Jump to content

కార్తీక మహా పురాణము/ఆరవ రోజు

వికీసోర్స్ నుండి

వశిష్ట ఉవాచ

ఓ మహారాజా! కార్తీకమాసంలో శ్రీహరిని ఎవరైతే అవిసెపూలతో పూజిస్తారో, వారికి చాంద్రాయణ ఫలం కలుగుతుంది. గరికతోనూ, కుశాలతోనూ పోజించేవారు పాపవిముక్తులై వైకుంఠాన్ని పొందుతారు. చిత్ర వర్ణ వస్త్రాన్ని శ్రీహరికి సమర్పించిన వారు మోక్షాన్ని పొందుతారు. కార్తీక స్నానాచరణం చేసి విష్ణు సన్నిధిని దీపమాలికను ఉంచేవారు, వైకుంఠ పురాణ పాఠకులూ, శ్రోతలూ కూడా విగత పాపులై పరమపదాన్ని చేరతారు. ఇందుకు ఉదాహరణగా సర్వ పాపాలను నశింపచేసేదీ, ఆయురారోగ్య దాయినీ అయిన ఒక కథణు వినిపిస్తాను, విను.

మంధరోపాఖ్యానం

కళింగ దేశీయుడైన మంధరుడనే ఒకానొక బ్రాహ్మణుడు స్నాన సంధ్యా వందనాలన్నిటినీ విసర్జించి, పరులకు కూలిపని చేస్తూ ఉండేవాడు. అతనికి పతివ్రత, సర్వ సాముద్రికాది శుభ లక్షణాలతో సంపన్న, సద్గుణ సముచ్చయంచేత సుశీల అనే పేరున్న భార్య ఉండేది. భర్త ఎంత దుర్మార్గుడు అయినా కూడా, అతనియందు రాగమే తప్ప ద్వేషం లేకుండా పాత్రివ్రత్య నిష్ఠ పాటిస్తూ ఉండేది.

కొన్నాళ్ళ తర్వాత కూలితో జీవించడం కష్టమని భావించిన మంధరుడు వనగాతుడై, ఖడ్గపాణిఅయి, దారులు కాచి, బాటసారులను కొట్టి, వారి నుండి ధనాన్ని అపహరిస్తూ కాలం గడపసాగాడు. ఆ దొంగసొత్తుణు ఇరుగుపొరుగు దేశాలకు తీసికెళ్ళి, అమ్మి, ఆ సొమ్ముతో కుటుంబ పోషణ చేసేవాడు. ఒకసారి దొంగతనానికి దారి కాచి ఉన్న మంధరుడు దానిన వెళ్తున్న ఒక బ్రాహ్మణుని పట్టుకుని, అక్కడి మర్రిచెట్టుకు కట్టేసి, అతని వద్ద ఉన్న ధనాన్ని దోచుకున్నాడు.

ఇంతలో అటుగా వచ్చిన పరమ క్రూరుడైణ ఒక కిరాతకుడు ధనం దోచుకున్న మంధరుని, ధనం పోగొట్టుకుని బంధీగా ఉన్న బ్రాహ్మణుడిని ఇద్దర్నీ చంపి, ధనాన్ని హరించుకుపోయాడు. కానీ, అదే సమయానికి అక్కడి కిరాత, మంధర, బ్రాహ్మణుల నుండి వచ్చే నరవాసనణు పసిగట్టిన పులి వచ్చింది. కిరాతుడు దానితో కలబడ్డాడు.కొద్దిసేపటికి పులి, కిరాతుడు ఇద్దరూ చనిపోయారు.

అలా మరణించిన విప్రుడు, మంధరుడు, వ్యాఘ్ర, కిరాతకులు నలుగురూ యమలోకం చేరి, కాలసూత్రం అనే నరకాన్ని పొందారు. యమ కింకరులు నలుగురినీ పురుగులూ, అమేత్యంతో నిండిన తప్త రక్త కూపంలో పడేశారు.

ఇక భూలోకంలో భర్త మరణవార్త తెలీని మంధరుని భార్య సుశీల మాత్రం నిత్యం అతన్నే ధ్యానిస్తూ ధర్మవర్తనతో, హరిభక్తితో, సజ్జన సాంగత్యంతో జీవిన్చాసాగింది. ఒకరోజు నిరంతర హరినామ సంకీర్తనా తత్పరుడు, సర్వుల యందు భగవంతుని దర్శించేవాడూ, నిత్యానంద నర్తనుడు అయిన ఒకానొక యతీశ్వరుడు సుశీల ఇంటికి వచ్చాడు. ఆమె శ్రద్ధాభక్తులతో అతనికి బిక్ష వేసి అయ్యా! నా భర్త కార్యార్ది అయి వెళ్ళాడు. ఇంట్లో లేదు. నేను ఏకాకిని ఆయన ధ్యానంలోనే కాలం గడుపుతున్నాను అని విన్నవించుకుంది.

అందుకా యతి అమ్మాయీ, బాధపడకు. ఈరోజు కార్తీక పూర్ణిమ. ఇది మహా పర్వదినం. ఈరోజు సాయంకాలం నీ ఇంట్లో పురాణ పఠన, శ్రవణాదులు ఏర్పాటు చేయి. అన్డుగ్గానూ ఒక దీపం చాలా అవసరం. దీపానికి తగినంత నూనె నా దగ్గరుంది. నీవు వత్తిని, ప్రమిదను సమర్పించినట్లయితే, దీపం వెలిగించవచ్చు అన్నాడు.

ఆ యతిశ్రేష్టుని మాటలకు సరేనని, సుశీల తక్షణం గోమయంతో ఇల్లంతా అలికి, పంచరంగుల ముగ్గులను పెట్టింది. పత్తిని శుభ్రం చేసి, రెండు వత్తులు చేసి, యతీస్వరుని వద్ద ఉన్న నూనెతో వాటిని వెలిగించి శ్రీహరికి సమర్పించింది.

యతి, దీప సహితంగా విష్ణువుణు పూజించి, మనశ్శుద్ధి కోసం పురాణ పఠనం ఆరంభించాడు. సుశీల పరిసరాల ఇళ్ళకు వెళ్ళి, వారందరినీ పురాణ శ్రవణానికి ఆహ్వానించింది. అందరి మధ్యలో తాను కూడా ఏకాగ్ర చిత్తఅయి ఆ పురాణాన్ని వింది. తర్వాత ఆమెకు శుభాశీస్సులు అందించి యతీస్వరుడు వెళ్ళిపోయాడు. నిరంతర హరి సేవనం వల్ల క్రమక్రమంగా ఆమె జ్ఞానిఅయి తదుపరి కాలధర్మం చెందింది.

తక్షణం శంఖ చక్రాంకితులు, చతుర్భాహువులు, పద్మాక్షులు, పీతాంబరదారులు అయిన విష్ణుదూతలు నందనవన, సుందర మందారాది సుమాలతో, రత్నమౌక్తిక ప్రవాళాదులతో నిర్మించిన మాలికాంబరాభరణాలంకృతమై ఉన్న దివ్య విమానాన్ని తెచ్చి సుశీలను అందులో అధిరోహింపచేసి వైకుంఠానికి తీసుకుపోసాగారు. అందులో వెళ్తున్న సుశీల మార్గమద్యంలో మరి ముగ్గురు జీవులతో కలిసి బాధలు పడుతున్న తన భర్తను గుర్తించి, విమానాన్ని ఆపించి, అందుక్కారణం ఏమిటో తెల్లియజేయమని విష్ణు దూతలను కోరింది.

అందుకు వారు అమ్మా! నీ భర్త అయిన మంధరుదు, విప్రుడు అయినప్పటికీ వేదాచారాలను మరచి కూలియై, మరి కొన్నాళ్ళు దొంగ అయి, దుర్మార్గుడై, ఇలా నరకాన్ని అనుభవిస్తున్నాడు. అతనితో బాటే ఉన్న మరొక బ్రాహ్మణుడు మిత్ర ద్రోహి. మిత్రుని చంపి అతని ధనంతో పర దేశాలకు పారిపోతూ నీ భర్తచేత బంధితుడయ్యాడు. అతని పాపాలకు గానూ అతడు నరకం పొందాడు. మూడవవాడూ కిరాతకుడు. బంధితుడైణ ఆ బ్రాహ్మణుని, నీ భర్తణు కూడా చంపి పాపానికి ఒడికట్టి, నరకం చేరాడు. ఇక నాల్గవ జీవి ఒక పులి. ఆ పులి అంతఃపూర్వ జన్మలో ద్రావిడ బ్రాహ్మణుడై ఉండి ద్వాదశినాడు భక్ష్యా భక్ష్య విచక్షణా రహితుడై ఆచరించిణ తైలాదిక భోజనాల వలన నరకం పొంది, పులిగా పుట్టి, చివరికి కిరాతకుడితో పోరి, నరకం చేరింది. వీరి నరక యాతనకు కారణాలు ఇవి అని వివరంగా చెప్పాడు.

అప్పుడు సుశీల విష్ణు దూతలను చూసి ఏ పుణ్యం చేసినట్లయితే వాళ్లకు ఆ నరకం తప్పుతుందో చెప్పండి అని కోరింది.

దూతలు కార్తీకమాసంలో నువ్వు ఆచరించిన పురాణ శ్రవణ ఫలితాన్ని ధారబోయడం వల్ల నీ భర్త, పురాణ స్రవనార్ధమై నువ్వు ఇంటింటికీ వెళ్ళి ప్రజలను పెలిచిన పుణ్యాన్ని ధారబోయడం వల్ల మిత్ర ద్రోహి అయిన ఆ విప్రుడు, పురాణ స్రవనార్ధమై నువ్వు సమర్పించిన రెండు వత్తుల పుణ్యాన్ని చేరి సగంగా ధారపోయడంవల్ల కిరాత, వ్యాఘ్రాలు నరకం నుండి ముక్తి పొందుతాయి అంటూ వివరించారు.

అలా వాళ్ళు చెప్పగానే సుశీల ఆయా పుణ్యాలను ధారబోయడంతో ఆ నలుగురూ నరకం నుండి విముక్తులై దివ్య విమానారూఢులై సుశీలణు వివిధ రూపాలుగా ప్రశంసిస్తూ మహా జ్ఞానులు పొందే ముక్తి పథానికి వెళ్ళగలిగారు.

కనుక జనక మహారాజా! కార్తీకమాసంలో చేసే పురాణ శ్రవణం వల్ల హరిలోకాన్ని తప్పనిసరిగా పొందుతారని తెలుసుకో!

ద్వాదశాధ్యాయం (వశిష్ట ప్రవచనం) 

వశిష్టుడు ఇంకా జనకునికి ఇలా చెప్పసాగాడు.

ఓ రాజా! కార్తీకమాసంలో వచ్చే సోమవార మహత్యాన్ని విన్నావు కదా! ఆ కార్తీక సోమవారం ఎంత ఫలాన్ని ఇస్తుందో అంతకంటే కార్తీక శని త్రయోదశి వందరెట్లు, కార్తీక పూర్ణిమ వెయ్యిరెట్లు, శుక్ల పాడ్యమి లక్షరెట్లు, శుక్ల ఏకాదశి కోటిరెట్లు, ద్వాదశి లెక్కకు అందనంత అనంతమైన ఫలాలను ఆదనంగా ప్రసాదిస్తాయి.

ఏ కారణం చేతనైనా సరే శుక్ల ఏకాదశినాడు ఉపవాసం ఉండి, మర్నాడు అంటే ద్వాదశినాడు బ్రాహ్మనయుక్తులై పారాయణ చేసేవారు మోక్షాన్ని పొందుతారు. ఈ కార్తీక శుద్ధ ద్వాదశినాడు అన్నదానం చేసినవారికి సమస్త సంపదలూ అభివృద్ధి చెందుతాయి. రాజా సూర్యగ్రహణ సమయంలో గంగాతీరంలో కోటిమంది బ్రాహ్మణులకు అన్నసమారాధన చేయడంవల్ల ఎంత పుణ్యం కలుగుతుందో అంత పుణ్యమూ కేవలం కార్తీకద్వాదశినాడు ఒక్క బ్రాహ్మణునికి భోజనం పెట్టడంవల్ల కలుగుతుంది. వేయి గ్రహణపర్వాలు, పదివేల వ్యతీపాత యోగాలూ, లక్ష అమావాస్య పర్వాలు ఏకమైనా కూడా ఒక్క కార్తీక ద్వాదశిలో పహారవ వంతు కూడా చేయమని తెలుసుకో. మనకు ఉన్న తిథుల్లో పుణ్యప్రదాలైన తిథులు ఎన్నయినా ఉండవచ్చును గాక.. వాటన్నిటి కంటే కూడా సాక్షాత్తూ విష్ణు ప్రీతికరమైన ఈ కార్తీక ద్వాదశి అత్యంత ఫలప్రదమని మర్చిపోకు.

ద్వాదశి దానములు

కార్తీక శుద్ధ ద్వాదశినాడు క్షీర సాగరం నుండి శ్రీహరి నిద్ర లేస్తాడు. అందువల్ల దీనికి హరిబోధినీ ద్వాదశి అనే పేరు వచ్చింది. ఈ హరిబోధిని నాడు ఎవరైతే కనీసం ఒక్క బ్రాహ్మణునికైనా అన్నదానం చేస్తారో, వాళ్ళు ఇహలోకంలో భోగానుసేవనాన్ని, పరలోకంలో భోగిశయనామ సేవనాన్నీ పొందుతారు. కార్తీక ద్వాదశినాడు పెరుగుతో కూడిన అన్నదానం చేయడం సర్వోత్కృష్టమైన దానంగా చెప్పారు. ఎవరైతే ఈ ద్వాదశినాడు పాలిచ్చే ఆవును, వెండి డెక్కలూ, బంగారు కొమ్మలతో అలంకరించి, పూజించి దూడతో సహా గోదానం చేస్తారో వాళ్ళు ఆ ఆవు శరీరంపై ఎన్ని రోమాలైతే ఉంటాయో, అన్ని వేల సంవత్సరాలు స్వర్గంలో నివసిస్తారు. ఈరోజు వస్త్రదానం చేసిన వాళ్ళు సంచితార్దాలన్నీ సమసిపోయి వైకుంఠాన్ని చేరుతారు అనడంలో ఎలాంటి సందేహమూ లేదు.

ఓ మహారాజా! ఎవరైతే కార్తీక శుద్ధ ద్వాదశినాడు సాలగ్రామాన్ని, బంగారపు తులసి వృక్షాన్ని దక్షిణ సమేతంగా దానం చేస్తారో వాళ్ళు చతుస్సాగర పర్యంతమైన సమస్త భూమండలాన్నీ దానం చేసినంత పుణ్యాన్ని పొందుతున్నారు. ఇందుకు నిదర్శనంగా ఒక గాథను చెప్తాను, విను.

 ధర్మవీరోపాఖ్యానం

పూర్వం గోదావరీ తీరంలో దురాచారవంతుడూ, పరమ పిసినారి అయిన ఒక వైశ్యుడు ఉండేవాడు. ఈ లుబ్దుఁడు దానధర్మాలు చేయకపోవడమే కాకుండా తాను కడుపునిండా తిననైనా తినకుండా ధనం కూడబెట్టేవాడు. ధనదాన్యాలనే కాదు, కనీసం ఎవరికీ మాట సాయం కూడా చేసేవాడు కాదు. రోజూ ఇతరులను నిందిస్తూ పరద్రవ్యాసక్తుడై జీవించే ఈ పిసినారి ధనాన్ని వడ్డీలకు తిప్పుతూ అంతకంతకూ ద్రవ్యాన్ని పెంచుకోసాగాడు.

ఒకసారి ఈ లుబ్ధుడు ఒక బ్రాహ్మణునికి ఇచ్చిన అప్పును రాబట్టుకోవడం కోసం అతని గ్రామానికి వెళ్ళి, తాను ఇచ్చిన బాకీని వెంటనే వడ్డీతో చెల్లించమని పట్టుబట్టాడు. అందుకు, బ్రాహ్మణుడు అయ్యా! నీ బాకీ ఎగ్గొట్టేవాడిని కాను. ఎందుకంటావేమో..


యో జీవతి రుణీనిత్యం నియమం కల్పమశ్నుతే |

పశ్చాత్తస్యసుతో భూత్వా తత్సర్వం ప్రతిదాస్యతి ||

ఎవరయితే రుణం తీర్చకుండానే పోతాడో, అతను మరుజన్మలో రుణదాతకు సంతు రూపంగా జన్మించి ఈ రుణాన్ని చెల్లుబెట్టుకోవలసి వస్తుంది. అందుచేత ఏదో విధంగా సంపాదించి ఈ మాసం చివరికల్లా నీ రుణం చేల్లిస్తాను. అంతవరకూ ఆగు అని చెప్పాడు.

ఆ బ్రాహ్మణ వచనాలను మాయమాటలుగా, తనను చిన్నబుచ్చడానికి చెప్పిన మాటలుగా భావించి, నీ కబుర్లు నా దగ్గర కాదు. నీ బాకీ వసూలు చేయకుండా ఇంకా నెలరోజులు ఆగే సమయం లేదు. మర్యాదగా ఇప్పుడే ఇవ్వు. లేదా ఈ కత్తితో పోడిచేస్తాను అన్నాడు.

నిజంగా తనవద్ద డబ్బు లేదని, వెంటనే తీర్చలేనని చెప్పాడు విప్రుడు. మరింత మండిపడిన ఆ పిసినారి, బ్రాహ్మణుడి జుట్టు పట్టుకుని లాగి, నేలమీద పడేసి, కాలితో తన్నాడు. అయినా కసి తీరక కత్తితో పొడిచాడు. సింహపు పంజా విసురుకు లేడిపిల్ల చనిపోయినట్లుగా క్రోధోన్మత్తుడైణ కోమటి కత్తివేటుకు బ్రాహ్మణుడు ప్రాణం కోల్పోయాడు. అంతటితో కోమటి తాను చేసిన హత్యానేరానికి గాను రాజు తనను దండిస్తాడు అనే భయంతో త్వరగా ఇంటికి పారిపోయి, గుట్టుగా బ్రతకసాగాడు. బ్రతికినంతకాలం గుట్టుగా బ్రతగ్గలమే కానీ, గుట్టుగా ఉన్నంత కాలం బ్రతకలేం కదా! అలాగే కోమటి కూడా ఆయువు తీరి చనిపోయాడు. యమకింకరురు వచ్చి, ఆ కోమటిని నరకానికి తీసికెళ్ళారు.

జనకభూపతీ! రురువు లనే మృగాలచేత, వాటి శ్రుంగాల చేత పీడింపచేసే ఒకానొక యాతననే రౌరవం అంటారు. ఈ కొమతిని ఆ రౌరవం అనే నరక విభాగంలో వేసి శిక్షించవలసిందిగా ఆజ్ఞాపించాడు యమధర్మరాజు. కింకరులు ఆ ఆజ్ఞను అమలుచేయసాగారు.

ఇక భూలోకంలో ఆ లుబ్ధ వైశ్యుని కుమారుడైన ధర్మవీరుడు. అతను మహాదాత, పరోపకారి అయి పిత్రార్జితమైన అగణిత ధనరాశులతో ప్రజా శ్రేయస్సుకై చెరువులు, నూతులు తవ్వించి తోటలు వేయించి, వంతెనలు కట్టించి పేదలకు పెళ్ళిళ్ళు చేయిస్తూ యజ్ఞయాగాది క్రతువులను, క్షుత్పీడుతులకు తరతమ బేధం లేకుండా అన్నదానాలు చేస్తూ ధర్మాత్ముడిగా పేరు తెచ్చుకున్నాడు.