Jump to content

కార్తీక మహా పురాణము/ఏడవ రోజు

వికీసోర్స్ నుండి

వశిష్ఠ ఉవాచ

రాజా! ఎంత చెప్పినా తరగని ఈ కార్తీక మహత్య పురాణాన్ని అనుసరించి కార్తీకమాసంలో ఆచరించవలసిన ధర్మాల గురించి చెప్తాను. ఏకాగ్రచిత్తుడవై విను. తప్పనిసరిగా చేయవలసిన వాటిని చేయకపోవడం వల్ల పాపం కలుగుతుంది. ఈ కార్తీక ధర్మాలన్నీ నా తండ్రి బ్రహ్మదేవుని ద్వారా నాకు తెలిశాయి. నీకు వాటిని వివరిస్తాను. జనకరాజా! కార్తీకంలో ప్రాతః స్నానం, యోగ్యుడైన బ్రాహ్మణ బాలునికి ఉపనయనం, విద్యాదానం, వస్త్రదానం, అన్నదానం ముఖ్యంగా చేయాలి. ఈ నెలలో ఒడుగు చేయించి దక్షిణ సమర్పించడంవల్ల పూర్వజన్మ పాపాలు కూడా తొలగిపోతాయి. ఇలా తమ ధనంతో ఉపనయనం చేసినపుడు, వటువు చేసే గాయత్రీ జపం వల్ల దాత పంచ మహాపాతకాలు నశించిపోతాయి. వంద రావిచెట్లు నాటిన్చినా, వంద తోటలు వేయించినా, వంద నూతులు, దిగుడు బావులు తవ్వించినా, పదివేల చెరువులు తవ్వించినా వచ్చే పుణ్యం ఎంతో, దానికి పేద బ్రాహ్మణ బాలునికి ఉపనయనం చేయించడం వల్ల కలిగే పున్యమ్లో పదహారో వంతుకు కూడా సమానం కాదు.

మాఘ్యాం వైమాధవేమాసిచోత్తమం మౌంజి బంధనం ||

కారయష్యంతి తే రాజన్ దానం దత్వాతు కార్తీకే ||


కార్తీకంలో ఉపనయన దానం చేసి తర్వాత వచ్చే మాఘంలో గానీ వైశాఖంలో గానీ ఉపనయనం చేయించాలి. సాధువులూ, శ్రోత్రియులూ అయిన బ్రాహ్మణ బాలకులకు ఉపనయనం చేయించడంవల్ల అనంత పుణ్యం కలుగుతుందని ధర్మవేత్తలైన మునులు అందరూ చెప్పారు. అలాంటి ఉపనయనానికి కార్తీకమాసంలో సంకల్పం చెప్పుకుని ఫలానావారికి నేను నా ద్రవ్యంతో ఉపనయనం చేయిస్తాను - అని వాగ్దానం చేయడంవల్ల కలిగే సత్ఫలితాన్ని చెప్పడానికి స్వర్గలోక వాసులకు కూడా సాధ్యం కాదని తెలుసుకో.


జనకరాజా! ఇతరుల సొమ్ముతో చేసే తీర్థయాత్రలు, దేవ, బ్రాహ్మణ సమారాధనలు వల్ల కలిగే పుణ్యం ఆ ధనదాతలకే చెందుతుంది. కార్తీకంలో తమ ధనంతో ఒక బ్రాహ్మణునకు ఉపనయనంతోబాటు పెళ్ళి కూడా చేయించడంవల్ల పుణ్యం ఇనుమడిస్తుంది.

కన్యాదానం తు కార్తిక్యాం యః కుర్యాద్భక్తి ౭తోనఘ |

స్వయంపాపై ర్వినిర్ముక్తః పితృణాం బ్రాహ్మణపదం ||

కార్తీకంలో కన్యాదానం ఆచరిరించినవాడు స్వయంగా తాను తరించడమే గాక వాని పితరులందరికీ కూడా బ్రహ్మలోక ప్రాప్తిని కలిగించిన వాడౌతాడు. ఇందుకు నిదర్శనంగా ఒక ఇతిహాసం చెప్తాను విను.

సువీరోపాఖ్యానం

[మార్చు]

ద్వాపరయుగంలో వంగదేశాన దుర్మార్గుడైన సువీరుడనే రాజు ఉండేవాడు. లేడికన్నుల వంటి సోగ కన్నులుగల సుందరాంగి అతని భార్య. దైవయోగంవల్ల సువీరుడు, దాయాదులు రాజ్యభ్రష్టుని చేయగా, భార్యతో సహా అడవులకు పారిపోయి, కందమూలాలతో కాలక్షేపం చేయసాగాడు.

ఇలా ఉండగా అతని భార్య గర్భం దాల్చింది. రాజు నర్మదాతీరంలో పర్ణశాల నిర్మించాడు. అందులో రాణి చక్కటి కుమార్తెను ప్రసవించింది. సర్వసంపదలూ శత్రువుల పాలైపోవడం, తాను అడవుల పాలవడం, కందమూలాలతో బతుకుతున్న రోజుల్లో కడుపు పంది సంతానం కలిగి, పోషించలేని స్థితి రావడం ఏమిటని పురాకృత కర్మలను నిందించుకుంటూ కూతుర్ని పెంచుకోసాగారు.

సువీరుని కూతురు అందంగా, నేత్రానందకారిణిగా పెరిగింది. ఎనిమిదేళ్ళకే ఆమెను చూసి ఒక ముని కుమారుడు మోహించి ఆమెతో పెళ్ళి జరిపించమని కోరాడు. అందుకు సువీరుడు ఋషిపుత్రా! ఇప్పుడు నేను ఘోర దరిద్రంలో ఉన్నాను. కనుక నేను కోరినంత ధనాన్ని నువ్వు కన్యాశుల్కంగా ఇవ్వగలిగితే నీ కోరిక తీరుస్తాను అన్నాడు.

ఆమెమీద ఉన్న మక్కువకొద్దీ మునికుమారుడు రాజా! నేను కేవలం మునికుమారుణ్ణి. కనుక నువ్వడిగే ధనం నావద్ద లేదు. అయినా, తపస్సు చేసి, ధనాన్ని సంపాదించి ఇస్తాను. అంతవరకూ ఈ బాలికను నాకోసమే ఉంచు అన్నాడు. సువీరుడు అందుకు ఒప్పుకోగా, అతను నర్మదాతీరంలోనే తపోనిష్టుడై, అనూహ్య ధనరాశులు సంపాదించి రాజుకు ఇచ్చాడు.

రాజు అందుకు సంతోషించి, ఇచ్చిన మాట ప్రకారం కూతురితో అతని పెళ్ళి జరిపించాడు. ఆమె భర్తతో వెళ్ళిపోయింది. కన్యావిక్రయ ద్రవ్యంతో రాజదంపతులు సుఖంగా జీవించారు. ఇంతలో సువీరుని భార్య మరోసారి గర్భవతి అయి ఆడపిల్లకు జన్మ ఇచ్చింది. రాజు సంతోషించాడు. పెద్దపిల్లను విక్రయించినట్లుగానే, ఈ కూతురి ద్వారా కూడా ద్రవ్యాన్ని సంపాదించవచ్చు అనుకున్నాడు. బిడ్డ పెరుగుతూ ఉంది. ఇలా ఉండగా ఒక యతీస్వరుడు నర్మదానదికి స్నానానికి వచ్చాడు. పర్ణశాలలో సువీరుని, అతని భార్యను, కూతుర్ని చూసి, ఓయీ! నేను కౌండిన్య గోత్రజుడైన యతిని. ఈ అరణ్యప్రాంతంలో సంసారయుతంగా ఉన్న నీవెవరివి? అన్నాడు.

యతీంద్రుడి ప్రశ్నకు అయ్యా, నేను వంగదేశాధీశుడైన సువీరుడిని. దాయాదుల వలన రాజ్యభ్రష్టుడినై ఇలా అడవిలో ఉంటున్నాను అన్నాడు సువీరుడు.

న దారిద్ర్య సమం దుఃఖం నశోకః పుత్రమారణా త్ |

న చ వ్య దానుగమనేన వియోగః ప్రియాపహాత్ ||

దరిద్రం కన్నా ఏడిపించేది కొడుకు లేకపోవడం. అంతకన్నాఏడవవలసింది రాజ్య వియోగం. అంతకన్నా బయటకు ఏడవలేని దుఃఖం మానసిక క్షోభ. దాన్ని మించింది ఇంకేమీ ఉండదని తమకు తెలుసు కదా. ప్రస్తుతం నేను ఆ మూడు విధాలైన విచారాల వలనా అమిత దుఃఖితుడినై కందమూల భక్షణతో అరణ్యమే శరణ్యంగా బతుకుతున్నాను. ఇక్కడే తోలిచూలుగా నాకొక కూతురు పుట్టింది. ఆమెనొక మునికుమారునికి విక్రయించి, ఆ ధనంతో ప్రస్తుతానికి సుఖంగానే బతుకుతున్నాను. ఇది ణా రెండో కూతురు. ఈమె నా భార్య. ఇంకా నా గురించి ఏం వివరాలు కావాలో అడిగితే చెప్తాను అన్నాడు సువీరుడు.

సువీరుడి సమాధానానికి ఆశ్చర్యపోతూనే ఆ యతీంద్రుడు రాజా! ఎంత పని చేశావు? మూర్ఖుడివై అగణితమైన పాపాన్ని పోగుచేసుకున్నావు

కన్యా ద్రవ్యేణ యో జీవే దసిపత్రం సగచ్చతి దేవాన్ ఋషీన్ పిత్రూన్ క్యాపి

కన్యా ద్రవ్యేణ తర్పయేత్ శాపం దాస్యంతి తే సర్వే జన్మ జన్మ న్యపుత్రతాం

ఆడపిల్లని అమ్ముకుని అలా వచ్చిన డబ్బుతో జీవించేవారు, మరణాంతాన అసిపత్రం అనే నరకం పాలవుతారు. ఆ సొమ్ముతో దేవ, ఋషి, పితృ గణాలకు చేసిన అర్చన తర్పణాదుల వలన ఆ దేవ ఋషి పిత్రాదులందరూ కూడా నరకాన్ని చవిచూస్తారు. అంతేకాదు, కర్తకు జన్మజన్మలకూ కూడా పుత్ర సంతానం కలగకూడదని శపిస్తారు. ఇక, అలా ఆడపిల్లలను అమ్ముకుని జీవించడమే వృత్తిగా పెట్టుకున్నవాళ్ళు ఖచ్చితంగా రౌరవ నరకంలో పడతారు.


సర్వేషా మేవ పాపానాం ప్రాయశ్చిత్తం విదుర్బుదా |

కన్యా విక్రయ శీలస్య ప్రాయశ్చిత్తం న చోదితం ||


అన్ని రకాల పాపాలకూ ఏవో కొన్ని ప్రాయశ్చిత్తాలు ఉన్నాయి కానీ ఈ కన్యాశుల్క మహా పాపానికి ఈ శాస్త్రంలోనూ ఎటువంటి ప్రాయశ్చిత్తం లేదు.

కనుక సువీరా! ఈ కార్తీకమాసంలో శుక్లపక్షంలో నీ రెండవ కుమార్తెకు కన్యాదాన పూర్వకంగా కల్యాణం జరిపించు. కార్తీకంలో విద్యాతేజశ్శీల యుక్తుడైన వరునికి కన్యాదానం చేసినవాడు గంగాది సమస్త తీర్దాల్లో స్నానదానాదులు చేయడం వల్ల కలిగే పుణ్యాన్ని యధోక్త దక్షిణాయుతంగా అశ్వమేధాడి యాగాలు చేసినవాళ్ళు పొందే సత్ఫలితాన్ని పొందుతాడు అని హితబోధ చేశాడు.

కానీ, నీచుడైన సువీరుడు ఆ సజ్జన సద్బోధనలు లెక్కచేయక ఏం చెప్పావ్యా.. మానవజన్మ ఎత్తినప్పుడు సర్వ విధాలుగా ఈ శరీరాన్ని సుఖపెట్టాలే గానీ ధర్మం అంటూ పాకులాడితే ఎలా? అసలు ధర్మం అంటే ఏమిటి? దానం అంటే ఏమిటి? పుణ్యలోకాలంటే ఏమిటి? అయ్యా, ఋషిగారు.. ఏదోరకంగా డబ్బు సంపాదించి భోగాలు అనుభవించడమే ముఖ్యం. పెద్దపిల్ల విషయంలో కంటే ఎక్కువ ధనం ఇచ్చేవానికే నా చిన్నకూతుర్ని ఇచ్చి పెళ్ళి చేసి, సుఖాలు అనుభవిస్తాను. నువ్వు చెప్పింది చాలు, ఇక నీ దారిన వెళ్ళు అని కసురుకున్నాడు. అంతటితో ఆ తాపసి తన దారిన తాను వెళ్ళాడు.

శ్రుతకీర్తి ఉపాఖ్యానం

[మార్చు]

సువీరుని పూర్వీకులలో శ్రుతకీర్తి అనే రాజు ఉన్నాడు. సమస్త సద్ధర్మ ప్రవక్తా, శతాధిక యాగకర్తా అయిన ఆ శ్రుతకీర్తి తన పుణ్య కార్యాల వల్ల స్వర్గంలోని ఇంద్రాదుల చేత గౌరవింపబడుతూ సమస్త సుఖాలను అనుభవిస్తున్నాడు.

సువీరునికి యముడు విధించిన శిక్ష కారణంగా యమదూతలు స్వర్గం చేరి అక్కడ సుఖిస్తున్న శ్రుతకీర్తి జీవుని పాశబద్ధుని చేసి, నరకానికి తీసుకువచ్చారు. ఆ చర్యకు ఆశ్చర్యపడిన శ్రుతకీర్తి యముని ముంగిట నిలబడి స్వర్గంలో ఉన్న నన్ను ఇక్కడికి ఎందుకు రాప్పించావు? నేను చేసిన పాపం ఏమిటి? అని నిలదీసి అడిగాడు.

మందహాసం చేసి మహాధర్ముడు ఇలా చెప్పాడు. శ్రుతకీర్తీ, నువ్వు పుణ్యాత్ముడవె. స్వర్గార్హుడివె. కానీ, నీ వంశీకుడైన సువీరుదనేవాడు కన్యను విక్రయించాడు. అతడు చేసిన మహాపాపం వల్ల అతని వంశీకులైన మీరంతా నరకానికి రావలసివచ్చింది. అయినా సువీరుని రెండో కూతురికి ఇంకా వివాహం కాలేదు. కనుక నువ్వు నా అనుగ్రహంవల్ల దేహివై (భూలోకవాసులు గుర్తించే శరీరం కలిగిఉండటం) అక్కడికి వెళ్ళి యోగ్యుడైన వరునికి ఇచ్చి, కన్యాదాన యుక్తంగా పెళ్ళి జరిపించు. ఎవరైతే కార్తీకంలో సర్వాలంకార భూషిత అయిన కన్యను యోగ్యుడైన వరునికి దానం చేస్తాడో వాడూ లోకాధిపతితో తుల్యుడౌతాడు. అలా కన్యాదానం చేయాలనే సంకల్పం ఉండి కూడా సంతానం లేనివాడూ బ్రాహ్మణ కన్యను అందుకోబోతున్న బ్రాహ్మణుడు కానీ ధన సహాయం చేసినట్లయితే ఆ ధనదాత కన్యాదాత పొందే ఫలాన్నే పొందుతాడు. అంతేకాదు, స్వలాభాపేక్ష రహితులై రెండు పాడి ఆవులను చెల్లించి కన్యను కొని, ఆ కన్యను చక్కటి వరునికి ఇచ్చి పెళ్ళి చేసేవారు కూడా క్నయాదానా ఫలాన్ని పొందుతారు. కనుక ఓ శ్రుతకీర్తీ, నువ్వు తక్షణమే భూలోకానికి వెళ్ళి సువీరుని ద్వితీయ కుమార్తెను ఎవరైనా సద్బ్రాహ్మణుడికి కన్యాదానం చేసినట్లయితే తద్వారా నువ్వూ, నీ పూర్వీకులు, సువీరాదులు కూడా నరకం నుండి విముక్తి పొందుతారు అని చెప్పాడు.

ధర్ముని అనుగ్రహం వల్ల దేహదారి అయిన శ్రుతకీర్తి వెంటనే భూలోకలోని నర్మదా నదీ తీరాన్ని చేరి అక్కడి పర్ణశాలలో ఉన్న సువీరుని భార్యకు హితవు చెప్పి వారి రెండో కూతుర్ని స్వర్ణాభరణ భూశితురాలిని చేసి, శివప్రీతిగా శివార్పణమస్తు అనుకుంటూ ఒక బ్రాహ్మణునికి కన్యాదానం చేశాడు. ఆ పుణ్యమహిమ వల్ల సువీరుడు నరకపీడా విముక్తుడై, స్వర్గం చేరి సుఖించసాగాడు. తర్వాత శ్రుతకీర్తి పదిమంది బ్రహ్మచారులకు కన్యామూల్యం ధారబోయడంవల్ల వారి వారి పితృపెటా మహాదివర్గాల వారంతా కూడా విగత పాపులై, స్వర్గాన్ని పొందారు. అనంతరం శ్రుతకీర్తి కూడా యధాపూర్వకంగా స్వర్గం చేరి తనవారిని కలిసి సుఖించసాగాడు. కనుక ఓ జనకరాజా! కార్తీకమాసంలో కన్యాదానం చేసేవాడు, సర్వ పాపాలనూ నశింపచేసుకుంటాడు అనుకోవడంలో ఏమాత్రం సందేహం లేదు. కన్యామూల్యాన్ని చెల్లించలేనివారు వివాహార్ధం మాట సహాయం చేస్తే కూడా అమితమైన పుణ్యాన్ని పొందుతారు. రాజా! ఎవరైతే కార్తీకమాసంలో యధావిధిగా కార్తీక వ్రతాన్ని ఆచరిస్తారో వాళ్ళు స్వర్గాన్ని, చేయనివాళ్ళు నరకాన్ని పొందుతారు అనడంలో సందేహం లేదు.