Jump to content

కవి జీవితములు/కంకంటి పాపరాజు

వికీసోర్స్ నుండి


సముఁ గూడఁ బూర్తిచేసిన బాగుగ నుండియుండు ననియును దోఁచునని మాత్రము చెప్పెదము.

___________

ఉత్తరరామాయణము.

9.

కంకంటి పాపరాజు.

పైనిర్వచనోత్తరరామాయణము కావ్యముగా రచియింపఁబడి యుండుటఁ జూచి కంకంటి పాపరా జనునతఁ డుత్తరరామాయణము మహా కావ్యముగా రచియించుట కుత్సహించి తిక్కనసోమయాజి చేసిన కావ్యమునే తాను మఱియొకసారి తెన్గుచేయుట చర్వితచర్వణ మనియు, నెచట నైన సమానవర్ణన లున్నచోఁ దనకవిత్వము తిక్కనసోమయాజికవిత్వముతో సరి తూఁగనిచోఁ బాఠకులు త న్నా క్షేపంబుచేసెద రనియు శంక మనస్సులో నుంచుకొని యీక్రిందిపద్యముచేతఁ దన యుద్యమమును వ్యక్తీకరించు చున్నాఁడు. అది యెద్ది యనఁగా :-

"మ. వరుసం దిక్కనయజ్వ నిర్వచనకావ్యం బై తగం జేసె ను
     త్తర రామాయణ మందున న్మఱి ప్రబంధం బూని నిర్మించు టే
     సరసత్వం బని ప్రాజ్ఞులార నిరసించంబోకుఁడీ రాఘవే
     శ్వరుచారిత్రము లెంద ఱెన్నిగతుల న్వర్ణించినం గ్రాలదే."

ఇట్లు చెప్పియు నుత్తరరామాయణమునే యాంధ్రీకరించుటకుఁ గలకారణము తిక్కనపైని పోటీగా వ్రాయుటకుఁ గాదనియుఁ దాను తరియించుటకు సాధన మనియుఁ దన యుపాసనాదేవుఁడు శ్రీరాముఁ డవుటంజేసి యందులఁకుగాను దా నాగ్రంథ మారంభించితి ననియు నీక్రిందిపద్యములలోఁ జెప్పెను. ఎట్లన్నను :-

"ఉ. మానక కర్మభూమిపయి మానుష దేహముతో హితాహిత
    జ్ఞాన మెఱుంగుబ్రాహ్మణుఁడు చారుకవిత్వము నేర్చి జానకీ
    జానికథ ల్రచింపక యసత్క థ లెన్ని రచించెనేనియున్
    వానివివేక మేమిటికి వానికవిత్వమహత్త్వ మేటికిన్.

"ఉ. శ్రీకరరామమంత్రజపసిద్ధిఁ బ్రసిద్ధి వహించి వెన్క వా
     ల్మీకి రఘుప్రవీరుకధలే రచియించి కదా చెలంగె ము
     ల్లోకములందు నెల్లమునులుం గొనియాడఁగ నట్టి దౌటఁ బు
     ణ్యాకర మైనరాముకథ హైన్యము మాన్పదె యెట్టివారికిన్."

అని యిన్ని విధములుగఁ బాపరాజు తనకు జనులవలనఁ గల్గఁబోవునిందను నివారించుకొనుటకుఁగాను యత్నించెను. ఇది యెంతశ్లాఘా పాత్ర మైనగుణము. ఆధునికులు పాపరాజుం జూచి కవిత్వ వి శేషములు నేర్చుకొనుటయే కాక గృహస్థమర్యాదను గూడ నేర్చుకొని యితరులు ప్రారంభించినకృతు లనునుచ్ఛిష్టమును గ్రహించుటకు సిద్ధపడకుండుట నేర్చుకొనెదరుగాక. అట్టికార్యముం జేయఁబోయి పొందెడియవమానంబునుండి తొలఁగుదురుగాక.

పాపరాజువంశముంగూర్చి.

ఈకవి తనవంశమును వర్ణించుకొనుటకుఁ బూర్వము తాను జన్మించిన నియోగిశాఖాబ్రాహ్మణుల నాఱ్వేలవారిని వర్ణించెను. ఆవర్ణన ప్రాచీనచారిత్రగాథల కన్నిటికిని సంగ్రహము గావున దాని నీక్రింద వివరించెదను :-

ఆఱ్వేలనియోగులవర్ణనము.

"సీ. అఖిలరాజాధిరాజాస్థానజనహృద్య, విద్యావిహారు లా ఱ్వేలవారు
    కల్పకబలికర్ణకలశార్ణవోదీర్ణ, వితరణో దారు లా ఱ్వేలవారు
    సజ్జన స్తవనీయసతతనిర్వ్యాజ, హారిపరోపకారు లఱ్వేలవారు
    ఘనదుర్ఫటస్వామికార్యనిర్వహణప్ర, వీణతాధారు లా ఱ్వేలవారు.

గీ. విమతగర్వాపహారు లా ఱ్వేలవారు, అట్టియా ఱ్వేలవారిలో నలఘుకీర్తి
   వెలయు శ్రీవత్సగోత్రారవిందహేళి, మహితగుణశాలి వల్లభామాత్య మౌళి.

దీనింబట్టి యాఱ్వేలనియోగులలోఁ బెక్కండ్రు రాజాధిరాజుల యాస్థానములలోఁ బ్రకాశింపఁ దగిన విద్యావిశేషములు గలవా రనియును, విశేషవితరణశాలు లనియును, నిందాదూరు లగుపరోపకారు లనియును, దుర్ఘటస్వామి కార్యనిర్వాహకు లనియును, శత్రువుల గర్వముం బరిహరించువారనియును దేలినది. అట్టియాఱ్వేలవారిలో శ్రీవత్సగో


త్రుఁ డగువల్లభరాజు తనకు మూలపురుషుఁ డని పాపరాజు చెప్పెను. అతనిసంతతి.

వల్లభరాజు

|

అయ్యన్న మంత్రి

|

అప్పయ్యమంత్రి

|

పాపరాజు. (గ్రంథకర్త.) ---- నరసింహము.

పాపరాజునకుం గలయధికారపదవి.

ఈపాపరాజు కవిత్వవిభవోపేతుఁడే గాక యధికారాది విభవో పేతుఁ డని యాశ్వాసాంతగద్యములో వ్రాయఁబడినవాక్యములం బట్టి యోజింపవలసి యున్నది. ఎట్లన్నను :-

"గద్యము. ఇది శ్రీమదనగోపాలకృపాకలితకటాక్ష వీక్షా సమాసాదిత చతుర్విధానపద్యకవిత్వవిధ్యావధా నాధునాతనభోజరాజ సకలవిద్వజ్జనాభివర్ణి తోదీర్ణ వైభవాధఃకృతరాజరాజ, రాజయోగసామ్రాజ్యలక్ష్మీవిలాస ధురంధర, ధరాధిపస భాంతరస్తవనీయ, నయకలాయుగంధర బంధురమనీషా విశేషమంథాన వసుంధరాధరశోధిత గణితశాస్త్రరత్నాకర, వినయాదికగుణరత్నాకర, కంకంటివంశపయఃపారావార పరిపూర్ణ సుధాక రాప్పయామాత్యసంక్రందననందన, విజ్ఞానవిభవజితసనఁ దన, విష్ణుమాయావిలాసాభిధాన యక్షగాన నిర్మాణప్రవీణతానిధాన పాపరాజప్రధాన ప్రణీతంబైన శ్రీమదుత్తరరామాయణం బను మహాకావ్యంబునందు".

దీనింబట్టి చూడఁగా నీపాపరాజు కేవలకవిత్వవిశేషములు గలవాఁడే గాక, విశేషధనికుఁ డనియు, రాజయోగాద్వైతశాస్త్రప్రవీణుఁ డనియుఁ బ్రభుసంస్థానములలో న్యాయకార్యవిచారణాదక్షుం డనియును, గణితశాస్త్రవిశేషజ్ఞుఁ డనియును జ్ఞాని యనియును, విష్ణుమాయావిలాస యక్షగాననిర్మాత యగుటం జేసి సంగీతములోఁగూడఁ బండితుఁ డనియును దేలినది.

పాపరాజునకుఁ బుష్పగిరి తిమ్మకవి సహాయుఁ డౌట.

ఈపాపరాజునకు నుత్తరరామాయణగ్రంథరచనలోఁ బుష్పగిరి తిమ్మనకవి సహాయుఁడై యుండిన ట్లీగ్రంథములోననే కాన్పించును. ఆ వృత్తాంతముఁ జెప్పుటకు బూర్వము పాపరాజు తానొకకలఁ గంటి ననియును, ఆకల తనకు మిత్త్రుండును సహాధ్యాయియు నైనపుష్పగిరి తిమ్మకవితోఁ జెప్పఁగా నతఁ డందులవిశేషముల విప్పి చెప్పి తన్ను గ్రంథరచన కుత్సహించి సహాయుఁడు కాఁగాఁ దా నీగ్రంథమును బ్రారంభించితి ననియును జెప్పెను. ఎట్లన్నను:-

క. అని పల్కి యాకృపాలుఁడు, సనుటయు నే మేలుకాంచి స్వప్న మునం దు
   న్నను నేలుస్వామిఁ గనఁ గలి, గెనె యని రోమాంచకంచు కితగాత్రుఁడ నై.

"మ. హనుమద్దివ్యపదారవింద మకరందానంద నేందిందిరా
     త్ము ననేకాంధ్రకృతి ప్రకల్పనసమర్థుం బుష్పగిర్యిప్ప నా
     ర్యునిసత్పుత్త్రునిఁ దిమ్మ నాఖ్యకవిచంద్రున్ మత్సహశ్రోతఁ బ్రొ
     ద్దున నేఁ బిల్వఁగఁ బంచి కన్న కల సంతోషంబునం దెల్పినన్.

"మ. అతఁ డానందముఁ జెంది నన్నుఁ గని యన్నా జాళువాపైఁడికిన్
     గృతవర్ణాంచితరత్న మబ్బినటు లయ్యె న్నీవు వాక్ప్రౌఢిమం
     గృతి సేయంగఁ దొడంగురామకథకుం గృష్ణుండు రా జౌటఁ బ్ర
     స్తుతి గావింపఁగ మాకు శక్యమె భవత్పుణ్యప్రభావోన్నతుల్".

"తే. అని కిరీటికి శౌరి తోడైనయటుల, నమ్మహాకవి సాహాయ్య మాచరింపఁ
    గృతి నొనర్పఁగఁ బూనినయేను మొదట, నెంతు మద్వంశవిధ మది యెట్టులనిన.

పాపరాజు కాలనిర్ణయము.

దీని సూచించుట కీగ్రంథములో నేమియు నాధారము లేదు. కాని యీగ్రంథకర్త పుష్పగిరితిమ్మకవిసమకాలీను డని చెప్పి యుండుటంజేసి యతనికాలముం బట్టి యైనను దీనిని నిర్ణయింత మని యోఁచింపఁగా నదియును నంతమాత్రముగానే యున్నది. అతనిపేరిట దశావతారచారిత్ర మనుగ్రంథ మొకటి ప్రఖ్యాతి నంది యున్నది. అది యతనిచే రచిత మైనను ధరణీదేవులరామమంత్రిపేరు బెట్టి రచియింపఁబడినది. అం దీతిమ్మనపే రైనను గానరాదు. ఇట్టిచో నేవిధముగ


దీనిని నిర్ణ యింపఁగలమో నాకు బోధ కాకుండ నున్నది. దశావతార చరిత్రంగూర్చి వ్రాయుచో నీవిషయమై సంపూర్ణముగ సంవాదించెదను. ప్రస్తుతములో మాత్రము లోకము వాడుకంబట్టి దానిని గ్రంథకర్థ యగుపుష్పగిరి తిమ్మనయును, ధరణీదేవుల రామమంత్రియును, కంకంటి పాపరాజును సమ కాలీను లనియును వారందఱును గృష్ణరాయానంతర కాలములోఁ బెన్గొండ, చంద్రగిరి సంస్థానములలో నాధిపత్యము చేసిన వీరవేంకటపతిరాయనిమంత్రి యై యతనివలనఁ జామరయుగళమును, పల్యంకిక భద్రదంతి మొదలగు సన్మానముల నందిన మదగలతిమ్మమంత్రి మనుమఁ డగు రామమంత్రికాలము లోనివారుగా నిర్ణ యింపఁబడవచ్చును. ఈమదగల రామమంత్రిపేరిటనే దశావతారచరిత్రము కృతియియ్యఁబడినది కావున నీపైకవు లందఱును శాలివాహనశకము పదునేడవశతాబ్దారంభములోనివారుగా నూహింపఁబడవచ్చును.

పాపరాజుకవిత్వశయ్యాదులు.

ఇతనికవిత్వము ప్రబంధకవులకవిత్వమురీతిని మిగులఁ బ్రౌఢిమ గలదియు రసవంత మైనదియు నని చెప్పవలసి యున్నది. కాని వ్యాకరణములోమట్టుకుఁ గొన్నిస్ఖాలిత్యము లగపడును. ఇతఁడు ప్రబంధకవుల వలెఁ దదవసరశాస్త్రములన్నిటిని విశేషించి పరిశీలించినవాఁడును, విశేష పరిశ్రమ చేసినవాఁడును గాకపోవచ్చును. కవిత్వవ్యాసంగములోమట్టుకుఁ బరిశ్రమ కలవాఁ డౌటచేత ధారాశుద్ధియును, భావప్రకటనయందు సమర్థతయును, విశేషించి యున్నవి. దానిం దెల్పుట కొకటిరెండు పద్యముల నీక్రిందఁ జూపెదను.

ద్వ్యర్థి.

"శా. వైదర్భీవిలసద్విలాసమునఁ జెల్వం బూని సత్యోక్తి నెం
    తే దీపించి కళింద జోజ్జ్వరసాప్తిన్ మించి భద్రాత్మకం
    బై దీవ్యద్ఘనలక్షణాశ్రయసమాఖ్యం గాంచుమత్కావ్య మా
    హ్లాదం బిచ్చు గ్రహింపఁ గృష్ణునకు నర్హంబే కదా యెయ్యడన్."

యమకము.

సీ. చిత్రకూటమణీవిచిత్రకూటసుఖేట, చిత్రకూటస్థలాసీనుఁ డగుచు
   దండకాశరభవేదండకాసరముఖో,ద్దండకాసరమృగధ్వంసి యగుచు
   మానవారితపూజ్యమానవాసవిరాధ, మానవాదహిమోగ్రభానుఁ డగుచు
   దానవాగ్ని భిదానిదానవార్యభయప్ర, దానవాక్పరితుష్టమౌని యగుచు
   దూషణాలాపఖరఖరదూషణామ, రేషణద్వేషణానేకశోషణాతి
   భీషణాశనిఘోషణా శ్లేషణాస్త్ర, పోషణుఁడు మించె రఘువంశభూషణుండు.

ఆంధ్రము.

సీ. చలిగట్టు దొరపట్టి జపియించుమంత్రంబు, వేయు ఱేకులతమ్మి వెలయునంచ
   పలుకుఁగొమ్మకు ఱేనిఁ గలిగించుతొలిపెద్ద, యీ రేడుజగముల నేలు ఱేఁడు
   ప్రాఁబల్కుజవరాండ్రబలగంపుముచ్చట, పెనునీటఁ దేలాడుపిన్న పాప
   మరుగొంగవలపుఁదామరమీఁదియెలదేఁటి, కలిమియొయ్యారి నోములఫలంబు,
   కటికచీఁకటివెల్గు నొక్కట వెలుంగు, మేటిరేద్రిమ్మరులగంటుపోటుబంటు,
   తొగలఁదమ్ములఁబ్రోచుకన్దోయిఁ జూచుఁ వేల్పు కౌసల్యకొమరుఁడై వృద్ధిఁబొందె

ముక్తపదగ్రస్తము.

సీ. శ్రీకరరఘుకులక్షీరాంబునిధిసోమ, సోమముఖ్యామరస్తోమధామ
   ధామనిధిప్రశస్తప్రతాపోదార, దారకవిత్వవిదారవీర
   వీరభద్రోన్ని ద్రవీరరసాధార, ధారణాభ్యాసచేతఃప్రచార
   చారణశ్రీవిలాసనిరస్తరాజీవ, జీవభావైక్యదృష్టిప్రదాన

గీ. దానవప్రాణహృతిప్రాణతతిభుజంగ, జంగమస్థావరరచనాంచత్ప్రభావ
   భావనాదూర బహుపావనావతార, తారకబ్రహ్మనామ కోదండరామ.
                      ___________