కవి జీవితములు/రామగిరి సింగనకవి

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

వెన్నెలకంటివారి కాలనిర్ణయము.

విష్ణుపురాణము, విక్రమార్కచరిత్రము, కృష్ణవిలాస మను మూఁడుగ్రంథములలో వివరింపఁబడిన వెన్నెలకంటివారికాలము నాయా గ్రంథములలోని యాధారములంబట్టి చేసిననిర్ణయము ఎట్లన్నను :_

శా. స. మొదలు శా. స. వఱకు
1 సూరనసోమయాజి 1030 1080
2 ఇతనికొడుకు 1080 1130
3 ఇతనికొడుకు సిద్ధమంత్రి 1130 1180
4 ఇతనికొడుకు భాస్కరుఁడను సూర్యుడు, జన్న మంత్రియు, వీరిలో భాస్కరుఁ డనవేమారెడ్డిపేరఁ గృతుల నిచ్చె. 1180 1230
5 పైవారిలో జన్నయకుమారుఁడు సిద్ధమంత్రి 1230 1300
6 పైవారిలో భాస్కరుని మనుమఁ డగుసూరన్న [విష్ణుపురాణకవి] 1300 1350
7 ఈ సూరకవి కొడుకు వెన్నెలకంటి వీరిలో నొక్కక్కరికేఁబది సంవత్సరముల వంతున మువ్వురికిని నూటయేఁబది సంవత్సరములు 1350 + 150 = 1500
8 ఇతనికొడుకు చక్రప్ప వెన్నెలకంటి
9 ఇతనికొడుకు గంగయ్య వెన్నెలకంటి
10 ఇతనికొడుకు వెంగయ్య 1500 లకు బూర్వమును బరమందుఁగూడ నున్నాఁడు.
11 ఇతనికొడుకు రామమంత్రి 1500 1550
12 ఇతనికొడుకు జగ్గన 1550 1600
13. ఇతనికొడుకు వేంకటాచలపతి 1600 మొదలు 1650


24.

రామగిరి సింగనకవి.

(పద్మపురాణోత్తరఖండము)

ఇతఁడు పద్మపురాణోత్తరఖండమును వాసిష్ఠ రామాయణముం దెనిఁగించిన కవిశిఖామణి. నియోగిశాఖాబ్రాహ్మణుఁడు. ఆపస్తంబసూత్రుఁడు. భారద్వాజగోత్రుఁడు భారతముఁ దెనిఁగించినతిక్కనసోమయాజి సంతతివారితో సంబంధి. ఇతఁడు భాగవతదశమస్కంధముఁగూడఁ దెనిఁగించితి నని తెల్పె. ఈపైరెండుగాథలను స్థిరపఱుచుపద్యముల వాసిష్ఠ రామాయణమునుండి యీక్రిందవి వరించెదము. అవి యెట్లనఁగా :_

"సీ. అతఁడు తిక్కనసోమయాజుల పౌత్త్రుఁడై, కొమరారుగుంటూరికొమ్మవిభుని
     పుత్త్రి బిట్టాంబిక బుధలోకకల్పక, వల్లి వివాహమై వైభవమున
     భూసార మగుకోటభూమి కృష్ణానదీ, దక్షిణతటమున ధన్యలీల
     నలరు రావెల యనునగ్రహారము తన, కేకభోగంబుగా నేలుచుండి
     యందుఁ గోవెలఁ గట్టి గోవిందు నెన్న, గోపినాథుప్రతిష్ఠయుఁ గోరిచేసి
     అఖిలవిభవంబులందున నతిశయిల్లె, మనుజమందారుఁ డల్లాడమంత్రివిభుఁడు.

అని పరబ్రహ్మోపాసంబు నిష్టదేవతాభివందనంబును సుకవివిద్వజ్జన ప్రార్థనంబును కుకవిజనవాగ్బంధనంబును గురుచరణస్మరణంబును బరమభాగవతసంకీర్తనంబునుం జేసి కృతకృత్యుండనై తొల్లి హరిభక్తిరసావేశంబునఁ గతిపయాక్షరాభ్యాసచాపలంబునం జేసి విష్ణువిభవాభిరామకథాప్రభూతంబు లగుపద్మపురాణోత్తరఖండంబును భాగవతదశమస్కంధంబును దెలుంగున రచియించి.

ఇక్కవి నన్నయతిక్కనల నిర్వురిని మాత్రమే ఆంధ్రకవులలో వినుతించె. ఎట్లన్నను -

"గీ. వ్యాసవాల్మీకశుకకాళిదాసబాణ, హర్ష ణాదుల నార్యుల నాత్మనిలిపే
     సకలభాషారసజ్ఞుల సముల నన్న, యార్యతిక్కకవీంద్రుల నభినుతింతు."

కవివంశము.

భారద్వాజ గోత్రములో బ్రహ్మనమంత్రి.

|

గుండన్యార్యుఁడు.

పై వివరించినవారిలోఁ 1, 2. గుర్తులు గలవారి చారిత్రములు కొంచెము వివరింపవలసియున్నది. అందులో 1 గుర్తు గలయల్లాడమంత్రి విషయమై చెప్పంబడినపద్య మీవఱకే వివరించినాఁడను. దానిలో నాతఁడు తిక్కన సోమయాజుల పౌత్త్రుఁ డైనగుంటూరి కొమ్మనప్రభుని పుత్త్రి యగుబిట్టాంబ యనుచిన్నదానిం బరిణయంబైనట్లున్నది.

తిక్కనసోమయాజి యింటిపేరు.

తిక్కనసోమయాజితాత యగుభాస్కరమంత్రి గుంటూరివిభుఁడని వ్రాయంబడుటచేత నతనికి గుంటూరిభాస్కరుఁ డనియే నామము కల్గినట్లు కాన్పించు. ఇతని కుమారుఁడును తిక్క సోమయాజులతండ్రియు నగు కొమ్మన దండనాథునకును గుంటూరివిభుఁ డనియుండుటచేత నతనికి నింటిపేరు గుంటూరి వారనియే తేలినది. ఇప్పుడు తిక్కనసోమయాజి పౌత్త్రునకుఁగూడ గుంటూరి కొమ్మవిభుఁ డనియుండుటబట్టి అతనికి నదియే యింటిపేరుగాఁ దేలినది. ఇట్లుగాఁ దిక్కన పై వారికినిఁ దఱువాతవారికిం గూడ గుంటూరివా రనుగృహనామము కల్గినపుడు తిక్కనయింటిపేరు గూడ నదియే యగుటకు సందియము లేదు. తిక్కన తండ్రిపేరు తిక్కనకుమారునకుండుట లోకస్వభావము. కాని యిచ్చోఁ దిక్కన మనుమని కే ఆపేరున్నట్లుగా నున్నది. ఇది అచ్చపొరపాటైనఁ గావచ్చును. లేదా యిది కుమారునిపేరుగాక మనుమనిపేరైనఁ గావచ్చును. ఇట్టిదాని నిర్ధారణ చేయుటకు గ్రంథారంతరములు దొరుక వలయునని ప్రస్తుతములో మనకు లభ్యములు కాలేదు. కావున దాని న్వదలెదను.

సింగనకవియింటిపేరు.

ఇఁక నీవాసిష్ఠ రామాయణముం దెనిఁగించిన సింగనకవి యింటిపే రేమని విచారింపవలసియున్నది. అట్టిదానిని గ్రంథకర్త యెచ్చటను స్పష్టముగా వివరించియుండలేదు. కవిచరిత్రములో బ్ర. కం. వీరేశలింగముపంతులవారు ఇతని యింటిపేరు మడికివారుగా నిశ్చయించి యితఁడు మడికి సింగన యని వ్రాసిరి. దానికిఁ దగినయుక్తులు కాన్పించుటలేదు. పైనమనము వివరించిన అల్లాడమంత్రికాఁపురస్థలము కోటసీమ (ధరణికోటిసీమ కానోవు) లో గృష్ణానదికి దక్షిణమున రావెల యనుయగ్రహారము. దాని నతఁ డేకభోగముగా ననుభవించుటంజేసి అతని నొకగుర్తుంచి తెలుపుటకుగాను రావెల యల్లాడమంత్రి యని చెప్పవచ్చునుఁ ఇక కవియొక్కతండ్రి యగునయ్యల మంత్రి రాజమహేంద్రవరమును పాలించుచున్న తొయ్యేటియనపోతభూపాలుని మంత్రియగుటంజేసి అతనిని రాజమహేంద్రవరపు అయ్యలమంత్రియని చెప్పనొప్పియుండు. ఈ అయ్యలమంత్రి (2) గుర్తుతో నీక్రింద నుదహరించఁబడు పద్యానుసారముగా గోదావరీనదికుత్తరతీరమునందలి పెద్దమణికి యను గ్రామమందున నారామక్షేత్రములను సంపాదించె నని యుండుటంజేసి అతనిని పెద్దమణికి యయ్యలామాత్యుఁ డని చెప్పినఁ జెప్పవచ్చును. ఇఁక కవియగు సింగన తాను తన ప్రభుం డగుకుమారముప్ప భూపాలునివలన రామాద్రిసీమలో ననేకవృత్తులు గ్రామములను బడిసితి నని చెప్పుకొనెను. ఆకారణమున నతనియింటిపేరు రామాద్రిసీమ వా రనిగాని లేకున్న నతఁడు గై కొనిన గ్రామములలో నొక గ్రామ నామము గాని అతనికి నింటిపేరుగాఁజెల్లిన లెస్సయై యుండును. ఇవియెవ్వియుఁగాక నీకవియింటిపేరు మడికివారని నిష్కర్షించుటకుఁ బంతులవారికిఁ గలయాధారములు మాత్రము నాకుఁ గానరాకున్నవి. ఈవృత్తాంత మేమైన నీకవివలన రచియింపఁబడినపద్మపురాణోత్తరఖండములో నున్న దేమో ముం దరయుదముగాక.

అయ్యలుమంత్రివర్ణన.

ప్రస్తుతములో నీకవితండ్రి యగునయ్యలమంత్రివర్ణ నముగల (2) గుర్తు గలపద్యము నిట వివరించెదము అదెట్లన్నను :_

"సీ. ఆత్రేయగోత్రపవిత్రు పేరయమంత్రి, పుత్త్రి సింగాంబిక పుణ్యసాధ్వి,
      వెలయ వివాహమైవేఁగిదేశంబులో, నేపారురాజమహేంద్రపురికి,
      నధిపతి తొయ్యేటి యనపోతభూపాలు, మంత్రి యై రాజ్య సంపదలఁ బొదలి
      యొప్పారుగౌతమియుత్తరతటమున, మహనీయ మగు పెద్దమణికియందు

   స్థిరతరారామతతులు సుక్షేత్రములును, బెక్కు లార్జించి సితకీర్తిపెంపుమిగిలి
   యఖిలజగదన్న దాత నా నవనిఁ బరఁగె, మనుజమం దారుఁ డల్లాడమంత్రివరుఁడు."

ఇందలి ప్రభుం డగుతొయ్యేటి అనవోతభూపాలుఁ డెవరను నొకశంక వొడమెడిని. అతఁ డెవ్వఁడో తెలిసినపిమ్మట నతనికాలము నతనిమంత్రియు సింగనకవికిఁ దండ్రియు నగునయ్యలుమంత్రికాలముం దెలియఁగలదు. ఆపని అవసరమగునెడలఁ జేయుదము.

సింగనమంత్రి గ్రామములు.

ప్రస్తుతములో సింగనకవికిం బ్రభుం డగుకుమారముప్పభూపాలునివలనఁ గవి కియ్యంబడినగ్రామాదులఁ దెలుపుపద్యమును, ఆముప్పభూపాలుంగూర్చి యీగ్రంథములో నెంతవఱకు వివరింపఁబడినదో దానిని మాత్రము తెలిపి యింతకంటె విపులముగా నున్న పద్మపురాణోత్తరఖండములోని పై రాజువిశేషములంబట్టి కాలనిర్ణయాదికములం జేసెదము. సింగకవి కిచ్చినగ్రామాదికములం దెల్పుపద్యము -

"గీ. ఆమహావిభుచేత రామాద్రిసీమఁ, బెక్కువృత్తులు గ్రామముల్ వెలయఁ గాంచి
     యతనియాశ్రితులందెల్ల నధికుఁ డనగఁ, జతురుఁ డన ధన్యుఁ డన సడిసన్న వాఁడ."

కుమారముప్పభూపాలుంగూర్చి

"క. కూనయముప్పనృపాలుని, నూనుం డగు తెలుఁగువిభుని సుందరిమల్లాం
     బానందనుఁ డగుముప్పది, భూనాథుని సుకవివరుఁడ బుధసన్ను తుఁడన్."

ఇతనివిశేషములు పద్మపురాణోత్తరఖండకృతిముఖములోన వివరించెద నని చెప్పియున్నానుగావున వానికి ముందుగా నీవాసిష్ఠరామాయణ గ్రంథకథాదులంగూర్చియు కవిశయ్యాదులంగూర్చియు కవివ్రాసిన కొన్ని వాక్యములను వివరించెదను. మొదట వివరించిన వచనములో

గ్రంథవిశేషములు.

"వెండియుఁ గవిత్వతత్త్వరచనా కౌతుకంబునం జిత్తంబుజొత్తిల్ల నొక్కకృతిం జెప్పంబూనితి. ఏందేనిఖిలభూతాంతర్యామియు నిగమార్థగోచరుండును, నిత్యసత్యజ్ఞానానందశుద్ధాంతరంగుండును, నిశ్చలానందయోగీంద్రహృదయుండును, నిశ్శ్రేయసానందఫలప్రదాయకుండును, నిర్మలచిదాభానుండును, నిరాకారుండును, నిర్గుణబ్రహ్మంబునగు నారాయణుం డొక్క రుండుదక్క నన్యంబు లేదనియును, బ్రహ్మాదిచేతను లతని తేజః కణంబు లనియును, దేహం బనిత్యంబు, దేహి నిత్యుం డనియును, జీవుండు చిత్తం బనియును, చిత్తంబునంద జగత్తులు విస్తరిల్లు ననియును, తత్సంకల్పంబ బంధంబు, తన్నిరసనంబ మోక్షంబనియును, చిత్తశాంతియ జీవన్ముక్తి యనియును, బెక్కువిధంబు లుపన్యసించు నట్టి వాసిష్ఠసంగ్రహం బాంధ్రభాష నఖిలలోకోపకారార్థంబుగా రచియించెద."

కవివిజ్ఞాపనము.

"క. ఇది తత్త్వరహస్యార్థము, పదసంగతిఁ దెనుఁగుపఱుప బ్రాజ్ఞులకును బె
     ట్టిద మగుఁ దత్పరవాసన, విదితంబుగఁ గవులు మెచ్చ విరచింతుఁ దగన్.

క. విజ్ఞానులు మును జెప్పిన, సంజ్ఞాభ్యాసములు కొంత జాడలు దోఁపన్
    విజ్ఞాపనంబు జేసెద, ప్రాజ్ఞులు తార్కికులు తప్పుపట్టకుఁ డెలమిన్.

క. కరు కిది నీరస మని వే, సర కల్లన వినుఁడు తుద రసాయన మగుఁ దాఁ
    జెఱకు తుదనుండినమలిన, తెరగున మది కింపు దనుపుఁ దీపున్ జూపున్.

క. మృదుమధురవచనగర్భము, గదియించినయట్ల తత్త్వగాఢార్థము చె
    ప్పుదుఁ బువ్వుదేనెఁ గొనుతు, మ్మెద మ్రాఁకులు దొల్చు నేర్పు మెఱసినభంగిన్.

క. ఇది యల్పగ్రంథం బని, మదిఁ దలపకుఁ డఖిలశాస్త్రమతములు దీనన్
    విదితం బగు నద్దములో, మదదంతావళము దోఁచుమాడ్కిని దెలుపున్."

కృతిపతివిషయము.

తనతొల్లింటిగ్రంథములవలెఁగాక నీగ్రంథమహోబలనృసింహ స్వామివారికి సింగనకవివలనఁ గృతియియ్యఁబడినది. దానికిఁ గారణాదికము నీక్రిందిరీతిని వివరించె. ఎట్లన్న -

"వ. అని సకలజనసమ్మతముగా నుపక్రమించి యనన్యసామాన్య యగునిక్కవి తావధూమణికిఁ బురుషుండు పురాణపురుషుండు గావుతమని, యఖిలలోకాధీశ్వరుండును, అతులకళ్యాణగుణాలంకారుండును, ననవరత లక్ష్మీ సమేతుండును, నాదిమధ్యాంత రహితుండును, నభిమతఫలప్రదాయకుండును, నగు నహోబల శ్రీనృసింహదేవునకు నిచ్చెద నని తలంచి, యద్దేవుం డఖిలవేదాంతవాగ్గోచరుం, డతితుచ్ఛంబు లగుమద్వాక్యంబు లర్పింతుననుటయు మహాద్రోహం బగునో యని శంకించి, యప్పరమేశ్వరుం డాశ్రితసులభుండగుటయు, మత్కవిత్వంబు తదీయవరప్రసాదలబ్ధం బగుటయు భావించి మనంబున నిట్లు వితర్కించితి.

క. వనరాశి జలము గొని యా, వనరాశికి నర్ఘ్యమిచ్చువడువున హరియి
    చ్చినవాక్యము లే నతనికి, ననయముఁ గృతిసెప్పి సుకృతి నగుదు ధరిత్రిన్.

క. గురుఁడునుదల్లియుఁదండ్రియుఁ, బురుషుఁడు, విద్యయును, దైవమును దాతయునా
    బొరి నేడుగడయు దానై, హరి నను రక్షించుఁగాత ననవరతంబున్.

క. తన పేరిటివాఁ డనియును, దనదాసులదాసుఁ డనియుఁ దనకీకవితా
    వనితామణి నిచ్చినవాఁ, డనియును రక్షించు గాక హరి నన్ను దయన్."

అని యున్న పైవిజ్ఞాపనాంశముంబట్టియు గృతిపతి నిర్ణయాంశముంబట్టియు నీకవిమనోదార్ఢ్యాదులును, యుక్తిపరంపరయును, గవిత్వ ప్రజ్ఞయుఁ గోచరంబు కాకపోదు. ఇట్టిధైర్యస్థర్యములు గలకవియును భాగవతము నాంధ్రీకరింప వెఱచి దానిలోని దశమస్కంధముమాత్రము దెనిఁగించె. దానికిఁ గారణము తత్త్వరహస్యార్థము లున్న పరమార్థగ్రంథ మదిగావున దానిం దెనిగింపఁగూడ దనునాకాలములోని పండితాభిప్రాయ మై యుండవచ్చును. అట్లున్నను కవికిఁ గలవిష్ణుభ క్తియే అతనిచేత నాభాగవతములోని శ్రీ కృష్ణకథావిశేషంబులనైనఁ దెలిఁగించక తప్పనట్లుత్సహించెను. పద్మపురాణోత్తరఖండమును వైష్ణవమాహాత్మ్యప్రతి పాదకంబేగావున నతఁడు ప్రథమములోనే దానిం దెనిగించె. ఇఁక నీవాసిష్ఠ రామాయణము భాగవతమువంటి మహత్తరగ్రంథమే అయినను, అందలి యంశములు పాఠకులకు సుబోధంబులు కావు. గావున దానింగూడఁ దెనిఁగించె. ఇది మిక్కిలి సంగ్రహఫక్కికగా నీతనివలనఁ దెనిఁగింపఁబడియె. అట్టిదానికి సమ్మతింపని నవీనకవులలో నొక్కండును, నైజాముదేశములోని ధర్మపురినివాసియు నగుకృష్ణగిరి వేంకటరమణకవివలన నీ వాసిష్ఠరామాయణము సంస్కృతమునకు సమముగా విపులముగా నుండునట్లుగా నాంధ్రీకరింపఁబడియె. ఈరెండుగ్రంథములకును గలభేదం బీ గ్రంథాంతమునఁ గొంత సూచించెదను. ప్రస్తుతములోఁ బద్మపురాణోత్తరఖండమున నీకవి వివరించిన కృతిపతివంశమును, అతనికినిఁ దనకును ప్రభుం డగుకుమారముప్పభూపాలునిచారిత్రమును వ్రాయవలసియున్నది. దానికి ముందుగా నీగ్రంథములో సింగనకవి పూర్వకవుల నెవ్వరిఁ బేర్కొనెనో ఆవృత్తాంతంబు గొంత పరిశీలించెదము -

ఆంధ్రపూర్వకవిస్తుతి.

"ఉ. భారతవేదవాక్యరసభావము లజ్ఞు లెఱుంగలేక ని
      స్సారమనస్కు లై తిరుగుచందముఁ జూచి తెలుంగుబాస బెం

   పార రచించి యందఱఁ గృతర్థులఁ జేసినపుణ్యమూర్తులన్
   సారమతిన్ భజింతు ననిశంబును నన్నయతిక్కనార్యులన్."

దీనింబట్టి భారతారణ్యపర్వశేషమును భారతశేషం బగుహరివంశమును బూర్తిచేసిన యెఱ్ఱప్రెగ్గడ యీ కవికాలమునకుఁ బై కార్యము చేసియుండునట్లే సూచించు. లేదా యితనికాలీనుఁ డైన గావచ్చును.

స్వగురువర్ణనము.

"క. ధర నిహపరములకును గురు, చరణంబులె యూఁత యగుటఁ జర్చించి మదిం
     బరవాదిభద్రవారణ, హరిభక్తులఁ దిరుమలయ్యయార్యులఁ దలఁతున్."

దీనింబట్టి పరవాదిభద్రగజకేసరి బిరుదాంకితుఁ డగుతిరుమలాచార్యుఁ డితనిగురుం డని తేలినది. ఈ తిరుమలాచారి కాలముఁ దెలియు నాధారములు లేవు.

కృతిపతికిఁ బ్రభుఁ డగుముప్పభూపాలువంశావళి.

1. కూనయముప్పరాజు.

|

2. గురిజాల తెలుఁగు రాయఁడు

|

3. ముప్పదిరాజు ----------- ముత్తరాజు 4.

ఈ ముప్పదిభూపాలుని రాజ్యాదికము.

"వ. అని ప్రశంసింపఁదగిన విభవ విలాస విక్రమ విజయ విఖ్యాతులఁ బ్రసిద్ధుండైన ముత్తభూపాలుండు తనకు సహాయుఁడుగా గౌతమీ దక్షిణభాగంబునఁ బరమ పావనం బగుసబ్బినాటిరాష్ట్రంబున రామగిరిపట్టణంబు నిజరాజధానిగాఁ బురందర విభవుండై రాజ్యంబుసేయుచున్న ముప్పరాజు."

అని చెప్పి అతని బిరుదులం దెల్పె. అవి యెవ్వియన. -

"1. నీరునెత్తురుగండ. 2. గండరగండగోపాల. 3. కాంచీరక్షపాలక. 4. చోడరాజ్యస్థాపనాచార్య. 5. దొంతియమన్నెవిభాళ. 6. చలమర్తిగండ. 7. గజగండ వారణ. 8. రాయగజకేసరి. 9. మూరురాయజగకాళినానా బిరుదవిఖ్యాతుండు, అగు ముప్ప భూపాలచంద్రుఁడు."

కృతపతికందనవంశము.

పైముప్పరాజచంద్రునకు సకలసామ్రాజ్యభారధురంధరుండును, ధర్మచరిత్రుం డును, నీతిచాతుర్యవివేక విశేష గుణాలంకారుండును నై యమ్మహారాజుమన్నన వడసి విశేషవస్తు వాహన ఛత్ర చామ రాందోళికాది రాజచిహ్నంబులం బెంపొందు కందనా మాత్యవంశావతారం బెట్టిదనిని"

వాణసవంశము. కాశ్యపగోత్రము.

రుద్రమంత్రి (మొలగూరుగ్రామాధిపతి)

|


ఇట్లుగా నీవంశావళిలో వివరింపఁబడిన పురుషులలోని. 1. 2. 3. గుర్తులు గలవారి చారిత్రముం దెలుపుపద్యముల నీక్రింద వివరించెదను. అందు

1. నన్నయమంత్రివిశేషములు.

"చ. పరువడి కాకతీయగణపక్షితినాయకునొద్ద మాన్యుఁ డై
      ధరణిఁ బ్రశస్తుఁ డై నెగడె దానము లెల్లను జేసి పేరు పెం
      పెరువుగ గుళ్లు గట్టి గణపేశ్వరదేవుని గొపికాధిపున్
      దిర మగుచున్నలక్ష్మిని బ్రతిష్ఠలు చేసెఁ ప్రభుత్వ మేర్పడన్."

దీనింబట్టి యీనన్నయమంత్రికాలము కాకతీయగజపతిదేవుని కాలముగాఁ దేలినది. ఇదివఱలో మనకుఁ గాన్పించుచున్న గణపతిదేవుని శాసనములం బట్టియు, నాతనిమంత్రి దండనాథులకాలముం బట్టియు నీ గణపతిదేవుఁడు శా. స. 1053 మొదలు 1130 వఱకు నున్నట్లు తేల్చితిమి, ఆవివరమంతయు నీవఱకే కాకతీయుల వంశచారిత్రములో వివరింపఁబడినది. గావున నిచ్చో దాని న్వి స్తరింపను. అట్టిగణపతిదేవుని మంత్రి యగునీనన్నయకాలము నావిధముగనే నిర్ణయింతము. అతని నుండి అయిదవపురుషుఁ డీకృతిపతి యగుకందన మంత్రి. ఇతనికాలము మనము పురుషునకు ముప్పది సంవత్సరములవంతున లెక్కింపగా నైదుగురుపురుషులకును నూటయేఁబదిసంవత్సరములు చేర్చవలసియుండును. అనఁగా సుమారు 1050 + 150 = 1200 శా. స. మగు నటనుండి నూఱుసంవత్సరములవఱకుఁ జూచిన శా. స. 1300 లకు లోపలనే కందనమంత్రికాల మగు.

ఇఁక నితనిపైఁగృతినిచ్చిన సింగనకవికాల మించుమించుగా నదియ యగు నగుటకు సంశయము లేదు. పైగణపతిరాజు కాలీనుఁ డగుతిక్కన సోమయాజితో నీకవి కొంతదూరపు సంబంధి యగుటంజేసి అక్కడినుండియు లెక్కించి చెప్పవచ్చును. కాకతీయుల చారిత్రముంబట్టి తిక్కనసోమయాజి గణపతిరాజు పెద్దతండ్రి యగురుద్రరాజుకాలము వాఁడుగాఁ దేలినది. ఆరుద్రరాజు శా. స. 972 మొదలు శా. స. 1050 వఱకు నున్నట్లు కానుపించుచున్నది. తిక్కనసోమయాజి శా. స. 1020 మొద లున్నట్లు చెప్పుటకు సందియ ముండదు. ఇతనిమరణము లోకల్‌రికార్డులలో నున్నట్లు శా. స. 1120 అగునెడల నీతఁడు నూఱుసంవత్సరములు జీవించియుండును ప్రస్తుతములో మన కింతకంటె నీతనినిర్యాణ కాలముం దెలుపుగ్రంథాధారములు లేవు గావున నీతనిమరణకాల మిదిగానే భావించి యితని నుండి యీసింగనకవికాలము నిర్ణయింతము. ఇతఁడు తిక్కనసోమయాజి పౌత్త్రునిపుత్త్రిక(లేకపుత్త్రునిపుత్త్రికకు) మనుమఁ డని చెప్ప బడెఁ గావునఁ దిక్కనసోమయాజినుండి యితఁ డేడవపురుషుఁడు గావచ్చును. ఆపక్షములోఁ గడమ ఆర్వురుపురుషులకును (1) కి ముప్పది సంవత్సరముల చొప్పునఁ 180 బదిసంవత్సరము లగును. అనఁగా 1120 + 180 = 1300 అగును. పై లెక్కనుబట్టి కృతిపతి యగుకందనమంత్రియుఁ గొంచెమెచ్చు తగ్గుగా నాకాలమువాఁడే అయియుండె. కావున నీయిర్వురును శా. స. 1300 ల కాలము వారని నిశ్చయించెదముగాక.

2. గుర్తుగల మల్లనమంత్రి.

ఇతనింగూర్చి చెప్పంబడినపద్యము విశేషచారిత్రాంశములం జెప్పునది కాకున్న నీమల్లన మంత్రి స్థలాదికములం దెలియం జేయును. అది యెట్లున్నదనఁగా :_

"ఉ. అశతమన్యువైభవుఁ డహర్పతితేజుఁడు నంద్ర చంద్రికా
      కాశసమానమూర్తి యగుగౌరమమల్లనమంత్రి దిక్కులన్
      వాసికి నెక్కి భక్తి ననివారణమై గుడికట్టి కట్టరా
      మేశుఁ బ్రతిష్ఠచేసి నుతికెక్కిన నమ్మొలగూరివాకిటన్."

దీనింబట్టి ఇతనిస్థలము మొలగూ రని తేలినది.

3. గుర్తుగల కేసనామాత్యునివిశేషములు.

ఇతఁడు కృతిపతి యగుకందనామాత్యునకు జ్యేష్ఠభ్రాత. ఇతఁడును కుమారముప్పభూపాలునిమంత్రి యై యున్న ట్లుండుటం జేసి ప్రథమములో నితఁడే మంత్రిగా నుండె ననియు నితనియనంతరము కందనమంత్రి పైరాజునకు మంత్రిగా నుందెననియు నూహింపనై యున్నది. ఈ క్రింద నుదహరింపఁబడు సీసపాదమువలనఁ గేసనమంత్రి ముప్పభూపాలుని మంత్రి యగుట స్పష్ట మగుచున్నది. ఎట్లన .-

"తననీతి ముప్పదిధరణీశుఁ డేలెడి, ధరణికి వజ్రపంజరము గాఁగ"

ఇతఁడు గొన్నిధర్మ కార్యములు చేసినట్లు మఱియొకపద్యము వలనఁ గాన్పించు ఎట్లన్నను :_

"చ. అతులితలీలఁ గేసనచివాగ్రణి ధర్మపురంబునందుసం
      చితముగ నన్న సత్త్ర మిడి శ్రీనరసింహున కుత్సవంబులన్
      సతతమహోపచారములు సల్పుచు రామగిరీంద్రమందు సు
      స్థితి గుడిఁ గట్టి విష్ణుని ప్రతిష్ఠ యొనర్చె నుదాత్తసంపదన్."

ఈ పయిం జెప్పబడ్డ ధర్మపురి ప్రస్తుతములో నిజామువారిపాలన క్రింద నుండునది. దీనిసమీపములోనివే మంథెన, కాళేశ్వరములు. ఈధర్మ పురిలోని నృసింహస్వామిపేరిటనే నృసింహశతక మనుసీసపద్యశతకము పుట్టినది. దానిముకుటము. -

".........శ్రీధర్మపురనివాస, దుష్టసంహార నరసింహ దురితదూర"

అని యున్నది. కావున నృసింహస్వామియుండిఅందుమూలముగాఁ బ్రసిద్ధినందిన ధర్మపురి పైధర్మపురియే యనియు నా నృసింహునకే యీ కేసనమంత్రి విశేషోత్సవాదులు చేయించుచుండె ననియు దేలినది. ఇఁక రామగిరిపై నీ కేసనమంత్రి గుడికట్టించి అందులో విష్ణుని ప్రతిష్ఠ చేసె నని మఱియొక వృత్తాంతము నాపద్యములోనే యున్నది. ఈరామగిరిసీమలోనే యీసింగనకవి తాను ముప్పభూపాలునివలన ననేకవృత్తులు గ్రామములు సంపాదించినట్లున్నది. ఈ రామగిరి అనునది కేవలము పర్వతమే కాక యొకగ్రామనామముకూడ నైనట్లును, అది యీముప్పభూపాలుని ముఖ్యపట్టణ మైనట్లునుగూడఁ గాన్పించు. దానికి వాసిష్ఠరామాయణములో నీక్రిందివిధ మగునాధార మున్నది. దానిలోనే కృతిపతి యగు కందనమంత్రివృత్తాంతముగూడ వచ్చునుగావున నావాక్యములు ముందు వివరించి కృతిపతివిశేషములఁగూడ నీ రెండుగ్రంథములలో నున్నట్లు వివరించెదను. అది యెట్లున్నదనఁగా :_

"విష్ణువిభవాభిరామంబు లగుపద్మపురాణోత్తరఖండంబును, భాగవత దశమస్కంథంబును దెనుంగున రచియించి యప్పుణ్యపురాణంబులకుఁ గృతిపతిగా నే పుణ్యుం భ్రార్థింతునో యని విచారించి, గజగంథవారణ, గండగోపాల, చలమర్తిగండ, రాయగజకేసరి, దొంతిమన్నె నానావిభవాది బిరుదవిఖ్యాతులం బ్రసిద్ధుం డగు రామగిరిపట్టణాధీశ్వరుం డైనకుమార ముప్పభూపాల మాన్యమంత్రివరధురంధరుండును, అమ్మహారాజ దిగంతరవ్యాపృతకీర్తిలతాలవాలుండును, ధర్మచారిత్రుండును, నీతిచాతుర్య వివేకవిశేష గుణాలంకారుండును, నఖిల దిగ్భరితకీర్తి విశాలుండును, వాణసవంశాబ్ది సుధాకరుండును, గాశ్యపగోత్రపవిత్ర అబ్బనార్యతనూభవ కందనామాత్యుండు నాకు నతిస్నేహ బాంధవుండును, అపూర్వవచనరచనానుబంధబంధుర కావ్యరసాభిజ్ఞుండును, నర్థిజనపారిజాతుండుఁ గావున నమ్మంత్రియుగంధరుం గృతిపతిఁ గావించి"

అని యున్నది. దీనింబట్టి చూడ నీసింగకవికిఁ బ్రభుం డగు ముప్పభూపాలుఁడు రామగిరిపట్టణాధీశ్వరుఁ డని తేలినది. ఈపట్టణము ప్రధాన మగుసీమనే రామగిరిసీమ యని వాడఁబడినట్లును దానిలోపలనే యీప్రభునివలన సింగకవి కనేకవృత్తులు గ్రామము లీయంబడిన ట్లీవఱకే వివరించియున్నాను. ఈరామగిరి పట్టణమునకు నీగ్రంథకాలమునాఁటికి సబ్బినాటిరాష్ట్రమని పేరున్నట్లుగా నది గౌతమీనదికి దక్షిణభాగంబున నున్నట్లుగా వివరించియే యున్నాము. ఇట్టి రామగిరిపట్టణమునకు వేఁగిదేశములోని (ప్రస్తుతపు గోదావరిజిల్లాలోని) పెద్దమనికి గ్రామమునకుఁ గొంచెమెచ్చుతగ్గుగా నెలదినముల ప్రయాణము పూర్వ ముండియుండు. అట్టి పట్టణములో గాఁపురముగా నుండుసింగనకవి కాతనితండ్రి సంపాదించిన పెద్దమనికింబట్టి మడికిసింగన యని చెప్పటంకంటె నీతఁడు స్థిరపడి గ్రంథరచనచేఁ బ్రసిద్ధినందినందున రామగిరి సింగన యని పిలుచుటయే మిగుల ననుకూల మని చెప్పి యితనియింటిపేరు రామగిరియని సవరించి యితని నింతటినుండి రామగిరి సింగన యని చెప్పెదము. పైవచనమువలనఁ గృతిపతి యగుగన్నమంత్రి వృత్తాంతము కొంత గోచరమగును. దానినే పద్మపురాణోత్తరఖండములోగొంతవిపులముగావివరించి యీసింగకవిచెప్పెను. ఆకృతిపతి స్వకీయాస్థానమంటపంబునఁగూర్చుండి కవిని గ్రంథరచనకై బిలిపించిన వృత్తాంతంబు నీక్రింద వివరింపుచున్నాఁడు. అదెట్లనిన :-

"వ. సప్తసంతానంబుల నుత్తరోత్తరంబు లగుకీర్తి సుకృతంబులకు మూలంబు కృతిపతిత్వంబుగా నిశ్చయించి, యష్టాదశపురాణంబులందును, సాత్త్వికంబునుం బరమ ధర్మార్థమోక్షప్రదంబును, విష్ణుకథాప్రధానంబును నగుపద్మపురాణంబు తెనుంగు సేయం దలంచి"

క. ఆపరమేశ్వరమకుట, వ్యాపృతగంగాప్రవాహవరకవితాస
    ల్లాపుఁ డగుకవిని సింగనఁ, జేపట్టక కీర్తిగలదె శ్రీమంతులకున్."

అని సింగనకవిం బిలువనంపించిన ట్లున్నది.

కవివంశావళీసంగ్రహము.

"చ. అనిపొగడంగఁ బెం పెసగునయ్యలమంత్రికి సింగమాంబకున్
      దనయుని విష్ణుమంగళకథానుముఖాత్మునినిత్య సౌమ్యవ
      ర్తను శుభలీలు నవ్యకవితారసపోషణవాగ్విలాసుభూ
      జనసుతసింగ నార్యు గుణసాగరు నన్ బిలిపించి యర్మిలిన్."

తెలుఁగురాయలంగూర్చి.

ఇదివఱలో జైమినీభారత గ్రంథముంబట్టి సాంపరాయని కాలమును నిర్ణయింపవచ్చునని శ్రీనాథకవి చారిత్రములో వ్రాసియున్నాను. ఆసాంపరాయనివర్ణనకంటె నాగ్రంథములో నాతని యాస్థానసామంతుఁ డును కృతిపతి యగునతనివర్ణనము విశేషించి వ్రాయంబడినది ఆవర్ణనలో నీసాంపరాయనింగూర్చి కొంచెము వ్రాయంబడె నని సూచించి యుంటిని. ఆపద్యమును వివరించెదను. ఎట్లన. -

"సీ. దురములో దక్షిణసురతాను నెదిరించి, కొనివచ్చిసాంపరాయనికి నిచ్చె
      సామ్రాజ్యమున నిల్పి సాంపరాయస్థాప నాచార్యబిరుదు విఖ్యాతి గాంచె
      శ్రీరంగవిభుఁ బ్రతిష్టించి యిర్వదివేలు, మాడలద్దేవునుమ్మళికి నొసఁగె
      మధురాసురత్రాణు మడియించిపరరక్ష, సాళువబిరుదంబు జగతి నెఱపె

తే. గబ్బితనమునఁ దేజి మొగంబు గట్టి, తఱిమి నగరంపుగవనులు విఱుగఁద్రోచి
    తానువ్రేసినగౌరునుద్దవిడిఁ దెచ్చె, సాహసంబున నుప్పొంగుసాళ్వమంగు."

ఇ ట్లుండుటంబట్టి పైసాంపరాయఁ డొకగొప్పరాజుగాఁ దేలు చున్నది. ఇతనికుమారునిపేరు తెలుఁగురాయఁ డని అతనిని సాంపరాయని తెలుంగాధీశుఁ డని శ్రీనాథకవి వర్ణించిన ట్లుండుటచేతఁ దేలినది. ఇతనికే యిర్వురుకుమారు లుండిరనియు నందులోఁ బెద్దవాఁడు కుమారముప్పరాజనియుఁ దేలినది. ప్రస్తుతములోని తెలుఁగురాయఁడు కూనయముప్పభూపాలు నికొడుకుగాఁ దేలుటంజేసి పైసిద్ధాంతము తిరిగిపోయినది.

తొయ్యేటి అనపోతభూపాలునికాలము.

ఈ యనవోతభూపాలునికాలముంగూర్చి యీవఱకే తిక్కన సోమయాజిచారిత్రములో నీసింగకవింగూర్చి వ్రాయునపుడే కొంతవ్రాసియున్నారము. కొండవీటిశాసనములంబట్టి యితనికాలము శా. స. 1220 మొదలు శా. స. 1250 వఱకు నున్నట్లుగా వివరించియుంటిమి. అతనికడ మంత్రిగా నున్నసింగనమంత్రితండ్రి యగునయ్యలమంత్రియుఁ గొంచె మెచ్చుతగ్గుగా నాకాలమువాఁడే అయియుండును. అదియునుఁగాక అనవోత భూపాలుఁడు ముప్పదిసంవత్సరములు రాజ్యము చేసినట్లు కనుపించులెక్కవలన నతనివయస్సు నంతే యై యుండు నని యూహింపఁగూడదుగదా. కావున సింగనకవికాల మాతనితండ్రి యగు నయ్యలమంత్రికిఁ బ్రభుఁ డగుననవోతభూపాలునికాలముంబట్టికూడఁ గొంచెమెచ్చుతగ్గుగా సరిపడియే యున్న దని చెప్పవచ్చును. పై గ్రంథము

వీ. కవిచరిత్రవిమర్శనము.

లో బ్ర. వీరేశలింగము పంతులవారు సింగకవి (మడికి సింగన్న) చారిత్రములో నతనికాలనిర్ణయముంగూర్చి కొంత యత్నించి దాని నొకవిధముగా నిర్ణయించిరి. దానింగూర్చి వారువ్రాసినదాని మనమిపుడు పరిశీలించవలసియున్నది. అందు వా రెట్లుగా వ్రాసి రనఁగా :-

"పై పద్యములవలన నీకవి తిక్కనసోమాజుల మనుమరాలి మనుమఁ డగుటయే కాక గోదావరీమండలములోని పెద్దమడికి నివాసుఁ డనికూడ స్పష్టమగుచున్నది."

అనువఱకు ముందుగా నాలోచింతము. ఇదివఱలో మనము చూసిన పద్యములుఁగూడ నివే అయియున్నవి. అందులో మొదటిపద్యమగు

"అతఁడు తిక్కనసోమయాజుల పౌత్రుఁ డై, కొమరారుగుంటూరికొమ్మవిభుని పుత్త్రి బిట్టాంబిక బుధలోకకల్పకవల్లి వివాహమై -"

అని యుండుటం జేసి పుత్త్రుఁ డనుపాఠము సరి కా దని చెప్పియున్నారము. ఇపుడు మన మరసినమార్గముంబట్టి తిక్కనసోమయాజి కీ సింగనకవి మనమరాలిమనమఁడుగాక ముమ్మనమరాలి మనుమఁడుగాఁ దేలును. దానివలన గలుగుభేదము కలుగదనియే భావించెదము. ఇఁకఁ దరువాయి వాక్యములను బరిశీలింపవలసియున్నది.

"ఈకవి పద్మపురాణమునకుఁ గృతినాయకునిఁగాఁ జేసినకందనమంత్రి మా మార్కండేయపురాణమును గృతినందిన గన్నయమంత్రికి యన్నమనుఁ మడౌటకూడఁ గవికాలమును నిర్ణయించుట కనుకూలపడుచున్నది. గన్నయమంత్రి జ్యేష్టభ్రాత గణపతి. గణపతి ద్వితీయపుత్త్రుఁ డబ్బయామాత్యుఁడు. అబ్బయామాత్యుని తృతీయపుత్త్రుఁడు కందనమంత్రి. తిక్కనసోమయాజిశిష్యుఁ డైనమారన తనమార్కండేయపురాణ మంకితముచేసిన గన్నయమంత్రికిఁ గంగనమంత్రి యన్న పౌత్రుఁ డగుటచేతను, కందనమంత్రి కాలములో సింగకవి యుండుటచేతను సింగకవిమారనకుఁ దఱువాత ముప్పదినలుబది సంవత్సరముల కుండిన నుండవచ్చును. కాబట్టి యీసింగనకవి క్రీ. శకము 1340-78 (1262 శా. స.) సంవత్సరప్రాంతమున నుండవచ్చును."

ఇక్కడ మనము వ్రాయవలసినది కొంత యున్నది. పైసిద్ధాంతము ననుసరించుటకు ముందు దాని యథార్థము కొంచె మరయవలసి యున్నది. పద్మపురాణోత్తరఖండములోని కృతిపతి వంశావళి నిదివఱలో వివరించియున్నను దానిని మారనకృత మగుమార్కండేయపురాణములోని వంశవృక్షము నొక్కచో వివరించి పరిశీలించెదముగాక. అపుడు పంతులవారు వివరించిన సంబంధములు స్పష్టపడును. అవి యెట్లున్నవనఁగా :_


ఇట్లుగా నున్న పై రెండువంశములవారికినిఁ బంతులవారు కల్పించసంబంధ మూహకురాకు న్నది. మార్కండేయపురాణములో నున్న గన్న సేనానినే పద్మపురాణములోని మంచిగన్నయగాఁ బంతులుగారు పొరపడియుందురు. ఈ గన్న సేనాని నాగయసేనాని పుత్త్రులలో జ్యేష్ఠుఁ డైనట్లు కానుపించును. మంచిగన్నయ యనునతఁడు మల్లన యనునతనిపుత్త్రుఁడై యతనినల్వురికొడుకులలోఁ గనిష్ఠుఁడుగాఁ గాన్పించు. ఇట్లున్నను పంతులవారు గన్న సేనానికి జ్యేష్ఠభ్రాత యున్నాఁ డనియు నతఁడు గణపతినాముఁ డని వ్రాసిన వాక్యముల కర్థముకాకయున్నది. మార్కండేయపురాణములోని గన్న సేనాని యింటిపేరుగాని గోత్రముగాని వివరింపఁబడియుండలేదు. పద్మపురాణములోని మంచిగన్నయ వాణస వంశమువాఁ డనియును కాశ్యపగోత్రుఁ డనియు వ్రాయంబడియున్నది. ఆయిర్వురితండ్రులపేరులును భేదములైనవి. వాటియాద్యక్షరములైన నొకటి కావు. ఒకనిపేరు నాగయ్య. రెండవయతనిపేరు మల్లయ్య. అయితే యీమల్లయతండ్రి యగునన్నయమంత్రి కాకతీయగణపతి కాలీనుఁ డని యుండుటచేతను, నాగయ్య యను నతనిమామ యగుమేచనయను నతఁడు కాకతీయగణపతియొద్ద తలారి యని యుండుటంబట్టి ఆయిర్వురు కాకతీయగణపతికాలీను లనునమ్మకముతో నుండి తక్కినసంగతులన్నియుఁ బొరబాటున నూహించియుందురు. ఇట్లుగానినాఁడు పంతులవారి యూహలకుఁ గలకారణముల వివరింపుఁ డని పంతులవారినే మనము కోరుదము. దానిని వారు తెల్పినపిమ్మట నీకథనంతయును నమ్ముదము. ఇఁకఁ బంతులవారు వివరించిన తక్కినయంశములఁగూర్చి విచారించవలసియున్నది. అందులో నెఱ్ఱాప్రెగ్గడకంటె సింగకవి పూర్వుఁ డని యీక్రింధివిధంబున వ్రాసిరి.

"ఇతఁ డెఱ్ఱాప్రెగ్గడకంటెఁ గొంత పూర్వుఁడు. కాబట్టియే సింగకవి పద్మపురాణమునం దీక్రిందిపద్యముచేత నన్నయ తిక్కనలను మాత్రమే స్తుతించియున్నాఁడు." అని. ఇది కేవలమొక సిద్ధాంతాంశముగాదు. కొందఱుకవులు కవిత్రయము వారినిఁగూడ నుతి యింపక యుండుట గలదు. మఱికొందఱు నన్నయ తిక్కనలమాత్రమే నుతియించుటయుఁ గలదు. తిక్కన సోమయాజియే నన్నయభట్టు భారతములోని మొదటి మూఁడుపర్వములం దెనిఁగించె నని వ్రాసియుండుటం జేసి ఆమార్గమునే అతనిసంబంథి యగుసింగన యవలంబించి భారతము నన్నయతిక్కనలకృతం బని ఆయిర్వుర నుతియించె. ఈసింగనకవి భాస్కరరామాయణగ్రంథకర్తలలో నొకరిపేరునైన స్మరియింపలేదు సరియేకదా తిక్కనసోమయాజివలనఁ గూడ నుతియించఁబడిన యతని తాత యగుభాస్కరమంత్రినిఁ గూడ వదలివేసెను. ఆకారణమున నాతని కంటె నీసింగనకవి ప్రాచీనుఁ డనిచెప్పనొప్పియుండదుగదా. ఇతర మైనసాధనములచేతనే యెఱ్ఱాప్రెగ్గడకంటెఁ బూర్వుఁ డని తేలునెడల దానికి సహాయముగా నతనిపే రీతఁడు స్మరియింపకపోవుటకుఁ బై కారణము పనికివచ్చును. అటుగాక సింగకవి కాలమంతయు నూహలపైననే స్థాపించుచోఁ దానిలోఁ బడినపొరపాటునకు నీసింగనకవి యెఱ్ఱాప్రెగ్గడపేరు స్మరియింపకపోవుటకూడ సహకారి యని చెప్పుట యొకయుక్తికాదని నాయభిప్రాయము. ఇట్టి సిద్ధాంతమునకు ముందుగాఁ బంతులవారు పద్మపురాణ మార్కండేయపురాణ కృతిపతులకుఁ గలసంబంధము చెప్పి దానిని నిరార్ధాణచేయవలసియున్నది. కావున నదియైనపిమ్మట దాని కుపబలకముగాఁ బనికివచ్చు నీయెఱ్ఱాప్రెగ్గడవృత్తాంతముఁ గూడఁ గైకొందము. ప్రధానాంశము నిలువఁబడనప్పు డేయంశముంగూర్చి వ్రాయపనియే యుండదుగదా. కావున దీని నిప్పటికి వదలెదము.

నవీనవాసిష్ఠ రామాయణవృత్తాంతము.

ఇదివఱలోనే నిట్టిపేరుతో నొప్పుకొనక నవీన గ్రంథము బయలువెడలెనని వాక్రుచ్చియుంటిని. ఆగ్రంథవిషయమై కొంత చెప్పి అనంతరము దానికిని సింగకవికృతగ్రంథమునకు గలభేదముం జూపెదను.

కవివంశావళి.

కృష్ణగిరిలో హరితసగోత్రుఁ డగు

నృసింహము.

|

రామయ్య.

|

వేంకటరమణయ్య. (కవి)

ఇతఁడు తనవిషయమై యీక్రిందిపద్యంబువ్రాసికొనియెను. _

"క. హరితసగోత్రోత్పన్నుఁడ, వరతరమగునులచనాడువంశ్యుఁడ లక్ష్మీ
     కరకర్ణాటకులుండను, ధర వేంకటరమణుపేరఁ దనరినవాఁడన్."

దీనింబట్టి యీకవి కరణకమ్మ లనఁబడు కన్నడశాఖాబ్రాహ్మణులలోనివాఁ డనియు నితనినాఁ డీభేదానుసారముగా నులచనాటివాఁ డని చెప్ప నొప్పినట్లు గాన్పించు.

కవికృతగ్రంథములు.

"గీ. రమ్యతర మైనయధ్యాత్మారామచరిత, నాంథ్ర మొనరించి పిమ్మట నాత్మభాషఁ
     బూని మానగుగయునుపాఖ్యాన మనెడు, గ్రంథము రచించితిని బుద్ధికలిమికొలఁది."

(1) ఆంధ్రములో నధ్యాత్మరామాయణము.

(2) కన్నడములో గయోపాఖ్యానము.

ప్రస్తుతగ్రంథముంగూర్చి యీక్రిందివిధంబుగ నింకొకపద్యంబు జెప్పెను అదెట్లన్నను :_

"గీ. రహిని జన్మాదిరహితపరాత్పరరత్వ, విమలసత్యాపరోక్షసంవిత్ప్రసాద
     దక్షిణం బగుమోక్షశాస్త్రంబు నొకటి, నిపుడు సేసెదఁ దత్క్రమ మెట్టి దనిన."

ఈకవి యాశ్వాసాంత గద్యముంబట్టి యథామాతృకముగాఁ దెనిఁగించినట్లు కాన్పించును.

"ఇది శ్రీ సీతారామకృపారసఝరీపాత్ర, హరితసగోత్రపవిత్ర, ఉలచనాడు వంశపయః పయోధికైరవమిత్ర, సజ్జనవర్ణ నీయచరిత్ర, నృసింహవిఖ్యాత భూసురవర్యపుత్త్ర వేంకటరమణ ప్రణీతం బగుశ్రీమద్యథావాల్మీకీయ వాసిష్ఠరామాయణము సర్వంబును సంపూర్ణము."

ఈకవి మఱియొకచో సంస్కృతములోని వాల్మీకికృత వాసిష్ఠరామాయణకవితావిశేషంబులు దానిం దెనిగించుటకుఁ గల స్వశక్తి లోపమును దెల్పునట్లుగా నొకయుపన్యాసంబు వ్రాసె. అది తన నిజ మగు శక్తిలోపంబును వివరించుటకుఁ గాకున్న నెవ్వరైనఁ దనగ్రంథంబు సింగకవి గ్రంథంబుతో సరిచేసి అది లెస్సయై యున్న దనియు నిం దట్టివిశేషంబులు లేవనుశంక నంది దీని నిరసించెద రనుసంకోచముతోఁ జేసియుండిన నుండవచ్చును. ఆవచనభాగంబుమాత్ర మిట వివరించెదను. "వ. ఇట్టివేదాంతసార సర్వస్వం బై యాదిమకవిసార్వభౌముం డగువాల్మీకి మహర్షి ప్రవరవదన సదనామృత ద్రవమృదూకృత మధుమాధురీరసఝరీ విరాజితపరగణ బద్ధం బై పురాకృతభాగధేయమాత్రసంవేదక మహార్థగుంభితం బై, సకృత్కర్ణకోటర ప్రవేశమాత్రాపకర్షి తచిత్తగతమహామోహదుర్వాసనామలశబ్దరాజీవిరాజితంబై సకృత్పఠనమాత్రాపనోదిత బహుజన్మానుస్యూతశోకసంచయం బగుశ్లోకసంచయసముద్దీ స్తంబై అజ్ఞసర్వజ్ఞచిత్తరంజక కథావిసరప్రశస్తంబై యుపమేయగతపరతత్త్వస్వరూప సర్వస్వప్రకాశకార్థచమత్కారగర్భితోపమానచయభరితం బై యశేషవర్ణనీయమహా మహిమంబై యొప్పారునీసర్వోత్కృష్టతరమోక్షశాస్త్రంబును తన్మహర్షి శేఖరుకృపాబలం బొక్కటి దక్క నితరంబు లగుకావ్యబంధకౌశలాదు లెఱుంగనినేను జవనుండగు జాంఘికుండు స్వేచ్ఛావిహారంబు సల్పినతెరంగున, ఖర్వుండు తత్పదస్థానంబులం బ్రలపనంబులిడుచుఁ బ్రాసరూపకంటకంబుల యెడం గంటగింపక, యుభయసంధులన్ మార్గంబుదప్పక, ప్రాప్తంబగు విచ్ఛిత్తినెడయక, సద్గణపద్ధతి నతిక్రమింపక నడువనుద్యోగించుచందంబునఁ దెనిఁగింప సమకట్టినమదీయజాల్మతను సహించి జంతువులకు సర్వ గుణంబుల సహజంబు లైన యీకృతింగల మద్బుర్ధిజాడ్యజనితదోషములచే నసూయతా మాత్ర చిత్తులుగాక, యిచట సాధకార్థగ్రహణ మాత్రంబే ప్రయోజనంబు గా నెఱింగి యార్యభావంబు నొంది సర్వులు విని యానందభరితాంతరంగులు కావలయు నని ప్రార్థించి, యనంతరంబునం బ్రారీప్సిత గ్రంథంబునకు నవిఘ్న పరిసమాప్తి నిమిత్తంబుగా శిష్టాచార పరిప్రాప్తేష్టదేవతాప్రణామలక్షణం బగుమంగళంబును, గ్రంథకారుం డగు నప్ప్రాచేతనుం డంగీకరించి చెప్పినశ్లోకంబుమొదలుకొని గద్యపద్యాత్మకంబు గాఁ జెప్ప నారంభించితిని."

అని యున్నది. కాని యిట్టి పై యుపన్యాసానుసారముగాఁబ్రత్యేకము కవిత్వము దోషయుక్తముగాక సామాన్యముగా గ్రంథము రమ్యముగానే యున్నది. ఈగ్రంథము యథామూలముగాఁ దెనిఁగించుటం జేసి సింగకవికృతగ్రంథమునకంటె రెండుమూఁడురెట్లు పెరిగినది సింగకవి కృత మగుగ్రంథము నూటముప్పదిపుటలు గలదియు నీనవీనకవి ప్రణీతము నాల్గువందలముప్పదిపుటలగ్రంథము గలదియు నైనది. గ్రంథ బాహుళ్యమున సారాంశము సుబోధము కాదనియే పూర్వకవులలోఁ బెక్కండ్రు గ్రంథములఁ దెనిఁగించునపుడు సాధ్యమగునంత సంగ్రహములుగానే తెనిఁగించుచు వచ్చిరి. ఆర్షేయగ్రంథములు పురాణములవలె నతివిపులము లై చెప్పినయంశమునే మరల నినమాఱు ముమ్మాఱు చెప్పుచు సారాంశము తేలియుండునట్లుగాఁ జెప్పక ఛాందన వృత్తితో నుండునట్లుగాఁ జెప్పుటఁగన్పట్టి తొంటిపురాణాంధ్రకవులందఱు నామార్గము నవలంబించక సారాంశమునే ప్రధానము చేసుకొని సంగ్రహరూపముగానే ఆంధ్రములో నాగ్రంథములు ప్రకటించిరి. అట్లుగా సారాంశప్రకటనముఁజేయుట కష్టసాధ్యముగావున నట్టిపనిం జేయక ప్రస్తుతకాలములోనివారు యథామాతృకముగాఁ దెనిఁగించుచున్నార మని చెప్పుచు శ్లోకమునకుఁ బద్యము వ్రాయుచుఁ జర్వితచర్వణముం జేయుచున్నారు. వీరికి లోకోపకారమే ప్రధాన మైనయుద్దేశ మైనయెడల సంస్కృతములో ఛందోబద్ధములుగా నుండుగ్రంథములను దేశభాషలలోనికిఁ గేవలము వచనరూపగ్రంథములుగా రచియించినదానివలనఁ గొంత లాభము కల్గును. అటుగాక తొంటిగ్రంథములనే తిరుగ నారంభించుచు నాగ్రంథము నాంధ్రీకరించిన పూర్వపువారికిఁ దమకుఁ గలకవిత్వభేదమరయఁబడునేమో అనుభయముతో యథామూలముగా మేము తెనిఁగించినారము. పూర్వు లిట్లుగాఁ దెలిఁగింపకుండుట యొకకొఱఁత యని యేల సూచింపవలయును? ఈగ్రంథకర్తవలెనే వాల్మీకికృత రామాయణము యథామూలముగాఁ దెనిఁగించితి నని యింకొకరు తెనిఁగించి దానింగూడఁ బ్రకటించిరి. కాని భాస్కరరామాయణము నా నవీనరామాయణమును రెంటిని బురాణముగా వినువారివలన వానిమంచిచెడ్డలు తెలియఁ బడును. అప్పుడుగదా ప్రాచీనులమార్గమునకు నవీనులమార్గమునకును గలభేదంబు గోచరంబగు. అటులనే ప్రస్తుతవాసిష్టరామాయణము నుండెననుటకు సందియంబు లేదు. వలయునేని యేకథాభాగములోఁ జూచిన నాకథలోనే యీభేదము తేలక మానదు. దాని నాగ్రంథారంభములోనే కొన్నిపట్లలోఁ జూపెదము.

కథారంభములో

వేం. ర. "అ. గురుని నేకతనమునఁ గూర్చున్న వాల్మీకి నఖిలదర్శనములు నపుడుగాంచి
               ప్రణుతి సల్పి యాభరద్వాజుఁ డిటు మృదు, స్వరము గరము వెలయ సరగ నడిగె."