కాశీమజిలీకథలు/తొమ్మిదవ భాగము/195వ మజిలీ

వికీసోర్స్ నుండి

యతం డుపాయము చెప్పుటచే నూరకొంటిని. నాఁటి కందఱము నింటికిం బోయితిమి.

అని యెఱింగించి తరువాయి కథ యవ్వలి మజిలీ యందిట్లు చెప్పదొడంగెను.

195 వ మజిలీ.

విద్యావతికథ

విద్యావతి స్వయంవరసభ మిక్కిలి విశాలముగా నున్నది. శ్రేణులుగా గురుతులు వైచి పీఠము లమర్పించిరి. పద్మవ్యూహము దారివలె మధ్యపీఠము మొదలు గుండ్రముగా నామార్గము తిరిగి పీఠములన్నిటినిం దగిలి బైటకు వచ్చును. విద్యావతి వరించునని వచ్చువారందఱు తమతమ పేరులు నధికారము జాతి మొదలగు చరిత్రాంశముల ముందుగనే తెలియఁ జేయవలయునఁట. గురుతువైచి వారికి పీఠము లుంచుదురఁట. ప్రేక్షకులుగా వచ్చువారి కవి యేమియు నవసరములేదు. మూఁడవనాఁడు పదిగంటలకు సభ కూడినది.

దేవలోకములనుండి యక్షులు గంధర్వులు కిన్నరులు కింపురుషులు విద్యాధరులు లోనగు ప్రముఖులందరు వచ్చి సభ నలంకరించిరి. జయంతుఁడు నలకూబరుఁడు దిక్పతిపుత్రులు కావున వారికి వావులు కుదరమి రాలేదు. తక్కుంగల దిక్పతిపుత్రులును గూడ రాలేదు. వేల్పులు జాతివైరము దలంచి యుపేక్షఁ జేసిరి.

మాయింటి యజమానుని బలవంతమున నేనుఁగూడ దివ్యమాల్యాంగరాగానులేపనములతో నూత్నరత్నభూషాంబరాదుల ధరించి యాసభకుఁ బోయి ప్రేక్షకులు గూర్చుండుచోట నొకపీఠముపైనిఁ గూర్చుంటి.

అప్పు డాయోలగంబున వసించియున్న దేవయోనివిశేషుల వేషములం జూడఁ గన్నులకు మిరిమిట్లు గొలుపుచుండెను. గంట మ్రోగినది. సభాజన కలకల ముడిగినది. సభాంతరాళంబున నున్న తెర లాగఁబడినది. మబ్బు వెల్వడిన మెఱుపు తీగవలె మెరసి యాసరసిజగంధి సభ్యులకు నేత్రపర్వము గావించినది.

సఖీహస్తావలంబినియై ముందొక సఖురాలు వారివారి యుదంతము లెఱింగింపుచు మెల్లఁగా నడుచుచుండఁ దానును వారివారి సోయగముల వారచూపుల నాలోకించుచు నడుచుచుండెను.

సీ. ననల గంధర్వవంశప్రదీపవరుఁడు వి
                    శ్వావసుం డనువాఁడు వాఁడె చూడు
     మితఁడె చిత్రరథుండు మతిమంతుఁ డితఁడు తుం
                    బురుఁడు గానకళాప్రభూతయశుఁడు

    మాణిభద్రుఁడు వాఁడె మహిత యక్షాన్వయ
                జాతుండు రాజ రాజ ప్రధాని
    సకియ! విద్యాధరచక్రవర్తి యతండు
               ప్రధిత కిన్నరసార్వభౌముఁ డితఁడు
గీ. రమణీ! రక్షః కులాంబోధిరా జతండు
    సిద్ధవిభుపట్టి వాఁడె ప్రసిద్ధయశుఁడు
    తరుణి సాధ్యప్రభుప్రియతనయుఁ డతఁడు
    వారె చూడుము వసువు లంభోరుహాక్షి!

అని తత్సఖీరత్నము వారివారి కులశీలనామంబు లెఱింగింపుచుండ నాలించుచు నవ్వలికిఁ బొమ్మని కనుసంజ్ఞ జేయుచుఁ గ్రమంబున నెవ్వరిని వరింపక యా సభాచక్రంబున -

సీ. మేలిమిబంగారు మిసిమి మించెడు మేని
              నిగ్గులభూషాంశుల సిగ్గుపరుపఁ
    బట్టుపయ్యెద జమకట్టుపై మెఱయు ము
             త్యాలహారముల డాల్దన్ని యెగయఁ
    జీనాంబరంబు కుచ్చెళ్ళు మీగాళ్ళపై
            జేరి యందంబుగాఁ జిందులాడ
    వ్రేల్ముడితో వ్రేలువెండ్రుకల్ వీపుపై
            మొగులు గ్రమ్మినట్లు సొగసుఁ జూప
గీ. నంఘ్రిమంజీరములు ఘల్లుమనుచు మ్రోయ
   జేతఁ గైదండఁ గైకొని చెలియయోర్తు
   ముందు నడువంగఁ దిరిగె నమ్మోహనాంగి
   యరసి ముమ్మారు తత్సభాంతరమునందు!

అందెవ్వరిని వరింపక క్రమంబున మే మున్నదెసకు వచ్చి యెప్పుడో పరిచయము గలదానివలే నావంక యెగాదిగఁ జూచి చూచి జ్యోత్స్నామంజరులు విసరునట్టు నా మొగముపైఁ దళ్కుచూపులు వ్యాపింపఁజేసినది. అప్పుడు నాకు మేనఁ గంపము గలిగినది. లజ్జావిభ్రమముల కాయత్తమగు చిత్తముతోఁ దత్తరమందుచున్న సమయంబున నయ్యంబుజాక్షి మన్నికటంబున కరుదెంచి మొగంబున మొలకనవ్వులు వెలయించుచుఁ జెలికేలనున్న పుష్పధామం బందిపుచ్చుకొని నామెడలో వైచినది.

స్వప్నమందైన నాకట్టిభాగ్యము పట్టునని తలంచుకొనలేదు, అప్పుడు సభ్యులెల్లఁ గరతాళములు వాయించిది. యక్షుఁడా? సిద్ధుఁడా? గంధర్వుఁడా? రాక్షసుఁడా? యితఁ డెవ్వఁడనువారును, ఎవ్వఁడైన నేమి? ఆరు పరం గావించి వచ్చెననువారును అఖిలపరంబు గావించి వచ్చెననువారును, రాజపుత్రిక పేరులేనివాని వరించిన నేమనువారును స్త్రీలకు స్వతంత్ర మిచ్చిన నిట్లే జరుగుననువారును, తలయొక మాటయుఁ బలుకకఁ జొచ్చిరి. ఆ పాటలగంధి యేమాటయు వినిపించుకొనక మెఱపుతీఁగె జలదమం దంతర్థానమైనట్లు నా మెడలో దండవైచిన యాక్షణమ శిబిక యొక్క యంతఃపురంబున కరిగినది.

ఆ వెంటనే యావాల్గంటి చెలికత్తియలు మొత్తములుగా వచ్చి నా కనేకోపచారములు గావింపుచు నాకాంతామణి శుద్ధాంతమునకుఁ దీసికొనిపోయిరి. వయస్యా! నాకం దాసుందరులు గావించిన విందులు ముచ్చటలు వినోదములు కేళీసౌధంబున నేనా నాళీకవదనతోఁ గలసి మెలసి గావించిన క్రీడావిశేషములు క్రమంబునఁ జెప్పినఁ పదిదినములు పట్టును. ఇప్పుడు ప్రొద్దు చాలదు. వేఱొకప్పుడు చెప్పెదంగాక తరువాయి వినుము.

ఆ దనుజభర్త తనకూఁతురు నన్ను భర్తగా వరించినదని విని నే నెవ్వఁడనో తెలిసికొను తలంపుతో నాయున్న యునికి కరుదెంచి యర్చితుండై యిట్లనియె. సౌమ్యుఁడ! నిన్నుఁజూడ వేల్పువు కానట్లు తెల్లమగుచున్నది. నీవు మనుష్యుఁడవు. ఈ దేవలోకంబున కెట్లు వచ్చితివి? తపఃప్రభావముననా? వరప్రభావముననా? నీ యాకారవిశేష మాభిజాత్యము సూచింపుచున్నది. నీవు నా కిప్పు డల్లుఁడవైతివి. కావున వెరవుడిగి నిజము దెలుపుమని యడిగిన నేను నమస్కరింపుచు నిట్లంటిని.

దానవోత్తమా! మీకడఁ గూడ యదార్థముఁజెప్పక మానుదునా? వినుఁడు. నేను భూలోకచక్రవర్తియగు నింద్రమిత్రుని కుమారుండ. జగన్మోహనుఁడనువాఁడ. నాకుఁ జిన్నతనము నుండియు నక్షత్రములన నెట్లుండునో తెలిసికొన నభిలాష గలిగియుండెను. సిద్ధవ్రతుడను సన్యాసిమూలమున నిల్లు వదలి కాశీగంగ దాటుచు నీటిలోఁ బడిపోయి నీటిలో జపము జేయుచున్న యొక సిద్ధుని యనుగ్రహమున నట్టిశక్తి సంపాదించి తేజోలోకముఁ జేరి యందు మూఁడుదినములు తీర్థశుల్కతోఁ గ్రీడించి యటం గదలి తపోలోకమునకుఁ దీర్థశుల్క వెంటరాఁబోయి యందు దివ్యపురుషుఁడై సుఖించుచున్న సిద్దవ్రతుం గలిసికొని మాటాడి భూలోకమునకుఁ బోవు నుపాయముఁ దెలియక యింద్రునికి వెఱచి మీలోకమునకు వచ్చితిని. దారిలో నలువురు రాక్షసులు మిత్రుల వలె వచ్చి నాభార్య నెత్తికొనిపోయిరి. ఆవార్త మీకెఱింగింప వలయునని వచ్చి మీ కుమార్తెచే వరింపఁబడితినని నా వృత్తాంత మింతయేని కొఱతఁ బుచ్చక యంతయుం జెప్పితిని.

నా యుదంత మంతయు విని యాతండు ముక్కుపై వ్రేలిడికొనుచు నీ నాటకమునకు సూత్రధారుఁడవు నీవా? బాబూ? తప్పొకరుచేయ నపరాధము రక్కసులపై బడినది. కానిమ్ము; ఎట్లయినను నాలోకమున నిట్టిదురంతచర్య జరుగుట యపకీర్తి హేతువు. అని పలుకుచుండఁగనే ద్వారపాలకులు వచ్చి దేవా! నమస్కారం. రసాతలవాసులగు నసురులు నలువురు తీర్థశుల్క నెత్తికొని పోవుచుండ దారిఁగాచి దేవదూతలు వారిం బట్టుకొని కట్టి తీర్థశుల్కతోగూడ నిక్కడికి దీసికొనివచ్చిరి. ద్వార మున నున్నవారని తెలిసినంత నే ననుగమించి వెంటరా, నిరృతి యతిరయంబున హజారమునకు జని యందున్న రక్కసులను దేవదూతలం జూచి వీరెక్కడ దొరకిరని యడిగిన నా దేవదూత లిట్లనిరి.

నిరృతి మహారాజా! తీర్థశుల్కను రక్కసులే యెత్తకొని పోయిరని నిశ్చయించి మహేంద్రుడు పుణ్యలోకములకెల్ల గాపుపెట్టించి మీలోకము చుట్టును దిఱిగి పరిశీలింపుచుండుడని పెక్కండ్ర దేవభటుల కాజ్ఞాపించి యున్నాఁడు.

మేము కొందఱము పాతాళముకు బోవు మార్గములో గాచికొనియుంటిమి. వీండ్రీ తెఱవ మొఱవెట్టుచుండ సీతను రావణుండువోలె నీదుర్దముండు భుజముపై నెక్కించుకొని వీరు మువ్వురు వెంటరాఁ బాతాళలోకమున కేగుచుండఁ బట్టుకొని రెక్కలు విరిచికట్టి మీకడకు దీసికొనివచ్చితిమి. వీండ్రను మీరే శిక్షింతురా? మహేంద్రుఁ నొద్దకు దీసికొనిపోదుమా? అని యడిగిన నతం డిట్లనియె.

మీరు చేసిన పనికి జాల సంతోషమైనది. వీరిని నేనే శిక్షించెదను. తీర్థశుల్కను వెనుకనుండి పంపించెద. మీరిప్పుడు పొండని చెప్పునప్పటికి నాగుండె నిలఁబడినది. తీర్థశుల్కను వారివెంట బంపివేయు నేమోయని తటతట లాడుచుంటిని. ఒండొరుల మొగము జూచికొని కన్నీరు గార్చుచుంటిమి. దేవదూతలు నిరృతి సెలవుపొంది యఱిగిన తరువాత నతఁ డామెను దన కూఁతు నంతఃపురమున కనిపి యా రక్కసుల కెక్కుడు శిక్షవిధించి యేకాంతముగా నన్నుఁ జేరి యిట్లనియె.

మోహనా? నా కూఁతురు దేవతల విడిచి మనుష్యుఁడవైన నిన్ను వరించినదని రాక్షసు లాక్షేపించుచున్నారు. అందుల కించుకయు నేను జింతింపను. తీర్థశుల్కకు నీకు నెట్టిసంబంధము కలదో ఇదియు నట్టిదేయని తెలిసికొమ్ము. ఇఁక నీ యొద్ద దాచనేల? నా పుత్రికను నిట్టివాని వరించితివేల యని గట్టిగాఁ నిర్బంధించి యడుగఁగా జిట్టచివఱ కది యున్నగుట్టు జెప్పినది. వినుము. తాను వెనుకటిజన్మమున భీమసేనుడను పుడమిఱేని కూఁతురు జంద్రికయనుదాని ననియు గాశీనికటంబున గంగాగర్భంబున మృతినొందిన పుణ్యవిశేషంబున నీ పట్టినై పుట్టితిననియు మరణసమయంబున నా జగన్మోహనుడే పతి గావలయునని కోరికొంటిని. కావున విశ్వనాధుండే వాని నిచ్చటి కంపె. నతనినే వరించితి నని సమాధానముఁ జెప్పినది. నీవు జెప్పినవృత్తాంత మాయుదంతమునకు సరిపడినది. ఇది దైవసంకల్పితము. దైవఘటనములఁ దప్పింప నింద్రాదులకు శక్యముకాదు. తీర్థశుల్కయు విద్యావతియు దొల్లిటిజన్మంబున యోగినులై యీ జన్మంబున నిన్ను బతిఁగా బడసిరి. ఇది కాశీతీర్థసంసేవన గలిగిన ఫలము.

భూలోకంబునఁ గాశీపురంబు సేవించిన వారికి గల్పవృక్షము వలెఁ గామితము లీడేర్చుచుండ మనుష్యులకుఁ గొదవయేమి యున్నది? అట్టి పుణ్యక్షేత్రంబు భూమధ్యంబున గలిగియుండ మానవులు యమలోకంబున కేల బోవలయునో తెలియకున్నది. ఒక్కసారియైనఁ గంగలో మునింగి విశ్వేశ్వరు నర్చింపరాదా! కానిమ్ము. అది పూర్వపుణ్యవిశేషంబునం బట్టి యుండును అని మఱియు నిట్లనియె.

రాజపుత్రా! నీ యిరువుర భార్యలను వెంట బెట్టుకొని భూలోకంబునకుం బోయెదవా? ఇందే యుండెదవా? నీ యభిప్రాయమేమని యడిగిన నే నత్యంతసంతోషము జెందుచు వందనపూర్వకముగా నిట్లంటి.

మహాత్మా! దేవలోకము లెట్టివైనను పుట్టిన దేశమం దభిమాన ముండకపోదు. నానిమిత్తమై జననీజనకులు పరితపించుచుందురు. మిత్రులు విచారించుచుందురు. మీ లోకమున కప్పుడప్పుడు వచ్చున ట్లనుగ్రహింపుఁడు. మీ కూఁతురు విద్యావతి యిందే యుండగలదు. నేను బోయివచ్చెద నానతీయుఁడు అని వేడికొనిన నతం డోహో! అది యట్లంగీకరించునా? ఆ మాట నే నిదివరకే చెప్పితిని. ఒప్పుకొన్నదికాదు. నీతో భూలోకమునకు వచ్చునఁట. ఈ వాద మంతయు నింతకుముందు మా యింట జరిగినది. సరే నీ విప్పు డీ యిద్దరి భార్యలతో భూలోకమునకు బొమ్ము. దక్షిణనాయకుండవై సుఖింపుము. వలయునప్పుడు వచ్చునట్లు విద్యావతికి చెప్పి పుచ్చెద నట్లు చేయుచుండుము. నీవు చూడ నాదిత్యునివలె నిత్యయౌవనుఁడవు చిరకాలజీవివి యగునట్లు దేవేంద్రు నడిగి యమృతము సంపాదించి యంపెదను. నియమితచిత్తుండవై దానిం ద్రావుము. అని బోధించిన విని మహాప్రసాదంబని యమ్మాటల కంగీకరించితిని. మఱియు వారి యనుమతిఁ బదిదినంబులందు విద్యావతితో దివ్యోపభోగసుఖంబు లనుభవించితిని.

మఱియొకనాఁ డా సోకులఱేడు కనకరత్నప్రబాథగద్దగితమై కాంచనకేతువిరాజమానమై కింకిణీఘంటారవమనోహరమై యొప్పునొక్క విమానంబు దెప్పించి మమ్ము రప్పించి యందుఁ గూర్చుండంజేసి యెందు బోదలతురని యడిగిన నే నిట్లంటి.

ఉ. ఏమహనీయ పట్టణ సమిద్ద మహత్వమునన్ లభించె మా
    కీముద, మెందు విశ్వపతి యిందు కళా మకుటుండు నన్న పూ
    ర్ణామదిరాక్షితో బుధజనంబుల కోరిక లిచ్చుచుండు, నే
    గ్రామము పొంతఁబారు సురగంగ మహాఘ విభంగ యేపురీ
    సీమ నొడల్ త్యజింతురు భజింతురు లోకసుంద రా
    రామమణీగృహాంతరవిరాజితసౌరవధూకుచోపగూ
    ఢామితభోగభాగ్యముల నట్టి మహోజ్వలరాశి కాశి సు
    శ్రీ మణికర్ణికాతటముచెంత వసింపఁగ జేయవే మమున్.

అని కోరుటయు నద్దనుజకులభూషణుండు మమ్ముందు దింపి రమ్మని యిరువుర కింకరుల కాజ్ఞాపించుటయు వారు విమానము నుగ్గరంబున నిలువంబడి భూమికి దింపుచున్న సమయంబున౼

సీ. తొలుత మాకీ ధరాతలమెల్ల నల్లని
              కమలినీదళమట్లు కానుపించె
    రానురా నీల సాంద్రచ్చాయ నొప్పియా
              కాశమండలమట్లు కనిపించె
    నంతలోఁ జూడగ నంబుధుల్ జెరువులు
              నదులు దారముల చందమునఁ దోచె
    వీక్షింపఁబడె మహోర్వీధరారణ్యపు
              రస్తోమములు బర్భములు గాఁగ

గీ. నంతలోఁ గానఁబడియె దివ్య స్రవంతి
    చెంత నత్యంత రమణీయ శిఖరగోపు
    రాల యోన్నత మంటపంబైన కాశి
    కాపురంబంత మణికర్ణికా తటంబు.

అప్పటికిఁ గనుచీకటి పడుచుండె. నొరు లెఱుంగకుండ మమ్మిందు దింపి విమానముతోఁగూడ నిరృతి కింకరు లంతరిక్షమున కెగసిపోయిరి. మేమును మెల్లఁగ నటఁగదలి వీథుల నిడిన దీపముల నడుచుచు విశ్వేశ్వరుని యాలయమునకుఁ బోయి ప్రదక్షిణపూర్వకముగా గుడిలోనికిం జని స్వామిని సేవించి యారాత్రి కాకోవెల మంటపములోఁ బండుకొని వేకువజామున లేచి తిరిగి యీగృహం బద్దెకుఁ దీసికొని యిందు వసించితిమి. నేటి యుదయంబున నీ జవరాండ్రు గంగాస్నానంబున కరుగుటయు దేవకన్యకలని పలుకుచు జనులు మూగుచుండిరి. ఆవింతఁ జూచియేకదా? నీవును వచ్చితివి. ఆ గదిలో నున్నవారే తీర్థశుల్కయు విద్యావతియు. నిదియే నా వృత్తాంతము నీవిందు వత్తువనియే విశ్వేశ్వరుని యాలయము గోడ ప్రక్కనొక విగ్రహముక్రింద నొక పద్యము వ్రాసితిని. చూచియే యుందువు, నాపోక విని నా తలి దండ్రు లేమనిరి? అక్కడ విశేషము లెఱింగింపుమని యడిగిన సిద్ధార్థుఁ డిట్లనియె.

ఆహా! మోహనా! సంకల్పసిద్ధుఁడ వనిన నిన్నే చెప్పవలయును. నీ సంకల్పము విని నిన్నుఁ బిచ్చివానిగాఁ గణించితిని. మనుష్యకోటిలో నీయట్టి యదృష్టవంతుఁడు లేఁడు. దివ్యలోకముల జూచి వచ్చితివి అప్రతిమాన రూపసౌందర్యాభిరాసులగు రానులం బెండ్లియాడితివి. ఇంతకన్న జన్మమునకుఁ గావలసిన దేమియున్నది? నీవు మిగుల ధన్యుఁడవని పొగడెను. ఆ దివసము తత్కథాలాపములతో వెళ్ళించిరి. వారు మఱునాఁడు గంగస్నానము జేసి యథావిధి తీర్థ దేవతల నారాధించి విశ్వేశాది మహదేవలింగంబుల సహస్రనామముల నర్చించుచు భక్తిపూర్వకముగా స్తుతించుచు మహానందముతో నారాధించిరి. మోహనుఁడు తలిదండ్రులఁ జూడ నుత్సాహ పడుచు తనదేశమునకుఁ బ్రయాణమగుడు సిద్ధార్థుండు తాను గొన్నినాళ్ళు కాశీపురంబున వసింతుననియు భార్యలతో నీ వింటికిం బొమ్మనియు నతనితోఁ జెప్పినంత నంగీకరింపక వానినిగూడ నింటికిరమ్మని బలవంతపరచెను. సిద్ధార్థునికి హృదయంబున నొకవిధమగు విచార మంకురించినది. మోహనుని భార్యల సౌందర్యములు తలఁచి యాహా! అట్టిభార్యలు లేనివాని బ్రతుకేమియని చింతించును. మోహనునియందు నసూయలేదు కాని తన కట్టివైభవము పట్టినది కాదని ధ్యానించుచుండును. మోహనుండును ఎరమరికలు లేకుండునట్లు తనభార్యలచే నతని కుపచారములు సేయించుచుండెను. వారిం జూచినంత వానిచింత మఱింత హెచ్చుచుండెను.

సీ? నాదొక జన్మమే? నేను మోహనునితో సమానముగాఁ బెరిగితిని. సమానముగాఁ జదివితిని.. బుద్ధిబలంబున సమానుడఁ ననిపించుకొంటిని, వాఁడు తపస్వి వెంట దేశాంతర మరుగచుండ ననదవలె నింటికడ వసించితిని. ముసలమ్మవలె వృద్ధదంపతులఁ గనిపెట్టుకొని యుంటిని.

వీఁడున్నట్లె యుండి పోయినట్లె పోయి దివ్యభోగము లనుభవించి దివ్యకన్యల స్వీకరించి వచ్చెను. వాని పుణ్య మట్లున్నది. నాకర్మ మిట్లున్నది. సంపాదింపవలె లేకున్న నీగంగలోఁబడి చావవలయును. ఇంటికిఁ బోయి వానివెంట వెంటఁ దిరుగుచు వాని భార్యలం జూచి యువ్విళ్లూరిన డెందముతోఁ గొందల మందనేల? దాని ననుగ్రహించిన సిద్ధుండు నన్నేమిటి కనుగ్రహింపఁడు. అతం డుండుచోటు గురుతు జెప్పెను గదా? పోయి చూచెదంగాక యని మనంబున నిశ్చయించుకొని మోహనునితోఁ గొన్ని పయనములు పోయినట్లే పోయి యొకనా డెవ్వరికిం దెలియకుండఁ గాశీపురంబునకుఁ బారిపోయెను.

నాఁటి ప్రయాణసమయంబున మోహనుండు సిద్ధార్థుం గానంపరితపించుచు వెదకుచుండ మీవార్త ముందుగా మీ తలిదండ్రుల కెఱింగింప మహేంద్రనగరంబున కరిగెనని పరిజనుం డెవ్వఁడో చెప్పఁగా నిజమనుకొని యతండు హుటాహుటి పయనంబుల మహేంద్రనగరంబున కరిగెను.

ఇంద్రమిత్రుఁడు కాశీపురంబు నుండి సిద్ధార్థుఁడు వ్రాసినజాబు చూచినది మొదలు రాజ్యతంత్రములు మంత్రి యధీనముఁ జేసి పుత్రవియోగచింతాక్రాంతస్వాతుండై భార్యతోఁగూడ నిద్రాహారములు సేయక మంచము పట్టియుండెను.

అప్పు డెవ్వరో వచ్చి నీపుత్రుం డిరువురు భార్యలతో మహావైభవంబున వచ్చుచున్నాఁడని చెప్పినంత నత్యంతబలసంపన్నుండై యేమేమీ? నా మోహనుఁడే వచ్చుచున్నాఁడా? సిద్ధార్థుఁ డెఱింగించిన విషయ మసత్యమా యేమి? అని యాలోచించుచుండఁగనే మోహనుఁడు వచ్చి యతనిపాదంబులం బడి నమస్కరించెను.

నా కన్నతండ్రి వచ్చెనాయని లేచి గ్రుచ్చి యెత్తి యానందబాష్పములచేఁ గన్నులు నిండింపఁ బడ డగ్గుత్తికచే మాటాడలేక పెద్దతడ వూరకుండి వత్సా! నీ మిత్రుఁడు నీపై లేనిపోని నిందలు వ్రాసెనేమీ? వాఁడు వచ్చెనా? ఎందుఁ బోయితివి తండ్రీ అని యడిగినఁ గుమారుం డిట్లనియె.

తండ్రీ! నాగాథ చాల పెద్దది. తరువాత నెఱింగించెదఁగాని నామిత్రుఁడు ముందిందు రాలేదా? అయ్యో? వాఁడు మఱలఁ గాశికి బోయెం గాఁబోలు. వానికి విరక్తి గలిగినదని తలంచుచుఁ దల్లికడకుఁ బోయి కోడండ్రఁ జూపి మ్రొక్కించి చుట్టముల నడిగి బంధువుల నాదరించి సిద్ధార్థుని తలిదండ్రులకడకుఁ బోయి నమస్కరించి యిట్లనియె.

నా మిత్రుఁడు నాకొఱకు చాల కష్టపడియెను. కాశీపురము వదలి రాననిన బలవంతమున వెంటఁబెట్టుకొని వచ్చితిని. దారిలో మాకుఁ గనంబడలేదు. మీకీవార్తఁ దెలుపుటకు నింటికి వచ్చె ననుకొంటిమి వాఁడు కాశీపురంబునకుఁ బోయియుండు. నేనందుఁ బోయి తీసికొని వచ్చెదనని తననేమముఁ దెలుపుచు వారి నూరడించెను.

వారతని రాకకు సంతసించుచుఁ గుమారుని వియోగమునకుఁ బరితపించుచు నుండిరి. ఇంద్రమిత్రుఁడు కుమారునికి వెంటనే పట్టాభిషేకము సేయఁదలఁచి యా సంతోషవార్త మంత్రిముఖముగా వానికి దెలియఁజేసెను. సిద్ధార్థుఁ డింటికి వచ్చినంగాని యేపనియుఁ జేయనని ప్రత్యుత్తర మిచ్చెను. సిద్ధార్థుని కొఱకుఁ బెక్కండ్రు దూతలఁ గాశీపురంబున కనుపుచుఁ జంద్రిక తండ్రియగు భీమవర్మకుఁ దమరాక దెలియున ట్టుత్తరము వ్రాసి యిచ్చెను. మిత్రవియోగశోకంబున మోహానుఁడు భార్యలతో నాప్తులతోఁ దిన్నఁగా మాటాడక తన పోయి వచ్చిన వృత్తాంతముఁ జెప్పక కాలక్షేపముఁ జేయుచుండెను. ఒకనాడు సిద్ధార్థుని దీసికొని వచ్చుటకు మోహనుఁడు పయనం బగుటయు రాజప్రధాను లిద్దరు వచ్చి యాటంకపఱచుచు మేమే పోయి వానిం దీసికొని వత్తుమని చెప్పుచు మఱల మఱికొందఱ వారువపురౌఁతుల వారణాశీపురంబున కనిపిరి.

మోహనుఁ డేమియుం దోచక యొకనాడు ప్రొద్దున్న గుఱ్ఱమెక్కి నగర ప్రాంతకాంతారమునకు విహరింప నరిగెను. ఒకచో నొక వింతయైన రంధ్రములు గల మందసము గనంబడినది. అది యేమియో యని యాలోచించుచు గుర్రమును నిలిపి అందేమి యున్నదో చూడుమని తనవెంట వచ్చిన పరిజనుల కాజ్ఞాపించెను.

వాఁడు దానిప్రక్కకుఁ బోయి యటు నిటు చూచి బాబూ! ఇది బోనువలె నున్నది. దీనిలో మనుష్యుఁ డున్నాఁడు. ఇక్కడి కెట్లు వచ్చినదో తెలియదని తెలిపినఁ దటాలున గుర్రము దిగి యతండు వంగి తొంగిచూచి ప్రాణావసిష్టుఁడైయున్న యొక పురుషుం గాంచి నీ వెవ్వఁడ నిందెట్లు పడి యుంటివని పెద్దయెలుంగున నడిగిన హీనస్వరముతో నన్నీ బోనునుండి యవ్వలికిఁ దీయించిన నంతయుం జెప్పెదనని ప్రతివచన మిచ్చెను.

అప్పుడతండు దానిం బగుల గొట్టించి చూడ సిద్ధార్థుండే యందుండెను. అతని గురుతుపట్టి రాజపుత్రుండు అయ్యో! మిత్రుఁడా! యిందుంటివేల? నిన్నిందుఁ బెట్టినవారెవ్వరు? ఇంత చిక్కితివేల? నీవృత్తాంతముఁ జెప్పుమని పలుకుచు నతని మెల్లన లేవనెత్తి తదవస్థకు దుఃఖించుచు మెల్లన గుఱ్ఱముపై నెక్కించి తాను గళ్లెముఁ బట్టుకొని గుఱ్ఱమును నడిపించుచు నింటికిం దీసికొనిపోయి పరుండఁబెట్టి యెవ్వరితో మాటాడనీయక తానే వాని కుపచారములు సేయఁబూనెను. సిద్ధార్థుఁడు చచ్చినంత పాటుపడి వచ్చెనని పట్టణమంతయుఁ జెప్పుకొనుచుండెను.

అతని రాకవలన దలితండ్రులే కాక ప్రజలందరు నుత్సవములు సేయఁ బూనిరి. నాలుగుదినములకు సిద్ధార్థునకు మాటాడుటకు సామర్థ్యము కలిగినది అప్పుడు రాజపుత్రుఁడు రహస్యముగా నీకీబంధనప్రాప్తి యెట్లు కలిగినదో చెప్పుము. అని యడిగినఁ గన్నీరుఁ గార్చుచు సిద్ధార్థుం డొక రహస్యప్రదేశమునఁ గూర్చుండఁబెట్టి తనకథ నిట్లు చెప్పదొడంగెను.

196 వ మజిలీ.

మండోదరికథ

ఉ. ఎవ్వఁడు తొంటిజన్మమున నెట్టితపోవ్రతదానధర్మముల్
     నివ్వటిలంగఁ జేయునొ ఫలించును తత్సమభోగభాగ్యముల్
     నివ్వెఱఁ బూర్వపుణ్యములు లేక దివంబున కేగ మేరువుం
     ద్రవ్వి శిరంబుమీఁద నిడిన న్బరువై పడుఁ గాక నిల్చునే.

వయస్యా! ముందుగా నీకు నా యుదంతమును బోలినచిన్నకథ యొక్కటి చెప్పెద నాకర్ణింపుము.

మాంగళిక యను గ్రామంబునఁ బింగళకుండను కాఁపు కాపురముఁ జేయుచుండెను. వాని కెందరేని పిల్లలు గలరు. తినఁ గూడులేదు. విప్పచ్చరము బాధింపఁ బిల్లలం బెనుప నేయుపాయంబు దోపక యడవికిం బోయి కట్టెలం తెచ్చి గ్రామములో నమ్ముచు దాన వచ్చినసొమ్మునఁ బొదుపుగాఁ గుటుంబమును బోషించుకొనుచుండెను.

ఒకనాఁడు వాఁడు వేకువజామున లేచి గొడ్డలి భుజముపై నిడుకొని పొలమునకుఁ బోవుచుండఁ జినుకు జినుకుగా నుండియుండి క్రమంబున బలసి ధారాపాతముగా వర్షము గురియఁ జొచ్చినది. వాఁ డాయడవిలోఁ దిరుగుచుండ దారునిగ్గితమైన యొక యమ్మవారున్న చావడి గనంబడినది. అందు నిలుచుటచే వానికి వర్షబాధ యంతగాఁ గలుగలేదు. కాని మఱియొకబాధ హృదయంబున నావిర్బవించినది.

అక్కటా? ఈవానకుఁ దుది గనంబడదు. వలసిన దారువులన్నియుఁ దడిసినవి. మధ్యాహ్నము కావచ్చినది. ఒక్కకట్టెనైను సమకట్టలేకబోయితిని. నేఁడు కావడి తీసికొనిపోక యూరక యింటికిఁ బోయినఁ బిల్లల కన్న మెట్లు దొరకును. పిల్ల లన్నమునకై యేడ్చుచుండ నాభార్య నారాక కెదురుటచూచుచుండును. ఏమిచేయుదు దైవమా? యని ధ్యానించుచు దారుస్థంభముగా నిల్వబడియున్న యమ్మవారింజూచి మురియుచు నిట్లు తలంచెను.