కాశీమజిలీకథలు/ఏడవ భాగము/126వ మజిలీ

వికీసోర్స్ నుండి

126 వ మజిలీ.

మృగదత్తుని కథ

గురుదత్తుఁడునుఁ బద్మినియు వసించిన కోయపల్లెకు నాలుగు క్రోశముల దూరములో మఱియొక కొండపల్లెగలదు. అందును గోయలు, చెంచులు బోయెలు, లోనగు నడవిజాతివారు కాపురముచేయుచున్నారు. వారును జాపలు, బుట్టలు, తట్టలు, మొదలగు నుపకరణములల్లి గ్రామములమీదికిఁ దీసికొనిపోయి యమ్ముచుందురు.

పద్మిని యల్లిన వస్తువులు కతంబునఁ గోయపల్లి లోని వారందఱికి భాగ్యము గలుగుటఁ దెలిసికొని యందలి పెద్దలు గుమిగూడి యొకనాఁడు అయ్యో? కోయ పల్లెవాండ్రందరు వింతచాపలు, బుట్టలునల్లుచుండిరి. మన కాపని తెలిసినదికాదు. మనమేడాది యల్లిన వస్తువుల కెల్ల వచ్చిన వెల వారొక తివాసినమ్మి తెచ్చు చున్నారు. వాండ్రా పని నెక్కడనేర్చుకొనిరో తెలిసికొనవలయు మనముగూడ నేర్చు కొందమని తలంచి యాలోచింపుచుండ వారిలోనొక కిరాతకుమారుఁడు పదమూఁడే డుల ప్రాయముగలవాఁడు ముందరకువచ్చి నాకావస్తువులఁ జూపుఁడు నేనల్లెదనని చెప్పెను.

ఆమాటలు విని కొందఱప్పుడే యాపల్లెకుఁబోయి చుట్టముల యొద్దనున్న వింతవస్తువులఁ గొన్ని తెచ్చి వానికింజూపిరి. బుద్ధిమంతుఁడగు నాబాలుఁడు వానిని విప్పి మరల నల్లి అందలి మర్మముల గ్రహించి యాయాకులఁ దెప్పించి తానుగూడ నాయుపకరణముల నల్లుచుండెను. వానిపేరు చిరుతపులి పలిపులిఅని అందరు వానిం బిలుచుచుందురు. ఆచిరుతపులి యొకనాఁ డల్లిన చాపలును, బుట్టలును మఱియొకనాడ ల్లుటలేదు. అంతకన్నజాలవిన్నాణముగా నల్లుచుండును. సంవత్సరములో నాపని యందాబాలుని కనన్యసామాన్యమైన నైపుణ్యముగలిగినది. గురుదత్తుఁడు పద్మిని అల్లి నవి వాఁడల్లిన వానిముందఱఁ జాలతేలికగాఁ గనంబడుచుండెను. ఆపని యందరిబాలు రకు నేరుపయత్నించెను. కాని యొక్కనికి నాపద్ధతియే దెలిసినదికాదు. వాడుకగా నల్లు చుండు తాడియాకులు, నీతాకులు, ఖర్జూరపాకులు లోనగు నాకులతోఁ నల్లె డుచాపలు మాత్రమే వాండ్రు అల్లుచుందురు.

పిట్టరెక్కలుతోను, వింతమేకబొచ్చుతోను, మృదుదళములతోను తివాసులను గొన్నిటినల్లి వానికి మిక్కిలి వెలవచ్చునని తలంచి తండ్రినడిగి కోయపిల్లవాండ్రు సహాయముగా గాడిదలపై వానిని మఱికొన్ని యుపకరణముల నెక్కించి చిరుతపులి యొకనాఁడు ఉదయార్కుఁడను మహారాజుచేతఁ బాలింపఁబడుచున్న యర్యమపురంబున కఱిగి యూరిబయటఁ గుటీరములఁబన్ని గాడిదలపైనున్న వస్తువులందింపి గ్రామము లోని కమ్మగమునకుఁ దీసికొనిపోయెను.

దేనికెంత వెలవేయవలయునో తెలియక తక్కువవెల వేయుటచే నొక యామ ములో నావస్తువులన్నియు నమ్మకమైనవి. ఆవస్తువులఁ గొనుటకై ప్రజలు కోలాహల ముగా గుమిగూడి వచ్చుటఁ జూచి యాబాలుండు గ్రమంబున నావస్తువుల దరలు హెచ్చు చెప్పుచుండెను. అట్లే అమ్మకమైనవి చివరకు నొకవింతయగు నాస్తరణము మిగిలియున్నది. అది మిక్కిలి కష్టపడి మంచి వస్తువులతో వింతగా నల్లఁబడినది ప్రజల యాతురతఁజాచి యాతివాసి వెల వెనుకటి‌ వానికంటె బదిరెట్లెక్కువ జెప్పు టచే నెవ్వరు కొనలేకపోయిరి. రత్నాంగి అను వేశ్యారత్నము చక్కగా నలంకరించు కొని నాఁటి సాయంకాలమున జిరుతపులి అల్లిన రత్నకంబళము తెరగు పరిచారిక వలనఁ దెలిసికొని వానిం దీసికొనిరమ్మనిపంపి తాను తన మేడవీధియరుగుపై నిలువం బడెను. ఇంతలో నాపరిచారిక యక్కిరాత కమారునిం దీసికొని అచ్చటికి వచ్చినది.

వానింజూచి యావెలయాలు విస్మయమందుచు నౌరా ! వీఁడెక్కడికోయవాఁడు ఆటవిక వేషముతోనున్న వీనిసౌందర్యము ఆసేననకంబై యొప్పుచున్నదిగదా! కానిమ్ము వీని‌ వలపులం జిక్కజేసి‌ టక్కరితనంబున నీతివాసి వెలయీయకయే లాగి వేసెదనని తలంచి వాని తనమేడకుఁ దీసికొనిపోయినది. అందలి వింతలన్నియు జూపి నది. చిట్టకములదే వానిమనసు గరగఁజేసినది. వ్రేళ్ళు వానిబుగ్గలపై విరచి యోహో? గట్టిమనసువాఁడవే లేకున్న నావ్రేళ్లు చప్పుడుకాకుండునా ? ఏదీ నీకంబళము విప్పి చూపుము. అని పలికినవాఁడు ముసి ముసి నగవులు నవ్వుచు దాని లీలలకు లోబడి దానింబరచి చూపెను.

కడు మృదువై పలురంగులతో నొప్పుచు మసృణంబై రత్నప్రభలవలె వెలుగుచున్న యాయాస్తరణం జూచి తలయూచుచు రత్నాంగి‌ బాపురే? సొగసు కాఁడా? యిది యెవ్వరల్లిరి? దీని వెలయెంత చెప్పుమని అడిగిన వాఁడు నేనే యల్లి తిని. ఒరులల్లినది నేనేలతెత్తును దీని వెల నూరుమాడలని చెప్పెను.

బాలుఁడా ? మే మెవ్వరమో యెఱుఁగుదువా ? వెలయాండ్రము. మేమొరులకు వెల యియ్యము అన మఱియేమిత్తువని అతం డడిగెను. ఏమి కావలసినను నియ్య గలము. నీకేది యభీష్టమో అదియే తీసికొనుము అని నవ్వుచు నుత్తరము చెప్పి నది.

నాకు నీవు కావలయునని అతండనిన అందులకు సంసిద్ధురాలనై యుంటి. నిది యిందుంచి రాత్రి రమ్ము అని పలుకుచు జేయిపట్టుకొని మెటికలు విఱిచినది. వాని మేను ఝల్లు మన్నది. పులకలు వొడమినవి. సాత్వికవికారములు తోచినవి యౌవనాంకురము పొడసూపుచున్న తరి స్త్రీసంపర్కము పురుషులకు వికారములు కలిగించుట సహజముగదా ! తద్విలాసములకుఁ జొక్కివాఁడు మొలక మీసములపైఁ జేయివైచి దువ్వుచు నీవు బోగము దానవుగదా ? నిన్ను హాస్యమాడవచ్చునని మా వాండ్రు చెప్పుదురు. రాత్రివచ్చెద నీకిదియూరక యిచ్చివేసెదఁ బుచ్చికొమ్ము. మరి యొకటి యల్లఁగలను. అని పలుకుచు దానితోఁ జెప్పి తన బసకు బోయెను.

తోడివారలా తివాసి నమ్మితివా? యని అడిగిన వాఁడు నవ్వుచు వింతలు, చూచి వచ్చితిని. రేపంతయుఁ జెప్పెద రాత్రి మరల బోవలయుఁ బెద్ద పెద్ద మిద్దెలం గంటి. అబ్బబ్బా అవి మన కొండగుబ్బలుకన్న మిన్నగా నున్నవిసుమీ! యెన్నియో బొమ్మలు గోడల ప్రక్క జక్కఁగా. వేలంగట్టిరి. ఆయందము చూచి తీరవలయు బోగముది మంచి కులాసాపనులు చేసినది. ఇంకనుం జేయఁగలదుఁ అని తన చెలి కాండ్రతో జెప్పుచు మూపు లెగరవైచుచు రాత్రి సమయ మరయుచుండెను.

ఇంతలో సూర్యాస్తమయమైనది. పూవులు, నాకులు, వక్కలు దెప్పించి పెంద లకడ భోజనము చేయవలయునని ప్రయత్నించుచుండ రత్నాంగికిఁ దలనొప్పియుఁ జలియుజ్వరము వచ్చి బాధింపదొడఁగినది.

అయ్యో కిరాతపుత్రుని రమ్మంటిని. వాఁడు వచ్చువేళయైనది దేహ మస్వస్థత జెందియున్నది మాటాడుటకైన నోపికలేదు. రత్న కంబళి యూరక పోఁగలదు. ఏమి చేయుదునని చింతించచు రత్నాంగి తనయింటనున్న వెఱ్ఱిదానిం బిలిపించి యాయాస్తరణ జూపుచు నిట్లనియె.

పడఁతీ ! యిది మిక్కిలి వెలగలది యెంత వింతవింతగా నున్నదియో చూచి తివా? మన చావడికిఁ గ్రొత్త అందము తెచ్చుచున్నది. యొక బాల విటుఁడు దీనిం గానుకగాఁ దీసికొనివచ్చెను వాని నీ రాత్రి రమ్మ౦టి నింతలో నాకు వేడివచ్చినది బాధకుఁ దాళ లేకున్నదాన నీవొక యుపకారము సేయవలయును వినుము. వాఁడు కుర్రవాఁడు మీసకళయైన బాగుగరాలేదు. మాటలచేతనైన సంతోష పెట్టవచ్చును ఈరాత్రి వానినిఁ బడకకు రమ్మంటి రెండుగడియలెట్లో వానితో ముచ్చటలాడి సాగ నంపుము. నీవుమాత్రమాడుదానవుగావా ? మంచి వస్తువు దక్కఁగలదు ! ఈమాత్ర ముపకారము జేయుమని బ్రతిమాలినది.

పద్మినికా తివాసిచూచినతోడనే పూర్వపుస్మృతి యంతయుం గలిగినది. ఆ యల్లికచూచి యోహో ? యిది నాభర్త అల్లియుండవలయును. మాకుఁగాక యొరు లకీ పనిరాదు. ఇది తెచ్చిన పిల్లవాఁడెవ్వడో తెలిసికొని వానిమూలమున నాభర్త వృత్తాంత మరసెదంగాక. ఈలంజపడఁతి యింటనుండ దుష్టక్రియలకు బ్రేరేప కుండునా? ఇందుండుట నాతప్పు కానిమ్ము రేపే మఱియొక చోటికిం బోయెదనని తలంచి దానికేమియు సమాధానము జెప్పక యూరక యాయాస్తరణవై చిత్ర్యము చూచుచుండెను.

అమృత్తకాశిని మెత్తబడినదని తెలిసికొని రత్నాంగి బోఁటీ ఇటురా ? అదిగో యా పెట్టైలో నగలున్నవి ధరింపుము. ఆచీరగట్టుము. ఆరవికెతొడుగుము. మేడ మీఁది గదిలోనికింబొమ్ము. తలదువ్వుకొనుము హారములు దాల్చుము. చమత్కార ముగా మాట్లాడుము. వేడుక గలిగింపుము లేనివలపు లేనిప్రీతి బ్రకటింపుము అని వేశ్యా ధర్మములన్నియు బోధించినది.

పద్మిని యాపలుకులు వినక యలంకరించుకొనక యా వెర్రివేషముతోనే మేడ మీఁదిగదిలోనికిబోయినది. రత్నాంగి జ్వరపీడిత యగుట నంతగా విమర్శించి నదికాదు. అంతలోఁ చెంచుపట్టి కాశకోకజుట్టి తలరుమాలుబిగించి యందుఁ బిగిలి పిట్టరెక్కల కుచ్చుజొనిపి వెండి మొలత్రాడు మురుగులు వింతఅందము తేరనొయ్యా రముగా నడుచుచు రత్నాంగి యింటికి వచ్చెను.

అంతకుముందు ద్వారమున వాని నిమిత్తము వేచియున్న దూతిక వానినా మేడమీఁదికిఁ దీసికొనిపోయినది అతండా గదిలోఁ బ్రవేశించి నలుమూలలు సూచి యొకమూలనొదిగియున్న పద్మినిం జూచి తలయూచుచు నందొక పీఠముపైఁ గూర్చుండెను.

పద్మిని వాని యాకారము చూచి మొగమునందు గురుదత్తుని చిహ్నములుం డుటఁ బరిశీలించి యొడలు ఝల్లుమని పాలుచేపురా వానితో నిట్లు మాట్లాడినది.

పద్మిని - బాలుఁడా ? నీకులమెయ్యది ? తలిదండ్రులెవ్వరు? కాపురమెచ్చటఁ ఇచ్చటికెప్పుడు వచ్చితివి ?

చిరుతపులి -- నీవెవ్వతెవు సాయంకాలమున నాతో మాటాడిన బోగముదానవు కావా ?

పద్మిని - అప్పా ! అది యిప్పుడే రాఁగలదు. నామాటల కుత్తరమిమ్ము.

చిరు - మేము చెంచువాండ్రము. మాదికోయపల్లె కాపురము. నాకుఁదల్లి లేదు. దండ్రి చెంచుఁడు. చాపలమ్ముటకై మొన్ననీయూరు వచ్చితిమి ! నా పేరు చిరుత

పద్మిని - ఈ తివాసి నెవరల్లినది.

చిరు - నేనే అల్లితిని. పద్మిని - ఈపని నీకెవ్వరు నేర్పిరి.

చిరు - నాబుద్దిబలముచేత నేనే నేర్చుకొంటిని.

పద్మిని - కోయపల్లియన నా కొండల నడుమనున్న కొండపల్లి కెంత దూరము.

చిరు -- నాలుగుక్రోసుల దూరమున్నది దానినీవెట్లెరుగుదువు.

పద్మిని - ఒకప్పుడక్కడికి వచ్చితిమిలే. నీకీ చిరుతపులి పేరెట్టు వచ్చి నది.

చిరు - అదిరహస్యము మాతండ్రియెవరికిం జెప్పవలదన్నాఢు.

పద్మిని -- బాబూ. మీయూరిలో జెప్పఁగూడదు. ఇక్కడఁ జెప్పిన దోసమేమి?

చిరు - లేకున్నఁజెప్పదవినుము. ఒకనాఁడు. మాతండ్రిచెంచుఁడుకొండ లోయలోఁ దిరుగుచుండ నన్నొక చిరుతపులి నోటఁ గరచుకొని నేనేడ్చుచుండఁ బరుగెత్తుకొని యెక్కడకో పోవుచుండెను. మాతండ్రిదానిం జూచి వెరువక వింటికోలతో నేసి కడతేర్చి నోటినుండి నన్ను మెల్లగఁదీసి యెత్తికొని తన పల్లెకుఁ పోయి పెంచు కొనియెనట. ఒకప్పుడు నాకీకథజెప్పి యెవ్వరికిఁ జెప్పవలదనిచెప్పెను. తెలిసినదియా? చిరుతపులి నోటినుండి రక్షింపఁబడిన కతంబున నాకుఁ జిరుతపులియని పేరు పెట్టెను.

పద్మిని - హా! పరమేశ్వరా! అని పలుకుచుఁ గోలుగోలున నేడువఁదొడంగి నది. ఏమమ్మా ? నామాటలువిని అట్లు ఏడిచెదవేమి? నీకింత కష్టముగా నున్నదియా యని యడిగిన నాయనా ! నాకు నిన్నుఁ జూచిన దుఃఖము వచ్చుచున్నది. నీకువిధి యిట్లు వ్రాసెనా? అయ్యో ? అని మఱియుఁ గన్నీరుగార్చుటయు నాబాలుండిట్ల నియె.

తల్లీ ! నీకు నన్నుఁజూచిన దుఃఖమేమిటికి రావలయు? నాకువిధి యేమి వ్రాసెనో చెప్పుము. నేను ముచ్చటపడివచ్చిన దుఃఖము చూపెద వేమిటి కనవుడు పద్మినిపుత్రా ! మఱియేమియుంగాదు. నీవు చిన్నవాఁడవు ముక్కుపచ్చలారనివాఁడవు చదివికొనఁదగినవాడఁవు. నీతినేరుచుకొనఁదగినవాఁడవు. ఈ ప్రాయంబున నీదుర్వృత్తిఁ బూనుకొంటివని దుఃఖించుచుంటినని యుత్తరమిచ్చినది.

ఇది దుర్వృత్తియా? భోగమువాండ్రతోఁ గలసిన దప్పులేదని మాపల్లెలోఁ జెప్పుకొనియెదరు. వీండ్రు ఆటలు, పాటలుబాగుగానేర్చియుందురఁట తప్పుకాదనియే వచ్చితిని. తప్పు పనిచేయుట నాకిష్టములేదు. ఎట్లుతప్పో చెప్పుమని యడిగిన నప్పడఁతి యిట్లనియె


క. జార భట చోరచేటక
   చార నట ప్రభృతి నీచజననిష్టివా


    ధర శరావము వార
    స్త్రీ రమ్యాధరము సంస్మరింతురె కులజుల్.

పుత్రా ! వేశ్యయన మన్మధాగ్నిసుమీ? రూపమను సమిధచే వృద్ధిబొందు చున్నది. కాముకులు తమ యౌవనములు ధనములు ఆ యగ్నియందు హోమము చేయుచుందురు గణికాసంగమము కడుదూష్యము. ఆయువుక్షీణించును. ద్రవ్యము నాశనమగును. రోగములు బలియును. కీర్తినశించును పురుషుఁ డప్పనియెన్నఁడును చేయరాదు. పట్టీ ! నీవుమిగుల బుద్దిమంతుడవు. వస్తువిచారముచేసిన నందేమియున్నది కాకున్నఁ జక్కనియువతిం బెండ్లి యాడి. పిల్లలగని సుఖింపరాదా ఈ వస్తువులకై యీరాత్రినిన్నుఁగారవించును, రేపువచ్చినఁదల్లిచేగెంటించును. వీండ్రకు దయాసత్య ములులేవు. మరియొకతివాసి తెచ్చిన మరల గౌరవించును. ఎన్ని తేఁగలవు? భార్య యైన నట్లుచేయునా? బాబూ ! ఇది దుర్వృత్తిసుమీ? యౌవనారంభమున నీవృత్తిగలిగిన మానిపింప బ్రహ్మశక్యముగాదు. వలదు. వలదు. దోషము అని బోధించిన విని యాకుమారుండు లేచివచ్చి యామెపాదంబులఁబడి నమస్కరింపుచు దల్లీ ! నీవు నాకు మంచిమాటలుచెప్పితివి. నీపలుకులు నాచెవులు సోకి యపరిమితానందము గలుగఁజేసినవి. ఇది మొదలీపాటిపనులకుఁ బూనితినేని దైవఘాతకుఁడని పిలువుము. నీవు జాల తెలిసినదానివలెనుంటివి. ఈబోగముది నీకేమికావలయును. ఇందుండియు నీ నీతి వచనంబులెట్టు చెప్పితివి? నీవృత్తాంతమెఱింగింపుమని అడిగిన నామె యిట్ల నియె.

పుత్రా ! నాకీ బోగముది యేమియుఁ జుట్టముకాదు. నేనొక పాపాత్మురాలను. నావృత్తాంతముతో నీకేమిపని? నేను నీకొకరహన్య ముపదేశించెద నెవ్వరికిందెలియ నీయకుము నీవుత్తమవంశ సంజాతుఁడవు. నీమాటవలన నీవు కిరాతకులమునఁ బుట్టనట్లు తెల్ల మగుచున్నదికదా? నిన్నుఁ గన్నతల్లి యేమైనదో తెలియదు. సమసియే యుండును. నిన్ను జూచిన నాకుఁజాలి గలుగుచున్నది వినుము. నీకొకయుత్తరము వ్రాసి‌ యిచ్చెదను. ఆజాబెవ్వరికింజూపకుము. తూరుపుదేశముననున్న రామదుర్గ మను నగరమునకుంబోయి అందు గుముదాంగదుఁడను వైశ్యుని యింటికిం జని వానికే యీకమ్మనిమ్ము ఇతరులకుఁ జూపినఁ బ్రమాదము సుమీ? ఆతఁడు లేకున్న భార్యకిమ్ము. నీసుకృతవీశేషమునవారు సజీవులైయున్నచో నిన్ను గన్నఁకుమారుని వలెఁ జూచి పోషించి వారి సొమ్మంతయు నీకీయగలరు. నీవు సుఖింపఁగలవు. అని చెప్పిన విని యా బాలుండు సంతసించుచు నిట్లనియె.

అమ్మా ! నీవే నాకు దల్లివి మాతల్లిని నేనెరుంగనుగద. నేను గొప్పవంశము గలవాఁడనని కూడఁజెప్పుచుంటివి నన్నెట్లెరింగితివి. అనవు డామె ఆమాటలేమియు నడుగకుము. నిన్నుఁజాడ నాకట్లు తోచినది. నాచెప్పిన చొప్పున నడిచెదవేని నీవు భాగ్య సంపన్నుఁవు కాగలవని చెప్పిన వాఁడిట్ల నియె.

అమ్మా ! అకారణముగా సంపదగలగఁజేయుచుండ వలదను వాఁడుండునా? రహస్యము వెల్లడింపను జాబు వ్రాసియిమ్మని అడిగిన నప్పడఁతి యప్పుడే యొక యుత్తరమిట్లు వ్రాసినది.

ఓపుణ్యాత్ములారా ! ఈకమ్మ తెచ్చిన పిల్లి వాఁడు మీ దౌహిత్రుఁడు వీనిపేరు మృగదత్తుఁడు. వీనింగాపాడి కులమభివృద్ధి జేసికొనుడు మీకూఁతురును అల్లుండును మృతినొందిరి. వారికొరకుఁ జింతింపఁబనిలేదు. వీనికి విద్యాబుద్ధులు గరపి వృద్ధి లోనికిఁ దీసికొనిరండు. ఇదియే పదివేలు.

ఇట్లు మార్గదర్శకరాలు.

అనివ్రాసి యాయుత్తరమిచ్చి శిరము మూర్కొని ముద్దాడుచు దండ్రీ? ప్రమాదమునైనను వెలియాలి యింటికిఁ బోవకు సుమీ? పరులకు హింసగావింపకుము. ఈయుత్తర మొరులకుఁ జూపకుమని పలుమారుబోధించి నిద్రబుచ్చి తెల్లవారకమున్న లేపి అవ్వలికిఁ బంపినది.

ప్రొద్దుట రత్నాంగి పద్మినింజూచి మెచ్చుకొనుచు నోహో నీవేమో వెర్రిదాన వనుకుంటిని. మంచిజాణవే వస్తువడుగకుండ విటుని సాగనంపితివి. మఱియేమైనను సొమ్ములాగితివా? యని అడిగిన విని మాటాడక లోనకిఁబోయి సీ? నావంటి మూఢు రాలెందైనం గలదా? సర్పదష్టుఁడైన మగనివార్తవిని చావక యిన్ని నాళ్ళేమిటికి జీవించితినో తెలియదు. ఆహా? వారకాంతనుగూడ ననిపించుకొంటినిగదా? చాలు. జాలు. కీడులో మేలు నాకుమారునిగంటి. హైహికభ్రమ వదలినది. అయ్యో ! కొన్ని దినము లుండమనక నిజంబెఱింగింప పంపివేసితినేమి? ఔను జ్ఞాపకము వచ్చినది. నాయవస్థకు వాఁడు వగచుట యొకటి పుంశ్చలిగాఁ దలంచుట యొకటి. ఈవిచారము వానిం బాధించునని చెప్పితినికాను మంచిపనియే. ఇఁకచావక యేమిచేయవలసినది. అడవికిఁ బోయి యెట్లో మడిసెదఁగాక అని నిశ్చయించి అప్పుడే యెవ్వరికిఁజెప్పక యిల్లు వెడలి అడవిదారింబడి నడువఁ దొడంగినది.

ముల్లుకంపలు, రాళ్ళు, రప్పలు, రుప్పలు గణింపక తోచినట్లు నడుచుచు నొకచో దావాగ్ని మండుచుండ గుభాలునబోయి యామంటలోఁ బడినది పాతివ్రత్య మునకు మెచ్చుకొని యగ్ని భట్టారకుడు మోక్షసామ్రాజ్యమునకు బట్టాభిషిక్తం జేయు చున్నవాడో యనఁగడవలతో గుమ్మరించునట్లు వర్షము గురియుటచే నా దావాగ్ని యంతయుఁ జల్లబడినది. పద్మిని కించుకయు వేడి సోకినదికాదు. బూడిదరాచిన రత్నమువలె మెఱయు చుఁ జెక్కుజెదరక లేచి నలుమూలలు జూచి అయ్యో? నన్ను దైవము జంపకున్నాడు గదా? ఇంక నెన్నియిడుములు గుడువఁ జేయుటకో యని తలంచుచుఁ బోయి పోయి కొన్ని దినంబుల కందొక గొల్లపల్లి చేరినది.

అప్పటికి మరల బుద్దిస్వాస్థ్యము తప్పుటచే అందొక గొల్లవాని యింటిలో వాఁడు చెప్పిన పనులుచేయుచుఁ గొన్నిదినములు కాలయాపనము చేసినది.

అని యెఱింగించి,

127 వ మజిలీ

ఉదయార్కునికథ

ఆహా? ఆమె యెవ్వతెయో కానీ చాలమంచిది ఆమెచెప్పిన మాటలు నాడెంద మున బాగుగ నాటినవి. నేనీ బోగముదానియింటికి వచ్చుట తప్పుగా ఎఱుఁగక మోస పోయితినిగదా? మిక్కిలి వెలగలతినాసి‌ గోలుపోయినను మంచిమాటలువినంబడినవి. అదియొకమేలే? మఱియు నేనుత్తమకులసంజాతుఁడనట. ఈజాబు రామదుర్గనగరంబు నకుఁదీసికొనిపొమ్మని చెప్పినదిగదా? దీనివలనఁగొంతలాభము గలుగఁ గలదు అయ్యా ! నాకుఁ జదువురాకపోవుటచే నిందేమివ్రాయబడినదో తెలియఁబడదు. ఒరు లకుఁ జూపవలదనిజెప్పినది. కానిమ్ము ముందుగాఁ జదువు నేర్చికొని యీయుత్తరము జదివికొనిన తరువాత బోయెద నిఁక నీకోయల సహవాసము విడిచెదనని తలంచుచు మృగదత్తుఁడు వేశ్యాగృహము వెడలి కనుచీఁకటి యుండఁగనే యూరిబయటనున్న గుడిసెలయొద్దకుఁబోయెను.

అందున్న కోయలు వానింజూచి యోరీ చిరతపులీ? నీవురాత్రి యెందుబోయి తివి? నీకొఱకుఁ బురమంతయు వెదకితిమి. తివాసినమ్మితివా? మనతివాసులు చూచి రాజుగారు మెచ్చికొని నిన్నుఁదీసికొని రమ్మనిరఁట. పెద్దతివాసి తామే కొనియెద రఁట. రాజభటులు పలుమారువచ్చి పోవుచున్నారు నీ అదృష్టము మంచిదాని వాండ్రు పలికిన విని అతండు నన్నుఁ బులియని పిలువవలదు నాపేరు మృగదత్తుఁడని పిలువుఁడు పెద్దతివాసి నమ్మితిని. రాత్రియెందో పోయితినని పలుకుచుండఁగనే రాజభటులు కొందఱువచ్చి తివాసులల్లిన పిల్లవాఁడు వచ్చెనా? అని కేకలు పెట్టిరి.

వచ్చెనని చెంచులు కొందరుత్తరము చెప్పిరి నేనే అల్లినవాఁడను అని మృగ దత్తుఁడు ముందరకువచ్చి నిలువంబడుటయు రాజభటులువానింజూచి నీనిమిత్తము రాతిరినుండి తిరుగుచుంటిమి. ఎందుబోయితివిబాబూ ! పెద్దతివాసియున్నదా! అమ్మి