిక్కము చెప్పుఁడనియడు గుటయు వారు బాలకా ! మా నోటితో నేమిటికిఁ జెప్పించెదవు ? పెద్దలము గదా మమ్మింతటితో విడిచి పెట్టుమని కోరిరి.
అట్టి సమయమునఁ బ్రచ్ఛన్నముగా నుండి తత్సంభాషణ లన్నియు వినుచున్న కృష్ణదేవరాయలు సంతోషము పట్టఁజాలక యా లోపలికి వచ్చి తటాలున నా బాలుం గౌఁగిలించుకొనియెను. అతండు రాజని తెలిసికొని పండితులలెల్లఁ దెల్ల పోయి చూచుచుండిరి. అప్పుడు రాయలవారు ఒహో ! యీతఁ డెవడో తెలియక మీరువెఱిచి వీనిని శరణుజొచ్చితిరి. వినుండితండు మన రామలింగకవి కుమారుండువసుంధరుఁడు నుండియని చెప్పినంత లేచి రామలింగకవి యేమేమీ ! వీఁడు మావసుంధరుఁడా యని పలుకుచు వానిం గ్రుచ్చి యెత్తికన్నుల నానంద బాష్పములు గ్రమ్మ దండ్రీ ! ఇంత కాల మెదుంటివి ? మమ్ము మఱచి వెఱపింప వచ్చితివా ? అయ్యో మీతల్లి నీకొఱకుఁ జింతించుచు మంచము పట్టినది. పట్టీ ! నీ వంతలో నెట్లు అంతర్ధాన మయితివి ? నీ మొగము జూచి నాఁడించుక సందియమంది పోలికయట్లున్నదని యుపేక్షించితి. నీపరిగిన తెఱం గెఱిఁగింపుమని యడిగెను.
అప్పుడు వసుంధరుండు వారినెల్ల సావకాశముగా కూర్చుండఁ ప్రార్థించి తన వృత్తాంతము గళానిరయ వృత్తాంతము నింతయేని కొరంతవెట్టక పూసగ్రుచ్చినట్టు లామూల చూడముగా నెఱిగించి వారినెల్ల నాశ్చర్యవారధిలో ముంచివేసెను. వారట్లు మాటలాడి కొనుచుండగనే సూర్యోదయమయినది. అప్పుడు రాయలవారు పరమానంద భరితహృదయులై తమ్ముఁజూచి లజ్జావిషాదంబులు బాధింప నొదిగియున్న పుత్రికం గౌగిలించుకొని వియోగదుఃఖ మభినయించుచున్న యా బాలిక నూరడించెను. పదం వడి యా యుదంతమంతయుఁ బట్టణంబునఁ జాటింపంజేసి మంగళతూర్యములతో భద్రగజంబుపై వారి నెక్కించి యూరేగింపుచు నా రాజపంచాస్యుండు వారి నిరువురఁ దల్లులయొద్ద కనిపెను.
మందారవల్లి యుఁ గళానిలయము నవత్య దర్శనంబునం జేసి సంతాన వియోగ దుఃఖమునకు నానంద బాష్పోదకము ధారవోసి విడిచి వేసిరి. అప్పడు రాయలవారు కుముద్వంతునకు వసుంధరుని చారిత్ర మంతయు గూడముగాఁ దెలియ జేసి నా పుత్రికఁ గళావతి నీతనికి బెండిలిఁజేయ బూయచున్నాను నీవును గౌముదినిఁ గూడఁబెండిలిసేయుమని యుత్తరమువ్రాసెను. పిమ్మట రాయలవారు పట్టణమంతయు నలంకరింపఁజేసి శుభముహూర్తమున బెక్కు వైభవములతో వసుంధరునకుం గళావతి నిచ్చి వివాహము గావించిరి. ఆ కల్యాణము జరిగిన కొన్ని దినములకు కుముద్వం తుండును వసుంధరునిఁ దీసికొనిపోయి కౌముదితోఁ గూడ దనరాజ్యమతని యధీనము జేసి పట్టభద్రుం గావించెను.
వసుంధరుఁడును నిద్దఱి భార్యలతో సుఖింపుచుఁ బెద్దకాలమమహారాజ్యము పాలించెను. అని యెఱింగించి గోపా ! యీ కథవలన మందారవల్లి కళానిలయలలో నెవతె విద్వాంసురాలో తెలిసినదా ? యని యడిగిన వాడు నమస్కరించుచు స్వామీ ! మీరు చెప్పినం దెలియదా ! మందారవల్లి కొడుకునకే సమాధానము చెప్పలేక పరితపించిన కళానిలయ మందారవల్లి తో నెట్లు తులవచ్చును. అన్ని గతుల నప్పడతియే శ్రేష్ఠురాలని చెప్పెను.
మణిసిద్ధుండును వాని బుద్ధి విశేషమునకు మెచ్చుకొనుచు నుచితకాలంబున నటఁగదలి వాఁడు గావడియెత్తుకొని సడుచుచుండఁ దదనంతరావ సధమునకుఁ బోయెను. మంగళమహశ్రీవృత్తము
స్వస్తియగుఁగాత బుధజాతమున కెప్పుడు ప్రజావితతిభూపతతి ధర్మన్యస్త మతిఁబ్రోవుతఘనంబు గఘనంబులు చితావసరమందు నసువృష్టుల్ నిస్తులముగాఁ గవిభు నించుతధరాస్థలి ఫలించుత సుమంగళ మహాశ్రీ విస్తృత గతిన్సభివృద్ధిమనుగాత సురభివ్రజము వత్సవములతోడన్.
గీ. హవ్యవాహనగుణ వారణాంబుజారి
సంఖ్యనొప్పారు వరశాలిశకమునందు
దనరుచుండ విరోధికృద్వత్సరమున
దీని రచియించి ప్రకటించితిని ధరిత్రి
గద్య. ఇది శ్రీమద్విశ్వనాథ సదనుకంపాసంపాదితకవితా విచిత్రాయ
మునిసుత్రామగోత్ర పవిత్ర మధిర కులకలశ జలనిధి రాకాకు
ముదమిత్రలక్ష్మీనారాయణ పౌత్రకొండయార్యపుత్రసోమి
దేవీగర్భశుక్తిముక్తాఫల విబుధజనాభిరక్షిత సుబ్బన
దీక్షితకవివిరచితంబగు కాశీయాత్రావసథచరిత్ర
మను వచనప్రబంధమందు చతుర్థభాగము
సంపూర్ణము
శ్రీ శ్రీ శ్రీ