Jump to content

కాశీమజిలీకథలు/ఏడవ భాగము/130వ మజిలీ

వికీసోర్స్ నుండి

ఎన్ని యిడుములం బడితిమి. పదపద. అడవులలో దాగిన విడుతుమనుకొంటివా? అని అదలించుచు వానిం బంధించిరి. మృగదత్తుఁడు తెల్ల తెల్లపోయి చూచుచుండ గదాధరుఁ డించుక యాలోచించి యిది యెవ్వరియాజ్ఞ వీఁడేమిఅపరాధము జేసెనని అడిగిన వాండ్రు అది మాకుఁ దెలియదు. గజేంద్రవాహునుని యానతిని వీనింబట్టితిమి. మేముకాక పెక్కండ్రు రాజభటులు వీని నిమిత్తము తిరుగుచున్నారని చెప్పిరి.

అందలికారణము పలుతెరంగులఁ దలంచుచు గదాధరుఁడు, ఏమియైనను లెస్సయే మేముగూడవత్తుము. పదుఁడని పలుకుచు నతనివెంట నడువసాగెను. గొన్ని దినంబులకు నా రాజకింకరులు వారి నుదయార్కునివీటికిఁ దీసికొనిపోయి రాజు ముందర నిలువఁబెట్టిరి.

ఉదయార్కుఁడు వారిం జూచి, ఏమిరా? నీకతంబున మాకుబైవారివలనఁ జాల యవమానములు వచ్చుచున్నవి. మాచక్రవర్తి నిన్నుబంపుమని యిరువదిసారులు ఆజ్ఞా పత్రికలఁ బంపిరి. నీ జాడ యేమియు మాకుఁ దెలియదు. రత్నాంగి పైవారింబట్టికొని తనయపరాధము మాపికొనఁదలంచుచున్నది. నీవునుఁబోయి గట్టిగా వాదించి గెలుపు కొనిరమ్ము. పొమ్ము. నీ వెంట రాజపురుషులువత్తురు వెఱవకుమని బలికిన విని సంత సించుచు మృగదత్తుఁడు గదాధరునితో మనమక్కడికిపోయి వాదింపవలసి యున్నది. నీవు బుద్ధిమంతుడవు ఎట్లు చెప్పవలయునో యాలోచింపుమని పలికెను. గదా ధరుఁడును గ్రమ్మర నాకథయంతయును విని విమర్శించుచుండెను. రాజభటుల విచా రించు దివసమున వారిని విద్యానగరమునకుఁ దీసికొనిపోయిరి.

అని యెఱింగించి ... .... ... ....

130 వ మజిలీ

అపరాధవిచారణకథ

అయ్యో? అయ్యో? మృగదత్తా! మనరహస్యము వెల్లడియగునట్లున్నది. అన్నన్నా? విధిసంఘుటనము కడు విపరీతముగదా. రామదుర్గనగరమునుండి రాజ ప్రతినిధియంపిన యభియోగ మీదినమే విచారించునఁట అప్పుడే పిలుచుచున్నారు. గురుదత్తాయనియు గుముదాంగదా యనియు గదాధరా యనియు మూడేసిమారులు పిలుచుచున్నారు. ఇప్పుడు మన మేమిచేయవలయును కన్నములో దొరికిన దొంగ చెప్పినమాటల నెవ్వరైన నమ్ముదురా? మన మట్లే దొరకితిమి. ఇప్పుడేమి చేయఁదగినది? రాజభటులు పారిపోవనీయరు. నిన్నుఁ విడిచి మేము పోవఁజాలము. అని భయ మభిన యించుచుఁ బలికిన విని యతండులికిపడి ఆహా ? మనదినము లెంతచెడ్డవి. మనకన్న ముందుగా శనిచారమువచ్చి పీడించుచున్నది కదా. కానిమ్ము. ఏమిచేయుదుము. చంపినఁ జంపుదురుగాక. ఎట్లు విచారింతురో నీవు సభలోఁగూర్చుండి యాకర్ణింపుము. కాకు న్నది కాక మానదుగదా యని చెప్పిన విని వాని ధైర్యమునకు సంతసించుచు గదా ధరుఁడు సభలో నొక మూల గూర్చుండి వారివిచారణ వినుచుండెను.

దివ్యరూపసంపన్నుఁడై సుమేధుఁడు పీఠ మలంకరించెను. పార్శ్వములయందు న్యాయవాదులు సముచితాసనంబుల నుపవిష్టులైరి. యుపసభ్యులచేతను బ్రేక్షకులచేతను సభాభవనము క్రిక్కిరిసి యుండెను.

సుమేధుఁడు తొలుతగనే రామదుర్గనగరమునుండి ప్రతినిధి యంపిన యభి యోగము విచారింపఁ బ్రారంభించెను. పిలిచిన తోడనే వీరభటులు మృగదత్తగదాధర కుముదాంగదుల నెదురకుఁదీసికొనివచ్చి నిలువంబెట్టిరి. దాపునకు రమ్మని వారిని రాజు నిరూపించి చూచుచుఁ బ్రతినిధిపక్షమున వచ్చిన న్యాయవాది మొగముజూచి వీ రేమి యపరాధముజేసిరో సవిమర్శముగా వక్కాణింపుమని యడుగుటయు నతండు లేచి యిట్లు చెప్పదొడంగెను.

దేవా ! కొన్ని యేండ్లక్రిందట రామదుర్గనగరాధీశుం డగు సురూపుండను సామంతరాజును, కుముదాంగదుఁడను వైశ్యుని కూఁతురును అల్లుఁడును బలవంత ముగాఁ జంపి కుండులోఁ బారవైచి పారిబోయిరి. వారిఁబట్టికొని తీసికొనివచ్చుటకై నానాదేశములకు నాజ్ఞాపత్రికలు బంపఁబడినవి. వారిజాడ యేమియుం దెలిసినదికాదు. వారిం బట్టికొనుటకై రాజభటులు గ్రామములు దిరుగుచునే యున్నారు. ఆరహస్యము దెలిసికొనుటకై కుముదాంగదుని యింటిలో ధ్వనిగ్రాహిణియను యంత్ర మమర్పఁబడి నది.

ఈనడుమ గురుదత్తునికొడుకు మృగదత్తుఁడును స్నేహితుఁడు గదాధరుఁడు కుముదాంగదుని యింటికివచ్చి మాట్లాడికొనిరి. యంత్రమూలమున వారి మాటల తెరం గంతయుఁ దెల్లమైనది మృగదత్తుడును భార్యయు నడవులలో నెక్కడనో వసించి రహస్యముగాఁ దమవారి వారింట కనుపుచున్నారు కావున వీరు మువ్వురును శిక్షాపాత్రు లైరి. వీరిని శిక్షించుటకు మునుసా సామంతరాజునకే యధికారముండునది దేవరయే యట్టియధికారము తగ్గించిరి. దానంజేసి రాజప్రతినిధి యాయభియోగమును మనయొద్ద కనిపెను. వీరి ముగ్గురిని శిక్షింపవలయునని యాన్యాయవాదియుక్తి యక్తముగా నుపన్యసించెను.

రాజు - సురూపుడి వీరేమిటికి బలవంతముగఁ జంపిరి

న్యాయవాది - పలువురు పలువిధముగాఁ జెప్పదురు నిశ్చయమైన హేతు వెద్దియుఁ దెలియదు. రాజు - ఒండు రెండు భేదములం జెప్పుడు.

న్యాయ - మృగదత్తుని భార్య చక్కనిదఁట. సురూపుఁడును మిక్కిలి చక్కని వాడఁట ఆమె యతనిని మోహించి సాంకేతిక మేరుపరచి తనయింటికి రమ్మనినదఁట ఆ గుట్టు మృగదత్తుఁడు గ్రహించినంతదన్ను బలవంతము చేయచున్నాడని మగ నికిఁ జెప్పి చంపించినదని చెప్పుదురు. కాంతలు బొంకులకు నెలవులుగదా?

రాజు - మఱియొక విధమెట్టిది?

న్యాయ -- రాజే దానిని బలవంతపరచెనని కొందరుచెప్పుదురు. నిజము భగవం తునకుఁ దెలియును విన్నమాటగాని నేనుజూచిన మాటకాదు. ఎట్లయిన వారు రాజుం జంపినమాట వాస్తవము రాజద్రోహాపరాధము వారి నెత్తిపై నున్నది.

రాజు - సురూపునకు సంతతిలేదా?

మృగ - లేదు. లేదు చక్రవర్తియే ప్రతినిధి నేర్పరచిరి. అదియుఁ మీయధి కారములోనే జరుగునని వినియుంటిమి.

రాజు - కానిండు. ఇందు మృగదత్తుఁడెవ్వఁడు?

న్యాయ - (ముందరికివచ్చి) నేను సామి నేను.

రాజు - నీతండ్రి పేరేమి?

మృగ - గురుదత్తుఁడు సామి.

రాజు - గదాధరుడెవ్వఁడు?

గదా - (ముందరికివచ్చి) నేను.

రాజు - కులమేమి?

గదా - బ్రాహ్మణులము?

రాజు - నీవేమి చదువుకొంటివి?

గదా - మాతండ్రి బిచ్చమెత్తికొనుటచే నాకు విద్యవచ్చినదికాదు.

రాజు - అటు నిలువుము. కుముదాంగదుఁడవు నీవేనా.

కుము - (ముందరకు వచ్చి) నేనే దేవా?

రాజు - నీయల్లుడుఁను గూతురుఁను సురూపుని జంపిరఁట నిజమేనా.

కుముదా - సురూపుఁడెవ్వఁడు బాబూ?

రాజు - మీరాజు

కుము - అదియా? నాకుఁ దెలియదు తండ్రి.

రాజు - సరే? మీరవ్వలకుఁ బొండు. రేపు విమర్శింతుము అప్పటికి రండు అని యాజ్ఞాపించెను. అప్పుడు న్యాయవాది లేచి దేవా! ధ్వని గ్రాహిణీయంత్రము నందలి విషయ ములు జ్ఞాపకముంచుకొనవలయును ఆసాక్ష్యమేవీడి అపరాధము ధ్రువపరచుచున్నది. సావధాన మనస్కులై చిత్తగింపవలయునని బలికిన అతండు సరే యిందు వ్రాయఁ బడియున్నదిగదా? పిమ్మట జూచెదంగాక రేపురండు. అని చెప్పి ప్రతీహారితో రత్నాంగి‌ అభియోగములో వాది ప్రతివాదులఁ బిలువుమని యాజ్ఞాపించెను. ద్వార పాలుఁడు హజారమునకుఁ బోయి పేరువరుసఁ బిలిచెను

రత్నాంగియు మఱికొందఱు సాక్షులును రాజు మ్రోలకువచ్చిరి రాజభటులు మృగదత్తుని సుమేధుసంతికమునకుఁ దీసికొనిపోయి నివేదించిరి. గదాధరుఁడును గుముదాంగదుఁడును వాని వెనుక బోయి యోరగా నిలువంబడిరి.

అప్పుడు రాజు మృగదత్తుని జాచి విస్మయము జెందుచు నొక్కింతసేపు కన్నులుమూసికొని ధ్యానించుచు మొదట వానిట్లు బ్రశ్నలువైచెను.

రాజు - మృగదత్తుడవు నీవేకాదా?

మృగ - నేనే సామి‌.

రాజు - నీతండ్రి పేరు.

మృగ - గురుదత్తుండు.

రాజు - కులము.

మృగ -- వైశ్యులము.

రాజు - వెనుక చెంచులమని చెప్పియుంటివే?

మృగ - అది దెలియక చెప్పినమాట సామి?

రత్నాంగి - వీఁడు గడియకొకపేరు చెప్పుచుండును. దేవరవారదియే పరీ క్షింపవలసిన విషయము.

రాజు - నిలు నిలు. నీవు మాటాడవలదు. నీన్యాయవాది లేడా? ఆతఁడే చెప్పును.

న్యాయవాది -- దేవా! ఇది కడువిపరితముగా నున్నదిగదా? ఇందాకవచ్చిన వాఁడును, గురుదత్తుని కొడుకుననియు దనపేరు మృగదత్తుఁడనియుఁ జెప్పికొనియె వీఁడునట్లే చెప్పుచున్న వాఁడు వీరిలో నిజమైనవాఁడెవ్వడు?

రాజు - మృగదత్తా! ఈ తివాసి యెవ్వరల్లిరి?

మృగ - నేనే సామి.

రాజు - ఈపని యెందు నేర్చుకొంటివి?

మృగ - కొండపల్లిలో నల్లియున్న యాస్తరణలం జూచి వాని విప్పిచూచి నేర్చుకొంటిని. నాకెవ్వరును జెప్పలేదు సామి. రాజు - కొండపల్లిలో నేమిటికుంటివి?

మృగ - నాకది జన్మభూమి.

రాజు - నీతల్లి పేరు.

మృగ - నాకుఁదెలియదు సామి.

రాజు - ఇతరులు చెప్పగా వినలేదా.

మృగ - తలయొకమాటయుం జెప్పిరి సామి.

రాజు - తండ్రి గురుదత్తుఁడని చెప్పితివిగదా! తల్లి పేరుమాత్రమేమిటికిఁ దెలియదు.

మృగ - పద్మిని అని కొందఱు చెప్పిరి.

రాజు - (పీఠముపైఁ జేరబడి యొక్కింతతడవు ధ్యానించి మరల ధైర్య మంది) నీవీరత్నాంగి నెరుఁగుదువా?

మృగ - ఎరుఁగుదును.

రాజు - దానియింటిలోనున్న యొక పరిచారికం దీసి కొనిపోయితివఁ సత్య మేనా?

మృగ - లేదు. లేదు. అది వట్టిమాట చెప్పుచునున్నది.

రాజు - దాని యింటికిఁ బోయితివా?

మృగ - పోయితిని. అందున్న యామె కడునిల్లాలు సామి.

రాజు - ఎట్లు గ్రహించితివి.

మృగ - బోగమువాండ్రు కడు చెడ్డవారనియు వారింటికివచ్చుట తప్పనియు నాకుఁ జాల బోధించినదిసామి. మఱియు ననేక నీతులు బోధించినది. అప్పటి నుండియు నట్టిపనులు మానివేసితిని. నా వృత్తాంతము విని పేరు మార్చుకొమ్మని చెప్పినది. యుత్తరము (అనబోయి మానివేసెను.)

రాజు - ఉత్తరమేమి చెప్పుము. చెప్పుము. యదార్థము చెప్పిన దోషము లేదు.

మృగ - ఏమియో యుత్తరము వ్రాసియిచ్చినది.

రాజు - ఎవ్వరికిమ్మని.

మృగ - (సంశయింపుచు) మా బంధువులకే.

రాజు - బంధువులనగా నెవ్వరో సరిగా జెప్పుము.

మృగ - రామదుర్గనగరంబున నున్న కుముదాంగదునకు.

రాజు - చూపితివా? మృగ - అందువలననే కాదా? ఇన్ని యిక్కట్టులు వచ్చినవి.

రాజు - ఏమి వచ్చినవి.

మృగ - గదాధరుని దృష్టితైక్ష్ణ్యము గ్రహించి సవరించుకొని మఱేమియుం గాదు దూరదేశమునుండి యిక్కడికి వచ్చుటలోనుగాఁగల ప్రయాసము.

రాజు - గదాధరుఁ నెరుఁగుదువా?

మృగ - ఎరుంగుదును. ఉ. ఉ. ఎరుఁగను.

రాజు - తబ్బిబ్బు పడుచుంటివేమి? భయములేదు. నిజము చెప్పుము. ఇంతకు ముందు వచ్చినవారిలో మృగదత్తుఁడను వాఁడుండెను వాని నెరుంగుదువా.

మృగ - గదాధరుని మొగము చూచుచున్నాడు.

రాజు - ఆదెస జూచుచున్నావు అందెవ్వరున్నారు.

మృగ - మావారున్నారు.

రాజు - వారినిట్లేదురకు రమ్మనుఁడు.

గదాధరుఁడు - ముందరికివచ్చి దేవా ! నేనీతని తండ్రికి మిత్రుఁడను. నాపేరు గదాధరుఁడు.

రాజు - వీనితో నీకెందుఁ బరిచయమైనది.

గదా - దారిలో.

రాజు - (రత్నాంగింజీరి) వీనిమాటలు వింటివా?

రత్నాంగి - (న్యాయవాది మొగముజూచుచు) వింటినిదేవా ! వింటిని. అన్నియు నసత్యములే?

న్యాయవాది - జోహారు దేవా! నాయుపన్యాస మించుక వినవలయును. ఇది యొక విచిత్రనాటకమువలె నున్నది. మొదటి యభియోగములో మృగదత్తుఁడు, గదా ధరుఁడు, కుముదాంగదుఁడు అని మువ్వురు ప్రతివాదులు వచ్చియుండిరి. వారి యపరాధముగురించి రేపు విమర్శింతుమని దేవర సెలవిచ్చియున్నారు. రెండవ మృగదత్తుఁడు మాయభియోగమున సాక్షియైయున్నాడు. విమర్శింప నతఁడు నితఁ డును నొక్కఁడే యైనట్లు తెలియఁబడుచున్నది. అట్టిశంక జేసియు దేవరయేమిటికో విరమించితిరి. వీనిమాటలలోఁ దబ్బిబ్బులుగనంబడుచున్నవి. ఇందలి నిజ మేమిదియో తెలిసికొనవలసియున్నది. మొదటి యభియోగమునందు గదాధరుఁడును అపరాధియైయున్నాడు. ఈతఁడు వాని నెరుంగుదుననియు నెరుంగననియుఁ జెప్పు చున్నాడు. అయ్యరాధుల మువ్వుర మరలఁ బిలిపింపుఁడు. ఎదురఁబెట్టి విమ ర్శింపవచ్చునని పలికిన నాసుమేధుఁడొక్కింత యాలోచించి యంతయు రేపు విమ ర్శింతుము. కాలాతీతమైనదని పలుకుచుఁ బీఠమునుండి లేచెను. సభ్యులెల్లరు లేచి మరునాఁడా వింతఁజూచుటకై వేడుక పడుచుఁ దమతమ నివాసములకు౦ బోయిరి.

మృగదత్తుండు గదాధరుండును నాఁటికి దాటినది మరునాఁటికి వేరొక యుపా యము దొరకకపోవునా? యని సంతసించుచు నివేశ దేశమున కఱిగిరి. రత్నాం గియు సుమేధుఁడు పక్షపాతముగా విమర్శించుచున్నవాఁడని తన న్యాయవాది చెప్పు టచే మిక్కిలి విచారించుచు నెలవునకుం బోయినది.

అయ్యభియోగము విచారించుటచే సుమేధునకు మనంబుననేదియో విచార మంకురి౦చినది. ఆరాత్రి నిద్రయేపట్టినదికాదు. ఏదియోయాలోచించుచుండఁగనే తెల్ల వారినది. ఆరాజునకుఁ బ్రతిదినము ప్రొద్దుట గుఱ్ఱ]మెక్కి కొంతదూరము పోయి వచ్చుట వాడుకయైయున్నది. నాఁడుత్తరముగా యున్న యొక రాజమార్గమునంబడి పోవుచుండెను.

తఱుచు పట్టణప్రాంతమందలి పల్లెవారందఱు పెందలకడ లేచి పాలునుం, బెరుగు, నెయ్యి, పుల్లలు, కసవు, కాయఁగూరలు, ఫలములు లోనగు పదార్థము లన్నియుఁ బట్టణమునకుఁ తీసికొనివచ్చి యమ్ముకొనిపోవుచుందురు. మోయలేనిబరువు మోసుకొనుచు నడుమనడుమఁ దింపికొని యెత్తువారికొరకు నెదురుజూచుచు విడిపోయిన కట్టల సవరించుచు వెనకిఁ బడిన వారిం జీరుచుబలుకష్టములతోఁ వచ్చు చుండెడిజానపదులం జూచుచు సుమేధుఁడు నాఁడు తనదృష్టి దైవికముగా వారిపై వ్యాపించుటచే వారి శ్రమలకు వగచుచు వినోదముగా వారిం బరామర్శించుచు గుఱ్ఱమును మెల్లగా నడిపించుచుండెను.

గుఱ్ఱపువాఁడు ముందునడుచుచుఁ దొలఁగుఁడు దొలఁగుఁడు. ప్రభువువారు ప్రభువువారు అని యెదురువచ్చు జనుల బెదిరింపుచుండ వాండ్రు జడియుచు నెత్తి నుండి గంబల దిగవిడుచువారును దొందరగా నోసరిల్లి నేలంబడువారును, దద్దరిల్లి వెనుకకుఁ బరుగిడువారునునై యిక్కట్టులఁ జెందుచుండ జూచిఁ రాజు గుఱ్ఱపునానిని మందలింపుచు మాటాడనీయక గుర్రమువెనుక రమ్మని మెల్లగాఁ దన వారునమునకు నెదురువచ్చు వారికడ్డముగాకుండ నడిపించుచ౦డెను.

ఆహా! కడుపుచిచ్చునకుఁగదా? వీండ్రందరు మోయలేని బరువు మోచికొని వచ్చుచున్నారు. అయ్యయ్యో దైవమందఱను సమముగా భాగ్యవంతులఁ జేయక కొందఱఁ గటికి దరిద్రులను జేయుచున్నాడే.


శ్లో॥ ఆభిమత మహామాస గ్రంధిప్రబేదన పటీయసీ
     గురుతర గుణగ్రామాంభోజ స్రుటోజ్వల చంద్రికా


   విపులవిలసల్ల జావళ్లీ వితాన కుఠారికా
   జఠర పిఠరీ దుష్పూరేయం కరోతి విడంబనా.

అక్కటా ! వీండ్రింత కష్టపడిసంపాదించిన ద్రవ్య మొక్కపూటకైఁన బూర్తిగాఁ జాలదు. ప్రతిదినము వీరిట్లు కష్టపడుచుండవలసినదే. వీరికి నిష్క్రతియెప్పుడో తెలియదు. అని కూలివాండ్రంజూచి యూరక జాలిపడుచు నోపినసహాయము గుర్రపువానిచేఁ జేయించుచుండెను. అప్పుడు


ఉ॥ మాసిన మోటుకోక జడిమంబున మేనికిఁ జుట్టఁబెట్టి య
      భ్యాసము లేనిరీతిఁ దలపనిడి తక్రఘడంబు పాదవి
      న్యాసమ బర్వుమో సెడు ప్రయాసము దెల్పఁగ గొప్పువీడియా
      యాసముతోడవచ్చెడు ప్రజాంగనయొక్క తెయూర్పులేర్పడన్‌.

ఒకగొల్ల భామ పట్టణాభిముగముగా వచ్చుచు శిరంబుననున్న చల్లకుండ బరు వగుట భరింపఁజాలక మార్గపార్శ్వమందు మొలబంటి యెత్తుగానున్న తూము గోడపైఁ జుట్టకుదురుతోఁ గూడఁ జల్లకుండ దింపి నిస్సురని నిట్టూర్పునిగుడింపుచు మోము తమ్మింగ్రమ్మిన చెమ్మటను దుడిచికొనుచుఁ బ్రొద్దువంకజూచి వేగిరపాటుతోఁ గుండ యెత్తికొనఁబోయియు నది పైకిలేవమి వగచుచు బాటసారుల కొఱ కిటు నటు చూచు చుండెను.

సుమేధుఁడు గుఱ్ఱము నిలువఁబెట్టి యాగోపికంజూచి యాహా!యాకోమలాంగి యవయవములు మృదువులయ్యుఁ గఠినక్రియలు చేయుటచే మోటెక్కినట్లు కనం బడు చున్నవి. అలంకారశూన్య యయ్యు నయ్యువతి శోభాజనకంబుగాఁ దోచఁబడు చున్నది.

అయ్యయ్యో? ఇట్టి కలకంఠిని నీచకులంబునం బుట్టించెనేమి? పాపము మోయ లేని బరువు మోచికొని పోవుచున్నది. ప్రొద్దెక్కిననమ్మకముగాదని కుండ నెత్తికొనఁ బోయియు నాపలేకపోయినది. దీని మగఁ డెంతకఠినాత్ముఁడోకదా ఇట్టికష్టపుపను లను చెప్పవచ్చునా? నిరూపించి చూచినంగాని దీని చక్కఁదనము దెల్లముగాదు. గోపికవలె నొప్పుచున్నది. అని మెచ్చుకొనుచు గుఱ్ఱపువానిం జీరి యోరీ? నీవామె కడకుఁబోయి కడవనెత్తిరమ్ము. పాపమాచిన్నది యెత్తువారి కొఱకు నిరీక్షించుచున్నది అని నియమించుటయు వాఁడు హసాదుసామీ! యని యల్లన యాముద్దరాలియొద్దకుఁ బోయి అమ్మా। రాజుగారి సెలవై నది. కుండయెత్తెద లెమ్మని పలికెను.

ఆయిల్లాలించుక శంకించుచు రాజు నోరజూపులఁ జూచినది. వీక్షణవైచిత్ర మున కతండు వెరగందుచు నయ్యిందువదన యుత్తమ కులసంజాతురాలని నిశ్చ యించెను. అప్పుడప్పడంతి పురషసాన్నిధ్యంబునకు వెరచుచు నుపాయాంతరము లేమి౦జేసి‌ కుండ యెత్తుమని యొడంబడి కట్టువస్త్రంబు సవరించుకొనుచు వాఁడు సహా యము చేయుచుండ నాకు౦డఁ దన రెండు చేతుల నాని యెత్తికొనినది.

పురుషసాన్నిధ్యంబునకు, గొంకుచు నప్పంకజాక్షి కుండ యెత్తుకొనునప్పు డించుక యోసరిల్లుటయు గడవయొరిగి యందున్న చల్ల సగము నేలపాలైనది. సుమేధుఁ డందులకుఁ బరితపించును గుఱ్ఱము దిగివచ్చి వానిందిట్టుచు అయ్యో! సాధ్వీ! వీఁడు తిన్నగా నెత్తకపోవుటచే నీచల్ల నేలపాలై నది మగువా! వగవకుము. దీనింబదిల ముగా నెంతయో దూరమునుండి తెచ్చుచుంటివి. నాకత౦బుననిది నేలపాలై నది కావున దీనివెల నేనిచ్చివేసెద నీకడవ కెంతి సొమ్ము వచ్చునో చెప్పుము. విచారింపకుము. అని యూరటంబలికిన విని యక్కలికి యిట్లు చదివినది.


ఉ. శ్రీపతి కప్పువెట్టు సిరిచేఁదులఁదూగెడు శెట్టిపట్టినై
    రూపునఁ బేరుపొంది యనురూపపయోగుణరూపశీల వి
    ద్యాపరిపూర్ణుఁ డాత్మహితుఁడై న మనోహరు చెట్టఁబట్టి ఘో
    రాపయశంబుజెందుచుఁ బరాంగనలం జెరఁబట్టుచున్న మా
    భూపతి జంపితి న్మగఁడు భూరిభుజంగముచేతఁ జచ్చెఁ బై
    నాపద జెందిచెంది యుదయార్కుని పట్టణమేఁగి వేశ్యనై
    పాపము గట్టికొంటి నఁటఁ బట్టి విటత్వముఁబూని రాగ సం
    తాపముఁజెంది యగ్గిఁబడి దగ్దముగాకిటు గొల్ల భామనై
    యీపని కొప్పుకొంటి నృపతీ వగ సేటికి ? చల్ల చిందినన్‌.

ఆపద్యమును విని సుమేఁధుడు హా పరమేశ్వరా! యని పలుకుచు నేలంబడి మూర్చిల్లెను. గుఱ్ఱపువాఁ డదిచూచి, అయ్యో అయ్యో గొల్ల భామా? ఏదియో చదివి మాఱేని మూర్చముంచితివి? నీ వెవ్వతెవు? తల్లీ! యుపకారము చేయఁబూనిన వానినే యిట్లు పడవేయుదువా? అని వాఁడు పలుకుచు శైత్యోపచారములు సేయఁదొడంగెను.

ఆ గొల్ల భామయుఁ దెల్ల తెల్ల పోయి జూచుచుఁ గుండదింపి బాబూ నేనేమియు నెఱుంగను. నాకే మంత్రములు తంత్రములు రావు. పాపాత్మరాలనగు నాకుపకారము సేయవచ్చి మీరాజు నేలం బడియెను. నేనేమి జేయుదునని దుఃఖించుచుఁ గుండలో మిగిలియున్న చల్ల నతని మొగమునఁ గొట్టినది.

అప్పు డించుక తెప్పరిల్లి మంధరములగు దృష్టులచే నామెంజూచుచు నారాజు గుఱ్ఱపువాని నీళ్ళుదేర దూరముగాఁ బనిచి హాహా ప్రేయసీ! ప్రేయసీ! ఎన్నినాళ్ళకుఁ గనంబడితివి. ఎట్టి యిడుమలం గుడుచుచుంటివి. అయ్యో? నీవెక్కడ ఈచల్లకుండ అమ్ముట ఎక్కడ అహహా పాడుదైవమా! యింత భ్రుష్టురాలిం జేసిన గాని నీ కక్ష దీరినది కాదేమి? అని వలుకుచు నా కలికిం గౌగలింపబోయెను.

అప్పుడయ్యింతి రవుదవ్వుల కోసరిల్లుచు నిలు నిలు మహారాజా! నాపతి పరలోక గతుడయ్యెను. నేనన్యపురుషుని ముట్టను. నన్నంటరాదు నాబ్రతు కిట్టిదియే యని పలి కిన అతండు మఱియుంగుందుచు గర్భభరాలసవై యున్న నిన్ను నట్టడవిలో విడిచి పోయిన గురుదత్తుఁడ దయావిహీనుఁడ నేనే యని పలికిన నా యిల్లా లించుక యాలో చించి యేమీ? నీవు గురుదత్తుఁడవే యెట్లు బ్రతికి వచ్చితివి? పరమార్థ మెఱింగించి నాసందియము దీర్చిఁ బ్రార్థించుచున్నాను. ఈ మాట సత్యమగుంగాక యని పలికినది కాని దుఃఖపరవశమై యుండుటచే నేమియు నెరుంగదు.

అప్పుడతండు కొన్ని రహస్యవిశేషము లెఱింగించి యామెకు నమ్మకముగలుగఁ జేసి బోటీ ! దై వమిప్పటికి మన కనుకూలుఁడై నట్లు తెలియుచున్నది. నీకుమారుఁడును నీతండ్రి గధాధరుఁడు నిందే వచ్చియున్నారు. నిన్ననే వారింజూచితిని. నేనని వారెరుం గరు. నచర్యలు విచారములో నున్నవని సంక్షేపముగాఁ జెప్పెను.

అప్పుడా ప్రోయాలు గోలున నేడ్చుచు నతని పాద౦బులం బడి ప్రాణేశ్వరా ! నిన్ను గురుతుపట్టక ప్రశ్నజేసినందులకు నాతప్పుమన్నింపుము మనము విడిచిపోయి పదునెనిమిది సంవత్సరములై నది. ఆహా ! దైవమహిమ యెట్టిది నాకు మతిపోయినది నేడే యంతయు స్ఫురించుచున్నది. అని కన్నీరు గార్చుచు నతనిం గౌఁగలించుకొని యెను.

ఆతం డామెను నక్కునఁ జేర్చికొని తదీయశీలమునకు మెచ్చు కొనుచు దైవ మహిమ వర్ణనాతీతముకానిచో నేఁడీ నాబుద్ది యీమార్గమున నడుచు వారింజూచి విమర్శన పూర్వకముగా జాలిఁజెందనేల? ప్రతిదినము నీమార్గంబున విహారమునకు వచ్చుచునే యుంటిని. మార్గంబున వీరందరు గనంబడుచుండిరి.

పరీక్షించి వాండ్రనెన్నఁడు చూడలేదు. ఈదినమున నాకట్టి బుద్ధి పుట్టుట భగ వచ్చర్యగాక మనుష్యయత్నమే. మనుష్యున కించుకయు స్వతంత్రముగలదా? అంతయుఁ దాను జేయుచున్నట్లు కనంబడును. ఏదియుఁ జేయంజాలఁడు. అదిగో పరిచారకుఁడు వచ్చుచున్నాడు ఊరకుండుమని పలికెను.

గుఱ్ఱపుఁ వాడింతలో నీరుదెచ్చెను. వానితో నోరీ యీగుఱ్ఱమును తీసికొని నీవు పొమ్ము. నేను వెనుక వచ్చెదనని చెప్పి వానింబంపివేసెను. తరువాత నామెతో గూడఁ బ్రచ్ఛన్నముగాఁ దన బసలోనికిం బోయెను.

అని యెఱింగించి.