కవి జీవితములు/శిష్టు కృష్ణమూర్తి కవి

వికీసోర్స్ నుండి

శ్రీరస్తు.

కవిజీవితములు.

17.

శిష్టు కృష్ణమూర్తి కవి.

ఇతఁడు ద్వ్యర్థికావ్యకవి యగు ల. కవియొక్క కాలీనప్రసిద్ధ కవి. ల. కవితో నెదిరింపఁదగుకవిత్వసమర్థతయును, ల. కవి యెదిరింపలేని సంగీతప్రజ్ఞయుఁ గలవాఁ డని యీకృష్ణమూర్తికవి చెప్పఁదగి యున్నాఁడు. అయినను సర్వకామదాపరిణయపూర్వపక్షములచేఁగానోవు నీకృష్ణమూర్తికవి కవిత్వవ్యాపారమునకంటె సంగీతవ్యాపారములో నెక్కుడు ప్రతిష్ఠ సంపాదించెను. నేఁటికిని ఆంధ్రదేశమున నీకృష్ణమూర్తి కవి శిష్యులు పెక్కండ్రు సంగీతములోను బెక్కండ్రు సాహిత్యములోఁ గూడ బ్రసిద్ధు లగుముదుసలిపండితులుగా నున్నారు. ఈకృష్ణమూర్తి కవిని వృద్ధావస్థలో నీచరిత్రకారుఁడు తనబాల్యములో ననఁగా ఆ|| 1870 సంవత్సరప్రాంతములోఁజూచియున్నాడు. అప్పటి కాకవికి 70 సంవత్సరములకుఁ బైగా నుండినట్లు కాన్పించెను. ఎటుల నైన నీకవి జననకాలము (క్రీ. శ. 1800-77) = 1723 శాలివాహన సంవత్సరప్రాంతమై యుండును. ఈపండితుఁడు సర్ వాల్టరు ఎల్లియట్టుదొర (Sir Walter Elliot) దొర చరిత్రవిషయమై చేసినయుద్యమములో సహాయభూతుఁడుగా నుండుటంబట్టి యీచారిత్రోద్యమములోఁగూడ సహాయభూతుఁడైన వాఁడే అనిచెప్పవలసియున్నది. పైదొర శిలాశాసన పరీక్ష చేయునపు డీకృష్ణమూర్తికవి శాసనాక్షరశోధకుఁడై యుండెననియును ద్రాక్షారామములో నుండెడునసంఖ్య మగుశిలాశాసనములన్నియు నీకవివలననే యెత్తి వ్రాయంబడెననియు సంప్రదాయజ్ఞాభిప్రాయము. ఈకవికాఁపురస్థలము గోదావరీమండలములోని రామచంద్రపురము తాలూకాలోఁ జేరినగొల్లపాలెముగ్రామము పిత్రార్జితస్థల మనియు నీతఁడు బాల్యమునం దచ్చటనే యుండి విద్యాభ్యాసము చేసి తదనంతరము రామచంద్రపురము వచ్చి కొన్నిదినము లుండెననియు వాడుకొనంబడు. ఈకవి ఆంధ్రదేశములో నుండుసర్వభాగములం జూచి అచ్చటచ్చటఁ గొన్నికొన్నిసంవత్సరములు నివసించియుండెను. రామచంద్రపురమునుండి విశాఖపట్టణము మండలములోని కొన్నిగ్రామములలోఁ గొన్ని సంవత్సరము లితఁడు నివసించెను. అనంతపురము చిత్తూరుజిల్లాలోని కాళహస్తిలోఁ గొన్నిసంవత్సరములు నివసించెను. పిమ్మట గోదావరీ మండలములోని పెద్దాపురము తాలూకాలో జగ్గంపేటగ్రామములో తుదిని మాడుగులు గ్రామములో స్థిరపడెను. పైగ్రామములలో నుండెడు జమీన్ దారు లీకవిశిఖామణిని ఆదరించి యుండఁగోరినమీఁదట నీతఁ డాయాస్థలములలో నివసించినట్లుగాఁ గానిపించును. కృ. కవిని మాడుగులు కృష్ణభూపతి విశేషమాన్యక్షేత్రము లిచ్చి నిల్పఁగా నా గ్రామములోనే నిర్యాణము నందెను.

కృ. కవి లాలీనులు.

కొంచె మెచ్చుతగ్గుగాఁ గ్రీస్తుశకము పందొమ్మిదవశతాబ్దము యొక్క మొదటిమూఁడుఖండములలోనిపండితులును, కవులును కృ. కవి కాలీనులనియే చెప్పవలసియున్నది. అందులోఁ గృష్ణమూర్తికవి యుత్తరార్ధవయఃకాలములోఁ బరవస్తు చిన్నయసూరియును, ఓగిరాలవారిలో ద్విరేఫవర్ణ దర్పణకారుఁ డగురంగనాథకవియును, నతని పితృవ్య పుత్రుఁడును సుమనోమనోభిరంజనప్రబంధకర్త యగు నోగిరాల జగన్నాథకవియును, పై యిర్వురికిని గురుం డగు మంత్రిప్రగడ. వేంకటరామన మంత్రియును కాలీను లని చెప్పవలసియున్నది. ఆనాఁటికిఁ గృ. కవియును వేంకటరామన మంత్రియును సంగీత సాహిత్యవిద్యాప్రవీణు లగు గురువులుగా నుండిరి. రంగ నాథకవి మొదలగువారు తమగురుఁ డధికుఁడని ప్రకటించువారుగను, కృ. కవి యధికుఁ డని అతనిశిష్యవర్గముం జెప్పుకొనుస్థితిలో నుండిరి. అందుఁ గృ. కవి శిష్యులు పెక్కండ్రు వైదికశాకలోనివారును, వేంకటరామనమంత్రి శిష్యులు పెక్కండ్రు నియోగిశాఖలోని వారు నైయుండిరి. రెండవ తెగవారందఱును కోరంగి, తాళ్లరేవు, నీలపల్లి, సీతారామపుర మనుకోరంగిగ్రామ సమీపవాసులు. కృ. కవి నీలపల్లి మొదలగు స్థలములలోనికిం బోవునప్పటికి పైరంగనాథ జగనాథకవులు కృ. కవితోఁ బ్రసంగించి రనియు, నందుఁ గృష్ణక మూర్తకవికే పరాజయము కల్గె నని జగన్నాథకవివలనఁ జరిత్రకారుఁడు తెలిసికొనెను. ఆప్రసంగముయొక్క వివరమును జ్ఞాపకముంచుకొనలేకపోతి నని విచారించుచు చారిత్రకారుఁడు కృ. కవి యొక్క యితరవిశేషముల వ్రాయును.

కృ. కవి. విద్యావిశేషము.

ఈకవి యాంధ్రమునకంటెను. గీర్వాణమందు విశేషప్రజ్ఞ కలవాఁ డని చెప్పవలసియున్నది. అందు సిద్ధాంతకౌముదీ వ్యాకరణమం దీతనికి సంపూర్ణజ్ఞానము కల దని వాడుక గలదు. ఆంధ్రంబునం గూడ నసాధారణకవిత్వప్రజ్ఞ కల దని ప్రబంధకవి యగుటయే కాక ఆవఱలోఁ బ్రసిద్ధిం జెందియున్న పిండిప్రోలు. లక్ష్మణకవితో సమానుఁడ ననిపించుకోవలయు నని చేసిన విద్యాప్రసంగమువలన నతని కాలీన కవులలోఁ బెక్కండ్రకంటె నధిక ప్రజ్ఞాశాలి యని చెప్పవలసియున్నది. ఆశుకవిత్వమునకు కృ. కవి. మిగులఁ బ్రసిద్ధుండు. పురాణమును, ప్రత్యక్ష, బాహాట, పాంచాల, నటన శయ్యలఁ జదువుట యితనినాఁడే ప్రసిద్ధివడసెను. ఇతనికంటెం గొంచెము పూర్వుఁ డగువక్కలంకవీరభద్రకవి తన ప్రజ్ఞావిశేషంబు లితరులు వర్ణించినట్లు చెప్పుకొను పద్యములలోఁ

"బ్రత్యక్ష బాహాట పాంచాల నటనలఁ జదివింప నేర్పుఁదాఁ జదువనేర్చు"

నని చెప్పుకొనియుండిన నిప్పటికిఁ బ్రస్తుతములోఁ బురాణములు చదువువారందఱును సంగీత విద్యాప్రవీణుం డగు నీ కృ. కవి శయ్యనే యవలంబించిచదువుచున్నారు. ఈ కృ. కవికిఁ గలప్రజ్ఞలలో మఱియొక గొప్పప్రజ్ఞ యేమనఁగా. ఏపురాణముఁ జదువుచున్నను ఏ రసము గలపట్టు చదువుచున్నను ఆగ్రంథ మటు నిల్పి తరువాయి గ్రంథమును స్వకపోలకల్పితముం జేయు మనఁగా నటనుండి అభాగములో నుండుశయ్యతో నారసములోనే చాలు నని చెప్పవఱకు నాశుధారను గవనము చెప్పుటయును అది చాలించి తిరుగ నటుపై నుండు కథాభాగముఁ జదువఁగా నించుకయైన శైలీభేదముగాని, రసభేదముగాని లేకుండుటయుఁ గల్గె నని అనేకపండితులు చూచి వచ్చి చెప్పిన వృత్తాంతమై యున్నది. ఈప్రజ్ఞ అసాధరణము. వసుచరిత్ర కావ్యమునకు నీపండితుఁ డెన్మిదియర్థములు చెప్పుచువచ్చె నని వాడుక గలదు. ఈకవి భళిరకవి వేల్పుశతకములోఁగొఱఁతవడియున్న పద్యములఁ బూర్తిచేసె ననియు నతనిశయ్య యాపూర్వపద్యములశయ్యతో సమానముగా నుండె ననియు నెన్నంబడును.

కృ. కవిగ్రంథవివరము.

ఈ కవియు ననేకచాటువులు చెప్పినట్లును వానివలన నాయాకృతిపతులు విశేష బహుమానాదికముం జేసినట్లును వాడుక గలదు. ప్రస్తుతములో దొరికినవఱకు దీనిలోఁ బ్రకటించెదను. ఇట్టిచాటుకవిత్వము చెప్పుటయేకాక సంగీతములోఁ గూడ ననేకకృతులును, వర్ణములును గాయకుల కుపయోగించునట్లు విశేషముగా రచియించెను. వానిలోఁ బెక్కులు కృ. కవితమ్మునికుమారులకడ జగ్గమపేఁటలో నున్నవి. గోదావరిమండలములో నుండువైణికులు పెక్కండ్రు వానిని నేర్చుకొని యున్నారు. వసుచరిత్రకారుఁ డగురామభూషణుని సంగీత సాహిత్యప్రజ్ఞ లెట్టివో ఆధునికులలోఁ గృష్ణమూర్తికవియు నట్లే యున్నవి. వీణా విషయములో నతనినాఁడు లోకోపకారకార్యములు జరిగిన ట్లీ కవినాఁడు వీణోపయోగము లగుననేకవిశేషములు చేయంబడినవి. అవి కాలాంతరమున నైన లోకములో సర్వవైణికులకు లభ్యములై విశే షోపయోగకారులు కాఁగోరుచున్నాము. ఈయనప్రబంధములు కొన్ని రచియించె నని వాడుక గలదు. వానిలోఁ బయలు వెడలినది యొక్క సర్వకామదాపరిణయమే. అది పూర్వపక్షకోటిలోఁ బడిపోవుటచేతఁ దక్కినగ్రంథములు వ్యాపకములోనికి రాలే దని తోఁచెడిని. సర్వకామదాపరిణయముకూడఁ జిరకాలము పేరైన వినఁబడకయుండెను. ఈసంవత్సరమే మామిత్త్రునివలన యత్నించఁబడి అతని కతికష్టముపైని సర్వకామదా పరిణయ గ్రంథముమట్టుకు దొరికిన దనియు నింకను కృ. కవి గ్రంథములంగూర్చి యత్నించుచుండె ననియు విని అత్యానందము నందినాఁడను. ఈ కృ. కవి కాళహస్తిసంస్థానములో నుండఁగ వేంకటేశ్వర మాహాత్మ్యము నాంధ్రీకరించెను. అది కొంతకాలముక్రిందట ముద్రితమై ప్రకటింపఁబడినది. అదియొక్కటియే ప్రస్తుతములో గృ. కవిప్రణీతగ్రంథ మని చెప్పవలసియున్నది. అది ప్రబంధశైలిని లేక సామాన్యశైలి నుండును గావున నందలి విశేషములఁ గూర్చి వివరింప మానెదను.

కాకర్లపూఁడివారిపై కృ. కవి చెప్పినయుత్పలమాలికలు.

"ఉ. వీరు తెనుంగుసాము లరబీతరబీయతు నొప్పుగొప్పస
      ర్కారువలే జమీలు దరఖాస్తుగ నేలినరాజమాన్యహం
      వీరులు ఢక్క ణేలు తజివీజుకులాహికు లున్న మేటిమం
      జూరు జొహారు యాఖిదుమషూరు ఖరారు మదారు బారు బ
      ర్దారు మిఠా ర్గురాలపరదారులుఠౌరు కడానితేరులం
      బారుమిఠారునౌబతు సుమారు పుకారును మీరుకుడ్తినీ
      దారుగుడారుపైకము బిడారుబజారుకొటారులందు నే
      దారుపఠాణిబారుదళదారుసవారు షికారులందు బి
      ల్కూరుసతాసవారు పిలగోలతుపాకులఫైరులందు లే
      ఖ్యారుగఁ బెక్కుమారులు తయారుగ వీరిహజారులందు వె
      య్యాఱులు పెద్దపేరుల జొహారులు చూచి హమీరు లెంచి ద
      ర్బారుపసందుమీఱ వహవా యని మెచ్చునవాబుఖానుషేం
      షేరు బహాదరుల్ పెరవజీరుల మాఱులమాఱుకెన్న తా
      ర్మాఱుగ మోఁది గీములు త మాము వదల్చి మఖాములెల్ల ఫీ
      ర్ఫారొనరించి మిక్కిలి మరాతబులందిరి చేరుమాలు త

ల్వారుల జేరుదారు దళవాయుల చాయలమీఱుచారుకై
జారుకరారుబాఁకునెలజాలుతళుక్కునబందుబస్తుగా
పోరుభుజోరుకాకరలపూఁడివజీరు లదే యన న్మహో
దారులు పూర్ణనిర్మల సుధాకరకాంతికలాపకీర్తివి
స్తారులు భూరిభూసుర వితానమహాహుతిగంధగౌతమీ
తీరనిసర్గ దుర్గపుర దీపితహర్మ్యతలాగ్రభాగసం
చారులు దేవవారవనజాతముఖీసమవారకామినీ
వారక రాబ్జకీలితసువర్ణమణిద్యుతిదండచామర
ప్రేరితవాతధూతనవఫేనసమానవితానమంగళా
కారసువర్ణపీఠపరికల్పితరాజ్యరమామహామహో
దారులు సేతుశీతవసుధాధరమధ్యతలస్ఫురల్ల స
ద్వీరవిశేషసంజనితతీవ్రదవానలబాడబాగ్నిత
త్వారినృపాలజాలమకుటార్పితపాదపయోధిపీఠసం
స్కారులు రామచంద్రపురసాలనివాసులు రామచంద్రవం
దారులు రామచంద్రవసుధావరపౌత్త్రులు రామచంద్రధా
త్రీరమణాభిధానులు వరిష్ఠవసిష్ఠసగోత్రపావనుల్
కారణజన్ము లబ్ధిశశికల్పకమేఘసమాన గానదీ
క్షారతు లిందిరాసుత జయంత వసంత సమాన సుందరా
కారులు బ్రహ్మకల్పము సుఖంబుగ వర్ధిలువార లీధరన్."

ఈ పద్యము విశాఖపట్టణముజిల్లా వేముపాడు గ్రామకాఁపురస్థుఁడు గుంటూరి పెద్దకవివలనఁ జెప్పఁబడిన ట్లాజిల్లాలోఁ బ్రసిద్ధి గలదు.

కాళహస్తి ప్రభునిపైఁ జెప్పినపద్యము.

ఉ. దామెరవేంకటక్షితిప తావకపాండురకీర్తిదీధితి
    స్తోమము లిందుభా స్తతులతో నెదిరించి తృణీకరింబె నౌ
    గాములకేమి యోజనలుకాని యశంబులు మేయు శంబరం
    బేమరకుబ్బుమీఱ వసియించునె డాపి తదంతరంబునన్

వైణికజనోపయోగిగాఁ జెప్పినయుత్పలమాలికావృత్తములు.

"ఉ. ఏయెడనో యదెక్కడనొ యెవ్వరియొద్దనొ యెందు కెందుకో
      చేయది నేర్చి యున్న యది చెల్లునె వీణె యనంగఁ గొండలన్
      గోయలు దండివచ్చు మెఱుఁగుం బచరించినయట్లుగాక నో

హో యెవరైన నిద్దమగునొద్దికనేర్పగ నేర్చువైణికా
గ్రీయునిశిక్ష గాంచి పలికించు విపంచిని రేఁబగళ్లులం
బాయనిసాధకంబు పరిపాటిగఁ జేతురొ వారివిద్య ని
ర్మాయికవృత్తి రాజసభమాని తమై హితమై తనర్చుఁ ద
న్యాయ మొకింత దెల్పె దనయంబలరన్ శ్రుతిరంజనశ్రుతిం
గాయన గాయనీహృదయకంజ వికాసము మున్ను గా మొదల్
సేయుచు నాటతేట సవిశేషముగా ఘటించి గౌళయున్,
శ్రీయు, వరాళి, యారభియు, సింధు, ఘనద్వని, గౌళి, పాడి, నా
రాయణగౌళి ఆదిఘనరాగము లెన్నిక కొన్ని కొన్ని వా
లాయము గాఁగఁ బూర్వమతలక్షణలక్ష్యత విన్కిఁజేసి యౌ
రా యని విన్న వారు తమయౌఁదల లాదట నూఁచి సన్ను తుల్
సేయఁగ వ్రేళ్లు సారెలకుఁ జేరినయట్లును జేరనట్లు నౌ
డాయు నెడల్ దడల్ దగుకడంక తడంబడకుండఁ దంత్రులన్
వేయువిధంబులన్ నడచువీఁకఁబడన్ బగుతూటుధాటిఘో
డాయనఁగాగఁ జాలగనుడాలు బెడంగుతులంగుహంగుతో
--యముఁ జెందియుండవలెఁ గేల్గదలించి యొకింత మీట నీ
టై యలరారి గౌరి, గిరిశాభరణంబు, ముఖారి, తోడి, పూ
రీయు, వసంతయున్ బిలహారీ మొద లౌనయరాగసంజ్ఞ బా
గై యటు లింపునింపవలె నట్టుల భట్టుల నట్టిరామఖ
ల్లీ, యమునా, అహంగు, మహరీ, గుజరీ, శవానా, బెహాగు, ఠ
క్కాయు, నఠాణ, మారువయు. కాఫీ, ఖమాచి, హుసేని యాది దే
ళీయవిశేషరాగములఁ జెప్పవలెన్ దననేర్పుమీఱ సు
మ్మాయతరాగమర్థనసమాన మరిస్ఫురితాహతోగ్రహ
స్థాయితురంగసంచరణసంకుచితో త్కుచితప్రచారిము
క్తాయివిభేదతాన కటనస్ఫుట తానతనాగ్రమూర్ఛమో
చ్ఛ్రాయమునాదియాదిస్వర జాతియుగీతిననుగ్రహింపఁ బ్ర
త్యాయుత మైనగ్రామయుగ మందము చందము సప్రబంథగీ
తాయతి దాయసంగతి యుదారత దారకమంద్రమధ్యమ
స్థాయిపదచ్యుతాచ్యుతవిచారములన్ గమకప్రచారముల్
ధీయుతవేద్య మిట్టి గడి దేఱినవాద్యము నెందుఁ జూడ మీ
చాయల చాయలంచును రసజ్ఞలు తజ్జ్ఞులు మెచ్చఁగావలెన్
హాయిఁగఁ బామరావళియు నచ్చెరువందఁగ మచ్చుమందుతీ

రై యతిరక్తి హెచ్చి మది నంటుట నొక్కటఁ జొక్కఁగావలెన్
బ్రాయపుసోయగంబు గనుపట్టి తయారగుమేలొయారితో
ఢీయనునొక్కపల్లవి కడిందివడిం దగి యెల్లవారి కా
ప్యాయనలీలఁ గూర్పవలెఁ బ్రాదులు, గాదులు నాదు లెన్న రెం
డై యుగయుగ్మమయ్యు తనరారిననౌనటగోటిమీటులొ
ప్పై యెనయంగ నిబ్బరము నబ్బుర మూనినతాళలీలఁ బ్రా
ణాయితకాలషట్కకలనం జలనం బొకయింతయైన లే
దాయె నయారె యంచు భరతాగమభాగవతప్రచారు లా
మ్నా యవిచేయధుగ్రహనిమగ్రహ భాగ్విషమాదిభేరజా
త్యాయతఖండమిశ్రచతురశ్రముఖాఖిలభేదయుక్క ళా
ప్రాయికసల్లయద్వియుగబంధమృదంగపీపిలికాదిని
శ్చేయయతిప్రసంగపరి శీలన ఖేలననిర్వ్యపాయగో
పాయితదక్షిణానుగత వార్తిక చిత్రముఖాఖిలాయన
స్థాయదమేయశబ్దయుతశబ్దవిహీనముఖాక్రియానుసం
ధేయ మటంచు నెంచవలె నిశ్చలచంచలవృత్తు లిట్టు ల
ట్లై యటు లిట్టులై వెలయ నద్భుతవృత్తి సుధాబ్ధిపూరప
ర్యాయసమాప్లవోత్ల్ప వనరంజన సంజననాంతరాత్మని
ధ్యాయపరాత్మభావనియతిస్థిరనాదవినోదధీరని
ర్ణేయవివక్షణత్వపరినిష్టితలక్షణతం బ్రతిష్టత
త్వాయన మంది యుండవలె నందఱికిన్ దర మౌనె యట్టివి
ద్యాయతకోటి కొక్కఁ డగు నట్టిప్రవీణుఁడు సత్క ళాసము
న్నాయక కాళహస్తిపుర నాయక సన్నిధిదేశ సంగతిం
బాయక కొల్చి యున్న ననపాయకథార్థసమృద్ధినిత్యసౌ
ఖ్యాయతసత్త్వసిద్ధి యగు నం దిఁక సందియ మందనేల వి
ద్యాయతు లైనవారల కుపాయ మిదే నిరపాయ మై తగున్."

ఇంతియకాక కృ. కవి కొన్ని సాహిత్యముల జేసె. అం దిమిడించిన కొన్ని వర్ణనల చమత్కృతుల నీక్రింద వివరించెదను.

1. "శ్రీరమణపాదజలరుహ బంభరాయమాన హృదయ, మదనమథ ధరరూప, దానరాధేయ, సుజన విధేయ, సద్గుణవిధేయ, శ్రీరావుకుల జలధి చంద్ర నీలాద్రిరాయచంద్ర, శ్రీవేంకటరాయచంద్ర, సుగుణసాంద్ర.

2. నయవినయాదిక సుగుణాకర, సకల దిగంతరాశ్రిత విశేషపాలితా, శేషబుధజన పాలిత, మకుటాళి మణిదీప, మధురాలాప, సురవిజయ, రనిజయ, విజయ, జయ, సంపత్ప్రతాప బలశీలా సుమహితల సదయ,మహితల సదయ, హితలసదయ, తలసదయ, లసదయ, సదయ, దయ, యనకలితవిమత శ్రీవేంకటరాయచద్ర, సుగుణసాంద్ర."

ఈరెండును సావేరీ రాగములో ధృవతాళమున స్వరములువేసి వానికి సాహిత్యముగా రచియింపఁబడినవి. ఇం దుదాహరింపఁబడిన రావు వేంకటరాయ ప్రభుఁడు బుచ్చితమ్మయాపరనాముఁ డగుజగ్గముపేఁట జమీదారుఁడు. వెలమకులస్థుఁడు.

కృష్ణమూర్తికవి మురుమళ్ల పోలవరం జమీందా రగు దంతులూరి వేంకటకృష్ణమరాజు భద్రాచలయాత్ర పోవుట వర్ణించి చెప్పిన సీసమాలిక.

"సీ. శ్రీనాయకతులితభూనాయకం బగు, నలదంతులూర్యన్వయమున వెలసి
      విలసితసత్కీర్తివిస్ఫూర్తులకును వి,శాలాక్షులకు ధౌతచేలము లయి
      వెలయఁగ చతురంబుధులు మేరగా ధారు,ణీరాజ్య మేలుచు నెగడఁజాలు
      వీలుగలుగురాజు పాలితాశ్రితజాలుఁ డతివేలసౌందర్యజితకమలని
      వాసినీబాలుఁ డై వాసిమీఱగఁ దను, వేంకటకృష్ణ భూవిభుఁ డొకప్డు
      శ్రీభద్రగిరియాత్రఁ జేయుటకై మది, నెంచి సౌందర్యసమంచితముగ
      శుభముహూర్తంబున విభవానుసారి యై, చతురంగబలముతో నతులితముగ
      రాజధాని యగుచు తేజరిల్లెడుపోల, వరము వెడలి తొడరుపరమసమ్మ
      దమ్ము నెమ్మది నిండ దతమహాపాపాగ్ని, మండలం బగుమునిమండలంబు
      పుల్ల సముల్లసన్మల్లి యన్నమపల్లి, మణిరంగదల్లికుమానపల్లి
      నిహితకలంక ఠాణేలంక శృంగారి, కులమునకు చదరుకొండకుదురు
      బహుదరమాధవీవల్లి యైనవిల్లి లే, వెలవెలపల్లి సద్ద్విజమతల్లి
      వరసూనవల్లి యౌవానపల్లి సురల, ప్రోడపారంబగువాడపాలె
      మఘదురంతాతపహరణంబునకు వెల్లి, వాడపల్లి కుముదబాంధవమణి
      వేదికాతతిజితవిమలతరాత్రేయ, పురమగునాత్రేయపుర మనింద్య
      తీరై పర్తినిరంతరకిసాల, శీతసుమేరు వెల్చేరు దివికి
      దంటవఁ దగుజీడిగుంట సర్వపురప్ర, పరమైనయలముప్పవరము పాంథ
      జనసంతతులకు విశ్రాంతిఁ దా నిడఁజాలు, నిడ దోలు మణిమయనిరుపమాన
      వాటంబుగా కాటకూటేశ్వరము వింత, ధనదుపురికి పిళ్లతాడిమళ్ల
      పారిజాతముతోడ పోరుమామిడి గల, వోరుమామిడి బలుసౌరుమీఱు
      రాజమానం బగుత్యాజమపూఁడి, యారామ దృశ్యద్విజప్రకరనీడ

మెఱ్ఱనగూడె మౌయీగనియోధుల, నాయోధనాంబుధియందుఁ దేల్చు
పోతవరంబగుపోతవరంబధి, రాజవరం బగురాజవరము
ప్రాకటనికటతటాకతటస్థలి, గుర్గు రా రావనిరర్గళప్ర
కారక్రోడంబు జంగారెడ్డిగూడెంబు, తాద్యుప్రమదదాయి తాడువాయి
రమ్యమౌకరుకువరాలబల్మూటయ, శ్వారావుపేట ఖవ్యమధుమాధ
వీసుపాకయునైనయాసుపాక సపత్న, చతురంగసేనార్ద్రశస్త్ర హస్త
దళనకేళికయందు తరవారు కుకునూరు, సాథుతరం బగుమాథవరము
పరమపావనజలభారభాసుర తర, గోదావరీఘనకూలవిచర
దమరవరం బగునమరవరము భూ, దేవికి క్రోడము రావి గూడె
మనఁ బ్రసిద్ధికి నెక్కునట్టిగ్రామంబుల, ననుకూలముననె దన్నలరుసుకవి
పండితక్ష-త్తియమండలితోడఁ దా, దిగుబస చేయుచుఁ దీవ్రవప్ర
చాక చికీక సచ్చక్రభద్రాచల, రామభద్రవిమాన రాజమెదుట
గన నైన సాష్టాంగ మొనరించి గౌతమీ, నది కవలదరిని బొదలునుష్ణ
సలిలగుండంబుల స్నానం బొనర్చి శ్రీ, భద్రాద్రినాథునిపట్టణమున
నెట్టన సన్మోదనిర్మలచిత్తు లై, యత్యుత్తమం బగుహర్మ్య మొకటి
యావసధ మొనర్చి యనుదినంబును దరి, గోదావరీఝరీ కూర్మి పేర్మి
మజ్జన మొనరించి సజ్జన శ్రేణితో, శ్రీరామచంద్రునిశ్చింతనికట
నివసన్మునీంద్ర వినీతలక్షణ భజ, నాతిని స్తంద్రవామాఁకభాస
మాన మై దివితనయైనయనోత్పల, పూర్ణి మాంచంద్రుసంపూర్ణసత్త్వ
సాంద్రు సేవింపుచు నింద్రతులిత భాగ్యుఁ,డితఁడని పురజను లతులితముగఁ
బొగడఁగ నగణితసుగుణసంపద మీఱ, నచటివిప్రులకు థానాన్న దాన
విధి తృప్తిగావించి విశ్రుతసత్కీర్తి, దిక్కుల నెల్లెడఁ బిక్కటిల్ల
ము న్నేఁగినట్టులు నన్ని గ్రామంబులు, దరియుచుఁ గోవూరు ధవళిగిరియు
కపిళేశ్వరపురంబు గాంచు టెక్కుడు గాఁగ, పోలవరం బతివేలలీల

గీ. జెందె నిభ్భంగి నాశ్రితబృందము క, గణ్యపుణ్యక్రియాతినై పుణ్యమహిమ
   సులభముగఁ గూర్ప నేర్పరి యిలమఱియొక, రాజు గల్గునెయిమ్మహారాజుదక్క."

పై వేంకటకృష్ణమరాజుపై మఱికొన్ని పద్యములు.

"ఉ. పండితమౌళి శిష్టుకులవార్నిధిసోముఁడు కృష్ణమూర్తి కా
      ఖండలతుల్యవైభవు లఖండిత దానవినోదు లౌర భూ
      ఖండ మొసంగి రిప్పు డది కాఁపుర ముండమిఁ బోవ దగ్గగా
      నుండనిముక్కు తుమ్మిన మఱుండునె కృష్ణనృపాలకాగ్రణీ."

మఱియొకపద్యము.

ఉ. సలలితలీల నెత్తఱిని సత్యపదస్థితి తప్ప కల్లసూ
    రులకుఁ బ్రమోదసంతతి నిరూఢిఁ దగన్ సమకూర్చి జీవనం
    బు లిడెడుమర్త్యమూర్తి మముఁ బ్రోవఁడెకృష్ణమహేంద్రచక్రవ
    ర్తి లసదనంతకీర్తి యవధీరిత మామకహృద్గతార్తియై."

పై దంతులూరి వేంకట కృష్ణమరాజును గూర్చియే కృ. కవి మఱికొన్నిపద్యములు చెప్పినట్లు కానుపించును. అందులోనియొక యుత్పలమాలికమాత్రము నాకు దొరికినదాని నీక్రింద వివరించెదను ఎట్లన్నను :-

దంతులూరివారిపైఁ జెప్పఁబడినయుత్పలమాలిక.

ఉ. పైపయిరంగులం గదిసి పన్నుగ బోగపుటన్నువన్నె పెం
    పై పనుపడ్డకబ్బముల కబ్బురమా వెర మాను మేలువా
    ల్జూపులు ప్రాపులన్ వలపు జూపుచు నీ టగుమాట తేట బ
    ల్దీపులు పుట్ట నెట్టనఁ బదింబది గా నెదఁ జిక్కి చొక్క పుం
    బూఁవచనుంగవం గలపి పోడిమి వేఁడిమిటారపుంగటా
    రీపస మీఱినారు జిగిరించెడిమించడరం గడంగి. మే
    లీపని యంచు నెంచు మది హెచ్చుగ మెచ్చుగ నిచ్చవచ్చిన
    ట్లోపినయంతపట్టు బిగియూఁతగ వా తెఱమార్పు నేర్పులన్
    దాఁపగుముద్దుగుమ్మరసితద్దయు గద్దరిబైదిప్రోదిమేల్
    గోపు లెఱుంగఁజేయు నలకోయిలకూఁకలచాయనింపుతీ
    రై పొసఁగన్ వ్రలెన్ జవుల నందినదంటతనాన విచ్చిక
    న్మోపిన పేరుటామని గనుంగొననై కనునీట తేటలన్
    దూ పెడలించి పెంచఁదగుతో పగు గొజ్జెగ పూలబాఱు తీ
    రై పొసఁగన్ వలెన్ చవుల నందిన నమ్మరుతేరుదారులొ
    ప్పౌ పవళింపుమేడగదిపందిరి నొప్పెడుపట్టెమంచమం
    దాపనిముందునూడిగ పుటందము జిందగ నందకత్తెచే
    జాఁపి యొసంగు వీడెముపసన్ వలపున్ మొలపింపఁగావలెన్
    దేపకుఁ దేప కిప్పగిదిఁ దెన్గొనరించెడి పట్ల సంస్కృతా
    టోపముఁ జూపుచో నలి కుటుంబిక ఝాంకరణాంక
    కల్పవల్లీపరివేల్లనోల్ల సదలీనన వీనసదావపాయనూ
    నోపలసత్ప్రభూత పురహూతవ నీభవనిర్ఝ రావనీ

జోపరిపుష్పనిష్పతదనూనమరందఝరీపరీతసం
తాపహరాంబుపూరపరితస్సరణోత్థఘలంఘలధ్వని
వ్యాపిసురాపగాంతర సమగ్రతమగ్రహనాయకావ్యపే
క్షాపరిహీనచారుతర సౌరభసారభరాతిభాసురా
ష్టాపదకంజపుంజనివసత్కనకచ్ఛద హంససంసదా
లాపకలాపసమ్మిళితలాస్యకలావలమానకాంచికా
నూపురకింకిణీగణవినూత్న తరద్యుతిరత్న కంకణ
ప్రాపిఝణంఝణక్వణనరంజితమంజులరూపరేఖపై
ఖీపరిగీతతారతరగీతవినూతనజాత మాధురీ
రూపనిరూపణీయ మయి రూఢికి నెక్కవలెం గవిత్వవి
ద్యాపటిమం బటంచు నను నంతటివానిగ నెంచి నాదుపు
ణ్యోపచయంబునన్ బిలిచి యుర్వర సర్వరసజ్ఞు లెన్నఁ జూ
పోపనివారు చిన్నతనమూనఁగ సన్నిధియందు నిల్పి పృ
థ్వీపథవిష్ణుమూర్తి యవధీరిత కర్ణవితీర్ణినైపుణా
శాపరిపూర్ణకీర్తివిల సద్గుణసంతతి దంతులూరువం
శోపధిసింధుబాంధవసముజ్జ్వల పూర్ణశుధాంశుమా ర్తియు
ర్వీపతిచక్రవర్తి యనఁ బే రగు వేంకటకృష్ణమూర్తియా
శాపరిపూర్తి సేయఁగ విచారమ నీదు ప్రచార మేలగున్.

పిఠాపురపు సంస్థానికునిపైఁ జెప్పినయుత్పలమాలిక.

ఉ. శ్రీరమణీమణీరమణసింధుసదృక్షకటాక్ష వీక్షణాం
    కూరసమృద్ధిసంతతని గూఢని గాఢ సమస్తభాగ్యపా
    ళీరమణీయదేవనగరీవర మాచిరమా పిఠాపురీ
    భూరిమణీగణాకలితభూరి నిరంతర కాంత కాంతివి
    స్తార నిరస్తచిత్రకరసౌధ సుధాకరకాంతవేదికా
    చారుచిరత్న రత్మ రుచిసాంద్రనగేంద్ర మృగేంద్రపీఠిదు
    ర్వారగతిన్ పయోజలధిపన్నగ నాథశిరోధి వీథికా
    సారరు హాక్షుదీక్షను విచక్షతతోఁ గొలువుండి మీ రసా
    ధారణవాక్సుధా మధురధారల మీ రలఘు ప్రచారవా
    చారు చిచాతురిం గలహసాధనరాజవిరాజి తారిరాడ్దారు
    విదారణక్ర కచదారుణ మండితమండలాగ్రభృ
    ద్వీరులఁ బిల్చి కృత్యము సవిస్తరతం దగ నెంచి మించి యిం
    పారెడు హృద్యవాద్యకలనాఖిల గీతకళాకలాపని

స్తారకులం గవి ప్రకరతార్కిక శాబ్దిక వేదవాదులన్
గౌరవ మొప్ప గొప్పగ నగణ్యధనాది సనాథులన్ ధృతిన్
గోరిక మీఱఁ జేయుచు నకుంఠనటత్పద కుంజమంజుమం
జీరసురత్న పుంజమృదు శింజితముల్ గల రావహింసికా
సారస సారసధ్వనుల సందడులన్ దుడుకందఁజేయువా
ణీరభసంబుడం బొదవ నిస్తులభూభృదపాత్తజీవికా
చారురమాసమానులగుపానులజానులు మీరు నాట్యవి
స్తారపదక్రమాభినయతానవితానవిభాగ రాగగో
ష్ఠీరుతి ధీరితిన్ బుధులచిత్తము నత్తగఁ జిత్తగింపుచోఁ
గోరిక దెల్పు వేళ యని కొంకణ టెంకణ లాటభోటసౌ
వీరశకాదిదేశపృథివీవరు లందఱు ముందు ముందు జోహారులు
చేసి నిల్వ సెలవాయను మీ కిట జేర నంచు చో
బ్దారులు దెల్ప జోహాకుమువాదర బారుపసందుమీఱు స
ర్కారుఖోదాబరాబరు ఖరారు ముదారుల మీరుతీరుదర్బా
రనియెన్ని పన్నొసఁగి పన్నుగ సన్నుతు లెన్నొ సేయుచో
మీఱన వేడ్కతోడ పుడమిం గడు బ్రోచుచు నిత్యసత్యవా
ణీరతిభారతీరమణునిం బరమాప్తిని మాధవున్ శివా
చారత నీశు సద్గతిని చంద్రుసదాసుమనః ప్రయుక్తిచే
సౌరధరావరుం గని యజస్రము గేరుచు మీఱుచుందుగా
వీరవరేణ్య రావుకులవేంకట రామమహీపతి కృతీ
మారసమాకృతీసదసమానయశశ్చిరదాన నిందిత
క్షీరపయోధిసౌరమణిశితి కరామర భూమిరుట్త తీ
భూరమణాగ్రగణ్య మిముఁ బ్రోవుత దేవత లెల్లకాలమున్.

అని యిట్లు వర్ణించి యున్న తఱి నాయనశిష్యుఁడు తనగురునియొక్క సంస్కృతనైపుణిం జూపుటకు యత్నించి అందులో నావఱకు కృ. కవివలన రచియింపఁబడిన యీక్రింది శ్లోకముం జదివెనఁట. ఎట్లన్నను :-

శ్లో. రావురామనృపతా వుదారతా, భావుకే౽త్ర నక దాపి లోపితా,
    కింతు సాధు సదలబ్ధవృత్తితా, హంత పూర్వభవ పాపవృత్తితః.

అని చదివిన శ్లోకము పూర్వము బులుసుపాపయ శాస్త్రి కీయఁబడిన భూస్వాస్థ్యములో జరిగిన కృత్రిమముంబట్టి పండితులకు భూము లిచ్చుట ప్రభుఁడు మానినట్లు కృ. కవి చెప్పి తనశిష్యునిచేఁ జదివించె నని యాగ్రహించి ప్రభుఁడు కృ. కవి యెడ ననాదరముం జూపెను. ఇది దైవకృతమే కాని కృ. కవియుద్దేశము కా దని వాడుక.

అశ్వశాస్త్రరచన.

ఈ కృ. కవి మాడుగులలో నుండగాఁ గృష్ణ భూపతి యొక్క మోహపుత్త్రుఁడగు జగన్నాథుఁ డనునతఁ డొకగుఱ్ఱముం దీయుటకు యత్నింప దానికి నశ్వశాస్త్రవేత్తలు గొందఱు మెడక్రింద గోఁగుగల దనియు అది యొక దోషమనియుఁ జెప్పిరి. అయిన నాగుఱ్ఱముయొక్క పొంకమును సురూపముం జూచి జగన్నాథుఁ డద్దానిని వదల లేక యీ కృ. కవికిఁ గనుసైగ చేసి, కృష్ణభూపతితో నీ కృ. కవియును అశ్వశాస్త్రములో మిగులఁ బండితుఁడు. వారికడ గ్రంథము లేవైన నుండును. వారియభిప్రాయము నరయుట మంచి దని విన్నవింప నటులైన మీకడ నుండుగ్రంథముం దెప్పింపుఁ డని కృష్ణభూపతి కృ. కవికిఁ జెప్పెను. అపుడు కృ. కవి తాను మఱునాఁడు దర్శనమునకు వచ్చినపుడు తెచ్చెదనని విన్నవించెను. అంతట నీజగన్నాథుఁడు కృ. కవి యింటికిఁ బోయి తన కాగుఱ్ఱముం గొనిపించునట్లు గ్రంథము జూపించిన విశేషధన మొసంగెద నని చెప్పిపోయెనఁట. దానికిఁ కృ. కవి సమ్మతించి ఆరాత్రి భోజనముచేసి తనదౌహిత్త్రుం డగుకృష్ణమూర్తి నామునిం బిలిచి ప్రాతఁతతాటాకుల యలేఖములం దెమ్మని చెప్పి వాని నొకగ్రంథములో మధ్య నిమిడించి సంస్కృతముతో నారదమహాముని యొకరాజన్యునకుఁ జెప్పినట్లశ్వశాస్త్రసంప్రదాయములన్నియుఁ బుంఖానుపుంఖములుగ మూఁడునాల్గువందల శ్లోకములు చెప్పి తెల్లవాఱుసరికి గ్రంథము సిద్ధముచేసి దానికి వర్ణము వేసి ప్రభువునకుం జూపించెనఁట. అట్టిగ్రంథము వినుట కందఱు నద్భుత మంది రనియు నందు గుఱ్ఱములకు గోఁగు కల్గియుండిన దానివలన దోషము లేకుండుటయే కాక గుణ విశేషములుకూడ బెక్కులు కల వని సూచింప దానికి సభవారందఱు నంగీకరించి, ఆగుఱ్ఱమును విలిపించి ఆమూహూర్తముననే జగన్నాథుని దానిపై నెక్కించిరఁట. పిమ్మట జనన్నాధుఁడు మిక్కిలి సంతసించి కృ. కవికి విశేషబహుమానంబుల నిచ్చెనఁట. ఈకథనంతయు నా రాత్రి కృష్ణమూర్తికవి యున్న స్థలములోనే కూర్చుండి కృ. కవివలన నాచమత్కృతిఁ జూడఁ గోరబడినట్టియు నపు డిరువది సంవత్సరముల వయస్సులో నుండియు నిపుడేఁబది సంవత్సరముల వయస్సులో నుండునాస్నేహితు లొకరు చెప్పుటచే దీని నిందుఁ బొందుపఱిచితిని. పాఠకులు నమ్మినను నమ్మకున్నను నింతకంటె నేను వ్రాయవలసినది లేదు.

కృ. కవికృత మని వాడుకొనంబడుపద్యము.

"సీ. దురుసానిమైనున్న బురుసాపనిరుమాలు, కరసొరసమున నొక్కపరి విసర
      కురదాపడనిలీల పరదా వెడలి వచ్చు, సరదా తెలియఁ బైఁట జాఱవిడిచి
      అఱజారుకురులు క్రమ్మఱ జాఱిపడి వ్రాలు, విరజాజిపువ్వుల విసరి విసరి
      వెరబాఱుగాలి నౌపొరబాటు విడఁ మారుదరబారుపావడ దార్చి తార్చి

తే. పకడుగలకమ్మవిలుకాని హుకుమతీమ, తలబు, జాహీరుగా షక్తుతలఁపుచేయు
    దీనివక్తుతమాషాఖుషీనిషాల, ఖిలవతురభీకు నయినను దెలియ వశమె."