కాశీమజిలీకథలు/ఎనిమిదవ భాగము/155వ మజిలీ

వికీసోర్స్ నుండి

జేయును. అట్టిపరీక్షలు చూచి కుచుమారుఁ డటఁగదలి దక్షిణాభిముఖుండై యరుగుచుండెను.

అని యెఱింగించి వేళ యతిక్రమించుటయు మణిసిద్ధుం డవ్వలి కథ పై మజిలీయందుఁ జెప్ప మొదలుపెట్టెను.

155 వ మజిలీ.

−♦ సరస్వతికథ. ♦−

కుచుమారుం డొకనాఁ డొకయగ్రహారమున నొకబ్రాహ్మణుని యింటి కతిథిగాఁ బోయెను. ఆగృహస్థు భుజించునప్పుడు కుచుమారునితో అయ్యా ! మీరూపము దర్శనీయము. మీతేజము విద్యాధిక్యము సూచించుచున్నది. ఎందుఁబోవుచున్నారు ? ఈజన్మభూమి యేది ? అని ప్రస్తావోచితముగా నడిగిన నతండు తనకాఁపురము కాశీపురమనియు మిత్రులతోఁ దాను సమస్తవిద్యలం జదివితిననియుఁ బండితకల్పభూజుండగు భోజభూభుజుని యాస్థానవిద్వాంసుల జయింప ధారానగరంబున కరుగుచున్నామనియుఁ దనయుదంత మాద్యంత మెఱిఁగించెను.

అప్పు డాబ్రాహ్మణుఁడు వెఱఁగుపాటుతో అయ్యా ! మీరంతవారైనచో నంతశ్రమపడి ధారానగరమున కరుగ నేల ? అరిగి యందలి పండితులఁ బరాజితులఁ గావించితిరేని యాఱేఁడు వేలిచ్చును లక్ష లిచ్చునుగాని తనరాజ్య మీయఁడుగదా ? మీకంతవిద్యలలో గట్టితనము గలిగియున్నచో సులభముగా రాజ్యలక్ష్మిం జేపట్టుతెఱఁ గెఱింగించెద నాకేమి పారితోషికమిత్తురు? అనుటయుఁ గుచుమారుండు నవ్వుచు నార్యా ! మీ యుపదేశంబున నాకు రాజ్యమే వచ్చినచో మీరును గొంత ఫలభాక్కులు కాకపోరు. వాక్కులతో నేమిప్రయోజనము ? అని యుత్తరమిచ్చెను.

అప్పు డాగేస్తు వినుండు. హిరణ్యగర్భుండను నృపాలుండు పురందరపురమును రాజధానిగాఁ జేసికొని యీదేశమును బాలించుచున్నాడు. ఆనగర మిక్కడ కిరువదియామడ దూరములో నున్నది. ఆరాజు మిక్కిలి వదాన్యుఁడు. భోజరాజువలెఁ గవీంద్రులఁ బండితుల నాదరించును. ఆనృపతికిఁ బురుషసంతతి లేదు. సరస్వతి యను నొకకూఁతురు గలదు. ఆమెచరిత్రమే వినవలసినది. ఆయువతి నిరతిశయ సౌందర్యంబును బ్రకాశించుచున్నదని చెప్పుట యొకగొప్పమాట గాదు. సారస్వత వైభవ మంతయు నామానవతి యధీనమై యున్నది. చతుష్షష్టికళలు బాలరామాయణమువలె నావటమై యున్నవి. ఆఱుశాస్త్రములు తల క్రిందుగా నేకరువుపెట్టఁగలదు. పెక్కేల? ఆయువతి విద్యలలో సరస్వతి యని చెప్పఁదగినది. చివరమాట వినుఁడు. ఆబోఁటి విద్యలలోఁ దనపరీక్ష కాగినవానింగాని యొరుని బరిణయమాడనని శపథము చేసి యున్నది. అనేక రాజకుమారులు శస్త్రాస్త్రనిపుణులు విద్యాధనరూప ప్రాభవోపేతులు వచ్చి యచ్చిగురాకుఁబోఁడి గ్రహింపఁ బ్రయత్నించిరి.

విద్యలలోఁ బరీక్షించి యయ్యంబుజాక్షీ, యెవ్వరిం బరిగ్రహించినదికాదు. ఎవ్వనికిం గనంబడదు. మీరు సమర్థులేని యారమణీమణితోఁ బ్రసంగించి గెలిచి తద్రాజ్యలక్ష్మితోఁగూడ నాచేడియం బాణిగ్రహణము సేసికొనుఁడు. కావలసిన నాకుమారుని శంబరుఁడనువానిని మీకుఁ దోడుపంపెదనని యెఱింగించిన విని కుచుమారుండు మందహాస శోభితవదనారవిందుండై మహాత్మా ! బ్రాహ్మణాశీర్వాద మమోఘఁ మైనది అయ్యైశ్వర్యము నన్నందునట్లు దీవింపుఁడు. భాగ్యోదయంబు దైవాయత్తంబు. అందుఁబోయి ప్రయత్నించి చూచెద. సరస్వతినైనం గెలువఁగలనని నాకు ధైర్యము గలదు. అని పలికినవిని యుబ్బుచు నాయజమానుం డిట్లనియె.

కుచుమారా! నీయాకారతేజోవిశేషంబు లుపలక్షింప నీ యందుఁ బ్రభుత్వచిహ్నంబులు బొడకట్టుచున్నవి. నీవు తప్పక రాజపుత్రిక యిచ్చిన ప్రశ్నములకు సమాధానము చెప్పఁగలవు. ఆరాచపట్టిం జేపట్టఁగలవు. రాజ్యాధిపత్యము వహింతువుగాక యని యాశీర్వ చనపురస్సరముగా సంభాషించెను. తదీయరాజ్యప్రాప్తివలనఁ దనకుఁగూడఁ గొంతలాభము గలదను సంతసముతో నాయజమానుం డాకుచుమారుని మార్గగమనశ్రమమువాయ నాలుగుదినములు దనయింట నుండుమని ప్రార్థించెను. శంబరుఁడను తనకుమారు నాతని కుపచారములుసేయ శిష్యునిగా నియమించెను.

కుచుమారుండు నాలుగుదినము లాయగ్రహారమున వసించి యాయాసముఁదీఱుచుకొని శుభముహూర్తమున బయలుదేరి శంబరుఁడు శిష్యుండై తోడరాఁ గొన్నిపయనంబులకుఁ బురందరపురము ప్రవేశించెను. సరస్వతీపరిణయలాలసులగు విద్వత్ప్రభుకుమారులచే నా నగరము నిండియున్నది. ఎక్కడవినినను నామె విద్యాతిశయము గుఱించి జరగు సంవాదములే. ఏవీధికిఁబోయినను రాజపుత్రు లామెకు సమాధానము చెప్పలేకపోయిరను వార్తలే. అట్టివిశేషము లాలించుచు నాపట్టణపువీధులఁ దిరిగి తిరిగి కుచుమారుండు ప్రకటనలఁ జదివి చదివి తిన్నగాఁ బ్రధానపురుషులయొద్దకుఁ బోయి, అయ్యా ! వినుండు.

చ. ప్రచురము చేసినట్టి నృపుపట్టి సరస్వతివార్త నాలకిం
    పుచు నిట కేగుదెంచితిని భూసురుఁడం గుచుమారుఁడం గళా
    నిచయములెల్ల నార్మసన నృత్యము సేయుచుచున్న వాకుభృ
    త్కుచ యొనరించుప్రశ్నములకుం దగునుత్తర మిత్తు నిత్తఱిన్ .

క. వాదింతు నే సరస్వతి
   తోఁ దులగా నాదుసర్వతోముఖవిద్యా
   వైదుష్యము గనుపింప ని
   వేదింపుఁడు నాదురాక వెలఁదుక కనినన్.

అమాత్యులు నవ్వుచు,

గీ. వలదు, పోవయ్య ! మాసరస్వతిని గెలువఁ
    దరమె నీ కిది యడియాస తగదు తగదు

 
    ఇటుల వాక్రుచ్చి యెంతెంతలేసివార
    లిటఁ బరాజితు లైరొ నీ వెఱుఁగ వకట !

సీ. నేపాళ దేశావనీపాలనందను
                  బహుకళాన్వితు సిగ్గుపఱచి పంపె
    సకలశాస్త్రజ్ఞు దర్పకతుల్యు మగధభూ
                  పతిపుత్రుఁ దృటిఁ బరాజితు నొనర్చె
    సంగీతశాస్త్ర ప్రసంగదక్షుని బాండ్య
                 జననాథసుతుఁ బదార్చకునిఁ జేసె
    నఱువదినాల్గువిద్యల నెఱింగినప్రోడ
                 గౌడభూపాత్మజు నోడఁబుచ్చె

గీ. మఱియు నెందఱినో కళామహితులైన
    నృపకుమారుల మారసన్నిభులఁ బెదవి
    గడపకుండఁగఁ జేసె వాక్కలనఁ గలన
    సలిపి సామాన్యయే సరస్వతి కుమార !

నీ కీవెఱ్ఱి యేలపుట్టినది? మఱియొకచోటంగూడఁ బరపతిలేకుండఁ జేసికొనుచున్నావు.. వైదికుఁడా ! రాజ్యకాంక్షంజేసి యాసపడివచ్చితివి. ఇది గేలపుసిరికాని గంపసిరికాదు. నీయభిలాష సరియైనది కాదు. వచ్చినదారిం బొమ్ము. మఱియొక దేశాధిపతికడ నీపాండిత్యప్రకర్షము చూపుమని హేళనముగాఁ బలికిన నగుచుఁ గుచుమారుం డిట్లనియె.

అయ్యా ! నేను మీరాజపుత్రికచారిత్రము తెలియక వచ్చినవాఁడనుగాను. ఈప్రపంచకములో నామెను మించినపండితుఁడు లేడనియా మీయాశయము. తాడితన్నువాని తలదన్నువాఁడు మఱియొకఁ డుండునని తెలిసికొనుఁడు.

ఆహా ! బహుసంవత్సరములు గురుకులవాసముసేసి కాశీపురంబున విద్యాభ్యాసంబుగావించి మహాపండితులమని పేరుపొంది దిగ్విజయ ముసేయ బయలువెడలిన మాబోఁటివా రంతఃపురమునుండి యేరికడనో నాలుగుమాటలు నేర్చికొన్న బోఁటులతోఁ బ్రసంగింపలేకపోయినచో నిఁక విద్యాపరిశ్రమముకు ఫలమేమి ? సరస్వతినై నం బ్రతిఘటింపఁజూలు నాకడనా? ఈవెడమాటలకు నేనించుకయు వెఱవను నే నాతెఱవ యిచ్చిన ప్రశ్నలకు సమాధానము సెప్పలేకపోయితినేని మీరు నియమించినశిక్షకుఁ బాత్రుండ నగుదునని శపథము చేసెను.

అయ్యా ! మీరు గెలువుఁడు, ఓడుఁడు, మా కింతయేల ? మాట వరుస కంటిమి. మీ రట్టివారు కావచ్చునని హెచ్చరించుచు నతండు వసింపఁదగిన నెల వేరుపఱిచి తదీయకులశీలవిద్యావిశేషంబులు వ్రాసి సరస్వతియంతఃపురమున కనిపిరి.

సరస్వతియు మంత్రులంపిన పత్రికం జదివికొని చిఱునగవుతో నౌరా ఈపాఱుం డెవ్వఁడో బీరములు పెక్కులు పలికెనే? చెప్పినంత చేయువారుండరు. బ్రాహ్మణుల నవమానించుట నాయభిమతము కాదు. నా రేదియోకొంత చదివియే యుందురు. కాని - మదీయవిద్యావాద ప్రకార మెఱుంగక యప్పనికిఁ బూనికొనుచున్నాఁడు. కానిమ్ము. బాహ్మణసత్కార మిహపరసాధనము గదా? అని తలంచి వేయు న్నూటపదాఱు లిచ్చి యాపండితు నంపవలయునని మంత్రులకుఁ దిరుగా వ్రాయించి యంపినది.

సచివు లాకానుకలు ప్రత్యుత్తరముతోఁగూడఁ గుచుమారు నొద్ద కనిపిరి. ఆమెవ్రాసినపత్రికయం దిట్లున్నది. బ్రాహ్మణులు వందనీయులు వారినోడించుట నా కిష్టములేదు. నాచరిత్ర మెఱుంగక సాహసించి ప్రసంగింపవచ్చినందులకు, సంతోషించి యీ కానుకల నంపితి. వీనిం గైకొని నన్నాశీర్వదింప వేఁడుచున్న దాన.

సరస్వతి.

ఆపత్రికం జదివికొని కుచుమారుండు స్మేరాంకూరవిభాసితాన నుండై మఱియు నిట్లు వ్రాసెను.

మ. నను వాదంబున నోడఁబుచ్చినపు డానందంబుతోఁ బిల్చి హే
     ళనగా బీరము లింతమాత్రమున కేలా ? విప్ర ! మేల్ తెల్లమ
     య్యెను పాండిత్యము బ్రాహ్మణుండవగుటన్ హీనంబుగాఁ బంపరా
     దని కాన్కుల్ దయచేసినన్ గొనెద గాదా? మీఁద నేఁ డేటికిన్ ,

మ. ప్రకటింపంబనిలేదు మీ కటులు దర్పంబొప్ప నాయిచ్చు స
     ర్వకలాప్రశ్నల కుత్తరం బిడినవిద్వాంసుడె మత్ప్రాణనా
     యకుఁ డంచున్ మృషలయ్యె నాపలుకు లాహా ! యిప్డు మీరిచ్చుకా
     నుకలం గైకొన నే జితోస్మి యనినన్ బోదుం జలేజాననా !

అని వ్రాసి యాపత్రికతోఁగూడఁ గానుకలఁ బ్రధానులకడ కంపివేసెను. వా రావార్త సరస్వతికిఁ దెలియఁజేసిరి. సరస్వతి మిక్కిలి యీసుబూని ఏమీ! కులగౌరవము మన్నించినందులకు నతం డిట్లవమానపఱచునా? కానిమ్ము. ఆపాఱుఁడు వ్రాసినట్లు పిమ్మటనే యెత్తి పొడిచెదంగాక యని యాలోచించి కొన్నిపుష్పంబులఁ గుచుమారు నొద్ద కనిపినది.

మాల్యగ్రధనవికల్పా! అను 14 విద్యలోఁ బ్రశ్నమడిగినదని నిశ్చయించి కుచుమారుం డాపూవులనెల్ల విచిత్రములైన మాలికలగాను బంతులగాను మండనములుగాను నన్నిటియుదుఁ దనపేరు వింత రంగులపూవులతోఁ గనంబడునట్లు కట్టి వానిని బ్రధానిముఖముగా రాజపుత్రికయొద్ద కనిపెను.

ఆపుష్పదామంబులం బరిశీలించి యమ్మించుఁబోఁడి వెఱఁగుపాటుతో నోహో! ఈమహీసురుండు నాయభిప్రాయము గ్రహించెను. చతుష్షష్టికళాపాండిత్య మున్నట్లు తోఁచుచున్నది. పెరవా రీవింతమాలికలఁ గట్టఁజాలరు. అని సంతసించుచుఁ గొన్నిరత్నములను గృత్రిమరత్నములను బంపి వెలగట్టుఁడని నియమించినది. కుచుమారుండు మణులకు వెలగట్టి యందలిదోషంబులఁ దెలియఁజేయుచు గాజరత్నములఁ జిదియఁగొట్టి తచ్ఛకలములతో రాజపుత్రికనొద్ద కనిపి (3 వ) రూప్యరత్న పరీక్షా అనువిద్యయందుఁ దనకుఁ గలపాండిత్యము దెలియఁజేసెను. అప్పు డాచిన్నది మేను ఝల్లుమన నయ్యారే ! యీపారుం డపారకళాప్రవీణుండువలెఁ దోఁచుచున్నది. ఇదివఱ కింతబుద్ధిమంతుఁడు వచ్చియుండలేదు. భగవంతుడు నాకు భూపతిఁ బతింజేయక భూసురవరుని వరునిగాఁజేయ నిశ్చయించుకొనియెనా యేమి ? అయ్యో ! ఆపారుఁడు రూపంబున నెట్టివాఁడో తెలిసికొనలేదు. కానిమ్ము. అఘటితఘటనాసమర్ధుఁడు పరమేశ్వరుని సంకల్ప మెట్లున్నదియో తెలియదని యాలోచించుచుఁ దనయొద్దనున్న మొద్దు చిలుక నొకదాదిచేత నతనియొద్ద కనిపి దానికి విద్దెలు గఱుపుమని నియోగించినది.

"43 శుకశారికాప్రలాపనం”అనువిద్యయందుఁ దన్నుఁ బరీక్షించు చున్నదని తెలిసికొని కుచుమారుఁ డాచిలుక నందుకొని ముద్దువెట్టుకొనుచుఁ బతంగపుంగవా! నీ వామె రామచిలుకవా? ఆమె నీ కేమి విద్యలునేర్పినది ? ఏదీ ? మీరాజపుత్రిక సందేశము దెలుపుము. పలుకుము. అని యెంతచెప్పినను మాటాడినదికాదు. అప్పు డాదాది అయ్యా! దీని మారాజపుత్రిక విదేశములనుండి తెప్పించినది. ఎంతప్రయత్నించినను దీని కొకమాటయు వచ్చినదికాదు. మంచిమాటలు నేర్పుఁడని మిమ్ముఁ గోరుచున్నదని చెప్పుటయు నతండు ఇప్పుడు నీ వింటికిం బొమ్ము. మాటలు నేర్పి ఱేపు మీభర్తృదారిక యొద్ద కనిపెదనని పలికి యా పరిచారిక నంపెను.

పిమ్మట నతండు తనకు సిద్ధునివలన సంప్రాప్తించిన విద్యామహిమచే దాని నొకసారి దువ్వి తనమెడనున్న యస్తిమాల దానిమేనికిఁ దగిలించి యుపదేశించినంత నాశుకప్రవరం బాశుకవిత్వముతోఁ జెప్పిన విద్యనెల్ల స్వరగ్రాహిణియంత్రమువలె నాకర్షించుచు నుచ్చరించుచుండెను.

చతుష్టష్టికళలు దానికిఁ బ్రసాదించి కుచుమారుండు మఱునాఁడాచిలుక నాకలికి యుతఃపురమున కనిపెను

ఇంపులగు పలుకులు పలుకుచుఁ దనదెస కరుదెంచిన రామచిలుకంజూచి యబ్బురపాటుకోఁ దనచేతిపై కెక్కించికొని యమ్ముద్దుగుమ్మ మొద్దుచిలుకా ! సుద్దులేమైన నేర్చికొంటివా ? అని యడిగిన నాశుకవరం బమ్మా ! నేను మొద్దుచిలుకనో ముద్దుచిలుకనో యిటుమీఁదఁ దెలిసికొనఁగలవు. నేను గుచుమారుని శిష్యుండనైతిని. అమ్మహాత్మునిచే శిక్షింపఁబడితిని. న న్నేవిద్యలలో నడిగెదవో యడుగుము. వాదమునకు రమ్ము, ఆతండే నేను అనిపలికిన విని యక్కలికి యులికిపడి ఔరా! పలుకనేరని యీకీర మెన్నిమాటలాడినది ? అతండు మిగుల ప్రౌఢుండగును. దీనిం బ్రాలాపించి చూచెదంగాక యని తలంచి యిట్లనియె.

కీరమా ! నీవు కుచుమారుని ఛాత్రుండవగుట మాకుఁబ్రతివాది వైతివి. ఏదీ! చతుష్టష్టికళలపేరులు సెప్పుము చూతము నీపాండిత్యము. అనుటయు నాచిలుక యౌరా ! కుచుమారుని శిష్యుండనఁట. అఱువది నాలుగువిద్యలపేరులు సెప్పవలయునఁట. ఇది యెంతతేలికప్రశ్నము. అమ్మా ! పేరులేకావు. ప్రతివిద్యయందును బ్రసంగించి జయమందెదఁ జూడుము. అని ధిక్కరించిపలుకుచు వానిపేరులు 1 గీతం, 2 వాద్యం, 3 నృత్యం, 4 ఆలేఖ్యం, 5 విశేషకచ్ఛేద్యం మొదలగు 64 ను వైనయికీన వైజయికీన వ్యాయామకీనాది విద్యాగ్రహణం. అని యేకరువుపెట్టినది.

ఆయుపన్యాసమువిని యక్కలికి చిలుకా ! యెతవక్తవైతివి ? బాపురే ! ఎంతపండితురాలవైతివి? అని మెచ్చికొనుచు ముద్దువెట్టుకొని మఱియు నాఱుశాస్త్రములయందును బ్రహేళికలయందును బరీ క్షించి తదీయనిరాఘాటపాండిత్యప్రకర్షము దెలిసికొని చేతులుజోడించి శుకరాజమా ! మీగురుండు త్రిభువనైకవిద్యత్ప్రవరుండు, నన్ననుగ్రహింపఁ జతురాననుండీయవతారమునఁ జనుదెంచెను. కానిచోఁ జెప్పినమాట యొకటియైన నుచ్చరింపనేరని నీవు తదుపదేశంబున గంగాప్రవాహమువలె నాశుధారాకవిత్వముతో శాస్త్రముల నిట్లు గురిపింపనేర్తువే? ఆతండే నాకు భర్త. ఆతండే నాహృదయేశ్వరుండు. ఆయనతోఁ బ్రతికూలముగాఁ బలికి తిరస్కరించినందులకు క్షమింప వందనశతంబు లర్పించుచున్నదాన. ఇదిగో యీహారమును దీసికొనిపోయి నీవు నాకుమారుగా వారిమెడలో వైచిరమ్ము. పొమ్ము. నాయెడ విశ్వాసముంచుము. అని ముత్యాలహార మొకటి దాననోటి కందిచ్చినది.

హంస తామరతూడుంబోలె నాపేరు ముక్కునంగైకొని గ్రక్కున నెగిరి యాఖగవరంబు రయంబునఁ గుచుమారునొద్ద కరిగి యాతొడ వతనిమెడలోవైచి యందుజరగినవృత్తాంతమంతయు నెఱింగించినది.

ఆబుధుం డాకథ విని యాపత్రరథమును ముద్దుపెట్టుకొనుచుఁ బతగేంద్రమా ! తొల్లి నలదమయంతులకు హంసయుఁబోలె నీవు మాకు దూతికాకృత్యము నెఱవేర్చుచుంటివి. వెండియు సరస్వతియొద్దకుం బొమ్ము. ఆమెపేరు నురంబునఁ దాల్చితినని చెప్పుము. విశేషములఁ దెలిసికొనిరమ్ము అని పలుకుచు నాచిలుక నాశుకవాణినొద్ద కనిపెను.

కుచుమారుండు శంబరునియం దత్యంతవాత్సల్యము జూపుచు నెప్పటికథ నప్పుడు వానికిఁ జెప్పుచు నొకనాఁ డిక రాజ్యలక్ష్మితోఁ గూడ సరస్వతి దనకుఁ దక్కఁగలదని నివేదించెను. అప్పుడు శంబరుఁడు అయ్యా! మాతండ్రియుపదేశంబునంగదా మీ రిందు వచ్చితిరి. రాజ్యము వచ్చినపిమ్మట నావిశ్వాసము మీ కుండునో యుండదో తరువాత నాతో మాటాడుదురో మాటాడరో యని యడిగినఁ గుచుమారుండు నవ్వుచు శంబరా ! యీరాజ్యము శాశ్వతమా ? రాజ్యపదము నన్నం టదని యెఱుఁగుము. అదియునుంగాక దీనికి భాగస్వాములు నామిత్రు లార్వురు గలరు. వారితో నాలోచించి నీకును దగినయుఛ్రయము గలుగునట్లు చేయించెద సందియపడకుము. అని పలికెను.

ఆమాట విని శంబరుఁ డాత్మగతుబున నౌరా ! వీఁ డెంతగర్వముగా మాటాడెను? వీని కీయుపాయము మాతండ్రి చెప్పకున్న నీ యైశ్వర్యము లభించునా ? ఆవిశ్వాస మించుకయు లేక యీరాజ్య మెక్కడనోయున్న మిత్రులకుఁ బంచిపెట్టునంట. వారినడిగి నా కేదియో యిచ్చునంట. ఇట్టి తుంటరిం జంపినం దప్పులేదు. వీనిప్రాణములు నాచేతిలో నున్నవి. వీనిం గడతేర్చి నేనే కుచుమారుండనని ప్రకటించెద. సరస్వతియు రాజ్యము నాకే దక్కఁగలదు. ఇఁక సరస్వతి విద్యాప్రశంస చేయదు. పెండ్లియాడినతరువాతఁ దెలిసికొనిన నేమిచేయఁగలదు ? ఉత్తరప్రత్యుత్తరములు పత్రికామూలమున జరగుట యాచారము. గుఱుతెఱింగినవారు లేరు వ్రాసినవ్రాఁతయంతయు నాదేగదా ! మహారాజ్యవైభవ మబ్బుచుండ బ్రహ్మహత్యకు వెఱవఁ బనిలేదు. అవసరమునుబట్టి యింద్రుండంతటివాఁడు గావించెను. అని నిశ్చయించి నాఁటిసాయంకాలముదనుక యుపాయ మాలోచించుచుఁ దగినసన్నాహము గావింపుచుండెను.

నాఁటిరాత్రి భుజించినతరువాత మంచముపైఁ బండికొని తాంబూలము నమలుచుఁ గుచుమారుండు శంబరుం జీరి వత్సా! నేఁడు నీ మొగముజూడ వేఱొకరీతిగా నున్నది. ఆనందించుసమయంబున విన్న బాటేమిటికి ? ఈపెండ్లికిఁ బెత్తనమంతయు నీదేకదా. నీతలిదండ్రులు నీబంధువులు పెండ్లివారు. నీయానందమే నాయానందము. నామిత్రులు దూరమందున్నారు. ఇందులకు ముఖ్యుఁడవు నీవేయని పలికిన విని శంబరుఁ డాత్మగతంబున అబ్బో ! అప్పుడే యీరండాపుత్రుఁడు రాజ్యము సరస్వతియుఁ దనకుఁ దక్కినవని యుబ్బుచున్నాఁడు. ఎక్కడ నోయున్న మిత్రులకు రాజ్యము పంచునఁట. నాకును నాతలిదండ్రులకును భోజనముసేయుటకై పెండ్లిపెత్తన మిచ్చునఁట. వీనిం బరిభవించిన తప్పులేదు. అని తలంచుచుఁ బ్రకాశముగా నార్యా ! నేఁడు నాకు దేహములో నస్వస్థతగానున్నది. అందుల కిట్లుంటినని సమాధానము చెప్పెను.

అట్లైనఁ బెందలకడఁ బండికొనుము. అని వానితో ముచ్చటించి కుచుమారుండు గాఢముగా నిద్రబోయెను. ఆయన గుఱ్ఱువినంబడినతోడనే లేచి శంబరుం డంతకుముందు సంగ్రహించియుంచిన పాషాణము మెల్లగ నెత్తి గుభాలున యతని నెత్తిపై వైచి చేతనమును బాయఁ జేసి యప్పుడే యాశవము నెత్తికొనిపోయి యాకోటకందకములోఁ బాఱవైచి తానే కుచుమారుండనని ప్రకటింపుచుండెను.

శ్లో॥ వాంఛాసజ్జనసంగతౌ పరగుణే ప్రీతిగున్‌రౌ కౌ నమ్రతా
     విద్యాయాం వ్యసనం స్వయోషితి రతిలోన్‌కాపవాదాద్భయం
     భక్తిశ్ళూలిని శక్తిరాత్మదమనే సంసర్గముక్తిఃఖలై
     రే తెయేషువసంతినిమన్‌లగుణాస్తెభ్యోమహద్భ్యోనమః॥

దుర్జనుల సంసర్గ గలిగినంత నెప్పటికైన ముప్పు వాటిల్లునని శాస్త్రములు చాటింపుచున్నవిగదా ?

అని చెప్పునప్పటికిఁ గాలాతీతమగుటయు నంతటితో విరమించి యవ్వలికథ పైమజిలీయం దిట్లు చెప్పఁదొడంగెను.

156 వ మజిలి

−♦ శంబరునికథ . ♦−

గీ. ప్రాణ మర్పించుటకు నొడంబడునుగాని
    బలిమి యజమానుని రహస్యవాచకంబు
    నెఱుఁగఁజెప్పఁడు పరులకు నెంతయైన
    నాత్మవిస్రంభపాత్రుఁ డైనట్టిదూత.