కవి జీవితములు/అయ్యలరాజు రామభద్రయ్య

వికీసోర్స్ నుండి


వాఁ డనియును, "రామలింగభాస్కరుఁ" డని యుండినచో భట్రాజులచే నుతియింపఁబడు "రాయనిభాస్కరునిమనుమఁ" డనియును గ్రహింపవలయును. ఇట్టియేర్పాటులు చేసికొనిననాఁడు వీరివృత్తాంతములు కల గలపులే వీరికాలనిర్ణయమును జేయనీయక యెట్టివారి కైనను దిగ్భ్రమనుఁ బుట్టించును. కావున మెలఁకువతో దీనినిగ్రహింపవలయును.

రామాభ్యుదయకావ్యము.

ఇదివఱలో రామాయణము నాంధ్రీకరించినకవులవృత్తాంతమును జెప్పియున్నాము. ఇపుడు మనము రామాయణనామముతో నొప్పు గ్రంథములు రచియించినకవులను జెప్పవలసియున్నది. కాని యట్టినామములు గలపుస్తకము లనంతములై యున్నవి. కొందఱు తమగ్రంథములను బ్రబంధములుగా రచియించిరి. మఱికొందఱు కేవలసంగ్రహములుగా రచియించిరి. ఇంకొకకొందఱు శతకములుగా రచియించిరి. అవి యన్నియు రామాయణనామముతో నొప్పక యున్నను రామకథ కలవిగా నున్నవి. కావున నే నట్టిగ్రంథములు వదలి పురాణములతో పాటుగ గణనకు వచ్చిన వాల్మీకి రామాయణమును బ్రబంధములతో పాటుగ గణనకు వచ్చినరామాభ్యుదయ మనుగ్రంథములఁగూర్చియే యిందుఁ బ్రశంసింప నై యున్నాను. అం దిదివఱకుఁ బురాణముగా నెన్న బడిన వాల్మీకి రామాయణము నాంధ్రీకరించిన కవుల గూర్చి వ్రాసియున్నాను గావున నే నిపుడు రామాభ్యుదయగ్రంథకర్త యగునయ్యలరాజు రామభద్రయ్య చారిత్రముంగూర్చి వ్రాసెదను :-

_________

7.

అయ్యలరాజు రామభద్రయ్య.

ఇతఁ డొంటిమిట్ట (ఏకశిలానగర) నివాసి. ఒంటిమిట్టరఘువీరశతకము చిన్న తనములో రచియించెను. ఇఁతడు నిరుపేద. బహుకుటుంబ వంతుఁడు. ఏడెనమండ్రుపిల్లలు గలవాఁడు. ఇట్టిహేతువుచేత నితనికిఁ


బిల్లలరామభద్రయ్య యనుపేరును గలదు. ఇతఁడు కుటుంబభరణము సేయలేక యొకానొకదినంబునఁ జింతాభరాక్రాంతచిత్తుండై పల్లెల నుంటకంటె నడవియం దుంట యే మేలని చెప్పినపెద్దలవాక్యము ననుసరించి దారాపుత్రాదులను వదలి యరణ్యమున ముని నై యుందుంగాక యని నిశ్చయించుకొని తత్సన్నాహము సేయుచుండెను. దీనినంతయుం జూచి యతనిమిత్రుం డొకరుఁడు వచ్చి యోయీ యిట్లు సేయ న్యాయమా? ఇట్టియుద్యోగము నిం కెన్నడును నూహింపకుము. విద్వాంసుఁ డైనవాఁడు కష్టసుఖములకు ఖేదమోదముల నందకుండవలయును. నీ విచ్చో నుండి కుటుంబసంరక్షణము సేయ లేకున్నచో నేదియైననొక పట్టణమునకుఁ జని యచ్చో నెవరినైన నాశ్రయించి కాలము గడపు మనుడు నాతఁడు ధైర్యముఁ దెచ్చికొని యాదినమునందే తనకుటుంబ సహితముగ బీజనగరు (విజయనగరము) నకుఁ బ్రయాణము నిశ్చయించుకొని శుభముహూర్తమున బయలు వెడలెను. అనంతరము కతిపయదిసములకు నా యూరు సమీపించెను. అపు డొకపెద్దవర్ష మాకస్మికముగ సంప్రాప్త మయ్యెను. మార్గమధ్యమున నీకవి సకుటుంబముగ వానం దడసి యచ్చో నున్న యొక దేవళము చేరెను. అందే కొందఱు జను లావఱకు వచ్చి యుండిరి. వా రందఱును నొకపద్య మూహించుచు నెవరను రచియింపఁజాలక "నీవు మరల యోజింపు మని తమలోఁ దమరు చెప్పికొనుచుండిరి. రామభద్రయ్య వారిం" జూచి "యోబాలులారా ! యేమి వ్రాయుచున్నా" రని యడిగెను. అపుడు వారిలోఁ బెద్దవాఁ డిట్లనియె. "స్వామీ ! మాగురువులవా రొక పద్యముచే విరహిణీ మూర్ఛానంతరకార్యములను వర్ణింపుఁ డనియాజ్ఞ యిచ్చిరి. దానిం జేయలేక చిక్కులఁ బడుచున్నార" మనుడు నాతఁడు నా కిపు డేమైన నుపాయము సెప్పి చలి లేకుండఁ జేసెద రేని నే నీపద్యమును రచియించెద ననియెను. వారలు దానికి సమ్మతించి చుట్టుపట్ల నున్న యాకులం దెచ్చి చలిమట వేసి తమయుత్తరీయములు వానికిం గట్ట నిచ్చిరి. అపు డాకవి మిక్కిలి యానందము నొంది చలి కాఁచికొని ఘంటము నాకుం గొని యీక్రిందిపద్యము వ్రాసెను.

సీ. మోహాపదేశతమోముద్రితము లైన, కనుదమ్ముల హిమాంబు లునుపరాదు
   శ్రమబిందుతారకాగమఖిన్నకుచకోక, ములఁ జంద్రనామంబుఁ దలఁప రాదు
   శీర్యదాశావృంతశిథిలి తాసులతాఁత, మసియాడ వీవన ల్విసరరాదు
   పటుతాపపుటపాకపరిహీణతను హేమ, మింకఁ బల్లవపుటా ర్చిడఁగ రాదు.

గీ. లలన కానంగకీలికీలాకలాప, సంతతాలీఢహృదయపాత్రాంతరాళ
   పూరితస్నేహపూరంబు పొంగి పొరలఁ, జల్లనిపటీరసలిలంబుఁ జల్లరాదు.

అని వ్రాసిన పద్యముం గొని సంతసంబునఁ జని యావిద్యార్థులు తమగురుం డగుభట్టురామరాజభూషణకవికిం జూపిరి. అతఁడు పద్య మంతయుం జదివి దాని చమత్కృతికి మిగుల సంతసించి దాని పదశయ్యావిశేషములచే నది తనశిష్యకృతము కా దని నిశ్చయించి "దీనిని రచించినవా రెవ్వరో యథార్థముగఁ దెలుపుఁ డని యడిగెను." దాని విని శిష్యులు గడచినవృత్తాంత మంతయుఁ దెల్పిరి.

రామభద్రుని జూడ రామరాజభూషణుఁడు వచ్చుట.

ఆవృత్తాంతము విని రామరాజభూషణుఁ డాపద్యము చెప్పిన వాఁడు గొప్పపండితుఁడని తెలిసి శిష్యులు ముందు నడువ నాదేవళమునకుం జనియెను. ఆకవియును "వీరందఱును దమగురునిం దోడ్తెచ్చు చున్నా రేమిమునిఁగెనో" యని భయంపడఁ దొడఁగెను. రామరాజభూషణుఁడును సమీపించి గాఢాలింగనము సేసికొని యతనివృత్తాంత మంతయుఁ దెలిసికొని తనతోడఁ జనుదెమ్మని తోడ్కొనిచని యొక్కచో విడియించి రెండుమూఁడు దినములు స్వయంపాకములు పంచి రాజుకడకుం జని యతని వృత్తాంతము సెప్పి దర్శనము సేయించి యాస్థానవిద్వాంసునిగ నియమించెను. అనంతర మీపద్యము నాకవియందలి తనగౌరవమును సూచించుటకుఁ గాలాంతరమునఁ దనవసుచరిత్రంబున నుంచె నని వాడుక గలదు.

రామభద్రునిశయ్యాదికము.

ఈకవియును మృదుతరకవనంబునకే ప్రసిద్ధుఁడు. కల్పనాంశమునఁ గూడ మిగుల సమర్థుఁడు. పెద్దనవలె నితఁడును శ్లేష ప్రధానము గాకుండఁ గవిత్వము సెప్పును. ఇతనికవితసరసత పెద్దనరామరాజభూషణా


దులవానింబలె విశేషముగ మనపండితులను సంతసింపఁ జేయును. ఇతని చాటుధారాపద్యములు మన కిపు డేమియు సంప్రాప్తములు కావయ్యెను. కావున నీతనిచే రచియింపఁబడిన రామాభ్యుదయములోని కొన్నిపద్యము లిట వివరింతము :-

స్త్ర వర్ణనము.

"గీ. చొక్కపుఁబసిండినక్కుల చెక్కు చెక్కు,లక్కలికికొప్పునీలాంబుముక్కుముక్కు
    కనకగంథఫలిస్మారకంబుఁకంబు, కలితరేఖావిలాసమంగళము గళము."

కౌసల్య రామునిఁగూర్చి విలపించుట.

సీ. కానక కన్న సంతానమ్ము గావునఁ, గానక కన్న సంతాన మయ్యె,
   నరయ గోత్రనిధానమై తోఁచుఁ గావున, నరయ గోత్రనిధాన మయ్యె నేఁడు
   ద్విజకులాదరణవర్ధిష్ణుండు గావున, ద్విజకులాదరణవర్ధిష్ణుఁ డయ్యె
   వివిధాగమాంతసంవేద్యుండు గావున, వివిధాగమాంతసంవేద్యుఁ డయ్యెఁ

గీ. గటకటా దాశరథి సముత్కటకరీంద్ర, కటకలితదానధారార్ద్రకటకమార్గ
   గామి యెట్లు చరించు నుత్కటకరీంద్ర, కటకలితదానధారార్ద్రకటకతతుల.

భట్టుమూర్తివిరోధకారణము.

ఈకవి, రాయలసభలో మిగులఁ బ్రబలుచుండుటఁ గని యోరువలేక భట్టుమూర్తి యీతనియెడ వైరము సాధించు చుండేను. ఇతఁడు నాతన లక్ష్యము లేకయే మెలంగుచుండెను. ఇట్లుండ నొకనాఁడు భట్టుమూర్తియెడం గరుణించి రాయఁ డాతనికవిత్వమును గొనియాడి యర్ధసింహాసనమునఁ గూర్చుండఁ బెట్టికొనియెను. అట్టి రాయనికృత్యము సభాసదులకు మిగులఁ గష్టముగఁ గాంపించెను. అపుడు భట్టుమూర్తి రామభద్రకవిం జూచి నగిన నాతఁడు కోపించి యీక్రిందిపద్యమును వ్రాసి సభానంతరమున సింహాసనమునకుం గ్రుచ్చి చనియెను. అది యెట్లనఁగా :-

ఉ. [1]పండితు లైనవారలు సభాస్థలి నుండఁగ నల్పుఁ డొక్కఁ డు
     ద్దండతఁ బీఠ మెక్కిన బుధప్రకరంబుల కేమి యెగ్గగున్
     కొండకక్రోఁతి చెట్టుకొనకొమ్మకు నెక్కినఁ గ్రింది మత్తవే
     దండమహోగ్రసింహములు తాలిమిఁనుండవె రాజచంద్రమా.


అనంతరము దీనిఁ జదివికొని యాతఁడు లజ్జించి యూరకుండెను. కాని రామభద్రునియెడ నెడతెగనివైరము గల్గియుండెను. ఇట్లుండఁ గొంతకాలము జరిగినది.

భట్టుమూర్తిశపథము.

అపు డొకానొకదినమునఁ గృష్ణరాయసింహాసనాసీనుం డగు వేంకటాద్రిసమీపమున నీయిరువురకు మఱలఁ గలహము విద్యావిషయమున సంభవించినది. అపుడు భట్టుమూర్తి రామభద్రుని జూచి "నిర్దోషంబుగ నీ వొకప్రబంధము సేసి తెమ్ము. దానిలో దోషము నేఁ జూపెదను. అటు గాకున్న నేఁ జేసి తెచ్చెదను. దానిలోన దోషమును జూపెదవేని నేను నీచెప్పినశిక్షకుఁ బాత్రుండ నయ్యెదను. నీ దానిలోఁ దప్పేఁ జూపించిన నీశిరంబున నాపాదంబు ధరించెదే?" అనుడుఁ గృద్ధుండై రామభద్రుఁడు వీని పోతర మడంచుట మంచిదని యి ట్లనియె. "ఓయీ ! నేను గ్రంథమును రచించి తెచ్చెదను. దానిలో దోషమును జూపలేకున్నచో నాతన్ను నందెదే" అనుడు వల్లె యనియె. అపుడు రాజుం జూచి భట్టుమూర్తి యితఁడు గ్రంథమును రచియించుటకు నాఱుమాసములు వ్యవధి యిచ్చితిని. నాఁటికిఁ దేకున్నచో నీతని కిదియ శిక్ష యనియెను. రామభద్రుఁడు పిమ్మట నిజనివాసమునకుఁ జనియెను. భట్టుమూర్తి యితని గ్రంథవృత్తాంత మరయుటకై చారుల నియమించెను. రామభద్రుఁ డవమానము సంప్రాప్తం బవు నని బెంగటిల్లి యేకార్యము చేయుటకును జే యాడక తనయిష్ట దేవుం డగురామభద్రుని ధ్యానింపుచు నూరకుండెను. ఇట్లుండ నేకదినావశిష్టంబుగ నాఱుమాసంబులును గడచినవి. ఆదినమున రామభద్రుఁ డేమియుఁ జేయక ప్రాణత్యాగము సేయ నిశ్చయించి తనసేవకుఁ డగు నొక బాలునకుఁ గొంతసొమ్మిచ్చి వననాభిఁ దెమ్మని పనిచె. ఇట్లుండ నొకచిత్రవృత్తాంతము జరిగినదఁట. దానికి మన మద్భుతపడ నవసరము లేదు. గొప్పకవులును రాజులును భగవత్సాక్షాత్కారము గల్గియుందు రనియు నట్టిభగవత్సహాయముచేతనే యనన్యసాధ్య


ము లైనపనులు వారు నెరవేర్చెద రనియు మనదేశములో నుండుపండితపామరులస్థిరమైనయభిప్రాయము. కావున నిచట భగవంతుఁడు స్వయముగ వచ్చి కార్యము చేసె నని చెప్పిన హిందువులకు నద్భుతముగ నుండదు. అట్టివిధం బగునొకచిత్రకథ మే మిపుడు వివరింపఁ బోవుచున్నారము :-

రామభద్రుఁడు చావ యత్నించుట.

రామభద్రుఁడు చావ నిశ్చయించి సేవకుం బిలిచి వననాభిని దెమ్మనఁగా నావృత్తాంతం బాయనియిష్టదైవం బగురామభద్రుఁ డెఱింగి భక్తరక్షణార్థంబుగ నొకమనుజునివేషము దాల్చి నాభి దెచ్చుటకుఁ జనిన వానిని దాఁచి రామభద్రుని కడ కరుదెంచి "స్వామీ ! తమసేవకుఁ డేడి?" యని యడిగెను. అతఁ డేదియేని పనికై వాని నంగడికిఁ బంపితి ననియెను, అపు డామాయకాఁడు భృత్యునితల్లికి జాడ్యము వచ్చెననియు లోకాంతరగమనమునకై సిద్ధమై యున్న దనియుం దెల్పి వానిం ద్వరగాఁ జూపు మనియెను మంచిది కూర్చుండు మని రామభద్రుఁడు వానిని వెదకుచు నూరంతయుఁ దిరిగి తిరిగి వేసారి సాయంకాల మింటికిఁ జనుదెంచి "యోయీ ! నా కాచావుకంటె నీ చా వెక్కుడుగ నున్నది. వాఁ డెచ్చోటను గాన్పించఁ డయ్యె. ఏమి యుపాయము" అనుడు నామాయలవాఁడు "సామీ ! యాచావంటివెద్ది నాకు దానిం దెల్పు" డని నంప్రశ్నంబు చేసెను. దాని కతఁ డేమియుఁజెప్పక యూరకుండెను. వాఁ డాప్రశ్నమునే మఱలమఱల నడుగ నారభించె. తుదకు రామభద్రుఁడు వేసారి వృత్తాంత మంతయుం దెల్పెను. దాని విని "స్వామీ ! యిట్టిపనికి మీ రింతగ వగవనేల ? నేఁటిరాత్రిలోపల నే నాపని నెఱవేర్చెదను. భయంపడకు" మని యిట్లనియె. "స్వామీ ! యొకగది నలికి మ్రుగ్గులు వెట్టి ధూపదీపంబు లిచ్చి వ్రాఁతకు వలయుసామగ్రి సిద్ధము సేయుఁడు. సూర్యోదయమున కేను గ్రంథము వ్రాసి యిచ్చెద" ననుడు, రామభద్రుఁడు భగవదనుగ్రహము తన యం దిట్లు ప్రసరించుచున్న దని యెంచి యాచిన్న వానివాక్యానుసారం


బుగ గది నలంకరించెను. అతఁడును గదిం బ్రవేశించి యష్టముఖగండ భేరుండం బై యెనిమిది గంటంబులఁ బూని యొక్క పెట్టున నెనిమిది యా శ్వాసముల గ్రంథం బగురామాభ్యుదయ మనుదానిని రచియింప నారభించెనఁట. లోపల గంటములచప్పు డధికం బవుట విని రామభద్రుఁడు దర్భశయ్య వదలి లేచి వచ్చి తలుపుకంతనుండి లోనివృత్తాంతము చూచుచో దేహము పులకరించెను. ఇట్లు స్వామి దివ్య తేజోమూర్తిని దర్శించి తన మనంబులో నతనిని స్తుతించి మరల పవళించెను. అనంతరము కొంతవడికి స్వామి వెలుపలికి వచ్చి రామభద్రునిం బిలిచి "యోరీ దీనిం గొని రాజసభం జదువుము. నీకుఁ గారణాంతరముచే నవమానము వచ్చినట్లు గాన్పించి పిమ్మట మామాహాత్మ్యంబున నది నివారితం బగును. ధైర్యమున నుండు" మనియె. రామభద్రుఁడు మహాప్రసాద మని స్తుతి యొనరింప నాతఁ డపు డదృశ్యుఁ డయ్యెను. మఱునాఁడు రాజసభకు గ్రంథమును గొనివచ్చెద నని వర్తమానము బంపెను. ఇట భట్టుమూర్తి యానాఁటిరేయి రామభద్రునకవమానము గల్గించునట్లు ప్రసాదింపు మని తనయిష్ట దేవత యగునాంజనేయు నుపాసించు చుండెను. మఱునాఁడు సూర్యోదయమున రాజు సభదీర్చి కూర్చుండి యుండి విరోధు లగునీయిర్వురుకవులకును వర్తమానము పనిచెను. అట్టివర్తమానము తెలిసి యాయిరువురును నాస్థానమునకు వచ్చిరి. రామభద్రుఁడు తనగ్రంథమును చక్కఁగఁ జదువ నారంభించెను. భట్టుమూర్తి తదేకనిష్ఠచే యోచించుచుఁ ద ప్పెచ్చోనైన వచ్చునా ? రామభద్రు నవమానింతునా ? యని కూర్చుండెను. ఇట్లుండ రామభద్రుఁడు గొంతతడవునకు నీక్రిందిపద్యమునుఁ జదివెను అది యెద్దియనిన :-

"సీ. సింహనఖాంకుర చ్ఛిన్న వారణకుంభ, జనితముక్తాఫలశర్కరిలము
    సమదనూకర పరస్పరభీకరాఘాత, శిథిలదంష్ట్రాచూర్ణ సిక తిలంబు
    గంథసింధురపటు ఘటితసహస్రవ, ద్బంధురదనాంబు పంకిలంబు
    దవగంథవహబంధు దహ్యమానా నేక, శాశికాగురుధూమగంధిలంబు

తే. పృథులషడ్జస్వనోదీర్ణ భిల్ల పల్ల, వాధరాగీతికాకర్ణ నాతిభీతి
   పరవశాత్మపటీర కోటరకుటీర, లీనఫణి యగునక్కాన గాననయ్యె."

దీని విని భట్టుమూర్తి కెవ్వునఁ గేక వేసి దొరికెరా బాపఁడు అని తలంచి యచ్చో నాఁగు మాఁగు మని పల్కెను. దానికి సభ గడగడ వడంకినది. రామభద్రుఁడును విన్నఁబోయి తనయిష్టదై వంబునకు మ్రొక్కి యచ్చో నూరకుండెను. అపుడు భట్టుమూర్తి లేచియిదే పాదంబు నీశిరస్సున ధరియింపు మనియెను. అపుడు సభలో హాహా కారంబులు సెలఁగినవి. రామభద్రుఁడు మెల్లన నాతని కిట్లనియె. "నా పద్యములోనిదోషము చూపి పిమ్మట నీయిష్టానుసారంబుగ నడుపుము" అనుడు భట్టుమూర్తి "యోయీ ! యిందు వీణానాదము వినుటం జేసి సర్పములు భయము నొంది తొఱ్ఱలం దూఱె నని చెప్పఁబడి యున్నది. ఎచ్చోనైన వీణాగానంబు విని సర్పంబు లుత్సాహంబుతో వచ్చు నని యున్నది గాని దాని విని భయపడి దాఁగె నని చెప్పఁబడి యుండలేదు. కావున నీ యీకల్పన దోషసహితము. కవిసమయసిద్ధము గాదు. ఇఁక నాపాదము శిరమున ధరియింపుము." అనుడు రామభద్రుఁడు భట్టుమూర్తి తనకల్పనకుం జెప్పినదోషం బనుభ్రమ నెఱింగి వీనికి సభలో నవమానంబు నొందుకాలంబు సంప్రాప్తం బయ్యె నని యూహించి యిట్లనియె. "ఓయీ ! శాంతించినచోఁ గొన్ని సమాధానములు చెప్పెద విను" మనుడు భట్టుమూర్తి "వల్లె" యనెను. అంత రామభద్రుఁ డిట్లనియె. "ఓయీ ! నేను షడ్జస్వనము వినుటం జేసి సర్పములు భయపడె నంటిఁ గాని వీణాగానంబుచే ననలేదు. షడ్జస్వనంబునకు కేకి కేక యని భయమంది సర్పములు పాఱెను. దీనికి దోష మేమి కలదు" అనుడు సభ్యు లందఱును "మేలుమేలు రామభద్రుఁడు చెప్పినది లెస్సై యున్న యది" యనిరి. భట్టుమూర్తి యుత్తర మేమియు నీఁ జాలక యూరకుండెను. అపుడు సభవారందఱును రామభద్రు నతని ప్రతిజ్ఞ చెల్లింపవలయు ననిరి. తోడనే భట్టుమూర్తి తనశిరోవేష్టనంబు క్రింద నుంచెను. రామభద్రుఁడు దానిని వామపాదంబున మెట్టెను.


అనంతరము రాజు గ్రంథంబు నాఁటికినిలిపి యింకొకదినంబున దాని వినియెద మని సభ చాలించెను. భట్టుమూర్తి చింతాక్రాంతుఁడై యింటికిఁ జనియె. సభ్యులందఱును సభావిశేషములు చెప్పుకొనుచు :-

"శ్లో. విద్యా వివాదాయ ధనం మదాయ, శక్తిః పరేషాం పరిపీడనాయ,
    ఖలస్య సాధో ర్విపరీత మేతత్, జ్ఞానాయ దానాయ చ రక్షణాయ."

అనుశ్లోక మిచ్చో నెట్టు లన్వయించెనో చూచితిరే యని వాని చెట్టలఁ దలంచుచుఁ జనిరి. మూర్తియు గృహంబునకుం జని యారాత్రి తనయుపాసనాదైవం బగునాంజనేయుని ధ్యానించి రామభద్రకవిని సంహరింపుఁ డని ప్రార్థించెనఁట! అతఁడు నుద్దండగదాదండంబుఁ బూని రామభద్రునొద్దకు సంహరింప నేతెంచి యచ్చో ధనుర్బాణధరుఁ డగుశ్రీరాముని నతనితమ్ముఁడగు లక్ష్మణుని గని నమ్రుఁడై నమస్కరించి మీ రుండుచోటునకు నన్నుఁ బంపినమహాపాతకుం దునిమెద నని చెప్పి మరలి వచ్చి భట్టుమూర్తిని తనగదతో మొత్తెనఁట. ఆదెబ్బకే భట్టుమూర్తి నిర్యాణము నందెనఁట. రామభద్రకవి తనగ్రంథమును వసుచరిత్రమును గృతి నందినతిరుమలరాయని మేనల్లుం డగుగొబ్బూరి నరసరాజునకుం గృతి యిచ్చెను.

అప్పకవీయములో నున్న రామభద్రకవి వర్ణనము.

ఆంధ్రకవులవర్ణించుచు, నప్పకవి యీక్రిందిపద్యము వ్రాసెను. అది యెద్దియన :-

"సీ. శబ్దశాసనుపాద జలజంబులు భజించి, యుభయసత్కవిమిత్రు నభినుతించి
    శంభుదాసునకు నం జలి వేడ్క నొనరించి, సహజపాండిత్యుని సంస్మరించి
    సకలవిద్యాసనా థకవీంద్రుఁ గొనియాడి, సౌజన్యజేయువాక్సరణిఁబొగడి
    తగ నాంధ్రకవితాపితామహు వర్ణించి, సుజనవిధేయు హెచ్చుగ నుతించి

తే. రామరాజవిభూషణరత్న ఖచిత, చారుమస్తకలాపాదిహారివాక్య
   గౌరవము పెక్కుభంగుల గణన చేసి, పిదప నితరాంధ్రకవులకుఁ బ్రియముపల్కి."

ఇందు గేవలమును కావులనామములు చెప్పఁబడక వారివారిగద్యములలో నుండినవిశేషణములుమాత్రము చెప్పఁబడినవి. అట్టిగద్యముల


వలనం జెప్పఁబడినపురుషులనామము లప్పకవీయములో నుచితస్థలంబున వివరించెదను. ప్రస్తుతము రామభద్రకవికి వర్తించునది. "రామరాజవిభూషణరత్న ఖచితచారుమస్తకలాపాదిహారి" అనువాక్యముం గూర్చి మాత్రము వ్రాయవలసి యున్నది. దీనియర్థము పైవృత్తాంతము చదివినవారికెల్ల గోచరం బగుట స్పష్టమే. ఇక్కడ "రామరాజభూషణకవి" యని యున్నది. పైని మనము "భట్టుమూర్తి" యని చెప్పి యున్నాము. అది లోకములో సామాన్యముగ "భట్టుమూర్తి" అనునది రామరాజభూషణునకుఁ గల్గినపర్యాయనామ మని చెప్పుకొనుభ్రమ వలనం గల్గును. ఆవృత్తాంతము భట్టుమూర్తి రామరాజభూషణులచారిత్రమునం జూచిన స్పష్ట మగును.

పైపద్యములో నాంధ్రకవులకుఁ గలబిరుదులం బట్టి వారినామములు స్ఫురించును గాని రామభద్రకవి పేరుమాత్ర మట్లు స్ఫురింపదు. ఇది చారిత్రసంబంధ మైనబిరుదుగాని గ్రంథాంతగద్యములోనిది కాదు. ఆగద్యము నిటఁ జూపినచోఁ బ్రమాదమునుండి పాఠకులం దప్పించును గావున దాని నిట వివరించెదను, ఎట్లన్నను :-

"గద్యము. ఇది శ్ర్రీమదొంటిమెట్ట రఘువీరశతకనిర్మాణకర్మతజగ దేకఖ్యాతి ధుర్యాయ్యలరాజు తిప్పయమనీషి సర్వతాభితానపౌ, త్త్రాక్కయాచార్యపుత్త్ర, పరిశీలిత సమిద్ధ రామానుజమతసిద్ధాంతమర్మ ముమ్మిడివరదాచార్య కటాక్షవీక్షా పాత్ర, హృదయపద్మాధిష్టితశ్రీరామభద్రరామభద్రకవి ప్రణీతం బైన రామాభ్యుదయ మహాప్రబంధము"

అనునీగద్యమువలన నీరామభద్రకవియొక్క వంశవృత్తాంతము గొంత విస్పష్టమగును.

అం దాయ్యలరాజువా రనునింటిపేరునుబట్టి చూడఁగా నీతఁడు నియోగి యగుట స్పష్టమే. ఇతనితాతపేరు తిప్పయాపరనామము గల పర్వతరాజు తండ్రిపేరు "అక్కయాచార్యుఁడు" ఇతనినాఁడు వీరు వైష్ణవమతప్రవిష్టు లైనట్లు కానుపించును. ఇతఁడు ముమ్మిడివరదాచార్యులను నొక రామానుజమతసిద్ధాంత మర్మజ్ఞుని శిష్యుఁడు. వరదాచార్యులు పర


వస్తువంశములోనివాఁ డని గ్రంథారంభములో నీక్రిందివిధంబుగ వ్రాయఁబడి యున్నది. ఎట్లన్నను :-

"క. పరవస్తు వంశరత్నా, కరకౌస్తుభమణి ప్రభావఖని యై నాకున్
    బరమగురు వైనముమ్మిడి, వరదాచార్యాంఘ్రివనజ వందారుఁడనై"

దీనింబట్టి రామభద్రకవి వరదాచార్యులసమకాలీనుఁ డని తేలినది.

రామాభ్యుదయగ్రంథకృతిపతి యగుగొబ్బూరినరసరాజు భోజనపపల్లెనారాయణాచార్య శిష్యుఁడు. కావున వీరందఱును సమ కాలీనులే. గొబ్బూరి నరసరాజు వసుచరిత్రకృతిపతి యగుతిరుమల రాజుమేనల్లుండని యిదివఱకే వ్రాసి యున్నారము. కావున నీపై వారలందఱు శాలివాహనశకము 15 శతాబ్దముచివరవా రనియుఁ, బదునాఱవ శతాబ్దములోని మొదటిపాదములోఁగూడ నున్నారనియును జెప్ప నొప్పి యున్నది.

రామభద్రకవిగోత్రము.

దీనిని దెలియుటకుఁ దగినయాధారములు పైగ్రంథములో లేవు. కాని యయ్యలరాజువారివలనం జెప్పఁబడినమఱికొన్నిగ్రంథములం బట్టి చూడఁగా నీరామభద్రకవి కౌండిన్యసగోత్రుఁ డని తేలుచున్నది. అందు శుకసప్తతిని దెనిఁగించిన కవీశ్వరుఁడు తనగోత్రము చెప్పి తన వంశములోనికవీశ్వరులను జెప్పుచు "మాయయ్యలరాజువంశజుల నాది కవీంద్రులఁ బ్రస్తుతించెదన్" అని వ్రాసియున్నాఁడు.

ఉత్తరరామాయణకవులు.

వాల్మీకికృతసంస్కృతరామాయణగ్రంథములో మొదటి యాఱు కాండలు కలసి యొక్కటిగా నుండును. కావున రామాయణము షట్కాండములు గలదిగానే వ్యవహరింపఁబడుచున్నది. అందు శ్రీరామ పట్టాభిషేకాంత మైనకథ గలిగియుండును. అనంతరవృత్తాంత మంతయు నుత్తరకాండ మనుపేర నొప్పియుండును. అందు శ్రీరామరాజ్య విశేషములును, పుత్త్రోత్పత్తియు, నశ్వమేధయాగమును జేయుటయు,


శ్రీరాముఁడు వైకుంఠలోకమునకుం బోవుటయు నుండును. ఇట్టిగ్రంథమును దెనిఁగించుటకు నుద్యోగించినవారిలో నిర్వురు ప్రధానులు. అందుఁ దిక్కనసోమయాజి యొకఁడు. కంకంటిపాపరా జొకఁడు నై యున్నారు. అందుఁ దిక్కనసోమయాజికృత మగును త్తరరామాయణ మతనిభారతముకంటెను బ్రాచీన మైనదియును బాపరాజకృతో త్తర రామాయణము నవీనగ్రంథములలోఁ బ్రాచీన మైనదియును నై యున్నది. ఇపుడు మనము ముందు తిక్కనసోమయాజికృతం బగునుత్తర రామాయణముంగూర్చి చెప్పి యనంతరము పాపరాజకృతో త్తరరామాయణముంగూర్చి వ్రాయుదము.

తిక్కనకృతనిర్వచనోత్తరరామాయణము.

ఇది వచనము లేకయే రచియింపఁబడుటంజేసి దీనికి నిర్వచనోత్తరరామాయణ మనునామము కల్గినది. అట్లు చెప్పుట ప్రౌఢకవిలక్షణము గావునఁ దానట్లు చెప్పెద నన్న ట్లీక్రిందిపద్యమువలనం గాన్పించును. ఎట్లనిన :-

క. వచనము లేకను వర్ణన, రచియింపఁగఁ గొంతవచ్చుఁ బ్రౌఢులకుఁ గదా
   ప్రచయము పద్యము లన పొం, దుచితంబుగఁ జెప్ప నార్యు లొప్పిద మన రే.

ఈనిర్వచనోత్తర రామాయణములోని కొన్ని పద్యములవలన నితనిచారిత్రమును, నితనిప్రభు వగుమనుమసిద్ధి రాజితనికిఁ జేసినగౌరవమును గోచరం బగును గావున వానిని యథోచిత స్థానంబుల వివరించెను.

గ్రంథారంభము.

తిక్కన తనపూర్వు లగుగ్రంథకర్తలవలెనే గీర్వాణశ్లోకము కృత్యాదిని మంగళాశాసనముగాఁ జెప్పెను. ఎట్లన్నను :-

శ్లో. శ్రీ రాస్తాం మనుమక్షితీశ్వర భుజస్తమ్బే జగన్మణ్డలం
   ప్రాసాదస్థిరభారభాజి దధతీ సా సాలభఞ్జిక్రియా
   శుణ్డాలోత్తమగణ్డభిత్తిషు మదవ్యాసఞ్గ వశ్యాత్తయా
   యా ముత్తేజయతే తరాం మధులిహా మానన్దసాన్ద్రస్థితిః.

అని యిట్లుగాఁ గృతిపతి నాశీర్వదించి ప్రాచీనాధునికకవులను వర్ణించుటకు నిర్దేశించి యెవరినామములను వివరింపక యీక్రిందివిధంబున వ్రాసెను. ఎట్లన్నను :-

చ. హరిహరపద్మగర్భులను నాదికవీంద్రుల నూత్న సత్కవీ
   శ్వరులను, భక్తిఁ గొల్చి తగ వారికృపన్ గవితావిలాసవి
   స్తరమహనీయుఁ డైన నను సర్వగుణోత్తరమూర్తి మన్మభూ
   వరుఁడు దగంగ రాఁ బనిచి వారనిమన్నన నాదరింపుచున్.

ఈపద్యముంబట్టి చూడఁగాఁ దిక్కననాఁటికి నతనిచేతఁ గవులు గా నుతియింపఁదగుప్రాచీనకవులు లేక యైన నుండవలయును. లేదా ? యట్టియాచారమైన లేక యుండవలయును.

ఇట్లుగా గ్రంథారంభంబు చేసి తిక్కన రాజు తన్నుం బిలువ నంపి గ్రంథరచన జాజ్ఞ నొసంగినకథఁ జెప్పుచున్నాఁడు. ఎట్లన్నను :-

క. ఏ నిన్ను మామ యనియెడి, దీనికిఁ దగ నిమ్ముభారతీకన్యక నా
   కీ నర్హుఁడ వగు దనినను, భూ నాయకుపలుకు చిత్త మున కింపగుడున్

దీనింబట్టి చూడఁ దిక్కనసోమయాజికి రాజునకుఁ గృతి నొసఁగుకోర్కె యదివఱలో లేదనియును, రాజు పల్కినమాటలోనిచమ చమత్కారముచేత మనస్సున నానందంబు గల్గుటచే నిచ్చినట్లును స్ఫురియించుచున్నది. దానికి దృష్టాంతముగ నీక్రిందిపద్య మున్నది. దాని వలనఁ దనమనస్సునకు సమ్మతి లేక యుండఁగా దానిని సయు క్తికముగ బోధించినట్లు కానుపించును ఆపద్య మెద్ది యనఁగా :-

సీ. సకలలోకప్రదీపకుఁ డగు పద్మినీ, మిత్త్రవంశమున జన్మించె ననియుఁ
   జూచిన మగలైనఁ జొక్కెడునట్టిసౌం, దర్యసంపదసొంపు దాల్చె ననియు
   జనహృదయానందజననమై నెగడిన, చతురతకల్మి నప్రతిముఁ డనియు
   మెఱసి యొండొంటికి మిగులశౌర్యత్యాగ, విఖ్యాతకీర్తిచే వెల సె ననియు.

గీ. వివిధవిద్యాపరిశ్రమవేది యనియు, సరసబహుమానవిరచితశాలి యనియు
   మత్కృతీశ్వరుఁ డగుచున్న మనుమనృపతి, సుభగుఁ గావించుటకు సముత్సుకుఁడ వైతి.

అని యిట్లు కృతనిశ్చయుండై తిక్కన మనుమసిద్ధి రాజునకు నంకితము చేయఁబోవుకృతిలోనివిశేషముల నీక్రిందివిధముగ సంగ్రహించి వ్రాయుచున్నాఁడు. ఎట్లన్నను :-

"ఉ. భూరివివేకచిత్తులకుఁ బోలు ననన్ దలఁ పందలంబులన్
    సౌరభ మిచ్చుగంథవహుచందమునన్ఁ బ్రకటంబు సేసి యిం
    పారెడుపల్కులం బడయ నప్పలుకుల్ సరివచ్చునట్లుగాఁ
    జేరుప నేరఁగా వలయుఁ జేసెద నేకృతి యన్న వారికిన్."

ఇట్లని యనంతరము కుకవినిందఁ జేయుటకుఁ గా నీక్రిందిపద్యంబుఁ జెప్పెను. ఎట్లనిన :-

"చ. పలుకులపొందు లేక, రసభంగము చేయుచుఁ, బ్రాఁతవడ్డమా
    టలఁ దమనేర్పు చూపి, యొకటన్ హృదయం బలరింప లేక, యే
    పొలమును గాని యెట్టిక్రమమున్ దనుమెచ్చుగ లోక మెల్ల న
    వ్వులఁ బొరయన్ జరించకుకవుల్ ధర దుర్విటులట్ల చూడఁగన్."

అని యిట్లు కుకవినింద చేసి యంతటితోఁ బరిసమాప్తి నందిపక భావికాలములోఁ దెనుఁగుకవిత్వముఁ జెప్పుసుకవులకు నుపయుక్తము లగుకొన్ని సూత్రప్రాయము లగుపద్యములంగూడ వ్రాసెను. అవి యెవ్వి యనఁగా :-

వడి ప్రాసవిషయము.

"క. తెలుఁగుకవిత్వముఁ జెప్పన్, దలఁచినకవి యర్థమునకుఁ దగి, యుండెడుమా
    టలు గొని వళులుం బ్రాసం, బులు నిలుపక యొగిని బలిమి బుచ్చుట చదురే."

తద్భవములఁ గూర్చి.

"క. అలవడ సంస్కృతశబ్దము, తెలుఁగుపడి విశేషణంబు తేటపడంగాఁ
    బలుకునెడ లింగవచనం, బులు భేధింపమికి మెచ్చు బుధజనము కృతిన్."

సరసాహ్లాదముగఁ జెప్పవలెనని.

"గీ. ఎట్టికవి కైనఁ దనకృతి యింపుఁ బెంపఁ, జాలుఁ గావునఁ గావ్యంబు సరసులైన
    కవులచెవులకు నెక్కినఁ గాని నమ్మఁ, డెందు బరిణతి గలుగుకవీశ్వరుండు."

అని యిట్లు సత్కవులమార్గము నుడివి యట్టిమార్గము ననుసరించి తా నుత్తర రామాయణమును రచియించెద నని యీక్రిందిపద్యములలో వ్రాసెను ఎట్లన్నను :

"క. అని సత్కవీంద్ర మార్గము, మనమున నెలకొల్పి సరసమధురవచోగుం
    భనసుప్రసాదసంబో, ధనగోచరబహువిదార్థతాత్పర్యము గాన్."

ఇట్లుగాఁ జెప్పి తా నుత్తరరామాయణము నాంధ్రీకరింపఁగడఁగుటకుఁ గారణ మీక్రిందివిధంబున వ్రాసెను. ఎట్లనఁగా :-

"క. ఎత్తఱి నైనను ధీరో, దాత్తగుణోత్తరుఁడు రామధరణీపతిస
    ద్వృత్తము సంభావ్య మగుట, నుత్తరరామాయణోక్తియుక్తుఁడ నైతిన్."

తిక్కన యిటుల వ్రాసి వెంటనే తనతాత యగు గుంటూరి మంత్రిభాస్కరునిఁ జూచి యైనఁ దనకవిత్వము సర్వజనాదరణీయ మగు నని పల్కిన దానింబట్టి తనతాతయే రామాయణము దెనిఁగించుటచేతఁ దనకు దానిం దెనిఁగించుట కవకాశము లేకపోవుటచేత నెట్లైన శ్రీరామకథం దెనిఁగించుటకుఁ దనకుఁ గల యుత్సాహమును జూపుటకు నుత్తర రామాయణములోఁ గల రామకథఁ దెనిఁగించినఁ జాలు నని మనస్సున సంతుష్టి నందినట్లుగాఁ గాన్పించును. అటు గాకున్నచో రామాయణమును దెనిఁగించుటకు భాస్కరునంతకవి యుండవలయును గాని తన వంటివాఁ డొకఁడు దానికై యత్నింపఁ దగునా యని యొరులు చేయుశంక మనస్సున నుంచికొని తిక్కన తాను భాస్కరకవి మనుమఁడనే యని చెప్పి యాభాస్కరుని సంప్రదాయానుసారముగనే తనకవిత్వముండు ననుటచేత రామాయణకవిత్వములోని సంప్రదాయ ముత్తర రామాయణములోఁగూడఁ గాన్పించు నని లోకమునకు స్పష్టపఱుపనైనను గావలయును.

తిక్కన తాను జేయు నిర్వచనకావ్యము పండితులకు మిక్కిలియానందదాయి కాఁగల దని యీక్రిందివిధమునఁ జెప్పెను. ఎట్లన్నను :-

ఉ. జాత్యను గామి నొప్పయిన సంస్కృత మెయ్యడఁ జొన్ప వాక్యసాం
   గత్యము సేయుచో నయిన గర్వము తోడుగఁ జెప్పి పెట్ట దౌ
   ర్గత్యముఁ దోఁపఁ బ్రాసముప్రకారము వేఱగునక్షరంబులన్
   శ్రుత్యనురూప మంచు నిడ శూరుల కివ్విధ మింపుఁ బెంపదే.

క. లలితపదహృద్యపద్యం, బులన పదార్థంబు ఘటితపూర్వాపరమై
   వెలయ నిడి విణియలనఁగా,హల సంధించినవిధంబు నమరఁగ వెలయున్.

ఉత్తరరామాయణములో నింతవఱకే తిక్కనవృత్తాంతము గాన్పించును. ఆశ్వాసాంతమునందు వ్రాయఁబడినగద్యమున నీగ్రంథరచన కాలమునాఁటికిఁ దిక్కనసోమయాజి యజ్ఞము చేయ లే దని తేలుచున్నది. ఆగద్య మెద్ది యనఁగా :-

"ఇది శ్రీమదుభయకవిమిత్ర కొమ్మనామాత్యపుత్త్ర బుధారాథన విధేయ తిక్కయనామధేయ ప్రణీతం బైన యుత్తరరామాయణం బనుకావ్యంబునందు"

అని యున్నది. భారతములో "బుధారాధనవిరాజి తిక్కనసోమయాజి" అని యున్నది. కావున నుత్తరరామాయణకాలమునకుఁ దిక్కనసోమయాజి యాహితాగ్ని కాలేదు. నిర్వచనోత్తరరామాయణములోనితుదియాశ్వాసముతప్ప తక్కిన దంతయుఁ దిక్కనసోమయాజి ప్రణీత మగుటచేత దానికిఁ గారణ మేమై యుండు నని యూహింపనై యున్నది. దాని కాగ్రంథములోని తుదియాశ్వాసమును బూర్తి చేసిన జయంతిరామకవిచే నైన కారణము చెప్పఁబడదయ్యెను. లోకప్రతీతిం బట్టి యాయాశ్వాసములో రామనిర్యాణమును జెప్పవలసి వచ్చు నని వదలినట్లుగా నూహింపనై యున్నది. అట్లే యయినచో భారతములోని స్వర్గారోహణపర్వములో మొదటఁ గృష్ణనిర్యాణంబును, అనంతరము పాండవుల లోకాంతరగమనంబును జెప్పుటయే తటస్థింపదు. అట్లు గావున దీనికిఁ గారణ మేది యైన నుండవలెను. దానిం దెల్పుగ్రంథ సామగ్రి లేదు గావున దాని న్వదలి తుదియాశ్వాసము పూర్తిచేసిన కవివరునివృత్తాంత మిచ్చోఁ గొంచెము ముచ్చటింతము :-

__________

ఉత్తరరామాయణము

8.

జయంతి రామభట్టు.

ఇదివఱకు మనము చెప్పిన జయంతి రామకవీశ్వరునిం గూర్చిన చారిత్ర మాకవిరచిత మైనయా శ్వాసప్రారంభములో గాని లోకమువా

  1. ఈపద్యము మఱియొకనికవిత్వములోనిది గాని రామభద్రునికవనము కాదని కొందఱు చెప్పిరి. ప్రస్తావనుకుఁగా న ట్లితరులపద్యములం జదువుట లోకములోని మర్యాదయే కదా.