Jump to content

కాలక్షేపం/రెండవ భాగం

వికీసోర్స్ నుండి




కాలక్షేపం

(TIT BITS)

రెండవ భాగం

ఇంగ్లీషుపాఠం మూలుగుతూ జోగుతూ కునికిపాట్లు పడుతూ చదువుతూన్న కొడుకుతో,

సవితితల్లి - పొగరుమోతా! క్రాపింగు అంటుగునేను! అదా చదువు!

కొడుకు (ఉలిక్కిపడి క్రాపింగు సర్దుకుని) - టి హెచ్ యి ఎం యే యన్ (అని ప్రారంభించగా, ఆవిడవెళ్ళి వాడితలకాయి గోణ్ణెట్టి కొట్టగా, కుర్రాడు ఏడుస్తూ, పుస్తకంకేసి చూస్తూ అందులో ఉన్నట్టు) ....... డబ్లుయూ ఐ డివోడబ్లుయూ ఎంయూయన్‌డియే! వై బీట్!

2

తగులడిపోతున్న ఒకకొంప ఆర్పిపెట్టడానికి కొందరు జాలి గుండెవాళ్ళూ, కొందరు వతనగా కొంపలారిపేవాళ్ళూ వచ్చింతరవాత ప్రేక్షకుల్లో ఒకడైన రాయుడుగారు, తన మిత్రుడు రంగకవిగారితో,

రా - రంగకవి గారూ! అల్లాచూస్తే కార్యంలేదు, రండి బింది పుచ్చుగోండి!

రం - ఉండవయ్యా! రేపు నేను హెచ్చుతగ్గుగా వర్ణన్లుచేస్తే మళ్లీనువ్వే తాటాకులు కడతావ్!

రా - అవీ ఉండవ్ కట్టడానికి! పెందరాళే రావయ్యా!

3

తెలుగుమేష్టరు - "తల్లిదండ్రులు” - ఏ సమాసం వనమయ్య!

వ - చాలా ప్రమాదం అండి. పచ్చిసమాసం.

తె - ఛీ! నోరుమూసుగో! పుంఢాకోర్! ఒక్కవరసగానే ఉంది నీనోరు!

కుసుమయ్య - (తన్ని అడక్కుండాను) ఒక్కవరసగా ఉంటా సమాసంలో పూర్వభాగం అండి! పరం బహు ఇది అశ్లీలంగా ఉంది.

4

కోటయ్య - ఒరేయ్! బ్రహ్మయ్య మరీపొడుగురా, తాడిలాగ! నీకూవాడికీ చెడిపెడీ అయింది టేమిటి?

బాపన్న - మరేరా! నేను! ఎగిరికొట్టాను, ఒక్క లెంపకాయ సాగదీసి! అది ఛళ్ళుమని వాడి పిర్రమీద తగిలిందిరా!

కో - మళ్ళీ కొట్టలేకపోయావ్ దవడ కందేటట్టూ!

బా - అనుకున్నా! యత్నించా! కా, వాడి పొడుగు చేతుల్తో నాగొంతిగ డబాయించి ఉంచాడేమో, నే కొట్టిన చరుపులన్నీ గాలిలో దూసుకుపోడమే!

5

ఒక కచేరీ ఇవతల సాయంత్రపువేళ ఒక సంసారి ఒకపెద్ద మనిషిని కలుసుగుని,

సం - ఏమన్నా అంటే మళ్ళీ గౌరవనీయుణ్ణి, పెద్ద సభ్యుణ్ణి అంటావు. అయిదుదాటింది. లోపలికివెళ్ళి నా విషయంలో మంత్రిగారికి సిఫార్సు చేస్తానని చెయ్యలేదుకాదూ? పె - మర్యాదగా మాట్టాడు. మధ్యాహ్నంవెళ్ళి ఓ గంట మాట్టాడివచ్చాను. నీకు భరవసా ఇచ్చింతరవాత ఊరుకుంటానుటోయ్, వెఱ్ఱివాడా!

సం - ఎందుకొచ్చిందయ్యా, పచ్చి అబద్ధం? నేను ఉదయాన్నించీ గేటుదగ్గిర నుంచుంటేనే!

పె - చాదస్తుడా, రెండోగేటు లేదుటోయ్?

సం - మూడోది కూడా ఉంది. ఉంటేం? రొండో దాని దగ్గర మాతమ్ముడూ మూడో దానిదగ్గిర మాబావమరదీ పొద్దుణ్ణించీ ఉన్నారు. చేతకాకపోతే, ఆమాట అనెయ్య కూడదూ. ఇల్లా ఏడవకపోతే?

6

నారాయణ - అచ్యుతం! పాటకచేరి ఎల్లా ఉంది?

అ - ఆయన తగుదునమ్మా అన్నట్టు భాసింపట్టు వేసుగు కూర్చున్నాడు.

నా - సరేలే, పాటమాట,

అ - భైరవి ఘంట పాడాడు, భోంచేసి ఊరికే 'బేవ్' మన్నట్టు ఉందిగాని ముండావాడికి ఏమీ ఆయాసమేనా లేందే!

నా - ఏదో! తెలివిగలవాడేనా?

అ - అబ్బో! మహగడుసు! ఒక్కమాట తెలియనిచ్చాడుకాడు. మెచ్చుగునేవాళ్ళు అది చూసే!

7

సాంబమ్మ - ఏమమ్మోయి, రంగమ్మగారు! ఇందాకా మీ ఆయన నీయెదటికొచ్చి అల్లా తెయితక్కలాడుతున్నారేం? తడికిల్లోంచి చూశానూ!

రం - ఏముంది సంబడం? నిన్న మీరు మీ ఆయన ఎదట ఆడుతూన్న సంగతి కిటికీలోంచి చూశారటా. అది నాతో ఇందాకా చెప్పడంసొంపూ అది!

8

ఒక జడధారి ఒక కుర్రాణ్ణి వెంటతరిమి పట్టుగుని.

జ - ఒప్పుకో!

కు - నేను చెయ్యలేదు,

జ - చేశావు .

కు - లేదు. నువ్వు చూశావా?

జ - దేవుడు చూశాడు,

కు - దేవుడు అన్నీ చూస్తాడా?

జ - ఓ లెక్కేమిటీ ఆయనకు!

కు - మొన్నటిరోజున మానాయనమ్మ నన్ను తిడుతూంటే నేను నవ్వుతూకూచోడం దేవుడు చూశాడూ?

జ - ఓ.

కు - (జడధార్ని ముక్కుమీద ఒక్కటి ఇచ్చుగుని) ఫోసె! మా నాయనమ్మ మా నాన్నని కన్న మర్నాడు పోయిందిట!

9

పేరమ్మ - మీకేం? సినీమాలోకెడతారు, నాటకంలో కెడతారు. అడ్డమైనచోట్లకీ వెడతారు! మొగాళ్ళూ! సూరయ్య - మొగాడివి కావనేనా నీకుపట్టుకున్న విచారం?

పే - ఆవిచారం మీకుమాత్రం లేదూ, అప్పుడప్పుడూ?

10

సోమయాజులు - రామం గారింట్లో పెళ్ళికి దక్షిణాదినించి సన్నాయిమేళం పిలిపించారట వెళ్ళావురా? మనవాళ్ళూ ! వండి

మ - ఆ. బాగా ఉందిరా, సన్నాయేమిటి, "అబ్ధు” తంగా ఉంది.

సో - ఏమోరా, ఆసన్నాయిగాడు కూర్చునీ, లేచీ, కుస్తీ చేశాడు. కాని, ఎంచేతో నాకు నవ్వొచ్చిందిరా, ఆనందం కలగలేదు. నేనూ వచ్చాలే!

మ - వాడిమాట కాదోయ్; ఆడోలు వాయించాడేం, వాడి సన్నాయిమాట నేచెప్పేది!

11

పంతులు - లెక్కతప్పూ! మళ్ళీ చూడు.

కుర్రాడు కొంచెం సేపటికి మళ్ళీ పట్టుగొచ్చి చూపెట్టగా,

పం - ఇంకా బేడ తక్కువే. మళ్ళీ చూడు.

కుర్రాడు మళ్లీ పట్రాగా,

పం - ఆ లోతక్కువ అల్లానే ఉంది.

కు - (కొంచెం సేపు ఆగివచ్చి) మేష్టారండి! ఇంకో లెక్క చేసి దానికి బేడఎక్కువొస్తే, రొండులెక్కలూ ఏకంగా రైటు కావండి?

12

శివయ్య మొదటా, శివయ్యవెనక ఇంకాకొందరూ, మేడమెట్లు దిగుతూండగా, మెట్లు కొంత ఒడుదుడుకుగానూ జారుగానూ ఉండడంవల్ల.

శి - (కడంవాళ్లతో) అయ్యా, జాగ్రత్త! జాగ్రత్తగా దిగండి.

పైవాడు - నువ్వుముందు జారకుండా దిగవయ్యా, మాజోలి నీకెందుకూ!

శి - అల్లాకాదులెండి. ప్రస్తుత పరిస్థితుల్లో నాజోలికంటె మీజోలే నాకు నెత్తిమీది విషయం .

13

తాత - ఒరేయ్, చిన్నాడా! నిన్న, లాగూఅదీ తొడుక్కుని, కర్రుచ్చుగుని, పెదిమి కొరుక్కుంటూ నీతో వొచ్చాడు, ఆయనెవరూ?

చి - కొండకోట ఎరుగుదువా?

తా - ఆ.

చి - ఆ జమీందార్ని ఎరుగుదువా?

తా - ఆ ఆ.

చి - ఆయన్తో పేకాడే ఆయన.

14

చెప్పరాని తంటాలుపడి పరీక్ష పేపర్లు దిద్దడం సంపాదించుకున్న మేష్టరుతో,

లక్కరాజు - ఏమండోయ్, పెద్దయ్యమేష్టారు! పేపర్లు జోరుగా కొట్టేస్తున్నట్టున్నారు! ఎక్కడా కనిపించటం లేదు.

పె - మరేనండి. జోరుగానే ఉంది.

ల - ఇంకా ఏమాత్రం ఉన్నాయి? పె - ఇక లేవండి. ఏపన్లోనేనా పూర్తిగా చెయితిరిగిన తరవాత ఆపనే ఉండదు.

ల - నిజమే. లేకపోతే ఆచెయ్యేనా ఉండదు!

15

మంగమ్మ, వెంకమ్మతోకలసి గుడికి మొక్కు పట్టిగెళ్ళి భక్తిపూర్వకంగా వినపడీ వినపడనట్టు,

మం - అనువులమ్మా, తల్లీ! నాకు నాలుగుపుట్ల ధాన్యం పండిస్తే, నీకు అందులో రెండుపుట్లు సమర్పిస్తాను.

వెం - (మంగమ్మ చెవులో) అంత మళ్ళీ నువ్వు సమర్పించుగుంటే నీకు సహానికి సహం దండగ కాదుటో?

మం - (అమ్మవారికి కనబడకుండా చెయ్యి అడ్డుపెట్టుగుని, కళ్ళుమూసుగుని, నాలిక ఆడిస్తూ వెంకమ్మ చెవులో) ఊరికే అన్నాను, మాట్టాడకు. ఆవిడికి ఈమాట విన పడొచ్చిందామిటీ! ఆవిడ మొహం!

16

ఒక స్వాములారు ఒక ఊరెళ్ళిన పదిరోజుల్లో ఆ ఊరిమీద ఆయనకి ఆగ్రహం రాగా,

జనులు - (సాష్టాంగపడి) దేవా కటాక్షించాలి, దాసులం! పాపులం! -

స్వా - తక్షణము ఒక మహాసంతర్పణ చేయుడు. ముడుపు దండిగా కట్టుడు, లేనిచో ప్రక్క ఊరచేసినది ఇచ్చటనూ చేయుదు.

అనగా జనులు హడిలిపోయి, బోలెడేసి అవీ ఇవీ చేసి, కానిచ్చి చివరకి ఆయనకి నమస్కరించి,

జనులు - స్వామీ! దేవరవారు ఆ పక్క ఊళ్ళో ఏమిటి చేశారు?

స్వా - ఆ ప్రక్క ఊర మేము ఘోరమైన ఉపవాస మొకండు చేసియుంటిమి!

17

ఇనస్పెక్టరు ఎదట పాఠం ఇస్తూ,

మేష్టరు - రూపాయిలో అయిదవవంతు ఎంత? నెంబర్ ఫోర్!

నెం - మూడణాలకాని అండి.

మే - కూచో,

ఇ - ఆగండి. అబ్బాయి! అయిదు మూడణాలకాన్లు ఎంత?

నెం - రూపాయికాని అండి.

ఇ - అవునా మరీ! గురువుగారు రూపాయిస్తే, నువ్వు ఇంకో కాని ఎక్కువిచ్చావే!

నెం - దక్షిణండి.

18

తండ్రి - ఈ మాటేనా బాగా తగలేశాడ్రా, మార్కులూ?

కొడుకు - మళ్లీ హిస్టరీలోనే వచ్చింది కొంచెం “డెఫిసిట్టు”

తం - అంటే ఎక్కువా తక్కువరా వెధవా? వెధవ నాన్చడమూ నువ్వూను!

కొ - తక్కువే.

తం - ఆయన ఎవర్రా? కర్రట్టిగెళ్ళి కనుక్కొస్తానూ!

కొ - లాభంలేదుట నాన్నా!

తం - ఏం? కొ - స్కూలు మొత్తానికే వచ్చిందిట డిఫిసిట్టు.

తం - అషీతే, అదిలేని స్కూల్లోజేరి ఏడవకూవదూ?

కొ - అదిలేని స్కూలే లేదుట నాన్నా!

తం - అల్లానా! పోన్లే. కాలమానమే అల్లా ఉంటే మనం ఎంజేస్తాం!

19

మేష్టరు - నరహరిరావు! పాఠం చదివావా?

న - చదివానండి,

మే - అప్పగించు.

న - జ్ఞాపకం లేదండి.

మే - ఏం గ్రహచారం?

న - పొద్దున్నే మానాన్న నాకు ఫర్గెటివ్ ఇచ్చాడండి!

మే - ఏమిచ్చాడూ?

న - ఫర్గెటివండి.

మే - దానికంటే నీ ఫరఫరలాడించడం బాగుంది.

20

బోగంమేళం రక్తికట్టి మజాగా అయిపోతున్న సమయంలో సభలోకూర్చున్న తెలుగుప్లీడరు గౌరయ్యగారు తన సరసని కూర్చున్న ఇంగ్లీషువకీలు కృష్ణారావుగారి చెవిలో

గౌ - కనిపెట్టారా?

కృ - ఏమిటి?

గౌ - దాని మొహం!

కృ - మీ మొహంలా ఉంది! అసలేమిటీ?

గౌ - అదికాదండీ!

కృ - ఏమిటి మరి?

గౌ - మొహానికీ, అంత ఒత్తుగా మెత్తిందేంటూత్ పౌడరు. మరీనూ?

21

పుల్లయ్య - విస్సన్నా! ఎల్లాఉంది పంతులుగారి వ్యాసం?

వి - పంతులంటే నువ్వేనా?

పు - మరే.

వి - మొదట్లో కొంతచూస్తే, 'తరువాత చూడురు' అని ఉంది.

పు - అక్కడ చూస్తే ?

వి - 'పైన ఉదాహరించినట్టు' అని ఉంది.

పు - మాధ్యస్తంలో చూస్తే?

వి - అక్కడ ఒక అక్కర్లేని విషయం కొంత చర్చింపబడి 'ఇంకా లోతుగా దిగబడడం అప్రస్తుతం' అని ఉంది.

పు - సంగతి నీకు తెలియలేదందూ!

వి - తెలియకేం? నీకు తెలియలేదని తెలిసింది.

22

ప్రణయరావు రచించిన ఓ గీతమాలిక ఒక శాస్తుల్లుగారు దీక్షగా చూస్తుండగా,

ప్ర - ఏమండోయ్, శాస్తుల్లుగారు! నా పద్యాలు అంతపరిశీలనగా చూస్తున్నారు. తప్పులుకోసమా ఏమిటి?

శా - అబ్బే! ఒప్పులకోసమే, దగ్గిరదారిగదా అని.

23

ఆగిఆగి స్కూలుఫైనలు పరీక్షకి వెళ్ళివచ్చిన రామయ్య కామన్నగారితో,

రా - లెక్కల పేపర్లో, వాడిదుంపతెగా, మేష్టరు చెప్పినట్టు “క్వాడ్రిలేటరల్” ఇచ్చాడ్రా!

కా - నువ్వు అదేనా చేశావా?

రా - లేదు. అది రాందే? “ఇంపాసిబిల్”ట!

కా - అవున్రా, మే వెళ్ళిన యేడూ అంతేట!

24

ముత్తయ్య - అదేమిట్రా, వడ్డికాసులూ! మెడ అల్లాఉంది దవడ వాచిందేం?

వ - పిప్పిదంతం తీయించుకున్నాన్రా. వైద్యుడు పొరపాట్న ఘట్టిదంతం పీకాడు. ఓ పట్టాన్ని ఊడకపోతేనూ రొమ్ము మీద కాళ్ళు దబాయించి పట్టకారుతో మెలెట్టి గుంజాడు.

ము - ఏముచ్చుగున్నాడొరీ!

వ - మామూలుగా పుచ్చుకునే రూపాయీకాక, ఇంకో రూపాయ ఇస్తేగాని కిట్టదన్నాడు.

ము - ఎందుకూ? పొరపాటు బడ్డందుకా!

వ - చెప్పాడుకాడు చచ్చినా!

మి - మెడపొడుగు చేసినందుకు గావును!

వ - కావును! మొదట్లోలేనిది ఇప్పుడు తలకాయి సరంబీకి తగుల్తోంది. పోదూ! మన సొమ్మెంతమంది తింటున్నారు కారూ!

25

సుందర్రావు - ఏమండి నరసన్నగారు! మన వాళ్ళంతా వచ్చారటా!

న - (ఇంట్లోకి చూసి) ఏమే! సుందర్రావుగా రొచ్చారు.

సుం - నవ్వుతూ అడుగుతున్నానూ. “ఏమే” అన్నారు గదా. పెద్దావిడ పలుకుతుందా, రొండో ఆవిడా ?

న - కావలసినప్పుడు ఎవర్తీపలకదు. అక్కర్లే నప్పుడు అంతా పలుకుతారు.

సు - సున్నితం, చెప్పకూడదుగాని, పెద్దావిణ్ణి “ఏమే” అని పిలవండి.

న - మరి తరవాత ఆవిణ్ణిమాత్రం ?

సుం - “ఏజ్యూస్” అని పిలిస్తేసరీ!

26

కొందర్ని కూచోబెట్టి శేషయ్య ఒకవ్రాతప్రతి చదువుతూ,

శే - "అంతట నతనికి దావామువేయ”

అని ఉచ్చరించగా, బోధపడక

ఒక శ్రోత - 'దావాము' ఏమిటి?

శే - ఉండండి. 'వా' మీద ఏదో అంకివేశారు. ఒక శ్రోత - ఆ అంకి ఉద్దేశం, కింద రాస్తారుచూడు.

శే - (చూసి) “అసలు 'హ' అని వ్రాయదలచి తలకట్టు మరచినాడ.”

ఇంకోశ్రోత - అబ్బా! ఎంతపనీ! ఇంకా ఏమన్నా రాశాడా?

శే - "అది అక్కడ ఉన్నట్టుగా భావించి చదువుకొనవలెను.”

మరో శ్రోత - హారి! ఎంత సిరాపాడైందిరా! వీడితలకట్టు బంగారంగానూ!

27

గోపాళం - రాత్రి నాటకం ఎల్లాఉందిరా. దాసూ!

దా - వేషాలూ, తెర్లూ, నాటకమూ, ఆడేవాళ్ళూ, మాత్రం పాతసరకు. సాంగ్సు కొత్తవేట గాని తబలావాడు మానేశాట్ట. లేడూ! ఉందీ!

గో - అయినా ! సరిగ్గా చెబుదూ!

దా - ఏమో! నేను ఈ మధ్య చూసినవాటిల్లోకి బాగానే ఉంది. అన్నట్టు నువ్వూ వచ్చావుగా! నీ కెల్లా ఉంది?

గో - నేను ఆ మధ్య చూడనివాట్లకంటే చాలా బాగుంది.

28

కోదండం తన స్నేహితుడైన బంగారయ్యతో కలిసి వచ్చిన కాశీగారితో మాట్లాడుతూ,

కో - నామాట కేవలం కొట్టిపారెయ్యకండి మరి, పది పణ్ణెండు భాషల్లో ప్రవేశంగల ముండావాణ్ణి.

కొ - ఏమేమిటం డవి?

కో - (గబగబా) తెలుగూ, ఇంగ్లీషూ, అరవం, కన్నడం, హిందూస్తానీ... (అని ఇక జ్ఞాపకంరాక) హిందీ....

కా - హిందూస్తానీ, హిందీ బహుదగ్గిరేగా?

కా - అయితేం లెక్కకి వేరేగా ?

కో - అయితేం మీరన్నవి ఆరేగా?

కొ - (కొంచెం తెల్లపోతాడు)

బం - ఆ ఆరూ రాయడంతోటి చదవడంతోటీ పన్నెండనే కాదూ నీ తాత్పర్యం?

కో - అడ్డమా! అదే. చూశారూ, కాశీగారు! వైఖరి కనిపెట్టడంలో మావాడి ప్రజ్ఞ ఇంతాఅంతా కాదు.

కా - తెలుస్తూనే ఉందండి. మీ ప్రజ్ఞకి అధమం రెట్టింపు ఉంటుంది.

29

విమలాపురంలో కథ చెబుతూ ఒక హరిదాసుగారు తాళం తప్పుతూండగా సభలో కూర్చున్న వారి సాటిహరిదాసు ఒకాయన అది భరించలేక,

సా - అయ్యా! మీరు ఫక్తు ఆ పాటేదో పాడుకుంటూ పొండి, తాళం ముట్టుగోకుండానూ! ఆ తాళంగొడవ నే చూస్తుంటానూ!

అనగా సభలో మరొకడైన త్రివేణిరావు సాటిహరిదాసుతో,

త్రి - అల్లాకాదండి. తమరు ఎల్లానూ తలపెట్టుకున్నారు గనక ఆపాటకూడా తమరే చూస్తే కృతార్థులం.

హరిదాసు - మరి నేనో!

త్రి - మీకేం గంతెయ్యండి హాయిగానూ!

30

రామయ్యా కామయ్యా. ఒకరోడ్డుమీద ఉన్న ఒకమనిషినీ ఒక దున్నపోతునీ చూస్తూ పొలాలికి అడ్డంపడి అటేనడిచి వెడుతూన్న సమయంలో ఒక మోటారుకారు వచ్చి దున్నపోతుని పక్కకాలవలోకి నెట్టి పారెయ్యడంతోటే ఆ మనిషి బూతులు తిట్టి కళ్ళెర్రచెయ్యడంచూసి డ్రైవరు ఆ మనిషిమీద ఓమనీ పర్సు పారేసి పోయేసరికి వీళ్ళూ రోడ్డుసమీపించగా,

మనిషి - (జాలిగా) పాపం! ఎవరిదో దున్నపోతు! ఏంచేస్తాడు డ్రైవరుమాత్రం?

కామయ్య - ఎవరిదైతేం? కారు ఆపద్దుటయ్యా, చచ్చు లాగ ఊరుకున్నావ్! అంటూ దున్నపోతుకి ఏదో చూస్తూండగా ఆ మనిషి పర్సు తీసి అందులో డబ్బులేకపోవడమేకాక అది చిరిగిపోయిందని కూడా గ్రహించి వాళ్ళతో,

మ - (కోపంతో) ఊరుకోడవేం? కారునెంబరు ఆరువేల మీద ఉంది. సాగతీద్దాం రండి!

31

సుబ్బన్న - ఒరేయ్, శ్రీరాములూ! మన శివరావు పాడుతూ మధ్య మధ్య హ హ హ హైఁ హై అంచూంచాడేమిషీ?

శ్రీ - తనపాట హాయి హాయిగా ఉంటుందని, ప్రాలుద్దంచేత విన్నవాళ్ళు, ఆలస్యంకాకుండా అనుకోడానికి,

సు - వెనక తను హైదరాబాదులో కొన్నాళ్ళున్నానని గర్వం కొద్దీ కాదుగదా!

శ్రీ - అందుకో, లేకపోతే తనుపాడేది హిందూస్తానీ బాణీ అని అందరూ గ్రహించడానికో.

సు - అహా అందుకనా! హల్లాచెప్పూ! హిప్పుడునచ్చింది!

32

చంద్రుడుగారు రాత్రి ఒంటిగంటకి మామూలుగా ఒకపని మీద బైటికిరాగా, గబగబా రోడ్డుమీద డాక్టరుగారు వెళ్ళడమున్నూ వెనకాలే భంట్రోతు రావడమున్నూ గమనించి, భంట్రోతుతో

చం - ఎక్కడకోయ్! తొందరగా వెడుతున్నారు?

భం - భగవాన్లుగారి ఇంటికండి.

చం - ఏమిటికథ?

భం - ఆయన "వైఫ్” గారు నెప్పులతో “ట్రబుల్” పడుతున్నార్టండి, “అర్జెంటు”గా “కా” లొచ్చి డాక్టరుగారు "ప్రెగ్నెంట్” చెయ్యడానికి వెడుతున్నారండి.

చం - వెళ్లుపాపం! ఇంగ్లీషులోకూడా గర్భకవిత్వం వచ్చున్టోయ్ నీకూ!

33

సంభావనదొడ్లో వెనకాల సూరయ్యతో,

కిత్తన్న - సూరయ్యా! గేటు కేసిచూడు! ఏ మిస్తూన్నటు?

సూ - అర్దా, పావలా, బేడాట! మనికి ఆఖరిదే!

కి - ఏడిశారు! నాకు అర్దే తెమ్మంటాను. ఎంతంతున్నాం, మనికి బేడేమిటి?

సూ - వాళ్ళకామాత్రం తెలియదూ! నీకు వచ్చి చచ్చిందేమి టంటారు!

కి - నాకేమీ ఎంతమాత్రం రాదుగనకనే పెద్దసంభావన ఇవ్వాలోయ్ చవటల్లాలా అని వాదిస్తాను. అయితేనూ, ఎంత మందో చూడు! సూ - ముగ్గురు, ఓడు సంచీపుచ్చుగున్నాడు. ఓడు సంభావన ముట్టడంతోటే మనిషిని కిందికి ఈడ్చేస్తున్నాడు.

కి - మరి మూడోవాడు?

సూ - ఈడవబడేవాడిచేతులో ఏమన్నాఉంటే తనుచ్చుగుని ఈడుపుపూర్తి అయింతరవాత వాడికిచ్చేస్తున్నాడు.

కి - సరే నేను ముందువెళ్లి ఈడ్చేవాళ్ళని ఈడ్చేస్తా అప్పుడు నాకు అర్ధ ఎల్లానూ ఇవ్వాలిగదా అని, ఈడవడానికి నన్నూ ఉండమంటారు. ఇంతతో నువ్వురా, నిన్ను ఈడవడం నాకు తరంకాదంటాను. నాకంటె గొప్పవాడవుకదా అని గ్రహించి నీకూ అర్ధ ఇస్తారు.

34

సేతుపతి గారింట్లో సదస్యం సందర్భంలో దొడ్డిదగ్గిర ఒక తిమ్మయ్యగారికి అణా యివ్వగా, ఇచ్చినవాడితో.

తి - తాటిమట్టలు పాదాలకి కట్టుగుని, పుంత కడ్డమడి, చెవులు ఘడియలడి, ప్రాణంకళ్ళంటి, దేవుడా అంటూ వస్తిని గదా. అణాటయ్యా, నాకూ!

ఆయన - నీకు ఏమేంవచ్చు?

తి - నాకా! నాకు లక్షవచ్చును. అదంతా యెల్లా యిప్పుడు చెప్పడం! పెళ్లికి తెలుపులిస్తారని పుకారువెయించి, అర్థణాటయ్యా. వెధవఅర్ధణా!

అనేసరికి ఇచ్చే ఆయనదగ్గిర మద్దతున్న మనిషి తిమ్మయ్యని దవడ ఊడ్చి వీధిలోకి లాగగా, తిమ్మయ్యవెళ్లి మైలవాడికి మల్లే గంధం పెట్టుగుని జుట్టు విరబోసుగుని మళ్ళీవచ్చి వీధికి అడ్డంగా నిలబడి ఆకాశంకేసి చూస్తూ పొత్రంతో పొట్ట బాదుకుంటూ.

తి - అయ్యొ దేవుడా ! ఈ సేతుపతిగారింట్లో పెళ్ళి అనే నిమిత్తం కల్పించి నన్ను రప్పించి లాక్కుపోతున్నావుట్రా! అంటూ గోలగా ఏడ్చేసరికి. సేతుపతి పరిగెత్తుగొచ్చి,

సే - అయ్యా! నన్ను కటాక్షించండి! ఇదిగో రూపాయి! తగ్గండి. లెండి, స్నానంచేసి మడికట్టుగుని రండి, అనగానే తిమ్మయ్య అది పుచ్చుకుని స్నానానికి వెడుతూండగా, అతనితో అతని స్నేహితుడైన సమ్మయ్య,

స - నిజంగానే కొట్టుగున్నావురా పొత్రంతో! నెప్పట్టలా?

తి - లగ్గసరికాదుట్రా మరీ! ఊహూ అజీర్ణం! ఎంజెయ్యనూ!

35

ఎల్లానైనాసరే ఒప్పించి భోజనం చెయ్యాలని ఒక గృహస్తు ఇంటికి కామాక్షి సుందరం వెళ్ళి, కొంత ప్రసంగం నడపగా,

గృ - అల్లాయితే మీకు పనసరాదూ?

కా - రాకేమండీ! కొదోగొప్పో, యథాశక్తి, వాణీ కటాక్షం వల్ల, నేనూకొంత, దాని బొడ్డుబొక్కా మరి...

గృ - ఏదీ, కొంచం!

కా - నాకూః అయిదుగురూః కొడుకులూఃఅందులో:

గృ - ఇదీమిటండోయ్! ఇది సంస్కృతమే కాదుగా!

కా - మీరెరగరుపాపం! తెలుగులోమాత్రం లేదూ, పనసా!

గృ - ఉంటేమట్టుకు, ఉదాత్త అనుదాత్తాలో! కా - ఇప్పుడు మన సంభాషణయావత్తూ అనుదాత్తం! భోజనం అరణ్యమెంటు చేయించండి ఉదాత్తంపూచీ నాదీ!

36

ప్రకాశం -- ఏమండీ మేష్టారూ!

మే - ఏమిటి?

ప్ర - ఈగంట మాకు డ్రాయింగులేదండి!

మే - శుభం. ఇప్పుడు ఏమిటి నువ్వనేది?

ప్ర - ఎవరో ఉందని అన్నారు నాతో!

మే - నీ 'తో' అన్నది ఇంగ్లీషు నేనా?

ప్ర - అవునండి,

మే - అంటే తక్షణం ఆ డాయింగేకానీ!

37

నాగమ్మగారు ఇంటికొచ్చిన తన చెల్లెలి మరిదితో ముచ్చటించుతూ.

నా - మీరేమన్నా చదువుకున్నారా?

మ - దులాబీగా తిరగడంచేత చదువు వెన్నేసిపోయిందండి మనికి.

నా - ఏమన్నా, ఉద్యోగమాండీ?

మ - అబ్బే! మనకి ఓటే ఉద్యోగమండి!

నా - ఏమన్నా పిల్లలాండి?

మ - మనికి ఆబాధోటి లేదండి నేటివరకు!

38

ఒకాయన ఉద్యోగం దొరక్క గర్వంచచ్చి శాంతం హెచ్చి మేస్టరీ ట్రైనింగులో చేరిన కొత్తరికంలోనే ఒకనాడు డ్రాయింగు గంటలో డ్రాయింగు మేష్టరు ఒక నక్కబొమ్మ గోడబల్లమీద గీయగా.

ఆయన - (ఏర్పడని పరిచయంతో) అదేం కర్మమండోయి మేష్టారు! ఎక్కడో పెద్ద “డిజ్ అప్పాయింటుమెంటు” అయి వచ్చినట్లు తోకముడుచుగున్నట్లు అల్లా వేశారేం నక్కనీ?

మేష్టరు - "అప్పాయింటుమెంటు” అయినతరవాతగదా తోక లేవడం, ఇప్పణ్ణించీ ఎందుకని!

39

రామగోపాలం - ఒరేయి, వరదరాజులూ! నువ్విచ్చేవన్నీ దొంగసాక్షీకాలని రత్తయ్య నిన్ను యాగీ పెడుతున్నాప్ష!

వ - నిజం! నిజమే! వెళ్ళి పళ్ళూడగొడతా ఒక్కలెంపకాయితోటి.

రా - (చప్పరించి) ఒక్క లెంపకాయకి ఎన్ని ఊడతాయి మహా!

వ - ఏం? రెండువరసలూనూ!

రా - అల్లాయితే, రెండుమూడు కొడితేగాని తెమల్దేమో!

40

ట్రైనింగు అయిన ఒక మేష్టరు ఒకస్కూలుతాలూకు కమిటీ మె (నె) 0బరు దగ్గిరికెళ్ళి నమస్కరించగా, మెం - ఏం సెప్పుగోవాలో సెప్పుగో మాతోటి!

మే - తమ స్కూల్లో పోస్టు ఖాళీట.

మెం - అయితే! దరఖాస్తు ఇయ్యి! సూద్దారి!

మే - దానికి జీతం ఏమిస్తారు?

మెం - అది నీకొచ్చేడవద్దూ! ఏదోయిత్తారు! (హేళనగా) భోయినం ఎట్టీ యీధిగదిత్తారు! ఎల్లూ!

మేష్టరువెళ్ళి అప్పుడే మళ్ళీ వచ్చి,

- పోనీ ఆగది, లోపలిగది, అయేటట్టు చూడండి. పబ్లీకున అల్లరిలేకుండా గుట్టుగా జీవిస్తాను, తీరిపోతుంది.

41

థర్డుఫారంలో ఇంగ్లీషుపాఠం చెబుతూండగా, “హౌస్ ఆఫ్ లార్డ్స్” అనేముక్క ప్రయోగించి.

మేష్టరు - మీరు విన్నారా, “హౌస్ ఆఫ్ లార్డ్స్” అనేది, లేక ఇదే వినడమా?

గుర్నాధం - అందులో మెంబర్లని బొమ్మలో చూశానండి, చాలామంది దొర్లు కూచున్నారు.

మే - ఆడవాళ్ళు లేరూ?

గు - ఎల్లాఉంటారండీ! ఉంటే ఆభాగాన్నేనా “హౌస్ ఆఫ్ లేడీస్” అనాలి.

మే - నువ్వెరగవోయ్! అందులో పురుషులు స్త్రీలూకూడా ఉండచ్చు!

గు - అది తెలుసండీ! అదేగదా “హౌస్ ఆఫ్ కామన్సూ!”

42

బసవయ్యగారు లెఖ్ఖ తెలియక సంచీలో ఒక రూపాయి నాణెం, పావలాకాసూ, అణాకాసూ వేసి మొత్తం మీద 'మూడు' అని జ్ఞాపకం ఉంచుగున్నాడు. వాళ్ళబ్బాయి లెక్కల్లోవాడు. వాడు అవిలాగేసి వాటిస్థానే ఓపదిడబ్బులు గిరవటేసి మళ్ళీ సంచీ కట్టేశాడు. మర్నాడు బసవయ్య మళ్ళీ లెఖ్ఖచూసుగుని, సొమ్ము హెచ్చయినట్టు తనికితోచి, కుర్రాణ్ణి పిలిచి,

బ - అబ్బాయ్! సంచీలోకి ఇన్నెల్లావొచ్చాయిరా?

అ - (శ్రమించినట్టు) నేను సంపాదించి అందులో కలిపేశాను నాన్నా!

బ - (మూడు నాణాలుంచుగుని తక్కినవి ఇచ్చేస్తూ) ఛిఛీ!

నీసొమ్ము నాకెందుకురా! నీ డబ్బులెట్టి నువ్వు ఇంచఖ్కా ఏమన్నా కొనుక్కో.

43

అచ్యుతం - ఆదెయ్యా! పూర్ణయ్యపాకం ఎల్లా ఉంటుంది?

ఆ - ఓ మాభేషుగ్గా ఉంటుంది.

అ - నిజంగా చెప్పూ!

ఆ - వేళాకోళంకాదు. ఒకటోరకంగా చేస్తాడు. పూర్ణయ్య శీతాకాలంలో. వెనక చారుకాచడంలో అంతటివాడు లేడని అతణ్ణి గరిటె చేతికిచ్చి ఊరేగించారు ఎరగవ్?

అ - ఎరుగుదున్లే. కాని, నువ్వు శీతాకాలం అంటున్నావు, వేసంకాలం మాత్రం !

ఆ - అబ్బే, అప్పుడూ దివ్యంగానే ఉంటుంది కాని, ఒకటీ ! వేసంగిలో అతనుచేసే ప్రతీవంటాకూడా ఎక్కువ ఉప్పు అతను వెయ్యకుండానే మరీ ఉప్పఉప్పగా ఉంటూంటుందని అంటారు భోక్తలు!

44

తండ్రి - అబ్బాయీ! చూసిందల్లా కొని త గలెయ్యకురా మరీ! నేన్ తేలేనూ ! ఊహూ మనింటో డబ్బులు కోళ్ళేరుకు తింటున్నా యనుకున్నావా, మనకేమన్నా డబ్బుల్చెట్టుందా!

అ - ఏమిటినాన్నా అల్లా తెలియకుండా కేకలేస్తావ్ నేను నీకు పాతికరూపాయలు నయంచేసి పెడితేనూ!

తం - అదెప్పుడూ?

అ - మరి, నేనీయేడు ప్యాసయితే నువ్వు పాతికరూపాయలిస్తానన్లేదూ నాకూ!

45

శివయ్య - బాలయ్యకి గుండెజబ్బుట! విన్నావా!

భార్య - లేనిపోని మాటలాడకండి!

శి - నిజమేట. చాలామంది చెప్పారు. వొఠ్ఠిమాటలని చూస్తున్నావా?

భా - వొఠ్ఠిమాటలా మళ్ళీ మాట్టాడితే శుద్ధ అబద్దంమాటలా?

శి - అల్లాయితే నువ్వు నమ్మనంటావా?

భా - సుతరామూ నమ్మను.

శి - అంతరూఢిగా నీకెల్లా తెలుసూ?

భా - అసలు అతనికి గుండె ఏడిసిందా ఏమిటి!

46

శేషాచలం - ఏంరోయ్ దామోదరం! పరీక్ష మళ్ళీ గీకేసిందని విన్నానే. నాదీ అంతే. అది ఇహతెమల్దురా. నేను ఫేలయినందుకు ఏమీలేదు, మనం పుస్తకం విప్పంగా! నీపేర్లేదే లిస్టులో చచ్చు పెద్దమ్మలవన్నీ ఏడిశాయి!

దా - అల్లానే జరుగుతూంటుంది! మార్కులు పరిష్కరించే చోట శుద్ధబ్లాక్‌హెడ్‌లు పోగైనప్పుడు ఏమవుతుంది?

షా - అయిందేదో కాగా నోటివట్టంమాటలుకూడా ఎందుకూ!

దా - తప్పేముందోయ్! ఆ కచేరిలో జిల్లాఒక్కంటికి ఒక “బ్లాకూ” ఒక్కొక్క 'బ్లాక్' కి ఐక ‘హెడ్డూ' ఉంటారు.

47

వ్యాఘ్రి - వామన్రావ్! పుట్టయ్య కనిపించటం లేదేం?

వా - అహఁ ఇందాకా, మనపక్కనించి వెళ్ళలేదుట్రా, బజార్లో?

వ్యా - ఎప్పుడ్రా!

వా - ఏడిసినట్టేఉంది. నువ్వు మిఠాయి దుకాణంమీద రుచి చూస్తానని చెబుతూ పకోడీలకి అడ్డంపడ్డప్పుడు!

వా - అల్లాయితే నేను వాణ్ణి ఆనవాలు పట్టలేకపోయానంటావా!

వా - వాడికి వెనకటి మొహంతీరే పోయింది. పైగా ఇప్పుడు గర్వం కూడానూ!

వ్యా - మొహం తీరుపోవడం ఏమిటి? గర్వం ఎందుకు?

వా - తను మహామహా గవర్నమెంట్లవల్ల కానిపని చేశాను గదా అని.

వ్యా - ఏమిటాపని?

వా - పాతిగముప్ఫై పన్నులు తీయించిపారెయ్యడం!

48

వై - ఏముటో! ఊరికేను! మన ఆయుర్వేదానికి ఆంక్షపెట్టేసి, ఆ మ్లేచ్చుడి అసందర్భ వైద్యానికి ఎగడతానంటావేమిటి? వాడు పుటాలెరుగునా, భస్మాలెరుగునా, ఆనవాలెరుగునా. అరిష్టాలెరుగునా?

రోగి - ఎరుగును.

వై - ఎరగడు. నీపక్షవాతం వాడికి లొంగదు.

రోగి - లొంగుతుంది నే పోతాను.

వై - నువ్వు నడవలేవు, వెళ్ళకు.

రో - వాడు తెలివి గలవాడయ్యా!

వై - కాడయ్యా, అల్లాకనిపిస్తాడు. నేను కుదరుస్తానయ్యా!

రో - నీవల్ల కాదయ్యా !

వై - వల్లకాకపోతే మంచి కర్రకాళ్ళేనా చేయించి ఇస్తాను. ఆమాటకూడా అనని వాడిదగ్గిరికెళ్ళి అన్నిందాలా పాడవకయ్యా, నీతో చావొచ్చిందీ!

49

వీరలింగం - జగ్గయ్యా! ఎక్కడికి?

జ - పొడుగు కొల్చుగోవాలి.

వీ - నీ పొడుగు బొగ్గులైనట్టేవుంది. పోలీసులో జేరతావా ఏమిటి?

జ - అబ్బే! నేను ప్రతీసోమవారం కొల్చుగుంటూ ఉంటా నసలు!

వీ - ఏం?

జ - ఆదివారం ఆదివారం తలంటు పోసుగుంటాను? అంచేత.

50

రత్నపతి - సురేశం! ఎక్కడికన్నావు ప్రయాణం!

సు - కాశీ.

ర - ఇది యింకా ఉత్తరాయణమేగావును!

సు - అయితే?

ర - ఈ ఆయనంలో మీనాన్నకి ఏమీ ప్రమాదం ఉండకూడదుమరి, దక్షిణాయనం రానీ!

సు - ఎందుకూ?

ర - ఏకంగా అప్పుడు వెడుదువుగాని! రెండు ఖర్చులు ఎందుకూ! ఎముకలు పొడుంచేసుకోడం ఎందుకూ!

51

కొడుకు చదువుకోడం తప్ప ఇంకేమీ ఆశించని, ఒక తండ్రి - నువ్విప్పుడు చదివే యఫ్.యే. ఎన్నాళ్ళురా. అబ్బాయి!

కొ - రెండేళ్ళునాన్నా, ఏం?

తం - యం.యే. అంటారు, అదెన్నేళ్ళు?

కొ - అదీ రెండే!

తం - దీనికి మల్లేనే దానికికూడా క్లాసులోజేరి తంటాలు పడాలి గావును! కొ - ప్రైవేటుగా వెళ్ళచ్చు!

తం - అల్లాయితే దానికి తక్షణం ప్రైవేటుగా కట్టి చూడకూడదు. నువ్వూ, అదృష్టం ఎల్లాఉంటుందోనూ?

52

వనమయ్య తనికి మంచినీళ్ళు ఇయ్యగా, తాగి, చప్పరించి, కోటేశ్వరరావు - వనమయ్యగారూ! మంచినీళ్ళు కొంచెం కారం కారంగా ఉన్నా యేమిటి?

వ - ఎమోబాబూ! అక్కడికీ నేను కారం జాగర్తగా చూసే వేశానండీమరీ! ఎంచేత అల్లాఉన్నాయో!

కో - సంతోషించాంలెండి, కారంవేశానంటూ స్వంతకవిత్వం కొంతా మీరు!

వ - చాల్లెండి కారంగా ఉన్నాయంటూ సొంత పైత్యం కొంతా మీరు!

53

స్నేహితులు - సుందయ్య? నీకు డొక్కచీలిస్తే ముక్క లేదుగదా! సంస్కార్లతోపాటు, సంభావన, రూపాయి ఇచ్చిన వాడెవడ్రా?

సుం - అందరు పెద్దవాళ్ళూ వెళ్ళేవరకూ ఆగి అప్పుడొచ్చాన్నేను.

స్నే - వస్తే!

సుం - అడిగారు, ఇదివరకు వెళ్ళిన పెద్దవాళ్ళతో రాలేదేమని, వాళ్ళు పరమశుంఠ లవడంవల్ల వాళ్ళతో కలిసి నే రాలేదూ, కావలిస్తే నన్ను పరీక్షచేసుకోండన్నాను. అని ఏవో పులగపుశ్లోకాలు రొండు దంచాను.

స్నే - వాళ్ళు పోల్చలేదూ!

సుం - వాళ్ళ కవేనా రావుగా మరీ!

సుం - హారి! ఏం పుణ్యంరా! మమ్మల్నికూడా లాక్కుపోరా!

సుం - మనం చాలామంది ఓచోటే ఉంటే తెలిసి పోతాంరా! పోలికలు ఉండకపోవ్! పైగా నవ్వొస్తుంది.

54

అప్పయ్య - కుర్చీలో కూర్చోరా, తిమ్మరాజూ! వస్తున్నా. అని ఇంటిలోపలికి వెళ్ళివచ్చి, మంచినీళ్ళు తెచ్చి, ఇంకా ఏదో దెచ్చి తిమ్మరాజుకి అందిస్తూ,

అ - ఇందరా! కొంచెం పుచ్చుకో! ఈ మధ్య మా చెల్లాయి హేమలత..........

తి - ఏమిటిదీ!

అ - చలిమిడి?

తి - ఇంకా చిమ్మిలేమో అనుకున్నాన్రా! పిల్లా! పిల్లాడా?

55

వీధులో వెడుతూన్న కుంచెన్నని 'మాట' అని ఇంట్లోకి పిల్చి ఈశ్వరయ్యగారు కుంచెన్నకి దవడశుద్ది చెయ్యగా.

కుం - (తిరిగి అప్పట్లో జబరదస్తీ చెయ్యలేక) ఇదిటయ్యా నమ్మించి, లోపలకీరమ్మనీ! ఆలా యీలా కాకుండా చదివావు, ఇదేనా నీ లాహిరీ!

ఈ - ఈపాటికి కిక్కురుమనక రోడ్డుచ్చుగో! మాటాడోచ్చావు పైగాను! “ప్లీడర్ల బల్లలు నాలుగైదు తీసిపారేశానండోయ్” అని నాతో వెనక అన్నావ్, నీపోటిగాడే ఇప్పుడు నాబల్ల తీసేసి తూంలో గిరవటేశాడు. కుం - నాపోటిగాడైతే నన్నెందుకూ కొట్టడం?

ఈ - వాడికీ నీకూ తేడా ఉందేమో చూడ్డానికి ముందు నీ దవడ కొల్చాను. వెళ్ళి వాణ్ణి తీసుకురా! తేడాఉంటే ముదరాయిస్తాను.

56

సారధి - అల్లాయితే వొఠ్ఠిదే, గణేశూ! మళ్ళీ పెద్దజంతువులా ఉంటాడు పైకి! కుస్తీమాట అటుంచి, ఆ పంజాబీ వచ్చేటప్పటికి వీడికి వాంతులూ అవీకూడా పట్టుగున్నాయిటేమిటి?

సీతారాం - నిజమే. అదివరకు ఆ పంజాబీ పేరుచెబితే మీసంమీద చెయ్యేసేవాడు. వఠ్ఠి వ్యర్ధప్రజ్ఞలు తప్ప ఏమీలేదు ఉత్తరుడు!

సా - అబ్బే! ఉత్తరుడు ఇంకానయమే. అర్జునుడితో కొన్ని మాటలేనా ఆడాడు. వీడు అదీలేదు. ప్రతీదానికి వీడు శుద్ధ నిరుత్తరుడు!

57

అత్త - లేవండి! కాళ్ళు కడుక్కోండి, సంధ్యవార్చడానికి దానికీ ఇంకా ఆలస్యం అవుతుంది గావును! అయింది వంట,

అల్లుడు - సంధ్యవార్చటం అయి చాలాసేపయిందండి!

అత్త - ఎక్కడండి?

అ - ఇందాకా ఆకాలవలో!

అత్త - కాలవకి నీళ్ళు ఇంకా రాలేనట్టుందండీ?

అ - వస్తున్నాయి లెండి, మీ ఊరుదాకా రాలేదేమో, నలుగురుముగ్గురు చెప్పారు.

అత్త - మావూళ్ళో అసలు కాలవేలేదండీ!

అ - అల్లానా! మీవూళ్ళో ఎంతెంత అబద్ధాలకోర్లు ఉన్నారండి!

అత్త - ఉంటేం? మీరే నెగ్గారు, లేవండి. -

58

కనకయ్య - భాష్యంమామా! పింఛను, ఏనెలది నీకు చేరకపోతా, రామేశ్వరం ప్రయాణంవల్లా?

భా - జూలైది.

క - తరవాతవి ముట్టాయా, ఈ నవంబరు వరకూ!

భా - ఆ.

క - అల్లాయితే జూలైది పంపడానికి పైవాళ్ళకి ఆక్షేపణ ఏమిటి?

భా - ఏమో వాళ్ళబొడ్డుబొక్కా! జూలైలోకూడా నేను జీవించి ఉన్నట్టు సర్టిఫికెటు కావాల్ట. లేకపోతే పింఛను ఛస్తే పంపరుట.

క - అవు నవును, చచ్చినా పంపరు.

59

సర్రాజు - ఏమండీ! జ్వాలారెడ్డిగారు! చెన్నపట్నం వెళ్ళెచ్చారూ?

జ్వా - ఏదో మళ్ళీ వచ్చి ప్రజల్లోపడ్డాం!

స - ఎక్కడ బస?

జ్వా - చాలా బహిష్టోపులున్నాయి, ఆ దగ్గిరేఉంది ఒక ఆంజినీలు వుటేలు, అందులోకి తీసికెళ్ళారు ప్లీడరు. స - పట్నంలో గొప్పగొప్పవి ఏమన్నా చూశారా?

జ్వా - ఎవడో దొరటండి. ఎక్కడ చూసినా వాడికొంపలే. అవి చూశాం వీధికి అయిదారు చొప్పున.

స - ఆ దొరెవడండోయ్?

జ్వా - టొలెట్టు దొరటండి. |

60

అన్నదమ్ముల పంపకాలమీద లెక్కయిచ్చి, కొంతసేపు చూసి, ఎవరూ చెయ్యలేకపోగా,

మేష్టరు - సీరయ్యా! అన్నగారికి ఎన్నివంతులు? అని వుంది లెక్కలో?

సీ - పదిహేనండి.

మే - ఎన్నింటికీ? కళ్ళులేవూ?

సీ - నూటికండి.

మే - నూటికి పదిహేనయితే, ఒకటికి?

సీ - నాకు రాదండి.

మే - ఏంతెగులూ, రాకపోడానికీ?

సీ - ఇప్పుడే వెళ్ళొచ్చానండి.

61

తెలుగుమేష్టరు - లోకయ్య! పండిత పుత్రుడు - అంటే ఏమిటి?

లో - పండితుని యొక్క కొడుకు.

తె - సరే, కాని, సాధారణంగా అది ఏ అర్థంలో వాడతారు?

లో - తెలియదండి.

తె - తెలియనివాడు - అనే అర్థంలో వాడతారు.

లో - అల్లావాడడం తప్పు కాదండీ?

తె - ఏడిసినట్టేవుంది, నువ్వేనాఏమిటీ చెప్పేవాడివి!

లో - కాదండి. పండిత మోతీలాల్‌గారి పుత్రుడు పండిత జహ్వర్‌లాల్ కాదండీ! ఇక ఆ మాటలకి అర్థం మార్చాలి, .

62

లక్ష్మమ్మ - గురవావధాన్లుగారూ! గోదావరి ఎప్పుడొస్తుంది ఈ యేడూ? ఇహమరి ఆషాఢం జొరబడిందికదా!

గు - శుద్దాష్టమి దాటదుగా!

ల - ఎవడెరుగు నాయనా. రూలుసామటీ, ఆఖండగౌతమికి?

గు - మరి ఎందుకు అడిగారూ? కవికి లెఖ్ఖేమిటి, దాన్ని బంధించాడు.

ల - ఏమని?

గు - ఆషాఢశుద్ధ సప్తమ్యాం వచ్చునే వృద్ధగౌతమీ!

అధవాతప్పిజారీనాం అష్టమ్యాం ఇహతప్పదూ||

ల - ఔర! ఔరా! ఏం కవులండీ!

గు - అడ్డం ఏమిటీ? గోదావరిలో మునిగితేలిన ప్రతీ పక్షీ కవే!!

63

రాంభొట్లుగారు ఓచోట తేరభోజనం ఊపిరి సలపకుండా వాయించేసరికి ఆయాసం హెచ్చిపోయి, కళ్ళు మూతలడి, తాపం ఇనుమడించగా ఉపశాంతికోసం గోదావరిలో దిగి కంఠంలోతు నీళ్ళల్లో ఉన్న సందర్భంలో ఒక చచ్చిన గేదె కొట్టుకుపోతూ అతణ్ణి తాకగా, అతడు కళ్ళుమూసుగునే తడిమి ఉబ్బిపోయి వున్న దాని పొట్ట గమనించి.

- ఓహోహొ! తమరా!

- మీరూ వచ్చారూ?

- (పొట్టఎత్తు గ్రహించి) అయితే మీరు లోపలిబంతివారా?

- వడ్డించేవాడు మీవాడా?

- సరిసరి, వండిందే మీవాడా!

64

పుల్లయ్య - ఏడిశాడు. జానికిరాముడు! గంగయ్యకీ వీడికీ సాపత్యం కూడానా! గంగయ్య వంటకి జింహ లేచొస్తుంది. వాడిచెయ్యి అమృతోపమానం.

కూర్మయ్య - ఆ. చెప్పిచెప్పి గంగయ్యనే చెప్పాలి. చేశాడు మొన్న సంతర్పణకీ! తిన్నాం! ఎవ్వడూ కిందుమ్మోయ్య లేదు. జానకిరాముడు, గాడి అంటించి, గరిటి చేతపడితే, దేవతలుకూడా పిలవందే భోజనానికొస్తారు, వాడిది భీమపాకం.

పు - ఛీ ఛీ వాడేమిటి? గంగయ్యెది నలపాకం.

కూ - నోరుమూయ్. గంగయ్యెవడూ, జానికి రాముడిది హరిశ్చంద్రనలోపాకం.

65

ఒక సంగీతం మేష్టరు ఒక అమ్మాయికి పాఠంచెబుతూ "కా-మీ-తా, కా-మీ-తా” అనేదాల్లో 'మీ' అనే అక్షరం తరవాత ఒక సంగతి తనగొంతికతో తను వెయ్యలేక ఎల్లాగోపాడి 'మీ' తరవాత మంచి సంగతి ఉందమ్మా! అను, అను.

అమ్మాయితండ్రి - అదేమిటండోయ్! మీరుపాడి వినిపించాలిగాని 'మీ' తరవాత సంగతి ఉంది అనమంటారేమిటి?

సం|| మే|| - అయ్యా! సంగీతంలో ఇరవైయేళ్ళకృషినాది! రెండువందల గీతం వందవర్ణం త్రికాలాల్లోనూ పాడడం కావేరీ తీరాన్ని నేర్చినవాణ్ణి! భగవింతుడు ఆకాస్త గొంతిగా ఇచ్చాడు కాడు, నాఅంతఊహ ఎవ్వడికీలేదు.

తండ్రి - ఊహకేం? జంతువులకీ ఉందేమో పాడిం తరువాతేగా గానం!

సం - ఏమోనండి! ఈకృషేగనక ఇంగ్లీషువంటి దాలో ఉంటే ఏ బియ్యేబియలో చులాగ్గా ఈడ్చేసి ప్లీడరీ చేస్తూండేవాణ్ణి!

తం - (తను ప్లీడరు అవడంవల్ల) అది సునాయాసమనా మీ ఉద్దేశం? ఒక్కొక్కక్లాసు ఆరేసేళ్ళు చదివిన ఓపికరాయుళ్ళున్నారు. మీసంగతి అల్లా వచ్చేదేమో!

సం - మరోమోస్తరుగా అనుకోనియ్యరేమిటండీ! బాగానే వచ్చింది. అల్లాయితే మరోణ్ణి చూచుగోండి, పాఠానికి!

66

శేషశాయిగారికి చారువడ్డించి, ఆయనభార్య మళ్ళీ దేనికో వంటయింట్లోకి పోగా,

శే - అవునే, చూడూ! భా - (వచ్చి) ఏమండి?

శే - చారెవరు కాచిందీ?

భా - నేనే. ఏం?

శే - ఎవరేనా వెధవ ఆవిడేమో అనుకున్నాను.

భా - ఎంత నిర్దయులండీ! అదా! నిజమే! అదంతా నేనే దాచేసుగున్నాను. అందులో వెయ్యడానికేమీ మిగల్లేదు.

67

కుండనాల వీరావధాన్లు పట్నం వెళ్ళి బంధువులింట్లో బసచేసి, సాయింత్రపు వేళ వీధులు తిరగడంలో ఒకవీధిని ట్రాంపోతూండగా, ఆపుమని సంజ్ఞచేయగా,

ట్రాంవాడు - (వడి తగ్గించి) ఊఁ, ఏరయ్యా, శీగిరం!

వీ - ఏరడానికి నాకెంపట్టింది గాని, ఎదరదార్లో పులిస్తరాకు కూడా ఉన్నట్టుంది. బండీ కాస్త తప్పించి మరీతోలు! .

68

ఒక రాత్రి ఒక హరిశ్చంద్ర నాటక ప్రదర్శనంలో విశ్వామిత్రుడికి మ్రొక్కి

హరిశ్చంద్రుడు - మునివరా! నాతప్పు సైరింపుము.

వి - ఛీ, మూర్ఖా! ఏలరా ఈ నక్కవినయమూ! నన్నంటకుమురా!

అని కోపిస్తూ, లోగడ హరిశ్చంద్రుడు కాంచిన కలప్రకారం జరిపే సదుద్దేశంతో అతని కిరీటం ఊడగొట్టడానికై ఒకతన్ను తన్నగా, ఆ తాపు దూసుకుపోయి, తన కాలికి ఉన్న పాంకోడు పావురాయికిమల్లే పైకి ఎగిరి హరిశ్చంద్రుడు నెత్తిని పడబోయినప్పుడు అతడు ఒసిలి తప్పించుకోగా, విశ్వామిత్రుడు ఆ పాంకోడు మళ్ళీ తొడుక్కుని, ఇంకా కోపంతో అతడు కణతమీద తన్నుతూ,

వి - నాదగ్గరటరా, నీ తలవిసురూ.

69

సత్రం గదుల్లో ఒకదాల్లో ఉన్న పెద్దమనిషితో,

బాటసారి - తమది ఏవూరండి? -

పె - కాకినాడ. ఏం?

బా - ఊరికేనేబాబూ! పేరు!

పె - దోసపాటి నాగారావు.

బా - తమకి ఏమన్నా ఉద్యోగమా అండి?

పె - (పక్కగదిలో మకాంఅయివున్న కలక్టరుగారి భార్యకు వినపడేటట్టు) ఈ గదిలో దిగారేం, ఆ కలెక్టరుగారి సర్కీటు గుమాస్తాని.

బా - తమకి ఏమన్నా సంతానమా?

పె - పింఛను పుచ్చుగున్న తరవాత అడగవలసిన ప్రశ్నలు ప్రస్తుతం అసందర్భం గనక ఊరుకోండి.

70

వాయిస్తూన్న వీణదించి సాగరంగారు ఒకమాటు బైటికి వెళ్ళడం కనిపెట్టి, సభలోంచి ఓఆయన తారాజువ్వలాగా వెళ్ళి “అదేమిటి, అదేమిటి” అంటూ మొత్తుగుంటూన్నా వినిపించుకోక, వీణ రెండుముక్కల క్రింద విరిచి అక్కడ పెడుతూండగా వైణికుడు వచ్చి అయ్యో అని నిర్ఘాంతపోగా, ఆయన - (గర్వంగా చేతులు దులుపుకుంటూ) ఆశ్చర్యం ఎందుకండీ! ఇదో లెఖ్ఖనుకున్నారా ఏమిటి?

వై - నా నడుం విరిచేశావు, పాపిష్ఠీ! పైగా వాగుతావెందుకూ?

ఆ - గంటనించి చూస్తాను, సంగతే కనిపెట్టలేక పోయావు, పైగా వాగుతా వెందుకూ?

వై - ఏసంగతి?

ఆ - సంగతా! పాతినగుంజ పెల్లగించడానికా అన్నట్టు గింజుకున్నా వేగాని, పట్టుతెలుసుగోలేక పోయావు.

వై - పట్టేమిటీ?

ఆ - పట్టా! టుంయి టుంయి మనిపిస్తే లొంగుతుందా ఇదీ? నేను వాటం కనిపెట్టి మోకాలికి దాన్నిడబాయించి చిటిగెలో టుప్పు మనిపించాను, నువ్వునన్ను మెచ్చకపోతే సరనుకున్నావా?

71

రంగయ్య - వెన్నముద్దగారూ! ధప్పళం ఎల్లాఉందీ?

వె - ఓ ఏం చెప్పను! లంఖణాలముండావాడు అన్నంతినేట్టుంది.

రం - నిజంగా చెప్పండి!

వె - ఒట్టండీ! స్వర్గానికి బెత్తెడు ఎడంగా వంటఉంటే ఇంకా ఏముటో నిజం చెప్పమంటా రేమిటి?

రం - అహఁ. మీ అన్నయ్య స్వర్గానికి మూడువేళ్ళే ఎడంగా వంట ఉందన్నాడు లెండి.

వె - అందుకా! సరె. వాడివేళ్ళు లావుకాదు మరీ! అంచేత అలాఅన్నాడు.

రం - ఓహోహో! మీకు తమ్ములు లేరుకదా అనా మీ ధైర్యం!

72

శంఖయ్య ఒక బస్తీలో ఒక మేడఎదట నిలబడి చూస్తూండగా, అతణ్ణి పదేళ్ళక్రితం కలుసుగున్న పరదేశి అనే స్నేహితుడుకూడా అక్కడికే వచ్చి,

ప - ఇదుగో! ఇక్కడేనా మకాం? చాలాకాలం మైంది చూసి.

శం - మరే.

ప - ఉద్యోగమా?

శం - మరే.

ప - ఎక్కడా, ఎందులో?

శం - పోలీసు సంబంధం.

ప - వెడతాను. కచేరీకి వెళ్ళాలిగావును.

శం - అక్కర్లేదు, తీసేశారు. ఈ ఉదయంనించి ఖాళీ.

ప - పనిప్రయత్నం చెయ్యడానికి ఈమేడలోకి పోతావా?

శం - మరే.

ప - వెళ్ళు. పోతాను.

శం - నా వెనకటిపనే సంపాదించాలంటే కొంత రహస్యంగా వెళ్ళాలి. రాత్రి వెడతాన్లే. ప్రస్తుతం నీతోనే వస్తాను, నడు.

73

హరికథ ప్రారంభించ బోతూండగా, యజమాని వచ్చి, కేతయ్యదాసుగారి చెవులో, అయ్యా! పాలమాటేమిటి? మీరు మామూలుగా పుచ్చుగోడం ఎప్పుడూ?

కే - తక్షణం తెప్పించండి.

య - ఏం, పోనీ, ఇబ్బందిలేదు. కొంతరంగం అయిం తరవాతే పుచ్చుకోండి.

కే - అహఁ. మామూలు ఇదే.

య - ఆయాసంగా ఉంటుందేమో, మామూలు ఇల్లా చేశారేం?

కే - అదా! మీకు చాదస్తంకాకపోతే, అంతా పాలిస్తారూ! తరవాత కిలం ఎక్కితే చావాలి. ఇందుకూ, మొదట్లోనే పుచ్చేసుగోడం! మరి చంపక, పట్రండి!

74

ఒక గాన శాస్త్రవేత్త ఓ ఊరొచ్చి పరిచయం సంపాదించి ఒకరింటో పాట పెట్టిన పావుగంట అయేసరికి, ఆయనా, మద్దెల ఫిడేలు వాళ్ళూ సృతివేస్తూన్న గృహయజమానీ మిగిలినా, ఆయనమాత్రం పాట మానేసెయ్యకపోడం మరొకపావుగంట చూసి, తనులేచిపోతూ గాయకుడితో,

యజమాని - అయ్యా! తమరు వెళ్ళేటప్పుడు చెప్పి మరీ వెళ్ళండి, తలుపు వేసుగుంటాను.

గా - చిత్తం వీలైతే చెబుతాను. నిద్దర మన్తో చెప్పి వస్తుందా మీకు వెర్రిగాని!

75

మొగుడు - అందకాడూ, సౌందర్యరాశీ, మన్మధరూపీ, గుణకాడూ అయినభర్త ఉంటూన్నా, ఒక్కొక్క ఆడదానికి ఏం పొయ్యకాలమో!

భార్య - అందకత్తీ, సౌందర్యకటారీ, రతీరూపీ, గుణకత్తీ అయిన భార్య ఉంటూన్నా, ఒక్కొక్క మొగాడికి ఏం వినాశకాలమో!

మొ - ఛఛా! కోప్పడకు! నేచెప్పేది ఊళ్ళోవాళ్ళమాట!

భా - రామరామ! మధ్య మీరు గోలెట్టకండి. నేచెప్పేదీ అంతే ! లోకంమాట, మధ్యమపురుష వ్యాపారం కాదు!

76

రత్నం - పుండరీకాక్షుడివి అన్నీ అఘాయిత్యపుపన్లే!

ముత్యం - ఏం?

ర - ఓసారి ఒకశవం వాడు ఊరికెళ్ళడంమూలాన్ని వారం నిల్చిపోయింది.

ము - ఏం?

ర - వాడు ఉచితంగా వతనగా దానంచేస్తూండే కటుకు ఇవ్వకపోవడంవల్ల! ఆపళంగా వెళ్ళి వాణ్ణి నానాతిట్లు తిట్టాం!

ము - వాడు ఊరుకున్నాడూ?

ర - ఊరుకుంటాడూ! ఊళ్ళోవాళ్ళ ఛాతీలన్నీ కొలవడం మొదలెట్టాడు.

ము - ఎందుకో!

ర - తను ఊరికెళ్ళినాసరే ఆటంకం రానీకుండా ప్రతీవాడికీ అధమం రెండేసి కటుకులు అడ్వాన్సుగా సప్లైచెయ్యడానికి అన్నాడు.

ము - మీరేంజేశారు? ర - పోనీ పొయిలోకేనా పనికొస్తాయనుకుని అవన్నీ పుచ్చుగున్నాం.

ము - తరవాత!

ర - వాణ్ణి చావగొట్టడానికి సిద్ధపడ్డాం.

ము - సిద్దపడి...

ర - ఊరుకున్నాం. తనస్వంతానికి వాడు ఒకటి రడీ చేసుగున్నాడో లేదో కనుక్కుని మరీ చావగొడదాం అని.

77

రాత్రి భోజన సందర్భంలో తనయింటికి పిలుపుప్రకారం చాలా మంది రాగా వచ్చినవాళ్ళని హెచ్చరిస్తూ, యజమాని, వారిని ఆసీనుల్ని చేస్తూ, - శాస్త్రం చెప్పినట్టుంది. మన పాటకచేరీ - రావుగారు రానేలేదు.

అనే సమయానికే రావుగారు వీధులోకివచ్చి. లోపల జరిగే సంభాషణ వింటూండగా, వచ్చినవారిలో ఒకరైన ఒక ప్లీడరు - ఏమిటో! ఏదో మీ మంచితనంకొద్దీ ఆ రావు గౌరవార్థం మీరీ ప్రీతిభోజనం పెట్టారనుకోండి, కాని ఆయనది నా మొహం పాట, ఎంపాటండీ, పెద్ద కచేరీ అనడానికీ! ఆయన వేసిన సంగతులన్నీ దవడసంగతలు, పాడినవర్ణాలన్నీ కర్ణకఠోరాలు, ఇన్నతానంఅంతా మేకతానం, అసలు పెట్టినశృతే కీచుశృతి, ములిగిపోలేదు. కూచుందాం, తిందాం పడుదురూ!

అంటూ రావుకోసం ఆగఖ్ఖర్లేదని యజమానికి నచ్చచెప్పగా అందరూ విస్తళ్ళకి అడ్డంపడమీదట రావుగారు లోపలికి వెళ్ళగా ఆ ప్లీడరే నవ్వుమొహంతో,

అయ్యా, దయచెయ్యాలి. ఇప్పుడే పరిషించాం, మీకేమీ అభ్యంతరం లేదను కుంటాను.

అనగా రావు కూర్చుని, నెయ్యీ, కూరా, పులుసూ, మజ్జిగా, వెంటవెంటనే కానిచ్చి మిక్కిలి త్వరగా లేవగా,

ప్లీ - అదేమిటండీ? ఇంకా భోజనాలుకాందే! ఆకలి లేదా?

రా - లేకేం? మధ్యాహ్నం మీ యింట్లోనేగా భోజనం మరీ!

పీ - అప్రస్తుతం ఇక్కడ వద్దు. బంతివాళ్ళకి కాందీ లేస్తారేం? ఇదా మర్యాదా?

రా - ఇతరులు నాకోసం ఆగనప్పుడు, ఇతరులకోసం నే నాగడం మర్యాద అని మీరు చెప్పింతరువాత తెలుసుగున్నాను. కాని ఇక్కడకూడా తమదేనా వకాలత్? హృదయంలో మాట అనేసే స్వభావం మీకుండబట్టి నాకు కడుపునిండి పోయింది, సెలవ్!

78

పరీక్ష సమాధానపత్రాలు కుర్రాళ్ళకి మేష్టరు ఇచ్చేస్తున్న సమయంలో.

ఒక విద్యార్థి - నా సమాధానపత్రంమీద మార్కు వెయ్యలేదండి.

మే - ఏమి వేసిఉందిమరి!

వి - ఆశ్చర్యార్థకం వేసిఉంది.

మే - అదీ ఒకమార్కేగా!

వి - సంఖ్య ఎదేనా ఉండాలిగాని ఆశ్చర్యార్థకం ఎందుకండీ? .

మే - అదా నీ ఆశ్చర్యం! లోపలి సమాధానానికీ సంఖ్యలకీ సంబంధం ఏముటోగదా అనే నా ఆశ్చర్యం తెలపడానికి. 

79

చాలామంది కలిసి ఇడ్లీ తింటూండగా, అందులో ఒకడై ఉన్న దీనయ్య రామోజీతో.

దీ - తిన్రా! ఏంశాశ్వతం! కరువో కాలమోనూ! .

రా - ఏమీభయంలేదు! ఆర్నెల్లవరకూ భయంలేదు. ఆ పైమాట చూసుగోవచ్చు!

దీ - ఏమో! అది మాత్రం నీకెట్లా తెలుసూ?

రా - నిన్న రాత్రిచూశాను, స్పష్టంగా కనిపించింది అరుంధతి.

80

నరసింహం తన అధికారితో,

న - అయ్యా! తొమ్మిది దాటింది. నేను నల్లమందు వేస్తాను. పదికి మళ్ళీ నే నిక్కడ వాలాలి. మరివెళ్ళి రెండు మెతుగులు నోటోవేసుగుని చక్కావస్తా!

అధి - (అదంతా దర్జాగా పరధ్యానంగా విని) సరి సరి! ఈ తొందర్లో మీ రెడితే ఎల్లా! భంట్రోతుని వెళ్ళిరమ్మనండి!

81

ఆయవార బ్రాహ్మడు - సీతారామాభ్యాన్నమః!

యజమాని - చెయ్యి ఊరుకోలేదండీ!

ఆ - కనకనే దేవరవారి మీసకట్టుకి ఆ అందం! తక్కిన వాళ్ళ చేతులుంటాయిగా బాబూ! సెలవ్!

82

ఒక మంచి ఆవిడ ఒక గొప్పవాడితో,

- అయ్యా ! మీరు చేసిన మేలు నేను మరవను. మళ్ళీ జన్మలో మీకు తల్లినై పుడతాను.

గొప్పవాడు - ఏమో! మీకు వచ్చిన చిక్కును బట్టిన్నీ మీకు నాయందుండే అభిప్రాయం కొద్దిన్నీ అట్లా అంటున్నాగాని, అది అక్రమం అండి!

83

మంగమ్మ - (రమణమ్మకి జుట్టులేకుండా బొట్టుండడం చూసి) తిరుపతి వెళ్ళొచ్చారాయేం, పిన్నమ్మా?

ర - లేదమ్మా! మా మొఘాలకి తిరపతి గూడానా!

మం - మరి కాకపోతే?

ర - మా వోడియివాఘంలో యియ్యపరాల లాంచినాలు!

మం - అదేమిటమ్మోయి!

ర - ఏమడుగుతావ్! ఆళ్ళూ యీళ్ళూ ఘర్సనపడి సివరికి నావొల్లాచ్చిందంట పేసీ, పెళ్ళికూతురోళ్ళు నన్ను కూకోమెట్టి అమ్మాయి పెళ్ళిలో అత్తగారి పుట్టెంటింగిలు తీయించారు, మద్దెత్తింగాను.

మం - మధ్యస్తంగాయేం?? చివరంటా తీసేశారు, పాపం, వాళ్ళకేం వచ్చిందో!

84

ఎడాపెడా చెంపలు వాయించినట్టు దెబ్బలుతగిలేటట్టు కతకలుగాఉన్న రోడ్డుమీద ఒంటెద్దు బండిలో పోతూన్న ముసలమ్మ బండివాడితో,

ము - ఇంత కుదుపుగా చెయించి తగలేశారేం నాయనా, బండీ! బం - చేసిన వడ్లా బత్తుడికి వల్లమాలిన దగ్గండీ! పైగా అతడు చలిజ్వరం పడ్డప్పుడు ఇది చేశాడు,

ము - అల్లాచెప్పుమరీ! అతగాడికి అవన్నీ తగ్గిపోయిం తరవాతేనా బండీ బాగుచేయించు నాయనా!

బం - ఆయినిగోరికి అంగుళ్ళేదమ్మా! బేరం చెయడానికి వెడితెమో కొండమీదనించి దిగనేదిగడు!

85

మేష్టరు - వెంకయ్య! మళ్ళీ “లేట్” కాదూ?

వెం - (మెల్లిగా) అవునండి.

మే - ఎన్నోసారి?

వెం - మూడోసారండి.

మే - మొదటిసారి ఏమన్నావు?

వెం - ప్రమాదో

మే - రెండోసారి?

వెం - అవశ్యం అనుభోక్తవ్యం

మే - సరే, ఒప్పుగుని ఆ రెండుసార్లూ క్షమించాను. ఇప్పుడు! ఇప్పుడేమంటావ్?

వెం - అభ్యాసేన - అంటానండి.

మే - అన్నాసరే, క్షమించను!

వెం - ఎందుకు క్షమించరండీ?

మే - ఆంధ్రంలో ఎవ్వడూకుడా క్షమించలేడు గనక!

86

రైలునడుస్తూన్న సమయంలో ఒక యాచకపు బ్రాహ్మడు మూడోక్లాసు పెట్టెలో, - అయ్యా! శుభోజ్జయం ! ఈవేళ అమావాస్యండి, అందరికీ, ఆడవాళ్ళకీ మొగాళ్ళకీ కూడా!

ఒక పెద్ద షాహుకారు - ఆడోళ్ళకీ మొగోళ్ళకీ సరిగాని, యెదవముండలమాట యేంటి సెలవిచ్చావు, బాపనయ్యా!

బ్రా - వెధవ వాళ్ళకీ, మీ బోట్లకీ, తల్లిదండ్రులులేని వాళ్ళకీ, కూడా అంతేనండి. అందరికీ అని చెప్పానుగాబాబూ, క్షమించి వినుంటే - సర్వేషాం.

87

పత్రపురంలో ఒక దాసుగారు చెప్పిన హరికథ పూర్తికాగానే దాన్ని గురించి ఒక రసజ్ఞుడు, సభవారితో, ప్రశంసాపూర్వకంగా మాట్లాడుతూ,

- ఆర్యులారా! నేటిరాత్రి మన హరిదాసుగారు 'రామదాసు' చెబుతూ ప్రకటించిన శక్తికిన్నీ చేసినగానమునకున్నూ మనజన్మ పావనమైంది. వారు మన పుణ్యంచేత మనలందర్నీ ఒఖ్ఖమాటుగా స్వర్గస్తుల్ని చేసేశారు. (అనగానే, సభలో కొందరు నవ్వగా)

ర - నిజమేనండి, సందేహంలేదు, ఇతర చోట్లగూడా జనాన్ని వారల్లానే చేశారని తెలుస్తోంది.

88

అత్త - (కోడలితో) దెబ్బలాడకో, ఆవిడ! దెబ్బలాడకు! నే పోతేసరి! పరమాన్నం వండిపెడుదురని, మొగుడుగారికి!

కోడలు - ఆయన ఏమన్నా తెస్తేగా ఇంట్లోది వండడం! నేపోతేగాని తీసుగురారు.

కొడుకు - వండడం నీకు చేతనవుతేగదా! నేపోతేగాని నీకు చేతవదు.

89

శాస్తుల్లు - ఏమండోయి, మేష్టారు! నమోన్నమః. మా కుర్రాణ్ణి మీస్కూల్లో చేరిపించాను. కుర్రతనం! మీరో కన్నేసి చూస్తూండాలి వాణ్ణి. అల్లా చూస్తున్నారేం?

మే - ఇద్దరప్పుడే చెప్పేశారండీ! ఇహ వీలెక్కడుందీ అని చూస్తున్నాం

శా - ఏమి సోద్దెమండీ తమదీ! అల్లాయితే, వీలెక్కడుందని మాత్రం ఎల్లా చూస్తున్నారూ?

మే - అదే చూస్తుంటా!

శా - అహఁ. అసలు నన్ను మాత్రం ఎల్లా చూడగలుగుతున్నారూ అని! నాదగ్గిర చెబుతారేమిటి?

90

పళ్ళులేని ముసలమ్మ తెగ నములుతూన్నట్టు కనిపించగా, చూసి,

మనుమడు - బామ్మా! నాక్కాత్తెట్టవ్?

బా - (బోసినోరు చూపిస్తూ) చూడు నాయినా! ఏముంది నాబొంద! ఏమీలేదు!

మ - మరి నువ్వు పెదిమిలు మూసుకు దవడ ఊరుకోకుండా కదుపుతూంటావేం?

బా - ఆ నమలడమా నువ్వనేదీ? అవి నీకెట్టడానికి వీల్లేదమ్మా! అల్లానేను నమిలేది మీ నాయన నాకెట్టిన చివాట్లు, మింగి ఊరుకుందామని ఎంత నమిల్నా మింగుడు పడకుండా ఉన్నాయి.

91

శర్మ - ఈపొట్ట మొత్తంమీద ఉతుకుష్టంగానే ఉంటోందోయ్, లక్ష్మయ్యా!

ల - ఎదో పోనిస్తూ, దేవుడిచ్చిందికదా! కావాలంటే వస్తుందా నా బోట్లకి?

శ - అదిసరే! బంధువు లిళ్ళకెడితే, నన్ను మడిగట్టుకోమనడం మానేశారు!

ల - ఆఁ ఆఁ ఎంత అప్రతిష్ఠా!

శ - నాకు ఆకలి సొరేసుగు పోతూన్నప్పుడు కూడా పైకి నా ఉదరం ఉన్నతంగానే ఉండడంవల్ల గావును!

92

ఒక సంగీత సావిత్రినాటక ప్రదర్శన సందర్భంలో, యముడు తన రాతిగాత్రంవిప్పి, ఒక సీసపద్యపు తుపానుతో సభవాళ్ళని మొత్తి చాలామంది చెవులు చిల్లులుపడగొట్టి, వచనంలోకి దిగి, సావిత్రితో,

య - సావిత్రీ! నీభక్తికి మెచ్చితి. నీపతి జీవము దక్క వేరొకవరము ప్రసాదించేద, కోరుకొనుము.

అనగానే, ఒకమామూలు పావలాక్లాసు రసజ్ఞుడు, పెద్ద గొంతిగ చేసుగుని, సావిత్రి తనకోరిక కోరుకునేలోపల,

అమ్మాయి సావిత్రోవ్! నీకడుపున పుడతాను గాని, ఆ యముడు మాత్రం ఇహ పాడకుండా వరం కోరుకుందూ!

93

కూతురు, జారిపడిపోగా,

రక్ష్మమ్మ - నీచావు నేలబడ!

అంటూసాధిస్తూ వేళ్ళు అంటుగునేటట్టు వీపుమీద బాధగా, ఇంటికొచ్చిన వియ్యంకుడు. అదేమిటక్కో! చంటి పిల్లని అల్లా చావగొట్టేశారే!

ల - మరి కిందికి దిగజారి చచ్చిందాయిరి, ఎంజెయ్యను చావనా!

వి - ఒహోహో! అల్లాయితే, మీరు ఆ చచ్చిన దాన్ని, చచ్చిచెడి బతక్కొట్టేశారన్నమాట! ఈ మాటు బోధపడ్డది!

94

శంభన్న - ఏమండి! రామకోటిగారుఁ భుజంమీద ఏమిటాకట్టు!

రా - విన్లే? మొన్న మావాళ్ళింటో పెళ్ళుమంటూ జరిగిన పెళ్ళి ఊరేగింపులో అవుటు పేలినప్పుడు తగిలినదెబ్బ!

అన్నట్టు మీ అమ్మాయికి ఎక్కడేనా ముడెట్టేశావా!

శం - ఆ అందుకనే రాకపోతా! ఆ రాత్రే గుళ్ళో అయింది,

రా - గుళ్ళో ఎందుకు మళ్ళీనూ! అదే ఇంట్లో కానీక పోయావా!

రా - గుళ్ళో అయితే అధమం దేవుడేనా రాయల్లా మాట్టాడక ఊరుకుంటాడుగదా, ఎక్కడికక్కడితె, అని!

95

వెంకన్న - కిష్టిగా! నీచేష్టలు ఊరేగించా! ఇల్లారా!

కి - (వచ్చి) ఏం?

వెం - సరేగాని మొహం అటు తిప్పిమాట్లాడు.

కి - ఎందుకూ?

వెం - ఎందుకా! నీమొహం చూస్తే అన్నమేనా పుట్టదు.

కి - పుట్టకపోతే అంబలితాగి నవ్యశ్రీనాథుడివి అయిపోదుగానిలే. కాని, నీ మొహం నాకేసే పెట్టు!

వెం - ఎందుకూ?

కి - అది చూస్తేగాని డోకే రాదు.

96

ఒక నాటకం ఆడడం సందర్భంలో, బ్రహ్మ సరస్వతులు కూచునిఉన్న ఒకరంగంలో, ఒకపాత్ర గబగబావచ్చి బ్రహ్మని శరణుజొచ్చి వరం వేడుకోగా, బ్రహ్మపాత్రవాడు తను ఏంజెయ్యాలో మరిచిపోయి ఊరుకోగా, ప్రాంప్టింగు ఇచ్చేవాడు బ్రహ్మతో సన్న సన్నంగా, - దేవి, దేవీ..............

అని అందివ్వగా, బ్రహ్మపాత్రధారి వినిపించుకోకపోగా,

ప్రాం - ఆగంతుకులు వేషా లేస్తే మా ప్రాణంమీదికి తెస్తారు. (అంటూ సణుక్కుంటూ అక్కణ్ణించి కదిలి స్టేజి మేనేజరు దగ్గరికి వెళ్ళి) అయ్యా! అయ్యా! మీ బలవంతం మూలాన్ని వేశానని అతనంటాడు. ఇప్పుడు చేస్తే వినపించుగోడాయిరి అసందర్భం జరిగితే మీరు చంపుతారు. సీను ఆగిపోతోంది. ఏమిటి గతి? స్టే|| మే|| - చెముడేమన్నా ఉందా అతనికి?

ప్రాం - అబ్బే! పాంచెవులండీ, మరీ!

స్టే - ఏదీ నడు, అల్లాయితే, నేను చూస్తాను.

అని - పక్కకి వచ్చి చూసి,

- ఉయేయ్! అయితేనూ, నాలుగు ఉండాలికదాఅని, మనం లోగడ చేయించిన కర్రతలచట్రం తగిలించారా ఏమిటి?

ప్రాం - మరేగావునండి, లేకపోతే బ్రహ్మవేషం ఒప్పదని!

మే - అల్లా చెప్పూ! అంచేతే అతనికి చెవులు మూసుగుపోయాయి. బ్రహ్మచెముడు అనేమాట నేటికి ప్రత్యక్షం అయిందిరా, దేవుడా! తెర వేసెయ్యమను!

97

తెలుగుపండిట్ - 'అండజము' అంటే ఏమిటి? నెంబర్ టూ,

నెం. టూ - గుడ్డులోంచి పుట్టింది, అన్నమాటండి.

తె - అనగా ఏది? త్రీ!

నెం. త్రి - పక్షి.

తె - లేక నెంబర్‌ఫోర్!

నెం. ఫోర్ -

ఫైవ్ - మేష్టాండి, గాడిదమాత్రం అండజం కాకూడదండీ!

తె - స్వవిషయాలు మనమే నిర్ణయించుగోడం మంచిది.

98

ఒకసిపాయి - భాయీ! తుపాకీ ఆనుకోడం నువ్వు కుడి భుజమా ఎడంభుజమా, పేల్చేటప్పుడు!

భా - (జ్ఞాపకం తెచ్చుగుని) కుడిభుజమే!

ఒక - ఏకన్నూ మూస్తూంటావ్?

భా - ఏకన్నూ మూసుగోను, రెండూ మూస్తూంటాను, నేనది అభ్యసించనేలేదు.

ఒక - మరి?

భా - నేనెప్పుడూ కూడా వెనక్కి కొట్టడమే నేర్చుగుంటూ ఉంటాను.

ఒక - సరిసరి. అదేమిటి? అల్లా ఎందుకూ?

భా - ఎమో! ఇక్కడికి నేను చేసిన అయిదారు యుద్ధాలలోనూ కూడా శత్రువులు నన్ను వెనకనించే కొడుతున్నారు మరి.

99

కూర్మయ్య వీధి వెంటపోతూ, బ్రహ్మయ్య ఎవడితోనో దెబ్బలాడుతూండడం చూసి, బ్రహ్మయ్యతో

కూ - బ్రహ్మయ్య - ఆగు ఆగు ఏమిటసలు?

బ్ర - చూడు! ఈ వెధవ ముష్టివెధవ నన్ను ఎక్కడి కెడితే అక్కడికి వెంటాడించి, వేధించి, నలుపుగు తింటున్నాడూ!

కూ - (తక్కినవాడితో) ఏం. నిజమేనా?

త - అబద్దమండి. బ్ర - మహమ్మండా, అబద్దమా! ఫర్లాంగు దూరాన్నించి ముష్టికి చెయ్యట్టి నా వెనుకాలే రాలేదూ?

త - ఒస్, చెయ్యట్టడమా! అది చిన్నతనంలో స్కూల్లో అలవాటు! స్వంత అలవాటు పట్టుగోడం కష్టం. సెలవు..

100

సంబంధాల కోసం తిరుగుతూ, ఒకాయన. ఒక బియే విద్యార్థి చదువుకొట్టులోకి వెళ్ళి, అతడితో ముచ్చటిస్తూ,

ఆయన - ఇదండి స్థితి!

విద్యా - ఆఖరమ్మాయికి ఎన్నేళ్ళన్నారూ!

ఆ - తొమ్మిది! కట్నం, ఏ తంటాలోపడి వెయ్యిస్తా, దానికంటే పైపిల్ల ఉంది, రమారమిగా పదకొండేళ్ళది - దానికి మరొహ అయిదువందలిస్తా? దాని పై పిల్ల ఉంది, కట్టుతప్పి, క్షణమేనా ఇహ ఉంచాయిస్తు కాకుండానూ - దానికి రెండు సంచులిస్తా ! మరి ఎంజెయ్యెను! దానికి పదమూడూ వెళ్లే పోయాయి.

విద్యా - అల్లాయితే తమవద్ద ఒఖ్ఖ ఇరవై యేళ్ళ పిల్లలేదేం పెళ్ళికి?

ఆ - ఇవేం మాటలయ్యా, ఎక్కడో పోఖిరీ రకంలా ఉన్నావు.

వి - వెళ్ళండి, వెళ్ళండి! ఊరికేఅన్నాను. మా అమ్మాయి సంబంధం గురించి నేనూ తిరగాలి!

101

ఒక జన మందిరంలోని ఆవరణయొక్క ఒకభాగంలో “ఈవైపునకు ఎవ్వరును రాకూడదు” అని రాసిన బల్లకట్టి ఉన్నప్పటికీ, ఒకనాడు చీకటిపడ్డతరవాత, ఇద్దరు గుసగుస లాడుతూవెళ్ళి అక్కడచేరి మాట్లాడుకుంటూండగా, ఆరోజున శివామని కాఫీకేనా లంచం దొరకని ఒకనెంబరు భంట్రోతు అక్కడికి డ్యూటీనెపంమీద ఏమన్నా వడుక్కోవచ్చుగదా అని వచ్చి,

భం - ఏయ్! ఎవరిది?

వ్యక్తుల్లో ఒకరు - మేం.

భం - మేమేమిటి? మీరిక్కడికి ఎల్లావచ్చారు?

వ్య - ఈ దారెమ్మటే నడిచి వచ్చాం!

భం - ఇది దారికాదే, “కళ్ళాపట్లా!” అక్కడ నోటీసుంది చూసుగోవాలని తెలియదూ?

వ్య - అక్కడ నోటీసున్నట్టు తెలియడానికి లైటు లేదు, చీకటిగా ఉంది, పైగా మీమనిషేగావును ఓడుండి మే వస్తూంటే ఊరుకున్నాడు!

భం - అబ్బో! చాలా రూల్సు మాట్లాడుతూండావే?

వ్య - మీరే రూల్సు మాట్టాడింది, ఏంకావాలో చెప్పకుండానూ?

భం - అల్లాయితే నీ పేరేముటో చెప్పెయ్, రాసేస్తాను, నీ జలుబు ఏమన్నా ఉంటే వొదిలిపోతుంది!

వ్య - నా పేరు అర్బుదం! అసలు నాకు మనస్సు చికాకుగా ఉంది. ఈవిడ నాభార్య!

భం - (కొంతతగ్గి) అయినాసరే నోటీసుచూడాలి (అని బ్యాటరీలైటు నోటీసుబ్లమీద వేసి), “ఈవైపునకు ఎవ్వరును రాకూడదు” (అని చదివాడు). వ్య - అమాటే నేనూ అంటూంటా! తమరూ వెళ్ళవలిసింది. తమరు అది చూశారు గనక మరియిటు రాకండి!

భం - అల్లాయితే మీ రహస్యాలకోసమా ఈ ప్రకటన?

వ్య - మీ రహస్యాలకోసం అని ప్రకటించి, ఆ ప్రకటన బల్లదగ్గిర లైటు పెట్టకపోయారా? నువ్వెక్కడికి వెళ్ళావ్, గంటనించిలేవే ? మానమర్యాదలున్నవాడిచేత నేరం చేయించడానికి సదుపాయాలన్నీ చేసి, వాడు తను ఆ నేరం చేసినందుకు తనికి గౌరవభంగం జరిగిపోతుందనే భయం చొప్పున ఇవ్వగల డబ్బులు లాగి, తిని, బలిసి చచ్చిపోయేకంటే ముష్టెత్తుగుని, చిక్కి శల్యం అయిపోడం గొప్పసంగతి! ఇదిగో పుచ్చుగో! (అని అణాయిస్తాడు)

భం - (పుచ్చుగుని) తమరు ఆగ్రహిస్తే మేం జీవించడం ఎల్లా?

102

రైలుస్టేషనునించి ఎనిమిది పైచిలుకు మైళ్ళదూరంలో ఉన్న ఒక ఊరికివెళ్ళేరోడ్డుమీద, పట్టపగలే, ఒక దొంగలగుంపు, గబగబా పరిగెత్తిపోతూన్న ఒక జట్కాబండి యొక్క గుర్రం కాళ్ళు విరగొగొట్టి, అందులో ఉన్న నల్లయ్య పచ్చయ్యలను పక్కడొంకల్లోకి ఈడ్చుకుపోయి, తుపాకులు చూపించి, వాళ్ళతో,

జేబూలు వెతుక్కుంటాం! కదిల్తే పేలుస్తాం?

నల్ల - (బిక్క మొహం వేసి) ఒకనిమిషం ఊరుకోరూ!

దొం - సరే!

నల్లయ్య అప్పుడు తనజేబులో చెయ్యి పెట్టి ఒక వందరూపాయల కర్రెన్సీనోటు పైకితీసి, పచ్చయ్యతో ఉత్సాహంగా,

పచ్చయ్యోయ్! ఎప్పటికప్పుడు ఏదోవోటి వస్తూండడం వల్ల వీల్లేకపోతోచ్చింది! నేను నీకు లోగడ రాసిచ్చిన ప్రామిసరీనోటు మింజుమలె, ఈ నూరురూపాయలూ జమ ఈవేళ యిచ్చినట్టు కాస్తంత వసూలు పెట్టేం! ఇదుగో పుచ్చుగో!

103

శీతయ్య - ఏరోయ్! శాస్తుల్లూ! మీవూరికి రైలు తీసేశార్ట!

శా - అవును, దండగొచ్చిందిట! మీది?

శీ - వేసిన ఖర్చుకంటే తీసేసేఖర్చు మించిపోతూందేమో అని వూరుకున్నారు.

శా - ఊరుకుంటేం? ఎప్పుడో మీదీ తీసేస్తారు!

శీ - మీది దిక్కుమాలి వూరుగనక లాగేశారు.

శా - ఒస్! మీది చిన్నగాడిరైలు

శీ - ఛీ! ఊరుకోరా! రైలుపెట్టి అగ్గిపెట్టిలాంటిదైనాసరే, అసలుందిగా! పోనీ పైకి అర్జీ పెట్టుగొండి!

శా - ఎమో మేం ఎముకలు పొడుంచేసుకోలేం, పోదూ!

శీ - నే అనేదీ అదే! రైలంటూవస్తే. అస్తికలూ అవీ, పొడుం అయిపోకుండా, తక్షణం మేహాలమీద పట్టిగెళ్ళి గోదావరిలో కలిపి చక్కారావచ్చు!

104

సోమప్ప - (బ్రేవ్ మని త్రేన్చగా),

రాజప్ప - ఎక్కడ్రా, ఈవేళ, పట్టూ! సో - పొట్టిప్లీడరింటో వాళ్ళమ్మాయికి......

రా - పదార్థాలు !

సో - మామూలే!

రా - కూరలు!

సో - ఎన్నైతేం అన్నాను! చెబితే దిష్టి కొడుతుందేమో గాని, అన్నంయావత్తూ ఒక్కవంకాయి కూరతోటే వెళ్ళిపోయిందంటే నమ్మొరీ!

రా - ఇహ దిద్దేమిటిగాని నీ పిండం, అది ఏ దిశగా వెడతా? 

105

కాశీ - ఒరేయ్‌సుబ్బూ! పందుంపుడక కావాలి, తే!

సు - అడితీకి కబురంపు! నీకు పుట్టి ఉండాలి లేకపోతే చాలదు.

కా - ఓహోఅదా! నీకు అక్కర్లేదా?

సు - నాకు తెలియకుండా ఉంటుందా?

కా - ఎమో! నీపెళ్ళాం వెళ్ళి నాలుగేళ్ళయింది. ఆవిడికి తెలుస్తే చాలదా?

106

సిద్దాంతి - బావా! ఈరోజులూ ......... ఊహూ వెళ్ళి పోతున్నాయిగందా! ఇవి వెళ్ళి ఎక్కడుంచున్నాయో, ఎవరైనా చెప్పగల్రేమో!

బా - ఎవరో యెందుకు మళ్ళీనూ! నీకు తెలియదుషోయ్!

సి - నాకా?

బా - అవును.

సి - ఎట్లా?

బా - అవన్నీ నువ్వుచేసి పారేసిన పాతపంచాగాల్లో పడిలేవుషోయ్! ముందు

సి - ఒహోహో! అవును! తీద్దాం!

107

గొల్లది - ఇది బేడముంత, పుచ్చుకుంటారమ్మా!

ఆవిడ - నేనూ మా ఆయనా ఇద్దరమే కాట్టే! ఎందుకింతా? పులుపుచిచ్చు పైగానూ!

గొ - చెబుదురూ!

ఆ - అవతల పోపు మాడిపోతోంది. ఇంతకి తక్కువైతే పొయ్యనని చెప్పూ ముంతా!

గొ - అడగండి.

ఆ - అర్థణా!

గొ - యెల్లవమ్మా! ఆడావు ఆడబేరం! అర్ధణాకిత్తే జుర్రుకోగల్రేం నువ్వూ మీ ఆయనానూ! అప్పుగల్తే ఎక్కువ కాదు కాబోలు!

108

బిచ్చగాడు - ఏదో మొహమాటం చొప్పున పెద్దలు నలుగురూ సత్కరిస్తున్నారండి.

పెద్దమనిషి - ఎదో పితలాటం చొప్పున పెద్దలు నలుగురూ నన్ను తిడుతున్నారు. నీపనే చాలాబాగుంది. దంచూ! వెళ్ళు!

బి - అన్నంలేనివాణ్ణి బాబయ్యా! ఒక్కకాని దయచెయించండి. మీరు తమలపాకు ఊసేసినంత లేదు! పె - (తాంబూలం ఉమ్మేస్తూ) నీకు వెర్రిగాని ఒక్కకానితో నీకు అన్నం ఏల్లావొస్తుందిరా?

బి - ఏ టీయేనా తాగుతానండి.

పె - ఏమో ఏంతాగుతావో! నువ్వు ముష్టికేనావస్తా!

బి - అవునండి.

పె - (నౌఖరుతో) ఈమనిషికి ముష్టివేసి పంపించు!

109

తెలుగుమేష్టరు - అల్లుడు అనేమాటకి అర్థంఏమిటి? ఎవరైనా!

శేషు - అల్లేవాడు.

తె - రైట్. అనగా కల్పనచేసేవాడు. అల్లుడుకి తనే అల్లుడైనవాడు ఎవడు?

శే - విష్ణువు.

తె - అవును. కొడుక్కి అల్లుడైనవాణ్ణి ఎరుగుదురా, విన్నారా?

అందరు - లేదండి.

తె - వినండి. ఒకడికి 63 ఏళ్ళు, వాడికొడుక్కి 42 ఏళ్ళు, తండ్రివెళ్ళి ఒక. 24 ఏళ్ళ చిన్నదాన్ని మళ్ళీ చేసుకోగా, ఆసంగతి తెలియక కొడుకు బయల్దేరివెళ్ళి ఆచిన్నదాని తల్లిని 39 ఏళ్ళ దాన్ని కట్టుగున్నాడు. అప్పుడేమవుతుంది మరి?

శే - అవునండి, మరి అప్పుడు ముసిలాడికి ఓకూతురుపుడితే, ఆ పెద్దావిడకి ఏమవుతుందండి?

తె - పుట్టినపిల్లకి పెద్దావిడ అమ్మమ్మగనక, పుట్టినపిల్ల అమ్మమ్మకి ఆడపడుచు అవుతుంది.

110

పాపయ్య - తట్టలో ఏమాత్రం ఉన్నాయి ముంజికాయిలు!

అమ్మేవాడు - మూడుపుంజీ లుంటాయి, బాబు!

పా - ప్రతీదానికీ ఉన్నాయా మూడేసికళ్ళూ?

అ - ఇదిగో మీసిత్తంవొచ్చినట్టు సూసుగోండి.

పా - సరే ధర?

అ - కాయ ఒక్కంటికి కాని దయ సెయ్యండి.

పా - పన్నెండుమూళ్ళా? తొమ్మిదణాలా? ఆరణాలకిస్తే యియ్యి లేకపోతే శీఘ్రంగా నడు.

అ - (సందేహించి) రెట్టుకిరెట్టు బాబుగోరు తేడాగా అడుగుతారు. సరే తీస్కోండి అదేపాయె!

111

అడితీవాడు - మారుజాతిపుడకా మంచిదేనండి, ఆరితే మాసప్పరిగా నిల్చి కాల్తుంది.

పెద్దమనిషి - దానంతట అదే!

అ - సిత్తం. మరేమీ పిడకలూగట్రా అక్కర్లేదు.

పె - పిడకమాట కాదోయ్! పుడక మరి బారెడు బారెడు ఉందాయిరి, దానంతట అది నిల్చికాల్తే, కొంపలంటుగుంటాయి గాని తరవాయి ఉండిపోతుందా?

అ - ఆ పనేజరిగితే పుడక ఖర్చు అసలుండదండి, సరుకు యావత్తూ నిల్చిపోయి ఉంటుంది.

112

మేష్టరు - అంబయ్య, నుంచో, 'గంగిగోవుపాలు' అప్పగించు.

అం - (ఊరుకుంటాడు)

మే - ఏం?

అం - పితకలేదండి.

మే - ఏమిటీ? చెయ్యట్టు. (అని పట్టినచేతిమీద కొడుతూ) రేపేనా పితుక్కొస్తావా, రేపేనా పితుక్కొస్తావా! (అని రెండుకొట్టి) లేకపోతేను, పితుక్కురాలేదుట, ఏడిశావుగని, రేపు అప్పగించు!

అం - మానాన్నకి పాలపథ్యం అండి! మాకేచాలవ్.

113

సీతన్న - ఒడైమంగళ్ళు ఇంతసున్నితంగా తలంటడం ఎల్లా నేరుస్తారంటావు, వెంకయ్యా!

వెం - ఆఁ ఎముందీ! అభ్యాసం. అభ్యాసం కూసువిద్యా అన్నాడు.

సీ - అభ్యాసానికిమాత్రం ప్రతిరోజూ రోజస్తమానమూ వీళ్ళకి తలంటించుగునేవాళ్ళు ఎక్కడ దొరికేడుస్తారూ?

వెం - అందుకనే. ఒంటరిగా కూర్చున్నప్పుడు కూడా రాత్రెళ్ళు పొట్ట బాదుకుంటూండడంలో ఆ అంటడపు ప్రజ్ఞ సుసాధ్యం సున్నితం చేసుగుంటారట.

114

సుబ్బారావు - శంకరం! పెద్దపూర్ణయ్యగారి సిద్ధాంతం గొప్పదా. చిన్నపూర్ణయ్యగారిదా?

శం - ఎందులో?

సు - (చికాకుగా) అబ్బ, అసలు మొత్తంమీదోయ్!

శం - అదా! మనకేంతెలుస్తుంది. అంత గణితం చేసే వాళ్ళలో హెచ్చుతగ్గులు కట్టడానికి గణిత ప్రమేయమే లేని మనం ఎల్లాపనికొస్తాం? విశేషం ఉన్నవాళ్ళంతా మనమనసుకి సమానులే.

సు - పోవోయ్, చెప్పావ్?

శం - నువ్వేమంటావ్?

సు - చిన్నపూర్ణయ్యగారిది దుర్గ సిద్ధాంతంట. అంచేత గొప్పది.

శం - అదే నే చెప్పిందీనూ. ఖాళీ సంభాషణవల్ల శాస్త్రపరిష్కారమూ కాదు, పరిష్కరణాల యాథార్థ్యమూ తెలియదు.

115

వక్త - (ఉపన్యాసమధ్యంలో) భగవద్గీతలు చెప్పిన కృష్ణుడు వేరు, భాగవతములో చెప్పబడిన కృష్ణుడు వేరు.

శ్రోతలలో ఒకరైన సుబ్బారావు ఆమాటలు విని,

- అవునవును. అందుకనే అతణ్ణి కృష్ణద్వైపాయనుడంటారు. ప్రతీవాడికీ తెలుసు. తమరు కొత్త సంగతులు ఏమన్నా కానీండి.

వ - అయితే, తమర్ని గురించే మాట్టాడాలి.

116

వజ్రాలూ రత్నాలూగురించిన ఒక అడ్వర్టైజ్‌మెంటు యొక్క రచన ఈ క్రింది విధంగా ఉంది! తెల్లనివన్నీ పాలుకావు. మెరిసేదంతా బంగారం కాదు. రంగే ప్రధానంకాదు, డబ్బే శాశ్వతంకాదు. మీరు పైడాబు ప్రచారాలు చూసి అక్కడికీ అక్కడికీవెళ్ళి టోపీ పడకండి. మమ్మల్ని ఒఖ్ఖసారి మచ్చుచూడండి, మీకే తెలుస్తుంది.

117

సోమయాజులు - ఊC, అల్లాయితే నువ్వు మెడ్రాసులో ప్రతిరోజూ తిరగడమే అందూ!

శర్మ - ఓ.

సో - దేనిమీద?

శ - మెల్లిన్సు ఆహారం మీద.

సో - ఓరి నీ దుంపతెగా, దానిమీద తిరగడం ఎల్లా?

శ- నిజమేరా. మళ్ళీ మాట్లాడితే - చేతితో తాకని - కూడానూ.

సో - ఓరి అదా! టిక్కట్టు ఎల్లా ఉంటూండేది?

శ - కానిదగ్గర్నించి బేడదాకా.

సో - అల్లా చెప్పూ! ట్రామా!

శ - మరే, కాని నే ఎక్కుతూండే దాని పేరు మాత్రం మెల్లిన్సే.

118

ఓ ముసలమ్మగారు తనయింటికొచ్చిన ముగ్గురు చుట్టాలకి అన్నం పెడుతూ, గరిటి అంటల్లో ఉన్నందువల్ల, రాచ్చిప్పతోనే చారునీళ్ళు వడ్డించబోయి. అది మొదటాయన విస్తట్లోనే ఇట్టీవంచగా, ఆయన తనకి చుక్కేనా కిట్టక తెల్లపోయినమీదట రెండో ఆయన తనకి దక్కినబాపతు గబగబా కలుపుగుంటూ తక్షణం మూడో ఆయన చెవులో,

ఆవిడ రాచ్చిప్ప నా విస్తట్లో వంచినప్పుడే నువ్వు చెయ్యట్టి సొమ్ముచేసుగో, నీవిస్తట్లో వంచిందాకా తేభ్యంలా చూస్తూంటావా నీ పని అంతే, నీకు ఆనక వట్టి పచారుతప్ప చారుండదు. పైన నీ యిష్టం.

119

తండ్రి - ఇదుగో పంతులుగారు, నమోన్నమః.

పం - చిత్తం.

తం - మా కుంక ఈ యేడేనా మాట దక్కించేనా, కాస్తా?

పం - ఫర్వాలేదండి,

తం - లేకపోతే ఆ దిక్కుమాలిన స్కూలిపైను పరీక్ష ఊరుకుంటుందా, మూడోమాటు!

పం - ఫర్వాలేదండి.

తం - అది గనక జరిగితే అక్కడికి మూణ్ణిద్దర్లూ అవుతాయి గనక దేశాంతరం లేచిపోవాలి.

పం - ఫర్వాలేదండి,

పం - అయితేనూ ముదురు వయస్సువాళ్ళని ఇహ చదివి ఫేలుకానీర్షేం?

పం - ఫర్వాలేదండి.

తం - ఎమో, మొత్తానికి మీరు నసుగుతూనే ఉన్నారు. మావాడిమాట నిష్కర్షగా చెప్పారుకారు.

పం - ఫర్వాలేదండి, అటు విజయనగరం విశాఖపట్నం లగాయితు ఇటు నెల్లూరూ గూడూరూ వరకూ ప్రతివిద్యార్థి ప్యాసయితే మీవాడు కూడా ప్యాసు కావాలి మరి. తం - అంతమంది ఉన్నమీద ఏం పర్వాలేదంటారా?

సం - పర్వాలేదండి!

120

ఒక సంతలో ఒక అరిటిపళ్ళ దుకాణదారు. కాలిమీదకాలు వేసుగు కూర్చుని, మీసాలు దిద్దుకుంటూ, లోగడ తను పదిహేనుసార్లు కొనుక్కునే వాళ్ళమీద ప్రయోగించి నెగ్గినట్టే అప్పుడూ నెగ్గాలనుకుని, ఒక పంతులుగారొచ్చి వేళ్ళాడగట్టిన అరిటిగెలలలో ఒక గెలలోనిపళ్ళు చెత్తోముట్టుగుని నొక్కి పరీక్షిస్తున్న సమయంలో,

దు - (హేళనగా సకిలిస్తూ) జాగర్తండి, పంతులుగారు! పళ్ళురాలగలవ్, జాగ్రత్త!

పం - (కంగారుపడక, చిరునవ్వుతో) అన్నట్టు నిజమే నయ్యోయ్ ! నీపళ్ళు రాల్తే నాకేం లాభం జాగర్త అవసరమే!

121

శేషగిరి - మీది ఏ జిల్లా?

చంద్రగిరి - వెనక గోదావరి. ఇప్పుడు కృష్ణ.

శే - గోదావరికి తూర్పుది అంతా తూర్పుగోదావరిట, పడమటది అంతా పశ్చిమగోదావరిట.

చం - అయితే నాది పూర్వగోదావరి కాదు.

శే - అది సరేనోయ్! అదికాదు నేననేది. అసలు గోదావరి జిల్లా ఎక్కడుందిప్పుడు.

చం - గంగలో.

శే - అది పాతాళంలోకి ఇగిరితే?

చం - నేతిలో.

122

అంతర్వేది తీర్థంలో కమలమ్మ అనే ఒక వితంతువు మారుగుడు అయిపోయినప్పుడు వాళ్ళవాళ్ళంతా కలివిలపడి ఆవిణ్ణి వెతికి పట్టుగోవాలని యత్నిస్తుండగా, శివరావు అనే ఒకాయన వాళ్ళ దగ్గిర్నించిపోతూ,

శి - ఏమిటండి?

వాళ్ళలో ఒకడు - మాతాలూకు ఒకావిడ తప్పిపోయిందండీ!

శి - ఆవిడ పేరు?

వా - కమలమ్మ.

శి - ఆవిడ పునిస్త్రియేనా?

వా - కాదండి.

శి - అల్లాయితే మీకంగారు బంగారుగానూ, అక్కడా అక్కడా దేవుళ్ళాడతారేం, ఛంగున రాచ్చిప్పల దుకాణంమీదికి వెళ్ళిపడక!

వా - రాచిప్పలు కొనడం నిన్న అయిందండి, వెడితే లాభిస్తుందా అని.

శి - పోనీ స్వాములవారు హరిదాసు ఒకడొచ్చాట్ట. ఆయన కథేమిటో కనుక్కుని పట్టుగోండి.

వా - (అంతమాట వాళ్ళవాళ్ళని అన్నందుకు కోపంవచ్చి) ఎంత భోగట్టా చేసొచ్చారు మీరు శ్రమపడీ!

శి - మీ శ్రమ ఒకటి నాశ్రమ ఒకటినా అండి!

123

మే - ఒరేయ్, సులేమాన్!

సు - సార్. మే - నీపలకేదిరా?

సు - నాది పల్కా చిర్డీ పోయిందండీ!

మే - హారి! నీ పలక పుడక?

సు - హేమ్టీ సెయ్యన్ అండి, పల్కాపుడ్కా తెగిపోయింది.

మే - ఓరి నీభాష పట్టంకట్టా! పోనీ పుస్తకంఏదిరా?

సు - పుస్తం యిర్గీ పోయిందీ అండీ!

124

తండ్రి - ఏమండోయ్, ప్రయివేటుమేష్టారు! కనపట్టంలేదే!

ప్ర - చిత్తం పరీక్షలు అయినాయి కాదండీ.

తం - ఈ యేడు ఎల్లా ఉన్నాయిష?

ప్ర - మామూలుగానే ఉన్నాయండి.

తం - లెక్కల పేపరు మహకష్టంగా ఇచ్చాట్ట వాడిమొహం ఈడ్చా!

ప్ర - కత్తి దెబ్బకింద స్పష్టంగా తేల్చవలిసొచ్చేవి కష్టం అంటార్లెండి.

తం - మావాడి లెక్కలు ఎల్లా ఉన్నాయి?

ప్ర - ఏమోనండి, పరీక్షతరవాత మీవాణ్ణి కలవలేదు. ఎన్ని చేశానన్నాడేమిటి?

తం - అన్నీట.

ప్ర - చెయ్యడం అంటే రైటు అన్నమాటండి.

తం - అల్లానాఅండీ! 'నాలుగు చేశానునాన్నా! నాలుగూ ఎక్కాల్లాంటివి. నాలుగురెళ్ళెనిమిది, ఎనిమిదైదులు నలభై! రావలసింది అంతకంటే తక్కువే. అంచేత ప్యాసైతీరాలి, అన్నాడు. అల్లాచూస్తారేం? అవుతాడా?

ప్ర - విధిగా, మీవాడి మాటే లెఖ్ఖండీ!

125

వెంకట్రాయులు - ఎమోయ్! సుబ్బుమహాశయా! కనపడ్డావే!నిన్న మీస్నేహితుడితో కలిసి కారెక్కి తిరుగుతున్నావే?

సు - ఎన్నిగంటలకి?

వెం - సాయింత్రం నాలుగింటికి.

సు - అంతేకద! రాత్రిపదింటికి తెలివితప్పి తిరగమంటావా నాతో!

వెం - అదికాదోయ్ నేనంటా!

సు - అదేనోయ్ నేనంటా!

126

కొత్తగా మేష్టరీలోకిదిగి ఒక కొత్తపాఠం క్లాసుకి బోధించాలని వచ్చిన ఒక తొందర మేష్టరు, ఇల్లా మొదలెట్టాడో లేదో! |

ఒకడు - మేష్టాండి, ఔటికండి.

మే - వెళ్ళి త్వరగా, రా, ఇక్కడున్నట్టు.

మరోనిమిషానికి.

మరోడు - రెంటికండి.

మే - ఛీ, వెళ్ళిరా, సూన్. మరొక కాస్సేపట్లో మూడువేళ్ళు చూపెట్టి

ఇంకోడు - మేష్టాండి.

మే - ఏమిటి వేలంవెఱ్ఱి! మూడంటే?

ఇం - మంచినీళ్ళకండి

మే - వల్లకాదు. (అని పాఠం అందుకో పోగా)

వేరొకడు - మేష్టాండి. నాలుగువేళ్లు పెడితే అన్నాని కన్న మాటండి.

మే - అబ్బా ఏమి అర్థాలూ? (అని వాణ్ణి సమీపించి) ఇది అయిదు (అంటూకొట్టి) తెలిసిందా?

వే - (కోపంగా) ఎందుకండి కొట్టడం? నాలుగంటే నాలుగు వేళ్ళూ లోపలికి వెళ్ళడం అని నేనంటేనూ?

మే - ఒస్ అదా! నేనూ అంతే. అయిదువేళ్ళూ అంటుగోడం గదా అని అయిదు అన్నాను.

వే - (ఏడుస్తాడు)

మరోడు - ఏడిచినట్టుండడం ఇదే అంటున్నాడండి వీర్రాజు.

మే - చాటున అనేకం అనుకుంటారు. మధ్య నువ్వు అరవకు.

127

ఆడలాయరు ఒకావిడ ఒక కేసులో సాక్షిని 'క్రాసు' పరీక్ష చేస్తూ,

- ఈసంవత్సరం మార్చి పన్నెండోతేదీ రాత్రి ఒంటిగంటకి నువ్వున్నది ఎక్కడ?

సా - (జడ్జితో) స్వంత భార్యకూడా అడగడానికి తాఖతులేని ప్రశ్నలు తక్కినవాళ్ళు మొగాణ్ణి అడగడం న్యాయంకాదని ఆర్డరు వెయ్యవలిసిందిగా కోర్టువారి ఘనతను గూర్చి ప్రార్థిస్తున్నాను.

128

ఒక పెద్దమనిషి పొరుగూరువెళ్ళి అక్కడ ఒక లైబ్రరీ భవనంలో ఉన్న గుమాస్తాతో కొంతకొంత మాట్లాడి,

పె - అల్లాయితే పోతన్న లేనట్టే ! పోనీ సూరన్న?

గు - ఉహుఁ .

పె -సోమన్న?

గు - అబ్బే ఉఁహుఁ.

పె - తిక్కన్న?

గు - అయ్యో చాదస్తమా! తిక్కన్నాలేడు తిమ్మన్నాలేడు. ఈకాలం చదవడాని కొస్తారూ పిల్లలూ! ఆ యెదరగుండా ఉండే కాఫీ హోటలుకి పోయి విచారించండి. వాళ్ళక్కడ దొరకచ్చు.

129

నీతిపాఠం చెప్పదలచి క్లాసుకెళ్ళి ఓమేష్టరు కూర్చుని మొదలు పెట్టడంలో,

మే - ఈవేళ విషయం ఏమిటి? నెం. 1?

1 - 'అబద్దాల కోర్లు'

మే - అవిషయం ఎక్కడేనా ఎవరేనా చదివారా?

6 - (నుంచున్నాడు) మే - దాన్ని గురించి ఈవేళ పేపర్లో పడ్డ విషయం చూశావూ?

6 - చూశానండి.

మే - అల్లాయితే నిన్ను గురించి మాట్లాడితే చాలు.

2 - ఏంచేతండి?

మే - ఈవేళ పేపర్లో ఆ విషయం లేదుగనక!

3 - అల్లాయితే మిమ్మల్ని గురించే మీరు ముందు మాట్లాడండి.

130

తన క్లయంటుని ఇంటిదగ్గిర తయారుచెయ్యడంలో ఒక ప్లీడరు క్లయంటుతో ప్రసంగిస్తూ,

ప్లీ - సరే. దెబ్బలాట అవుతా సరిగ్గా ఎవరెవరికి?

క్ల - మామేనగోడలు మొగుడు ఓడున్నాడండి, మాంచి మారీచుడంటివాడు. ఇదిగో ఆ చచ్చినాడు నావొళ్ళు హూనం అయేట్టు నన్ను కుళ్ళబొడిచి వొదిలిపెట్టాడు.

ప్లీ - ఒక్కడే.

క్ల - చిత్తం.

ప్లీ - ఇద్దరుముగ్గురయితే మనకేసు మహబలంగా ఉండునే!

క్ల - అబ్బే! అల్లా యెల్లా కుదురుతుందీ? మా మేనగోడలు ఒక్కత్తే కూడాను!

ప్లీ - అదోటా?

క్ల - మరేమిటనుకున్నారు! నాకు ఈ మాత్రం తోచకపోలేదు!

131

అంబి - ఒరేయి తంబీ! ఆ రామసింగుకి పాటారాదు నా మొహంరాదు. పెద్ద గాయకుడన్నావే.

తం - ఎమోమరీ! వాడికి గాయికంవచ్చి అయిదారేళ్ళయింది.

132

ఒకదొడ్లో తాడినిఉన్న ముంజికాయల దొంగతనానికి వెళ్ళిన నలుగురిలో గట్టివాణ్ణి ఒకణ్ణి కడమ ముగ్గురూ ఓడిమీద ఓడు వీధిలో నిలబడి గోడెక్కించిన తరవాత వాడితో,

ఒకడు - జాగ్రత్తరోయ్! గోడమీదపిల్లివాటంగా ఉండు,

గట్టివాడు - సరేలేస్తూ, మహా!

అని, గోడమీద నుంచిని అందుతూన్న గెలమీద చెయ్యి వేసే తొందరలో మదురుతాలూకు చీకుతాటికమ్మమీద కాలెట్టి దభేలుమని దొడ్లోకి పడిపోగా, వీధిలో తక్కిన వాళ్ళతో మెల్లిగా,

ఒకడు - ఒరేయి, గెలడిందిరోయ్!

అని, గట్టివాడు మదురుమీద ఉన్నాడుగదా అనుకుని. వాడితో,

- నువ్వుకూడా తాడమ్మటే దిగివచ్చి నిమ్మణంగా తలుపు తీరా.

గట్టివాడు తలుపువెంటనే తియ్యగా, వీళ్ళు లోపలికి చొరబడి,

- ఏదిరా గెలా ?

గ - (మూలుగుతూ) నేనేరా పడతా! నడుంపోయింది!

రెండోవాడు - (మూడోవాడితో) ముంజికాయల సంచీ ఏదిరా?

మూ - (ఇస్తూ) ఇదుగో.

రెం - (గట్టివాడితో) ఇందులో కూచోరా, మోసేస్తాం!

గ - మొయ్యండి గాని, కత్తిమాత్రం దూరంగా పెట్టండి! సంచీలోని ముంజికాయలేమో అనుకుంటే, సెలిగేస్తారు!

133

ఒక డాక్టరుకీ, ఒక ప్లీడరుకీ చాలా చనువు అవడంచేత ఒకరి నొకరు వేళాకోళం చేసుకోవడమూ మాడ్చుగుంటూ ఉండడమూ మామూలై, ఆ డాక్టరు కోర్టులో బోనులో నిలబడి సాక్ష్యం ఇవ్వవలసి రావడమూ ఆ లాయరే అతణ్ణి 'క్రాసు' చేస్తూండడమూకూడా జరుగుతూ రాగా,

ప్లీ - (బోనులోనుంచుని సాక్ష్యం ఇస్తున్న డాక్టరుతో) డాక్టర్లు ప్రమాదాలు చేస్తూంటారు కాదూ?

డా - చిత్తం. ప్లీడర్లు ప్రమాదాలు చేస్తున్నట్టే.

ప్లీ - అడిగినదానికి మాత్రమే సమాధానం చెప్పండి. అధికం వద్దు.

డా - చిత్తం.

ప్లీ - డాక్టర్ల ప్రమాదాలు భూమిలో పాతేస్తారు కాదూ?

డా - చిత్తం.

ప్లీ - ఏమాత్రంలోతున పాతేస్తారూ?

డా - ఎంతెత్తున ప్లీడర్ల ప్రమాదాలు గాలిలో వేళ్ళాడదీస్తారో, అంతే లోతున!

134

తెలుగుశాస్త్రి - 'అతిశయోక్తి' అంతే ఏమిటి? రామ్రావ్.

రా - గ్రాండ్ గ్రాండ్‌గా డాబడం.

తె - నీకు ఇంగ్లీషుముక్కలు కేవలం పటిగిబెల్లపుముక్కలు.

అడ్డమైనప్పుడూ అవి కటుకూకటుకూ నముల్తావు. ఉదాహరించు.

రా - కొందరు రాసిరాసి 'ఇల్లరాయడం అతిశయోక్తి కానేరదు' అంటూంటారు. అవన్నీ ఉదాహరణలేనండి, అతిశయోక్తికి.

శా - వినండి, కడం అబ్బాయిలు. ఇతనిమాటలే సరియైన అతిశయోక్తులు.

135

అవ్వగారి హోటలులో రాత్రి భోజనసమయాన్ని వడ్డన అయినతర్వాత భోక్తలలో దిట్ట అని పేరుపొందిన,

భీమయ్య - అవ్వా, అభీరించు పరిషంచేస్తాం.

అ - రాత్రిళ్ళు అభిఘారణ అవసరం లేదు, నాయనా, పరిషేచన కానీండి.

అనగా, వాళ్ళపరిషించి కూర కలుపుకోగానే, అవ్వవచ్చి అతి జాగ్రతగా నెయ్యిరాల్చగా, భీమయ్యకి అవ్వని చంపేద్దాం అనేటంత కోపంవచ్చినా, చేసేదిలేక, పక్కవాడికి సంజ్ఞచేసి తల వెంట్రుక ఓటితెంపి విస్తట్లో పారెయ్యగా, సంజ్ఞ అర్ధమై,

పక్కవాడు - అయ్యెయ్యో! తలవెంట్రుక వచ్చింది. అవ్వా! ఒక్కమాటు అభీరించు. అన్నమీదట, అవ్వవిసుక్కుంటూ ఒట్టి పొడిగరిటే పట్టు గొచ్చి విస్తట్లో ఇట్టీఅని చక్కాపోగా, మళ్ళీ పచ్చడి కలుపుగునేటప్పుడు నెయ్యి తప్పదుగనక పట్టుగొచ్చి అవ్వ వెయ్యబోతూండగా.

భీ - అబ్బబ్బ - తేలు, తేలు!

అని, తనకుడి అరచేతికేసి చూడడం అభినయించిన పిదప, అవ్వ, దీపంవత్తి ఎగసందోసి భీమయ్యచేతికి దగ్గిరిగా పెట్టి,

అ - అబ్బే! భయపడకునాయనా! చేతిలో తేలూలేదు, జెర్రిలేదు. ఏమీలేందే! భీ - (కోపంతో) ఏమీలేదనే నేనూ అంటూంటా! ఏమీ లేదు, నెయ్యీలేదు. తిన్నగా నెయ్యివేస్తావా, మరేమన్నా కావాలా! .

136

కాఫీహోటల్లో ఒక కాఫీపాయి తన కాఫీ తిరగాబోర్లా పోసుగుంటూ పక్కాయన మోఖంకేసి చూసి,

కా - కళ్లెర్రగా ఉన్నాయేమండీ?

ప - రాత్రి, నాటకానికి వెళ్ళానండి.

కా - ఏం నాటకం?

ప - భీమాంజనేయం.

కా - ఎల్లాఉంది?

ప - వాళ్ళ మొహంలాఉంది. చెప్పుచ్చుగుని కొడ్దామనుకున్నానుగాని, కొట్టలేదు.

కా - ఏం?

ప - అప్పుడు నా కాలిని జోడు లేకపోయింది.

కా - ఆరెరే, అప్పుడు నా కాలికి కొత్తపైజార్లు సిద్ధంగా ఉన్నాయిస్మండి. ఆక్షణంలోనే మీరు నా దగ్గరికి రావలిసింది. స్టేజిలోకి.

137

క్షౌరప్రసంగంవచ్చి, స్నేహితులతో,

కిష్ట్రావు - మామంగలి క్షౌరంచెయ్యడం ముగించిన తక్షణం మొహం చూస్తే. నిన్న చేసినట్టుంటుంది.

అప్రావు - మావాడు క్షౌరం కానిచ్చిన మొఖాన్ని పరిశోధించినా సరే, అసలు క్షౌరం చేసినట్టే ఉండదు.

సుబ్రావు - మామంగలి క్షౌరంచేసిన మొహం రేపటెల్లుండి క్షౌరం కాబోయే మొహంలాగ ఈవేళే ఉంటుంది. పైపెచ్చు! నిమిషం!

138

సినీమాలో ఒక కథపట్లు ముగిసే సందర్భంలో మోటారు కారు ఒకటి జనంతో సహా అమాంతంగా పర్వతాల మీంచి దొర్లి సముద్రంలోకి పడిపోగా ప్రేక్షకుల్లో ఉన్న ఒక శాస్త్రి పక్కనున్న బంధువు రావుగారితో,

శా - (చప్పరిస్తూ) ఆఁ, బూటకం, అసంభవం. అంతమంది చచ్చిపోతారా? అబద్దం.

రా - ఇందాకణ్ణించి జరిగిందిమాత్రం అబద్దంకాదా?

శా - (కొంచెం చికాకుపడి) అవుననుకో! -

రా - అయినప్పుడు నీకు బాధ ఎందుకూ?

శా - (కాస్త ఆలోచించుగుని, ఏదో ఓటి చెప్పదలచి) ఈ అబద్దం మరీ కారురకం!

139

అరణ్యం - ఆరి! ఏమీ సర్కస్‌రా! అన్నీ ఓ యెత్తూనూ, మొన్నరాత్రి, ఆమోటారు 'జంపు' దాటు - ఓయెత్తూనూ! అతనెప్పుడూ అందుకు సిద్ధం అయేఉంటాట్టస్మీ, 'విల్లూ' అదీ రాసేసి!

కాంతం - నువ్వు విన్లేదూ! పాపం వాడు గతించాట్ట. పట్నంలో, ఈవేళ. అ - పోయాడో, ఉన్నాడో! పనిలోఉండే కష్టాన్ని బట్టి, ఎప్పుడో, ఓనాడు వాడు ఎల్లానూ పోవలసినవాడేగదా అనుకుని, తమ ఊర్నించి వెళ్ళిపోడంతోటే పోయాడు అనేస్తూంటారు, జనం! కాని, మొన్నరాత్రి వాడితస్సగొయ్యా!

కాం - వాడోడూ! ఆ ఒంటిచక్రం సైకిల్‌వాడు, వాడు రొండోమాటొచ్చాడు. చూశావూ, వాడికాలు మడతకూడా పడిందీ!

అ - (మొఖం కొంచెం పొగచూరినట్టై) వాడా! నేనూ, అప్పుడూ, అవుటికి వచ్చాను. కాని, వాడు మూడోమాటు వచ్చాడేం, అప్పుడు ఒళ్ళుపులకరించి పోయిందిష్మీ! -

కాం - వాడు మూడోమాటు అసలు రాలేదు కాదురా!

అ - (చికాకు ఆపుగుంటూ) మూడోమాటు రాకపోవడమేమిట్రా? నిక్షేపరాయిడల్లావచ్చాడు. అప్పుడు నువ్వు అవుటికి వెళ్ళావేమో, జ్ఞాపకం చేసుకో!

కాం - కూచున్న చోట్నించి నేను కదల్లేదు, రెప్పవెయ్యలేదు, అవుటికి అనేమాట స్మరించలేదు.

అ - (వెళ్ళబోతూ) వస్తానుండు.

కాం - ఎక్కడికీ?

అ - అవుటికి. ఇతరులపన్లు నేను ఎన్ని చెయ్యటం లేదూ?

కాం - నువ్వుఅసలు వచ్చావా సర్కస్‌కీ?

అ - నేనా, బోలెడొచ్చాను. నేవచ్చినంత ఎవ్వడూరాలేదు.

కాం - వస్తే కోపమెందుకూ? వచ్చి మొత్తంగా అవుటి కెళ్ళావేమో జ్ఞాపకంచేసుగో?

ఆ - అది జ్ఞాపకంరాకనే, ఇప్పుడెడుతున్నానోయ్ అవుటికీ! ఇహ ఊరుకో, ఎల్లాగైతేం నేర్చావు సర్కస్ కబుర్లూ!

140

చిన్నప్ప - శేషాయిగారూ, ఈ మధ్య ఊళ్ళలేనట్టున్నారు!

శే - చిత్తం. సర్వమూ బ్లాక్‌మార్కెట్ కదండీ! అందుకని తిరగవలసొచ్చి తిరుగుతున్నాను. ఎక్కడా అనకండి, దక్కాలి గాని, చిలుం వొదిలింది.

చి - ఏమిటి గ్రంథం?

శే - మా కుర్రాడు పరీక్ష కెళ్ళాడు.

చి - దానికీ బ్లాక్ మార్కెట్ కీ సంబంధ మేమిటీ?

శే - అయ్యో మీ అజ్ఞానమా! పరీక్షపూర్వ ప్రశ్న పత్రాలు ఆర్జించేటప్పుడు; సమాధాన పత్రాలు రాస్తూండేటప్పుడు! రాసిం తరువాత అవి పోస్టులోనూ రైళ్ళలోనూ ప్రయాణించేటప్పుడు; అవి చిల్లరపరీక్షకుడు అధీనంలో ఉన్నప్పుడు? అవి టోకు ఆసామీని చేరుకున్నప్పుడు! వాటి వయినాలు ఖాయం కాబోయేటప్పుడు. ఇలాగ్గా పొడుగునా, చిన్నచిన్న పరీక్ష మొదలు మహా మహా పరీక్షల చివరదాకా బ్లాక్‌మార్కెట్.

చి - అదా! మనుషులుంటే మోసాలుంటాయి. మోసాలు ప్రతీదాల్లోనూ ఉండగలవ్. ఉంటేం? ఈ మోసాలకి మరోపేరు చూడండి. బ్లాక్‌మార్కెట్ అంటారేం?

శే - మరోపేరెందుకూ? మార్కెట్‌లో మార్కుల ప్రమేయం లేదా. బ్లాక్‌లో సిరాస్ఫురణలేదా?

141

ఒక భవనంలో జరుగుతూన్న సమావేశం గురించి వీధివెంటపోతూన్న ప్రసాదం, ద్వారందగ్గిర నిలబడ్డ ఒకావిడతో హేళనగా, ప్ర - ఏమండీ! ఇది ఫక్తు ఆడంగుల మీటింగా?

ఆవిడ - అబ్బెబ్బే, కాదండి. ఆడంగులేకాదు, ఏడంగులైనా వెళ్ళచ్చు. వొఠ్ఠి డంగుల్ని కూడా పంపిస్తూనే ఉన్నాం. మీరూ దయచెయ్యచ్చు.

142

కల్యాణం - అయితేనూ, అవధాన్లు మీవాడి కీమధ్య వివాహం అన్నాడు, నిజమేనా యేమిటి, భీమప్పగారూ!

భీ - ఏదండీ! ఇంకా కలిసిరాలేదు. చూస్తున్నాం ఓటి నేడో రేపో ఫొక్తుపడేటట్టుంది. మూడుముళ్ళూ పడాలి, అనుకోవాలి.

క - కట్నం?

భీ - రెండు పిల్లికూనలవరకూ చెబుతూన్నాం.

క - లాంచనాలు?

భీ - (తగ్గుస్థాయిలో) మీకు తెలియదా యేమిటి? మేమే ఆడపిల్ల వాళ్ళకిస్తూన్నది. మా మూడోవాడికి కాదూ, కొంచెం అవసరం ఉందీ?

.....ఏది ! .... అందుచేత నాలుగోవాడు ఇదివరకే ఓయింటివా డయాడుగా.

క - ఓహోహో! అదా! సరిసరి! పిల్లవయస్సూ!

భీ - ఏం జెప్పనూ? మూడు గాళుపులూ గడవలేదు.

క - అందుకనా, ఓపిల్లకూన తగ్గించారూ?

భీ - మరే. యధార్థం అంతే.

143

శ్రీరామనవమి ఉత్సవపు హడావిడిలో ఒకపందిట్లో హరిదాసు ఒకాయన, దండవెయించుగోవడమూ ప్రార్థనాలాంటి లాంచనాలూ అయినతరవాత, ఇంకా పాటా మాటాలోకి దిగాడోలేదో, అప్పుడే కొంప మునిగిపోయినట్టు ఆట మొదలెట్టి వెనకాల బల్లఉందో లేదో గమనింపు లేకుండా జరిగిజరిగి దిమ్మతిరిగేటట్లు వెనక్కిపడిపోగా,

ఒకసభ్యుడు - అయిందా అక్కడికి. నిమ్మణంగా లేవండి. భక్తి ప్రకటించడానికి పిప్పిగంతులేస్తే ఏమవుతుంది మరీ!

అప్పుడాయన మెల్లిగా మళ్ళీ బల్ల ఎక్కబోతూంటే,

మరోసభ్యుడు - వెనకంజ వెయ్యకండి మిత్రమా! మీరు, ముందుకొస్తే చూడాలని మేం కూర్చున్నాం.

హరిదాసు - (కాస్త తేరుకుని) నమస్కారం. మీరే మీరు జట్కావాళ్ళే జట్కావాళ్ళు. ఇతరులు ముందుకొస్తే చాలని మీరూ, పైకొస్తేచాలని జట్కావాళ్ళూ తాపత్రయపడుతూంటారు. కృతజ్ఞుణ్ణి.

144

భద్రాద్రి - ఒరే! మోహనం! నిన్నరాలేదే సినీమాకీ?

మో - ఊళ్ళోలేను. వేసంగికాదూ, రాత్రి ప్యాసెంజరుమీద వెళ్ళి ఉదయాని కొచ్చాను.

భ - అల్లానా! మంచిపనిచేశావు. మధ్యాన్నం రైలూ బాగానే ఉంటుందికాని, ఆగినప్పుడల్లా ప్రాణపోకటే?

మో - నిశ్చయంగా అంతే. ప్రాణానికి రైలుకీ ఏం బాంధవ్యమోకాని, రైలుపోతూంటే ప్రాణం నిలబడుతూంటుంది. రైలునిలబడితే ప్రాణం పోతూంటుంది.

145

ఒక సాయింత్రం ముగ్గురు డచ్చీలరాయుళ్ళు సముద్రపుపోర కూచుని కబుర్లు చెప్పుగుంటూండగా,

ఒకడు - (నిదానించి చూసి) అల్లా తూర్పుగా దిక్చక్రంకేసి చూసి ఏముందో చెప్పుకోండి.

రెండోవాడు - ఏముందీ నీ మొహం!

ఒ - ఓరి ఇదిట్రా నీ తెలివీ?

మూడోవాడు - పెద్ద దీపస్తంభం ఉంది.

రెం - ఇంకా ఏమడుగుతున్నావో అని ఊరుకున్నాను. అసలు నే నది ఇందాకానే చూశాను. అదుగో దానిమీద కాకివాలి ఉంది.

మూ - (చెవిఒగ్గి వినడం నటించి) నిజంరా! ఆకాకి శ్రావ్యంగా నిషాదం ఆలపిస్తోంది.

ఒ - ఇప్పుడు నువ్వు వింటూన్న నిషాదం పేరే కాకలి నిషాదం!

146

రంగశాయి - వెళ్ళావురా, పాటకచేరీకీ?

రత్నం - ఆ.

రం - ఎల్లాఉంది!

ర - ఆయన భల్లూకంలా ఉన్నాడు.

రం - పాట వింటాంగాని, చూడంకదా, ఆయనసరే. పాటమాట నేననేది?

ర - చాలా గొప్పపాటట.

రం - 'ట' ఏమిటీ? నువ్వెళ్ళానంటున్నావుగా!

ర - వెళ్ళాను. వెడితేం? కొందరు ముందు కూచున్న వాళ్ళకి ఆయన శాస్త్రం తెలిసిందిట ఆహాహా అంటోచ్చారు.

రం - అర్థమేమిటో తేల్చనఖ్ఖర్లేదుగనక, అల్లా అంటూంటార్లే గానశాస్త్ర మొహమాటస్థులు, నీమాట?

ర - మేం అంతాకలిసి భజన ఫక్కీని చాలాగోల చేశాం,

రం - ఆయన్ని మానిపించారా?

రా - ఆ? మా తరమా? ఒక్కమాటు మానినట్టే మాని తాంబూలం బిగించి మళ్ళీ అందుకున్నాడు.

తం - మీగోలకి పైనేఉందా ఆయనగాత్రం - ఖంగుమని కంగు గీసినట్టు?

రం - అబ్బే! లేదు. ఊరికే అద్దుడు కాగితం మీద సిరాగీత గీసినట్టు

ఊరుకుంది?

147

వేర్వేరు ఉద్యోగాల్లో ఉంటూ ఒక పెద్దనగరంలో ఒక భవనంలో జాయింటు కాపురం పెట్టుగున్న కొందరు బ్రహ్మచారి దొరలు, తమ నౌఖరైన ఒక చైనా కుర్రాడి తలకాయ ఎప్పటికప్పుడు సాలిగ్రామంలాగ కనబడుతూండడంవల్ల వాడు దగ్గరికొచ్చినప్పుడల్లా ఒక క్షౌరపుజల్ల ఇచ్చుగుంటూ ఉండేవారట. కొంత కాలానికి వాళ్ళకి ఆ కుర్రాడిమీద జాలివెయ్యగా.

వాళ్ళల్లో ఒకడు - ఒరేయ్! ఈ వేళనించి నీ బుర్ర టింగుమనిపించడం మాన్తామురా. వాడు - సరేనండి, చిప్పలుకడిగిన నీళ్లతో చేసిన కాఫీ మీ కివ్వడం ఈ వేళనించి నేనూ మాన్తాను.

148

నరుసు - ఏమయ్యా, ఆదెయ్యా! సూర్యం, చంద్రం, కాంతం, ముగ్గురూకూడా ప్రభాదేవిని వరిస్తున్నారు గదా, వీళ్ళల్లో అదృష్టవంతు డెవడవుతాడో!

ఆ - అదృష్టవంతుడు కనపడడు గనక ఎవడవుతాడో చెప్పలేను కాని. ఆవిడ సూర్యాన్ని పెళ్ళి చేసుగుంటుందని తెలుస్తుంది.

149

ఒకచోట జరుగుతూన్నది కొత్తవాళ్ళ పాట కచేరీ యేమో అనుకుని లోపలికి వెళ్ళి, ఇంతాచేసి ఆ పాడుతూన్నది తనకి పూర్వపరిచిత అయిన చంద్రకళయే అని గ్రహించి, తీరావెళ్ళి కూర్చోకపోతే ఇదిగా ఉంటుందని తను చతికిలబడ పోతూన్నా, లోగడ తనకి నమస్కారం పెడుతోచ్చినా ఆసమయంలో చంద్రకళ ఊరుకున్నందుకు కొంచెం చికాకుపడి, అప్పట్లో చంద్రకళ పాడుతూన్నపదం సమాప్తి కానిచ్చి, ఒక హరిదాసు.

హ - ఏదీ, చంద్రకళా! భైరవి పెద్దవర్ణంఅను.

చం - ప్రస్తుతం పాఠం లేదండి.

హ - అయ్యొ ఖర్మమా! అంత పసందుగా పదంపట్టినదానవు, చంద్రకళా! పెద్దవర్ణాన్నే నెట్టేశావే!

చం - (నమస్కరిస్తూ) చిత్తం. నమస్కారం. క్షమించాలి, దాసురాల్ని.

హ - క్షమించాలి, దాసుణ్ణి.

150

వెంకటగిరి - మాణిక్యం! తెలిసిందిలే. స్నేహితుణ్ణి అని చెప్పుగుంటూ రావుజీ ఇంట్లో వ్యవహరిస్తూ వాళ్ళమ్మాయితో ఉత్తర ప్రత్యుత్తరాలు నడుపుతున్నావుటే!

మా - హరహరా! ఇదిట్రా, నన్నెరుగుండీకూడా! ఆ అమ్మాయి ఒకటీ మనచెల్లాయి ఒకటీనా! ఎంతమాటాడావు!

అన్న కొన్నాళ్ళకి ప్రేమజాబొకటి ఇతరుల చేతుల్లో పడడమూ మాణిక్యాన్ని కట్లపాముని కొట్టినట్టు కొట్టడమూ జరిగి, మళ్లీ అతడు వెంకటగిరిని కలియడం తటస్థించగా,

వెం - ఏంరా? నాతో అంత అబద్దం ఎందుకురా? చెల్లాయని చెబుతోచ్చావే!

మా - చెల్లాయంటే ఏమిటి నీఊహ? ఆ అమ్మాయి పేరు చెల్లాయి, తెలుసునా?

వెం - చెల్లమ్మ కాదుట్రా?

మా - ఇంట్లో అంతా చెల్లాయి అంటార్రా, కావలిస్తే రాసిస్తాను.

వెం - ఇంకా ఎందుకులే! నీ రాత ఎల్లాఉందో తెలిసింది.

151

కుస్తీలోనెగ్గి బహుమతీ పట్టిగెళ్ళడానికి, ఒక గొప్పవస్తాదు ఒక మహారాజావారి దర్శనానికోసం దిగగానే, వాడిరూపవర్ణన వినేసరికి, ఆస్థానాన్ని కొరుక్కుతిని పందికొక్కుల్లా బలిసిన ఆస్థాన వస్తాదుల్లో కొందరు నడవలేకపోయీ కొందరు నడవగలిగినవాళ్ళు నడిచివెళ్ళి మంచం ఎక్కగా, మహారాజావారి ప్రతిష్ఠ నిలబెట్టడానికి సమయస్పూర్తిగల ఒక తెనాలిరామలింగం వంటివాడు లంగోటీ బిగించి తయారైన మీదట, పట్టణ మహాజనులందరూ చూస్తూండగా, పర్వతం అంత ఉన్న కొత్తవాడూ వాడిపక్కని వాడిచేతికర్రలాగ కనిపిస్తూండే మనవాడూ ఒంటినిండా చిందూరం పూసుగుని గోదాలో దిగగానె.

కొత్తవాడు - (కుడితొడమీద కొట్టుగుని ఠపేలుమని పించాడు.)

మనవాడు - (సరిగ్గా అల్లానే చేశాడు. )

కొ - (దండకొట్టి ఠపేలుమని పించాడు)

మ - (సరిగ్గా అల్లానే చేశాడు.)

కొత్తవాడు చేసినదానికి అర్థం మనవాడు గ్రహించుగున్నాడని జనం అనుకున్నారు.

మ - (కొత్తవాడికేసి చూపుడువేలు చూపించాడు.)

కొ - (ఇదేముటో తెలియక తెల్లపోయి ఒకఅంగ వెనక్కి వేశాడు. జనంలో కలకలం బయల్దేరింది)

మ - (తనకేసి చూపుడువేలు చూపించుగున్నాడు.)

కొ - (మరో అంగ వెనక్కి వేశాడు. )

- జనం కొంచెం కేకలూ లేవిడీలూ మొదలెట్టారు.

మ - (కొట్టడం సూచిస్తూ తనచేత్తో గాలిని పైనించి కిందికి నరికాడు.)

కొ - (రెండు మూడంగలు వెనక్కి వేశాడు.)

జనం, ఓరిబుట్టబొమ్మా ఓరిడబ్బా అని కేకలేస్తూ చప్పట్లు కొట్టేశారు.

మ - (అడుగున్నర ఎత్తు సూచిస్తూ తనరొండు అరచేతులూ పట్టి నుంచున్నాడు.)

కొ - (భయంతో వణికిపోయాడు.)

జనం ఈలలూ కేకలూ అరుపులూ చరుపులూ బాదులూ మొదలైనవాట్లతో మహాకోలాహలం చేశారు.

మ - ఏమిటి? (అన్నట్టు గుప్పిడిపట్టి ఊపుతాడు.)

కొ - (పుంజాలు తెంపుగుని పారిపోయాడు. )

జనం మనవాణ్ణి చేతులమీద ఎత్తేసి, నెత్తిమీద కూచోపెట్టుగుని భుజాలమీద ఉరేగించగా,

మహారాజు - ఏమయ్యా! వాణ్ణి ఎల్లా గెలిచావు?

మ - ఏమో మహప్రభూ!! నాకు తెలియదు.

మహా - కుస్తీలో నీకు తెలిసిన ప్రథమ విషయాలే తనకి తెలియవని వాడు పారిపోయి ఉంటాడు. మీరు మీ రహస్యం కాస్త విప్పిచెప్పండి.

మ - (వాడికేసి చూపించి) నువ్వు, (నాకేసి చూపించుగుని) నన్ను, (కొట్టడం) చంపేసేస్తావనుకో, (అరిచేతులు సూచిస్తూ) మరి మా అబ్బాయి ఉన్నాడు, (గుప్పిడి) వాడి మాట ఏమిటి? అన్నాను. గ్రహించుగోలేక వాడు తోకముడిచాడు.

152

ఏదో సుస్తీగాఉండి బాధపడిపోతూన్న మనోహరమ్మగారు వైద్యుడైన ఒక రావుగారికి కబురుపెట్టగా, ఆయన మనోహరమ్మ ఇంటికి వచ్చి, ఆవిడమంచంమీద పరుండడం గమనించి,

వై - పెద్దలు లేరండీ!

మ - (మూలుగుతూ, గట్టిగా) నాన్నా నాన్నా!

అని కేకేసేసరికి, దగ్గుతో వంగిపోయిన చెమిటి తండ్రివచ్చి పక్కనికూచోగా, వైద్యుడుకూడా కూచుని, వై - (ఆవిడతో) మీరు లేవకండి. ఏదీ చెయ్యి!

మ - ఇదుగో, మీరు తిన్నగా గ్రహించాలి.

అని, తనకుడిచెయ్యి ఇయ్యగా,

వై - మీరు నర్మదాపురుకుత్సీయం చదివినట్టున్నారే! ఎడమచెయ్యి ఇయ్యండి. అనగా, ఆవిడ ఎడమచెయ్యి ఇచ్చినమీదట పరీక్షించి,

వై - ఈవిడకి పెళ్ళే మందండి,

మ - తమరే కటాక్షించాలి, ఆ మందు.

వై - (వెళ్ళడానికి లేవబోతాడు.)

తండ్రి - (చెముడువల్ల పైసంభాషణ వినపడక) ప్రస్తుతం మూడుమోతాదు లిప్పించండి. కావలిస్తే తరవాత పిరాయించుగోవచ్చు.

153

రాజు - బండీ, స్టేషను కెంతక్కడతావు?

బండివాడు - బలువు మీరేనా?

రా - నువ్వూ, బండీ, గంటా - ఇవన్నీ మాత్రం బలువులు కావూ ఎద్దుకీ?

బం - అదికాదుబాబూ! మీరొక్కరేనా బండిలో కూర్చునేది?

రా - అవును. ఎంతక్కడతావు?

బం - నిమిట్లో కడతాను. రైలందుకుంటాను.

రా - అదికాదురా, ఎంతసొమ్మిస్తే కడతావు?

బం - అదాండీ. మీరెరగరూ? మామూలే!

రా - మామూలా? నాకు దిగిదులుపుగుని చక్కాపోడం మామూలు!

బం - అల్లాటోళ్ళకి కట్టకపోడం నాకు మామూలు.

రా - దిగేటప్పుడుగాని అల్లాంటివాళ్ళు నీకు తెలియరుగా!

బం - ఎక్కకుండానే తెలుస్తూంటేనే బాబూ!

రా - నాకు బండీయే అక్కర్లేదూ, హాయిగా నడిచేపోతాను.

బం - సిత్తం. శీఘ్రంగా నడవండి. నాయెద్దుకి కాలు నలిగింది. నేను కట్టనే కట్టను.

154

ఒక పెద్దపన్నా పోలీసు ఇనసపెక్టరు ఇంటిదగ్గిర మామూలుగా ఉండేటప్పుడు తొడుక్కునేటందుకు సాదాజోడు కొనుక్కోవాలని షాపుకివెళ్ళగా, జోళ్ళషాపువాడు గుండెల్లో రాయిపడి ఏదో నొల్లుకుని పోతాడ్రా అని భయపడుతూ,

షా - నమస్కారం బాబూ, దయచెయ్యండి.

ఇ - నాకో జోడు కావాలోయ్!

షా - చిత్తం. తమరు సర్వాధికారులు. మాప్రాణాలు తమచేతులోనే, ఉండేది.

అంటూ ఎన్ని వేరువేరు కొలతల జోళ్లు తీసిచూపించినా వాటిల్లో ఎవీ ఇనస్పెక్టరుకాలికి ఎక్కకపోగా,

ఇ - (ఇంకా ప్రసంగం సాగిస్తూ) చెప్పిచెప్పి మా సర్వాధికారమే చెప్పుగోవాలి, పోదూ! అసలు మాకు ఓకాలు ఎప్పుడూ జైలులోనే ఉంటుంది.

షా - పోనీ , ఆమిగత కాలేఆయిరి, ఛస్తే ఏజోడులోనూ ఇమిడేటట్టు కనపట్టంలేదు. బాబూ!

155

సెకండుఫారం చదువుతూన్న కొడుకు తండ్రితో,

కొ - నాన్నా! ఈ యేడు లెఖ్ఖల్లో ప్యాసవుతాను, నాన్నా.

తం - ఏం? నిరుటికంటె ఈయేడేం కొమ్ము లొచ్చాయా? నీ లెక్కలు ఇహనంతే.

కొ - కాదు నాన్నా . ఈయేడు నాకు లేఖ్ఖలకి 'దేవసహాయం' ఉంది,

తం - పురుషప్రయత్నం లేందే అదిఉండదోయ్, చవటా! ముందు నోరుమూసుకొని చెయ్యి. తరవాత దేవ సహాయం.

156

మొయ్యలేనంత డబ్బు తమరికిఉన్నా, ఇంకా తేరగావస్తే బావుకోవాలనే ఊహతో ఎల్లానైనా వొడుపుమాటలు చెప్పి మొగుణ్ణి సంభావనకి గెంటదల్చుకుని,

కంఠాలమ్మ - చూడండీ! రేపు నాగారంలో పాకెన్నష. రోజల్లా గోళ్లుగిల్లుకుంటూ కూచోడమే కాని మీరుచేసేదేముందీ? వెళ్ళి సందెవేళకి ఇట్టిరావచ్చు.

మొగుడు - (ఎల్లానైనా నడక తప్పించుకోవాలని మూలుగుతూ) నాకు ఈనడుంనెప్పి ఓటికాదూ?

కం - దానికేం? అదెప్పుడూ ఉన్నదే ఆయె, నేనె తెల్లారకుండా, మీకు మినపరొట్టి చేసి పెడతానుగా!

అని, అతణ్ణి ఒప్పించి, ఝాం తెల్లారకట్టే, కాళ్ళు విరగదొక్కుగుని, ఆ హడావిడిలో కాస్త బెల్లంతరిగి తేవడానికి వెళ్ళి కత్తిపీటమీదపడి, ఎల్లానోఇదై, చెయ్యగా, బూలిమూకుడు రొట్టీ ఊదిపారేసి నిమ్మణంగా నీలుగుతూ బయల్దేరి వెళ్ళి అయిదునిమిషాల్లో తిరిగివచ్చి, మొగుడు ఏమేవ్!

కం - ఏం? అప్పుడే ఏ మొచ్చిందీ, వెనక్కిరావడానికీ?

మొ - (మూలుగుతూ) సంభావన రేపుటే!

కం - ఇంతేకదా!

అని, మర్నాడు అల్లానే చేసి పెట్టి పంపగా అతడు మొదటి నాటికిమల్లేనే తక్షణం తిరిగివచ్చి, అతినీరసంగా.

మొ - ఏమేవ్, సంభావన నిన్ననేటే!

కం - మీనిన్న కాల్చిరిగదయ్యా! మూకుళ్ళకి మూకుళ్ళు తినడం అయిందికదా. ఆమాట గట్టిగా ఏడవక మూలగడమూ మీ మూలుగుఊరికెళ్ళా!

ము - (మూలుగుతూ) వెళ్ళీ వచ్చేసిందీ?

157

రాఘవులు - కేశవులూ! ఎంతమట్టుకొచ్చింది, మీ యింటో పెళ్ళి వ్యవహారం?

కే - చెరిసహం కుదిరింది.

రా - అంటే?

కే - అంటేనా! వాళ్ళు పిల్లని ఇస్తాం అనడం తడువుగా చేసుకోడానికి మేం ఒప్పుగునేటందుకు అంతా సిద్ధం చేసుగుని ఉన్నాం. సరి, నీ రాజీసంగతి ఏకాడికొచ్చింది?

రా - అదీ సహంసహం అయింది.

కే - అంటే? రా - నే చెప్పిందంతా వాళ్ళువినడం అయింది.

కే - అయితే, చెరిసహం నీదీ అయినట్టేగా!

రా - కాలేదేమో అని నా భయం. ఏమంటావా, వాళ్ళు విన్నది వాళ్ళకి తెలియాలి, తెలిసిన మీదట నచ్చాలి, నచ్చిన మీదట వాళ్ళు ఒప్పుకోవాలి.

158

కైవారపు శిఖరయ్యగారి క్షౌరకాండయొక్క మధ్యరంగంలో ఆయన మెడమీద కొంచెం కత్తితో ఒత్తవలిసొచ్చి, మంగలి, అమాంతంగా ఆయన బుర్రకాయ కిందికి వంచబోగా,

శి - (ఊపిరి సలపక) అబ్బ! అబ్బ! ఉండరా!

మం - మరి, వెనకాల కొంచెం ఒత్తాలండి.

శి - అయితే, పొట్టవేపునించి తిరిగి వీపువైపు, రా.

మం - రావచ్చుగాని, నేనవతల తొందరగా వాయింపు కెళ్ళాలండీ

159

కృష్ణుడు - ఒరేయి పానకం! నీకూ అమృతానికీ చెడిపేడీ అయిందిటా?

పా - అవదూ?

కృ - ఏమిటి కథా?

పా - ఆ ఏముందీ? ఏవో కొన్ని దంపుడుపద్యాలు కట్టి తెచ్చాడు. తెచ్చీ, బాగున్నాయా లేవా అని నన్ను చంపడం మొదలెట్టాడు. మొదలెడితే, పోరా నీకు కవిత్వం ఎమిటీ అన్నట్టు ఓ వందదోషాలు అయిదునిమిషాల్లో చూపించాను.

కృ - అయితే మరి దోషాల్లోంచి రోషాల్లో పడలేదూ మీ రిద్దరూనూ?

పా - వాడికి రోషంలేందేట్రా! వాడు ససవ! కాడంటావా?

కృ - అవును.

పా - ఎల్లాకనిపెట్టావ్?

కృ - లేకపోతే నిన్నడగడం ఏమిటి పద్యాలెల్లా ఉన్నాయనీ! మరోచవటని ఎవణ్ణడిగినా, తీరిపోను!

160

తొందరగానూ ఖంగారుగానూ ఇంట్లోకి జొరపడుతూ,

ఆయన - అమ్మకుంకా! చూడూ!

ఆవిడ - ఏమిటేమిటి?

ఆయన - పెసరయ్యగాడు!

ఆవిడ - ఏమన్నాడు?

ఆయన - తనతో నేను సమానం కాదుట.

ఆవిడ - మీ అంతవారు వాడితోనూ సమానం కాకపోవాలాయేమిటి ఊరుకుందురూ, వాడిలెఖ్ఖేమిటి, వాడిమాటలు లెఖ్ఖేమిటి పోనిస్తురూ! అసలు వాడు ముండల ముఠాకోరూ!

161

తమతమ రైళ్ళ వేగాలగురించి ముగ్గురు అభూతకల్పనలు చేసి మాట్లాడుకుంటూ,

ఒకడు - మారైలు చాలావేగంగా పోతుంది. అది వెడుతూంటే భూమేదో జలమేదో ఆకాశం ఏదో తెలియకుండా సర్వమూ ఒక్కటే గిలాబాలాగ ఉంటుంది. రెండోవాడు - అది యింకానయం. మారైలు వెడుతూంటే, పక్కనున్న టెలిగ్రాపు స్తంభాలు బహుదగ్గిరిగా వచ్చినట్టైపోయి సన్న కోతకోసిన దువ్వెన్న పళ్ళులాగ కనబడతాయి.

మూడోవాడు - ఒస్. ఇంతేనా! మా రైలు సంగతి వినండి.

మొన్న నేను రాజమండ్రిలో రైలెక్కాను. రైలు బయల్దేరింది. ఇంతలో నాచేతులో ఉన్న పుస్తకం ప్లాటుఫారం మీదివా డెవడో ఊడలాక్కున్నాడు. వాణ్ణి ఒక్క చెంపకాయ లాగపోయాను. ఆ చెంపకాయవెళ్ళి దానిదుంపతెగా, కడియం స్టేషన్లో పోర్టరు దవడమీద పడింది.

162

ఇంగ్లీషు విద్యార్థులు కొందరు, తమ గురువుగారు చెప్పే చెప్పడాన్ని గురించి ప్రైవేటులో మాట్లాడుకుంటూ,

సత్యం - మనవాడు గజ్జికట్టడం తోటే, నాకు నిద్దరొస్తుంది. నాకేమీ తెలియదు.

ముత్యం - నాకు నిద్దరాపట్టక కీచుకీచయిపోతాను. ఆయనకే తెలియదట, ఆయన చెప్పేది! ఎమో, చాలామంది అల్లా అంటారు.

విశ్వం - అదికాదు. ఆయన చెప్పేటప్పుడు, ఏపుస్తకం చెబుతున్నాడో ఆపుస్తకం రాసినవాడికికూడా తెలియకపోడం అనేది ప్రారంభం అవుతుందిట.

స - నేను నమ్మను. వాడెందుకుంటా డక్కడా?

వి - అయ్యో నువ్వెరగవురా! మనస్తంతులుంటాయి.

ము - ఒకవేళ ఆపుస్తకం రాసినవాడు కీర్తిశేషుడైతే, ఎల్లా?

వి - ఓరి, వెర్రివాడా! అయినా. ఫరవాలేదురా. ఆత్మతంతులని ఉన్నాయిరా! వాట్లకి నాశనంలేదు.

163

శివయ్య - మూర్తిరాజు మొన్న మీటింగుకి వచ్చాడన్నార్రా, ఎవళ్ళోనూ!

పట్టాభి - రాలేదని నేనన్నానని చెప్పు, వాళ్ళతో.

శి - ఎవళ్ళో జ్ఞాపకంలేదురా (అని కళ్ళుమూసుగుని జ్ఞాపకం చేసుగుంతూన్నట్టు నటిస్తాడు)

ప - సరేలే. వాళ్ళెవళ్ళో జ్ఞాపకం వచ్చినప్పుడే చెప్పువాళ్లతో,

శి - అంతే చెయ్యాలి.

ప - కాని, ప్రస్తుతం నేనన్నది జ్ఞాపకం ఉంచుకో, తీరా వాళ్ళెవళ్ళో జ్ఞాపకం వచ్చిన తరవాత, వాళ్ళని కలుసుగుని నిలబెట్టి, కళ్ళుమూసుగుని, నేనేమన్నానో జ్ఞాపకం చేసుగోడం మొదలెడితే, వాళ్ళతాడుకూడా తెగుతుంది.

164

కోటయ్య - ఫిల్ముచిత్రానికి ఏంపేరు పెట్టడం నీకిష్టం? ఆడపేరా, మగపేరా?

భార్య - నాయిష్టం మాట ఎలా ఉన్నా, ఆడపేరు పెట్టడమే లాభం.

కో - లాభమా?

భా - లాభమూ స్వభావసిద్ధమూ కూడానూ!

కో - ఏం, నువ్వు ఆడదానవనా?

భా - ఇదా గ్రహించారు? నెలదాటే యోగ్యత ఉంటే ఉండవచ్చునని!

కో - ఓహో, అప్పుడు తొమ్మిది నెలలూ మొయ్యడం సంభవించ వచ్చుననా! ఎంతగడుసువీ!

165

తమరి ప్రమదావనంలో ప్రతిధ్వనిచ్చేరాయి ఉందని చెప్పి స్నేహితులందర్నీ ఊరించి చంపి, ఒకనాడు, తద్విషయంలో అయిదింటికి స్నేహితులందర్నీ పిలిచి ఆ వనంలోనే వాళ్ళకి కాఫ్యాదులు ఇస్తూ వాళ్ళు అవి ఆరగిస్తూన్న సమయంలో, తను, దానికేసి నడిచి,

మీనయ్య - ప్రతిధ్వనోయ్!

ప్రతి - ఓయ్!

అనగా, చివరపలుకు ప్రతిధ్వనించటంవల్ల అందరూ మెచ్చుగున్నా, అక్కడ తను దాక్కోపెట్టిన మనిషివాడు తమ చెప్పిన మాటలు మరిచి పోయాడని మీనయ్య కొంచెం ఆగ్రహించి, మళ్లీఅటువెళ్ళి.

మీ - సరిగ్గా చెప్పు వెధవ పీనుగా!

ప్రతి - వెధవ పీనుగా!

మీ - (కోపంతో) ఛంపేస్తా!

ప్ర - ఛంపేస్తా!

అని ప్రతిధ్వనులురాగా, బయల్దేరుతూన్న కోపం చంపుగుని, పైకి నవ్వుతూ, స్నేహితులతో,

మీ - చూశారా! ప్రతీ అక్షరం ఎంత స్పష్టంగా వినపడుతోందో!

ఒక స్నేహితుడు. - (ఆ రాతికేసి నడిచివెళ్ళి) నువ్వుంటా ఎప్పణ్ణించీ?

ప్రతి - ఒంటిగంట నించి

ఒకస్నే - ఇదేమిటి, మీనయ్యా! ఈ ప్రతిధ్వని ప్రశ్నలకి సమాధానం కూడా చెబుతోందే!

మీ - ఇది కొత్తరకం, ప్రపంచంలో ఏదీ అసంభవం కాదు.

166

బాపిరాజు - మనిషి కోతిలోంచి పుట్టాడంటారేమిటీ? నీ అభిప్రాయం ఏమిట్రా, రామకోటీ?

రా - ఆఁ, ఇల్లా అంటున్నారని కోతులికి బోధపడదు గనకః లేకపోతే అవి పేచీపెట్టవూ?

బా - పోనీ, ఈవాదన మంచిదంటావా?

రా - మంచిదే.

బా - ఏం?

రా - కొందరు కొందరు వెనక్కి మాట్లాడుకుపోతూ తమ తాతల్నీ ముత్తాతముత్తాతల్నీ స్తోత్రాలు మొదలెట్టి గొడవ చేస్తూంటారు. అలాంటివాళ్ళని ఇవతలికి గెంటడానికి ఈవాదన కాస్త గోడలాగ పనిచేస్తుంది.

167

ఒక చోట అతిఘాటుగా ఉపన్యాసం పేల్చేస్తూన్న ఒకవక్త -

మహాజనులారా, నానోట చీమంత అబద్దం వచ్చినాసరే, నా నెత్తిమీద పెద్దపిడుగు పడుగాక! అంటూ చాలాహడావిడిగా అభినయించగా, ఏదో ఊరికే బులబులాగ్గా కర్రముక్కలతో అంటెట్టి ఉన్న ప్లాటుఫారం పెళ్ళుమని విరిగి ఢమ్ముమని కిందపడిపోగా,

ఒక సభ్యుడు - పిడుగు పడింది. అన్నీ అబద్దాలన్నమాట.

అనగా, చాలామంది తెల్లపోగా, కొంతసేపట్లో, ఆ కలపలోంచి వక్తలేచి పైకివస్తూండడం గమనించి,

మరోసభ్యుడు - నెత్తిమీద పడకుండా దూసుకుపోయింది. పిడుగు. నెత్తిమీదే పడుతుందన్నాడు. అన్నీ అబద్ధాలే.

168

అవధానిగారు బల్లదగ్గిర కూచుని జోడుకేసి పరిశీలనగా చూస్తూండగా,

కొడుకు - అదేమిటి, నాన్నా!

అ - జోడులో టోపీపడ్డాను, ఉండరా!

కొ - కాలి జోడులోనా? కాలిదగ్గిరికి టోపీ ఎల్లా వచ్చింది నాన్నా!

అ - అబ్బ ! కంటిజోడులోరా. టోపీ అంటే దండగ!

కొ - అమ్మినాయన ఎవరూ?

అ - నా స్నేహితుడే.

కొ - అయితే, దగా ఎందుకుంటుందీ?

అ - అందుకనే ఉంటుంది. నేను తన్ని నలుగురిలోనూ యాగీ చెయ్యలేనుగదా, తన రహస్యం అల్లానే ఉంటుందిగదా, అని 12 రూపాయలదానికి 21 పుచ్చుగున్నాడు.

కొ - ఖరీదు కాయితంమీద వేసిచ్చాడా?

అ - ఆ ఇదుగో.

కొ - దీనిమీద 12 రూపాయలనే ఉంది.

అ - (జోడూ తీసేసి చూసి) అవున్రోయి. జోడెట్టుగుని 12 కేసి చూస్తే 21 లాగ కనిపించే జోడిచ్చాడు, మాట్టాడకుండా, దాంతో చూసి నేనిచ్చేశాను.

169

దీక్షితులు - ఎమోయ్, రాంభొట్లూ! ఏమిటామూట?

రాం - మినుములు,

దీ - ఎల్లా?

రాం - ఎరగవు గావును, పంతులుగా రింట్లో దశదానాలు.

దీ - ఎవరూ, పాపం!

రాం - మగపిల్లాడే. ఈ పాటికి పీటలమీంచి లేస్తారు.

170

సూరయ్య - విన్నావా, నారయ్యా! మన ప్రజాపతి చదువుకున్నవాడనికూడా తేలింది. వాడికి మొదట లక్ష్మీ ప్రసన్నం. ఇప్పుడు సరస్వతీ ప్రసన్నం.

నా - ఆగాడు. (అని ఆలోచిస్తూ) మొదట వాడికి లక్ష్మి వచ్చి కనపడింది. ఒప్పుగున్నాను. తరవాత. సరస్వతివచ్చి కనపడిందా, ఓ, అదీ బాగానే ఉంది.

సూ - ఏమిట్రా ఆ ఆలోచనా, ఆ సందేహమూనూ?

నా - ఏమిటంటావా? లక్ష్మికి చేతులో ఉంటుంది తామర. సరస్వతి మొగుడు తామరలోంచి పుట్టాడు. మన ప్రజాపతిలోంచే తామర పుట్టింది. వీణ్ణి మెచ్చుగోడానికి వచ్చి వాళ్ళిద్దరూ ఎప్పుడో ఒకప్పుడు కనపడడం సబబుగానే ఉంది.

171

పదిహేను రోజులక్రితం తనదగ్గిర మందు పట్టిగెళ్ళి మళ్ళీ ఐపూమచ్చా లేకుండాపోయిన పున్నయ్య తనకొట్టు దాటి రోడ్డు మీద నక్కినక్కి పోతూండగా కనిపెట్టి ఎల్లానేనా వాడిదగ్గర కొంత లాగలేకపోయామే అనేబాధ దాచుగుని పైకినవ్వుతూ,

వైద్యుడు - ఏమండోయ్, పున్నయ్యగారూ! రండి, కనపడ్డం మానేశారే! పు - ఏమిటోనండీ! అనుకుంటూనే ఉంటాను. ఎప్పటికప్పుడు ఏదోవోటి వస్తూంటుంది.

వై-పోనీలేండి. ఒంట్లో ఎల్లాఉంది?

పు - బాగావుంది.

వై - ఉందికద! అల్లాయితే మందు ఇంకా పట్టిగెళ్ళండి. “కంపౌడర్! చూడూ! వీరికి.”

పు - వద్దండి, వద్దండి, అదీ ఎదీకూడా నేను పుచ్చుగోలేదు.

వై - పోనీ, ఇప్పణ్ణించి పుచ్చుగోండీ! దానికేం?

172

మండలం - పరమయ్య ఈ మధ్య మేడకట్టాడుట, విన్నావురా పెంటయ్యా?

పెం - విన్నాను.

మం - ఎందుకురా, వాడు మేడకట్టడం?

పెం - బహుశా, ఎక్కిపడడానికి.

మం - ఆమాత్రానికి చెట్టెక్కకూడదూ పోనీ!

పెం - చెట్టెక్కడం చేతకాదేమో!

మం - నిచ్చెనేసుకోవాలి అలాంటప్పుడు.

పెం - వాడి నిచ్చెనకాళ్ళకి రెండింటికీ బాఘా ఓ మూరెడు హెచ్చుతగ్గు ఉంది. వాడికంటె ముందు అదే పడిపోతుంది.

మం - నన్నడిగితే నేనైనాఇస్తును భేషైన నిచ్చెన.

పెం - నిన్నడగడానికి నీకంటె వాజమ్మగా తయారవాలి. అవడం కష్టసాధ్యం.

మం - మొండివాదన వాదిస్తే ఏమి ఒలుకుతుంది?

పెం - గుండెలేకుండా వాదిస్తే ఒలికే బాపతే!

173

మనిషి నెత్తురు చప్పరించి చూసిన ఓ చిరతపులి రాత్రిళ్ళప్పుడు ఒక ఊరువీధుల్లో తోక ఝాడించుగుంటూ తిరగడం మామూలు చేసుగునేసరికి, బతుకుతెరువు తెలిసిన మహాజనులందరూ సాయింత్రం పడకుండానే దీపాలార్పుగుని తలుపులు బిడాయించుగుని జాగర్తపడుతూండగా, అది ఓనాడు ఆఊరి పోలీసుస్టేషన్ ఎదర బైటాయించేటప్పటికి, అక్కడ కాపలా కాస్తున్న నెం. 102 పోలీసు భంట్రోతు, సాహసించి అమాంతంగా పక్కగదిలోకి ఉరికి తలుపువేసుకోగా, ఖైదీలు గొంతెత్తి పాడ్డం మొదలుపెట్టడం తనకిష్టంలేక,

పో - ఏయ్! పాడకండి. అది నేనున్న గదిలోకి పైనించి ఉరకగల్డు.

అని కేకవేసినా వాళ్లుమానక, ఆగోలలోనే ఆకురాయితో ఇనపకమ్ములు తెగ్గోసి అయిదుగురు ఉడాయించేసిన పిదప ఆరోవాడు (స్థూలకాయుడవడం వల్ల) ఆ కమ్ముల్లో చిక్కడి ఉండగా, చిరతపులి వెళ్ళిపోడం పసిగట్టి మరేదో జరుగుతోందని పైకొచ్చి, చూసి, వాణ్ణికొడుతూ,

పో - వాళ్ళేరీ, చెప్పు, బద్మాష్!

వాడు - (పోలీసుని వినిపించుగోక, తనలో) నయమే, మొదట్లోనే నేను యత్నించలేదు, వెళ్ళడానికి.

174

తండ్రి - ఏమండీ, మేష్టారూ! మా వెంకటపతి ఎల్లాఉన్నాడు, ఈయేడు? నిరుడు ఒక్కమార్కు తక్కువొచ్చిందంటూ ఇందులోనే కూచోపెట్టారు, ఆ స్కూలువాళ్ళు, వాళ్ళమొహంఈడ్చా!

మే - మా మొహమూ ఈడిపించేట్టున్నాడు, ఈయేడు. నిరుడే నయం. తం - ఏమీ ససిగా లేడంటారా?

మే - ఎల్లా ఉంటాడూ? మరో మార్కు ఎక్కువైందిప్పుడు.

తం - ఎక్కువవడం మంచిదే కాదుటయ్యా?

మే - అయితే నన్నెందుకు మీరడగడం?

తం - అదికాదండీ! రొండోయేడు దుఖ్ఖంతో చదవాలిగా!

మే - అంతా దుఖ్ఖిస్తారాండీ! ఒక్కొక్క రొండోపెళ్ళివాడు దుఖ్ఖిస్తూనే బాణాసంచాకూడా కాలిపిస్తాడు.

తం - ఎల్లా అయినాసరే పైకి వెళ్ళేట్టు చూద్దురూ!

మే - మీరతడు పడిపోకుండా చూసుగుందురూ?

175

ఒకావిడ భరతనాట్యం మొదలెట్టి, ఒకపదం పడుతూ, అందులోవచ్చిన 'నెరజాణ' అనే ముక్కలోది 'జాన' అనుకుని, చేతో జేన అభినయించగా,

ఒక సభ్యుడు - ఆహాహా! ఏమికళ, ఏమికళ!

పక్కవాడు - (నవ్వుతూ) ఏం, ఏం?

ఒ - ఆవిడ, కేవలమున్నూ, ఆయొక్క శబ్దబ్రహ్మం!

ప - చాల్లే ఊరుకో. అర్థబ్రహ్మం.

ఒ - ఎల్లా?

ప - ఎల్లానంటావా? ఎవరు సొమ్ము చేసుగుంటారో, వాళ్ళు అర్ధం చేసుగున్నవాళ్లు కాకుండా ఎల్లాపోతారూ?

176

రంగం - సోములూ! “ఊటీ” వెళ్ళి వచ్చావుట.

సో - అవును.

రం - నీకు చాదస్తంగాని, చలవ ఇక్కడమాత్రం లేదూ ? అయితే, యేటా వెడుతున్నావా?

సో - రొండోమాటు ఇది.

రం - అయ్యో, సొమ్ము తగులడిపోతుంది. ఇహ చాల్లే. వెళ్ళకు.

సో - మొదటిసారి వెళ్ళొచ్చి అల్లానే అనుకున్నాను. అనుకుంటూండగానే, మళ్ళీ కరిచింది పిచ్చికుక్క, మరి కరవకపోతే, మరి వెళ్ళను.

177

తనబంధువు ఆసుపత్రిలో ఆపరేషను చేయించుగోడంగురించి కబురంపగా, ఒకాయన ఆసుపత్రికివెళ్ళి దిక్కుమాలిన అనవసరపు గొడవలతో ఆ బంధువుని సకలబాధా పెట్టగా, వీణ్ణి ఎరక్కపోయి రమ్మంటినిగదా అని అతడు లోలోపల కుసిళ్ళుతూండగా,

ఆయన - పాపం! నువ్వు ఒంటరిగా ఉంటూండడంవల్ల తోస్తూండదు గావును!

బంధువు - తోచకేం? నన్ను చూడడానికి నీ బోటిగాడు నాకు ప్రతీరోజూ ఎక్కడ లభిస్తాడూ?

178

ముత్తయ్య తను తలంటుగోడానికి ఒక వడ్డీమంగలికి కబురంపగా, వాడువచ్చి, ఆయన్ని పరకాయించి, తన రుమాలు తీసి తలకి వాసిన చుట్టినట్టు చుట్టుకోగా, ము - ఏం రా?

వడ్డీ - అయ్య!

ము - నువ్వు వడ్డీ మంగలివేనా?

వ - చిత్తం.

ము - (హేళనగా) అయితేమరి తలకాయకి రుమాలు అల్లాచుట్టుగున్నా వెందుకూ, బూజు దిలిపేవాడులాగ?

వ - చిత్తం.

ము - చిత్తం ఏమిటి?

వ - కోపం చెయ్యకండి. తమరిపొట్ట మడతల్లోనూ తొనల్లోనూ బూజూ ఉండవచ్చునండి.

179

పల్లెటూరి అల్లుడు పట్నవాసపు అత్తారింటికి వెళ్ళిన నాడే నాజూకుతనం ప్రకటించాలని నున్నటి క్షౌరం చెయించుగుని స్నానం నిమిత్తం దొడ్లోకి వెడుతూండగా, కిందుగా ఉన్న ఆ దొడ్డి గుమ్మం పై కమ్మి మనిషి గిల్లార్చుకుపోయి ప్రాణం కళ్ళంటేటట్టు ఫెడీమని తగలగా,

అ - (తలపట్టుగుని, కూచోపడి) అబ్బ!

అనగా, చదువునేర్చిన అతడిపెళ్ళాం అక్కడికి పరిగెట్టి.

పె - ఏదీ, చూడనీండి, చెయ్యితియ్యండి నెత్తిమీంచీ!

అన్న మీదట, అతడు చెయ్యి తియ్యగా,

పె - నెత్తురులేందే!

అ - లేకపోతే?

పె - ఇది అలంకారాలలో ఒకటీ!

అ - ఛస్తూంటే అలంకారమా?

పె - అవునండీ, విశేషోక్తి,

అ - చిఛీ, అవతలకి పో.

పె - నిజమేనండి, చూడండి కావలిస్తే, విశేషోక్తి అంటే కారణం ఉంటుంది. కార్యం ఉండదు.

180

సౌభాగ్యం - ఎమోయ్! వెంకట్రావ్! ఏమిటి విశేషాలు?

వెం - ఎక్కడ?

సౌ - ఎక్కడేమిటి, ప్రతీచోటానూ!

వెం - ప్రతీచోటానా ? ఏముందీ? ఉన్నవాళ్లు తింటున్నారు. లేని వాళ్ళు పడుకుంటున్నారు.

సౌ - అబ్బ ఆమాట సరేనోయ్! కొందరుఉండీ లేనివాళ్ళున్నారు, వాళ్ళ మాటేమిటని!

వెం - ఒస్. అదీ అడగాలా? ఉండీలేనివాళ్ళు తినీతినకుండా ఉంటున్నారన్న మాటేగా!

181

రాత్రి తొమ్మిదిగంటలకి వచ్చే 'మేలు' బండి ఎక్కే ఉద్దేశంతో, ఎనిమిది గంటలప్పుడు, ఒక రైలు స్టేషనుకి దగ్గిరిగా ఉన్న ఒక అన్నవిక్రయాలయంలో బుచ్చన్న ఎంగిలి పడుతూండగా, అతని స్నేహితుడు రామోజీ లోపలికివెళ్ళి, బుచ్చన్నని చూసి,

రా - ఎవరదీ? బుచ్చన్నలా ఉందే!

బు - మరే. రా - మేలుకా?

బు - మొదట్లో అల్లానే అనుకున్నాను.

రా - ఇప్పుడు?

బు - ఇప్పుడా! తెల్లారకట్ట రైలే రాసింది.

రా - ఏం?

బు - ఈ కూరముక్కలు ఆలోపుగా నములుడు పడేటట్టు తోచదు.

182

పండిట్ - తుమున్నరకం ఎప్పుడూ ప్రయోగించడం? రామన్న!

శా - రొంపగా ఉన్నప్పుడండి. నాకిప్పుడు రాదు. .

పం - హారి! చేదాద్యర్తకం ఎప్పుడూ? భీమన్న!

భీ - నుయ్యి ఉన్నప్పుడండి.

పం - ఓరి మీ వ్యాకరణాలు అంటించిరి గదర్రా, మీ వ్యాకరణాలు అంటించా!

ర - పడిశం పట్టినప్పుడు అంటించడానికి వీలుగా ఉండేది తుమున్నరకమేనండి. వాడిది వీలుకాదు. నేను రైటేనండి.

183

ఒక హరిదాసు అద్దంఎదట కూచుని తన స్నేహితులతో మాటా పలుకూ ఆడుతూ తలదువ్వుకుంటూ ఉండగా ఆయనకంటె ముసిలివాడై పింఛన్ సర్వీసు పాతిగేళ్ళు దాటిపోయిన ఒక గొప్పవాడు తలపాగాతోసహా, వచ్చి,

గొ - ఏమండోయ్! హరిదాసుగారు! అద్దంఎదట కూచుని మెరుగు పెడుతున్నట్టున్నారు.

హ - (గొప్పవాడి మీసాలకేసి దీక్షగాచూస్తూ) మరే, మరే, రంగేసుగోవడం ఇప్పుడప్పుడే అయింది.

184

పెద్దజీతం, వల్లమాలిన టెక్కూ చచ్చినంత నిరసనభావం. అఖండమైన పిరికితనం, మాటతిరగెయ్యడంలో నేర్పూ గల ఒక నగర వి. దా, ర. (విమానదాడి రక్షణ) శాఖాధికారి జీతం బత్తెంలేని తనకింది పరివారాన్ని రక్షణ కృత్యాల్లో తరిఫీయతు చెయ్యవలిసొచ్చి, వాళ్ళు దెబ్బతగిలినవాడికి ప్రథమచికిత్స ఎల్లా చేస్తారో చూడడం నిమిత్తం తనకే దెబ్బతగిలినట్టు తను నటిస్తానని వాళ్ళతోచెప్పి, క్రిందికి పడిపోతూ,

అధి - అయ్యో! బాధబాధ! బతకను, బతకను, రక్షించండి అయ్యో!

అనగా, వాళ్ళు. నవ్వు మొఖాలతో గబగబా ఆయన్ని వాహనం ఎక్కించి. చికిత్స అభినయించగా, ఆయన లేచి,

అధి - భేష్. మాబాగాచేశారు. కాని, మీ మొఖాలు అంత కలకలలాడుతూ పెట్టడం బాగుండలేదు.

వాళ్ళు - మాకు విచారం ఎల్లా వస్తుందండీ?

అధి - చిక్కు సమయంగనక రావద్దూ?

వాళ్ళు - సమయం చిక్కుదైనా విషయం మీదైనప్పుడు మిమ్మల్ని ఎంత చివరదాకా మోసినా మాకు సంతోషమేనండి.

185

దాదా - హెమండీ, సోమన్నగారూ! మన హేమన్నా వొచ్చాడు సూశారా. సెల్లెంలాగా సిక్కీ! సో - చిక్కడేం ఖర్మం?

దా - కానితిర్గుడూ అండీ!

సో - అంత పాడయాడా? విన్లేనే?

దా - ఉద్దేషం సాలామంచిదీ అండీ. తిర్గడంమాట నే అనేది.

సో - ఎక్కడ? అందుకోసం చిక్కడం ఎందుకు?

దా - ఎంద్కూ అంటా రేమండీ? కొవ్వూర్ తాలూకా తాలూకా సీదాగా అహోరాత్రం కాంగ్రెస్ ప్రచారంసేస్తే హేమ్టీ అయితుందండీ, సిక్డంకాకా! యెర్రీలాగా సెప్తారే!

186

నాగేంద్రుడు - ఏంరా, పుల్లయ్యా! మీ అమ్మ మీద కేకలేసి విసుక్కుంటున్నావేం?

పు - లేకపోతే, ఏమిట్రామరీ! చంపుగు తింటూంటేనూ,

నా - ఏంజేసింది?

పు - ఏంజేసిందా! బేడకాసెక్కడో పారేసి, అది కనపడితే, పెద్దతిరపతి వెడతానని మొక్కుగుంది.

నా - అయితే నువ్వేమన్నావు?

పు - పోనీ, అన్నదానవు ఎల్లానూ అన్నావు. ఏ చిన్న తిరపతో వెళ్ళవమ్మా అన్నాను.

నా - అంటే. ఏమందీ?

పు - మరీ గందరగోళం చేసింది. మనస్సులో సంకల్పం ఎవళ్ళకి కలిగితేం గనక, తిరిగిపోనియ్యడం పాపంగదా అంటూ రొండుచోట్లకీ మొక్కుగుంది.

187

ఒక వి. దా. ర. భటుడు ఒక గృహం ఇవతలికి దీపం వెలుగు పడుతోందని గృహస్థుని బెదిరించి సొమ్ములాగడం అలవాటు చేసుగుని, నాలుగోసారి! మళ్ళీవెళ్ళి కేకవెయ్యగా ఇంట్లోంచి ఎవ్వరూ పలక్కపోగా, వెళ్ళిపోతూ, ఆవరణస్థలం చివర యజమాని చుట్టకాల్చుగుంటూ కూచోడం చూసి,

భటుడు - ఏయ్!

గృ- అయ్య!

భ - అయ్యట. అయ్య యేమిటికొయ్య! దీపంపైకి కనిపిస్తోంది రిపోర్టు చేసేస్తాను.

గృ - పోనీచెయ్యండి. మూడుసార్లు ఇదివరకు ఈయన చూశారండి, చూసి సరిగానే ఉందన్నారు, అని చెబుతాను.

భ - చెబితే ఏమయినట్టూ! అక్కడ బాంబుపడిపోతుంది.

గృ - అందుకనే దూరంగా వచ్చి ఇక్కడ కూచున్నాను, ఆరుచుట్టలు తెచ్చుగుని.

భ-పోనీ, ఓచుట్ట యిల్లాపారెయ్,

గృ - అయిదు ఇదివరకే కాల్చేశాను.

188

బుజ్జణ్ణ - (గోదావరిస్టేషను ప్లాటుఫారంమీద గుర్లింగాన్ని కలుసుగుని) ఏమోయ్! గుర్లింగం ఎక్కడికి?

గు- పట్నం.

బు - అప్పుడెప్పుడో ఓమాటు వెళ్ళినట్టున్నావు!

గు- అవును, వెనక. చాలా రోజులైంది. కాని, అప్పుడు పట్నంలో సహమే చూశాను.

బు - అదేం? అంతా చూడకపోయావా? గు - అంతా ఎల్లాచూడ్డం? (గాత్రం తగ్గించి) అప్పుడు నేను వెడతా, సగం టిక్కట్టుమీదే. అందుకని!

189

వంటపూటి వ్యాపారంలో జాయింటుదారైన సర్వారావుతో,

విశ్వమ్మ - అబ్బాయి! సర్వారావు! ఆ ఆమదాలపురంవాడున్నాడూ, అదుగో, వాడివల్ల మనకి ఈనష్టం. వాణ్ణిపొమ్మందూ?

స - ఉండనీండి. ఎంతమందిలేరూ?

వి - ఓయ్, నీ వేళాకోళాలు బంగారంగాను, వాడు కొంప తినేస్తున్నాడోయ్!

స - ఏం?

వి - ఏం యేమిటి! వాడికి ఏదీ సయించకపోడం లేదు. ఎప్పుడు రొంపేనా పట్టదు పీనుక్కి. కాశీ తగులడలేదుట, అక్కడ పోనీ ఏమన్నా వొదిలి పెట్టాడమో అనుకోడానికి, మాటల్లోనిధీ! కడుపులో అన్నం తీసుకుతింటాడు.

స - ఓహో! అల్లానా! నే విన్లేదే! అన్నమా ఆధరువా వాడెక్కువ లగాయించేది?

వి - అన్నీనూ. అన్నంతెస్తే, 'అన్నం పరబ్రహ్మస్వరూపం' అని వదలడు పప్పుతెస్తే పప్పుకీ బ్రాహ్మడికీ అవినాభావ సంబంధం అంటాడు. కూరతెస్తే, ఆధరువు ఎక్కువగాలేందే తనకి దిగదంటాడు.

స - ఆరి వీణ్ణితగలెయ్యా! పచ్చడి చూపిస్తే.....

వి - పచ్చడి అంటే తనకి నాలికి లేచివస్తుందంటూ లొట్ట లెస్తాడు. చల్చతెస్తే, 'వంటికి మంచిదిష్మండిచారు' అనడమూనూ ఊహూ దోరచడమూనూ. పులుసు తెస్తే, పులుసు ముక్కలంటే తనకి ప్రాణమనీనీ, వాటికోసం తనువేరే జన్మ ఎత్తుతాననీ అంటాడు. సరి యిక మజ్జిగతెస్తే, ఎంతోసినా సరే, 'ఏది, ఏది, ఒక్క పురుషిడు చేతులో ఉంచండి. మొదణ్ణించీ ఈ గొడ్డు మజ్జిగతో బతికింది' అంటూండడం, మజ్జిగవంటి పదార్థము ముజ్జగములలోన లేదు - అని పాటకూడా మొదలెడతాడు. ఇదమీడట వీలైతే నిన్నూ, లేకపోతే నన్నూ కొరుక్కుతింటాడు.

స - ఇదోటా! అల్లాయితే వాణ్ణి తక్షణం సాగనంపుతా!

190

అభూతకల్పనదారులైన సీనయ్య, మీనయ్య, కోనయ్యలు వేడెక్కిపోయిన ప్రసంగం సాగించుకుంటూ,

సీ - నేను చాలా చలిదేశాలు వెళ్ళాను. అక్కడి చలికి కన్నీళ్ళుకూడా గడ్డకట్టి పోతూండడం వల్ల, ఎంత బాధగా ఉన్నా ఏడుద్దాం అంటే వీల్లేక ఊరుకునేవాణ్ణి.

మీ - సరి సరి, నేను అంతకంటే చలిదేశాలు చూశాను. అక్కడ దీపం గడ్డకట్టిపోయింది, ఓ కర్రపుచ్చుగుని దీపాన్ని చావగొడితే అప్పుడది ఏడుస్తూ మళ్ళీ వెలుతురు ఇవ్వడం మొదలెట్టింది.

కో - ఓస్ ఇంతేనా! నేనూ నా స్నేహితుడొకడూ కలిసి మరీ చలిదేశం వెళ్ళాం . అక్కడ నేను ఆ స్నేహితుడితో కొన్ని మాటలు అన్నాను. ఆ మాటలు వాడి చెవిమీద వెళ్ళిపడే మధ్యదార్లోనే ఠక్ ఠక్ మని గడ్డకట్టిపోయాయి. అవన్నీ వాడు పోగుచేసి వెచ్చచేసుగుని తంటాలు పడ్డమీదట వాడికవి బోధపడడం జరిగింది.

★ ★ ★