కాశీమజిలీకథలు/ఏడవ భాగము/116వ మజిలీ
నరా - యేమి సేయవలయును.
దుర్మ - పెందలకడ ముందుబోయి యీమందిరము శుభ్రము సేయుమని నాకు నియమించెను. వేరొక పనిమీద నాకిందు రాజాగయ్యె. అతండు వచ్చు వేళయైనది లోపలికిఁబోయి బాగుచేయుదమురమ్ము. ఇందులకే నిన్నుఁ బిలిచితిని.
నరా - బాగుజేసితిమనియే జెప్పుదము. నేను లోపలికిరాఁజాలను. అని సంభాషించుకొనుచు విద్యుజ్జిహ్వుని రాక నిరీక్షించుచుండిరి. వీరసింహుడు వారి సంవాద మాలించి యౌరా! వింతలపై వింతలు దోచుచున్నవి. యిది లంకాపట్టణమా? వీండ్రు రాక్షసులా విభీషణుని మనుమనిపేరును విభీషణుఁడే కాఁబోలును. వారిరువురు శ్రీరంగమున కఱిగినట్లు చెప్పికొనిరి. అది భూలోకములో నున్నదఁట. యిది ల౦కాపురము గానిచో నట్టి సంభాషణమున కవకాశముండదు. అయ్యారే ? ఎంతచిత్రము మనుష్యమాత్రునకీ దీవికి రాశక్యమగునా? కమఠరూపుండగు హరియే నన్నిచ్చటికిఁ దీసికొని వచ్చెను. ఇది శుభోదర్కమని తలంపనగు అని వెఱఁగుపడుచుఁ గన్నులు మూయక సందడిచేయక పండుకొని యుండెను. అని యెఱింగించువఱకు వేళయతిక్ర మించుటయు నవ్వలి మజిలీయం దిటని చెప్పదొడంగెను.
116 వ మజిలీ.
అశోకవనము కథ
ఏకాక్షి - అక్కా నీకెన్ని యేండ్లున్నవి నాకంటె పెద్దదానవా చిన్నదానవా ఛీ? రామ సీతారామ.
ఏకకర్ణ - నాకెన్ని యేండ్లున్నవో తెలియదుగాని నీకంటె కొంచెము పెద్దదాన నగుదును ఛీ! రామ ఛీ రామ సీతారామ రామ,
ఏకాక్షి - సీతాహరణకాలమునకును నీకెన్ని యేండ్లున్నవి
ఏకకర్ణ - మొన్న మొన్ననేకాదా సీతాహరణమైనది. దేవా సురయుద్దము నాటికి నే నీడేరితిని. ఆ సంగరములోనే నాభర్తకడ తేరెను.
'ఏవాక్షిలానీవు తాటక యీడుదానవా యేమి?
ఏకకర్ణ - సరిసరి తాటక నాకంటెఁ జాల చిన్నది. తాటకా సుందుల వివాహమునకు నేను బేరంటమునకుఁ బోయితిని సుందోప సుందులునాకు మేనత్తకొడుకులు.
ఏకాక్షి - నాకు మాత్రము తక్కువయేండ్లున్నవియా; సముచిశంబరులు నాకంటెఁ జిన్న వారలు. అమృతమునిమిత్తము దేవాసురులు కలహించినది నేను బాగుగ నెరుంగుదును. ఏకకర్ణ - అట్ల యిన మనము సమాన ప్రాయమువారమే ఛీ రామ ఛీ రామ!
ఏకాక్షి - ఏకాలమందైన రాక్షసస్త్రీలకిట్టి నిర్భంధము గల్గినదా? కట్టా ? యీ పాడుతావళములు త్రిప్పలేక వ్రేళిలు గంటులు వారుచున్నవి. ఈపాడు రామమంత్ర మెన్ని నాళ్ళిట్లు జపముచేయుచుందుము. దీర్ఘాయువుగలుగుటఁ గష్టములకుఁ గారణమై నదిగదా.
దీర్ఘ జిహ్విక - మనశత్రువగు వానినామమిట్లు జపించుమని విభీషణుఁడు దిక్కులేనివారలమగుట మనకు నియమించెను. అన్నన్నా! రాక్షసస్త్రీలకెట్టి యిడుములు వచ్చినవి. రావణబ్రహ్మ సీతనిచ్చటికిఁ దీసికొని రాకపోయినను మనకీ ముప్పులేక పోవును ఛీ రామ ఛీ రామ.
లంబోదరి - రావణుని కాలములో మనమేవీరభటులమై చటులముగాఁబట్టణ మంతయుఁ దిరుగుచు నెల్లవారిం బెదరింపుచుండువారముగదా. అట్టి మనమిప్పుడీ రండాపుత్రులకు వెరవలసి వచ్చినది ఔరా కాలమహిమ ఛీ రామ ఛీ రామ.
అజాముఖి -- మనపాదములకు సంకెళులు వైపించి యీపాడు రామమందిరము ముంగల గూర్చుండఁబెట్టి రామమంత్రము జపింపమని నియమించిన విభీషణుని పాపమునకు మేరయున్నదా మన యుసురెప్పుడు తగులునో?
వ్యాఘ్రముఖి -- ఆమహారాజు రావణబ్రహ్మకాలములో ననుదినము తినెడి మాంసము దలచుకొనిన గుండె పగిలిపోవుచున్నది. ఈలంకలో దినమునకుఁ బదిమణుగుల నరమాంసము తినని రక్కసి గలదా? అక్కటా ఎంత యిక్కట్టువచ్చినది. ఛీ రామ ఛీ రామ.
జేష్ట్రసఖీ -- మనకు నరమాంస మాకాశకుసుమమైనది. ఇందు మాంసము దినుటయే దప్పఁట. మునులవలె శాకాహారము తినిన మన కడుపులెట్లు నిండును? మనల నిట్లాకటవేపుచున్న విభీషణుఁడు కొలఁదికాలములో నశింపకుండునా?
పాదచూళిత - అబ్బ! మనుష్యమాంస మనిన నానోరూరుచున్నదిగదా? అన్నా రావణబ్రహ్మ! నీవు మృండవగుటయు మా పాపమేకదా? ఛీ రామ.
లంబకర్ణి - ఈవిభీషణునికి విది చావేల విధింపఁడో తెలియదు పాపీ చిరాయు వను మాట సత్యమే ఛీ రామ ఛీ రామ
హంసిపాదిక - మన ప్రభువును వరించునని బెదరించి విడిచితిమి కాని నాఁడు సీతనుమ్రింగితిమేని నీ వెతగలుగకపోవును భార్యా వియోగదుఃఖంబును రాముండు సమసిన రావణబ్రహ్మకు మరణమేల గలిగెడిని?. అట్లైన మనరాజునకీ విభీషణుండు వరవుండై మెలఁగుచుండును గదా? ఛీ రామ ఛీ రామ. గోముఖి - యీచిన్న విభీషణుండు తాతక౦టెఁ గ్రూరకర్ముడుగదా ! మనకు మద్యమాంసము లిచ్చినచో లొంగమనియే అల్పాహారము లిచ్చి బద్దులంజేసి మాడ్చు చున్నాడు.
అనాసిక - పది యేనుఁగుల భక్షింపగల్గిన మనకీ స్వల్పాహారమే మూలకు వచ్చెడిని.
గోముఖి - పోనీ చచ్చినట్లు పడియుందమన్నను యీతులసీ మాలికల త్రిప్పుటయు నోరు నొప్పి పెట్టునట్లు శత్రునామము జపించునట్లు విధించెనే? మరియు దినమునకు లక్ష తక్కువగాకుండ జపి౦పవలయునఁట. ఆకలిబాదన వేగుదుండ నీ నామము లెట్లుసాగెడివి.
దీర్ఘ నాసిక -- పూర్వము ప్రహ్లాదుని రాజ్యకాలములో రాక్షసులనెల్ల నారాయణమంత్రము జపింపుడని నిర్భంధించినట్లు మాయమ్మమ్మతల్లి చెప్పెడిది ఆవెత మనకిప్పుడు గలిగినది.
లంబోదరి - అదిగో ; రాజభటులిటులవచ్చుచున్నారు. మాలికలబూని జపము సేయుడు, ఛీ రామ ఛీ రామ (అని అందురు జపించు చున్నారు.)
రాజభటులు - (ప్రవేశించి) రండలారా? జపములు మాని మాటలాడుకొను చుండిరా ! మేము చూచితిమిలెండి లంబోదరీ ! నీవిప్పట్టికెన్ని జపించితివో చెప్పుము.
లంబోదరి - ఏబదివేలు జపించితిని.
రాజు - ఛీ రండా? రెండుగడియలప్రొద్దెక్కినదో లేదో యే బదివే లెట్టుజపించితివి. నీలెక్క తప్పులెక్క నిన్ను శిక్షింపుఁడు జేసెదము చూడుము.
లంబోదరి - పొరపాటు చెప్పితిని రక్షింపుఁడు రెండువేలెనని ఇవిగో గీటులు చూడుఁడు.
రాజభటులు - అసి ముండా! ఎలా బొంకితివి ఇందులకు శిక్షనేఁడు అధికముగా రెండులక్షలు రామనామము జపింపుము. లేనిచో మహారాజుగారికి దెలియఁ జేసెదము.
లంబో - చిత్తము చిత్తము సీరామసీరామ అని వడిగా జపించుచున్నది.
రాజభటు లందరిని నట్లే ------- దాపునఁ గూర్చుండి శ్రీ రామనామజపము చేయింపుచుండిరి. మహామునులవలెఁ -----మూసికొని యారాక్షసస్త్రీలందఱు నొకరి వంక నొకరుచూడక తారక మంత్రము జపించుచుండిరి.
అట్టి సమయమున దీర్ఘ నాసికలేచి తావి యాఘ్రాణించి హాయి హాయి మానిసి వాసన యెన్నిదినములకు నాశాపక్వమైనది. అనుటయు అవునవును మనుష్యవాసనయే. అని యందఱును కాలిగొలుసులు తెగునట్లు చిందులు ద్రొక్కఁ దొడంగిరి. అప్పుడు రక్షకభటులు వారింగశలచే బాది యదలించుచుఁ గూర్చుండఁబెట్టి మీ యలజడి యేమి యేమి యని అడిగిన అయ్యా మాకు నరవాసన గొట్టినది. చిరకాల మైనను దినిన నోళ్ళగుట అమ్మాంసము నందలి లాలసత్వముచే నిలువలేక గంతులువైచితిమి. ఇది ప్రమాదము క్షమింపుడు అని వేడికొనిరి. రండలారా ? ఇక్కడికి మనుష్యులెట్లువచ్చిరి వచ్చిననో భక్షింతురా యేమి? రాజశాసనము మరచితిరా? ఇఁక మీరిన శిక్షింతుముజుడి అని వెఱపించుచు యధాగతముగా వారినెల్ల శ్రీరామ మంత్ర జపరాయణులం గావించిరి. అంతకుఁ బూర్వమే యా ప్రాంతమున నిలిచి యా వింతలం జూచుచు వారి సంభాషణము లాలించుచున్న వీరసింహుండు మనంబున నిట్లు తలంచెను.
ఔరా? ఈరక్కసుల వికృతరూపములు హఠాత్తుగా జూచిన నరులకు నుల్లములు తల్ల డిల్లక మానవు. అన్నన్నా? ఈ ఘోరాకారము లనడుమఁ గర్ణ కఠోరములగు తర్జన భర్జనములకోర్చి మహాపతివ్రతయైన సీతామహాదేవి యెట్లు నివసించినదో తెలియదు. చిరకాలమైనను వీరి ప్రలాపములు దుర్బరముగా నున్నవి. ఆహా ! ఇట్టి వాండ్రనెల్లఁ గాళ్ళకు సంకెళ్లు వైపించి రామమందిరముచుట్టునుఁ గూర్చుండఁబెట్టి జన్మతారకమగు రామనామము జపింపఁ జేయుచున్నారు. విభీషణుఁడెంత కృతజ్ఞుఁడో ఎట్టి పరమార్దవేదియో, ఎంత వివేకశాలియో, నర కళేబరములఁ జెఱుకుముక్కలవలె విఱచుకొనితినియెడు దానవులకు మాంసభక్షణము నిషేధముజేసి శాకభక్షులనుఁ గావించిన విభీషణుని వంటి దయాశాలి యెందైనం గలఁడా ఔరా? నేనెట్టి పుణ్యము జేసికొంటిని? త్రేతాయుగమునాఁటి వింతలం జూడగంటిని. రామాయణకథ వినుటయే గాని చూచినవారుండిరా. రామలక్ష్మణులకుఁ దక్క మనుష్యులకీ లంకాపురము ప్రవేశింప వశమా? మహాపుణ్యాత్ముండైన విభీషణునిం జూచి జన్మము సాద్గుణ్యము జేసి కొందును. అహా హా ఎక్కడి లంకాపట్టణము. యెక్కడి యుజ్జయిని. యెక్కడి వీరసింహుడు మాముత్తాత విక్రమార్కుని సుకృతమే నాకీఫలము గలిగించినది. నా వాసనగొట్టినంతనే గంతులువైచిన యీరక్కసిముండలు రత్నగుప్తుఁడను గానిచో గుహలవలెనున్న తమ నోటిలో వైచికొనకపోవుదురా? కానిమ్ము ప్రచ్ఛన్నముగానే యీలంకాపట్టణమంతయుం దిరిగి చూచెదంగాక. ఇందలి ప్రకటనా పట్టములే పట్టణపువింతలఁ జెవ్ఫకయే తెలియఁజేయఁగలవు. ఇది ప్రాతలంకకు మార్గ మఁట. ఆ కనంబడు మేడలన్నియు శిధిలములై యున్నవి విభీషణుఁడు పూర్వపులంక విడిచి దక్షిణముగాఁ గ్రొత్తపట్టణము నిర్మించుకొనినట్లు రాజభటుల మాటల వలనం దెలిసినది. ఇది అశోకవనమునకు మార్గమఁట ఈదారివోయి అందలి విశేషములం జూచి యానందించెందంగాక యని తలంచి యొక మార్గంబునంబడి నడువసాగెను కుసుమఫలదళ మనోహరములగు తరులతా విశేషములచే నవ్వన మతనికిఁ గన్నుల పండువ గావించినది పలురకములగు పూ వులతావి యాఘ్రాణించుచు మెచ్చుకొనుచు వింత పండ్లం జూచి యచ్చెరువందుచుఁ గొంత సేపందు విహరించి పోయి పోయి సీతామహాదేవి వసించిన శింశుపావృక్షమును గనుంగొనియెను.
అది మిక్కిలి ప్రాతదై యున్నది. విభీషణుఁడు శ్రీరామనందుగల భక్తివిశేషమునంజేసి సీతామహాదేవి కాశ్రయభూతమైన యా వృక్షరాజమును శిధిలము గాకుండ దోహదముల గావింపుచు లనేకవిచిత్రాలంకారముచే వెయింపఁజేసెను. తన్మూలమున నవరత్నములచే వేదిక గట్టించెను. శాఖోపశాఖలును కుసుమకిసలయ ఫలదళములును కృత్రిమముగఁ గనకరత్న విశేషములచేఁ బ్రకాశింవ జేయుచుండెను. ఆవేదికయందు వేనవేలు రాక్షసవృద్దులు వసించు వేదశాస్త్రపురాణములఁ బఠింపుచుండిరి. కొందరు మూలమున స్థాపించియున్న కాంచన సీతావిగ్రహమును నామెతో సంభాషించు చున్నట్లు నిలుపఁబడినహనుమద్విగ్రహమును సహస్రనామములచేఁ బూజించుచుండిరి.
పెక్కేల రావణుఁడా నాఁడు గావించిన చర్యలెల్ల నందుఁ గల ప్రతిమల జూచినఁ పురాజము జెప్పినట్లు తెల్లముగాక మానదు.
అట్టి విశేషములం జూచుచుఁ పరమానంద భరితుండై కరవాలము కేలం గీలించి మణిధారణంబున నొరులకుఁ గనంబడక యవ్వన మంతయుఁ తిఱిగి తిరిగి ఫలములం దిని యాకలి యడంచుకొనియెదను. రత్న ప్రభావంబునఁ దనకు క్షుత్పిపాసలు లేవని తెలిసియును రుచి జూడ ఫలముల నారగింపుచుండెను.
అందఁగల రాక్షసులెల్ల వికృతిరూపములచే నొప్పుచున్నను వారి చేష్టలు క్రూరములు కావు బ్రహ్మఘోషము చేయుచుందురు. సామగానంబులుచ్చరించు చుందురు శిష్యులచే వల్లె నేయించుచుందురు అందొకచో నీదారినెవ్వరు రాఁగూడదు. రాజపుత్రిక చంపక విహరించు నుద్యానవనమున కీదారి పోవును అని యున్న ప్రకటనం జూచి యతండు మిక్కిలి నంతసించుచు నాదారింబడి పోయెను కొంతదూరము యేగువరకు నొక పూవు దోట నతనికిఁ గన్నులపండువు గావించినది. దానింజూచి యతండు ఔరా! నావంటి పుణ్యాత్ముం డెందునులేడు. మున్ను రావణుఁడు దిక్పాలుర నగరములోనుండు మంచివస్తువులనెల్ల నేరితెచ్చి లంకలో నుంచుకొనెనని పురాణములు చెప్పుచున్నవిగదా? వానింజూచిన మనుష్యుఁడులేడు నాకు స్వప్నమో యింద్రజాలమో తెలియదు యిట్టికేళీవనము చూచుటకు నాకీ రెండుకన్నుల జాలవు.
ఓహోహో! ఈపరిమళము భూలోకము లోనిదియా? మేను పరవశమగు చున్నది. దేవలోకములోని నందనవనమునం గల మంచి వృక్షముల నెల్ల పెరికితెచ్చి లంకలో నాటిరిగదా ? ఇంతకంటె రమణీయమగు నుద్యానవన మేలోకమునందు లేదని నిశ్చయింప వచ్చును.
ఇది మిక్కిలి విశాలముగా నున్నది. జలయంత్రముల విశేషములు చూడ వర్షాకాలమువలెఁ దోచుచున్నది. కాలమానముల నల్లిక వేసవిం దెలియనీయదు సర్వర్తు కుసుమ పులభాసురమై యిక్కాన బొడగట్టుచున్నది. ఇందేవసించి దేహయాత్రనడుపు కొనియెదను. నేనెవ్వడనో యేమిటికిందు వచ్చితినో నాకేమియుఁ దెలియకున్నదియని తలంచుచుఁ పరవశమైన చిత్తముతో, అతండు విహరింపుచుండెను.
చంపక కథ
అంతలో నొకమూలం దంత్రీనాదమిళితమైన మనోహరగానం బతనికి శ్రోత్రపర్వము గావించినది. ఆధ్వని విని యదరిపడి బాపురే నాకన్నులకుఁ దృప్తిదీరినది చెవులకుఁ గూడ బర్వము గలుగు చున్నది. అద్భుతగానశ్రవణము అపూర్వ వస్తు సందర్శనముగూడ నాకుఁ గలుగఁబోవుచున్నది. ఇది విభీషణ పౌత్రికయగుఁ చంపక విహరించు కేళీవనమని ప్రకటనలవలనం దెలియబడుచున్నది అనగా నాదము నాపైదలిదేయని తలంచెదను. అదృశ్యుండనగుట నాకెక్కడ బోయినను నాటంకము లేదుగదా చంపకం చూచెదంగాకయని యాలోచించి యానాద మేతెంచినదెసఁకరిగెను.
ఒక గున్నమామిడి క్రిందఁ జంద్రకాంత శిలావేదికపైగూర్చుండి పెక్కండ్రు చెలికత్తెలు చుట్టునం బరివేష్టింపఁ దంత్రీస్వరములతో గంఠనాదము మేలగించి సంగీతము పాడుకొనుచున్న యొక చిన్నది యతని కన్నులం బడినది.
అద్భుతగాన స్వనాకర్ణవంబున నీరైన యతని చిత్తము త్రిలోకమోహజనకంబగు నా కనకగాత్రిం జూచినప్పు డెట్లున్నదో వర్ణించుటకు బృహస్పతికి శక్యము గాదు. ఆమెంజూచి యతండు పరవశుండై నేలం బడెననుట యతిశయోక్తి గాదు. ఒక్కింత వడికిఁ దెలిసి మెల్లనం గన్నులఁదెరచి మెఱపు తీగయుబోలె తత్తనులావణ్యము మిరిమిట్లుగొలుపఁ గన్నులు మూసికొనియె ననుట యధార్థ కథనము.
మఱల మఱల గన్నులం దెరచుచుఁ జేతులచేఁ దుడిచికొని రెప్పవేయక యట్లే చూచుచు వాపోవక యాకోక స్తని నాపాదమస్తకముఁ దిలకించి మేను పులకింప నతం డిట్లు తలంచెను. బళిరా! దైవసంఘటనము. రాక్షసరాజపుత్రికయగు నీ చంపకను దలంచి విద్యుజిహ్వుఁడు విరాళిజెంద నేమో యనుకొంటిని. ఇది యెక్కడి రక్కసి కూన. రక్కసులు వికృతాంగులు కారా? సురగరుడోరగ సిద్ధ విద్యాధరయువతు లీనాతికి దాస్యముసేయఁ బనికిరారని శపథముజేసి చెప్పఁగలను పెక్కేల యొక్కొక్క యవయవము చక్కఁదనము వర్ణింప శేషునకొక్క సంవత్సరము చాలదని చేయెత్తి పన్నిదము చేయగలను. ఓహోహో? కనురెప్ప లెగయ రాగముల వెలయింపుచుఁ గృతుల నాలాపించు నప్పుడు పండువెన్నెలలు గాయ నాణెముత్తెముల వలె నించుక బయల్పడుచున్న పలువరసయందముజూడ శ్రీ శుకునకైనమోహము గలుగక పోవునా! అబ్బబ్బా? అమ్ముద్దుమొగము చక్కఁదనము. అని గంతులువై చుచు నున్మత్తుని భంగి కొంతసేపు ప్రలా పించుచుండెను.
మరల మోహమడంచుకొని అయ్యో? నేనింత మూఢుండనై తినేమి? చాలు జాలు. నీ ప్రోయాలు మగనాలైనచో నా మనసు వ్యభిచారదోషముం బొరయదా? మాతల్లి చెప్పిన నీతివాక్యముల మరచితినేల? పరాంగనల గన్నె త్తి చూడరాదు గదా? ఇది చంపక యగునో కాదో ఇప్పుడు మంగళగీతంబులం బాడుచున్నది గానావసానమున వీరు మాటాడుకొనక మానరు. అప్పుడు వీరి కులగోత్రములం దెలిసికొనియెదంగాక యని నిశ్చయించి యాప్రాంతమందుఁ గూర్చుండి గీతావసానకాల మరయుచుండెను.
ఆ చిన్నది సంగీతము కట్టిపెట్టి యప్పుడే వచ్చి కూర్చుండియున్న యొక చేటికం జూచి చామరికా! నీవు నేఁడింత యాలసించితివేల? నీ కొఱకుఁ. బెద్దతడవు వేచియుంటిమి? పని యేమి గలిగినదని యడిగిన నమ్మగువ యిట్లనియె.
రాజపుత్రీ నిన్నరాత్రి నీ యంతఃపురమున నేను వాడుక ప్రకారము సంగీతము పరిశ్రమ జేయుచుంటి. నీవేమిటికో యక్కడికి వచ్చితివికావు పెద్దతడవు పాడి పాడి నీవు లేమింజేసి నీ మంచముపైఁ బండుకొని గాఢముగా నిద్రపోయితిని. కొంత సేపటికి లేచి చూడఁ ద్రికూట నగరంబునందలి చీకటియింటిలో నుంటి. అప్పుడు శూర్పణకా పౌత్రుడగు విద్యుజ్జింహుఁడు చంపకా! చంపకా! అని నన్ను లేపుచు నేమేమో ముచ్చటింప దొడంగెను. అప్పుడు నేను లేచి ఓయీ? నేను చంపకనుఁ గాను. ఆమె సఖురాలు చామరికను. నన్నేమిటికిఁ దీసికొని వచ్చితివి చంపకతో నీకేమి పనియున్నది. అని యెడదఁబొడమిన వెఱపు బయల్పడనీయక ధైర్యముగా నడిగితిని.
అప్పుడు వాఁడు పశ్చాత్తాపము చెంది అయ్యో? చామరికా నేను నిన్ను రాజపుత్రిక యనుకొని భ్రమపడి తీసుకొని వచ్చితిని. నీవామె మంచముపై బండుకొంటివి కాఁబోలు. కానిమ్ము. నీవు నాకొక యుపకారము చేయుదునంటివేని నిన్ను విడిచి పుచ్చెద లేకున్న నీపని పట్టెదనని బెదరించిన నే నాలోచించి యిట్లంటి కుమారా! మేము పరిచారికలము ఎవ్వరు చెప్పిన పనులనైనంజేసి మెప్పువడయు చుందుము. నాయోపినంత యుపకారముజేసి నీవలన గానుకల నందెద నీయభీష్టమేమో తెలుపుమని నై పుణ్యముగాఁ బలికితిని అప్పుడు వాఁడు నన్ను మెచ్చుకొనుచు చామరికా ? ఇట్లు బలుకుట నీకే తగును. నాకోరిక వినుము. చిన్న విభీషణుని పుత్రిక చంపక నాకంటె నించుక చిన్నది. చిన్నతనము నుండియు నేను దానినిఁ బెండ్లి యాడవలయునని యభిలాష పడుచుంటిని దానితండ్రి తాతలకు జయంతునకో మన్మధునకో పెండ్లి చేయవలయునని యున్నధఁట. రావణబ్రహ్మ చనిపోయిన పిమ్మట విభీషణుఁడు రాక్షసులంబెట్టు బాధలు నీవెఱింగియే యుందువు. అట్టివాఁడు నాకుఁ బిల్లనిచ్చునా? శాంబరీపాటవంబున దానిం గొనిపోయి పెండ్లి యాడఁదలంచుకొంటిని. నిన్న విభీషణుఁడు మనుమనితోఁ గూడ శ్రీరంగమున కరిగెనని విని రాత్రి మాయాబలంబున నా యంతఃపురంబునకు వచ్చి నీవే యామెయనుకొని తీసికొని వచ్చితిని. గుఱితప్పినది.
ఇఁకమీఁదఁ జంపకకు నాయందు మోహము గలుగునట్లు నీవు చేయవలయును. నీవు సంతతము చంపకయొద్ద నుందువు. కావున నీవలనఁ గార్యసాఫల్యము కాఁగలదు. నీకు మంచి పారితోషిక మిప్పింతును అని నాతోఁ బెద్డతడ వేదియో గొడవచెప్పెను.
అప్పుడు నేను దప్పించుకొనుటకై వానికనుకూలమగు మాటలాడి కానుక లంది వచ్చితిని. అని యాకథయంతయు నెఱింగించినది.
చంపక మిక్కిలి కోపముతో నేమీ? ఆ పాపాత్ముఁడట్లు గావించెనా? ఈవార్త మాతండ్రి కెఱింగించితివా? లేకున్న నిప్పుడేపోయి చెప్పుము. తప్పక ఆనీచుం బరిభవించును. అనుటయు నది దేవీ ! నీవనకమున్న యెఱింగించితిని. అయ్యగారెద్దియో తొందరలోనుండిరి. పాతాళలోకములోఁ గర్కోటకకులమువారికి వాసుకి వంగడము వారికిని బెద్దయద్దము జరుగనై యున్నదట. వాఱికి వంశజాతులు మనవారిని బాట రమ్మని కమ్మబంపిరట. దానిం జదువుకొనుచున్నారు. ఆ తొందరలో నామాట బాటింపక పోపోమ్ము. పిమ్మట విమర్శింతుములే అని యదలింప నిచ్చటికి వచ్చితిని అని చెప్పినది.
ఆమాట విని ఆబోఁటి అక్కటా! వారికిఁ బోరేమిటికి వచ్చినదియో తెలిసి కొనవలయును. లెండు లెండు అని పలుకుచు సఖులతో గూడ బయలువెడలి చంపక శుద్ధాంతమున కరిగినది.
వీరసింహుఁడు వారి సంవాదము విని మురియుచు నిమ్ముదిత రాక్షసరాజ పుత్రియగు చంపక. దీనికింకను వివాహము కాలేదు. ఏను దీనిని వరించుట తప్పు గాదు. వచ్చినసని మఱచుటతప్పు. ఇందుండి పాతాళమునకు దారి గలదు గదా ? యురగసమరసహాయమున కరిగెడు. రక్కసులవెంట నేనక్కడికిఁ బోయి నా తలి దండ్రుల జాడ తెలిసికొనియెదనని నిశ్చయించి నాచేడియలవెంట గొంతదూర మరిగెను. అంతలో వారదృశ్యులగుట విభ్రాంతుఁడై దిగ్భ్రమజెంది యందొక దారింబడి పోవఁదొడంగెను.
అని యెఱింగించువరకు వేళ యతిక్రమించుటయు దదనంతరోదంత మవ్వలి మజిలీయం డిట్లని చెప్పందొడంగెను.
117 వ మజిలీ
విభీషణుని కథ
అయ్యో? సుడిగుండమునఁ బడినయీతగానివలెఁ బదిదినముల నుండి యీ పట్టణమునఁ దిఱుగుచుంటిని. అగమ్యగోచరముగానున్నది. విభీషణుని గేహమేదియో తెలిసికొనవలయునని యెఱింగినను గనంబడకున్నది. చంపకనుజూచు భాగ్యము నాకిఁక బట్టదుకాఁబోలు ఈపాటికి రాక్షససేనలు పాతాళమున కేగియుండును. ఇప్పుడు నాకుఁగర్తవ్యమేమి? ఎన్ని దినములిట్లు తిఱుగుచుందును? అన్ని మేడలు జూచినట్లె కనఁబడును. క్రొత్తవివలెఁ దోచుచుండు కాళ్ళు నొప్పి పెట్టుచున్నవి. ఇకఁ నడువఁజాలను. సాయంకాలమగుచున్నది. ఈ కనంబడుచున్న మేడ ప్రవహస్తుని దని వ్రాయఁబడియున్నది. ఈరాత్రి నిందు వశించి విశేషంబులం దెలిసికొనియెద నని తలంచి వీరసింహుఁడు ప్రహస్తుని మేడలోనికిఁ బోయెను.
అందొక శయనగృహంబున భార్యభర్తలిట్లు సంభాషించుకొనిరి.
భార్య - ప్రాణేశ్వరా! నగరవిశేషములేమి ? నేఁడు ప్రొద్దుపోయి వచ్చితిరేల?
భర్త - అబ్బా ? యీ విభీషణుని కొల్వుచేయుట కడుగష్టముగానున్నది. సృష్ట్యాదినుండియు దమోగుణ ప్రధానులగు యాతుధానుల మునులవలె నుండుమనిన నుందురా ? సహజగుణము మానుప నెవ్వరి తరము. ఈ నడుమ శూర్పనకా పౌత్రుడఁగు విదుజ్జీహ్వుఁడు మాయాబలంబున జంపక యంతఃపురమున కఱిగి యామె చెలికత్తె నెచ్చటికో తీసికొనిపోయెనఁట. అది నాయపరాదముగా నెంచి యా మాయావిం బరిభవింపకున్న నిన్ను మన్నింపనని చిన్న విభీషణుఁడు నాపై నలిగెను. విద్యుజ్జిహ్వుని నిమిత్తము పెక్కండ్రు దూతల నంపితిని. వాఁడెక్కడికో పారిపోయెనఁట. వారియింటనున్న మాయాకథప్తుస్తకములెల్ల లాగికొని రాజవశము గావించితిని. నేడాలస్యమైనదని యెరింగించెను
ఆమాటవిని భార్య అర్యా ! పూర్వము లంకలోఁ గల రక్కసుల మాయాశక్తి యంతయునేమైనది. యిప్పుడు వ్యాపకముగాలేదేమి అని యడిగిన భర్త సతీ