కాశీమజిలీకథలు/ఎనిమిదవ భాగము/148వ మజిలీ

వికీసోర్స్ నుండి

విడిచి సామాన్యపు పుట్టములు ధరించి తల్లితో మఱేమియుంజెప్పక మేడమీఁదికింబోయి గోణికాపుత్రున కత్తెరంగంతయు నెఱింగించిరి.

అతండు వారి సాహసమునకు వెఱగుపడుచుసక్తుండై యంగడికింబోయి వస్త్రమాల్యాను లేపనాదులం గొనివచ్చి వారికిచ్చెను. నూత్నకుసుమమాలాలంకృతలై యక్కాంతలు వింతసోయగంబునం బ్రకాశించిరి. నాఁటిరాత్రియే యాగణికాపుత్రికలు గోణికాపుత్రునితోఁగూడ నొరులకుఁ దెలియకుండ బయలుదేరి ధారానగరాభిముఖముగా నఱిగిరి.

అని యెఱింగించి యయ్యతిపంచాస్యుండు కాలాతీతమగుటయు నవ్వలికధ తదనంతరావసధంబున విట్లు చెప్పందొడంగెను.

146 వ మజిలీ.

-♦ మతంగయోగినికథ. ♦-

గీ. అఱుతఁ గరములఁజెవుల రుద్రాక్షమాలి
    కలు వెలయ భూతమై పూతగానలంది
    దండకుండ్యజనంబులఁ దాల్చి సిద్ధు
    రాలొకర్తుక కాషాయచేల కలిత

పాటలీపుత్రనగర రాజమార్గంబున బోవుచుండ నయ్యోగినిం జూచి సాష్టాంగమెరగువారును జేతులుజోడించువారును దాసోహమనువారును నోరసిల్లిపోవువారునై బ్రజలు తద్రూపాటోపంబుజూచి తపస్సిద్ధురాలని తలంచి వెనువెంటఁ బోవుచుండిరి.

ఆమె వారివారి నమస్కారములుమాత్రమందికొ నియెవ్వరివంక జూడక యెవరితోమాటాడక తిన్నగా రతినూపురయింటికిఁ బోయినది సంతతము వీణగాన ముఖరితంబై యొప్పుచుండెడి యాయిల్లు నిశ్శబ్దంబై యుండుటకు వెఱగుపడుచు నాసిధ్ధురాలు ఢాకినీ నామస్మరణము గావింపుచు లోపలికిబోయినది. రతినూపుర మంచముపైఁబండికొనియామె రాకజూచి తటాలున మంచముడిగ్గి పాదంబులంబడి నమస్కరింపుచు శోకగద్గదస్వరముతో నశ్రువులచే బాదములు దడుపుచు దల్లీ ! నా కూఁతుండ్రు నన్నువిడిచి లేచివెళ్ళిరి. నాయవస్థ యేమిచెప్పుదునని విచారించుటయు నబ్బురపాటుతో వారునిన్నేల విడిచివెళ్ళిరి? యెక్కడికిఁబోయిరి? ఎఱింగింపు మనుటయు నదిబోడిబాపనవానిం దీసికొనిపోయిరని యావృత్తాంత మంతయుం జెప్పినది. ఆకథవిని యయోగిని మనంబున నించుకవిన్న దనంబుదోప నొక్కింతసేపూరకుండి వారేదెసకుఁబోయిరో యెఱుంగుదువా ? అనియడిగిన నావేశ్య అమ్మా ! నేను గోపోద్రేకంబున నావిషయమేమియు విమర్శించితినికాను. ఏమూలకుఁబోయిరో నాకుఁ దెలియదని యుత్తరము జెప్పినది.

అప్పుడు యోగిని నిట్టూర్పునిగుడించుచు నోసీ ! నేనిప్పుడు నీకూతుండ్రఁ జకవర్తికి భార్యలంచేయు తలంపుతో వచ్చితిని. నారాకనిష్ఫలమైపోయినది. వినుము మహాపురనగరాధీశ్వరుఁడు విపులుఁడను రాజు నవరసరసికుఁడు తేజశ్శాలి రూపంబునమన్మధుఁడే యని చెప్ప దగు. మార్గవశంబున నే నానగరంబునకుంబోయి రాజదర్శనము గావించితిని.

అతఁడు నన్ను భక్తిపూర్వకముగా నర్చించి మీయభీష్టమేమని యడిగెను. దేశపర్యటనమే మాకృత్యము నీసద్గుణంబులు జనులు బొగడవిని యుత్సుకత్వముతో నిన్నుఁ జూడవచ్చితి నాకేకోరికయులేదు. సజ్జనులేనాకు మిత్రులు నీరాజ్యమునాకుఁ బూజ్యముకాదు. నీసాధుత్వమునకు మెప్పువచ్చెనని స్తుతియించిన నతం డుబ్బుచు నన్నుఁగొన్ని దినంబులందుండి సద్గోష్టి జేయుచుండుమని కోరికొనియెను.

నేనంగీకరించి యాఱుమాసములందుంటిని. అప్పుడప్పుడుపోయి యాతనికి మంచిమాటలు సెప్పుచుంటిని. అతనికిఁ జనువయినకొలఁది పరిహాసవచనములు ప్రబలుచుండెను, ఒకనాఁడతండు స్త్రీప్రశంశమీద దేవీ ! నీవు సర్వదేశములు తిరుగుచుందువు. సర్వావయవసుందరుల నిందుముఖుల నెందైనంజూచితివా ? కవివర్ణనమేకాని యట్టి స్త్రీలులేరనియే నాయభిప్రాయమని యడిగిన నేనించుక యాలోచించి చిఱునగవుతో మహారాజా ! నాకీ ప్రసంగముతోఁ బనిలేదుకాని మీరడిగితిరి కావునఁ జెప్పుచుంటి వినుండు పాటలీపుత్రనగరమున రతినూపురయను వేశ్యగలదు. దానికిద్దరు కూఁతుండ్రు. వారి యవయవములన్నియు మొలచినట్లు పోసినట్లు దిద్దినట్లున్నవి. చక్కదనం బొక్కటియేకాదు. సంగీతమో ? సరస్వతియైన నంతమాధుర్యముగా వీణఁబాడలేదు. వారి సుగుణంబులు గణనాతీతములు విటులఁదుచ్ఛులుగా జూచుచుందురు. అబ్బబ్బా ! ఆలావణ్యము సురగరుడోరగాదిత్య విద్యాధరాది యువతులకు లేదని రూఢిగాఁ జెప్పఁగలను. ఇప్పుడాలలనలు మురిపెంపు పరువమున సానబట్టిన రతనముల వలె మెఱయుచున్నారు.

నరేంద్రా! నేనవధూతనై నగుదుంగాక. చెప్పవలసినమాట జెప్పకమానను. నీకు వారు తగినవారు. వారికి నీవుదగుదువు. వారితో నిన్ను సంఘటించినప్పుడుగదా పరమేష్టినిఁ జతురాననుండని పొగడ దగినది. అని యూరక నీబిడ్డలఁ జక్కతనముం గొనియాడితిని.

నామాటలు విని యాభూకాంతుడు విస్మితస్వాంతుండై ఏమీ ? వారకాంతలే యంత చక్కనివారు! వారన్యాక్రాంతలైరా! లేదా? చెప్పుమనవుఁడు నేనిట్లంటి దేవా ! పరవశలైన తెరవల యొఱపుమీకడ నేమిటికి నుతింతును ?

వారిప్పటి కెవ్వరిని వరింపలేదు. సరిపడిన పురుషులు దొరకవలదా? గుణాధికులఁ గాని వరింపరు. అని చెప్పినవిని యాభూభర్త తటాలున లేచివచ్చి నాపాదంబులంబడి దేవీ ! నీవు యోగినివయ్యును భోగినీ ప్రవృత్తులు లెస్సగా నెఱుంగుదువు ? వైరాగ్యంబునంగాక శృంగారంబునంగూడనీకభినివేశము గలిగియున్నది. మహాత్ములులోకోపకారమునకై పాటుపడుచుందురు. త్రికరణంబుల భూతప్రీతి గోరువారే యుత్తములు. నన్ను నీశిష్యునిగా భావించి యామించుఁబోఁడుల నాకుఁ బెండ్లిగావింపుము. నీయుపకార మెన్నటికి మఱువనని ప్రార్ధించెను.

నాకు నీకూఁతుండ్రయందుఁగల యనురాగముచే గహిన్‌తకృత్యమైనను దౌత్యమున కనుమోదించితిని. తదామంత్రణంబు వడసి యిక్కడకుఁ బరమోత్సాహముతో వచ్చితిని. ఏమిలాభము ? నాప్రయాసమంతయు వ్యర్ధమైనది. అని పలికిన రతిసూపుర, దేవీ! నాకూఁతుండ్రు దాసరులై యూరరం దిరుగునట్లు నొసట వ్రాసియుండఁ జక్రవర్తి కెట్లు భార్యలగుదురు? కోరికోరి చివరకు విభూతిరాయలఁ గోరిరి. అదియే నామనం బెఱియుచున్నది, నేనేమి చేయుదును ? నీకు శక్తియుండిన వారిని వెదకిపట్టి తీసికొనివచ్చి యాఱేనికిఁ గట్టిపెట్టుము. నీవు నిజముగాఁ దలంచినపనియేల కొనసాగకుండెడిని ? అని కోరిన విని యాయవధూత శిరఃకంపమున నంగీకారము సూచించుచుఁ గొన్నియానవాళ్ళు తీసికొని బయలుదేరి వారల జాడలు దెలిసికొనుచు గొన్నినాళ్ళు దేశసంచారము గావించినది. కాంతలు కనకమువంటివారు కాంతాకనకంబు లొంటిగా లభించెనేని యనుభవింపవలయునని యెట్టి వారికిని బుద్ధిపుట్టక మానదు. అని తలఁచి గోణికాపుత్రుండా గణికానందనలఁ బురుషవేషమువైచి ధారానగరంబునకుఁ దీసికొనిపోవుచుండెను. మహాపురంబున నొకసత్రంబున వారు బసజేసియుండగా మతంగయోగిని యక్కడికి బోయి నలుమూలలు వెదకుచుండెను.

చిత్రసేన యామెంగురుతుపట్టి గోణికాపుత్రునితో నార్యా ! యీయోగిని యప్పుడప్పుడు మాయింటికి వచ్చుచుండునది. మాతల్లికి నీమెయందుఁ జాలభయభక్తులు గలిగియున్నవి. ఆమె బంపఁగా నిక్కడికి వచ్చినదేమో యని చెప్పిన నతండు నవ్వుచు నాయోగిని దెసకుఁ బోయి దేవీ ! నీవెవ్వరి నిమిత్తమిట్లు వెదకుచుంటివి? పని యేమనియడిగిన నామె బాబూ! మొన్న నీయూర రాజసభలో సంగీతము పాడిన గాయకులిందున్నారని వింటిని. వారిం జూడవచ్చితి నెందున్నారో చెప్పఁగలరా ? యని యడిగిన నతండిట్లనియె.

నీవు సంగవజిన్‌తురాలవు. సంగీతము శృంగార రసదీపకము. అట్టిగాన బ్రసక్తితోఁ నీకుఁ బనియేమి? వైరాగ్యప్రవృత్తికి ధర్మమా? అని యడిగిన నామే చిఱునగవుతో బాబూ ! నాదబ్రహ్మము పరబ్రహ్మ బోధకమైనది. సంగీతము వినుచుండ నాడెందము పరబ్రహ్మమందు లీనమగుచుండును. అందులకే నారదమహర్షి సంగీతప్రియుండయ్యెను. నేను బుడమిఁగల గాయనగాయనీమణుల సంగీతములు పెక్కులు వినియుంటిని. పాటలు వినుటకే నేను దేశాటనము చేయుచుంటిని. ఈదేశాధిపతి విపులుఁడు నాయందుఁ గురుభక్తిగలవాఁడు మొన్న వారికడ వీరేమో పాడిరఁట. ఆగాన మతఁడూరక మెచ్చికొనుచున్నాడు. నేనప్పుడు గ్రామములో లేను నాతోఁ బెద్దగా వర్ణించి చెప్పుచు వారీసత్రంబున నున్నారని యెఱింగింప నిందువచ్చితిని వారు మీరేనా? అట్లైన నేను ధన్యురాలనే! ఇంచుకపాడి శ్రోత్రానందము గావింతురా మిమ్ము దీవించి యేగెదనని కోరిన నతండు చిత్రసేనంజీరి కొంచెముసేపు పాడుమని సంజ్ఞ జేసెను.

పురుషవేషముతోనున్న యాచిన్నది. ముసి ముసి నగవులతో వీణశ్రుతి వేసి తంత్రుల నాలపించుచు గంఠనాదముతోఁ గలిపి హాయిగాఁ బాడినది. అప్పుడాయోగిని గంతులువైచుచు నోహెూహో ఎంతకాలమున కిట్టి సంగీతము వింటిని. నేఁటితో నాచెవుల త్రుప్పు వాసినది. ఇట్టిసంగీతము పాటలీపుత్రనగరంబున రతినూపురపుత్రికలు పాడుచుండ వింటిని. మఱియెక్కడ వినలేదు. ఇంత మనోహరముగాఁ బాడువారరుదు. అని స్తుతియించుచు మఱియొకపదము మఱియొకగీతము అనికొసరుచు, నత్తన్వి పాడుచుండ శిరఃకంపము చేయుచు నాలించినది. అప్పుడు గోణికాపుత్రుడు సాక్షేపముగా నవధూతా ! నీచిత్తము పరబ్రహ్మయత్తమైనదా? తురీయానంద మనుభవించితివా? ఇఁక చాలునా? అని యడిగిన నామె బాబూ! నేనెన్నినాళ్ళు వినినను వినఁగలను, ఇందులకు నాకుఁదృప్తి లేదు. నిద్రాహారములు విడిచి వినగలను. అనుటయు నతండు నవ్వుచు నీవు వినఁగలవుగాని పాడువారికి నోపిక యుండవలదా? ఇప్పుడు వేదాంతివిగదా యని యితఁడుపాడెను గాని యిఁక యూరకపాడఁడు విత్తముజూపినంగాని వీణ విప్పడు ఇఁక నీదారిని నీవుబొమ్ము. అనుటయు నామె యిట్లనియె.

బాబూ ! నేనొరుల నెప్పుడు కష్టపెట్టను నానిమిత్తమై పాడ నక్కరలేదు. మీరు పాడినప్పుడే విని యానందించెద మీతోవచ్చుట కంగీకరింతురా? అనిన నతండు నీవు మాతో రావలదు. నీదారిని నీవు బొమ్ము. నీవు యోగినివి మేము భోగులము అని కచ్చితముగా నుత్తరము జెప్పెను.

అప్పుడాయోగిని యించుకసిగ్గుపడుచు దిగ్గున విపులునొద్దకుఁ బోయి మహారాజా ! వాండ్రు రతినూపుర పుత్రికలే. పురుషవేషములు వైచి తీసికొనిపోవుచున్నాఁడు. ఆబాహ్మణుఁడు కడుగడుసు వాఁడు. నన్నుఁ దమతో రావద్దని నిరసించెను. పాపము రతీనూపుర యిరువురఁ గూతుండ్రను మీకిచ్చుటకు సిద్ధముగానున్నది. ఇప్పుడు మనముచేయందగినపని యేమని యడిగిన విపులుండిట్లనియె.

దేవీ ! నీవు వారింగలసికొని పురుషుఁడువినకుండ మదీయప్రాభవవిద్యాలీలాదులఁబొగడి కార్యమెఱింగించి తీసికొనిరమ్ము. నీవు చెప్పిన దప్పకవత్తురనియే నాఅభిప్రాయము రానినాఁడు వేరొక తెరు వాలో చింతము నీవన్నిటంబ్రౌఢురాలవు. నీకు మేము చెప్పనక్కరలేదు కార్యభారము నీదేయనిపలుకుచు దారిభత్యమునకని కొన్నిదీనారము లామెచేతిలోఁబెట్టి చేయవలసినకృత్యములు బోధించి యంపెను.

గోణికాపుత్రుం డాయూరువిడిచి దేశవిశేషంబులఁ జూచుచు మెల్లగాఁబోవుచుండుటంబట్టి పదిదినములలో నొకగ్రామములో నా యోగిని వారింగలిసికొనినది. అతండామెను బల్కరింపక మారుమొగము వెట్టుటయు నామెయే విద్వాంసుడా! నాపైనీకుఁగోపమా? నే నేమిపాపముజేసితిని. తలఁచితలఁచి నిలువలేక క్రమ్మర మీపాటవినుటకై వచ్చితిని. ఒక్కసారిపాడింపవా? అనుటయు నతండు నీకేమియుఁ బనిపాటలులేవు ఎవ్వరోయింతభిక్షమిడినఁదృప్తిగా భుజింతువు. సంగీతము వినకేమిచేయుదువు? పో. పొమ్ము. ఇందుపాడువారులేరని గద్దించి పలికిన నలుగక యామె బాబూ! నీవు నన్నుఁదిట్టినను నొప్పుకొందు కొట్టినను నంగీకరింతు. పాడించినంజాలని బలుకుచు వారినివిడువక వెనువెంటఁదిరుఁగుచుండెను. ఒకనాఁడు గోణికాపుత్రుఁ డెందోపోయిన నాయవకాశము కనుపెట్టి యాయోగిని వారితో నేకాంతముగా నిట్లనియె.

బిడ్డలారా! మిమ్ము నేను గురుతుపట్టితిని. మీరు రతినూపుర పుత్రికలు. మీరుగన్మొఱంగివచ్చితిరి. మీనిమిత్తము మీతల్లిమంచము పట్టినది పెద్దదానినేడిపించుట మీకుఁదగదు. అది యట్లుండె మీకొక శుభోదర్క మెఱింగింపవచ్చితిని. వినుండు విపులుఁడను మహారాజుకడ మీవిద్యారూపశీలాదులఁ బొగడితిని అతండు మిమ్ము జేపట్టుటకు సిద్ధముగానున్నాఁడు అతనియైశ్వర్యమంతయు మీయధీనము చేయఁగలఁడు నాతోరండు మిమ్మతనితోఁ గలిపెద. ఈముష్టిపాఱునివెంటఁ బడితిరేల? ఇదియేటియూహ! అనిపలికినవిని చిత్రసేన చురచురంజూచుచునిట్లనియె.

ఓసీ! దుష్టయోగినీ! ఇదియా? నీవేదాంతము! వేషమునకే యవధూతవా ? రాజునొద్ద దారుపుకత్తెవై తిఱుగుచుంటివా? చాలు చాలు ఇఁకనీతోమాటాడఁ దగినదానవుకావు. పో .పొమ్ము రతినూపుర యెవ్వతె? విపులుఁడెవ్వఁడు? మేము నీవనికొనినవారము కాము భ్రమసితివి నీదారిని నీవుబొమ్ము. మాకవీంద్రునికి నీపైఁ గోపముపెద్ద. నీగుణమతఁడప్పుడే గ్రహించెను. ఈమాటవిన్న నిన్ను శిక్షించునని పలికినఁ దెలతెలపోవుచుఁ బూఁబోఁడులారా ! మీసుఖముగోరి యిట్లంటి మీకిష్టము లేకున్నఁ బోనిండు నాకేల ? కాని మీరు చేయుచున్నపని చాలతప్పుపని వినుండు తల్లికిఁదెలియకుండ దాని యాస్తి యంతయు దొంగిలించుకొని మారువేషములు వైచికొని యొకబాపనయ్యను దగులుకొని పోవుచున్నారు. మీరు దండనార్హలు. మీతల్లి రాజునొద్ద మీపైనభియోగము దెచ్చినది మిమ్ముఁగట్టించి బలవంతమున దీసికొనిపోయెదఁ జూడుఁడు అని బెదరించుచు నాయోగినియేగినది. చిత్రసేన గోణికాపుత్రుండు వచ్చినతరువాత యోగిని యాడినమాట లన్నియుం జెప్పినది.

అతండాలోచించి మనమిఁక నీదేశము విడిచిపోవలయును. విపులుఁడు మిమ్మువలచియున్నాఁడు కామాంధులు యుక్తాయుక్తశూన్యులు. ఏమిచేసినం జేయఁగలరు. అని పలుకుచు నిలుకడమాని హుటాహుటి పైనంబులు సాగింపుచుండెను.

ఒకనాఁడు చిత్రసేన వేశ్యాజనప్రవృత్తిని గర్హించుచు మాకులములో సద్గుణంబులచేఁ బేరుపొందిన సుందరు లెన్నఁడైనంజనించిరా? యని ప్రస్తావవశంబున నడిగిన గోణికాపుత్రుండు నవ్వుచు మీరుపుట్ట లేదా ! మీకన్ననుత్తము లెవ్వరనిపలికిన , నక్కలికి చాలుచాలు మా మాటయే చెప్పవలయునా పరిహాసమాడక నిజముచెప్పుఁడని ప్రార్థించిన నతండు చింతామణియను వేశ్య లీలాశుకుండను బాహ్మణుని భర్తగా వరించి ముక్తినొందినకథ జగద్వితమైయున్నది. మీరు విన లేదా? అని నొడివిన నప్పడఁతి యక్కథమేమెఱుఁగ మెట్టిదో చెప్పుఁడని కోరిన నతండిట్లుచెప్పెను.

అని యెఱింగించి

147 వ మజిలీ.

చింతామణికథ.

గీ. కలదు చింతామణీ నామకలిత లలిత
    రూపయౌవన శీల విద్యాపరీత
    యనవగతపాప గణికాన్వయ ప్రదీప
    యపహసితభోగ సువిరాగ యాప్రయాగ.

గీ. చదివినది చాలశృంగార శతకములను
    తెలిసినది కామతంత్ర ప్రదీపికలను
    అరసినది సత్కళారహస్యములఁ బెక్కు
    కాంత పరువమొకింతమై గ్రమ్మినపుడ.

వైశికప్రయోగ ప్రకారమంతయుం బఠించినదైనను చింతామణి పూర్వజన్మవాసనా విశేషంబునం జేసి దుష్ట విటజాలంబులఁ దజ్జాలంబునఁ దృప్తిఁబొంది యౌవనోదయంబున నేకచారిణీవ్రతంబనుష్ఠిం పందలంచి యనుకూల ప్రియాన్వేషణ తత్ఫరయై యున్నంత.

గీ. సకలవేదపురాణశాస్త్ర ప్రవీణ
    ధీవినిజిన్‌తగురుఁడు వర్ధితయశుండు
    శ్రోత్రియుఁడు కృష్ణమిశ్రుఁడన్ సోమయాజి
    కాపురముసేయు నాప్రయాగమున మున్ను.

ఆపాఱునకు నడివయసున నొక కుమారుండుదయించె మారసదృశుండగు వాని యాకారలక్షణంబు లుపలక్షించి సంతసించుచు నతండు శ్రీశుకుండు విలాసార్ధమై జన్మించెనను నర్ధంబు సూచింప నాశిశువునకు లీలాశుకుండను నామకరణము గావించెను. అయ్యభిఖ్య