కాశీమజిలీకథలు/తొమ్మిదవ భాగము/189వ మజిలీ

వికీసోర్స్ నుండి

ప్రత్యేకము పోవుదుముగాక. ఇప్పుడీ పయనము మానుమని పలికిన విని రాజపుత్రుం డిట్లనియె.

మిత్రమా ! మహాయోగు లెప్పుడు నాత్మీయమగు సామర్థ్యమును జెప్పుకొనరు. మనబోటులతో హృదయమిచ్చి మాటాడరు. ఈతం డద్భుతప్రభావసంపన్నుఁడగుట నిక్కువము. మంచియండ దొరకినప్పుడు విడువరాదు. ఈ యోగివరుని చరణసేవ సేయుచు బోయి వీనివలననే నాకామితము బడయుదును కానిచో వీని యాశ్రయబలంబున నాసిద్ధుని యనుగ్రహము సంపాదించెను. ఇప్పుడు నా పయనమున కంతరాయము గలుగఁజేయకుము. కొలఁదికాలములో నభీష్టసిద్ధివడసి యింటికి వచ్చెద. మద్వియోగదుఃఖముఁ బొందకుండ నా తలిదండ్రులఁ గాపాడుమని బోధించినఁ గన్నీరుఁ గార్చుచు డగ్గుత్తికతో సిద్ధార్థుఁ డిట్లనియె.

వయస్యా! నీవు సన్యాసివై సన్యాసివెంట నరుగుచుండఁ జూచి చూచి యింటికడ నెట్టుందును. నీ తలిదండ్రులమాట యట్లుండనిమ్ము. నీ వియోగము నేను సహింపఁగలనా? పదపద. నేనుగూడి మీవెంట వచ్చెదని పలికిన విని రాజపుత్రుండు తమ్ముడా! నామాట వినుము. మనమిద్దర మొక్కసారియే పోయినచో గగ్గోలుపడి మనవారు దేశముల వెదకించి పట్టుకొని తీసికొనిపోవుదురు. నీ విందుండిన నాపోక కొన్నిదినములవఱకు నెవ్వరికిం దెలియదు. నీవు గొన్నిదినంబు లిందుండి మనవారి నెట్లో జోరువెట్టి పిమ్మటఁ గాశీపురంబునకు రమ్ము, అందు నీకొఱకు వేచియుండెద. శ్రీవిశ్వేశ్వరుని యాలయముమీఁద నాయునికి వ్రాసెద. వచ్చి ముందుగాఁ జూచుకొమ్మని పలికి బలవంతమున వాని నొప్పించి నాఁటి వేకువజాముననే యా యోగివెంట మోహనుండు కాశీపురంబునకుఁ బయనంబై పోయెను.

అని యెఱింగించి యవ్వలికథ పైమజిలీయం దిట్లు చెప్పఁ దొడంగెను.

189 వ మజిలీ

కపిల కథ

మోహనుం డట్లు సిద్ధవ్రతుండను యోగీశ్వరునితోఁ గాశీపురంబునకుఁ బోవుచు నొకనాఁడు మల్లెప్రోలను పల్లెఁ జెరువుగట్టున నున్న రావిచెట్టు కిందఁ బస జేయుటయు వారిని భిక్షసేయనీయక తానందలి యంగడికిఁబోయి భోజనసామగ్రి తీసికొనివచ్చి యర్పించెను. ఆ యోగి శిష్యుఁడొకఁడు వంటఁ జేయుటయు నందఱు భుజించిరి.

నాఁడు దూరము నడచి వచ్చుటచే మోహనుని కాళ్ళలోఁ బొక్కు లెక్కినవి. దానంజేసి రెండుదినంబు లందుండక తీరినదికాదు. ఆ తటాకమునకు నీళ్ళకు వచ్చు స్త్రీలు మోహనుంజూచి వెఱఁగుపడుచు నిలువంబడి తద్రూపాతిశయము వింతగాఁ జూచుచు నొకళ్లొకళ్ళు చెప్పుకొనుచు గజగుజneడుచు నందే జాగుచేయుచుండిరి.

వారిలో నొక మోహనాంగి సాహసించి వారిదాపునకుఁబోయి నమస్కరింపుచు మహాత్మా! నాకుఁ జేతిరేఖలుజూచి సాముద్రికము జెప్పెదరా? అని చిరునగవుతో నడిగిన సిద్ధవ్రతుండు కాదనలేక చేయిసాచుమని విమర్శించి దానిరహస్యచర్యలు స్థితిగతులు పూసగ్రుచ్చినట్లు నిరూపించి తెలియఁజేసెను.

అప్పు డందున్న యాఁడువాండ్రందఱు సిగ్గువిడిచి క్రమంబున నతని యొద్దకుఁబోయి చేతులు చూపించుకొనుచుండ నయ్యోగియు విసిగికొనక వారివారికిఁ దగినఫలములు నిదర్శనముగాఁ జెప్పుచుండును.

ఆవార్త గ్రామమంతయు వ్యాపించినది. స్త్రీలు గుంపులుగా వచ్చి ఫలముల దెలిసికొనిపోవుచుండిరి. అందలి సుందరులు చాలమంది సాముద్రికము నెపంబున నందువచ్చి మోహనుని సౌందర్యముజూచి మోహసముద్రములో మునిఁగి విభ్రాంతలై బలవంతమున నేగుచుందురు.

ఆ సందడిజూచి మోహనుఁడు యోగితో మహాత్మా! మీ కీబులపాట మేమిటికి? స్త్రీ సంపర్కంబున నింద్రియచాంచల్యము కలుగదా! ద్రవ్యాశ లేనప్పుడు నాకేమియుం దెలియదనక వృథావ్యాసంగముతోఁ బనియేల. వీండ్రరాక నాకు సంకటముగా నున్నదని పలికిన విని నవ్వుచు నతండు రాజపుత్రా! నీ బుద్దినైర్మల్యము దెలియుటకే వీరినిట్లు రప్పించుచుంటిని. వీండ్రందఱు సాముద్రికఫలము నెపముఁజేసికొని నిన్నుఁ జూడవచ్చుచున్నారు. గాలి వీచినప్పుడేకదా దూదికిని ఱాతికిని భేదము దెలియును. దృఢచిత్తుండవు గమ్మని యేమేమియో పలికి వాని హృదయగంధి బిగియఁ జేసెను.

ఆయూర భద్రుఁడను రెడ్డిగలఁడు వాఁడు మిక్కిలి భాగ్యవంతుఁడు. పరమలోభి. కూరకర్ముఁడు. వానికి లేక లేక యొక కుమారుం డుదయించెను. వాఁడు వట్టిపంద. వానికన్న గంగిరెద్దయిన దెలివి గలదని చెప్పవచ్చును. పొలమేగి నాఁగలి దున్నుట తప్ప వానికేమియుం దెలియదు. వానికి గపిలయను భార్య గలదు. దివ్య స్త్రీలకైన నట్టి సోయగము లేదని చెప్పవచ్చును. లెస్సగాఁ జదివినది. సంగీతమున మిక్కిలి పరిశ్రమఁ జేసినది.

ఆ చిన్నది కర్ణాకర్ణిగాఁ జెరువుగట్టున నున్న యోగీంద్రుని ప్రభావము విన్నది. తనకేమైన నతండు మంచియుపాయము జెప్పునేమోయని యాలోచించి పీతాంబరము ధరించి యపహారములఁ గైకొని యొరుల చూడకుండఁ బెరటిదారి నా చెరువుగట్టునకుఁ బోయినది. తొలుత మోహనునిం జూచినది. మోహసముద్రములో మునిఁగిపోయినది దేహము పరవశమైపోయినది. మేను పులకింపఁ గన్నులు మూసికొని యొక్కింతసేపు ధ్యానించింది. తాను వచ్చినపని యేదియో మరచి తబ్బిబ్బు పడుచు నెట్టకేల కాయోగి కట్టెదుటకుఁ బోయి ఫలముల మ్రోల నునిచి యతనిపాదంబులం బడి నమస్కరింపుచు రక్షింపుమని ప్రార్థించినది. దయాళుండగు నాయోగి బాలా! నీ వెవ్వతెవు? ఏమి కోరి వచ్చితివి? యెఱింగింపుమని యడిగిన నమ్మగువ యిట్లనియె.

స్వామీ! నేను భద్రుఁడను రెడ్డికోడలను. నా పేరు కపిల యండ్రు. నా భర్తకు లోకజ్ఞాన మేమియును లేదు. వట్టి మూర్ఖుఁడు. భాగ్యమున కాసపడి నన్నా పురుషపశువునకుఁ గట్టిపెట్టిరి. నాభర్త నామొగ మెన్నఁడును జూచి యెఱుంగఁడు. బ్రహ్మచర్యవ్రతమే చేయుచుంటిని. అత్తమామలు కత్తులబోనులోఁ బెట్టి నన్ను బాధించుచున్నారు. నాకీసంసారమం దాసక్తి వోయినది. మహానుభావులు మీరిందు వచ్చితిరని మీపాదంబులం బట్ట వచ్చితిని. శిష్యురాలిఁగాఁ జేసికొని నన్ను మీవెంటఁ దీసికొనిపొండు. శుశ్రూష జేయుచుండెద ననుగ్రహింపుఁడని కోరిన నతం డిట్లనియె.

తరుణీ! యువతులకుఁ బతిశుశ్రూషకన్నఁ దరుణోపాయము వేఱొకటి లేదు. ఆతం డెట్టివాఁడైనను విడువరాదు. అధర్మకార్యములకు మే మంగీకరింపము. పొమ్మింటికిఁ బొమ్మని మందలించుటయు నా చపలాక్షి యక్షుల నశ్రువులు గ్రమ్మఁ గ్రమ్మర నమ్మహాత్మున కిట్లనియె.

స్వామీ! నాకు భర్తృశుశ్రూషఁ జేయు భాగ్యము పట్టినదికాదు నేను వెనుకటి జన్మమున గట్టిపాతకము గావించితిని. నా మగఁడు వెఱ్ఱివాఁడు. నా దాపున కెన్నఁడును రాఁడు. నేను బోయినఁ బారిపోవును. ఇంతకన్న మీకడ నే నేమి జెప్పుదును? నేను మి మ్మధర్మకార్యములఁ జేయమందునా. ఈ జన్మమున నింతియ నోచి పుట్టితిని. మీవెంట వచ్చి మీకు శుశ్రూషఁ జేయుచుండెద నుత్తరజన్మమునందైన నాకు సుఖము గలుగఁ గలదు నారాక కనుమతింపుఁడని ప్రార్థించుటయు నతం డిట్లనియె.

సుందరీ! త్రిభువనాతిశయసౌందర్యంబునఁ బొలుపొందు నీవు మావెంట వచ్చిన లోకులు మమ్ము విరక్తులని నమ్ముదురా? పొమ్ము పొమ్ము నీరాక సమ్మతము కాదనవుఁడు నా జవరాలు కన్నుల జలమ్ము గ్రమ్ము మహాత్మా! నేను దెగించియే యిల్లు కదలి వచ్చితిని. మా మామకు నే నిక్కడికి వచ్చితినని తెలియక మానదు. తెలిసిన నన్ను బ్రదుకనీయఁడు ఆ క్రూరుని చేతిలోఁ జావనేల? మీరు నారాక కనుమతింపనిచో నిప్పుడే యా చెరువులోఁబడి ప్రాణములు విడిచెద నిఁక నింటికిం బోవఁజాల. రక్షించిన రక్షింపుడు. అని మిక్కిలి దైన్యముగాఁ బ్రార్థించుటయు నాసిద్ధవ్రతుండు తదీయగంభీరోపన్యాసము విని యించుక యాలోచించుచు మోహనుని మొగము జూచెను.

మోహనునికిఁ గపిలం జూచినతోడనే స్మరవికార మించుక జనించినది. దృగంచలముల నడుమనడుమ నా చంచలాక్షి నీక్షించుచుండెను. ప్రగల్బములైనమాట లెన్ని జెప్పినను గపిల తన్ను జూచిన చూపులవలన సక్తమయ్యెనని నిశ్చయించెను. అది మగనాలియని పాపభీతిఁ జెందుచుఁ దన యభిప్రాయము దెలిసికొన జూచిన నా యోగి కేమాటఁ జెప్పిన నేమనుకొనునో యని యేమియు సమాధానముఁ జెప్పకయూర కుండెను.

అప్పు డయ్యోగి తరుణీ! మేము విరాగులము, భోగముల నిరసించి తిరుగుచుంటిమి. నీవు జవరాలవు. నిక్కముగాఁ గామాసక్తవుగాక పరం బపేక్షించి మా వెంట వత్తునేని రమ్ము, లేకున్నఁ బొమ్ము. రెంటికిం జెడకుమని పలికిన నక్కలికి మహాత్మా! నా కైహికసుఖంబు లిదివఱకే గగనకుసుమములైనవి. వాని మునుపే వదలకొంటిని ఉత్తరజన్మమునందైన యభీష్టకామంబులఁ బడయుదు నేమోయని మీవెంట రాఁదలచితిని. మీరు విరక్తులని నే నెఱుంగనా? మహాత్ముల శుశ్రూషకన్నఁ దరింపఁజేయ వేఱొక సాధనము లేదు. నన్ను రక్షించి శిష్యురాలిగాఁ జేసికొనుఁడని ప్రార్థించినది. అతం డంగీకరించెను.

ఆ చిన్నది యమూల్యభూషాంబరాదు లదివఱకే విడిచివచ్చినది. ఆ పీతాంబరమే వల్కలముగాఁ జేసికొని యా యోగిపాదంబుఁ బట్టినది. ఆతం డేదియో మంత్ర ముపదేశించి జపము జేసికొనుచుండుమని నియమించెను.

రెడ్డిభయంబున వా రందుండక యప్పుడే బయలుదేరి యుత్తరాభిముఖముగా హుటాహుటి నడకలంబోయి మఱునాఁడు మధ్యాహ్నమునకు మఱియొకగ్రామముఁ జేరిరి. కపిల మోహనుని సౌందర్యము కన్నలారఁ గ్రోలి యానందించుచుండును. మోహనుండును దద్రామణీయమునకు మది చలించినను యోగి చెప్పిన మాటలం దలంచుకొని వికార మడంచుకొనుచుండును కపిల చూపులచేతనే సంతసించుచుండెను. ఆకారదర్శనముచేతనే తృప్తిఁ జెందుచుండెను.

కపిలమామయగు భద్రుఁడు తనకోడలు సన్యాసులం దగిలికొనిపోయినదని విని రౌద్రావేశముతో దండధరులఁ బెక్కండ్ర గాపులవెంటఁ బెట్టికొని నాడలం దీసి వేఱొక చెరువుగట్టున వారిం గలిసికొనియెను. కపిల దూరమునుండి వారిం గురుతుపట్టి బాబో! అదిగో. మామామ పదుగురతో వచ్చుచున్నాడు. మనలం గొట్టఁగలఁడు. ఎట్లు కాచెదరో యని మొఱవెట్టుచు సిద్ధవ్రతుని యొడిలో దూరినది.

అప్పుడు రాజపుత్రుఁడు ఓహో! నే నుండ వెఱవనేల? వీండ్రం బరిభవించి యనిపెదం జూడుఁడని పలుకుచు యోగదండముల కట్టలో దాచియుంచిన కరవాలముఁ దీసికొని కాచికొనియుండ నింతలో నాకాఁపులు మూఁగికొని జోగులారా ! కపటవేషములు వైచికొని మాపడుచుం దీసకొనిపోవుచున్నారా? ఎక్కడికిఁ బోయెదరు. నిలునిలుండని యడలించుచుండ మోహనుం డడ్డమై యవక్రవిక్రమంబునఁ బరిభ్రమించుచు వారిం దూరముగాఁ బారఁద్రోలి లఘుప్రహరణంబుల నాసాకర్ణచ్ఛేదనంబు గావించి పరిభవించెను.

రెడ్డి సిగ్గుపడుచు సీ సీ. లేచిపోయిన కోడలిని రప్పించుకొనుటకంటె తప్పిదమున్నదా? తెలియక వచ్చితిమి. దానినోట మన్నుఁగొట్టికొని యదియే పోయినది. నా కొడుకునకు వేఱొకకన్యకం బెండ్లిఁ జేయలేనా? రండు, రండు. పోవుదమని పలుకుచు నింటికిం బోయెను.

అని యెఱింగించి మణిసిద్ధుం డవ్వలికథ పైమజిలీయం దిట్లు చెప్పదొడంగెను.

190 వ మజిలీ.

చంద్రిక కథ

హేమదుర్గమను నగరమున భీమవర్మయను రాజు గలఁడు ఆతండు మిగుల ధర్మాత్ముఁడు వితరణశాలి. కేవలము సన్యాసుల నిమిత్తమై పెద్ద మఠ మొకటి గట్టించెను. దాని దుర్గామఠమని పిలుచుచుందురు. అందు విరక్తులకు సకల సదుపాయములు చేయుచుందురు. బైరాగు లెన్నిదినము లుండినం బొమ్మనక భోజనము పెట్టుచుందురు. అందెప్పుడు జూచినను వేయిమంది సన్యాసులకుఁ దక్కువ యుండరు.

మార్గవశంబున సిద్ధవ్రతుండు శిష్యులతోఁ గూడ నొకనాఁడు సాయంకాలమునకు నా మఠంబునఁ బ్రవేశించెను. రాజపుత్రుండు మఠవిశేషము లన్నియుం జూచి వచ్చి యోగీంద్రా! ఇందున్న బైరాగులు మహేంద్రవైభవం బనుభవింపుచున్నారు వింటిరా?

సీ. చమురు మెల్లన రాచి జడలు విప్పుచు దల
             లొప్పార నంటుదు ఱొక్కచోట
    మేనఁ బూసిన భూతి బోనంగ రాగముల్
             జిక్కనీరాడింతు ఱొక్కచోట
    నడిచిన పెంద్రోవ బడలికల్ దీరంగ
             నొడలల్లఁ బట్టుదు ఱొక్కచోట
    మృదుతల్పములను నెమ్మది బరుండగఁ బెట్టి
             యోపిక వీవుదు ఱొక్కచోట
గీ. వంటకంబులతోడఁ గావలసినట్టి
    భోజనము గూర్తుఱిటఁ బరివ్రాజకులకు
    నొక్కచోఁ బెండ్లికొడుకులకో యనంగ
    నహహ! ఇది గట్టినట్టి పుణ్యాత్ముఁ డెవ్వఁడో.

మ. ఒకచోఁ బుణ్యతరింగిణీ సుమహిమ న్యూనాధికోద్యత్ప్రసం
     గకథల్, యోగవిధానచర్చ లొకచోఁ, గాశీప్రయాగాది సు