కార్తీక మహా పురాణము/పదకొండవ రోజు

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

అత్రి ఉవాచ

సాధారణమైన దొమ్మిగా, కొట్లాటగా ప్రారంభమై, ఆ సమరం మహా యుద్ధంగా పరిణమించింది. అస్త్రశస్త్రాలతో, పదునైన బాణాలతో, ఖడ్గాలతో, కర్రలతో, ముసల, శూల, భల్లాతక, తోమర, కుంభ, కుఠారాద్యాయుదాలతో ఘోరంగా యుద్ధం చేశారు. ఆ సంకుల సమరంలో కాంభోజరాజు మూడు వందల బాణాలను ప్రయోగించి, పురంజయుని గొడుగును, జండాలను, రథాన్ని కూలగొట్టాడు. మరో అయిదు బాణాలతో గుర్రాలను కూల్చివేశాడు. ఇంకొన్ని బాణాలతో పురంజయుని గాయపరిచాడు. అందుకు కోపించిన పురంజయుడుబ్రహ్మాస్త్ర మంత్రంతో అభిమంత్రించిన పదునైన పది బాణాలను, కాంభోజ రాజుపై వేశాడు. ఆ బాణాలు కాంభోజుని కవచాన్ని చీల్చి గుండెలో దిగాబడ్డాయి. రక్తం ధారాపాతంగా కారుతుండగా తన వక్షంలో గుచ్చుకున్న బాణాలను పెరికి తీసి, ఆ కాంభోజ మహారాజు ఓ పురంజయా! నేను పరుల సొమ్ముకు ఆశపడేవాడిని కాను. నువ్వు పంపిన బాణాల్ని నీకు తిప్పి పంపుతున్నాను తీసుకో అంటూ వాటిని తన వింత సంధించి, పురంజయుని మీద ప్రయోగించాడు.

ఆ బాణాలు పురంజయుని సారధిని చంపేశాయి. ధనుస్సును ముక్కలు చేశాయి. పురంజయుని మరింత గాయపరిచాయి. అంతటితో మండిపడిన అయోధ్యాధిపతి ఇరవై రెక్కల బాణాలను వింత సంధించి వాటిని ఆకర్ణాంతం లాగి కాంభోజునిపై వదిలాడు. ఆ ఇరవై రెక్కల బాణాలూ ఏకకాలంలో అతగాడి గుండెల్లోంచి వీపు గుండా దూసుకుపోవడంతో కాంభోజరాజు మూర్చిల్లాడు. దాంతో యుద్ధం మరింత భీకరంగా మారింది. తెగిన తొండాలతో ఏనుగులు, తలలు కోల్పోయిన గుర్రాలు, విరిగిపడిన రథాలు, స్వేచ్చగా దొర్లుతున్న రథచక్రాలు, తలలు, మొండాలు వేరైన విగతజీవులు, గిలగిలా తన్నుకుంటున్న కోన ఊపిరితో ఉన్న జీవాలతో కదనరంగమంతా పరమ భయానకంగా, కంటగింపుగా తయారైంది. మృతవీరుల రక్తం వాగులు కత్తి ప్రవహించసాగింది. అటువంటి ఆ భీషణ, బీభత్స సంగ్రామంలో అధర్మి అయిన పురంజయుని బలం క్రమక్రమంగా క్షీణించిపోయింది. కురుజాది వీరుల విజ్రుంభణను తట్టుకోలేక ఆసాయంకాలానికి సమరభూమిని వదిలి పట్టణంలోనికి పారిపోయాడు. అంతఃపురం చేరి ఆనాటి శత్రువుల విజయానికి దుఃఖిస్తున్న పురంజయుని చూసి సుశీలుడు అనే పురోహితుడు మహారాజా! శత్రువైన ఆ వీరసేనుని గెలవాలనే కోరిక గనుక బలవత్తరంగా ఉంటే ఈ క్షణమే భక్తిప్రపత్తులతో విష్ణువును సేవించడం ఒక్కటే మార్గం. ఇది కార్తీక పౌర్ణమి. కృత్తికా నక్షత్రయుతుడై చంద్రుడు షోడశ కళాశోభితంగా ఉండే ఈవేళ ఈ ఋతువులో లభించే పూలను సేకరించి హరి ముందు మోకరిల్లి పూజించు. విష్ణు సన్నిధిలో దీపాలను వెలిగించు. గోవిందా, నారాయణా ఇత్యాది నామాలతో, మేళతాళాలతో ఎలుగెత్తి పాదు. ఆ పాటలతో పరవశుడైన హరి ముందు నర్తించు. అలా చేసినట్లయితే ఆ విష్ణుమూర్తి అనుగ్రహం వల్ల నీకు మహావీరుడైన కుమారుడు కలుగుతాడు. కార్తీకమాసంలో తనను ఆరాధించే భక్తుల రక్షణార్ధం వేయి అంచులతో శత్రు భయంకరమైన తన సుదర్శన చక్రాన్ని సహాయంగా పంపుతాడు. సంపూర్ణ కార్తీక మహిమను చెప్పడం ఎవరివల్లా అయ్యేపని కాదు. భూపతీ! ఈనాటి నీ ఓటమికి కారణం సైన్యబలం లేకపోవడం గానీ, నీకు శరీర బలం లేకపోవడం గానీ కానేకాదు. మితిమీరిన అధర్మవర్తనం వల్ల నీ ధర్మఫలం, తద్వారా దైవబలం తగ్గిపోవడమే న్ ఈ పరాజయానికి కారణం. కనుక పురంజయా! శోకాన్ని వదిలి భక్తితో శ్రీహరిని సేవించు. కలత మాని కార్తీక వ్రతాన్ని ఆచరించు. కార్తీక వ్రతంవల్ల ఆయురారోగ్య ఐశ్వర్యాలు, సుఖసంపత్ సౌభాగ్య సంతానాలు చేకూరుతాయి. నా మాటలను విశ్వసించు.

రెండోరోజు యుద్ధం - పురంజయుని విజయం

అత్రి మహర్షి ఇంకా ఇలా చెప్పసాగాడు..

అగస్త్యా! ఆవిధంగా సుశీలుడు చేసిన బోధతో పురంజయుడు తక్షణమే విష్ణు ఆలయానికి వెళ్ళి వివిధ ఫల పుష్ప పల్లవ దళాదిగా విష్ణువును షోడశోపచారాలతో పూజించి ప్రదక్షిణ నమస్కారాలు అర్పించి మేళతాళాలతో ఆయన్ను కీర్తించి పారవశ్యంతో నర్తించాడు. అంతేకాదు, బంగారంతో విష్ణు ప్రతిమను చేయించి దానిక్కూడా పూజలు చేశాడు. దీపమాలికలు వెలిగించి అర్పించాడు. ఆ రాత్రంతా అలా విష్ణుసేవలో విలీనుడైన పురంజయుడు మరుసటి రోజు ఉదయమే శేషసైన్యాన్ని తీసుకుని యుద్ధరంగం చేరాడు. నగర సరిహద్దులను దాతుతూనే శత్రువులను సమరానికి ఆహ్వానిస్తూ భీషణమైన ధనుష్ఠంకారం చేశాడు. ఆ ఠంకారం చెవినపడిన కాంభోజ కురుజాది బలాలు పురంజయుని ఎదుర్కొన్నాయి. వజ్రాల వంటి కత్తులతోనూ, పిడుగులవంటి బాణాలతోనూ , మహా వేగంగా పరిగెడుతూ, ఆకాశమెత్తున ఎగరగల గుర్రాలతోనూ, ఐరావతాలను పోలిన ఏనుగులతోనూ అన్యోన్య జయకాంక్షా తత్పరులై ప్రాణాలకు తెగించి పోరాడే సైన్యంతోనూ క్రమంగా యుద్ధం దుర్నిరీక్ష్యమయింది.

గత రాత్రి పురంజయుడు చేసిన పూజలకు సంతుష్టుడైన శ్రీహరి దైవబలాన్ని తోడుచేయడంవలన నాటి యుద్ధంలో శత్రురాజుల శక్తులన్నీ ఉడిగిపోయాయి. కాంభోజుల గుర్రాలు, కురుజాదుల ఏనుగులు, వివిధరాజుల రథబలాను, వైరికూటం పదాతిబలాలు దైవకృపాపాత్రుడైన పురంజయుని ముందు చిత్తుగా ఓడిపోయాయి. పురంజయుడి పరాక్రమానికి గుండెలు అవిసిపోయిన పగవారందరూ ప్రాణభీతితో రణరంగాన్ని వదిలి తమతమ రాజ్యాలకు పరుగులు తీశారు. అంతటితో విష్ణువు అనుకూలుడైతే శత్రువు మిత్రుడిగా మారతాడు. విష్ణువు ప్రతికూలంగా ఉంటే, మిత్రుడే శత్రువు అవుతాడు. దేనికైనా దైవబలమే ప్రధానం. ఆ దైవబలమే ప్రధానం. దైవబలానికి ధర్మాచారణమే అత్యంత ముఖ్యం. అటువంటి ధర్మాచరణలో ప్రప్రథమమైన కార్తీక వ్రత ధర్మానుష్ఠానంతో ఎవరైతే శ్రీహరిని సేవిస్తారో, వారి సమస్త దుఃఖాలూ చిటికెలో చిమిదిపోతాయి.

అగస్త్యా! విష్ణుభక్తి సిద్ధించడమే కష్టతరం. అందునా కార్తీక వ్రతాచరణ పట్ల ఆసక్తి కలగడం, చేసే శక్తి ఉండటం కష్టతరం. కలియుగంలో ఎవరైతే కార్తీక వ్రతమూ శ్రీహరిసేవా వదలకుండా చేస్తారో వాలు శూద్రులైనా సరే, వైష్ణవోత్తములుగా పరిగణించబడతారు. వేదవిధులైన బ్రాహ్మణులైనప్పటికీ కూడా ఈ హరిసేవ, కార్తీక వ్రతాచారణలు లేనివాళ్ళు కర్మచండాలులే అని గుర్తించు. ఇక వేదవేత్తయై హరిభక్తుడై, కార్తీక వ్రతనిష్ఠులైన వారిలో సాక్షాత్తూ విష్ణువు నివసిస్తాడు. ఏ జాతివాళ్ళయినా సరే ఈ సంసార సాగరం నుండి బయటపడి ఉత్తమగతుల్ని పొందాలనే కోరికతో విష్ణువును అర్చించినట్లయితే తక్షణమే వాళ్ళు తరించుకుపోయినట్లుగా భావించు.

అగస్త్యా! స్వతంత్రుడు గానీ, పరతంత్రుడు గానీ హరి పూజాసక్తుడై ఉంటేనే ముక్తి.శ్రీహరి, భక్తులు పరస్పరం అనురాగబద్ధులై ఉంటారు. భక్తులకు ఇహపరాలు రెండిటినీ అనుగ్రహించి, రక్షించగలిగిన ఏకైక దైవం ఆ వాసుదేవుడే. విశ్వమంతటా నిండిఉన్న ఆ విష్ణువు యందు భక్తిప్రపత్తులు ఉన్నవారికి మాత్రమే కార్తీక వ్రతం చేసుకునే అవకాశం దొరుకుతుంది. కనుక, వేదసమ్మతము, సకలశాస్త్రసారం, గోప్యం, సర్వ వ్రతోత్తమం అయిన కార్తీక వ్రతాన్ని ఆచరించినవారికి, కనీసం కార్తీక మహత్యాన్ని భక్తిగా విన్నవారికి కూడా వాళ్ళు విగత పాపులై వైకుంఠం చేరుకుంటారు. మహత్వపూర్వకమైన ఈ ఇరవై రెండవ అధ్యాయాన్ని పఠించడంవల్ల పితృదేవతలు కల్పాంత తృప్తిని పొందుతారు.

పురంజయుని మోక్షం

హే అత్రి మునీంద్రా! విష్ణు కృపవల్ల విజయుడైన పురంజయుడు ఆ తర్వాత ఏం చేశాడో వివరించు అని కోరాడు అగస్త్యుడు.

బదులుగా అత్రి ఇలా చెప్పసాగాడు.

భగవత్కృప వల్ల యుద్ధభూమిలో విజయలక్ష్మి వరించిన పురంజయుడు అమరావతిలో ఇంద్రునిలా అత్యంత వైభవంగా ప్రకాశించాడు. గతంలోని దుష్టభావాలను విసర్జించి సత్యశౌచపాలనం, నిత్యధర్మాచరణం, దానశీలత, యజ్ఞ యాగాది నిర్వహణలు చేస్తూ ప్రతి సంవత్సరం ప్రయుక్త కార్తీక వ్రతాచరణతో విగత కల్మషుడై, విశుద్దుడై, అరిషడ్వర్గాలను జయించి పరమ వైష్ణవుడై మనసాగాడు. అంతేకాదు, నిరంతరం శ్రీహరి పూజాప్రియుడి ఏ దేశాల్లో, ఏయే క్షేత్రాల్లో తీర్ధాల్లో విష్ణువును ఏయే రకాలుగా పూజించడంవల్ల తన జన్మ తరిస్తుందా అనే తపనతో ఉండేవాడు. అంతగా హరిసేవా సంవిధాన సంతృప్తుడైన కారణంగా ఒకరోజు ఆకాశవాణి పురంజయా! కావేరీతీరంలో శ్రీరంగ క్షేత్రం నుంచి శ్రీరంగనాథుడనే పేర అక్కడ వెలసి ఉన్న విష్ణువును కార్తీకమాసంలో అర్చించి జనన మరణాల నుంచి కడతేరుమని ప్రబోధించడంతో రాజ్యపాలనను మంత్రులకు అప్పగించి, తగినంత చతురంగ బలయుక్తుడై అనేక తీర్ధక్షేత్రాలను దర్శిస్తూ అక్కడక్కడ తగినరీతిన శ్రీహరిని అర్చిస్తూ కావేరీ మధ్యంగతమైన భూలోక వైకుంఠమైన శ్రీరంగాన్ని చేరి, కార్తీకమాసమంతా కావేరీనదిలో స్నానాదులు చేసి, శ్రీరంగంలో రంగనాథ సేవలు చేస్తూ ప్రతిక్షణం కూడా కృష్ణా, గోవిందా, వాసుదేవా, శ్రీరంగనాథా అంటూ హరినే స్మరిస్తూ జపదానాది విద్యుక్తధర్మాలన్నిటినీ నిర్వర్తించి కార్తీకమాస వ్రతం పూర్తిచేసుకుని పునః అయోధ్య చేరుకున్నాడు. అనంతరం ధర్మకామంవల్ల సత్పుత్రపౌత్రాదుల్ని పొంది కొన్నాళ్ళు సర్వభోగ వివర్జితుడై భార్యాసమేతంగా వానప్రస్థం స్వీకరించి కార్తీక వ్రతాచరణ, విష్ణుసేవలోనే లీనమై తత్పుణ్యవశాన వైకుంఠం చేరుకున్నాడు.