కాశీమజిలీకథలు/ఏడవ భాగము/114వ మజిలీ

వికీసోర్స్ నుండి

నా కలికి యందులకు సమ్మతించినది కాదు. అక్కడ నుండియే ముక్తనయ్యెదనని దీనయై మిక్కిలి ప్రార్దించినది.

అరుంధతి యాబోఁటి మాటలన్నియుఁ. బూర్వపక్షములు జేసి చేయఁదగిన కృత్యంబు లుపదేశించుచుఁ గన్నుల మూసికొనుమని చెప్పినది. యోగసక్తం జూపింతుననుటచే జితవతి తన కరతలంబుల గన్నుల నాచి మూసికొనినది.

అని యెఱింగించి - ఇట్లని చెప్పదొడంగెను.

114 వ మజిలీ కథ

ఔరా ! కన్నులుమూసి తెరచినంతలో నత్తపోవన మంతర్థానమైనదే. ఈ భవన మెవ్వరిది? నవరత్న ప్రభాధగద్ధగితములై కుడ్యాంతరంబులు కన్నులకు మిరుమిట్లు కొల్పు చున్నవి. ఇది మదీయ సదనము కాదు. ఇదియొక దేవలోక విశేషమని తోచుచున్నది. అగునగు మఱచితిని. నా సఖురాలిం జూపి౦పుమని యామునిపత్నిం గోరితినికానా? ఇది యోగసక్త మందిరము కావచ్చును. సందడియేమియుం దోచ దేమొకో? లోపలికిఁబోయి చూచెదంగాక యని తలంచి జితవతి మెల్లన తలుపులు తెరచికొని లోపల అడుగుపెట్టినది.

గదిలో మంచముపైఁ బండుకొని ధ్యానించుచున్న యోగసక్త “ఎవరువారు” అని కేక పెట్టినది. ఆ ధ్వనివిని యోగసక్త యని నిశ్చయించి జితవతి యామె దాపునకుఁబోయి నమస్కరించినది.

యోగసక్త లేచి యెదురువచ్చి యామె నెగా దిగఁజూచి అమ్మా ! నీవెవ్వతెవు ? ఇందేమిటికి వచ్చితివి? ఈ ప్రాయంబున యోగినివై జటావల్కలములు ధరించితి వేల? నీయుదంత మెరింగింతువే అని యడిగిన సఖీ ! నన్ను మరచితివా? నీకష్టముల కెల్లఁ గారకురాల జితవతిని తల్లీ! కశలినివై యుంటివా అని పలికినంత నాశ్చర్య ముఖముతో నామెం గౌఁగలించుకొని ప్రాణసఖీ! ఇట్టి వేషము ధరించితివేల? నీవిక్కడకెట్లు వచ్చితివి? మా దేవత్వము భ్రష్టమైనది వింటివా? నీకును వార్త నంపియే యుంటినని అశ్రుబిందువులుజింద విదారించుచుఁబలికినది.

జితవతి యామె నోదార్చుచు అమ్మా ! నీ దుఃఖమును సమూలముగా నిర్మూలింపఁజాలనుగాని కొంతకొంత కొరఁత వడునట్లు చేసితిని. వినుమని తాను రోహిణితో నగరము విడిచి యోగిని వేషము వైచినది మొదలు అంతదనుక జరిగిన వృత్తాంత మంతయు నెరింగించినది.

యోగసక్త యురముపై జేయివైచుకొని అమ్మనేజెల్లా ! ఎంత సాహసము జేసి తివి? తల్లీ ? యెన్నియిడుమలంబడితివి సఖీ ? యెట్టి కృతజ్ఞురాలవు యెట్టిమహిమ సంపాదించితివి అని యబ్బురపాటుతో నామెం గౌఁగలించుకొని రాజపుత్రీ! స్వర్గమర్త్యపాతాళములలో నీవంటి పుణ్యాత్మురాలు లేదు. నీమైత్రివలన నేనును గృతార్దురాలనైతినని పెద్దగా బొగడినది.

చాలుఁజాలుఁ ఎదురు నన్నుఁ బొగడుచుంటివా? నీ సుగుణములలో సహస్రాంశము నాకడలేదు. నీ సత్యము నీ యౌదార్యము నీపరోపకృతియే సుకృతికిఁ గలదు. పోనిమ్ము మనమిద్దరము ఇందుఁ దపంబు జేసికొనుచుండుదము దేహయాత్ర నడువఁగలదని పలికిన యోగసక్త యిట్లనియె.

దేవీ ! మేమీ ప్రపంచముచూచి రోసితిమి?. నీవు చూడకయే రోయుచుంటివి. అయినను అప్పురాణ మునిదంపతులు నిన్నింటికిఁ బోయి పెండ్లి యాడుమని యానతిచ్చిరి కదా ! అ వైభవము కొన్ని దినము లనుభవించి పిమ్మట తపంబు జేసికొన వచ్చును.

తపమనఁగా ముక్కుమూసుకొను కూర్చుండుటగాదు. శమదమాది గుణంబులు గలుగుటయే తపము. సత్యము తపము, దానము తపము, కృతజ్ఞత తపము, సుగుణంబులన్నియుఁ దపంబులు. కావున నీవు గావించన తప మేమహర్షులు చేయలేదని వ్యాఘ్రసేవయే చెప్పుచున్నది. నీవిఁక నింటికిబోయి యా ప్రభాకరుని బెండ్లి యాడుము. సౌఖ్యమొందగలవని‌ యుపదేశించినది.

జితవతి యేమియు మాటాడక కర్తవ్యంశాము గుఱించి వితర్కించుచున్న సమయంబున నగ్రవసువు భార్య తేజోవతి యచ్చటికి వచ్చి సోదరీ యేమిజేయుచున్నావు? నీకొక శుభవార్త చెప్పెద నిటురమ్మని పిలిచినది. సంతోషముతో లేచి యోగసక్త వాకిటకుఁ బోయి తోడితెచ్చి యుచితాసనాసీనం గావించినది.

జితవతి లేచి యామెకు నమస్కరించుటయు నబ్బురపాటుతో జూచుచు నీ యోగిని యెవ్వతె? నీకీమె పరిచయ మెందుఁ గలిగినదని యడిగిన యోగసక్త పిమ్మట నీమె వృత్తాంతము జెప్పెద నీవుదెచ్చిన శుభోదర్క మేమనవుఁడు. తేజోవతి యిట్లనియె.

వసువులెల్ల శప్తులై భూమిలో జనింపఁ దలిదండ్రు లెవ్వరని యా లోచించుఁ బోవుచుండ దారిలో బ్రహ్మశాపతప్తయగు గంగా మహాదేవి యెదురు పడినదట. వసువులామెతోఁ దమపాట్లు జెప్పికొనిరి. ఆమెము వారికిఁ దమశాపప్రకార మెఱింగించి వానినెల్లఁ దనయందు జనించునట్లు నియోగించినదఁట.

పిమ్మట అద్దేవి శంతనుఁడను మహారాజును భర్తగా వరించి వసువుల నందఱ గొడుకులగాఁగనినది. జాతమాత్రమున శాపవిముక్తులై యార్వురు వసులును నీభర్తకిచ్చిన దుష్టశాపముల గుఱించి పరితపించుచుండ నాకాశవాణి వసువులారా ! మీరు ప్రభాసుని నిమిత్త మించుకయు విచారింప నవసరములేదు. ఆతడు భీష్ముండను పేరుతోబుడమిఁ బెద్దకాలము బ్రతుకును. దేవతలకన్న నెక్కుడు విఖ్యాతి వడయఁగలడు. సర్వధర్మములు అతనికే తెలియును. స్వచ్చంద మరణుండై యుండునని పొగడుచు నెఱింగించినది. వసువు లింటికి వచ్చినీకీ వార్త దెలిపి రమ్మనిరి. అని చెప్పినవిని యోగసక్త యిట్లనియె.

అక్కా ! అతి కౄరమైన యతి శాపంబిట్లు మారుటకుఁ గారణమేమియో తెలిసినదియా? యని యడిగిన నామె యది యేమియో నాకుఁ దెలియదు. ఇది అసత్యము కాదు. యదార్థవచనమని పలికిన నవ్వుచు యోగసక్త అక్కా ! యిక్కార్యంబ౦తయు నీ కాంత వలన ఫలించినది. అందు వసుసామర్థ్య మేమియు లేదని జితవతి వృత్తాంత మంతయు నెఱింగించినది.

అప్పుడు తేజోవతి యేమీ? యీమెయే జితవతి. ఆహా ! నేఁడెంత సుదినము. అని పొగడుచు నామెం గౌఁగలించుఁ కొనుచు దల్లీ నీ వలన మా కులంబు నిలఁబడినది. మే మందరము నీ కృతజ్ఞతకుఁ దాసులమై యుండెదము. నిన్నుఁబోలిన పుణ్యాత్యురాలు లేదు. అని పొగడుచుండ జితవతి యామెకు నమస్కరింపుచుఁ జెవులు మూసికొనినది. యోగసక్తయుఁ దేజోవతియు జితవతికి బోధించి జటావల్క లాదులఁదీసి దివ్యమాల్యానులేపన మణిభూషాలంకృతం గావించి ముహుర్త మాత్రములో నామె మేడమీద దింపి రండని పరిచారకుల నియమించిరి.

అయ్యుప్పరిగపై నున్న పరిజనమా రాజపుత్రిక రాకజూచి జితవతి జితవతి యని కేకలువై చుచుఁ బదుగురకుం దెలియఁజేసిరి. సంభ్రమముతో రాజపత్నియు రోహిణియు మున్నగు అంతఃపుర కాంతలామేడకువచ్చి జితవతింజూచి కౌఁగలించుకొను చుండిరి. జితవతియు వారినెల్ల నాదరించచుఁ దల్లికన్న ముందు రోహిణిం గౌఁగలించుకొని ప్రియసఖీ ! ఇంటికెట్లు చేరితివి? ప్రవాహములోఁ గొట్టుకొనిపోయి ఎందుఁ గట్టెక్కితివి? ఆ పులియేమైనది. చెప్పుము. అని యడిగిన రోహిణి తనకథ యంతయు జెప్పినది. జితవతియు రోహిణి యడుగఁ దన వృత్తాంత మంతయు వారికెల్ల నెరింగించినది.

పిమ్మట మందిరాభ్యంతరమున కరిగి పరంపరలుగా వచ్చి చూచెడు బంధువుల కందఱకు అత్తెరంగెఱింగింపుచుండ వినోద నినాద మేదురంబై యాగృహంబు సాగరంబువోలె ఘూర్ణిల్లుచుండెను. ఉశీ నరుండరుదెంచి పుత్రికం గౌగలించుకొని యానందాశ్రువులచేఁ దదీయ శిరంబు దడుపుచుండఁ గులపాలికా విరుద్దంబగు చర్యలఁ గావించితినని సిగ్గుపడుచుండ అతండు గద్గకంఠముతోఁ దల్లీ! నీ సౌశీల్యము లోక విదితమైనది. నీవు విచారింపపలదు. నీ కతంబున మా వంశము వాసి కెక్కి, నది.

క. తలనుండి తృణముదీసిన
   నలరారుం గోటియిచ్చినట్లుల మజనుం
   డిలఁ బ్రాణమిచ్చి యపకృతి
   సలిపిన వైరముగనది యసజ్జనుఁ డెంచున్‌.

నీవు గృతజ్ఞురాలవై మంచికీర్తి సంపాదించితివని పొగడుచుఁ బెద్దగా గౌరవించెను. పదిదినముల దనుక రోహిణియు జితవతియుఁ దమ ప్రయాణవిశేంషంబుల నాప్తుల కెరింగించుచుండిరి. ఆ ప్రస్తావములో రోహిణి ప్రభాకరుని గుణగణంబులను పెద్దగాఁ బొగడుచు నామె మనసు వానియందు లగ్నమగునట్లు కావించినది.

తన నిమిత్తమై యత్తర దేశారణ్యములఁ దిరుగుచు నతండు పడిన కష్టములును జెప్పిన మాటలును జేసిన కృత్యంబు లుగ్గడించిన విని జితవతి అయ్యో? సఖీ! ఆ రాజపుత్రుఁడు నా కొరకంత పరితపింప నేమిటికి? నా మాత్రవు జోగురా లాయనకు దొరకదా ? కటకటా ? నే నెందరిని గష్టపెట్టితినో అని పలికిన విని రోహిణి జితవతి ! ప్రభాకరుఁడు నీ రూపము గుఱించి యంతగా స్తుతిజేయఁడు. నీ కృతజ్ఞతఁ దలఁచి అబ్బా ! వాని మనసు నీరై బోవునుగదా ? అని యానందభాష్పములతో నెరింగించిన జితవతి పలుమారు వినివిని యొక్క నాఁడిట్లనియె.

రోహణి ! నీ యుపన్యాసము శ్రోతవ్యమై యున్నది. నేను జోగురాలనై గుడిలో వసించియతనితో సంభాషించితిని. ఇప్పుడుశృంగార క్రీడలవానిమతినెట్లురంజింపఁజేయఁ గలను. శృంగార వైరాగ్యములు పరస్పర విరోధములుకావా? నా వైరాగ్యమంతయు, గపటమని తలంపఁడా అని యనేక విషయంబులఁ దలఁచి చెప్పిన విని రోహిణిచాలుఁ జాలు. నీ వైరాగ్యమే వానికి హృదయంగమముగా నున్నవఁట. నాఁడు నాతోఁజెప్పిన మాట లెన్నిగలవు ? నీవు మరియొకరీతిఁ దలంప నిందు మీ తలిదండ్రుల యభిలాషయు నట్లే యున్నది. నీ భర్త ప్రభాకరుఁడని వేల్పులే నిశ్చయించిరి. ముహూర్తము నిశ్చయించిరి. నీతో నూరక చెప్పుచున్నాను. కాని యిదివరకే పన్నాగమంతయు, గారవించిరని యెరిగించి యామె యంగీకారము గైకొని యశీనరున కెరగించినది.

ఉశీనరుఁడు ప్రభాకరునిఁ బంధుమిత్ర పరివార సహితముగా రప్పించి శుభ ముహూర్తంబున నత్యంతవైభవముతో జితవతినిచ్చి వివాహము గావించెను. అరుంధతీ మహాదేవి నందినీధేను దుగ్దంబుల స్వయముగాఁ బెరికి జితవతి కిచ్చియున్నది. యా పాల నా రాజపుత్రిక జాగరూకతతోఁ దెచ్చియుంచి వివాహానంతరమున భర్తకిప్పించి నది. యా పాలంగ్రోలి ప్రభాకరుండు దివ్యప్రభాకరుండై జితవతింగూడి యభీష్ట కామంబులఁ దృప్తుండయ్యెను.

ఒకనాడుక్రీడాంతరంబునఁ బ్రభాకరుండామె మొగముజూచి నవ్వుచుబ్రేయసీ ! నాఁడు నీవు యోగినివై యున్నప్పుడు నీ చూపులు జూచితిని. కేవలము శాంతరస ప్రధానములై యున్నవి. ఇప్పుడిట్లు పచ్చ నిల్తుని పూముల్కులువలె హృదయభేదకము లగుచున్నవి. ఈ శృంగారవిలోకము లెప్పు డభ్యసించితివని పరిహాసమాడిన నవ్వుచు నాపువ్వుఁ భోణి ప్రభాకరుని సాన్ని థ్యంబు లభించినఁ గనుదమ్ములకుఁ గ్రొత్తయందము గలుగుట యబ్బురముకాదు. అని యుత్తరముజెప్పి యా పురుష సింహమును సంతోష సాగరమున నోలలాడించినది.

ప్రభాకరుండు జితవతింగూడి పెద్దకాలము ఇంద్రవైభవ మనుభవించుచు రాజ్యము గావించెను.

గీ. ధరఁగృతజ్ఞునికన్న నుత్తమ సుకృతి యు
    గనఁ గృతఘ్నునికన్న దుష్కకల్మషుండు
    లేడు లేడని శాస్త్రము ల్విప్పిచెప్పె
    సత్య మా మాట కిది నిదర్శనము కాదె

సీ. నితరణంబున జగద్విశ్రుతయశులైరి
             శిబి సూర్యసుత దధీచిప్రముఖులు
    సత్యంబె వ్రతముగాఁ జన హరిశ్చంద్రుడు
             త్రిభువనంబు లెఱుంగఁ దేజమందె
    సాహసంబె ప్రధాన సద్గుణంబై యొప్ప
             విక్రమార్కుఁడు దేవ వినుతుఁడయ్యె
    శమగుణై కాంచిత స్వాంతుఁడై భరతుండు
             మునుల కందరాని ముక్తివడసె

గీ. జితవతి కృతజ్ఞ తాగుణ వ్రతముబూని
    చిరతపఃపూత మునిజాత నిరతిశయన
    మస్తసురగీత విఖ్యాత మహిమగాంచె
    సుగుణమేదైన జనుఁ బరిశుద్దఁజేయ.

గోపా ! వినుమా ప్రభాసుండు శంతనునివలన గంగాగర్భంబునం జనించి భీష్ముండను పేరు వడసి సమస్త విద్యలం జదివి యస్త్రశస్త్రధారణంబునఁ అసమానుండై యొప్పుచు రెండవ జన్మంబునఁ బలడిత రాయలై యుదయించెను. ఆ యోగసక్త లవంగియై బ్రాహ్మణ పుత్రిక యయ్యు పాదుషా కూతుఁరను వాడుక వడసినది జితవతి కుపకారము చేసిన పెద్దపులియే పాదుషాయైనది రెండవ పులి యతనికి మంత్రియైనది. పండితరాయలును లవంగియు నాజన్మంబునఁ గొన్ని యిడుమల గుడిచియు శాపావసానమున గంగాగర్భంబునం బ్రవేశించి వసురూపంబులం దాల్చి వసులోకమున కరిగిరి. తెలిసినదియా? యని యడిగిన గోవ కుమారుండు పరమానందభరిత హృదయుండై యా కథ పలుమారు జ్ఞప్తికిఁ దెచ్చు కొనుచు అయ్యవారి కనేక దండములు గావించెను.

ఉ. ఊరక చేతితోడఁ దలనున్న తృణావళి దీసినంత బం
     గారము కోటియిచ్చిన ప్రకారమున న్ముదమందు సజ్జనుం
     డారసి ప్రాణదానముననైన నొనర్చు మహోపకారము
     న్వైరముగాఁదలంచి యుపవాదము సేయు ఖలుండు థాత్రిలోన్‌.

గద్య - ఇది శ్రీమద్విశ్వనాధ సదను కంపాసంపాదిత కవితావిచిత్రా

త్రేయ మునిసుత్రామగోత్ర పవిత్ర మధిర కులకలశ జలనిధి

రాకాకుముదమిత్ర కొండయార్యపుత్ర సుబ్బన్నదీక్షిత

కవి విరచితంబగు కాశీయాత్ర చరిత్రంబునందు

సప్తమభాగంబున జితవతీ చరిత్రము.

శ్రీ విశ్వనాధార్పణమస్తు.