కాశీమజిలీకథలు/ఎనిమిదవ భాగము/170వ మజిలీ
మేమియుఁ జెప్పలేదుకాని వానివలన నిడుములం గుడిచితిననిమాత్ర మెఱింగించెను. ఆభైరవుఁ డిప్పు డీయూర నున్నాఁడు. వానిమృగముల యాట రేపు సాగింతురు. వాని నప్పుడు పరిభవింపఁ దలంచికొంటిమి. వాఁడు మనచారాయణునిఁగూడ మృగమును జేసెనని యాకథయంతయు నెఱింగించెను.
అతండు భోజుండని విని ఘోటకముఖుండు విస్మయసాగరమునం దేలియాడెను. అతనిభార్య లీలావతి యిందేయున్నదని చెప్పినంతఁ గలిగినసంతోష మిట్టిదని చెప్పఁజాలను. వెండియు వార లొండొరులకథల నొండొరుల కెఱింగించికొనుచు వారు వారు పడినయిడుములు దలంచుకొని యడలుచు నాదివసము పర్వసమయముగా వెళ్లించిరి.
అని యెఱింగించి యతిపంచాననుం డవ్వలికథ మఱల నిట్లు చెప్ప మొదలుపెట్టెను.
170 వ మజిలీ.
−♦ మిత్రసమ్మేళనము. ♦−
నాఁడు భైరవుని మృగములయాటఁ జూచుటకు నియమించిన దివసము. అయ్యాటకుఁ దగిననెలవు పురమందిరము అది మిక్కిలి విశాలముగానున్నది. స్త్రీలనిమిత్తమై ప్రత్యేకముగా గదులు గట్టఁబడి యున్నవి. అయ్యాటఁజూచుటకు మల్లికయు రత్న పదిక సువర్న పదిక మొదలగు మగువలుకూడ నభిలషించి కోరుటయుఁ గుచుమారుఁ డంగీకరించి స్త్రీలనందఱను దీసికొనిపోవుటకు నేర్పాటు గావించెను.
రాజుభార్యలు రుక్మిణి మొదలగు నంతఃపురకాంతలుగూడ నావేడుకచూచుటకుఁ బోవుదురని విని చారుమతి దానుగూడ వత్తునని చిత్రసేనుం గోరికొనినది. ఆమెయందలి ప్రేమచే నతం డనుమోదించి స్త్రీవేషముతో వచ్చినచోఁ దండ్రికిఁ దెలియుసని వెఱచి చారుమతికిఁ బురుషవేషమువైచి యాయాటకుఁ దీసికొనిపోయి మారుమూలగాఁ గూర్చుండెను.
భోజుండును గాళిదాసకవితోఁగూడ నియమితకాలమునకు స్యందనమెక్కి యాపండితులున్న మందిరమునకుఁ బోయి వీధిని నిలువంబడి లోపలికి వర్తమానముపంపెను. స్త్రీలను బ్రత్యేకముగాఁ దీసికొనిరమ్మని గోణికాపుత్రునకు నియమించి తక్కినవారు భోజకాళిదాసకవుల ననుగమించి రంగస్థలమున కరిగిరి. అందుఁగూర్చున్న వెంటనే తన్నుఁ జూచి చిఱునగవు మొగంబున వెలయింపుచున్న ఘోటకముఖుంజూచి భోజుండు ఓహోహో ! వీరెవ్వరు? నావెంటఁ బెక్కులు చిక్కులు పడుచు దేశాటనము గావించిన పరమోపకారి ఘోటకముఖులా ? ఎప్పుడువచ్చితిరి? అని లేచి యాలింగనము సేసికొనియెను. మీ రాపదగుడిచియుండ లేచిపోయిన కృతఘ్నుఁడ ఘోటకముఖుఁడనే. ఆపాపాత్మునిచేతిలోఁ బడితి రెట్లు తప్పించికొని వచ్చితిరి ? అనియడిగిన నిప్పు డేమియు మాటాడవలదు వీఁడే యాక్రూరాత్ముఁడు. వీనిం బంధించునిమిత్తమే యీయాటఁ బెట్టితిమి. అంతయుఁ దరువాతఁ జెప్పెదఁ జూచు చుండుమని తత్కాలోచితములగు మాటలచే నతనికి సంతోషము గలుగఁజేసెను.
భోజునకు వామభాగమునఁ గాళిదాసకవియుఁ గుడివైపునఁ గుచుమారుఁడును దరువాతఁ దక్కినవారుం గూర్చుండిరి. స్త్రీలు గూర్చున్న చోటునకు దాపునఁ జిత్రసేనుఁడు పురుషవేషముతోనున్న చారుమతితోఁ గూర్చుండెను. విద్యుద్దీపములచే రంగస్థలమంతయుఁ బట్టపగలువలె నొప్పుచుండెను. స్త్రీలకుఁ బురుషులందఱుఁ గనంబడుదురు. రాజ భార్య లెవ్వరును రాలేదు. రుక్మిణిమాత్రము రేవతితో వచ్చి లీలావతి ప్రక్కను గూర్చున్నది రాజకుటుంబమువారిందప్ప నితరుల నాయఱలోనికి రానీయరు. లీలావతి భర్తనుఁ గాళిదాసకవిని జూచి నమస్కరింపుచు, లీలావతి - ఆహా ! నే నామహానుభావులసేవజేసి యెంతకాల మైనదో తిరుగా నీజన్మమున నా కట్టిభాగ్యము పట్టునా ? అని కన్నీరు విడచుచున్నది.
సరస్వతి - దేవీ ! ఘోటకముఖు లీదినమున మిమ్ముఁ దప్పక భర్తతోఁ గూర్తునని చెప్పలేదా ? మఱచితివా ? మీనిమిత్తమై వారు పడినశ్రమయంతయు వినియుఁ బరితపించెద వేమిటికి ? తప్పక మీకు నేఁడు భర్తృసమాగమము కాఁగలదు.
మదయంతి - అక్కా ! సరస్వతీ ! ఆతఁడే కాళిదాసకవిచంద్రుఁడు. ఆహా ! ఆమహానుభావునికథలం జెప్పికొనుటయేకాని దర్శనము సేసియుండలేదు. నేఁడు కృతార్థులమైతిమిగదా !
సరస్వతి - (భోజకాళిదాసకవుల నిరూపించిచూచి నమస్కరింపుచు) అయ్యిరువురు దేవసదృశులు; త్రిభువనవిఖ్యాతయశులు; నావివాహముతగవులో నానృపతికూడ నుండిరఁట.
రత్న పదిక - మాచరిత్రమంతయుఁ జూడకుండఁగనే రచించిన రహస్యవేది అతఁడే కాళిదాసు అయ్యో ! నాభర్త వారిదర్శనము సేయవలయునని యెంతయో కుతూహలపడువారు. ఎందుండిరో తెలియదు. ఏమిజరగునో అని యశ్రువులు విడుచుచున్నది.
సువర్న పదిక - ఈప్రయత్నమంతయు నందులకే కాదా? సంతోషసమయము వచ్చుచున్నది. విచారింపకుము.
సరస్వతి - మనపండితుల దండితనము వింటిరా? మొన్నటి సభలోఁ గాళిదాసకవితోఁ బ్రసంగించుటకుఁ గాలుదువ్విరఁట.
మదయంతి – అది యౌవనమదము తొలిప్రాయమందుండుటచే నట్టిపంకము గలుగును.
మల్లిక - ప్రసంగించిన నెవ్వరు గెలుతురో ?
లీలావతి - మీభర్త లెంతదిట్టలైనను విద్యామహిమచే నతనికి సాటిరారనుకొందును.
సరస్వతి — మహిమమాట జెప్పలేను కాని విద్యలకుఁ దీసి పోవరు.
రత్నపదిక — అమ్మయ్యో ! ఆమహానుభావునకు సాటి మూఁడు లోకములలో లేరని చెప్పఁగలను. మాహృద్గతాభిప్రాయములఁగూడఁ జూచినట్లు వర్ణించెను.
రుక్మిణి – అదియే యాకవిశిరోమణియందున్న విశేషము. ఎంత రహస్యమైనవిషయమైనను సమస్యగా నిచ్చినచో యథార్థము తెలియునట్లు పూర్తిచేయును.
సరస్వతి - అది దైవశక్తి, పాండిత్యప్రగల్భము కాదు.
రుక్మి -- రేవతీ ! మాయన్న యాపండితులతోఁ గలిసి కూర్చుండక మారుమూలగాఁ కూర్చుండెనేమీ ?
రేవతి - ఏమో తెలియదు. తండ్రిగారియొద్ద భయముకాదా ?
రుక్మిణి – ఆతనిప్రక్కఁ గూర్చున్నపురుషుఁడు మన మెఱిఁగియున్నవాఁడుంబోలెఁ గనంబడుచున్నాఁడు. చూడుము.
రేవతి - అగునగు నతఁడే నీహృదయచోరుఁడు.
రుక్మిణి — (జనాంతికముగా) ఈయాట ముగియులోపల నందుఁ జని వానివృత్తాంత మరసి రావలయును.
రేవతి - అట్లే పోయివచ్చెద, నదిగో గంట మ్రోగుచున్నది. మృగములతో వాఁడు ప్రవేశించునుగాఁబోలు.
మల్లిక - అడిగో అడిగో మెడలకుఁ దొడలకుఁ జేతులకు గంటలు గట్టికొని వచ్చుచున్నాఁడు. వాఁడేకాఁబోలు భైరవుఁడు. అగును. వాఁడె వాఁడె నాఁడు చూచితిని. గడ్డము జటలు పెంచుకొని యున్నాఁడు వాఁడే. ఓరీ ! క్రూరాత్ముఁడా ! నాతలిదండ్రుల నేమృగము చేసితివో చెప్పరా ! అని నిందించుచున్నది. రత్నపదిక - ముందు వాఁడును వానివెనుక మృగము లాసన్నని దారివెంబడి యావువెనుక లేగలువచ్చుచున్నట్లు వచ్చుచున్నవి. వానిఁ గఱవవుకాఁబోలు!
మల్లిక – బాబో ! పెద్దపులులు సింహములుగూడ వానివెంట దూడలులాగున వచ్చుచున్నవి. వానిఁ జంపవుకాఁబోలు !
సువర్ణ పదిక - కఱచినచోమనవంటివాఁడే, కఱవకుండుటయేవింత.
మల్లిక - అక్కా ! చూడు చూడు. చేతితో బెత్తముబట్టుకొని యెటుత్రిప్పిన నామృగము లటుతిరిగి యాడుచున్నవి.
సరస్వతి - కుచుమారునిముందఱ వీనియాటలు సాగవు ఇప్పు డేమిచేయునో చూడుము.
మల్లిక - ఏమి మీభర్తగారిబడాయి ! మీతో నేమిచేయుదు నని చెప్పిరి ?
సరస్వతి -- ఒక్క మృగమునైన వానికిఁ జెప్పినట్లు వినకుండఁ జేయుదురు. చూచుచుండుఁడు.
రత్న పదిక - మీభర్తకారుణ్యమున మావారు బంధవిముక్తులయ్యెనేని చాల సంతోషింతుముగదా !
మదయంతి - అక్కా ! నీభర్తగారిమెడలోఁ దెల్లగా మెఱయుచున్న దదేమి ?
సరస్వతి — అదియే యాసిద్ధుని యజ్ఞమాల, దానిమూలమున మంచిచమత్కారము జరగును చూచుచుండుము.
మదయంతి - అది సింహముకాఁబోలు. తోకయాడించుచుఁ గుక్కవలె వానివెనువెంటఁ దిరుగుచున్నది ఇంతకుము న్నిట్టియాటలు పెక్కులు చూచితిమి. క్రూరమృగముల బోనులలోఁబెట్టి తీసికొనివచ్చువారు. ముహూర్తకాలము నిలిపి యంతలోఁ దీసికొనిపోవుచుందు రిది కడు చోద్యముగానే యున్నది. అయ్యో ! అక్కా ! చూడు మా సింహముపైఁ గరిపోత మెక్కి యాడుచున్నది. సరస్వతి - (నవ్వుచు) అదిగో ! కుచుమారులు లేచుచున్నారు. ఇఁక వానిపని మట్టమగును.
అని యవనికాంతరమున స్త్రీలు సంభాషించుచుండిరి. ఆట కొంతవఱకు జరగినతరువాతఁ గుచుమారుఁడు లేచి యామృగముల దాపునకుఁ బోయి మెడలోనున్న యస్థిమాలను జేతంబూని మృగములకుఁ జూపుచు హుంకారము గావించెను. అప్పు డందున్న మృగములన్నియు నాతనియొద్దకు వచ్చి వినయ మభినయించుచు నిలువంబడినవి.
భైరవుఁడు చేతనున్న బెత్తముం జూపుచు రమ్మని యొకభల్లూకమును బిలిచెను. పోయినదికాదు. దానితో నొకదెబ్బకొట్టినంత బొబ్బ పెట్టుచు వానిమీఁదఁబడి రక్కినది. అంతలోఁ గుచుమారుఁడు పిలిచినంత నతనిచెంతకుఁ బోయినిలిచినది. వెండియు వాఁడు వ్యాఘ్రమును బెదరించిన నది గాండ్రుమని యఱచుచుఁ గఱవఁబోయినది. ఈరీతి మృగము లెల్ల దిరుగఁబడి వానిం గఱవఁబోయిన వెఱచుచు వాఁడు బారిపోవ ప్రయత్నించెనుగాని దారిలేదు. మృగములే యడ్డముగా నున్నవి. క్రూర సత్వంబులేకాక యశ్వములుగూడ చెంతకుఁబోయినఁ దన్నుచుండెను.
వాఁడు హస్తమెత్తి మహారాజా ! ఈతఁ డెవ్వఁడో ప్రయోగము గావించెను. మృగములు చెప్పినట్లు వినుటలేదు. నే నేమిచేయుదును ? రక్షింపవలయు, నివియే నన్ను భక్షించునట్లున్నవి అని ప్రార్థించెను. అప్పుడు చారాయణుఁడు వానిదాపునకుఁ బోయి యోరీ ! భైరవా ! నన్నెన్నఁడైనఁ జూచితివిరా ! నాముఖముజూచి చెప్పుము. అని యడిగిన వాఁడు గడగడ వడంకుచు నా కేమియు జ్ఞాపకములేదని యుత్తరము జెప్పెను. అల్లనాఁడు సిద్ధునితల రాయితోఁ బగులఁగొట్టితి వదియైన జ్ఞాపకమున్న దా ? అనవుఁడు చాలు చాలు నన్నెవ్వరో యనుకొని భ్రాంతి పడుచుంటివి అని గద్దించెను.
నిన్ను నే నెఱుంగుదును. భైరవుండవు. గురువుంజంపిన మహా పాపాత్ముండవు. చీ! మూఢా ! నీమొగముచూడ మహాపాతకమని నిందింపుచుండ ఘోటకముఖుం డరుదెంచి యేమిరా ద్రోహీ ! నాఁడు ఆడుదానిం జెఱపట్టితివి జ్ఞాపకమున్నదా ? అని నిందించెను అట్లు తలయొకమాటయాడి తిట్టుచుండ వాఁ డేమిచేయుటకుం దోఁచక ఇదిగో వచ్చెదనని యొకమూలనుండి వెళ్ళఁబోయిన గోఁతు లాటంకపఱచినవి. కుక్కలు తఱిమినవి. గుఱ్ఱములు తన్నినవి. వాఁ డిటునటు పరుగులిడుచుండ సామాజికులు నవ్వసాగిరి.
అప్పుడు కుచుమారునిచేఁ జెప్పఁబడి యొకభల్లూకము వాని నొకచెంపకాయ గొట్టి జుట్టుపట్టికొని వంచి లాగికొనివచ్చి కుచుమారుని పాదమూలమునఁ బడవేసినది.
కుచుమారుఁడు వానిశిరము కాలితోఁ దన్నుచు గురుద్రోహీ ! పరమతపోనిధియగు నాసిద్ధుం బరిమార్చి యేమిమూటఁగట్టుకొంటివి ? యముఁడు నీ నిమిత్తమై క్రొత్తనరకము గట్టించుచున్నాఁడు. పదపద. నీ విఁక నీభూమిలో నుండఁదగినవాఁడవు కావు. ఎందఱనెన్నిద్రోహములు సేసితివి. సీ ! సీ ! కీటకాదులలోఁగూడ నీవంటి నీచజన్మములేదని మీఁద నుమ్మి వైచి బాలీశా ! ఈమృగములన్ని యు నెవ్వరో నిజముజెప్పుము. లేకున్న నిదిగో మృగములచేత నీపనిపట్టించెదనని పలికిన వాఁ డేమియు మాటాడక జీవచ్ఛవములాగున పడియుండెను.
అప్పుడు వానిపాదములకుఁ జేతులకు నిగళములు దగిలింపఁ జేసి మృగములన్నిటినిఁ బరిశీలించి మెడలలోఁ గట్టఁబడియున్న తాయెత్తుల లాగివైచినంతఁ గొన్ని పురుషులుఁ గొన్ని స్త్రీలునై, నిలువంబడినవి. సభ్యులెల్లరు విస్మయముజెంది చూచుచుండిరి. అప్పుడు వారు అంబా ! తాతా ! అక్కా ! అన్నా ! అని యాక్రోశించుచుండిరి.
వారిలో యక్షుండు నలుమూలలు సూచుచు దీపప్రభావిశేషముల కచ్చెరువందుచు నది స్వర్గమాయని విభ్రాంతిఁ జెందుచుండ సువర్ణ నాభుందు సమీపించి మహాత్మా! నన్నెఱుంగుదువా? సువర్ణ పదిక భర్తను సువర్ణ నాంభుడ. మావదినయు నిందేయున్నదని పలుకుచుఁ గౌఁగిలించుకొనియెను. ఈసభ యెవ్వరిది ? నే నిక్కడి కెట్టువచ్చితిని ? అని యడిగిన సువర్ణనాభుండు ఇది భోజరాజుగారిసభ. అతఁడే మహారాజు. అతఁడే కాళిదాసు. వారే నామిత్రులు. వీఁడే భైరవుండు బంధింపఁ బడెను.
అని యావృత్తాంతమంతయు నెఱింగించుటయు నాయక్షుండు చేతులెత్తి భోజకాళిదాసకవులకు నమస్కరించుచు చారాయణునితో వారందఱు సేమమా భైరవుని బంధించుట లోకోపకారము. మల్లికతల్లి దండ్రులు వచ్చిరా ? అనుచుండఁగ నే బ్రహ్మదత్తుఁడును భార్యయు నందు వచ్చి తమకథ యెఱింగించిరి. మల్లికయు నందేయున్న దని విని ప్రహర్షపులకితగాత్రులై భోజునకుఁ దమ్మెఱింగించి భైరవుఁడు గావించిన యవమానము దెలియఁజేసిరి. భైరవవంచితులగు వారినెల్ల భోజుండు ఆదరించి పీఠస్థులఁ గావించి వారివారివృత్తాంతము లడిగి తెలిసికొనియెను. ఆకథలు విని సభ్యులు నాటకముచూచినదానికన్న నెక్కుడుగాసంతోషించిరి. సువర్ణ నాభుండు యక్షుంజూపుచు నీతఁడే మనకు పరమోపకారి. ఈతఁడే మన కెల్ల వంద్యుఁడు. అని యాతనికథ యెఱింగించుచు మనకాళిదాసకవి యీదంపతులకథయే మేఘసందేశముగా రచించెనని చెప్పెను.
అప్పుడు భోజుండుయక్షునిఁ బెద్దగాగౌరవించుచు ఘోటకముఖునితో జనాంతికముగా నిందు లీలావతి లేదేమి ? అని యడిగిన నవ్వుచు మహారాజా ! లీలావతి నంతకుముందే యక్షుండు రక్షించెను. మీవీట మామిత్రులయింట నున్నది. మీయభిమత మెఱింగింపవలయునని వారు నిరీక్షించుచున్నారని యాకథ యెఱింగించెను. అప్పుడు భోజుండు యక్షుం గౌఁగిలించుకొని మహాత్మా ! నీవు మనుష్యాతీతుఁడవు. మాతోఁ గలిసి మెలసి తిరుగుచు మా కుపకారములు గావించితివి. ఎల్లకాలము కృతజ్ఞుల మైయుండెదము. నీదయలేకున్నఁ జారాయణుఁడు భైరవునికిఁ బిండివంటయైపోయెడివాఁడే యని స్తుతిఁజేయుటయు యక్షుండు మహారాజూ ! మేము మిమ్ముంజూచుటకై మిక్కిలి యుత్సాహమందుచుంటిమి. కాళిదాసవిరచిత మేఘసందేశము వినినదిమొదలు నా కాకవియందు నత్యంత భక్తివిశ్వాసములు గలిగినవి. దైవికముగా దత్తుఁడు మాయింటికి రాఁబట్టి యిందఱఁజూచుభాగ్యము పట్టిందని చెప్పఁగా నతండే కాళిదాసకవి, యేమియు నెఱుఁగనివాఁడుబోలె నందుఁ గూర్చున్న వాఁడని చూపిన యక్షుండు వోయి యతనిపాదంబులఁబడి స్తుతియిుంపుచుండెను.
ఆసందడిలో గోణికాపుత్రుఁడు చిత్రసేనునొద్దకుఁ బోయి పురుషవేషముతోనున్న చారుమతిం జూచి ఇడిగో మనదత్తుఁడు దత్తుఁడు అని కేకపెట్టెను. అందఱు నచ్చటికివచ్చి చూచి మిత్రమా! మాటాడవేమి ? ఇందు రహస్యముగాఁ గూర్చుంటివేల ? అని యడుగుచుండ నెవరికిని సమాధానముజెప్పక రాజపుత్రుని మఱుఁగఁజేరెను.
అప్పుడు సువర్ణ నాభుండు వీఁడు దత్తుఁడగాఁడు. పోలిక యట్లున్నది. దత్తుఁడు స్త్రీరూపముతోఁ దిరుగుచున్నాఁడు, యక్షశాపముమాట మఱచితిమి. వానినే పట్టుకొనవలసియున్నది. అనిపలుకుచుఁ గాళిదాసుతోముచ్చటించుచున్న యక్షునితో మహాత్మా ! నీవలన మా కనేకోపకారములు జరగినవి. దత్తునిఁ బురుషుని జేయవా? యెందున్నవాఁడో చెప్పవా ? అనియడిగిన యక్షుఁడు కాళిదాసుం జూపుచు మాచరిత్రము చూడకయే రచించిన మహాభావుండు మనచెంత నుండఁగ, దత్తుఁ డెం దుండెనో నేను జెప్పవలయునా ? ఆతఁడే యెఱింగింపఁగలడు అని ముకుళిత కరకమలుండై ప్రార్థించినఁ గాళిదాసకవి ముసిముసినగవులు నవ్వుచు రాజుగారి మొగము జూచుచు నీక్రిందిశ్లోకము చదివెను.
శ్లో॥ దత్తకో పుత్రికాగర్భ దత్తకో చిత్తజోపమః
యక్షశాపాభిభూతస్తె జామాతైవ స్నుషా భవత్॥
ఆశ్లోకమును విని యందఱు తెల్ల తెల్లఁబోయి చూచుచుండిరి. రాజుగారికి బాగుగా విడిపోయినదికాదు. అప్పుడు గోణికాపుత్రుఁడు సంతోష మభినయించుచుఁ బెద్దయెలుఁగున నాకుఁ దెలిసినది. ఈరహస్యము నాకుఁ దెలిసినది. అని కేకలుపెట్టుచు మనము చూచినవాఁడే దత్తుఁడు. స్త్రీరూపముతో నుండి చిత్రసేనునిప్రోత్సాహమునఁ బురుషవేషము వైచికొని వచ్చెను. శాపాభిభూతుండగుట పూర్వస్మృతి లేదు. అని యారహస్య మెఱిఁగించెను. అప్పుడు రాజపుత్రునివెనుక నొదిగియున్న చారుమతిం బట్టుకొని గోణికాపుత్రుఁడు యక్షునొద్దకుఁ దీసికొనివచ్చి వీఁడే మామిత్రుఁడు. నీశాపమున నిట్లున్నవాఁడు. శాపవిమోచనము గావింపుమని ప్రార్థించెను. అప్పుడు యక్షుం డీశ్లోకమును జదివెను.
శ్లో॥ కాంతాస్యజ్ఞానతఃపూర్వం మద్రహస్య ప్రశంసనాత్
కాళిదాస ప్రసాదేన పురుషోభవదత్తక ॥
అని చదువుచుండఁగనే అదేవేషము అదేరూపము వెలయ నాదత్తుం డున్మత్తత వదలి నిజరూపవిద్యాపాటవంబులు దేటపడ నోహో హెూ ! నామిత్రులందఱు నిందేయున్నారు. ఎప్పుడు వచ్చితిరి? నే నింత దనుక నిద్రఁబోవుచున్నానుకాఁబోలు నేమియు జ్ఞాపకములేదేమి ? అని యడిగెను.
మిత్రులందఱు నతనిం గౌఁగిలించుకొని సౌహార్దము దెలుపుచు నీయక్షకాళిదాసులమూలమున నీయాపద దాటితివి. నీవృత్తాంతము చాలఁగలదు. ఆనక దెల్పెదము అని తత్సమయోచితముగా సంభాషించిరి.
తెరలోనుండి మల్లిక తల్లిదండ్రులఁ జూచి నిలువలేక అమ్మా! తండ్రీ ! అమ్మా ! అమ్మా ! అని యఱనచుచు నీవలకు రాఁబోయినది. యక్షపత్ని భర్తంజూచి నిలువలేక హా ప్రాణనాథా ! అని పిలుచుచు బయటకుఁ బోఁదొడంగినది. సరస్వతి వారి వారించినది.
రుక్మిణి లీలావతితో నమ్మా! ఆతఁడే నాభర్త. అన్నన్నా ! యెంతయో వెదకించితిని. ఇక్కడి కెట్లువచ్చిరో తెలియదని చెప్పిన విని లీలావతి యావిశేషములన్నియుం జూచుచుండుటంబట్టి తెలిసికొని పుత్రీ ! నీయదృష్టము ఫలించినది. నా కంతయుం దెల్లమైనది. నీభర్త దత్తకుఁడు యక్షశాపంబున నాఁడుదియై నీతో స్నేహముసేసెను. సంవత్సరము ముగిసినతరువాతఁ బురుషుఁడయ్యెను. యక్షశైలవృత్తాంతము సువర్ణపదికకుఁ జెప్పుటచేఁ దిరిగి స్త్రీయైపోయెను. మీయన్న చిత్రసేనుఁ డామెను స్వీకరించెను. ఇప్పుడు కాళిదాసకవీంద్రుఁ డావిషయమై (జామాతైవస్ను షా భవత్ ) అని శ్లోకముగాఁ జదివెను. నీవు వినలేదు. నీబుద్ధి యీదత్తునిమీఁద నున్నది. తరువాత గోణికాపుత్రుఁడు వచ్చి కపటదత్తుని దీసికొనిపోయి యక్షునిచే శాపనివృత్తి గావింపఁజేసికొనియెను. ఇదియే వీనిరహస్యము. నీవువరించినవాని ప్రతిబింబము జూచి సువర్ణ నాభుఁడు నాఁడే దత్తుఁడని చెప్పెను. అని యావిశేషములన్నియుం జెప్పినది.
అమ్మయ్యో ! ఇదియా కారణము ? తల్లీ ! నారహస్యము సభలో వెల్లడియైనదాయేమి ? ఈసంగతివిని మాతండ్రిగా రేమనిరి? సభ్యులు పరిహాసమాడిరా ? నే నాదెస జూడలేదు. అని రుక్మిణి యడిగిన నీవు చేసినపని తప్పుకాదు. నిజ మెఱింగి వారే సమాధానపడియెదరని తల్లి యోదార్చినది.
భోజుండు వారివారి చరిత్రములన్నియు విని యందఱం గౌరవించుచుఁ దగిననెలవులు నియమించి పంపి తా నాకాళిదాసకవితోఁగూడ పండితకవులవెంట వారినివాసముల కరిగెను. రుక్మిఱిప్రభృతి యువతులును వారివెనుకనే యానివాసదేశంబు జేరిరి. భైరవుం గట్టిపెట్టి రాజుభటులు కారాగారంబునం బెట్టిరి. భోజమహారాజు ఆచావడిలో నాపండితులతో నాంతరంగిక సభ గావించి లేచి నమస్కరించుచు నిట్లనియె. మహాత్ములారా ! ఇందున్నవారు జగత్పండితులు. యక్షుండు దేవతావిశేషుఁడు. ఇట్టివారికడ యథార్థము జెప్పినచో నేనుగావించిన పాతకము వాయఁగలదు. వినుండు. ఈకాళిదాసకవిసార్వ భౌముండు త్రిలోకపూజ్యుండు. నాకు బహిఃప్రాణము. ఈతనివిడిచి నేను క్షణకాలము నిలువలేను. ఇట్టివిస్రంభ పాత్రుని విమర్శింపక బాలిశులుపన్నిన కపటవ్యూహమునఁ జిక్కి నిష్కారణము నవ్వలఁ బొమ్మంటి; నయ్యనుమానముననే మహాసాధ్వీలలామము నడవిపాలు గావించుకొంటిని. ఆపాతకము ననుభవించుచు స్థానభ్రష్టుండనై దేశములఁ దిరిగితిని, భైరవునిచే మేషముగాఁ జేయఁబడితిని. చివర కీమహాత్మునిచేతనే విముక్తి నొందితిని. నాఁడు నన్నితండు విడిపించనిచో నీపాటికిఁ బరలోక మలంకరించువాఁడనే. మహాత్ము లపకారికే యుపకారము సేయుదురు. నా కట్టియుపకారము గావించి నా ప్రార్థనల నంగీకరించి తిరుగా నాయింటికి విచ్చేసెను. నాకు లీలావతీవియోగదుఃఖముతో పాటు రుక్మిణీచిత్రసేనుల యసభ్యప్రవర్తనములు నాహృదయమును మిక్కిలి వేధింపఁదొడంగినవి. ఆచింతలుగూడ నీదివ్యజ్ఞాన సంపన్నుఁడు వదలఁజేసెను. దత్తకుండు నాకల్లుఁడు, కోడలు నయ్యెనని యెఱింగించెఁగదా? యక్షుండే యీనాటకమునకు సూత్రధారుండు. ఈనాటకకథ యందఱకుఁ దెలిసినవిషయముగానఁ దిరుగా వక్కాణింప నేమిటికి ? దత్తుండు నా కల్లుఁడయ్యెను. ఘోటకముఖుఁడు ప్రాణస్నేహితుఁడు. గోణికాపుత్రుండు నాకుమారునికి మిత్రుఁడు. గోనర్దీయ కుచుమారులు రాజబంధువులు. సువర్ణ నాభుండును దేవతుల్యుఁడు. యక్షుండు మనకందఱకు వంద్యుఁడు. నేఁ డిందఱుకొత్తమిత్రులనడుమ నిలిచి సంభాషింప నొనగూడినది. ఇంతకన్న భాగ్య మేమియున్నది. నా ప్రాణనాయకి లీలావతినిఁగూడఁ జూచితినేని యిట్టిసుదినము నాకు మఱి యొకటి యుండదు. అని పలుకుచుండఁగనే యాప్రాంతమందుండి యా యుపన్యాసమువినుచున్న లీలావతి హా! ప్రాణనాథా ! నేను ధన్యురాల ధన్యురాల. నీచే నిట్లు స్మరింపబడుచుంటినని పలుకుచు నతని పాదంబులం బడినది. భోజుండు ప్రమోదకంటకితశరీరుండై సంతోషాశ్రువులచేఁ దచ్ఛిరంబుఁ దడుపుచు లేవనెత్తి పెద్దగా గారవించుచుఁ దాను జేసినతప్పు మన్నింపుమని వేఁడుకొనియెను. అప్పుడు లీలావతి,
క. పతి తన్ను సుగుణవతి యని
స్తుతియించుటకంటెఁ గలదె సుందరికిఁ బ్రియం
బతులవ్రతములు దానము
లతిశయముగఁ జేయుసుకృత మగుఁ బతి మెచ్చన్ .
మీరు నన్నిందఱిలో మెచ్చికొనుటచే నేను ధన్యురాలనైతిని. ఈపండితులు నాకు సోదరులై యాదరించిరి. యక్షుండు తండ్రియై రక్షించె. యక్షకాంతలు తల్లులై మన్నించిరని తనవృత్తాంత మంతయు నెఱింగించినది. అంతలో రాజపుత్రికయగు రుక్మిణియు పాదకటకంబులు ఘల్లురనిమ్రోయ నల్లన తల్లివెనుక వారినికటంబునకుఁ బోయి భర్తకు మ్రొక్కి తండ్రికి నమస్కరించి పండితులకుఁ గేలుమోడ్చి యేదియో చెప్పఁదలంచి సిగ్గుచే మాటరాక దత్తకునిమో ముపలక్షించుటయు నాసన్న యెఱిఁగి యాపండితుఁడు లేచి యిట్లనియె.
మహారాజా ! భగవంతుని యఘటితఘటనాసామర్ధ్యము మీకు వేఱ చెప్పనక్కఱలేదు. నేను యక్షశాపదుఃఖితుండనై యెందో పోవుచుండ నీమెగఱ్ఱము కళ్లెముద్రెంచికొని నాకడకు వచ్చుట భగవత్ప్రేరితముగాదా ? అది మీయశ్వమని యెఱుంగక యెక్కితిని. ఆ హయంబు రయంబున నీమెయుద్యానవనమునకుఁ దీసికొనివచ్చుటకు దాని నేఁ దోలితినా? నేను శాపంబునఁ జేసి యాఁడుదాననైతినని యీమె యేమియు నెఱుంగదు. విద్యాగ్రహణలాలసయై నన్నుఁ దన యం తఃపురమునకుఁ దీసికొనిపోవుట తప్పుగాదుగదా? దౌవారికులమాట విని నీకుమారుఁడు నన్నుఁ బరీక్షింపవచ్చుటయు న్యాయమే. న న్నతండు మోహింప నాయింగితమువడువున నతని మందలించుటయు సమంజసమే. శాపాంతమున నేను బురుషుండనై యంగాంగమేళనం బొనరించి యున్న నన్నుఁ బతిగావరించుట యేమితప్పో చెప్పుఁడు. అని తనయుదంతమంతయు నెఱింగించి రుక్మిణి నిర్దోషురాలని యెల్లరకుఁ దెలియునట్లుపన్యసించెను.
అప్పుడు భోజుండు పుత్రికంజేరఁదీసి గారవించుచుఁ దల్లీ ! నీ విందులకు వగవంబనిలేదు. అప్రయత్నముగనే జగత్పూజ్యుండగు పండితుఁడు నీకు భర్తయయ్యె. ఇది నీయదృష్టము. అని బుజ్జగించిపలుకుచుఁ గూఁతునకుఁ బ్రీతిఁగలుగఁజేసెను. పిమ్మట రత్నపదిక వచ్చి యక్షునకు మ్రొక్కుచు వియోగదుఃఖమును బ్రకటించుచు నతనిమన్ననలం బడసినది.
తరువాత మల్లికవచ్చి తల్లిదండ్రులం గౌఁగిలించికొని దుఃఖించుచుఁ దనకు యక్షదంపతులు గావించిన యాదరణము లుగ్గడించుచుఁ బతిముఖనిహితదృష్టియైయున్నంత భోజభూపతి యాసతీతిలకము పాండిత్యమహత్వము గవిత్వప్రౌఢియు ననన్యసాధారణములని స్తుతియించెను.
అప్పుడు రతిమంజరీచిత్రసేనలు వచ్చి వారిముంగట నిలువంబడుటయు గోణికాపుత్రుండు వారుపడినయిడుములన్నియు నుగ్గడింపుచు పెద్దగా నగ్గించెను. దత్తుం డామత్తకాశినులం జూచుచు నోహో ! నా బాల్యస్నేహితురాలు చిత్రసేనయే. అయ్యో! ! నానిమిత్త మెన్నికష్టముల పాల్పడితివి ? ఎట్టియైశ్వర్యము విడిచివచ్చితివి. అని కొనియాడుచుఁ దత్కాలోచితములగు మాటలచే నయ్యోషలకు సంతోషము గలుగఁజేసెను. అప్పుడు భోజభూభుజుండు వారినందఱం గలయఁగనుఁగొని వారువారుపడిన కష్టములు తిరిగిన దేశములు చూచినవింతలు ప్రత్యేకముగా వెండియు నడిగి తెలిసికొని యో హెూ ! నేఁడు మహోత్సవ దివసము. వియోగముబొందినవారందఱము గలిసికొంటిమి. ఇట్టి సంతోషము గలుగఁజేయువాసరము మఱియొకటి యుండదు. అని యుపన్యసించుచు మీరందఱు నిదుండి నా కానందము గలుగఁజేయు చుండవలయును. గోనర్దీయకుచుమారులు రాజ్యభారవాహకులు కావున వచ్చుచుం బోవుచు నుందురు. యక్షుండు మాకుఁ బ్రత్యక్షదైవము. దర్శనపాత్రులముగాఁ జేయుచుండవలయునని ప్రార్థించుటయు నందుల కందఱు ననుమోదించిరి.
గోనర్దీయకుచుమారులు మారాజ్యములు మాయొక్కరివేకావు. మేమేడ్వురము పంచుకొనవలసినవారమే. మీమూలముననే మాకీయైశ్వర్యములు గలిగినవి. మిమ్ము మేము ప్రభువుగా మిత్రుగా దైవముగా భావించుకొనియుందుము. మీ రాజ్యము స్వరాజ్యముగానే యెంచికొందుమని తగురీతి నుత్తరము జెప్పిరి. అంతటితో సభ చాలించిరి.
భోజుండు లీలావతి నప్పుడే తనయంతఃపురమునకుఁ దీసికొని పోయెను. ఆమె పండిత కుటుంబమును వెంటఁబెట్టికొనిపోయి పెద్దగా నాదరించినది. అమ్మఱునాఁడే భోజుండు దత్తకుఁడు తనకు జామాతయని ప్రకటింపుచు వివాహమహోత్సవవిశేషములు నిర్వర్తించెను. దత్తుఁడు చిత్రసేనను రెండవభార్యగా స్వీకరించెను. గోణికాపుత్రుండు విద్యారూపశీలసంపన్నయగు తదాస్థానకవి శంకరునిపుత్రికం బెండ్లియాడి రతిమంజరిని రెండవభార్యగాఁ గైకొనియెను యక్షుండు రత్నపదికతో మూఁడునెల లయ్యుత్సవవిశేషముల నానందించుచుఁ బిమ్మటఁ దమశైలమునకుం బోయెను.
భైరవున కెట్టిశిక్ష విధింపవలయునని మఱియొకనాఁడు గొప్ప సభ గావించిరి. వాఁడుచేసిన దుష్టక్రియలనెల్ల విమర్శింపుచు నిట్టిదుర్మార్గుఁడు జీవించియుండినచో లోకమున కపకారముజరుగునని నిశ్చయించి సామాజికులు వాని కురిశిక్ష యే విధించుట కర్జమని యేకవాక్యముగాఁ బలుకుటచేఁ బట్టణమంతయు నూరేగింపుచు నొకనాఁడు వాని నురిఁదీసిరి.
మఱియు నీసప్తమిత్రులును బ్రభుపుత్రుండగు పాంచాలునిచే క్లుప్తముగా రచింపఁబడిన కామశాస్త్రములోని సప్తాధికరణములు నొక్కొక్కటి నొక్కొక్కఁడు ప్రత్యేకముగా రచించిరి.
అందుఁ జారాయణుఁడు సాధారణాధికరణము సువర్ణ నాభుండు సాంప్రయోగికము ఘోటకముఖుండు కన్యాసంప్రయుక్తము గోనర్దీయుఁడు భార్యాధికారికము గోణికాపుత్రుండు పారదారికము దత్తకుండు వైశికాధికరణము కుచుమారుండు ఔపనిషదికమును వ్రాసి కామశాస్త్రప్రవక్తలలో నగ్రగణ్యులైరి.
చ. ఇరువురు రాజులైరి మఱియిద్దఱు రాజుల కల్లురైరి యొ
క్కరుఁ డల రాజమిత్రుఁ డనఁగాఁ దగె నొక్కఁడు యక్షకన్యకం
బరిణయమయ్యె శ్రోత్రియకుమారిక నొక్కఁడు బెండ్లియాడె నీ
ధరఁ దగె సప్తమిత్రచరితంబు విచిత్రకథాస్పదంబుగాన్ .
గోపా ! (జామెతైవ స్ను షాభవత్) అల్లుఁడే కోడలయ్యెను. అని నీవడిగిన ప్రశ్నమునకు నీకథ సమాధానము జెప్పినదా? అనిచెప్పిన ముప్పిరిగొనుసంతోషముతో వాఁడు స్వామికి మ్రొక్కుచు మహాత్మా ! ఇట్టి గూఢార్థముగల యాశ్లోకము వారి కెట్లర్థమగును. రెండు మాటలతోఁ జెప్పెదరేమో పోయి వారి కాయర్థము చెప్పవలయునని తలంచితిని. ఆయ్యవసథంబు దాటి చాలదూరము వచ్చితిమి. పోనిండు
మంచికథ వినుట తటస్థించినది. తలవనితలంపుగా భోజకాళిదాసకవుల కథలుగూడ నిందుఁ గూడినవని యుబ్బుచు నయ్యతిశిఖామణివెంటఁ గావడి మోయుచు నవ్వలిమజిలీ చేరెను. చ. పరమదయాసమగ్ర వృషభధ్వజ భక్తజనప్రసక్త శం
కర గిరినందినీహృదయకంజ దివాకర వాసవాదిని
ర్జరగణమస్తకస్థగితరత్న విచిత్రవిభాలసత్పదాం
బురుహ మహేశ ! పాపహర ! భూధరమందిర ! చంద్ర శేఖరా !
క. నీగురుకృప నీయష్టమ
భాగము రచియించినాడఁ బావనమతి నో
యోగినుత ! చేయు మీకృతి
నాగగనమణీందుతారమై వెలయంగన్.
గద్య. ఇది శ్రీమద్విశ్వనాథ సదనుకంపాసంపాదిత కవితావిచి
త్రాత్రేయమునిసుత్రామగోత్రపవిత్ర మధిరకులకలశజల
నిధి రాకాకుముదమిత్ర లక్ష్మీనారాయణపౌత్ర కొండ
యార్యపుత్ర సోమిదేవీగర్భశుక్తిముక్తాఫల
విబుధజనాభిరక్షిత సుబ్బన్నదీక్షితకవి
విరచితంబగు కాశీయాత్రాచరిత్ర
మను మహాప్రబంధమున
అష్టమభాగము
సంపూర్ణము.
శ్రీశ్రీశ్రీ
శ్రీవిశ్వనాథార్పణమస్తు.