కార్తీక మహా పురాణము/నాలుగవ రోజు
'ఓ జనకరాజా! పవిత్రమైన కార్తీకమాసంలో పుష్పార్చన, దీపారాధనల గురించి చెప్తాను విను.
పుష్పార్చనా ఫలదానా దీపారాధన విశేషాలు
కార్తీకమాసంలో కమలనాభుడైణ శ్రీహరిని కమలాలతో పూజిస్తే కమలంలో నివసించే లక్ష్మీదేవి ప్రసన్నురాలై, భక్తుల ఇళ్ళలో నివాసం ఏర్పరచుకుంటుంది. తులసిదళాలతో గానీ, జాజిపూలతో గానీ మారేడు దళాలతో గానీ పూజించేవారు తిరిగి ఈ భూమిపై జన్మ ఎత్తరు. మోక్షం పొందుతారు. కార్తీకమాసంలో ఫలాలను దానం చేస్తే వారు చేసిన పాపాలు సూర్యోదయానికి చేకటిళా చెదిరిపోతాయి. ఉసిరిచెట్టు కింద విష్ణువును ఉసిరికాయలతో పూజించేవారిని కన్నెత్తి చూడటానికి యముడికి కూడా శక్తి చాలదు. కార్తీకంలో ఎవరైతే సాలగ్రామాన్ని తులసి దళాలతో పూజిస్తారో వారిని మించిన ధన్యులు ఉండరు.
బ్రాహ్మణ సమేతులై ఉసిరిచెట్టు కింద సాలగ్రామ పూజ చేసేవారు వైకుంఠాన్ని పొంది విష్ణువుళా ఆనందిస్తారు. ఎవరైతే కార్తీకంలో విష్ణు ఆలయమ్లో మావిడాకుల తోరణం కడతారో, వాళ్ళు పరమపదాన్ని పొందుతారు. పూలతో, అరటి స్తంభాలతో మండపం కట్టిన వాళ్ళు వైకుంఠంలో విష్ణువు సామీప్యాన్ని పొందుతారు. ఒక్కసారి అయినా శ్రీహరికి సాష్టాంగ దండ ప్రణామం చేసినవారు అశ్వమేధ పుణ్యవంతులు అవుతారు. విష్ణువుకు ఎదురుగా జప, హోమ దేవతార్చనలు చేసేవారు పితరులతో సహా వైకుంఠానికి వెళ్ళి సుఖిస్తారు. స్నానం చేసి తడి బట్టలతో ఉన్నవానికి పొడి బట్టలు దానం చేసినవారు పదివేల అశ్వమేధాల ఫలాన్ని పొందుతారు. ఆలయ శిఖరం పై ధ్వజారోహణం చేసినవారి పాపాలు గాలికి పుష్ప పరాగం వలె ఎగిరిపోతాయి. నల్లని లేదా తెల్లని అవిసె పూలతో హరి పూజను చేసినవారికి పదివేల యజ్ఞాల ఫలితం ప్రాప్తిస్తుంది. కార్తీకమాసంలో ఏ స్త్రీ అయితే బృందావన గోమయంతో అలికి, పంచ రంగులతో, శంఖ, పద్మ, స్వస్తికారి నందా దీపాన్ని సమర్పించడం వల్ల కలిగే పుణ్యాన్ని వేయినోళ్ళ ఆదిశేషుడు కూడా పొగడలేడు.
కార్తీకమాసంలో శివుని జిల్లేడు పూలతో పూజించినవాడు దీర్ఘాయువై, అన్త్యాన మోక్షాన్ని పొందుతాడు. విష్ణు ఆలయంలో మండపాన్ని అలంకరించినవారు హరి మందిరంలో చిరస్థాయిగా ఉంటారు. హరిణి మల్లెపూలతో పూజించిన వారు వైకుంఠాన్ని పొందుతారు. విష్ణు సన్నిధిలో నాట్యాన్ని చేసినవారి పూర్వ సంచిత పాపాలన్నీ నాశనమై పోతాయి. భక్తియుక్తులై అన్నదానం చేసేవారి పాపాలు గాలికి మంచుతునకల్లా ఎగిరిపోతాయి. ప్రత్యేకించి కార్తీకమాసంలో నువ్వుల దానం, మహానదీ స్నానం, బ్రహ్మపత్ర భోజనం, అన్నదానం - ఈ నాలుగూ ఆచరించడం ధర్మంగా చెప్పారు. స్నాన దానాడులను ఆచరించని లోభులు నూరు జన్మలు కుక్కలుగా పుట్టి, చివరికి చండాలునిగా పుడతారు. కార్తీక వ్రత శూన్యులు మరుజన్మలో గాడిదగా పుట్టి, తదుపరి నూరు జన్మలు శునకంగా పుడతారు.