కవి జీవితములు/సంకుసాల నృసింహకవి

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

శ్రీరస్తు

కవిజీవితములు

ప్రౌఢప్రబంధకవులచరిత్రము.

18.

సంకుసాల నృసింహకవి.

ఈవఱకును గొందఱు ప్రబంధకవులచరిత్రములు వివరించినాము. వారు ప్రౌఢకవులయినను గొన్ని భాగములలోఁ గథానుగుణ్యమున మృదుశయ్యంగూడ నవలంబించియుండుటచేత వా రుభయ విధకవు లయిరి, ఇపుడు మనము వ్రాయుచున్నకవులు కేవలము ప్రౌఢ రచనయే ప్రధానముగాఁ జేసి కవిత్వము చెప్పినవా రవుటంజేసి వీరిని బ్రౌఢకవులుగా నిర్ణయించవలసివచ్చెను. వీరిపేరులును గ్రంథముల పేరులు నీక్రింద వివరించెదను.

1. నృసింహకవి. కవికర్ణరసాయనము.

2. కృష్ణరాయలు. విష్ణుచిత్తీయము.

3. కామకవి. సత్యభామాసాంత్వనము.

4. వేంకటేశ్వరవిలాసము. గణపవరపు వేంకటపతి.

5. ధరణదేవుల రామమంత్రి. దశావతారచరిత్రము.

ఇట్టి కవుల చరిత్రములలోఁ బై యిద్దఱుకవుల చరిత్రమును బూర్వము కొంత చెప్పియున్నాను. ఇకఁ దక్కిన కవులచారిత్రము విశేషముగ వ్యాపకములో లేదుగావున గ్రంథస్థ మగుదానిమట్టుకు వివరించెదను. కృష్ణరాయనిచారిత్రములో నిదివఱ కతఁడు కవిగా వివరించి కొంతగాథయు దేశాధిపునిగా వివరించి కొంతగాథయు వ్రాసియున్నా ము. అట్టిగాథల నిపుడు దొరికినమట్టుకు విశేషములఁ జేర్చి పెంచి వ్రాసెదను. కృష్ణరాయచారిత్రము కేవలప్రభు చారిత్రములలోఁ జేర్చి చెప్పవలసిన దైనను, రాజచరిత్రము లేనిది కేవలకవిచారిత్ర మంత శ్లాఘాపాత్ర మైయుండదు గావున నీ పట్టున రాజచారిత్రములలో నున్న దానిని విడఁదీసి దీనియందే పొందుపఱిచెదను. కావున చరిత్రాభి మాలుబు దీని నంగీకరింపఁ బ్రార్థింపఁబడుచున్నారు.

కవికర్ణరసాయనము.

పైప్రౌఢప్రబంధములలో మొదటిగ్రంథ మగుకవికర్ణ రసాయనమనునీగ్రంథము నరసింహకవి యనునతఁడు రచియించెను. అల్లసాని పెద్దనయు నీతనికిఁ బూర్వులగు కొందఱు కావ్యకర్తలును గనుపఱిచినమార్గములలోని విశేషముల ననుసరించి కేవలము ప్రబంధవర్ణనలన్నియుఁ దెచ్చుటకు నొకకథను విశేషకథాచమత్కృతి లేనిదానిం గైకొని ఆఱాశ్వసములగ్రంథము రచియించెను. ఇట్టిగ్రంథములో నుండు వర్ణనావిశేషములు దెలుపుటకుఁ బూర్వము ప్రబంధావసరము లగువర్ణనలకు నిబంధనపద్యములఁ దెల్పి యనంతరము వర్ణనలలో నెన్ని పెంచి రచియింపఁబడియెనో చూపెదను. ఇతనినాఁటికి లక్షణగ్రంథము కావ్యాలంకార చూడామణి యనంబరఁగు విన్నకోట. పెద్దనకవిరచిత లక్షణ మై యున్నది. కాని అంతకంటె ననంతరకాలములో రచియింపఁ బడిన ప్రతాపరుద్రీయములో నుండువిశేషము లీనరసింహకవికి లక్షములుగా నున్న ట్లూహింపఁబడును. అది నరసింహకవికాలమునాఁటికిఁ దెనుఁగుకాకున్నను ఇపుడు వ్యాపకములో నాగ్రంథ ముండుటం బట్టి దానిలోని ప్రబంధ నిబంధనమునే యీక్రింద వివరించెదను. ఎట్లన్నను :-

"గీ. ఇంకఁ గావ్యప్రభేదంబు లేర్పఱింతు, వరుస నష్టాదశ విశిష్టవర్ణములు
     గలుగవలయు మహాకావ్యతిలకమునకు, నెలమిఁ దన్నామధేయంబు లెట్టి వనిన.

క. పుర, సింధు, నగ, ర్త్విన, శశి. సరసీ, వన, మధు, రతిప్రసంగ, విరహముల్
    పరిణయ, తనయోదయ, నయ. విరచన, యా, త్రాజి, దౌత్య,విభువర్ణనముల్.

గీ. ఇందు నొకకొన్ని కడయైన నెంచిచూడ, నదియు నవనిమహాకావ్యమనఁగ బరఁగు
    మఱియు క్షుద్రప్రబంధ నిర్మాణమర్మ, లక్షణము లేర్పఱించెద లలితఫణితి."

మహాకావ్య లక్షణముల వివరించితిగావున నిఁక నట్టివర్ణనలలో నీ నృసింహకవి హెచ్చించి చెప్పిన వర్ణనములం జూపెదను, దానికిఁగాను నరసింహకవివలనఁ జెప్పఁబడిన యాశ్వాసాంత గద్యములే చాలియుండుంగావున నీక్రిందివానిఁ బ్రత్యేకించి చూపెదను. అందులో :-

1. ప్రథమాశ్వాసములో 1. కావ్యారంభము. 2. పురవర్ణనము. 3. నాయకనిరూపణము.

2. రెండవయాశ్వాసములో. 1. రాజనీతి. 2. శరత్కాలవర్ణనము. 3. దండయాత్ర. 4. దిగ్విజయంబు. 5. సేనాసన్ని వేశనిరూపణము. 6. దూతాలాపంబును. 7. వీరాలాపంబును. 8. యుద్ధము. 9. శైలవర్ణనము.

3. మూఁడవ యాశ్వాసములో. 1. నాయికానిరూపణము. 2. యౌవనవర్ణనము. 3. విప్రలంభంబును. 4. ఆ విప్రలంభవర్ణనములో దశదశానిరూపణము. 5. వివాహము. 6. నవనవోఢాసంగమము.

4. నాల్గవ యాశ్వాసములో. 1. వసంతవర్ణనము. 2. వనవిహారము. 3. జలక్రీడ. 4. సూర్యాస్తమయము. 5. తమోవర్ణనము. 6. తారకావర్ణనము. 7. జారవిట విటీవర్ణనము. 8. చంద్రోదయము. 9. మధుపానము. 10. రతినిరూపణము. 11. ప్రభాతవర్ణనము. 12. సూర్యోదయవర్ణనము.

5. అయిదవ యాశ్వాసములో. 1. వసిష్ఠాగమనము. 2. రాజ ప్రశ్నప్రతి వచనంబులు. 3. అట్టిప్రశ్నలలో కర్మస్వరూప బ్రహ్మస్వరూపములు. 4. వేద వేదాంత పురాణ నిరూపణము. 5. భక్తి ప్రపత్తిరూపసాధన నిరూపణము. 6. సంసారనిరూపణము. 7. మోక్షావతరణము. 6. ఆఱవ యాశ్వాసములో. 1. తపశ్చరణము. 2. అందులో గ్రీష్మ, వర్ష, శిశిరర్తు వర్ణనము. 3. అప్సరస్సమాగమన ప్రకారము. 4. నృత్తప్రపంచము. 5. సముద్రవర్ణనము. 6. వైకుంఠవర్ణనము. 7. భగవద్దివ్య మంగళవర్ణనము. 8. భగవత్ స్తోత్రము.

పైవర్ణన లెట్టు లున్న వనఁగా :-

1. వ దానిలో 3. 2 వ దానిలో 9. 3 వ దానిలో 6. 4 వ దానిలో 12. 5 వ దానిలో 7. 6 వ దానిలో 8. మొత్తము. 45.

ఇటులఁ జేసి తిరుగ నొక్కొకదానిలో ననేక వర్ణనలు చేర్చి చెప్పుటయే కాక నరసింహకవి తిరిగి యొక్కొక వర్ణనలో ననేకభేదములుగూడ కల్పించెను. ఎట్లనగాఁ బురవర్ణనలో కోటలు, కొమ్ములు సౌధములు వర్ణించుటయేగాక బ్రహ్మక్షత్త్రాది వర్ణ చతుష్టయమును, చతురంగబలంబులను, పుష్పలావికాది స్త్రీవర్ణనాంశాదికములం జేర్చి పెంచి చెప్పెను. పారిజాతాపహరణమునకంటె మనుచరిత్రంబునను, మనుచరిత్రమునకంటె నీకవికర్ణరసాయనంబున ననేక విశేష వర్ణనాంశములు కాన నయ్యెడిని. ఇట్టి నరసింహకవి మార్గమునే కై కొని ఆముక్తమాల్యద, వసుచరిత్రము మొదలగు ప్రబంధములు రచియింపఁనడినవి. తదనంతరకాలములోనికవులందఱు నాయావర్ణ నలనే చేయుచు వారిబుద్ధివైశద్యముచేత నాయావర్ణనలలో నింకను విశేషించి గ్రంథము జేర్చిరి. శా. స. 16, 17 శతాబ్దములలోని కవులు పైవర్ణనల నన్నిటిం జేకొనినను శృంగారాదివర్ణనలు ప్రధానములుగాఁ జేసి అందుఁ బ్రఖ్యాతిం జెందిరి. వారిచారిత్రములు మఱియొక భాగములోఁ జేర్పంబడినవికావున నందలి విశేషము లాచరిత్రములలోపలనే వివరించెదను. ప్రస్తుత మీకవిచరిత్రముం జెప్పి మనుచరిత్రమునకు నీకవి కర్ణ రసాయనమునకుం గలశైలీవిశేషములం జూపెదను.

నృసింహకవిచరిత్రము.

దీనిని దెలుపుట కీగ్రంథములో విశేషాధారములు లేవు. ఇతని వలన నావఱకుఁ జేయంబడినగ్రంథనామములం దుదాహరింపఁబడియుండలేదు. కావున గ్రంథాంతరముల వలననైనం దానిం దెలయుట కాధారములు లేవు. గ్రంథముఖంబున నీకవి యొకపద్యముం జెప్పెంగాని దానివలన నీతని వంశానువర్ణనము తెలియదు. ఆపద్య మెట్లన్నను :-

క. గురువరభట్టపరాశర, చరణసరోరుహసముల్లసన్మానసుఁడన్
    నరసింహనామధేయుఁడ, పరిమితసత్కృతిరసానుభవహేతువునన్.

ఆశ్వాసాంతగద్యములోఁగూడ నరసింహకవియొక్కచారిత్రము కొంచెమైనను లేదు. గద్య మె ట్లున్న దనఁగా :-

"శ్రీమద్భట్ట పకాశర దేశికేంద్ర చరణనరసిజసేవకోప సేవక నరసింహ నామధేయ ప్రణీతను."

అని యున్నది. ఇట్లాశ్వాసారంభములోఁగానీ యాశ్వాసాంత గద్యములోఁగానీ స్వప్రజ్ఞాప్రకటనముగానీ వంశవర్ణనముగానీ చేసికొనినవాఁ డీనరసింహకవియొక్కఁడే యీప్రబంధకవులలోఁ గాన్పించుచున్నాఁడు. ప్రజ్ఞావిశేషము లేదేమో అని యూహింపఁగా నితనితో సమానుఁ డగుప్రబంధకవి ఆంధ్రములో నున్నట్టుగనే కానుపించఁడు. ఇట్టికవి నేమికారణముననో ఆంధ్రకవిచరిత్రములో "ఇతఁడు స్వాతిశయభావము గలవాఁడైనట్లు కనుపట్టుచున్నాఁడ"ని వ్రాయంబడియున్నది. ఇది మిక్కిలి యాలోచన చేయకయే యియ్యంబడిన అభిప్రాయముగా నిర్ణయించి అట్లుగా నభిప్రాయ పడుటకుఁ గారణభూతము లైనపద్యములరచనకుఁ గలకారణముల నుచితస్థలంబున వివరించెదను.

కవికర్ణ రసాయనము కృష్ణరాయలకడకుం గొంపోయినకథ.

ఆంధ్రకవితాపితామహుఁ డగునల్లసానిపెద్దన మనుచరిత్రము రచియించి కృష్ణరాయలకడ విశేషగౌరవము నందినవృత్తాంతంబు విని నరసింహకవి తాను నొక ప్రబంధంబు రచియించి రాజునకుం గృతినిచ్చి గౌరవము నందంగోరెను. అట్లుగా నూహించి "కవికర్ణ రసాయనమ"ను గ్రంథమును రచియించి దానిని కృష్ణరాయలకుఁ గృతినిచ్చు తలంపున నద్దానిం గొని విజయనగరమునకుం బోయి అట్టిప్రబంధ విషయమై లెస్సగ నెఱిఁగినట్టియు రాజునకు మిగుల గౌరవనీయుఁ డగునల్లసాని పెద్దనకుం జూపించి తనకు రాజదర్శనంబు చేయించు మని కోరఁగాఁ బెద్దన దానిని సావకాశంబుగఁ జూచి అది రాజుకడకుఁ బోయినవిశేష సన్మానం బాకవికిం దెచ్చు నని తలంచి ఆకవికి రాజదర్శనంబు కాకుండు నుపాయ మారయుచుండెను. ఈ నూతనకవియును రాజదర్శనం బగుననుకోర్కెచేఁ దాఁ జిరకాలం బచ్చో సొంతసొమ్ము వెచ్చించుచు నుండెను. తుదకుఁ జేతనున్నధనంబు వ్యయమగుడు నేమియుఁ దోఁచక యూరకున్న నే మగు నని తనగ్రంథములో నున్న నాల్గుపద్యములం దీసి వానిం దనపరిచారకుచే నంగడికిం బంపి విక్రయించి రమ్మనెను. వాఁడును ఆపద్యంబులం గొని గ్రామంబంతయుఁ దిరుగుచు పద్యమునకు వేయి వరాలు విలువ యని కేక వేయుచు రాజుకోటలోనికి వచ్చెను. ఆదిన మా కోటలో రాజకుమారిక హర్మ్యాగ్రంబున విహరించుచుండెను. ఈకేక నాపె విని యాపద్యంబులం దెప్పించి చూచి మిగుల సంతసించి వాఁడడిగినమూల్యము నిచ్చి వానిని విలిచితాఁ బఠియించెను.

ఇట కవికర్ణరసాయన గ్రంథకర్త యీవచ్చినధనంబు పుచ్చుకుని మఱికొన్నిదినంబు లుండి అప్పటికిని రాజదర్శనంబు గాకుండుటకు లో వగచి ధనాశచే నిట్టికృతి మనుజుల కిచ్చుట తుచ్ఛం బనియు దీని నిఁక నాముష్మికార్థి నై శ్రీరంగనాథున కిచ్చి ధన్యుండ నయ్యెద నని నిశ్చయించి యచ్చోటు వాసి శ్రీరంగంబునకుం బోయి అచ్చో నద్దాని భగవదర్పణచేసి కృత్యాదిని శ్రీరంగమాహాత్మ్యంబు వచియించి ధన్యుండయ్యె నని ప్రతీతి గలదు.

అట కృష్ణరాయనికూఁతురు పద్యంబుల గ్రహియించి సంతసంబుననుండి యొకనాఁడు తండ్రి వచ్చిన నతనితోఁ జతురంగమాడఁ దొడంగె. అపు డొకపేదా (బంటు) రెండు పెద్దజంతువులనడుమం బడినఁ గని యాచిన్నది "ఉద్ధతులమధ్యఁ బేదల కుండఁ దరమె." అనుడు రా జా వాక్యమునకు నలరి ఏది పద్యమంతయుఁ జదువుమనుడు నాపె యట్లు కావించెను.

కృష్ణరాయం డాపద్యమున కలరి అది యేవారికవిత్వ మనుడునా చిన్నది తాఁ గవి నెఱుఁగ ననియుఁ దాను వాని విలిచితి ననియుఁ జెప్పిన రాజు విని విస్మితుండై దిగ్గున లేచి యాస్థానంబునకుం జనుదెంచి ఆపద్యంబు చదివి యిది యెవరికవిత్వ మనుడు నచ్చో నున్న కొందఱు కవికర్ణరసాయన మను కృతిలోని దని తెల్పి ఆకవి అచటికి వచ్చుట మొదలగువృత్తాంతంబు చెప్పిరి. ఆమాట విని రాజు మిక్కిలి వగచి అతనికి వర్తమానంబు పంపె. ఆకవియును తనగ్రంథంబు రంగనాథునకుఁ గృతినిచ్చుట మొదలగు వృత్తాంతంబులు జెప్పిపుచ్చెను. ఆమాటలు విని కృష్ణరాయం డెంతయుఁ జింతించి ఆగ్రంథంబైన తనకడకుఁ బంపినఁ జూచెద ననుడు నాకవి తనగ్రంథంబును రాజునకుం బంచె. దానిలోని విశేషంబులకు రా జెంతయు నాశ్చర్యంబు నంది హా ! ఇట్టి గ్రంథంబునకుఁ దాఁ కృతిపతి యగు భాగ్యంబు పట్టదయ్యె నని చింతించి తా నట్టిగ్రంథం బొకదానిని రచియించినంగాని తన విచారంబు పో దని నిశ్చయించి యపు డాముక్తమాల్యద రచియించి నని కొందఱ యభిప్రాయము. అట్టిగ్రంథము తన పేరిట రచియించి ప్రకటించుటయే పెద్దనకుఁ దగు నపరాధముగా నూహించి బెద్దన నట్లు నియమించె నని మఱి కొందఱయభిప్రాయము. పెద్దనయెడ రాజునకుం గల గౌరవాధిక్యముం బట్టి యిట్టి యమర్యాద కార్యంబు చేయునా యని యూహించ వలసి యున్నది. ఏది యెట్లన్నను పెద్దన యాగ్రంథము రాజుకడకుం బోక యుండఁ జేసినట్లు ప్రతీతి కలదు. ఆంధ్రకవిచరిత్రములో.

‘ఆంధ్రకవితాపితామహుఁ డయినయల్లసానిపెద్దన్న యంత యసూయాగ్రస్తుఁ డగుటకుఁ దగినకారణమేమియుఁ గానరాదు. కవికర్ణరసాయనము మొత్తముమీఁద మంచిదే యయినను పెద్దనార్యకృత మైనమనుచరిత్రముకంటె నేవిషయమునందును గుణాతిశయము కలది కాదు.’ అని యున్నదానితో నన్నియంశములలో నే నేకీభవింపను. ఆంగ్లేయులప్రభుత్వములో క్రీస్తుని పందొమ్మిదవ శతాబ్దాంతములో నభివృద్ధిలోనుండునాంగ్లేయవిద్యాప్రాబల్యము నందియు, వారినాగరకతాలక్షణములు తెలిసికొని వారితోఁ గలసి మెలసి వ్యవహరించుచుండు మన యాంధ్రపండితులు నేఁటివఱకు స్వదేశ జన్య మైనయసూయాపిశాచ గ్రస్తులు కాక తప్పించుకొనలేక యెవరైన కష్టపడి యొకగొప్ప యుద్యమము చేయుచుండ నోర్వలేక దానికి విఘ్నములు గాని లేక అది తాముం జేసితి మనిపించుకొనినఁ గొంత యెదట వానిప్రతిష్ఠ తగ్గినఁ దగ్గుం గాక యని యుద్యమించుచుండ, నాల్గుశతాబ్దముల క్రింద నున్నసర్వాధికారుల మనుకొనురాజులసభలలో నగ్రతాంబూలము గ్రహించి మించుచున్న పెద్దన్నవంటి హిందూపండితుఁడు. తనతో సమానుఁడు గాఁ గానీ తనకంటె నధికుఁడనిగానీ భావించఁదగినకవికర్ణరసాయన గ్రంథకర్త యగునారసింహకవిని రాజదర్శనార్థంబుగఁ దోడ్కోనిపోవు నని యాధునికాచారముం బట్టిచూచిన నిర్ణ యింప వశమై యుండదు. కావున నసూయయే యితనిగ్రంథము కృష్ణరాయల సన్నిధికిం బోకుండఁ జేసిన దానికిఁ గారణ మై యుండును. పెద్దనార్యమనుచరిత్రమునకంటె నారసింహ కవికృత కవికర్ణరసాయనము ఎన్నివిధముల నధికమైనదో దాని నాయిర్వురి శైలీవిశేషంబులఁ జూపుచో వివరించెదను. ఇపుడీనృసింహ కవి గ్రంథము రాజునకుఁ గృతినిచ్చుటకు యత్నించెనా అనుదానిం గూర్చి చర్చించెదను. ఎట్లన్నను :-

నృసింహకవి గ్రంథరచనావిషయము

దీనింగూర్చి నృసింహకవివలననే కొన్ని వాక్యంబులు చెప్పంబడినవి. అవియెట్లన్నను :-

"వ. అని వితర్కితపూర్వకంబుగా నపూర్వవిరచనా చాతుర్యంబు నెఱయ మెఱయ నన్వర్థనామంబుగాఁ గవికర్ణరసాయన మనునొక్క కావ్యంబు రచియింప సున్ముఖుండనై యనుకూలనాయకా న్వేషణపరాయత్తం బైనచిత్తంబున" అని యున్నది. దీనిక్రింద వ్రాసిన పద్యములో ననుకూలనాయకాన్వేషణంబు జేయుటకు మాఱుగ ముందుఁగఁ బ్రతికూలనాయక నిర్ణయంబు చేసి నరకృతినిందం జేసి పిమ్మట ననుకూలనాయకుని నిర్ణయించుకొని నట్లుగా నున్నది. నరకృతి జేయనివారలందఱు నవలంబించిన ఫక్కిక యిది కాదని ఆంధ్రభాగవతముతక్క తక్కిన గ్రంథములన్నియు సాక్ష్యమిచ్చుచున్నవి. ఆయాంధ్రభాగవతములోఁగూడ నరకృతి చేయ వలసిన యవసర మొకటి యేర్పడిన పిమ్మటనే దానిం దిరస్కరించి అట్టి తిరస్కరణమును లిఖితరూపంబుగాఁ జేయంబడినదికాని అదిలేనిది కా లేదు. అటులనేయీనృసింహకవికిఁగూడ మొదట నరకృతి చేయునవసరము కలిగినపిమ్మటనే ఆయూహ మార్చుకొనినట్లు కానుపించును. దాని నెట్లు చెప్పె ననఁగా :-

"సీ. ఆందోళికలయందు నంతరచరు లైన, శవకృతాకృతులఁ బిశాచజనుల
      వాలవీజనములఁ గ్రాలుచు నీఁగకుఁ, గాలునిఖరవర్తులాండసముల
      వేత్రపరంపరావిలకంటకాకృతిఁ, జేరఁబోరాని బర్బూరతరుల
      పరకరాలంబులై ప్రార్థింపఁ గైకోక, వాయెత్తకుండుజీవచ్ఛవముల.

గీ. శంఖనాగస్వరాదిక శ్రవణసమద, విస్ఫుటచ్ఛత్ర విస్ఫారితస్ఫటాక
    దిష్టవిషవైద్య వశవర్తిదుష్టఫణుల, ప్రభుదురాత్ముల వెవ్వాఁడు ప్రస్తుతించు.

గీ. నరగుణాంకిత మయ్యెనే నరసకృతియు, దూష్య మగు శునకో ద్వృత్తదుగ్ధ మట్ల
    హరిగుణాంకిత మయ్యె దే నరసకృతియు, హారసూత్రంబుగతి హృదయంగమంబు."

అని అప్రస్తుత మగునరకృతినింద నొనరించి పిమ్మట తా నేర్పఱుచుకొనిన కృతిపతి గుణవిశేషముల నీక్రింది విధంబునం జెప్పె. ఎట్లన్నను :-

"సీ. జగదేకపతి యయ్యు సకలాభిగమ్యుండు, సర్వశాసకుఁ డయ్యు సదహృదయుఁ
      డభిమతప్రదుఁ డయ్యు నంజలిసాధ్యుండు, పరిపూర్ణుఁ డయ్యును బ్రణుతికాముఁ
      డతిగతేంద్రియుఁ డయ్యుననిమేషదృగ్దృశ్యుఁడనియోజ్యుఁడయ్యు భక్తానుయాయి
      సాక్షి యయ్యు నతాపచారానభిజ్ఞుఁడు, సముఁ డయ్యు నార్తరక్షాపరుండు

గీ. భద్రగుణనిధి దుర్గుణప్రతిభటుండు, సముఁడు నధికుండు లేనియుత్తమపరుండు
    వెదకి చూచిన శ్రీరంగవిభునివంటి, ప్రభువు నత్యంతసులభుండు పరుఁడు గలఁడె.

శా. జ్ఞానప్రౌఢమహాజనాధికవచస్సంస్తూయమానుండు ల
     క్ష్మీనాథుండు మదల్పవాక్య రచనాస్వీకర్త కాకుండునే
     నానాభూపతుల్లెఁ గానుకలు రత్న శ్రేణు లర్చించగాఁ
     ధానాముష్టిముచుం గుచేలుఁ గరుణన్ ధన్యాత్ముఁ గాఁ జేయఁడే."

అని సకలలోక నాయకుం డైన శ్రీరంగనాయకుండు కృతినాయకుండు గా నిశ్చయుంచి

అని యున్నది, పైపద్యసందర్భముతో దీనిని బరిశీలించి చూడఁ గా నీకవి మొదట నీగ్రంథము నరకృతి చేయ యత్నించి యుండె ననియు నది యేకారణముననో మాఱి దైవకృతి కంగీకరించె నని చెప్పెడు లోకప్రతీతి సరియైనదిగానే కానుపించుచున్నది.

గ్రంథరచనాప్రకారము.

ఈ నృసింహకవి తా నేశాఖాబ్రాహ్మణుఁడైనదిగానీ లేక బ్రాహ్మణుఁడైనదిగానీ చెప్పియుండలేదు. అట్లుండుటంబట్టి నృసింహకవి యేవర్ణస్థుఁ డైనదియును జెప్ప వీలుపడదు. ఇతఁడు బ్రాహ్మణుఁ డనియు నియోగి యనియు లోకములో నున్న వాడుకనే నమ్మవలసినది గా వచ్చుటంజేసి అటు లై యుండిన నేమతస్థుఁ డనుదానిం దెల్పుటకు గా నాతనివలఁ గృత్యాదిని చేయంబడిన యిష్టదేవతాస్తోత్రపాఠములను బట్టి నిర్ణయించెదను. అందులో మొదట విష్ణుని, పిమ్మట బ్రహ్మను, శంకరుని, వినాయకుని, సరస్వతిం బ్రార్థించె. ఇది స్మార్తులుగానుండుబ్రహ్మక్షత్రియులు చేయుస్తోత్ర ప్రక్రియ యై యున్నది. కాని భట్టు పరాశర శిష్యుండ నై చెప్పుటంజేసి యితఁడు నల్లసాని పెద్దనవలె స్మార్తుఁ డయ్యును వైష్ణవేష్టి చేసికొని రామానుజసిద్ధాంతప్రధానుఁ డై యుండిననియోగి యని యూహింప నై యున్నది.

సుకవిస్తుతి, కుకవినిరాకరణము.

ఈకవి యేకారణముననో ప్రాచీనకవుల నేరిం బ్రశంసించి యుండఁడాయెను, ఆస్థలములలోఁ గొన్ని సుకవి లక్షణములును, కుకవి లక్షణములం జెప్పి ఆనడుమ సత్కావ్యముల యొక్కయు దుష్కా వ్యములయొక్కయుఁ బ్రసంగంబు చేసి అందులోఁ దనకావ్యవిశేషములఁ గొన్నిటిం జెప్పెను. ఈ ఫక్కిక ప్రాచీననవీన కావ్యములలోఁ జూపట్టనిదై మురారికవియొక్క ఫక్కికయై కాన్పించు. పైపద్యములలోఁ సుకవిసంబంధము లగుపద్యముల ముందు వివరించెదను. ఎట్లన్నను :-

"చ. మనమునఁ గొన్న నెవ్వగలు మాన్పి ఘటింతు రకాండసమ్మదం
      బనఘకథాముఖంబున హితాహితబోధ మొనర్తు రింపుగాఁ
      గనుఁగొనుకంటె నద్భుతముగా నెఱిగింతు రతీంద్రియార్థముల్
      ఘనమతు లెల్లవారికి నకారణబంధులుగారె సత్కవుల్."

ఇఁకఁ గువికనిరాకరణ మీక్రింది విధంబునం జేయుచున్నాఁడు . -

ఉ. అంతము గాఁగ శబ్ద హృదయజ్ఞులు గా రుచిరప్రయోగముల్
    వింతలుగాఁ బ్రబంధముల వీథులు ద్రొక్కఁగలే రశక్తులై
    దొంతరజిల్లిబొంత లెడ దూర్చి గతార్థమె కూర్చుదుష్కవి
    భ్రాంతుల సందడిం దఫవఁ బాసె రసజ్ఞులకుం గవిత్వముల్. అని

కవిత్వవిశేషములు.

పురాణకవులలోఁ దిక్కనసోమయాజివలెఁ గావ్యకవులలో నీ నరసింహకవి స్వోద్దిష్ట కావ్యములలోఁ గల్గెడుకొన్ని విశేషములు వివరించెను. దానియభిప్రాయ మారయ నావఱకుఁ గల్గినకావ్యములలో నట్టి విశేషములు లే వనియు నవి ముఖ్యములు కాకున్న నాకావ్యములలోఁ బ్రౌఢిమ తక్కువగుననియు వారియంతరం గాభిప్రాయము గా దోఁచెడిని. నన్నయ భట్టుకవనంబులో లేనిమెఱుఁగు లెట్లు తిక్కనసోమయాజి తన కవిత్వములోఁ దేఁగోరెనో అటులనే నృసింహకవి అల్లసాని పెద్దనకవిత్వములో లేనిమెఱుఁగులు తనకావ్యములోఁ దెచ్చెదనని కొన్ని విశేషములఁ బ్రదర్శించినట్లు కానుపించును. పురాణకవనముఁ లో నన్నయతిక్కనల కెట్టితారతమ్య మున్నదో ప్రబంధకవిత్వములో పెద్దననారసింహకవుల కట్టి భేద మున్నదని యూహింపవలసియుండును. ఇట్లు చెప్పుటవలన నన్నయపెద్దనల కవిత్వములో లోపము లున్న వని చెప్పుట కాదు. ఆకవు లిర్వురకు నవ్యవహితముగ నట్టికావ్యములే రచియిం చిన తిక్కన నారసింహకవులు అంతకంటెను మెఱుఁగులు తెచ్చి రనియు నట్టిసంగతి ప్రకాశముగఁ జెప్పినచోఁ బరనింద కాకున్న నలౌక్యమనియు నెంచి మఱియొకచమత్క్రియామార్గమున తమతమ సామర్థ్యంబులు వెల్లడించిరనియుఁ జెప్ప నొప్పియుండును. ఆపద్యము లెట్లున్న వన :-

"గీ. కావ్య మత్యాద్య మైన సత్కావ్య మింక,నుక్తకావ్యంబయేఁ బునరుక్తి దెచ్చుఁ
     గాన కవితాభిముఖుఁ డైనఁ గవివరునకు, మిశ్రకావ్యంబె కావ్యమై మెచ్చుఁ దెచ్చు.

క. నేరిచినసుకవి కృతిచే, బే రెఱిఁగించికొని జగతిఁ బెం పగు టొప్పున్
    నేరక కృతి చెప్పుట తగ, నేరమి యపకీర్తి జగతి నిలుపుట గాదే.

క. ఏరసము చెప్పఁబూనిన, నారస మాలించువాని నలరించని యా
    నీరసపు కావ్యశవముల, దూరముననఁ బరిహరింపుదురు నీతిజ్ఞుల్.

చ. ఫణుతుల రెంట మూఁట నొకపద్యముఁ గూరుచువారు లక్ష్యల
    క్షణసహకావ్యనిర్వహతఁ గల్గుట చిత్రముగాని యట్లపో
    ఫణమణిమాత్రధారు లగుపాము లసంఖ్యము గాక తత్ఫణా
    మణివిధవిశ్వభూభృతిసమర్థుఁడు శేషుఁడు గాక కల్గునే,

క. ఆకుల నిడియెడుకవితా, పాకంబులు మొదలు చెడినప్రాఁతప్పుల నా
    లోకము జిహ్వాంచలములె, యాకులుగా నుండు నెవ్వి యవియొకొ కవితల్.

క. పరభుక్తము లైనయలం,కరణముల జుగుప్స, లేక గైకొని పదవి
    స్ఫురణంబు చూపుకుకవితఁ, బరికింపఁగ లజ్జ లేనిబానిస గాదే.

క. కలకంఠ కలన చూపక, కలకంఠం బూరకున్నఁ గాకమ కాదే
    కవిత నిజవాగ్విలాసం, బలరింపనితజ్ఞుఁడైన నజ్ఞుఁడు కాఁడే.

చ. ఖలుఁ డిల దప్పులే వెదకుఁ గావ్యరసానుభవంబుఁ జేయలేఁ
    డొలుకులు గోరు గాక ముద మూనఁగ గర్దభ మొంద వేర్చునే
    మలయమరుద్విధూతమధుమాసవికస్వరకేసరావలీ
    కలితపరాగయోగపరికల్పిత పేశలతల్ప సౌఖ్యమున్.

క. ఎల్లరు మెచ్చని మత్కృతి, నుల్లంబున మెచ్చుఁగాత యొకఁ డుష్ట్రకులం
    బొల్లనిపల్లవితామ్రముఁ, గొల్లలుగాఁ బొగడ నొక్క కోయిల లేదే.

గీ. తప్పుగల్గెనేని తారె తెల్పి రసజ్ఞు, లస్మదీయకవిత ననుమతింతు
    రించు కలుక గలిగెనేఁ దేర్చి ప్రేయసి, నుల్లమున వరింప కోర్తు రెట్లు."

పైపద్యముల వివరించితిని గావున నిఁక వానిలోని సందర్భము నాలోచింపవలయును. దీనిలోఁ గవిత్వము చెప్పఁ బూనినవాఁడు ప్రాచీనమార్గము నవలంబించిక పోరాదనియు న ట్లవలంబించు నపు డది పునరుక్తి యగు ననిపించుకొనునట్లు చెప్పరా దనియును, నేర్పుగలవాఁడే కావ్యము చేసిన ప్రతిష్ఠ కల్గునుగాని నేర్పు లేనిచోఁ గవిత్వము చెప్పుట తన తెలివి లోపమును ప్రపంచమందు స్థిరపర్చి యుంచుట యగుననియును, నేర్పు కల్గి కవిత్వము చెప్పువాఁడు తా నేరసముం జెప్పఁబోవుచున్నాఁడో ఆరసమును బైకి నుబికించి దానివలన నితరుల రంజింపఁ జేయ వలయు ననియు, నట్లు చేయ లేనిచో రసజ్ఞు లాకావ్యముం దిలకించక పరిహరించెద రనియును, ఫణామండితము లగుపాము లసంఖ్యము లై యుండినను విశ్వవిశ్వంభరాభరణదక్షత యొక శేషునకే కాక యితరఫణులకు లేనట్లు పద్యము లల్లఁగల మనుకొనువా రందఱు ప్రబంధములు రచియింపలే రనియు, నితరులు చెప్పిన గ్రంథములలోని యలంకారాదికములు దొంగిలి తాను గ్రంథము చేసినట్లు చెప్పుకొనువాఁడు లజ్జాహీనుఁడు గాఁ దెలియఁబడుననియు, నెంత రసజ్ఞుడైనఁ దనకుఁ గలరసికత్వమును వాగ్విలాసమును జూపింపకున్న నజ్ఞుఁడుగా భావింపఁబడు ననియును, గావ్యములలోని తప్పులు వెదకి సంతోషపడువాఁడు దుర్మార్గుం డనియును, లేమావిచిగురు కోకిలమునకువలె నాకవిత్వ మొకరసికునకు నైన సంతోషకారి కాకపోదు. రసికులు తప్పు గల ప్రియురాలిం దేర్చి సంతసింపం జేయునట్లుగా నాకవనంబునఁ ద ప్పున్న దిద్ది దానిం దిలకించెదరు గాక అనువఱకుం జెప్పియుండెఁగావున నప్పుడు తనకవిత్వములోఁ దప్పున్నట్లు తానే యొప్పికొనిన ట్లగుకావున నట్టి సందియము తనకవిత్వములో లేదనియును, తనకవిత్వములో నేవర్ణనఁ దాఁ జేయుచున్న నట్టికావ్యరసము స్ఫురియించుటయేకాక ఆయాపట్లు వినెడువారికిః దమ తమ వర్ణాశ్రమ వ్యాపారముల మఱపు గల్గి రసపారవశ్యంబున కేవలము తద్వ్యతిరేకధర్మావలంబనము కలుగుననియును జెప్పుటకై యీక్రిందిపద్యముం తెల్పె. అది యెద్దియనిన :

"గీ. యతి విటుఁడు కాకపోవునే యస్మదీయ, కావ్యశృంగారవర్ణనాకర్ణనమున
     విటుడు యతి కాక పోవునే వెస మదీయ, కావ్యవైరాగ్యవర్ణనాకరణనమున."

ఇ ట్లున్నదానికి నాంధ్రకవుల చారిత్రములో వ్రాయంబడిన యీక్రిందివాక్యము లనాలోచితము లని చెప్పవలసియున్నది. అవి యెట్లన్నను :-

"ఆనృసింహకవి తనకవిత్వసామర్థ్యముం గూర్చి గ్రంథాదియం దాత్మస్తుతిఁ జేసుకొనియున్నాఁడు, మఱియుఁ దక్కిన కవులవలెఁ గాక కుకవిధూషణముం బెక్కు పద్యంబులం జేసియున్నాఁడు. కాఁబట్టి యితఁడు స్వాతిశయభావము గలవాఁడై నట్లు కన్పట్టుచున్నాఁడు."

అని యున్నది. ఈవిషయములోఁ బెద్దనకవి యింతకంటె శ్లాఘాపాత్రుఁ డగు నని చెప్పవచ్చునేమో ఆసంగతి పెద్దనగ్రంథంబునుండి వెదకి చూతము. అందులోఁ గుకవినంద యున్నది. ఎట్లనఁగా :-

"మ. భర మై తోఁచుకుటుంబరక్షణకుఁగా బ్రాల్మాలి చింతన్ నిరం
       తరతాళీదళ సంపుటప్రకరకాంతారంబునం దర్థపుం
       దెరవాటుల్ తెగి కొట్టి తజ్జ్ఞపరిష ద్విజ్ఞాతచౌర్యక్రియా
       విరసుం డై కొఱతం బడుం గుకవి పృథ్వీభృత్సమీపక్షితిన్."

       స్వప్రజ్ఞాప్రకటనముంగూడ నీక్రిందివిధంబునఁ జేసికొనియె.

"క. హితుఁడవు చతురవచోనిధి, వతులపురాణాగమేతిహాసకథార్థ
      స్మృతియుతుఁడ వాంధ్రకవితా, పితామహుఁడ వెవ్వ రీడు పేర్కొన నీకున్."

ఈపద్యము కృతిపతి చెప్పిన ట్లుండుటంజేసి అది పెద్దనార్యుని కవిత్వము కా దనిగానీ యది యాత్మస్తుతి కా దనిగానీ చెప్పవలనుపడునా? ఇంతియకాక ఆశ్వాసాంత గద్యములో నున్న వాక్యంబు లాత్మస్తుతిని దెల్పునవి కాకపోవునా ఆగద్య మెట్లున్న దన :-

"ఇది శ్రీమదాంధ్ర కవితాపితామహ సర్వతోముఖాంక పంకజాక్ష పాదాంబుజాధీనమానవేందిందిర నందవరపు వంశోత్తంస శఠగోపతాపసప్రసాదాసాదిత చతుర్విధకవితామ తల్లికాల్లసానిచొక్కయమాత్య పుత్త్ర పెద్దనార్యప్రణీతము"

అని యున్నది. నృసింహకవి పెద్దనార్యునివలె నాత్మస్తుతి అతిమాత్రముగఁ జేసి యుండలేదే. ఇట్లుండఁ బెద్దనకంటె నధికముగ నరసింహకవి నిందాపాత్రుఁ డని చెప్పుట సహేతుకము కా దనిచెప్పవలయును.

కవిత్వవిషయము.

ఇఁక నాంధ్రకవులచరిత్రములోని యింకొకయాక్షేపణకు సమాధానము చెప్పక తీఱదు. అందులో

"కవివర్ణ రసాయనము మొత్తము మీఁద మంచిదే అయినను, పెద్దనార్య కృత మయిన మనుచరిత్రకంటె నే విషయమునందును గుణాతిశయము కలది కాదు."

అనియున్నది. దీనికి సమాధానము మిక్కిలి శ్రమలేకయే అచ్చటచ్చటనుండు సమానాంశములలోనివర్ణనలు సూపినం జాలియుండును. ప్రస్తుత మీయుభయుల కవిత్వశయ్యాదులం గూర్చి చూపందలఁచు కొని యున్నాఁడను గనుక దీనిలోనే పైరెండువిషయములుగూడ చూడఁదగును. అంతవఱకును పెద్దనకంటె నృసింహకవి గుణాథికుఁ డని కానీ లేక నృసింహకవికంటెఁ బెద్దన గుణాధికుఁడనికానీఁ నిర్ణయింపక యుంచెదను.

పురవర్ణనము.

"మ. వరణాద్వీపవతీతటాంచలమునన్ వప్రస్థలీచుంబితాం
       బర మై సౌధసుధాప్రభాథవళితప్రాలేయరుఙ్మండలీ
       హరిణం బై యరుణా స్పదం బనఁగ నార్యావర్తదేశంబునం
       బుర మొప్పున్ మహికంఠహారతరళస్ఫూర్తి న్విడంబించుచున్." మను

"సీ. జాతరూపమనోజ్ఞజాతరూపం బైన, కోటచే వలయాద్రి నోటుపఱిచి
      మధుసుధారసపూరమధురనీరం బైన, పరిఘచే వారాసి భంగపఱిచి
      నవరత్న చిత్రాభినవయత్న కములైన, యిండ్లచేఁ గనకాద్రి యేపుగఱచి
      కాంతనిర్మలచంద్రకాంతబద్ధము లైన, కుట్టిమంబుల ధాత్రి కొంచెపఱిచి
      కమలగర్భుండు తన సృష్టి గాఁ ద్రిభువన, కోశగర్వంబు నడఁగించుకొలఁది దీని
      వేడ్క నిర్మించె ననఁ బొల్పు విమతహృదయ, ఘట్టణం బైనసాకేతపట్టణంబు."
                                                                                      కవిక. ర.

మనుచరిత్రములో నల్లసానిపెద్దన పురవర్ణన తోఁ గల్పిబ్రహ్మ క్షత్త్రవణిక్ఛూద్రులను వెలయాండ్రను ఒక సీసపద్యమున వర్ణించెను. ఆపద్యమెట్లన్నను :-

సీ. అచటివిప్రులు మెచ్చ రఖిలవిద్యాప్రౌఢి, ముది మదిదప్పిన మొదటివేల్పు
    నచటిరాజులు బంటు నంపి భార్గవు నైన, బింకానఁ బిలిపింతు రంకమునకు

   నచటిమేటికిరాటు లలకాధిపతి నైన, మును సంచి మొద లిచ్చి మనుప దక్షు
   లచటినాలవజాతి హలముఖాంత విభూతి, నాదిభిక్షువుభైక్ష మైన మాన్చు
   నచటివెలయాండ్రు రంభాదు లైన నొరయఁ, గాసెకొంగున వారించి గడపఁగలరు
   నాట్యరేఖాకళాధురంధరనిరూడి, నచటఁ బుట్టినచిగురుఁగొమ్మైనఁ జేచ."

కవికర్ణ రసాయనములో బైని సంగ్రహముగా వర్ణింపఁబడిన పట్టణాంగములు విపులములుగాఁ జేసి వర్ణింపఁబడియె. అందలిపద్యము లన్నియు వివరించుట గ్రంథవిస్తర మగుటయుఁ, జారిత్రోపయోగము కాకుండుటయు నగును గావున నందులవివరముమాత్రము తెలిపి చమత్కారము లగు నొకటి రెండుపద్యములు వివరించెదను. ఎట్లన్నను.

పురవర్ణముతోఁ జేర్చి 1. పట్టణముపై సంచరించు సూర్యచంద్రులను, 2. నక్షత్రములను, 3. బ్రహ్మక్షత్త్రియ వైశ్యశూద్రులను, 4 పట్టణముననుండు వారణములను 5. ఉత్తమాశ్వములను, 6. క్రీడామందిరములను, 7. తన్మందిరవిహారులను, 8. వార యువతులను, 9. పుష్పలావికాజనమును; 10. ఉద్యానవనములను; 11. సరస్సులను, 12. కోడె గాండ్రను చెప్పెను.

ఇట్లుగా వర్ణించిన నరసింహకవియొక్కయు పెద్దనార్యునియొక్కయు దృష్టిలోఁ బుర మెట్లుగా నున్నదో అందు వర్ణింపవలసిన వర్ణనలు పెద్దనార్యునివలన నెన్ని వదలివేయంబడియేనో చూడవలయును. పెద్దనార్యుఁ డొక సీసపద్యములోఁ జెప్పిన పైవర్ణనలను నృసింహకవి యిరువదిపద్యములతో నతిప్రౌఢముగా వర్ణించి చెప్పెను. అట్టి వర్ణనలలోఁ బుష్పలావికావర్ణన, సరోవరవర్ణనల పద్యముల నిట వివరించెదను. ఎట్లన్నను :-

పుష్పలావికలు.

సీ. కరములకందిచ్చు విరులబంతులకంటె, వెడఁ దోఁచుచన్నులు వేడ్కఁ బెనుప
    మవ్వంబుఁ గొననెత్తుపువ్వుటెత్తులకంటెఁ, గరమూలరుచి చుడ్కిగమిచితిగువ
    కోరిన నొసఁగెడుకొసరుపువ్వులకంటె, మొలకనవ్వులు డెందములు గరంప
    నిండారునెలవులనెత్తావిగమికంటె, సుముఖసౌరభములు చొక్కుబెనుప

తే. జట్టికాండ్రఁ దమదు సరససుందరవిలా,సములచేతఁ దార జట్టికొనుచుఁ
    బురమువీథులకును భూషణప్రాయ మై, క్రాలుఁ బుష్పలావికాజనంబు.

సరస్సులు

"చ. అలికులకుంతలంబులు, రథాంగకుచంబులు, పద్మవక్త్రముల్
      గలరవపద్మినుల్ గడువికాసముతోఁ దమయందు సక్తలై
      యలరువిహారవేళఁ దము నంటినకాంతల మేనికస్తురిం
      జులకన జోడుముట్ట సరసుల్ సరsu ల్బలె నొప్పు నప్పురిన్."

బాల్యవర్ణనము.

"చ. మఱియు నతండు సంయమిసమాజవినిర్మితజాతకర్ముఁడై
      నెఱిఁ బరివర్ధి తుండు నుపనీతుఁడు నై వివిధాయుధంబులం
      గఱకరియై రణస్థలుల గద్దఱి యై నిగమార్థ వేదియై
      నెఱతనకాఁడు నై మెఱసె నిర్మలకాంతివిలాసరేఖలన్." మను.

అని స్వరోచి పుట్టె నని చెప్పినపద్యము వెంబడినే పై వర్ణనము చేయంబడినది.

"గీ. జాతవేదుండు వీజనాశక్తివోలె, నుష్ణకరుఁడు తపర్తుసంయుక్తిఁ బోలె
      నక్కుమారుఁడు జాతకర్మానుషక్తి, సమధికాశ్చర్యతేజమును బొంది.

సీ. కను ఱెప్ప యిడనెఱుంగనిచూడ్కిఁ జూచుచు, జిగివీఁపుదోపఁబోరగిలఁబడుచుఁ
    గరజానువుల చతుశ్చరణుఁ డై తిరుగుచు, శిశునిదర్శితదృఢస్నేహుఁడగుచు
    భాసురమితపదన్యాసంబు చూపుచు, హ్రదవిహారమున దుర్వారుఁడగుచు
    జనకజానందబీజత్వంబుఁ గైకొంచు, గుణముల ముసలినాఁ బ్రణుతిఁ గనుచు

తే. వసననిరపేక్ష నిచ్ఛాప్రవర్తి యగుచు, హయసమారోహణంబు సేయంగఁగలిగి
    రాసుతుఁడు తనశైశవక్రమదశావ,తారములచేతఁ బూరుషోత్తమతఁ దెలిపె.

క. కాలోపనీతుఁడై భూ,పాలతమాభవుఁడు గురునిపాలన్ బ్రచుర
   వ్యాలోలకాకపక్ష, శ్రీలక్షితుఁ డగుచు నభ్యపించెన్ విద్యల్.

క. మందానిలుచే నలరుల, కందువ గని తావు లెల్లఁ గైకొనునవిమా
    డ్కిం దగుగురువశమున నృప, నందనుమతి శాస్త్రవాసనల దూఁకొనియన్.

సీ. తూరి బాల్యముఁ బోవఁద్రోచిప్రాయంబు వె,ట్టినకవాటంబుఁ బాటించె నురము
    జయరమాలంబనశాఖ లై బాహువు, లాజానుదీర్ఘంబు లధిగమించె

    వదనచంద్రునిఁ గొల్చి బ్రదికెడు చీఁకట్ల, గతి నవశ్మశ్రురేఖలు జనించె
    నర్థిధైర్యములపై నడరు కెంపునుబోలె వీక్షణాంచలముల నెఱ్ఱతోఁచె

గీ. సుందరత్వమునకుఁ జో టిచ్చి తాసంకు,చించె ననఁగ గడుఁ కృశించె నడుము
    బసవరాత్మజునకు సకలలోకోత్సవా, పాదియైనయౌవనోదయమున."

దీనిలోఁ మనము చెప్పవలసిన దేమున్న దనఁగా నలసానిపెద్దనార్యునివలన మనుచరిత్రములోఁ జూపింపఁబడిన, 1. జాతకర్మము, 2. ఉపనయనము, 3. విద్యాభ్యాసము, 4. యౌవనావిర్భావములు కవికర్ణరసాయన కవివలనఁ బ్రత్యేక ప్రత్యేకము పద్యములతో నతిప్రౌఢ వర్ణనలఁ బ్రకాశింపఁజేయఁబడినవి. దీనింబట్టియుఁ బైపురవర్ణనముం బట్టియు మనుచరిత్రకవికంటెఁ గవికర్ణరసాయనకవి వర్ణనాంశములు పెంచి కథాభాగమును దగ్గించె నని సూచింపఁబడుచున్నది.