Jump to content

కాశీమజిలీకథలు/ఏడవ భాగము/137వ మజిలీ

వికీసోర్స్ నుండి

మగుటయు నగ్నివర్మ రాజపురుషులతో బండియెక్కి యాయిక్క కరుదెంచి తలుపులు తీయించినంత వెక్కివెక్కి. యేడ్చుచుఁ గూరుచుండెను.

అప్పుడగ్నివర్మ అమ్మా! ఒంటరిగానుండ జుడిసితివా? ఊరడిల్లుము, ఈఱేడు మనపై వైరముగట్టి యున్నట్టు పొడగట్టు చున్నది. కానిచో నిరపరాధినివగు నిన్నేల నిర్భంధవాసంబున నుంచెడిని అపరాధులతోఁగూడ వాదుల బాధించు నృపతులుందురా? ఇతండు గావించిన యన్యాయము సామంత చక్రవర్తియగు సూర్యవర్మతో జెప్పు కొనుఁడని కొందరు ప్రోత్సాహపరచుచున్నారు. ఆవిషయ మాలోచింతము పోవుదము రమ్ము. అని యూరడించిన విని యవ్వనిత కన్నీరు దుడిచికొనుచు నిట్ల నియె.

తండ్రీ! నాకు రాజుగావించిన నిర్బంధమువలన మరియొకముప్పు వాటిల్లి నది. అయ్యల్పుని నాగదిలో నుంచినది యెరుగక యీ గవాక్షము తలుపెద్దియోయని తెరచి చూచితిని వాఁడు నన్నుఁజూచి ప్రొద్దుటనుండియు విరహార్తిగుందుచుఁ గొంతదనక స్వయముగఁ బ్రార్థించి యంగీకరింపమి నోటికిరాని దుర్భాషలాడి రాళ్ళరువ్వఁబోయిన తలుపు వేసికొంటిని గడియ పడకపోవుటచే మరియు మరియు ద్రోయుచు రట్టు గావించెను. వానికిఁ దగిన శిక్షవిధించినంగాని నేగుడవజాలనని పలికి యాగురుతులు జూపించినది.

అగ్నివర్మ తలుపు తెరచి యవ్వలిగదియం దల్పుని జూచిపండ్లు పటపట కొరుకుచుఁ గానిమ్ము నిన్నింతటితో విడువను. తుచ్చా? ఇప్పుడైన సిగ్గురాలేదా? ఇంకను దుర్భాషలాడుచుంటివిగా! ఇలాటి భూభర్తలు పాలించుచుండుటచే నీయాట లిన్ని నాళ్ళుసాగినవి. అని నిందించుచు రాజపురుషుల కివ్విషయము బోధించి సాక్ష్య ముగా నుండుఁడనికోరి యప్పుడే సురసను నింటికిం దీసికొనిపోయెను.

అని యెటింగించి చెప్పందొడగెను.

137 వ మజిలీ

దేవవర్మకథ

అమ్మా! నీ బుద్దిబలము మిక్కిలి కొనియాఁడదగియున్నది. సందిగ్ధాభియోగ మున యధార్దము జూపి హృదయగ్రంధియగు సందియము. పోగొట్టితివి. నాకీర్తినిలిపి తివి సురస కౌటిల్యము అల్పుని సౌజన్యము మాటుననుండి కన్నులారాజూచితిని. చెవులారావింటిని. ఇప్పుడు సురసకుఁగావించుదండనము నల్పునికిఁగావించు గౌర వము నీవేనిరూపింపుము నీవెట్లు చెప్పిననట్లు కావించెద. మరియు నీకేదియేని మనః ప్రియమగు కార్యంబు గలిగిన నొడువుము అకార్యమైనను గావింతునని యత్యుత్సా హముతోఁ బలికిన దేవవర్మకు యమున యిట్లనియె. తండ్రీ! సురస యాజన్మశుద్ధురాలగుట నిక్కువము రూపైకపక్షపాతియగు మదనునిచే మోసపెట్టఁబడి యకార్యమునకుఁ బూనుకొన్నది. బ్రత్యక్షసాక్ష్యంబేమియు లేకపోవుటచేత నానాతిని శిక్షించుటకువీలులేదు అల్పుఁడీపనితాను జేయలేదనక చేసినట్లే యొప్పుచున్నాఁడు. సురసను శిక్షింపనిశ్చయించితివేని నీవుజూచిన విషయములు సాక్ష్యమిచ్చి చక్రవర్తి సూర్యవర్మచేతశిక్షింపఁ జేయుమునీకధికారములేదు. కావున నంతయేలవచ్చెనాఁడుది కావున మన్నించితినని విడిచిపెట్టుము ఇదియొండునాకుఁ బ్రియంబు మఱియు నల్పుఁడమరకల్పుండు కారణాంతరమున నట్టి పేరు పెట్టికొనెను గాని సొమాన్యుఁడుకాఁడు ఉత్తమకులుఁడు అట్టి సుగుణమణిని మీరు గౌరవింపఁ దలంచిరేని మీరాజ్యమున కధినాధుంజేయుటతప్ప వేరొక కార్యంబతనికి గౌరవము కాదు. ఇదియే నారెండవకోరిక ఇంతకన్న నాకేకోరికయు లేదని చెప్పినవిని యాజన పతి యమున బుద్ధిచాతుర్యము స్తుతియించుచు జిఱునగవుతో నిట్లనియె.

పుత్రీ! నీవాక్యనైపుణ్యము స్తోత్రపాత్రమైయున్నది. నీకోరికకడు నుత్తమముగా నున్నది. అట్లే కావించెద నప్పటినుండియు నిదియె నామనస్సులో నున్నది అని పలికి యమునకోరికయుఁ దనసంకల్పము నొక్కటియె యగుట యప్పుడే కొల్వు కూటంబునకుం బోయి యాయభియోగ సంబంధులనెల్ల బిలిపించెను.

అప్పుడు అగ్నివర్మ ఱేనియెదుటకు వచ్చి మహారాజా! నీవుపక్షపాతముజేయు చున్నావు. అల్పుఁడు తప్పులుపై తప్పులుజేయుచున్నాడు బందీగృహంబుననున్నతరి నొంటరిగా నుండుట తిలకించి గవాక్షము తలుపు తెఱచుకొని సురస నెట్టిమాటలాడెనో మీరా పురుషులనడుగుడు వేరే మాకు సాక్ష్యమక్కురలేదు. అని చెప్పిన విని రాజు అక్కడికిఁ బోయిన రాజపురుషుల రప్పించి మీరేమిజూచితిరని అడిగెను. వాండ్రు దేవా! మేమేమియుం జూడలేదు. తలుపు తెరచునప్పటికి నీచిన్నది వెక్కి వెక్కి యేడ్చు చున్నది. యేమని తండ్రి యడిగిన వాతాయనము తెరచి అల్పుఁడు తన్ను మరల నిర్భంధించెనని చెప్పినది. ఇదియ యామెరింగించినది. అని చెప్పిన విని అగ్మివర్మ వింటిరిగద అల్పుని దౌర్జన్య మనవుఁడు రాజు పక్కున నవ్వుచు నిట్లనియె.

విప్రోత్తమా ! అల్పుఁడు సురసను గవాక్షము తెరచి నిర్భంధింపఁ జూచినవారు లేరు. ఆమెచెప్పినమాట నమ్మవలయుననియా మీ అభిప్రాయము అని అడిగిన నగ్ని వర్మ సందియమేలా? నాపుత్రిక అనసూయవంటిది. దబ్బరలాడునదికాదు. అదికూడ నల్పునే అడిగి చూడుఁడు అనుటయు రాజు అల్పునింజూచి అయ్యా! మొన్న బందీ గృహం౦బుననుండఁ గవాక్షముతెరచి మీరామెనునిర్బంధించిరఁటసత్యమే? అనిఅడిగెను.

అంతయు సత్యమే అని అతండుత్తరము జెప్పెను. చూచితిరా! మీరేమో సురస నసత్యవాదినిగా భావించిపలికిరి ఇప్పుడై న నమ్ముదురా? అని అగ్నివర్మ పలు కుటయు నలుక చిత్తంబునం జిలుక యమున మాటలం దలంచి యడంచికొని చిరు నగవు మొగంబున మొలకలెత్త భూసురో త్తమా? మత్తకాశినుల చిత్తంబులు మీకెరుక పడవు.

ఈ యభియోగమున సురసయే యపరాధినియై యున్నది. అసత్యాభియోగము దెచ్చుటచే సురస శిక్షాపాత్రురాలు అయినను లోకమునకు విదితమగు సాక్ష్యము లేమింజేసి సురసను విడిచి పెట్టితిమి అల్పుఁడు నిరపరాధి. వంద్యుఁడు అని తీరుపు చెప్పి అగ్నివర్మాదులఁబొమ్మని యాజ్ఞాపించి అల్పునకు నమస్కరించుచు రాజసదన మునకు సగౌరముగాఁ దీసికొనిపోయి యుచితాసనాసీనుంగావించి యిట్లనియె.

మహాత్మా ! నీబుద్దినై ర్మల్యముఁ విశదమైనది. నీకులము పరమోత్తమముకాక మానదు కారణాంతరమున బ్రచ్చన్నముగ దేశాంతరములు దిరుగుచున్నట్లుతోచు చున్నది. ఏదియెట్లై నను సరే త్రిలోకాభిరామయగు యమున యను నాకూఁతురు నిన్ను వరించినది. ఆమెను నీకిచ్చెదను. రాజ్యముతోఁగూడ స్వీకరింపుము. నాకొక్క రితయే కొమరిత అచిన్నది బుద్ధిబలమున బృహస్పతిని మించియున్నది. నీకులశీలాదులు విననర్హులమేని మాకెరిగింపుము కాకున్నను మాకు సందియములేదు. యమునతోఁగూడ రాజ్యలక్ష్మిం గై కొనుమని ప్రార్దించిన విని అల్పుండిట్లనియు.

దేవా! నేనన్నిట నల్పుండని యెఱింగియు మీరిట్లనుట వింతగానున్నది. ధన బలవిద్యాశూన్యుండనగు నన్ను యమున వరించుట యాశ్చర్యముకాదా? నాయందు వరునందరయఁదగిన సుగుణ మొక్కండును లేదు. లెస్సగా విమర్శించుకొని మాటలాడ వలయు నాకు రాజ్యమును యమునయు నక్కరలేదు. నాదారిం బోవనిండనిన విని దేవవర్మ అల్పుని వినయాభిరతుండై ప్రార్థించి యెట్టకే నతని నొడంబడజేసి యమున నిచ్చి మహావైభవముతో శభముహూర్తంబున వివావాము గావించెను. యమున తన బుద్ధిబలంబున నల్పుని కులశీల నామంబులు దెలిసికొని పరమానంద భరితహృదయై స్మరలీలా విలాసాంబువిధి నోలలాడుచుండెను.

కొన్ని దినములుగడచినంత నొకనాఁడు దేవవర్మ పేరోలగమున్న సమయం బున సామంతచక్రవర్తియగు సూర్యవర్మ యొద్దనుండి యొకదూతవచ్చి సందేశపత్రిక యేదియో యందఁజేసెను. ఆ పత్రికవిప్పి ప్రధాని రాజు విన నిట్లు చదువుచున్నాడు.

నరమృగ పశుపక్ష్యాదులలో మనుష్యు లుత్తములు. అందు బ్రాహ్మణులు పూజ్యులు అందువిద్వాంసులు వందనీయులు అందు శ్రోత్రియులు పరమోత్తములు దేవయజనకాపురస్థుఁడా పరమశ్రోత్రియుఁడగు నగ్నివర్మకూతురు సురస ఆజన్మ శుద్ధురాలని జగద్వితమై యున్నది. అట్టిసాధ్వీరత్నమును మోహించి కలయరమ్మనిన దుర్మార్గు నీచు నల్పుని మాయావి నుత్తముఁడని పొగడ శిక్షింపక యల్లునిగాఁ జేసికొని యామెను నిర్బంధించి చిక్కులబెట్టి విడిచితివి నీకూతురు స్త్రీచాపల్యంబున వాని వరించి నీకు సురసయందు నీరసబుద్దిగలిగించినదని తెలిసినది. అందులకు నీచర్యయే దృష్టాం తముగా నున్నది. అందలి గ్రంథమంతయు సాంతముగాఁ జదివితిని వృధాగా నప రాధిని విడిచి నిరపరాధినిఁ జిక్కులు పెట్టితివి. నీకుగల కీర్తికిఁ గళంకము దెచ్చికొంటివి. స్త్రీబుద్దివిని చెడినవాడవైతివి బ్రాహ్మణులు క్షోభించిన దేశమునకే ముప్పువాటిల్లును. అల్పుడు మాయావియనియు నపరాధియనియు వాఁడు చెప్పినమాటలే చెప్పుచున్నవి. కులశీలాదులు తల్లిదండ్రులం జెప్పకున్న నూరకుందురా. పెక్కులేల అంతయుం దప్పుజేసితివి మాయొద్దనగ్నివర్మ అయ్యభియోగమునుమఱల విచారింపనాజ్ఞ వేడికొని యెను. కావున మేము స్వయముగా తిరిగి విచారింతుము. నీయల్లుని వెంటనేనాయొద్ద కనుపుము. ఇదియే ముమ్మాటికి నాజ్ఞాపత్రిక అని చదివిన విని దేవవర్మ క్రోధాక్రాంత స్వాంతుడైఁ ఔరా! సూర్యవర్మ తాను జక్రవర్తియైన నగుంగాక నిజముదెలియక నన్న న్యాయముజేసితినని వ్రాయుట లెస్సయా? అల్పుని గుణమేమిదెలిసి యిట్లువ్రాసెను. అని పనికి తనలోఁ దాను నిదానించుకొని ఔను. అయ్యభియోగము రీతి జదివిన నట్లే తోచును. గ్రామాధికారిని మండలాధిపతిని నేనిట్ల నలేదా! ఇది వానితప్పుగాదు. నిజము తెలియజేసెదంగాక యని యాలోచించి తిరుగా నిట్టిప్రత్యుత్తరము వ్రాసెను.

మహారాజా! తమ యాజ్ఞాపత్రికం జదివికొంటిని. అయ్యభియోగము నేను బూర్తిగా విమర్శించితిని. అల్పుఁడు కడు నుత్తముఁడు సురస స్మరవశయై తానుజేసిన తప్పంతయు నల్పునిపై మోపించినది. కన్నులారాఁ జూచితిని చెవులార వింటి. నేను న్యాయమే కావించితిని అల్పుని గుణసంపత్తియే నేనల్లుని జేసికొనుటకుఁ కారణమైనది నారాజ్యమున కల్చుఁడే యధిపతి. అతండు మీకు గౌరవనీయుఁడు, అపరాధివలె మీయొద్దకు రానర్హుఁడుగాడు తప్పులు మన్నింపవలయును. అని వ్రాసి సూర్యవర్మ యొద్ద కనిపెను.

మఱిరెండు దినములు గడచిన పిమ్మటఁ గ్రమ్మర సూర్యవర్మయొద్దనుండి మఱియొక కమ్మవచ్చినది. అందు అపరాధియైనప్పుడు నీయల్లుఁడై ననేమి? నీవైననేమి? తప్పక రాజభట బంధితుఁడై మా సభకు రావలసినదే. అందలి నిజానిజంబులు విమ ర్శింతుము. నీకిప్పుడు పనిలేదు. అపరాధియని మాకుఁ దోచిన శిక్షింతుము. కాకున్న గౌరవింతుము. కాని నీకల్లుఁ డైనంత మాత్రముననే నీవు రాజ్యమిచ్చినంత మాత్రము ననే యతండు పూజ్యుఁడు కాఁడు నీవు మాయాజ్ఞ తిరస్కరించినట్లు తలంచితిమి. ఇది మొదటితప్పుగాఁ తలంచి క్షమించితిమి. తక్షణము నీయల్లు నిచ్చటికిఁ బంపవల యును. అట్లు పంపక యెద్దియో కల్పించి ప్రత్యుత్తరము వ్రాసితివేని నిన్ను మన్నిం పను. నీపైదండెత్తివచ్చి నీపీచమడంచి నీరాజ్యమంతయు మాయధీనము జేసికొందుము. ఇదియే ముమ్మాటికిని శాసనము అని వ్రాయఁబడియున్న పత్రికం జదువుకొని దిగులు మొగముతో నేమియు మాటాడనేరక అప్పుడు యమున యంతఃపురమునకరిగి సఖు లతో సరసగోష్ఠి వినోదముల బ్రొద్దుపుచ్చుచున్న కూతుఁజూచి ప్రీతిపూర్వకముగా సూర్యవర్మ పంపిన సందేశప్రకారమంతయు బోధించి యిపుడు కర్తవ్యమేమి యని అడిగెను.

ఆమె యించుక ధ్యానించి తండ్రీ! మనమా విప్రుల కన్యాయమేమియుఁ జేయ లేదు. చాటుననుండి సురస యల్పునితోఁ బలికిన పలుకులన్నియు వింటిమి అతం డిచ్చిన ప్రత్యుత్తరము గ్రహించితిమి కన్నులారజూచి సురస మహాపతివ్రతయన నెట్లు సమ్మతింతుము అల్పునెట్లు దండింతుము ఈ రహస్యమా రాచపీనుగున కేమి తెలియును. తెలిసి తెలిసి ఆతం డపరాధియనినంతమాత్రమున నల్పుని నతని యొద్దక పరాధివోలె నంపమా? యింతకన్న నవమానమేమియున్నది. ఎప్పటికైనఁ జావు జంతు వులకు విధియైయున్నది. క్షత్రియులకు సంగరంబునం జచ్చుటఁ బరమధర్మము జయించితిమా పేరు పొందుదుమని పలికిన విని దేవవర్మ సవినయముగా యిట్లనియె.

తల్లీ! సూర్యవర్మ చేతిక్రింద నలువదిమంది సామంతరాజులు గలరు అతండు గోరినవారందఱు జతురంగబలముతో సహాయము వత్తురు. మనకు వజ్రదత్తుఁడుతప్ప వచ్చిన మిత్రుడొక్కరుఁడును లేడు. ఉన్నను జక్రవర్తికి వెరచి తోడ్పడరు. కావున మనము జయించుటెట్లు ఓటమియే నిక్కము ఎట్లైనను బోరక తీరదని చెప్పిన విని యమున యిట్లనియె.

దైవము ధర్మమందుండును. ధర్మముగలవానికి జయము గలుగును. బలగ ముతోఁ బనిలేదు. మనకు దైవమువచ్చి సహాయము చేయును. నీవు జింతింపవలదు. యుద్ధప్రయత్నము చేయింపుమని యుపదేశించెను.

అంతలో నల్పుఁడు అచ్చటికి వచ్చెను. అతనితో నావృత్తాంతమ౦తయుం జెప్పిన నతండు సంవర్తసమయ వలాహకంబువోలె గర్జిల్లుచు ఏమి? సూర్యవర్మ కింత కావరమేల గలిగినది. మదీయ పరాక్రమ విధం బెరుఁగఁడు దేవవర్మ యస హాయుండని తలంచి యట్టి వ్రాతలు వ్రాసెను. కాని రణరంగమునఁ బశ్చాత్తాపంబు జెందఁగలడు అని పలుకుచు యుద్ధమునకు సన్నద్ధులమై యుంటిమని జూబు వ్రాయమని పలికెను. నీవు మాపై యుద్ధము ప్రకటించితివి మాయందపరాధమేమియును లేదు. దైవమే మాకుఁ దోడుపడును. సన్నద్ధులమై యుంటిమి అని దేవవర్మ సూర్య వర్మకుఁ బ్రత్యుత్తరము వ్రాసెను. ఆయుత్తరము జూచికొని సూర్యవర్మ మంత్రు లతో నాలోచించి దేవవర్మపై యుద్ధము ప్రకటించితి మనియుఁ బ్రతిసామంతరాజు నిరువుర మహావీరులను లక్ష సైన్యమును బంపుమని యాజ్ఞాపత్రికలం బంపెను. తచ్చాసన ప్రకారము రాజులందఱు సైన్యముతో వీరుల నంపిరి.

దేవవర్మయుఁ దమ మిత్రులఁ గొందఱఁ దోడు రమ్మని కమ్మల వ్రాసెను. ఎవ్వరో యిద్దరు ముగ్గురు రాజులు మాత్రము ప్రచ్ఛన్నముగాఁ గొంత సైన్యమును సహాయముగాఁ బంపిరి.

ఇరువాగులును వ్యూహములను బన్ని యుద్ధమునకు నాయత్తపడి యుండిరి. రెండుమూడు దినములలో మహాయుద్ధము జరుగఁగలదు మనకుఁ దృప్తియగు నాహా రము దొరకగలదని భూతరాజు భార్యకుఁ దద్వృత్తాంతమంతయు జెప్పెను.

ఆకథవిని భూతపత్ని అయ్యో ? పాపము దేవవర్మ బలహీనుఁడగుట శత్రువు నకు లొంగిపోవును కాఁబోలు, న్యాయమితనిదేకదా? ఇవిరో యేరాజుగాని నీదన్యా యము. యుద్ధము జేయఁగూడదని మందలింపక సూర్యవర్మ కోరినంతనే బలములఁ బంపదగునా! ఇది ధర్మవిరుద్ధము ధర్మవిరుద్దమని పలుకగా భూతరాజు మనకేది విరుద్ధమైననేమి? పూర్తి యదు నాహారము దొరుకుచున్నదిగదా! అబ్బా యీ కడుపు మంట నేను భరింపజాలకుంటినిగదా. అయ్యో ఇంకను రెండుయామములై న కాలేదే? ఎప్పుడు తెల్లవారును. ఎప్పుడు ప్రొద్దుగ్రుంకును మరలనెప్పుడు ఆహారము దొర కును. అని యాఁకట వేగుచుండ నతని భార్య అయ్యో? నీబాధ నేను జూడలేకుం టిని ఆహారమేదియుం దొరకదు నే నేమి జేయుదును. అని పరితపించుచుండెను.

వారి సంవాదమంతయు విని విరతి నిరతిశయ దయాకలితహృదయయై పాపము ఈ భూతదంపతులు ఆహారములేక మలమల వేగుచున్నారు. నేను వీరి కాహారమైతినేని నాజన్మసాద్గుణ్యము నొందును. నేను బ్రతికి యేమిజేయుదును. అని తలంచి మెల్లగ లేచి వారియెదుటకు వచ్చి నమస్కరించుచుఁ బిశాచభాషతో నిట్ల నియె.

ఓ భూతదంపతులారా ! మీరు ఆకలిచే మిక్కిలి బాధపడుచున్నారు. నేనొక మనుష్యకాంతను దైవికముగా మీటెంకికరుదెంచితిని. నన్ను మీరు భక్షించి మీయా కలి యడంచికొనుఁడు. నేను గృతార్దురాల నగుదును. భూతతృప్తి జేయుటకన్న నుత్తమపుణ్యములేదు. అని బలికిన ఆ దంపతులామె దిక్కు మొగ౦బై యబ్బుర పాటుతో నెగాదిగజూచి నీవెవ్వతెవు? ఇవ్విపినంబున కెట్లు వచ్చితివి? మాభాష యెట్లు తెలిసికొంటివి? ఇట్టి సాహసమేల జేసెదవు. చావునకు సమ్మతించువారుందురా! అని యడిగిన విరతి మరల నిట్ల నియె.

నాచరిత్రము వినుట సే మీకును గొంతవిచారము గలుగును. దానితో మీకేమి పని ఆకలికి క్షణమోర్వలేని స్థితిలో నుంటిరి. ఎవ్వరైననేమి మనుష్యకాంతను మీకు భక్షింపఁదగినదానను వేగ భక్షించి నా దుఃఖమును బోగొట్టుఁడని వేడినది.

అప్పుడు భూతకాంతసాదరముగాఁ జేరదీసి, అమ్మా! నీవుమాయింటి కతిధివై తివి ఎంతయాకలిగా నున్నను నతిధిని భక్షించు పాపాత్ములుందురా? ప్రాకృ తుండైనను అతిధి పూజార్హుఁడు నీవంటి యుత్తమురాలి సంగతి చెస్పనేల? నీవే దియో నాపద నొందియున్నట్లు తలంచఁబడుచున్నది. నీకంఠస్వరము మిక్కిలి మాధుర్యముగానున్నది. నీవుత్తమజాతి యువతివలె దోచుచున్నది. నీవృత్తాంతము జెప్పుమని యడిగినది నీకథజెప్పినంగాని నీ మేని మాంసము మేము ముట్టమని భూత రాజు పలికెను.


శ్లో. భీమంవనం భవతి తస్య పురం ప్రధానం
    సర్వోజన స్స్వజనతా ముపయాతి తస్య
    కృత్స్నాచ భూర్భవతి కాంచనరత్న పూర్ణా
    యస్యాప్తి పూర్వసుకృతం విపులం నరస్య

అప్పుడా రాజపుత్రిక తన చారిత్రమంతయుఁ బూసగ్రుచ్చినట్లు వక్కాణించి అదిగో అతఁడే నాభర్త చెట్టుక్రిందఁ బండుకొని గుఱ్ఱువెట్టి నిద్రబోవుచున్నవాఁడని చెప్పినది. భూతకాంత యయ్యుదంతమువిని యత్యంత విస్మయకృపాపరీతస్వాంతయై తల్లీ! నీవంటి యిల్లాలింజంపి తినుమనుచుంటివా? ఆహా! నీశీలము త్రిలోక జనస్తుత్యమై యున్నది. నీయక్కయు నీయన్నయు నైశ్వర్యమదమత్తులై నిన్నా క్షేపించియడవిలోనికి త్రోసిపుచ్చిరా? కానిమ్ము నవ్విన యూళ్ళెపట్టణంబులు కాకపోవునా? నీతండ్రి యింత కఠినాత్ముడయ్యెనా! రత్నమువంటి నిన్ను ముష్టియెత్తికొనియెడు జంగమునకిచ్చి పెండ్లి కావించునా! ఔరా! యెంతవింత యని వెరగుపడుచుఁ బతింజూచి ప్రాణేశ్వరా? యీచిన్నది కడు నుత్తమురాలని యీమె చరిత్రమే చెప్పుచున్నది. ఈపూతురాలి పాద రేణువు సోకిన మనము పవిత్రులమగుదుము. దీని మగఁడు వెఱ్ఱివాఁడు చెట్టుక్రింద బండుకొని యున్నవాఁడు వానికిమంచి ఐశ్వర్యము గలుగఁజేయవలయు నిందులకుఁ దగిన యుపాయమాలోచింపుఁడు. అని ప్రార్థించిన అతండు బత్నిమాట జవదాటని వాఁడగుట వల్లె యని యొప్పుకొని యందులకుఁదగిన యాలోచనము జేయుచుండెను.

అప్పుడు భూతపత్ని తల్లీ! నీవల్లభుని జూడవలయు అతనివృత్తాంతమెట్టిదో యెరుఁగనని చెప్పితివి ఇది కడు విపరీతము ఇటు పిలువుము అనుటయు విరతి సిగ్గభిన యించుచు దేవీ! ఇదివరకు నేను బలుకరించి యెరుఁగను. నన్నతఁడును బలుకరింప లేదు. ఇప్పుడేమని పిలుతును, అని సంశయకలితమతియై పలికిన అక్కలికింజూచి భూతపత్ని నవ్వుచు పద పద సిగ్గేల నేనుగూడ వత్తుననుటయు అతఁడు పండుకొని యున్న చెట్టుక్రిందకి నామె నామెందీసికొని పోయినది.

అంతకుమున్నె ఆతండులేచి ప్రక్కను విరతింగానక నలుమూలలు సూచుచు నింతలో వీరిద్దరు వచ్చుటజూచి దద్దరిల్లి అట్టేలేచి యోసరిల్లి యేమియుమాటాడక వింతగా భూతకాంతంజూచుచుండెను.

అప్పుడు విరతి దేవీ ! యితండే నేజెస్పిన యతండు చూడు మనవుఁడు భూత పత్ని దాపునకుఁబోయి చూచుచు నీవెవ్వఁడవు? నీవృత్తాంత మెయ్యది? నీదేకులము నిజము జెప్పుము చెప్పకున్న నిన్నుదండింతుము నిజముచెప్పిన గౌరవింతుము. ఇందు లకే నిన్నీ చిన్నది మాయొద్దకు దీసికొనివచ్చినది. అతండే భూతరాజు నేనతనిపత్నిని మేమిద్దరము ఆపర్వతశిఖరమున వసింతుము. ధర్మపత్నియగు విరతి మూలమున నీతో నింత మెల్ల గా మాట్లాడుచున్నదానను. లేకున్న నాభర్త నిన్నీపాటికి జీల్చి విడుచును నిజము చెప్పము. అని యడిగిన అతండు విస్మయ సాధ్వవిద్యస్తచిత్తుండై చీకాకు పడి నిజము చెప్పక తీరదని యిట్లు చెప్పదొడంగెను.

అని యెఱింగించి ... ఇట్లని చెప్పదొడంగెను.

138 వ మజిలీ.

సుగతునికథ

అమ్మా! నీవు నన్నడిగినంతనే నావృత్తాంతమంతయు స్ఫురించుచున్నది. వినుము శ్రీకంఠనగరంబున వజ్రదత్తుఁడను. రాజు గలఁడు. అతండు సంతాన శూన్యుండై పెద్దకాలము పరితపించుచుండెను. సామ్రాజ్యవై భవసంతోషంబు నణఁగ ద్రొక్కి సంతానరాహిత్య పరితాపంబభివృద్ధి నొందుచుండెను.

ఇట్లుండ నొకనాఁడవ్వీటికి అపరశివావతార మనందగు జంగమదేవర యొకం డరుదెంచి శివాలయములో వసించెను. భూతిరుద్రాక్ష మాలికా విరాజితగాత్రుండు శంఖ ఘంటికాధారుండునై యొప్పుచున్న అతవివేషము జూచినవారికి మహానుభావుండని తోచక మానదు. అతఁడు త్రికాలవేదియనియు రసమూలికా సిద్ధుండనియుఁ బౌరు లద్భుతముగాఁ జెప్పుకొనఁ దొడంగిరి.

ఆవాడుకవిని వజ్రదత్తుఁడొకనాఁ డయ్యోగికడకుఁబోయి స్తుతి పూర్వకముగాఁ దన యభిలాష నెరింగించెను. అయ్యోగి యానృపతి గృపావిలోకనములఁజూచుచు