Jump to content

కాశీమజిలీకథలు/ఎనిమిదవ భాగము/142వ మజిలీ

వికీసోర్స్ నుండి

శ్రీరస్తు.

కాశీమజిలీకథలు

ఎనిమిదవభాగము.

142 వ మజిలీ.

సప్తమిత్రచరిత్రము.


క॥ శ్రీమ త్కాశీనగర! స్వామి రమాప్రాణనాథ వాణీ ధవ సు
     త్రామా దిదేవ మకుట! భ్రామిత మణినికరకిరణ భాసిత చరణా!

దేవా! యవధరింపు మ మ్మణిసిద్ధుం డయ్యవసధంబున గథా కథనలాలసుండై యున్నంత నగ్గోపకుమారుం డరుదెంచి.

"శ్లో॥ జామాతైవ స్నుషాభవత్”
       అల్లుఁడే కోడ లయ్యెను.

అని చదువుచు మహాత్మా! వింతలంజూడ నేఁడీ గ్రామము లోనికిం బోయితిని. రచ్చబల్లపైఁ గూర్చుండి కొందఱు విద్వాంసు లీశ్లోకపాదముం జదువుచుఁ దద్భావము గ్రహింపలేక వితర్కించు చుండిరి.

ఉ॥ అల్లుఁడు కోడలెట్టులగు ◆ నంచు వచింప గ గొందఱందు నౌ
      నిల్లరికంపుటల్లుఁడు గ్ర ◆ హింపఁగఁ గోడలివంటివాఁడె యౌ
      నల్లుఁడు కోడలయ్యెనని ◆ యర్ధముచెప్పఁగఁ గొంద ఱొల్లరై
      రల్లన వాదమయ్యెఁ దెలి ◆ యంబడదయ్యెఁ దదర్థ మేరికిన్. (1)

స్వామీ ! అల్లుఁడు గోడలగుట చిత్రము కాదా ? దానిభావంబు వివరింపుఁడు. తెలిసికొని యాపండితులకుం జెప్పెద. మఱియు నీగ్రామమునం గలవిశేషంబుల సొంతముగాఁజూచి వచ్చెద ననియడిగిన నయ్యతిపతి రత్నప్రభావంబునఁ దదుదంత మాకలించుకొని గోపా ! యీశ్లోకపాదమువలన నద్భుతకథాసందర్భగర్భితం బగుసప్తమిత్రచరిత్ర మనునుపాఖ్యానము స్ఫురించుచున్నది. అది నీ వింతకు మున్ను విన్నకథలకన్నఁ జాల చమత్కారముగా నుండు నవహితుండవై యాలకింపుము.

- దత్తుని కథ. -

సీ॥ తెలితమ్మిపూవురే ◆ కులమించు సోగ క
                 న్నులు మోమునకువింత ◆ చెలువుగూర్ప
      నరచందరుని మేల ◆ మాడునెన్నుదుట ది
                 ద్దిన విభూతులబ్రహ్మ ◆ తేజమెదుగ
      నీర్కావివలువ వ ◆ న్నియకుందనమువంటి
                యొడలిచాయకుఁగ్రొత్త ◆ యొఱపుగొలుప
      బహుళ శాస్త్రామ్నాయ ◆ పఠనచిహ్నితములై
                యోష్ఠముల్ దీప్తి సం ◆ యుక్తి నెసఁగ

గీ. నవనిఁ గుమ్మఱవచ్చిన ◆ యతనుఁడో జ
    యంతుఁడొ కుబేరపుతుఁడో ◆ యబ్జుఁడో వ
    సంతుఁడో యనఁదగి బ్రహ్మ ◆ చారి యౌవ
    నాంకురాలంకృతాంగ కుం ◆ డైనవాఁడు.

ఒకానొక బ్రాహ్మణ కుమారుండొక మహారణ్య మధ్యంబున వసించి యిట్లుతలంచెను.

ఆహా ! నేను గాశీపురంబునుండిబయలుదేరి యిరువది దినములైనది. మొదటనాలుగైదు పల్లెలు మాత్రము గనంబడినవి. తఱువాత నీమార్గమంతయుఁ గాంతార భూయిష్ఠమై యొప్పుచున్నది. ఎన్నిదినములు నడచినను నీయడవికిఁదుదిమొదలు గనంబడకున్నది. తెచ్చిన యాహారపదార్థము లైపోయినవి. యెన్ని నాళ్ళు ఫలములుదిని సంచరింతును. ఎన్ని రాత్రులు చెట్టుకొమ్మలసందునఁ బండుకొందును ? వెనుకటివలెనే ప్రొద్దు గ్రుంకకపూర్వ మేచెట్టోయెక్కక నేఁడు దాపునఁ దెరపి కనంబడుటచే గ్రామముండునని యాసతోఁ బ్రొద్దుపోవువఱకు నడచితిని. ఇప్పు డంధకారబంధురంబై లతాగుల్మాదులచే నావృతమై మన్నును మిన్నును దెలియకున్నవి ఏమిచేయుదును ఈరేయిఁ గ్రింద వసించితినేని మృగములు హింసింపకమానవు. ఇది మనుష్యులు సంచరించు మార్గముగాదు. తెలియక నీత్రోవంబడితిని. భవితవ్యమెట్లున్నదో తెలియదు. అని విచారించుచు నలుమూలలు పరికించుచుండెను.

అల్లంతదవ్వులో నెత్తుగానొక దీపమతని చూపులకు మురిపెము గలుగఁజేసినది. ఒకమారు తళుక్కుమని మెఱయుచు నొకసారి మినుకుమినుకుగాఁ గనంబడుచు నొకతేప నదృశ్యమై యంతలోఁగనంబడుచున్న యాదివ్వె తేజము పరీక్షించి యతండు వెఱఁగుపాటుతో నాహా ! జనసంచార శూన్యమగు నీయడవినడుమ నీదీపముండుటకుఁ గారణమేమి? ఆ తేజమున్న తావు పర్వతమో ప్రాసాదమోకావలయును. క్రీడాసౌధంబు గట్టించుకొని యివ్వనములో నెవ్వరైన నివసించి యుండిరేమో ? జనులుండినంగాని దీపముండదు. శ్రమమైననగుంగాక ఈరేయి నాదీపమున్న తావునకుంబోయి చూచెద నేమైనను సరేయని నిశ్చయించుకొని యతం డాదీపమును లక్ష్యముగాఁ జేసికొని యా దెసకు నడుచుచుండఁ గ్రమోన్నత భూమివలన నది యొకకొండయని తెలియఁబడినది.

చేతులతో నానుచు గంటకపాషాణబాధం దప్పించుకొనుచు నల్లనల్లన నెగఁబ్రాకుచుండెను. ఆ తేజము దాపున నున్నట్లేయుండి యెంతసేపు నడచినను నట్లే కనంబడుచుండును. ఆకటికి చీకటిలో ధైర్యమే సహాయముగా నతండా దీపమువెలుఁగు ననుసరించి క్రమోన్నతంబగు నన్నగం బెగ ప్రాఁకిప్రాఁకి పెద్దతడవునకుఁ దన్నికటంబుఁ జేరెను. సాంద్రశిలాఘటిత కుట్టిమంబగు సమతలంబుచేరి యతండు దానువచ్చిన దేసంబరికించుచు ఝల్లరీధ్వానభీకరంబగు నంధకారంబు గాక యొండుగానక గుండెపైఁ జేయివైచుకొనుచు అన్నన్నా ! తేజో లక్ష్యంబునంగానక యీకటికిచీఁకటిలో నీప్రదేశంబుఁజేర శక్యమా ? దైవమే నన్నిందుఁజేర్చెను. ఇందలి ప్రసూనముల వాసన లపూర్వ నాసాపర్వము గావించుచున్నవి. మండలాధిపతి యెవ్వండైనఁ గ్రీడా శైలముగాఁ జేసికొని యిందు విహరించుచున్నవాడా? ఔను. సందియములేదు. అది విద్యుద్దీపప్రభ. గుహాంతరమున నమర్పఁబడియున్నను గవాటదర్పణంబునం బ్రతిఫలించి దీప్తి జాలంబు పైకి విరజమ్ము చున్నది.

ఇందు మహారాజులో దేవతలో వసియించియుండిరి. గుహా మందిర కవాటంబులు తెఱవఁబడియున్నవి. లోనికింబోయి వింతలం జూచెదంగాక యని తలంచుచు మెల్లమెల్లన నడుగులిడుచుఁ బొంచి పొంచి చూచుచు నాగుహలోనికిఁ బదిబారలు పోయెను. ప్రక్కగా ద్వారముగల యొకగది కనంబడినది. దానికవాటము లించుక చేరవేయఁబడియున్నవి. లోపల మణిదీపములు వెలుగుచుండెను. అప్పు డత్యంత సాహసముతో నతండు తలుపులు త్రోయక మెల్లగా వివరములనుండి లోపలికిఁ దొంగిచూచెను.

దివ్యాలంకారశోభితంబగు నక్కందరమందిరాభ్యంతరమున రత్న పర్యంకమున నొక యక్షుండు యక్షిణి నక్కు నం జేర్చుకొని ముద్దాడుచుండెను.

యక్షిణి - మనోహరా ! మన వియోగకాలము సంవత్సరమే యైనను యుగాంతరము లైనట్లైనది. అబ్బా! ఆమాట దలంచుకొనిన మేనుజల్లుమనుచున్నది. కుబేరుని కేమి యపరాధముఁ జేసితిమని యట్టి శాపమిచ్చెను.

యక్షుఁడు - కుబేరుండొక నాఁడొక సౌరనారీమణిని వరించి యమ్మించుఁబోఁడిం దీసికొనిరమ్మని నాకు నియమించెను. నేనింటికి వచ్చి భవదీయాధరసుధారసపాన మత్తుండనై యావృత్తాంతముమఱచి యందుఁ బోయితినిగాను. క్రీడాభిరతి నఱుగలేదని యెఱిఁగి విరహాతురుండై రాజరాజు చిత్రకూట పర్వతంబునఁ బండ్రెండు మాసములు వసించి యలకాపురంబు జేరకుండునట్లు శిక్షవిధించెను.

యక్షిణి - అదియా? కారణము ఆహా? ఆమహాపత్సముద్రము నెట్టుతరించితిమో తెలియదు. పోనిండు మనమిల్లును వాకిలిని విడిచి యెంతకాలమిందుండవలయును.

యక్షుఁడు — ఆధూర్తకుబేరుని సేవసేయుట నాకిష్టములేదు. అందుండిన నేవియో లేనిపోనిపనులు సెప్పి తప్పులుగణించుచుండును. ఈగుహాంతర మత్యంతరమణీయమై యున్నది. మనయింటనున్న వస్తు సముదాయమెల్ల నిందుతెచ్చితిమిగదా? ఇది యేకాంత ప్రదేశము. క్రీడాయోగ్యమైయున్నది. ఇందేయుందము.

యక్షిణి - పోనీమనము మఱియొక దేవతానగరమునకుఁబోయి సుఖింపరాదా ? యీ యరణ్యములో వసింపనేల?

యక్షుఁడు - కుబేరశాపంబుస దేవలోకనివాసమున కహన్‌త పోయినది. పగలెల్ల భూసంచారము సేయుచు విశేషములం జూచివచ్చి రాత్రుల నీ కెఱింగింపుచుందును. ఇదియే? సుఖింపఁదగిననెలవు.

యక్షిణి - మనోహరా! విశేషములనిస జ్ఞాపకమువచ్చినది. నేడు సాయంకాలమునఁ బదిలముగా మూటగట్టికొని వచ్చితిరి. అదియేమి? యక్షుఁడు - ఓహో! నీకు మంచిసంగతిచెప్పుట మఱచితినే. వినుము అది మన చరిత్రము మేఘసందేశమను గ్రంథము ఒకగ్రామములో విద్యార్థులు నల్లించుచుండఁదిరోహితుండనై దాపునకుఁబోయి యాగ్రంథమంతయు భూజన్ పత్రములమీఁద వ్రాసికొని వచ్చితిని. మొదటి శ్లోకము వినుము.

శ్లో॥ కశ్చిత్కాంతా విరహగురుణాస్వాధికారాత్ప్రమత్తః
     శాపేనాస్తంగమిత మహిమావర్ష భోగ్యేణభర్తుః।
     యక్షశ్చ క్రేజనకతనయాస్నాన పుణ్యోదకేషు
     స్నిగ్ధచ్ఛాయాతరుషువసతింరామగిర్యాశ్రమేషు॥

యక్షిణి - అవును. ఇప్పుడు మీరు చెప్పిన శాపవిధానమంతయు దీనిలోనున్నది. మేఘసందేశమన నేమి?

యక్షుఁ డు— నేనప్పర్వతముపైఁ గుబేర శాపగ్రస్తుండనై యున్నంత మేఘోదయమైనది. ఆ మేఘముచేత నీకు సందేశమంపితిని. అంచులకే దానికాపేరు పెట్టెను.

యక్షిణి — ఏదీ మఱియొకశ్లోకము తీసి చదువుఁడు?

యక్షుఁడు – నీకుస్పష్టముగాఁ దెలియగల దీశ్లోకమువినుము.

శ్లో|| తత్రాగారం ధనపతిగృహా నుత్త రేణాస్మదీయం
     దూరాల్లక్ష్యంసురపతిధను శ్చారుణా తోరణేన ।
     యస్యోపాంతే కృతకతనయః కాంతయా వర్ధితోమే
     హస్త ప్రాప్య స్తబకనమితో బాలమందారవృక్షః ॥

అనినేను మేఘునితో మనయింటిగురుతులు చెప్పితిని.

యక్షిణి - మనయిల్లు కుబేరుని యింటికుత్తరముగా నున్నట్లును మనదొడ్డిలో గుత్తులచే వంగియున్న మందారవృక్ష మున్నట్లు మీరు చెప్పుచుండ నతఁడువినెనా ? లేక యెప్పుడైన మసయింటికి వచ్చి చూచెనాయేమీ ? ఆకవికెట్లు తెలిసినది ? మీరు మేఘునితోఁ జెప్పు చుండ నాప్రాంతమందుండి వినెనేమో ? యక్షుఁడు — చాలుచాలు అమ్మహారణ్యమధ్యమునకు మనుష్యులు రాఁగలరా ? ఆకవి దైవశక్తిగల వాఁడఁట వినుము ఇంతకన్న రహస్యమైన విషయము వర్ణించెను.

యక్షిణి - ఏదీ ? చదివి వినిపింపుఁడు.

యక్షుఁడు -

శ్లో॥ భూయ శ్చాహ త్వమపి శయనెకంఠలగ్నా పురా మె
      నిద్రాం గత్వా కిమపి రుదతీ సుస్వరం విప్రబుద్ధా
      సాంతహాన్ సం కథిత మస కృత్పృచ్ఛత శ్చ త్వయా మె
      దృష్ట స్వప్నె కితవ ! రమయ న్కా మపి త్వం మ యేతి !

నీవల్ల నాఁడురాత్రి నిద్రబోవుచు లేచి వెక్కి వెక్కి యేడ్చుచుండ నేను గారణమేమని పలుమారడుగ నీవునవ్వుచు వంచకుఁడా! మఱియొకకాంతతో నీవు రమించుచున్నట్లు స్వప్నములోఁ గనంబడితివి అందులకని చెప్పితివి. ఈరహస్యము మనయిరువురకుఁగాక యొరులకుఁ దెలియదు. నేనది యానవాలుగా నీతోఁ జెప్పుమనిమేఘునితో పలికితిని ఆమాటయే యీకవి వర్ణించెను.

యక్షిణి — మీరేమన్నను సరియేకాని మీరామేఘునితోఁ జెప్పుచుండ నాకవి వినెను. లేనిచో యెట్లు వ్రాయఁగలఁడు.

యక్షుఁడు – అయ్యో ! నీకుఁ జెప్పినం దెలియకున్న దేమి ? ఆపర్వతమందు మనుష్యు లెవ్వరును లేరు. నేనొక్కండనేయుంటిని అతండు మహర్షితుల్యుఁడు త్రికాలవేదియనిచెప్పిరి ?

యక్షిణి - మహానుభావుండైన యాకవీంద్రుని పే రేమియో తెలిసికొంటిరా?

యక్షుఁడు - ఈగ్రంథమందే వ్రాయబడియున్నది. మహాకవి కాళిదాసకృతౌ మేఘసందేశే ! అని

యక్షిణి - ఆతడెందుండును ? యక్షుఁడు -- భోజునియాస్థానకవియఁట ఆ నృపతిచెంత-

యక్షిణి - భోజుఁడన నెవ్వఁడు?

యక్షుఁడు -- ఆతనికీర్తి కిన్నరులు పాడుచుండ వినలేదా? మఱచితివికాఁబోలు! ధారానగరాధీశ్వరుఁడు మహావదాన్యుఁడు.

యక్షిణి — అట్టి పుణ్యాత్ములంజూచి వచ్చితిరా ?

యక్షుడు - చూడలేదు. ఎప్పుడోసోయెద.

యక్షిణి — ఆగ్రంధమంతయుఁ జదివి వినిపింపరా ?

యక్షుడు - ఇప్పుడు ప్రొద్దుపోయినది. ఱేపు వినిపించెద నేదీ? ఆహా! అనిపలుకుచు యక్షుండా యక్షిణితో శృంగార లీలా తరంగితాంతరంగుండై యనంగ క్రీడలనానందించి యక్షిణితన్ననుసరించి రా వాయుసేవకై యీవలకువచ్చుచు ద్వారదేశంబుననున్న యా విప్రకుమారునిం గాంచి భయసంభ్రమలజ్జాలోలచేతస్కయై యక్షిణి దిగ్గునలోనికింబోవ యక్షుండతని నదలించుచుఁ జేయిపట్టుకొనియోరీ ! నీనెవ్వండవు? ఇందేలవచ్చితివి ? దొంగవలెనిందుఁబొంచుంటివేల? నిజము చెప్పుము. అని యడిగిన భయపడుచు నతండు నమస్కరించి యిట్లనియె.

గీ॥ దత్తుఁడనువాఁడ మాధురాత్మజుఁడ నేను
     పాటలీపుత్రనగర సంభవుఁడనందుఁ
     జదివితినిగొంత యొజ్జలసముఖమందుఁ
     గడమవిద్యలఁదెలియ నుత్కంఠగలిగి.

ఉ॥ శ్రీకరజాహ్నవీవిమల శీకరపూతతటస్థితోరువి
      ద్యాకరసుప్రసంగనినదాంచితమద్రి కుమారికా కృపా
      లోకనభావితేష్టనర లోకము శాశ్వతవిశ్వనాథలిం
      గైకపవిత్రభూమి యమృతాశినివాసము కాశికేగితిన్.

అందు మహామహోపాధ్యాయ బిరుదమువహించి పదివేలమంది శిష్యులకుఁ బాఠముఁజెప్పుచున్న క్షేమేంద్రుఁడనునుపాధ్యాయునొ ద్ద కరిగి నమస్కరించి యెదుర నిలువంబడియున్న నన్నుఁ జేరంజీరి నీవెవ్వండ వేమిటికి వచ్చితివని యడిగిన మదీయోదంత మెఱింగించి విద్యార్ధినై వచ్చితిని. విద్యాదానంబు గావింపుఁడని కోరికొంటి నతండు నాచదివిన విద్యలం బరీక్షించి సంతసించుచుఁ దన విద్యార్ధులలో నాతో సహాధ్యాయుఁడుగా నుండ నెవ్వడు సమర్థుడోయని శిష్యులనెల్ల నాతో బ్రసంగింపఁజేసెను. అందఱుఁ గాందిశీకులైరి. మఱియు వారిలో,

క॥ చారాయణుండు మఱి కుచు
     మారుడు ఘోటకముఖుండు మఱిగోనదీన్
     యోరుమతి గోణికాసుతుఁ
     డారయఁగ సువర్ణ నాభుఁడనువిప్రసుతుల్.

సమానవయో రూపమనీషాకౌశలురగు నీ యార్వురుమాత్రము నాతోఁ బ్రసంగింప నిలువంబడిరి. ఆయొజ్జలు సంతసించుచు నయ్యార్వుర నాకు సహాధ్యాయులుగాఁ జేసి యచిరకాలములో సమస్తవిద్యాపారంగతులఁ గావించెను. మేమేడ్వురము సహాధ్యాయులైనది మొదలొక గడియయైన విడిచియుండలేక యేకదేహమట్లు మెలఁగుచు నత్యంతమైత్రితో విద్యలఁ బూర్తిజేసి దేశపర్యటన లంపటులమై తలయొకదారిం బోయి నానాదేశవిశేషంబులఁజూచుచు సంవత్సరమునాఁటికి ధారానగరంబునం గలసికొనునట్లు నియమము చేసికొంటిమి. నేనొక మార్గంబునఁబడి పోవుచు దారితప్పి యిమ్మహారణ్యము జేరి నేటిరాత్రి తేజోలక్ష్యంబున నిక్కడకు వచ్చితిని. మీరు యక్షుదంపతులని మీమాటలవలనం దెలిసికొంటి ననుగ్రహించి దారియెఱింగించినఁ బోపువాఁడ నభ్యాగతుం గాపాడుఁడని ప్రార్థించినవిని కనుఁగవగెంపుగదుర యక్షుం డిట్లనియె.

క॥ మిగులంజదివియు నాలియు
     మగఁడును గ్రీడింపఁబొంచి మర్మంబులఁ జూ

డఁగ డివితిరి కావున నీ
మగతన ముడుఁగంగ మెలఁగుమా సతి వగుచున్.

నీవు విద్వాంసుఁడవు బ్రాహ్మణుఁడవు కావున నింతటితో విడిచితి పో పొమ్ము; అని శపించిన బరితపించుచు దత్తకుండు—

చ. చతురత నెన్నియేని గురుశాస్త్రముల న్సకలాగమార్థసం
శ్రితపరమార్థభావము లెరింగితి వాదము సేయ భోజభూ
పతి సభ కేగుచుంటి నురుభావ! యెరుంగక దారి తప్పి వ
చ్చితి నపరాధ మే నెరుఁగ జిత్తమునం బరికించి చూడుమా.

మహాత్మా! ఆపన్నుడనై మీయాపన్నమునకు వచ్చితిని. రక్షింపక శిక్షింపఁదగునే? యక్షులు దయాదాక్షిణ్యములు గలవారని విందుము. నాయం దనుగ్రహముఁ జేసి శాపము గ్రమ్మరింపుడు. మదీయవిద్యాపఠన మంతయు రిత్తవోవ నాడుదాన నై తిరుగంజాల రక్షింపుడని పాదంబులం బడి వేఁడుకొనుటయు ననుకంపాసంభృతహృదయుండై గుహ్యకుండు.

గీ. భూమిసుర! నాదుశాప మమోఘ మగు
నొండువత్సర మింతియై యుండు వందు
తొంటికళలెల్ల స్ఫురియించుచుంట నీకు
నమరు సౌఖ్యంబు మగవాఁడ వగుదువంత.

ఇంతకన్న సదుపాయంబు సేయనోపను. నీ విందుండ కవ్వలికిఁ బొమ్ము. అనుటయు దత్తుండు.

క. ధారానగరాంతిక మేఁ
జేరుదనుక నాఁడుతనము పొందకుండగ
గారుణ్యము సేయుము దు
ర్వారప్రారబ్ధ మనుభవము గాకున్నే.

అని కోరిన విని యక్షుం డట్ల కాగలదు. మాయున్నయునికి నెవ్వరికైనం జెప్పితివేని శాపవిముక్తి బడసినను గ్రమ్మఱ నాడుదానవై పూర్వస్మృతి లేక సంచరింతువు సుమీ. ఇది యెఱింగి మెలంగు మదియే మార్గం బాదారిం బొమ్మని యానతిచ్చి యక్షుండు గుహాంతరంబున కరిగెను.

దత్తకుండును యక్షనిర్దిష్టమార్గంబున నగావతరణంబు గావించె. నప్పటికి దిక్కులు తెలతెలవారుచుండెను.

తేరు వేరుపడి కనంబడుచుండెను. అతం డొకదారిం బడి నడుచుచు ఆహా! దైవమును మీరినవాఁ డెవ్వఁడును లేడు. విధి మెడకు ద్రాడుగట్టి లాగికొనిపోయి ప్రారబ్ధ మనుభవింపజేయును. కానిచో నంధకారబంధురంబైన యర్ధరాత్రంబున బహుకంటకలతావృతంబగు నన్నగం బెట్లెక్కగలను? ఎక్కినను నొక్కచకి వసియింపక తలుపుసందులనుండి తొంగిచూడనేల? చూచినంతనే మన్నింపక యక్షుం డట్టి శాప మీయవలెనా? అయ్యో! ధారానగరంబునకుం బోయి కాళిదాసాదిపండితులతో బ్రసంగించి యెంతయో ఖ్యాతి సంపాదింపవలయునని తలంచితిని—విద్యలు స్ఫురించుచున్నను నాడుదాననై యేమి చేయగలను, వయసుకాండ్రు వెనువెంట దిరిగి యేమి మోసము గావింతురో, అని పెక్కుగతుల విచారించుచు నంతలో నాకింత విచార మేటికి? ధారానగరము చేరినప్పుడు గదా? నే నాడుదాన నగుట! అందుబోకున్న శాపానుభవమున కవకాశమే లేదు. కావున మరియొకదేశమునకుం బోయెద. మిత్రులు నానిమిత్తమై యందు వేచియుందురా? కానిమ్ము మరియొకలాగును వర్తమానము గావించెదనని నిశ్చయించి యతండు పోవుచుండెను.

అట్లు కొన్నిదినములు పయనము సాగించి యొకనాడు పెద్దదూరము నడచుటచే మిక్కిలి యలయిక చెంది నడువలేక యొకచెట్టునీడ నిలువంబడి చెమ్మట కార్చుకొనుచు సీ! సీ! నేను బయలుదేరిన

వేళ మంచిదికాదు. చెడుదారింబడితిని నడుమ దండకారణ్యములే కాని మంచి జనపదం బొక్కటియుఁ గనంబడలేదు. ఇది యేదేశమో తెలియదు. ఈదారి యెక్కడికిఁబోవునో చెప్పువారులేరు. యక్షశాప ప్రవృత్తి యెట్లు పరిణమించునో యెఱుగను తనశాపం బమోఘమని యతండానతిచ్చి యున్నవాఁడు ఆయూరికిఁబోవకున్నఁ దప్పునా ? కానిమ్ము కానున్నది కాకనూనదు. అని యాలోచించుచు మార్గము దెసఁ దనచూపులు వ్యాపింపజేసెను.

అప్పు డామార్గములో నేదియోమృగము దనదెసకుఁ బరుగెత్తికొని వచ్చుచున్నట్లు కనంబడినది. జడియుచు నతం డాచెట్టుపైకెక్కి కొమ్మలసందున నణగి యుండెను. అంతలో జీనుగట్టినగుఱ్ఱమొకటి వచ్చి యాచెట్టుక్రిందనే నిలువంబడినది. దానినిఁజూచి దత్తుండు సంతోషాయత్తచిత్తుఁడై ఔరా ! దీని నడవిమెకమనుకొని జడిసితిని. కల్యాణ లక్షణోపేతమగు నీవీతి యేనృపసూతిదో కావలయును. అనర్ఘములగు కనకమణినికరములచే నలంకరింపఁబడియున్నది. ఇది ఖలీనము ద్రెంచికొని పారిపోయి వచ్చినది. ఈప్రాంతమందేదియో నగరమున్న దికాఁబోలు అని తలంచుచు మెల్లన నాచెట్టుదిగి యాగుఱ్ఱమును మచ్చికచేసి జూలుదువ్వుచు మోమున వ్రేలగట్టిన బంగరుపట్టికం బరీక్షించి రుక్మిణియను విలాసముండుట తెలిసికొని యక్కజమందుచు నిదిస్త్రీలెక్కు తత్తడి యందుల కే జీను విలక్షణముగా నున్నది. ఏది యేమైనను నడువలేక బడలియున్న నాకీయశ్వమును సర్వేశ్వరుఁ డే తెచ్చియిచ్చెను. దీనినెక్కి యెక్కడికో పోయెద నేదియోయొకటి కాఁగలదని నిశ్చయించి క్రిందికి వ్రేలాడుచున్న కళ్ళెముపట్టుకొని వీపుపైఁ జరచుటయు నదికదలక బెదరక త్రోక నాడించుచు సకిలించినది -

అతండది శుభసూచకమని తలంచి ఱివ్వుననెగసి దానిపై కెక్కి కళ్ళెములాగి మడమలతో నించుకగొట్టి యదలించినంతనాగంధర్వంబు ఱెక్కలుగలదివోలె నతిజవంబునం బరుగిడుచు నాస్కందిత ధోరతికాది గతివిశేషములంజూపుచు వచ్చినదారిం బోవుచుండెను. దత్తుండు కళ్ళెము బిగలాగి యాహయరయం బుడుపవలయునని యెంత ప్రయత్నించినను నదియాగినదికాదు. మహావేగముగాఁ బోయిపోయి రెండు గడియలలో భోజరాజ రాజధానియగు ధారానగరము సమీపోద్యానవనంబు జేరినది. అని యెఱిగించి, వేళ యతిక్రమించుటయు మణిసిద్దుం నవ్వలికథ దరువాతి మజిలీయం దిట్లు చెప్పఁ దొడంగెను.


143వ మజిలీ.

భోజుని కథ.

భోజరాజునకు నలువురు భార్యలని వెనుక తచ్చరిత్రంబునఁజెప్పి యుంటినికదా. వారినల్వురయందు సమాన ప్రతిపత్తిగలవాఁడై నను లీలావతిచేయు నుపచారములంబట్టియుఁ దొలుత నడవులఁ బెక్కిడుమలంబడి తన్నొడయనిగాఁ బడసినదగుటయు నామెయంతఃపురమునఁ దఱుచుగా వసించుచుండును. ఆసాథ్వీరత్న మత్యంత భక్తివిశ్వాసములతో భర్తనారాధించుచుండెను. భార్యలకంటెఁ బుత్రులకంటెఁ గాళిదాసకవియం దాభూభర్త కధికప్రీతి కలిగి యున్నది. ఆకవి శిఖామణింజూడ నొక యామ మెడమైనచో యుగాంతరములైనట్లు చింతించుచుండును. సభయందేకాక యాహారవిహార శయనాసనముల యందుఁగూడ నతండాపండితునివిడిచి యుండనేరఁడు. తాను లీలావతి యంతఃపురమునకుఁ గూడ కాళిదాసుందీసికొనిబోవుచుండును. అయ్యంబుజాక్షియు బ్రత్యక్షముగా నాకవితో సంభాషింపదు గాని భతన్‌సమక్షమున బెనిమిటితోఁగూడ సమయోచితములైన యుపచారములఁ గావించుచుండును. విసరుమనియు మడుపులందిమ్మనియు శయ్యఁగల్పిం