Jump to content

కావ్యాలంకారచూడామణి/తృతీయోల్లాసము

వికీసోర్స్ నుండి

తృతీయోల్లాసము

————

క.

శ్రీలోలాభీలాయత, కోలధ్వజుఁ గుపితయువతికుసుమధ్వజుఁ జి
న్మూలస్థితవృషభధ్వజుఁ, దాలధ్వజు నుగ్రసమరతత్పరకేలిన్.

1


శా.

శృంగారాదిరసోదయంబునకు సంసిద్ధాస్పదం బైన త
ద్రంగన్నాయకనాయికానిచయముం దత్తద్గుణశ్రేణిచేఁ
[1]బొం గార న్వివరింతు నేర్పడ సముద్భూతప్రబోధాత్ము లె
ల్లం [2]గేడింపక యాదరింపుఁడు, దృఢోల్లాసంబు శోభిల్లెడున్.

2

నాయకుఁడు

సీ.

శిష్టకులీనత శీలంబు శాస్త్రార్థవేదితప్రజ్ఞావివేకబుద్ధి
యౌవన ముత్సాహ మాత్మదృఢత్వంబు వినయంబు దక్షత వితరణంబు
శౌచంబు శౌర్యంబు జనతానురాగంబు సత్యంబు ధర్మంబు సత్ప్రియోక్తి
మానంబు తేజంబు మాధుర్యవృత్తంబు వాఙ్మితబహుకలావాసనాప్తి


తే.

స్మృతి కృతజ్ఞత [3]దూషణ మేళనంబు
ధార్మికత్వంబు సౌభాగ్యదశ యనంగ
[4]వెలయుగుణములు విశ్వేశవిభుఁడపోలెఁ
దనరుభూపతి నాయకత్వము వహించు.

3

నాయకభేదములు

క.

ధీరోదాత్తుండును మఱి, ధీరోద్ధతసంజ్ఞకుండు ధీరలలితుఁడున్
ధీరప్రశాంతుఁడును బెం, పారెడు నాయకులు నలుగు రయ్యైగతులన్.

4

ధీరోదాత్తుఁడు

క.

ధీరుఁడు గంభీరుఁడు సత్కారుణ్యుఁడు నస్వయంకృతస్తుతి నిరహం
కారుడు నగునాయకుఁ డిల, ధీరోదాత్తుండు నాఁగ ధృతిం బెంపారున్.

5


ఉ.

మ్రోయనివార్ధి నెత్తురుల బ్రుంగనిరాముఁడు వంకవిల్లుగాఁ
జేయని పైఁడికొండ [5]తనుఁ జెప్ప మదింపని పెద్ద యెట్టిచోఁ
బాయనినిక్కువంబులకుఁ బట్టు ధరిత్రిఁ జళుక్యవిశ్వభూ
నాయకుఁ; డమ్మహాగుణసనాథు నుదాత్తత యొప్పు నెప్పుడున్.

6

ధీరోద్ధతుఁడు

క.

అతికోపనుఁ డతిమత్సరుఁ, డతిగర్వసమేతుఁ డత్యహంకారబలా
న్వితుఁ డాత్మశ్లాఘోదయ, చతురుఁడు ధీరోద్ధతుండు చంచలుఁడు మతిన్.

7

మ.

ధర సర్వంకషగర్వముం బిరుదమాత్సర్యప్రవిధ్వంసమున్
[6]బరభూపాలపలాయనప్రకట్టనప్రౌఢంబుఁ గ్రోధోదయా
కరముం గ్రూరము నై చళుక్యవిభు నుగ్రవ్యగ్రకేతుస్థితాం
బరఖేలత్కరవాలభైరవసురూపం బొప్పుఁ బోరాటలన్·

8

ధీరలలితుఁడు

క.

స్మరభీతుఁడు మానవతీ, పరవశుఁడును భోగలోలుపవ్రతుఁడును సుం
దరుఁడును నయ్యెడు నాయకుఁ, డరయంగా ధీరలలితుఁ డన విలసిల్లున్.

9


చ.

[7]అరు దగురాజ్యతంత్రము [8]నయప్రియుచేతికి నిచ్చి విశ్వభూ
వరుఁ డఖిలాంగసుందరియు వారణయానయు నిత్యదృఙ్మనో
హరయును నై తనర్చువిజయాంగనతోడిద లోక మై నిరం
తరము సుఖించుచుండు నవదర్పకుఁ డై సుధ గర్వ మేర్పడన్.

10

ధీరశాంతుఁడు

క.

సుభగుఁడు శుచియు వివేకియు, నభిమానియు మృదువు [9]సద్ద్విజాతులవంశ
ప్రభవుండును [10]నగునాయకుఁ, డభిమతముగ ధీరశాంతుఁ [11]డనఁ బొగడొందున్.

11


ఉ.

శ్రీయుతు లై యశేషసమచేతను లై వివిధాగమాదివి
ద్యాయతనంబు లై రసికు లై సుఖు లై తరుణీవిహారపు
ష్పాయుధు లై చరింతురు ధరామరు లట్టుల కారె రాజనా
రాయణదేవుచేఁ బడిన నచ్చెరువే యభిరామసంపదల్.

12

శృంగారనాయకులు

క.

ఈనలువురు రసనవకస, మానస్థానముల జననమహిమంబులకున్
మానుగ శృంగారరసా, ధీనులు మఱి నలుగు రండ్రు తెలియఁగ వలయున్.

13


క.

వనితావిహరణదశలం, దనుకూలుఁడు శఠుఁడు దక్షిణాఖ్యుఁడు ధృష్టుం
డును నన నలుగురు నాయకు, లనయము శృంగారమునకు నర్హులు చెప్పన్.

14

అనుకూలుఁడు

క.

ఏకవధూరక్తుండై, యేకొఱఁతయు లేక సమసమీహితగతులన్
గైకొని మెలఁగెడు నాతఁ డ, నాకులుఁ డనుకూలనాయకాఖ్యం బడయున్.

15


శా.

సద్రాగాన్వితగా నొనర్చుఁ గరసంచారోపచారంబులన్
భద్రశ్రీపరిలిప్తఁ జేయు సుమనఃపర్యాప్తఁ గావించు యు
క్తద్రవ్యప్రతిపత్తిచే వసుమతింగాఁ జాలఁ బాలించు ని
ర్ణిద్రప్రీతిఁ జళుక్యనాథుఁడు ధరిత్రీకాంత నెల్లప్పుడున్.

16

శఠుఁడు

క.

ఒరు లెఱుఁగకుండ నప్రియ, కరుఁడు శఠుం డనఁగఁ బరఁగుఁ గడుఁగపటకళా
కరుఁడు నిజప్రియవనితా, పరితాపప్రదుఁడు క్రియలఁ బరికింపంగన్.

17


ఉ.

వల్లభ యైన[12]కీర్తిసతివార్తల నిమ్ముల వించు విశ్వభూ
వల్లభుఁ డర్థ మర్థులకు వావిరి నిచ్చుట కీరసంబు సం
ధిల్లదు [13]లచ్చి కేయెడలఁ దీయపుఁజూపులలోనఁ గెంపు రం
జిల్లున కాక, [14]ధీరలకుఁ జిత్తమునం దొకవింత కల్గునే.

18

దక్షిణుఁడు

క.

పెక్కండ్రు ప్రియలయందున్, జక్కనిమొగమాట యొక్కచందంబున నిం
పెక్కిన దక్షిణనాయకుఁ, డక్కజ మెఱుఁగంగవలయు నది చతురులకున్.

19


మ.

అరు దెం దైనఁ జళుక్యవిశ్వవిభు నెయ్యం బొక్కచందంబునం
గర మొప్పారుచు నుండు సైంధవిపయిన్ గాంధారిపై నించు
ఘూర్జరిపై మాళవిపై [15]వరాళికపయిన్ సౌరాష్ట్రిపై [16]గౌడిపై
సరి [17]నీమాట లరాతిరాజతనయా శంకామతిం జేయుచున్.

20

ధృష్టుఁడు

క.

స్పష్టాపరాధపిశునుఁడు, దృష్టాన్యారచితరతుఁడు ధృష్టుం డగు; సం
దష్టాధరాదిదర్శన, పుష్టవధూకోపుఁ డభయభూతుం డెపుడున్.

21


చ.

ఒరసి చళుక్యభూపతికి నోడినవైరికిఁ గాననంబులోఁ
గరిమదగంధము ల్గుటిలకంటకరేఖలు ఘర్మితాంగముల్
సురతవికారలీలఁ దలచూపినఁ దత్సతి యల్కఁ జెందె; ద
ద్వరుఁడునుఁ దేటగాఁ దెలిపె; వక్రత నమ్మద యెన్ని చెప్పినన్.

22

శృంగారనాయకసహాయులు

తే.

[18]పృథివి నేతత్సహాయులు పీఠ మగ్గ
విట విదూషక చేటక విదితనాము
లోలి నలువురు; వీరి యయ్యుచితగతులు
వలయుఁ దెలియంగఁ దద్గుణవర్తనముల.

23


తే.

పీఠమర్దుండు [19]దగుఁ గార్యపేశలుండు,
వాని కించుక తక్కువవాఁడు విటుఁడు,
[20]తొడఁగి నవ్వించునేని విదూషకుండు,
చేటకుఁడు సంధికల్పనసిద్ధికరుఁడు.

24

నాయికలు

శా.

శృంగారప్రథమప్రభాసకము లై చెన్నారుశోభాదులన్
బొంగారం బ్రకటిల్లు నాయికల యుద్భూతప్రకారంబులన్

రంగల్లక్షణలక్ష్యవృత్తిఁ గని లో రాగిల్లు [21]టొప్పున్; మద
త్వంగన్నీరసవాదరోషములచేతం గల్గునే సౌఖ్యముల్.

25


క.

నాయికలు స్వకీయయుఁ బర, కీయయు సాధారణియును గీర్తిత లగుదుర్,
పాయక వారలవలన [22]గు, ణాయత్తార్థములు గలుగు; నవి యెఱుఁగఁ దగున్.

26

స్వీయ

క.

సతియును శీలార్జవసం, గతయుం గులవతియు నఖిలకల్యాణగుణా
న్వితయును లజ్జాళువు నగు, నతివను రసికులు స్వకీయ యందురు కృతులన్.[23]

27


క.

కులవతియును [24]శీలార్జవ, కలికయు సతియును నశేషకల్యాణగుణో
జ్జ్వలయును లజ్జాళువు నగు, నలినీలకచన్ స్వకీయ యందురు కృతులన్.

28


చ.

అలఘుచరిత్రలున్ శుభగుణాన్వితులున్ గురుబంధుమిత్రవ
త్సలలును దర్పహీనలును ధర్మవిధజ్ఞలు రూపసంపదా
కలితలు నైనదారికలఁ గానిక లిత్తురు [25]సంధివేళలన్
నలినహితేందువంశనరనాథులు విశ్వనరేంద్రభర్తకున్.

29

పరకీయ

క.

పరకీయ రెండుదెఱఁగులు, కరపరిణీతయును బేరుగలకన్యయు నాఁ
[26]బరిణీత రాగరసములఁ, బరికల్పిత గాదు సత్ప్రబంధములందున్.

30


ఆ.

కన్య పరిణయాభికాంక్షచే రాగాంగ, మగుట [27]రసమునందు నగు నుతింపఁ
భిన్న యయ్యుఁ [28]దనకుఁ బెండ్లి యౌమాట లా, లించు నౌలఁ గన్య లీలఁ బోలె.

31


ఉ.

సాలకఫాలభాగలును నంకురితస్తనబింబలున్ విక
ల్పాలసబాలలీలలును నల్పవివేకలు నైనవైరిభూ
పాలురముద్దుఁగన్నియల భాగ్యము నెన్నుదు రర్ధి విశ్వభూ
పాలుని రాజ్యలక్ష్మికి సపత్నిక లయ్యెద రంచుఁ బ్రాశ్నికుల్.

32

సాధారణనాయిక

క.

సాధారణి యన గణిక క, ళాధౌరేయాత్మ కపటలంపట లీలా
మాధుర్యవిధాయిని దుర, గాధమనోవృత్తి దానిగతిఁ దెలియంగన్.

33


చ.

అనిఁ బరగండభైరవభుజాసివడిం బడి పుణ్యమూర్తు లై
వినుతగతిం జరించు బలువీరులఁ [29]గైకొని యేపు మీఱ ము
న్ననఁగి పెనంగి కూర్చుసువిటావలులన్ దొలఁగించి రప్సరో
వనితలు; పైఁడివెట్టి విలువం గలవే వెలయాండ్రకూరుముల్.

34

స్వీయాభేదముు

క.

చతురస్వకీయగుణసం, గతి ముగ్ధయు మధ్యయుం బ్రగల్భయు ననఁగా
రతిపతితంత్రంబులచేఁ, బ్రతిపాదిత లైరి మూఁడుభంగుల వరుసన్.

35

ముగ్ధ

క.

[30]జవ్వనములోన నడుగిడ, మవ్వపుమది సిగ్గుచేత మరుని గెలిచి లో
[31]నివ్వటిలఁ, గఱద లెఱుఁగని, యవ్వెలఁదుక [32]ముగ్ధ యనఁగ నభిమత యయ్యెన్.

36


సీ.

[33]ఆత్మసేమంబున కఱ్ఱాడుచనుఁగవ యలఁతిపయ్యెదచాటు నాసపడఁగఁ
గన్నుఁగ్రేవలఁ [34]గ్రాలఁగడఁగు వాలికచూడ్కి సొబగారు[35]సిగ్గుతో సుడివడంగ
బొరిపొరి బొమలపైఁ బొలుపారు నలకలు చేతికెంజాయతోఁ జెలిమి సేయ
[36]నలకనై తోఁచు నెన్నడు మించునూఁగారు మాటున నొక్కింత మఱుఁగుపడఁగ


తే.

నంగజుఁడు వేడ్క లోనఁ జిట్టాడ నడరు
ముగ్ధ డెందంబుఁ గనుఁగొని ముదము నొసఁగుఁ
జతురలీలల విశ్వేశచక్రవర్తి
[37]యూష్మశరదాగమంబుల నుచితగతుల.

37

మధ్యనాయిక

క.

సంపూర్ణయౌవనోచిత, సంపత్తియుఁ గామినియును [38]సమలజ్జయుఁ బ్రే
రింపఁగ మోహోత్తగరతి, లంపటయు న్మధ్య యనెడులలన దలంపన్.

38


సీ.

హ్రస్వోన్నత[39]సమాయతాంగవిస్ఫూర్తిపై నిబిడలావణ్యంబు నిట్టత్రోవ
నేపథ్యశృంగారనియమితిరచనపైఁ దారుణ్య[40]సంపత్తి దళుకులొత్త
మిళితరాగాభోగ[41]మృదుగల్లపాళిపై సమ్మదోద్రేకంబు జాలువాఱ
లాలితలజ్జావిలాసంబుపై సాంద్రకందర్పదర్పంబు కందళింపఁ


తే.

గొమరు మిగిలెడు మధ్యఁ గోర్కులకు నెల్ల
[42]నెల్ల యై యొప్పు విశ్వేశవల్లభుండు
[43]భావజక్రీడఁ గవఁ గూడి పరిణమించు
విమలహేమంతశిశిరకాలములయందు.

39

ప్రగల్భనాయిక

క.

అతిరూఢవయోభిమతయు, నతికామావేశమతియు నంగజవిద్యా
చతురము నతిలీనమనో, గతియును నగువనిత తగుఁ బ్రగల్భ యనంగన్.

40


సీ.

పయ్యెద[44]కొంగులోపలఁ బిక్కటిల్లెడు నెవ్వీఁగుఁజన్నులనింపుసొంపు
తళుకుతో లజ్జకుఁ దల మీఱి క్రాలెడు నిడువాలుఁజూపుల నిశితగతియుఁ
[45]బ్రణయానులాపసంపత్తిలోఁ కొంకక మున్నాడి యేతెంచు మొక్కలంబు
నొడికంపుఁజేఁతల యొఱ పెఱింగినవింత [46]వీడ్పాటుపనిగల వెడఁగుఁదనముఁ


తే.

గలిగి తమకించునెడలఁ బ్రగల్భఁ దగిలి
వేడ్క విహరించుఁ జాళుక్యవిశ్వవిభుఁడు
చారువర్షావసంతర్తుసమయములను
బాలితాఖిలరాజ్యవైభవ మెలర్ప.

41

ధీరాదినాయికాభేదములు

క.

ఆరయ ముద్దియ వెలిగా, గారవమున మధ్యయును బ్రగల్భయు వరుసన్
ధీరయు [47]ధీరాధీరయు, ధీరేతరయును [48]ననంగఁ ద్రివిధాఖ్య లిలన్.

42

ధీర

క.

తెల్లపుటపరాధము గల, వల్లభుఁ గని వినయమృదులవక్రోక్తులచే
నుల్లసము దోఁపఁ బలికెడు, నల్లలనకుఁ బేరు ధీర యండ్రు రసజ్ఞుల్.

43


చ.

[49]లసితము లైన లేఁజేమరులన్ జెలువారెడిమేనితావియున్
బొసఁగ విలోచనాంతములఁ బొంపిరివోయెడువింతరాగమున్
వసుమతి గారవించుచు [50]శ్రమం పడకుండిన నేల కల్గు నిం
పెసఁగఁగ నంచుఁ బల్కెఁ దరళేక్షణ యోర్తు చళుక్యవల్లభున్.

44

ధీరాధీర

క.

[51]నేరమి చేసినపతిఁ గ, న్నారం గని లోచనముల నశ్రువు లొలుకన్
దోరపువక్రోక్తులఁ దగ, ధరాధరాఖ్య పలుకు [52]ధృతి కడ కొదవన్.

45


చ.

చతురత విశ్వభూవిభుఁడు జాదులు మాళవి కిచ్చె, నిచ్చినన్
[53]బ్రతిభ వహించి [54]లాటి పిదపం దన కిచ్చినపాటలంబులం
[55]బతిపయిఁ బాఱఁ జిల్కి నవబాష్పకణంబులు రాల రోషభా
పిత యగు చుండె; నత్తెఱఁగు చిత్తమునం [56]బరికించెనో కదే.

46

అధీర

క.

అపరాధి యైనపతిపై, నుపచితరోషమున నశ్రు లొలుకఁగ నుద్య
ల్లపితము లుల్లసములుగా, నెప మిడుచు నధీర పలుకు నెయ్యము కలిమిన్.

47


చ.

ఒదవెడువేడ్కఁ దన్ను మును [57]నూఱడఁ బల్కి మొఱంగి చన్నచ
క్కదములు రోషబాష్పకణగద్గదభాషలచేతఁ జెప్పుచున్
ముదిత చళుక్యవల్లభునిమ్రోలఁ దనర్చుట చూచి నెచ్చెలుల్
మదనునిచేఁతకుం [58]దరుణిమానములేఁతకు నొచ్చి రిచ్చలన్.

48

ప్రగల్భధీర

క.

అలుక దలచూపకుండెడు, పలుకులుఁ జేతలును నచ్చుపఱుచుచు దయితున్
గలితాపరాధు మదిలో, నలయించుఁ బ్రగల్భధీర యర్హక్రియలన్.

49


చ.

వెలి నపరాంగనాప్తుఁ డగువిశ్వనృపాలునిఁ బ్రీతి [59]చూపుచూ
పుల నలరింపదయ్యె మణిపుత్రికఁ జూచుట గారణంబు గాఁ
జిలుకకు నత్తఱిం జదువు చెప్పుకతంబునఁ పల్కదయ్యెఁ, దొ
య్యలి యెదు రేఁగదయ్యెఁ గలహంసికి [60]నెన్నడఁ జూపుచుండుటన్.

50

ప్రగల్భధీరాధీర

క.

కినుకయుఁ దాలిమియును జెం, దిన [61]మాటల నాప్రగల్భధీరాధీరాం
గన యుల్లసముల పెనఁకువ, తనముఁ బ్రసాదంబుఁ జూపు[62]తగవరి దలఁపన్.

51


మ.

అతివా నాకుఁ జళుక్యనాథుచతురవ్యాపారముల్ విన్న [63]సం
తతమోదంబు జనించు, నంతటన ధూర్తక్రీడ లాలించినన్
బ్రతిపన్నం బగుఁ గోప, మప్పు డటు సోత్ప్రాసోక్తికిం జొచ్చినన్
హితమందస్మిత మబ్బు మోమునకు ము, న్నీకౌతుకం బెట్టిదో!

52

ప్రగల్భాధీర

క.

కూరిమిపతి తనకోపము వారించినఁ ద్రోచి పిదప వచ్చి యతనిఁ దా
నూరార్చునది ప్రగల్భా, ధీర యనం బరఁగు రసికదృష్టికి నరయన్.

53


శా.

ఆపంచాయుధుపెంపు నాహిమకరాహంకార మాకోకిలా
టోపంబుం దరియింప లేక సతి నిండుంగూర్మితో ధైర్యసీ
మా[64]పర్యాప్తికి నెగ్గుగా మణిగణన్మంజీరపుంజీకృత
[65]క్ష్మాపవ్రాతకిరీటు మ్రొక్కి [66]నిలిచెం జాళుక్యవిశ్వేశ్వరున్.

54


క.

జ్యేష్ఠయు మధ్యాఖ్యయును గ, నిష్ఠయు ననఁ గృతులఁ బరఁగునెలఁతలకును నీ
నిష్ఠితగుణములు వరుసఁ బ్ర, తిష్ఠితములు సరసగతులఁ దెలియఁగవలయున్.

55

అష్టవిధనాయికలు

తే.

కలరు స్వాధీనపతికయు ఖండితయును
బ్రోషితప్రియయును విరహోత్కలికయు
నౌల నభిసారికయుఁ గలహాంతరితయు
[67]సంప్రవాసిని వాసకసజ్జికయును.

56


క.

ఈయెనిమిది శృంగారవి, ధాయి దశాకలిత లైనతరుణుల తెఱఁగుల్
పాయక లక్షణలక్ష్యో, పాయంబులఁ దెలియవలయుఁ బ్రౌఢప్రతిభన్.

57

స్వాధీనభర్తృక

క.

మధురానువర్తి యగు తన, యధిపతిచే నెప్పు డర్పితాభరణాదిన్
బ్రథిత యగుచుండు కోమలి, కథితస్వాధీనభర్తృకాసంజ్ఞ యిలన్.

58


మ.

ప్రతిపక్షప్రతిపాదితక్షతులు చూపన్ జెప్ప లే వెన్నఁడున్
బ్రతికాలస్వకృతోత్సవాభరణభద్రశ్రీవిమిశ్రక్రియా
[68]చతురత్వం బలరారుచుండు నెపుడున్ జాళుక్యవిశ్వేశ్వరుం
బతిగా నోచిన [69]రత్నగర్భ యనులాభం బొప్పుఁబో పృథ్వికిన్.

59

ఖండిత

క.

రేయెల్ల నవ్యసురత, శ్రేయస్కుఁడు కృతమనోజచిహ్నుఁడు నగున
న్నాయకుని వీడ నాడెడు, నాయంగన ఖండితాఖ్య యగుఁ బరికింపన్.

60


శా.

చారుస్పర్శసమీరసూచితతనూసౌరభ్య మింపారఁ గా
శ్మీరీసంగమశంసి యైనఁ గని గాసిల్లెం బ్రకాశాంగజా
కారుం డై విలసిల్లు విశ్వవిభుపైఁ [70]గర్ణాటి గాశ్మీరితో
నారాజన్యుఁ డెఱుంగు టచ్చెరువె తద్వ్యామోహఖేదంబులన్.

61

ప్రోషితభర్తృక

క.

పతి పరదేశాంతకపరి, గతుఁ డై క్రమ్మఱక యచటఁ గడు మసలుటయున్
[71]మతిఁ దుందుడుకుం జెందెడు, సతిఁ బ్రోషితభర్తృక యనఁ జను నండ్రు బుధుల్.

62


ఉ.

శ్రీశుఁ జళుక్యవిశ్వధరణీశు భజింపఁ [72]దలంచి చన్న యా
త్మేశుఁడు వచ్చునంతకుఁ బురేందిరకుం బ్రభవించెఁ దోడుతో
[73]నాశలమాఱుపాటు మలినాంబరభావము నంగవర్ణసం
క్లేశవికారమున్ నిరవలేపతయున్ సుమనోవిముక్తియున్.

63

విరహోత్కంఠిత

క.

పరుఁ డనురక్తుం డయ్యు ని, తర మగు పని గలిగి రాక తడయుటయు విభా
వరియందు నడలుపొలఁతుక, విరహోత్కంఠిత యనంగ విశ్రుతి కెక్కున్.

64


చ.

[74]నవరసగీతవాద్యనటనంబు రుచించిన రాక తక్కెనో,
వివిధకవిప్రబంధరసవీచులఁ దేలి తలంపఁడయ్యెనో,
[75]గవ యగురాచకర్జములు గల్గెనొ కాక, చళుక్యమేదినీ
ధవుఁ డిటు లేటికిం దడయుఁ దారలు వెల్లఁదనంబు గూరెడున్.

65

అభిసారిక

క.

[76]ముంగిటికై నడ సాగ న, పాంగము తిమిరంబె దిశల [77]నడఁపఁగఁ దమితో
జెంగక పతికడకుం జను, నంగన యభిసారికాహ్వయంబుం బడయున్.

66


మ.

క్రియ నుద్దామ[78]ఘనాఘనాకలితముం గీలాలధారాళమున్
[79]భయదోద్యచ్ఛతకోటిఘోషణము నై భాసిల్లుఁ బోరాటలోఁ
బ్రియలీలా[80]చపలావలోకములు శోభిల్లం బ్రసన్నాకృతిన్
జయసీమంతిని వచ్చి [81]మెచ్చి కలయుం జాళుక్యవిశ్వేశ్వరున్.

67

కలహాంతరిత

క.

కలహాంతరిత యనంగా, వలవనిపొలయల్కఁ జేసి వల్లభుతోడం
బలుకక పిమ్మట మదిలో, నలఁదురు నెలఁతుకకు నామ మండ్రు రసజ్ఞుల్.

68

చ.

తొలితొలి నల్గె విశ్వవిభుతో మననెచ్చెలి; రిత్తయల్కకుం
[82]దెలియఁడ రాజు; దర్పకుఁడు తీపులవి ల్లదె యెక్కువెట్టె; గ్రొ
న్నెల వొడతెంచె; నింకఁ గరణీయము సఖ్యము సేయు నేర్పు తొ
య్యలి యలికేందురేఖకును నవ్విభుపాదపయోజలక్ష్మికిన్.

69

విప్రలబ్ధ

క.

పంచినయెడ కేతేరక, వంచించిన దయితుతో వివాదము సంపా
దించి చెలితోడ దుఃఖో, దంచిత యగు విప్రలబ్ధ తత్పరబుద్ధిన్.

70


శా.

[83]చాళుక్యక్షితినాథ నీ పనుపునన్ సౌరాష్ట్రి యేతెంచె; [84]నీ
వేలో జాలము సేసి రామికి మరుం డిష్వాసముం దాల్చె; నా
యాలాపంబులు నమ్మవేయును రమ్మా మాతు కన్నీటిచే
జాలం బంకిలభాగ మైనవిలసత్సంకేతసద్మస్థలిన్.

71

వాసకసజ్జిక

క.

భాసురుఁ డై పతి నగరికి, మాసరమున వచ్చు టెఱిఁగి మణిమండలవి
న్యాసాలంకృత యగు సతి, వాసకసజ్జిక యనంగ వల నై యొప్పున్.

72


మ.

[85]పరిలేపస్ఫుటహేమకుంభకుచయున్ బ్రాలంబముక్తాఫలాం
బరవిభ్రాజితమూర్తియున్ వికచపుష్పస్రగ్వితానాంతర
స్ఫురితాకారయు నై [86]వెలుంగు పురి సంశోభిల్లె విశ్వావనీ
వరుఁ డేతెంచె జయీప్తితో ననెడు నీవార్తావిశేషప్రతిన్.

73

దూతికలు

తే.

వీరలకు దూతికలు ప్రతివేశినియును
[87]జెలియు దాసియు ధాత్రియు శిల్పినియును
[88]లింగినియుఁ గారువును వీరు లేక యున్నఁ
దాన యైనను నగుఁ బ్రియతంత్రములకు.

74


క.

శ్రీయుతు లగునీనాయక, నాయిక లిరువాగు, భాజనంబులు శృంగా
రాయతిజననమునకు నివి, పో యెఱుఁగం దగినయవి సుబుద్ధుల కెల్లన్.

75


సీ.

రచితసహాయాంగరసపరవ్యక్తియుఁ బూజ్యాంగికరసానుపోషణంబుఁ
[89]గానివిభావాదికష్టకల్పనమును శత్రుభూతరసాధిసంకరమును
[90]సద్మకాలాదిరసప్రరోహణమును రసభావనామోచ్చరణపదంబు
ననుచితక్రమ[91]శాసనాగ్రహసంచారి భావానుబంధనప్రసరణంబు


తే.

పొడము భావరసాభావములు దలంప
వీనిఁ బరికించి తొలఁగించి విశ్రుతముగఁ

గబ్బ మొనరించు సుకవిపుంగవులఁ గాని
యన్యు మెచ్చఁడు రాజనారాయణుండు.

76


మ.

[92]చతురశ్రోత్రసుఖాకరామృతపరిష్యందంబు నందంబు నై
క్షితిఁ గావ్యప్రసరంబు వొల్చు నిఖిలక్షేమంకరస్ఫూర్తితోఁ
బ్రతిభావంతులు మెచ్చ లక్షణము నొప్పం జెప్పుదుం బూర్వక
ల్పితశాస్త్రానుగతంబు సంగతముగాఁ బ్రీతిప్రదవ్యక్తిచేన్.

77


శా.

[93]దివ్యం బైనకృతిత్రయంబు వివిధోక్తిం బర్వుశాస్త్రంబులున్
భవ్యం బైనపురాణవర్గమును గుప్తం బైనవిద్యాప్రపం
చవ్యాపారము నేమిటం గలిగి [94]యక్షయ్యంబు లై పేర్చుఁ ద
త్కావ్యం బేరికి నింపుగా దెఱిఁగినం గల్పాంతరస్థాయి యై.

78


క.

సమయజ్ఞుఁడు సమచిత్తుఁడు, సమశబ్దార్థప్రయోగచతురుఁడు భావ
క్రమరసపోషణరచనా, కమనీయప్రతిభుఁ డిల సుకవి యనఁ బరఁగున్.

79

సప్తవిధకవులు

తే.

వాచి కార్థులు శిల్పక రౌచికులును
భూషణార్థియు మార్దవస్ఫురణకరుఁడు
[95]నల వివేకియు ననఁగ సప్తాహ్వయములఁ
గవులు నెగడుదు [96]రీహితకావ్యములను.

80

వాచికుఁడు

క.

[97]ఛలవర్ణగుచ్ఛపిచ్ఛిల, లలితపదాడంబరావలంబనకవితా
సులభవిరచనాచతురుం, డలవడు వాచికుఁడు నా నుదగ్రప్రౌఢిన్.

81

అర్థుఁడు

క.

మితశబ్ద మయ్యు నర్థము, సతతవ్యాఖ్యానలాలసక్షమవిపుల
స్థితి నొప్పఁ గవిత సెప్పెడు, నతఁ డార్థుం డనఁగ నెగడు నార్యులసభలన్.

82

శిల్పకుఁడు

క.

మహితసుశబ్దార్థంబులు, [98]బహువిధయమకార్ధబంధబంధురరచనా
[99]నిహితవిచిత్రము లై చన, విహరించున్ శిల్పకుండు విశ్రుతకృతులన్.

83

రౌచికుఁడు

క.

ఒదవెడుకృతిపైఁ గలసొబ, గదలక యెందాఁక నిష్ట మగు నందాకన్
మృదుమధురరచన సువిశా, రదుఁ డై సాగించునతఁడు రౌచికుఁ డెందున్.

84

భూషణార్థి

క.

తివుటవడి నొడువునప్పుడు, వివిధాలంకారవరణి విడువక చవి గా
నవహితుఁ డై కృతి చెప్పెడు, కవి యెందును భూషణార్థి కడుఁ బొగడొందున్.

85

మార్దవానుగతుఁడు

క.

సరళము లగు[100]శబ్దములను, విరళము లగునర్థములను వీనుల కింపం
దరళత లేక రసౌఘము లరుదుగఁ, గృతి చెప్పు మార్దవానుగుఁ డెపుడున్.

86

వివేకి

క.

శ్రతశాస్త్రాలంకార, ప్రతిభుఁడు [101]శబ్దాదిదోషపటుగుణఘటనా
చతురుఁడు వివేకి నాఁ డను, నతఁడు మహాకవిశతంబులందుఁ జరించున్.

87


క.

ఛందోలంకారాదుల, పొం దెఱిఁగిన నెద్ది లేక పొసఁగదు కవితా
[102]సుందరత శక్తి యది యా, కందువఁ వగ నెఱుఁగువాఁడె కవివరుఁ డెందున్.

88


తే.

శక్తి వెలి యైన కావ్యోక్తి సాధనంబు
లెల్ల జీఁకటియింటిలో నిడినసరకు
లెన్ని ఋతువులు గల్గిన నెట్లు పూచు
మహి వసంతాగమము లేక మావిమోక.

89


చ.

వినుతయశంబునం గలుగు విశ్రుతనాకనివాస; మయ్యశో
జననము శ్రవ్యకావ్యములసంగతి నొప్పగు; శ్రవ్యకావ్యముం
దనరుఁ కవిప్రభావమునఁ; దత్కవిసమ్మతి లేనిరాజు [103]లే
పున విహరింప; రవ్విభులు పోయినజాడ లెఱుంగఁ బోలునే.

90

కావ్యభేదములు

తే.

అట్లు వికృత మైన కావ్యత్రయంబు
[104]గద్యపద్యవిమిశ్రసంపాద్య మండ్రు,
నగరముఖ్యాష్టదశవర్ణనములచేతఁ
బరఁగు నదియును భవ్యప్రబంధ మనఁగ.

91

అష్టాదశవర్ణనలు

మ.

పుర వారాశి మహీధరార్తు శశభృత్పూవాదయోద్యానపు
ష్కరకేళీమధుపానమోహనవియోగక్షేమయానస్వయం
వరపుత్త్రోత్సవమంత్రదూత్యగందోర్వైక్రాంతిసంకీర్తనా
కర మష్టాదశవర్ణనాన్వితము [105]తత్కావ్యంబు భవ్యం బిలన్.

92

నగరవర్ణనము

క.

దుర్గమపరిఖావరణని, సర్గబలానీకచతురచాతుర్వర్ణ్యా
నర్గళసంపద్వనజల, వర్గస్తుతి వలయు నగరవర్ణనమునకున్.

93

సీ.

గంభీరపరిఖ నాగస్త్రీల కశ్రాంత[106]కేళీవిహారదీర్ఘిక యనంగ
నుత్తాలసాల మన్యుల కుబ్బి దివిఁ బ్రాఁకఁ జేసినదీర్ఘనిశ్రేణి యనఁగఁ
జతురచాతుర్వర్ణ్యసంఘ మర్ధులపాలిరాజితకల్పకారామ మనఁగ
[107]భ్రాంతసుస్థిత యైన భవజూటవాహిని భుక్తిముక్తిప్రదస్ఫూర్తి యనఁగ


తే.

[108]నెప్పుడును నొప్పురాజమహేంద్రవరము
ధరణిఁ గల్పించె నేరాజు తనదుపేర
నట్టి రాజమహేంద్రునియనుఁగుమనుమఁ
డెసఁగుఁ జాళుక్యవిశ్వనరేశ్వరుండు.

94

సముద్రవర్ణనము

క.

సిరినెలవు, [109]గురుసుధాప్తియు, [110]నరుదారఁగ నజునితండ్రియల్లుఁడు, రత్నా
కరము దనపేరు, జలధికి, సరి గలరే యరయ ననుచుఁ జను వర్ణింపన్.

95


మ.

అతిగాంభీర్యము గోత్రగోపనము సత్త్వాటోపమాహాత్మ్యమున్
హితలక్ష్మీసదనత్వమున్ సతతవృద్ధీతప్రభావంబు [111]ను
న్నతసర్వోత్తరజీవనోదయము నానావాహినీసౌఖ్యకా
లితయుం బేర్చుఁ జళుక్యనాథునకుఁ[112]బోలెన్ జూడ నంభోధికిన్.

96

పర్వతవర్ణనము

క.

అచలతయును నున్నతియును, ఖచరవినోదౌచితియును గనకాదిఖనీ
[113]రుచితయును మొదలుగాఁగల, ప్రచురతలు నుతింపవలయుఁ బర్వతమునకున్.

97


మ.

[114]చెలువారున్ నవరత్నపాదకటకశ్రీచేత, గంధర్వ[115]మం
గళనాదంబులతోడ నొప్పగు, నభంగస్థైర్యవృత్తిన్ మహా
బలు నైనం బ్రహసించు, భూభరణశోభం దాల్చి మి న్నందుచున్
గులశైలంబులపెంపు విశ్వవిభుతోఁ గూర్పం దగున్ ధీరతన్.

98

వసంతవర్ణనము

క.

అంకురపల్లవపత్ర[116]స, మాంకితముకుళప్రసూనహారిఫలములన్
బొంకము లగువనములు ని, శ్శంకముగ [117]నుతింపఁబడు వసంతమునందున్.

99


మ.

స్మరబాణంబులు వాఁడు లయ్యె, గణవిస్ఫారంబు ఘోరంబుగా
నెరసెం, [118]గీరము లంగజాతబిరుదానీకంబు గీర్తించె, మిం
చె రసాలాగ్నులు, [119]పల్లవార్చులు దలిచెన్, [120]విశ్వనాథావనీ
వరుతో నల్గుట చెల్లునే యనత యై వామాక్షి కీపట్టునన్.

100

గ్రీష్మవర్ణనము

క.

ధారాగృహముల నవఘన, సారాదులు గంధసార[121]సరసపటీరో
శీరవ్యజనాదుల నిం, పారఁగ వర్ణింపఁ దగు నిదాఘాగమమున్.

101

శా.

[122]ధారామండితసాలభంజికలచేతన్ జిత్ర[123]యంత్రోద్గళ
త్సారామోదతుషారపూరములు [124]విస్తారంబు లై పర్వుఁ గాం
తారూఢేక్షణదీప్తితోడన చళుక్యాధీశుపైఁ జంద్రవం
శారాధ్యుం డని చంద్రికాగణము నిం పై క్రాలుచందంబునన్.

102

ప్రావృడ్వర్ణనము

క.

తటిదటనమేఘపటలీ, ఘటితాంబరశక్రచాప[125]కరకావ్రాత
స్ఫుటధారాసారాదివి, కటత నుతింపంగవలయు ఘనకాలమునన్.

103


మ.

చపలాలోకములుం బయోధరగరిష్ఠశ్రీయు [126]సద్యోల్లస
ద్విపులానందము [127]నంబరాభరణసద్వేషంబునుం గంకణ
స్థపుటారావము సొంపు మీఱఁ దగువర్షావేళ విశ్వేశ్వరా
ధిపు [128]సేవించు ప్రగల్భకామినిగతిన్ దీపించు భావింపఁగన్.

104

శరద్వర్ణనము

క.

వెన్నెల సొంపును జుక్కల, చెన్నును దెలుపారుదెసల చెలువంబులు ని
చ్ఛిన్నము లగుజలదంబుల, సన్నుతి సేయంగవలయు శారదవేళన్.

105


శా.

సోమశ్రీలకు [129]వన్నె వెట్టును, [130]ఘనస్తోమంబునం బర్వునా
శామాలిన్యము నౌలఁ ద్రోచు, [131]నవరాజద్రాజహంసావళిం
బ్రేమంబుం బచరించు మానసమునం బెం పై, శరద్విభ్రమం
[132]బామోదప్రద యైనవిశ్వవిభు నుద్యత్కీర్తికిన్ సాటి యై.

106

హేమంతవర్ణనము

క.

[133]బలవత్కాలీయకకం, బళఘనకౌశేయపట్టపటమాంజిష్ఠం
బులఁ జనదు సీతు యువతుల, వలిచన్నులఁ దక్క ననుచు వలయుం బొగడన్.

107


మ.

తరుణీయౌవనగర్వజృంభితకుచోదగ్రోష్మగంధంబులన్
వర[134]కాశ్మీరససాంకవాగురురసవ్యాసక్తులం [135]బట్టికాం
బరమాంజిష్ణపటాదులన్ హిమగతిం బ్రాపింప రీవిశ్వభూ
వరు మెచ్చించిన సత్కవీంద్రు లతులావాసంబులం దిమ్ములన్.

108

శిశిరవర్ణనము

క.

భృశవిచ్ఛిన్నం బగు ది, గ్దశకంబును గమలరుహవితానముఁ బ్రాతః
ప్రశిథిలరవికరమును గా, శిశిరముఁ బొగడంగఁ దగు విశేషక్రియలన్.

109


చ.

వెరవున నాత్మవంశ్యుఁ డగువిశ్వనరేశ్వరుమీఁది ప్రీతిఁ జం
దురుఁడు తుషారసంహతుల దొడ్డుగఁ బంచిన వచ్చి యిచ్చటన్
బరిగొనఁ బోలు నరౌచుఁ జెడి పాఱినవైరులు భీతిఁ గానలో
దిరముగ నిల్వనేరరొ కదే యని [136]చూతురు పంద లాత్మలన్.

110

చంద్రోదయవర్ణనము

క.

మండలశోభయుఁ [137]గైరవ, షండవిలాసంబు జలధిసంజృంభణమున్
[138]గొండొకవెన్నెల గ్రోలెడు నండజములు విధుని[139]పొడుపునం దగుఁ బొగడన్.

111


మ.

[140]అదె రౌద్రాకృతిఁ జూచెఁ జంద్రుఁడు, మయూ[141]ఖాటోప మేపారె న
ల్లదె, మున్నాడెఁ జకోరసంఘ మదె జ్యోత్స్నాపానసంక్రీడకై;
యదయుం డంగజుఁ డెట్లు గాఁగలఁడొ? నీయాలోకనేందీవ[142]రా
పదఁ దూలించెదు, చంద్రవంశజుని నొప్పం జూతు రమ్మా సఖీ.

112

సూర్యోదయవర్ణనము

క.

ఎచ్చటఁ జూచిన జగముల, [143]నచ్చటన వెలుంగు ననియు నజ హరి [144]హర తా
సచ్చతురుఁ డనియు మఱియును, నిచ్చకుఁ దగఁ బొగడవలయు నిను నుదయంబున్.

113


మ.

కమలామోద మెలర్ప నేత్రసుఖదాకారంబు రంజిల్ల ను
త్తమవందారు శివంకరత్వ మెసఁగన్ ధర్మార్థకామక్రి[145]యా
దిమమూలం బన నొప్పుమిత్రుఁ డుదయోత్సేకప్రభావంబుచే;
సముఁ డద్దేవున కిందువంశజుఁడు తచ్చంచద్గుణశ్రేణులన్.

114

వనవిహారవర్ణనము

క.

[146]చారుతరచైత్రసంప, త్పూరితవిభవముల వేడ్క పొంగుడువడఁగా
నారీజనసహచరుఁ డై, యారామవిహార మొప్ప నధిపతి చేయున్.

115


సీ.

మానినీగండూషమధువులఁ బూచిన [147]పొగడను సొబగొప్పఁ బొగడి పొగడి
నారీపదాహతి ననిచినకంకేలి పరువంబు నగ్గించి పలికి పలికి
లలనావలోకనంబులఁ బుష్పితం బగు తిలకంబుపైఁ జూడ్కి త్రిప్పి త్రిప్పి
వనితోపగూహనంబునఁ బేర్చు[148]సురపొన్న మేలిపుణ్యమునకు మెచ్చి మెచ్చి


తే.

[149]మన్మథారామములపొంత మలసి మలసి
శుకపికాళివిహారంబు చూచి చూచి
సతులుఁ దానుఁ జరించు వసంతవేళ
బ్రమదవనమున విశ్వభూపాలవరుఁడు.

116

జలవిహారవర్ణనము

క.

నీరజములుఁ జెంగలువలు, కైరవములు వీచికలును గరయంత్రపయో
ధారలు నావర్తంబులు, వారివిహారంబులందు వర్జ్యము లరయన్.

117


చ.

[150]వళులును వీచికావళులు వారిరుహంబులు వక్త్రపంక్తులున్
చెలు వగు[151]నాభులున్ సుడులుఁ జేతులు రక్తసరోరుహంబులున్
జలదలకంబులున్ మధుపజాలము వీడ్వడఁ గేలి సల్పి [152]మిం
చులు గొనుచూడ్కులన్ సతులు సూతురు విశ్వనృపాలమన్మథున్.

118

మద్యపానవర్ణనము

క.

సంబోధకరము మదనా, లంబనము నశేషరసవిలసితము నంత
ర్బింబితవచనము నగు [153]కా, దంబరి నాపానమునకుఁ దగు నొడఁగూర్పన్.

119


మ.

అలినాదంబులు దాసమానములుగా నాలప్తి గావించుఁ [154]దొ
య్యలి యో ర్తొక్కెతె పాడు విశ్వవిభు నేలాదిప్రబంధంబులన్;
గైకొని యోర్తు సాంగముగ వర్తించుం; గళాసించు [155]ను
గ్మలి యో ర్తొక్కతె వ్రాలు సోలములతోఁ గాదంబరీ[156]గోష్ఠిచేన్.

120

సురతవర్ణనము

తే.

[157]తనరు నెనుబదినాల్గుబంధములయందు
నమరుఁ బ్రచ్ఛిన్నమును బ్రకటము ననంగ
సురతములు రెండు; [158]వానికి స్ఫురణసొంపు
వలయు వర్ణింప నిఖిలకార్యములయందు.

121


సీ.

పొలయల్కఁదలఁపులఁ బులకించుఁ, బులకించి బింకంపుఁగౌగిళ్ల బిగి భజించు
మరుచిన్నె లున్నెడఁ బరికించుఁ, బరికించి [159]చొక్కుఁ, జెమర్చినయిక్క లరయుఁ,
దొలిమ్రొక్కు చెలిచెవిఁ జిలికించుఁ, జిలికించి [160]మురిపెంపుసిగ్గున మూరిఁబోవుఁ,
బంజరంబున చిల్కఁ బలికించుఁ, బలికించి నొడువు లాలము లైన నోరు నొక్కు,


తే.

సొబగుటడుగులలదుక చూచుఁ, జూచి
[161]యరిగి శయనీయ మారయ నప్పళించు,
వెలఁది యొక్కర్తు చాళుక్యవిభునిచేత
భావజాతుని గెల్చినభావ మొప్ప.

122

విప్రలంభవర్ణనము

క.

అచ్చపువెన్నెలచేఁ [162]గడు, వెచ్చుటలును మాన మెడలి వెడవిల్తునిచే
నొచ్చుటలును బ్రియుఁ డబ్బని, ముచ్చటలును విప్రలంభమునఁ జెప్పఁదగున్.

123


ఉ.

ఎల్లిద మయ్యెఁ దాల్మి, [163]తగ నెల్ల వివేకము వింత యయ్యె, మి
న్నెల్లను జంద్రుఁ డయ్యె, మన మెల్ల మనోభవుతూపు లయ్యె, మే
నెల్లను సన్న మయ్యెఁ, జెలు లెల్ల విరోధిన లైరి, విశ్వభూ
వల్లభుతోడియల్క గరువంపుఁజలంబునఁ బువ్వుఁబోఁడికిన్.

124

ప్రయాణవర్ణనము

క.

గజరథహయసూచిత మగు, [164]విజయమ్మున నుబ్బి నడుచు విశ్రుతవివిధ
ధ్వజిని వినుతించు టెప్పుడు, భజనీయము సుకవి సత్ప్రబంధములందున్.

125


మ.

కర ముద్యత్కరవాలభైరవపతాకాఖేలనం బై పరి
స్ఫురదుగ్రాయుధదీప్తిపూరితనభోభూభాగ మై సంచర

త్తురగోద్ధూతరజోతిధూసరహరిత్కూలంబు నై యుద్ధతిం
బరిభాసిల్లుఁ జళుక్యనాథుని చమూభద్రప్రయాణం బిలన్.

126

వివాహవర్ణనము

క.

ప్రచురస్వయంవరోచిత, రచనలుఁ [165]గన్యావరాభిరమ్యక్రియలున్
విచితశుభాత్మకవిధులును, రుచిరవివాహంబులందు రూపింపఁదగున్.

127


ఉ.

సంతతమంగళధ్వనులు చామరమౌక్తికపుండరీకముల్
వింతవిభూతి గా గురుకవిస్తుతివేళ వరించెఁ బొంత సా
మంతుల నుజ్జగించి [166]కడు మచ్చిక నెచ్చెలు లైన నీతి వి
క్రాంతులు చూపఁ గోరి జయకన్యక వచ్చి చళుక్యవల్లభున్.

128

పుత్త్రోదయవర్ణనము

క.

మిత్రానందోదయము న, మిత్రత్రసనంబు శుభనిమిత్తంబును స
త్పాత్రకృతవితరణంబును [167]బుత్త్రోదయమందుఁ దద్ద పొగడఁగవలయున్.

129


ఉ.

చిత్రము పోర విశ్వవిభుచే నసిపుత్త్రికఁ గన్నపుత్త్రు లు
ద్యత్త్రిదశాకృతిం బడసి యౌవనసంపదఁ జెంది మంగళా
మంత్రము లై వెలుంగునెడ మంజులయుక్తి దనర్చు దివ్యవా
దిత్రరవంబు నింపొదవుఁదెమ్మెరలున్ సురపుష్పవృష్టియున్.

130

మంత్రవర్ణనము

క.

అగవాక్షము నస్తంభము, [168]నగుగూఢాభ్యంతరముల హర్మ్యాగ్రమహా
[169]నగశృంగంబుల మంత్రము, దగు నొనరింపంగ ననుచుఁ దగు వర్ణింపన్.

131


మ.

అలుకం బోరికి [170]నెమ్మిమైఁ దరలుచోఁ బ్రారంభణోపాయమున్
బలసంపత్తియు [171]దేశకాలగతులున్ భంగప్రతీకారమున్
ఫలసంసిద్ధియు [172]నిర్ణయించు టనునీపంచాంగమంత్రక్రమం
బులు తర్కించుచళుక్యనాథు వెర వొప్పున్ బూజ్యరాజ్యక్రియన్.

132

దూత్యవర్ణనము

క.

ప్రతిభయుఁ బరమంత్రవిభే, దితయునుఁ బతిరక్తియును దితిక్షయు నిర్మూ
ర్ఖతయును [173]నవ్యసునీతియుఁ, జతురతయును [174]దూత్యమునను జను నుతియింపన్.

133


శా.

[175]ఉత్తేజుం డగువిశ్వభూవిభుని [176]దూత్యోదారసమ్యగ్గుణో
త్పత్తిన్ విశ్రుత మైనసంధి గనుభూపశ్రేణియున్ దుర్మదా
యత్త[177]స్వాంతత నిగ్రహించు [178]నరనాథౌఘంబె వర్తించు న
త్యుత్తుంగాచలచిత్రకూటములయందుం జెంది యశ్రాంతముల్.

134

సమరవర్ణనము

శ.

పటురథకరిహరిభటసం, ఘటిత[179]వ్యూహాదికములు ఘనఫలకాసి
[180]స్ఫుటరుచులు విజయకారణ, పటహాడంబరముఁ బొగడఁబడుఁ బోరాటన్.

135

మ.

[181]అమరాహీనరవంబు వీరసుభటాహంపూర్వికానాదమున్
విమలాస్త్ర[182]ప్రతిఘాతనధ్వనులు నున్నిద్రంబు లై పర్వ [183]
గ్రిమవిశ్రాంతికి మెచ్చి నారదుఁడు నర్తింపన్ మహాయోధనం
బమరుం జూడఁ జళుక్యవల్లభునిశూరాటోపముం జూపుచున్.

136

దోర్వీర్యవర్ణనము

క.

అరులఁ జనఁ దోలి యార్తుల, [184]నరుదారం గాచి హతులయడియాలములన్
బిరుదంబులఁ గైకొను న, న్నరపతివిజయంబు కీర్తనము సేయఁదగున్.

137


ఉ.

ఆచతురాశ్వసంఘము రణాంగణసంభవ, మాసువర్ణపే
టీచయ మాజి శత్రువులు డించి తొలంగిన వస్తుసంభృతం,
బీచతురంతయానముల యింతులు రాజతనూజ లంచు మెం
డై చని విశ్వనాథువిజయంబు నుతింతురు పౌరకామినుల్.

138

—————

మ.

ఇటు లష్టాదశవర్ణనాకలిత మై యేపారు [185]కావ్యంబు నం
తటఁ బాటించి తదర్థసంఘటనముం దర్కించి భావోదయ
[186]స్ఫుటభేదంబు లెఱింగి తద్రసగతుల్ శోధించి యచ్చంపు మె
చ్చుటకుం దావల మై చళుక్యపతి సంశోభిల్లు నెల్లప్పుడున్.

139


ఉ.

[187]రాజనరేంద్రవంశజుఁడు రాజపటీరసుధాసుధాకర
భ్రాజిత[188]కీర్తి రామరఘురామపరాక్రమంప్రవర్తి యం
భోజహితప్రతాపుఁడు రిపుక్షితిభృత్కులిశంబు సత్కళా
భోజుఁడు దానధూతసురభూజుఁడు భూజనపోషణుం డిలన్.

140


క.

సుందరుఁ డభినవవిభవపు, రందరుఁ డంధ్రేశ్వరాభిరాముఁడు రామా
కందర్పుఁ డమందయశ, శ్చందనపరిలిప్తదిగ్గజవ్రజుఁ డెపుడున్.

141


మాలిని.

అనఘసుకృతధర్ముం డార్యసంస్తుత్యశర్ముం
డనలసదృశతేజుం డగ్ర్యచాతుర్యభోజుం
డనిశరిపుశరణ్యుం డంధ్రభూపాగ్రగణ్యుం
డనుగతశివతంత్రుం డాప్తమంత్రుండు బుద్ధిన్.

142

గద్యము.
ఇది శ్రీమదుమారమణచరణారవిందవందన గోవిందామాత్యనందన విబుధబుధవిధేయ
విన్నకోట పెద్దయనామధేయ విరచితంబైన కావ్యాలంకారచూడామణి
యనునలంకారశాస్త్రంబునందు నాయకనాయికావివిధవిశేషలక్షణ
ప్రబంధలక్షణోదాహరణసముద్దేశం బన్నది
తృతీయోల్లాసము.

—————

  1. క. పొంగారన్ వినిపింతు సమ్మతి
  2. గ. గేటింపక యాదరింపుఁడు
  3. క.గ.చ. దూషకామేళనంబు
  4. క.గ.చ. వెలయుగుణముల
  5. క.గ.చ. తనుఁ జెప్పి మదింపని పెద్ద
  6. గ. చ. పరభూపాళి పలాయన
  7. చ. అరుదుగ
  8. క.గ.చ. నయక్రియ చేతికి నిచ్చి
  9. క.గ.చ. సద్ద్విజామలవంశప్రభవుఁడు
  10. క.గ.చ. అన్నాయకుఁ డభినుతముగ
  11. క.గ.చ. అనఁ బెంపొందున్
  12. క.గ.చ. కీర్తిసతివార్తలఁ గ్రిమ్ములదించు
  13. క.గ.చ. లచ్చి కీయెడల
  14. క.గ.చ. ధీరులకుఁ జిత్తమునందు
  15. క.చ.వరాటికపయిన్
  16. క.గ.చ. గౌడిపై
  17. క.గ.చ. నీమాటల రాగరాజతనయా
  18. క.గ.చ. పృథివి నేతృసహాయులు
  19. క.గురుకార్యపేశలుండు, గ.చ. గురువాక్యపేశలుండు
  20. క.గ. తొడఁగి నగిపించునేని, చ. తొడరి నగిపించునేని
  21. క.గ.చ. ఒప్పున్మతి త్వంగత్
  22. క.గ.చ. గుణాయతభేదములు
  23. ఈపద్యమునకుఁ దరువాత “అదియె” అనికలదు.
  24. క. శీలార్జనకలితయు
  25. క.గ.చ. సంధికాలమున్
  26. క.గ.చ. పరిణీత యంగరసముల
  27. క.గ.చ. స్వీయరసము నగు నుతింప
  28. గ.చ. తనదు పెండిలిమాటలు
  29. క.గ.చ. కైకొని యిప్డు దారుమున్న
  30. క.గ.చ. జవ్వనములోన నడుగిడి
  31. క. నివ్వటిలఁగ బదు లెఱుఁగని, గ. నివ్వటిలం గరుడు లెఱుఁగని, చ. నివ్వటిలం గఱుదు
  32. క.గ.చ. ముగ్ధ యనఁగ నభిమత
  33. క.గ.చ. ఆత్మసీమంబున కఱ్ఱాడు
  34. క. గ్రాలఁగదురువాలిక చూడ్కి
  35. క.గ.చ. సిగ్గులో సుడివడంగ
  36. క.గ.చ. నలికమై తోఁచు
  37. క.గ.చ. ఉష్ణశరదాగమంబుల
  38. క.గ.చ. సమలజ్జయుఁ బేరింపగు
  39. క. సమాయతాంగవిస్ఫూర్తికి
  40. క.గ.చ. సంపద దళుకులొత్త
  41. క. మృదుగండపాళిపై
  42. “నుబ్బునుల్లంబు జనువుల నుగ్గడింప” అను నీగీతపాదము క.గ.చ. ప్రతులు మూడింటను రెండవపాదమై యధికముగఁ గన్పట్టుచున్నది. ఇట్లీగీతి పంచపాదియై యున్నది.
  43. చ. భావజక్రీడ గమిఁగూడి
  44. క.గ.చ. కొంగులోపల గ్రక్కటిల్లెడు
  45. క.గ.చ. ప్రణయానురాగసంపత్తితో
  46. క.గ.చ. వీడ్వాటు పనిగల
  47. గ.చ. ధీరాధీరయధీరయును
  48. క. యనఁగ నెసఁగుఁ ద్రివిధాఖ్య లిలన్, గ.చ. వరుసఁ ద్రివిధాఖ్య లిలన్
  49. క.గ.చ. లసితములైన కెంజెమటలన్
  50. చ. శ్రవం పడకుండిన
  51. క.గ.చ. నేరము చేసిన పతి
  52. క. ధృతికడలొడువన్, గ.చ. ధృతికదలొదవన్
  53. క.చ. ప్రతిభ సహించి
  54. క. తాళి
  55. క.గ.చ. పతిపయిఁ బాఱఁజల్లి
  56. క.గ.చ. పరికించియో కదే
  57. క. ఉఱటఁ బల్కి
  58. క.గ.చ. తరుణిమానపులేఁతకు
  59. క.గ.చ. జూచుచూపులు పచరింపదయ్యె
  60. క.గ.చ. నెన్నడఁ జూపు చూపులన్
  61. క.గ.చ. మాటలయది
  62. క.గ.చ. తగవడిఁ దలఁపన్
  63. క.గ.చ. సంతతమోహంబు
  64. గ.చ. పర్యాప్తికి సిగ్గుగా
  65. క.గ.చ. క్ష్మాపవ్రాతము చూడ మ్రొక్కి
  66. క.చ. తెలచెం జాళుక్యవిశ్వేశ్వరున్, గ. తెలసెం జాళుక్యవిశ్వేశ్వరున్
  67. క.గ.చ. సంత్రివాదినివాసకసజ్జిక
  68. క.గ.చ. చతురత్వం బెలరారుచుండె
  69. గ.చ. రత్నగర్భయగులాభంబు
  70. క.గ.చ. కర్నాటికన్నీటితో
  71. క.గ. మతి దురపిల్లుచునుండెడు, చ. మతిమఱుపిల్లుచునుండెడు
  72. గ.చ. తలంచుచున్న
  73. క.గ.చ. ఆశలమాగుపాటు
  74. క.గ.చ. నవతరగీతవాద్యము
  75. క.గ.చ. గవమగురాచకర్జము
  76. క.గ.చ. ముంగిటికి నడుగు సాగదపాంగము తిమిరంబురేకు
  77. క. లరయు డతనితో, గ.చ. లరయుదు రనిలో
  78. క.గ.చ. ఘనాఘనావళితమున్
  79. క.చ. భయదోద్యచ్ఛటకోటి
  80. చ. చపలావలోకనము శోభిల్లున్
  81. క.గ.చ.మెచ్చఁగవయున్
  82. క.గ.చ. తెలియుఁడ
  83. క.గ.చ. చాళుక్యక్షితిపాల
  84. క.గ.చ. నీవేలోయాలము
  85. క.గ.చ. పరిపూర్ణస్ఫుటహేమకుంభ
  86. క.గ.చ. వెలింగి పురి
  87. క.గ.చ. బెరయు ధాత్రీతనూజయు
  88. క.గ.చ. లింగినీకారువులు
  89. గ.చ. గ్లానివిభావాది
  90. క.గ.చ. అశ్మకాష్ఠాదిరసారోహణము
  91. గ.చ. శాసనాసక్తసంచారి
  92. గ.చ. చతురశ్రోత్రశుభాకరామృత
  93. గ.చ. దివ్యంబైనశ్రుతిత్రయంబ
  94. గ.చ. అక్షయ్యంబులై యుండు
  95. గ.చ. అతివివేకియు
  96. గ.చ. ఈహితకార్యములను
  97. గ.చ. ఛలవర్గగుచ్ఛపిచ్ఛిల
  98. బహువిధయమకానుబంధ
  99. క. విహితవిచిత్రములై
  100. క.గ.చ. శబ్దముల నవిరళములగు
  101. క.గ.చ. శబ్దార్థదోషపటుగుణ
  102. క.గ.చ. సుందరశక్తియ యదియా
  103. క.గ.చ. ఏపున విహరించి రవ్విభులు
  104. క.గ.చ. పద్యగద్యవిమిశ్ర
  105. గ.చ. సత్కావ్యంబు భవ్యం బిలన్
  106. క.గ.చ. కేళీవినోదదీర్ఘిక
  107. క.గ.చ. భ్రాంతసంస్థితయైన
  108. క.గ.చ. ఇప్పుడు నొప్పు
  109. క.గ.చ. గరుసుఁదావియు
  110. క. నరుఁ డెఱఁగక నజుని, గ.చ. నరుదేరఁగ నజుని
  111. క. ఉద్గతసర్వోత్తర
  112. క. పోలన్ జూడ నంభోధికిన్
  113. క.గ.చ. రుచిరతయు మొదలుగా
  114. క.గ.చ. చెలువారన్ ఘనరత్న
  115. క.గ.చ. మంగళనాదంబులు జెప్ప
  116. సమంకితముకుళ
  117. క.గ.చ. నుతింపఁదగు వసంతమునందున్
  118. గ.చ. కీరము లంతజాత
  119. క.గ.చ. పల్లవార్చులఁ దనర్చెన్
  120. క.గ.చ. చంద్రవంశావనీవరుతో
  121. క.గ.చ. సరళపటీరోదార
  122. క.గ.చ. ధారామందిరసాలభంజికల
  123. క. యంత్రోద్గరత్సారామోద
  124. క. విస్తారంబులై పర్వ
  125. గ.చ. కరకాపాతస్ఫుట
  126. క.గ.చ. నవ్యోల్లసద్విపులానందము
  127. క.గ.చ. అంబరాభరణసంద్వేషంబు
  128. క. సేవించి ప్రగల్భకామినిగతిన్
  129. క.గ.చ. వన్నె వెట్టుచు
  130. క.గ.చ. వనస్తోమంబునం బర్వు
  131. క.గ.చ. నతరాజద్రాజహంసావళిన్
  132. క.గ.చ. ఆమోదప్రదమైన
  133. క.గ.చ. బలవత్కౌళేయక
  134. క.గ.చ. కాశ్మీరరసాంకవాగురు
  135. గ.చ. పట్టకాంబర
  136. క. చూతురు బంద లాత్మలన్
  137. క.గ.చ. కైరవషండవికాసంబు
  138. క.గ.చ. కొండుక వెన్నెల గ్రోలెడు
  139. క. పొడవుదగుఁ బొగడంగన్, గ.చ. పొడవునందగుఁ బొగడన్
  140. క.గ.చ. అది రౌద్రాకృతిఁ దోఁచె
  141. క. ఆటోప మేపార
  142. క.గ.చ. ఆపదఁదూలించెడు
  143. గ.చ. నచ్చనయవెలుఁగు
  144. క.గ.చ. హరరాజచ్చరితుఁడు
  145. క.గ. ఆదిమమూలంబున నొప్పు
  146. గ.చ. చారుతరనేత్రసంపత్
  147. క. పొగడల సొబగొప్ప, గ.చ. పొగడల బాగొప్ప
  148. గ. సురవొన్నమేని
  149. క. మన్మథాంగావలుల, గ.చ. మన్మథాగావలుల
  150. క.గ.చ. వలలును వీచికావళులు
  151. క.గ.చ. నాభులున్ దిరులు చేతులు
  152. గ.చ. మించులు గనుచూడ్కులన్
  153. క.గ.చ. కాదంబరి యావాసమునకు
  154. క.గ.చ. తొయ్యలి యోర్తొక్కతె
  155. క.గ.చ. ఉగ్మలి యొక్కర్తుక
  156. క.చ.గోష్ఠిలోన్, గ. గోష్ఠితోన్
  157. క.గ.చ. తనర నెనబదినాల్గు
  158. క.గ.చ. వాని విస్ఫురణసొంపు
  159. క. చెక్కు చెమర్చిన
  160. క.గ.చ. మురిపంపుసిగ్గున
  161. క.గ.చ. అలగి శయనీయము
  162. క కడుమెచ్చుటలును, గ.చ. కడువెచ్చటులును
  163. క. తగ వెల్లవివేకము. గ.చ. తగ వెల్లివివేకము
  164. క.గ.చ. విజయమునకు నుబ్బి
  165. గ.చ. కన్యాపరాభిరమ్యక్రియలున్
  166. క.గ.చ. కడుమక్కువ నెచ్చెలులు
  167. క.గ.చ. పుత్త్రోత్సవవేళ
  168. క.గ.చ. అగూఢభిత్త్యంతరంబు
  169. క.గ.చ. నగశృంగంబున
  170. క.గ.చ. నెమ్మికిం గొరలుచో
  171. క.గ.చ. దేశకాలగతియున్
  172. క.గ.చ. నిర్ణయింపుడనునీ
  173. క.గ.చ. నవ్యసనితయు
  174. క.గ.చ. దూత్య మనఁగఁ జను
  175. క.గ.చ. ఉత్తేజంబగు
  176. క.గ.చ. దూతోదార
  177. క.గ.చ. స్వాంతత విగ్రహించు
  178. క. నరనాథౌఘంబు వర్ణించు, గ.చ. నరనాథౌఘంబ వర్తించు
  179. క.గ.చ. వ్యూహాదికముల
  180. క.గ.చ. స్పుటరుచుల
  181. క.గ.చ. అమరాలాపరవంబు
  182. క.గ.చ. ప్రతిఘాతినిధ్వనులు
  183. క.గ.చ. అగ్రిమవిక్రాంతికి
  184. క.గ.చ. అరుదారం గాంచి హతులు
  185. క.గ.చ. కావ్యంబు నాదటఁ బాటించి
  186. క.గ.చ. స్పుటభేదంబు నెఱింగి
  187. క.గ.చ. రాజమహేంద్రవంశజుఁడు
  188. క.గ.చ. కీర్తిధామ రఘురామ