Jump to content

కాశీమజిలీకథలు/తొమ్మిదవ భాగము/191వ మజిలీ

వికీసోర్స్ నుండి

డని యడిగిన వాండ్రు విమర్శించి దేవా! ఆ బాలయోగి మిగుల జక్కనివాఁడు. వారి వెంటనున్న వాల్గంటి మంచి యందగత్తె. వా రిందెవ్వరును గారని చెప్పిరి. రాజు వారి నెల్ల బంధవిముక్తులఁ గావించి పోపొండు. మా దేశము విడిచి పొండు. సన్యాసి పురుగు మా విషయమున నుండఁగూడదు. అని యాజ్ఞాపించి వారినెల్ల విడిపించి యంతఃపురమునకు వచ్చి భార్య కత్తెఱం గెఱింగించెను.

ఆమె నాథా! చంద్రిక బుద్ధి యెంత చెప్పినను దిరుగకున్నది. తనమూలమున నా సన్యాసులఁ బట్టించితిరని విని యురిఁ బోసికొనుటకు బ్రయత్నించుచున్నది. వారి విడిపింతునని బ్రతిమాలికొని వచ్చితిని. నగ లన్నియు దీసి పారవేసినది. జల్తారుచీర లన్నియుఁ బంచి పెట్టుచుండ వారించినఁ జించిపారవేసినది. కాషాయాంబరధారిణియై యోగినీవేషము ధరించినది. నిద్రలో సన్యాసులఁ బలవరింపుచున్నది. వాండ్రు దీని మంత్రబద్ధం జేసిపోయిరి కాబోలు? ఇందులకుఁ బ్రతితంత్రవేత్త లెవ్వరయిన నుండిరేమో రప్పింపుఁడు వాండ్రు నిన్ను మోసముఁ జేసి తీసికొని పోవుచున్నారని యెంతఁ జెప్పిన నొప్పుకొనదు. వారు మహానుభావు లనియు నేయంత్రము వేయలేఁదనియు నాతని రూపమే తనకు మోహనయంత్ర మైనదనియు నాతండే భర్తగ బ్రహ్మ లిఖించెననియు వాదించుచున్నది. అయ్యయ్యో? ఇప్పుడేమి చేయుదము? అది మనమాట వినదు. అన్నింటికిం దెగించి యున్నది. మనము నిర్బంధించిన బలవంతమునఁ జావఁగలదు. పోనిండు. ఆ బాలయోగి నిందు రప్పింపుఁడు. ఇందే యుండఁగలఁడని పలికినంత నతండు ప్రళయకాలమేఘమువలె బొబ్బ పెట్టి ఎట్టిమాట పలికితివి? నీ స్త్రీ చాపల్యమూరక పోయినదికాదు. అది చచ్చినం జచ్చుఁగాక. గట్టిగా రట్టుజేసిన దానిం గూడఁ గట్టి పారవేయించెదఁ గులము చెడఁబుట్టినది. ఈ విషయమయి దయఁదలచనని చెప్పుమని పలుకుచు నతండు తన మందిరంబునకుంబోయెను. రాజపత్నియు దుఃఖించుచుఁ గూఁతునొద్దకుఁ బోయినది.

191 వ మజిలీ.

కాశీప్రభావము

దైవజ్ఞుండగు సిద్ధవ్రతుండు నాఁటి వేకువజామున మఠమునుండి బయలుదేరి శిష్యులతోఁగూడ నుత్తరాభిముఖుండై యరుగునప్పుడు మోహనుండు మహాత్మా! నీ వసత్య మాడని వాఁడవుగదా. ఆ రాజపుత్రికతో నెల్లుండివఱకు నిందుండెదనని చెప్పి యప్పుడే బయలుదేరితి రేల? కపిల రాక కనుమోదించి యామె నట్లు వంచించితి రేమి? అని యడిగిన నయ్యోగి యిట్లనియె.

మోహనా! కపిలమూలమున మన కపఖ్యాతి చాల గలుగుచున్నది. బలశాలివి నీ వడ్డుపడబఁట్టి మేము బ్రతికితిమిగాని లేనిచో నాఁడు రెడ్డిచేతనున్న దుడ్డుకఱ్ఱచేఁ జావక పోపుదుమా? ఆ యాపద యెట్లో దాటినది. అగ్గి నొడి గట్టినట్లు మఱలఁ జంద్రికను వెంటబెఁట్టుకొని వచ్చితిమేని యాఱేడు మనలం బొలిమేర దాటనిచ్చునా? అందులకై కపటముగా దాని సాగనంపి లేచి వచ్చితిని. నీకు నా కన్నియం బెండ్లి యాడవలయునని యున్నచో వెనుకకుఁ బొమ్ము. అని పలికిన నతం డిట్లనియె.

స్వామీ? మాటవరుస కట్లంటిని. ఆ వాల్గంటి మన వెంట వచ్చిన నా ముందరికార్యమున కంతరాయము గలుగఁగలదు. మొదట నాకుఁ గపిల రాకయే యిష్టములేదు. చంద్రిక నెట్లంగీకరింతునని పలుకుచు నడుచుచుండెను. వారు వినోదముగాఁ జంద్రిగా వృత్తాంతమే చెప్పుకొనుచు మఱి నాలుగు పయనములు జరిపినంత నొకనాడు చంద్రిక చంద్రికారుచులు గేలిసేయు వారువము నెక్కి వాయువేగంబున వారిం గలిసికొనినది.

గుఱ్ఱము డెక్కలచప్పుడు విని వారెవ్వరో యని యాదెసఁ జూచుచుండఁ జెంతకు వచ్చి గుఱ్ఱము దిగి మహాత్మా! నేను మీ శిష్యురాలను చంద్రికను. మీసెలవు ప్రకారము యోగినీ వేషము వైచికొని వచ్చితినని పలుకుచు నా యోగికి నమస్కరించినది. మోహనునికి మ్రొక్కినది. కపిలం గౌఁగలించినది. అందరు విస్మయముతోఁ జూచుచుండ సిద్ధవ్రతుం డౌరా! చంద్రికా! నీ సాహసము, మీ వారికిఁ జెప్పివచ్చితివా? చెప్పకుండా వచ్చితివా చెప్పు మనవుఁడు నా జవరా లిట్లనియె.

స్వామీ! మీరు నన్ను మోసముఁ జేసి నాఁడే వచ్చితిరి గదా! అదియే మేలయినది. త్రికాలవేదులగు మీకుఁ దెలియని విషయము లుండునా? పాప మందుఁ గల సన్యాసుల నెల్ల జెఱసాలం బెట్టించి రెండు దినములు బాధించి మీరు కారని విడిచివేసిరి. మా తండ్రి నన్నుఁ బెద్దగా నిర్బంధించెను. నేను జచ్చుటకు నిశ్చయించికొనియుండఁ దెలిసికొని మా తల్లి రహస్యముగా గుఱ్ఱ మెక్కించి పంపివేసినది ఎట్లయినఁ దల్లికున్న ప్రేమ తండ్రి కుండదు. ఎందైనం బ్రతికియుండినం జాలని యామె యభిప్రాయము. మీ జాడలు తెలుసుకొనుచు గుఱ్ఱమెక్కి వాయువేగంబున వచ్చి మిమ్ముఁ గలసికొంటినని తన వృత్తాంతమంతయుఁ నెఱింగించెను.

అప్పు డాయోగి కపిలకువలెనే యామెకుఁగూడ నొక మంత్ర ముపదేశించి వెంటఁ బెట్టుకొని పోవుచుండెను. వారట్లు పోయిపోయి కొన్ని దివసంబులకుఁ గంగానదీప్రాక్తటంబుఁ జేరిరి. అప్పుడే సూర్యోదయ మగుచుండెను. అది వర్షకాలమగుట గంగానది నింగి పొడవునఁ బొంగి ప్రవహించుచున్నది. వారు కాల్యకరణీయంబులు తీర్చుకొని రేవుదాట నోడకొఱ కెదురు చూచుచుండిరి. అక్కడికిఁ గాశీపురంబంతయుఁ దెల్లముగాఁ గనబడుచుండ నమస్కరింపుచు విశ్వేశు నభినుతించుచు భక్తివివశుండై మోహనుం నిట్లనియె.

మహాత్మా! మీరు కాశీపురంబున బెద్దకాలము వసించితిమని చెప్పితిరి. అందు మీకుఁ తెలియని విశేషము లుండవు. ఆ కనంబడు నాలయప్రాకారం మంట పాదు లెవ్వరివో యెఱింగింపుఁడని ప్రార్థించుటయు నా యోగీంద్రు డిట్లు చెప్పం దొడంగెను.

సీ. పసిఁడికుండలచేతఁ బ్రభఁగాంచి యలరారు
                  నదియె విశ్వేశుని యాలయంబు
    ఆప్రక్క గోపురోద్దీపితం బగునది
                  యన్నపూర్ణాదేవి యున్నఠావు
    పొడవైనకంబముల్కడఁ జూడఁబడునది
                  బిందుమాధవదేవు మందిరంబు
    రమణీయ మణిశేఖరములచే నొప్పారు
                 నదియె డుంఢీశుని సదనరత్న
గీ. మల్లదియె చూడుఁ డందు రాజిల్లునదియె
    దండపాణి వసించు సుందరగృహంబు
    కాళినగరి తలారి యక్కాలభైర
    వుని నికేతన మదియె కేతనము గలఁది.

సీ. మణికర్ణికాతీర్థ మణియల్ల దే చూఁడు
               డధికపుణ్యప్రదం బదియోకాశి
    సత్యంబునకు హరిశ్చంద్రుండు మును వల్ల
               కాడు గాచినయట్టి ఘట్టమదిగో
    పరమేష్టి యతినిష్ఠఁ బదియశ్వమేధమ్ము
               లాచరించిన ఘట్టమదె కనుండు
    కేదారఘట్ట మామీఁద నున్నదియె క్షే
              మేంద్ర ఘట్టంబులవియే పవిత్ర
గీ. మదియె హనుమంత ఘట్ట మయ్యదియె చక్ర
    పుష్కరిణిజ్ఞానవాసి యామూలనొప్పు
    నది తదద్భుత మహిమ నెల్లపుడు సురలు
    బొగడుదురు ముక్తిమంటపంబున వసించి

అమ్మణికర్ణికాతీర్థంబునం గావించిన స్నానదానజపహోమతర్పణాదు లక్షయమోక్షఫలంబు లొసంగు. సాంఖ్యయోగాదినియమంబులు తత్తీర్థస్నానంబునుం బోలనేరవు. కాశిం దర్శించినంతనె తులాపురుషప్రదానఫలంబు గలుగును. భగీరథానీతంబై మందాకినీనది మణికర్ణిక మీఁదుగా నుత్తరవాహినియై యిప్పురోపకంఠంబునం బ్రవహించుచున్నది. తన్మాహాత్మ్యం బగ్గింప సురాసురులకైన శక్యంబుగాదు. వినుండు.

సీ. జహ్ను కన్యాస్నాన సంకల్పమును బోల
             దఖిల శాస్త్రాగ మాధ్యయనపుణ్య
    మమరస్రవంతీ లోకనము మనో
            వాక్కాయ కృతపాప భంజనంబు
    గంగామహా నిమ్నగా తీర వాసంబు
            గలుగ దీశ్వర కృపా కలనఁగాని
    భాగీరథీ కణాప్లావ మాత్ర లభించు
            బ్రహ్మ విజ్ఞాన సంభవ ఫలంబు
గీ. నిరతిశయ దుష్కృత క్రియానిరత నరత
    తులకు నీ కలియుగంబునఁ గలుష దమన
    మునకు సాధనమనిమిషధుని జలంబు
    దక్క వేఱొక్క దిక్కు వెదకినలేదు.

క. మది నిచ్చలేక ముట్టిన
   వదలక దహించునట్టి వహ్నిక్రియ నీ
   నది యిచ్చలేక మునిఁగిన
   విదళించున్ ఘోరకలుషవితతుల నెల్లన్.

క. సరిరావు వారణాశీ
   పురిమణము నొందవచ్చు పుణ్యముతో దు
   ష్కరదాస తపోధ్యయనా
   ధ్వర విజ్ఞానార్చనాది ధర్మము లెల్లన్.

అని మఱియు ననేక ప్రకారంబులఁ గాశీగంగాప్రభావం బభివర్ణించుచుండ నాలించి పులకితశరీరుండై మోహనుండు స్వామీ! యోడవచ్చు జాడ యింకనుం గనబడదు. ఈ లోపల గాశీప్రభావప్రఖ్యాపకంబగు నుపాఖ్యానం బేదేని వక్కాణింపుఁడని ప్రార్థించుటయు నా యోగిసత్తముండు సంతసించుచు నిట్లనియె. రాజపుత్రా! కాశీనగరప్రభావం బెన్ని దినములు వర్ణించినను వర్ణింపవచ్చు నందొక్క కథ మార్గదర్శకముగా నెఱింగింతు నాకర్ణింపుము.

యజ్ఞదత్తుని కథ

కాంపిల్యమను నగరంబున నగ్నివర్మయను బ్రాహ్మణుఁడు వేదవేదాంగపారంగతుండై సుశీలయను భార్యతో ననేక యాగములు సేసి దీక్షితుండని యన్వర్ధనామము వడసి రాజసన్మానితుండై యొప్పుచుండెను. ఆ పాఱునకుఁ బెద్దగాలమున నొక కుమారుం డుదయించుటయు వానికి యజ్ఞదత్తుడని పేరుపెట్టి గారాముగాఁ బెనుచుచు వానికుచితకాలమున నుపనయనముఁ జేసి గురువుల నొద్దఁ జదువనేసెను.

యజ్ఞదత్తుం డాటపాటల మరగి చదువక క్రమంబున ద్యూతక్రీడారతుండై కితవులఁగూడి తిరుగుచుండును. మఱియు

సీ. బ్రాహ్మణాచారము ల్పరిహిస మొనరించు
              నగ్నిహోత్ర విధానమన్న నవ్వు
    సంధ్యాభివందనార్చనలు హేళనసేయు
              వేదార్థవేత్తల వెక్కిరించు
    పాషండ షండ దుర్భాషల నుతియించు
             గీత వాద్య వినోదకేళి మెచ్చు
    ధాతువాదులనె యుత్తములని కొనియాడు
            ద్యూతకారులను నార్యులని పొగడు
గీ. నటుల మన్నించు వర్ణించు నాస్తికులను
    పీఠమర్దుల నగ్గించి పెద్దఁజేయు
    విటులఁ గైవార మొనరించు వివిధగతుల
    దీక్షితునిపట్టి చెడుగుల తెఱవుబట్టి.

అగ్నివర్మయు నితరవ్యాసంగసక్తుఁడగుటఁ గుమారునిదుశ్చేష్టితముల నేమియుఁ బరిశీలింపక యప్పుడప్పుడు భార్య నడుగుచుండ నామెయుఁ బుత్రునందలి ప్రేమచే వాని దుర్వ్యాపారము లన్నియు గప్పిపుచ్చి చదువుచున్నాఁడనియు వ్రేల్పుచున్నాఁడనియు వార్చుచుచున్నాఁడనియు బొంకుటయేగాక సజీవనిర్జీవద్యూతంబుల వా డోడిన సొమ్మునకై జూదరులకు దనమేనియాభరణము లిచ్చి సరిపెట్టుంచుండునది. మఱియు నెడప దడప భోజనమునకు వచ్చినప్పు డామె దుర్వ్యాపారములు విడువుమని పెద్దగాఁ బుత్రునకు బోధించును. అందులకు వాఁడేమియుఁ బ్రత్యుత్తర మీయక యట్లేయని తల యూచుచు నవ్వలికిఁ బోయి యథాప్రకారము సంచరించును.

మృగయామద్య పౌశున్య వేశ్యా చౌర్య దురోచరపరదారాభిలాషంబులు నవయౌవనారంభమున సంభవించెనేని వాని మరలింప సృష్టించిన విరించికిని శక్యము కాదుగదా.

ఒకనాఁడు అగ్నివర్మ రాజసభనుండి యింటికివచ్చుచు దారిలో నొక జూదరివ్రేల నవరత్నస్థగితమగు దనయుంగర ముండుట గురుతుపట్టి వానిచేయి పట్టుకొని యోరీ? యిది నా యుంగరము. నీ కెట్లువచ్చినదని యడిగిన వాఁడు వెఱువక అయ్యా! దీని మీ కుమారుండు జూదములో నా కోడిపోయెను. నతనివ్యాపారములు మీ రెఱుంగరుకాఁబోలు నిదియొకఁ టననేల మీ యింటనున్న వస్తువులన్నియు జూదరుల యధీనమైనవి చూచుకొండని పలికిన సిగ్గుపడి మారుమాటపలుకక క్రోధావేశముతో నింటికిం జని సోమిదేవీ ! యేమిజేయుచున్నా విటురా? అని పిలుచువఱకు గడగడలాడుచు నీవలకు వచ్చి పనియేమి? అని యడిగిన నీవల నాకుఁ దలయంటుచు బరిహాసముగా నా వ్రేలి యుంగరము లాగికొంటివి. జ్ఞాపక మున్నదా? దాని నిటు దెమ్ము. పనియున్నదని యడిగిన నా సోమిదేవి యిట్లనియె.

నాథా! మీ యుంగర మెక్కడికిం బోలేదు. పెట్టెలోఁ బెట్టి దాచియుంచితిని. మడిఁ గట్టికొంటి. సగమ వంటయైనది. అన్నార్థులై యతిథులు వేచియున్నారు. ఇప్పు డింత తొందరయేల? ఆనక తీసియిచ్చెద స్నానంబు గావింపుఁడని పలికిన విని యతండు కటకటంబడి యోహోహో! ఎంత సత్యసంధురాలవు, ఎట్టి సత్పుత్రజనయిత్రివి? అని యాక్షేపించుచు -

సీ. స్వాద్యాయమెన్నంగు జదువకుండిన బొంకి
                చదువుచున్నాఁడని జరిపినావు
    స్నానంబు నొకనాఁడు సల్పకుండఁగ బొంకి
               తీర్థమాడునటంచుఁ దెలిపినావు
    సంధ్యాభివందనార్చనలు సేయకయుండ
               చేయునటంచు వచించినావు
    వ్రేల్వకుండిన నగ్ని వేళకు నిత్యంబు
               నర్చించునని బొంకులాడినావు
గీ. ఇటుల దబ్బరలాడంగ నేమివచ్చె
    నీకు నీమాటలేను మన్నించి యకట !
    కొడుకు సాధుగ రక్షించుకొనఁగలేక
    పాడుజేసితి పరమనిర్భాగ్యురాల?

అని నిందించుచు మందసంబు లన్నియుం దీసి పరీక్షించి యే వస్తువుం గానక పరితపించుచు భ్రుకుటివికటముఖుండై ఛీ! ఛీ! కుపుత్రత్వంబుకంటె నపుత్రత్వంబె మేలు తిల లిటు తెమ్ము. నీ కొడుకు నీకు నివాపాంబలుల నిత్తునని పలుకుచు స్నానంబు జేయక భుజింపక భార్యతోఁ గలహింపుచుండ నపరాహ్ణమైనది.

అంతలోఁ దనకు వేళయగుటయు యజ్ఞదత్తుండు ద్యూతశాలనుండి యింటికి వచ్చి వీధి నిలువంబడి లోపలి యల్లరి యంతయు దాదులవలన విని యట నిలువక యా యూరు విడిచి యొక మహారణ్యంబునంబడి పోవుచుండఁ బాటచ్చరు లెదురుపడి వానిం ధనికుఁ డనుకొని జావగొట్టి వానియొద్ద నేమియు లేకునికి వగచుచు బ్రాణావశిష్టుండై పడియున్న యాతని మోచుకొనిపోయి యొక రెడ్డిపల్లెలోఁ బడవేసి పోయిరి.

అందొక కాఁపు వానియాపద దెలిసికొని యక్కటికంబుతోఁ దనయింటికి దీసికొనిపోయి కట్టులు కట్టించి పట్టులు వయిచి గాయములు వాపి కొన్ని దినంబులు తనఁయిoటఁ బెట్టుకొని కాపాడెను. పాడిపంటలుగల యా రెడ్డియింట గుడిచి యజ్ఞదత్తుండు ఆఁబోతువలె బలిసి యెలప్రాయములో నున్న యా కాఁపు పట్టికి వలపు పట్టఁజిట్టకంబులు వెలయించుచు నెట్లో దానిం గలిసికొని వెలిచవుల నభిరుచి పుట్టించి యిల్లు కదిలించి దేశాంతరమునకు దీసికొనిపోయెను.

వాఁ డట్లు కులభ్రష్టుండై కాపుకూఁతురుతో గాపురముజేయుచు నొక మాలపల్లె యందు గొన్ని దినంబులుండి జీవనము జరుగనందున నా పల్లె విడిచి మఱియొక పట్టణముజేరి యందుఁ గల కబరులతోఁ గూడికొని చౌర్యక్రియారతుండై దారులు గొట్టుచు గొన్నిదినంబులందు గాలక్షేపముజేసి మ్రుచ్చులతో బోట్లాడి యందుండక మఱియొక గ్రామము చేరి యందు గొన్ని దినములు నివసించెను.

యీ రీతి దేశములన్నియుఁ దిరిగితిరిగి పూర్వభవసుకృతవిశేషంబునం జేసి తుదకీ కాశీపురంబుజేరి యిందును -

సీ. గంగలో మున్గి మున్గంగ వచ్చిన తైర్ధి
             కుల పాదషణంబులు హరించు
    విశ్వేశు గుడిమ్రోల వెలయుగుంపున దూరి
             కంప భూషణములఁ గత్తిరించు
    నంగళ్ళఁ దిరిగి యొయ్యనపరాకు గనుండు
            వారిమూటలనెత్తి పారిపోవు
    తీర్థవాసుల పనుల్‌దీర్చి పెత్తనగా
            దొరికిన వస్తువుల్ దొంగిలించుఁ
గీ. గ్రొత్తతైర్థికులకు నిళ్ళు గురుతుఁజూపి
    భద్రమనిపల్కి రాతిరి పడినయంత
    దోచికొని పోవు వారివస్తువులనెల్ల
    యజ్ఞదత్తుడు చౌర్యక్రియానురక్తి

ఇట్లు కైవల్యలక్ష్మిఘంటాపథంబయిన కాశీపురంబు జేరియు వాఁడు సన్మార్గ ప్రవర్తనుడుగాక తస్కరుండై తిరుగుచు నొక్క మహాశివరాత్రినాడు వేకువజామున లేచి గంగలో మునిఁగి తీర్థవాసుల పాదభూషణముల హరింప దలంచియు రక్షకపురుషుల కాపుదలం జేసి తత్ప్రయత్నంబు కొనసాగినదికాదు. అందుండి లేచివచ్చి సాయంకాలముదనుక విశ్వేశ్వరుని యాలయము చుట్టును దైర్థికులంవెంట దైర్థికుండు వోలె దిరిగియు నేమియుం దొరకమింజేసి పరితపించుచు శుష్కోష వాసమున బేర్చు కార్చిచ్చువలెఁ గడుపున పేరాకలి బాధింప బోజనంబెక్కడ దొరకునో యని యాలోచించుచు దిరిగి దిరిగి యొక్క శివలింగంబు ప్రక్కశైవుండొకండు శివపూజ జేయుచు రాత్రి నాలుగుజాములు నమ్మహాలింగమునకు బూజానైవేద్యములు సేయదలంచి చతిర్వాధాన్నంబులు గొనివచ్చి యందుంచి క్రమంబున నయ్యోగిరములు స్వామికి నైవేద్యము సేయుచుండెను.

అవ్విధం బంతయు యజ్ఞదత్తుండు సూచి యువ్విళ్ళూరుచు శివపూజా దర్శనలాలసుండువోలె నా ప్రాంతమున వసించి శైవుడుగావించు శివపూజ జూచుచు నమస్కారముఁ గావించుచు నతండెప్పుడు నిద్రించునో యని యవకాశ మరయుచు నిద్రబోవక కాచియుండ నాలుగవ జామున శైవుడు నిద్రకు దాళలేక కునికిపాట్లు పడజొచ్చెను.

అప్పు డతఁడు మెల్లన గుడిలోనికిం బోయి సన్నగిల్లుచున్న దీపము నెగద్రోసి యవ్వెలుంగున మృష్టాన్నము లుపలక్షించి భక్ష్యములతోడి యన్నపాత్ర మెత్తి మెల్లగా నవ్వలకుఁబోవు సమయంబున దైవవశంబున వానిపాద మాశైవునికి దగిలినది అతండులికిపడి కన్నులం దెరచి వానిం జూచి దొంగ దొంగ యని యరచెను. అయ్యరపులు విని చేరువనున్న తలారులు అన్నపాత్రము విడువక పారిపోవుచున్న యజ్ఞదత్తుం దరిమికొని పోయిరి అతండాయాలయము చుట్టును పదిమారు దిరుగుచు వారికి దొరకడయ్యెను.

అప్పుడు వాండ్రు కోపించి యూచల నేసి వానిం గడతేర్చిరి. భయంకరాకారముతో యమకింకరు లరుదెంచి వాని బాశంబులంగట్టి యమలోకమున కీడ్చికొని పోవుచుండిరి. అంతలో మనోహరాకారములతో శివకింకరు లరుదెంచి యమకింకరుల నదలించుచు వాని కట్టుల విప్పించి దివ్యమాల్యాంబరాభరణాలంకృతుం గావించి విమానముపై గూర్చుండబెట్టి శివలోకంబున కరుగనున్న సమయంబున యమకింకరులు చేతులు జోడించి యిట్లనిరి.

చ. ఓమహితాత్ములార! యిపు డుర్వి నధర్మము ధర్మమయ్యె నా
    సేమములన్ ఘటింపఁగ వచింపుఁడు సమస్తకిల్బిష
    స్తోమగతక్రియాచరణదుష్టచరిత్రకుఁ డిట్టివాని మీ
    రేమి గుణంబు జూచి పొనరించితి కార్యవిమానసంస్థుగా.

వీడు కులాచారవిహీనుండు. పితృవాక్యపరాఙ్ముఖుండు. మిత్రద్రోహుడు. కులభ్రష్టుడు విప్రసర్వసహర్త. శివద్రవ్యాపహారియై మరణించె. పుణ్యము లేశమైన వీనియందు గనంబడదు. వీనినెట్లు విమాన మెక్కించితిరో చెప్పుడని యడిగిన నవ్వుచు శివకింకరు లిట్లనిరి.

సీ. తిండి యేమి లభింపకుండిన నైనను
             శివరాత్రి నుపవాససిద్ధి గాంచె
    నన్నంబు నందలి యాసక్తినైనను
             సలిపె నప్పటిదాక జాగరంబు
    వస్తువుల్ జూచు తాత్పర్యంబునను నైన
            నెగద్రోసె దీపంబు సిగవెలుంగ
    నిచ్చలేకున్న దా నీక్షించె నితరు లీ
           శ్వర మౌళిజేయు పుష్పముల పూజ

గీ. తిరిగెఁ బలుమారు గుడిచుట్టు వెఱచియైన
    జచ్చెఁ గాశీపురంబున శర్వుమ్రోల
    సూక్ష్మదృష్టి విచారించి చూడ నింత
    కన్న నుత్తమమగు పుణ్యకర్మమేది?

చౌర్యమునకైనను నీఁడు నిత్యము గంగాస్నానంబు చేయుచుండు. వీని పాపంబులు పటాపంచలు గాక నలిచియున్నవా? సామాన్యులకు మహాశివరాత్రి దివసంబునఁ గాశీపురంబున మరణంబు లభించునా? కాశీప్రభావం బెఱుంగక మీరిట్లు వచ్చితిరి. తెలిసికొను డిదిమొద లెన్నఁడును బంచక్రోశమధ్యంబున మృత్యు డగువాఁడెట్టివాఁడైన వానికొఱకు మీరు రాకుఁడు. కాలభైరవునికిఁ దెలిసిన మిమ్మీపాటికే గెంటివైచు పో, పొండు. శివధర్మ మతిగూఢమని పలుకుచు శివకింకరులు యజ్ఞదత్తు నుత్తమలోకంబునకుఁ దీసికొనిపోయిరి. వింటిరా. కాశీపురప్రభావంబని సిద్ధవ్రతుఁడు చెప్పుచుండఁగనే యోడ రేవు చేరినది. అని యెఱింగించువఱకు వేళ యతిక్రమించినది.

192 వ మజిలీ

మోహనుని మరణవార్త కథ

మఱికొన్నిదివసంబులక్రింద మిత్రుండు పుత్రుండు సన్యాసులవెంట దేశాంతర మరిగెనని తెలిసికొని పరితపించుచు వానిని వెదకుటకై ప్రయాణోన్ముఖుండగుటయు వారించుచు సిద్ధార్థుం డారహస్యముం దెలియనీయక తాను బోయి వెదకి తీసికొని వచ్చెదనని చెప్పి తురఁగారూఢుండై బయలుదేరి యుత్తరాభిముఖముగాఁబోయి జాడలు దీసికొని వారు వోయిన తెఱవునుబట్టి కొన్నాళ్ళకుఁ గాశీపురంబున కరిగెను. అందు వ్యాసమఠంబున నున్న యోగులనెల్ల విమర్శింప సిద్ధవ్రతునితో వచ్చిన శిష్యుఁ డొకండు గనంబడియెను.

వానిం గురుతుపట్టి పల్కరించి తనపేరు సెప్పి మీగురుండెం దున్నఁవాడని యడుగుటయు నతండు కన్నీరు నించుచు వారందరు పురందరపుర మలంకరించిరని దద్గదస్వరముతోఁ దెలియపరిచెను.

ఆ! ఏమీ! ఏమి! అని సిద్ధార్థుఁడు శోకవేగంబున నొక్కింత తడ వొడ లెఱుంగక యెట్టకేఁ దెప్పిరిల్లి యుల్లము పగుల దుఃఖించుచు వారెట్లు చచ్చిరో తెలుపుమని యడిగి నాయోగి శిష్యుం డిట్లనియె.

అయ్యా ! మేము మీనగరము విడిచి యుత్తరాభిముఖులమయి పోయి పోయి యనేక జనపదంబులం గడచి కొన్నినెలలకు గంగాతటంబుఁ జేరితిమి. దారిలోఁ గపిలయుఁ జంద్రికయు నను నిరువురు తరుణులు మా గురువునకు శిష్యురాండ్రై వెంటఁబడి వచ్చిరి. మేమోడకై రేవుకాచికొని యుంటిమి. అప్పుడు గంగానది