కవి జీవితములు/అల్లసాని పెద్దన
శ్రీరస్తు.
కవిజీవితములు.
ఆంధ్రపంచకావ్యకవులచారిత్రము.
10.
అల్లసాని పెద్దన
దీనిని విస్పష్టముగాఁ దెల్పుదృష్టాంతములు విశేసముగ లేవు. మనుచరిత్రములో నచ్చటచ్చట వివరించినసంగతులం బట్టి కొంచెము చారిత్రము సమకూర్పవలసి యున్నది. ఇతనిగ్రంథారంభస్తోత్రములం బట్టి స్మార్తుఁ డని తోఁచుచున్నది. స్మార్తులు సామాన్యముగా బ్రహ్మ విష్ణు మహేశ్వరుల నుమారమావాగ్భామామణులను. వినాయకాదు దులను వర్ణించి పద్యములను రచియించెదరు. అట్లుగా నీతఁడును చెప్పెను. గాని తనగురుని వర్ణించి చెప్పినయీక్రిందిపద్యమువలన నాతఁడు స్మార్తుఁడు కాఁడేమో యని తోఁచుచున్నది. ఆపద్య మెట్లన్నను :-
క. కొలుతు న్మద్గురు విద్యా, నిలయు న్గరుణాకటాక్షనిబిడజ్యీత్స్నా
దళితాశ్రితజనదురిత, చ్ఛలగాఢధ్వాంతసమితి శఠగోపయతిన్.
అనుదీనింబట్టి శఠగోపయతీంద్రునిశిష్యుం డైనట్లును వైష్ణవమత ప్రవిష్టుఁ డనియుం దోఁచెడిని.
ఈతఁడు నందవరీకు లను నియోగులలోనియొక వంశస్థుఁ డగునల్లసాని చొక్కనమంత్రి కుమారుఁడు. రాయలయాస్థానకవి శేఖరుఁడు, ఆంధ్రమున కెంతయుఁ బ్రసిద్ధుఁడు. సంస్కృతమునంగూడ నసమానప్రజ్ఞ కలవాఁడు, ఈతనికిఁ బూర్వు లగుపురాణకవులును, కావ్యకవులును నొనరింపని ప్రబంధకవనమునకుఁ గ్రొత్తత్రోవ లీతఁడు కల్పించుటంజేసి యాంధ్రకవితాపితామహుఁడని విఖ్యాతబిరుదు గల్గినది. ఈతని రాయలు "క. హితుఁడవు చతురవచోనిధి, వతులపురాణాగమేతిహాసకథార్థ
స్మృతియుతుఁడ వంధ్రకవితా, పితామహుఁడ వెవ్వ రీడు పేర్కొన నీకున్."
"చ. ఘనతరఘూర్జరీకుచయుగక్రియ గూఢము గాక ద్రావిడీ
స్తనగతిఁ దేట గాక యఱచా టగునాంధ్రవధూటిచొక్కపుం
జనుగవఁబోలె గూఢముగ జాటుఁదనంబును లేక యుండఁ జె
ప్పిన నదివో కవిత్వ మనిపించు నగిం చటు గాక యుండినన్."
"ఉ. అఱవలచన్ను లంబలె బయల్పడనీయక ఘూర్జరాంగనా
గురుకుచయుగ్మముంబలె నిగూఢము కాక తెనుంగుదేశపుం
గరితలచన్ను లంబలె నొకానొకయించుక గానుపించినన్
సరసులు మెత్తు రక్కవితచందము నందముగా జంగంబునన్."
అని కృష్ణరాయఁడు పెద్దనకవిం జూచి తనపేరిటఁ గృతి రచియింప యత్నింపవలయు నని తఱచుగా నుత్సహించుచుండెనఁట ! అట్లుత్సహింపఁ బడినను మంచిది రచియించెద నని కాలయాపన చేయు చుండెను. గాని గ్రంథారంభముమాత్రము చేయఁబడదాయెను. ఒక నాఁడు పెద్దన యిట్లు కాలయాపన చేయుటకుఁ గారణ మేమి యుండు నని యూహించి యతనిం బిలువనంపించి కృతి రచియింప నారంభించినఁగాని తాను భుజియింప ననియు నాదినమునందే కృతి యారంభింపక తప్పదనియును బలవంత పెట్టి చెప్పిన విని పెద్దన యిట్లనియె.
చ. నిరుపహతిస్థలంబు రమణీప్రియదూతిక తెచ్చి యిచ్చుక
ప్పురవిడె మాత్మ కింపయినభోజన ముయ్యెలమంచ మొప్పుత
ప్పరయురసజ్ఞు లూహ తెలియం గలలేఖక పాఠకోత్తము
ల్దొరికినఁ గాక యూరక కృతుల్ రచియింపు మటన్న శక్యమే.
అని నుడివిన రాయఁడు పెద్దన్న యభిప్రాయానుసారంబుగ నొక్క దివ్యభవనంబును, గోకట మొదలగు నగ్రహారాదికము నిచ్చి సంతోష పెట్టెను. అనంతరము కృష్ణరాయఁడు మరలఁ బెద్దనకవివలనఁ గృతినందు నిష్టము కలవాఁడై యిట్లనియె.
గీ. సప్తసంతానములలోఁబ్రశస్తిఁ గాంచి, ఖిలము కాకుండునది ధాత్రిఁ గృతియకానఁ
గృతి రచింపుము మాకు శిరీషకుసుమ, పేశలనుధామయోక్తులఁ బెద్దనార్య.
క. నరనారాయణచరణాం, బురుహద్వయభద్రచిహ్న ముద్రితబదరీ
తరుషండ మండలాంతర, సరణిం ధరణీసురుండు చనిచని యెదుటన్.
అన్యదేశ్యంబు లుంచి చెప్పినపద్యము.
సీ. పచ్చనిహరుమంజిపనివాగె పక్కెర, పారసిపల్లంబు పట్టమయము
రాణ నొప్పోరుపైఠాణంపుసింగిణి, తళుకులకోరీఁతరకసంబు
మిహిపసిండిపరంజు మొహదా కెలంకుల, ఠావుగుజ్జరివన్నె కేవడంబు
డా కెలంకునసిరాజీక రాచురికత్తి, కుఱఁగటఁగ్రొవ్వాఁడిగొఱకలపొది.
తే. పీలికుంచెతలాటంబు పేరజంబు, మణులమొగముట్టుఁ బన్ని సాహిణియొకండు
కర్తయెదుటికిఁ గొనివచ్చె గంధవాహ, బాంధవం బగు నొక మహాసైంధవంబు.
మిశ్రమున కుదాహరణము.
సీ. బుద్ధీంద్రియక్షోభములకుఁ బెట్టనికోట, విపదంబురాశిదుర్వికృతి|గోడ
ఖలదురాలాపమార్గణవజ్రకవచంబు, రణమహీస్థలికి శ్రీరామరక్ష
శాత్రవదుగ్గర్వసం స్తంభనౌషధి, మొనయుచింతాశ్రేణిమూఁకవిప్పు
యోగాదిసంసిద్ధు లొనగూర్చు పెన్నిధి, తూలు నేకాకులతోడునీడ.
తే. సకలసుగుణప్రధానంబు సకలకార్య, జాలసాఫల్యకరణైక సాధనంబు
ధైర్యగుణ మట్టిధైర్యంబుఁ దక్కి పాఱఁ, దత్తరింతురె యకట మీతరమువారు.
మ. సమరక్షోణిని గృష్ణరాయలభుజాశాతాసిచేఁ బడ్డదు
ర్దమదోర్దండపుళిందకోటి యవనవ్రాతంబు సప్తాశ్వమా
ర్గమునం గాంచి శబాసహోహరిహరంగా ఖూబుఖోడాకితే
తుముకీబాయల బాయిరే మలికి యందు ర్మింటికిన్ బోవుచున్.
మ. రాయగ్రామణి కృష్ణరాయ భవదుగ్రక్రూరఖడ్గాహిచేఁ
గాయం బూడ్చి కళింగదేశనృపతుల్ కానిర్ఘు రీపోషణీ
మాయాభీకు ముటాకులో హుటు రేమాయాసటాజాహిరే
మాయా న్మేయమడే యటండ్రు దివి రంభాజారునిన్ యక్షునిన్
శ్లో. వీరాగ్రేసర కృష్ణరాయ నృపతే త్వద్వైరికాంతా వనే
ధావంత్యః కుచయానరో మలతికావ్యాహారలీలాభృతః,
ప్రాప్తాన్ కోకమదేభపన్న గశుకాన్ రుంధంతి వక్త్రేందునా
మధ్యే వాపి కచేన కంకణల సద్వైస్వర్ణరత్నై రపి.
సీ. చినుకుపూసలు గూర్చు చెలువైనపూదండ, దండాటగలవేల్పు తపసికొండ
కొండాటములను జిక్కులు బెట్టుజడదారి దారితప్పక గట్టుజీరునలుగు
నలుగ టింటికి వెన్నుఁ డిలకుఁ దెచ్చినచెట్టు, చెట్టుగొట్టగఁ జేయు చెలువతోడు
తోదు క్రీడికి నైనదొరతోడఁబుట్టువు, పుట్టులిబ్బులకానిపొందుకాఁడు
గీ. కాడుపూరిజనించినఘనునితల్లి, తల్లిబిడ్డలఁ బెండ్లాడుగొల్లమనికి
మనికితంబుల నీడేర్చుఘనులవిందు, విందు సత్కీర్తి నరసింహవిభునికృష్ణా."
మనుచరిత్రలో నల్లసానిపెద్దన యీక్రింది విధముగఁ గృష్ణరాయని వినుతించె ఎట్లన్నను :-
సీ. ఉదయాచలేంద్రంబు మొదల నెవ్వనికుమా, రతకుఁ గ్రౌంచాచలరాజ మయ్యె
నావాడపతిశకంధరసింధురాధ్యక్షు, లరిగాపు లెవ్వానిఖరతరాశి
కాపంచగౌడధాత్రీతలం బెవ్వాని, కసివారుగా నేఁగునట్టిబయలు
సకలయాచకజనాశాపూర్తి కెవ్వాని, ఘనభుజాదండంబు కల్పశాఖ
గీ. ప్రబలరాజాధి రాజవీరప్రతాప, రాజపరమేశ్వబిరుదవిభ్రాజి యెవ్వఁ
డట్టిశ్రీకృష్ణదేవరాయాగ్రగణ్యుఁ, డొక్కనాఁడు కుతూహలం బుప్పతిల్ల."
అనునీపద్యమువలన మనుచరిత్రము కృతినందునాఁటికె కృష్ణరాయఁడు "ఉదయగిరిసీమ" ను జయించె ననియు నావాడశకంధరసింధు దేశాధిపతులు కప్పము నిచ్చుచుండి రనియుఁ బంచగౌడలదేశముపై ననేక పర్యాయములు దండయాత్రలు చేసె ననియు రాజాధిరాజ వీరప్రతాపరాజపరమేశ్వర బిరుదులు గల్గి యుండె ననియుం దేలినది. ఈకవిరాయల సభాస్థలిలో ననేకసమస్యలు పూర్తి సేయుచు ననేకసమస్య లితరకవుల కిచ్చుచు విద్యావినోదంబులు పెక్కులు సేయుచుండును. వానిలో నితఁ డితరుల నడిగినవానిం గొన్నిటి నిట వివరింతము ఒకనొకదినంబున రాధామాధవుం డనుకవిశిఖామణి రాయలఁ జూడఁ జనుదెంచినఁ బరీక్షింప నితఁడు నియమింపఁబడియె. అతనిసామర్థ్యాతిశయంబులు చూడ నగరు, తొగరు, వగరు, తగరు అనుపదంబులు ప్రాసస్థానంబులం దుంచి శ్రీరాము లరణ్య వాసంబున కేఁగునట్లుగ వర్ణింపు మని యడిగెను, దాని కాతఁడు వల్లెయని :-
"చ. నగరు పగాయె నింక విపినంబుల కేఁగుడు రాజ్యకాంక్ష కుం
దగరు కుమారులార యని తల్లి వగ ల్మిగులంగఁ దోఁపఁగాఁ
దొగరున రక్షఁ గట్టి మదిఁ దోఁచక గద్గదఖిన్న కంఠియై
వగరపుచున్నఁ జూచి రఘువంశవ రేణ్యుఁడు తల్లికిట్లనున్."
అని చదివిన నీతఁడు మెచ్చి "యోయీ భారతంబులోనికథ కావలయును" అనుడు వల్లె యని యాతఁడు. :-
"చ. తొగరుచి కన్ను దోయిఁ గడుఁ దోఁపగ గర్ణుఁడు భీమసేను పైఁ
దగరు ధరాధరంబువడిఁ దాఁకినభంగినిఁ దాఁకి నొచ్చిన
న్వగరుపుచున్ వెసం బరుగువాఱిన నచ్చటిరాజలోకము
ల్నగరు సుయోథనాజ్ఞ మది నాటుటఁజేసి ధరాతలేశ్వరా."
అనుడుఁ బెద్దన యేదీ? భాగవతంబునఁ జెప్పు మనుడు నాతఁ డిట్లనియె :-
"చ. వగరుపుమాత్రమే వరుఁడు వశ్యుఁడు గాఁడు సఖీసఖత్వ మె
న్న గరుడవాహనుండు మము నాఁ డటు డించుట లెల్ల యుద్ధవా
తగ రని కాక మోహపులతాతనులైన విడంగఁ జూతురే
తొగరుచి యోషధీశునకుఁ దోఁచునె యుమ్మలికంబు మాను నే."
అని చదివినయాతనియాశుధార కెంతయు నలరి రాయలకడ నాతని నెంతయు శ్లాఘించెను. రాయఁడు నాతనికి విషేషసన్మానంబు సేసి పుచ్చెను.
ఈపెద్దన పూర్తిచేసినపద్యంబు లనన్య భేదంబులు, ఒకానొక దినంబున రాయం డొక పెండేరంబు దెచ్చి యాస్థానంబునం దుంచి యాం
ధ్రమునందును సంస్కృతమందును గవిత్వము సమానముగఁ జెప్పఁ గలవారలు దీనిం గైకొనం దగుదు రనియె. దానికి సభలోనిపండితు లందఱు నాలోచించుచు నుండిరి. అంత నీయాంధ్రకవితాపితామహుఁడు లేచి నిలిచి యీక్రిందిపద్యముఁ జదివె దానికి సభ్యు లందఱును మెచ్చి యీ పెండేర మీతనికిఁ దగు ననిరి. నాఁటనుండియు నీతనికి "గవిగండ" యని బిరుదు గల్గినది. ఈతఁడు చెప్పినపద్యమును "ఆంధ్రకవితాపితామహునిసింహావ లోకనము" అని యందురు. అది యుత్పలమాలికా నృత్తమాలిక. ఎద్ది యనిన :-
"ఉ. పూఁతమెఱుంగులుం బొసఁగుపూఁపబెడంగులు సూపునట్టివా
కైతలు జగ్గునిగ్గు నెనగావలెఁ గమ్మన కమ్మనన్వ లెన్
రాతియుం బవల్ మఱపురాదనునాచెలియోర జంపుని
ద్దాతరితీపులంబలెను దారసిలన్వలె లోఁ దలంచినన్
బాతిగఁ బైకొనన్వలెను పైదలి కుత్తుకలోనిపల్లటీ
కూఁత లనన్వలెన్ సొగసుకోర్కెలు గావలె నాలకించినన్
చేతులకొద్ది కౌఁగిటను జేర్చినముద్దులచిన్ని పొన్ని మే
ల్మూఁతలచన్ను దోయివలె ముచ్చట గావలె విచ్చి చూచినం
డాతొడ నున్న మిన్నల మిటారపుముద్దులగుమ్మకమ్మనౌ
వా తెరదొండపంటివలె వాచవి గావలెఁ బంటనూఁదినన్
గాతరతమ్మిచూలిదొరకై జవటా డెడుగబ్బి గుబ్బ పె
న్మూఁతల నున్న కాయసరిఁ బొల్చెడికిన్నరమెట్టుబంతిసం
గాతపుసన్న తంతిబయకారపుకన్నడ గౌలవంతికా
సాతత తానతానలపసం దివుటాడెడిగోటమీటుబల్
మ్రోఁత లనన్వలెన్ వలపు మొల్లము గావలె నచ్చ తెన్గు లీ
రీతిని సంస్కృతంబు పచరించినపట్టున భారతీవధు
టీతపనీయగర్భనికటీభవదానసుపర్వసాహితీ
భౌతిక నాట్యగప్రకర భారతభారత సమ్యగప్రభా
శీతన గాత్మజాహృదయ శేఖరశీతమయూఖ రేఖికా
పాతనఖప్రపూరబహుభంగఘుమంఘుమఘుంఘుమార్భటీ
జాతకతాళయుగ్మలయ సంగవిడంబి విడంబి కామృదం
గాతత తేహిత త్తహితహాధిత గానసతానదింధిమి
వ్రాతలయానుగుణ్యపదహారికుహూద్వహహా రిశోభితా
నూతనఘల్ఘ లా చరణ నూ పురజాలఝరీ మరందసం
ఘాతవియద్ధునీ చక చక ద్వికచోత్పల సారసంగ్రహా
యాతకుమారగంధవహహారి సుగంధవిలాసయుక్తిమై
చేతము చల్ల చేయవలెఁ జిల్లనఁజల్లవలెన్ మనోహర
ద్యోతకగో స్తనీఫలమధుద్రవగోఘృత పాయసప్రసా
రాతి రసప్రసారరుచిరప్రతి గావలె సారెసారెకున్.
పాఠాంతరము.
ఉ. మా. పూఁతమెఱుంగులున్ పసరుపూఁపబెడంగులు చూపునట్టివా
కైఁతలు జగ్గునిగ్గు నెనగావలెఁ గమ్మునఁగమ్మనన్వలెన్
రాతిరియు న్బవ ల్మఱపురానిహొయల్చెలియారజంపుని
ద్దాతరితీపులు న్బలెను దారసిలన్వలె లోఁ దలంచినం
డాతొడ నున్న మిన్నలమిటారపు ముద్దులగుమ్మకమ్మ నౌ
వా తెఱదొండపంటివలె వా చవి గావలెఁ బంట నూఁదినన్
జేతులకొద్ది కౌఁగిటను జేర్చినకన్నియ చిన్నిపొన్ని మే
ల్మూఁతలచన్ను దోయివలె ముచ్చటకావలెఁ బట్టిచూచినం
బాఁతిగఁ బైకొన న్వలపుఁ బైదలికుత్తుకలోనిపల్లటీ
కూఁతలుమన్బలెన్ సొగసుకోర్కులు గావలె నాలకించినం
గాతలతమ్మిచూలి దొరకైవసపుంజవ రాలిసిబ్బెపు
న్మే తెలియుబ్బరంపు జిగినిబ్బరపుబ్బగుగబ్బిగుబ్బపొం
బూఁతలనున్న కాయసరి పోఁడిమికిన్నెర మెట్లబంతిసం
గాతపుసన్నతంతిబయవారపుకన్నడ, గౌళ, పంతు కా
సాతతతాన తానలపసందివుటాడెడు గోటమీటుబల్
మ్రోఁత లనన్వలెన్ హరువు మొల్లము గావలె నచ్చ తెన్గు లీ
రీతిగ సంస్కృతంబు పచరించినపట్టున భారతీవధూ
టీతపనీయగర్భవిక టీభవ దాననపర్వ సాహితీ
భౌతిక నాటకప్రకర భారతభారత సమ్మతప్రభా
శీతన గాత్మజాగిరిశశేఖరశీతమయూఖ రేఖికా
పాతసుధాప్రపూరబహుభంగ ఘుమంఘుమఘుంఘుమార్భటీ
జాతకతాళయుగ్మలయ సంగతి చుంచు విపంచికామృదం
గాతతతత్తతాధిహిత హాధిత దంధణుధాణుదింఢిమి
వ్రాతలయానుగుణ్య పదవారికుహూద్వహహారికింకిణీ
నూతనఘల్ఘ లాచరణ నూపురఝాళఝరీక రాబ్జసం
ఘాతవియుద్ధునీచక చకద్ద్వికచోత్పలసారసంగ్రహా
యాతకుమారగంధవహ హారిసుగంథ విలాసకృత్యమై
చేతము చల్లజేయవలె జిల్లున చల్లవలె న్మనోహర
ద్యోతకగోస్తనీ మధుమధుద్రవ గోఘృతపాయసప్రసా
రాతిరసప్రసారరుచిరప్రతి గావలె సారెసారెకున్."
అనునీపద్యంబుఁ జదివినపెద్దనకవిని రాజులు సభ్యులును నెంతయుఁ గొనియాడి యతనియశుధారం గీర్తించి యీయందెను ధరింప నతఁడే సమర్థుం డనిరి. అపుడు కృష్ణరాయం డాకవిగండ పెండేరముం గొని యాతనిపాదంబు పట్టికొని దానిం దొడిగెను. దానికి సభ్యులందఱును సంతసిల్లిరి. ఇట్లు గౌరవించినరాజుం గాంచి పెద్దన విశేషానందముతో నాతని నొగపద్యంబు చెప్పి దీవించెను. అదెట్లనిన :-
పంచపాది.
శా. క్షీరాంభోనిధియందు యోగసరణిం జిచ్ఛక్తిఁ బ్రాసించి త
ద్గోరాజత్కకుదస్థగోపవిలసద్గో రాజగోలోకతా
స్ఫా రాలోకనతేజగాత్రచలనస్వాంతాద్రిదంభోళికృ
త్సారజ్ఞానసనందనాదిమునిబృందాధిక్యసామర్థ్యవాః
పూరాకారత నిద్రఁ జెందుకరుణాంభో రాశి నిన్ బ్రోవుతన్.
ఈ పెద్దనకడ నొకభట్టు చిరకాలమువిధ్యాభ్యాసము సేయుచుండెను, ఈచిన్న వాఁడు విద్యకఱచుటయందు మిగుల శ్రద్ధాళుఁడై యుండువాఁడు కావున నీతనియెడఁ బెద్దనకు నెక్కుడుప్రేమ యుండి విద్యా మర్మముల నన్నిటిం గ్రమక్రమంబుగ బోధించెను. ఇట్లుండ నొకనాఁటి రేయిఁ బెద్దన పండియుండి యొకానొకవర్ణాంశం బూహించుచుండెను. అపు డీభట్టు గురుని పాదసేవ సేయుచునుండి స్వామీ ! మీ రూహించు వర్ణనకు బాధకంబు గలదు దాని నొంకొకవిధంబున నూహింపుఁ డని తద్విధం బెఱింగించె, దాని విని యత్యాశ్చర్యంబునఁ బెద్దన యిట్లుచింతించెను. అహహా ! నాకుం దోఁచనియీకఠినవర్ణనం బీతఁ డూహించుట చే వీనిమనోదార్ఢ్యంబు విశేషంబని తెలియుచున్నది, వీఁడు మత్సముం
డయ్యెను. కావున శుశ్రూషార్హుండు గాఁడు" అని వానిం జూచి "యోయీ ! యిఁక నాపాదములు ముట్టకుము; ఇంటికడనే యుండి పాఠములు చింతన సేయుచుండుము, రాజదర్శనార్థము నినుఁ దోడ్కొని పోయెదను" అని దానికిఁ దగు నుపాయ మన్వేషింపుచుఁ గొంత చింతించి పర్యాయంబున నాలోచింత మని నిశ్చయించి భట్టుం జూచి నేను లేకుండ రాజుకడకుఁ జనవల దని తెల్పి తా నిదురించెను. అంత భట్టు తనప్రజ్ఞావిశేషములు పెద్దనకే యధికముగఁ దోఁచుట తెలిసికొని మిక్కిలి సంతసించి రాజదర్శనమునకుఁ జనఁ దనలోఁ దా నిట్లు చింతించె. "పెద్దన నన్నుఁ దా లేనపుడు రాజుకడ కఱుగవల దనెను. దీనికిఁ గారణం బేమి. నాకు విశేషసన్మానము గల్గు ననియెంచి కానోవును, ఇట్టి వాని నమ్మినఁ గార్యం బేమి? కావున నే నిపుడు రాజుకడ కేఁగి మద్వృత్తాంతం బాతని కెఱింగించి వచ్చెద. ఉదయమైన నీతం డేదేనియంకిలి గావింపనోపును. అని యెంచి తత్క్షణంబ బయలు వెడలి నగరు చేరం జని తనవార్త రాజునకుఁ బంపిన నాతఁడు కవి వచ్చె నని విని సంతసించి యపుడు సమయం బొసంగిన నీభట్టు కట్టెదుటనిలిచి కైవారంబు సేసి "కుంజరయూథంబు దోమకుత్తుక సొచ్చెన్" అనునట్లు తా నంతవఱకుఁ బ్రసిద్ధి లేక పెద్దనగృహంబున నుంటి ననియు నాకెన్నఁడును నాతఁడు దేవరదర్శనలాభము గల్గున ట్లొనరించి యుండలే దనియు నింతియకాక తనకుఁ దెలియకుండ దర్శనంబునకుఁ బోవల దనియుఁ దెల్పిన నాతఁడు నిద్రించుతఱిఁ గనుమొఱఁగి వచ్చితినని యాతనివలనిభయం బభినయించుచునుండెను. అది విని రాజు కొంచె మాలోచించి పెద్దన యిట్లొనర్చునా యనుకొని యయినను సంగతి నరయవలయుఁ బెద్దన నిటకుఁ దోడ్కొని రమ్మని భృత్యులకుం దెల్పెను. వారును వేగంబున వచ్చి నిద్రబోవుచున్న పెద్దన్నను లేపి రాజాజ్ఞఁ దెలిపిన నాతఁ డట్టిసమయమునఁ బ్రభుఁడు రాఁబంచుటకుఁ గారణం బేమని యూహించి తనశిష్యుం బిలిచెను. వాఁ డట లేకుంటచే రాజు
కడ నెవ్వ రుండి రని భటులతో ముచ్చటింప వా రెవ్వఁడోయొకభట్టు న్నాఁ డని పల్కిరి. దానిచే వాఁడే తనశిష్యుఁ డనియును రాజు తన్ని మిత్తంబుగఁ దనకు వర్తమానము పంచె ననియు నిశ్చయించి రాజుకడ కరుదెంచి యెదుట నిలువంబడియె. అపుడు రా జాతనిం జూచి "కుంజరయూథంబు దోమకుత్తుకఁ జొచ్చెన్" అని సమస్య యిచ్చె. పెద్దన దాని విని యది భట్టుకవిసమస్యగ నూహించి యాతనిం దప్పక చూచి:=
"క. గంజాయి త్రాగి తురకల, సంజాతులఁ గూడి కల్లు చవి గన్నా వా,
లంజలకొడకా యేటికిఁ, గుంజరయూథంబు దోమకుత్తుక సొచ్చెన్.
అని రోషంబుతో ననిన పెద్దనం గని రాజు నవ్వి యిదినాసమస్య, నన్నుం జూచి సంపూర్ణము సేయు మనుడుఁ జిత్త మని యిట్లనియె :-
"క. రంజన చెడి పాండవు లరి, భంజనులై విరటుకొల్వుపాలైరి కటా
సంజయ ! విధి నేమందును, గుంజరయూథంబు దోమకుత్తుక సొచ్చెన్."
అని యిట్లు పూర్ణము సేసిన నాతనిసమయస్ఫురణమునకు రాయం డలరి ప్రొద్దాయె, శయనింపఁ బొండు. అని యాతని వీడ్కొలిపి భట్టుం జూచి దయతో నిట్లనియె, ఓయీ ! నీవు భయ మందకుము. నిన్నుఁ గంటికి ఱెప్పయుంబలె నాతనివలన హాని లేకుండ రక్షించెదను. ఇంటికిఁ బొ మ్మని యాతనిఁ బనిచి తాను నారాత్రి నిదురించి మఱునాఁడు రేపకడ లేచి యాస్థానమునకు వచ్చి నిండోలగంబుండి భట్టు ను రావించి సభ్యుల కాతనిం జూపి "యీతని మనయాస్థానపండితులలో నొకనిగ నియమించితిమి. కావున నీతనియెడఁగూడ నాస్థానపండితులకుం జూపుగౌరవమే చూపవలయు" ననియెను. దానికి వారందఱును సమ్మతించిరి.
భ ట్టిట్లు రాజసన్మానము గాంచి విఱ్ఱవీఁగి విద్వజ్జనమును లెక్కింపక యుండెనఁట. ఇట్లుండఁ గొంతకాలంబు సనె. అపు డీతఁడు రాజానుగ్రహము విశేషముగఁ దనయెడఁ గల్గిన ట్లందఱకుం జూప గోరి యొకా
నొకదినంబున ఱేనిం బ్రార్థించి తనయిష్టానుసారముగా నొకకార్యము నడపుఁడనియె. దానికి రాజు సమ్మతించి యేమికార్య మనుడు నిట్లనియె. "చమత్కా రార్థముగమనయాస్థానములోని కొందఱుకవులను మీయాజ్ఞ యని తెల్పి సభకు రాఁగూడ దని నుడివెదను, ఇదియ నాయభీష్టమనియె, దానికి రాయఁడును సమ్మతించెను అపుడు భట్టు సభలో నిలిచి కొందఱి నామములు జదివి వీరిని ప్రభుఁ డాస్థానమునకు మఱల రా నుత్తరం బిచ్చువఱకు వీర లిచటికి రావల దని తెల్పి యిదియు రాజాజ్ఞయే యనియె. రాజాజ్ఞయనుటంజేసి యలంఘనీయము గావున వల్లె యని వారందఱును నాస్థానంబు వాసి చనిరి. వారిలోఁ బెద్దన మొదలగుకవు లుండిరి. వీరందఱును గారణం బేమియు లేక రా జిట్లాజ్ఞ యొసంగుటకుఁ జింతించి యిది భట్టుచేత నైనదే కాని యింకొకటి కాదని నిశ్చయించి ముక్కుతిమ్మనయింటికిం జని యచ్చోఁ గూర్చుండి భట్టుచెట్టలు దలంచుచుండిరి. ఇట్లుండఁ గొంతతడవునకు భ ట్టందలం బెక్కి యావీథింజనుచుండె. తిమ్మనవాకిట నున్నకవికోటి యీతనికి దృష్టిగోచరంబయ్యె. వారింజూచి నిజప్రభావము వర్ణించికొని మాధవుం డనుతనభటునిం బిలిచి యిట్లనియె :-
"వాకిటి కావలితిమ్మన, వాకిటకవికోటి మాధవా కిటికోటే"
అని నగిన విని పెద్దన కృద్ధుండై యద్దిరే భ ట్టెట్టికాఱు లఱచుచున్నాఁడు ! చూడుఁడు ? వీనికండక్రొవ్వు. మాటలో నైన వీనికి మనము చాల మని తలంచుచున్నాఁడు. తగునుత్తరం బిచ్చెదంగాక యని లేచి యెలుఁగెత్తి యాతని నుద్దేశించి :-
"క. ప్రాకృతసంస్కృతఘుర్ఘుర, మూకీకృతకుకవితుంగముస్తాతతికిన్
వాకిటికావలితిమ్మన, వాకిటికవికోటి మాధవా కిటికోటే."
అనుడుఁ బెద్దన గర్జారవమున కులికి మాఱు పలుక నోరాడకున్నభట్టు తనత్రోవం జని మఱునాఁ డావృత్తాంత మంతయు రాజునకుం
దెల్పె. దాని విని ధర్మము దప్పినమనకు వారా భయముపడువారు ? పెద్దల నూరక నొప్పించుట మహాపరాధము. అని యూహించె.
ఒకనాఁడు కృష్ణరాయఁడు గజారోహణముఁ జేసి వాహ్యాళి వెడల నీ పెద్దనకవి పైనుండి వచ్చుచు నొకసందుమళుపుఁ దిరుగునపుడు రాజును మిక్కిలి సమీపమునఁ జూచి భయవినయములు చూపుచు నిలువంబడినఁ గృష్ణరాయఁడు తనలోపమునకు క్షమాపణముఁ జెప్పుట కదియ సమయ మని యెంచి పెద్దనకవిని దన యేనుఁగుపై గౌరవముగా నెక్కించుకొని లోకములోనివర్తమానము లెట్లున్నవి? అని అడుగుడుఁ బెద్దన యాతని కిట్లనియె :-
మ. గవనుల్ బల్లిదమయ్యె ఢిల్లికిని మక్కాకోట మేటయ్యె నీ
భువనం బెల్ల నదల్చి పుచ్చె ననఁగాఁ బోలేరు సందేరులన్
దవసం బెక్కె బెడఁదకోటపురకాంతాగర్భనిర్భేదన
శ్రవణంబయ్యె భవత్ప్రతాపజయవార్తల్ కృష్ణరాయాధిపా.
అని పెద్దన చదువఁగా రాయలు మిగుల సంతసించి యతనికిఁ దనయాభరణం బొక్కదాని నిచ్చి యనంతర మతనిఁ దొల్లిటికంటె విశేషముగ మన్నించుచుండెను. ఈవృత్తాంతమునె యీ పెద్దన కృష్ణరాయనిర్యాణానంతరము చెప్పిన.
"ఎదురైనచోఁ దనమదకరీంద్రము నిల్పి కేలూఁతయొసఁగి జేసి యెక్కించుకొనియె."
అనుపద్యములో సూచించెను.
ఇట్లుగా విద్యావినోదములు పెక్కులు గావించి కృష్ణరాయఁడు స్వర్గమునకుం జనినయనంతర మీరాయలసంస్థానములోఁ గల్గినతొందర నింకొకచోఁ జెప్పియే యున్నరము. అట్టిసమయమునఁ బెద్దన శత్రు రాజులపై ననేకపద్యంబులం జెప్పె ననియు నట్టిపద్యములవలనఁ గొన్నితొందరలు నివారితము లయ్యె ననియును గలదు. ఆపద్యములలోఁ గొన్ని మన కిపుడు సంప్రాప్తము లైనవి, వానికిఁ గలకథను వానిని వివరించెదను. ఎ......... కృష్ణరాయలు గతించినపిమ్మటఁ గటకాధిపుఁ డగుగజపతి విజయనగరము (ఆనేగొందిపై) దండెత్తి వచ్చి తత్పట్టణసమీపములో విడిసెను. దానికిఁ బ్రజలందఱును మిగుల భయముపడఁ దొడగిరి. అది చూచి పెద్దనామాత్యుఁడు గజపతికడకుం బోయి యీ క్రిందిపద్యమును జదివె నెట్లన్నను :-
సీ. రాయరాహుతుగండ రాచయేనుఁగు వచ్చి యారట్లకోట కోరాడునాఁడు,
సమ్మెటనరపాలసార్వభౌముఁడు కంచుతలుపులఁ గరుల డీకొలుపునాఁడు,
సెలగోలసింహంబు చేరి ధిక్కృతిఁ జేసి సింహాద్రిజయశిలఁ జేర్చునాఁడు,
గడికోటమారాజు గండపెండేరంబుకూతుఁ నొడంబడఁ గూర్చు నాఁడు.
గీ. నొడ లెఱుంగవొ చచ్చితో యూర లేవొ, చీరఁ జాలక తొలఁగితో జీర్ణ మైతో,
కనడరాజ్యంబు చొచ్చితే గజపతీంద్ర, తెఱచినిలు కుక్కసొచ్చిన తెఱఁగుగాను.
అనునీపద్యమును విని గజపతి సిగ్గుపడి తాను గారణాంతరమున వచ్చితిం గాని వేఱు కా దని చెప్పి తనదేశమునకుఁ మఱలె నని ప్రతీతి గలదు.
కృష్ణరాయునియల్లుం డగురామరాజు రాజ్యము చేయుతఱి నొక వెలయాలు మైసూరుదేశమునుండి వచ్చినది. దానివిద్యావిశేషములకు రామరా జెంతయు నలరి దాని నచ్చోఁ దనకుగా నిల్పుటకు యత్నించెను. ఆవృత్తాంతము కృష్ణరాయునికూఁతురు విని యట్టిపని నివారింపఁ బెద్దనకు వర్తమానము పంపినది. అతఁడును దగుసమయముం జూచుచుండెను, ఇట్లుండ రామరా జొకదినమున సభ చేయించి యా వెలయాలివిద్యం బరీక్షింప నిర్ణయించి పెద్దన మొదలగు పెద్దల రావించెను. అట్టివిద్వత్సభలో నాగణికాశిఖామణి గానంబునం గల తనప్రావీణ్యముం జూపి సభికులమనంబు నలరించినది.
దానికి రామరా జెంతయు సంతసించి పెద్దనదిక్కు మొగంబై జాణగానచమత్క్రియల వర్ణించి సభను నానందింపఁజేయు మనుడు బెద్దన సకరుణంబుగా నిట్లనియె. "ఓరాజేంద్రా నేను గృష్ణరాయఁడు
గతించినప్పుడే కవితాసంన్యాసము తీసికొని యుండితిని. కావుననే వర్ణ నావిషయమగు కవిత్వము చెప్పను. ఒకవేళ జెప్పుదునేని యది భగవత్పరముగా నుండవలయును. ఇట్లు నన్ను వెలయాలిపైఁ గవిత్వము చెప్ప నుత్సహింపఁ జేయుట న్యాయము గాదు, మఱియొకవర్ణనమైనం గాదు. వెలయాలిని వర్ణించుట మఱియును హైన్యము గదా. దానిజీవన మెట్టిదో వివరించెదను. చిత్తగింపుఁడు :-
చ. పడిగము తమ్మలం బుమియు పల్లవకోటికి నోరు వేణి యం
గడిసవరంబు సంతసొరకాయ లురోజము లిచ్చ ఱచ్చసా,
వడి యొడ లూరువుల్ గవనివాతియనంటులు మోని యెడ్డిగి
జ్జడి వెలయాలిజీవనము జీవనమే యది యెంచి చూచినన్.
అని యిట్లు వెలయాలిదోషములు సమయోచితముగ నుడివిన రాజునకు దానిపై నుండుమోహము తగ్గింపవలయు నని తోఁచినది. పిమ్మట దాని నటు నిల్పుప్రయత్నము మాని సబహుమానముగఁ గారవించి సాఁగంబనిచెను.
కృష్ణరాయఁడు గతించినవెనుకఁ బెద్దన తనలోపము పాటించి యీక్రిందిపద్యము వ్రాసె. దీనిచే నీయిర్వురకుఁ గలమైత్త్రియుఁ గృష్ణరాయలగుణాతిశయమును గోచరమగును అదెట్లన్నను :-
సీ. ఎదురైనచోఁ దనమకరీంద్రము నిల్పి, కేలూఁత యొసఁగి యెక్కించుకొనియె
మనుచరిత్రం బందికొని పురం బేఁగింపఁ, బల్లకి తాఁ జేతఁ బట్టి యెత్తెఁ
గోకట గ్రామాద్య నేకాగ్రహారము, ల్చాలసీమల నిచ్చి సంతరించె
బిరుదైనకవిగండ పెండేరమున కీవ, తగు దని నాదుపాదమునఁ దొడిగె.
గీ. నాంధ్రకవితాపితామహ యల్లసాని, పెద్దకవిచంద్ర యని నన్నుఁ బిలచు నట్టి
కృష్ణరాయలతోడ ముగించుకొనక, వసుధఁ బ్రతికితి జీవచ్ఛవం బనంగ.
అని యిట్లు విలపించుచుఁ బెద్దన కొలఁది కాలములోపలనే మృతుండయ్యెను. అనంతరము భట్టుమూర్తి పెద్దనదారాపుత్త్రాదులం బరామర్శింప నతనియింటికిం జని వారిం గాంచి దైవయోగంబునకు దుఃఖించిన వినియోగం బేమి యున్న దని పెద్దనకడఁ దాఁ జదివినవిశ్వా
సముతో నిట్లనియె. "అయ్యయ్యో ! నా కీకుఱ్ఱలం జూచిన జాలి యయ్యెడిని. పెద్దన యింకను గొంతకాల ముండిన వీరికిం జదువుసంధ్యల నేర్పి తనయంతవారిం జేయును గదా ! ఇపుడు వీరికి విద్య యలవడు టెట్లు తండ్రివిద్వాంసుఁ డైనఁగొడుకులును నట్టివారగుట యెచ్చటనో గద అనుభట్టుమూర్తి పల్కులాలించి పెద్దనకుటుంబిని తనపుత్త్రుల నతఁడధిక్షేపించుటగ నెంచి కనలి యిట్లనియె. నాపుత్త్రులు తండ్రిఁబోలెవిశేషముగఁ బ్రజ్ఞావంతులు గాకున్న శ్లేషకవనము చెప్పికొని యైనను బొట్టపోసికొనెడువా రగుదురు పొమ్ము, వీరింగూర్చి నీవు వగవకుము. అనుడు భట్టుమూర్తి యాపెపల్కుల నాలించి తా శ్లేషకవి యవుటయుఁ దాఁ పెద్దనకు మిగుల నిష్టుండు గాకుండుటయుఁ దలఁచి యామె యట్ల నె నని యూహించి యనంతరము నిజనివాసమునకుఁ జనియెను.
ఈ తిమ్మనచారిత్రము దెల్పుటకు మనకు రెండుగ్రంథములు గలవు. అం దొకటి పారిజాతాపహరణము. రెండవది యాంధ్రప్రబోధ చంద్రోదయము - అందు మొదటిదానిలో :-
"సీ. కౌశికగోత్రవిఖ్యాతుఁ డాపస్తంబ, సూత్రుఁ డాఱ్వేలపవిత్రకులుఁడు
నందిసింగామాత్యునకును దిమ్మాంబకుఁ, దనయుండు సకలవిద్యావివేక
చతురుఁడు మలయమారుతకవీంద్రునకు మే, నల్లుండు కృష్ణరాయక్షితీశ
కరుణాసమాలబ్ధఘనచతురంతయా, నమహాగ్రహారసన్మానయుతుఁడు
గీ. తిమ్మనార్యుండుశివపరాధీనమతి య, ఘోరశివగురుశిష్యుండు పారిజాత
హరణ మనుకావ్య మొనరించె నాంధ్రభాష, నాదివాకరతారాసుధాకరముగ,
- ↑ ముక్కుతిమ్మన