కవి జీవితములు/శ్రీనాథుడు

వికీసోర్స్ నుండి

శ్రీరస్తు.

కవిజీవితములు.

ఆంధ్రపంచకావ్యకవులచరిత్రము.

13.

శ్రీనాథుఁడు.

ఈకవిరచితము లగుగ్రంథములు పెక్కులు గలవు. అందు శృంగారనైషధమును భీమఖండ, కాశీఖండములును, కావ్యపాకమున నొప్పియుండును. అందు రెండును రెండుకావ్యములుగాఁ బరిగణియింపఁబడును. మఱికొందఱవలన శృంగారనైషధ, కాశీఖండములుమాత్రమే కావ్యములుగా లెక్కింపఁబడును. ఈరెండవపక్షమునే యవలంబించి దీని నిపుడు వ్రాయుచున్నాను.

శ్రీనాథుఁడు భారద్వాజసగోత్రుఁడు, ఆపస్తంబసూత్రుఁడు, నియోగిబ్రాహ్మణుఁడు కమలనాభకవిపుత్రుఁ డగుమారయమంత్రి కీకవి కుమారుఁడు. తల్లి పేరు భీమాంబ. ఇతఁడును నొకసుప్రసిద్ధాంధ్రకవి. భారతకవిత్రయమువారియందు మనయాంధ్రపండితుల కెట్టి గౌరవము గలదో యీ శ్రీనాథునియెడల నట్టి గౌరవమే వారికిఁ గలదు. ఇతఁడు పండితాదరణీయ మగుకావ్యములం జెప్పుటయేకాక స్త్రీశూద్రాదుల కుపయుక్తము లై సులభశైలితో నొప్పు పాటలు పద్యములు రచియించెను. మనదేశములోఁ బెండ్లిపాటలు, మొదలగునవియు, గొల్లలు మొదలగుపాటకపుజాతి పాడుకొను గొల్లసుద్దులు మొదలగునవియును, పగటి వేషగాండ్రు చెప్పెడుకొన్నికథాకలాపములును శ్రీనాథునిచే విరచితములే యని ప్రసిద్ధి గలదు. శ్రీనాథకృతము లగునాంధ్రగ్రంథములలోఁ గాశీఖండము పురాణములలో మిక్కిలి కఠినమై "కాశీఖండ మయఃపిండ"మ్మని విఖ్యాతి గనిన గ్రంథమునకుఁ దెలుఁగు. నైషధము సంస్కృతకావ్యములలో నారికేళపాకంబున నొప్పి "నైషధం విద్వదౌషధ" మ్మనువిఖ్యాతిం గాంచిన దై యుండును. ఇట్టిగ్రంథద్వయము నాంధ్రీకరించుటకుఁగాను శ్రీనాథునకుఁ బూర్వు లగువా రెవ్వరును యత్నింపరైరి. అతనియనంతర కాలములోనివా రాయాగ్రంథములం జూచినపిమ్మటఁ దామట్టి ప్రయత్న మంతకంటె విశేషముగాఁ జేయలే మనుతలంపుతో నట్టియుద్యమమును వదలుకొనిరి. ఇట్లుగా నున్నగ్రంథముల రెంటిని నతిప్రాగల్భ్యముతో నీశ్రీనాథుఁడు తెనిఁగించెను. ఆగ్రంథము లాంధ్రీకరించిన విధ మంతయును ముందుముందు వివరించెదను.

శ్రీనాధకృతగ్రంథములవివరము.

శ్రీనాథుఁడు తాను రచియించిన గ్రంథములలో నావఱకుఁజేసిన వానిలో ముఖ్యము లగువానిని నైషధములోపలను, భీమఖండములోపలను, గాశీఖండములోపలను నీక్రిందివిధంబున వివరించె అందు నైషధములో :-

క. జగము నుతింపఁగ జెప్పితి, ప్రెగడయ్యకు నాయనుంగు పెద్దనకుఁ గృతుల్
    నిగమార్థ సారసంగ్రహ, మగునాయాచార్యచరిత మాదిగఁ బెక్కుల్.

భీమఖండములో మఱికొన్ని గ్రంథములు రచియించినట్లుగాఁ జెప్పె. ఎట్లన్నను :-

గీ. ఐనమరు చ్చరిత్రంబు నైషధంబు, సప్తశతి పండితా రాధ్యచరిత మనఁగఁ
    గావ్యములు పెక్కు చెప్పియుఁ గాంక్ష చనక, వెండియును గావ్య మొకటిగానింపఁదలఁచి.

కాశీఖండములో మఱికొన్ని గ్రంథములు రచియించినట్లు చెప్పియున్నది. అందుఁ బైగ్రంథములలోఁ బెక్కులు చేర్చఁబడినవి. ఎట్లన్నను :-

"సీ. చిన్నారిపొన్నారి చిఱుతకూఁకటినాడుఁ, రచియించితి మరుత్తరాట్చరిత్ర
    నూనూఁగుమీసాలనూత్న యౌవనమున, శాలివాహనసప్తశతి నొడినితి

    సంతరించితి నిండుజవ్వనంబునయందు, హర్ష నైషధకావ్య మాంధ్రభాష
    ప్రౌఢనిర్భరవయఃపరిపాకమునఁ గొనియాడితి భీమనాయకునిమహిమ

గీ. ప్రాయ మింతకు మిగులఁ గైవ్రాలకుండఁ, గాశికాఖండ మనుమహాగ్రంథ మేను
    దెనుఁగుజేసెదఁ గర్ణాటదేశకటక, పద్మవనహేళి శ్రీనాథభట్టసుకవి.

పైపద్యములు పర్యాలోచింపఁగా శ్రీనాథకృత గ్రంథములలో, 1. నిగమార్థసారసంగ్రహము, 2. మరుచ్చరిత్రము, 3. నైషధము, 4. శాలివాహనసప్తశతి, 5. పండితారాధ్యచరితము, 6. భీమఖండము, 7. కాశీఖండము అనునవి. పైగ్రంథములలోఁ దన యతిబాల్యవయస్సులో మరుత్తరాట్చరిత్రమును, యౌవనప్రాదుర్భావసమయములో శాలివాహనసప్తశతియును, నిండుయౌవనకాలములో నైషధకావ్యమును, ప్రౌఢవయఃకాలములో భీమఖండమును, వార్థకావస్థ సమీపించక యుండు సమయములోఁ గాశీఖండమును రచియించినట్లు చెప్పియుండె కాశీఖండముతరువాత గ్రంథములు రచియించినట్లు కానరాదు. పల్నాటివీరచరిత్ర మొదలగునవి యున్నట్లు కలదు. దానికి గ్రంథదృష్టాంతములు లేవు.

ఇపు డీపైగ్రంథములలో శృంగారనైషధమును, భీమఖండ, కాశీఖండములుమాత్రమే నిలిచి దేశమందు వ్యాప్తములై యున్నవి. తక్కినవి నామావశిష్టము లైనవి. శ్రీనాథునివీథినాటక మన నొప్పు గ్రంథభాగమును గొంత వ్యాపకములో నున్నది. అందలిపద్యము లప్పకవి మొదలగువారివాలన లక్షణగ్రంథములలో నుదాహరింపఁ బడుచు వచ్చెను. శ్రీనాథునికథలుగా ననేకములు పుక్కిటిపురాణములు వాడు కొనంబడినను సాధ్యమగునంతవఱకు గ్రంథస్థము లగువానిని నగర్హణీయము లగువానినిమాత్రమే యచ్చో వివరించెదను.

శ్రీనాథునియుపాసనావిషయము.

ఈశ్రీనాథుఁడు బ్రాహ్మీదత్త మగువరము కలవాఁడుగాను, ఈశ్వరార్చనాపరుండుగా నున్నట్లును, శృంగారనైషధములోఁ దత్కృతిపతి


యితని నుతియించిన ట్లాగ్రంథమువలనం గాన్పించును. దానింబట్టి యితఁడును, తొల్లింటి కవులంబోలె శైవమంత్రో పాసకుఁడే యని చెప్ప నొప్పి యున్నది. ఆపద్య మెట్లన్నను :-

"శా. బ్రాహ్మీదత్తవరప్రసాదుఁడ వురుప్రజ్ఞావిశేషోదయా
      జిహ్మస్వాంతుఁడ వీశ్వరార్చనకళాశీలుండ వభ్యర్హిత
      బ్రహ్మాండాదిమహాపురాణచయతాత్ప ర్యార్థనిర్థారిత
      బ్రహ్మజ్ఞానకళానిధానమవు నీభాగ్యంబు సామాన్యమే."

ఈశ్రీనాథుఁ డీశ్వరార్చనకళాశీలుఁ డని యుండుటచేతను, ఆవఱకుం గలకవులందఱును శైలో పాసకులే యయి యుండుటచేతను నంతవఱకును రామానుజమతము వ్యాపించి యుండనట్లును శంకరాచార్య మతమే ప్రబలమై యుండినట్లును నూహింపనై యున్నది. అట్టివైష్ణవ మతము నవలంబించినకవులలో నల్లసానిపెద్దన ముఖ్యుఁడుగాఁ గానుపించును. అక్కడనుండి తఱచుగ నాంధ్రకవు లందఱును వైష్ణవమతానుసారులై యున్నట్లుగా, తెనాలిరామకృష్ణుఁడును, అయ్యలరాజు రామభద్రకవియును, కవికర్ణ రసాయనకవి యగునరసింహకవి మొదలగువారలకవితలంబట్టి యూహింపనై యున్నది.

ఈశ్రీనాథకవి తనగోత్రాదికము నొకపద్యమునం దెల్పెను. దాని నీచారిత్రారంభమున ముందే చెప్పి యుంటిమి. ఇపు డాపద్యము నీక్రింద వివరించెదము. ఎట్లన్నను :-

"శా. భారద్వాజపవిత్రగోత్రుని శుభాపస్తంబసత్పూత్రు వి
      ద్యారాజీవభవుండు మారయకుఁ బుణ్యాచార భీమాంబకున్
      గారామైనతనూజు న న్ననఘు శ్రీనాథాఖ్యునిం బిల్చి స
      త్కారం బొప్పఁగ గారవించి పలికెన్ గంభీరవాక్ప్రాడిమన్."

ఇతరకవిప్రశంస.

ఈశ్రీనాథుఁడు రచియించిననైషధ, భీమఖండ, కాశీఖండము లనుగ్రంథత్రయము కావ్యత్రయముగను, శ్రీనాథుఁ డాంధ్రకాళిదాసుఁ డనియును జెప్పఁదగి యున్నది. కాళిదాసత్రయము సంస్కృతసాహితీ


ప్రారంభమందుఁ జదువుదురు. శ్రీనాథకావ్యత్రయ మాంధ్రసాహితికిం గలయవధిని బఠియించెదరు. సంస్కృతమునం గూడఁ బంచ కావ్యములు చదివినపిమ్మటనే నైషధముం జదువుదురు గావున నాంధ్రమునందును నీవఱలో జెప్పంబడిన మనుచరిత్రము, పారిజాతాపహరణమును, పాండురంగక్షేత్రమహాత్మ్యమును, భీమఖండమును, కాశీఖండమును జదివిన పిమ్మట నైన శ్రీనాధకృతశృంగారనైషధముం జదువవచ్చును. లేదా భీమఖండము లభియింపనిచోఁ గాశీఖండము చదివియే శృంగారనైషధముం జదువవచ్చును. లేదా ప్రారంభమునందే కాళిదాసకృతము లగు కావ్యత్రయము నభ్యసించినట్లుగా నీశ్రీనాథుని కావ్యత్రయముం జదివి పిమ్మటనే మనుచరిత్రమును, పారిజాతాపహరణ, పాండురంగక్షేత్రమాహాత్మ్యములను జదువవచ్చును. అది పాఠకులదార్ఢ్యముం బట్టియు నుపాధ్యాయుల ప్రాగల్భ్యముం బట్టియునుండును. కావున నాయుభయులు సమ్మతించినవానినే యవలంభింతురుగాక.

శ్రీనాథకృతకవిస్తుతి.

ఈ శ్రీనాథుఁడు తాను రచియించినగ్రంథములలో భారతకవిత్రయము నన్ని చోట్లును, తనతాత యగుకమలనాభుని, వేములవాడభీమకవిని, కొన్నిచోట్లను నుతియించెను. దానివలనఁ నతనికాలమునకుఁ బైకవులే ప్రసిద్ధు లై యున్నట్లుగా నెన్నందగియున్నారు.

ఆపద్యము లెవ్వి యనఁగా :- శృంగారనైషధములోనికవిత్రయసతి :-

"ధీరమతి నన్న పార్యునిఁ దిక్కయజ్వ, శంభుదాసునిఁ కర మర్థి సంస్మరింతు."

భీమఖండములో శ్రీనాథుఁడు ప్రత్యేకముగాఁ జేసిననన్న యభట్టు వర్ణన మెట్లన్నను :-

శ. నెట్టికొని కొలుతు నన్నయ, భట్టోపాధ్యాయసార్వభౌముని గవితా
    పట్టాభిషిక్తు భారత, ఘట్టోల్లంఘనపటిష్ఠ గాఢప్రతిభున్.

ఇఁక తిక్కనసోమయాజింగూర్చి చెప్పినపద్యము :-

ఉ. పంచమవేద మై పరఁగు భారతసంహిత నాంధ్రభాష గా
    వించెఁ బదేనుపర్వముల విశ్వజగద్ధితబుద్ధి నెవ్వఁ డ
    క్కాంచనగర్బతుల్యున కఖండితభక్తి నమస్కరింతు ని
    ర్వంచితకీర్తివైభవవిరాజికిఁ దిక్కనసోమయాజికిన్.

మఱియొకకవిం జేర్చి కాశీఖండములో నీపైముగ్గురు కవులను గృతిపతి తనకుఁగాను వర్ణించిన ట్లింకొకపద్యముం జెప్పెను. అం దధికముగాఁ జేర్పంబడినకవి వేములవాడభీమకవి. ఆపద్యమువలన నానల్గురు కవులపరిగణనలోనిముఖ్యతయును కవిత్వశయ్యాదులుంగూడఁ దెలియును గావున నాపద్యము నిట వివరించెదను. ఎట్లన్నను :-

"సీ. వచియింతు వేములవాడభీమనభంగి, నుద్దండలీల నొక్కొక్కమాటు
      భాషింతు నన్నయభట్టుమార్గంబున, నుభయవాక్ప్రౌడి నొక్కొక్కమాటు
      వాక్రుత్తు తిక్కయజ్వప్రకారము రసా, భ్యుచితబంథముల నొక్కొక్కమాటు
      పరిఢవింతు ప్రబంధపరమేశ్వరునిఠేవ, సూక్తివై చిత్రి నొక్కక్కమాటు."

అని యిట్లు కృతిపతివాక్యంబుగా నొకపద్యము చెప్పెను. అందే శ్రీనాథుఁడు కవిత్రయమును వర్ణించి మఱియొకవర్ణనముం జెప్పెను. దానింబట్టి చూడ నీశ్రీనాథుఁనకు భారతకవిత్రయమందే విశేషాదరమున్నట్లుమాత్రము కానుపించును ఆపద్య మెద్ది యనఁగా :-

"గీ. శబ్దశాసను నన్న పాచార్యవర్యు, సత్కవిశ్రేష్ఠుఁ దిక్క యజ్వను భజించి
      సత్ప్రబంధమహేశ్వరు శంభుదాసు, నధికతరభక్తిసంయుక్తి నాదరించి"

ఇట్లుగా శ్రీనాథుఁడు ప్రాచీనాంధ్రకవుల నుతియించి యాగ్రంథములోపలనే తనతాత యగుకమలనాభకవి నీక్రిందివిధంబున వర్ణించె నది యెట్లన్నను :-

"గీ. మత్పితామహుఁ డగుపితామహునిఁ దలఁచి, కలితకావ్యకళానాభుఁ గమలనాభు
     జంద్రచందనమందారసదృశకీర్తి, సరససాహిత్యసామ్రాజ్యచక్రవర్తి."

ఈకమలనాభునే శ్రీనాథుఁడు కాశీఖండమునకంటెఁ బూర్వరచిత మగుభీమఖండములోపలంగూడ నుతియించెను. ఎట్లన్నను :

"మ. కనకక్ష్మాధరధీరు వారిధితటీకాలట్టణాధీశ్వరున్
       ఘనునిన్ పద్మపురాణసంగ్రహకళాకావ్యప్రబంధాధిపున్
       వినుమధ్యాంతరసార్వభౌముఁ గవితావిద్యాధరుం గొల్తు మా
       యనుగుందాతఁ బ్రదాత శ్రీకమలనాభామాత్యచూడామణిన్"

శ్రీనాథస్తోత్రాభిప్రాయము.

పైకవులవర్ణన చేయునపుడు శ్రీనాథుఁడు వారివారికవిత్వములోని విశేషములును వారిమహత్తులును విశేషముగ గుర్తెఱిఁగినవాఁ డవుటం జేసి యథార్థవర్ణనమునే చేసినట్లుగా నూహింపవలసి యుండును. అందు వేములవాడభీమకవిం గూర్చి చెప్పుచో నుద్దండలీలలఁ గవిత్వము చెప్పునట్లుగా వ్రాసెను. నన్నయభట్టును వర్ణించుచో ధీరమతి యనియును, ఉపాధ్యాయసార్వభౌముఁ డనియును, కవితాపట్టాభిషిక్తుఁడనియును, ఉభయవాక్ప్రౌఢి గలవాఁ డనుటంబట్టి యుభయభాషావాగనుశాసనుండనియును, శబ్దశాసనుం డనియును వివరించె. ఇఁక శంబుదాసాపర నాముం డగునెఱ్ఱాప్రగ్గడను వర్ణించునపుడు సత్ప్రబంధమహేశ్వరుఁ డనియును, సూక్తివైచిత్రి గలవాఁ డనియుం దెల్పెను. తనతాత యగు కమలనాభుంగూర్చి చెప్పునపుడు, సరససాహిత్యసామ్రాజ్యచక్రవర్తి యనియుఁ గవితావిద్యాగురుం డనియుం జెప్పెను.

తిక్కనసోమయాజింగూర్చి వ్రాయుచో శ్రీనాథుఁడు తనకుఁ గల విశేషాదరముం దెల్పునట్లుగ రసాభ్యుచితబంధములం జెప్పుననియును, సత్కవిశ్రేష్ఠుఁ డనియును నుడివెను.

ఇట్లుగా నీతిక్కనసోమయాజిని జతురాననతుల్యుం డని చెప్పుటకుఁ గారణము పంచమ వేదతుల్య మగుభారతము నాంధ్రీకరించుటయే యని చెప్పఁగా నద్దానిం దెనిఁగించిన నన్నయశంభుదాసుల నేమికారణమున నట్లుగా శ్రీనాథుఁడు వర్ణింపఁడయ్యె నని యొకశంక పొడముచున్నది. దానికిఁ గారణమును మన మూహింపఁగలము. ఎట్లన్నను :- భారతములోనిమొదటి మూఁడుపర్వములలో వేదవేదాంతార్థ ప్రతిపాద


కము లగు ఘట్టములు లేవు. అట్టి పర్వత్రయముం దెనిఁగించిననన్నయ భట్టుగాని, భారతపరాంశ మగుహరివంశముం దెనిగించినశంభుదాసుఁడు గాని కేవలము వేదాంతార్థప్రతిపాదకము లగుఘట్టములం దెనిఁగింపరైరి. అందుచేతఁ బైయిర్వురుకవుల కట్టిసామార్థ్య మున్న దని చెప్పెడు గ్రంథదృష్టాంతములు శ్రీనాథునకుం గానుపించక పోవచ్చును. ఇఁక తిక్కనసోమయాజి కవిత్వములో నట్టివేదాంతార్థప్రతిపాదకము లగు నుద్యోగ, శాం, త్యానుశాసనికపర్వము లుండుటంబట్టియు, నట్టివానిని వేదాంతరహస్యములు దెలియనివారికిఁ దెనిగింప నసాధ్యము లవుటయుం జూచి శ్రీనాథుం డట్లు వ్రాసి యుండె నని యూహింపనై యున్నది. ఇదియునుగాక వేద వేదాంతార్థములు కేవలము తెలిసినను దదుక్తకర్మాచరణము లేనివారల కట్టిపట్లు తెనిఁగింప సమర్థత యుండ దని శ్రీనాథుఁడు తానట్టివాఁడు గాకుండుటంబట్టి యూహించి యుండును. శ్రీనాథుఁడేగాక యతనితండ్రియును దాతయుఁగూడ వైదికసంపత్తి లేనివారే. తిక్కనసోమయాజివంశ మట్లు గాదు. సోమయాజితండ్రి యగు కొమ్మనామాత్యుఁడు సాంగవేదవేది యని యుండె. తిక్కనసోమయాజి వేదవేదాంగముల నేర్చినవాఁడేగాక వైదికమార్గనిష్ఠమగువర్తనమును నిర్వహించునట్టియజ్వగా నుండెను. కావునఁ బై విషయములలో శ్రీనాథుఁడు తనకంటెను నన్నయభట్టాది పూర్వకవులకంటెను భారతామ్నాయముం దెనిఁగించుటకుఁ దిక్కన యొక్కఁడే లౌక్యవైదికములు రెండింటను సమర్థుఁ డని యెంచి యారీతిగా వర్ణించెను. "నాబ్రహ్మా క్రమపాఠకః" అని సామాన్యపుక్రమపాఠకులనే బ్రహ్మయంతవాఁ డని చెప్పఁగా వేద వేదాంగములం జదివి తదర్థావబ్ఫ్ధము కల్గి తద్రహస్య వేది యై, తదుక్తశ్రౌతస్మార్తకర్మముల నాచరించుచు, నాంధ్రమునఁ గవిత్వమహాదీక్షావిధి నుండి యందు నిరుపమాన కవిత్వమహత్త్వముం జూపి భారతము నాంధ్రీకరించినతిక్కనయజ్వను సర్వవిధములఁ గవిబ్రహ్మ యని శ్రీనాథుఁడు చెప్పుట యెంతయు నొప్పి యున్నది. ఇట్లు శ్రీనాథుఁడే


కాక యతనికిఁ బూర్వుండును భారతకవులలో నొక్కండును నగునెఱ్ఱా ప్రెగ్గడయు నీతిక్కనసోమయాజి నాంధ్రకవి బ్రహ్మగానే వినుతించెను. ఇట్లిర్వురు ప్రామాణికకవులచే నిర్ణయింపఁబడినవిధంబున తిక్కనసోమయాజి యాంధ్రకవిబ్రహ్మయే యని నిర్ణయించెదము. ఇటులనే యనన్యసాధ్యము లగుభాగవతరహస్యార్థములం దెలిసి వాని నాంధ్రీకరించినపోతరాజు, ఆంధ్రవేదవ్యాసుం డనియును, వసిష్ఠ, విశ్వామిత్ర, బ్రహ్మఋషుల యద్వైతతత్త్వార్థముల గ్రంథరూపములుగ నాంధ్రంబునఁ బ్రకటించిన మడికిసింగనకవియు, పరశురామపంతులలింగమూర్తిగురుమూర్తియుఁ గ్రమంబుగ నాంధ్రవశిష్ట, విశ్వామిత్రఋషు లనియును, నితరపురాణాదులం దెనిఁగించినశ్రీనాథాదికవు లాంధ్రగౌతమాదిఋషు లనియు వర్ణించి చెప్పెదము. ఇట్టిఋషికల్పు లగునాంధ్రకవులసహాయముననే యీవఱకు వేదాభ్యాసాధికారులు గాని స్త్రీశూద్రులును, సంస్కృత భాషాభ్యసనాశక్తు లగునాంధ్రద్విజులును తరణోపాయము నంది యుండి రనుటకు సందియము లేదు. ఇఁక ముందు దేశభాషలే ప్రబలఁగ సంస్కృతము పరిక్షీణింపఁగ వేదశాస్త్రాభ్యాసము లేక యాంధ్రు లందఱును నీపై నాంధ్రగ్రంథములే వేదకల్పములుగఁ జదువుదు రనుదాని కొకసందియమును నుండదు. కావున లోకోపకారు లగునాధునికపండితు లందఱును బైకవులగ్రంథములలోనితత్త్వము నేకముఖము చేసి సంగ్రహగ్రంథములం జేసి యుంచెదరుగాక.

శ్రీనాథునితాతంగూర్చి.

భారతకవుల వృత్తాంతము వ్రాయుచు శ్రీనాథునితాతంగూర్చిన కథ వ్రాయుట కెడయయ్యెను. అతనింగూర్చిన పద్యములలో నతఁడు సముద్రతీరమున నొప్పుకాల్పట్టనమున కధీశ్వరుం డని శ్రీనాథునిచేఁ జెప్పంబడియె. ఈకాల్పట్టణముయొక్క తావు ప్రస్తుతము ద్యోతకము కాక యున్నది. దానిం దెలియుట కతనిచేత రచితమైనపద్మపురాణ సంగ్రహకావ్యములో నేమైన నాధార ముండునేమో? అని దానింగూర్చి విచా


రింపఁగా నాగ్రంథము నట్లుగనే నామావశిష్ట మయ్యె. కావున మన మిపుడు కమలనాభకవినివాసస్థలము నిర్ణయింపలేము. అతఁడు సరససాహిత్యచక్రవర్తి యని శ్రీనాథునిచేఁ జెప్పంబడుటచే నతఁడును తిక్కనసోమయాజి పితామహునివలెనే యొకగొప్ప యాంధ్రకవి యని మాత్ర మూహింప నై యున్నది. దీనింబట్టి శ్రీనాథునితండ్రియును శ్రీనాథుఁడును సంప్రదాయసిద్ధాంధ్రకవులని నిశ్చయింప వచ్చును. వంశపరంపరాగతము లగువిద్యల నందిన కవులతో నితరకవులు సాటిరా రని చెప్పుటకుఁ దిక్కన సోమయాజులును శ్రీనాథుఁడును సాక్షులై యున్నారు.

ఆంధ్రభాష కర్ణాటభాష యనుట.

ఈశ్రీనాథుఁడు తనకవిత్వమును గర్ణాటభాష యని వచియించెను. దానికి భీమఖండములోని పద్యము :-

గీ. ప్రౌఢిఁ బరికింప సంస్కృతభాష యండ్రు, పలుకునుడికారమున నాంధ్రభాష యండ్రు
    ఎవ్వ రేమన్న నండ్రు నా కేమికొఱఁత, నాకవిత్వంబు నిజము కర్ణాటభాష.

శ్రీనాథునికవిసార్వభౌమ బిరుదు.

ఈశ్రీనాథునకుం గవిసార్వభౌమబిరుదు గల్గినట్లుగా నొకటిరెండుస్థలంబులం గాన్పించును. అం దొకటి యితని కాశీఖండములోపలను రెండవది యితనివీథినాటకములోపలను గాన్పించును. కాశీఖండములో నితనిప్రభుం డగు వేమారెడ్డి యితనినుద్దేశించి చెప్పినపద్యము. ఎద్దియన:

"శా. ఈక్షోణి న్నినుఁ బోలుసత్కవులు లే రీమేటికాలంబులో
       ద్రాక్షారామ చళుక్యభీమవర గంథర్వాప్సరోభామినీ
       వక్షోజద్వయగంధసారఘుసృణద్వైరాజ్యభారంబు న
       ధ్యక్షించున్ గవిసార్వభౌమ భవదీయప్రౌఢసహిత్యముల్"

శ్రీనాథునివీథినాటకములోని సీసపాదము.

"చంద్రశేఖరక్రియాశక్తిరాయలయొద్థఁ, బాదుకొల్పితి సార్వభౌమబిరుదు"

శ్రీనాథునిదిగ్విజయము.

ఈశ్రీనాథకవి యనేకసంస్థానములఁ జూడ బోవుచు నచ్చటిపండితుల జయించి విశేషబహుమానముల నంది విశేషవిఖ్యాతిఁ గాంచినట్లు


గా నితనివీథినాటకములోన నీక్రిందిపద్యమువలనఁ గాన్పించును. అది యెట్లన్నను :-

"సీ. దీనారటంకాలఁ దీర్థ మాడించితి, దక్షిణాధీశుముత్యాలశాలఁ
      బల్కుతోడై తాంధ్రభాషామహాకావ్య, నైషధగ్రంథసందర్భమునకుఁ
      బగులఁ గొట్టించి తుద్భటవివాదప్రౌఢి, గౌడడిండిమభట్టుకంచుఢక్క
      చంద్రశేఖరక్రియాశక్తి రాయలయొద్దఁ, బాదుకొల్పితి సార్వభౌమబిరుద.

గీ. మెటుల మెప్పించెదో నన్ను నిఁకమీఁద, రావుసింగన్నభూపాలు ధీవిశాలు
    నిండుకొలువున నెలకొని యుండి నీవు, సరససద్గుణనికురుంబ శారదాంబ !"

ఈ పద్యమువలన నీశ్రీనాథకవి దక్షిణాధీశ్వరునియాస్థానంబునకును రాయలసంస్థానమునకును, రావుసింగ నృపాలునిసభకును బోయి యున్నట్లు గానుపించును. గౌడడిండిమ భట్టుతో సంవాదము చేసి యతని కంచుఢక్కం బగులఁ గొట్టించునట్లు కాన్పించెడిని. గౌడదేశమునకుగూడఁ బోయి యుండవచ్చును. లేదా డిండిమభట్టు శ్రీనాథుఁ డుండు సంస్థానమునకు వచ్చి యుండునపు డాతనితో వాదించి యైన నుండునోవు. ఆంధ్రదేశమునకు సమీపంబున నొకయెల్లగా నున్న గౌడదేశమునకు నోఢ్రదేశ మని పేరు. దాని యందే జగన్నాథ మనుపురుషోత్తమక్షేత్రముండుటం జేసియు నది మధ్యాంధ్రదేశస్థులకు సమీపయాత్రస్థాన మగుటం జేసియు, నీశ్రీనథునిప్రభుం డగు వేమభూపాలుని తమ్ముఁ డగువీరభద్రారెడ్డి దేశములోనిచిల్క సముద్రమున కతిసమీపంబున నుండుటంబట్టియు శ్రీనాథుడే జగన్నాథమునకుం బోయియుండె ననియును నట్టిసమయములో నచ్చోఁ బండితుఁడుగా నుండు డిండిమభట్టు పరదేశమునుండి వచ్చియున్న శ్రీనాథకవినిఁ దిరస్కరించి యుండినట్లును నూహించుటయే సయుక్తికముగా నున్నది. ఇది యాంధ్రదేశమున కుత్తరముగ నున్నది. రాయలసంస్థాన మనునది యాంధ్రదేశమునకుఁ బశ్చిమమున నున్నకర్ణాటదేశములోనియానెగొందె యనుపేర నొప్పు విజయనగర మై (Buja-nagar) యున్నది. రావుసింగభూపాలునిసంస్థానమును దేశమును నెల్లూరును నుత్తరార్కాడుజిల్లాలలోనిదై యున్నది. ఇవి యాంధ్రదేశమునకుఁ


బ్రాగ్దక్షిణభాగముల నున్నవి. "దక్షిణాధీశునిముత్యాలశాల" అనునది కేవలమును దక్షిణదిక్కున నున్న ట్లూహింప నై యున్నది. దీనింబట్టి చూడ శ్రీనాథుఁ డాంధ్రదేశము నలుప్రక్కలం దిరుగుటయే గాక యా దేశమునకు సమీపంబున నున్న ద్రావిడకర్ణాటదేశములను నోఢ్రదేశమునుంగూడ దిగ్విజయార్థమై చూచియున్న ట్లూహింప నై యున్నది.

శ్రీనాథుఁడు రాయనిసంస్థానమునకుం బోవుట.

పైపద్యములో వివరించినశ్రీనాథునిదిగ్విజయములలో మొదటి రెండును స్థలనిర్దేశములే కానివి కావున వానిని వదలి యితఁడు రాయలసంస్థానమునకుఁ బోయి యున్న పుడు జరిగిన వృత్తాంతమును, రావుసింగభూపాలునిసభకుం బోయియున్నపుడు జరిగినవృత్తాంతములను గొంత వివరించెదను. అందు మొదటిది రాయలయాస్థానమందు జరిగినవిశేషములు. అచ్చోటికి శ్రీనాథుఁడు పోయియున్నపుడు శ్రీనాథుఁ డని యెఱుఁగక రాయలు నీవాసస్థాన మెచ్చోటను అని యడిగినసంప్రశ్నమునకు శ్రీనాథుం డిట్లుగా నుత్తర మిచ్చెను. ఎట్లన్నను :-

కొండవీటివర్ణనము.

సీ. పరరాజపరదుర్గపరవైభవశ్రీల, గొనకొని విడనాడు కొండవీడు
    పరిసంథిరాజన్యబలముల బంధింప, గురువైనయుఱిత్రాఁడు కొండవీడు
    చటులవిక్రమకళాసాహసం బొనరించు, కుటిలారులకుఁ జోడు కొండవీడు
    ముగురురాజులకును మోహంబు పుట్టించు, కొమరున మించినకొండవీడు

గీ. చటులమత్తేభసామంతసారవీర, భటనటానేక హాటక ప్రకటగ్రంథ
    సింధురార్భట మోహనశ్రీలఁ దనరు, కూర్మి నమరావతికిఁ జోడు కొండవీడు.

ఇట్లు శ్రీనాథుఁడు పలుకఁగా రాయ లతనిని శ్రీనాథునిగా నెఱింగి యథోచితసత్కారంబు లాచరించి తమపట్టణమునఁ గొన్ని దినంబు లుండుటకుఁ బ్రార్థించెను. శ్రీనాథుఁడును దానికి సమ్మతించి యుండెను. ఇదివఱలో శ్రీనాథునిచేఁ జెప్పఁబడిన సార్వభౌమబిరుదము స్థిరపఱుచుటకు జరిగినసం వాదముగాని దానికిం గల్గు కారణములుగాని తెలు


పుగ్రంథములసహాయము లేకుండుటంబట్టి యట్టివృత్తాంతము దెలుపక శ్రీనాథుఁ డానిగొందెలో నున్నపుడు జరిఁగిన మఱియొకకథ వివరించెద నది యెద్ది యనఁగా :-

గృహ రాజు మేడవృత్తాంతము.

శ్రీనాథుఁడు పైనిఁ జెప్పినవిధంబున రాయలకడ నుండ నొకనాఁడు రాయలవలన గృహరాజుమేడ యనునొకసౌధవిశేషంబు గట్టించుయత్నము చేయంబడుచుండెను. అట్టివృత్తాంతమును దెలిసికొని యా మేడ తమప్రభుం డగుకోమటివేమారెడ్డికే యుండవలయు ననుకోర్కెతో శ్రీనాథుఁ డాగృహరాజుమేడ మాప్రభుం డగు వేమారెడ్డి కట్టించి యుండెను. దానిం జూచి మీరును గట్టింపవచ్చునని పల్కెను. అట్టిమేడ మిగుల నపురూపమైనదగుటంజేసి వేమారెడ్డి దానిం గట్టించియే యున్నఁ దాఁ గట్టించు నవసరములే దనియు నైన నది యేవిధముగాఁ గట్టం బడెనో యారసి రం డని తన భృత్యులలోఁ దగువారిం బంప నిర్ణ యించెను. ఆవృత్తాంతము తెలిసికొని శ్రీనాథు డు తనజనములోఁ గొందఱం బిలిచి వేమారెడ్డి కావార్తందెలిపి తనమాట బోటుపోకుండఁ ద్వరలో గృహరాజుమేడం గట్టి సిద్ధము చేసి యుంచు మని చెప్పి పంచెను. అట్టి వృత్తాంతము వినినతోడనే వేమారెడ్డి యట్టిగృహరాజుమేడ కట్టించలే నేమో యని దిగులుపడి యుండఁగా నతనియిలువే ల్పగుమల్లగూరిశక్తి యతని స్వప్నములో వచ్చి కొండవీటిలో నున్న పోతరాజుగుడిద్వార మందున నొకముసలితుమ్మమ్రా నున్న దనియును, దానిని దెచ్చి స్తంభముగా వేసినచో గృహరాజుమేడ కట్టవచ్చు ననియుం జెప్పెనఁట. అపుడు వేమారెడ్డి లేచి స్వప్నానుసారముగా తుమ్మం గొట్టి తెప్పించి తొమ్మిదిదినములలో గృహరాజుమేడం గట్టించి సిద్ధము చేసెనఁట. ఇట్లుండ రాయప్రేషితు లగుభటులు వచ్చి గృహరాజుమేడం జూడ వచ్చితి మని తెలిపిరి. అపుడు వేమభూమీధవుఁడు వారిని సగౌరవంబుగాఁ బిలువ నంపించి గృహరాజుమేడ నంతయుం జూపి వారికి బహు


మతుల నిచ్చి మరల రాయలకడకుం బంపి వేసెనఁట. శ్రీనాథుఁడును వీరు మరల రాయలకడకు వచ్చినసంగతి తెలిసికొని తనమాట నెగ్గుటకు సంతసించి రాయలఁ దనకవిత్వంబున నలరింపంజేసి బహుమతుల నందికొని మరలఁ గొండవీటిలో నున్న తనప్రభునికడకు వచ్చి చేరెను.

శ్రీనాథుఁడు రావుసింగభూపాలునొద్దకుం బోవుట.

వేమభూపాలుఁడు తనకు రావుసింగభూపాలునితోఁ బని గల్గ శ్రీనాథుని అతనిసభకుఁ బంప నుద్యోగించెను. కాని ఆసింగభూపునకు నీ వేమభూపాలునకును విశేషముగ నంతస్తాపము లుండుటంబట్టియు సింగభూపాలునకు సర్వజ్ఞుం డనుప్రసిద్ధి యుండుటంబట్టియు నాతనియాస్థానమునకుం బోయినచోఁ దనకుఁ బరాజయము గల్గునేమొ యనుసంశయంబు శ్రీనాథునకుం గలిగెను. అట్టిసందేహము తనకుఁ గల్గి దానిం దెలియపఱుపక సభ్యులును సింగభూపుఁడును సంతసిల్లునట్లుగా సరస్వతీ ప్రార్థనామిషంబున శ్రీనాథుఁడు

"ఎటుల మెప్పించెదో నన్ను నింకమీఁద, రావుసింగన్నభూపాలు ధీవిశాలు !
  నిండుకొలువున నెలకొని యుండి యిపుడు, సరససద్గుణనికురంబ శారదాంబ"

అని తనపూర్వదిగ్విజయప్రకటనమును, సింగభూపునివిద్యావైదుష్యముం బొగడి చెప్పెను. దానికి వా రందఱును సంతసించిరి. అంతట శ్రీనాథుఁడు సింగభూపు నీక్రిందివిధంబున నుతియించె. ఎట్లన్నను :-

"క. సర్వజ్ఞనామధేయము, శర్వునకే రావుసింగజనపాలునకే
     యుర్విం జెల్లును నితరుని, సర్వజ్ఞుం డనుట కుక్క సామజ మనుటే."

అనుపద్యము వినియును సింగభూపాలుఁడు శ్రీనాథుఁ డని తెలిసికొని విశేషముగ బహుమానింప కుండుట కలిగి యతఁడు సింగప్రభుని యర్థసింహాసనంబునఁ బోయి కూర్చుండె. దానికిం గనలి యంతట నచ్చటి సింగభూపసభా పండితులు శ్రీనాథున కీక్రిందిసమస్య యిచ్చిరి.

అది యెట్లన్నను :-

"కుక్కవొ, నక్కవో, పులివొ, కోఁతివొ, పిల్లివొ, భూతపిల్లివో"

దాని నీక్రిందివిధంబున శ్రీనాథుఁడు పూర్తిచేసెను. ఎట్లన్నను :-

ఉ. తక్కక రావుసింగవసుధావరుఁ డర్థుల కర్థ మియ్య నే
    దిక్కున లేనికర్ణుని, దధీచిని, ఖేచరు, వేల్పు చెట్టుఁ, బెం
    పెక్కినకామధేనువు, శిబీంద్రుని వేఁడఁగ నేల యాచకా
    కుక్కవొ, నక్కవో, పులివొ, కోఁతివొ, పిల్లివొ, భూతపిల్లివో.

అని యిట్లు సమస్యాపూరణముం జేసియున్నశ్రీనాథుని సింగభూపుఁడు మహాకవిగఁ దెలిసికొని సగౌరవంబుగా నతనికోర్కె యడిగినఁ దనప్రభునికోర్కె యతఁడు దెల్పె. దానిం జేసి శ్రీనాథుం బంప నతఁడు తనప్రభుం డగు వేమనృపాలుకడకు వచ్చి సర్వజ్ఞసింగమనీనిఁ దా నలరించి వచ్చితి నని చెప్పెను. అపుడు వేమనృపాలుఁడు సర్వజ్ఞునిసభలో జరిగినవిశేషములు తెల్పు మనఁగా శ్రీనాథుఁడు వాని నన్నిటిని సవిస్తరముగాఁ జెప్పును. వేమభూపాలుఁడు తనవిరోధి యగుసింగమనీని సర్వజ్ఞు డని వర్ణింపగా మేము నట్టిబిరుదున కంగీకరించిన ట్లుండును గదా. కార్యార్థమై నిన్ను బంపియుంటిమి గాని నిజముగ నతని వర్ణించి యతనివలన బహుమాన మంది రాఁ బంపలేదే. నీ వెట్లుగ నతని సర్వజ్ఞుఁ డని నుతియించితివి నీలౌకికప్రజ్ఞకు లోప మాపాదించితి వని యధిక్షేపించెను. అట్టిపల్కులకు శ్రీనాథుఁడు నవ్వి నే నీవలనం బ్రేరేపింపఁబడి యచ్చటికిం బోయి యున్నచో నీ కవమానకర మగుపనిం జేసివత్తునా? అటుల నొనరింప లేదు. నేను యథార్థముం జెప్పినదానిని సర్వజ్ఞుఁడును నాతనియాస్థానపండితులును గ్రహింపలేక వారిసర్వజ్ఞత్వమును వారే పోఁగొట్టుకొనిరి. అనుడు సర్వజ్ఞుఁ డనుపద్యమున కేమియర్థము చెప్పితి వనుడు నాపద్యమునే మఱియొక విధంబునఁ జదివి చెప్పెను. ఎట్లన్నను :

క. సర్వజ్ఞ నామధేయము, శర్వునకే రావుసింగజనపాలున కే
    యుర్విం జెల్లును ? నితరుని, సర్వజ్ఞుం డనుట కుక్క సామజ మనుటే.

ఇ ట్లర్థము భేదించుటయే గాక రెండవపక్షములో దూషణము గూడఁ గన్పించునట్లు చదువుటకు వేమారెడ్డి యెంతయు సంతసించెను.

పైని వేమారెడ్డి సర్వజ్ఞునితో నొక కార్యము గల్గి శ్రీనాథునిఁ దత్కార్యార్థము పంపినట్లు చెప్పియుంటిమి. అట్టికార్య మతినీచకార్య


మైనను నిటఁ జెప్పక తీఱదు గావున దాని నిట వివరించెదను. వేమారెడ్డికిని సింగమనీనికిం గలవైరముం దీర్చుకొనుట కనేకమార్గము లిర్వుర కున్నను సింగమనీఁడు దానిం దీర్చుటకొకపడిగెముం జేయించి దానికి వేమారెడ్డి యనునామ ముంచి, ఊచవలెను వేమారెడ్డిం దేరా" అని తన భృత్యునితోఁ జెప్పుచుఁబ్రతినిముసమందున వేమారెడ్డిపేరు స్మరియింపుచు నెన్నిపరియాయము లూచినను నీవేమారెడ్డికిఁ దృప్తి లేదనియును, వేమారెడ్డివాతను సభ్యులందఱును నుమిసినగాని యతని కడుపు నిండ దనియు నిట్టి వే కొన్ని కార్యంబులు చెప్పి వేమారెడ్డిం గేలి చేయుచుండెను. అది వేమారెడ్డి వినియును సర్వజ్ఞసింగమనిని దండించుటకుఁ దగిన శక్తి లేకుండుటకు మిక్కిలి ఖిన్నుండై శ్రీనాథుని సింగమనీనికడకుం బంపి యాతని మానుపింప యత్నించె. అట్లు గావున శ్రీనాథుఁడు సింగమనీనిమనస్సు ముందుగ రంజిల్లుపద్యములం జెప్పి తన యభీష్టంబు తెల్పు మని యడిగిన సింగమనీనితోఁ బైయనుచితకార్యము మానుటయే తన యభిష్టమనియె. ఆమాటకు సింగమనీఁడు రసికుఁడును బండితుఁడును గావునని తరమూర్ఖభూపతులవలెం గాక దానిని వెంటనే తీసి వేసి యిఁక నెప్పుడును నట్టి యక్రమంబు గావింప నని పల్కెనఁట. సర్వజ్ఞ బిరుదు నందినభూపతియే యిట్టిదుర్నీతిగ నడిచె నని చెప్పి యుండఁగా నిఁక భూపతులదుర్నీతుల నే మని చెప్పవచ్చును. ఇది దేశచారిత్రము గావున నెట్టివృత్తాంతముల నైనం జెప్పక తప్పదు. దేశస్థు లందఱును నిట్టివి భావిజనోపకారులు గావున వీనిఁ బ్రకటించుట కనుజ్ఞ నీ యంగోరఁబడుచున్నారు.

శ్రీనాథుఁడు తెలుఁగురాయని సంస్థానమునకుఁ బోవుట.

సబ్బినాపిరాష్ట్రములోని రామగిరిదుర్గమున కధీశ్వరుం డగు తెలుంగురాయఁ డనునొకప్రభుండు గలఁడు. అతనిం దర్శించుటకుఁగాను శ్రీనాథుఁ డొకసమయంబునఁ బోయి యొకపద్యంబున నాశీర్వదించె. ఆపద్య మెద్ది యనఁగా :

శా. ధాటీఘోటకరత్నఘట్టనమిళద్ద్రాఘిష్ఠకళ్యాణఘం
     టాటంకార విలుంఠలుంఠితమహోన్మత్తాహితక్షోణిభృ
     త్కోటీడౌకితకుంభినీధరసముత్కూటాటవీఝాటక
     ర్ణాటాంధ్రాధిప సాంపరాయని తెలుంగా నీకు, దీర్ఘాయు వౌ.

ఇట్టిశ్రీనాథునిపద్యములోనిశయ్యాచమత్కృతి కెంతయు నలరి తెనుంగురాయఁ డతని శ్రీనాథునిగా నెఱింగి యతఁ డేమి కోరియుండెనో దానిఁ దెల్పు మనియె. అపుడు శ్రీనాథుఁ డొకపద్యంబునఁ దనకోర్కె తెల్పె. అది యెట్లన్నను :-

ఉ. అక్షయ్యంబుగ సాంపరాయని తెలుంగాధీశ కస్తూరికా
    భిక్షాదానము సేయురా సుకవిరాడ్బృందారకశ్రేణికిన్
     ద్రాక్షారామపురీవిహారవరగంధర్వాప్సరోభామినీ
     వక్షోజద్వయకుంభికుంభములపై వాసించుఁ దద్వాసనల్.

ఇట్లు శ్రీనాథుఁడు తనకుఁ గస్తూరి కావలయు నని యడుగఁగాఁ దెలుఁగురాయఁ డతనికిఁ గస్తూరియును విశేషము లగునితర బహుమానంబులును నిచ్చి యతని దేశమునకుం బోవ సెల వొసంగె.

తెలుఁగురాయ లెవ రని?

ఈపయిం జెప్పఁబడిన తెలుఁగురాయలు శ్రీనాథుని కాలములో మిగులఁ బ్రసిద్ధుండైనను నితనివిశేషములు తెల్పుగ్రంథసామగ్రి విశేషించి లేదు. ఇతనితండ్రి యగుసాంపరాయలంగూర్చి జైమినిభారతములో నొకసీసపద్యమున రెండుచరణము లున్నవి. అవి యెట్లన్నను :-

"సీ. దురములో దక్షిణసురతాను నెదిరించి, కొనివచ్చి సాంపరాయనికి నిచ్చె
      సామ్రాజ్యమున నిల్పి సాంపరాయస్థాప, నాచార్యబిరుదవిఖ్యాతిఁ గాంచె."

అని సాళ్వమంగరాజును వర్ణింపుచుఁ బిల్లలమఱ్ఱిపిన వీరభద్రకవి వ్రాసెను. ఇంతమాత్రమునఁ జరిత్రాంశములం దెలియంజాలునాధార మది కాదయ్యెను. కావున గ్రంథాంతరములం జూడఁగోరి మడికిసింగన కవికృతపద్మపురాణో త్తరఖండముం జూడఁ దెలుంగురాయనివర్ణన ముండుటంబట్టి యతఁడును నితఁడును నొక్కఁడే కానవచ్చు నని యూహించి యాపద్యముల నిందుఁ గీల్కొల్పుచున్నాఁడను. ఆపద్యములలో న


తనికుమారుని బిరుదంబులంబట్టియు, జైమినిభారతములోనివర్ణనంబట్టియు, శ్రీనాథునిచే వర్ణింపఁబడిన తెలుఁగురాయండును నీతెలుంగురాయండును నొక్కఁడే యని నిశ్చయింపఁదగి యుండును. ఆపద్యము లెవ్వి యనఁగా :-

మ. గురిజాలాన్వయదుగ్ధవార్ధిశశి దిక్కుంభీంద్రహస్తాభబం
     ధురభూభారధురీణనిశ్చలమహాదోర్దండుఁ డుగ్రారిభీ
     కరుఁ డై దిక్పరివర్తికీర్తి నెగడం గా భూరిభోగాఢ్యుఁ డై
     పరఁగెం ధాత్రిఁ దెలుంగురాయఁడు జగత్ప్రఖ్యాత రాజ్యోన్నతిన్.

చ. అతనికి నగ్రభార్య వినయాంచిత నిత్యశు భైకశీల సు
    వ్రత నియతాత్మ సజ్జనపరాయణ ధర్మవివేకసార స
    న్నుతహృదయానుకూల సుగుణోజ్జ్వల నాఁదగుమల్లమాంబయం
    దతులితరామలక్ష్మణశుభాకృతు లిద్దఱు పుట్టి రాత్మజుల్.

వ. అం దగ్రసంభవుండు.

క. శ్రీకంఠుఁడు సకలజనవ, శీకరణసుకీర్తియుతుఁడు చిరతరగుణర
   త్నాకరుఁడు సతతదానద, యాకల్పుఁడు ముప్పదిక్షమాధీశుఁ డిలన్.

ఆంధ్రపద్మ పురాణోత్తరఖండము.

"వ. ఇతఁడు సోదరుం డగుముత్తభూపాలుండు సహాయుండు గా గౌతమీదక్షిణంబున బరమపావనం బైనసబ్బనాపి రాష్ట్రంబున, రామ గిరిపట్టణంబు నిరాజధానిగ, బురందరవిభవుం డై రాజ్యంబు చేయుచు, నీరునెత్తురుగండ, గోపాలకాంచిరక్ష పాలక, చోడరాజ్యస్థాపనాచార్య, దొంతిమన్ని యవిభాళ, చలమర్తిగండ, గజగంధవారణ, రాజగజకేసరి, మూరురాయజగదళవిభాళాది నానాబిరుదవిఖ్యాతుం డై ముప్పభూపాలుం డుండు" అని యున్నది.

పైపద్యములంబట్టి తెలుంగురాయఁ డనునొకపెద్దరాజుగాఁ దెలియవచ్చుచున్నది. చోళరాజ్యస్థాపనాచార్యబిరుదు లీతని వంశమువారికిఁ గల్గియుండుటంజేసి వారు చోళరాజులప్రభుత్వములో సామంతమండలాధిపులుగా నున్నట్లును, ఆచోళరాజులు క్షీణించుసమయములో నాసంస్థానమువారు కర్ణాటాంధ్ర రాష్ట్రములలోఁ గొంతభాగము నాక్రమించుకొని యున్నట్లును నూహింపనై యున్నది. ఈ రాజులవంశనామము గురిజాలవారు అని కలదు. ఇతనింగూర్చి దేశచారిత్రములో వివ


రించి వ్రాయఁబడుం గావున నిప్పటి కీతనికథ ముగించెదము. కాని శ్రీనాథునకు సార్వభౌమబిరుదు గల్గించినసంస్థాన మిది కా దనియును, అది యానెగొందెసంస్థానములో నున్నదనియును జెప్పందగి యున్నది.

శ్రీనాథునిప్రభుఁ డగువేమారెడ్డి యని యిదివఱలో వ్రాసియున్నాను. కాని వేమారెడ్డినాము లనేకు లుండుటంబట్టి యితనిప్రభుండగువేమన యెవ్వరో బోధకాకుండును. కొండవీటిదండకవిలెలోఁ గోమటివేమారెడ్డి యితనికిఁ బ్రభుం డని వ్రాయంబడి యున్నది. కాశీఖండముకృతిపతి యగువీరభద్రారెడ్డి కన్న యగు వేమారెడ్డికూడ నీతని ప్రభుం డయినట్లు కాశీఖండములోఁ గానుపించును. ఆవేమనకు రాచ వేమన యని పేరు గలదు. అతడు రాజమహేంద్రవరములో నున్నట్లు కాన్పించు. కోమటివేమన అనపోతరెడ్డికుమారుఁడు. ఇతనిది కొండవీడు. ఆ వివరముంగూర్చి విశేషము చర్చింపవలసి యున్నదిగావున నిపు డద్దానిం దెల్పుటకుఁ బూర్వము కొండవీటిదండకవిలెలో నున్న కొన్ని మాటల నీక్రింద వ్రాసెను.

కొండవీటిదండకవిలెలో నీశ్రీనాథునకుఁ గోమటివేమన్న వలన రెండుపాలెము లీయఁబడె ననియును, అం దొకదానికి సొలసపాలె మనియు, రెండవదానికిఁ బాలెమనియు నామ మున్నట్లును జెప్పఁబడియె. ఆరెండ్రుగ్రామములును దొంతి, అల్లాడరెడ్డికాలములో నల్లా రెడ్డికూఁతునకు నతనివలన సంక్రాంతిపండుగబహుమానముగా నీయఁబడిన వనియు నున్నది. అల్లారెడ్డికూఁతురుపేరు వేమాంబ. ఆమెకు నామాంతరము మైలమ్మ యని కలదు. అయిలమ్మ కాగ్రామము లిచ్చి పొలిమేర హద్దులు పెట్టించి యం దొకదానికయిలమ్మపేరిట నయిలవర మనియును, రెండవదానికి సంక్రాంతిపండుగకుఁగా నీయఁబడుటచేత సంక్రాంతి పాలె మనియు నామకరణములు చేసిరి. నాఁడు మొద లవి ప్రత్యేకగ్రామము లాయె నని యున్నది. కాశీఖండములో శ్రీనాథకవి తనప్రభుఁ డగువేమారెడ్డివంశము నీక్రిందివిధంబుగఁ దెల్పె.


ఈపైవంశవృక్షముంబట్టి శ్రీనాథునిసమకాలీనుఁ డగువేమారెడ్డి అల్లాడరెడ్డికుమారుఁ డగునళ్లయవేమన యని చెప్పఁదగును. పైదండకవిలెలోఁ గోమటివేమన్న కాలములో శ్రీనాథునకు గ్రామము లీయంబడినట్లుగాను, ఆగ్రామము లల్లాడరెడ్డికాలములో నతనికూఁతున కియ్యంబడినట్లును జెప్పంబడి యున్నది. శ్రీనాథుఁ డీయల్లాడరెడ్డికుమారుఁ డగువేమారెడ్డియధికారమునాఁటికి ముదుసలి యై యుండును. పైకోమటివేమనకాలము కొండవీటిదండకములో శా. స. 1278 మొదలు 1305 వఱకు నున్నట్లు వ్రాయఁబడినది. కాని కోమటి వేమనయనంతర మతనికొడు కగురాచ వేమన యధికారమునకు వచ్చిన ట్లాగ్రంథములో నున్నది. కాని రాచవేమన కోమటివేమనకొడుకు గాక, అల్లాడరెడ్డి కుమారుఁడే యైనట్లు పై వంశవృక్షమువలనం గాన్పించును. కారణాంతరమునఁ గోమటివేమనయనంతరము, అల్లాడరెడ్డి (అనగా, అనవేమారెడ్డికొడుకున కల్లుఁడు) కొంతకాలము ప్రభుత్వము చేసెను. ఇతనిశాసనములు 1338 వ శా. స. మున నుండుటచేత నతఁ డంతవఱకుఁగాని యింకను బిమ్మటఁగాని రాజ్యముచేసినట్లు కాన్పించును. (Lists of


Antiquities by Mr. R. S. Vol II.) ద్రాక్షారామ శాసనములలో నల్లాడరెడ్డికుమారుని శాసనము 1359 లో నున్నది. దీనింబట్టిచూడ శ్రీనాథునకుఁ గోమటి వేమనచేఁ బైరెండుపాలెము లీయఁబడి యవి మరల నల్లారెడ్డిచే నాక్రమింపఁబడినట్లుగాఁ గాన్పించు. అంతట శ్రీనాథుఁడు అల్లాడరెడ్డి నాశ్రయింపక యుండి యతనియనంతరము రాజ్యమునకు వచ్చినరాచవేమనమన్నన నంది కాశీఖండ మతనితమ్మునకుఁ గృతి యిచ్చినట్లు కాన్పించు. తక్కినవిశేషములు ముందు దేశచరిత్రములో వ్రాసెదను.

వేమారెడ్డిపండితుల కిచ్చినసమస్య.

శ్రీనాథుఁడు తాను దిగ్విజయార్థము పోవుచు, వేమారెడ్డిసభాపండితుల కొకసమస్య యిచ్చి తాను మరల నాఱుమాసములకు వచ్చి చేరెద ననియును నంతకులోపున నాపద్యముం బూర్తిచేసి యుంచవలయు ననియుం దెల్పెను. ఆపద్య మెద్దియనగా :-

"క. కొంచెపుజగములలోపల, సంచితముగ నీదుకీర్తి యలవేమనృపా"

పై సమస్యాపూరణంబు చేయుట కాపండితులకుఁ దెలియక యూరకుండిరి. అంతట మఱికొన్ని నాళ్లకు శ్రీనాథుఁడు తనప్రభునికడకు వచ్చి తనతొంటిపద్యము నీక్రిందివిధంబుగఁ బూరించె. ఎట్లన్నను :-

"మించెన్ గరి ముకురంబునఁ, బంచాక్షరి శివుఁడు మదిఁ బ్రపంచముపోలెన్"

ఈ శ్రీనాథుఁడు శృంగారనైషధము, భీమఖండ కాశీఖండము లనుగ్రంథములను రచియించుటకుఁ గొన్నిగాథలు కల్గియున్నట్లగా నీ దేశస్థులు చెప్పుకొనియెదరు. ఆగాథలు గ్రంథములో నెట్లుగా నున్నవో వానిం జూపి పిమ్మట విశేషముగా భేదించువానినిగూడ వివరించెదను.

శృంగారనైషధకృతిని గుఱించినకథ.

ఇందుఁ గృతిపతి యగునతఁడు మామిడి సింగమంత్రి. ఇతని వృత్తాంత మెఱుఁగనివారిచేఁ జెప్పంబడుగాథను, అనంతరము చెప్పం దలంచి తొలుత శ్రీనాథకృతశృంగార నైషధములో వ్రాసినదాని న్వివరించెదను. ఎట్లన్నను :"వ. నవరసభావానుబంధబంధురంబుగా నే నొక్కప్రబంధంబు నిర్మింపందలంచి కౌతూహలాధీనమానసుండనై యిమ్మహాప్రబంధప్రారంభంబునకుం దగినపుణ్యశ్లోకపు రాతనమహారాజచరిత్రం బెయ్యదియొకో యని వితర్కించుచున్న సమయంబున.

సీ. తనకృపాణము సముద్ధతవైరిశుద్థాంత, తాటంకముల కెగ్గు దలఁపుచుండఁ
    దనబాహుపీఠంబు ధరణిభృత్కమఠాహి, సామజంబులకు విశ్రాంతి యొసఁగఁ
    దనకీర్తినర్తకి ఘనతరబ్రహ్మాండ, భవనభూముల గొండ్లిఁ బరిఢవిల్లఁ
    దనదానమహిమ సంతానచింతారత్న, జీమూతసురభుల సిగ్గుపఱుపఁ

గీ. బరఁగుశ్రీవేమమండలేశ్వరునిమంత్రి, యహితదుర్మంత్రివదనముద్రావతార
    శాసనుఁడు రాయవేశ్యాభుజంగబిరుదు, మంత్రిపెద్దయసింగ నామాత్యవరుఁడు.

వ. మృధుమధురచిత్రవిస్తారకవితావిలాసవాగీశ్వరు లగుకవీశ్వరులును, పతంజలి, కణాద, అక్షచరణ, పక్షిలాదిశాస్త్రసిద్ధాంతక మలవనహంసు లగువిద్వాంసులును, భరతమతంగదత్తిళ, కోహళాంజనేయప్రణీత సంగీతవిద్యారహస్యవిజ్ఞానవైజ్ఞానిక స్వాంతు లగు కళావంతులును, శక్తిత్రయ, చతురుపాయ, షాడ్గుణ్య ప్రయోగయోగ్యవిచారు లగురాయబారులును, నిఖిలపురాణేతిహాససంహితాతాత్పర్యపర్యాలోచనా ధురంధరధిషణాస ముత్సాహం బగుపౌరాణిక సమూహంబును బరివేష్టింపం గొలువుండి, సరసవిద్యాపారంగతుండు సరససాహిత్యగోష్ఠివి నోదప్రసంగంబున :-

శా. భారద్వాజపవిత్రగోత్రుని శుభాపస్తంబసత్సూత్రు వి
     ద్యారాజీవభవుండు మారయకుఁ బుణ్యాచార భీమాంబకుం
     గారా మైనతనూజు న న్న నఘు శ్రీనాథాఖ్యునిం బిల్చి స
     త్కారం బొప్పఁగ గారవించి పలికెన్ గంభీరవాక్ప్రౌఢిమన్.
     ...........................................................................

వ. కావున నాకు నొక్కప్రబంధంబు పుణ్యశ్లోకపురాతనరాజర్షి చరితానుబంధ బంధురంబుగా రచియింపుము. అందు :-

గీ. భట్టహర్షుండు ప్రౌఢవాక్పాటవమున, నెద్ది రచియించి బుధలోకహితముఁ బొందె
    నట్టినైషధసత్కావ్య మాంధ్రభాష, ననఘ యొనరింపు నాపేర నంకితముగ.

వ. అని పల్కి సబహుమానంబుగఁ గర్పూరతాంబూలం బొసంగి జాంబూన దాంబరాభరణంబులు గట్ట నిచ్చి వీడ్కొలిపిన, నేను నమ్మహాప్రధానునిం గృతినాయకుం జేసి నైషధకావ్యము చెప్పందొడంగితి."

ఇట్లున్న పద్యములం జూడఁగ లోకములోనియందఱుకృతిపతులును కవీశ్వరుని గృతి యిమ్మని యడిగినప్పు డెట్లుగా నడిగెదరో అటుల పే శ్రీనాథకవిని సింగనామాత్యుండు నడిగినట్లున్నది. శ్రీనాథుఁడును దాని కుత్తరము గ్రమముగనే లోకములోని కవులంబోలి యిచ్చియున్నాఁడు. అంతకంటె నధికప్రసంగమున కవసరము లేదు. ఇట్లుండఁగా నిఁక లోకములో వ్యాపించియుండుగాథ మిక్కిలి నింద్యముగాను, లోకానుభవముచే సందర్భహీన మైనదిగా నుండును. అట్టికథకు మూలము శ్రీనాథకవి స్త్రీలోలుఁ డని లోకములోఁ గలమూఢజనాభిప్రాయమై యున్నది. అట్టియభిప్రాయము నదియైనది కాదని నుడివి ముప్పదియిద్దఱునియోగులచరిత్రములో వివరింపఁబడినవృత్తాంతము నీక్రింద వివరించి పూర్వపక్షము చేసెదను. ఎట్లన్నను :-

శ్రీనాథుఁడు శృంగారనైషధము రచియించి రాచవేమన యను వేమారెడ్డికిఁ గృతి నీయం గమకించి యతఁ డున్న యూరునకుఁ బోవుచుండఁ ద్రోవలో నొకవర్షము సంతతధారగాఁ గురియఁ బ్రయాణంబు నిలుపు చేసి తనయానంబుతో నీ మామిడిసింగనామాత్యుఁడు కరణముగా నున్నగ్రామమునకుఁ బోయి యుండెనఁట; అపు డాసింగన శ్రీనాథుని రాక విని యతనిం జూడఁ బోయి యాదినంబు తనయింట విడిసి తనగృహంబు పావనము చేయుఁ డని ప్రార్థించెనఁట! అపుడు శ్రీనాథుం డట్ల యని సమ్మతించి రాఁ గని సింగన యాదినము తనపితృకార్యార్థమై సమకూర్చియుంచినవిశేషపదార్థము లన్నిటితో శ్రీనాథునకు ముందుగ భోజన మిడి యనంతరము మఱికొన్ని పదార్థములు దెచ్చి తనపితృకార్యంబు నెఱవేర్పుడు, శ్రీనాథుం డట్టిమన్ననకు మిగుల సంతసించి యుండెనఁట. సింగన శ్రీనాథునిఁ దనయింట భోజనమునకు నిల్వుఁ డని కోరినయుదయము వేళనే శ్రీనాథుఁడు తన కారాత్రి యొక వేశ్యం దెప్పించి యిచ్చినం గాని తా నతనియింట భుజియింప రా నని నుడివినట్లును, ఈసింగన యట్లు తాను సమకూర్చెద నని యనుటచేతనే శ్రీనాథుఁ డాతనియింట భుజియింప నంగీకరించె ననియుం గలదు. ఆరాత్రి కల్గినవర్షప్రతిబంధమువలన నీసింగనమంత్రి వెలయాలిం దెచ్చి గూర్చుట


కు సమర్థుఁడు గాక యావృత్తాంతముం దెల్పిన శ్రీనాథకవి శపియించునేమోయనుభీతిచేత మిగులఁ జింతించి తనభార్యకు వేశ్యా వేషం బమర్చి శ్రీనాథునిపడకటింటిలో నిల్పె ననియును. అంతట శ్రీనాథుం డాపతివ్రతతోముచ్చటించి యాపె వెలవెలఁదుక గా దని నిశ్చయించి యా పెవృత్తాంతమును సమూలముగా గ్రహియించి సింగనమంత్రియొక్క సాహసౌదార్యముల కెంతయు సంతసించి తాను రచియించి యుంచినశృంగారనైషధ మాతనికిం గృతి యిచ్చి వేమారెడ్డిసభకుం బోయి జరిగినవృత్తాంత మంతయు నతనికిం దెల్పెనఁట ! అపు డారెడ్డి తన కాగ్రంథము కృతి యందునదృష్టము లేనందుకు మిగులఁ జింతించి యెట్లైన నే నిచ్చెద నని వాగ్దానము జేసిన నర్ధరాజ్యంబు నిచ్చి వేసెద నని పలుకఁగా శ్రీనాథుఁడు తనకుఁగా నీయనుంచిన రాజ్యార్ధము సింగమంత్రికి నిమ్మని పల్కెనఁట ! అపుడు వేమారెడ్డి కొంతవఱ కాలోచించి యర్థ రాజ్యంబు కవికిని సర్వరాజ్యమంత్రిత్వంబు సింగమంత్రికి నొసంగ నపుడు శ్రీనాథుండు మరలఁ దనయర్థ రాజ్యంబు రాజున కొసంగి మంత్రి నీక్రిందివిధంబుగా నుతియించెనఁట. ఎట్లన్నను :-

"క. శ్రీరాజరాజవేమ, క్ష్మారమణ కృపాకటాక్ష సంవర్ధిత ల
     క్ష్మీరక్షితబుధలోకో, దారగుణాధార సింగనామాత్యమణీ."

సింగనమంత్రివంశముంగూర్చి.

అని యిట్లు ద్వాత్రింశన్మంత్రి చరిత్రములో నున్నది :-

అట్టికథ యథార్థ మగునా యనుదానిఁ బరిశీలుంచుటకుఁ బూర్వము సింగమంత్రివంశస్థు లావఱకే మంత్రిత్వముం జేసియుండిరేని శ్రీనాథునిమూలముగ సింగన మంత్రి యయ్యె నని చెప్పెడుబలవత్తరమైనపూర్వపక్షము నిలిచిపోవును. ఆవిషయము శృంగారనైషధములో శ్రీనాథకవిచే వర్ణింపఁబడినసింగనవంశావళి నీక్రింద సంగ్రహించి వివరించెదను. కృతిపతి యగుసింగనమంత్రిపేరిటఁ జెప్పంబడినయీక్రిందిపద్యములలోనిబిరుదంబులంబట్టి చూడ నీసింగమంత్రి శృంగారనైషధముం గృతి నందునాఁటికే వేమభూమీశునియాస్థానమున రాజ్యనిర్వాహక తంత్రమున విశేషవిఖ్యాతిం గాంచి తనపూర్వు లగుమంత్రులకంటె నెక్కుడుబిరుదులు సంపాదించినట్లు కాన్పించును అది యెట్లనఁగా :-

సీ. గగనకల్లోలినీ కల్లోలమాలికా, హల్లీసకములతో నవఘళించి
    చరమసంధ్యాకాలసంపుల్లమల్లికా, స్తబక పంక్తులతోడ సరసమాడి
    శర దాగమారంభసంపూర్ణపూర్ణిమా, విమలచంద్రికలతో వియ్యమంది
    బిసరుహాసనవధూపృథుపయోధరభార, హారవల్లరులతో ననఁగి పెనఁగి

గీ. వెలయు నెవ్వానియభిరామవిమలకీర్తి, యతఁడు త్రిభువన రాయ వేశ్యాభుజంగ
    కదన గాండీవి, జగనొబ్బగండబిరుదు, శాశ్వతుం డొప్పు సింగనసచివవరుఁడు.

మ. అరుదారన్ వివిధాగ్రహారములతో నాందోళికాఛత్రచా
     మరకళ్యాణకళాచికాదిబహుసమ్మా నార్హ చిహ్నంబు లా
     దర మొప్పారఁగ వేమభూవరునిచేతం గాంచె సామ్రాజ్యసం
     భరణప్రౌఢుఁ డమాత్యసింగఁడు నయప్రాగల్భ్యగర్వోన్నతిన్.

ఈపైరెండు పద్యములవలనను సింగమంత్రికి శ్రీనాథునిచే శృంగారనైషధము కృతి నందువఱకే త్రిభువనరాయవేశ్యా భుజంగ, కదనగాండీవి, జగ నొబ్బగండబిరుదు లున్నట్లును, అనేకాగ్రహారములతో ఆందోళిక, ఛత్ర, చామర, కళ్యాణకళాచి (పొందాను) కాది సన్మానార్హ చిహ్నములు వేమభూమీశునివలన సంప్రాప్తములై నట్లును కనిపించుచున్నవి. ఇవియునుగాక షష్ఠ్యంతములలోను, అశ్వాసాదిమాంత్యపద్యములలోఁగూడ నుండినసింగమంత్రియొక్క మఱికొన్ని బిరుదులు మొదలగువాని నీక్రింద వివరించెదను :-

క. శ్రీమహితు పెద్దకొమరుఁడు, వేమక్షితిపాలరాజ్యవిభవకళార
    క్షామణికి సింగసచిన, గ్రామణికిం బాండ్య రాజగజకేసరికిన్.

క. కేళాదిరాయ యభినవ, లీలాసుక రాంకచంద్రలేఖాంకురచూ
    డాలంకారపదాంబురు, హాలింగనసుఖితనిర్మలాఁతఃకరణా.

ద్వితీయా శ్వాసాంతములో నీక్రిందిపద్యము లున్నవి.

"మ. నవరత్నోపలదివ్యలింగవరదానప్రీత దాక్షాయణీ
       ధవ, కర్పూరవసంతరాయ, యనవద్యద్వాదశీవాసరో
       త్పవరుక్మాంగద వేమభూపతిమహాసామ్రాజ్యరక్షామణీ
       యవనాధీశసభానిరంకుశవచోవ్యాపారపారంగతా."

మూఁడవయాశ్వాసాంతమున

"స్రగ్విణి. తల్లమాంబాసుతా ధైర్యహేమాచలా, పల్లవాదిత్య సౌభాగ్యభాగ్యోదయా
 పల్లవోష్ఠీ కుచప్రాంతభాగద్వయీ, గల్లపాళీలసత్కారముద్రాంకురా."

నాల్గవయాశ్వాసంతమున

"మాలిని. హరిచరణసరో జధ్యాననిష్ఠాగరిష్ఠా, ధరణిభరదిధీర్షాధఃకృతా హార్యవర్యా
 తరుణకమల నేత్రా తల్లమాంబాసుపుత్రా, విరహితమదళంకా, వీరనారాయణాంకా."

షష్ఠాశ్వాసాంతమున

క. అరివీరబసవశంకర, శరణాగతరక్షణానుసంధానధురం
    ధరసచివగంధసింధుర, ధరణీభరణైకదక్ష దక్షిణహస్తా.

పైపద్యము లన్నియును బర్యాలోచించి చూడఁగా నీసింగమంత్రి కిం గలబిరుదు లన్నియు స్పష్టము లగును.

1. త్రిభువనరాయ వేశ్యాభుజంగుఁడు.
2. కదన గాండీవి.
3. జగనొబ్బగండఁడు.
4. పాండ్యరాజ గజకేసరి.
5. కేళాదిరాయఁడు.
6. కర్పూరవసంతరాయఁడు.
7. పల్లవాదిత్యుఁడు.
8. వీరనారాయణుఁడు.
9. అరివీరబసవశంకరుఁడు.

ఇట్టిమహాబిరుదము లన్నియు వేమారెడ్డి సింగమంత్రికి నొక్క మాఱుగనే యిచ్చి యుండె నని యూహింప లోకానుభవవ్యతిరేకమై యుండును. ఒక్కొక్కబిరుద మొక్కొకమహాకార్యము చేసినప్పు డీ యంబడుట నైసర్గికము. ఇట్టిబిరుదు లన్నియు నీసింగనమంత్రిచేత నైషధగ్రంథరచనకుఁ బూర్వము పరిగ్రహింపఁబడినట్లుగనే యెంచవలయును. కాఁబట్టి నైషధగ్రంథమునకుఁ బూర్వము సింగమంత్రి కేవలము నొకగ్రామమునకు మిరాసీదారుఁడుగాక తండ్రితాతలనాఁటి నుండి సంక్రమించిన రెడ్డి సంస్థాన మహామంత్రియై యుండె నని చెప్పవలసి యున్నది. ఇదియును గాక ? శ్రీనాథకవిచేత నావఱకే యీసింగనమంత్రి యన్న యగుప్రెగడన దండనాథు డొకకృతి నందినట్లుగ నీ గ్రంథములోనే యున్నది ఎట్లన్నను :-

"క. జగము నుతింపఁగఁ జెప్పితి, ప్రెగడయ్యకు నాయనుంగు పెద్దనకుఁ గృతుల్
     నిగమార్థసారసంగ్రహ, మగునాయా రాధ్యచరిత మాదిగఁ బెక్కుల్."

ఇ ట్లుండుటంబట్టి శ్రీనాథకవి సింగనమంత్రివంశస్థులకు నపుడపుడు గ్రంథములఁ గృతి నిచ్చుచు నుండునాస్థానకవిగా నూహింపనై యున్నాఁడు. ఇంతవఱకును శ్రీనాథునకు రాచవేమభూమీశునిసభలోఁ బ్రవేశము కల్గినట్లే తోఁచదు. శృంగారనైషధగ్రంథానంతరము రచి యింపఁబడినభీమఖండములోఁ దద్గ్రంథకృతిపతి యగుబెండపూడి యన్నమంత్రి వంశవర్ణనము చేసి యప్రస్తుతముగా నాయన్న మంత్రికిఁ బ్రభుం డగు వేమభూమీశ్వరునివంశమును వర్ణించుటంబట్టి చూడ నందు మూలముగ నైనఁ దనపేరు రాచవేమభూపాలుని చెవిం బడఁగల దను కోర్కెతో శ్రీనాథుఁ డట్లు చెప్పుటకు సందియము లేదు. అన్నమంత్రి మూలముగ శ్రీనాథుఁడు వేమభూపాలునిమన్నన వడసి యుండుటంబట్టియే చివరకావ్య మగుకాశీఖండము రచియించుటయును, తదాదిగ నాప్రభునియాస్థానపండితుఁడై యుండుటయును దటస్థించె నని యూహింపనై యున్నది. కావున శృంగారనైషధగ్రంథము నందిన మామిడిసింగన యొకబోగముదానిం దెచ్చియిచ్చినం గాని నీయింట భోజనమునకు నిలువ నని శ్రీనాథునిచేఁ బల్కింపఁబడునంత నీచస్థితిలోఁగాని నీచజన్మములోగాని యున్నాఁ డని చెప్పఁజాలియుండఁడు. శ్రీనాథుఁడు సింగనమంత్రి యనుగ్రహము సంపాదించుకొనినచోఁ దనకు విశేష ధనసహాయము గల్గుటయే కాక యెప్పటికైన నతనిప్రభుఁ డగు వేమభూపాలునిదర్శనముగూడఁ గల్గు నని యూసించియు నుండును. అట్టిచో శ్రీనాథుఁడు సింగనకు నతని యజమానియైననుఁ జెప్పఁజాలనంత యతినీచకార్య మగుతార్పుడుపని చేయు మని చెప్పియుండఁడు. శ్రీనాథుఁడు స్త్రీలోలుఁ డని వాడుక యున్నది గావున నీకథ పామరజనములచేఁ బన్నంబడి యున్నట్లుగా నూహింపవలసి యున్నది.

ఈమామిడిసింగమంత్రి ముప్పదియిద్దఱు నియోగులలోని వాఁడు. ఆ సీసపద్యములో నతనింగూర్చినచరణ మెద్దియన.

"ఆంధ్ర నైషధకావ్య మందె శ్రీనాథునిచే మామిడిసింగనామాత్యమౌళి"

శృంగార నైషధగ్రంథ శయ్యాదికము.

ఇది సంస్కృతమునకు సరియైన తెనుఁ గని చెప్పఁదగి యున్నను నక్కడక్కడ నుభయభాషలకును జాతీయభేదము లైనచో మాత్రము కొన్ని మార్పులు కాన్పించు. ఆ మార్పులు చేయక చెప్పుటయే సుల భము. అయినను అట్లు చెప్పిన నాంధ్రభాషలో నది రసహీన మగు నని యెంచి శ్రీనాథుఁ డట్టిపట్లను మిక్కిలి మెలకువతోఁ దెనిఁగించుచు వచ్చెను. అవి సంస్కృతమాతృకను దగ్గర నుంచుకొని పరిశీలించినంగాని స్పష్టములు కావు. అటుగావున వాని నిప్పుడు వివరింపక సమముగాఁ దెనిగించినయొకశ్లోకమును పద్యమును నిట వివరించెదను :-

"శ్లో. అధిగత్య జగత్యధీశ్వరాం దథ ముక్తిం పురుషోత్తమా త్తతః
      వచపామపి గోచరో నయ,స్స త మానంద మనిందత ద్విజః. నైషధము 2. సర్గము.

గీ. అట్లు పురుషోత్తముం డైనయతనివలన, ముక్తిఁ గాంచినయాద్విజముఖ్యుఁ డెలమి
    డెందమునకును వాక్కున కందరాని, యధికతర మైనయానంద మనుభవించె."

ఈ గ్రంథములో గ్రంథాంతమునం దొకపద్యము భాస్కరరామాయణములోనిపద్యముతోఁ బోల్పందగి యున్నది. ఆ పద్యముం జూచిన నీశ్రీనాథుని కవిత్వనై పుణి బోధ యగును.

రామాయణములోనిపద్యము.

శా. లాటీచందనచర్చ, చోళమహిళా లావణ్యసామగ్రి, క
     ర్ణాటీగీతికళా సరస్వతి, కళింగాంతఃపురీమల్లికా
     వాటీమంజరి, గౌడవామనయనావక్షోజహారాళియై
     పాటింపం దగు నీదుకీర్తి రథినీపాలాగ్రణీ సాహిణీ."

శృంగారనైషధములోనిపద్యము.

శా. లాటీచిత్తసరోమరాళ, కుకురీలావణ్యలోలాత్మ, క
     ర్ణాటీనృత్తకళావిలోకన సమారంభప్రియంభావుకా
     భోటీనేత్రచకోరచంద్ర, మగధీపుష్పాస్త్ర, చోళీకుచా
     ఘాటస్థాపితమన్మథాంక, కుహళీ గాఢాంకపాళిప్రియా."

శ్రీనాథుఁ డీగ్రంథమును దన ప్రౌఢవయఃకాలములో రచియించినట్లుగఁ జెప్పె ఈగ్రంథమును బెండిపూడి యన్న మంత్రికిఁ గృతి యిచ్చె. ఇతఁడును ముప్పదియిద్దఱునియోగులలోనివాఁడు కావున సుప్రసిద్ధుఁడే యగును. అం దితనిసీసరచణ మెట్లన్నను :

"ఘనదైవతంబు ద్రాక్షారామభీమేశుఁ, డని కొల్చె బెండపూఁ డన్న మంత్రి"

దీనింబట్టి చూడఁగా నన్నమంత్రి ద్రాక్షారామ భీమేశ్వరభక్తుఁ డని ప్రసిద్ధి నందెను. ఈయన్న మంత్రి శ్రీనాథు నొకనాఁడు పిలువనంపించి యీక్రిందివిధంబునం బల్కె. ఎట్లన్నను :-

"సీ. వినుపించినాఁడవు వేమభూపాలున, కఖిలపురాణవిద్యాగమములు
      కల్పించినాఁడవు గాఢపాకం బైన, హర్ష నైషధకావ్య మాంధ్రభాష
      భాషించినాఁడవు బహుదేశబుధులతో, విద్యాపరీక్షణవేళలందు
      వెదచల్లినాఁడవు విశదకీర్తిస్ఫూర్తి, కర్పూరముల దిశాంగణములందు."

గీ. బాకనాటింటివాఁడవు బాంధవుఁడవు, కమలనాభునిమఁనుమడ వమలమతివి
    నాకుఁ గృతి సేయు మొకప్రబంధంబు నీవు, కలితగుణగణ్య శ్రీనాథకవివరేణ్య.

అన్న మంత్రి తన్నుం గోరఁగా శ్రీనాథుఁడు తా నీగ్రంథ మతనిపేరఁ గృతి యిచ్చె నని తేలుచున్నది. పైపద్యములో వేమభూపాలునకు నఖిలపురాణాదికములను శ్రీనాథుఁడు వినుపించిన ట్లున్నది. ఇందుఁ బాకనాటింటివాఁడ వనుదాని కర్థము పాకనాటి కాఁపురస్థుఁడ వని కాక పాక నాటినియోగిశాఖలోనివాఁడ వని యర్థము.

పైపద్యములోనే శ్రీనాథుఁడు పాకలనాటినియోగిగాఁ జెప్పంబడియెను. ఈ శాఖవారు తాము పాకలనాటిశ్రేష్ఠుల మని వక్కాణించెదరు. వీరికి నాఱువేలనియోగిశాఖవారికిని సంబంధములు తఱుచుగా లేవు. శ్రీనాథునివా రనునతని వంశీయులలోఁ గొందఱుగోదావరీమండలములోనిమొగిలితుఱ్ఱులోఁ గొంతకాలముక్రిందట నివసించిరి. వారీదేశమునకు వచ్చియున్న కాలములోఁ బాకలనాటివారు బొత్తుగా లేనిగోదావరీమండలములో స్వశాకవారితో సంబంధములు మాని యాఱువేలనియోగులతో సంబంధముల నడిపిరి. ఇటులనే పైరెండుశాఖలనియోగిబ్రాహ్మణులకు నేఁటివఱకు సంబంధ బాంధవ్యములు సకృత్తుగా జరుగుచుండును.

శ్రీనాథకవి వేమభూపాలునివంశావళి వర్ణించుట.

ఇందు శ్రీనాథుఁ డితరగ్రంథములలోవలెఁ దనకృతిపతివంశావళిని ప్రారంభింపక యతనికిఁ బ్రభుం డగువేమభూపాలుని వంశముంగూర్చి ప్రథమములో వ్రాసె. ఇట్టివ్రాఁత కుద్దేశము వేమభూపాలునిగూడ నొకకృతి నందునట్లుగా నుత్సహించుట యని యూహింపవలసి యున్న ది. వేమభూమిపాలుని వంశానువర్ణనమున మనదేశచారిత్ర కుపయోగింపఁదగినశూద్రులలోఁ గలశాఖాభేదంబులు వివరించి చెప్పెను. ఆభాగముమాత్ర మిచ్చో వివరించెదను. అది యెట్లన్నను :-

"ఉ. కైటభదైత్యవై రిపదకంజమునం దుదయంబు నంది మి
      న్నేటికి భూతధాత్రికిని నెంతయు నచ్చినతోడబుట్టువై
      హాటకగర్భముఖ్యనిఖిలామరమౌళిమహామణిప్రభా
      పాటలవర్ణ మైనయొకపావనవర్ణ ముదీర్ణ సంపదన్.

వ. ఆపుణ్యవంశంబు కంసాసురధ్వంసిచరణపల్లవంబు తనకుఁ బుట్టినిల్లు గావున, గారణ సంక్రమణంబునుంబోలెఁ జామర, తోమర, ఛత్ర, ధనుః,ఖడ్గాదిచిహ్నోపశోభితంబై, చెదలేటినీటివలనిసోదరీయస్నేహలబ్ధంబు లచ్చో నిపాతనత్వ, శుచిత్వ, గాంభీర్య, మాధుర్యంబులు భరితమనః, స్వభావ, వచనంబులు ధరియించి సైదోడుం బొదమి విశ్వవిశ్వంభరాక్రీడనంబునకు విదిర్చినపరమక్షాంతి యంతరంగంబున సంతరించి నిఖిలప్రపంచంబునకు నాధారంబై ప్రవర్తిల్లె. అందుఁ, 1. బద్మనాయకు లన, 2. వెలమ లన, 3. కమ్మ లన, నదినల్లనంబంట లన బహుప్రకారశాఖోప శాఖాభిన్నంబు లైనమార్గంబులం ద్రిమార్గగంగాప్రవాహంబునుంబోలె గోత్రంబు లెన్నెన్నియు జగత్పవిత్రంబులై ప్రవహించుచుండు. కల్పంబు లతిక్రమించి, మన్వంతరంబులు జరిగి, యుగంబులు సరిగడచి, వత్సరంబులు చని కాలచక్రంబు లతిక్రమించుచుండఁ జతుర్థమౌళిమండనంబై కీర్తివిహార ఘంటాపథంబై నపంటదసటి మహాన్వయంబున. పాకనాటిదేశంబున భద్రపీఠంబున నధివసించి, సింహవిక్రమనగర, దువ్వూరు, గండవరాళిపట్టణంబులు నిజనివాసంబులు గా, భవాల తాష్టాదశద్వీపాంతరాళు లగుభూపాలగ్రామణులను, త్రిలింగభూమండలాఖండలులను, ప్రోలయవేమ, అన్నపోత, అన్నవేమ, కుమారగిరీశ్వరాదులన్ బూర్వసామ్రాజ్య పీఠస్థులం గావించె. తత్సంబంధ బాంధవంబున వసుంధరాభారధౌరంధర్యంబున, దిగ్గంధసింధుర ఖటకూట, కపటకిటి, కచ్ఛపావతార నారాయణభుజంగభూధరంబులకుఁ దోడుజోడై, రాయగురుపరమేశ్వర, సాధుజనవిధేయ, ఘోడెరాయ, సకలకళాధామ భీమయగురువరేణ్య పుణ్యకారుణ్యకటాక్షవీక్షాలబ్ధసుస్థిరైశ్వర్యధుర్యుఁడై విజయధాటీసమాటీక నంబుల దిశ లల్లాడ నల్లాడభూవల్లభుండు రాజమహేంద్రంబు రాజధానిగా సింహాద్రిపర్వతంబు లక్షకళింగ, యవన, కర్ణాట, లాటాంతరీపం బైనప్రతాపంబున, దిలీప, నహుష, నా భాగ భరత, భగీరథ, మాంధాతృ, దుంధుమార, వూరు, పురూరవప్రాభవుండు, విశ్వవిశ్వంభరాభువనమండలంబు పరిపాలించె."

పై పెద్దవచనమువలన విష్ణుపాదమందు శూద్రజాతి పుట్టె ననియుఁ అది 1 పద్మనాయక, 2 వెలమ, 3 కమ్మ లను శాఖాత్రయంబు న నొప్పియున్న దనియును, కమ్మశాఖ పంటలు (రెడ్లు) మొద లగుబహువిధశాఖలతోఁ బ్రకాశించె ననియుం దేలినది పాక నాటిదేశములో సింహవిక్రమ నగరము, దువ్వూరు, గండవరాళి అనుపట్టణము లుండె ననియు వానిని, (1) ప్రోలయ వేమన. (2) అన్న పోతరెడ్డి. (3) అన వేమారెడ్డి. (4) కుమారగిరిరెడ్డి మొదలగువారు పాలించి రనియును, అట్టివారితో సంబంధ బాంధవ్యముం గల యల్లాడరెడ్డి రాజమహేంద్రవరము నిజరాజధానిగాఁ జేసెనని దానికి సింహాచలపర్యంతము గలభూమికి లక్షకళింగ మని నామమున్నట్లు నున్నది. దీనింబట్టి చూడ శ్రీనాథుఁడు పాక నాటిలో నున్న యనవేమారెడ్డిసభలోనివాఁడై యుండిపైయనవేమారెడ్డిసంస్థాన మల్లాడరెడ్డివశము కాగాఁ దత్సంస్థానము నాక్రమించిన యల్లాడరెడ్డి నాశ్రయింపక యుండ నాతం డితనికి నన్న వేమారెడ్డి యిచ్చిన గ్రామములు రెండును హరియించి తనకూఁతున కిచ్చినట్లును, అది కారణముగ శ్రీనాథుఁ డితరసంస్థానములకుం బోయి కాలక్షేపము చేసినట్లును, నితరులం గృతిపతులం జేసినట్లును కాన్పించు. పైయల్లాడ రెడ్డికుమారుఁ డీ రాచవేమారెడ్డి. అతఁడు రాజమహేంద్రవఱమునకు వచ్చి యా రాజ్యము తనతమ్ముం డగువీరభద్రారెడ్డికిచ్చి యతనిగుండ వ్యవహారములంజరిపించు చుండినట్లు పైవచనముయొక్క తరువాయి నున్న పద్యమువలనం గాన్పించు. అట్టివేమవీరభద్రారెడ్లను సంతసింపఁ జేయుట కీభీమఖండములో శ్రీనాథుఁడప్రస్తుతముగనయిన రెడ్డివంశోత్కర్షయుఁ దన్మూలముగ రాచవేమనవంశావళియును జెప్పె. ఇట్టిగ్రంథము వినినయెన్ని నాళ్లకు శ్రీనాథుఁడు కాశీఖండముఁ జేయంగోరఁబడెనో యది తెలియదుగాని ప్రౌఢనిర్భరవయః పరిపాకమున నీ భీమఖండము చెప్పినందునను.

"ప్రాయ మింతకు మిగులఁ గైవ్రాలకుండఁ, గాశికాఖండ మనుమహా గ్రంథమేను దెనుఁగు చేసెద"

నని చెప్పుటంబట్టి చూడ నీరెండుగ్రంథములు నిరువదివత్సరముల వ్యవధిలోఁ బుట్టి యుండవచ్చునని తోఁచునుగాని శృంగారనైషధముమాత్రము నీండైన వయఃకాలములోఁ జెప్పఁబడియున్నది. అందులోఁగూడ నీవేమారెడ్డియే నుడువంబడెం గావున నాతనిరాజ్యము ముప్పదినలువది సంవత్సరములు పొడుగుగలదిగాఁ గాన్పించును. పైని జెప్పినకొండవీటి రెడ్లలోనన్న వేమనకు నల్లాడరెడ్డి కొడుకున కల్లుఁ డవుటంజేసి యనవేమారెడ్డిక్రిందఁ గలపాకలనాటి భాగమునకుఁగూడ నల్లాడరెడ్డి యధికారి యయి యుండును. ఆభాగమునకు రాచవేమన యధికారి యయ్యె, రాజమహేంద్రవరముగూడ రాచవేమనకు వచ్చిన విధము రెడ్లచరిత్రలో వివరింపబడును.

బెండపూఁడి అన్న మంత్రి వంశము.

శ్రీనాథుఁడు వేమారెడ్డివంశమును వర్ణించి యనంతరము భీమఖండముఁ గృతినందిన యన్న మంత్రి వంశముంగూర్చి కొంత వ్రాసెను. అట్టివంశవిస్తార మంతయు "ప్రసిద్ధమంత్రి చరిత్రము" అనునాదేశ చారిత్రములో వ్రాయంబడెం గావున నిపు డందలివివరముం దెలుపక యన్న మంత్రివంశస్థులలోనివా రేయేప్రభువుల కాలములో నుండిరో దానిమాత్ర మిచ్చటఁ జూపెదను.

కాశీఖండ విరచనము.

ఈగ్రంథములోపలనే శ్రీనాథుఁడు తా నీగ్రంథమును

"ప్రాయ మింతకు మిగులఁ గైవ్రాలకుండఁ, గాశికాఖం మనుమహాగ్రంథ మేను దెలుఁగుజేసెద"

అని వ్రాసియుండె. ఈగ్రంథముతోఁ గావ్యములుగాఁ బరిగణకు నెక్కం దగినగ్రంథములు శ్రీనాథకృతములు సమాప్తములు. అనంతరముగూడ మఱికొన్నిగ్రంథములు చాటుపద్యముల నీకవి రచియించి యుండవచ్చునుగాని యవి వ్యాపకములో లేవు. సంస్కృతకాశీఖండము కావ్యములలో నైషధకావ్యమువలెనే పురాణములలోఁ గఠినశయ్యకుఁ బ్రసిద్ధము. కావుననే దీనికి "కాశీఖండ మయఃపిండమ్" అను పేరు కల్గినది. ఈగ్రంథము వేమ భూపాలుఁడు కోరకమునుపే శ్రీనాథుఁ డాంధ్రీకరించుచున్నట్లును, అట్టి వృత్తాంతము విని యారాజు శ్రీనాథుం బిలుపించి నీవు రచియించుచున్నగ్రంథము మాతమ్ముం డగువీరభద్రారెడ్డిపేరిటఁ గృతి నియ్యవలయు నని కోరినట్లును దీనిలోని యొకపద్యమువలన నొకవచనమువలననుఁ గాన్పించును. ఎట్లన్నను :-

ఉ. స్కందపురాణసంహితకు ఖండము లేఁబది యందులోన నా
    నందవనానుభావకథధంబున శ్రోతకు వక్తకున్ శుభా
    నందపరంపరావహము నైజగుణంబునఁ గాశిఖండ మా
    కందువ యే నెఱింగి సమకట్టితిఁ గావ్యము గా నొనర్పఁగన్.

వ. ఇమ్మహాప్రారంభంబు కర్ణాకర్ణి కావశంబున నాకర్ణించి, కర్ణాంత విశ్రాంతవిశాల నేత్రుండును, బంటవంశకమల మిత్రుండును, నశ్రాంతవిశ్రాణనక్రీడాపరాయణుండును వీరనారాయణుండును, నిత్యసత్యుండును, భూభువనభారభరణదీక్షాదక్షదక్షిణభుజా, భుజంగుండును, రాయావేశ్యా భుజంగుండును, కీర్తిగంగాతరంగిణీప్రవాహ పవిత్రత స్వర్గమర్త్యపాతాళుండును, జగనగోపాలుండును, విమల ధర్మశీలుండును, నగునల్లయ వీరభద్రభూపాలుం డొక్కనాఁడు.

గీ. నిజభుజావిక్రమంబున నిఖిలదిశలు, గెలిచి తను రాజ్యపీఠ మెక్కించినట్టి
    యన్న వేమేశ్వరునియంక మాశ్రయించి, నిండుకొలు వుండెఁ గన్నులపండు వగుచు.

</div వ. అప్పుడు నన్నుం బిలువం బంచి సముచితాసనంబునం గూర్చుండ నియమించి యున్న యవసరంబున.

గీ. రాయవేశ్యాభుజంగసంగ్రామపార్థ, గాయగోపాళవేమనక్ష్మావరుండు
    కూర్మియనుజన్ముహృదయంబుకోర్కి యెఱిఁగి, యర్థి ననుఁ జూచి యిట్లని యానతిచ్చె.

గీ. నైషధాదిమహాప్రబంధములు పెక్కు, చెప్పినాఁడవు మాకు నాశ్రితుఁడ వనఘ
    యిపుడు చెప్పఁ దొడంగినయీప్రబంధ, మంకితము సేయు వీరభద్రయ్య పేర.

పైపద్యములలోఁ "గర్ణాకర్ణికగా" అని వ్రాసి యుండుటంబట్టి శ్రీనాథుఁ డదివఱకు పై రాజమహేంద్రవరపురెడ్లసభలో (లేక) అక్కడక్కడ కాలక్షేపము చేయుచున్నట్లును, అనంతరము కాశీఖండముమూలముగ వేమా రెడ్డిసభలోఁ బ్రవేశము నందినట్లును గానుపించును

శ్రీనాథుఁడు పైవిధంబున గ్రంథరచనకై కోరంబడి కాశీఖండములోఁగూఁడ నింకొకపరి వేమభూపాలునివంశవర్ణనముం జేసె.

వీథినాటకము.

ఈ వీథినాటకముంగూర్చి శ్రీనాథకృతము లగుగ్రంథములలో నతనివలన నెక్కడను నుదాహరింపఁబడక పోయినను అప్పకవి మొదలగు తొంటి లక్షణగ్రంథకర్తలు వీథినాటకములోని కొన్ని పద్యముల నుదాహరించి యుండుటచేత నది శ్రీనాథునికృతిగానే నిర్ణయించి దానింగూర్చి యిపుఁ డీచారిత్రములో వ్రాయుచున్నాము. అందలికథాసందర్భముంగూర్చి వ్రాయక పూర్వ మాగ్రంథమువలన దేశచారిత్రమునకుఁ గల్గినయొకలాభము నిచ్చో ముందు వివరించెదము. అది యెద్దియనఁగా ఆంధ్రదేశములో శ్రీనాథునికాలమునఁ గలజాతులును వారి స్త్రీలభూషణాదులును శృంగారవిశేషములును దెలియుటయే. స్త్రీలం జెప్పినప్పుడు పురుషుల జాతులుగూడఁ దెలియును. కావున వివిధజాతులు తెలియుపరిజ్ఞాన మిందువలనఁ గలుగకమానదు. అవి యెవ్వియనఁగా :-

1. విప్రభామ. కేవలము వైదికవృత్తి నుండుబ్రాహ్మణునిభార్య. 2. నరేంద్రభామ. సామాన్యక్షత్రియునిభార్య, అనఁగా మూర్ధాభిషిక్తులు కాకున్నను రాజు లని వ్యవహరింపఁబడుశాఖవారి స్త్రీ.

3. వైశ్యభామ, కోమటు లని యాంధ్రదేశములో వ్యవహరింపఁబడువైశ్యజాతి స్త్రీ.

4. శూద్రభామ. ఇందు శూద్రులలో గౌరవముగా నుండి తెలగా లని వంటరు లని వ్యవహరింపఁబడుజాతి స్త్రీ.

5. ఆంధ్రనియోగిభామ. ఆంధ్రబ్రాహ్మణులలో స్మార్తశాఖలోని లౌకికులకు నియోగు లని పేరు. అట్టినియోగులు కేవల మాంధ్రదేశములో నుండువారే కావున వారికి నాంధ్రనియోగిశాఖ యని నామంబు చెప్పెను. శ్రీనాథకవియు నాశాఖలోనివాఁడే. అన్ని శాఖల స్త్రీలను వర్ణించునపుడు తనశాఖస్త్రీనిగూడ వర్ణింపవలయుం గావున నదియును జెప్పెను.

6. నియోగిస్త్రీ. నియోగులలోఁ దెలగాణ్యు లనియు, నందవరీకు లనియు నింకను వివిధ శాఖ లున్నవి. అట్టిశాఖల నన్నిటింగూర్చి యొక్కపర్యాయము నియోగిశాఖా స్త్రీని వర్ణించెదను.

7. వేపార్యంగన. ఆంధ్రదేశములోని మధ్వమతస్థు లగుబ్రాహ్మణశాఖవారికి "వేపారు" లనువ్యవహారము కలదు. వీరికి కన్నడము, ద్రవిడము, మొదలగుదేశములలో వైష్ణవు లని వ్యవహారము కలదు. రామానుజమతస్థులు వైష్ణవశబ్దవాచ్యులుగా నున్నను వారి నాదేశములలో మూఁడునామములవైష్ణవు లని వ్యవహరింతురు. అట్టివారిని శ్రీనాథుఁ, డాంధ్రదేశవ్యవహారానుసారముగ వైష్ణవు లని వ్రాసి యున్నాఁడు.

8. మఱియొకవేపారిస్త్రీ. ఆంధ్రదేశములో ఋక్శాఖాబ్రాహ్మణులలోఁ గొందఱకుఁ గరణకమ్మవేపారు లనియు, తెలగాణ్యులలో వైష్ణవమతప్రవిష్టులుగా నున్నవారికి గోలకొండవేపారు లనియు నామము గలదు. కావున మఱియొకవేపారీ స్త్రీనిగూడ వర్ణించెను.

9. కర్ణాటాంగన. ఋక్శాఖాబ్రాహ్మణులలో వైదికవృత్తి నుండువారికిఁ గర్ణాటకు లనియు, కరణకమ్మలు (కనడాకమ్మీవా రని యర్థము) అనియు వ్యవహారము గలదు. అట్టివారింగూర్చి యిందుఁ జెప్పెను.

10. కాసలనాటి స్త్రీ. ఆంధ్రదేశములోని వైదికశాఖాబ్రాహ్మణులు వెలనాటివారు, వేఁగినాటివారు, కాసలనాటివారు, తెలగాణ్యులు మొదలగు నామములతో నొప్పియున్నారు. కాని వారిలో శ్రీనాథునిచే నొక్క కాసలనాటివారుమాత్రమే చెప్పంబడుటచేత నాకాలమునకుఁ దక్కినశాఖలబ్రాహ్మణు లీదేశమునకు వచ్చియుండకపోవచ్చును. ద్రావిడు లనుదక్షిణాత్యశాఖయు వర్ణింపఁబడియె.

11. వైష్ణవస్త్రీ. రామానుజమతస్థు లగుబ్రాహ్మణశాఖవారికి వైష్ణవు లని యాంధ్రదేశములో వ్యవహార మున్నట్లీవఱకే చెప్పియుంటిమి. ఇందులో నట్టిశాఖలోని స్త్రీని వర్ణించెను.

12. నంబి స్త్రీ. పైరామానుజమతస్థులలోనే "పాంచరాత్రము వైఖానసము" అనురెండుశాఖ లున్నవి. అందు వైఖాసనశాఖనుబట్టి విష్ణ్వాలయములలో నర్చనాదికములఁ జేయుశాఖవారిని నంబులని వ్యవహరించెదరు. ఆనంబుల స్త్రీ యిందు వర్ణింపఁబడియె.

13. పూజారి స్త్రీ. స్మార్తులలో శివాలయములలో నర్చాదికము జరుపుటకు వెలనాటిపూజారు లనియును, తంబళు లనియు రెండుశాఖలబ్రాహ్మణు లున్నారు. ఈపద్యములో వర్ణింపఁబడినస్త్రీ లాయిర్వురని యెంచవలయును.

14. అగసాలి స్త్రీ. ఆంధ్రదేశములోఁ బంచాణ్ణమువా రనుపేరుతో నొప్పునైదుశాఖలవిశ్వకర్మకులస్థు లున్నారు. వారిలో బంగారు పనిచేయుశాఖకు "అగసాల" లనియు, "కంసాలు" లనియు నామము గలదు. ఆశాఖలోని స్త్రీ లిందు వర్ణింపఁబడిరి.

15. బొందిలీ స్త్రీ. బుందేలు ఖండ మనునుత్తరహిందూస్థాన దేశములో నుండునొకదేశమునుండి వచ్చి యనేక సంవత్సరములక్రిందట నాంధ్రదేశములో స్థిరపడియున్న గౌడదేశపు బ్రహ్మ, క్షత్ర, శూద్రశాఖలవారు బొందిలీలుగా వ్యవహరింపఁబడుదురు. వారి స్త్రీ లిందు వర్ణింపఁబడిరి.

16. జంగముభామ. కన్నడదేశమునుండి చిరకాలముక్రిందట నాంధ్రదేశమునకు వచ్చినశూద్రశాఖలోనిలింగాయతుల గురుపీఠస్థులకు జంగము లని పేరు. అట్టి శాఖ స్త్రీ నిందువర్ణించె.

17. లింగబలిజెస్త్రీ, శూద్రులలోపలనే లౌకికవ్యాపారమును జేసికొనుచు లింగాయతులుగా నున్నశాఖలు లింగబలిజె లని పేరు. వారి స్త్రీ యిందు వివరింపం బడియెను. లింగాయతులు కానిబలిజెకులము వారిని గాజులబలిజెశాఖ యని చెప్పుదురు. వీరి కాంధ్రశూద్రులలో శ్రేష్ఠు లైన తెలగా లని వాడుక గలదు.

18. రెడ్డి స్త్రీ. పైశూద్రశాఖలోఁ గొందఱు రెడ్లని పిలువఁబడుదురు. శ్రీనాథకవి యీరెడ్డివంశస్థులగు వేమ, వీరభద్రరెడ్లకే కాశీఖండము కృతి యిచ్చెను, ఆరెడ్ల స్త్రీ లిందు వర్ణింపఁబడిరి.

19. సాతానిభామ. ఆంధ్రదేశములోని వైష్ణవమతస్తు లై లౌకికవ్యాపారమును వదలుకొని కేవలము మతబోధమును, వైష్ణవధర్మాచరణమును ప్రధానముగాఁ గలశాఖాకు సాతాను లని పేరు. అట్టిసాతానులస్త్రీ యిందు వర్ణింపఁబడియెను.

20. సాలెత. లింగాయతమతస్థులలోని జంగమశాఖను గురువులుగా నేర్పర్చికొని యున్న శూద్రశాఖకు, సాలె లని, దేండ్ర లని,కరిణి బత్తులని మొదలగునామము లున్నవి. వీరందఱును తంతుకారులు. వీరి స్త్రీ లిందు వర్ణింపఁబడిరి. 21. భోగభామిని. ఆంధ్రదేశములో నవివాహిత స్త్రీసంతతికి సాను లని నామము గలదు. ఇందు సానిశాఖ, భోగముశాఖ, జక్కులశాఖ, కాళింగశాఖ మొదలగుశాఖ లనేకములు గలవు. పై యందఱకును భోగినీశాఖ యని పేరు. ఆస్త్రీ లిందు వర్ణింపఁబడిరి.

22. ఒడ్డెయువతి. ఓడ్రదేశమునుండి యాంధ్రదేశమునకు వచ్చి యుండువారికి "ఒడ్డె" లని పేరు. అందులో శిష్టికరణమనియు, పండాలనియు ఒడ్డెవారనియుఁ పలువిధనామములు గలశాఖ లున్నవి. కేవల లౌకికవ్యాపారము గల్గి చదువరులుగా వచ్చినశాఖవారిని "శిష్టుకరణము" లందురు. వర్తకవ్యాపారము చేసికొనుశాఖవారిని "పండా" లందురు. నీచకృత్యములం జేయు వారిని "ఒడ్డె" లందురు. ఈ పద్యములో నట్టి యొడ్డెలు చెప్పంబడిరి.

23. తమలపాకుల స్త్రీ. పైయోధ్రదేశపు శాఖలోని యాంధ్రులే తమలపాకులవ్యాపారముమాత్రము చేయువారిని పండా లని వ్యవహరింతురు. అట్టిపండాల స్త్రీ లిందు వివరింపఁబడిరి.

24. కుమ్మరిస్త్రీ. కుంభకారునియువిద.

25. చాకలియువతి. రజకి.

26. బిబ్బీలు. తురుష్కుల స్త్రీలు.

27. పింజారీ స్త్రీ. దూదేకులకుల మని వ్యవహరింపఁబడుశాఖ. ఈశాఖకు భాష ఆంధ్రము, మతము మహమ్మదీయము.

ఇట్లుగా దేశచారిత్రమునకు వలయువృత్తాంతములం దెల్పిన శ్రీనాథునివీధినాటకముంగూర్చి వ్రాయుచో నాగ్రంథమునకుం గలదోషములును, దానిని రచియించుటచేత శ్రీనాథునకుఁ గల్గినయపయశస్సును జెప్పవలసియున్నను, ఈవీథినాటకము చదివినతోడనే శ్రీనాథ కవి స్త్రీలోలుఁ డని జారుఁడని యుండుటచేతఁ దనకుం గలిగినయనుభవంబు నిట్లుగా గ్రంథస్థము చేసె నని పండితపామరు లందఱకును దోఁచకపోదు. అట్టియభిప్రాయము గలుగకపూర్వము లోకానుభవము కొంచెము తెలిసియుంట మంచి దని విన్న వించెదను. లోకములో నెట్టి మూర్ఖుఁడైననుదాను జేసినతప్పులనుబైటఁ బెట్టికొనఁడు. అట్టిచో శ్రీనాథునివంటిమహాప్రాజ్ఞుఁడు లోకములో నందఱిచేతను గర్హి తమగునట్టి వర్ణనలు తనపయిం బెట్టికొని ప్రకటించునా? అట్లుగా నతఁడు చెప్పియున్నను, అతని కాప్తులుగా నుండువారు నివారింపరా! కాఁబట్టి పైగ్రంథమును శ్రీనాథుఁడు స్వకామపూరణార్థముగానీ, కామప్రకటనార్థముగానీ చెప్పినట్లూహింపఁదగదు. ఇఁక నీ గ్రంథరచనమున కేమి కారణ ముండు నని యూహింపవలసి యున్నది. దాని నీక్రింద వివరించెదను.

నాటకములు పదివిధములుగా నుండును. అందు వీథి యనునది యొకనాటకభేదము. ఎట్లన్నను - ప్రతాపరుద్రీయము.

శ్లో. నాటకం సప్రకరణం భాణః ప్రహసనం డిమః,
    వ్యాయోగ సమవాకారౌ వీ థ్యం కేహామృగా దశ.

శ్రీనాథకృతనాటకమునకు వీథి యనునాటకలక్షణము పట్టును. ఇట్టిచో నిది శ్రీనాథునివలన వీథిలో నాడుటకు నేర్పఱుపఁ బడిన ట్లూహింపఁగూడదు. ఈవీథినాటకములో నొకవిటుఁడు తనకుఁ గలలో కాను భవమును దనమిత్రునితోఁ జెప్పినట్లుగా వ్రాయంబడెను. అంతమాత్రమున వానిలోనియభిప్రాయానుసారముగ శ్రీనాథుఁడు తననే యుద్దేశించి చెప్పిన ట్లూహించుట పొరపాటు. ఈనాటకములో నుద్దేశింపఁబడిన స్థలములు రెండుమూఁడు గలవు. అందు నాంధ్రదేశములో నుత్తరముగా నుండుసింహాచలదేవస్థాన మొకటి. ఆంధ్రదేశములో దక్షిణమున నుండు నద్దంకిపట్టణ మొకటి. దానికిని దక్షిణముగా నుండుశ్రీరంగ దివ్యస్థానము మూఁడవది. తీర్థవాసులు దివ్యస్థలములకు వచ్చుట సహజముగనుక కథానాయకుఁ డిటువంటిచోట్లు వచ్చిన స్త్రీలను వర్ణించుచున్నాఁడు. సింహాచలము నాటకరంగ మైనందులకుఁ బ్రమాణము.

"సీ. హరినీలములకొప్పు లణఁగించునునుకొప్పు, విరిపువ్వదండతా వీఁగఁబాఱఁ
      గోటిచందురుడాలు కొనివేయఁగాఁ జాలు, మొగముకుంకుమచుక్క సొగసుగుల్క
      అలజక్కవలచిక్కు లణఁగద్రొక్కఁగ నిక్కు, పాలిండ్లపై నాఁచుపైఁట జాఱ
      నిసుకతిన్నెలమెట్టి పసిఁడిచెంపలఁ గొట్టు, పిఱుఁదుపై మొలనూలు బెళుకుడేర

తే. చిగురుకెమ్మోవిపగడంపుసిరులు మెఱయ, మాటలాడంగఁ గనుదోయి తేటలమర
    చెమట లూరంగ సింహాద్రిఁ జేరవచ్చె, భోగగుణధామ యాంథ్రనియోగిభామ."

ఇంక ననేకపద్యము లున్నవి. అద్దంకిపట్టణము రెండవరంగమైనందుల కుదాహరణము.

"సీ. తళ్కుతళ్కున కాంతి బెళ్కు కెంపులముంగ, ఱందమై కెమ్మోనియందుఁ గుల్క
      ధగధగద్ధగలచేఁ దనరారుబంగారు, గొలుసులింగపుకాయ కొమరుమిగుల
      నిగనిగన్నిగలచే నెఱసిచెల్వగుగబ్బి, మేనుమిన్నందుల మెలఁగుచుండ
      రాజహంసవిలాస రాజితం బగుయాన, మందు మట్టెలు రెండు సఁదడింప

గీ. సరసచూపుల విటులను గరఁగఁజూచి, పొందికై నట్టి మోమున భూతిరేఖ
    రాజకళలొప్ప నద్దంకిరాజవీథి, బొలిచె నొకకొమ్మ గాజులముద్దుగుమ్మ."

శ్రీరంగ మొకరంగస్థల మైనందులకు.

"గీ. చెమటచేఁ దిరునామంబు చెమ్మగిల్ల, హాళి డాచేత విడియంబు గీలుకొల్పి
     రంగపురిరాజవీథిఁ గానంగ నయ్యె, నాదుమది కోర్కె లూర వైష్ణవవధూటి."

ఈవీథినాటకములోనిపద్యములలోఁ గొన్ని వర్ణన లద్భుతంబుగను మఱికొన్ని వర్ణనాంశములో నొకలోపమును లేకున్నను నిప్పటికాలమువారికి నేహ్యములుగాను నుండును. ఆగ్రంథము కేవలము పండితులఁకుగా నుద్దేశింపఁబడకపోఁబట్టి యెట్లు సెప్పంబడినను పరిగణియింప నవసరములేదు. గుణగ్రహణపారీణులు దోషమును వదలి గుణమునే యవలంబించెదరుగదా.

రాజమహేంద్రవరపండితులంగూర్చి.

వీథినాటకములో నుదాహరింపఁబడిన పద్యములంగూర్చి నాకుం బోలినమట్టుకు వ్రాసియున్నాను. ఆగ్రంథము చివరనే శ్రీనాథునిపద్యము లని మఱికొన్ని చాటుధార లుదాహరింపఁబడియున్నవి. వానిలోని పద్యములే యిదివఱకును జారిత్రములోఁ గైకొనందగినవి. అట్టిపద్యములలో రాజమహేంద్రవరములోని పండితుల నిందించుచు నొకపద్యము వ్రాయంబడినది. దానికిఁ గారణము మాత్రము విస్పష్టముకాలేదు. శ్రీనాథుఁడు పరస్థలస్థుఁ డగుటంజేసి యతనిరాక రాజమహేంద్రవరములో వీరభద్రారెడ్డి సభలోనిపండితుల కయిష్టముగా నుండుట స్వభా వమే యగును. ఈశ్రీనాథుండు ప్రభునియొద్దఁ ప్రవేశము గల్గించుకొనుటయ కాక యతని కనన్యసాధ్య మగుకృతి నిచ్చి యతనివలనఁ గృతిసదృశ మగుగౌరవము నందియుండును. దాని కాతనిసభలోనిపండితులు తార్కికులు కుయుక్తిని నెగతాళి చేసియుందురు. దానిఁకిగాను శ్రీనాథునివలనఁ బైపద్యము రచియింపంబడియుండును. ఆపండితులు చేసిన యాక్షేపణలు జీర్ణములై హృద్గతములైనవియు శ్రీనాథునియాక్షేపణ శాశ్వతమైనదియు నయ్యె. ఆపద్యములో రసము తక్కువ యవుటంజేసి దాని నిట వివరింపక రాజమహేంద్రవరము పండితులమార్గము గైకొనిన పండితు లున్నచో శ్రీనాథకవిమార్గము గై కొన్న గ్రాంథికు లుండుట గూడ సహజ మనియు, అది యుభయపక్షములం గూడ దనియు విప్పి చెప్పెదను.

ఈవీథినాటకవిశేషములు నాదేశచారిత్రములో మరల విస్తరింపఁబడుం గావున నిప్పటి కీగ్రంథముంగూర్చి విస్తరింపను. శ్రీనాథకవిచారిత్రములోఁగూడఁ పెంచి వ్రాయుట కాధారములు లేవు గావున నింకొకవృత్తాంతంబుతో దీనిని ముగించెదను. అది యెద్ది యన శ్రీనాథునిచరమావస్థలోఁ జెప్పఁబడె నని యాంధ్రకవి చరిత్రములో వ్రాసిన పద్యవిమర్శనము. అం దె ట్లుండె నన :-

"శ్రీనాథుఁడు తన కాశ్రయు లైనవేమారెడ్డియు వీరభద్రారెడ్డియు మరణము నందినతరువాతఁ గూడఁ గొంతకాలము బ్రతికియుండెను. ఆకాలమునం దతఁడు కృష్ణాతీరమునందు బొడ్డుపల్లె యనునొకగ్రామము గుత్తచేసి నదీప్రవాహమువలన సస్యము పోఁగా గుత్తధనము రాజునకుఁ గట్టలేక వారిచే బహువిధము లైనబాధలు పొంది తుదకు మిక్కిలి బీదతన మనుభవించెను. ఈసంగతి శ్రీనాథకృతము లైనయీ క్రిందిపద్యములవలన నెఱుఁగవచ్చును :-

సీ. కవిరాజుకంఠంబుఁ గౌఁగిలించెనుగదా, పురవీథి నెదురెండ పొగడదండ
    సార్వభౌమునిభుజాస్తంభ మెక్కెనుగదా, నగరివాకిట నుండునల్లగుండు
    ఆంధ్రనైషధకర్తయంఘ్రియుగ్మంబునఁ, దగిలియుండెనుగదా నిగళయుగము
    వీరభద్రారెడ్డి విద్వాంసుముంజేత, వియ్యమందెనుగదా వెదురుగొడియ.

గీ. కృష్ణవేణమ్మ కొనిపోయె నింతఫలము, బిలబిలాక్షులు తినిపోయెఁ దిలలు పెసలు
    బొడ్డుపల్లెను గొడ్డేఱి మోసపోతి, నెట్లు చెల్లింతుఁ డంకంబు లేడునూర్లు.

సీ. కాశికావిశ్వేశుఁ గలిసెవీరారెడ్డి, రత్నాంబరంబు లేరాయ డిచ్చుఁ
    కైలాసగిరిఁ బండె మైలారువిభు డేఁగి, దినవెచ్చ మేరాజు తీర్పఁగలఁడు
    రంభఁ గూడెఁ దెనుంగురాయరాహుత్తుండు, కస్తురి కేరాజుఁ బ్రస్తుతింతు
    స్వర్గస్థుఁ డయ్యె నిస్సనమంత్రి మఱి హేమ, పాత్రాన్న మెవ్వని పం'క్తిగలదు.

గీ. భాస్కరుఁడు మున్నె దేవునిపాలి కరిగెఁ, గలియుగంబున నిఁక నుండఁగష్టమనుచు
    దివిజకవివరుగుండియల్ దిగ్గురనఁగ, నరుగుచున్నాఁడు శ్రీనాథుఁ డమరపురికి.

ఇట్లున్న పై సీసపద్యములు రెండును శ్రీనాథకృతము లగునాయని యొకశంక పొడముచున్నది. దీనికి గ్రంథదృష్టాంతములు కాన రావు. శ్రీనాథకృత గ్రంథములలో నివి యుండు నని చెప్పుట యసందర్భమే. అటు గాకున్న శ్రీనాథునిపద్యములుగా నితరలాక్షణికులచే నుదాహరింపఁబడియు నుండలేదు. పద్యములు చదివినతోడనే యివి శ్రీనాథ కృతములు కావేమో అను నొకశంక పొడముచున్నది. దానికి మొదటి కారణము శ్రీనాథుఁడు తనచివరకాలములోఁ గృష్ణాతీరమునందుండునట్లు చెప్పుట. రెండవదియప్పటిరాజుదగ్గఱ నొకగ్రామము గుత్తకుఁగొనుట, మూఁడవది యాగుత్త సొమ్మియ్యలేకున్న నతనికాలికి సంకెలల వేయంబడెననియు, వీఁపుపైని నల్లని యొకఱాతిగుం డెత్తింపఁబడె ననియు నుండుట. పైవానిలో మొదటిది యగుచివరకాలములోఁ గృష్ణాతీరమున శ్రీనాథుఁ డున్నాఁ డని చెప్పుమాటకు సహకారము లగుగాథలు లేవు. దీనికి వ్యతిరేకముగా శ్రీనాథునిబాల్యవయసు మొదలు రాజమహేంద్రవరప్రభు లగురెడ్లకును వారిమంత్రులకును గృతుల నిచ్చుచుండుటయే ఆతనిముసలితనములోఁ గృష్ణాతీరమున వసియించి యుండె ననుమాటను బూర్వపక్షము చేయుచున్నది.

రెండవయంశ మగుకృష్ణాతీరములోనిరాజుకడ నతఁడు బొడ్డుపల్లె యనుగ్రామము గుత్తకుఁ గొనె ననునది. పూర్వకాలము కవులకు ననేకగ్రామములు శాశ్వతముగాఁ గాకున్న జీవితకాల మనుభవించుటకైన నియ్యంబడునాచారంబు కాన్పించుచున్నది కాని పైవిధమున గుత్తకీయంబడినట్లుగా నీవఱ కెక్కడును దృష్టాంతములుకాన్పించ లేదు. శ్రీనాథునకుఁ గాశీఖండరచననాఁటికే ముదుసలితనము వచ్చియుండును. అట్టిచో నంతవయస్సు చెల్లినపిమ్మట గ్రామములు గుత్తకుఁ దీసియుండుటయు, సంశయింపవలసినయంశమే యయి యుండును. ఇఁక మూఁడవయంశములోఁ జెప్పంబడిన నల్లగుం డెత్తించుటయును, సంకెలలు వేయించుటయు మఱియు నసందర్భములుగాఁ గాన్పించుచున్నవి. పూర్వకాలములో వ్యవసాయదారులు పన్నియ్య లేనిచోఁ గొందఱు క్రూరు లగుగ్రామయజమానులవలన నిట్టిదండనలు సామాన్యక్షుద్రప్రజలవిషయమై చేయంబడి యున్నట్లు వినుచున్నాము గాని శ్రీనాథునివంటి కవివరునకు గ్రామమును గుత్తకుఁగొని యున్న వానికిఁగూఁడ నిట్టిశిక్ష గ్రామయజమానివలనఁ గాక రాజువలననే చేయంబడియుండె ననుమాట మఱియు నసందర్భముగా గాన్పించు. కవుల కుపకారము చేయుతలంపునఁ బ్రభువులు గ్రామములు బహుమానముగాఁ గాని గుత్తగాఁ గాని యిచ్చియున్నను వానిపైఁ దమ కుండుస్వాతంత్ర్యమును వదలకున్న నుండెదరుగాని యందుకుఁగా నొకపన్నేర్పర్చుటయు నది యియ్యనినాఁడు వారింగూడ నితరులవలె దండించుటయు నిపుడు మనము వ్రాయుచున్న శ్రీనాథునికాలము జరిగియుండు ననుట కేవల మసందర్భము. ఆకాలము కవు లలిగినఁ దిట్టిచంపుదు రనుభయము విశేషముగాఁ గలిగి యుండెను. ఒకవేళ శ్రీనాథుఁడు సొమ్మియ్యలేకున్న నేదియేని గ్రంథ మొకదానిని రచించి యా రాజునకో లేక తత్సమీపవాసస్థు లగు మఱియొకరికో కృతి యిచ్చి సొమ్ము తెచ్చి యిచ్చి వైచునుగాని యందులకుఁగాను నిగళబద్ధుఁడై యాసంగతి గ్రంథస్థము చేసియుండుట తటస్థింపదు. కాఁబట్టి యీపద్యములోనిసంగతులు యథార్థము లని చెప్పుట సరికాదు.

ఇఁక రెండవపద్యములో శ్రీనాథుఁడు దివి కేఁగుట వ్రాయంబడినది. అదియు నసందర్భముగానే కాన్పించుచున్నది. ఈశ్రీనాథుఁడు చనిపోవుసరికి నతనికాలములో నతనికి దాతలుగా నుండు ప్రభువు లందఱు చనిపోయి యుండి రనియును, అందుచేత నతఁడు బ్రతికి యుండఁ గూడ దని చెప్పిన ట్లున్నది. అ ట్లుండునా యని యూహింప వలసి యున్నది. ఇందఱు ప్రభువులు గతించువఱకు శ్రీనాథుఁ డున్నాఁ డనఁగ శ్రీనాథుఁడు విశేషకాలము జీవించియుండు నని చెప్పుట కీపద్యము కల్పింపఁబడినట్లు కాన్పించుగాని యిది యథార్థ మని చెప్పుటకుం జాలదు. కవి కొకపుడు దాత లున్నారు ఒకప్పుడు లే రని యూహింపఁబని యుండదు. కొందఱు దాతలు గతించినను క్రొత్తదాత లేర్పడకపోరు. పై రెండుపద్యములును కల్పితములే యయి యుండిన నిఁక నతని నిర్యాణకాలముం జెప్పుటకుఁ దగినయాధారములు మఱియేవి యున్నవో వానిని మనమారయవలయును. ఆపని యిప్పటికిఁ జేయంజాలము గనుక నింతటితో నీవృత్తాంతము నిల్పియుంచెదను.

శ్రీనాథునిసమకాలీనుఁ డగు రాయ లెవ రని.

పై రాయలసంస్థానమునకు శ్రీనాథునికాలములో నధికారియెవ్వ రని యొకశంక పొడముచున్నది. ఆశంకఁ దీర్చుటకుఁ గాను దండ కవి వెలోఁ జెప్పంబడియున్న రాయలపేరుంగూర్చి విచారింపవలసియున్నది. అందుఁ గృష్ణదేవరాయ లని యున్నది. ఇంతియ కాక యీకృష్ణరాయలే కొండపల్లి కొండవీడు మొదలగు దుర్గములం జయించి గజపతికూఁతుం బరియణంబై సింహాచలములో జయ స్తంభములు వేయించి తిమ్మరసు మంత్రితోఁగూడి రాజ్యపరిపాలన చేసిన కృష్ణరాయలే యనియుం జెప్పంబడి యున్నది. శ్రీనాథునికాలము శా. స. 1350, సమీపకాల మవుటచేతను, ఇదివఱలో స్థిరపఱుపఁబడినచారిత్రాంశములన్నియు దీనివలనఁ దాఱుమాఱుగాఁ జేయంబడుఃను. కాని దీనికి సహాయముగాఁ గృష్ణరాయనిర్యాణముంగూర్చి చెప్పంబడియున్న యొకపద్యము కానుపించుచున్నది. ఆపద్యము నీక్రింద వివరించి దాని కెట్లు సమాధానము చెప్పవలయునో ఆలోచించెదము. ఆపద్య మెట్టిదనిన :-

"ఉ. భోరున యాచకప్రతతిబుద్ధి విపజ్జలరాశిఁ గ్రుంగఁగా
      నారయ శాలివాహనశకాబ్దము లద్రి, గజాగ్ని, సోములన్
      దారణనామవత్సరనిదాఘదినంబున జ్యేష్ఠశుద్ధష
      ష్ఠీరవివాసరంబున నృసింహునికృష్ణుఁడు నస్తమిల్లె నా
      ద్వారక నున్న కృష్ణుఁ డవతారసమాప్తము నందు కైవడిన్."

పైపద్యమునందు వివరింపఁబడిన కాలము :-

అద్రి = 7, గజ = 8. అగ్ని = 3. సోమ = 1. అనఁగా "అంకానాం వామతో గతిః" అను సూత్రముంబట్టి 1387 అయినది.

దీనిని రూఢిపఱుచునట్టికృష్ణరాయకృతభూదానశాసనములు గలవు. అందు శా. స. 1332 స్వభానుసంవత్సరమున అత్తోటపాటిలోఁ గొంతభూమి విడఁదీసి దానికిఁ గంచవర మనునామ ముంచి, అగస్త్యేశ్వరస్వామికి నిత్యదీపారాధన ఖర్చులకు "కుంచే అమ్మసాని" అనువేశ్యవశమున నిచ్చె నని యున్నది.

అటుపిమ్మట దేశము నశ్వపతు లేలి రనియును, అనంతరము సదాశివరాయ లేలినకాలములో ననఁగా శా. స. 1465 అగుశోభకృతు సంవత్సరములో చిలకమర్తి వల్లభాచార్యులకు "గోవాడ" అనుగ్రామ మిచ్చినట్లును, శా. స. 1467 మునకు సరియైన విశ్వావసుసంవత్సరములో కందాళ్ల అయ్యవార్లంగారికి అనుమర్లపూడి గ్రామము నిచ్చె ననియుం జెప్పి యున్నది. ఇట్లుగా వివరింపఁబడినపేరు లన్నియును, నసంగతము లని యెంచి కృష్ణరాయ నిర్యాణపద్యమును "ఆంధ్రకవిచరిత్రము"లో వలెనే శాలివాహన శతాబ్దమును పదునేనవశతాబ్దముగా సవరించుటకంటె నిట్టిభేదము లుండుట కేమైనను గారణము లుండునా? అని యూహించుట న్యాయమై యుండును. అట్టిసంవాదము కృష్ణరాయ చరిత్రములోఁ జేయవలసిన దగుటంజేసి దాని నిచ్చో వివరింప మానినాఁడను. కాని యీ చరిత్రము చదివినపిమ్మట శ్రీనాథకవికాల


ములోఁగూడ నొకకృష్ణరాయ లున్నాఁడనియును, అతఁడును, అల్లసాని పెద్దనకవిసమకాలీనుఁ డగుకృష్ణరాయనివలెనే విశేషఖ్యాతిం గల్గి యుండె ననియును, అతనినిర్యాణము కొండవీటిసీమలో సర్వత్ర శా. స. 1378 గనే వ్యవహరింపఁ బడుచున్న దనియును, నీ కృష్ణరాయఁడు రావు సర్వజ్ఞసింగమనీనిసమ కాలీనుఁడనియును, సింగమనీఁడు కృష్ణరాయని సామంతప్రభులలో నొక్కఁడుగా నుండి యతని స్తోత్రముచేయు బిరుదులలో నొకబిరుదును కృష్ణరాయఁడు దాసీపుత్త్రుఁడనుకారణము వలన నుచ్చరింప నొల్లక తుదిని సింగమనీఁడు ప్రాణంబులు విడిచె ననియును గలకథల కన్నింటికిని సమన్వయము కావలసి యున్నది. కృష్ణరాయనిర్యాణాదికముంగూర్చి చిరకాలము క్రిందటఁ బురుషార్థప్రదాయనీ పత్త్రిక పైపద్యానుసారమే యని నిష్కర్షించినది. కావున నీశ్రీనాథునికాలములోని కృష్ణరాయ లెవ్వరనుదాని నిందు నిద్ధారణచేయక యిర్వురు కృష్ణరాయ లుండి రనుమాటమాత్రము జ్ఞప్తిలో నుంచుకొనఁ గోరెదను.

ఆంధ్రపంచకావ్యకవులచరిత్రము

సమాప్తము.