కాశీమజిలీకథలు/ఎనిమిదవ భాగము/146వ మజిలీ
భిక్షుకులతో నటులతో విటులతో మూలికావైద్యులతో నెన్నఁడును మాటాడునదికాదు వాండ్రు దూతకృత్యముల నిర్వర్తించి పతివ్రతల నైనఁ జెడుత్రోవల దింపఁగలరు. మఱియు భర్తకేదియిష్టమో తెలిసికొని భోజనసదుపాయము జేయుచుఁ బతివ్రతలలో నగ్రగణ్యయై యొప్పినది. స్త్రీలు సహజముగా దోషదూషితులైనను నడవడికచేఁ జక్క పడుదురు.
గోమఠుఁడు గొన్నిదినము లత్తవారింటనుండి భార్యగుణము జక్క పడినదని నిశ్చయించి మామగారికిఁజెప్పి తనకత్యంతోపకారము గావించిన గోణికాపుత్రుంజూడ ధారానగరంబునకుఁ బయనంబై పోయెను.
అనియెఱిఁగించి యాసిద్ధుండు తదనంతరావ సధంబునఁ దదనంతరోదంతం బిట్లుచెప్పందొడంగెను.
144 వ మజిలీ.
- ♦ రతినూపురకథ ♦-
పాటలీపుత్రమను నగరంబు మగధదేశమునకు రాజధానియై జగద్విదితంబై ప్రకాశించుచున్నది. ఆపట్టణంబు దత్తునకు జన్మభూమి యని యిదివఱకే చెప్పియుంటినిగదా మఱియునాపురంబున రతినూపుర యను వేశ్య కాపురము జేయుచుండెను. విద్యారూపవైభవంబుల ననవద్యయగు నగ్గణికా రత్నము కొంతకాల మేకపరిగ్రహయై కొంతకాల మనేక పరిగ్రహయై కొంతకాలమపరిగ్రహయై మిక్కిలి ధనమార్జించినది. కుబేరులవంటివిటుల జోగులఁజేసి సాగనంపినది. భూములుమిద్దెలు మేడలు చాల సంపాదించినది. సంతానముగలుగుటఁ కెడమైనది. వ్రతములు దానములు ధర్మములు సంతానాభిలాషఁ బెక్కుగావించినది. నడివయసున నొక విప్రునివలన నేవ్రత ప్రభావముననో దానికిరువురు పిల్లలుపుట్టిరి. వేశ్యల కాఁడుపిల్లపుట్టుట రాజులకుఁ బట్టభద్రుండుపుట్టి నట్లేకదా? వారికిఁజిత్రసేనయనియు రతిమం జరియనియుఁబేరులుపెట్టినది. త్రిజగన్మోహనరూపంబునఁ బ్రకాశించు నాబాలికలకుఁ గ్రమంబున సంగీత సాహిత్యాది విద్యలు నేర్పించినది. వీణాగాన పరిశ్రమలో భూలోకములో వారినిమించినవారు లేరని వాడుకవచ్చినది. బంగారమునకుం బరిమళమబ్బినట్లు ఆబిబ్బోకవతుల చక్కఁదనమును యౌవనము మెఱుఁగుబెట్టినది.
శ్లో॥ యౌవనే సత్వజాస్త్రిణా మలం కా రాస్తువింశతిః॥ యౌవన సంబంధములగు హావభావాద్యలం కారము లిరువదియు వారినలంకరించినవి తదీయ సౌందర్య విద్యావిశేషంబులఁ దెలిసికొని వారింజూడ వలయుననియు మాటాడవలయుననియు ననేక విటశిఖామణులు ప్రయత్నించిరి. కాని, వారట్టియవకాశమీయక రాజస్త్రీలవలె నంతఃపురముననే మెలఁగుచుందురు.
యౌవనవతులగు పుత్రికల నిర్వుర వేశ్యావృత్తిలో బ్రవేశపెట్టిధనమార్జింపవలయునని తలంచి యొకనాఁడు రతినూపురతనపుత్రికలకు వైశికధర్మము లిట్లు బోధించినది. బిడ్డలారా! మీరు మనోహర రూపవిద్యాననవద్యలై యొప్పుచున్నారు. మీనిమిత్తమైవిత్తేశునివంటి యాఢ్యులు బడికాపులై తిరుగుచున్నారు. మీరు వేశ్యాధర్మముల నాక్షేపించుచు విటుల మొగము జూడక కులస్త్రీలవలె నొదిగియొదిగి మెలఁగుచున్నారు. వైశికప్రకరణమొకటిమన నిమిత్తమై విద్వాంసులచే వ్రాయఁబడినది. దాని మీకుపదేశింతు. అంతయు చెప్పువఱకు నట్లిట్లని శంకజేయక వినుండు.
కాముకులకు శరీరమిచ్చి యర్ధార్జనముచేయుట వేశ్యాకుల ధర్మమై యున్నది. కులస్త్రీలు రాగాసక్తలు. వేశ్య లర్థాసక్తులు. గణిక, రూపాజీవ, కుంభదాసి యని వేశ్య మూఁడువిధముల నొప్పుచున్నది. దేవగృహతటాకాది పుణ్యకార్యంబులు చేయుచు నొక్కనినే పతిగాఁ బరిగ్రహించి ధనమార్జించునది గణిక యనంబడును. రూపమన గృహవస్తుప్రాగల్భ్యము. సౌందర్యము సామాన్యమైనను వస్తుపాగల్భ్యముగలది రూపాజీవయనంబడును. రాజస్త్రీలకడ సంచరించు దాదులు కుంభదాసులనంబడుదురు. నట శిల్పికారులభార్యలు భర్తృ మరణానంతరము వేశ్యావృత్తి వహింతురు. వారిని శిల్పికారిక లని పిల్చుచుందురు. వీరిలో గణికయే యుత్తమురాలు.
మఱియు నాత్మస్తుతిపరుని త్యాగశీలు గురుశాసనాతిక్రమణు స్వతంత్రు ధనికుఁ బ్రచ్ఛన్నకామునిఁ బతిగాఁ బరిగ్రహింపవలయు. కాంతుననుసరించి కృత్రిమరాగము స్వాభావికరాగమువలెఁ బ్రకటింపవలయును. కామపరులగు పురుషులు వేశ్యల కపటములు నమ్ముదురు. నాయకునిచేఁ బార్థింపబడియు తొందరపడి యంగీకరింపకూడదు. నాయకుని శీలము రాగముసక్తత దాతృత్వము లోనగు గుణంబులు బరీక్షించి యంగీకరింపవలయు. వానిరంజింపఁ జేయుటకు ననేకోపాయంబులుగలవు. వానిలోఁ గొన్నిటివివరించెద నాలింపుఁడు.
సీ. సందేశమాలించి జాగుజేసినవిటు
కడకు దానేపోయి యడుగవలయు
నలరఁ దాంబూలమాల్యాను లేపనము లిం
టికివచ్చినట్టి నాయకునకీయ
వలయు మండవ పరివర్తనంబులు సేయ
దగు బ్రియుం డనుర క్తిఁదగులుకొనఁగ
సాంప్రయోగికమును సాకూతముగను సూ
చింపఁగాఁదగుగమ్యు చిత్తమరసి
గీ. ప్రీతిదాయకములగు వాగ్రీతులొప్పఁ
బెలఁగి క్రీడల విటుని రంజింపవలయు
సక్తగాకుండ దా నతిసక్తయైన
యట్లునటియింపవలెఁ గపటాత్మవేశ్య.
గీ. వేశ్యమాత యెపుడు విటునితోఁ జనువుగా
మాటలాడఁదగదు మఱియు నతఁడు
బెదరునట్లుకూఁతుఁ బిట్టునిందింపంగఁ
దగును దొరకె మంచితగులమనుచు.
సీ. పయనమేగెడునట్టి ప్రియుఁజేరి వగచుచు
వేగరమ్మని యొట్టు పెట్టవలయు
నాలసించిన విరహాగ్ని కీలలమ్రగ్గి
యొడలు బాసెదనంచు నుడువవలయు
విటునాప్తు లెఱుఁగ నెప్పటికివచ్చు ప్రియుండ
టంచుఁదాశకునంబు లడుగవలయుఁ
బ్రియుని మిత్రులుజూడ రయముగా నతఁడు రా
వలెనంచు వ్రతములు సలుపవలయు
గీ. నతఁడువచ్చినపిదపఁ జిత్తార్తిదెలిపి
యోజశ్రీకామదేవుని పూజసలిపి
మ్రొక్కు లెల్లను జెల్లించి మురియవలయు
వల్లభుఁడుజూచి నమ్మివిభ్రాంతిబడగ.
క. సరసున కాపద గలిగిన
వరుసనలంకారములను వర్జింపఁదగున్
పరుసమగుమాట లెన్నఁడు
వరుసన్నిధినాడఁతగదు వారాంగనకున్.
గీ. విటునికవసర మగునట్టి వేళలందుఁ
దనదునగలీయఁదగు నమ్ముకొనుడటంచు
సారధనుడౌటఁ గార్యంబు దీరినంత
దానికిబ్బడినీయక మానఁడతఁడు.
సీ. కంటిరే? యీరత్నకలిత కంకణమెంత
సొగసైనదోయంచుఁ జూపవలయు
మీయుంగరము కెంపునాయంగుళికిసొంపు
గలిగింపవలెనంచుఁ దెలుపవలయు
నీవాహనము మనమెక్కి యూరేఁగ వే
డ్కలుపుట్టెనని చేరిపలుకవలయు
నీవల్వగట్టి మీతో వేడుకలఁగూడ
మనసయ్యెనని బ్రతిమాలవలయు
గీ. విక్రయంబునకవినచ్చు వేళలెఱిఁగి
వలదు పోనిండు నేఁడు ద్రవ్యంబు చేత
గొరఁతగాఁబోలు రేపైనఁ గొనగవచ్చు
ననుచు సూచింపఁ దగువిటు నంతికమున.
ఇది సక్తునికిఁజేయు తెరంగింక విరక్తుప్రకారం బెట్టిదనిన.
గీ. ఇంగితాకారచేష్టల నెఱుఁగఁదగు వి
రక్తునతఁడిత్తునన్న యర్ధంబుకొరఁత
గా నొసంగుచునిత్య మీఁగలది రేపు
రేపుమఱచితినని భ్రమజూపుచుండు.
గీ. ఒకటిసెప్పిచేయు నొక్కటి ప్రియురాలి
శత్రుకోటితోడ సలుపుమైత్రి
వెనుక విడిచినట్టి వేశ్య దూతికలతో
మంతనంబులాడు మఱియు మఱియు
సీ. భర్తకిష్టముగాని పనులఁ గావింపుచు
నతనిముందర, నిందలాడవలయు
దృణము భేదించి మర్దించి లోష్టమువాని
దెసఁజూచుచును మూతిద్రిప్పవలయు
నధికవిద్యావంతులైన వారిగణించి
దూషింపవలయు నాధూర్తుయశము
పరిచారికలమీదఁ బన్నిదోషములెత్తి
పొడుపుమాటల సూటిబొడుపవలయు
గీ. రతుల కవకాశమీక రుగ్మతవచించి
వలపు గాడిదయొక్కటి కలదుమాకు
నదలదెన్నన్న సిగ్గులేనిది యటంచు
దిట్టవలెఁదల్లిచేత మొత్తింపవలయు.
క. మెల్లగవిటులకుగల ధన
మెల్లనునమ్మించి లాగియేపున వానిన్
వెళ్ళంగొట్టఁగ మఱితన
తల్లిం బురికొలుపవలయు దర్పంబొప్పన్ .
బిడ్డలార! వినుండు.
శ్లో॥ పరీక్ష్య గమ్యై సంయోగ స్సంయుక్త స్యానురంజనం।
రక్తా దర్ధస్య చాదాన మంతెమోక్షశ్చ వైశికం॥
గీ. తెలిసి విటుశీలమతనితోఁ గలసికొనుట
కలిసి రంజించుటతని శృంగార కలన
రక్తుఁడగువానివలన నర్ధములు గొనుట
చివర విటుగెంటుటిదియె వైశికమనంగ.
క. ఈవైశికవిధు లెఱిగిన
చో విటులం గపటవృత్తి జొనుపుచు రూపా
జీవలు ధన మార్జింతురు
ప్రావీణ్యముతోన సక్తభానంబలరన్.
అని యెఱింగించి మఱియు నపరిగ్రహానేక పరిగ్రహ ప్రవృత్తుల జెప్పుట కుద్యమించుచున్న తల్లి నాక్షేపించుచు నమ్మించుబోఁడు లిరువురు అమ్మా! నీ యుపన్యాస మింతటితో విరమింపుము. సీ! సీ! వేశ్యావృత్తి యెంతగర్హితము. ఈధనంబంతయు నీవిట్లేసంపాదించితివి గాఁబోలును. అయ్యయ్యో! మేమిట్టి కులంబున బుట్టితిమేమి?
చ. ఖలుఁడును జాతిశూన్యుడు వికారిగురుక్షయరోగి కుష్టుదు
ర్లలితుఁడు కుంటి గ్రుడ్డి చపల కియుడున్ మలినాంగుఁ డెవ్వడే
గలియగవత్తు విత్తమిదెకైకొనుఁ డన్న ముదంబుజెంది వే
శ్యలు తమదేహమమ్ముదు రహా! యతినీచమికేది జూడఁగన్?
గీ. లలిత మణి భూషణాంబరాదుల ధరించి
నెరయఁబైవన్నె లెన్నేని నెరపితుచ్ఛ
విటులు బెక్కండ్రు భోగించి విడిచినట్టి
గణిక యుచ్చిష్ఠపాత్రంబుగాదె? తల్లీ !
ఉ. మేడలుగల్గనీ! పశుసమృద్ధి లభింపగనీ! సిరుల్ గడున్"
గూడగనీ! ప్రసిద్ధిపడగోటికిఁ దాపడగెత్తనీ! నిజం
బాడెదమోశుభాంగి! వినుమా! గణికాజనజీవనంబు సీ
పాడుసుమీ! కిమిక్షుధలపాలుసుమీ! తుదిఁదత్ప్రతీకముల్ .
గీ. కాపురంబులెన్నో మాపినిందలమోపి
బొంకులాడి ధర్మములనువీడి
కపటవృత్తి విటులఁగలసి జోగులఁజేయు
పడపుబోంట్లు యమునిభటులుగారె?
ఉ. దేహమశాశ్వతంబనుచుఁ దెల్లముగాఁగ నెఱింగిరేని యీ
మోహమదేల గల్గు నిహమున్ బరమున్ దలపోసినన్ వరా
రోహకు భర్తయుండఁదగు రూఢిగనొక్కని మంచివాని స
ద్రోహమనీష నెన్నుకొని తుష్టి వహింతుము మేము తల్లీరో!
అనిపలికిన విని రతినూపుర కోపరస మిశ్రితమగు చిఱునగవుతో వెఱ్ఱిబిడ్డలారా! పెండ్లియాడు తలంపుమీకేల గల్గినది? ఇది యె వ్వరియుపదేశము? అయ్యయ్యో! కులపాలికలుబడు నిడుములం జూచు చుండియు మీకీసంకల్ప మేలబుట్టినది? వినుండు –
సీ. అత్తమాటలకు నోరెత్తి యుత్తరమీయఁ
దప్పు వేరొకతప్పు జెప్పకున్న
మఱఁదులకడనిల్చి మాటలాడుట తప్పు
ఆఁడుబిడ్డల కెదురాడఁదప్పు
మామముంగటనుండ మసలుట యొకతప్పు
బావగారికిఁ గనంబడుటతప్పు
ఎఱుఁగక మొగసాలకఱిగినిల్చినఁదప్పు
నగుచుఁబల్కుటపల్కి నగుటతప్పు
గీ. జడనుజుట్టుట చెంపకొప్పిడుట వ్రేలు
ముడి ఘటించుట జిన్ని బొట్టిడుట మెఱుఁగు
వలువగట్టుట సిగను దండలనుజుట్టు
టెక్కుడగుతప్పు మగనాలికెపుడు ముప్పు.
గీ. ఇన్నితప్పుల నెట్లో సహింపవచ్చు
గాని భర్త యతిక్రోధుఁడైన యపుడు
తెఱవ పడుపాటులల బ్రహ్మదేవుఁడెఱుఁగు
వలదు మగనాలితనము శత్రులకునై స
అనుటయుఁ గూఁతుండ్రు అమ్మా! నీవింత యవివేమతివగుట వింతగానున్నది. పెండ్లియాడుచున్న కులస్త్రీలెల్ల నిడుమలంగుడుచు చుందురా?
సీ. అత్తచిత్తమెఱింగి యాడుబిడ్డమనంబు
గనుపెట్టి మామవైఖరిగ్రహించి
తోడికోడండ్రచేతో నిధానముగాంచి
మఱుఁదులహృదయాభి మతముదెలిసి
బావగారితలంపు పరికించి చుట్టాల
గౌరవంబుగణించి కార్యమెఱిఁగి
ప్రాణేశుకడుపులోపలఁ బండుకొనివంశ
మర్యాదలులెల్ల నెమ్మదివహించి
గీ. ధర్మగతినొప్పు సాధ్వీవతంసమునకు
నూడిగంబులు సేయరే యున్నహితులు
నర్ధదేహ మొసంగఁడే యరసిభర్త
వరములీయరె వచ్చి దేవతలుప్రీతి.
తల్లి — పుత్రికలారా! లోకానుభవము లేనివారగుటచే మీ రిట్లనుచున్నారు. వినుండు...
క. గాధల్ పెక్కేటి సం
బోధింపగ నెల్లకాలము సజీవుండై
నాథుండు బ్రదుకునే భువి
వైధవ్యవ్యథభరింపవశమే చెపుడా
గీ. నేల బండుకొనుచు మాలికాగంధతాం
బూలముఖ్యభోగములను వదలి
విధవ జోగివలె వెలయంగవలెనఁట
కామమును జయింప గలరె సతులు.
పుత్రికలు - అమ్మా! నీవు శాస్త్రజ్ఞానము లేనిదానవగుట నిట్లనుచున్నావు పూర్వకృతసుకృతదుష్కృతము లనుభవింపక యెట్టివారికిందీరదు. పెండ్లియాడినను నాడకున్నను బ్రారబ్ధమవశ్యభోక్తవ్యము. నీమతము మాకభిమతముగాదు కులవృత్తి మేమనుసరింపము. అది నిరయద్వారము. అని తిరస్కరించి పలికిరి. అందు మఱియుఁ జిత్రసేన
గీ. చదివితిని చిన్నతనమున ముదముగదుర
దత్తకుండను మాధురాత్మజునితోడ
వాని సౌందర్య మక్కజమైనదగుట
నపుడె తలఁచితి నతనిఁ బెండ్లాడ మతిని.
బడియందేమే మొండొరుల వరించుకొంటిమి. అతండిప్పుడు కాశీపురంబునఁ జదువుచున్నాడని వింటి నేనందుఁబోయి బాల్య స్నేహం బెఱింగించి యుతనిఁబతిగా వరించెద నీయైశ్వర్యము నాకక్కర లేదని పలికినది.
రతిమంజరియుఁ జిత్రసేనచెవిలో నేదియో చెప్పి యట్టివాఁడే నాభర్త యిది గురూపదిష్టము. అట్లుకావించెదనని యుపన్యసించినది. రతినూపుర వారిమాటలాలించి చిన్నవారలు మీకేమియుం దెలియదు పో. పొండు అని మందలించి యవ్వలికిఁ బోయినది.
అని యెఱింగించి మణిసిధ్ధుండు వేళయతిక్రమించుటయు నవ్వలికథ దరువాతమజిలీయందు జెప్పందొడంగెను.
145 వ మజిలీ.
చిత్రసేనా రతిమంజరులకథ.
గురుఁ డెఱిగించిన శుభదివసంబున వేకువజామునలేచి రతిమంజరి జలకమాడి ధవళమణిభూషాంబరంబులు ధరించి మాల్యను లేపనాదివాసన నలుదెసల నావరింపఁ గై సేసికొని యక్కా! నాభాగ్య మెట్లున్నదియో తెలియదు భర్తనునిరూపించు సమయమగుచున్నది. ఇప్పుడపోయి వీధితలుపుతీసినతోడనే మనయఱుగుపైఁ దొలుత నెవ్వడు గనంబడునో వానినే ప్రాణేశ్వరునిగాఁదలంచి యీపుష్పదామంబు వానిమెడలో వైచెదను. అట్లే దేశికుం డుపదేశించెను.
మఱి నందెవ్వరునులేనిచో నేమిసేయఁదగినది.అనిపలికిన చిత్రసేన చెల్లీ! మహాత్ములవచనముల కన్యధాత్వముండదు శుభోదర్కములగు వారిమాటలననుసరించిపోయిన మంగళములు సేకురకమానవు. వేళయగుచున్నది? పదపద అనిచెప్పినది. అత్యుత్సుకత్వముతో రతి