కవి జీవితములు/పింగళి సూరన

వికీసోర్స్ నుండి

శ్రీరస్తు.

కవిజీవితములు.

ఆంధ్రద్వ్యర్థికావ్యకవులచరిత్రము.

14.

పింగళి సూరన

ఇతడు ద్వ్యర్థికావ్యకర్తలలో మొదటివాడు. ఈతనికి ముందు ద్వ్యర్థికావ్యరచనకై వెములవాడ, భీమకవి యత్నించె ననిమాత్రము తెలియవచ్చునుగాని ఆగ్రంథము కొనసాగినట్లు తెలియదు. ఉన్నను అది యెచ్చటను దొరకుటయును లేదు. ఈసూరన కావ్యములలో బ్రథమమైనది రాఘవపాండవీయ మనుద్వ్యర్థికావ్యము. ఇది పుట్టినకొన్ని దినములకే భట్టు రామరాజభూషణునివలన హరిశ్చంద్రనలోపాఖ్యానమును మఱియొక ద్వ్యర్థికావ్య ముద్భవించినది. ఈరెండుగ్రంథము లైన పిమ్మట మఱికొందఱు కవు లాంధ్రమున ద్వ్యర్థికావ్యములు రచియించుటకు యత్నించినారు. మూడర్థములు వచ్చునట్లుగా గూడ కొందఱాంధ్రకావ్యములం జేసియున్నారు. కాని వాని కన్నింటికి నీపైరెండు గ్రంథములకు వచ్చిన వ్యాపకము గాని ప్రతిష్ఠ గాని వచ్చియుండ లేదు. ఆధునిక కవులలో బిండిప్రోలు లక్ష్మణకవీ యనునొక యాంధ్రకవి లంకావిజయ మనునామాంతరము గల "రావణదమ్మీయము" అనునొక ద్వ్యర్థికావ్యమును రచియించినాడు. ఇతడును తన సమకాలీనులలో విశేషవిఖ్యాతి గాంచినవా డౌటంబట్టియు, గ్రంథ మతిప్రాగల్భ్య తతో నొప్పుటంబట్టియు నీతనిద్వ్యర్థికావ్యము బుధజనాదరణీయం బయ్యెను.

పై మువ్వురు గాక ద్వ్యర్థికావ్యకవులు కొంద ఱున్నను వారి చారిత్రములు వ్యాపకములో లేవుగావున వారిని వదలివేసి యీభాగములోఁ బై మువ్వురుకవులచారిత్రములు మాత్రము తెలిసినవఱకు వివరించెదను.

పింగళిసూరనకవి వంశవర్ణనముంగూర్చి.

ఈకవి తాను ప్రథమములో రచియించిన రాఘవపాండవీయములోఁ దనవంశముంగూర్చి చెప్పికొని యుండలేదు. అనంతరగ్రంథ మగు కళాపూర్ణోదయములోపలఁగూడఁ జెప్పియుండఁ డయ్యె. పిమ్మట మఱికొన్నిదినములకు దాను రచియించుటకు నేర్పఱుచుకొనినప్రభావతీప్రద్యుమ్న మనుప్రబంధములోఁ దనవంశమంతయు సవిశేషముగఁ జెప్పెను. సూరనకవి తాను రచియించినగ్రంథములలో నావఱకు తనవంశావళి వర్ణింపకపోవుట యొకకొఱఁతగావున దాని నివారించెద నని ప్రభావతీప్రద్యుమ్నములో నీక్రిందివిధంబునఁ జెప్పికొనియెను.

మ. జనముల్ మెచ్చఁగ మున్రచించితి నుదంచ ద్వైఖరిన్ గారుడం
     బును శ్రీరాఘవపాండవీయము కళాపూర్ణోదయంబున్ మఱిన్
     దెనుఁగుంగబ్బము లెన్నియేనియును మత్ప్రిత్రా దినంశాభివ
     ర్ణన లేమిం బరతుష్టి నా కవి యొవర్పం జాల వత్యున్నతిన్,

దీనింబట్టి ఆవఱకు సూరనకవిచే రచియింపఁబడినగ్రంథములన్నిటిలో నాతనివంశవర్ణనము లేనట్లు స్పష్ట మగుచున్నది. ప్రభావతీప్రద్యుమ్న మనుగ్రంథము తనతండ్రిపేరిటనే కృతియిచ్చి అందుఁ గృతిపతి వంశవర్ణనము గాఁ దనవంశమును వర్ణించికొనియెను.

సూరనకవి తండ్రిం గృతిపతిం జేయుట.

సూరనకవి తనతండ్రినిఁ గృతిపతిం జేయుటకు రెండుకారణము లఁ జెప్పికొన్నాఁడు. అందు మొదటిది పితృభక్తి యని యీక్రిందిపద్యమువలనఁ దెలియును.

క. తండ్రియ సుతులకు దైవం, బండ్రుగదా వేదవాదు లని వినియును నే
    వీండ్రను వాండ్రనుబలెమా, తండ్రిఁ బరమపూజ్యుఁ గాఁగఁ దలపమి తగునే.

ఇఁక రెండవకారణము తనకంటెఁ జిన్న యగుతనతమ్ముండు గయావర్జనాదికముం జేసి పితృఋణవిముక్తుండు గాఁగఁ దా నట్లు చేయ లేనైతి నని చింతించి పిదప తండ్రివంశమును వర్ణించి తన్మూలముగఁ దన తండ్రిని శాశ్వతనామునిఁ జేయుతలంపయియున్నది. దానిని సూచించుట కీక్రిందిపద్యములు వ్రాయఁబడినవి.

మ. గయలోఁ గాశి ప్రయాగ శ్రీగిరిని గంగాద్వార నీలాచ లో
     జ్జయినీ ద్వారకలం దయోధ్య మధురన్ సంస్తుత్యపుణ్యస్థలా
     గ్రియతన్ వెండియు మించునైమిశ కురుక్షేత్రాదులం దర్పణ
     క్రియచే నాపినతమ్ముఁ డెఱ్ఱన యొనర్చన్ దండ్రి కాహ్లాదమున్.

క. ఏను నుచితపూజను నా, చే నైన ట్లెద్దియైనఁ జేయఁగవలయున్
    గానఁ గృతి నిచ్చి మేదిని, పై నెఱపుదు నతనికీర్తి పరమేశుకృపన్.

సూరకవివంశావళి.

ఇతఁడు నియోగిబ్రాహ్మణుఁ డైనట్లును, గౌతమగోత్రుఁడైనట్లును, ఇతనివంశనామము పింగళివారనియు సూరనయే చెప్పియున్నాఁడు. ఇతనివంశమునకు మూలపురుషుఁడు పింగళి గోకనామాత్యుఁడు. ఇతఁడు "పేకి" అనునొక క్షుద్రగంధర్వ స్త్రీని దాసిగాఁ జేసి కొనియె. నాఁట నుండియు నది "పింగళివారిపేకి" అని పిలువంబడుచు వచ్చెను. ఈపేకివృత్తాంతము గోకనామాత్యచరిత్రలో వ్రాసెదను. ప్రస్తుతమున సూరకవి వంశవృక్షము నీక్రింద వివరించెదను.

గౌతమగోత్రములో (ఆపస్తంబసూత్రము, యజుశ్శాఖ)

పింగళిగోకన్న. ఇతనివంశమున

గంగన.

సూరనకవివంశచారిత్రము.

మూలపురుషుఁడు పింగళి గోకమంత్రి.

ఈగోకమంత్రి సూరనకవివంశజులకు మూలపురుషుఁ డని యీ వఱకే చెప్పియున్నాఁడను. అతఁడు ప్రథమమున సంతానము లేక సూర్యదేవో పాసనఁ చేయుచుండఁగా నాసూర్యుఁడు గోకమంత్రిభార్య స్వప్నమున నొకబ్రాహ్మణవేషముతో వచ్చి యగపడి యొకదొండచెట్టు చేతికిచ్చి యీచెట్టు భూమిలో నాటి పెంచితివేని యిది ఫలింపఁగల దని చెప్పెనఁట. అటుపిమ్మట నాగోకమంత్రి కనేకులు పుత్త్రులు కల్గి అతనివంశము దొండతీఁగె శాఖోపశాఖలుగా నల్లుకొనురీతినే పుత్రపౌత్రపరంపరలచేఁ బ్రకాశించెను. ఇట్టిగోకమంత్రిసంతతి కొన్నితరము లైనపిమ్మట ననేకస్థలములలో స్థిరపడి ఆయాగ్రామములే వంశ నామమునుగా ధరించిరి. గోకనమంత్రి యుండునూర నుండువారికి మాత్రము పింగళివారను గృహనామంబు నిల్చియుండెను. అనంతరకాలములో నీపింగళివారు కొందఱు గోదావరీతీరమందును, మఱికొందఱు కృష్ణాతీరమందును, పింగళిరామయ మొదలగువారు పల్నాటి సీమలోను, పాకనాటిసీమలోను, పింగళిగాదయాదులు గోకనమంత్రి యున్న చోట నుండిరి. సూరకవి మొదలగువారును గోకమంత్రికి నింటిపే రైనపింగళి యనుస్థలము ననే యుండి ప్రసిద్ధులైరి.

పేకికథ.

పిదప పింగలిగోకమంత్రి పేకి యనుగంధర్వస్త్రీని వశపఱచుకొనిన ట్లొకగాథ దేశములో వ్యాపించి యున్నది. అయితే ఆకథ జనసామాన్యముగఁ బిశాచపుకథగా వాడుకొనంబడుచున్నది. కాని మంత్రయోగు లిట్టిగంధర్వవిద్యల వశపఱచుకొని వానివలన ననేక చమత్కార కార్యములఁ జేయించుట కలదు. యక్షిణీవిద్య యిట్టిశాబరదేవతోపాసనమూలముగనే చేయుచుండెదరు. యక్షిణి యనునామమునకు యక్షభార్య యని పేరు. అట్టియక్షణులు పరివారముగాఁ గల్గుదేవతలు గాంధర్వవిద్యలు. దీని వశపర్చుకొనినవారికెల్ల వైహికసుఖములు లభియింపఁ గలవనియును, ఆముష్మికవిద్యల కివి నిరోధకము లనియు మంత్ర శాస్త్రజ్ఞుల యభిప్రాయము. ఈవిధ మగువిద్య నొకదానిని గోకమంత్రి వశపఱుచుకొనె నని సామాన్యముగాఁ జెప్పంబడక

"పేకి యనుదానిని దాసి గ నేలె యోగి తా గుర్వనుభావుఁ డై"

అనియుండుటచేత గోకమంత్రి యోగియై యీగంధర్వ స్త్రీని దాసిగఁ జేసె నని చెప్పియుండుటచే లోకములో వాడుకగా నుండు మఱియొకకథ మాంత్రికులు వాడుకొనునదియే యీ పేకికథ యేమో యని తలంచెదను. ఆకథలోని విశేషము లేవియనఁగా, ఒకగంధర్వ విద్య నొకమాంత్రికుఁడు ప్రత్యక్షముచేసికొనియె ననియును, ఆవిద్య వలన నైహికసౌఖ్యముల నన్నిటి నంది తనకు నామూష్మికసుఖమును గల్గింపవలయునని యాగంధర్విని గోరఁగా నట్లేచేసెదనిన చెప్పి మాంత్రికుని మరణకాలములో వియద్గమనమున నెత్తుకొనిపోయి కాశిలో గంగాతీరమం దాతని నుంచె ననియు నామాంత్రికుఁ డవిముక్త క్షేత్రమున మరణము నందుటం జేసి ముక్తుఁ డయ్యె ననియుం గలదు. ఇఁకఁ బామరజనసాధారణకథను వివరించెదను.

పింగళి వారి పేకికథకు మఱియొక యనువాదము.

దానింగూర్చి యిప్పుడును వాడుకలోనున్న కథను వివరించెదను. ఇక్కథ యెన్నివిధములచేత వదిలించుకొనినను వదలనిమనుష్యులవిషయమై పింగళివారిపేకి వలె పట్టుకొనిన వదలఁ డని చెప్పెడునొక సామెత యయినది. దీనికి వాడుకలోఁ గలకథ యెట్లనఁగా :-

ఒకబ్రాహ్మణుఁడును అతనిభార్యయును గారణాంతరమున దేశాంతరమున నుండిరనియును. అపు డాబ్రాహ్మణుని భార్యకు పరిచారిక యొకతె కావలసివచ్చె ననియు అందుకుగాను ప్రయత్నము చేయుచుండ నీపేకి యనునది యొక స్త్రీవేషము వేసికొని తాను పరిచర్య చేసెదననియు, తన కొకవ్రత మున్నదిగావున ఆవ్రతము జరిపినచో జీతబత్తెము లక్కఱ లేకయే సేవచేసెద ననుడు బ్రాహ్మణుఁడు లెస్స యని దానివ్రతముం దెల్పు మనియెనఁట. అపు డాపేకి తనకు విరామము లేకుండ సర్వకాలమును పనులు చెప్పుచుండుప్రభుని గాని అన్యులఁ దాఁ గొలువ ననునదియే తనవ్రత మని తెల్పె. దాని కాబ్రాహ్మణుఁ డెంతయు సంతసించి చెప్పినపనులు చేయలేనిపరిచారకు లే దొరకుచుందురుగాని యిట్లు పనిచెప్పకున్న నుండ ననుచాకిరులు కుదరరు. పని చెప్పుట సులభమే చేయుటయే కష్టము. అని విచారించి "చెప్పినపని చేయ లేకున్ననో" అని సంప్రశ్నము చేసెను. "ఎడతెగకుండ పనిచెప్ప లేకున్ననో" అని పేకి తిరుగ ప్రశ్న చేసెను. దానికి బ్రాహ్మణుఁడు నవ్వి యోడిపోయినవారికి తగినట్లుగా నాలోచించవచ్చు ననియె. అందులకు పేకి సమ్మతించి ఆబ్రాహ్మణునికడ పరిచారికగాఁ గుదిరెనఁట ఆ నిముసము మొద లాబ్రాహ్మణుఁడు పనులు చెప్పుటకుఁ బ్రారంభించి త్వరలో వంటచేసి వడ్డించి యింటిపను లన్నియుఁ జేయు మనుడుఁ బేకియు నట్లే యని అతిశీఘ్రముగఁ గార్యముల నన్నిటిం జేసి మఱియేమిపని చెప్పెద వని యడిగెను. అప్పటికిం జేయవలసినపను లేమియుఁ జేయునవి లేక బ్రాహ్మణుఁడు ఆలోచించుచుండ నాతనిభార్య నవ్వి మాదొడ్డిలో రెండుభావు లున్నవి. అందులో నీరంతయుఁ దోఁడి తెల్లవాఱునంతలో మాపొలములన్నియుఁ దడిపి రమ్మని చెప్పిపంపెను. పేకియు నటులనే తెల్లవాఱులోపలఁ బొలమంతట మళ్లు కట్టి నూతులలో నుండు నీరంతయు రెండు మోటగూనలతోఁ దోఁడి ఆమళ్లు తడిపి సూర్యోదయ సమయమునకుఁ దిరిగి తనప్రభుని దర్శించి యేమిపని చెప్పెద వని సం ప్రశ్నించెను. దానిం జూచినతోడనే ఆబ్రాహ్మణుఁడు భయాక్రాంతుఁడై నిత్యకృత్యములు చేయు మని చెప్పి భోజనాదికము లైనపిమ్మట మఱియేదియో యొకపని కల్పించి పేకిని పంపి తానును తనభార్యయును రాత్రివేళ నొకనిర్జనస్థలంబున కుం బోయి విడిసియుండిరి. పేకి తనకుఁ జెప్పఁబడినపని నెఱ వేర్చి తనప్రభునికడకు వచ్చి యతఁడుగాని అతనిభార్యగాని యింట నుండు పరికరములుగాని అచ్చో లేకుండుటచేత యజమాని పలాయితుఁ డయ్యెనని గ్రహించి అతఁ డున్న స్థలంబును గనిపట్టి అతనియింట నుండునొకఱాతిఱోలు పదుగురు మగవారైనఁ గదల్చలేనిదాని నూఁడబెఱికి నెత్తి కెత్తుకొని మఱునాఁడు సూర్యోదయమునకు బ్రాహ్మణునిఁ జేరి "ఏమయ్యా! నీవు సంసారివి కావా" నీయింటిలో నుండుసమస్తవస్తువులును జాగ్రత్త చేసికొని యేమికారణమున నీఱోలు వదలి వచ్చితివి. గ్రామమందు దొంగలభయము విశేషము గదా అని యిది తెచ్చితి నని పల్కె. దాని కాబ్రాహ్మణుఁడు వెఱగంది పేకి మనుష్యస్త్రీ కాదు. బ్రహ్మరాక్షసియో, కామినీగ్రహమో అయియుండును. అటులైన నిఁక జీవి తేచ్ఛ లే దని భయాక్రాంతుఁడై తలకట్టికొని పండియుండఁగా నపు డా బ్రాహ్మణునిభార్య పెనిమిటి నూరార్చి తాను పేకిచేతఁ బరిచర్యఁ గొని దాని నోడించెద నని పెనిమిటికి ధైర్యంబు చెప్పఁగా బ్రాహ్మణుఁడు కొంత తేఱెనఁట. పిమ్మట నాబ్రాహ్మణి తాను అభ్యంగనస్నానము చేయవలయుంగావున నుష్ణోదక ముంచు మని పేకిం గోరి తలకు తైలము రాఁచుకొని వెండ్రుకలు చిక్కు తీయించుకొని యూడినతలవెండ్రుకల చిక్కు పేకిచేతి కిచ్చి యీవెండ్రుకలం గొనిపోయి ఒక్కొక్కదానిచే తెగకుండా వీడఁదీసి కదురువలె నిలువంబడునట్లు తోమి తేవలె నని ఆజ్ఞ యొసంగె. అపుడు పేకి తలవెండ్రుకల తుట్టెను తీసికొని యొక యేటి యొడ్డునఁ గూర్చుండి యొకటియైనఁ దెగిపోకుండ నన్నిటిని వీడఁదీసి దూరదూరముగ నుంచి యొక వెండ్రుక నిలువంబెట్టుటకు గోటితో లాగిచూచెను. ఆ వెండ్రుక చుట్టుకొనిపోయెను. అది బాగుగ నుండలేదని దానిని నీటిలో ముంచి వులుసు పెట్టి మరలఁ దోమి గోటితో మఱియొకపర్యాయము లాగిచూచెను. అపు డది మఱిరెండుచుట్లు పడుటకుఁ జింతించి మఱియు మఱియు లాగి నిలువంబెట్టుడు నది మఱియును జుట్టుకొనిపోవుచుండ నంత నావెండ్రుకం గొని నిప్పుసెగ చూపి సరిచేయంబోవ నది చూర్ణముకాఁగాని ట్లొకవెండ్రుక చెడుటకు భయపడి, అన్నియు నట్లే చెడు నని పేకి విచారించి చెప్పినపని పూర్తిచేయనిది తనప్రభువులకడకుం బోయినఁ బ్రతిజ్ఞాభంగ మగునని యెంచి తిరుగ వారలకుఁ గాన్పించకుండఁ బలాయిత యయ్యెను." అని, యొకకథ గలదు.

పైకథ యంతయు నాలోచింపగా నిది చమత్కారార్థము కల్పించఁబడియుండునుగాని యధార్థము కా దని తోఁ చెడిని. అయినను లోకములోనివాడుకనుగూడ మనము తెలియఁ జేసినాము. దేని నెట్లు గైకొనవలయునో బుద్ధిమంతులు దాని నట్లే కైకొనియెదరుగాక. ఈపేకివృత్తాంతము చెప్పితిమి కావున నిఁక గోకనమంత్రిచరిత్రము ముగింపము. అయితే పైపద్యములో "నెరపె గోపకుమారుని ఖడ్గవర్ణనము"అను కథ మాత్రము చెప్పవలసియున్నది. దీనిం బట్టిచూడ నీగోకనమంత్రి కవిత్వమునందును ప్రజ్ఞ కలవాఁ డని నిశ్చయించి చెప్పవలసియున్నది. అతని కవిత్వవిశేషములు సూరకవికే తెలిసియుండక పోవచ్చును ఇఁక మన కెట్లు తెలియఁగలవు. కావున నావృత్తాంతము వ్రాయఁజాలము.

గోకనమంత్రి వంశలోని సూరకవిశాఖ.

పైగోకమంత్రి వంశస్థు లనేక శాఖలైరి. వారిలోగంగయమంత్రి నుండి సూరకవిశాఖ విభజింపఁబడినది. ఈగంగయమంత్రికి బంగరుకామ, గలకుంచెలు, పల్లకి మొదలగు సర్వాంగసమృద్ధితో నొప్పురాజ్యలక్ష్మి సంప్రాప్తమయ్యె నని కలదు. అందుల కారణము వ్రాయంజాలము. గంగమంత్రి మనుమనికుమారుం డగుసూరయకవియును, శివభక్తిపరాయణుఁ డైన ట్లీక్రిందపద్యమువలనం గాన్పించు.

క. వారలకు నగ్రజుం డగు, సూరయ సూరప్రభుండు సుకవిత్వసదా,
    చార శివభక్తి, విన యో దారత్వాదులఁ బ్రసిద్ధతముఁ డై మించెన్.

సూరన కుమారుం డగునమరన మంత్రి కుమారుఁడు మనచరిత్రకుఁ బ్రధానుఁ డగుసూరకవి. ఇతఁడు తనతాత యగుసూరకవి ప్రతి ష్ఠ నిల్పె ననియు నంతకంటె నధికుఁ డై యుండె ననియుం జెప్పవలసియున్నది. అట్టియాధిక్యమునకుఁ గారణములు ముం దుచితస్థలంబున వ్రాయుదుము.

సూరన కాలవిమర్శనము.

దీనివిషయమై యిదివఱలో నీసూరకవి చారిత్రము వ్రాసిన దక్షిణామూర్తిపండితుఁడును, ఆంధ్రకవిచరిత్రము వ్రాసిన కందుకూరి వీరేశలింగముపంతులును విశేషముగఁ జర్చించి యుండిరి. అం దాయుభయులసిద్ధాంతములు వేర్వేఱుగ నిట వివరించి అనంతరము నాసిద్ధాంతముం దెల్పెదను.

దక్షిణామూర్తిపండితుఁడు వ్రాసినదానిలోఁ గళాపూర్ణోదయ కృతిపతి యగునంద్యాలకృష్ణరాయల కన్నయగు తిమ్మరాజు విజయనగరాధి పతి యగుసదాశివరాయనికాలమునందు నంద్యాల కధిపతియై యున్నట్లును అది శా. స. 1490 (A. D. 1490 + 77 = 1567) మనియు నొకచోటఁ జెప్పి అనంతరము వెంకటపతిరాయలు పెన్గొండయందు సింహాసనాసీనుఁ డై యుండఁగ నంద్యాలను పైకృష్ణరాయ లేలుచున్నట్లు నంద్యాలగ్రామచరిత్రమునందు వ్రాయఁబడి యుండె నని తెల్పి వెంకటపతిరాయల కాలము క్రీ. శ. 1585 - 77 = (1508 శా. స.) ప్రారంభమై క్రీ. శ 1614 - 77 = (1537 శా. స.) రమున ముగిసె నని చెప్పియుండె. ఇట్లు చెప్పి అనంతరము సూరకవి రాఘవపాండవీయము రచియించునప్పటికిఁ జిన్న వయస్సులో నుండె ననియు నాగ్రంథముం బట్టి చూడ సూరకవి చాలకాలమువఱకు జీవించియున్నట్లును అనఁగా శా. స. 1465 మొదలు శా. స. 1523 వఱకు నని సిద్ధాంతీకరించెను.

పైదానిలో మనయభిప్రాయము తెలుపవలసియున్నది. అందు వ్రాయఁబడినప్రకారము కరిమద్దుల గ్రామశాసనములోని తిమ్మరాజు కృష్ణమరాజు నన్న యే అగునేని కృష్ణమరాజుకాలము దానింబట్టి యూహింప ననుకూలముగనే యున్నది. అయినను ఇతరములైన యాధారములు లేనిది ప్రత్యేకము పై (లోకల్ రికార్డుస్ లోని) వ్రాఁతలను నమ్మి సిద్ధాంతము చేయఁగూడదు. ఆవృత్తాంతములు తత్కాలీనులవలన వ్రాయఁబడక ఇప్పటికి నూఱుసంవత్సరములకుఁ బూర్వమున నున్న యాగ్రామజనులవలన విన్న వృత్తాంతములఁ బట్టి వ్రాయంబడినవి. ఒక వేళ పైకథలు నమ్మఁ బడినను పింగళిసూరనకవి కళాపూర్ణోదయముం జేసినకాల మదియే యని చెప్పుటకుఁగాని అప్పటికే అతఁడు ముదుసలి కాక యుండె నని చెప్పుటకుఁగాని ఆకథ చాలదు. శా. 1490 సం. నాఁటికే సూరకవి కళాపూర్ణోదయమును రచించి అప్పుడు అధికారము చేయుచున్న తిమ్మరాజు తమ్ముం డగుకృష్ణరాయలకుఁ గృతియీయ వచ్చునప్పటికే సూరకవి మిక్కిలి ముసలివాఁడై యుండవచ్చును. కళాపూర్ణోదయము కృతి నందినకొంతకాలమునకుఁ గృష్ణరాయఁడే ప్రభుండై వెంకటపతిరాయలు పెనుగొండలో రాజ్యముచేయుచున్న కాలములోఁగూడ నుండవచ్చును. అంతమాత్రమున సూరనకూడ వెంకటపతిరాయల కాలములోనివాఁ డని యూహింప వీలుపడదుగదా శా. 1490 నాఁటికేఃసూరకవి యేఁబది అఱువదిసంవత్సరములయీడువాఁ డయ్యె నేని అతనిజనన కాలము శా. స. 1420 గల కాలమై యుండును. అప్పుడు సూరకవి పదునేనవ శతాబ్దపూర్వఖండములోనివాఁ డని చెప్పవలసియుండునుగాని పదియాఱు పదు నేడు శతాబ్దములలోనివాఁ డయినట్లు నిశ్చయింపఁగూడదు. కావున నీసిద్ధాంత మంగీకరింప వీలుపడదు.

ఆంధ్రకవిచరిత్రముపై విమర్సనము.

ఇఁక నాంధ్రకవిచరిత్రములోఁ జేయంబడినసంవాద మీపైదానికంటె విపులముగా నున్నను పాఠకునకు మఱియును దిగ్భ్రమ నందించును. కావున దానిలోనియంశములను వేర్వేఱుగ వివరించి దానిపైఁ బూర్వపక్షములం దెల్పెదను. గుణగ్రాహు లాసిద్ధాంతములోఁ గలభేధములం గనిపెట్టెదరు గాక.

ఆంధ్రకవిచరిత్రాంశములు. పూర్వపక్షములు.
(1) కృష్ణదేవరాయని యాస్థాన కవీశ్వరులలో నీసూరనకవి యొక్కఁ డని కొందఱు చెప్పుదురుగాని అతఁ డాకాలమునందు గాని ఆసంస్థానమునందు గాని యున్నట్లు నిదర్శనము లేమియుఁ గానరావు. ఈసూరకవి పదునాఱవ శతాబ్ద మధ్యమున నున్న ట్లూహించుట కనేకనిదర్శనములు కనఁ బడుచున్నవి. (1) ఏసంస్థానము లోనైనను అందుండు కవీశ్వరు లందఱును ఆసంస్థానాధిపునిపైకృతి నిచ్చునాచారము లేదు. పూర్వకాలములో ముసలి వారుగా నుండుకవీశ్వరులే కృతి యిచ్చునాచారము కాన్చించును. సూరనకంటె ముసలికవు లిర్వురు మాత్రమే కృష్ణరాయలను మనుచరిత్ర పారిజాతాపహరణ గ్రంథములకుఁ గృతి పతిం జేసిరి. అంతమాత్రమునఁ గృష్ణరాయని యాస్థానములోనిఁక యితరకవులు లే రని చెప్పఁగాఁ గృష్ణరాయల సంస్థానములో ననేకులు కవులుండి రనుజగద్వ్యాపకమగుప్రతీతి యంతయు నబద్దము కావలసి వచ్చును. పైగ్రంథకర్త లిర్వురు గాక కృష్ణరాయలసభలో కవులుగా నున్న యితరు లెవ్వ రని యొకశంక జేసి యుంచెదము.
(2) సూరనకవి కళాపూర్ణోదయమును నంద్యాలసంస్థానాధిపతియు నార్వీటి బుక్కరాజు సంతతిలో నతని కాఱవ పురుషుఁ డగుకృష్ణరాయలకుఁ గృతి యిచ్చె ననియు, నార్వీటిబుక్కరాజు కాలము క్రీ. శ 1473-77 (శా. స. 1396) మొదట క్రీ. శ. 1481-77 శా. స. 1404 వఱకును రాజ్యము చేసెననియును, అతనిపిమ్మట రాజ్యము చేసిన యతని సంతతిలోని నల్గురు రాజులకును పురుషున కిరువది (20 years) సంవత్సరముల వంతున లెక్కింపఁగా వారిపిమ్మట రాజ్యమునకు వచ్చిన కృష్ణరాయలు క్రీ. శ. 1560-77 శా. స. 1483 ప్రాంతమున నున్న ట్లెంచవలయును. (2) ఈ ప్రశ్నమునకు సమాధానము చెప్పుటకుఁ బూర్వము విజయనగరమున నధికారము చేసిన ముఖ్యు లగుప్రభువులకాలనిర్ణయము చేయవలసియున్నది. అది యిదివఱకే ప్రభుత్వమువారివలన శాసనాదికముల సహాయమున నిర్ధారణచేయఁబడియుండెఁ గావున నందులోని ముఖ్యాంశముల నీక్రింద వివరించెదను. (see R. Swell's lists Antiquities of the Southern India Vol II) ఎట్లన్నను :-

బుక్కరాజు No 1. - క్రీ. శ 1300 - 77 = 1223 శా. స.

బుక్కరాజు No 2. - 1354 - 77 = 1277 శా. స.

బుక్కరాజు No 3 - క్రీ. శ. 1369 - 77 = 1292 శా. స.

కృష్ణరాయలు - 1509 - 77 = 1432 మొదలు 1530 - 77 = 1453

సదాశివరాయలు - 1542 - 77 = 1465 మొదలు 1563 - 77 = 1486

తిరుమలదేవరాయలు - 1567 - 77 = 1490 మొదలు 1577 - 77 = 1500

శ్రీరంగరాజు - 1572 - 77 = 1495 మొదలు 1584 - 77 = 1507

వేంకటపతిరాజు - 1585 - 77 = 1508 మొదలు 1614 - 77 = 1537

అనియున్నది. దీనింబట్టి చూడ బుక్కరాజనామములలోఁ జివర నున్న యతఁడుగూడ క్రీ. శ. 1369 అనఁగా శా. శ. 1292 నకు పిమ్మట నున్నట్లుగా కానరాఁడు. కాఁబట్టి బుక్కరాజుకాలము క్రీ. శ. 1473 మొదలు క్రీ. శ. 1481 వఱకు అని చెప్పిన ఆంధ్రకవిచరిత్రములోని కాల నిర్ణయము నిలువదు. [1] చారిత్రములో రాజులయొక్క అధికారకాలము నిర్ణయించవలసి వచ్చినప్పుడు దామాషాగా నంగీకరింపఁబడిన సంవత్సరములు 15 (పదునేను) అని హూణచరిత్రకారులందఱి యొక్కయు మతమైయున్నదిగాని అది 20 (యిరువది) కాదు. అట్లు పదేను సంవత్సరముల లెక్కను బుక్కరాజు తరువాత రాజ్యము చేసిననల్గురు రాజులకు నఱువది (60) సంవత్సరము లైనది. క్రీ. శ. 1369 సంవత్సరమునకు పై సంఖ్య కలుపఁగా క్రీ. శ. 1429 లేక 1430 (శా. స. 1353) అయినది. ఇది నంద్యాలప్రభుం డగుకృష్ణమరాజు రాజ్యారంభసమయము కావలయును. ఇది ఆంధ్రకవిచరిత్రములో వ్రాయంబడిన కాలమునకు నూటముప్పది సంవత్సరములు పూర్వమై కాన్పించుచున్నది. కాఁబట్టి దీనిం బట్టి నంద్యాల కృష్ణరాయల కాలముగాని అతని కాలీనుఁ డగుపింగళ సూరకవి కాలముగాని నిశ్చయింప వీలుపడలేదు.
(3) ఈకృష్ణరాజు విజయనగరమును సదాశివరాయలు పాలించు చుండిన కాలములో నంద్యాలరాజైనట్లు కానఁబడుచున్నది. (3) ఈ కారణముచేత సూరకవి అతనికిఁ బూర్వుఁ డైనయచ్యుతదేవరాయల కాలములోఁ గాని అచ్యుత దేవరాయలతో సమాన కాలములో వ్యవహరించిన కృష్ణరాయల కాలములోఁ గాని లేఁడని చెప్ప వీలుపడదు గదా. స్యూయలుదొరలీష్టులప్రకారము క్రీ. శ. 1528 వత్సరము మొదలువిజయనగరములో నీయఁబడిన శాసనములను బట్టి కృష్ణరాయలు, అచ్యుతరాయలు నుభయులుగూడ విజయనగరసంస్థానాధిపతులు గా నున్నట్లు కానుపించును.
(4) ఈకృష్ణదేవరాయల యనంతరము 1530 సంవత్సరమున రాజ్యమునకు వచ్చినయచ్యుత దేవరాయలు 1542 సంవత్సరమున మృతి నొందెను. ఆకాలమునందు సదాశివ దేవరాయలు బాలుఁ డౌటచేత రామరా జతనిని సింహాసన మెక్కించి రామరాజు 1564 సంవత్సరమున మృతినొందెను. సదాశివరాయఁడు 1567 సంవత్సరమున మృతుఁడయ్యె. ఆసంవత్సరమునందే తిరుమల దేవరాయఁడు విజయనగరమును విడిచి పెనుగొండఁజేరి 1569 లో పెనుగొండరాజ్యము స్థిరపర్చి 1572 సం. మునందు లోకాంతరగతుఁ డయ్యెను. 1572 సంవత్సరమున నతని పుత్త్రుఁడైన శ్రీరంగరాజు రాజ్యమునకు వచ్చి 1585 సంవత్సరము వఱకును రాజ్యము చేసెను. 1585 సంవత్సరమున నాతని తమ్ముఁడు వేంకటపతి రాజు సింహాసనమునకు వచ్చి తనరాజధాని పెనుగొండనుండి చంద్రగిరికి మార్చెను. 1614 సంవత్సరములో సంతానము లేనివాఁడై మరణము నొందెను. (4) దీనిలోనిసంగతులు చూడనందుఁ గలకృష్ణరాయఁడు సదాశివదేవరాయలు విజయనగరమును పాలించుసమయములో నున్నాఁ డని చూపించుటకై చాలియున్నవి. కాని విజయనగరరాజులజనన మరణకాలములం దెల్పుటకుఁ గాదు. పైకధలోఁ దెల్పఁబడినకాలనిర్ణయము న్యూయల్‌దొరగ్రంథములోని కాలనిర్ణయ పట్టికలకు మిక్కిలి సరిపడి యుండలేదు. అట్టి దానిం గూర్చి ప్రస్తుతము మనము సంవాదింపఁ బనిలేదు. కావున నేనిపుడు సిద్ధాంతమునకు సమాధానము చెప్ప విడిచెదను. ఇవి యన్నియు యథార్థములే యనుకొన్నను అవి సూరకవికాలమును నిర్ణయింపం జాల వని మాత్రము విస్పష్టముగాఁ జెప్పవలసియున్నది.
(5) నంద్యాలరా జైనకృష్ణమరాజు సదాశివదేవరాయని కాల (5) నంద్యాల రాజైనకృష్ణమరాజు సదాశివరాయలు వీరికాలము
మువాఁ డైనందున నతనిరాజ్యకాలము 1564 సంవత్సరమునకు లోపల నారంభ మైయుండును. కాఁబట్టి పింగళి సూరన్న నంద్యాల సంస్థానమునం దుండి కృష్ణరాజునకుఁ గళాపూర్ణోదయము నంకితము చేసినకాల మించు మించుగా 1560 సవత్సరప్రాంత మని చెప్పవచ్చును. లలో సింహాసనము నెక్కినరాజైనం గావచ్చును. రాజు కాకపూర్వము కృతి నందఁ గూడ దమని బంధన లేనిచో నంతకుఁ బూర్వమే కృష్ణరాయ లీకళాపూర్ణోదయ కృతి నందియుండవచ్చు ననునూహ నది యెట్లు బాధించఁగలదు? కాఁబట్టి నంద్యాల కృష్ణంరాజు రాజ్యకాలమునుబట్టి పింగళి సూరనకాల నిర్ణయము చేయఁబడఁ గూడ దని యింకొకసారి చెప్పెదను.
(6) ఈసదాశివరాయఁడు అచ్యుతదేవరాయనికుమారుఁ డైనట్లు కొన్ని శిలా తామ్రశాసనముల యందుఁ జెప్పఁబడియున్నది కాని కృష్ణామండలములోని సత్తెనపల్లితాలూకాలో దొరకిన శా. స. 1482 సంవత్సరమునకు సరియైన క్రీ. శ. 1560 సంవత్సరపు తామ్రశాసనములో నతఁడు రంగరాజునకు తిమ్మాంబకు పుత్త్రుఁడై నట్లును రామరాజునకు మఱఁది యైనట్లు నున్నది. (6) ఇం దుదాహరింపఁబడినశిలాశాసనము కృష్ణామండలములోనిదిదియై కన్నడరాజ్యములో దొరకిన యనేకాశిలా తామ్రశాసనములఁ బూర్వ పక్షముసేయు నదియై యున్నది. కాఁబట్టి కన్నడరాజులు ఆరాజ్యములో నిచ్చిన శాసనములు యథార్థములుగాని ఈసత్తెనపల్లితామ్రశాసనమును నమ్మఁగూడదు. విజయనగర రాష్ట్రచారిత్రములోఁ గాలనిర్ణయములోఁ గల్గినచిక్కు లిక్కడఁ జెప్పుట యప్రస్తుతము గనుకను, ఈసంవాదము సూరకవికాలనిర్ణయమునకు నిరుపయోగము గనుకను సమాధానము వ్రాయమానెదను.
(7) పైఅంశములోని రంగరాజు అనునది ప్రమాదజనిత మేమో? నంద్యాల కృష్ణమరాజు వేంకటపతిరాయల రాజ్యారంభదశలోను జీవించి యున్నాఁడఁట. అందుచేత నతఁడు 1585 సంవత్సరమునకుఁ దరువాత గూడ నల్ప కాలము రాజ్యమేలి యుండును. (7) రంగరాజు పేరు ప్రమాదజనితమే కావచ్చును. కాకపోవచ్చును. అది ప్రస్తుతము మనకథకు సంబంధింపదు. నంద్యాలకృష్ణమరాజు వెంకటపతిరాయల రాజ్యారంభదశలో రాజ్యము చేయుచుండిన నంతవఱకును సూరకవి బ్రతికియున్నాఁ డని చెప్పుట కది చాలదుగదా.
(8) కళాపూర్ణోదయములోఁ గృష్ణమరాజుతాత యయిననార పరాజు కుతుబ్ ముల్కును కొండవీటి యొద్ద నోడించిన ట్లున్నది. ఈకుతుబ్ ముల్కు గోలకొండలో కుతుబ్‌షారాజవంశమును స్థాపించెను. ఇతఁడు క్రీ. శ. 1512 - 77 = (1435 శా. స.) మొదలు 1543 - 77 = (శా. స. 1466) వఱకును గోలకొండ యందు రాజ్యము చేసెను. కృష్ణదేవరాయని కాలములోఁ గొండవీటి దగ్గఱ జరిగినపైయుద్ధము క్రీ. శ. 1512 - 77 శా. శ. 1435 (సంవత్సరమం దనుటచేత నాతనితో యుద్ధము చేసిఅనారపరాజు మనమఁడైన కృష్ణమరాజు తర్వాతను ముప్పదినలువది సంవత్సరములకు రాజ్యము చేసె ననుట సత్యమునకు దూరమై యుండదు. కాఁబట్టి దీనింబట్టియు సూరకవి 1520 స. ప్రాంతముననున్నట్లు నిశ్చయించవలసియున్నది (8) ఇది నిజమైనగాధయే కావచ్చును. ఇదియును సూరకవికాలనిర్ణయము చేయుటకుఁ జాలియుండదు. నారపరాజునకు నిరువది సంవత్సరముల లోపున కొమారుఁడును నలువది సంవత్సరములలోపున ఆకుమారునివలన మనుమఁడును గలిగి యుండవచ్చును. ఆమనుమడు తన యిరువదియవసంవత్సరమునఁ గళాపూర్ణోదయము కృతినందిన నప్పటికి నారపరాజునకు 54 సంవత్సరము లుండవచ్చును

అప్పుడు నారపరాజు యుద్ధములోనికిం బోవచ్చును. నారపరాజుతో సమానవయస్కుఁ డగుసూరకవి నారపరాజు మనుమనిపేర కృతియు నిచ్చియుండ వచ్చును. కావున నిదియును సూరకవికాలమును కృష్ణరాయలకాలమును కా దని నిశ్చయించుటకుఁ జాలి యుండదు. పూర్వకాలములో గొప్ప యుద్యో

గము లనఁగా సేనాధిపత్యములును మంత్రిత్వములును నలుబదియేఁబది సంవత్సరములు గడచినవారికిఁ గాని లభియించెడు నాచారము లేదు. కాఁబట్టి పై కథలో సూరకవి సదాశివరాయల కాలములోనివాఁ డనుట కేమాత్రము చాలియుండ లేదు.
(9) ఈ విషయమునే రాఘవపాండవీయములోని కృతిపతివంశాను వర్ణనమునుండియు నొక విధముగా నూహింపనై యున్నది. ఈగ్రంథము కర్నూలుమండలములోని ఆకువీడుసంస్థానాధిపతి యైన పెదవేంకటాద్రి కంకితము చేయఁబడినది. ఈ వేంకటాద్రికి తాత యైనయిమ్మరాజు రాజమహేంద్రవరమును జయించిన ట్లున్నది. రాఘవపాండవీయ కృతిపతితాత యగుతిమ్మరాజును, కళాపూర్ణోదయకృతిపతితాత యగునారపరాజును కృష్ణదేవరాయని కాలములో నాతనికి లోఁబడినసామంతరాజు లై యుండి అతనితోఁ గలసి సేనాధిపతులుగా మహమ్మదీయులతో యుద్ధములు చేసి రని తెలియవచ్చుచున్నది. 1515 - 77 (శా. స. 1435) సంవత్సరము నందు కృష్ణరాయలు రాజమహేంద్రవరమును జయించెను. కాఁబట్టి (9) రాఘవ పాండవీయములోని యీగాథలవలన నిమ్మరాజు కృష్ణరాయల సేనానిగా కనుపడదు. అందు,

క. రాజమహేంద్రవరాధిపు
   రీజైత్రవిచిత్రములఁ బరిభ్రాజితుఁ డై,
   యాజిఘనుండాయిమ్మమ
   హీజానిప్రసిద్ధిఁగాంచెవెంతయుమహిమన్

అనియున్నది. దీనింబట్టి యీ యిమ్మరాజు స్వయముగనే రాజమహేంద్రవరమును జయించినట్లు కాన్పించును. కృష్ణదేవరాయనివంటి రాజాధిరాజునకు సహాయులుగా నుండినయితరసామంత ప్రభువులను వర్ణించుచో నతని ప్రభునిపేరు వక్కాణింపకుండుట యుండదు. అది యెంతమాత్రము లేదు. కావున నీగాథ విశ్వసనీయము కాదు. దీనిం బట్టి సూరనకవి కాలనిర్ణయము జేయ ననువుపడదు.

యిమ్మరాజుకాలమునం దాతనితో నుండియుండనోఁవు. దీనింబట్టి చూచిన సూర నార్యునికాలము పైనిఁ జెప్పఁబడినదే యయి యుండును.
(10) విజయనగరరాజ్యము చెడక ముందు అనఁగా 1564 - 77 (శా. 1487) సంవత్సరమునకుఁ బూర్వమే రాఘవపాండవీయము రచియింపఁబడిన ట్లూహించుటకు "వడిగలతనాన" అనుపద్యము చాలి యుండును. (10) ఇందలిపద్యము విజయనగర రాజ్యము బాగున్న సమయమును గాని చెడిపోయిన సమయమును గాని సూచింపదు.

"క. వడి గలతనాన నీగిని
     విడిముడి సత్ప్రాభవమున విజయనగరిలోఁ,
     గడు నెన్న నేర్వఁగలమే
     నడకల పెద వేంకటాద్రినడవడు లొప్పన్."

దీనిలో విజయనగరపట్టణములో పెదవెంకటాద్రి యెన్నఁ దగుమనుజుఁ డని యున్నదికాని విజయనగర రాజ్యమునకు నది ముఖ్యపట్టణముగా నున్నప్పు డని లేదు. విజయనగరము చెడిపోయినను ఆగ్రామ వాస్తవ్యులు మఱియొక్కచో నుండుసమయములో వారి గౌరవము చెప్పునప్పు డిట్లు చెప్పుట కేమియాక్షేపణ గలదు.

ఇదియాయూరిలోని గొప్పగృహస్థులం జెప్పునపు డీతఁడు తగినవాఁడని చెప్పినపద్యముగాని యంత కెక్కుడుగ దాని కర్థము కల్పింపఁగూడదు. దీనివలన సూరకవి కాలము తేలదు,

(11) కృష్ణరాయని కాలములో నున్న ధూర్జటికవి మనుమఁ డగుకు (11) కృష్ణరాయని కాలములో ధూర్జటికవి యున్నందులకు ధూర్జ
మారధూర్జటి కృష్ణరాయవిజయమును రచించి ఆకు వీటి, చినవేంకటరాయనికిఁ గృతియిచ్చెను. ఈ చినవేంకటరాయలు రాఘవపాండవీయములో వర్ణించఁబడినకృతిపతి తమ్ముఁ డైన చినవేంకటాద్రియే అయినపక్షమున నీపద్యము పైకాలమును స్థిరపఱుచుచున్నది. టి కృత మగుకాళహస్తి మహాత్మ్యములో నాధారములు లేవు. అతనిమనుమఁ డని చెప్పఁబడునీకుమార ధూర్జటివలనఁ గృతినందిన చినవేంకటరాయలు రాఘవపాండవీయములో వర్ణింపఁబడినకృతిపతికిఁ దమ్ముం డనియు నెందును గానరాదు. ఈ రెంటివలన సూరకవి కాలమును నిర్ణయింపరాదు.
(12) గ్రంథస్థము లైనయీనిదర్శనములు కాక సూరకవి అల్లసాని పెద్దన్న మనుమరాలిభర్తయను కట్టుకథకూడ అతని కాలము పైఁ జెప్పునదే యని నిశ్చయము చేయుచున్నది. అల్లసాని పెద్దన కృష్ణదేవరాయని యనంతరమందనఁగా 1530 - 77 (శా. స. 1453) సంవత్సరమునకు తరువాతఁ గూడ జీవించి యున్నందున సూరన్న అల్లసానిపెద్దన్న మనుమరాలి మగఁడైననుకావచ్చును. (12) కట్టుకథ యైన నిది సూరకవి కాలనిర్ణయమును చేయుటకుఁ జాలియున్నది. అల్లసాని పెద్దనకు మనుమరా లుండవచ్చును. ఆమె పౌత్త్రియో దౌహిత్రియో తెలియదు. దౌహిత్రియే అయినచోఁ బెద్దనకవికంటె నలువది సంవత్సరములు చిన్న యై యుండవచ్చును. ఆచిన్న దాని పెనిమిటి ఆపెకంటె పదియిరువది సంవత్సరములు పెద్ద యైయుండ వచ్చును. అట్లైనచోఁ బెద్దనకవికంటె నతని మనమరాలి పెనిమిటి యిరువది సంవత్సరములు చిన్న యై యుండవచ్చును. తనబంధువుడుకవియై యున్నపుడు పెద్దన అతనిని కృష్ణరాయలకడఁ బ్రవేశ పెట్టక యుండఁడు. కాఁబట్టి సూరనకవి కృష్ణరాయలయాస్థానములోని వాఁడే య
ని నిశ్చయింపఁజాలను. సూరనకవి బాలుఁ డవుటంజేసి కృష్ణరాయలకుఁ గృతి నీయక పోవచ్చును. కృష్ణ రాయనియనంతరము తత్సంస్థానకవు లితరసంస్థానములు జేరి తమ తమ వార్ధక్యదశలో వారిపేరిటఁ గృతుల నిచ్చి యుండవచ్చును. కావున నీకట్టుకథ సూరకవికాలీనుఁ డని చెప్పుటకుఁ జాలియుండదు.
(13) కళాపూర్ణోదయమును రచియింపక పూర్వము సూరకవియాకువీటి రాజులవద్ద మొదట నుండి రాఘవపాండవీయముం జేసి వారి కంకితము చేయుటచే రాఘవపాండవీయము 1550 - 77 (శా. స. 1473) సంవత్సర ప్రాంతమందు మంచి పడుచుతనములో రచియించి యుండును. (13) సూరకవి యాకువీటిరాజులవద్ద మొదట కాఁపుర మున్నందులకుఁగాని, రాఘవపాండవీయము క్రీ. శ. 1550 సంవత్సర ప్రాంత మందుఁ జేసి యున్నందులకుఁగాని అప్పటికి సూరకవి మంచిపడుచుఁ దనములో నున్నందులకుఁ గాని గ్రంథదృష్టాంతములు లేవుగావున నిది సిద్ధాంత మని నిశ్చయింప వీలుపడదు.

సూరకవి కాలనిర్ణయము.

ఇంతవఱకును జెప్పఁబడిన పూర్వపక్షములంబట్టి సూరనకాల మింకను స్థిరపడలేదు. ఇఁక దానిని స్థిరపఱుచుటకు నొకటి రెండు గాథలు క్రొత్తవి వక్కాణించెదను. వానిని పైపూర్వపక్షములతోఁ గల్పి యోఁచించినయెడల సూరనకాలము యొక్క పరిజ్ఞానము కొంచెము కల్గును. అందు మొదటిది సూరనకృత మగురాఘవపాండవీయము మొదటిదా ? లేక వసుచరిత్రకారుఁ డగురామరాజభూషణకవికృతమగుహరిశ్చంద్ర నలో పాఖ్యానము మొదటిదా ? అను సంప్రశ్న మై యున్నది. రాఘవపాండవీయము కృతినందునపు డందలికృతిపతి సూరకవితో నీక్రింది వాక్యంబులు పల్కిన ట్లాగ్రంథములోఁ గాన్పించును.

"శా. రెండర్థంబులపద్య మొక్కటియు నిర్మింపంగ శక్యంబు గా
      కుండున్ దద్గతిఁ గావ్యమెల్ల నగు నే నోహో యన్ జేయదే
      పాండిత్యంబున నందునుం దెనుఁగుఁగబ్బం బద్భుతం బండ్రు ద
      క్షుం డెవ్వాఁ డిల రామ భారతకథల్ జోడింప భాషాకృతిన్."

ఉ. భీమన తొల్లి చెప్పె ననుపెద్దలమాటయ కాని యందు నొం
    డేమియు నేయెడ న్నిలుచు టెవ్వరుఁ గాన ర టుండ నిమ్ము నా
    నా మహిత ప్రబంధ రచనా ఘన నిశ్రుతి నీకుఁ గలుటన్
    నామదిఁ దద్ద్వయార్థకృతి నైపుణియుం గల దంచు నెంచెదన్.

ఈ రెండు పద్యములం బట్టి యాలోచింప నంతకుము న్నాంధ్రభాషయందు ద్వ్యర్థికావ్యములు లే వనియును, భీమకవి అట్టికావ్యరచనకై ప్రయత్నించి దానిని వదలివేసె ననియును, కావున ననన్యసాధ్యముగా రామభారతకథలు జోడింపు మని చెప్పినట్లు నున్నది. దేశములోనివాడుకయు రాఘవపాండవీయమే మొదటిద్వ్యర్థికావ్య మనియు హరిశ్చంద్రనలో పాఖ్యానము రెండవద్వ్యర్థికావ్యమనియుఁ గలదు. కాఁబట్టి పైగ్రంథకర్త లగుసూరకవియు, రామభూషణకవియును నేక కాలీను లైనం గావలయును. లేనియెడల మొదటికవి రెండవకవికి ప్రాచీనుఁ డైనం గావలయును. ఈరామభూషణకవి కృష్ణరాయనియల్లుం డగునళియ రామరాజుకడ నుండెడు పండితుఁడు. కావున రామరాజుకాలీనుఁ డై కృష్ణరాయలకాలీనుఁడుగూడ నైనాఁడు. సూరనకవి రామభూషణకవి కాలీనుఁడైన గృష్ణరాయనియల్లునికాలమువాఁ డగును. అంతకుఁ బూర్వుఁడే యయినఁ గృష్ణరాయనికాలీనుఁడే యగును. కావున నీవిషయమున శంకించం బనియుండదు. ఇదివఱకే అల్లసానిపెద్దన దౌహిత్రికి పెనిమిటి సూరకవి యైన నై యుండవచ్చు నని చెప్పియుంటిమి. అల్లసాని పెద్దన మనుచరిత్రము రచియించునాఁటికి ముసలివాఁడై యున్నట్లుగాఁ దెలియవచ్చుచున్నది. అతనికడనే భట్టురామభూషణుఁడు బాలుఁడై యుండి కవిత్వమును నేర్చుకొనునట్లు చెప్పెడుకథ లున్నవి. ఆయిర్వురలో సూరన పెద్దనకంటెఁ జిన్నయును రామభూషణునికంటె బెద్దయు నై యుండుట సరిపడును.

ఈ సంవాదమునే మరియొక గ్రంథోదహరణముచేత బలపఱచెదను :-

హరిశ్చంద్రనలోపాఖ్యాన కవి యగురామభూషణునిచారిత్రము గ్రంథపీఠికలో బ్ర. పూండ్ల. రామకృష్ణయ్య పంతుల వలన కొంతకొంత వ్రాయఁబడినది. అం దా రామభూషణకవిరచిత మగుద్వ్యర్థికావ్యము ప్రథమమైనదా లేక పింగళసూరన కృతద్య్వర్థికావ్య మగురాఘవపాండవీయము ప్రథమ మైనదా యనుసంప్రశ్నమునకు నప్రమాణముగ నుత్తరమీయఁబడినది కావున నే నిపు డాపంక్తులనే బొందుఁజొందు పఱిచి ప్రామాణిక పండితాభిప్రాయము సూరనకవిగ్రంథమే ప్రథమమైనదని గాని రామరాజకృతగ్రంథము ప్రథ మైనది కా దనియు, రామరాజభూషణునికంటె సూరనకవియే పూర్వుఁ డనియుం జెప్పెదను.

హరిశ్చంద్రనలోపాఖ్యానముపీఠిక, పుట 12లో ఈద్వ్యర్థి కావ్యములలోఁ బ్రథమకావ్యము పింగళిసూరకవికృతము మగురాఘవపాండవీయము గ నున్నను వేములవాడ భీమకవి యంతకుముందే మఱియొక రాఘవపాండవీయమును రచియించినట్లు నందే వ్రాయంబడియున్నది. ఇఁక మనమెఁఱిగిన శ్లేష కావ్యములలోఁ బ్రథమకావ్యము పింగళిసూరన రాఘవపాండవీయము. అది వ్రాయఁబడినతరువాత నీహరిశ్చంద్రనలోపాఖ్యానమును రామభూషణకవి రచియించెను. అట్లు కానిచో రాఘవపాండవీయములో "భీమన తొల్లిచెప్పె నని" అనుపద్యము వ్రాయఁబడి యుండదు గదా. పింగళసూరనకవియును రామభూషణకవియు శ్రీకృష్ణరాయ సంస్థానకవు లని కొందఱుపండితులయభిప్రాయము గావున రామభూషణకవి యీగ్రంథమును రచియించియున్న యెడల సూరన కది తెలియకపోవునా ! తెలిసిన సూరనగ్రంథమునం దట్లు వ్రాయునా? అఖండశ్లేష కావ్యమును బ్రథమమున వ్రాసినవాఁడు పింగళిసూరన య నియే మొట్ట మొదటినుండియు కవులయభిప్రాయము. అట్లు కాని నాఁడు రామకృష్ణోపాఖ్యాన మనుద్వ్యర్థి కావ్యమునందు శ్రీపాద వేంకటాచలకవి.

"ఉ. సూరకవీంద్రుఁ డేర్పఱచుచొ ప్పొకయించుక గాంచి నెమ్మదిన్
      గూరిమి రామకృష్ణుల గనుంగొనఁగోరి తదీయసత్కథా
      సారము జోడు చేసి యొకసత్కృతిఁ గూర్పగ సాహసించితిన్
      ధీరవరేణ్యులార యిది తెల్లముగా దయ నాదరింపుఁడీ.

ఉ. వెంగలు లెందఱో కడు వివేకము లేకను దామె యర్థపుం
    భంగులు రెండుమూఁడు గలభవ్యకవిత్వముచేఁ బ్రబంధముల్
    రంగుగఁ గూర్చినా మనుచు రాజస మొప్పఁగ నుందు రందుకై
    పింగళిసూరనాహ్వయుఁడు బెట్టినమార్గముగాక కల్గునే."

అని యివ్విధముగ నేల యుదాహరించి యుండును? మఱియు గణపవరపు వేంకటకవి ప్రబంధ రాజ వెంక టేశ్వరవిలాసమునందు.

"సీ. అల విన్నకోట పెద్దన లక్షణజ్ఞిత, శబ్దశాసనకవి శబ్దశుద్ధి
      ప్రాబంధికపరమేశ్వరు నర్థమహిమం బు, భయకవిమిత్త్రుని పదలలితము
      శ్రీనాథు వార్తాప్రసిద్ధి నాచనసోము, భూరికాఠిన్యంబు పోతరాజు
      యమకవిధము మల్లయమనీషి చిత్రంబు, పింగళిసూరకవివరు శ్లేష."

అనియును వ్రాసియుండెఁ గాన రాఘవపాండవీయమును వ్రాసినతరువాత రామరాజభూషణకవి హరిశ్చంద్రనలో పాఖ్యానము వ్రాసియే యుండును. పైపీఠికలోపలనే శ్లేషకవుల సూ రకవి మొదటను రామరాజభూషణకవి యనంతరమందు నుదాహరించఁబడిన (నైషధ పారిజాతీయము) అనుకృష్ణాధ్వరికృత ద్వ్యర్థికావ్యములోని యొకపద్య ముదాహరింపఁబడినది.

ఉ. ప్రేషము లేమియుం గనమిఁ బింగళిసూరప రామరాజస
    ద్భూషణభాషితంబు లగుపుణ్యకథాద్వయసంగ్రహాద్భుత
    శ్లేష కృతు ల్బ్రసిద్ధిఁ గని శ్రీరఘునాథనృపాలమౌళి నా
    నైషధపారిజాతకృతినాయకరత్నముఁ జెంది హెచ్చగున్.

కృష్ణరాయలయల్లుం డగునళియరామరాజు కాలీనుఁ డై అతనిపై ననేకగ్రంథములు రచియించిన రామరాజ భూషణకవి రచిత మ గుహరిశ్చంద్రనళోపాఖ్యానమునకు ముందుగ పింగళిసూరనకృత రాఘవపాండవీయము రచియింపఁబడిన మాత్రముననే రామభూషణ కవి కంటె సూరనకవి ప్రాచీనుఁ డని చెప్ప వచ్చునా యని శంక జనింపఁ గలదు. అ ట్లని మాయభిప్రాయము కా దనియు, నీయిర్వురును సమకాలీనులని చెప్పుటకు పైయుక్తులే చాలుననియు, ప్రథమగ్రంథము రచియించినవాఁడే పూర్వుఁడు కావలయు నని చెప్పెడువారిమతముం బట్టి చూడ సూరనకవియే రామరాజభూషణునకుఁ బ్రాచీనుఁడు కావలయు ననియు న ట్లైన రామభూషణునికాలీనుఁ డగు నళియ రామరాజు కంటెంగూడ సూరన ప్రాచీనుఁడు కావలసి వచ్చు ననియును, అనఁగా నళియ రామరాజునకుఁ బ్రాచీఁను డగునతనిమామ యగుకృష్ణదేవరాయలును నళియ రామరాజు సంస్థానకవి యగురామరాజభూషణునికంటెఁ బ్రాచీనుఁడగుపింగళి సూరకవియును సమకాలీను లని సమాధానము చెప్పవలసి యున్నది.

గ్రంథాతరముం బట్టి నిర్ణయింపఁబడిన పింగళిసూరకవి కాలము.

ఇతని కాలనిర్ణ యమున కింకొకమార్గము కలదు. అది మిక్కిలి చిక్కైనమార్గమును, చాలశ్రమ పెట్టునదియు నై న్నది. అయిన నది సూరనకవివలననే చెప్పఁబడియున్నది కావున దాని నిచ్చో మనము వివరింపకతప్పదు.

కళాపూర్ణోదయకృతిపతి యగుకృష్ణమరాజుయొక్క వర్ణనముం జేయుచుఁ జెప్పంబడిన షష్ఠ్యంతపద్యములలో.

"క. విశ్రుత తిరుమల తాతా,ర్య శ్రేష్ఠాన్వయ సుదర్శనాచార్య తనూ
     జ శ్రీనివాస గురుచర, ణాశ్రయణ సమార్జి తాఖిలాభ్యుదయునకున్."

అని యి ట్లొకపద్యము వ్రాయఁబడినది. కాని యింతమాత్రము చేత మనకు కృష్ణమరాజుకాలముగాని అతని కాలీనుఁ డగు పింగళి సూరకవికాలముగాని నిర్ణయింపఁబడలేదు. అట్టికాలనిఋనయముఁ జేయుటకుఁ బూర్వము ద్రావిడ ప్రాణాయామముగాఁ దిరుమలతాతాచార్యుల వంశ చారిత్రమును తత్తత్కాలీను లగురాయలకాలమును వివరింపఁబడవలయును. గ్రంథవిస్తర భయ మున్నను దేశచారిత్రముగావున మఱియొకచో వ్రాయవలసినగాథ లిచ్చోటనే వ్రాయ గమ కించినాఁడను.

తిరుమల తాతాచార్యుల వంశగాథ.

నృసింహాచార్యులు (ఏటూరినగరనివాసి. ఇతఁడు విజయనగరప్రభు వగు విరూపాక్షరాజునకు గురువు)
         |
తాతాచార్యులు.
         |
 శ్రీశైపూర్ణులు.
         |
శ్రీనివాసాచార్యులు.
         |
తాతాచార్యులు.
         |
వేంకటాచార్యులు.
         |
సుదర్శనా (సుందరా) చార్యులు.
         |
శ్రీనివాసాచార్యులు. (నంద్యాల కృష్ణమరాజుగురువు)
         |
తాతాచార్యులు. బహుప్రసిద్ధుఁడు కృష్ణదేవరాయ రామదేవరాయల గురువు.
         |
లక్ష్మీకుమారతాతాచార్యులు. అప్పయదీక్షితకాలీనుఁడు
         |
వేంకటాచార్యులు.

పైవంశవృక్షము ప్రసన్నా మృత మనునొకప్రసిద్ధ రామానుజచారిత్ర గ్రంథమునుండి యెత్తి వ్రాయఁబడినది. తద్గ్రంథకర్త యగు ననంతాచార్యులు వేంకటవరదాచార్యుల శిష్యుం డగుటం జేసి అతఁడు వ్రాయుచున్న స్వగురువంశావళి యైన లెస్సగాఁ బరిశోధించక యుండఁ డని యూహింపఁదగి యున్నది. పైవంశావళిలోఁ బ్రసిద్ధులం గూర్చినకొన్నిశ్లోకములు వివరించెదను. అవి చూచిన తోడనే వారివారి కాలనిర్ణయములు తెలిసిపోవును.

పైఁజెప్పినవిరూపాక్షరాజు శైవమతమును వదలి వైష్ణవమతము నందియుండుటకుఁ గొన్ని కారణములు చెప్పఁబడినవి.

ఈకథాసందర్భములలో నున్నశ్లోకములు.

"విరూపాక్ష స్తతో ధీమా న్వీరశైవమతో౽పి సః,
 శ్రీశైలవంశసంభూతా జ్ఞాత్వా తౌ రామలక్ష్మణౌ.
 పుత్త్రమిత్త్ర కళాత్రాదిసహిత శ్చ సనాగరః,
 శ్రీశైలవంశతిలకా న్నృసింహార్యా జ్జగద్గురోః.
 పంచసంస్కారసంపన్నో బభూవ సుమహాయశాః." (పుట 428.)

అని యున్నది. పై విరూపాక్షరాజుకాలము నీవఱకే శాసనాదికసహాయమున (Mr. R. Sewell) దొరవలన నిర్ణయించఁ బడియున్నది. (Vide Vol. II of his Lists of Antiquities.) అందు విరూపాక్ష శాసనములు క్రీ. శ. 1470 - 77 = 1393 శా. స. లో నొకటియును, క్రీ. శ. 1473 - 77 = 1396 శా. స. లో నొకటియుం గాన్పించును. మనకు సరియైనకాలనిర్ణయము దొరకనిచో నీకాలమునుండి లెక్క చూచుకొనుటకుగా దీనినుంచికొందము.

"నృసింహార్యస్య పుత్త్రో౽భూ త్తాతార్య ఇతి విశ్రుతః,
 శ్రీశైలపూర్ణనా మాభూ త్తాతార్య స్యాత్మజో మహాన్,
 త స్యాభూ చ్ఛ్రినివాసార్యః తస్య శ్రీతారదేశికః,
 త స్యాభవ ద్వేంకటార్యః తస్య సున్దరదేశికః,
 పుత్త్ర శ్శ్రీ సున్దరార్యస్య శ్రీనివాసాభిధో గురుః,
 శ్రీనివాసగురోః పుత్త్ర స్తాతార్యో లోకవిశ్రుతః,
 స తాతదేశిక శ్శ్రీమా న్మహాత్మా శాస్త్రవిత్తమః,
 గ్రన్థం విధాయ విఖ్యాతం యః పఞ్చ్‌మతభన్జనమ్,
 విఖ్యాత స్పర్వలోకేషు మహాత్మా విబుధాగ్రణీః,
 .............................................................
 శ్రీరామదేవరాయాఖ్యః కృష్ణరాయాదనఁతరమ్,
 శశాస రాజ్యం థర్మేణ గురు భక్తిపరాయణః,

స భూపతి ర్మహతేజా యయౌ చన్ద్రగిరిం ప్రతి,
గురుం తాతార్య మాదాయ రామరాయాభి ధ స్తదా,
..................................................................
రామరాయసహాయేన మహాచార్యో మహాయశాః,
దుర్జయా నపి నిర్జిత్య శైవాన్ శాస్త్రవిదుత్తమః,
.........................................................
శైవశాస్త్ర విదాం శ్రేష్ఠో ధీమా నప్పయదీక్షితః,
చిత్రకూటే జితారాతి రశోభత మహాయశాః,
అద్వైతదీపికాభిఖ్యం గ్రస్థ మప్పయదీక్షితః,
చకార భగవద్ద్వేషీ శైవధర్మరత స్సదా,
మహాచార్య స్స తాం శ్రుత్వా తస్య ప్ర తిభటం తదా,
చండమారుతనామానం విదధే గ్రంథ ముత్తమమ్."

అని యున్నది.

దీనింబట్టి గూడ నృసింహాచార్యులకు నప్పయ్యదీక్షిత కాలీనుఁడును చండమారుతగ్రంథకర్తయు నగుతాతాచార్యులకు నడుమ 7 (ఏడ్గురు) పురుషు లున్నారు. అందుతాతాచార్యనాములు మఱియిర్వురు కానుపించుచున్నారు. శ్రీనివాసాచార్యనాము లిర్వురు రున్నారు. అందు నంద్యాలకృష్ణమరాజుకాలీనుఁడు పై పద్యానుసారముగఁ గృష్ణదేవరాయానంతరము వచ్చినరామరాజునకు గురు వని చెప్పఁబడినతాతాచార్యులతండ్రి యగు శ్రీనివాసాచార్యు లై యున్నాఁడు. అందు విశ్రుతుఁ డగుతాతాచార్యు లని యుండుటచేతను అతనియన్వయమందుఁ బుట్టిన సుదర్శనాచార్యు లని యుండుటచేతను ఆతాతాచార్యులు నృసింహాచార్యులకుమారుఁ డగుతాతాచార్యులు కావచ్చునని తోఁచుచున్నది. అట్లు కానిచో నతని మనుమఁ డగుతాతాచార్యు లైనను కావచ్చును. ఎటులైనను తాతాచార్యవంశస్థుఁడు సుదర్శనాచార్యులు గావచ్చును. అతనికుమారుఁ డగుశ్రీనివాసాచార్యులు నంద్యాలకృష్ణమరాజును సమకాలీను లగుటకు సందియము లేదు. పింగళిసూరన కృష్ణమరాజు కాలీనుఁడు గనుక పై శ్రీనివాసాచార్యులకాలీనుఁ డగుటకు సంశయ ముండఁగూడదు. ఒక వేళ శ్రీనివాసాచార్యులు విశే షముగా ముసలివాఁ డైనతఱి కృష్ణమరా జతనికడ నుపదేశమంది శిష్యుఁ డై యుండి తనముసలికాలములో బాల్యవయస్సున నుండు పింగళిసూరకవి శ్రీనివాసాచారి కాలీనుఁడు కాకున్న నేకశతాబ్దములోనివాఁడు మాత్రము కాక తప్పదు. కృష్ణరాయల గురు వని ప్రసిద్ధిం జెందినట్టియుఁ గృష్ణరాయానంతరము రాజ్యమునకు వచ్చినరామరాయని కాలములో దేవస్థానప్రతిష్ఠాదిక మొనరించినట్టి తాతాచార్యునికాలము క్రీ. శ. 1509 - 77 = 1432 శా. స. మొదలు అనఁగా గృష్ణరాయరాజ్యారంభకాలములో మొద లయి యుండును. కాఁబట్టి తాతాచారితండ్రి యగుశ్రీనివాసాచారియును, అతనిశిష్యుఁ డగునంద్యాల కృష్ణమరాజును. అతనిపైని కృతి రచియించిన పింగళిసూరనయును సమకాలీను లని గాని లేక యొకశతాబ్దములోని వారే యని గాని నిశ్చయించిన సూరకవి తాతాచార్యకాలీనుఁ డై తద్వారముగఁ గృష్ణదేవరాయల కాలీనుఁ డై రామరాయలపైఁ గృతి నిచ్చిన హరిశ్చంద్రనలోపాఖ్యానగ్రంథకర్త యగు రామరాజభూషణకవికిఁ బూర్వుఁ డై యుండుట కెంతమాత్రము సందేహింపఁ బడనివాఁ డై యుండును గదా. కృష్ణమరాజుపైఁ గృతి యీఁబడినకళాపూర్ణోదయ గ్రంథముకంటెఁ బూర్వము రచియింపఁబడినరాఘవ పాండవీయద్వ్యర్థికావ్యము హరిశ్చంద్రనలోపాఖ్యానమునకంటెఁ బ్రాచీన మైనది యగుటయు నిస్సంశయాంశమే కదా. కాఁబట్టి పైసంవాదద్వితయమును బరిశీలించిన వారు పింగళిసూరనకవి పది యాఱవశతాబ్దములోనివాఁ డని నిర్ణ యింపక అతఁడు కృష్ణదేవరాయనివలె పదునేనవశతాబ్దములోనివాఁ డని సిద్ధాంతీకరించుటయే కాక అతఁడు కృష్ణరాయనిసంస్థానాష్టదిగ్గజములలోని వాఁడు కావచ్చు నని నిశ్చయించి చెప్పుట దోషయుక్త మేమో శ్రద్ధతో నాలోచించి తీర్మానించుటకుఁ బ్రార్థింపఁబడుచున్నారు.

పింగళి సూరకవి రచియించినగ్రంథప్రశంస.

ఇంతవఱకును మనము సూరకవియొక్కకాలనిర్ణయము చేయుటలోఁ గాలక్షేపము చేసి తత్కవికృతము లగుగ్రంథ విశేషముల వివ రింపఁ బ్రాలుమాలినారము. ఇపుడు మన మట్టికొఱఁత నివారించుకొనియెదముగాక.

ఈసూరనకృతగ్రంథములపేరు లీవఱకు చెప్పియున్నారము. ఇపు డాగ్రంథరచనావిషయము తత్కృతిపతు లతనివిషయ మై చేసిమమర్యాదలును వివరించవలసియున్నదిగనుక మఱియొక పరి వాని నీక్రింద వివరించెదను.

అందు

1. గారుడపురాణము (సంస్కృతమునకుఁ దెనుఁగున భాషాంతరీకరణము.)

2. రాఘవపాండవీయము (ద్వ్యర్థికావ్యము)

3. కళాపూర్ణోదయము (అభూతకల్పనాకథాప్రబంధము)

4. ప్రభావతీప్రద్యుమ్నము (స్వవంశావళియుక్తప్రబంధము)

ఈగ్రంథములలో గారుడపురాణము తప్ప తక్కిన గ్రంథములు మూఁడును ముద్రితము లై ప్రకటింపఁ బడి యున్నవి. మొదటి గ్రంథమగుగారుడపురాణము, గొప్పగ్రంథ మై యుండుటచేత బహుప్రతి ముఖంబున సర్వదేశంబులలోను వ్యాపింపక పో వచ్చును. ఆ కారణమున ప్రస్తుతకాలములో నది యచ్చొత్తువారికిని లభ్యము కాక యుండవచ్చును. మూఁడుసంవత్సరముల క్రితముదనుకఁ గళాపూర్ణోదయమును సంవత్సరముక్రిందటిదాఁక ప్రభావతీప్రద్యుమ్నమును అచ్చువడియుండక పోవుటచేత దుర్మభములుగా నుండినవి. ఇట్టిస్థితిలో వందలకొలఁది పుటలు గలపురాణములకు ప్రత్యంతరములు దొరకునా? నేఁటివఱకును చిరకాలముక్రిందటనాంధ్రీకృతము లైనపురాణము లనేకము లముద్రితములుగా నేయున్నవి. వీనిలో సూరనకృతం బగుప్రథమపురాణగ్రంథమును జేరి యుండును. ఇ ట్లూహించుట న్యాయముగాని ఆంధ్రకవిచరిత్రములో వలె సూరకవియొక్క బాల్యకవిత్వమవుటచే నాగ్రంథము నశియించి పోయి యుండెనేమో అని యూహించుట న్యాయము కాదు. ప్రాచీనుల కవిత్వములు ప్రథమములోనే విశేషప్రౌఢముగా నుండు నాచా రము గలదు. దానికి దృష్టాంతము తిక్కనసోమయాజికృతనిర్వచనోత్తర రామాయణమును, శ్రీనాథకృతనైషధము నై యున్నది. గరుడపురాణముంగూర్చి యింతకంటె విశేషించి వ్రాయంజాలము. నాల్గవగ్రంథ మగుప్రభావతీప్రద్యుమ్నముం గూర్చి మొదటనే వ్రాసియున్నాఁడను ఇఁక రాఘవపాండ వీయముంగూర్చి యిపుడు వ్రాసెదను.

రాఘవపాండవీయము.

దీనియుత్పత్తిం గూర్చి యిదివఱకే కొంతకొంత వ్రాసియున్నాము. ఇపు డిందలి కృతిపతి వంశవృక్షమును కవికవిత్వవిశేషములు నుడువుటయు మాత్రము చెప్పవలసినదిగా నున్నది. కృతిపతి యగు ఆకు వీటి పెదవేంకటాద్రిరాజుయొక్క వంశావళి యీక్రింది విధముగా నున్నది.


గ్రంథరచనాకారణము.

ఈపైకృతిపతి యగుపెద్ద వేంకటాద్రిరా జొకనాఁడు సంగీతసాహిత్యాది వివిధవిద్యాప్రసంగంబులఁ బ్రవర్తిల్లుచు సూరనకవిం బిలుపించి సముచితసత్కారంబుల గౌరవించి రెండర్థములపద్యము చెప్పుటయే కష్టమైయుండఁగా నట్టియర్థద్వయముతో నొప్పుకావ్యము చేయుట యెంతయుఁ గష్టమైయుండును. అట్టికావ్యము నీయట్టిపండితుఁడే రచియింపవలెనుగాని అది యన్యులకు సాధ్యము కా దనుచు నీక్రిందిపద్యములం జెప్పన ట్లున్నది.

ఉ. భీమన తొల్లి చెప్పె నను పెద్దలమాటయ కాని యందు నొం
    డేమియు నేయెడ న్నిలుచు టెవ్వరు గాన రటుండనిమ్ము నా
    నామహితప్రబంధరచనాఘనవిశ్రుతి నీకుఁ గల్గుటన్
    నామదిఁ దద్ద్వయార్థకృతి నైపుణియుం గల దంచు నెంచెదన్.

క. చాటుప్రబంధరచనా, పాటవకలితుఁడవు శబ్దపరిచితియందున్
    మేటివి దీనిం దెనుఁగునఁ, బాటించి రచింప నీవ ప్రౌఢుఁడ వరయన్.

ఉ. దక్షత యింత కల్మి విశదంబుగఁ గాంచియు నీమది న్ఫలా
    పేక్ష ఘనంబు గామి నిది యిట్టనఁ గొంకెద నీకు నోలలా
    టేక్షణభక్తిశీల రచియించుట యిష్టముగాదె శ్రీవిరూ
    పాక్షున కంకితంబుగ శుభార్థము రాఘవపాండవీయమున్.

ఇట్లుపెదవేంకటాద్రివలననే సూరన కవిత్వవిశేషములు కొన్ని వక్కాణింపఁబడినవి. అట్టిశ్లాఘాపూర్వకము లగుప్రభుని యుత్సాహవాక్యముల కలరి, తాఁ జేయందొరకొనిరాఘవపాండవీయములోఁ దాను చూపింపవలసినశయ్యా విశేషముల నీక్రిందివిధంబున వివరించెను.

సీ. ఆంధ్రభాషాసంస్కృతాభిభాషాశ్లేష, యొక్కొకచోట నొక్కొక్కచోట
    నుచితశబ్దశ్లేష యొక్కొక్కచోట న,ర్థశ్లేష యొక్కొక్కతఱిని ముఖ్య
    గౌణవృత్తిశ్లేషఘటన యొక్కొక్కతఱి, నర్థాన్వయము వేఱె యగుచు నునికి
    శబ్దాన్వయవిభేదసంగతి యొక్కొక, తఱి నవి యొక్కొక్కతఱిని రెండు

తే. మూఁడు కూడుట యన సముజ్జ్వలము గాఁగ
    నాకుఁ దోఁచినగతిఁ బెక్కుపోక లమర
    రామభారతకథలు పర్యాయదృష్టిఁ
    జూచుసుమతుల కేర్పడ నాచరింతు.

పైపద్యములోని విశేషములు స్పష్టపఱుచుచో గ్రంథబాహుళ్య మగు నని యెంచియు నవి యలంకారగ్రంథములలోఁ దెలియందగి నయంశము లవుటంబట్టియు వాని నిట వివరించుట మాని సూరకవి పదశయ్యాదులలో నెఱ్ఱప్రగ్గడం బోలినవాఁడనియును, అతనివలె నీ సూర కవియును, దీర్ఘ సమాసములును. సంస్కృతములోఁగూడ నసాధారణములుగాఁ బ్రయోగింపఁబడువై యాకరణుల ప్రయోగము లీయాంధ్రములోఁ బ్రయోగించునిష్టము కలవాఁ డనియుం జెప్పెఁదగియున్నది. శ్లేష లేక యున్న పద్యములలో నిట్టిచమత్కృతులు విశేషించి కానుపించును. శ్లేషలోఁగూడ ప్రౌఢప్రయోగములఁ జేయును. దీనిం జూపుటకుఁ గొన్ని పద్యముల నీక్రింద వివరించెదను.

శా. శ్రీచన్గొండలు రెండు నండగొని వాసిం బేర్చుచు న్భక్తిసా
     మీచీన్యామలపెద్దవేంకటనృపోన్మీలన్మనశ్చాతక
     వ్యాచిక్రింసకుఁ గైవసం బయి సదోదంచత్కృపాదృష్టి స
     ధ్రీచీనం బగుకృష్ణమేఘము జగత్ప్రీతిం గడుం జేయుతన్.

శా. లోకత్రాణరతిం దదాదిమమహీలోకప్రబంధోత్కభా
     షా--- ప్తప్రథమ ద్వితీయ పదగుంజన్మంజుమంజీరగ
     ర్జాకల్పామలరామభారత కథాసర్గఁబుల న్మించువా
     ల్మీకివ్యాసుల గొల్చెదన్ దదుభయశ్లేషార్థసంసిద్ధికిన్.

      దీర్ఘసంస్కృత సమాసమునకు :-

ఉ. అంత వసంత మొప్పెఁ జరమాగ్రిమభాగచరాఖిలర్తుసా
    మంత మనంతజాలకసమంజసరంజితకుంజకుంజరో
    ధ్వాంతనితాంతసాంద్రమధుదానవిజృంభితబంభరస్వనా
   త్యంతనిరంతరీకృతదిగఁత మతాంతలతాంతకుంత మై.

మిశ్రకవిత్వమున కుదాహరణము.

సీ. అచ్చంపులేఁజిగురాకుజొంపము కెంపు, మేలిచెందిరపుఁగెంధూళి గాఁగ
    గ్రుచ్చినట్టుగ జాదుకొన్న మొగ్గలగుంపు, ప్రకటపాటలబిందుపాళి గాఁగ
    విచ్చినపరువంపువిరులతండము పెంపు, శోభితతభూతిరింఛోళి గాఁగ
    నిచ్చలం బైనతేనియవానజడి సొంపు, లాలితదానధారాళిగాఁగ

తే. సుమపరాగము ల్కేళిపాంసువులు గాఁగ, భ్రమరపంక్తులు పైసరపణులు గాగ
    బుడమి నెల్లను వాహ్యాళి వెడలుమదను, మదపు టేనుఁగుబోలె నామనిఁ దనర్చి.

శ్లేషోదాహరణము :-

సీ. క్రీడానరుం డైనశ్రీవరుం డిట్లు క్షా, త్త్రప్రక్రియను విజయప్రసక్తి
    నిర్వహించుచు శత్రునిర్మూలనము సల్పి సొంపుమైఁ దనకును శుభసదనిక
    లంకాధిరాజ్యవిలాసపట్టాభిషే, కము స్వపురస్ఫూర్జితముగ నడప
    వసుధ నప్పుడు దానవప్రభుత్వవిశేష, పృథుతరదీప్తివిభీషణుండు

తే. తేజరిల్లె ధర్మరాజితరక్షమా, పాలదుర్లభతరభాగ్యలక్ష్మి
    నేఁడు గా ఫలించె నెఱయ నస్మత్పూర్వ, సుకృత మద్భుత మని సుజను లలర.
                                                                            ఆశ్వా. 4. ప. 209.

రాఘవపాండవీయకృతివిషయము.

ఈగ్రంథమును సూరనకవి తనయితరగ్రంథములవలెఁ గాని లేక యితరకవుల గ్రంథములవలెఁగాని చెప్పక గ్రంథమున కిర్వురుకృతిపతులఁ జేసె. అందు పెదవేంకటాద్రి యొకకృతిపతిగాను, విరూపాక్షక్షేత్రాధిపతి యగువిరూపాక్షేశ్వరుఁ డనుశివుఁ డొకకృతిపతిగా నున్నట్లు కానుపించును. దానికిఁ గారణము తానావఱకే గ్రంథ మారంభించి విరూపాక్షస్వామికిఁ గృతి నీయవలయు ననుకోర్కె కలవాఁడై యుండి అనంతరము రాజసన్మానార్థమై తన తొల్లింటియభిప్రాయము మానియుఁ గేవల మట్లు మానుటవలన స్వప్రతిజ్ఞాభంగ మగు నని యూహించి, తదర్థమై రెండుపేరులును గల్పి యుండు నని తోఁచుచున్నది. లేదా మఱియొకకారణ మేదియైన నుండవచ్చును. దీనింగూర్చి రాఘవపాండవీయములో నీక్రిందివిధంబుగ వ్రాయఁబడినది. అది చూచినవారల కది నిశ్చయమే అని తోఁచక పోవునేమో యని యూహించి పై కారణ మూహించుట యయినది, ఆవచన మెట్లన్నను :-

"వ. అని యిట్లు కృతోత్సాహుండ నగుచు నేతత్ప్రబంధనారంభంబునకుఁ బ్రేరకుం డైనసకలాంతర్యామి హేమకూటాధ్యక్షుఁడు శ్రీనిరూపాక్షుండు నిర్విఘ్న పరిసమాప్తి ప్రచయగమనంబులకుం దాన కలండు. అతని సంకల్పానుసారంబున నెట్లు కావలయు న ట్లగుంగాక నాకు భారం బేమి యనుతలంపున నిశ్చితుండ నై కడంగి దీనికిఁ బ్రత్యక్షనియామకుం డైనపెదవేంకటాద్రి మహీవల్లభు వంశక్రమం బభివర్ణించెద. ఆశ్వా 1 - ప 20. షష్ఠ్యంతములలోఁగూడ విరూపాక్షేశ్వరునిపేరే యున్నది. అటుపిమ్మట విరూపాక్షేశ్వరునకు సభక్తికసమర్పితంబుగా నాయొనర్పంబూనిన రాఘవపాండవీయమునకుఁ గథాక్రమం బెట్లనిన యనియున్నది. ప్రతియాశ్వాసాద్యంతముల యందును విరూపాక్షదేవునిపేరే యున్నది. గ్రంథసమాప్తినిఁగూడ నీక్రిందివిధంబున విరూపాక్షదేవునిపేరే చేర్పఁబడియున్నది.

శా. దేవా దేవరప్రేరణంబునన యుద్దీపించువాగ్వైభవ
     శ్రీవిస్ఫూర్తిని రామభారత కథాశేషప్రబంధోత్తమ
     వ్యావిర్భావము నిట్లు సెందె నిది భవ్యాభవ్యత ల్సూడ కిం
     పై వర్తిల్లఁ బరిగ్రహింపుము విరూపాక్షా జగద్రక్షకా.

శా. క్రీడామాత్రకృతత్రిమూర్తిభరణాంగీకారచూడాపరి
    భ్రాడాదిత్యధునీపృషత్పుషితపంపాశైత్యవేధోమరు
    ద్రాడారాధితపాద యంఘ్రినఖచంద్రద్యోత సిధ్యత్పరి
    వ్రాడాఖండలమండలీహృదయజీవంజీవసంజీవనా.

వ్యాఖ్యాతం గూర్చి.

ఈ రాఘవపాండవీయమునకు ముద్దరాజుపెదరామమంత్రి వ్యాఖ్యానముం జేసెను. ఇతనికాలముగాని యునికిపట్టుగాని తెలియుట కా గ్రంథములో నేమియును వ్రాయంబడలేదు. వ్రాతఁప్రతులలోఁ గొంత యున్నట్లుగాఁ తెలియవచ్చినది. అవి ప్రస్తుతము దొరకుట యరుదుగా నున్నది. అతఁడు ఆశ్వాసాంతములయందు వ్రాసియుండు గద్యలంబట్టి ముద్దరాజు గణపమంత్రికుమారుఁ డని మాత్రము తేలుచున్నది. ఇదియునుగాక నందవరీకశాఖానియోగులనియును స్పష్ట మగు.

ఆగద్య మెట్లన్నను :-

"ఇది శ్రీమదనగోపాల కృపాకటాక్ష సంప్రాప్త సారసారస్వత సంపదానంద నందవరకుల క్షీరపారావార రాకాసుధాధామ ముద్దరాజు గణపయామాత్య పెద్దరామ ధీమణి ప్రదర్శితం బైనరాఘవపాండవీయాదర్శంబు" అని యున్నది. కాలము లోనగునవి యచ్చొత్తువారికిని లభ్యములు కాకయుండవచ్చును. ఇఁక రాఘవపాండవీయ శయ్యాదికముం గూర్చి యిప్పుడు వ్రాసెదను :-

రాఘవపాండవీయశయ్యాదికము.

దీనియుత్పత్తింగూర్చి యిదివఱకే కొంత కొంత వ్రాసియున్నాము. ఇపు డిందలి కవి కవిత్వవిశేషములు నుడువుట మాత్రము కావలసినదిగా నున్నది.

రాఘవపాండవీయములోని పదప్రయోగాది విషయము.

దీనివిషయమై దక్షిణామూర్తి పండితునివలన వ్రాయంబడినది మిక్కిలి పరిశీలనము చేయంబడినయభిప్రాయము కాదు. అట్టి పరిశీలన మంతయు సరియైనట్టుగా నే నొప్పుకొనఁజాలను. శ్లేషకావ్య మౌటం జేసి యీగ్రంథములో సూరకవిచేయవలసి చేసినకొన్ని ప్రయోగములు లాక్షణికులందఱికి సమ్మతములు కావయ్యెను. వైయాకరణులలోఁగూడ నహోబలపతి మొదలగువారలు కొన్ని యాక్షేపణలు చెప్పిరి. ద్వివిధ రేఫలవిషయమై పెనఁగులాడువారు గూడ నీసూరకవి చేయుఱకార ప్రయోగములలోఁ గొన్నిటికి సమ్మతింపరైరి. వాని నన్నిఁటి నిట వివరించుట మిక్కిలి కష్టసాథ్యమును స్వల్పలాభయుతము నై యుండుంగావున ఆ పని మాని వానింగూర్చి అప్పకవీయములో నహోబలపండితీయములోఁ జూడం దగు నని వక్కాణించెదను. శ్లేషకావ్యములలో నర్ధాను స్వారములును, శకటరేఫములును, అఖండయతులును బ్రబంధములలోవలెఁ కల్గుట తటస్థించదు. సంస్కృతశబ్దములు తెలుగులో శ్లేషించి విడఁదీయునపు డిట్టినియామకములు కొన్ని పొసఁగియుండవు. అట్టిపట్ల సూరనకేకాక యితరకవుల కెంతవారికి నైన మార్చి చెప్పుట దుష్కరము కావున పైదోషము లున్నంతమాత్రమున శ్లేష కావ్యమున కొక లోప మాపాదింపఁగూడదు. ఎ ట్లైనను సూరనప్రయోగములు విజాతీ యములైనవి. అనంతకాలములో శ్లేషకావ్యములం జెప్పినకవు లందఱును సూరనకవిమార్గమునే యవలంబించి నడీచిరిగావున సూరనమార్గమే శ్లేషకవనమునకు నిబంధనగ్రంథ మైనది. కావున నావిషయ మై విశేషించి వ్రాయ గమకింపను.

శయ్యాదులవిషయము.

సూరన శయ్యాదులంగూర్చి దక్షిణామూర్తిపండితుఁడు వ్రాసినవిశేషములో నేవి యంగీకరింపఁదగినవియో ఏవి పరిహరింపఁదగినవో వానినిమాత్రము వివరించెదను. అట్లు వివరింపకున్న నందలి గుణాగుణములు పాఠకులకు బోధపడకపోవును.

Critical Essas on Pingali Surana

PAGE 6.

ఉపన్యాసకాభిప్రాయము.

"సూరనార్యకవియుఁ గడుబాల్యమునందే కవితాకౌశలమును సంపాదించిన ట్లూహింపఁదగియున్నది."

చారిత్రకాభిప్రాయము.

లోకములోని కట్టుకథయే నిజ మగునేని సూరన బాల్యకాలములో విద్యాభ్యాసము లేక మూఢుఁడై తిరుగుచుండె ననియును. భార్యవంకవార లతనిం బరిహసింపఁగా నతఁడు రోషమున దేశాంతరమునకుఁబోయి విద్యాభ్యాసము చేసి పండితుఁడై వచ్చె ననియు, ననంతరము మఱికొంతకాలమునకు నతఁడు తనభార్యకుఁ దాత యగునల్లసానిపెద్దనం జూడఁబోవుడు నతనికవిత్వముం బరీక్షింప నొకపద్యముం జదువుఁడనుడు నపుడు.

"తలఁపం జొప్పడి యొప్పె నప్పుడు"

అనుపద్యము ప్రారంభింపఁగా ప్రారంభమునందే నాల్గువిఱువులా యని అడిగినట్లును, అందుపైని సూరనపద్యమంతయు విని యాక్షేపించిన బాగుగదా యనుడుఁ బెద్దన చదువు మనుడు.

" తదుద్యజ్జైత్రయాత్రాసము
 త్కలికారింఖదసంఖ్యసంఖ్యజయమత్కంఖాణరింఖావిశృం
 ఖలసంఘాతధరాపరాగపటలాక్రాంతంబు మిన్నేఱన
 ర్గళభేరీరవనిర్దళద్గగన రేఖాలేపపంకాకృతిన్."

అని చదివి పెద్దనకవిని మెప్పించిన ట్లున్నది. ఇంతియకాక బాల్యమునందే కవిత్వము చెప్పినశ్రీనాథాదులు ఆవృత్తాంతమును స్వకీయ గ్రంథములలో వ్రాసియుంచిరి. సూరన యట్లు చెప్పియుండకపోవుటచే నతఁడు బాల్యవయస్సులోఁ గవి యని చెప్ప వీలుపడదు.

2. ఉ. ఇతఁడు సంస్కృతపాండిత్యము మిగులఁ గలవాఁడు. ఇతని కద్భుతజనకములగుగ్రహణధారణశక్తులు కలవు. ఈతఁడు బాల్యమునం దభ్యసించినవిద్య యెట్టిదో చూడుఁడు. ఈయనయు నందఱివలెనే పంచకావ్యపఠనముం జేసినాఁడు, తర్వాత నాటకములంగూడ చదివెను. ఈనాటకములందలి రహస్యముల నెల్ల ననర్గళముగా గ్రహించినాఁడు. కావుననే యాంధ్రభాషను బునరుద్ధారణము చేయుటకుఁ దగినశక్తినిఁ బడసి యున్నాఁడు. నాటకశైలి యతనిమనస్సున మిగుల నాటుకొనినది. ఇది యతనిగ్రంథముల యం దెల్లెడ నాతనిచేఁ బ్రకటీకృత మై యున్నది."

చా. ఇందు వ్రాయంబడినయంశములలోఁ బెక్కులు సర్వకవిజన సామాన్యలక్షణములేకాని విశేషములు కావు. ఇతని కద్భుతము లగు గ్రహణథారణశక్తులు కల వనుటకు గ్రంథదృష్టాంతములు లేవు. పంచకావ్యములు నాటకములు చదివినాఁ డని చెప్పుట అంతకుఁ బూర్వము బాలరామాయణముంగూడఁ జదివె ననిచెప్పుట యట్టిదే. ఆంధ్రభాషను పునరుద్ధారణము చేసె ననుదాని కాధారము లేదు. నాటకశైలి యనుమాటకు నాంగ్లేయభాషలో నగుభావము ఆంధ్రగీర్వాణభాషలలోఁ జెప్పవలసివచ్చిన నది సంస్కృత ప్రాకృతములతో నున్నది. కావున నాటకశైలి ఈసూరనకవిగ్రంథములలో లే దని నిశ్చయించెదము.

3. ఉ. ఏయది చదివినను దానిని సమగ్రముగా గ్రహించి కాని విడువలేఁడు. కావుననే యితని కనర్గళధారాశక్తి లంభించినది.

చా. ఈమాటల నెఱిఁగియున్నట్లుగా మాటాలాడుటకు మనకుఁ దగినయాధారములు లేవు. ఇతని కనర్గళధారాశక్తి యున్నది లేనిది చెప్ప వలనుపడదు.

4. ఉ. రాఘవపాండవీయరచన కెట్టిశక్తి యుండవలెనో యోజింపుఁడు.

చా. హరిశ్చంద్రనలోపాఖ్యానము మొదలగుద్వ్యర్థికావ్యములను యాదవరాఘవపాండవీయత్య్రర్థికావ్యమును నలయాదవరాఘవ పాండవీయాదిచతురర్థకావ్యములను రచియించువారికి నెట్టిశక్తి యుండవలయునో!

5. ఉ. ఈతఁడు పదగుంభన కెంతమాత్రము గౌరవ మిచ్చియుండలేదు.

చా. ఇది పరిశీలన లేనివాక్య మని సూరకవిగ్రంథములఁ బరిశీలించినవారి యభిప్రాయము.

6. ఉ. కాళిదాసుకవిత్వ మితనికి మిగుల గుఱియైనది. అతనియం దితనికి మిగుల గౌరవము కలదు. ఇట్టి బుద్ధితోఁ గవిత్వము వ్రాయఁ బూనినవాఁ డెట్టి వాఁ డగునో విశేష మాలోచింపఁ బనిలేదు.

చా. దీనిని స్థిరపర్చువ్రాఁతలు లేవు. ఇట్టియూహలు శైలిని పరిశీలించుటలోఁ జాలియుండవు.

7. ఉ. ఇతని నడవడింగూర్చి చూడుఁడు. నమ్రతయు నిగ్గర్వమతియు మొదలగునవి యీతని సహజగుణములు.

చా. కృతిముఖంబునఁ జెప్పెడుమాటలంబట్టియే యొకరిప్రవర్తనము నిర్ణయింపఁ గల్గితిమేని ప్రతికృతిపతియు నైశ్వర్యంబున కుబేరసమానుఁడును, విభవమున నింద్రతుల్యుఁడు సత్యమున హరిశ్చంద్రుఁడును బరాక్రమమున శ్రీరాములు నగుదురు. కాఁబట్టి యిట్టివానిం బట్టి కృతిపతి యొక్కగాని, కవియొక్కగాని ప్రవర్తనల నెంచఁగూడ దని చెప్పెదను.

8. ఉ. ఆంధ్రకవు లందఱలోను శబ్దసౌష్ఠవమునందేమి యర్థగౌరవము నందేమి శయ్యాపాకములందేమి శైలీపరిపూర్ణతయందేమి తిక్కన సోమయాజితోడ సరి రాఁ దగుకవి యొక్కఁడును లేఁడు.

చా. ఇది పురాణకవులం గూర్చి చెప్పఁదగినమాటగాని ప్రబంధకవు లం గూర్చి కాదు. ప్రబంధకవులను ప్రబంధకవులతో సరిచూడవలెను. అం దీతనికంటెఁ బెద్దనాదు లన్ని విధముల నధికు లనుటకు సందియమే లేదు.

9. ఉ. తిక్కనతర్వాత నాచనసోమునిం జెప్పవచ్చును. ఈయిరువురితరువాతను సూరన గణనకు రాఁదగియున్నాఁ డని తలంచెదను.

చా. పైన వ్రాసినదే దీనికిఁగూడ సమాధానము. కావున దీనికి వేఱుగ నుత్తరమీయను.

10. ఉ. ఇతఁడు ఒకరు త్రొక్కినమార్గములం ద్రొక్కువాఁడు కాఁడు. తాను సంపాదించినలోకానుభవము, స్వీయ మగుతనబుద్ధివైశద్యము, ప్రతిభాసమా సాదిత మగుగుణాగుణ వివేచ నాశక్తియుఁ గలుగఁజేసినయభిరుచులమూలముగఁ గావ్యములు వ్రాసినవాఁడుగాని కబ్బపుదొంతుల సత్పదార్థములు వెదికి వ్రాసినవాఁడు కాఁడు.

చా. ఈసిద్ధాంతము కాళిదాసుమార్గమునే యితఁ డవలంబించినాఁ డనియును, రాఘవపాండవీయములోని "శ్రమ ముడుగుండు" అను పద్యము కాళిదాసకృత "పరిచయం చలలక్ష్యనిపాతనే" అను శ్లోకమునకు సరియైన తెలుఁగుగాఁ గాన్పించుచుండు నని యుపన్యాసకుఁడు 10 పుటలో వ్రాసిన మాటలకును బాధక మగుచున్నది. "బాణోచ్ఛిష్టం జగ త్సర్వ" మ్మని యున్నబుధజనోక్తియు దీనిని బలపఱుచుచున్నది. సూరకవియొక్కఁడే గ్రంథచోరుఁడు కాఁడని చెప్పఁగాఁ దక్కినకావ్యకవులందఱును గ్రంథచోరు లని అర్థాత్తు సిద్ధించుచున్నది. అట్లైర పెద్దనాదుల పెద్దఱికము చెడిపోవును. సూరనకు పైవారికంటె గౌన వాధిక్యము లేదనుమాట సర్వత్ర విదితమే. కావున సూరనంగూర్చి విశేషించి చెప్పుట యత్యుక్తి యగును.

11. ఉ. నూతనసృష్టి చేయుట యితనిమతము. చిలుకపలుకులవలె పూర్వకవి కృతవర్ణనలవెంబడి పోవుట యితనిమతము కాదు. కావుననే తన్నకావ్యములం దితఁ డాంథ్రీగీర్వాణభాషలయందాదిమకవులం బేర్కొని యున్నాఁడే కాని తక్కుంగలవారిపేళ్లనైనఁ దడవియుండలేదు.

చా. నూతనసృష్టి చేయుట యితనికే కాక కావ్యరచనచేయు వారియందఱిమతము నై యున్నది. ఇతనిపూర్వులు నీతనివలెనే పూ ర్వకవికృతవర్ణనలవెంబడి పోయిరే గాని కేవలము స్వకపోలకల్పితములకై పోవువారు కారు. ఇతఁడు నట్టివాఁడే యని కంఠోక్తిగాఁ జెప్పవలసియున్నది కాని యిం దీతనివిశేష మేమియుఁ గాన్పించదు. ఆంధ్రగీర్వాణభాషలయందలి యాదిమకవులం బేర్కొనుట యితరుల నిరసించుటకుఁ గాదు. అట్లే అయిన కాళిదాసాది మహాకవులం దిరస్కరించి నట్లగును. సంస్కృతములోఁ గవిత్వము చెప్పినవారు ప్రాచీను లగు ఋషు లై యున్నారు. కావున వ్యాసవాల్మీకులు సర్వజనులవలనఁ బరిగణింపఁ బడుచున్నారు. సూరన వారిగ్రంధముల రెండిటిం జోడింపఁ గమకించినాఁడు గనుక

"వాల్మీకి వ్యాసులఁ గొల్చెదన్ తదుభయశ్లేషార్థసంసిద్ధికిన్.

అని చెప్పినాఁడు. ఆంధ్రములోఁగూడ భారతకవిత్రయము వారు ఆంధ్రభాషా మహోపకారులలోఁ బ్రధానులు కావున వారు మాత్ర మనేకులవలనఁ గొనియాడఁబడుచున్నారు. అంతమాత్రమున వారికి గౌరవమును తక్కినవారి కగౌరవమును జేయుతలంపు సూరనకుఁగాని యే యితరకవులకుఁగాని యుండ దని నిశ్చయించవలసియున్నది. అ ట్లుండిన నాతఁడు శ్లాఘాపాత్రుఁడు కాకయే పోవచ్చును.

12. ఉ. కల్పనాశక్తి యీతనికి మెండుగ నుండుటచేతనే యాశక్తిచే నలంకరింపఁ బడినకవులను మాత్రము వర్ణించినాఁడు.

చా. పైనిఁ జెప్పంబడినయాంధ్రగీర్వాణకవులు పురాణకవులు. వారికిఁ గల్పనాశక్తితోఁ బ్రసక్తి లేదు. వారు చెప్పినదంతయుఁ జారిత్రములుగాని కావ్యములు కావు. ఒకవేళ నుపన్యాసకునియభిప్రాయములోఁ బురాణము లన్నియుఁ గల్పితము లని యున్న దేమో. అట్లుండిన వ్యాసవాల్మీకులు గాని వారికథలను కలిపిచెప్పినసూరన గాని శ్లాఘాపాత్రులు కాకపోవలెను. వీరలలో నెవ్వరును క్రొత్తకథలఁ గల్పించలేదు గదా.

13. ఉ. ఈతఁడు, వ్రాసినగ్రంథములెల్ల నూతనఫక్కికములై యున్నవి. మొదల నితనికి సహజ మగుశక్తి కలదఁట. పిదప కాళిదాసాదిమహాకవుల కావ్య సారముం గ్రహించినాడఁట. ఇఁక నితనిశక్తి యే మని యనుకొన వచ్చును ? ఈశక్తి యెట్టిపనుల నొనర్చినదో చూతము."

చా. ఈమాటల కాధారము లెవ్వియును లేవు. ఇతఁడు వ్రాసినగ్రంథములన్నియు నూతనఫక్కికములే యనుట యత్యుక్తి యగును. గరుడపురాణము పురాణఫక్కి కలదే. రాఘవపాండవీయము సంస్కృతములో నంతకుఁబూర్వమున్న రాఘవపాండవీయఫక్కి కలదే. కళాపూర్ణోదయము సంస్కృతకాదంబరి ఫక్కి కలదే, ప్రభావతీప్రద్యుమ్నము ప్రబంధఫక్కి కలదే. ఇతనిశక్తి యే మని యనుకొనవచ్చు ననునంత యద్భుతమైనది కాదు సరికదా ప్రథమతః సంస్కృతాంథ్రములయందు నవీనమార్గములఁ గల్పించినమహాకవులశక్తికి నెంతమాత్రము చాలి యుండ దని చెప్పవలసియుండును.

సూరనకాలమందుఁ గవిత్వ మెట్టిదశయం దున్న దను

దానిం గూర్చి విమర్శనము.

1. ఉ. ఆంధ్రకవు లెల్లరును వారలకాలములం బట్టి ప్రాథమిక మాధ్యమి కాధునికు లని మూఁడు భాగములుగ నగుచున్నారు. ఈ మువ్వురియందును శైలీభేదము మిగులఁ గాన్పించుచున్నది.

చా. లోకమందంతటఁ బ్రాచీనులు నాధునికు లని రెండుభేదములే గాని మూఁడుభేదములు కల్గుటకు ప్రసక్తి లేదు. అట్లే అప్పకవి మొదలగునిబంధనకారు లెవ్వరును వివరించి యుండలేదు. మనము కవిత్వశయ్యావిషయములలో భేదాభేదములఁ గనిపెట్టవలయు నని కోరెద మేని యొక్కశతాబ్దములో నుండెడుకవులపదశయ్యాదులఁ బరిశీలింపవలయుంగాని నాలుగేసి శతాబ్దములలోని కవులశయ్యాదులం బోల్పఁగూడదు.

2. ఉ. భారతశైలితోడ సరితూఁగునది యాంధ్రంబున నేదియు లేదు.

చా. అట్లు చెప్పెడు మాట కర్థము లేదు. భారతశైలి మూఁడు తెన్నులుగా నున్నది. అందు నన్నయభట్టుశైలి వంటిది తిక్కనసోమయాజిది కాదు. తిక్కనసోమయాజి శైలివంటిది యెఱ్ఱాప్రెగ్గడది కాదు. అందు నన్నయభట్టుశైలి అతిసులభమైనదియు నెఱ్ఱాప్రెగ్గడ శైలి అతి కఠినమైనదియు నై యున్నది. తిక్కనసోమయాజి శైలి యీయుభయ విధముల నుండునది. కవిత్వప్రౌఢిమలో నన్నయభట్టు మిక్కిలి నేర్పరి కానివానివలెఁ గాన్పించును. తిక్కన యెఱ్ఱప్రగ్గడలు ఇంచుమించుగా సమర్థులుగాను సమానులుగాను గాన్పించుచున్నారు.

3. ఉ. తర్వాతికవులు కొందఱు ప్రయత్నించి యాశైలి నవలంబించి గ్రంథముల వ్రాసియున్నారు.

చా. కవిత్వముం జెప్పువారు ఇతరులశైలి నవలంబించి వ్రాయుట యుండనట్లుగా నాత్మానుభవమునఁ జెప్పవలసియున్నది. కవిత్వప్రారంభసమయములో నందఱిశైలియును గొంచెము కఠినపదయుక్తముగాను, కఠినాన్వయయుక్తముగాను, నాతిమధురముగా నుండుట స్వభావము. పోవంబోవ గఠినపదప్రయోగమునం దిష్టముగలవారికవనము అతికఠినముగాను సులభపదప్రయోగము లిష్టముగా నుండువారి కవిత్వ మతిసులభముగా నుండును. ఇటులనే రసాలంకారములఁ గృషిచేయువారికవితయు నుండుననుటకు సందియ ముండదు. ఇట్లుండుటం జేసి మనము ఒకరి కవిత్వముంబోలి యొకరికవిత్వ మున్న దని గాని యొకరివర్ణ నలం జూచి యొకరు వర్ణనలం జేసి రని గాని యూహింపఁ గూడదు. చమత్కారార్థముగా నెవ్వరైన మహాకవి చెప్పిన వర్ణనాంశముల నంతకు నెక్కు డగురసము పుట్టింపఁగోరి మఱికొందఱు మహాకవులచేతం బ్రయత్నింపఁబడినను అంతమాత్రమున నాయిర్వురు నొక్క శైలి వా రనిగాని లేక వారినుండి వీరు దొంగిలి రని గాని చెప్పుట కవిత్వపరిపాటిలోనిది కాదు.

4. ఉ. పూర్వకవులు వలయుచోటుల సంస్కృతముం దెచ్చి పెట్టిరి. కాని గ్రంథముల నెల్ల సంస్కృతభూయిష్ఠములు చేసి యుండలేదు, తర్వాతి కవులు వ్రాసిన గ్రంథములయం దాంథ్రచిహ్నము లించుకైనను లేవు.

చా. దీనికిఁ గారణ మాలోచింపక పోరాదు. పూర్వకవులు సంస్కృతముం దెనిఁగించుచోఁగూడ సంస్కృతము లుంచియుండఁగా సం స్కృతములోని కావ్యనాటకములు నలంకారములు తెనుఁగులోనికిఁ దెచ్చెడిప్రబంధకవులుమాత్రము సంస్కృతము నెందు కవలంబించఁ గూడదు. అటులనే కాకున్న సంస్కృతములోనియలంకారములకు నాంధ్రమున నిష్ప్రయోజనత్వము తటస్థించును. ఆంధ్రభాష తత్సమ తద్భవ దేశ్యాత్మక మై యున్న దనినచో నీమూఁడును కల్పి యైనఁ జెప్పవచ్చును. దేని కది విడఁదీసియైనఁ జెప్పవచ్చును. ప్రబంధములలోఁ బ్రత్యేకము వర్ణనాంశములే ప్రధానములు గావున నిట్టివర్ణ నాంశములలోఁ గొన్ని సంస్కృతజటిల మగుటచేతనే రసావిర్భావ మగుటయు, శ్రావ్య మగుటంబట్టి ప్రబంధకవులందఱు నట్టిత్రోవ నవలంబించిరి. కాఁబట్టి ప్రబంధము లనుపేరితో నొప్పుగ్రంథము లట్లె యుండవలెంగాని వేఱుగ నుండఁగూడదు. ఇట్టి విశేషములు లేని నవీనులప్రబంధములు పండితా దరణీయములు కాక సామాన్యగౌరవమున నొప్పియున్నవి. కావున గ్రంథగౌరవమే కోరువారు ఆంధ్రచిహ్నములు లేనిలోప మెంచ రని తలంచెదను.

5. లే. శబ్దార్థ గౌరవ మూహించునలవాటు మాధ్యమిక కవులయందుఁ బ్రబలినది. ఇంతటినుండియుఁ గవులయందు స్వశక్తి మాటుపడినది. వీరలు తమవ్రాసినగ్రంథముల నెల్ల నొక్కరీతిగాఁ జర్వితచర్వణ మన్నట్లు వ్రాసిరే గాని తమబుద్ధివిశేషము నేనిఁ గల్పనాశక్తి నేని వెల్లడి చేసియున్నవారు కారు.

చా. ఈయాక్షేపమునందు న్యాయ మేమియుం గానివించదు. ప్రబంధమున కేర్పడినవి యిరువదియొక్కవర్ణనములు. అవి లేనిచో నది ప్రబంధము కాదు. అందు ప్రథమములో వర్ణించినవారికి సౌలభ్యము విశేషించి కలదు. ఆవర్ణనముననే వందలకొలఁది జనము చేయనారంభించిన నొకరిదానిం బోలి యొకరిది యుండకతీఱదు. అంతమాత్రముచేత ప్రాచీనులఁ జూచి నవీను లావర్ణనములనే చేసి రని చెప్పుట యుక్తియుక్తము కాదు. ఇట్టివన్నియుఁ జర్వితచర్వణము లని చెప్పుటయు న్యాయము కాదు. ఈవర్ణనాంశములయందేమి తదితరస్థలములయం దేమి ప్రతి ప్రబంధములోనను హృదయాహ్లాదకరము లగుకొన్ని కొన్ని క్రొత్తవి శేషము లుండి యవి యాయాకవులబుద్ధివిశేషమును, గల్పనాశక్తిని బ్రకటించుచునే యున్నవి కాని యుపన్యాసకుఁ డనినట్లు హాస్యాస్పదములుగా లేవు. కవిత్వవ్యవసాయము చేసినవార లిచ్చెడియభిప్రాయ మిది గా దనియుం గూడ చెప్పవలసియున్నది.

6 ఉ. ఈప్రబంధకవులకు మార్గదర్శి యగుపెద్దనమాత్రము కొంతపొగడ్తకుఁ దగియున్నాఁడు. కాని తక్కినవారందఱు నాయనవర్ణనలకు నచ్చటచ్చట మెఱుఁగువెట్టియేని పూర్వకవివర్ణనాంశములఁ గలిపియేని వ్రాసినారుకాని తమస్వశక్తిని జూపియుండలేదు. పెద్దనకూడ తనవర్ణ నల నితరులనుండి చేకొనియున్నాఁడు.

చా. ఉపన్యాసకుని దృష్టిలోఁ పెద్దనకవియే గ్రంథచోరుడుగాఁ గాన్పించఁగా నిఁక తక్కినకవులంగూర్చి చెప్పనేల? ప్రబంధములవిషయములో నిట్టిన్యూనాభిప్రాయ మీవఱకే విమర్శకులు నీయలేదు. ఇందు విమర్శకునకుఁ బ్రబంధపరిపాటి తెలియ దని చెప్పుటయే యుత్తరువు. దీనికి వివరణము చేయుటకై యత్నించుట నిష్ఫల మగును.

7. ఉ. ప్రబంధములలో నెద్దానిం జేకొన్నను దానికథ చదువకయ చెప్పవచ్చును.

చా. ఇది యొక గొప్పశక్తి. మనుచరిత్రమునకు గలకథ గ్రంథము పేరు వినినంతమాత్రముననే బోధించు నేమో? చదువఁగాఁగాని నా కాకథ తెలియలే దని చెప్పుట ఆత్మానుభవము. అటులనే పారిజాతాపహరణము యొక్కయు, నాముక్త మాల్యదయొక్కయు, పాండురంగక్షేత్ర మహాత్మ్యముయొక్కయు, యయాతిచరిత్రయొక్కయు మఱియు నిట్టిప్రబంధములయొక్క కథలు పేరు వినినంతమాత్రమున నవగాహనకు రాకున్నవి. అటుగాకున్న నుపన్యాసకుని వాక్యమునకు వేఱేది యైన నర్థ మున్న నుండవచ్చును.

8 ఉ. రామరాజభూషణకవిరచిత మగువసుచరిత్రఁ జేకొనుఁడు. అందలి కథ నెల్ల నొక్కవాక్యమునఁ బొందుపఱుపవచ్చును. వర్ణనలుమాత్ర మతిమాత్రములై యున్నవి. చంద్రోదయవర్ణనమున ముప్పదిపద్యములును సూర్యోదయవర్ణనమున నలువదిపద్యములును, నాయికా నాయకుల విరహదశావర్ణనమున రెండాశ్వాసములును వ్రాసి కాలము గడపినాఁడేకాని కథాంశముల వర్ణించి రసము పుట్టించినవాఁడు కాఁడు. చా. వసుచరిత్రముపై యాక్షేపణచేసినపరిశీలకు లెవ్వరు నీవఱకుం గాన్పించలేదు. ఉపన్యాసకున కేకారణముననో సాహిత్యరసపోషణుఁ డగురామరాజభూషణునికవితారసము వెగటై పోయినది. తా మెచ్చెడుసూరనకవి కన్ని విధముల నితఁ డధికుఁ డగుటకు నలిగినాఁడేమో! లేకున్న కారణాంతర మేమైన నున్నదో! వసుచరిత్రములో రాజరాజభూషణుఁడు కురిపించినసాహిత్యరసవర్షము అతనికిఁ బూర్వమున నున్న కవులకు లభింపకపోవుట మంచిపని యాయె నని తదనంతరకవులు దాని నంతయుఁ దమకవితాసన్యములకే వినియోగింపఁ జేసికొని బలవంతము లై ఫలవంతము లగుకవితానన్యగర్భు లగుచున్నారు. వసుచరిత్ర కవిం గూర్చి వ్రాయుచో నాగ్రంథవిశేషముల వక్కాణించెదను. ముం దుపన్యాసకాధిక్షేపణములకుఁ గొంచెము సమాధానము వ్రాసెదను. అందలి కథనెల్ల నొక్కవాక్యమునఁ బొందుపఱుపవచ్చు నను దానికి బుద్ధిమంతులైనవారు రామాయణకథనుగూడ నట్లే చేయవచ్చును. భారతకథ నట్లే చేయవచ్చును. సర్వకథల నట్లే చెప్పవచ్చును. ప్రబంధములు కథాచమత్కారముల కొఱకుగా నేర్పడినవి కావు. ఇవి ప్రత్యేకము వర్ణనప్రజ్ఞను చూపుటకే ఏర్పడినవి. రామభూషణుఁ డదివఱకు పెద్దన చెప్పినమనుచరిత్రములోని కథాచమత్కృతి తెలియని వాఁ డై యీవసుచరిత్రము నారంభించి యుండఁడు. అందుఁ గథాప్రయుక్తచమత్కృతియేగాని కవిత్వ రసప్రయుక్తచమత్కారము విశేషముగ లేకుండుట నూహించి కథాచమత్కారము లేనిగాథనే యేర్చి కొనియుండును. అటులే కాకున్న చమత్కారకథలు తెల్పుగాథలు మనపురాణములలో లేవా ? అట్టివానిని రామరాజభూషణుఁడు చదివియుండకుండునా ? కావున నిట్టియుద్యమము శ్లాఘాపాత్రమే. వర్ణనలుమాత్ర మతిమాత్రములై యున్న వనుదానికిఁ జెప్పవలసినమాట యొకటి యున్నది. కల్పన లత్యద్భుతము లనియో లేక అతివిస్తారము లనియో ఇందు కల్పన లత్యద్భుతము లగు ననుట ఆంథ్రసంస్కృత కవి జనసామాన్యధర్మమేను. ఇఁక నతివిస్తారములన్నచో నది రామరాజభూషణ సాహిత్యబలమునే చూపును. సామాన్యముగ నొక్కొకవర్ణనకు రెండేసి మూఁడేసి పద్యములకంటె నధికముగా నితరకవులు చెప్పలేదు. పెద్దనకవిమాత్రము పదివఱకుం జెప్పె. ఆవిషయములో నాలోచింపఁగా రామరాజభూషణుఁడు ముప్పది పద్యములు నలుబది పద్యములు చెప్పుటచేఁ బెద్దనకంటెఁ గూడ నీతఁడు కల్పనాశక్తియందనేక మడుఁగు లాధిక్యత నందినవాఁడని చెప్పవలయును. ఈవర్ణనలనునవి ముప్పదిముప్పది విధములుగ నున్నవికాని యొకదానిం బోలినది యొకటికాదు. ఒకదానికంటె నొకదానియందు విశేషము లున్నవి. ఒకటిరెండుపద్యములం జూపెదను.

మ. హరిదంభోరుహలోచనల్ గగనరం గాభోగరంగత్తమో
     భరనేపథ్యము నొయ్యనొయ్య సడలింపన్ రాత్రి శైలూషికిన్
     వరుస న్మౌక్తికపట్టమున్ నిటలమున్ వక్త్రంబునుం దోఁచె నా
     హరిణాంకాకృతి వొల్చె రేకయి సగం బై బింబమై తూర్పునన్.

శా. ఉదయోలూఖల మెక్కి నిక్కి సహజాంకోసేంద్రసంయుక్తుఁ డై
     చదలన్ బూదశశాంకసీరి కరవిస్తారంబులం బట్టి బి
     ట్టదుమన్ గాఱెఁ జకోరగోపతతిపా లై చంద్రికాక్షీరముల్
     పొదలెన్ ఘూర్ణితదుగ్ధధామనిబిడప్రోద్భూతసంరంభముల్.

ఇట్టివర్ణనలోఁగూడ నెక్కడనో పదియునైదుగాని తక్కినచోటుల రెండుమూఁడు చెప్పి పైకిఁ బోవుచు వచ్చెను. చమత్కరించుట కవధియున్నంతవఱకుఁ జమత్కరించుటయే రామరాజభూషణుని కోర్కె గాని సంగ్రహించి చెప్పుట యాతనిమార్గము కాదు. నాయికానాయకుల విరహాదశావర్ణనమున రెండాశ్వాసములు వ్రాసి కాలము గడపినాఁడేకాని కథాంశముల వర్ణించి రసము పుట్టించినవాఁడు కాఁ డనుదానికిఁ బైనసమాధానమే చాలియుండును. ఇది కథాంశవర్ణన కై యేర్పడినకావ్యము కాదు. విరహదశావర్ణన లెవ్వ రెంతవఱకుఁ జేయఁగలరో అట్టిమనోదార్ఢ్యములు చూపుకొనుటకై రచియింపఁబడిన వర్ణన లై యున్నవి. ఆగ్రంథము చూడకుండ నిప్పటికాలములోఁ బండి తులందఱుఁ గలసి యొకయంశముంగూర్చి రెండాశ్వాసములవర్ణనముం జేయ గమకింపుఁ డని ప్రార్థించెదను. వా రట్లుచేయఁజాలినప్పుడుగదా రామభూషణునికష్టము వృధ యై పోవును.

9 ఉ. రసపుష్టి నొక్కశబ్దముచేతనే కలిగింపవచ్చును. దాని నమితముగా వర్ణించినచో నది విరస మై పోవును.

చా. అది నిజమే అయిన గొప్పశక్తియే ! రసపుష్టి యనునది యే రెండుమాటలు గలది. ఇఁక రసపుష్టి నొక్కమాటచేఁ గల్గించుట యెట్లో నాకు గోచరంబు కాకున్నది. కవిత్వవ్యవసాయము మాటలు చల్లిన ఫలియింపదు. దానికి కృషియును, నైసర్గికప్రతిభయు నుండవలయును. అపుడుగాని రసోదయము కాఁజాలదు. అట్టిరసాస్వాదనము ప్రారంభకులకు ముఖసిధానము చేయును. అపుడు విరసమగునేమో కాని అభ్యాసవంతులకు మధురరసాదులవలెఁ బ్రౌఢులకు కావ్యరసము కడుం గడుఁ బ్రీతి గావించు. అట్టివారిం దనియించువాఁ డందఱికంటెను రస లోలుఁడై యుండవలయును. కావుననే రామరాజభూషణునకు సాహిత్యరసపోషణుఁ డనుబిరుదు కల్గినది. రసము తెచ్చిన నతఁడే తేవలయునుగాని యిఁక నన్యులవశ మగునా ?

10 ఉ. స్వాభావికము లగువర్ణనలు పెక్కు లుండిన మనోహారముగా నుండునుగాని మిథ్యావాదము లగుమత్ప్రేక్షాతిశయోక్తులు మితి మీఱ వర్ణించినచో నది మనసూన కానంద మీకుంటయకాక వేసటఁ గల్గించుటకుఁగూడ మూలము లగును.

చా. ఇక్కడ స్వాభావికము లగువర్ణన లన నా కర్థము గోచరంబు కాలేదు "శుష్కేమూలంతిష్ఠత్యగ్రే" అనునట్టివి స్వాభావికవర్ణనములు. ఇట్టివి ప్రబంధములలోఁ జేర్పఁబడకపోవుటకుఁ గారణ మేమైన నుండవచ్చును. కేవలము వర్ణనాంశముల కే యిది యేర్పడినది. వలయునేని స్వాభావికవర్ణనలు పురణాదికములలోఁ జూడఁదగును. ఉత్ప్రేక్షాతిశయోక్తులు మనస్సున కానంద మీయకుంటయే కాక వేనటఁ గూడ గల్గించు నన దీనికి వ్రాయవలసినసమాధానము లేదు. ఇది పండితానుభవవేద్యము. 11 ఉ. చక్కనిజవరాలికి శరీరమం దంతట తొడవులు తొడిగినచో నెట్టులుండును. అట్లు గాక ప్రశస్తము లగురెండుమూఁడు తొడవు లాయాచోటులం గైచేసిన నెట్టు లుండును.

చా. ఈయుదాహరణము లోకానుభవముం బట్టి వ్రాయఁబడవలయును. శరీరమంతయు కనకాంగివిధముగ నగలుంచుట అసహజమే గద. ఇఁక నగ లెక్కువ తక్కువగా నుండినచోఁ గల్గుస్త్రీ సౌందర్యాదికములు దేశానుసారములై యుండును. ఆంధ్రులు వివిధము లగునలంకారములచేతంగాని తనియరు. ద్రావిడదేశస్థులు దీనికి వ్యతిరేకాభిప్రాయులు. ఆంధ్రులలోఁ గొంచెమునగ లుంచికొనుట మంచిది యని యే స్త్రీయును బల్కఁ జూడము. ధనాధికారము లేక తొడవులు తొడిగింప నెట్లు సాధ్యము కాదో అటులనే ఆంధ్రులలో సాహితీరసపోషణాధికారము లేక కవితాయువతిని భూషణభూషితం జేసి సంతసింపం జేయరాదు. కావ్యాలంకారసంగ్రహములో

క. తను వగు శబ్దార్థంబులు, థ్వని జీవ మలంక్రియావితానము సొమ్ముల్
    తనరుగుణంబులు గుణములు, ఘనవృత్తులు వృత్తు లౌర కావ్యేందిరకున్.

అని యున్నది. కావున నాంధ్రసరస్వతి రెండుమూఁడు తొడవులతో సంతోషించునది కా దని నిష్కర్షించెదను.

కాలీనుల కవిత్వమున కున్నదశను సూరన వృద్ధి నొందించినవిధము.

1 ఉ. ఈకవి తనకవితాకన్యకకుఁ దొడవులు తొడిగి మెఱయింపలేదు. ఆమె స్వభావసౌందర్యమునే వెల్లడిచేసినాఁడు.

చా. ఈయభిప్రాయ మేమియు సరియైనది కాదు. సూరనకవి కావ్యాలంకారములం గైకొనియుండలే దనుమాట కాధారములు లేవు. ద్వ్యర్థికావ్య మగురాఘవపాండవీయములోఁ గూడ నీకావ్యాలంకారములు మెండుగ నున్నవి. ప్రభావతీప్రద్యుమ్నము కేవలము ప్రబంధమే. కళాపూర్ణోదయము కల్పనాకథ యైనను అందు ననేకాలంకారము లుండినవి.

2 ఉ. మాధ్యమికకవు లందఱిలోను సూరనతో సరి యగునంతటివాఁ డొక్కదైన లేఁడు. పెద్దనకూడ లొఁగువాఁడే అని నాతలంపు. చా. దీనిఁ గారణములు చెప్పింనంగాని అంగీకరింప వీలుపడదు. సూరనయెడ నిబంధనకారుల కేమి యభిప్రాయము కలదో అది ప్రమాణముగాని ఆధునికులలో నొక రిద్దఱి యభిప్రాయము గణనీయము కానేరదు. పెద్దనకూడ నీసూరనకుఁ జాలువాఁడు గాఁ డనుట ఆయిర్వురికవితాతారతమ్యము లెఱుఁగక పోవుట యై యుండును.

3 ఉ. కాళిదాసుకవిత్వమం దపారగౌరవ ముంచియున్నాఁడు గనుకనే యితఁడు లాతికవులవలెఁగాక రసవంత మగుకావ్యరచనకు సమర్థుఁ డైనాఁడు.

చా. దీనికి సమాధాన మిదివఱకే చెప్పియున్నాఁడను. లాతి కవుల కావ్యములు రసవంతములు కా వనియు నితనికవనమొక్కటి యే రసవంత మైన దని చెప్పుట కేవల మనృతమైనఁ గావలె లేకున్న పక్షపాతవృత్తి యైనం గావలెను.

4 ఉ. ఇతఁడు నాటకాలంకార సాహిత్యము కలఁవాఁడు. ఇతఁడు సంస్కృతమున శాస్త్రాభ్యసనము చేసినట్లు కనుపించుచున్నది.

చా. ఇది సర్వప్రబంధకవిసామాన్యలక్షణమే కాని విశేషమైనది కాదు. సంస్కృతశాస్త్రాభ్యసనము చేయని ప్రసిద్ధప్రబంధకవు లెవ్వరును లేరు.

5 ఉ. రాఘవపాండవీయమునందు నయోధ్యాహస్తిపురములను వర్ణించినాఁడు. అంతటను కథాభాగములను వర్ణించినాఁడేకాని ఛాందసవృత్తిఁ గైకొని నిరుపయోగము లగువర్ణనములను జేయలేదు.

సూరనకవి రెండుకథలను కల్పిగ్రంథముచేయు భారమునందు మునిఁగి యున్నాఁడుగావునను, అది ప్రథమప్రయత్నము కావునను దృష్టి, కథాసందర్భముఁ గూర్చుటయందే వినియోగించెఁ గావునను తక్కినవర్ణనలు సాధ్య మగునంతవఱకు తగ్గించి యుండును. కాని వర్ణనలయందలియసూయచేతఁగాని లేక యాధునికాభిప్రాయము దివ్యదృష్టిం జూచుటచేఁతగాని కాదు.

6 ఉ. రామరాజభూషణకవి తనహరిశ్చంద్రనలోపాఖ్యానమునఁ బూరవర్ణన చేసి దానికిం దోడుఁగ బెక్కువర్ణనల వర్ణించినాఁడు. చా. దీనిచేతనే రామభూషణకవికంటె సూరన వర్ణనావిషయములోఁ గించిత్తు తగ్గనాఁ డని చెప్పవలసియున్నది. రామభూషణునివలె వర్ణనలు సర్వతోముఖముగఁ జేయఁగలవా రాంధ్రకవులలో లేరు సరిగదా సంస్కృతములో లక్ష్మీసహస్రము రచియించినకవిగూడ నాతనిఁ బోలఁజాలఁ డని చెప్పవలసియున్నది.

7 ఉ. ఏ హేతువుననో నూతన తనమూఁడవకావ్య మగుకళాపూర్ణోదయమున నీఛాందసవృత్తికి లోనైనాఁడు. తనకాలమందలి కవులయం దీవర్ణనలు చేయుట యాచారమై యుండుటంబట్టి తనకావ్యములం దేదేని యొక్కదానియందు వానిఁ జేర్చిన నెట్టు లుండునో చూత మనుతాత్పర్యమున వ్రాసినను వ్రాసియుండునుగాని యావర్ణనలందు సూరన కేమాత్రమును గౌరవము లేదు.

చా. సూరన వర్ణనావిషయ మగుఛాందసవృత్తి నవలంబించుటకుఁ గారణము విస్పష్టమే. తన ప్రథమకృతి పురాణ మవుటంజేసియుఁ రెండవకృతి ద్వ్యర్థికావ్య మగుటం జేసియుఁ దనవర్ణనాసామర్థ్యముఁ జూపుట కనువుపడలేదు. ప్రబంధకవిత్వమునకు వర్ణనాపాండిత్యమే ప్రధానము. అవి కల్గియుండనినాఁడు ఏకృతియుఁ బ్రబంధము కాదు. ఆకవి ప్రబంధకవి కాఁడు. ప్రబంధకవి యనిపించుకొనిన నాతనికాలములో గౌరవమున్నదిగాని పురాణముం దెనిఁగించినను, ద్వ్యర్థి కావ్యము రచించినను గౌరవము లేదు. కావున సూరన కళాపూర్ణోదయము నందైనఁ దాను ప్రబంధకవి ననిపించుకొనవలయు నని యత్నించి ప్రబంధవర్ణనల నన్నిటిం జేసియున్నాఁడు. అది యిప్పటివారిసాహిత్యభేదముం బట్టి ఛాందసముగాఁ గానుపించినను సూరకవికాలమువారి కాప్రజ్ఞ విశేషముగా నుండెను. అట్టిగౌరవకార్యముగనుకనే దానిని మనఃపూర్వకముగ నారంభించెను.

8 ఉ. ప్రభావతీప్రద్యుమ్నమునందుఁ బురవర్ణన మైనఁ జేయకమునుపే మొదటి పద్యమునందే కథాప్రారంభము చేసి భూమికి దిగివచ్చుచుండఁ గ్రిందఁ గనుపించు చున్న ద్వారకాపట్టణవైచిత్ర్యములను ఇంద్రమాతలులు జెప్పుకొనునట్లు వ్రాసినాఁడు.

చా. ప్రబంధములోఁ గొన్నివర్ణన లుండవలయు నని యున్నది గాని అందు ప్రథమములో నీవర్ణన లుండవలె నని లేదు. ఆకారణము న పురవర్ణనమునకు మొదలనే యక్కఱ కాదు. పురమును వర్ణించునపుడు క్రిందనుండి మీఁదికి వర్ణించువారు కొందఱును మీఁదినుండి క్రిందికి వర్ణించువారు మఱికొందఱు నైయున్నారు. ఆచేయుచున్నవర్ణనాంశములో నేదియైన క్రొత్తత్రోవ యలవడిన నందుఁ జేయువర్ణనము కొంచెమయిన గొప్పగా నుండును. క్రిందినుండి పైకి పురమును వర్ణించుమార్గదర్శి యగుటకు నాముక్తమాల్యదాకారుఁడు.

"అడుగున నుండియున్ బదిలమై చెద లంటెడుకోట నొప్పుప్రోల్"

అని మొదలిడెను. సూరన పైనుండిపట్టణము చూచిన నెట్లుండునో దానిని నూహించి వర్ణించుట విశేషములోనిది కాదుకావున సూరనయు పురవర్ణనము చేసినవాఁడే.

9 ఉ. ఇతఁడు కవితాప్రశంసలోఁ దనకావ్యములందుఁ గొన్ని లక్షణములు వ్రాసియున్నాఁడు. ఇం దలంకారశాస్త్రజ్ఞానమును వెల్లడిచేసినాఁడు.

చా. సూరనకవి యుదాహరించినపద్యము నిట వివరించి యనంతర మందలివిశేషములు పైయుపన్యాసకుని యభిప్రాయములతో నెట్లు సరిపడియుండువో తెలియపఱిచెదను.

సీ. పొసఁగ ముత్తెపుసరుల్ పోహళించినయట్ల, తమలోనఁ దొరయుశబ్దములఁ గూర్చి
    యర్థంబు వాచ్య లక్ష్య వ్యంగ్యభేదంబు, లెఱిఁగి నిర్దోషత నెసఁగఁజేసి
    రసభావములకు నర్హం బుగ వైదర్భి, మొదలైనరీతు లిమ్ముగ నమర్చి
    రీతుల కుచితంబు లై తనరారెడు, ప్రాణంబు లింపుగాఁ బాదుకొల్పి

గీ. యమర నుపమాదులును యమకాదులు నగు, నట్టియర్థశబ్దాలంక్రియలు ఘటించి
    కవితఁ జెప్పంగ నేర్చుసత్కవివరునకు, నభిమతార్థంబు లొసఁగనివారు గలరె.

అను నీపద్యములో నుడువఁబడిన వెవ్వి యన :-

1. అర్థ మెఱుంగుట.
2. లక్ష్య మెఱుంగుట.
3. వ్యంగ్య మెఱుంగుట.
4. రస భావముల కర్హం బగు వైదర్భి మొదలగురీతులు చేర్చుట.
5. రీతుల కుచిత మగుప్రాణంబు లుంచుట.
6. ఉపమాదులఁ గూర్చుట (అర్థాలంకారములు)
7. యమకాధులఁ జెప్పుట (శబ్దాలంకారములు)

ఈరీతిని కవిత్వముఁ జెప్పినచో రసికులు మనోరథముల నిచ్చెద రనియె. ఉపన్యాసకుఁడు పైనఁ జెప్పుచు వచ్చిన "ఈకవి తన కవితాకన్యకు తొడవులు తొడిగింపలే దనియు, ఇతఁడు అయోధ్యా హస్తిపురముల వర్ణించి అంతట కథాభాగములను వర్ణించినాఁడే కాని ఛాందసవృత్తిం గైకొని నిరుపయోగము లగువర్ణనలఁ జేయలేదనియు, కళాపూర్ణోదయములోఁ జేయంబడినతనఛాందసవర్ణనలయందు సూరన కెంతమాత్రము గౌరవము లే"దనునవి మొద లగువాక్యములు సూరకవి మత మెఱుఁగక పోవుటచేత వ్రాసియున్నాఁడుగాని మఱియొకటి కాదని స్పష్టపఱుచు. సూరనకవి తనమతమును తానే స్పష్టీకరించి చెప్పుచుండఁగా నది సూరనమతము కా దని యేరైన నొక్కి వక్కాణించుటకు నధికార మే మున్నది. సూరకవి తనయభిప్రాయము నొక్కకళాపూర్ణోదయములోఁ జెప్పుటయే చాలు నని తలంచక తననాల్గవకృతి యగుప్రభావతీప్రద్యుమ్నములోఁగూడ మఱికొన్నివిశేషములఁ జేర్చి చెప్పె. ఇది యాంధ్రకవిత్వాభ్యాసకులకు మిగుల నుపయోగకర మైనదియును కావ్యాలంకారములను సంగ్రహముగాఁ జెప్పునదియు నై యున్నది. దాని నిట వివరించెదను.

"సీ. శబ్దసంస్కార మెచ్చటను జాఱఁగనీక, పదమైత్త్రి యర్థసంపదలఁ బొదల
      తల పెల్ల నక్లిష్టతను బ్రదీపితము గాఁ, బునరుక్తిదోషంబుపొంతఁ బోక
      యాకాంక్షితస్ఫూర్తి యాచరించుచును శా,ఖాచంక్రమక్రియఁ గడవఁజనక
      ప్రకృతార్థభావంబు పాదుకో నదుకుచు, నుపపత్తి నెందు నత్యూర్జితముగ

గీ. నొకటఁ బూర్వోత్తరవిరోధ మొదవకుండఁ, దత్తదవయవవాక్య తాత్పర్యభేద
    ములు మహాకావ్యతాత్పర్యమునకు నొనరఁ, బలుక నేర్చుట బహుతఫఃఫలము గాదె.

కళాపూర్ణోదయమున సూరన కవితావిశేషముల నెన్నుచుఁ జెప్పినపద్యమును పైపద్యములతోటిపాటిదే. ఇవియన్నియుఁ గలసియే సూరకవి కవితాశైలిం దేటపఱచు. అట్టిపద్యము నీక్రింద నుదహరించిన సూరనకు కావ్యవర్ణనలయం దెంతమాత్రము గౌరవము లేదనుమాట మొదటికి దుడిచికొనిపోవును. ఆపద్య మెట్లన్నను.

లయగ్రాహి.

"చలువ గల వెన్నెలల చెలువునకు సౌరభము కలిగినను సౌరభముఁజలువయుఁ దలిర్పంబొలు పెసఁగుకప్పరపుఁ బలుకునకుఁ గోమలత నెలకొనిన సౌరభముఁ జలువపసయుం గోమలతయును గలిగి జగముల మిగులఁ బెం పెసఁగుమలయసవనంపుఁగొదమలకు మధురత్వం బలవడిన నీడు మఱి కల దనఁగ వచ్చుఁ గడు వెలయఁ గలనీసుకవిపలుకులకు నెంచన్."

అని చెప్పెను.

10 ఉ. ఈకవి కావ్యములందు నాటకశైలి కాన్పించుచున్నది. శ్రవ్యకావ్యముల యం దున్నరమ్యత శ్రవ్యకావ్యములయం దున్నది. దృశ్యకావ్యములయం దున్నరమ్యత దృశ్యకావ్యములయం దున్నది. వీనిరెంటిని గలిపి వ్రాసినయెడల నెంతమనోహరముగాఁ గూడునో వేఱే చెప్ప నక్కఱ యుండదు.

చా. నాటక శైలియును దానికంటెఁ బ్రసంగశైలి యని చెప్పిన నది లెస్స యై యుండును. ప్రబంధాదులు కేవలము శ్రవ్యకావ్యములై నప్పటికి నిందు ప్రసంగశైలి యుంచుట ప్రౌఢకవులలోఁ గాన్పించు. తారాశశాంకవిజయాది శృంగారరసప్రబంధకవులు గూడ నీశైలినే అవసరసమయములలో నవలంబించుచు వచ్చిరి. అంతమాత్రమున నాంధ్రములలో నీవఱకు లేనినాటకఫక్కిక నీసూరకవి కల్పించె నని చెప్ప నొప్పియుండదు.

11 ఉ. అంశము లన్నియు నాటకములవలె నెట్లు వర్ణింపఁబడినవి. సంధివచనములు లేనిచోఁ గావ్య మెల్ల రూపక మగు నని యెంచెదను. ఈవిషయముల నెల్లఁ జాగ్రత్తతోఁ బరీక్షించి చూచినపుడు సూరనకు నీతనిసమకాలికు లగునితరకవులకు నెట్టితారతమ్యము కలదో స్పష్ట మగును. ఇతరమాధ్యమిక కవులందఱికంటె నీతఁడు వేయిమడుంగు లెక్కు డని యొప్పుకొనకతీఱదు.

చా. నాటకపద్ధతింగూర్చి యిదివఱకే వ్రాసియున్నాను. నాటకఫక్కి ఆంధ్రంబునకు లేదు. సంధివచనములే నాటకమునకు ప్రధానాంగములు కావు. నాటకమునకు ప్రస్తావనాద్యంగము లుండును. అవి యుండనిచో దానికి నాటకనామము చెల్లదు. ప్రసంగశైలివిశేషముగా నున్నంత మాత్రమున నిది యొకవిశేషముగా నెన్నంబడదు. ఇతరమాధ్యమికకవు లందఱికంటె నీతఁ డెక్కువవాఁ డని చెప్పుటయే సాహసకృత్యము. అట్టిచో వేయిమడుంగు లెక్కు డని చెప్పినమాట అర్థము లేనియత్యుక్తి యనక తప్పదు. 12 ఉ. ఇతఁడు వచనములుగూడ మిగుల సులభముగా వ్రాయును. మనుచరిత్రవసుచరిత్రాదులందుఁ బద్యములకంటె వచనములు మిగులఁ గఠినశైలిని వ్రాయఁబడియున్నవి. అందులకర్తృకర్మక్రియలను గ్రహించి వాక్యాన్వయము చేసుకొను నప్పటికే దుర్లభము. ఈయలవాటు సూరన తనకళాపూర్ణోదయమునఁ బీఠికయందు నిల్పినాఁడు కాని తర్వాత వ్రాసినవచనములనెల్ల మిగుల సులభము గాను, సరసముగాను వ్రాసియున్నాఁడు. ఈతనివచనములు భారతము నందలివచనములతోడఁ బోల్పఁదగియున్నవి. పద్యములు కఠినశైలిని వ్రాయఁబడియుండినను, వచనములు నడుమ నుంచినఁ గ్రందసందర్భము బాగుగాఁ దెలిసికొనవచ్చుననియు, గ్రంథ మంతయుఁ బద్యమయమై యుండక అక్కడక్కడ వచనములుకూడ నుండినచోఁ జదువరుల మనస్సునకు విశ్రాంతి నొసఁగు ననియు వచనములు పద్యకావ్యముల యందుఁ జేర్పఁబడుచున్నవి. అది పోవం బోవ పద్యములకంటె వచనములు మిగుల గఠినశైలిని వ్రాయుటలోనికి దిగినది..

చా. ఉపన్యాసకుఁడు చెప్పినట్లు వచనములు సులభముగ వ్రాయుట యిప్పటికాలపుచదువరులలో శ్లాఘనీయకార్య మైన నగునుగాని సూరనకాలములో నది యట్లుకాదు. వర్ణనావిషయమై కలనిరంకుశప్రజ్ఞ జూపుటకుఁ గలకోర్కెను చందోబద్ధము లైన పద్యములలో. జూపుటకు వలనుపడక ప్రబంధకవులు విశేషకథాసందర్భ మవసరము లేనిచోట నాశ్వాసమున కొక్కటియో రెండో వచనము లుండుచుండు నాచార మేర్పర్చికొనిరి. కొందఱు కవులు వచనములు పెక్కులు చెప్పుట వివిధవృత్తములయెడ నాదరణము గలచదువరులకు నానందకారులు కాకపోవు నని యెంచి అనేకచరణయుక్తములుగాఁ జేయం దగు రగడలు, దండకములు మొదలగువానిని విశేషించి వ్రాసి వచనముల గొన్నిఁటిం దగ్గించిరి. కావున వచనములు మొదలగునవి పద్యముల కంటె స్వభావముగఁ గఠినశైలిలో నుండుట కాన్పించు. సూరనకవియు నావఱకు తనచే విరచితము లైనప్రథమద్వితీయకావ్యములు ప్రబంధములు కాకుండుటంబట్టి అందు కొన్నిలోపము లున్నట్లు గ్రహించి తనమూఁడవగ్రంథమును బ్రబంథముగా రచియించి యందుఁ తనతొల్లింటిగ్రంథములలో నుండులోపములఁ బెక్కులు నివారించెను. ఇట్లు ప్రభావతీప్రద్యుమ్నములో నేల లేవనఁ గారణము చెప్పెదను. ప్రభావతీ ప్రద్యుమ్నము సూరకవి తనముదుసలికాలములో రచియించినప్రబంధ మౌటం జేసియును, తనతండ్రిపేరిటఁ గృతియిచ్చి తాను తీర్థయాత్రాదికము తనతమ్మునివలెఁ జేయలేకపోయిన లోపముఁ దీర్చికొనుటకై యత్నించుటంజేసియును అందు గ్రంథపూర్తికొఱకే యత్నించియుండునుగాని కేవలము ప్రజ్ఞాప్రకటనకే యత్నించియుండఁడు. ఆకారణముచే నందు కఠినవచనములు గాని గొప్పవర్ణనలు గాని తఱుచుగాఁ గానుపించవు. ఇట్టిగ్రంథమును ఆధారము చేసికొని ఉపన్యాసకుఁడు సూరన నప్పటి కాలమువారికంటె నధికుఁ డని ప్రస్తుతవచనకావ్యకర్తలలోఁ గొందఱిఫక్కి ననుసరించి చెప్పుట అసంగతము. ఎవ్వఁడును సమానులలో నుత్తముఁడు గాఁ బ్రయత్నించుంగాని తత్వ్యతిరిక్తము కాదు గావున సూరనయు న ట్లొనరించినవాఁ డనియే సీద్ధాంతీకరించెదము.

కళాపూర్ణోదయకల్పనావిషయము.

ఇదివఱకే సూరకవికృతము లగుగ్రంథములు కళాపూర్ణోదయము తరువాయిగ నన్నింటిం దెల్పినాఁడను. ఇఁక నీవిషయమునఁ గొంచెముగా వ్రాసి సూరకవిచరిత్రము వ్రాయ విరమించెదను. పాఠకులు నావలన నింతవఱకు నీయఁబడిన విమర్శశ్రమకు సహించి కొంచె మవకాశముతో నీగ్రంథవిషయమునఁగూడ నే నిచ్చుశ్రమకు మన్నించెదరుగాక.

ఈపైగ్రంథములోఁ గవిత్వశయ్యాదులయందుఁదప్ప కల్పనావిషయమై సూరకవిని నేను శ్లాఘించను. ఆ 1882 వ సంవత్సరములోనో ఆసమీపకాలములోనో యిది మొదట ముద్రిత మైనపుడు దీనిని మామిత్త్రు లొకరు నామొద లగుస్నేహితులు కొందఱికి మాయభిప్రాయప్రకటనకుగా నిచ్చియుండిరి. అపు డట్టిమాయభిప్రాయమిచ్చుటకును గథాసందర్భము బోధపఱుచుకొనుటకును దీనికి సంగ్రహము వచనముతో నావలన వ్రాయంబడినది. దాని నిందుఁ బ్రకటింప గ్రంథవిస్తరభయంబున మానుచున్నాఁడను. అయ్యది ప్రత్యేకవచనకావ్య మాయెఁ గావున వేఱుగఁ బ్రకటించెదను. అపు డందులకథాసందర్భములోని పూర్వపక్షముల విస్తరించి చూపెదను. ఇపు డిందు నేనందులఁ గనిపట్టిన లోకములలోఁ గొన్నిటినిమాత్రమువివరించెదను, దానికి ముందుగ కవిత్వశయ్యాదులలో నీకవిచమత్కృతిం జూపు నొకటిరెండు పద్యములం జూపెదను ఒక ముదుసలి స్త్రీని వర్ణించిన పద్యము.

సీ. పసిమి పో సెండినకసవుబట్టయుఁబోలె, నెఱవెండ్రుకలఁ బర్వుశిరమువలన
    నులిగొన్న చెలఁదిపుర్వులనూలివళ్లునా, నమరెడుముడుతకన్బొమలవలనఁ
    గడుఁ జిట్టినట్టిబంగరుపోఁతపొక్కిళ్ల, వడువుఁ జూపెడుమేనివళులవలనఁ
    దునిసివ్రేలెడుమ్రాఁకుతునుకల వలపించు, బాహువక్షోజలంబనమువలనఁ

తే. ఘూకరవములచాడ్పున ఘోరవృత్తిఁ, దనరుఘనకాసకుహికుహిధ్వనులవలన
    భావజుఁడు వెళ్లిపోయినపాడుమేడ, పగిదిఁ గాన్పించు ముదుసలిపడఁతియొక తె.
                                                              కళాపూర్ణో. ఆశ్వా 3 ప 84.

ఈముదుసలి నే తిరుగ నింకొకపరి శాపవిమోచనానంతరము యౌవనప్రాదుర్భావము నందిన స్త్రీనిగాని వర్ణించె.

సీ. నిండుచందురు నవ్వు నెమ్మోముసిరితోడ, నిరులు గ్రమ్మెడువేణిభరముతోడ
    నాకర్ణలోలంబు లగునేత్రములతోడఁ, దళుకొత్తు చెక్కుటద్దములతోడ
    మిగుల మిటారించుబిగిచనుంగవతోడ, లలితంపుబాహువల్లరులతోడ
    నతికృశత్వమున జవ్వాడుమధ్యముతోడ, నభినవం బైననూఁగారుతోడఁ

తే. వలువమీఁదికిఁ దొలఁకు సువర్ణపులిన, గురునితంబప్రభాపరంపరలతోడ
    మహితసర్వాంగలావణ్యమహిమతోడ, నమరుప్రాయంపురూపుచిత్రముగఁదాల్చె.
                                                                  కళా. ఆశ్వా, 3. ప. 122.

ఈసందర్భములోఁ బైముదుసలియువతియొక్క వర్ణనము మిక్కిలి కఠినమైనపని. సాధారణముగ శృంగారవర్ణనమే అందఱు చేయుదురు గాని తద్వ్యతిరేకముగా వర్ణించుటకుఁ గవులు యత్నింపరు. సూరకవి అట్టివర్ణనమును స్వభావోక్తితోఁ జేయుటయే కాక తిరుగ నా స్త్రీనే రూపాంత మందఁగా వర్ణించుటయు నందు రసము స్వాభావికమైనది తెచ్చుటయు వర్ణనీయము. ఇటులనే సూరకవి తనకుఁ గలవర్ణానావిశేషము లోనిప్రజ్ఞ నగపఱిచిన పద్యములనేకము లీగ్రంథములోఁజూపెను. అట్టివానికి నెంతయు నలరియుఁ గథాకల్పనలోఁ జేసియున్నకొన్నిసందర్భములకుఁ గాఁ గల్గియున్న శంకల నిట వివరింపకున్న యెడల విమర్శనకు లోప మని యట్టివానిలోనిలోపము లఁ గొన్నిటి నిట వివరించెదను. అయితే యీగ్రంథమందు విశేషాభిమానము గలవార లట్టిశంకలయెడల నాదర ముంచి యథార్థ మరయఁ గోరెదను.

నారదమునికిని తుంబురునకును సంగీతవిద్యలో వివాదము కల్గె ననియు, నపుడు నారదుండు తుంబురుని జయించుటకుగాను గానవిద్యా విశేషంబులు నేర్చుకొనుటకై ద్వారకాపట్టణంబునకుఁ బోవ శ్రీకృష్ణుం డాతనిం దోడ్కొని తనభార్యలలో నొక్కతె యగుజాంబవతి కొప్పింప నాపెకడ నారదుం డొకవత్సరంబు గానంబె నేర్చికొనె ననియును; పిమ్మట నారదుండు శ్రీకృష్ణనియుక్తుండై సత్యారుక్మిణులకడ నొక్కొక్కవత్సరంబు గానవిద్య నభ్యసించె ననియును మణిమందరుండును, కలభాషిణి నారదునివలె నంతఃపురకాంతలవలన సంగీతశిక్ష లేకయుండియు శ్రీకృష్ణుని యనుగ్రహంబున సకలసంగీతకళారహస్యంబులం గ్రహించి రని చెప్పంబడినది. లోకములో సంగీతవర్ణనముఁ జేయుచో నందు నారదునియట్టి ప్రజ్ఞగలవా రని చెప్పుటయే అత్యుక్తి. నారదుఁడును నేర్చుకోఁ దగినసంగీత మని చెప్పుట అత్యుక్తికి పైది. అదియునుగాక నారదుఁడు వచ్చి శ్రీకృష్ణునిభార్యలకడ మూఁడుసంవత్సరములు విద్య నేర్చుకొనియె నని చెప్పుటయు నంతదనుక అతని శిష్యుం డగుమణికంధరుండు రాణివాసంబు ద్వారంబుననే నిల్చియుండె ననియు నిట్లున్న మణికంధరుఁడు శ్రీకృష్ణునియనుగ్రహంబున నొక్క పెట్టున సకలసంగీతరహస్యంబులు నేర్చుకొని నారదునితో సమానుఁ డయ్యె నని చేసినకల్పన యత్యుక్తికింగూడ మించినదై భక్తాగ్రగణ్యుఁ డైననారదుండు సంపాదింపలేని శ్రీకృష్ణసంబంధ మగుసంగీత విద్యను నారదశిష్యుఁడుగాఁగల్పింపఁబడినమణికంధరుఁడు శ్రీకృష్ణుని నిర్హేతుకజాయమాన కటాక్షమునకు పాత్రుఁడై యొక్కమాఱుగ గ్రహించె నని చెప్పినకల్పన యుక్తియుక్తమై యున్నట్లు కానరాదు. ఇంతియ కాక ఆసందర్భములోనే నారదుఁడు తనసంగీతంబును కృష్ణమహిషులు వర్ణించుట వినియు నది ముఖప్రీతి కా నోవు నని యూహించి దాని నరయుటకై కలభాషణిం గోరఁగా నాపె కామరూపంబు వేఁడి దానిఁ గైకొని కృష్ణమహిషుల సఖీరూపంబు దాల్చి పోయి నారద సంగీతవిశేషంబులం గూర్చి ప్రశంసించి వారు దానిని నిజముగ స్తోత్రముచేయుటయే యని మరలి వచ్చి నారదునకుఁ దెల్పెనని తెల్పినకథ కలభాషణికి నారదుఁడు కామరూపశక్తి యిచ్చుటకుఁ గారణరూపముగాఁ జెప్పంబడినను తా నెవ్వరికడ మూఁడుసంవత్సరములు విద్యాభ్యాసము చేసెనో వారు తనసంగీతమును స్తోత్రముచేయుదు రని చేసినకల్పితయుక్తికిని శాస్త్రమునకుంగూడ సరిపడనిది యై యున్నది.

ఇటులనే తుంబురుని జయించుటకుఁగాను నారదుఁడు యత్నించి తపంబు చేసి విష్ణునివలన వరంబు గొనినకథయును గానుపించును. అటుపిమ్మట మణికంధరుతపః ప్రభావంబును సిద్ధునిసమావేశంబును చిలుక కథయును, సందర్భశుద్ధములుగాఁ గానుపింపకుండుటయే కాక లోకసామాన్యములుగాఁగూడ కాన్పింపవు. ఇటులనే వ్రాయందొడంగిన గ్రంథంబులోనిగాథ లన్నియు పరస్పరసందర్భము లేకయు, నమ్మ నర్హములు కాకయు పరిశీలనము చేయం జేయ నసారంబులౌను. కాని మనుచరిత్రాదికములోఁ గల్పింపఁబడిన కల్పనల విథంబున యుక్తినహంబు లై యుండవు. కావున నిఁక నింతటితో నీకథాసందర్భములంగూర్చి వ్రాయ విరమించెదను.

  1. ఈకవిచరిత్రము లోపలనే కృష్ణరాయల చరిత్రము వ్రాయుచొ నీబుక్కరాజు కాలము నేను పైన వ్రాసిన విధముగ నే యున్నది. కాని సూరకవి చరిత్రములో మాత్రము దానికి మఱియొకపాఠాంతరము కాన్పించును. దీనికిఁ గారణ మూహింపలేను.