కాశీమజిలీకథలు/ఏడవ భాగము/100వ మజిలీ

వికీసోర్స్ నుండి

శ్రీరస్తు

శుభమస్తు అవిఘ్నమస్తు

కాశీమజిలీకథలు

సప్తమభాగము

నూఱవ మజిలీ

క. శ్రీకాశీనగరాధీశాః
    కారుణ్యాంబుధీ! నిశాకరవర
    లేఖాకల్ప భక్తకల్ప
    శుభాకర! గౌరీశ! పాపహర! విశ్వేశా!

మహాత్మా అవధరింపుమట్లు మణిసిద్ధ యతీంద్రుండు ప్రబుద్ధ స్వాంతుఁడగు నంతేవాసితో గూడఁ నూఱవ మజిలీ చేరి విహితక్రియా కలాపములం దీర్చికొని గ్రామ విశేషములం జూడనఱిగిన శిష్యునిజాడ నరయుచున్నంత అగ్గోపకుమారుం డూర్పుల డర నొకదెసనుండి పరుగిడి కొనివచ్చి యమ్మహాత్ము నడుగుదమ్ములం బడి గురువర్యా ! అల్లనాఁడు పండితరాయలు లవంగితోఁగూడ గంగాతరంగిణి యందైక్యమై పూర్వ దేహము ధరించెనని చెప్పితిరి. వారి పూర్వవృత్తాంత మెట్టిదని నేనడుగ “ఇప్పుడు చెప్పుటకు వీలులేదు. ముందెందైనఁ గరచరణ విశిష్టుండగు నిందుధరుమూర్తి గల శివాలయము గనంబడిన చోట జ్ఞాపకము సేయుము. దానికట్టి కారణమున్న" దని యానతిచ్చిరి గదా! అట్టిశివాలయ మీవీఁటం బొడఁగంటిని, పంచముఖుడైన యాదేవు నారాధించి వచ్చితి. పండితరాయల పూర్వవృత్తాంత మిప్పుడు చెప్పక తప్పదని గట్టిగా నిర్బంధించుటయు నయ్యతిపతి మందహాసము గావింపుచు నాత్మీయదివ్య మణిప్రభావ విదితోదంతుఁడై యుత్సుకత్వముతో వత్సా ! కృతజ్ఞతా గుణవిశేషంబునం గలుగు సుకృతంబును భీష్ముని పూర్వోత్తర జన్మ వృత్తాంతము నిందు దెల్లంబుగాఁ గలవు. అవహితుండవై యాకర్ణింపుము.

_____________

జితవతికథ

ధరాతలంబున సుప్రసిద్ధమగు విశాలాపురంబున సుశీనరుండను మహారాజు ప్రజలం బాలింపుచుండును. ఆ నృపతికి జితవతియను కూఁతురుగలదు. అయ్యువతీమ తల్లి, సౌందర్య ఖనిగా, సుగుణరాశిగా, లావణ్యపుంజముగా, కళాకలాపముగా, భూలోక లలనా లలామముగా నుండనెంచి వివరించి యతిప్రయత్నమున సృష్టించెనని చేయి యెత్తి శపథముజేసి చెప్పవచ్చును. విద్యారూప గుణగణంబుల భూలోకకొక స్తనుల నెల్ల జయించినదగుట నయ్యువతికి జితవతియని పేరిడిరని తలంచెదను.

ఆ బాలామణి యొకనాఁడు రాత్రి పండు వెన్నెలలు గాయచుండ నిజప్రాసాదోపరిభాగంబున మణికుట్టిమంబున జ్యోత్స్నావితానంబులు ప్రతిఫలించి వింతకాంతులీన ననూనడానకళా ప్రవీణలగు అలివేణులతోఁ గూడికొని వినోదముగా సంగీత ప్రసంగంబునఁ గాలము గడుపుచున్నంత రోహిణియను నేకాంత సఖురాలు జితవతిం జూచి యిట్లనియె.

భర్తృదారికా ! ఇపు డర్థరాత్రమైనది. ఈ శీతకరుని కిరణజాలంబు హృదయాహ్లాదము గావింపఁ గానామృతము శ్రవణంబులఁ గ్రోలుచున్న మనకు కాలపరిణామ మించుకయుం దెలిసినది కాదు. ఇఁక విపంచింగట్టి నిదురింపంబోదమే అనుటయు జితవతి జవ్వనీ ! భగవంతుండగు రోహిణీవల్ల భుని చల్లని కిరణంబుల విడచి వెళ్ళుట కుల్లం బొల్లకున్నదికదా? ఆహా! అమృత కిరణుండన కతనికే చెల్లుఁబో. ఈ యోషధీశుని ఘృణిగణంబులు సోకినంగాని పంటలు పండవఁట సకల లోకాహ్లాదకరుం డగు నీ హిమకరుని మహిమాతిశయం బించుక స్తుతి యించిపోవుటమంచిదిని యాజ్ఞాపించినది. అందఱునిందు బింబాముఖలై

               స్రగ్విణి వృత్తము
    రోహిణినాధ! కారుణ్యవార్దీ! సుధా
    వాహినీశాత్మజా భర్గచూడామణీ!
    రాహువైరీ! నిభారమ్య సౌమ్యాకృతీ!
    పాహిమాం పాహిమాం పాహిజై వాతృకా॥

భక్తిపరవశమై కన్నులు మూసికొని స్తుతియించుచున్న జితవతి దోసిటఁ బటుకాంతి స్ఫుటమణి ప్రభా ధగద్ధగితమై యొక మండనం బంతరిక్షంబునందుండి తటాలున జారిపడినది. అప్పుడమ్మదవతి అదరిపడి మృదుకరపుటం బమ్మణిభూషాపతన తాడనంబున కోపమి నేలబడ వదలినది. అయ్యదరుపాటుంజూచి యందున్న బోఁటు లెల్ల నేమియేమని బిదరు గదుర నడుగుటయుఁ దన్మణిఘాత వేదన నించుక సూచించుచు అమ్మించుబోఁణి సఖులారా! అదిగో చూడుఁ డాకసంబునుండి నా చేఁత నేదియో పడినది. అని యంతికమున వింతకాంతుల మెఱయుచున్న యమ్మణిభూషం జూపినది.

రోహిణి దానింగైకొని విమర్శించి యమ్మన చెల్లా! ఇది దివ్య మణిమండనము. తారావల్లభుండు స్తుతీగీతంబుల కలరి యీ యోషా మణికిఁ బారితోషికముగా దీనిం డిగవిడచెనని తలంచెదను ఆహా! ఈ దివ్యరత్నంబు లెంత వింతగానున్నవి! అని పొగడుచుండ నందున్న సుఖరాండ్రెల్ల నేది యేది యని మూఁగి దాని లాగికొనఁ దొడంగిరి.

రాజపుత్రికయుఁ గరపుటవేదవం బించుక యడంగిన పిమ్మట నిటుతెమ్మని యత్తొడవందుకొని వెరగుపాటుతోఁ జూచుచు అయ్యారే ! ఇది శిరంబున ధరింపఁదగిన నగుయగును దీనిం జైవాతృకుండు మనకుఁ ప్రసాదించెనని తలంచుచుంటిరా ? భక్త దీనికుండు మనకుఁ ప్రసాదించెనని తలంచుచుంటిరా? భక్త పరతంత్రుడగు అతండట్లు చేసినంజేయవచ్చును. మఱియు దేవతా మిధునములు విమానము లెక్కియంతరిక్షమున సంచరించుచుందురు. ఏవేలు జవరాలి శిరోభూషణమిందు జారి పడినదో తెలియరాదు. ఎట్లయినను దీనిం దేవసమానముగా నెంచి పూజింపవలయును. అని పల్కుచు అక్కలికి యంతరిక్షమువంక వీక్షణంబులఁ బ్రసరింపఁజేసినది

అప్పుడాకసమునుండి బలమైన మెఱపుతీగ క్రిందకు వచ్చుచున్నట్లు గనంబడుటయు అక్కుటిలాలక సఖులతో "అటు చూడుఁడు మనకు వింతలపై వింతలు గనంబడుచున్నవి. ఆ తేజోరాశి యెద్దియో విమర్శింపుఁడు. అదిమనదెస వచ్చుచున్నట్లున్నది. అనుటయునక్కాంత లక్కజపాటుతోఁ జూచుచు దేవకాంత దేవకాంత. ఒరుల కంతరిక్ష సంచారము కలుగనేరదు. భగవతీ రక్షింపుము రక్షింపుమని కేకలువేయుచుండ నారాజపుత్రిక సఖులతో చేతులెత్తి మ్రొక్క, దొడంగినది. అంతలో అంతరిక్షము నుండి యొక కాంతారత్నము వారి మేడమీఁదకి దిగి కలయంజూచుటయు నబ్బిబ్బోగవతు లతిసంభ్రమముతో

సీ. చెలియోర్తుమణి భర్మసింహాసనమొసంగె
             నర్ఘమర్పించెఁ దొయ్యలియొకర్తు
    పాద్యమిచ్చె సరోజ పత్రనేత్ర యొకర్తు
             వింజామరంఁబూని విసరె నొకతె

    గంధమాల్యాద్యలంకారంబు లర్పించి
             పూజించె వెసనొక్క పూవుఁబోణి
    పాదంబులొత్తె సద్భక్తి నొక్కవధూటి
             తాంబూలమిచ్చెఁ బైదలి యొకర్తు

గీ. జితవతీసతి గనుసన్న జేసినంత
    చెలులు సకలోపచారముల్ జేసిరట్టు
    లమర కాంతకు నంతరంగమునఁ జెలఁగి
    వారిభక్తికి నామె దీవనలొసంగ.

సింహాసనాసీనయైయున్న యన్ని లింపాగనయెదుర నంజలి పుటంబు శిరంబునంజేర్చి వినయంబు దీపింప జితవతియల్లన నిట్లనియె.

శా. దేవీ! నీవు సమస్తలోకముల రక్తిన్ బ్రోచు శర్వాణివో?
    శ్రీవో! పద్మజురాణివో! సురపతిస్త్రీవో! మరుత్కాంతవో
    దేవరాతి వధూటివో? పసుపురంధ్రీమౌళివో? కావలెన్
    భావింపన్భవదీయరూప విభవప్రాగల్భ్యముల్ దివ్యము
    ల్గావే! మామక పూర్వపుణ్య పరిపాక ప్రాప్తిచేఁగాక మా
    కీ వీరీతిఁ బ్రసన్న వౌదువె! కృపాదృష్టిన్ బ్రపాదింపుచున్
    బ్రోవంగాఁదగుదమ్మ మమ్మిఁకను బ్రాపుంజేర్చి సద్భక్తితోఁ
    గావింతుం గొనవమ్మ నీకిదె నమస్కారఁబు లోకేశ్వరీ.

అని అనేకవిధంబులం బొగడుటయు నవ్వేలుపుఁ జవరాలు తదుపాసన కెంతేని సంతసించి యమ్మించుఁబోణి కర్దాసనంబిడి యక్కునం జేర్చుకొని గారవించుచు నపారగౌరవంబేసారఁదరుణీమణీ! నీవుప్రాయంబునఁ గడుపిన్న వయ్యుఁ బ్రోఢవలె నాకపూర్వసత్కారములు గావించితివి. నీయుపచార పరిగ్రహంబు నాడెందము నీయందు నెలకొల్పఁ జేయుచున్నది. నీపేరెయ్యది? యెవ్వనికూఁతురువు? భర్తయెవ్వఁడు? ఇది యేపురము అని అడిగిన జితవతి కుతుకమతియై యిట్లనియె.

భగవతీ! నా పేరు జితవతియండ్రు. ఇది భోజనగరము. ఉశీనరుండను మహారాజీ పురము పాలించుచుండెను. నే నాఱేఁని పుత్రికను నాకింకను వివాహముకాలేదు. వీండ్రందఱు నా సఖురాండ్రు. వీండ్రు పరిచారికలు, వీరు చుట్టములు. మేమీఱేయి వెన్నెల సేవింపుచు నమృతకరు నారాదింపుచుండ నీ మండనము నాదోసిటంబడినది. దీని దేవతా ప్రసాదముగా స్వీకరించి ముఱియుచుండ నింతలో నీవు సాక్షాత్కరించి తివి. ఇదియే మావృత్తాంతము. దేవీ ! యకారణ బంధురాలవై మాకుదర్శన మొసంగిన నీయుదంతమువిన మేము బాత్రులమేని శ్రోత్రానందము గావింపుమని వేడికొనుచున్నదాన నని పలికిన విని అక్కలికి లేనగవు మొగమున మొలకలెత్త నత్తన్వి కిట్లనియె.

యోగసక్తకథ

సఖీ ! వినుము దేవలోకములో వసువులని యొకజాతి వేల్పులు గలరు. వారెనమండ్రన్నదమ్ములు దేవసభాసామాజికులై విమానము లెక్కి స్వేచ్ఛావిహారంబులు సేయుచుందురు. మహేంద్రుఁడు గురువాక్యసమానముగా వారిమంత్రంబుల మన్నంచుచుండును. నేనువారిలో గడపటి వసువు ప్రభాసుని భార్యను. నా పేరు యోగసక్తయండ్రు. వినుము ఇక్ష్వాకకులసంభూతుఁడగు మహాభీషుండను నృపతి క్షితినపరిమితసహస్రాశ్వమేధములు గావించి స్వర్గలోకమున కరుదెంచి సకల దేవతా మునిపూజ్యుండై యొప్పుచుండెను.

అమ్మహాభిషుం డొకనాఁడు ఇంద్రాది బృందారక సందోహముతోఁగూడ బ్రహ్మసభకుఁబోయి కూర్చుండెను. సిద్ధవిద్యాధర గంధర్వ కింపురుషాది దేవాతా విశేషులును నారదాదిమహర్షులు దిక్పతులు నిండియున్న యక్కొల్వుకూటంబునకు గంగామహాదేవి దివ్యాంగనారూపముదాల్చి విచ్చేసినది. ఆమెవచ్చుచుండ గాలిచేఁ గట్టినపుట్ట మించుక తొలఁగినదట అందున్న సమాజికులెల్లఁ పాపభీతిచేఁ దలలు వంచికొనిరి. మహాభీషుండు తలవాల్పక కదళీకాండ గర్భంబునుంబోలి యారంభోరు నూరుభాగంబు సాభిలాషతో నీక్షించుటయు నాదుష్టచేష్టంగాంచి కాంచనగర్భుం డలుగుచు రాజా ! నీవు కడుపుణ్యాత్ముండవై యుత్తమలోకంబులం బడసియు మాయెదుటనే దూష్యకృత్యంబులం గావించితిరి. నీవిందుండఁదగవు. మనుష్య లోకంబున జనింపుమని శాపమిచ్చెను. అందులకు వగచుచున్న యన్న పపురంఢరుని చిత్తశాంతికై త్రివిష్టపంబుననెల్లి యమరవల్లభుం డొకసభ జేయుచున్నవాడఁట. వసువు లయ్యోలగంబున కాహూతులై యరుగుచు నీదివసంబున విభావసు వసువిసరములచే నాకసమంతయు దప్తమగుటయు నవ్వేడిమికొడి గగన గమనంబు మాని తమ విమానముల మానవలోక నికటభాగములకు దింపి శీతల శీకర తరంగ మాలికాడోలికల నూగునట్లు జలధిమీదుగా నడపింపదొడంగిరి. అప్పుడు కాలకళాదుండు బ్రహ్మాండహసంతికలో రవిబింబమును పైడికమ్మింగాంచి కడలియను నీతొట్టెలో ముంచెనోయన రవి యపరసాగరజలంబున మునింగెను. తత్తాపంబునకు జలంబు లుడికి త్రుళ్ళుచున్నవియో యన మకరాకరమున భీకరములగు శీకరములు వీచికా వికరములతో నెగురుచుండెను. అంతలోఁ జంద్రోదయమైనది. కౌముదీసమయంబు వెండిపూసినట్లు చదల నాక్రమించినది. అప్పుడు తరగలం బొడమిన తుంపరల నెగరఁజిమ్ముచుఁ బిల్లవాయువులు మాకెంతేని హాయిగావించినవి. వీచికల రాచికొని యోడలవలె జలధి మీదుగానరుగుచున్న విమానములపైఁ గూర్చుండి చల్లగాలి సేవింపుచు మేమయ్యంబునిధి విశేషంబులఁ దిలకింపుచుంటిమి. మఱియును

సీ. క్రిందిభాగము మహోర్మికలు బొంగుచుముంస
          నలరి నంబు క్రీడ లాడియాడి
    త్రుళ్ళి చింత్రాంబుజంతువులు యానముల పై
          బడినఁ జేతులునాచిపట్టిపట్టి
    మించువీచులగ్రుమ్మరించిన వృధుశుక్తి
          రాసిలో ముత్తెముల్ దీసితీసి
    పవడంబుతీవ గన్పడినయప్పుడ యాఁగి
         గ్రుచ్చి ఖండములుగాఁగోసి కోసి

గీ. మ్రోలఁబాఠీన లుంఠనంబులను గనుచు
    జలవిహంగమరుత విశేషముల వినుచు
    నతులితానంద మనుభవించితిమి మేము
    కడలిమీదుగ నేగునప్పుడు లతాంగి.

అనేకవినోదములఁజూచుచు మేమాసముద్రము మీఁదుఁగాబోవు చుండఁ గొండొకవడికి దత్తీరంబున సమున్నతసౌధాగ్ర సమల్లిఖితగోపురంబగు నీ పురంబు గన్నుల పండువు గావించినది. ఇన్నగర ప్రాసాదవిశేషంబు లింద్రయమనరుణ కుబేరపట్టణ సౌధప్రభల మించి యున్నట్లు తోచుటనుఁ దర్వికవ దర్శనలాలసులై వస్తువుల సమానవేగముగల తమ విమానముల ----------- గగనమునకు రివ్వున నెగరఁజేసి తదుపరిభాగంబునం నిలచి

మ. అదెశృంగాటకమందు నాల్గుమొగలన్ హర్మ్యోత్తమంబుల్ ప్రభా
     స్పదముల్ రాజిలు రాజమార్గమదె భాస్వత్సోధరాజీయుతం
     బదె సాలంబదె రాజమందిరము కల్యాణోత్సవోపేత మ
     య్యదియే తోరణమౌర! వీటిరుచి పెంపౌఁగౌముదీవ్యాప్తి చెన్.

అని అనేక ప్రకారంబులం నిప్పుటభేదన విశేషంబులం గొనియాడు చుండి రట్టితరినావల్లభుండు మదంస భాగంబు గరతలంబునం గొట్టుచు బోఁటీ! అటు చూడుము ! చూడుము. అవ్వీటిసింగారంబు హృదయంగమంబును సుమీ అనిపలికిన విని నేను తమకంబేపారఁ గుడిచేతఁ బ్రియుని కంఠంబు బిగియఁ గౌగలించుకొని యించుక తలవంచి యిందలి విశేషములరయుచుంటిని, అప్పుడు దైవికముగా మదీయ శిరోరత్నము కదలి పట్టువదలి క్రిందజారి పడినది. తద్వియోగమునకు వగచుచు నధోభాగ మీక్షించుచున్న నన్నుఁజూచి కొమ్మా! పోనిమ్ము. ఈ మండనమంత లెస్సయాయేమి! వగచెద వేమిటికని నాపతి యడిగిన నిట్లంటిని.

మనోహరా ! ఈ శిరోమణి వివాహావసరమున నా జనకుండు నాకిచ్చె ఈ మంగళమండనంబు నాటంగోలేవిడువక పంతతంబు ధరింతునిది పోవుట యశుభసూచికమని వెరచుచుంటి నెట్లయిన వెదకి తేవలెనని బ్రతిమాలితిని. అప్పుడు విమానమందు నిలువంబెట్టి నా పతియతి జనంబునఁ క్రిందికి బోయివచ్చి మచ్చెకంటీ ! నీ శిరోరత్న మొకమేడపై గుమిగూడియున్న చేడియల నడుమఁ బడినది. దానింగూర్చి యాబోఁటులు మాటలాడు కొనుచుండిరి. ఆడుఁవాండ్రనడుమ కెట్లు పోవుదునని శంకగదుర మరలివచ్చితి. నీవువోయి వారి నడిగి యాతొడవుం దెచ్చుకొనుము. అంతదనుక నేనింద యుండెద నని యుపదేశించిన సంతసించుచు నేనిత్తఱి వియద్గమన పాటవంబున విమానంబు దిగి మీదండ కరదెంచితి ఇదియే నావృత్తాంతము నీభక్తి విశ్వాసములు నాకు మిగుల వేడుకం గూర్చుచున్నవి. నీకెద్దియేని గామితంబున్న నెఱింగింపుము. ఓపుదు నేని తీర్చి యరిగెదనని ప్రీతిపూర్వకముగాఁ బలికిన విని యాజితవతి యిట్లనియెను.

దేవీ ! వసువులు త్రిలోక పూజ్యులని మేము పురాణముల వినియుంటిమి. అట్టి వసుపత్నియైన నీదర్శనము పురాకృత సుకృత విశేషంబున మాకు లభించినది. మేమెల్లంగృతార్థులమైతిమి. నీవు నన్ను సఖియని పిలుచుటచేతనే నేను మనుష్యాంగనలలో నధికురాలనని గర్వపడుచుంటిని. నన్ను నీదాసురాలిగా నెంచుకొని నీ వెంటఁ దీసికొనిపోమ్ము నీ పాద సేవఁ జేయుచుండెదను. జరామరణ రోగభూయిష్టంబగు నీమనుష్యలోకంబున నుండుటకన్నఁ గష్టమున్నదియా? వేల్పులకట్టి యిక్కట్టు లేమియును లేవుగదా ! నాకు దేవత్వము గలుగ ననుగ్రహింపుము. ఇదియే నాయభీష్టమని వేడిన నచ్చేడియంజూచి యోగసక్త యిట్లనియె.

జితవతీ ! జరామరణ రోగములను నెట్లుండును ? వాని వలనంగలిగెడి బాధ యెట్టిది ? మా లోకములో వానిపేరులు మాత్రము విని యుంటిమి. ప్రచారమెట్టిదో తెలియదు. వివరింతువే అని అడుగుటయు రాజపుత్రిక నవ్వుచు నోహో ! మీ యదృష్ట మేమని కొనియాడదఁగి యున్నది. చింతయనునిది యెఱుంగక సంతతము సంతసము జెంది తిరుగుచుందురు. ఇదిగో ముదిమి తెఱఁగరయుము.

సీ. పలపలగా బట్టతలపైనఁ బండిన
           కుంతలంబులఁజేర్చి కొప్పువెట్టి
    రదములెల్ల నురాలఁ బెదవులతో బొక్కి
           నోరప్పలింపుచు సారెసారె
    చర్మావశిష్ట కుచద్వయం బురమున
           చర్మ భస్తికలట్లు జారివ్రేలఁ
    గరచరణాద్యంగకములెల్ల జీర్ణించి
           కాష్టముల్ పగిది వికారమొంద

గీ. పండివాడిన పణిలతావర్ణమట్లు
   దేహలత యెండి ముడుతలుదేరి యుండఁ
   దలఁదల్చుచుఁ జేత వేత్రంబుబూవి
   యందుఁగూర్చున్న యొక్క జీర్ణాంగిజూ పె

దేవీ ! ఈమె నాకు తల్లి తల్లి. యౌవనదశ యందిట్టి సుందరి యెందును లేదను వాడుకఁ బడసినది. ఇప్పుడెట్లున్నదో చూడుము. ఇదియే జరావికారమని చూపినఁ గాంచి యోగసక్త విస్మయ సాథ్వస వివశహృదయయై యేమీ! ఈమె మనుష్య కాంతయే ? కొంతకాలము సుందరి యని పేరు బొందినదా। నెచ్చెలీ ! నీవుగూడ ముందిట్లగుదువా యేమి ? అక్కటా ముదిమి కడుచెడ్డదియే ? అనియూరక వింతగా నా వృద్ధకాంతంజూడ దొడంగినది.

అప్పుడు జితవతి తల్లీ ! ఇఁకఁదెవుళ్ళ తెఱఁగరసిన నీగుండె పగిలిపోవును. మృత్యుదేవత బ్రహ్మయొద్దకువచ్చి జీవజాలంబులనే సమయింపఁజాలనని దుఃఖించినదఁట. అపుడు పరమేష్టి యామె కన్నీళ్లు దోసిటం బట్టి విరజిమ్ముటయు నాయశ్రుజల కణంబులు నలుమూలలుఁగోట్ల కొలది వ్యాపించినవి. అవియే మహావ్యాధులగుననియు నవినీకు దూతికాకృత్యములఁగావింపఁ గలవనియుజప్పి ప్రష్టయద్దేవినూరడించి యంపెనఁట. ఆబిందుకణము లసంఖ్యాకములైన రోగములై మనుష్యులం బాధించు చున్నవి. అని రోగిప్రవృత్తులం దెలుపు కొన్ని శ్లోకములం జదివినది.

యోగసక్త యా వృత్తాంతమువిని ఛీ ఛీ ! నీ విట్టి యసహ్యపు లోకమున నేమిటికిజనించితివి? మహాభిషుండు పుడమిజన్మించుటకు దుఁఖించిన నేమియో యనుకొంటి. నిరయమన నరలోకమని చెప్పవచ్చును. నీవునన్నిట్లు వరంబడుగుట యుక్తమే. కాని యింద్రుని అనుమతి లేక నాకంబునకు నిన్నుఁ దీసికొనిపోయితినేని నపరాధిని నగుదును. నీవిందుండంగనే నిన్నీ యిక్కట్టు లేవియుం జెందకుండునట్లు ప్రయత్నిం చెద. నూరడిల్లుము ఇది మొదలు నీవు నాకుఁ బ్రాణసఖురాల వైతివి. దూరమందున్నను దాపున నున్నట్లే నీక్షేమ మరయుచుండెదను. నాయాజ్ఞలేక నీవు వరుని వరింప వద్దు. అని యుపన్యసించినవిని సంతసించుచు జితవతి యిట్లనియె.

దేవీ ! నీవచనంబులన్నియు వరంబులుగాఁ దలంచుచుంటి. ఇఁక నాకేకొదవయునులేదు. నీవు మఱలవచ్చి యనుజ్ఞనిచ్చు దనుకఁ బెండ్లి యాడను. నీవాలసించివేని జరారోగములచే నేనునుం బీడింపఁబడుదుం జుమీయని సాభిప్రాయముగాఁ బలికిన విని యయ్యోగస క్త నవ్వుచుఁ దత్సమయోచితముగా ముచ్చటించి దీవించి తన మండనంబు గైకొని తదనుజ్ఞంబడసి యంతరిక్షగమనంబునఁ బతియొద్ద కఱిగినది.

అని యెఱింగించి మణిసిద్ధుం డవ్వలివృత్తాంతంబు దతనంతరా వనదంబున నిట్లని చెప్పందొడగెను.

101 వ మజలీ

వసువుల కథ

1. ధరుఁడు — తమ్ములారా ! నిన్నటి సభలో మహాభిషుని సంతోషమునకై మహేంద్రుం డెన్ని యుత్సవములఁ గావించినను నతని మనసు వికసించినట్లు కానిపించలేదు. విచారగ్రస్తమై యున్నదిసుఁడీ !

2. ధ్రువుఁడు — స్వకృత సుకృత విశేషంబున నత్యంత దుర్లభంబైన యమరలోక నివాససౌఖ్య మనుభవించుచు స్వల్పాపరాధమూలంబున ననల్ప దుఃఖభూయిష్టంబగు మనుష్యలోకంబున జనింపబోవు చున్నవాఁడు. అమ్మహారాజునకు దుఃఖముగాక సంతోషమెట్లు గల్గెడిని.

3. సోముఁడు — దేవమహర్షి సేవితంబగు బ్రహ్మ సభలో నాఁడుదాని వలువ తొలంగిన సాభిలాషుఁడై చూచె నిది స్వల్పాపరాధ మెట్లగును ?

4. అహ్నుఁడు - స్వల్పాప రాధము కాదు. జలజోదరుఁడు దయా హృదయుండగుట నామాతృపు శాపముతో విడిచిపెట్టెను.

5. అనలుఁడు — అంబుజ గర్భుండు గంగాదేవి కెమైన శాపమిచ్చెనా ?

6. అనిలుఁడు — అం దామె తప్పేమి యున్నది?

7. ప్రత్యూషుఁడు - తప్పున్నదని యెంచియే విరించి యామెం గూడ మనుష్యజన్మ మెత్తుమని శపించెను.

8. ప్రభాసుఁడు — అక్కటా ! మనుష్య లోకమం దాధి వ్యాధులు బాధింప నెట్టివారికిని సుఖలేశమైన లేదని యచ్చటి చరిత్ర మంతయు యోగసక్తవలన వింటిని. పాపము, పరమేష్టివారికి కఠిన శిక్షయే విధించెను.