కార్తీక మహా పురాణము/పన్నెండవ రోజు

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

అత్రి మహాముని ఇలా చెప్పసాగాడు

అగస్త్యా! కార్తీక శుక్ల ద్వాదశిని హరిబోధిని అంటారు. ఆ పుణ్యతిథి నాడు చేసే వ్రతాచరణ సర్వ తీర్థాల్లో స్నానం చేసినంత, సర్వ యజ్ఞాలూ ఆచరించినంత పుణ్యం ప్రాప్తిస్తుంది. సూర్యచంద్ర గ్రహణ ప్రత్యేక దినాల కంటే, ఏకాదశి కంటే వందరెట్లు మహిమాన్వితమైంది అయిన ఈ ద్వాదశినాడు చేసే పాపం గానీ పుణ్యం గానీ కోటిరెట్లుగా పరిణమిస్తుంది. అంటే - ద్వాదశినాడు ఒకరికి అన్నదానం చేసినా కోటిమందికి అన్నదానం చేసినట్లు, ఒక్క మెతుకు దొంగిలించినా కోటి మెతుకులు దొంగిలించినట్లు అవుతుంది.

ఒకవేళ ద్వాదశినాడు ద్వాదశి ఘడియలు తక్కువగా ఉంటే, ఆ స్వల్ప సమయాన్ని పారణకు ఉపయోగించాలే తప్ప ద్వాదశి దాటిన తర్వాత పారణం పనికిరాదు. పుణ్యాన్ని కోరేవారు ఎవరైనా సరే ఏ నియమాన్ని ఉల్లంఘించినా, ద్వాదశి పారణను మాత్రం వదలకూడదు. ఏకాదశి తిథినాడు ఉపవాసం ఉండి, మర్నాడు ద్వాదశి తిథి దాటిపోకుండా పారణ చేయాలి. తద్వారా కలిగే శ్రేయస్సు అనంతం. ఇందుకు అంబరీషుని కథే ఉదాహరణ.


అంబరీషోపాఖ్యానం

ద్వాదశి వ్రతాచరణ తత్పరుడు, పరమ భాగవతోత్తముడు అయిన అంబరీషుడనే మహారాజు ఓ కార్తీక శుద్ధ ఏకాదశినాడు ఉపవసించి మర్నాడు ద్వాదశి ఘడియలు స్వల్పంగా ఉన్న కారణంగా, తిథి దాటకుండానే పారణ చేయాలనుకున్నాడు. అదే సమయానికి దూర్వాస మహర్షి వచ్చి ఆనాటి ఆతిథ్యంలో తనక్కూడా భోజనం పెట్టమని కోరాడు. అంబరీషుడు ఆయన్ను ద్వాదశి పారణకు ఆహ్వానించాడు. తక్షణమే దూర్వాసుడు స్నాన, అనుష్టానార్ధం నదికి వెళ్ళాడు. అలా వెళ్ళిన ఋషి ఎంతసేపటికీ మళ్ళీ రాకపోవడంతో అంబరీషుడు ఆత్రుత చెందాడు. ఆ రోజున ద్వాదశి ఘడియలు స్వల్పంగా ఉన్నాయి. కాలం అతిక్రమించకుండా పారణ చేయాల్సి ఉండి. అతిథి వచ్చేవరకూ ఆగడం గృహస్థ ధర్మం. దానిని వదలలేడు. ద్వాదశి దాటకుండా పారణ చేయడం వ్రత ధర్మం.దీనిని వదులుకోలేడు.

హరిభక్తి పరిత్యాగో ద్వాదశీ త్యాగాతో భవేత్

యతో౭నుపోషితో భూయాత్ కృత్వాసమ్య గుపోషణం

పూర్వం ద్వాదశ సంఖ్యాకె పురుషో హరివాసరే

పాపముల్లంఘనేపాపాత్ నైవయుజ్యం మనీషిణా


ద్వాదశీ వ్రతాన్ని ఉల్లంఘించిన వారు విష్ణుభక్తిని విస్మరించిన వారౌతారు. ఏకాదశి నాడు ఉపవాసం చేయకపోతే ఎంత పాపం కలుగుతుందో, ద్వాదశినాడు పారణ చేయకపోతే అంతకు రెట్టింపు పాపం కలుగుతుంది. అంటే కాదు, ఒక్క ద్వాదశి పారణ అతిక్రమణవల్ల, ఆనాటి వ్రతఫలంతో బాటు అంతకు పూర్వం చేసిన పన్నెండు ద్వాదశి పారణల మహా పుణ్యం కూడా హరించుకుపోతుంది. జన్మజన్మాంతర పుణ్యబలం క్షీణిస్తుంది. అన్నిటికన్నా ముఖ్యంగా ద్వాదశ్యతిక్రమణవల్ల విష్ణు విరోధ భీతి ఏర్పడుతుంది. అందువల్లే ప్రాణావసానం అయినా సరే, ద్వాదశి పారణ చేయడమే కర్తవ్యం. తద్వారా సంక్రమించే బ్రాహ్మణ శాపంవల్ల కల్పాంత దుఖమే కలుగుతుంది. దూర్వాసుని ఆగమనం తర్వాత కన్నా, ద్వాదశి ఘడియలు వెళ్ళకముందే పారణ చేసి హరిభక్తిని నిలుపుకున్నట్లయితే కలగబోయే కష్టాలను ఆ కమలనాభుడే కడతేరుస్తాడు. ఇలా తన మనసులో ఒక నిర్ణయానికి వచ్చి కూడా ధర్మవర్తనుడైన ఆ అంబరీషుడు ద్వాదశి పారణార్ధం తనను పరివేష్టించి ఉన్న వేదవిదులకు తన ధర్మసందేహాన్ని తెలియజేశాడు.


అంబరీషుని మనోవ్యథ

అంబరీషుని సమస్యను విన్న వేదస్వరూపులైన ఆ విప్రులు క్షణాల్లో శృతి, స్మృతి, శాస్త్ర, పూరాణాదులన్నీ మననం చేసుకుని మహారాజా! సర్వేశ్వరుడైన ఆ భగవంతుడు సమస్త జీవుయందు జఠరాగ్ని రూపంలో ప్రక్షిప్తమై ఉంటున్నాడు. ఆ జఠరాగ్ని ప్రాణవాయువు చేత ప్రజ్వలింపచేయడం వల్లే జీవులకు ఆకలి కలుగుతోంది. దాన్నే క్షుత్పిపాసా బాధ కనుక యుక్తాహారం చేత ఆ అగ్నిని పూజించి శాంతింపచేయడమే జీవలక్షణం. జీవులు తీసుకునే భక్ష్య, భోజ్య, చోష్య, లేహ్య రూపమైన అన్నాదులు వారిలోని అగ్ని భిజిస్తుంది. జీవులు అందరిలోనూ ఉన్న జఠరాగ్నిజగన్నాథ స్వరూపం.

తన ఇంటికి వచ్చిన వ్యక్తి శూద్రుడైనా, చండాలుడైనా ఆ అతిథిని వదిలి గృహస్తు భోజనం చేయకూడదు. ఒకవేళ బ్రాహ్మణుడే అతిథిగా వస్తే అతన్ని వదిలి భోజనం చేస్తే అంతకంటే నీచమైన పని ఇంకొకటి లేదు.

రాజా! ఇలాంటి అవమానం చేయడం వలన ఆయుస్షు, ఐశ్వర్యం, కీర్తి, ధర్మం నశిస్తాయి. మనస్సంకల్పాలు తిరోగమిస్తాయి. బ్రాహ్మణుడు సర్వదేవతా స్వరూపుడు కనుక బ్రాహ్మణుని అవమానించడం సర్వ దేవతలనూ అవమానించడంతో సమానమౌతుంది. జాతిమాత్రంచేతనే బ్రాహ్మణుడు దేవతాతుల్యుడై ఉండగా కేవలం జన్మవల్లనేగాక జ్ఞానం వల్ల, తపోమహిమవల్ల, శుద్ధరుద్ర స్వరూపుడిగా కీర్తింపబడే దూర్వాసుని వంటి రుషిని భోజనానికి పిలిచి, ఆయన కంటే ముందే పారణ చేయడం ధర్మమని చెప్పడం సాధ్యంకాదు. కోపిష్టి అయిన ఆ ఋషి శపిస్తాడు అనే భయాన్ని పక్కకు నెట్టి చూసినా మరో శ్లోకాన్ని అనుసరించి బ్రాహ్మణ అతిథి కంటే ముందుగా భుజించడం మంచిది కాదు. ధరణీనాథా! ద్వాదశీ పారణ పరిత్యాగం వల్ల తత్పూర్వదినమైన ఏకాదశి ఉపవాసానికి భంగం కలుగుతుంది. ఆ ఏకాదశి వ్రత భంగానికి ప్రాయశ్చిత్తం అనేది లేదు. విప్ర పరాభవానికి విరుగుడు లేడు. రెండూ సమతూకంలోనే ఉన్నాయి.


విప్రుల ధర్మబోధ

అంబరీషా! పూర్వజన్మ కర్మానుసారం నీకు ఈ ధర్మసంకటం ప్రాప్తించింది. దూర్వాసుడు వచ్చేవరకూ ఆగాలో, అక్కర్లేదో ద్వాదశి ఘడియలు దాటకుండా పారణ చేయాలో నిశ్చయించి చెప్పడానికి మేము అశక్తులమై పోతున్నాం. కనుక ఆత్మబుద్ధి స్సుఖంచైవ అనే సూత్రాన్ని అనుసరించి భారం భగవంతునిమీద పెట్టి నీ బుద్ధికి తోచినట్లు నడచుకో అన్నారు బ్రాహ్మణులు. ఆ మాటలు వినగానే అంబరీషుడు ఓ బ్రాహ్మణులారా! బ్రాహ్మణ శాపంకన్నా విష్ణుభక్తిని విడిచిపెట్టడమే కష్టంగా భావిస్తున్నాను అనగానే, పూజాస్థానంలో ఉన్న యంత్రాన్ని ఆవహించి జగదేకశరణ్యము, జగదేక భీకరము అయిన సుదర్శన చక్రం రివ్వున దూర్వాసుని వైపు కదిలింది. అచేతనాలైన పూజిత సంజ్ఞలోంచి జడమైన విష్ణుచక్రం దివ్యకాంతి ప్రభాశోభితమై తన వంకగా కదిలిరావడాన్ని చూడగానే దూర్వాసుదు తుళ్ళిపడ్డాడు. ఆ చక్రానికి చిక్కకూడదని భూచక్రమంతా క్షణాలమీద పరిభ్రమించాడు. అయినా సుదర్శనం ఆటగాడిని తరుముతూనే ఉంది. భీతావహుడై దూర్వాసుడు వశిష్టాది బ్రహ్మర్షుల్ని ఇంద్రాది అష్టదిక్పాలకులని, చివరికి మహాశివుని, బ్రహ్మదేవుని కూడా శరణు వేడాడు. కానీ, అతని వెనుకే విహ్వల మహాగ్ని జ్వాలాయుతంగా వస్తున్నా విష్ణుచక్రాన్ని చూసి ఎవరికి వారే తప్పుకున్నారే తప్ప విడిచి, తెగించి ఎవరూ అభయాన్ని ఇవ్వలేదు.

ఇలా ప్రాణభీతుడైన దూర్వాసుడు సంభవిత లోకాలన్నీ సంచరించి చివరగా చక్రపాణి అయిన విష్ణు లోకం చేరాడు. హే బ్రాహ్మణప్రియా! మాధవా! మధుసూదనా! కోటి సూర్యులతో సమానమైన కాంతిని, వేడిని కలిగిన నీ సుదర్శనచక్రం నన్ను చంపడానికి వస్తోంది. బ్రాహ్మణ పాదముద్రా సుశోభిడివైన నువ్వే నన్ను ఈ ఆపద నుండి కాపాడాలి అని ఘోషిస్తూ సర్వేశ్వరుడైన ఆ విష్ణువునే శరణు కోరాడు.

విష్ణువు విలాసంగా నవ్వి దూర్వాసా! ప్రపంచానికి నేను దైవాన్ని అయినా నాకు మాత్రం బ్రాహ్మణులే దైవస్వరూపాలు. కానీ, నువ్వు సద్బ్రాహ్మణుడవు, రుద్రాంశ సంభూతుడవు అయ్యుండీ అంబరీషుని అకారణంగా శపించావు. పారణకు వస్తానని చెప్పి, స్నానార్థమై వెళ్ళిన నువ్వు సకాలానికి చేరుకోలేదు. ఆలస్యంగా రాదలచుకున్నవాడివి నీకోసం ఎదురుచూడకుండా ద్వాదశి ఘడియలు గతించిపోకుండా పారణ చేయడానికి అనుమతి అయినా ఇవ్వలేదు. ద్వాదశి దాటిపోడానికి కొన్ని క్షణాలు మాత్రమే వ్యవధి ఉన్న సమయంలో వ్రతభంగానికి భయపడి మంచినీళ్ళను తీసుకున్నాడే గానీ ఆకలితోనో నిన్ను అవమానించాలనో కాదు. అనాహారేపి యచ్ఛస్త్రం శుద్ధ్యర్ధం వర్ణినాం సదా నిషిద్ధాహారులకు కూడా జలపానం దోషం కాదని శాస్త్రాలు చెప్తుండగా అదేమంత తప్పని నువ్వు సపించాల్సి వచ్చింది? ఆత్రేయా! నువ్వెంత కటువుగా మాట్లాడినా కూడా అతగాడు నిన్ను వినయపూర్వకంగా శాంతించమని వేడుకున్నాడేగానీ, కోపగించుకోలేదు గదా! అయినా సరే, ముముక్షువైన అతన్ని నువ్వు పది దుర్భర జన్మలను పొందాలని శపించావు. ణా భక్తులను రక్షించుకోవడం కోసం నీ శాపాన్ని ఈ నిమిషంలో తిప్పివేయగలను. కానీ, బ్రాహ్మణవాక్యం వట్టిపోయిందనే లోకాపవాదం నీకు కలక్కుండా ఉండటం కోసం ఆ భక్తుని హృదయంలో చేరి నీ శాపాన్ని సవినయంగా స్వీకరించినవాడిని, నీ శాపాన్ని అంగీకరిస్తూ గ్రుహ్ణామి అంది నేనే గానీ ఆ అంబరీషుడు కాదు. అతనకి నీవిచ్చిన శాపం సంగతే తెలీదు. ఋషిప్రభూ! నీ శాపం ప్రకారంగానే ఈ కల్పాంతాన దుష్టుడైన శంఖాసురుని సంహరించేందుకు శిష్యుడైన మనువును ఉద్ధరించేందుకు మహా మత్స్యంగా అవతరిస్తాను.

దేవదానవులు క్షీర సాగరాన్ని మధించే వేళ మందరగిరిని మూపున ధరించడానికి కుదురుగా ఉండేందుకు గాను కూర్మావతారుని అవుతాను. భూమిని ఉద్ధరించేందుకు, హిరణ్యాక్షుణి సంహరించేందుకు వరాహాన్నవుతాను. హిరణ్యకశిపుని సంహరించడం కోసం నరసింహావతారం ఎత్తుతాను. సర్వదేవతా సంరక్షణ కోసం ధర్మబాలుడైనా కూడా దానవుడైన బలిని శిక్షించేందుకు వామనుడినౌతాను. త్రేతాయుగంలో జమదగ్నికి కుమారునిగా పుట్టి సాయుధ బ్రాహ్మణుడినై దుర్మార్గులైన రాజులను అంతమొందిస్తాను. రావణ సంహారంకోసం రామునిగా అవతరిస్తాను. ద్వాపరయుగంలో శ్రీకృష్ణునిగా జన్మిస్తాను. కలియుగ ఆరంభంలో పాపమోహాలను తొలగించుకోమని హితవు చెప్పడం కోసం బుద్ధుడినౌతాను. కలియుగ అంతాన శత్రుఘాతుకుడైన బ్రాహ్మణునిగా ప్రభవిస్తాను. దూర్వాసా! నా ఈ దశావతారాలూ ఆయా అవతారాల్లోని లీలలను చదివినా, విన్నా వారి పాపాలు పటాపంచలౌతాయి.

దేశ కాల వయో పరిస్థితులను బట్టి వర్ణాశ్రమ ధర్మాలను అనుసరించి ధర్మం అనేక విధాలుగా వేదంచే ప్రవచింపబడి ఉండి. అటువంటి వివిధ ధర్మాల్లోనూ ఏకాదశినాడు ఉపవాసం, ద్వాదశి దాటకుండా పారణం అనేవి విశ్వజనీనంగా భాసిస్తున్నాయి. అటువంటి వైదిక ధర్మాచరణ చేసినందుగ్గానూ నువ్వు అంబరీషుని శపించింది చాలక తిరిగి మరో ఘోర శాపం ఇవ్వబోయావు. బ్రాహ్మణుడివైన నీ వాక్యాన్ని సత్యం చేయడము, భక్తుడైన ఆ రాజును కాపాడుకోవడము రెండూ ణా భాధ్యతలే. కనుక పునః శపించబోయేముందు నిన్ను నివారించదానికే నా చక్రాన్ని నియమించాను.